జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, July 8, 2013

లాజిక్‌ లేని త్రీడీ మ్యాజిక్‌ 'యాక్షన్‌' - సమీక్ష



లాజిక్‌ లేని త్రీడీ మ్యాజిక్‌ 'యాక్షన్‌'
సాంకేతికత ఎంత పెరిగినా, సినిమా హాలులోకి వెళ్ళి కూర్చున్నాక ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు సీట్లలో కూర్చోబెట్టాలంటే తెర మీద పండాల్సింది - భావోద్వేగాలే. చిత్ర నిర్మాణంలో, ప్రదర్శన పద్ధతుల్లో ఎంత అత్యాధునికత ఉన్నా, ఆఖరికి ప్రేక్షకులు కూడా చూసేది తమను మురిపించి, మైమరపించే ఆ కథన చాతుర్యం కోసమే! అది లేనప్పుడు మిగిలిన ఎన్ని అలంకరణలున్నా అవి వాసన లేని కాగితం పూలే అవుతాయి. 1980లో కొన్ని నేరు తెలుగు చిత్రాలు త్రీడీలో వచ్చాయి. మళ్లీ ఇన్నేళ్ళకు ఆధునిక సాంకేతికతతో తెలుగులో నేరుగా వచ్చిన త్రీడీ సినిమా 'యాక్షన్‌-3డి' ('విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' అనేది ఉపశీర్షిక) వ్యవహారం కూడా అచ్చంగా కాగితం పూల చందమే అయింది. కళ్ళద్దాలు పెట్టుకొని చూసే త్రీడీ ఎఫెక్ట్‌ల చిత్రంగా, మనస్సును మెప్పించే కథ కానీ, కథా కథనం కానీ, అభినయ ప్రతిభ కానీ లేని భారీ నిర్మాణ ప్రయత్నంగా మిగిలిపోతుంది.

కథ ఏమిటంటే... చిన్నప్పటి నుంచి కలసి మెలసి తిరిగి, పెరిగిన నలుగురు స్నేహితుల కథ ఇది. 'కలకాలం జీవిస్తామన్నట్లు కలగనాలి! రేపే మరణిస్తామన్నంత రీతిలో ఇవాళే జీవితాన్ని ఆస్వాదించాలి' అన్నది ఆ మిత్రుల సిద్ధాంతం. పెళ్ళికి కొద్ది రోజుల ముందు అజరు ('కిక్‌' శ్యామ్‌) తన మిగతా ముగ్గురు మిత్రులైన పందాల రాయుడు బా.వ. అలియాస్‌ బాలవర్ధన్‌ ('అల్లరి' నరేశ్‌), ఫ్యాషన్‌ డిజైనర్‌ పురుషోత్తమ్‌ (రాజు సుందరం), డెంటిస్ట్‌ శివ (వైభవ్‌)తో కలసి సరదాగా గడిపేందుకు గోవా బయలుదేరతాడు. ఆ నలుగురు మిత్రులకు ఎదురైన సంఘటనలు, అక్కడ గోవాలో వారికి ఎదురైన సమస్యలు, వారు చేసే ప్రతి పనీ మరో దానికి దారి తీయడం లాంటి వాటితో సినిమా అంతా నడుస్తుంది.
నటన ఎలా ఉందంటే... 'ఫ్రెండ్‌షిప్‌ అనేది వ్యాపారంలో చేసుకొనే వన్‌ ఇయర్‌ ఎగ్రిమెంట్‌ కాదు. వందేళ్ళ కమిట్‌మెంట్‌' అన్నది ఈ సినిమా ఇతివృత్తం. క్లైమాక్స్‌లో మినహా మిగతా ఎక్కడా దాన్ని బలంగా చెప్పలేదు. దాంతో, ఈ ఇతివృత్తానికీ, ఏ పాత్రకూ ఓ పరిపూర్ణత కనిపించదు. తమిళంలో 'ఓ పోడు!' (స్థూలంగా జై కొట్టు అని అర్థం) పేరుతో మూడు వారాల విరామం తరువాత విడుదల కానున్న ఈ ద్విభాషా చిత్రంలో 'అల్లరి' నరేశ్‌తో పాటు తమిళ తెరకు సుపరిచితులైన వైభవ్‌ (దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి కుమారుడు), 'కిక్‌' ఫేమ్‌ శ్యామ్‌, నటుడు - నృత్య దర్శకుడు రాజు సుందరం నలుగురు మిత్రులుగా నవ్వించడానికి శతవిధాల ప్రయత్నించారు. ఆ క్రమంలో కొంత ఎడల్ట్‌ కామెడీ, మరికొంత వల్గారిటీకి కూడా చోటిచ్చారు. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ లాంటి సీనియర్‌ కమెడియన్లు సరే సరి!
అతిథి పాత్రల్లో సునీల్‌, పోసాని కృష్ణ మురళి, 'ఈగ' ఫేమ్‌ సుదీప్‌ కనిపిస్తారు. నలుగురు హీరోలకూ జోడీలుగా నీలం ఉపాధ్యాయ, స్నేహా ఉల్లాల్‌, రీతూ బర్మేచా,కామ్నా జెఠ్మలానీ ఉన్నారు. సీజన్డ్‌ తారల సీజన్డ్‌ నటనే తప్ప, వీరెవరి నుంచీ ప్రత్యేక అభినయం కనిపించదు. 'దూకుడు', 'బొమ్మరిల్లు' లాంటి చిత్రాల్లోని పాపులర్‌ ఘట్టాల ఆధారంగా ఎమ్మెస్‌ నారాయణతో చేయించిన ప్యారడీ బిట్లు కాసేపు నవ్విస్తాయి. గతంలో శ్రీను వైట్లతో చిత్రాలు నిర్మించిన అనీల్‌ సుంకర దర్శకుడిగా ఆయన చిత్రాల నుంచి చాలానే స్ఫూర్తి పొందినట్లు అర్థమవుతుంది.
కథనం మాటేమిటంటే... నిజానికి, సినిమా ప్రథమార్ధం చాలా వరకు అసలు కథకు ఉపోద్ఘాతం లాంటిది. గోవా చేరిన నలుగురు స్నేహితులూ ముందు రోజు రాత్రి ఏం జరిగిందో తెలియనంత మత్తులో ఉండి, మరునాడు నిద్ర లేచాక తమలో ఒకరు మిస్సవడంతో కంగారు పడుతున్నప్పుడు ప్రథమార్ధం ముగుస్తుంది. సరిగ్గా అప్పుడే అసలు కథ మొదలువుతుంది. అసలేం జరిగిందన్న దాన్ని క్రమక్రమంగా ప్రేక్షకుడికి తెలిసేలా చేసే కీలకమైన కథంతా ద్వితీయార్థం.
కానీ, 'యాక్షన్‌' అక్కడే తడబడింది. కథను ఆసక్తిగా నడపడంలో కాకుండా, సన్నివేశాలతో, పాటలతో కాలక్షేపం చేయించడంగా సినిమా మారింది. ఆ రాత్రి ఆ నలుగురు మిత్రులకూ ఎదురైన సంఘటనల్ని ఒక్కోదాన్నీ ఒక్కో ఎపిసోడ్‌గా చూపారు. అయితే, అందులో ఏవీ ఆసక్తిగా నడిచేంత పట్టున్నవి కావు. అవే ఈ కథకు పెద్ద బలహీనతగా మారాయి. వెరసి, రెండు గంటల ముప్ఫై అయిదు నిమిషాల పాటు నడిచే ఈ సినిమాను ఒక దశ దాటిన తరువాత భరించడం కష్టమవుతుంది. చివరకొచ్చేసరికి త్రీడీ ఎఫెక్ట్‌లు, పాటలే తప్ప, మిగతాదంతా వట్టి గజిబిజి గందరగోళమనిపిస్తుంది.
సాంకేతిక శాఖల సంగతి... టైటిల్స్‌లో మరో ముగ్గురు మాటల రచయితల పేర్లున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం క్రెడిట్‌ కూడా అనీల్‌ సుంకరే తీసుకున్నారు. అయితే, తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు దర్శకుడిగా కన్నా, నిర్మాతగానే ఎక్కువ మార్కులు పడతాయి. గుర్తింపున్న నటీనటులు చాలా మందితో పాత్రధారణ చేయించడం, నిర్మాణంలో ఖర్చుకు వెనుకాడకపోవడం తెరపై తెలుస్తుంటాయి.
సాంకేతిక అంశాల సంగతికి వస్తే, 3డి థియేటర్లే తక్కువ కాబట్టి, సినిమాలో సగం దృశ్యాలను సర్వసాధారణ చిత్రాల లాగా 2డిలో, ఇతర దృశ్యాలను 3డి ఎఫెక్ట్‌లో తీసినట్లు అనిపిస్తుంది. త్రీడీ దృశ్యాల చిత్రీకరణ నిపుణుడైన అమెరికాకు చెందిన 3డి స్టీరియోగ్రాఫర్‌ కీత్‌ డ్రైవర్‌కు కూడా ఇదే తొలి సినిమా. రాత్రి వేళ జాగింగ్‌ చేస్తూ, నటులు పోసాని, సునీల్‌లకు ఎదురయ్యే రెండు డైలాగుల పాత్రలో ఆయన తెరపైనా కనిపించారు. కెమేరామన్‌ సర్వేష్‌ మురారి బాగానే శ్రమించారు.
1980ల నాటి హిట్‌ పాటల హిందీ సంగీత దర్శకుడు బప్పీలహరి, ఆయన కుమారుడు బప్పా లహరి కలసి సంగీతం అందించారీ సినిమాకు. అన్నీ బీటు పాటలే! దర్శకుడు కె. రాఘవేంద్రరావు హిట్‌ పాటల దృశ్యాలకు అనుకరణగా సాగిన 'ఢింక చిక' పాట, నాగార్జున నటించిన 'ప్రేమ యుద్ధం'లోని 'స్వాతి ముత్యపు జల్లులలో...' పాట ( పాత బాణీ, ఆర్కెస్ట్రయిజేషన్‌కే కొత్త గళాలతో పాడించారు) ప్రేక్షకులను కాసేపు అలరిస్తాయి.
ఇక, షాంపేన్‌ గ్లాసులో స్నేహా ఉల్లాల్‌ నర్తించిన క్లబ్‌ సాంగ్‌ 'డింగ్‌ డాంగ్‌ బెల్‌' ఇటీవల వస్తున్న ఐటమ్‌ సాంగ్‌లకు మరో నకలు. థమన్‌ నేపథ్య సంగీతం కూర్చారు. చర్చి దగ్గర అలీతో మాట్లాడి, హీరోలు బయటకు వచ్చే చోటతో సహా వివిధ సందర్భాల్లో సినిమాలోని దృశ్యాలు చూస్తున్నప్పుడూ, డైలాగులు వింటున్నప్పుడూ దర్శక - నిర్మాతలే ఎడిటింగ్‌లో మధ్య మధ్య కొంత తొలగించినట్లు అర్థమైపోతుంటుంది. కోటి రూపాయలతో గోవాలోని హౌటల్‌ హీరో నరేశ్‌ సొంతం ఎలా అవుతుందో అర్థం కాదు. అలాగే, కనపడని పాప గురించి స్నేహా ఉల్లాల్‌ కానీ, పులి గురించి సుదీప్‌ కానీ ఏ చర్యా తీసుకోరెందుకో! సినిమా చూస్తుంటే ఇలాంటి జవాబు లేని ప్రశ్నలు తెగ తడుతుంటాయి.
తెరపై తొలి భారతీయ త్రీడీ చిత్రం 'మై డియర్‌ కుట్టి చేతాన్‌' (1984) వచ్చిన ఇరవై తొమ్మిదేళ్ళ తరువాత రూపొందిన సినిమాగా కామెడీ త్రీడీ 'యాక్షన్‌ ' సాంకేతికంగా పురోగతి చూపింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మనవాళ్ళ త్రీడీ ఎఫెక్ట్‌ కొంత మెరుగైంది. అయితే, ఇటీవల వచ్చిన ఇంగ్లీషు, హిందీ చిత్రాలతో పోలిస్తే, ఈ త్రీడీది ఇంకా వెనుకపట్టే! ఇక, కథ, సన్నివేశాల రూపకల్పన, చిత్రీకరణలో అయితే మనవాళ్ళు పాత యుగాల దగ్గరే పాతుకుపోయారని అనిపిస్తుంది.
కొసమెరుపు : తెలుగు, తమిళ, హిందీ, 'హ్యాంగోవర్‌' లాంటి హాలీవుడ్‌ చిత్రాలతో పోలికలు, మునుపటి చిత్రాల తాలూకు ప్రభావం పుష్కలంగా ఉన్న ఈ 'యాక్షన్‌'లో త్రీడీ మ్యాజిక్‌లే తప్ప, లాజిక్‌ల కోసం వెతకడం వృథా ప్రయాస. క్లైమాక్స్‌లో వచ్చే హీరోయిన్‌, హీరోల మాటలనే కొద్దిగా మార్చి చెప్పాలంటే, ''సినిమా అంటే అంతే! కొన్నింటికి లాజిక్‌లు ఉండవు. కానీ, తెలుగు సినిమా అంటే అసలు లాజిక్కే ఉండదు!'' కాబట్టి, వేళాకోళపు వినోదభరిత దృశ్యాలతో సగటు తెలుగు సినిమాను చూడ్డానికి సిద్ధమై వెళితే, ప్రేక్షకులకు కొంతయినా నిరాశ తప్పవచ్చు. ఎంత విదేశీ సాంకేతికతనూ, నిపుణుల్నీ తెచ్చిపెట్టుకొన్నా, తీసేది మన వాళ్ళు, తీస్తున్నది మన తెలుగు సినిమా కదా! కాబట్టి, తిప్పలు తప్పవు !!
 - రెంటాల జయదేవ   
.........................................................................................

2 వ్యాఖ్యలు:

Goutami News said...

మీ బ్లాగు ని "పూదండ" తో అనుసంధానించండి.

www.poodanda.blogspot.com

astrojoyd said...

వోసోసి తెలుగు సిమాలలో లాజిక్కులేంది భయ్యా..వొట్టి పాతకాలం మడిసిలాగుండావే..లాజిక్కులెత్తి సిమాలు తీస్తే నిర్మాత నేత్త్హిన సైను గుడ్డీ మిగులుద్ది మరి...