జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, November 2, 2013

సాంకేతికంగా మరో ముందడుగు - 'క్రిష్‌ 3' (సినిమా సమీక్ష)




     మానవ జాతిని నాశనం చేయాలనీ, ప్రపంచం మీద తన ఆధిపత్యం నెలకొల్పాలనీ అనుకొనే విలన్ల కథలు, వాళ్ళను మట్టి కరిపించే శాస్త్రవేత్తలు, హీరోల కథలు మనకు తెలియనివేమీ కావు. ఇలాంటి సూపర్‌ హీరో సినిమాలు, సైన్స్‌ ఫిక్షన్‌ - ఫ్యాంటసీ సినిమాలు హాలీవుడ్‌లో కోకొల్లలు. కానీ, మన వెండితెర మీద మాత్రం ఖర్చు, సాంకేతిక పరిజ్ఞానాల రీత్యా అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. 'క్రిష్‌3' అచ్చమైన అలాంటి హాలీవుడ్‌ తరహా కథ. కాకపోతే, దానికి భారతీయ సినిమా కథల తరహా ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. పిల్లల్ని ఆకట్టుకొనే అంశాలు మునుపటి భాగాలతో పోలిస్తే తగ్గినా, ఫరవాలేదనిపించారు. 
..........................................................................
చిత్రం - క్రిష్ 3, తారాగణం - హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా, వివేక్ ఓబెరాయ్, కంగనా రనౌత్, సంగీతం - రాజేశ్ రోషన్, కెమేరా - ఎస్. తిరు, నిర్మాత, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - రాకేశ్ రోషన్
..........................................................................

దాదాపు పదమూడేళ్ళ క్రితం 'కహో నా ప్యార్‌ హై' సినిమాతో తెరంగేట్రం చేసిన హృతిక్‌ రోషన్‌ కెరీర్‌ మొదట్లో ఫ్లాపులను ఎదుర్కొన్నా, తరువాత హీరోగా నిలబడ్డారు. దర్శక - నిర్మాత అయిన తండ్రి రాకేశ్‌ రోషన్‌ సారథ్యంలో కృష్ణ అలియాస్‌ 'క్రిష్‌' పాత్రలో మన భారతీయ వెండితెరపై సూపర్‌హీరోగా ఎదిగారు. ఆ తండ్రీ కొడుకుల కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా - 'క్రిష్‌3'. ఈ సైన్స్‌- ఫిక్షన్‌ చిత్రం 'కోయీ... మిల్‌ గయా', 'క్రిష్‌' చిత్రాల సూపర్‌హిట్ల తరువాత అదే సిరీస్‌కు కొనసాగింపుగా వచ్చిన మూడోది.

సూపర్‌ మ్యాన్‌ లాంటి హీరో, 'ఎక్స్‌ మెన్‌' లాంటి విలన్‌ ముఠా సభ్యులు, వాళ్ళ మధ్య పోరాటం - అనే హాలీవుడ్‌ సినీ వాణిజ్య కథలను బాగా కలగలిపి, ఈ సినిమాలో యథేచ్ఛగా వాడుకున్నారు. 'ఎప్పటికైనా, చెడు మీద మంచి విజయం సాధిస్తుంది' అనే వెండితెర సూత్రానికి తగ్గట్లుగా సినిమాను నడిపారు. కృష్ణ అలియాస్‌ క్రిష్‌ (హృతిక్‌ రోషన్‌) చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ గడిపేస్తుంటాడు. ఆపదలో ఉన్నవాళ్ళను ఆదుకొనేందుకు అవసరమైనప్పుడల్లా 'క్రిష్‌'గా అవతారమెత్తి, తన సూపర్‌మ్యాన్‌ శక్తులతో రక్షిస్తూ ఉంటాడు. జర్నలిస్టు ప్రియ (ప్రియాంకా చోప్రా) అతని భార్య. కృష్ణ తండ్రి డాక్టర్‌ రోహిత్‌ మెహ్రా (ద్విపాత్రాభినయంలో హృతిక్‌ రోషన్‌) ఓ శాస్త్రవేత్త. వెలుతురు జీవం పోస్తుందన్న దానిపై పరిశోధనలు చేస్తుంటాడు. 

ఇక, మెదడుతో ఆలోచించి, చేతి వేళ్ళతో ఏదైనా చేయగల శక్తిసంపన్నుడైన వికలాంగుడు కాల్‌ (వివేక్‌ ఓబెరారు) ఓ దుష్టుడు. తన డి.ఎన్‌.ఏ.కు సరిపడే బోన్‌ మ్యారో (ఎముక మూలగ)ను శరీరంలో ప్రవేశపెట్టుకొని మామూలు మనిషి కావాలనీ, మానవాళిని ధ్వంసం చేయాలనీ తనదైన లోకంలో ప్రయోగాలు చేస్తుంటాడు. రకరకాల జంతువుల నుంచి మ్యుటేషన్‌ ద్వారా అతను సృష్టించిన రకరకాల మానవ మృగాలు అతని బంట్లు. రంగులు మార్చే ఊసరవెల్లి నుంచి అలా తయారైన మానవ మృగం కాయ (కంగనా రనౌత్‌). కాల్‌ ఓ ప్రాణాంతక వైరస్‌ను కనిపెట్టి, దాన్ని ప్రపంచంపై ప్రయోగించి, దానికీ విరుగుడు కూడా తన డి.ఎన్‌.ఏ. నుంచే చేసి, కోట్లు గడిస్తుంటాడు. భారత్‌లో అతను ప్రవేశపెట్టిన వైరస్‌ను అరికట్టే మందును హీరో డి.ఎన్‌.ఏ. నుంచి అతని తండ్రి తయారు చేస్తాడు. అదెలా సాధ్యమైంది? అది తెలిసి విలన్‌ ఏం చేశాడు? విలన్‌కూ, హీరోకూ ఉన్న సంబంధమేమిటి? చివరకు ఆ విలన్‌పై హీరో ఎలా విజయం సాధించాడు? లాంటి వన్నీ మిగతా సినిమా.
   మొదట కాసేపు నెమ్మదిగా సాగే ఈ చిత్రం క్రమంగా పుంజుకొని ఇంటర్వెల్‌ దగ్గర కీలకమైన మలుపుతో ఆగుతుంది. ద్వితీయార్ధం రకరకాల మలుపులతో కొంత వేగం అందుకుంటుంది. చివరకు మాత్రం సుదీర్ఘమైన హీరో, విలన్‌ పోరాటంతో ముగుస్తుంది. క్లిష్టమైన ప్రోస్థెటిక్‌ మేకప్‌తో వృద్ధుడైన తండ్రి పాత్రను చక్కటి బాడీ లాంగ్వేజ్‌తో హృతిక్‌ చక్కగా అభినయించాడు. ఇక, కుమారుడు క్రిష్‌ పాత్రలో సిక్స్‌ - ఎయిట్‌ ప్యాక్‌తో దృఢంగా కనిపిస్తాడు. హీరోయిన్‌ ప్రియాంక కన్నా, కంగనా రనౌత్‌ పోషించిన విలన్‌ తరహా పాత్ర కథకు కీలకం. ఆ పాత్రను ఆమె పండించారు. అలాగే, విలన్‌గా వివేక్‌ ఓబెరారు కేవలం చక్రాల కుర్చీకే పరిమితమై కూడా ఆకట్టుకున్నారు. 

కెమేరా వర్క్‌ బాగున్న ఇంత భారీ కథను ఊహించడం, దాన్ని కెమేరా కన్నుతో తెరపై చూపించడం కష్టమే. టీమ్‌ వర్క్‌గా సాగిన ఆ పనిలో దర్శక, నిర్మాత సఫలమయ్యారు. చాలాభాగం మన హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుకొన్న ఈ చిత్రం సాంకేతికంగా బాగుంటుంది. సినిమాలో వాడిన కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ (సి.జి.ఐ - కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజెస్‌) కానీ, యాక్షన్‌ సన్నివేశాలు - వాటి చిత్రీకరణ కానీ ఆశ్చర్యానందాలను కలిగిస్తాయి. ఏదైనా హాలీవుడ్‌ సినిమా చూస్తున్నామేమో అనిపిస్తాయి. హృతిక్‌ రోషన్‌ చెప్పినట్లు ''విజువల్‌ ఎఫెక్ట్‌ ్సకు సంబంధించినంత వరకు మన భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలుపుతుంది - 'క్రిష్‌3'. 

అయితే, హృతిక్‌ రోషనే ఈ మధ్య అన్నట్లు, ''ఏ సినిమా అయినా అనుకున్న ఫలితం సాధించాలంటే, టెక్నాలజీ ఒక్కదాని మీదే ఆధారపడితే సరిపోదు. టెక్నికల్‌గా సినిమా ఎంత బాగున్నా కథ ఉండాలి. అందులో విషయం ఉండాలి. సినిమాలోని ఆ పాత్రలతో ప్రేక్షకులు తాదాత్మ్యం చెందాలి. అది చాలా కీలకం'' అన్నారు. ఈ సినిమాలో లోపం ఏదైనా ఉందంటే, పెద్ద హృతిక్‌ రోషన్‌ పాత్ర చివరికి ఏమైంది లాంటి ఒకటి రెండు ఘట్టాలు మినహా ప్రేక్షకులకు భావోద్వేగాలు కలిగించే సన్నివేశాలు తక్కువగా ఉండడం. చావు బతుకుల్లో ఉన్న హీరోను చూసి, తండ్రి బాధపడడం లాంటి దృశ్యాలు ఆశించినంత పండలేదు.

సినిమాను సుదీర్ఘంగా చిత్రీకరించి, రెండున్నర గంటలకు కుదించడం వల్లనో, ఏమో కొన్ని చోట్ల లింకులు కనిపించవు. ఉదాహరణకు, హీరో తండ్రి, శాస్త్రవేత్త అయిన పెద్ద హృతిక్‌ రోషన్‌ సింగపూర్‌ వెళ్ళాక, అతను కిడ్నాప్‌ అయ్యాడనే దృశ్యమే కనిపించదు. నేరుగా అతణ్ణి విలన్‌ డెన్‌లో చూపెడతారు. ఇలాంటివి ఒకటి రెండు కనిపిస్తాయి. అలాగే, సర్వశక్తిమంతుడిగా చూపుడువేలుతో ఏ.కె. 47 గన్‌లను వంచేస్తూ, గుప్పిట మూసి ఆకాశంలోని హెలికాప్టర్లను కూడా పేల్చివేయగల సామర్థ్యం, ఎక్కడేం జరుగుతోందో ఇట్టే తెలుసుకొనే సత్తా ఉన్న విలన్‌ తీరా చివరలో హీరో భార్య ప్రియాంకా చోప్రా ఎక్కడుందంటూ వెతకడం లాంటివి మరీ సిల్లీగా ఉన్నాయి. విలన్‌కు కావాల్సింది తన డి.ఎన్‌.ఏ.కు సరిపడే 'ఎముక మూలగ' (బోన్‌ మ్యారో). ఆ అన్వేషణలో ఉన్న విలన్‌ డి.ఎన్‌.ఏ. ద్వారా వైరస్‌ను సృష్టించడం, మానవ మృగాల ద్వారా విధ్వంసం జరపడం లాంటివి అతని ప్రాథమికమైన లక్ష్యానికి తగినట్లుగా కనిపించవు.

అయితే, ఇప్పటికే 'కోయీ మిల్‌ గయా', 'క్రిష్‌' చిత్రాలు చూసి, ఆనందించినవాళ్ళు ఆ రకమైన ఆలోచనా దృక్పథంతో, ముందుగానే ట్యూన్‌ అయి ఈ 'క్రిష్‌3'కి వస్తారు కాబట్టి, వాళ్ళను ఈ సినిమా అధునాతనమైన సాంకేతికతతో అబ్బురపరుస్తుంది. అందుకే, స్క్రిప్టులో లోపాలున్నా, మిగిలిన హంగులు, ఆర్భాటాలతో సినిమా పాసై పోతుంది.

కొసమెరుపు: అన్నట్లు, ఈ సిరీస్‌లో మొదటి సినిమా పేరు - 'కోయీ మిల్‌ గయా'. రెండో సినిమా పేరు -'క్రిష్‌'. మరి, వీటి తరువాతి తాజా సినిమా ఏకంగా 'క్రిష్‌3'. మరి, మధ్యలో 'క్రిష్‌2' అనేది రానే లేదు. ఒకటి తరువాత 2వ నంబర్‌ రాకుండానే, 3వ నంబర్‌ రావడమేమిటంటారా? ఇలాంటి సినిమాల కథలోనే కాదు, పేరులోనూ లాజిక్‌ వెతకడం వృథా శ్రమే!
- రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 2 నవంబర్ 2013, శనివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
........................................................................

Saturday, October 26, 2013

పరమ రొటీన్‌ కథనంతో 'భాయ్' (సినిమా సమీక్ష)



   హాంగ్‌కాంగ్‌లోనో, బ్యాంకాక్‌లోనో మాఫియా ముఠాలు, మన రాజధాని దాకా విస్తరించిన ఆ ముఠా నేతల వ్యవహారాలు, అందులో హీరో పాత్ర, కథా నేపథ్యం హైదరాబాద్‌ నుంచి అక్కడికో, లేదంటే అక్కడ నుంచి ఇక్కడికో మారడం - ఇలాంటి సినిమాలు చూసి చూసీ సగటు తెలుగు ప్రేక్షకుడి తల ఇప్పటికే బొప్పి కట్టేసింది. కానీ, మన దర్శక, నిర్మాతలు, హీరోలు మాత్రం పదే పదే ఇలాంటి కథలనే వండి, వెండితెరపై వడ్డించడం మానలేదు. కొత్త సినిమా చూద్దామని వెళ్ళిన ప్రేక్షకులకు ఈ శుక్రవారం తాజాగా కట్టిన తలబొ (నొ)ప్పి - 'భాయ్' చిత్రం. 
......................................................................................
చిత్రం-భాయ్, తారాగణం - నాగార్జున, రిచా గంగోపాధ్యాయ. ఆశిష్ విద్యార్థి, సోనూ సూద్, సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, కెమేరా - సమీర్ రెడ్డి, నిర్మాత - నాగార్జున అక్కినేని, దర్శకత్వం- వీరభద్రం చౌదరి
.........................................................................................
    అప్పుడెప్పుడో ఆరేళ్ళ క్రితం 2007 డిసెంబర్‌లో విడుదలైన 'డాన'్‌ చిత్రం తరువాత హీరో నాగార్జునకు మళ్ళీ సరైన వాణిజ్య విజయం లేదు. ఆ తరువాత వచ్చిన 'కేడి', 'కింగ్‌', 'రగడ', 'రాజన్న', 'శిరిడిసాయి', 'ఢమరుకం', ఈ ఏడాది సమ్మర్‌ రిలీజ్‌ 'గ్రీకు వీరుడు' దాకా వరుసగా వైఫల్యాలే ఆయనను పలకరించాయి. ఫలితంగా ఆయన యాక్షన్‌ నేపథ్యంలో ఉండే ఓ వినోదాత్మక కథను ఈసారి ఎంచుకున్నారు. 'అల్లరి' నరేశ్‌తో 'అహ నా పెళ్ళంట!', సునీల్‌తో 'పూలరంగడు'తో వరుసగా రెండు విజయాలను అందుకున్న దర్శకుడు వీరభద్రమ్‌ తనకు విజయాన్ని అందిస్తారని నమ్ముకున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్‌ పతాకంపై, తానే నిర్మాతగా, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వారితో చేతులు కలిపి మరీ 'భాయ్'ను నిర్మించారు. కానీ, దాదాపుగా ఏడేళ్ళుగా తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు దర్శకుడు వీరభద్రమ్‌ చెప్పిన ఈ కథ సరిగ్గా ఆనాటి కథాచిత్రాల దశలోనే ఆగిపోయింది. లోతుగా చూస్తే, ఇంకా వెనక్కి కూడా వెళ్ళిందేమో అనిపిస్తుంది. 

హాంకాంగ్‌లో డేవిడ్‌ (ఆశిష్‌ విద్యార్థి) మాఫియా డాన్‌. అతనికి ఇద్దరు కొడుకులున్నా, భాయ్ (నాగార్జున) అంటే గురి. హైదరాబాద్‌లో తమ మాఫియా ముఠా సభ్యులను ఎవరో పోలీసు అధికారి గుట్టుచప్పుడు కాకుండా తుద ముట్టిస్తుండడంతో, అతని అడ్డు తొలగించడానికి భాయ్ ును అక్కడకు పంపుతాడు డేవిడ్‌. తీరా అక్కడకు వెళ్ళిన హీరోకు ఆ పోలీసు అధికారి (ప్రసన్న) ఎవరన్నది తెలుస్తుంది. దాంతో, చంపకుండా అతణ్ణే కాపాడడం మొదలుపెడతాడు. ఇంతకీ ఆ పోలీసు అధికారికీ, హీరోకూ సంబంధం ఏమిటి, చివరకు ఏమైందన్నది మిగతా సినిమా. 

మొదట కాసేపు'స్టైలిష్' అనిపించిన ఈ సినిమా ఆ వెంటనే బిగి తగ్గిపోతుంది. కానీ, ఆసక్తికరమైన మలుపు దగ్గర ఇంటర్వెల్‌ పడుతుంది. ద్వితీయార్ధం బాగుంటుందని భావిస్తే, తీరా అది కాస్తా రొటీన్‌ పెళ్ళింటి వినోదం ఫక్కీలో సా...గుతుంది. బలమైన విలన్‌ కానీ, హీరో పాత్రకు క్లిష్టమైన లక్ష్యం కానీ, దాన్ని చేరుకొనేందుకు పెద్దగా శ్రమ కానీ లేకపోవడంతో సినిమా విసుగనిపిస్తుంది. 

పెరిగిన జుట్టుతో మాఫియా గెటప్‌, పిల్లి గడ్డంతో పాత బస్తీ 'భాయ్' గెటప్‌, చెల్లి పెళ్ళికని మామూలు గెటప్‌లతో మూడు విధాలుగా నాగార్జున తెరపై కనిపించారు. 'మాస్‌', 'డాన్‌', అతిథి పాత్రలో కనిపించిన 'స్టైలిష్' చిత్రాల శైలిని గుర్తుచేసే ఆహార్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని శతవిధాల ప్రయత్నించిన నాగార్జున, ఫ్యాన్స్‌ విషయంలోనే ఆ మేరకు సక్సెస్‌ అయ్యారనిపిస్తుంది. యాభయ్యో పడిలో ఉన్న నాగ్‌ సినిమాలో వీలున్నప్పుడల్లా కళ్ళను కనిపించనివ్వకుండా చలవ కళ్ళద్దాలతో మేనేజ్‌ చేశారు. ఉన్నంతలో అందంగా, హుందాగా అనిపించారు. మునుపటి మోకాలి శస్త్రచికిత్స లాంటి వాటి ఫలితాలు కెమేరా ముందు కనపడిపోతున్నా, కష్టపడి స్టెప్పులు వేశారు. ఎగరడాలు, దూకడాలు లేకుండానే సై ్టలిష్‌గా ఫైట్లు చేశారు. అయితే, వీరభద్రమ్‌ కథలో కానీ, కథనంలో కానీ దమ్ము లేకపోవడంతో ఇవేవీ పెద్దగా ఉపయోగపడలేకపోయాయి. 

సహజంగా పొడగరి, అందగత్తె అయిన రిచా గంగోపాధ్యాయ నాగ్‌ సరసన చూడడానికి బాగున్నారు. కానీ, ఆమె పాత్ర పాటలకే పరిమితమైంది. పూల తోటల పెంపకదారైన హీరోయిన్‌ను కాస్తా ఒక్కోసారి సాఫ్ట్‌ ఇంజనీర్‌ అని భ్రమింపజేసేలా చూపెట్టారు. హీరో చెల్లెలి ఆఫీసుకు వెళ్ళి, ఆమె గొడవ పడే సన్నివేశం లాంటివి అందుకు ఉదాహరణ. వరుసగా పెళ్ళి చూపులకు హాజరయ్యే హీరోయిన్‌ తీరా హీరోను ఎంపిక చేసుకున్న తీరూ పొసగలేదు.

 ఈ సినిమాలో రెండు సీన్లకు పరిమితమవుతూ కామ్నా జెఠ్మలానీ, అలానే సినిమా మొదట్లో నథాలియా, మమతా మోహన్‌దాస్‌ గొంతులో వినిపించే చివరి పాటలో హంసానందిని ('మిర్చి'లో ఐటమ్‌ సాంగ్‌ గుర్తుందిగా!) ప్రత్యేక నృత్య గీతాల్లో కనిపిస్తారు. హీరో చెల్లెలు గీత పాత్రలో నటించిన అమ్మాయి అందం, అభినయం లేకపోగా, అవసరమైన అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్‌కూ ఉపయోగపడలేదు. 

ఈ సినిమాలో ఒకరూ, ఇద్దరూ కాదు - తెర నిండుగా ఎంతో మంది క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఉన్నారు. హీరో తండ్రిగా నాగినీడు, హీరోయిన్‌ తండ్రిగా దర్శక - నటుడు కాశీ విశ్వనాథ్‌లు మరీ రొటీన్‌ భావప్రకటనలతో నడిపించారు. హీరోయిన్‌ బామ్మ పాత్రలో సీనియర్‌ నటి గీతాంజలి ఒక డైలాగ్‌తో కనిపిస్తే, హౌమ్‌ మంత్రి భార్య పాత్రలో హేమ కనీసం డైలాగైనా లేకుండా అర నిమిషంలో మెరిసిమాయమవుతారు. ఈ చిత్రంలో కామెడీ ఆర్టిసులకూ కొదవ లేదు. బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, రఘుబాబు, 'థర్టీ ఇయర్స్‌' పృథ్వి, ధన్‌రాజ్‌, రఘు, 'సత్యం' రాజేశ్‌ - ఇలా ఎందరెందరో కనిపిస్తారు. కానీ, ఏం లాభం! తెరపై పండిన నవ్వులు మాత్రం చాలా తక్కువ. 'రూలర్‌...' అన్న హిట్‌ పాట బ్యాక్‌గ్రౌండ్‌ వినిపిస్తుండగా, ఉన్నంతలో కొద్దో గొప్పో నవ్వించిందల్లా - ఎమ్మెస్‌ నారాయణ, అరిగిపోయిన ఆయన తాగుబోతు కామెడీ మాత్రమే.

నిజానికి, మాఫియా నేపథ్యం సంగతి కాసేపు పక్కనబెడితే, అన్నకు తమ్ముడు, చెల్లెలు పట్ల ఉండే అనుబంధమనే బలమైన సెంటిమెంట్‌ దర్శకుడు తీసుకున్న ఇతివృత్తంలో ఉంది. కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అన్నాచెల్లెళ్ళ మధ్య కానీ ఆ బంధాన్ని పటిష్ఠం చేస్తూ, ప్రేక్షకులను ఆ భావోద్వేగానికి గురి చేసే ఘట్టాలు, సన్నివేశాలు అల్లుకోలేకపోయారు. దాంతో, ఎప్పుడో పాతికేళ్ళ క్రితం అన్నీ, అందరినీ వదిలేసి ఎక్కడో దూరంగా మాఫియా డాన్‌గా ఉంటున్న హీరో, మళ్ళీ తన వాళ్ళ కోసం కష్టపడడం అర్థం కాని విషయం. 



అసలు ఈ సినిమాలో హీరో గురించి విలన్‌ చెప్పే విధానం చూసినా, అతని పరిచయ సన్నివేశం చూసినా అతనే ఓ మాఫియా డాన్‌ ఏమో అనిపిస్తుంది. మళ్ళీ కాసేపైన తరువాతేమో హీరో కేవలం పెద్ద డాన్‌ డేవిడ్‌ (ఆశిష్‌ విద్యార్థి)కు నమ్మకస్థుడైన బంటు అంటారు. అలాగే, మౌత్‌ ఆర్గాన్‌ వాయించడమనే చిన్న దృశ్యం ద్వారా హీరోయే తన అన్నయ్య అని చిన్నప్పటి నుంచి అతనికి దూరంగా ఉన్న చెల్లెలు గుర్తుపట్టడం లాంటివి పూర్తిగా సినిమాటిక్‌గా ఉన్నాయి. కనీసం అన్నాచెల్లెళ్ళ అనుబంధానికీ, ఆ మౌత్‌ ఆర్గాన్‌కూ మధ్య లింకును చూపే బలమైన ఫ్లాష్‌బ్యాక్‌ సీన్‌ అయినా పెట్టలేదు. 

ప్లస్‌ పాయింట్లుగా చెప్పాలంటే, ఈ సినిమాలో హీరో నోట ఎప్పటికప్పుడు వినిపించే సరికొత్త పంచ్‌ డైలాగులు. ఇవి కొంత వరకు మాస్‌ ప్రేక్షకులనూ, అభిమానులనూ ఆకట్టుకొనేలా ఉన్నాయి. అయితే, ఒక దశకు వచ్చేసరికి ప్రతి సీన్‌లో, దాదాపు ప్రతి పాత్రా ఏదో ఒక రకమైన పంచ్‌ను పలికించాలనుకొనేసరికి, మోతాదు మించిపోయిందని అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సినిమాను ఓ స్థాయికైనా నిలబెట్టింది. 'బి హెచ్‌ ఏ ఐ - భారు.. చీకటి పడితే ప్లేబాయ్..' అనే టైటిల్‌ సాంగ్‌, 'రామ సక్కనోడు...' అనే యుగళ గీతం అభిమానుల్ని ఆకట్టుకుంటాయి. కానీ, సినిమా తొలి గంటలోనే మూడు పాటలు వచ్చేసరికి, హాలులో నుంచి చిన్నగా ప్రేక్షకులు బయటకు వెళ్ళక తప్పలేదు.

కనువిందుగా దృశ్యాలను చూపించడంలో కెమేరా వర్క్‌ బాగానే ఉంది. లొకేషన్లు, ఖరీదైన సెట్లు, భారీ తారాగణంతో 'భాయ్'లో చిత్ర నిర్మాణ విలువలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఎడిటింగ్‌లోని లోటుపాట్లు, అసలు కథా కథనంలోనే ఉన్న బలహీనతలు ఈ సానుకూల అంశాలను కప్పెట్టేశాయి. ఇంత భారీ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో దర్శకుడి అనుభవ రాహిత్యం, కథ, కథన లోపాలు శాపమయ్యాయి. మునుపటి రెండు చిత్రాల్లో కనీసం శ్లాప్‌స్టిక్‌ కామెడీతో అయినా గట్టెక్కినా వీరభద్రం, ఈ చిత్రంలో ఆ పాటి వినోదమూ అందించలేకపోయారు! తెలుగు తెరపె ఇప్పటికే తెగ వాడేసిన ద్వితీయార్ధపు శ్రీను వైట్ల మార్కు పెళ్ళి ఇంటి వాతావరణపు సీన్లూ పండించ లేకపోయారు. వెరసి, రెండుంబావు గంటల రొటీన్‌ సినిమాగా 'భారు'ను మిగిల్చారు. 

కొసమెరుపు: సోలో హీరోగా కెరీర్‌ చివరకు వచ్చేసినట్లు ఇటీవల తానే స్వయంగా ఒప్పుకున్న నాగార్జున బహుశా ఈ 'భాయ్'తో ఆ రకం చిత్రాలకు దాదాపు బై... బై... చెప్పేసినట్లేనా?         

-  రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 26 అక్టోబర్ 2013, శనివారం నాటి సంచిక, పేజీ నం. 8లో ప్రచురితం)
....................................................

Tuesday, October 22, 2013

ఆలోచన రేపే నిజ జీవిత కథ - 'షాహిద్‌' (సినిమా సమీక్ష)


       ఇటీవలి కాలంలో హిందీ చిత్రసీమలో ఓ పక్క రొటీన్‌ కమర్షియల్‌ చిత్రాలతో పాటు, మరోపక్క భిన్నమైన కథలు, కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలు వరుసగా వస్తున్నాయి. చిన్న బడ్జెట్‌లో, సహజత్వానికి దగ్గరగా రూపొందిస్తున్న ఈ నవీన ధోరణి చిత్రాలు ముందుగా అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతున్నాయి. అక్కడ విమర్శకుల ప్రశంసలందుకొని గుర్తింపు తెచ్చుకున్న తరువాత, ఇక్కడ ఏదో ఒక ప్రసిద్ధ చిత్ర వ్యాపార సంస్థలు ముందుకొచ్చి, ఆ చిత్రాల మార్కెటింగ్‌లో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. అలా ఆ చిన్న చిత్రాలను కూడా విస్తృతమైన ప్రచారం, మార్కెటింగ్‌తో జనం ముందుకు తెస్తున్నాయి. 'షిప్‌ ఆఫ్‌ థెసియస్‌', 'లంచ్‌ బాక్స్‌' లాంటి ఇటీవలి చిత్రాలు కొన్ని అలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినవే. అదే కోవలో అక్టోబర్‌ 18న దేశవ్యాప్తంగా విడుదల కానున్న హిందీ చిత్రం - 'షాహిద్‌'.  

పోలీసులు కేసు పెట్టినంత మాత్రాన, సదరు కేసులో కోర్టు తీర్పు రాక ముందే మీడియా చిలవలు పలవలు చేసినంత మాత్రాన ఎవరైనా తీవ్రవాది అయిపోతారా? దేశంలో జరుగుతున్న విద్రోహ కార్యకలాపాలన్నిటికీ ఒక వర్గం వారినే ఎందుకు తప్పుబడుతున్నారు? నమోదవుతున్న కేసుల్లో నిజంగా దోషులు ఎవరు? ఎందరు? మన చుట్టూ సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇలాంటి మౌలికమైన ప్రశ్నలెన్నో మనకు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు మన మధ్యే బతికిన ఓ మనిషి జీవితాన్ని తీసుకొని, దాన్ని తెరకెక్కిస్తూ ఈ ప్రశ్నలపై అందరినీ ఆలోచింపజేసే ప్రయత్నమే - 'షాహిద్‌' చిత్రం.
 బొంబాయికి చెందిన మానవ హక్కుల ఉద్యమకారుడు, వృత్తి రీత్యా వకీలు అయిన షాహిద్‌ ఆజ్మీ (1977 - 2010) నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్ర కథను అల్లుకున్నారు. గుర్తు తెలియని దుండగుల చేతుల్లో తన కార్యాలయంలోనే కాల్పులకు గురై, 2010 ఫిబ్రవరి 11న ఆయన ప్రాణాలు కోల్పోయారు. తీవ్రవాదంపై పోరాటం విషయంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ చివరకు క్రూరమైన పోలీసు రాజ్యంగా మారినప్పుడు, దాన్ని వ్యతిరేకిస్తూ పోరాడారాయన. నిరుపేదలు, కనీసం తమ మీద వచ్చిన కేసులపై పోరాటానికి డబ్బులిచ్చి వకీలును కూడా పెట్టుకోలేని కడుదీనులైన వందలాది ముస్లిమ్‌ల తరఫున ఆయన నిలిచారు. తీవ్రవాదులుగా ముద్ర పడిన పలువురు అమాయకుల పక్షాన వాదిస్తూ, ఏడేళ్ళలో 17 మందిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. చివరకు ఆ కృషిలోనే కేవలం 31 ఏళ్ళ వయస్సుకే ముష్కరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ముంబరులో బాంబు పేలుళ్ళకూ, దాడులకూ పాల్పడిన దేశద్రోహులైన వ్యక్తుల పక్షాన ఆయన నిలిచారన్న అపవాదులూ వచ్చాయి. 

ఏమైనా, నేరం రుజువు కానంత వరకు ఎవరైనా నిందితులే తప్ప, దోషులు కాదనీ, అనుమానంతో ప్రతి ఒక్కరిపై అనవసరంగా తీవ్రవాదులనే ముద్ర వేయరాదనీ ప్రాథమికమైన సూత్రాలను పట్టుకొని నడిచిన ఉద్యమకారుడు ఆయన. ఈ 'షాహిద్‌' చిత్రం కూడా ఆయన జీవిత ఘట్టాలను ఒక్కొక్కటిగా తెర మీదకు తెచ్చింది. తేదీలు, జరిగిన సంఘటనల వివరాలను తెలిపే టైటిల్‌ కార్డులతో కథకు ఓ చారిత్రక సాధికారికతను అద్దే ప్రయత్నం చేసింది. కథానాయకుడు చిన్నప్పుడు తీవ్రవాదిగా మారడానికి ప్రయత్నించడం, ఆ తరువాత ఆ వలలో నుంచి బయటకు వచ్చేసినా కఠినమైన తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద తప్పుడు కేసులో ఇరుక్కోవడం, ఆ పైన మానవ హక్కుల పరిరక్షణ కోసం లాయర్‌గా ప్రయత్నించడం - ఇలా ఎన్నో మలుపులు తిరిగిన ఆయన జీవితాన్ని వీలైనంత వరకు నిజ జీవిత ఘటనల నుంచి తీసుకొని, అవసరాన్ని బట్టి కొంత కల్పన జోడించి, కాస్తంత నాటకీయంగా కూడా చూపారీ సినిమాలో!  
ఇప్పటికే ఈ చిత్రాన్ని 'టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం - 2012' (టి.ఐ.ఎఫ్‌.ఎఫ్‌. 2012)లో వరల్డ్‌ ప్రీమియర్‌గా వేశారు. అలాగే, న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో, చికాగో సౌత్‌ ఏషియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సెంటర్‌ పీస్‌గా ప్రదర్శించారు. అలాంటి పలు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపును అందుకున్న ఈ చిత్రం వెండితెరపై రెండు గంటల పైచిలుకు సాగే మంచి ప్రయత్నం. 'కై పో చే' చిత్రం ద్వారా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న రాజ్‌ కుమార్‌ యాదవ్‌ ఈ చిత్రంలోని టైటిల్‌ రోల్‌ను చక్కగా పోషించారు. అలాగే, అతను ఇష్టపడి, పెళ్ళాడిన మరియమ్‌ పాత్రలో ప్రబ్లీన్‌ సంధ్య, అతని తల్లిగా బల్జీందర్‌ కౌర్‌, ప్రాసిక్యూషన్‌ లాయర్‌గా విపిన్‌ శర్మ - ఆ యా పాత్రలను వీలైనంత సహజత్వంతో తెరపై పండించారు.

పాటలు, నృత్యాల లాంటి రొటీన్‌ సినిమాటిక్‌ హంగామాలేవీ లేని ఈ చిత్రం సందర్భోచితమైన నేపథ్య సంగీతంతోనే ఆద్యంతం నడుస్తుంది. రొటీన్‌గా సాగే మెలోడ్రమాటిక్‌ కోర్టు సన్నివేశాలను చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు సహజమైన కోర్టు వాతావరణం, డైలాగులతో సహజత్వాన్ని పరిచయం చేస్తుంది. ప్రథమార్ధం వరకు కొంత డాక్యుమెంటరీ శైలిలో నిదానంగా నడిచినా, ద్వితీయార్ధానికి వచ్చే సరికి సినిమా వేగం అందుకుంది. భార్యాభర్తల పాత్రల మధ్య మానసిక సంఘర్షణ, కోర్టులో వాదోపవాదాలు, కథానాయకుడి కోసం దుండగుల అన్వేషణ లాంటి దృశ్యాలు, వాటిని కెమేరాలో చిత్రీకరించిన విధానం చిత్రంలో భావోద్వేగాన్ని పెంచాయి. 
అక్కడక్కడా కొంత సినీ నాటకీయతను సంతరించుకున్నా, ఆసక్తిని పెంచి, సినిమాను నలుగురూ మెచ్చేలా చేశాయి. రచనతో పాటు, ఛాయాగ్రహణం, కూర్పు లాంటి సాంకేతిక శాఖల పనితనం సినిమాలో కనిపిస్తుంది.
ఇటీవలి కాలంలో 'పాన్‌సింగ్‌ తోమార్‌', 'భాగ్‌ మిల్ఖా భాగ్‌' లాంటి జీవిత కథా చిత్రాలను తీస్తూ, ఆకర్షిస్తున్న హిందీ చిత్రసీమ దానికి కొనసాగింపుగా 'బయో పిక్స్‌' కోవలో తీసిన తాజా సినిమా ఇది.

'స్పాట్‌ బారు' అనే విభాగం కింద విలక్షణమైన, చిన్న బడ్జెట్‌ కథా చిత్రాలను అందిస్తున్న 'యు' టి.వి. సంస్థ అదే విభాగంలో ఈ 'షాహిద్‌'ను అందించింది. అయితే, ఇప్పటికే ఆ విభాగం కింద 'యు' టి.వి. అందించిన గత చిత్రాలతో పోలిస్తే, ఈ సినిమా అంత గొప్పగా అనిపించదు. సినిమా వ్యాకరణానికి కొద్దిగా భిన్నంగా, 'సోనీ' టీవీలోని ప్రసిద్ధ టీవీ షో 'పోలీస్‌ పాట్రోల్‌' తరహాలో, సీరియల్‌ నిర్మాణ వ్యాకరణంతో నడుస్తుంది. చిన్నప్పుడే మతఘర్షణల్ని చూసిన హీరో తీవ్రవాదం వైపు ఆకర్షితుడు కావడానికి కానీ, ఆ వల నుంచి బయటపడడానికి కానీ నమ్మదగిన సరైన కారణాలను తెరపై చూపించలేదు. పైగా, ప్రధానంగా కథానాయకుడి దృష్టి కోణం నుంచే కథ నడవడంతో, ప్రతి వాస్తవానికీ ఉండే మిగిలిన కోణాలను చూపెట్టలేకపోయింది. 

ఏమైనా, 'షాహిద్‌' ఓ అద్భుతమైన సినిమా కాకపోవచ్చు కానీ, ఓ అందమైన ప్రయత్నం. చుట్టూ ఉన్న సమాజంలో మన మధ్య తిరిగిన ఓ మామూలు మనిషి జీవితానికి సెల్యులాయిడ్‌ చిత్రీకరణగా ఆలోచింపజేసే సత్ప్రయత్నం. ప్రతి ముస్లిమ్‌నూ తీవ్రవాదిగా చూసే చాలామంది ఆలోచనా ధోరణిలోని అపసవ్యతను ఎండగట్టే సెల్యులాయిడ్‌ ప్రయత్నం. రొడ్డకొట్టుడు కమర్షియల్‌ చిత్రాల కలకలానికి దూరంగా, మనసుంటే మంచి సినిమాలు ఎలా తీయవచ్చన్న దానికి కళ్ళెదుట నిదర్శనం. 

కొసమెరుపు: వరుసగా అయిదారు ఫ్లాపులిచ్చిన దర్శకుడు హన్సల్‌ మెహతా ఆ అపజయాల్ని లెక్కచేయకుండా ఇలాంటి కథను ఎంచుకోవడం గొప్పే! అతనన్ని ఫ్లాపుల్లో ఉన్నా సరే, ఈ కథనూ, అతని దర్శకత్వాన్నీ ప్రోత్సహించడం హిందీ చిత్రసీమ ఘనత. మరి, పదుల కోట్ల ఖర్చుతో రొటీన్‌ చిత్రాలు తీసే మన నిర్మాతలు, స్టూడియో అధినేతలు ఇలాంటివి చూసైనా ఏమైనా కొద్దిగా నేర్చుకుంటారంటారా?
రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 17 అక్టోబర్ 2013, గురువారం, పేజీ నం. 8లో ప్రచురితం)
.....................................................................

Sunday, October 20, 2013

''నాకు క్యాన్సర్‌! నన్ను ఆశీర్వదించండి!'' - అక్కినేని నాగేశ్వరరావు సంచలనాత్మక ప్రకటన


- సానుభూతి వద్దు ! వచ్చి ఇబ్బంది పెట్టద్దు!
- క్యాన్సర్‌ విజేతలెందరో ఉన్నారు!
- ఆఖరి క్షణం వరకు నటిస్తా! 

అక్కినేని అంతరంగ ఆవిష్కరణ

ట్రాజెడీ చిత్రాల రొమాంటిక్‌ కథానాయకుడిగా అశేష అభిమానుల్ని సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు తనకు క్యాన్సర్‌ వచ్చిందన్న విషయాన్ని ప్రకటించడంలో మొక్కవోని ధైర్యం చూపి, హీరోగా నిలవడం విశేషం. ''సుస్తీ చేసిందని చాలామంది బయటకు చెప్పుకోరు. కానీ, అపోహలకూ, తావివ్వకుండా, నేను ఈ విషయాన్ని నలుగురికీ చెప్పాలనుకున్నా. నా మీద ప్రేమ, అక్కరతోనైనా ఎవరెవరో ఫోన్లు చేసి డొంకతిరుగుడుగా విషయం అడగడం, దానికి తప్పించుకు తిరుగుతూ నేనేదో జవాబివ్వడం నాకిష్టం లేకపోయింది. అందుకే, నేనే ఈ విషయాన్ని ధైర్యంగా ప్రకటిస్తున్నాను'' అని ఆయన చెప్పుకొచ్చారు. 

''జీవితంలో మనందరం నటిస్తాం. కానీ, కెమేరా ముందే తప్ప, జీవితంలో నాటకమాడే ప్రవృత్తి నాకు లేదు. అందుకే, ఈ విషయం ఇప్పటికే కొందరు డాక్టర్ల ద్వారా, ఇతరుల ద్వారా తెలిసినవాళ్ళు నా మీద ప్రేమతో నన్ను నేరుగా అడగడానికీ, నేను వాళ్ళకు చెప్పడానికీ ఇబ్బంది పడుతున్నాం. ఏవేవో అబద్ధాలు చెప్పే ఇబ్బంది వాళ్ళకూ, నాకూ లేకుండా ఉండాలనే ఇప్పుడీ విషయం బయటపెడుతున్నా'' అన్నారు. ''అబద్ధం మాట్లాడడానికి తెలివితేటలు కావాలి. కానీ, నిజం మాట్లాడడానికి ధైర్యం కావాలి. నాకూ, నా పిల్లలకూ ధైర్యం ఉంది. ...అందుకే, మా కుటుంబమంతా కలసి కూర్చొని, నిర్ణయించుకొని మరీ ఈ సంగతి అందరితో చెప్పాలనుకున్నాం. ఎవరూ చెప్పుకోని అనారోగ్యం గురించి కూడా నేను చెప్పేస్తున్నాను'' అని అక్కినేని వ్యాఖ్యానించారు.

   ప్రపంచ ప్రసిద్ధ క్యాన్సర్‌ వ్యాధి నిపుణుడూ, న్యూయార్క్‌ వాసీ అయిన డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడుతో తన అనారోగ్యం విషయమై మాట్లాడినట్లు అక్కినేని వెల్లడించారు. ''దత్తాత్రేయుడుతో మాట్లాడాను. ఆయనకు ఈ వివరాలన్నీ చెప్పాం. 'వాటి గురించి బాధపడకండి. అవేమీ చేయవు' అని ఆయన అన్నారు'' అని ఈ సీనియర్‌ నటుడు వివరించారు. సినిమా కెరీర్‌ తొలి రోజుల్లో, పెళ్ళి కాని వయసులో 1948లో తనపై వచ్చిన అపవాదులతో బాధపడి తాను రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సంగతులను ఆయన చెప్పారు. ''అయితే, చనిపోయి అందరి అపవాదులనూ నిజం చేసే కన్నా, బతికి సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను'' అని అక్కినేని తెలిపారు. ''...బ్రతికి జీవితాన్ని సాధించు... చనిపోయి కలకాలం జీవించు..'' అంటూ అప్పట్లో తాను తొలిసారిగా రాసిన 'అ ఆలు' (అక్కినేని ఆలోచనలు)లోని మొదటి ఖండికను గుర్తు చేశారు.

నన్నెవరూ కలవద్దు! అడగద్దు!
   ఈ అనారోగ్యం విషయంలో మీడియా ఉన్న విషయం చెప్పి, బాధపడే మిత్రులకూ, అభిమానులకూ సాంత్వన కలిగించాలని ఆయన అభ్యర్థించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు ఒక్క రోజు బాధపడినా, వాళ్ళు సతమతపడకుండా, తనను సతమత పెట్టకుండా ఉంటారని అక్కినేని అభిప్రాయపడ్డారు. ''నా అభిమానులెవరూ బాధపడద్దు. నన్ను బాధపెట్టవద్దు. నన్ను కలవద్దు. నాకు పదే పదే ఈ అనారోగ్యం గురించి గుర్తు చేసి, రోజూ ఇబ్బందులు పెట్టద్దు'' అని చెప్పారు. ''ఇది చంపే జబ్బు కాదు. ఈ జబ్బుతో బతుకుతున్నవాళ్ళు చాలామందే ఉన్నారు. నాకు ఏమీ బాధలు లేవు. ఏ నొప్పీ లేదు. రెండు సార్లు గుండె జబ్బు వచ్చి, ఇంత కాలం నేను బతకడమే అదృష్టం. కాబట్టి, ఎక్కడున్నా మీ ఆశీస్సులిస్తే, అవే నాకు ఆరోగ్యం అందిస్తాయి. దూరంగా ఉండే మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా'' అని మీడియా ద్వారా అభిమానులను ఆయన అభ్యర్థించారు.


అంతా సినిమాతల్లి దయ!
   పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన 'ధర్మపత్ని' (1941) చిత్రం షూటింగ్‌ నిమిత్తం కొల్హాపూర్‌లోని శాలినీ సినీ స్టూడియోకు వెళ్ళి, తొలిసారిగా కెమేరా ముందు నటించిన 1940 నాటి నుంచి ఇప్పటికి 74 ఏళ్ళుగా సాగుతున్న తన సుదీర్ఘ నట ప్రస్థానాన్ని ఏయన్నార్‌ తన ప్రసంగంలో నెమరువేసుకున్నారు. అలాగే, నాటకాలు వేసి తెనాలి నుంచి గుడివాడ వెళుతుండగా రైల్వేస్టేషన్‌లో తనను చూసి, 'శ్రీసీతారామ జననము' (1944) చిత్రంలో హీరోగా అవకాశమిచ్చిన దర్శక - నిర్మాత కీర్తిశేషులు ఘంటసాల బలరామయ్యను స్మరించుకున్నారు. 1944 మే 8న మద్రాసులోని నంబర్‌ 10 - ఆలివర్‌ రోడ్డు నివాసంలో కాలుపెట్టినప్పటి నుంచి వివిధ మనస్తత్త్వాలున్న పాత్రలు ధరించి, అభిమానుల్ని సంపాదించుకున్న తీరును తలుచుకున్నారు.

   కుమారులు, కూతురు నాగ సుశీల నిర్మాతలైతే, కుమారుడితో పాటు మనుమలు నటులయ్యారనీ, మనుమలు, మనుమరాళ్ళు స్టూడియో నిర్వహణ చూసుకుంటున్నారనీ అంటూ, ''నేను, మా కుటుంబం సినిమాలకు అంకితమయ్యాం. మాకిన్ని పేరు ప్రతిష్ఠలు సినిమాతల్లి వల్లే వచ్చాయి. కేంద్రం నుంచి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులూ వచ్చాయి. ఇవన్నీ వస్తాయని నేను ఊహించలేదు. 90 ఏళ్ళ జీవితంలో 74 ఏళ్ళుగా సినీ రంగంలో పని చేయడం, ఇప్పటికీ పనిచేస్తూ ఉండడం ఓ పెద్ద రికార్డు'' అని ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో అందరి కన్నా సీనియర్‌ హీరో అయిన అక్కినేని ఆనందం వ్యక్తం చేశారు.

ఆరోగ్యంలో మూడో రికార్డ్‌కు సిద్ధం!
   తాజా అనారోగ్యం బయట పెట్టిన అక్కినేని, తన పాత అనారోగ్యాలు, వాటిని తాను ధైర్యంగా ఎదుర్కొన్న తీరును కూడా చెప్పుకొచ్చారు. గతంలో రెండుసార్లు గుండె పోటు నుంచి గట్టెక్కి, అనుకున్న దాని కన్నా దీర్ఘకాలం ఆరోగ్యం కాపాడుకోవడం రికార్డులే అన్నారు. ''1974లో హై కొలెస్ట్రాల్‌ వల్ల గుండె పోటు వచ్చింది. దాంతో, 1974 అక్టోబర్‌ 18న నా గుండెకు ఆపరేషన్‌ చేశారు. అప్పటికి ఆ ఆపరేషన్‌ కొత్త. ఆ ప్రక్రియ వచ్చి ఏడేళ్ళే అయింది. అయినా, ఆ పరేషన్‌ చేశారు. ఓ పధ్నాలుగేళ్ళు ఫరవాలేదన్నారు. ఆ తరువాత 1988లో మళ్ళీ హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. కానీ, డాక్టర్లు నా గుండె ఆపరేషన్‌కు చేయదగిన స్థితిలో లేదన్నారు. 'కావాలంటే ఆపరేట్‌ చేస్తాం. కానీ, ఆయన బతకకపోవచ్చు' అని చెప్పారు. మా పిల్లలు అధైర్యపడినా నేను ధైర్యంగా ఉన్నాను. అప్పటి నుంచి మందులేమీ లేవు, డయలేటర్స్‌ వాడుతున్నా. అది జరిగి పాతికేళ్ళు అయింది. ఇదంతా నా మనోబలం, మీ లాంటి ప్రేక్షకుల అభిమానం, ఆశీర్వాదబలంతో సాధ్యమైంది'' అని ఆయన చెప్పారు.
   ఇప్పుడు తన జీవితంలో ఎదురైన ఈ మూడో అనారోగ్య విషమ పరీక్షను మనోబలంతో ఎదుర్కోవడానికి అక్కినేని సిద్ధమైనట్లు కనిపించింది. ''నా జీవితంలో ఇప్పుడిది ఓ కొత్త మలుపు... ఈ ఘట్టం ఏ రికార్డు సృష్టిస్తుందో నాకు తెలియదు. క్యాన్సర్‌ వస్తే చాలు, ఆ మనిషి చనిపోతాడన్నట్లు సినిమాల్లో మేము ఎంతో నాటకీయంగా మార్చి చూపిస్తుంటాం. అలాంటి చాలా సినిమాల్లో నేనూ నటించాను. ఆ అభిప్రాయం ప్రజలకు కలిగించాను. కానీ, ఇప్పుడు క్యాన్సర్‌ వస్తే బతకరన్న పాత మాట మారిపోయింది. ఎందరో క్యాన్సర్‌ను జయించారు'' అని మొన్న సెప్టెంబర్‌ 20న 90వ ఏట అడుగుపెట్టిన ఏయన్నార్‌ వ్యాఖ్యానించారు.
   ఇప్పటికే పలువురు డాక్టర్లతో క్యాన్సర్‌ గురించి చర్చించినట్లు చెప్పిన ఈ సీనియర్‌ నటుడు, ''చిన్న వయస్సులో క్యాన్సర్‌ వస్తే అప్పుడు ఆ కణాలు బలంగా, వేగంగా ఉంటాయి. కానీ, ఇప్పుడు ఈ 90 ఏళ్ళ వయస్సులో నా బోటివాడికి వస్తే, ఆ కణాలు కూడా నా వయస్సుకు తగ్గట్లే నిదానంగా ఉంటాయి. కాబట్టి, ఇదేదో మృత్యువు దరికి చేరిన ఆఖరు దశ అనుకోకూడదు. ప్రజలందరి ఆశీర్వాదబలం తోడైతే, దీన్ని కూడా ఎదుర్కొని, ఆరోగ్యం విషయంలో మూడో రికార్డు సృష్టించే అవకాశం నాకు వచ్చింది'' అని అన్నారు.

నా టార్గెట్‌ 96! మీ ఆశీస్సులుంటే 'సెంచరీ'!!
   కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వెంకట రాఘవాపురంలో 1924లో వెంకట రత్నం, పున్నమ్మ దంపతులకు తొమ్మిదో సంతానంగా జన్మించిన ఏయన్నార్‌ తన కుటుంబంలోని వాళ్ళది సామాన్యంగా దీర్ఘాయుష్షు అంటూ చెప్పుకొచ్చారు. ''మా కుటుంబంలో అందరి కన్నా ఎక్కువ కాలం 96 ఏళ్ళు బతికింది మా అమ్మ. కాబట్టి, 96 ఏళ్ళు బతుకుతానని నాకెప్పుడూ గట్టి నమ్మకం. అది నా టార్గెట్‌'' అన్నారు. ''ప్రజలందరూ అభిమానిస్తే, ఆశీర్వదిస్తే, సహకరిస్తే 96 ఏళ్ళు దాటి, సెంచరీ కొడతా'' అని ఆశాభావం వ్యక్తం చేశారు. 
   క్యాన్సర్‌ వచ్చిన ఎంతోమంది ఆ తరువాత కూడా ధైర్యంగా, హాయిగా చాలాకాలం బతికారంటూ, నీలం సంజీవరెడ్డి, భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ లాంటి వాళ్ళ ఉదంతాలను అక్కినేని గుర్తు చేశారు. ''సంజీవరెడ్డి గారు స్పీకర్‌గా ఉన్నప్పుడు ఒకసారి మామూలుగా వైద్యపరీక్షలు చేయించుకుంటే, క్యాన్సర్‌ ఉన్నట్లు అనుకోకుండా బయటపడింది. ఆ తరువాత ఆయన రాష్ట్రపతి అయ్యారు. ఏడేళ్ళ పాటు హాయిగా జీవించారు. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు'' అంటూ ప్రస్తుతం తనకు ప్రేరణ అయిన క్యాన్సర్‌ విజేతల కథలను ఆయన ప్రస్తావించారు. పైగా, ''మా కుటుంబంలో మేమెవరమూ దు:ఖంతో, మనస్తాపంతో ఈ విషయం గురించి కలత చెందడం లేదు'' అని కూడా చెప్పుకొచ్చారు.

మంచి పాత్రలొస్తే చేస్తా..
   తొమ్మిది గంటల యాభై నిమిషాల ప్రాంతంలో తన ప్రత్యేకమైన, ఖరీదైన తెల్లకారులో విలేఖరుల సమావేశం జరిగే స్థలానికి వచ్చిన ఏయన్నార్‌కు ఆయన కుమారులు వెరకట్‌ అక్కినేని, నాగార్జున అక్కినేనితో సహా కుమార్తెలు, మనుమలు, మనుమరాళ్ళు - ఇలా కుటుంబమంతా స్వయంగా ఎదురేగి, స్వాగతం పలికారు. నాగార్జున చేయి అందించగా, నిర్ణీత స్థానానికి వచ్చిన కూర్చున్న ఏయన్నార్‌ దాదాపు 25 నిమిషాల పాటు తన మనసులోని మాటలను పత్రికల వారి ఎదుట పంచుకున్నారు.
   
విలేఖరుల ముందుకు ఆయనొక్కరే రాగా, మిగిలిన కుటుంబం, పరివారమంతా కాస్త ఎడంగా, దూరంగా నిల్చొని, అందరితో పాటు ఆయన మాటలు విన్నారు. ఏయన్నార్‌ తాను చెప్పదలుచుకున్నది చెప్పిన తరువాత, ఇక ప్రత్యేకించి ప్రశ్నలేమీ వద్దంటూ, మీడియా ప్రశ్నోత్తరాల ఘట్టాన్ని సున్నితంగా తోసిపుచ్చారు. ''మాట్లాడడానికి ఏముంది! క్యాన్సర్‌ గురించి మీ కన్నా నాకే ఎక్కువ తెలుసు'' అని వ్యాఖ్యానించారు. అయితే, ''ఆఖరు ఊపిరి ఉన్నంత వరకు నటిస్తాను. అయితే, ఏ పాత్ర పడితే ఆ పాత్ర పోషించను. చిన్న పాత్రలైనా, నా వయస్సుకు తగిన మంచి పాత్రలైతే చేస్తాను'' అని వివరణ మాత్రం ఇచ్చారు. ''ఎందుకంటే, పని చేయడంలో నాకు సంతోషం ఉంటుంది. అది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది'' అని అక్కినేని అందులోని అంతరార్థాన్ని చెబుతూ, ముగించారు.

ఉదయం నుంచే హంగామా
   శనివారం ఉదయం 9 గంటలకు ఏయన్నార్‌ అందరినీ ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నారనీ, అత్యంత ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నారనీ శుక్రవారం సాయంత్రమే మీడియా అంతటికీ సమాచారమిచ్చారు. దాంతో, శనివారం ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్‌లో 'మనం' సినిమా చిత్రీకరణ జరుగుతున్న ఇంటి సెట్‌ బయట టీవీ చానళ్ళ ప్రత్యక్ష ప్రసార వాహనాలన్నీ బారులు తీరాయి. అక్కినేని ఏం చెబుతారన్నది అంచనాకు అందకపోవడంతో, దాదాపు నూట పాతిక మందికి పైగా మీడియా సిబ్బంది చర్చించుకోవడం కనిపించింది. ఏయన్నార్‌ తన మనసులో మాట చెప్పడం మొదలుపెట్టేసరికి, విలేఖరులు, చాలా మంది సినీ, స్టూడియో సిబ్బంది నిశ్శబ్దంగా అక్కినేని మాటలు వింటూ, రాసుకుంటూ, కెమేరాలో చిత్రీకరిస్తూ కనిపించారు. అక్కినేని ఎలాంటి తొట్రుపాటూ, భావోద్వేగాలూ లేకుండా నింపాదిగా తన అనారోగ్యం సంగతిని వెల్లడించారు. 

   ముందుగా తన నట, ఆరోగ్య జీవిత విశేషాలను ప్రస్తావిస్తూ వచ్చిన ఆయన ఆనక అసలు విషయాన్ని నిబ్బరంగా ప్రకటించారు. మాట్లాడుతున్నంత సేపూ అక్కినేని ఏ మాత్రం భావోద్వేగాలకు లోను కాలేదు. వేసిన షామియానా, కుర్చీలు చాలకపోవడంతో, పలువురు మీడియా ప్రతినిధులే కాక, అక్కినేని కుటుంబ సభ్యులైన వెంకట్‌, నాగార్జున, అమల, నాగ చైతన్య, నాగసుశీల, తదితరులంతా సూర్య ప్రతాపాన్ని సైతం లెక్క చేయకుండా పక్కనే ఎండలోనే నిల్చొని మరీ, బరువెక్కిన గుండెలతో అక్కినేని ప్రసంగాన్ని విన్నారు.
బయట ఇతరుల ద్వారా చూచాయగా విషయం తెలుసుకొని, ఎవరికి వారు తోచినట్లు వ్యాఖ్యానాలు చేసుకోకుండా ఉండేందుకు తానే ఈ విషయం మీడియా ద్వారా ప్రకటిస్తున్నట్లు అక్కినేని తన మాటల్లో చెప్పారు. 

నిజానికి, రెండు, మూడేళ్ళ క్రితం కూడా ఒకసారి అక్కినేని ఆరోగ్యంపై సినీ ఆంతరంగిక వర్గాల్లో వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడు మాత్రం సాక్షాత్తూ అక్కినేనే మీడియా ముందుకు వచ్చి, తన తాజా అనారోగ్యం గురించి నాటకీయంగా వెల్లడించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ''పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజుకు పోవాల్సిందే!'' అంటూనే ''మనోబలంతో పాటు, అభిమానుల ఆశీర్వాదఫలంతో నిండు నూరేళ్ళ తరువాత ఇలాగే మీడియా ఎదుట మాట్లాడాల''న్న ఆకాంక్షను అక్కినేని వెలిబుచ్చారు. అది నెరవేరాలనే సినీ అభిమానులందరి కోరిక!

- రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 20 అక్టోబర్ 2013, ఆదివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
.....................................................

''క్యాన్సర్‌.. ఎదుర్కొంటా'' - అక్కినేని నాగేశ్వరరావు


   సినీ ప్రియులైన అభిమానులకూ, ప్రేక్షకులకూ అక్కినేని నాగేశ్వరరావు అనగానే ఒక 'దేవదాసు', ఒక 'ప్రేమ్‌నగర్‌', ఒక 'ప్రేమాభిషేకం' - లాంటి ఎన్నెన్నో చిత్రాల్లో విలాసాన్నీ, విషాదాన్నీ ఏకకాలంలో పలికించిన ఓ అభినయ విశారదుడు గుర్తుకొస్తారు. ఓ ముఖ్యమైన విషయం చెప్పాల్సి ఉందంటూ శనివారం నాడు ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్‌లో అక్కినేని నాగేశ్వరరావు ప్రత్యేకంగా జర్నలిస్టులందరినీ పిలిపించి మరీ మీడియా సమావేశం నిర్వహించి నప్పుడు అప్రయత్నంగా విలేఖ రులందరికీ అలాంటి చిత్రాల తాలూకు సన్నివేశాలు, అభినయం గుర్తొచ్చాయి. ఇటీవల జరిపిన వైద్య పరీక్షల్లో తనకు క్యాన్సర్‌ వచ్చినట్లు వెల్లడైందంటూ బాంబు లాంటి వార్తను శనివారం ఉదయం అందరి ఎదుటా ఏయన్నార్‌ స్వయంగా బయటపెట్టారు. ఏయన్నార్‌ చేయబోయే ముఖ్యమైన ప్రకటన ఏమై ఉంటుందన్న దానిపై అప్పటి దాకా రకరకాలుగా ఊహాగానాలు చేస్తూ వచ్చిన పత్రికా ప్రతినిధులకు ఇది ఊహించని వార్త అయింది. 
''అక్టోబర్‌ 8న కడుపులో నొప్పిగా అనిపించింది. దాంతో డాక్టర్‌ దగ్గరకు వెళ్ళి చూపించుకున్నా. కేర్‌ ఆసుపత్రిలో, 'నిమ్స్‌'లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ లాంటి అనేక రకాల పరీక్షలు వారం రోజుల పాటు చేశారు. ఎక్కడో నా శరీరంలో క్యాన్సర్‌ కణాలు ప్రవేశించాయని వైద్యులు చెప్పారు'' అని అక్కినేని వివరించారు. అయితే, క్యాన్సర్‌ వచ్చిందని ఖంగారు పడాల్సిన పనేమీ లేదనీ, క్యాన్సర్‌ వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని జీవించినవాళ్ళు ఎందరో ఉన్నారనీ, దేశదేశాల్లోని అభిమానుల ఆశీస్సులుంటే, తన మనోబలంతో సంతోషంగా మరింత కాలం బతుకుతాననీ అన్నారు.
- రెంటాల జయదేవ 
..........................................

Friday, October 18, 2013

జీవన సమరంలో అసామాన్య విజేత రావూరి భరద్వాజ కన్నుమూత

- జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మరణంతో చిన్నబోయిన తెలుగు సాహితీ లోకం 

- అవార్డు ప్రకటించిన సరిగ్గా ఆరు నెలలకు, అవార్డందుకున్న వారం రోజులకే మరణం


ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ కన్నుమూశారు. కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, అక్టోబర్ 18 శుక్రవారం నాడు రాత్రి 8.35 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. 

మనదేశంలో సాహిత్యానికి ఇచ్చే అత్యున్నత పురస్కారంగా పేరందుకున్న జ్ఞాన్‌పీఠ్‌ ఆయనను వరించినట్లు ఇవాళ్టికి సరిగ్గా ఆరు నెలల క్రితం ఏప్రిల్‌ 17న ప్రకటన వెలువడింది. మొన్న అక్టోబర్‌ 11న శుక్రవారం నాడు ఢిల్లీలోని తీన్‌మూర్తి భవన్‌లో పలువురు ప్రముఖుల సమక్షంలో ఆయన ఆ పురస్కారాన్ని అందుకున్నారు. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భరద్వాజ మూత్రపిండాల వైఫల్యం, గుండె జబ్బుతో సహా వివిధ అనారోగ్యాలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో 48వ జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్న సరిగ్గా వారం రోజులకే తన 87వ ఏట శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. 

కన్నుమూయడానికి సరిగ్గా వారం రోజుల క్రితం జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకుంటూ...
పదిహేడో ఏట నుంచి రచన చేయడం ప్రారంభించిన ఆయన గడచిన 70 ఏళ్ళుగా విస్తారంగా సాహితీ సృజన సాగిస్తూ వచ్చారు. ఈ ఏడు దశాబ్దాల విశిష్ట సాహిత్య సేవలను గుర్తించి, వాటన్నిటి సమష్టి ఫలంగా 2012వ సంవత్సరానికి గాను ఆయనను జ్ఞానపీఠ్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అవార్డు ఎంపిక కమిటీ పేర్కొంది. (మొదట ప్రచారం జరిగినట్లు, చాలామంది పొరబడుతున్నట్లు ఆయనకు కేవలం 'పాకుడు రాళ్ళు' నవలకు గాను ఆ అవార్డు ఇవ్వలేదు). 

తెలుగు సాహిత్యంలో కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ, ఆధునిక కవి సి. నారాయణరెడ్డి తరువాత ఈ ప్రసిద్ధ అవార్డును అందుకున్న మూడో వ్యక్తి - భరద్వాజ. అదే సమయంలో తెలుగునాట కథ, నవలా సాహిత్యం ద్వారా ఈ అవార్డును సాధించిన తొలి రచయిత మాత్రం ఆయనే! 

కేవలం ఏడో తరగతి వరకే చదువుకొని, సాహిత్యంలో ఇంత ఉన్నత స్థాయికి ఎదగడం, తన రచనల మీద ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగే దశకు చేరడం భరద్వాజ విశిష్టత. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి, ఒకప్పుడు పిడికెడు అన్నం, జానెడు వస్త్రం కోసం నానా అగచాట్లూ పడిన ఓ సామాన్య వ్యక్తి ఆయన. అక్కడ నుంచి జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ, స్వయంకృషితో పైకి వచ్చారు. అందుకే, ఆయన రచనల్లో ప్రధానంగా అట్టడుగు వర్గాల జీవితాన్నీ, వారి జీవన సమరాన్నీ ప్రతిఫలించారు. 

అప్పటి హైదరాబాద్‌ సంస్థానానికి చెందిన పరిటాల జాగీర్‌లోని మోగులూరు గ్రామంలో (ఇప్పుడు కృష్ణాజిల్లాలో ఉంది) 1927 జూలై 5న ఆయన జన్మించారు. తండ్రి పేరు కోటయ్య. తల్లి పేరు మల్లికాంబ. గుంటూరు జిల్లాలోని తాడికొండ గ్రామంలో పెరిగారు. పొట్టకూటి కోసం వ్యవసాయ కూలీగా పనిచేశారు. పశువులను కాశారు. పనివాడిగా రంపం లాగారు. తుత్తులు ఊదే కూలీగా, ఇంటింటికీ పత్రికలు వేసే పేపర్‌ బాయ్‌గానూ కష్టపడ్డారు. 

పదిహేడో ఏట నుంచి చనిపోయే ముందు కొన్నేళ్ళ వరకు ఆయన అవిశ్రాంతంగా రచనలు చేశారు. 1946 ఆగస్టు ఆఖరువారం 'ప్రజామిత్ర' పత్రికలో అచ్చయిన 'విమల' ప్రచురితమైన ఆయన తొలి కథ. ఇక, అచ్చయిన ఆయన తొలి పుస్తకం - 'రాగిణి' (1950). అప్పటి నుంచి ఆయన ఎన్నో కథలు, నవలలు రాశారు. ధనికొండ హనుమంతరావు లాంటి రచయితల ప్రోత్సాహం, ప్రోద్బలంతో పైకి వచ్చిన ఆయన సినిమా జర్నలిస్టుగా కూడా పనిచేశారు. 1956 నుంచి దినచర్యను డైరీలో రాసే అలవాటున్న ఆయన జర్నలిస్టుగా తాను చూసిన పలువురు సినిమా వ్యక్తుల జీవితంలోని చీకటి వెలుగులను ఆధారంగా చేసుకొని, 'పాకుడు రాళ్ళు' నవల రాశారు. ఆ నవలతో పాటు 'కాదంబరి' లాంటి ఆయన రచనలు సుప్రసిద్ధం.  


అలాగే, సమాజంలోని వివిధ వృత్తులకు చెందిన సామాన్యుల జీవిత చిత్రాలను కలం చిత్రాలుగా మలిచి, ఆయన రాసిన ఫీచర్‌ 'జీవన సమరం' ఓ పెద్ద సంచలనం. అప్పటికీ, ఇప్పటికీ బడుగు జీవుల బతుకు చిత్రానికి ఓ సాహితీ రికార్డు. విద్యార్హతలతో సంబంధం లేని ఆయన ప్రతిభ  ఆకాశవాణిలో ఉద్యోగం సంపాదించి పెట్టింది. చాలాకాలం ఆకాశవాణి - హైదరాబాద్‌ కేంద్రంలో పనిచేసిన ఆయన తెలుగు ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా ఉద్యోగ విరమణ చేశారు. 

ఆయనకు 1968లోనూ, 1983లోనూ మొత్తం రెండు సార్లు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలాగే, 1987లో 'సోవియట్‌ ల్యాండ్‌ - నెహ్రూ' అవార్డు, అదే ఏడాది భారతీయ భాషా పరిషత్‌ వారి అవార్డు వరించాయి. ఇంకా ఎన్నో అవార్డులందుకున్న రావూరిని మూడు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌లు ఇచ్చి, గౌరవించాయి. ఆయన రచనలపై నాలుగు యూనివర్సిటీల్లో పిహెచ్‌.డి. స్థాయి పరిశోధనలు, అయిదు యూనివర్సిటీల్లో ఎం.ఫిల్‌ స్థాయి పరిశోధనలు జరిగాయి. 

ఇక, ఆయన రచనలు అనేకం ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లోకి అనువాదమయ్యాయి. బాలసాహిత్యంలోనూ విశేష కృషి చేసి, ఇటీవలే జ్ఞానపీఠంతో తెలుగు సాహితీకారులను గర్వించేలా చేసిన రావూరి మృతితో తెలుగు సాహితీ లోకం చిన్నబోయింది. పలువురు రాజకీయ, సాహితీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. 

..................................