జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, July 24, 2013

సగమే ఫలించిన 'సాహసం' (సినిమా సమీక్ష)


కొన్ని కథలు చదవడానికి బాగుంటాయి... మరికొన్ని కథలు వినడానికి బాగుంటాయి... కానీ, వాటిలో చాలా కొద్ది కథలే చూడడానికి కూడా బాగుండేవి! ఎందుకంటే, చదవడంలో, వినడంలో పాఠకుల, శ్రోతల ఊహాశక్తే హద్దు. అనుభవాన్నీ, అనుభూతినీ ఇచ్చేది అదే! కానీ, చూడడానికి వచ్చేసరికి కంటికి కనిపిస్తున్నంత వరకే అనుభవానికీ, అనుభూతికీ ఆధారం. అందుకే, చిన్నప్పుడు చదువుకొన్న చందమామ కథ కూడా చదువుతున్నప్పుడు ఉన్నంత మజా దాన్ని ఎవరో దృశ్యీకరించినప్పుడు కనిపించదు. సాహసగాథలు, నిధి నిక్షేపాల అన్వేషణ గాథలకు కూడా ఆ ఇబ్బంది తప్పదు. ఆ ఇబ్బంది తెలిసీ, దాన్ని నెత్తినపెట్టుకొని, దర్శక, నిర్మాతలు చేసిన 'సాహసం' ఈ చిత్రం.

.........................................
చిత్రం: సాహసం, తారాగణం: గోపీచంద్‌, తాప్సీ, శక్తి కపూర్‌, లక్కీ అలీ, అలీ, మాటలు: కె.కె. రాధాకృష్ణ కుమార్‌, పాటలు: అనంత్‌ శ్రీరామ్‌, సంగీతం: శ్రీ, కళ: ఎస్‌. రామకృష్ణ, కెమేరా: శ్యామ్‌దత్‌, స్టంట్స్‌: సెల్వ, డిజిటల్‌ ఎడిటర్‌: జి.వి. చంద్రశేఖర్‌, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సహ నిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌, కథ, కథనం, దర్శకత్వం: యేలేటి చంద్రశేఖర్‌
........................................

విభిన్న కథాంశాలతో, వినూత్న చిత్రాలను రూపొందిస్తారని పేరున్న దర్శకుడు యేలేటి చంద్రశేఖర్‌ ఈ సారి నిధి - నిక్షేపాల అన్వేషణ కథను ఎంచుకున్నారు. సాహసోపేతమైన అన్వేషణ అనే కోవలోని కథలు తెలుగు తెరకు కొత్త ఏమీ కాదు. కౌబారు చిత్రంగా 'మోసగాళ్ళకు మోసగాడు', కౌబారులోనే వినోదం మిళాయించిన కథగా 'టక్కరి దొంగ', ఫ్యాంటసీ చిత్రంగా 'అంజి' లాంటివన్నీ అదే కుదురు నుంచి వచ్చినవే! ఇక, 'సాహసం' విషయానికే వస్తే...

కథ : 

వందల ఏళ్ళ క్రితం కనిష్కుల కాలంలో రాజులు దాచిన ఓ నిధి పెషావర్‌ సమీపంలో నిగూఢంగా ఉందని లెక్క. కాగా, దాదాపు 60 ఏళ్ళ పైచిలుకు క్రితం హీరో తాత సత్యనారాయణ వర్మ (సుమన్‌) పెద్ద వజ్రాల వర్తకుడు. భారతదేశ విభజన సందర్భంగా అల్లర్ల సమయంలో అల్లరి మూకల నుంచి ప్రాణాలనూ, అమూల్య వజ్రాలు, ఆభరణాలను కాపాడుకోవడం కోసం వాటన్నిటినీ మూట గట్టుకొని పారిపోతాడు. సురక్షిత మార్గమని రాజుల కాలం నాటి రహస్య ద్వారం గుండా ప్రయాణిస్తాడు. ఆ ప్రయాణంలో అనుకోకుండా ఆయన చేతిలోని వజ్రాల సంచీ ఓ రహస్య నిధి ప్రాంతంలో పడిపోతుంది. అక్కడ చావును తప్పించుకొని, తనకు దొరికిన గరుత్మంతుడి హారంతో భారత్‌కు వచ్చేసి, సామాన్యుడిలా బతుకుతాడు. ఆ వివరాలన్నీ డైరీలో రాసి, ఆ వజ్రాలు తన వారసులకు చెందాలంటూ వీలునామా రాసి, చనిపోతాడు.

దిగువ మధ్యతరగతి కుటుంబంగా గడుపుతున్న అతని వారసుడే మనుమడైన గౌతమ్‌ (గోపీచంద్‌). ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే హీరో ఎప్పటికప్పుడు ఎంతో ధనవంతుణ్ణి అయిపోవాలని కలలు కంటూ ఉంటాడు. అలాంటి వాడికి అనుకోకుండా దొరికిన తాత వీలునామా, డైరీ, లాకెట్‌ ద్వారా తాత పోగొట్టుకున్న వజ్రాల సంగతి తెలుస్తుంది. ''నాది కానిది కోటి రూపాయలు కూడా ముట్టుకోను. నాది అన్నది అర్ధరూపాయి కూడా వదులుకోను'' అన్నది హీరో తత్త్వం. దాంతో, తాత వజ్రాల కోసం అన్వేషణ మొదలుపెడతాడు. మరోపక్క పాకిస్తాన్‌లో సాగుతున్న పురాతత్త్వ శాస్త్రవేత్తల అన్వేషణ ద్వారా రాజుల కాలం నాటి ఆ నిధిని సొంతం చేసుకోవాలని అక్కడి సాయుధ ముఠా నేత సుల్తాన్‌ (శక్తి కపూర్‌) చూస్తుంటాడు. హీరో అక్కడకు ఎలా వెళ్ళాడు, ఏం జరిగిందన్నది మిగతా కథ.

బలాలు, బలహీనతలు...

'సాహసం'లోని బలాలు ఏమిటంటే, యాక్షన్‌ హీరోగా గోపీచంద్‌కు ఉన్న ఇమేజ్‌. ధైర్యం, సాహసం, నిజాయతీ, కాస్తంత చిలిపితనం నిండిన పాత్రను అతను చులాగ్గా పోషించిన తీరు. కథానాయిక శ్రీనిధిగా తాప్సీ కథాపరంగా చేయడానికి ఉన్నది తక్కువే. అయితే భక్తి, కాకపోతే భయాందోళనలకు గురి కావడం తప్ప మరో భావం లేకుండా ఆమె పాత్ర నడిచిపోతుంది. ఇక, క్రూరత్వం అంతగా కనిపించకపోయినా సుల్తాన్‌గా ఒకప్పటి ప్రసిద్ధ హిందీ విలన్‌ శక్తి కపూర్‌ నటన, గెటప్‌ ఆఫ్‌ఘనిస్తానీయుల్ని తలపిస్తూ బాగా కుదిరాయి. పాకిస్తాన్‌లో కనిపించే ఖయామత్‌ రాజుగా అలీ కాసేపు సినిమాలో రిలీఫ్‌.

కథ, కథనం యేలేటి చంద్రశేఖర్‌వే అయినా, ఈ సినిమాకు దాదాపు మరో అరడజను మంది కథా సహకారం అందించారు. కథాసహకారంతో పాటు సంభాషణల రచనలోనూ భాగమున్న కె.కె. రాధాకృష్ణ కుమార్‌ సంభాషణలు ముఖ్యంగా చిత్ర ప్రథమార్ధంలో ఆకట్టుకుంటాయి. ''కథంతా విని - కసబ్‌, పాకిస్తాన్‌కు ఏమవుతాడని అడిగినట్లు'' (అలీ) లాంటివి థియేటర్‌లో నవ్వులు పూయిస్తాయి.

సినిమాలో హీరో హీరోయిన్లకు ఒకటే డ్యుయెట్‌. ఓ నేపథ్య గీతం, సినిమా మొదట్లో టైటిల్స్‌ పడుతుండగా ఓ పాట, చివరలో రోలింగ్‌ టైటిల్స్‌ సందర్భంగా టైటిల్‌ సాంగ్‌ వస్తాయి. ఇది సగటు తెలుగు ప్రేక్షకుడికి తృప్తినివ్వవు. పైగా, హాలులో వింటూ ఉండగానే మర్చిపోయేలా పాటలున్నాయి. రీ-రికార్డింగ్‌, ముఖ్యంగా శబ్దగ్రహణం (జాతీయ అవార్డుల గ్రహీత ఎ.ఎస్‌. లక్ష్మీనారాయణ ఆడియోగ్రాఫర్‌) తెరపై దృశ్యాల్లోని భావగాఢతను పెంచాయి. కళా దర్శకత్వం, కెమేరా పనితనం బాగున్నాయి. సినిమా విజువల్‌గా ఓ చక్కటి అనుభూతినిస్తుంది. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ కూడా చాలానే వాడారు. ఒకటీ, అరా మినహా అవీ బాగానే ఉన్నాయి.

ఎలా ఉందంటే...

పాత్రల పరిచయం, కథా నేపథ్య వివరణ, హీరో తాత ఫ్లాష్‌బ్యాక్‌తో ప్రథమార్ధం చకచకా నడుస్తుంది. హీరో, హీరోయిన్ల పాకిస్తాన్‌ పర్యటనతో ఆసక్తిని నిలబెడుతుంది. కానీ, విలన్‌కూ, హీరోకూ మధ్య ఢ అంటే ఢ మొదలయ్యే ద్వితీయార్ధానికి వచ్చే సరికి సినిమా క్రమంగా పట్టు సడలింది. హీరో ఎలాగూ నిధిని సాధిస్తాడన్నది సగటు సినిమా సూత్రం కాబట్టి, ప్రేక్షకుల ఆసక్తి అంతా అది ఎలా సాధ్యమైందన్న దాని మీదే! కానీ, అక్కడ విజువల్‌ ఎఫెక్ట్‌ల మీద ఉన్నంత శ్రద్ధ, ఒక అంతస్సూత్రంగా సన్నివేశాలను నడిపే తీరులో కనిపించదు. ఒక దశకు వెళ్ళాక, కథలో హీరో పాత్రదే డామినేషన్‌ అయిపోయి, విలన్‌ వట్టి డమ్మీ అనిపిస్తాడు.

నిధిని చేరుకొనే ఘట్టాలు, ముఖ్యంగా దిగుడు బావి, బాణాల మందిరం లాంటి అంశాలు బాగానే ఉన్నా అవొక్కటే అందరినీ ఆకట్టుకోలేవు. ఈ చిత్రంలో లోటుపాట్లు కూడా చాలానే ఉన్నాయి. హీరో తాత 'పుష్కళావతి డైమండ్స్‌' పేర వ్యాపారం సాగించిన అంత పెద్ద వజ్రాల వ్యాపారి అయినా సరే, హీరో తండ్రి (నారాయణరావు)కి కానీ, ఇంట్లో వాళ్ళకు కానీ ఆయన సంగతులు కానీ, ఆ వ్యాపారం గురించి కానీ, దేశవిభజనలో ఇక్కడకు వచ్చేశామన్నట్లు కానీ తెలియవన్నట్లు చూపించడం నప్పలేదు. అలాగే, పాకిస్తాన్‌లోని పెషావర్‌ సమీపంలో ఉందన్నట్లు కథలో చూపిన హింగ్‌లాజ్‌ దేవి (ఆలయం) హీరో కుటుంబానికి తరతరాలుగా కులదేవత అయినప్పుడు, దాని వివరాలేమిటో, ఎందుకో అన్న సంగతి హీరోకూ, అతని కుటుంబానికీ తెలియదన్నట్లు చూపడం కూడా నమ్మశక్యం కాని విషయమే. హీరో వాళ్ళ పాత ఇంట్లో పై కప్పు ఊడిపడి, అందులో నుంచి తాత వీలునామా, డైరీ, ఖాళీ వజ్రాల సంచీ లాంటివి దొరకడం ఒక మిస్టరీ అయితే, వాటి గురించి ఇంట్లో చర్చే జరగకపోవడం సహజమైన స్పందనకు విరుద్ధంగా కనిపిస్తుంది.

అలాగే, కథ ప్రకారం హింగ్‌లాజ్‌ దేవి ఆలయం ఉన్నదీ, నిధుల అన్వేషణలో ప్రవేశించాల్సిన మార్గమూ ఒకచోట కాగా, పురావస్తు తత్త్వవేత్తలు తవ్వకాలు జరిపేది మాత్రం వేరొకచోట! ప్రవేశ మార్గానికీ, నిజంగా నిధి ఉన్న ప్రదేశానికీ మధ్య చాలా దూరముందని గ్రహించి, ప్రేక్షకులు సర్దిచెప్పుకోవాల్సిందే! ఇలాంటి నిధుల అన్వేషణ కథల్లో చూపే పగ, ప్రతీకారాల ఫార్ములా కానీ, ప్రత్యేకించి వినోదం, వీనుల విందైన పాటలు కానీ 'సాహసం'లో లేకపోవడం సామాన్య ప్రేక్షకులకు కొంత అసంతృప్తి కలిగిస్తుంది. భక్తినీ, మూఢ విశ్వాసాన్నీ సున్నితంగా వేరు చేసి చూపే మాటలు, దృశ్యాలతో పాటు, ''అదృష్టం కోసం యంత్రాలను కాకుండా కష్టమనే మంత్రాన్ని నమ్ముకో'' లాంటి ఆలోచనాత్మక సంభాషణలూ సినిమాలో ఉన్నాయి. వెరసి, చివరకు వచ్చేసరికి ఈ చిత్ర యూనిట్‌ పడ్డ కష్టం మాత్రం 'అడ్వెంచరస్‌ యాక్షన్‌' కథా చిత్ర ప్రియులకే కాలక్షేపమనిపిస్తుంది.

కొసమెరుపు : మ్యాప్‌ను కూడా నీళ్ళలో పడేసే హీరో, మైండ్‌ వాయిస్‌లా తనలో తానే మాట్లాడుకుంటూ నిధి అన్వేషణలో ప్రతి చిక్కుముడినీ తానే విప్పడంతో కథలో మజా ఏముంది! అందుకనే, విజువల్‌గా బాగున్నా, ప్రేక్షకులను అందులో పూర్తిగా లీనం కానివ్వని ఈ చిత్రం - సగమే ఫలించిన 'సాహసం'! 

- రెంటాల జయదేవ 

..........................................................

1 వ్యాఖ్యలు:

వేణూశ్రీకాంత్ said...

ఆలయం నుండే నిధికి ప్రవేశమార్గమనేది తవ్వకాలు జరిపే వాళ్ళకి తెలియదండీ. వాళ్ళు నిధి ఉన్న మాప్ ఒక పెట్టెలో ఉందనీ ఆ పెట్టె తాళం ఆ చుట్టుపక్కల దొరికే అవకాశముందని ఆ తాళం కోసం మాత్రమే అక్కడ తవ్వుతూ వెతుకుతుంటారు.

నిధి లొకేషన్ గురించి కేవలం హీరో తాత డైరీ ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. మీరన్నట్లు నిధి గురించి ఇంట్లో వాళ్ళ అనాసక్తి జస్టిఫై కాలేదు ఆ తండ్రి పాత్ర అలాటిదని సరిపుచ్చుకోడమే. ఇక ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులని పోగొట్టుకున్నాడు కనుక ఏదో పూర్వీకుల దేవత పటం అని పూజిస్తుండచ్చు కానీ వజ్రాల వ్యాపారం, ఆలయం ఇంకా ఇతర వివరాలు ఏవీ తెలిసే అవకాశం లేదు.