జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, October 5, 2010

మహేశ్ బాబు ‘ఖలేజా’ సెన్సార్ పూర్తి - రిలీజ్ కు రెడీ!



ఇప్పుడే అందిన వేడి వేడి తాజా కబురు. మహేశ్ బాబు అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఖలేజా ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది. అన్ని కార్య క్రమాలూ పూర్తి చేసుకొన్న ఈ సినిమా నిన్న (అక్టోబర్ 4వ తేదీ - సోమవారం) రాత్రి కల్లా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ అధికారులు ఖలేజాకు యు /ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. దాంతో, సినిమా విడుదలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.

ప్రస్తుతం సినిమా ప్రదర్శనకు కావాల్సిన వందల కొద్దీ ప్రింట్లను ల్యాబ్ లో సిద్ధం చేస్తున్నారు. ఓ పక్కన ప్రింట్ల పని జరుగుతుంటే, మరోపక్క సినిమా కు సంబంధించిన టీవీ ట్రైలర్ల తయారీ హడావిడి సాగుతున్నట్లు భోగట్టా. అక్టోబర్ 7వ తేదీ గురువారం నాడు విడుదల కోసం నిర్మాణ వర్గాలు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఓ పక్క రోబో వాణిజ్యపరంగా కలెక్షన్లలో సంచలనం రేపుతుండడంతో, ఖలేజా కు తగినన్ని హాళ్ళను సమకూర్చుకోవడంలో కొంత ఇబ్బంది తలెత్తుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా, ఈ హంగామాలను ఊహించి, డిస్ట్రిబ్యూటర్లు పట్టుబట్టడంతో జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న బృందావనం రిలీజ్ ను అక్టోబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. ఆ రకంగా అక్టోబర్ 1, 7, 8 తేదీలను దాటి ఎట్టకేలకు 14కు బృందావనం విడుదల ఖరారైంది.

సెప్టెంబర్ ఆఖరులో విడుదలైన ఖలేజా పాటల్లో కొన్ని ఇప్పటికే జనాన్ని ఆకర్షిస్తున్నాయి. మణిశర్మ సంగీత దర్శకత్వంలోని ...పిలిచే పెదవుల పైనా..., ఓం నమో శివ రుద్రాయ.... పాటల గురించి అభిమానులు మురిసిపోతున్నారు. ఏమైనా, దాదాపు మూడేళ్ళ తరువాత వస్తున్న సినిమాగా మహేశ్ బాబు ఖలేజా అభిమానుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్న అంశం. అది తెలుసుకోవడానికి మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Monday, October 4, 2010

పాత్రికేయ పితామహుడికి పురస్కారం: ...ఇవాళే ...అదీ హైదరాబాద్ లోనే..!



చిత్రం ఏమిటంటే - వయస్సులో నా కన్నా పెద్ద వాళ్ళతో నాకు చటుక్కున దోస్తీ కుదురుతుంటుంది. అది పెరుగుతుంటుంది. నా సమవయస్కులతోనూ, చిన్నవాళ్ళతోనూ ఇట్టే కలిసిపోయినా, పెద్ద వయస్సు వాళ్ళతో మటుకు నా స్నేహం మరింత బలంగా పెనవేసుకుపోవడం జరుగుతుంటుంది. మన జాతకమో, రూపురేఖా విలాసాలో, మాటలో మంచితనమో తెలీదు కానీ, చిన్నప్పటి నుంచీ ఎందుకో నాకు అలా జరుగుతోంది.

ఇంతకీ ఇప్పుడు నేను చెప్పొచ్చేది నాతో అలా బంధం పెనవేసుకుపోయిన ఓ పెద్ద మనిషి గురించి. కనీసం మా నాన్నగారు, తాత గారు వయస్సున్న మంచి మనిషి గురించి. ఆయనతో నా దోస్తీ గురించి. ఆయన - ఎం.ఎస్. శర్మగా ఎక్కువ మందికి సుపరిచితులైన పాత తరం జర్నలిస్టు. పూర్తి పేరు - మద్దాలి సత్యనారాయణ శర్మ. ఆయనకిప్పుడు 92 ఏళ్ళు. ఇప్పటికీ, అందంగా, ఆరోగ్యంగా ఉండే ఆయన నిజానికి మా నాన్నగారు రెంటాల గోపాలకృష్ణ కన్నా పెద్దవారు. మా నాన్న గారి కన్నా ముందు నుంచీ జర్నలిజంలో ఉన్న కురువృద్ధులు.

శర్మ గారితో నా పరిచయం చిత్రంగా జరిగింది. అది గౌరవం నుంచి స్నేహంగా పరిణమించడం మరీ చిత్రం. ఆ స్నేహం ఇప్పుడు సౌహార్దంగా ఎదగడం ఇంకా విచిత్రం. నార్ల వెంకటేశ్వర రావు, గూడవల్లి రామబ్రహ్మం, చల్లా జగన్నాథం లాంటి 1940ల నాటి ప్రముఖ సంపాదకులతో భుజం రాసుకు తిరిగి, పత్రికా రచన చేసిన పెద్దాయన శర్మ గారు. ‘ప్రజామిత్ర’, ‘గోభూమి’, ‘క్రాంతి’, ‘మీజాన్’, ప్రసిద్ధ కన్నడ వారపత్రిక ‘ప్రజామత’ నడిపిన అప్పటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏ.ఐ.సి.సి) సభ్యుడు బి.ఎన్. గుప్తా గారి ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికల్లో ఆయన పనిచేశారు. ఆ తరువాత 1940ల మధ్య నాటి నుంచి రిటైరయ్యే వరకూ 'ఆంధ్రపత్రిక' దినపత్రిక సంపాదక వర్గంలో శర్మ గారు విస్తృత సేవలందించారు. అటు మద్రాసులోనూ, ఆ తరువాత హైదరాబాద్ లోనూ 'ఆంధ్రపత్రిక' డైలీ ఎడిషన్ కు పెద్ద దిక్కుగా పనిచేశారు.

మరో విశేషం ఏమిటంటే - తొలి తరం సినీ పాత్రికేయులలో ఆయన ఒకరు. 1940ల తొలినాళ్ళ నుంచి 1950ల ప్రథమార్థం వరకు ఆంధ్రపత్రిక డైలీలో సినిమా పేజీ నిర్వహణ ఆయన చేతి మీదు గానే జరిగింది. అప్పటి సంగతులు ఇప్పటికీ ఆయన పూస గుచ్చినట్లు చెబుతుంటారు. మా నాన్న గారితో సాహితీ పరిచయం, మా మూడో వదిన వాళ్ళ నాన్న గారు ('ఆంధ్రపత్రిక' సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ పినపాక సూర్యప్రకాశరావు)తో సాన్నిహిత్యం శర్మ గారి సొంతం. ఎప్పటి నుంచో శర్మ గారిని కలుసుకోవాలని ఉన్నా, ఎందుకనో కుదరనే లేదు. అలాంటిది - ఉన్నట్టుండి ఆఫీసు పని మీద వివరాల సేకరణ కోసం సరిగ్గా 15 నెలల క్రితం హైదరాబాద్ లో ఆయన ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి కలిశాను. ఓ నాలుగు రోజులు వరుసగా వెళ్ళి, ఆపాత మధురమైన ఆయన జ్ఞాపకాలను తెలుసుకున్నా. అలా మొదలైన మా పరిచయం అక్షరాలా దినదిన ప్రవర్ధమానమైంది. సాయంకాలపు నీడలా పెరుగుతూ వచ్చింది.

ఆయన అనుభవంలో సగమన్నా లేని నాతో ఆయనకు దోస్తీ ఏమిటి! అది విచిత్రమే కాదు, ఆయన మంచితనం కూడా!! ఈ 15 నెలల్లో మా స్నేహం ఏ దశకు చేరిందంటే - కనీసం వారానికి ఒకసారైనా ఓ అరగంట ఎస్టీడీ ఫోన్లో మాట్లాడుకోవాల్సిందే. ఏ పనిలోనైనా ఉండి నేను చేయకపోతే, ఆ మరునాడే 'ఏమైంది, ఏమిట'ని ఆయనే ఫోన్ చేసి, యోగక్షేమాలు అడుగుతారు. సూచనలు, సలహాలిస్తారు. రాజకీయాల నుంచి సాహిత్యం, సినిమాలు, షికార్ల దాకా ఏ అంశం మా మాటల్లో నిషిద్ధం కాదు. అప్పట్లో 'ఆంధ్రపత్రిక'లో చేరిన సుప్రసిద్ధులు ముళ్ళపూడి వెంకట రమణ, నండూరి రామమోహనరావు తదితరులను జర్నలిజంలో చేయి పట్టుకొని నడిపించిన ఈ పాత్రికేయ భీష్ముడికి ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం దక్కడం ఎంతో ఆనందకరమైన విషయం. తొలినాళ్ళ జర్నలిస్టు సంఘాల స్థాపనలో ముఖ్యపాత్ర పోషించిన ఎం.ఎస్. శర్మ గారు యూనియన్ కార్యకలాపాల్లో, ప్రెస్ క్లబ్ పక్షాన సలహా సంప్రతింపుల్లో కూడా చాలా కాలం క్రియాశీలంగా వ్యవహరించిన పెద్దలు. అన్నట్లు - ఇవాళ బెజవాడలో పబ్లిసిటీ రంగంలో, ముఖ్యంగా సినీ పబ్లిసిటీ రంగంలో అందరికీ తలలో నాలుకైన పాత్రికేయుడు కృష్ణాజీ సాక్షాత్తూ శర్మ గారి అబ్బాయే.

మరో చిత్రం ఏమిటంటే - ఎం.ఎస్. శర్మ గారు పుట్టింది - 1919 సెప్టెంబర్ 19న, కృష్ణాజిల్లా కలవపాముల గ్రామంలో. సంవత్సరం వేరైనా (1887), సెప్టెంబర్ 19నే పుట్టారు - శర్మ గారి ముందు తరానికి చెందిన రచయిత - పాత్రికేయుడు తాపీ ధర్మారావు. ఇప్పుడు అక్షరాలా ఆ తాపీ ధర్మారావు గారి పేరిట తెలుగు విశ్వవిద్యాలయం ‘కీర్తి’ పురస్కారం శర్మ గారికి లభించింది. తాపీ వారితో శర్మ గారికి ప్రత్యక్ష పరిచయం కూడా ఉండడంతో ఈ సత్కారం మరింత సబబుగా మారింది. కొత్త సొబగు చేకూరింది.

ఈ రోజు (2010 అక్టోబర్ 4, సోమవారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియమ్ లో ఈ పురస్కార ప్రదానోత్సవం జరుగుతోంది. తమ తమ రంగాల్లో చేసిన సేవలకు గాను ఎం.ఎస్. శర్మ గారితో పాటు వివిధ రంగాలకు చెందిన మరో 26 మందికి ఈ ‘కీర్తి’ పురస్కార ప్రదానం చేయనున్నారు. (పురస్కారాలందుకొనే ఈ 27 నక్షత్రాలలో నాకు సుపరిచితులైన మరో ఇద్దరు - బెజవాడకు చెందిన రచయిత - పాత్రికేయుడూ, మా నాన్నగారి మిత్రుడు వీరాజీ గారు, మా ఆకాశవాణి మిత్రుడు నాగసూరి వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు).

1940 నాటి నుంచి ప్రధాన స్రవంతి పత్రికా రంగంలో పనిచేస్తూ, ఇప్పటికీ వివిధ అంశాలపై తన అభిప్రాయాలనూ, అనుభవాలనూ పత్రికల్లో పంచుకుంటున్న పాత్రికేయ పితామహుడు శర్మ గారు. ఆయనకు ఇన్నాళ్ళకు, ఈ పాటి చిన్న గుర్తింపు ప్రభుత్వం నుంచి రావడం మన వ్యవస్థ, దాని పాలకుల స్థితిగతులకు నిదర్శనం. అయితే, 70 ఏళ్ళుగా ఓ రంగంలో పని చేస్తున్న వ్యక్తికి ఇప్పటికైనా, ఈ మాత్రం గుర్తింపైనా దక్కడం ఆవేదనలోనూ ఆనందమనిపిస్తోంది. లేటు వయసులోనూ రాతలో, మాటలో ఘాటు తగ్గని ఎం.ఎస్. శర్మ గారికి ఈ శుభ సందర్భంగా తెలుగు పత్రికా రంగం తరఫున జేజేలు!!

కొసమెరుపు - గగన్ మహల్ ప్రాంతంలో ఉన్న బాల్య మిత్రుడి దగ్గరకు ఇప్పటికీ ప్రతి వారం బస్సులో వెళ్ళి, ఓ రోజంతా కబుర్లాడుకొని రావడం ఎం.ఎస్. శర్మ గారికి వారకృత్యం. సరిగ్గా అయిదు రోజుల క్రితం ఆయన అలాగే వెళ్ళి, మళ్ళీ ఇంటికి బస్సులో వచ్చేస్తుంటే ఓ గమ్మత్తు జరిగింది. అదే బస్సులో ఎక్కిన ఓ యువతి ఆయనను అదే పనిగా గమనిస్తోంది. విషయమేమిటో శర్మ గారికి అర్థం కాలేదు. తీరా దిగాల్సిన స్టాపు దగ్గర పడేసరికి, సర్దుకొని లేచిన ఆ అమ్మాయి, హడావిడిగా దిగిపోతూ, తెల్లటి లాల్చీ - పంచెల్లో దబ్బపండులా ఉన్న ఎం.ఎస్. శర్మ గారి దగ్గరకు వచ్చి, ‘‘మీరు బాగున్నారండీ!’’ అంది. దానికి, శర్మ గారు లిప్తపాటు కాలం నివ్వెరపోయినా, వెంటనే -‘‘మనుమరాలి స్వయంవరం మంచిదే!’’ అని హాయిగా నవ్వేస్తూ, ఆశీర్వదించారు. నిండు జీవితాన్ని ఇలా ఆహ్లాదంతో నింపుకోవడం ఆ తరం నుంచి మన తరం అక్షరాలా నేర్చుకోవాల్సిందే!

అందుకే, "శర్మాజీ! మీరు మరిన్ని పురస్కారాలతో, ఆరోగ్యంగా, ఆనందంగా కాలం గడపాలి. మీ అనుభవాలనూ, జ్ఞాపకాలనూ యువతరం పాత్రికేయులతో సదా పంచుకోవాలి." అదే నా ఆశ, ఆశంస!

(మిత్రులకో మాట - హైదరాబాద్ లో ఉండి, తీరిక, ఓపిక ఉన్న మిత్రులు, మరీ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఈ పురస్కార ప్రదానానికి వెళితే బాగుంటుంది. వయస్సులోనూ, అనుభవంలోనూ అక్కడ అందరిలోకీ పెద్దాయన శర్మ గారు పురస్కారం అందుకుంటున్నప్పుడు నాలుగు చప్పట్లు కొడితే మరీ బాగుంటుంది. అది ఆయన కోసం కాదు, మన కోసం! 70 ఏళ్ళుగా ఓ రంగంలో ఓ వ్యక్తి చేసిన విశిష్ట కృషిని గౌరవించాలన్న సంస్కారాన్ని నలుగురితో పంచుకోవడం కోసం, మనలో మనం పెంచుకోవడం కోసం!!)

Sunday, October 3, 2010

‘రోబో’: భారీతనం మింగిన భావోద్వేగాల పండు!



('విజువల్స్ సరే...! విషయం మాటేమిటి...?!' – రోబో చిత్ర సమీక్ష 2వ పార్ట్)

ఆట్టే విలనీ చూపించకుండా సగంలోనే చచ్చిపోయిన ప్రొఫెసర్ బోరా పాత్రతో కలుపుకొన్నా సరే, ‘రోబో’ సినిమా మొత్తం నాలుగే నాలుగు పాత్రల చుట్టూ (ప్రొఫెసర్ బోరా, హీరో, హీరోయిన్, రోబో) నడుస్తుంది.

హీరో కన్నా విలనే బెటర్!

ఇందులో సైంటిస్ట్ గా రజనీకాంత్ అందంగా కనిపిస్తారు. ఐశ్వర్యారాయ్ కూడా ఇప్పటికీ అందాల భరిణే అనిపిస్తుంది. కొన్ని పాటల్లో ఆమె ఇవాళ్టికీ కుర్రకారుకు గిలిగింతలు పెట్టారంటే అతిశయోక్తి కాదు. ఆమె అభినయం కూడా పాత్రను సహజంగా మార్చింది.

రోబోగా రజనీకాంత్ నటన భేష్. ముందు మంచితనం, అమాయకత్వం నిండిన రోబోగానూ, ఆ తరువాత చెడు దోవ పట్టిన రోబో గానూ రెండు పార్శ్వాలనూ రజనీకాంత్ మెప్పించారు. గట్టిగా చెప్పాలంటే, సైంటిస్ట్ హీరో పాత్ర కన్నా చెడు దోవ పట్టిన రోబో నటనలోనే రజనీకాంత్ కు ఎక్కువ మార్కులు పడతాయి.

కెరీర్ మొదట్లో విలన్ పాత్రలు పోషిస్తూ, ఆనక హీరోగా ఎదిగిన రజనీకాంత్ ఈ రోబో విలనీని బాగా పండించారు. వంద రోబోల్లో ఒకడిగా మారువేషంలో జొరబడిన సైంటిస్ట్ హీరోను, విలన్ రోబో కనిపెట్టే సన్నివేశం అందుకు ఓ మంచి ఉదాహరణ. అక్కడ విలన్ రోబోగా ఆయన నటన ‘చంద్రముఖి’లో ‘లక లక లక...’ ఘట్టం లాంటి వాటిని గుర్తుకు తెచ్చింది. ఇక, ప్రొఫెసర్ బోరాతో సహా మిగిలిన పాత్రలన్నీ - ఇలా వచ్చి, అలా వెళ్ళేవే.

ఊహలకే రెక్కలు వస్తే...

దేశంలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందినట్లుగా ప్రచారమవుతున్న ఈ సినిమా సాంకేతికత విషయంలో భారతీయ సినిమాను ఓ కొత్త తీరానికి తీసుకువెళ్ళిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా, విజువల్ ఎఫెక్ట్ లు, రోబోట్రానిక్స్ (స్టాన్ విన్ స్టన్ స్టూడియో), యాక్షన్ సన్నివేశాల (పీటర్ హెయిన్స్, యూయెన్ వూ పింగ్) రూపకల్పనలో హాలీవుడ్ చిత్రాలను తలపించింది. ఈ కథకూ, సన్నివేశాలకూ ‘ఐ- రోబో’ మొదలు ‘ట్రాన్స్ ఫార్మర్’ దాకా అనేకానేక ఆంగ్ల చిత్రాల నుంచి దర్శకుడు శంకర్ ప్రేరణ పొందారు. ఆంగ్ల సినిమాలు ఎక్కువగా చూసే వారికి ఆ మేరకు రోబోలోని కొన్ని అంశాలు, దృశ్యాలు కొత్తగా తోచకపోవచ్చు.

కానీ, కొన్నేళ్ళ క్రితమే వాటి స్ఫూర్తితో అల్లుకున్న శంకర్ ఆలోచన కమలహాసన్ - ప్రీతీ జింటా; షారుఖ్ ఖాన్ లను దాటి; చివరకు రజనీకాంత్ - ఐశ్వర్యారాయ్ లతో ఇప్పటికి ఇలా తెరపైకి ఎక్కిన తీరు సామాన్య ప్రాంతీయ భాషా ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. భారీ ఊహను అంతే భారీగా తెరపై చూపడానికి దర్శకుడు శంకర్ పటిష్ఠమైన సాంకేతిక బృందంతో కలసి చేసిన కృషి, అతణ్ణి నమ్మి నిర్మాతలు (సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్) చేసిన శతాధిక కోట్ల సాహసం, దానికి చేస్తున్న వీర ప్రచారం దక్షిణాది సినీ రంగంలో అపూర్వ ఘట్టమే. శంకర్ ఈ సినిమాతో తన సమకాలికులకు ఓ కొత్త బెంచ్ మార్కు పెట్టారు.

అపూర్వ సాంకేతిక శ్రమ

నిజం చెప్పాలంటే, ‘రోబో’ సినిమా మొత్తానికీ మూలస్తంభాలు - సాంకేతిక నిపుణులు. ముదిమి మీద పడుతున్న రజనీకాంత్ ను మధ్యవయస్కుడిగా అందంగా (ఇంకా చెప్పాలంటే, మొన్నటి ‘శివాజీ’లో కన్నా అందంగా) చూపడంలో మేకప్ తో పాటు, రత్నవేలు ఛాయాగ్రహణాన్ని చెప్పుకొని తీరాలి.

సైంటిస్ట్ గా, రోబో గా ఒకే ఫ్రేములో ఇద్దరు రజనీలు కనబడినా, అంతా సహజంగానే అనిపిస్తుంది. ఎక్కడా తేడా తెలియదు. సినిమాలో వచ్చే గ్రాఫిక్స్ సరే సరి. ఏకకాలంలో ఓ వంద మంది రజనీకాంత్ లు, (ఒక పాటలో పదుల కొద్దీ ఐశ్వర్యారాయ్ లు) కనిపించి కనువిందు చేస్తారు.

రెహమాన్ బాణీల్లో హాలులో తెలుగు మాటలు సరిగా వినిపించని పాటలు సో - సో అనిపించినా, వాటి చిత్రీకరణ మాత్రం ప్రతి శంకర్ సినిమాలో లానే లార్జర్ దేన్ లైఫే. హీరోయిన్ మీద ప్రేమను రోబో వ్యక్తం చేసే ‘ఇనుములో హృదయం మొలిచెనే...’, పెరూలో చిత్రీకరించిన ‘కిలిమంజారో...’ పాటలు కొన్నాళ్ళు జనాన్ని ఆకర్షిస్తాయి. ఎడారి ఇసుక తిన్నెల నడుమ నీలం రంగు నీటి చెలమలతో సినిమా మొదట్లోనే వచ్చే ‘నీలో వలపు...’ పాట లొకేషన్ ను చూసి, ప్రేక్షకులు మురిసిపోవడం ఖాయం. అలాగే పాటలకు వేసిన సెట్లు, సన్నివేశాల మొదలు పాటల దాకా వాడిన కాస్ట్యూమ్ లూ బాగున్నాయి.

ప్రొడక్షన్ డిజైనర్ గా బాధ్యతలు నిర్వహించిన సాబూ సిరిల్ కృషి ఒకటీ అరా చోట్ల కృత్రిమం అనిపించినా, హైటెక్ రోబోల రూపం నుంచి హెలికాప్టర్లు, సెట్ల దాకా రూపొందించడంలో ఆయన చేసిన శ్రమ సామాన్యం కాదు. ఆంటోనీ ఎడిటింగ్ కథనాన్ని వేగవంతం చేయడంలో సహకరించింది.

డబ్బింగ్ ప్రతిభ

తెలుగులో రజనీకాంత్ కు గాయకుడు మనో చేసిన స్వరదానం పాత్రను సజీవంగా నిలిపింది. ఇక, ఐశ్వర్యారాయ్ కు సవితా రెడ్డి గాత్రం నప్పింది. ‘నకరాలా’ అని పోలీసు అడిగితే (బహుశా తమిళంలో ‘నక్కలా’ (ఎగతాళి అని అర్థం) అయ్యుండాలి), ‘కాదు నికెల్’ అని రోబో జవాబు లాంటి చోట్ల అనుకున్న ఎఫెక్ట్ ను తెలుగు డబ్బింగ్ లో కూడా మాటల రచయిత శ్రీరామకృష్ణ తీసుకురాగలిగారు.

ఇక, తెలుగు పాటలు సుద్దాల అశోక్ తేజ, వనమాలి రచనలు. పాటల్లో ‘యంత్రుడు’ లాంటి అపసవ్యమైన తెలుగు ప్రయోగాలు కూడా అనిపించారు. ‘యంతిరన్’ అని తమిళంలో వస్తే, దానికి ‘యంత్రుడు’ అని యథేచ్ఛగా రాసినట్లనిపిస్తుంది. ఈ మన రచయితలు తమ విశృంఖల సృజనాత్మకతతో తెలుగు భాషకు మరోసారి జోహార్ అనేశారు.

జవాబు లేని ప్రశ్నలెన్నో...

ఇంత పెద్ద సినిమాలో లోపాలు కూడా ఇంకా లేకపోలేదు. మానవ స్పందనలు సైతం ఉన్నదిగా మారిన రోబో చిట్టి - ఆర్మీ టెస్టులో ఫెయిలవడంతో హీరో ముక్కలుగా విడగొట్టి పారేస్తాడు. తనను ముక్కలుగా విడగొట్టి పడేసి, తన ప్రేమను తోసిపుచ్చిన హీరోను మనిషి ఫీలింగ్స్ వచ్చిన రోబో ద్వేషించడం సహజం.

కానీ, తీరా చివరలో ఆ రెడ్ చిప్ ప్రోగ్రామ్ ఒక్కటి తీసేయగానే తన పాత స్పందనలన్నీ రోబో వదిలేస్తుంది. అప్పటి దాకా తాను ద్వేషించి, చంపడానికి కూడా సిద్ధమైన అదే హీరో పట్ల స్నేహంగా, మంచిగా ప్రవర్తిస్తుంది. ఈ మార్పు ఎలాగన్నది అర్థం చేసుకోలేం. స్పందనలనేవి రెడ్ చిప్ తో సంబంధం లేని అంశం కదా!

ఇక, అంత పెద్ద సైంటిస్ట్ హీరో, విడిభాగాలుగా విడగొట్టేసిన రోబోను ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా అలా చెత్తకుండీలో వేసేస్తాడా? పేటెంట్ రావడం కోసం చూస్తున్న సదరు శాస్త్రవేత్త, రోబోలోని సాఫ్టువేర్, ప్రోగ్రామింగ్ ల గురించైనా ఆలోచించకుండా అలా నిర్లక్ష్యంగా పారేస్తాడా…? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు. అలాగే, విలన్ చేసిన ఒక్క (రెడ్ చిప్) ప్రోగ్రామ్ తో రోబో యావత్ ప్రపంచానికే అంత వినాశకరంగా మారడం కొంత సినిమాటిక్ గా అనిపిస్తుంది.

నో స్టయిల్స్, నో పంచ్ డైలాగ్స్

ఇక, రజనీకాంత్ తరహా మాస్ మెచ్చే స్టయిల్స్, పంచ్ డైలాగులు ఈ సినిమాలో శూన్యం. వాటిని ఆశించే వారికి ఈ సినిమా ఆశాభంగమే. సాధారణంగా రజనీకాంత్ సినిమాల్లో ఉండే భావోద్వేగభరిత అంశాలూ ఇందులో కనిపించవు. అలాగే, కథలో హీరో సైంటిస్ట్ పాత్ర కానీ, కాసేపు విలన్ గా కనిపించి - అర్ధంతరంగా చచ్చిపోయే ప్రొఫెసర్ బోరా పాత్ర కానీ పెద్దగా చేసిందేమీ లేదు. వాటి కన్నా రోబో పాత్రదే పైచేయి అయిందనిపిస్తుంది. ఒకానొక దశకు వచ్చేసరికి, విలన్ రోబోను అరికట్టడానికి హీరో ఏమీ చేయలేకపోయాడని కూడా అనిపించేస్తుంది. ఇలాంటివన్నీ తెలియకుండానే ప్రేక్షకుల అంతరాంతరాళాల్లో అసంతృప్తిని కలిగిస్తాయి. పైకి చెప్పలేని ఏదో వెలితిని మిగులుస్తాయి.

ముగింపు

అన్నట్లు, సినిమా చివరలో 2030 కాలం నాటిదంటూ ఓ భవిష్యత్ సన్నివేశాన్ని చూపారు. ఇరవై ఏళ్ళ క్రితం (2010లో) తయారుచేసిన ఈ రోబోను ఎందుకు డిస్ మ్యాంటిల్ చేశారని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యూజియమ్ సందర్శనకు తీసుకొచ్చిన టీచర్ ని, ఓ విద్యార్థిని అడుగుతుంది.

దానికి, గాజు అరలో ఉన్న రజనీకాంత్ రోబో శిరస్సు సమాధానం చెబుతూ, ‘ఎందుకంటే -- నేను ఆలోచించడం మొదలుపెట్టాను కాబట్టి’ అంటుంది. ఇప్పుడు దర్శకుడు శంకర్ చేయాల్సింది కూడా అదేనేమో అనిపిస్తుంది. సినిమాను సాంకేతికంగా, విజువల్ గా ఇంత భారీగా తీర్చిదిద్దడానికి ఎంతో శ్రమపడిన శంకర్ స్ర్కిప్టు మీద, కథలోని భావోద్వేగాల పైన మరింత లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాల్సి ఉంది.

నిజానికి, మనిషి యాంత్రికంగా మారుతున్న వేళ, యంత్రానికే మానవ సహజమైన స్పందన వస్తే అన్న ఆలోచన మంచిదే. రోబోకు రెడ్ చిప్ లాగా, మనుషులు అబద్ధం, అసూయ, వంచన, ద్రోహం, స్వార్థం, ద్వేషం లాంటి రెడ్ చిప్ లు తగిలించుకొని తిరుగుతున్నారన్న అంశమూ సమాజానికి చెంపదెబ్బే. కానీ, వాటిని ఇంకా ప్రభావశీలంగా చెప్పాల్సింది.

చిన్న ఇతివృత్తానికి చిత్రీకరణలోని భారీ తనంతో సరిపుచ్చకుండా, పకడ్బందీ కథనూ, పాత్రచిత్రణనూ, మానవ సంబంధాలనూ మరింత బలంగా అల్లుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా, కొన్నేళ్ళుగా స్క్రిప్టు రూపకల్పనలో శంకర్ కు ప్రధానబలంగా నిలిచిన ప్రముఖ తమిళ కథా రచయిత సుజాత ఆ మధ్య మరణించడం కూడా ఇప్పుడు కనిపిస్తున్న ఈ బలహీనతకు కారణమేమో అనిపిస్తుంది. అందుకే, ఈ సినిమాను శంకర్ 'అపరిచితుడు' లాంటి గత చిత్రాలతో పోల్చలేం.

ఈ చిత్రంలో రోబో ప్రేమను హీరోయిన్ తిరస్కరించే ఘట్టం, చివరకు రోబో చిట్టి తనను తానే డిస్ మ్యాంటిల్ చేసుకొనే దృశ్యం లాంటి కొన్ని చోట్ల భావోద్వేగాల మెరుపులు మెరిశాయి. కానీ, ఇంతటి భారీ సినిమా - పై నుంచి కింది వరకూ అందరి మనసుల మీదా బలమైన ముద్ర వేయాలంటే ఆ మెరుపులు చాలవు. అది లేనప్పుడు ఇలాంటి సినిమాలు వట్టి సాంకేతిక అపురూపాలుగానే మిగిలిపోతాయి! బాక్సాఫీస్ కలెక్షన్లలోనే ఒరిగిపోతాయి!!

కొసమెరుపు: సినిమాలోని క్లైమాక్స్ లో వచ్చే దృశ్యాల గురించి చాలామందిమి ఆహా, ఓహో అంటున్నాం. కానీ, నేను సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఆ జనంలో యువకుడైన ఓ సగటు ప్రేక్షకుడు మాత్రం పక్కనున్న ఫ్రెండ్ తో ఇలా అన్నాడు: ‘‘అందరూ ‘క్లైమాక్స్ అదిరింది. అద్భుతం’ అంటూ ఉంటే ఏమో అనుకున్నారా బాబూ! చిన్నపిల్లల కామిక్స్, 3డి యానిమేషన్ గేమ్స్ చూసినట్లుందిరా!!’’ భావోద్వేగాల ముద్ర లేకపోతే బంధనాలు లేని ఎంతటి భారీ ఊహలకైనా వచ్చే కామెంట్లు ఇలానే ఉంటాయేమో?!

‘రోబో’: విజువల్స్ సరే...! విషయం మాటేమిటి...?!


సినిమా అంటే కొద్ది గంటల పాటు ఓ చీకటి గదిలో కళ్ళ ముందు కదిలే జీవితం. మనం కూడా అందులో భాగమనిపించేలా భ్రమ పెట్టే (కొన్నిసార్లు భయపెట్టే) మాయ. అలాంటి మాయా లోక విహారంలో వాస్తవం పాలు ఎంత, కల్పన పాలు ఎంత అన్న విచికిత్స ఒక్కోసారి ఎంత అవసరమో, అంత అనవసరం కూడా.

తీస్తున్నదీ, తెరపై చూస్తున్నదీ మాయలు, మంత్రాల కథో, ఆధునిక సైన్స్ - ఫిక్షనో అయినప్పుడు ఇక తర్కాలు, వాస్తవాలు, సంభావ్యతల కన్నా ఏ మేరకు సంభ్రమానికి గురయ్యామన్నదే కీలకమై కూర్చుంటుంది. రజనీకాంత్ హీరోగా, దర్శకుడు ఎస్. శంకర్ రూపొందించిన ‘రోబో’ (తమిళంలో ‘యంతిరన్’) సరిగ్గా అదే కోవకు చెందిన సినిమా. నిన్న ప్రపంచవ్యాప్తంగా వేల కొద్దీ థియేటర్లలో, ఆ స్థాయిలోనే ప్రింట్లతో, వందల కొద్దీ షోలతో విడుదలై, సంచలనం రేపిన (రేపుతూనే ఉన్న) ‘రోబో’ అనేకులతో ‘అమ్మో’ అనిపించడానికి కారణం అదే. కానీ, అదే సమయంలో సినిమా మొత్తం చూశాక, సాంకేతిక నైపుణ్యం, విజువల్స్ సరే కానీ, కథ, పాత్రల లోతుపాతులేమిటని ఆలోచిస్తే మాత్రం - పెళ్ళి విందుకని పిలిచి, మంచి మండపంలో మెస్ భోజనం పెట్టించినట్లుంది.

కథాక్రమంబెట్టిదనిన....

కథగా చెప్పాలంటే - డాక్టర్ వశీకర (రజనీకాంత్) ఓ మంచి శాస్త్రవేత్త. ఎంతో కష్టపడి అచ్చం తన లాగే ఉండే ఓ యాండ్రో - హ్యూమనాయిడ్ రోబోను తయారుచేస్తాడు. చెప్పిన పనల్లా చేయడమే కాక, బోలెడంత సమాచారాన్ని నిల్వ చేసుకోగల రోబో అది. ఎన్నో భాషలు, కళలు కూడా వచ్చిన ఈ మర మనిషికి చిట్టి (రెండో రజనీకాంత్) అని పేరు పెడతాడు హీరో. వంద మంది తెలివితేటలతో, సామర్థ్యంతో, శతయోధులకు సమానంగా సిద్ధం చేసిన ఈ రోబోను సైన్యానికి అప్పగించి, దేశభక్తిని చాటుకోవాలని ఆ సైంటిస్ట్ హీరో ఆలోచన.

ఈ పనుల్లో పడి ప్రేమించిన వైద్యవిద్యార్థిని సనా (ఐశ్వర్యారాయ్ బచ్చన్)ను కూడా కొంత అలక్ష్యం చేస్తాడు. అన్ని విధాలా తయారైన రోబోను శాస్త్రవేత్తల సదస్సులో నిలబెట్టి, ప్రశంసలు పొందుతాడు. అయితే, అదే సదస్సుకు హాజరైన వశీకర గురువు ప్రొఫెసర్ బోరా (డేనీ డెన్ జొప్ప)కు ఇది కంటగింపుగా మారుతుంది. అచ్చం మనిషిలా ప్రవర్తించే అలాంటి రోబోను తయారు చేయాలని అప్పటికే అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న బోరా, పైకి కనిపించనంతటి ద్వేషాన్ని వశీకర మీద పెంచుకుంటాడు.

రోబో చిట్టి చేసే విన్యాసాలు, కథానాయికను ఆదుకొనే సంఘటనలతో సినిమా మరికాసేపు గడుస్తుంది. రోబోను సైన్యానికి అప్పగించేందుకు అనుమతి కోసం శాస్త్రవేత్తల ముందు పరీక్షకు పెడతాడు సైంటిస్ట్ వశీకర. కానీ, అక్కడ మనిషి లాగా విచక్షణనూ, స్పందననూ ఉపయోగించలేని, ‘తన - పర’తేడా తెలియని వట్టి మరమనిషి అంటూ రోబోను ఫెయిల్ చేస్తాడు - ప్రొఫెసర్ బోరా. బయటి ప్రపంచంలోకి ఆ రోబోను పంపితే ప్రమాదమనేస్తాడు. మరొక్క అవకాశం ఇవ్వమంటాడు హీరో.

ఓ సవాలుగా తీసుకొని, రోబో చిట్టికి కోపం, ప్రేమ, సంతోషం లాంటి మనుషుల భావావేశాలనూ, స్పందనలనూ కష్టపడి ప్రోగ్రామ్ చేస్తాడు. ప్రాణాపాయ స్థితిలో పడ్డ ఓ గర్భిణికి హీరోయిన్ తో కలసి మామూలు ప్రసవం చేసి, రోబో చిట్టి చరిత్ర సృష్టిస్తాడు. ముద్దిచ్చి, అభినందించిన హీరోయిన్ ను మానవ స్పందనలున్న రోబో చిట్టి నిజంగానే ప్రేమించడం మొదలుపెడతాడు. అక్కడికి సినిమా ఫస్టాఫ్ పూర్తవుతుంది.

రోబో చిట్టిలో పెరిగిన ఈ ప్రేమ తరహా ప్రకృతి సహజమైన స్పందనలు హీరో, హీరోయిన్లకు తలనొప్పిగా తయారవుతాయి. ప్రకృతి విరుద్ధమైన ఆ ప్రేమను మర్చిపొమ్మని వాళ్ళు రోబోకు నచ్చజెబుతారు. కానీ, ఆ మాటలతో రోబో చిట్టి సమాధానపడడు. మరోపక్క విధ్వంసకరమైన వంద రోబోలను తయారుచేసి ఇవ్వడానికి విదేశీ అక్రమ ఆయుధ వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రొఫెసర్ బోరా ఆ పని పూర్తి చేయలేక సతమతమవుతుంటాడు. రోబో చిట్టిలోని బాధను ఆసరాగా చేసుకొని, హీరో మీద అతని మనసు విరిచేస్తాడు బోరా.

దాంతో, మరునాడు ఆర్మీ టెస్టులో రోబో చిట్టి కావాలనే ప్రేమపాఠాలు వల్లిస్తూ, ఫెయిలవుతాడు. కొన్నేళ్ళ శ్రమ బూడిదలో పోసిన పన్నీరైనందుకు హీరో కోపం కట్టలు తెచ్చుకుంటుంది. బతకాలని ఉందని రోబో బతిమాలుతున్నా వినకుండా, ముక్కలు ముక్కలు చేసి, చెత్తకుండీలో పారేయిస్తాడు. అన్నేళ్ళ ప్రయోగం విఫలమైందని బాధపడతాడు.

అప్పటికే హీరో మీద అక్కసుతో ఉన్న అతని అసిస్టెంట్ల (సంతానం, కరుణాస్) సహాయంతో ఆ రోబోకు మళ్ళీ జీవం పోస్తాడు ప్రొఫెసర్ బోరా. ప్రేమ కోసం బతకదలచిన రోబో చిట్టి నుంచి అలాంటి రోబోలను మరిన్ని తయారుచేసే మూలసూత్రం రాబడతాడు. ఉన్న ప్రోగ్రామ్ లకు తోడుగా, విధ్వంసాలు సృష్టించే తనదైన ప్రమాదభరిత రెడ్ చిప్ ప్రోగ్రామ్ ను కూడా రోబో చిట్టిలో ప్రవేశపెడతాడు.

విధ్వంసక శక్తిగా మారిన రోబో చిట్టి తన లాంటి మరిన్ని రోబోలను సృష్టించి, తనదైన సామ్రాజ్యం నెలకొల్పుకుంటాడు. సమాజంలో అల్లకల్లోలం రేపుతాడు. మళ్ళీ జీవం పోసిన ప్రొఫెసర్ బోరాను సైతం చంపేస్తాడు. హీరో, హీరోయిన్ల పెళ్ళి చెడగొట్టి, పెళ్ళి పీటల మీద నుంచి హీరోయిన్ ను ఎత్తుకు వచ్చి, తన రోబో సామ్రాజ్యంలో బందీని చేస్తాడు.

అక్కడ నుంచి అతణ్ణి ఎదుర్కోవడానికి అందరూ పడే తంటాలు, హాలీవుడ్ యాక్షన్ సన్నివేశాలను తలపించే గ్రాఫిక్స్ నిండిన పతాక సన్నివేశాల్లో రోబోలను హీరో ఎలా నిర్వీర్యం చేశాడన్నది మిగతా సినిమా.

కథా కథనం

ఈ సినిమాలో ఫస్టాఫ్ కాస్త సరదా ఘట్టాలతో గడిచిపోతుంది. నీటికీ, నిప్పుకూ తట్టుకొనే రోబో చిట్టి పెద్దగా పాటలు పెట్టిన వారిని ఎదుర్కోవడం, దుండగుల బారి నుంచి లోకల్ ట్రైన్లో హీరోయిన్ ను కాపాడడం, అగ్నిప్రమాదంలో చిక్కుకున్న బాధితులను రక్షించడం లాంటి సన్నివేశాలతో ప్రథమార్ధంలో కొద్దిపాటి కథే అయినా, గబగబా గడిచిపోతుంది.

అక్కడికక్కడ ఆ యా సన్నివేశాల్లో ఆసక్తిని నిలిపి, పిల్లలను ఆకట్టుకోవడానికి ఆ కథనం తోడ్పడుతుంది. పిల్లలను ప్రధానమైన టార్గెట్ గా చేసుకొన్న ఈ సినిమాలో దోమలతో, రోబో సంభాషణల లాంటి లాజిక్ కు అందని మేజిక్కులు కూడా పుష్కలం.

ద్వితీయార్ధానికి వచ్చేసరికి అసలు కథ మొదలవుతుంది. కథలోని అసలు పీటముడి, దానికి పరిష్కారమంతా సెకండాఫ్ లోనే వస్తాయి. సెకండాఫ్ సగమైన తరువాత నుంచి కథ మొత్తం సాంకేతికత సాయంతో చేసిన విజువల్ మాయ. దాంతో, ఓ దశకు వచ్చేసరికి పాత్రల మధ్య సంఘర్షణ కన్నా, ఏ మీట నొక్కి, ఏ టెక్నిక్ తో హీరో, ఆ రోబోల ఆట కట్టిసాడోనని ఎదురుచూడడమే మిగులుతుంది. అదే ఈ సినిమాలోని బలమూ, బలహీనత కూడా!

(మిగతా భాగం మరికాసేపట్లో...)

Saturday, October 2, 2010

'రోబో' సందడే సందడి!



హమ్మయ్య. ఎలాగైతేనేం. రజనీకాంత్ - శంకర్ ల 'రోబో' సినిమా చూశా. అదీ కష్టపడి టికెట్ సంపాదించి, మరీ మొదటి రోజే రాత్రి చూశా. హాలు కౌంటర్ లోనే బాల్కనీ టికెట్ ను అక్షరాలా నాలుగు రెట్ల రేటుకు అన్యాయంగా అమ్ముతూ, ప్రేక్షకులను దోచుకుంటున్న తీరుకు ఆవేదనపడుతూ మరీ చూశా. రజనీకాంత్ కు తెలుగులో కూడా ఉన్న అభిమానుల క్రేజును హాలులో ఆనంద పడుతూ చూశా. తెలుగులోనూ ఇలాంటి విజువల్ వండర్స్ చేసే దర్శకులు ఒకరికి నలుగురు వస్తే బాగుండునే అని ఆశిస్తూ చూశా.

పొద్దు పోయాక ఇంటికి వస్తూ, బోలెడన్ని హాళ్ళలో ఏకకాలంలో విడుదలైన 'రోబో' (తమిళంలో 'యంతిరన్') దెబ్బకు రోడ్ల మీద ఆగిపోయిన వాహనాలనూ అబ్బురంగా చూశా. అంత ట్రాఫిక్ రద్దీలోనూ బస్సులో జనం తెల్లవారు జాము నుంచి ఆ సినిమా చేస్తున్న సందడి గురించే మాట్లాడుకొంటున్న అలవికాని అభిమానాన్ని ఆశ్చర్యపోతూ చూశా. వెరసి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో అని అంచనాలు కడుతూ ఇంటికి వచ్చేశా.

('రోబో'- సినిమా సమీక్ష... తరువాతి టపాలో... మరికొద్దిసేపట్లో...)

Friday, October 1, 2010

మేకప్ కి మూడు కోట్లా...? ఆడియోకు 8 కోట్లా..?

(‘ఒక రోబో - ఎన్నో కథలు’ - 2వ పార్ట్)

* రోబో చిత్ర సెట్ల విషయానికి వస్తే - ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ గా కళా దర్శకుడు సాబూ శిరిల్ చాలా కష్టమే పడ్డారు. ఈ సినిమా కోసం దాదాపు 35కు పైగా వేర్వేరు రకాల సెట్లు వేశారు. పతాక సన్నివేశంలోని సెట్ కోసమే దాదాపు 5 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు భోగట్టా. అయితే, అన్నీ పర్యావరణ అనుకూలమైన పదార్థాలతో రూపొందించిన సెట్లే కావడం విశేషం. ఈ సినిమా కోసం కొత్త రకం హెలికాప్టర్లనూ, ఎయిర్ ఫోర్స్ విమానాలనూ ఆయన రూపొందించారు. ఇక, కిలిమంజారో.... అనే పాట కోసం అద్భుతమైన సెట్ వేశారు.

* ఈ సినిమాలో మొత్తం 6 పాటలుంటే, వాటిలో ఒక పాటను సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కుమార్తె ఖతీజా పాడడం విశేషం. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో కలసి ఆ చిన్నారి టైటిల్ సాంగ్ పాడింది. ‘‘ఆ పాట రికార్డు చేసేసరికి అర్ధరాత్రి దాటింది. నా కోసం ఆ పాట రికార్డు చేశాక, మరునాడు మా పాప బడికి వెళ్ళలేకపోయింది’’ అని రెహమాన్ ఆ మధ్య వెల్లడించారు.

* ఈ చిత్రం తమిళ ఆడియో రైట్లను థింక్ మ్యూజిక్ సంస్థ చేజిక్కించుకుంది. అందు కోసం ఆ సంస్థ చెల్లించిన మొత్తం అక్షరాలా 8 కోట్ల రూపాయలు. ఓ దక్షిణ భారతీయ సినిమా ఆడియో హక్కులు ఇంత భారీ మొత్తానికి అమ్ముడు కావడం ఇదే ప్రథమం.

* ప్రభుదేవా, రాజు సుందరం, లారెన్స్ రాఘవేంద్రలు ఈ సినిమాలోని వేర్వేరు పాటలకు నృత్య రీతులు సమకూర్చారు. రెండు పాటల చిత్రీకరణకే రూ. 30 కోట్లు ఖర్చయిందని యూనిట్ వర్గాలు చెబుతున్న మాట.

* ఇంతకీ ఈ సినిమాలో రజనీకాంత్ మేకప్ కే అక్షరాలా రూ. 3 కోట్లు ఖర్చయిందని యూనిట్ వర్గాలు తెలిపాయి. అంటే, ఓ చిన్న తెలుగు సినిమా బడ్జెట్ అన్నమాట.

* ఈ సినిమాను వియన్నా, పెరూలోని మచూ పిచూ, అమెరికా, బ్రెజిల్ లాంటి వేర్వేరు దేశాల్లో చిత్రీకరించారు. మనదేశంలో కూడా చెన్నైలోని వివిధ ప్రాంతాలతో పాటు రాయవెల్లూరు, పుణే, కులూమనాలి, గోవాలలో చిత్రీకరణ సాగింది.

* సినిమా కన్నా ముందు ఈ చిత్రం ట్రైలర్ విడుదలైనప్పుడు కూడా తమిళనాట పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. తిరుచ్చిలో తొలిసారిగా రోబో (యంతిరన్) ట్రైలర్ ప్రదర్శిస్తుంటే, నిర్ణీత సమయాని కన్నా దాదాపు మూడు గంటల ముందు నుంచే అభిమానులు సినిమా హాలు బయట నిరీక్షించారు.

* ఇక, తూత్తుకుడిలో అయితే, ట్రైలర్ రీలును ఉన్న బాక్సును ఏనుగు అంబారీ మీద పెట్టి, బ్యాండు మేళాలతో పట్నమంతా ఊరేగించారట. కోయంబత్తూరులో రథంలో పెట్టి తిప్పారట. చెన్నైలో రజనీకాంత్ కటౌట్లకు అభిమానులు పాలాభిషేకాలు, హారతులు ఇవ్వడం సరేసరి. సినిమా విడుదల రోజు కూడా ఇలాంటి హంగామాకు మనం సిద్ధంగా ఉండాల్సిందే!