జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, January 25, 2014

పాత తరం నటుడు నాగరాజారావు మృతి



- నేపథ్య గాయని ఎస్‌. జానకి సంతాపం
  
పాత తరం రంగస్థల, సినీ నటుడు, ప్రముఖ నేపథ్య గాయని ఎస్‌. జానకి చెల్లెలి భర్త అయిన వి. నాగరాజారావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున 4.40 గంటల ప్రాంతంలో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 76 ఏళ్ళు. ఆయనకు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూకాభినయ తారగా దేశ, విదేశాల్లో తెలుగు వారి ఖ్యాతిని వ్యాపింపజేసిన కీర్తిశేషులు 'ఫన్‌ డాక్టర్‌' చంద్రశేఖరం రెండో కుమారుడే నాగరాజారావు. 

నేపథ్య గాయని ఎస్‌. జానకి చెల్లెల్ని వివాహమాడిన ఆయన రంగస్థలంపై ఎన్నో పాత్రలను రక్తికట్టించారు. ముఖ్యంగా, రచయిత - నటుడు రావి కొండలరావు రాసిన చాలా నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. ఆ నాటకాలను రక్తి కట్టించడంలో కీలక భూమిక వహించారు. చాలా ఏళ్ళుగా చెన్నైలో ఉంటున్న ఆయన కొద్ది సినిమాల్లో కూడా నటించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఎన్టీయార్‌ 'నర్తనశాల' (1963)లో సహదేవుడి పాత్ర పోషించింది ఆయనే. అలాగే, బి.ఎన్‌. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'రంగుల రాట్నం' చిత్రంలో నటి విజయనిర్మలకు జోడీగా తెరపై కనిపించారు. 
చెన్నైలోని తెలుగువారి సినీ, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలన్నిటికీ తప్పనిసరిగా హాజరయ్యే నాగరాజారావు స్థానికులకు ఎంతో సన్నిహితులు. ఆయన మరణంతో గాయని జానకి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కేరళ నుంచి వచ్చిన ఎస్‌. జానకి, నాగరాజారావుతో కలసి నటించిన సినీ నటి శారద తదితరులు భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. సీనియర్‌ సినీ నటుడు విజ్జిబాబు, కూచిపూడి నాట్యాచార్యుడు మాధవపెద్ది మూర్తితో సహా పలువురు సన్నిహితులు, స్నేహితులు నాగరాజారావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నాగరాజారావు భౌతిక కాయానికి మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు జరిపారు.
(Published in 'Praja Sakti' daily, 22 Jan 2014, Wednesday, Page No.8)
........................................

Friday, January 24, 2014

అలుపెరుగని సినీ బాటసారి అక్కినేని



   రంగస్థలం మీద నుంచి సినీ రంగానికి వచ్చిన తొలి తరం తారల్లో అక్కినేని ఒకరు. పి. పుల్లయ్య దర్శకత్వంలోని 'ధర్మపత్ని' (విడుదల: 1941 జనవరి 10న)లో ఓ చిన్న పాత్రతో ఆయన సినీ జీవిత ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి చనిపోవడానికి కొద్ది నెలల ముందు షూటింగ్‌లో పాల్గొన్న సొంత చిత్రం 'మనం' (ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది) దాకా ఆయన సినీ జీవిత పయనం సుదీర్ఘంగా సాగింది. 'మనం' ఆయన నటించిన 256వ సినిమా! 
ఈ ఏడు దశాబ్దాల పైచిలుకు కెరీర్‌లో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. సాంఘికాలు చేశారు, మెప్పించారు. పౌరాణికాల్లో మెరిశారు. చారిత్రక పాత్రల్లో విమర్శకుల ప్రశంసలు పొందారు. అయితే, కెరీర్‌ తొలి రోజుల్లో జానపద హీరోగా అనిపించుకున్న అక్కినేని, ఆపైన దీర్ఘకాలంలో అది తనకు విజయసూత్రం కాదని గ్రహించి, సాంఘికాల వైపు మళ్ళడం విశేషం. చివరి దాకా సాంఘికాలకూ, అందులోనూ ప్రేమ కథలకూ, విషాదాంత ప్రేమకథలకూ తనదంటూ ఓ ప్రత్యేక ముద్ర వేశారు.

ఆయన కెరీర్‌ను గమనిస్తే... తొలి పూర్తి తెలుగు టాకీ కన్నా ఏడేళ్ళ పై చిలుకు పెద్దవాడైన అక్కినేని 'ధర్మపత్ని' (1941)లో బాలానందం పిల్లల్లో ఒకడిగా ఓ పాటలో కనిపించి, తెరంగేట్రం చేశారు. ఆ పైన ఆశించిన అవకాశాలు రాక రంగస్థలికే పరిమితమయ్యారు. దర్శక - నిర్మాత ఘంటసాల బలరామయ్య చలవతో 'శ్రీసీతారామ జననము' (1944)తో హీరో అయ్యారు. 'ముగ్గురు మరాఠీలు', 'రత్నమాల' తరువాత 'బాలరాజు' (1948)తో హీరోగా నిలబడ్డారు. 'కీలుగుఱ్ఱం', 'లైలా మజ్ను' లాంటి విజయాలు, 'శ్రీలక్ష్మమ్మ కథ' లాంటి పోటాపోటీ చిత్రాల తరువాత జానపద హీరోగా కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. దాంతో, పునస్సమీక్షించుకొని, 'సంసారం'తో సాంఘిక చిత్రాల బాట పట్టారు. 
భరణీ వారి చిత్రాల్లో భానుమతికి జోడీ అయ్యారు. 'ప్రేమ' (తమిళంలో 'కాదల్‌') తదితర చిత్రాలతో, ఆ పైన 'దేవదాసు' (1953)తో ప్రణయ కథానాయకుడిగా తెలుగు, తమిళ దేశ ప్రజల నీరాజనాలు అందుకున్నారు. 'చక్రపాణి' (1954), 'మిస్సమ్మ' ('55) లాంటి వినోదాత్మకాలూ, 'విప్రనారాయణ' ('54) లాంటి భక్తి చిత్రాలు, 'అర్ధాంగి', 'రోజులు మారాయి', 'దొంగరాముడు' లాంటి సాంఘికాలు వరుస విజయాలిచ్చాయి. 'మాయా బజార్‌', అరవంలోనే కాక తెలుగులోనూ వచ్చిన పార్‌ట్లీ కలర్‌ 'అల్లావుద్దీన్‌', తెలుగు నుంచి తమిళ, హిందీ భాషలకు అనువాదమైన 'భూకైలాస్‌'తో అక్కినేని కీర్తి ఎల్లలు దాటింది. 'మాంగల్య బలం' (1959), 'జయభేరి' ('59), 'శాంతి నివాసం' ('60), 'మహాకవి కాళిదాసు' ('60) లాంటి విభిన్న చిత్రాలు ఆయన ప్రతిభకు గీటురాళ్ళయ్యాయి. ''వద్దని వారించినా'' భానుమతి తీసిన 'బాటసారి' ('61) అక్కినేని మాటల్లోనే చెప్పాలంటే, ఆయన ''కెరీర్‌లో మరపురాని కళాఖండం.''

1960 -'71 మధ్య 'ఇద్దరు మిత్రులు', 'ఆరాధన', 'మూగమనసులు', 'అమరశిల్పి జక్కన', 'ప్రేమ్‌నగర్‌', 'దసరా బుల్లోడు' లాంటి వైవిధ్య చిత్రాలు బంగారం పండించాయి. ఆ పై 'అందాల రాముడు' (1973), 'మహాకవి క్షేత్రయ్య' ('76) రజత నందులు సాధించాయి. ఆ పైన 'దేవదాసు' స్ఫూర్తి ఉన్న 'ప్రేమాభిషేకం' ప్లాటినమ్‌ జూబ్లీ విషాదాంత హీరోగా అక్కినేని కీర్తికి కలికితురాయి. జాతీయ, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులెన్నో అందుకున్న 'మేఘసందేశం' ('82)ఉత్తమ నటుడి అవార్డు తెచ్చిన కళాఖండం.
 క్రమంగా పెద్ద తరహా పాత్రలకు మళ్ళిన అక్కినేని 'బహుదూరపు బాటసారి', 'సూత్రధారులు', 'సీతారామయ్య గారి మనవరాలు' ('91), ఉత్తమ నటుణ్ణి చేసిన 'బంగారు కుటుంబం' ('94) తరువాత రాశి తగ్గించారు. అడపా దడపా 'చుక్కల్లో చంద్రుడు', 'శ్రీరామదాసు' లాంటి సినిమాల్లో కనిపించారు. బాపు - రమణల 'శ్రీరామరాజ్యం' ఏయన్నార్‌ నటించగా విడుదలైన ఆఖరి చిత్రం. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న 'మనం'లో ఆయన పాత్ర వరకు చిత్రీకరణ పూర్తయింది. ఆపరేషన్‌ అయి వచ్చాక, అక్కినేని ముందుజాగ్రత్తగా తన పాత్రకు డబ్బింగ్‌ కూడా చెప్పేశారు. ఈ ఏడాది రానున్న ఆ సినిమాతో ఈ బహుదూరపు బాటసారి సినీ జీవితం ముగిసిపోవడం సినీ ప్రియులకు విషాదమే! 

అక్కినేని బాక్సాఫీస్‌ ప్రస్థానం
ఎనిమిది దశాబ్దాలుగా నట రంగంలో ఉంటూ, అందులో ఏడు దశాబ్దాల పైగా సినీ రంగంలో కొనసాగిన ఏకైక భారతీయ నటుడు అక్కినేనే! ఇన్నేళ్ళు నటనను కొనసాగించిన మరో వ్యక్తి దేశవిదేశాల్లోనూ మరెవరూ ఉండి ఉండకపోవచ్చు. మొత్తం 256 చిత్రాల్లో కెరీర్‌ తొలినాళ్ళలో, చివరి రోజుల్లో పోషించిన సహాయక పాత్రల లాంటివి వదిలేస్తే, దాదాపు 210 దాకా చిత్రాల్లో ఆయనే హీరో. ఈ సినిమాల్లో సుమారు 70 పైచిలుకు చిత్రాలు థియేటర్‌ మారకుండా, నేరుగా శతదినోత్సవాలు జరుపుకొన్నవే.

ఇక, థియేటర్లు మారి (షిఫ్టింగ్‌తో) వంద పైచిలుకు సినిమాలు వంద రోజుల ఉత్సవాలు చేసుకున్నాయి. భారతదేశంలో ఎన్టీయార్‌, తమిళ నటుడు ఎమ్జీయార్‌ తరువాత ఇన్ని శతదినోత్సవ చిత్రాలున్న నటుడు అక్కినేనే! ఆయన నటించిన 'దేవదాసు' చిత్రం హైదరాబాద్‌లోని సుదర్శన్‌ 70 ఎం.ఎం.లో ఉదయం ఆటలతో రీ-రిలీజులో 104 రోజులు ఆడి, సంచలనం రేపింది. 
అక్కినేని చిత్రాల్లో స్ట్రెయిట్‌గా సిల్వర్‌ జూబ్లీ జరుపుకొన్న చిత్రాలు పది దాకా ఉన్నాయి (రోజులు మారాయి, సువర్ణ సుందరి, మాయాబజార్‌, పెళ్ళి కానుక, గుండమ్మ కథ, ఇద్దరు మిత్రులు, మూగమనసులు, దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం). షిఫ్టింగులతో సిల్వర్‌ జూబ్లీ చేసుకున్న చిత్రాల్లో 'బాలరాజు' నుంచి 'సీతారామయ్య గారి మనవరాలు' దాకా దాదాపు 11 ఉన్నాయి. 
ఇక, 'దసరా బుల్లోడు', ప్రేమాభిషేకం', 'ఏడంతస్తుల మేడ' చిత్రాలు ద్విశతదినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. వాటిలో మొదటి రెండు చిత్రాలు ఇంకా ముందుకు సాగి, ఏడాది పాటు ఆడి రికార్డు సృష్టించాయి. ఇక, ట్రాజెడీ హీరోగా ఏయన్నార్‌కు ఉన్న పేరును నిలబెట్టిన 'ప్రేమాభిషేకం' మరింత సక్సెస్‌ సాధించి, ఏకంగా 75 వారాలు ఆడి ప్లాటినమ్‌ జూబ్లీ చేసుకుంది. ఇన్ని విజయాలతో ఏయన్నార్‌ తన స్థానాన్ని అభిమానుల మదిలో సుస్థిరం చేసుకున్నారు.

- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 23rd Jan 2014, Thursday, Page No. 8)
............................................................

బాటసారి తుది మజిలీ



-    మంగళవారం అర్ధరాత్రి అక్కినేని ఆఖరి శ్వాస 
-    ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
-    విషాదంలో సినీ పరిశ్రమ 
-    అశేషజనం అశ్రునివాళి

      తెలుగు సినీ కళామతల్లి మరో ముద్దుబిడ్డను కోల్పోయింది. తెలుగు సినిమా ఖ్యాతిని హిమాలయ పర్వతమంత స్థాయికి తీసుకువెళ్ళిన నట శిఖరం ఒరిగిపోయింది. ఏడు దశాబ్దాల పాటు కథానాయక పాత్రలతో అందరినీ అలరించి 'ఎవర్‌గ్రీన్‌' తారగా వెలిగిన నట సమ్రాట్‌ 'టాటా వీడుకోలు... ఇంక సెలవు...' అంటూ అభిమానులకు వీడ్కోలు చెబుతూ తుది శ్వాస విడిచారు. అభిమానుల శుభాకాంక్షలతో క్యాన్సర్‌ను సైతం జయించి వస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసిన అక్కినేని నాగేశ్వరరావు ఆ వాగ్దానం మాత్రం నెరవేర్చకుండానే జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించారు. ఆయన మరణంతో తెలుగు సినీ ప్రియులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. శాసనసభ, మండలి సంతాపం ప్రకటించాయి. 
   తెలుగు సినీ రంగానికి రెండు కళ్ళలో ఒకటిగా అందరూ ప్రస్తావించే 'పద్మవిభూషణ్‌' అక్కినేని నాగేశ్వరరావు మంగళవారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్‌లో తన స్వగృహంలో కన్నుమూశారు. గడచిన సెప్టెంబర్‌ 20న తొంభయ్యో ఏట అడుగుపెట్టిన ఆయన కొద్ది నెలలుగా జీర్ణకోశానికి సంబంధించిన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గడచిన అక్టోబర్‌ నెలలో ఆ వ్యాధి బయటపడడంతో రాష్ట్ర రాజధానిలోని 'కిమ్స్‌' ఆసుపత్రిలో శస్త్రచికిత్స కూడా జరిపారు. క్యాన్సర్‌కు గురైన పేగు భాగాన్ని తొలగించి, కొన్ని వారాలుగా కెమోథెరపీతో వైద్యం అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం కూడా కుటుంబ సభ్యులతో మామూలుగా మాట్లాడిన ఏయన్నార్‌ ఆరోగ్యం రాత్రి భోజనం తరువాత క్రమంగా క్షీణించింది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్న అర్ధరాత్రి దాటాక తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్ళి, తుది ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
  ఏయన్నార్‌ మరణంతో తెలుగు చిత్రసీమను ఏలిన తొలినాళ్ళ హీరోల్లో ఆఖరి నట దిగ్గజం నిష్క్రమించినట్లయింది. మంగళవారం సాయంత్రం కూడా అక్కినేని చివరిసారిగా కుటుంబసభ్యులందరితో ఎంతో సంతోషంగా మాట్లాడారని నాగార్జున తెలిపారు. ఏయన్నార్‌ మరణ సమయంలో ఆయన కుమార్తె నాగసుశీల, మనుమడు - యువ హీరో సుశాంత్‌ పక్కనే ఉన్నారు. తెల్లవారుజామున అక్కినేని భౌతిక కాయాన్ని కేర్‌ ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తరలించారు. ఉదయం కొద్దిసేపు ఇంట్లో ఉంచిన తరువాత ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు, అభిమానుల సందర్శనార్థం అక్కినేని భౌతిక కాయాన్ని ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అన్నపూర్ణా స్టూడియోస్‌కు తరలించారు.

   స్టూడియోలో అక్కినేని అత్యంత ఇష్టమైన 'క్రిటిక్స్‌ గ్రోవ్‌' ప్రాంతంలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచారు. బుధవారం నాడు అంత్యక్రియలు జరుగుతాయని అక్కినేని కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ అరుదైన నట విశారదుడి అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డి.కె. అరుణ వెల్లడించారు. 

  తమ అభిమాన నటుణ్ణి ఆఖరుసారిగా చూసుకోవడం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి, దేశవిదేశాల నుంచి సినీప్రియులు పెద్దయెత్తున తరలివస్తున్నారు. జనం పోటెత్తడంతో అన్నపూర్ణా స్టూడియోస్‌ ప్రాంగణం క్రిక్కిరిసి కనిపించింది. చిన్నా, పెద్దా, ఆడా, మగా తేడా లేకుండా ఎంతో మంది సుదీర్ఘమైన క్యూలో నిల్చొని, అక్కినేని కడసారి చూపు కోసం నిరీక్షిస్తూ వచ్చారు. సినీ నటులు కృష్ణ, చిరంజీవి మొదలు పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీయార్‌, అలీ, సీనియర్‌ నటుడు కాకరాల దాకా, నిర్మాతలు డి. రామానాయుడు, ప్రసాద్‌ ల్యాబ్స్‌ అధినేత రమేశ్‌ప్రసాద్‌, దర్శకులు కె. రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లాణి శ్రీధర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఇంకా ఎంతో మంది రాజకీయ, సామాజిక ప్రముఖులు అక్కినేని భౌతిక కాయాన్ని ఆయన స్వగృహంలోనూ, అన్నపూర్ణా స్టూడియోలోనూ దర్శించి, నివాళులు అర్పించారు.
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 23rd Jan 2014, Thurs day, Page 1 and Page 4)
........................................................

Sunday, January 19, 2014

అస్తమించిన అపురూప నాయిక - సుచిత్రా సేన్‌

-   సుచిత్రా సేన్‌ (1931 - 2014)

     సుప్రసిద్ధ సినీ నటి సుచిత్రా సేన్‌ కన్నుమూశారు. ఆమె వయసు 82 ఏళ్ళు. ఛాతీ ఇన్‌ఫెక్షన్‌కు గురై కొద్దికాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఈ అలనాటి అందాల తార కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హౌమ్‌లో గురువారం ఉదయం 8.25 గంటలకు తీవ్రమైన గుండెపోటుకు గురై, తుదిశ్వాస విడిచారు. గడచిన డిసెంబర్‌ 24వ తేదీన ఆసుపత్రిలో చేరిన ఆమె గడచిన మూడు వారాలుగా 'లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌' మీద ఉంటూ, అనారోగ్యంతో పోరాడి, ఆఖరుకు జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించడంతో సినీ పరిశ్రమ వర్గీయులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. బెంగాల్‌కు చెందిన సుచిత్రా సేన్‌ మరణంతో కోల్‌కతాలోని బెంగాలీయులు కడసారి చూపు కోసం ఆమె చికిత్స పొందిన నర్సింగ్‌ హౌమ్‌కు పెద్దయెత్తున తరలిరావడం విశేషం. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సహా ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమె మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 

అలనాటి ఆరాధ్య దేవత
     బెంగాలీయులు 'మహానాయిక' (గొప్ప హీరోయిన్‌ అని అర్థం)గా పేర్కొనే సుచిత్రా సేన్‌ ఆ రోజుల్లో ఎంతోమందికి ఆరాధ్యదేవతగా వెలిగారు. 'దేవ్‌దాస్‌', 'ఆంధీ' లాంటి హిందీ చిత్రాల్లో ఆమె నటన ఎందరో అభిమానుల్ని సంపాదించి పెట్టింది. బెంగాలీలో కూడా 'సప్తపది' (1961), 'దీప్‌ జ్వెలే జారు' లాంటి పలుచిత్రాలు ఆమెకు పేరు తెచ్చాయి. ముఖ్యంగా 'దీప్‌ జ్వెలే జారు' (1959)లో ఆసుపత్రి నర్సు రాధగా, 'ఉత్తర్‌ ఫల్గుణి' (1963)లో దేవదాసిగా - ఆమె కుమార్తెగా చేసిన ద్విపాత్రాభినయం ఇవాళ్టికీ బెంగాలీ సినీ ప్రియులకు మరపురానివే! ఓ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అవార్డు పొందిన తొలి భారతీయ నటి ఆమే! యాభై ఏళ్ళ క్రితం 1963లో మాస్కో చలనచిత్రోత్సవంలో 'సాత్‌ పాకే బాంధా' చిత్రంలోని నటనకు గాను ఉత్తమ నటిగా వెండి బహుమతిని ఆమె అందుకున్నారు. అలాగే, 1972లో భారత ప్రభుత్వం ఆమెకు 'పద్మశ్రీ' పురస్కారాన్నిచ్చింది.

సుచిత్రాసేన్‌ అసలు పేరు రమా దాస్‌గుప్తా. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు 1931 ఏప్రిల్‌ 6న బెంగాల్‌లోని పబ్నా గ్రామం (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో భాగం)లో ఆమె జన్మించారు. ఆమె తండ్రి కరుణామరు దాస్‌గుప్తా స్థానిక పాఠశాలలో హెడ్మాస్టర్‌గా పనిచేసేవారు. తల్లి ఇందిరా దేవి సాధారణ గృహిణి. వారి అయిదో సంతానం సుచిత్ర. బెంగాలీ ధనిక పారిశ్రామికవేత్త కుమారుడైన దీపానాథ్‌ సేన్‌తో 1947లో ఆమె వివాహం జరిగింది. వారి సంతానమే - తరువాతి రోజుల్లో నటిగా పేరు తెచ్చుకున్న మూన్‌ మూన్‌ సేన్‌. కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలోని 'సిరివెన్నెల'లో కూడా మూన్‌ మూన్‌ సేన్‌ నటించారు. 

కాలం చెరపని తీపి జ్ఞాపకం
బెంగాలీ చిత్రాల్లో స్త్రీత్వానికి ప్రతిరూపంగా సుచిత్రా సేన్‌ పేరు తెచ్చుకున్న తీరు ఆశ్చర్యపరుస్తుంది. సంప్రదాయానికి కట్టుబడి ఉంటూనే, ఆదర్శాల విషయంలో పక్కకు బెసగడానికి ఒప్పుకోని దృఢమైన స్త్రీ పాత్రలకు ఆమె జీవం పోశారు. నిజానికి, ఆమె నటించిన తొలి చిత్రం 'శేష్‌ కొఠారు' (1952) విడుదల కానే లేదు. ఆ మరుసటి ఏడాది నటుడు ఉత్తమ్‌కుమార్‌ సరసన ఆమె నటించిన 'షారే చౌత్తోర్‌' చిత్రం బాక్సాఫీస్‌ హిట్టవడంతో, ఆమె దశ మారిపోయింది. బెంగాలీ సినీ రంగంలో ఉత్తమ్‌కుమార్‌, సుచిత్రలది సూపర్‌హిట్‌ జంటగా పేరు తెచ్చుకుంది. దాదాపుగా రెండు దశాబ్దాల పైచిలుకు ఆ ప్రభంజనం కొనసాగింది. బెంగాలీ ప్రేమకథా చిత్రాలకూ, మెలోడ్రామా చిత్రాలకూ చెరగని చిరునామాగా నిలిచిన ఆమె ఒకటి, రెండు తరాల ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేశారు. 1960లు, '70లలో ఆమె నటించిన చిత్రాల ఘన విజయాలతో అత్యంత పాపులర్‌ బెంగాలీ తారగా అవతరించారు. 

హిందీ చిత్ర రంగంలో కూడా సుచిత్రాసేన్‌ మరిచిపోలేని పాత్రలు పోషించారు. బిమల్‌ రారు రూపొందించిన హిందీ 'దేవ్‌దాస్‌' (1955)లో దిలీప్‌కుమార్‌ సరసన పార్వతి పాత్రలో ఆమె చూపిన అభినయం ఉత్తరాది ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసింది. ఆ తొలి హిందీ చిత్రంతోనే ఆమె దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అలాగే, తరువాతి రోజుల్లో ఆమె నటించిన మరో హిందీ చిత్రం 'ఆంధీ' (1975), అందులో ఆమె పోషించిన రాజకీయ నాయకురాలు ఆర్తీదేవి పాత్ర సంచలనమయ్యాయి. భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఆ సినిమా కథ అల్లుకోవడం చర్చనీయాంశమైంది. ఆ చిత్రంలో సంజీవ్‌ కుమార్‌తో కలసి ఆమె కనిపించే 'తేరే బినా మేరే జిందగీ సే...' అన్న పాట, అందులో ఆమె హావభావాలు ఆల్‌ టైమ్‌ హిట్టే! దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆ సినిమా కూడా నిషేధానికి గురైంది. హృషీకేశ్‌ ముఖర్జీ దర్శకత్వంలోని 'ముసాఫిర్‌' కూడా ఎంతో పేరు తెచ్చింది. 

తీరని సత్యజిత్‌ రే, రాజ్‌కపూర్‌ల కోరిక
వెండితెరపై బలమైన, భిన్నమైన స్త్రీ పాత్రలకు పేరు తెచ్చుకున్న ఆమె నిజజీవితంలోనూ తాను నమ్మిన రీతిలో దృఢమైన నిర్ణయాలు తీసుకొనేవారు. సుచిత్రా సేన్‌తో 'దేవి చౌధురాణి' పేరిట ఓ చిత్రం తీయాలని సత్యజిత్‌ రే భావించారు. కానీ డేట్ల సమస్యతో ఆమె తోసిపుచ్చారు. అలాగే, దర్శక - నటుడు రాజ్‌కపూర్‌ ఇచ్చిన సినిమా ఆఫర్‌ను కూడా ఆమె కాదన్నారు. దిలీప్‌ కుమార్‌ ఆమెకు మంచి మిత్రుడు. అలాగే, దేవానంద్‌తో కూడా 'సర్హద్‌' (1960), 'బొంబయి కా బాబు' (1960) లాంటి చిత్రాల్లో నటించారు. భారీ బడ్జెట్‌ చిత్రాలకు భిన్నంగా ప్రయోగాత్మక చిత్రాలు, దర్శకులతో సినీ జీవిత పయనానికి ఆమె మొగ్గుచూపడం విశేషం. దాదాపు పాతికేళ్ళ పాటు అపరిమిత ప్రభావం చూపిన ఆమె1978లో సినీ రంగానికి గుడ్‌బై చెప్పేశారు. జనజీవితానికి దూరంగా ఉండిపోయారు. రామకృష్ణ మిషన్‌ భావాలకు ఆకర్షితురాలై, వారి సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. 

దశాబ్దాలుగా... జనం దృష్టికి దూరంగా...
సినిమాల నుంచి పక్కకు తప్పుకున్న తరువాత దాదాపు మూడు దశాబ్దాల పైగా ఆమె జనానికీ, ప్రచారానికీ దూరంగా ఉంటూ వచ్చారు. కోల్‌కతా దక్షిణ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జనం కంటికి దూరంగా కాలం గడుపుతూ వచ్చారు. నిజానికి, 2005లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు నివ్వాలని భావించింది. అయితే, అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి వ్యక్తిగతంగా వచ్చి జనం దృష్టిలో పడడం ఇష్టం లేని సుచిత్రాసేన్‌ సినీ రంగంలో ప్రభుత్వమిచ్చే ఆ అత్యున్నత పురస్కారాన్ని సైతం తిరస్కరించడం గమనార్హం. కాగా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తామిచ్చే అత్యున్నత పురస్కారమైన 'వంగ విభూషణ్‌' పురస్కారాన్ని 2012లో ఆమెకు ప్రకటించారు. 

ఎవరి కంటా పడకుండా అనారోగ్యంతో కాలం గడుపుతున్న ఆమెను రహస్యంగా కెమేరాలో చిత్రీకరించడం కోసం ఓ ప్రముఖ బెంగాలీ వార్తా చానల్‌ కొన్నేళ్ళ క్రితం ఓ జర్నలిస్టును ఆసుపత్రి సిబ్బంది వేషంలో ఆమె ఇంటికి కూడా పంపింది. వ్యక్తిగత గోప్యతను గౌరవించని ఈ రహస్య ఆపరేషన్‌ నైతికత మాటెలా ఉన్నా, సుచిత్రా సేన్‌ అంటే బెంగాలీయులకు ఉన్న ఆరాధన, ఎలాగైనా ఆమెను చూడాలన్న కోరికకు ఆ ఉదంతం ఓ మచ్చుతునక. నటుడు, దర్శక - నిర్మాత దేవానంద్‌ ఓ సందర్భంలో చెప్పినట్లు, ''సుచిత్రా సేన్‌ను కేవలం అందగత్తె అని చెప్పి ఊరుకోలేం. అందం కన్నా, ఆమె వ్యక్తిత్వం ఇంకా గొప్పది. అందుకే ఆమె దృఢనిశ్చయంతో ఉన్న వ్యక్తిగా, వీడని ఓ చిక్కుముడిగా అందరినీ ఆకర్షించారు.'' ఆ ఆకర్షణ, ఆ మార్మికతల్ని బెంగాలీ, హిందీ సినీ ప్రియులు ఎన్నటికీ మర్చిపోలేరు. 
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 18th Jan 2014, Saturday, Page No.8)
...............................................

Saturday, January 18, 2014

పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా! - సినీ నటుడు కృష్ణంరాజు

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బి.జె.పి) తరఫున పోటీ చేయనున్నట్లు సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు. కృష్ణంరాజు తెలిపారు. గురువారం రాత్రి ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, ఈ సంగతి వెల్లడించారు. కొన్నాళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కృష్ణంరాజు ఇటీవల మళ్ళీ బి.జె.పి.లో చేరిన సంగతి తెలిసిందే. గతంలో కాకినాడ, నరసాపురం పార్లమెంటరీ స్థానాల నుంచి బి.జె.పి. తరఫున నిలిచి, గెలిచిన ఆయన ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేయనున్నదీ చెప్పలేదు. ''పార్టీ నిర్ణయించిన స్థానంలో పోటీ చేస్తా'' అని ఆయన 'ప్రజాశక్తి'తో అన్నారు. మునుపటి నియోజక వర్గాల్లో తన పని తీరు బాగున్నందు వల్ల ఇప్పుడు ఇతర స్థానాల నుంచి కూడా తనను పోటీ చేయమంటూ అభ్యర్థనలు వస్తున్నాయని ఆయన అంటున్నారు. 

పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు శుక్రవారం నాడు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్న ఆయన, ''నేను బి.జె.పి. కుటుంబంలోని వాణ్ణి. మధ్యలో బయటకు వచ్చినా, ప్రస్తుత రాజకీయాలు నచ్చకపోవడంతో గడచిన నాలుగేళ్ళుగా వాటికి దూరంగా ఉంటున్నా. కానీ, పరిస్థితులు మారుతున్నాయనే చిన్న ఆశతో మళ్ళీ ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నా'' అని వివరించారు. 2009 ఎన్నికల సమయంలో మరో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం పార్టీ' (పి.ఆర్‌.పి)లోకి వెళ్ళిన కృష్ణంరాజు ఆ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో, కొద్ది రోజులకే బయటకు వచ్చేశారు. 

ఇక నుంచి మళ్ళీ బి.జె.పి. పక్షాన క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉంటానన్న కృష్ణంరాజు ''మన రాష్ట్రంలోనే కాక, ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయనున్న''ట్లు తెలిపారు. 'ఒక ఓటు - రెండు రాష్ట్రాలు' అంటూ చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్న బి.జె.పి. అధినాయకత్వం బాటలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. ''అయితే, రాష్ట్ర విభజన సమయంలో ఏ ప్రాంతం వాళ్ళకూ అన్యాయం జరగకూడదు. రెండు ప్రాంతాలకూ న్యాయం చేయాలి. అందు కోసం నా స్వరం వినిపిస్తాను'' అని కృష్ణంరాజు, 'ప్రజాశక్తి'తో అన్నారు. 


''నేను కోస్తా ఆంధ్రలో పుట్టినా, ఇక్కడే హైదరాబాద్‌లో బద్రూకా కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో చదివాను. ఇక్కడ నుంచే మద్రాసులో సినీ రంగానికి వెళ్ళాను. మళ్ళీ ఇక్కడకే వచ్చాను. కాబట్టి, నేను అన్ని ప్రాంతాల వాణ్ణి'' అని ఆయన అన్నారు. కొత్త ఏడాదిలో అవినీతి మూలాలను నిర్మూలించాలన్న ఇతివృత్తథంతో 'ఒక్క అడుగు' పేరిట ఓ సందేశాత్మక సాంఘిక చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభాస్‌, తాను కలిసి ఆ చిత్రంలో నటిస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బి.జె.పి. విజయం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌:

(Published in 'Praja Sakti' daily, 17th Jan 2014, Friday, Page No.4)
.........................

Friday, January 17, 2014

ఆరున్నర దశాబ్దాల సినీ ఆణిముత్యం నటి అంజలీదేవి

ఆరున్నర దశాబ్దాల పైచిలుకుగా తెలుగు వారి ఇంటింటా సుపరిచితురాలైన తొలినాళ్ళ నటీమణి అంజలీదేవి. ఆమె జీవితం, సినీ జీవితం ఊహించని ఎన్నో మలుపులతో సాగింది. 1928 October 28 సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె సినీ జీవితపు శిఖరాలను చూశారు. నిర్మాతగా నమ్మినవారి చేతుల్లో మోసపోయినప్పుడు ఈ రంగంలోని అగాధాల అంచులను కూడా తాకారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇతోధికంగా పాల్గొన్నారు. నటిగా, నిర్మాతగా బాక్సాఫీస్‌ హిట్లు అందించారు. భారీ ఫ్లాపులతో నష్టాలూ చవిచూశారు. ఎంతో సీనియర్‌ నటి అయినా, ఇప్పటి దాకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ 'పద్మ' పురస్కారమూ దక్కకుండానే కన్నుమూశారు. 

స్టేజీ నుంచి సినిమాకు...
అంజలీ దేవి నట జీవితాన్ని గమనిస్తే, ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న ఆమె బాల నటిగా రంగస్థలంపై ఓనమాలు దిద్దుకున్నారు. కాకినాడలోని ప్రసిద్ధ 'యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌' ఆర్గనైజర్‌ అయిన సంగీత దర్శకుడు, రచయిత ఆదినారాయణరావు ఆమెను నటిగా, నాట్యరాణిగా తీర్చిదిద్దారు. తల్లీ, తండ్రీ, గురువు, స్నేహితుడు - అన్నీ తానే అయిన ఆయన పట్ల అంజలీదేవికి ఆరాధనా భావం పెరగడంతో, అనంతరం 1942లో వారు పెళ్ళి చేసుకున్నారు. 

మొదట పలు ప్రయత్నాలు జరిగినా, అవేవీ ఫలించక చివరకు చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలోని 'గొల్లభామ' (1947) చిత్రం ద్వారా అంజలీదేవి సినీ రంగ ప్రవేశం జరిగింది. ఓ నాటక ప్రదర్శనలో అంజలీదేవి అభినయం చూసిన ఆయన ఆమెకు సినిమా అవకాశమిచ్చారు. ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే, కొన్ని వందల చిత్రాల్లో అమ్మ పాత్రలకూ, సాత్త్వికమైన పాత్రలనూ పోషించిన అంజలీదేవి మొదట్లో అందానికీ, ఆకర్షణకు ప్రాధాన్యమున్న వ్యాంప్‌ పాత్రలతో సినీ జీవితం ఆరంభించారంటే ఆశ్చర్యం కలుగుతుంది. తొలి చిత్రం విడుదల కాకుండానే ఆమెకు ఏకంగా నాలుగు సినిమాల్లో అవకాశం రావడం విచిత్రం. 'గొల్లభామ'లో మోహినిగా, అక్కినేని నటించిన 'బాలరాజు' (1948)లో అందగత్తెగా, 'కీలుగుఱ్ఱం' (1949)లో రాక్షస కన్యగా ఆమె ప్రేక్షకుల మనస్సు దోచారు.

మంచి పాత్రలతో మారిన ఇమేజ్‌
అంజలీదేవికి ఉన్న తొలి రోజుల నాటి వ్యాంప్‌ ఇమేజ్‌ను మార్చిన సినిమా ఘంటసాల బలరామయ్య దర్శకత్వంలో అక్కినేనితో నటించిన 'శ్రీలక్ష్మమ్మ కథ' (1950). అనంతరం ఆమె సీత, సుమతి, రుక్మిణి లాంటి పవిత్రమైన పాత్రలు చేశారు. పుల్లయ్య దర్శకత్వంలోనే ఎన్టీయార్‌ శ్రీరాముడిగా, అంజలీదేవి సీతాదేవిగా నటించిన 'లవకుశ' ఆమెకు పెద్ద ఇమేజ్‌ను సంపాదించి పెట్టింది. 'తెలుగింటి సీతమ్మ'గా పేరు తెచ్చింది. 'భక్త ప్రహ్లాద', 'భక్త తుకారామ్‌', 'బడి పంతులు' లాంటి చిత్రాలు ఆమెను తెలుగువారు తమ ఇంటి మనిషిగా గుర్తు పెట్టుకొనేలా చేశాయి. కథానాయిక నుంచి క్రమంగా తల్లి పాత్రలకు ఆమె మారారు. అందరికీ ఆత్మీయంగా మెలిగారు. 

చిరస్మరణీయ చిత్రాల నిర్మాత 
సినీ పరిశ్రమలోకి వచ్చిన మూడేళ్ళకే అంజలీదేవి నిర్మాత అయ్యారు. అంజలీ దేవి, ఆమె భర్త ఆదినారాయణరావు, అక్కినేని, మేకప్‌మ్యాన్‌ గోవిందరావు భాగస్వాములుగా అశ్వినీ పిక్చర్స్‌ పతాకంపై 'మాయలమారి' చిత్రాన్ని నిర్మించారు. కానీ, తరువాత ఆ చిత్ర నిర్మాణ సంస్థ మూతపడింది. అటుపైన అంజలి దంపతులు 1953లో 'అంజలీ పిక్చర్స్‌' పేరిట స్వీయ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ పతాకంపై తీసిన 'పరదేశి' సినిమా ద్వారా తమిళ నటుడు శివాజీ గణేశన్‌ను తెలుగు వారికి పరిచయం చేశారు. ఆ కృతజ్ఞతతో ఆయన తరువాతి రోజుల్లో ఆమె నిర్మించిన 'భక్త తుకారామ్‌'లో ఛత్రపతి శివాజీ మహారాజుగా అతిథి పాత్రలో ఉచితంగా నటించారు. 

సొంత నిర్మాణ సంస్థపై ఆ దంపతులు దాదాపు పాతిక పైగా చిత్రాలు నిర్మించారు. 'అనార్కలి', బాక్సాఫీస్‌ బంపర్‌ హిట్‌ 'సువర్ణ సుందరి', 'స్వర్ణ మంజరి', 'సతీ సుమతి', 'సతీ సక్కుబాయి', 'భక్త తుకారామ్‌', 'మహాకవి క్షేత్రయ్య', 'చండీప్రియ' తదితర చిత్రాలు వారి నిర్మాణంలో వచ్చినవే. 

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ వారు చిత్ర నిర్మాణం చేశారు. తమిళంలో ఎమ్జీయార్‌, శివాజీ గణేశన్‌, జెమినీ గణేశన్‌ లాంటి స్టార్ల సరసన నటించిన అంజలీదేవి యాభయ్యో దశకంలో ఓ అరడజను హిందీ చిత్రాల్లోనూ హీరోయిన్‌. ఎన్టీ రామారావు హిందీలో నటించిన ఏకైక సాంఘిక చిత్రం 'నయా ఆద్మీ'లో ఆమే హీరోయిన్‌. 'ఉస్తాద్‌', 'ఏక్‌ థీ రాజా', 'లడ్కీ', 'దేవ్‌తా' లాంటివి ఆమె నటించిన మరికొన్ని హిందీ చిత్రాలు. 





ఆత్మీయ పాత్రల అమ్మ

అప్పట్లో రోజూ రెండు కాల్షీట్లతో, రోజుకు పదహారు గంటలు పని చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఆమె. కథానాయిక నుంచి క్యారెక్టర్‌ వేషాలకు మారిన తరువాత వదినగా, అమ్మగా అంజలీదేవి నటించిన సినిమాలకు లెక్కలేదు. బి.ఎన్‌. రెడ్డి దర్శకత్వంలోని 'రంగుల రాట్నం', ఎన్టీయార్‌తో 'బడి పంతులు' (దర్శకుడు పి.సి. రెడ్డి), ఎస్వీ రంగారావుతో 'తాత - మనవడు' (దర్శకుడు దాసరి నారాయణరావు), కాంచన నటించిన 'కల్యాణ మండపం' (దర్శకుడు వి. మధుసూదనరావు) లాంటివి ఆమె నటజీవితంలో మేలిముత్యాలయ్యాయి. 

నిజానికి, వంద సినిమాలు పూర్తయ్యాక ఒక దశలో ఆమె సినీ జీవితం నుంచి రిటైరై పోవాలని కూడా అనుకున్నారు. ఆ ఆలోచనతో కొత్త చిత్రాలు అంగీకరించడం కూడా ఆపారు. కానీ, అదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ వారి దాడులతో చిక్కుల్లో పడ్డారు. మరోపక్క నటి వైజయంతిమాలతో హిందీలో తీసిన 'ఫూలోంకా సేజ్‌' చిత్రంలో ఫైనాన్షియర్లు మోసం చేయడంతో ఆస్తులన్నీ కోర్టు స్వాధీనమయ్యాయి. అయినా, అటు తమిళ చిత్ర సీమ, ఇటు తెలుగు సినీ సీమ ఆమెను ఆదరించడంతో మళ్ళీ పుంజుకున్నారు. 

చిత్ర నిర్మాణ రంగంలో దెబ్బతిన్న సమయంలో 1963లో సీనియర్‌ నటుడు చిత్తూరు వి. నాగయ్య ద్వారా సత్యసాయిబాబాకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయనకు భక్తురాలిగా మారిన ఆమె చెన్నైలో తమ ఇంటిని ఆనుకొనే ఉన్న కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఆయన ఆశ్రమం 'సుందరం' నిర్మాణానికి రాసి ఇచ్చేశారు. 'షిర్డీ సాయి - పత్రి సాయి దివ్యకథ' అనే సీరియల్‌ను కూడా స్వయంగా నటిస్తూ, నిర్మించారు. 

తోటి తారలతో అనుబంధం
సౌతిండియన్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు 1950 - 51లో ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆ గౌరవం దక్కిన తొలి మహిళ అంజలీదేవే! అలాగే, దక్షిణ భారత చలనచిత్ర కళాకారుల సంఘం (నడిగర సంగంగా సుప్రసిద్ధం)కి 1959లో అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. తెలుగు సినీ రంగంలో తొలినాళ్ళ గ్లామర్‌ తార అయిన అంజలీదేవికి తాను ఏకలవ్య శిష్యురాలినని తరువాతి తరం నటి సావిత్రి చెప్పేవారు. 'గొల్లభామ' చిత్రంలో అంజలీదేవి చేసిన నృత్యాలను ఆమె సభా వేదికలపై చూస్తూ ఉండేవారు. సావిత్రితో పాటు ఆ నాటి నటీమణులైన జమున, 'షావుకారు' జానకి, కృష్ణకుమారి, తరువాత సినీ రంగానికి వచ్చిన కాంచన, శారద లాంటి వారందరూ ఆమె అంటే ఇప్పటికీ అపరిమితమైన ప్రేమాభిమానాలు. 

చెన్నైలో ఒకే ప్రాంతంలో దగ్గరి ఇళ్ళు కావడంతో నటి - నిర్మాత సి. కృష్ణవేణితో అంజలిది ప్రత్యేక అనుబంధం. ఆ మధ్య మరణించిన నటి టి.జి. కమలాదేవితో కలసి చిత్తూరు వి. నాగయ్య మెమోరియల్‌ అవార్డు పేరిట ఏటా చెన్నైలో అవార్డులు అందిస్తూ, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తూ వచ్చారు. అలాగే, తొలితరం సినీ జర్నలిస్టు కీర్తిశేషులు ఇంటూరి వెంకటేశ్వరరావు మీద గౌరవంతో, ఏటా ఓ ఉత్తమ సినీ జర్నలిస్టుకు సత్కారం చేసే కార్యక్రమంలో విధిగా పాల్గొనేవారు. 

సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక తరహాలు నాలుగింటిలోనూ పేరు తెచ్చుకోవడం, తెలుగులో లాగానే తమిళంలోనూ సుపరిచిత నటిగా వెలగడం అంజలీదేవి నటజీవితంలోని విశేషం. 1946వ సంవత్సరం భోగి పండుగ రోజున అంజలీదేవి, ఆదినారాయణరావు దంపతులు మద్రాసులో దిగారు. సరిగ్గా అరవై ఏడేళ్ళ తరువాత అదే భోగి రోజున మధ్యాహ్నం అంజలీదేవి అదే చెన్నపట్నంలో కన్నుమూయడం. కాకతాళీయం. ఒక విశిష్ట నటిగా, నిర్మాతగానే కాక, తరువాతి తరం తారలెందరికో మార్గనిర్దేశనం చేసిన వ్యక్తిగా, మనసున్న మంచి మనిషిగా అంజలీదేవి చిరకాలం గుర్తుంటారు. 

- రెంటాల జయదేవ

(Published in 'Praja Sakti' daily, 14th Jan 2014, Tuesday, Page No.10)
...............................................................