జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, December 27, 2014

బాలచందర్‌ నుంచి...ఎవరూ సరిగ్గా నేర్చుకోలేదేమో!

బాలచందర్‌ నుంచి...ఎవరూ సరిగ్గా నేర్చుకోలేదేమో!
సి. మృణాళిని (ప్రముఖ రచయిత్రి, విశ్లేషకురాలు)

తెలుగు సినిమాల్లో స్త్రీలను బాగా చూపించడం (అంటే అందంగా కాదు) అనేది ఎవరూ పెద్దగా ఆశించే విషయం కాదు. అలా ఆశించిన వారికి ఆశాభంగమే. కాకపోతే ‘‘స్త్రీలను కంటతడి పెట్టించే సినిమాల’’నే స్త్రీ ప్రాధాన్య సినిమాలుగా భావించే సంప్రదాయం మనది. అలా ఏడ్పించే సినిమాలకు ఏమీ కొదవలేదు. అయితే, అలా ఏడిపించడం కంటే, దుఃఖించే సందర్భాల్లోనూ మనోనిబ్బరంతో, పరిణతితో ప్రవర్తించే స్త్రీలను సృష్టించిన అపురూప దర్శకుడు కె. బాలచందర్. ఆయన సినిమాలన్నిటిలోనూ ఆధునిక స్త్రీలో ఉన్న ఆత్మవిశ్వాసం, పరిణతితో కూడిన ఆలోచనా విధానం కనిపిస్తాయి. బాలచందర్‌గారికి స్త్రీల పట్ల అపారమైన గౌరవం, స్త్రీలకు ఈ సమాజంలో ఎదురవుతున్న పరిస్థితుల పట్ల అసహనం, వారి పట్ల సానుభూతి పుష్కలంగా ఉన్నాయి. అయితే, బహుశా ఆ సానుభూతి మాత్రమే ఉండి ఉంటే, ఈ రోజు మహిళా ప్రేక్షకులు ఆయన్ని అంతగా గుర్తు పెట్టుకోనవసరం లేదు.

 కానీ స్త్రీలను వ్యక్తులుగా చూసిన, అర్థం చేసుకున్న ఒక అపూర్వమైన దృష్టి ఆయనలో ఉంది. స్త్రీలలోని సున్నితత్వాన్ని ఇతరులు బలహీనతగా చూపిస్తే, ఆయన అదే సున్నితత్వాన్ని ఆమె బలంగా చూపారు. ఇతర దర్శకులకూ, ఆయనకూ బహుశా తేడా ఇక్కడే ఉంది. ముఖ్యంగా అంతులేని కథ, ఇది కథకాదు, గుప్పెడు మనసు, మరో చరిత్ర (మాధవి పాత్ర) మొదలైన సినిమాలు చూసినప్పుడు ఈ అభిప్రాయం బలపడుతుంది.స్త్రీ పాత్రల చిత్రణలో ఆయన ప్రత్యేకత వారిని దేవతలుగా కాక మనుషులుగా చూపడం. 1976లో వచ్చిన ‘అంతులేని కథ’ ఆనాటి స్త్రీలెందరి జీవితాలకో ప్రాతినిధ్యం వహించిన చిత్రం. అప్పుడప్పుడే స్త్రీలు కుటుంబ భారాన్ని మోయడం ప్రారంభమైంది. బహుశా మరో దర్శకుడైతే ఆ స్త్రీ (జయప్రద)ని సంపూర్ణ విషాదజీవిగా, స్వీయకరుణతో కుమిలిపోయేదానిగా, ఇంటిల్లిపాదినీ ఒక్క మాటా అనని సహనశీలిగా... అంటే అతిమానుష జీవిగా (లార్జర్ దేన్ లైఫ్) చూపించేవారేమో.

కానీ బాలచందర్ ఆమెను రక్తమాంసాలున్న, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన స్త్రీగా, అత్యంత సహజంగా చిత్రించారు. ఇంట్లో వాళ్లకు ఆమె ‘పెద్ద పులి’, పిల్లలకైతే ‘రాక్షసి’ కూడా. బయటకు వెళ్లి పదిమందిలో కూర్చుని పని చేసే తనకు మంచి దుస్తులు వేసుకోవాల్సిన అవసరం, హక్కూ కూడా ఉన్నాయని భావించే వాస్తవిక దృష్టిని చూపడం మరవలేదు దర్శకుడు. ఇంతకూ ఆమె చేసిన త్యాగాలు చిన్నవేమీ కాదు. తన ప్రేమను, వివాహాన్ని, విరామాన్ని అన్నిటినీ కోల్పోతుంది; తన శ్రమను సునాయాసంగా తక్కిన వాళ్ల కోసం ఖర్చు చేస్తుంది. కానీ ఒక త్యాగమూర్తిలాగా ప్రవర్తించదు; కుటుంబం పట్ల తన బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించుకున్నాక, దాని నిర్వహణలో కలిగే మనస్తాపాలు వంటివి కూడా ప్రతి స్త్రీ అనుభవిస్తుందనీ, కుటుంబం, తన జీవితం - ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణను మనో నిబ్బరంతో ఎదుర్కొంటుందనీ చిత్రించడం ఆయన చేసిన గొప్ప పని.

అంతేకానీ, స్త్రీ అంటే భూదేవి వంటి సహనమూర్తి అనే టైప్స్ లాగా ఆయన చిత్రించలేదు.ఇదే దృక్పథం ‘గుప్పెడు మనసు’ చిత్రంలో సుజాత పాత్రలో కూడ కనిపిస్తుంది. సుజాత ప్రసిద్ధ రచయిత్రి. తన నవలల్లో స్త్రీ పాత్రలకు ఆమె పేరు పొందింది. అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. కానీ నిజ జీవితంలో సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు తనలోని రచయిత్రి, తనూ వేర్వేరేమో అనుకుంటుంది. తను ఎంతగానో ప్రేమించే భర్త, తామిద్దరు కూతురిగా భావిస్తున్న యువతితో క్షణాకావేశంలో దైహిక సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేకపోతుంది. క్షమించలేకపోతుంది. అతనితో కాపురం చేయలేకపోతుంది. అయితే సుజాతలో ఉన్న రచయిత్రి, సరితను మాత్రం అర్థం చేసుకోగలుగుతుంది. ఆ అమ్మాయి తప్పులేదనీ, తప్పంతా తన భర్తదేననీ భావిస్తుంది. తన కలలో సరితను చనిపోయినట్లుగా ఊహించుకుని ఆనందించినందుకు జాగ్రదావస్థలో తనని తానే అసహ్యించుకుంటుంది. సరితలో కూడ సుజాత పట్ల గౌరవం అమితంగా ఉన్నందువల్లే, శరత్‌బాబుతో ఒక్కరాత్రి సంబంధం వల్ల తనకు పుట్టిన పాపకు విద్య (సుజాత పేరు) అని పేరు పెట్టుకుంటుంది.

 అన్నిటికంటే ఇక్కడ చెప్పదగ్గ విషయం సరిత పాత్ర. తన తండ్రి వయస్సుగలిగిన వ్యక్తి అతను; అతను తనను లోబరచుకోవడానికి పూనుకున్నప్పుడు లొంగిపోయింది. అది పరిపక్వత లేని తన తప్పు కాదని ఇతరులు చెప్పినా, ఒప్పుకోదు. తనకు కూడ మనసులో ఎక్కడో అతని పట్ల కోరిక లేకపోతే వ్యతిరేకించి ఉండేది కదా. కానీ ఎందుకు ఆనందంగా లొంగిపోయింది? కనక తప్పు తనలోనూ ఉందని అనుకుంటుంది. అందుకే ఈ సంఘటనను పట్టించుకోకుండా తనని వివాహం చేసుకుంటానని వచ్చిన సుజాత తమ్ముడిని తిరస్కరిస్తుంది. అందరూ మంచి వాళ్లే. కానీ ఒకే బలహీన క్షణం ఇంతమంది జీవితాలనూ నాశనం చేసింది. పితృస్వామ్య వ్యవస్థలో సహజంగానే ఏ ఆపద జరి గినా, ఎక్కువ బాధపడేది స్త్రీలే. కానీ ఆ స్త్రీలిద్దరూ ఈ దుర్భరమైన సన్నివేశంలోనూ, ఎంత హుందాగా ప్రవర్తిస్తారో చూసినపుడు, బాలచందర్ వంటి దర్శకులు మనకెంత అవసరం కదా అనిపిస్తుంది.

ఇక మూడో చిత్రం ‘ఇది కథ కాదు’. ఇది నిజంగా సంచలనాత్మక చిత్రమే అన్ని విధాలా. పురుషులతో స్త్రీ సంబంధాల్లో ఎన్ని సంక్షిష్టతలున్నాయో అన్నిటినీ చూపిస్తూ (చిరంజీవి, శరత్‌బాబు, కమల్‌హాసన్‌లతో జయసుధ అనుబంధం), స్త్రీల మధ్య అత్యంత సహజంగా ఉండ గలిగిన స్నేహబంధాన్ని (ముఖ్యంగా జయసుధ, అత్తగారి మధ్య) మనకు గుర్తు చేస్తూ, అత్యంత ఆలోచనాత్మకమైన సినిమాగా దీన్ని రూపొందించారు. ఇక్కడ కూడ జయసుధ పాత్ర కరుణాస్పదమై మాత్రమే ఉండేది మరో దర్శకుడి చేతిలో. కానీ బాలచందర్ చేతుల్లో మనందరి గౌరవం పొందేలా ఆమె ఉంటుంది. అసాధారణమైన ఇందులోని అత్తగారి పాత్ర ఈనాడు స్త్రీవాదులు చెప్పే ‘స్త్రీల ఐక్యత’కు ప్రోటోటైపా అన్నట్టుంటుంది.

 జయసుధ కృంగిపోయే పరిస్థితులు ఇందులో చాలానే వస్తాయి. కానీ ప్రతి సన్నివేశం నుంచీ మళ్లీ తనని తాను పునరుజ్జీవింపజేసుకునే ఒక సహజమైన ధైర్యం ఆమెలో చూపించి, ఆమె పట్ల మనకు అపారమైన గౌరవం కలిగిస్తారు దర్శకుడు. బహుశా మరో రకం దర్శకుడైతే, తనని ఎంతగానో ప్రేమించే కమలహాసన్‌ను ఆమె జీవిత భాగస్వామిని చేసుకున్నట్టు చిత్రించేవారేమో. కానీ, ఏ మగవాడూ అక్కర్లేకుండా తన జీవితాన్ని కొనసాగించగలనన్న ఆత్మ విశ్వాసాన్ని ఈమెలో చూపించి, ఒక ఆధునిక స్త్రీ ఎలా ఉండగలదో ఆయన మనకు చెప్పారు. చివర అత్తగారు ఆమెకు తోడుగా నిలవడంతో బంగారానికి తావి అబ్బినట్టే అయింది.

‘మరో చరిత్ర’లో మాధవి పాత్రలోనూ, ‘ఆకలిరాజ్యం’లో శ్రీదేవి పాత్రలోనూ ఒక ఆధునిక స్త్రీ జీవితంలోని సంఘర్షణ, దాన్ని ఆమె సంయమనంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్న తీరు ఆయనకు స్త్రీల పట్ల ఎంత గౌరవం, నమ్మకం ఉన్నాయో తెలియజేసేవే. సింధుభైరవి, అపూర్వ రాగంగళ్ (తెలు గులో దాసరి గారి ‘తూర్పు పడమర’), ఆడవాళ్లూ మీకు జోహార్లు, జీవితరంగం మొదలైన మరెన్నో సినిమాలు ఆయన స్త్రీలను తను ఎంత వాస్తవిక దృష్టితో, అవగాహనతో చిత్రించారో రుజువు చేస్తాయి. సినిమాల్లో నాయికల ఆహార్యంలో కూడ ఆయన ఎంత సహజత్వాన్ని, హుందాతనాన్ని పాటించడానికి శ్రద్ధ తీసుకునేవారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.బాలచందర్‌గారిని అభిమానించేవారు, గురువుగా భావించేవారూ చాలా మందే ఉన్నారు. కానీ ఆయన నుంచి, స్త్రీలను ఎలా చిత్రించాలో మాత్రం బహుశా ఎవ్వరూ సరిగ్గా నేర్చుకోలేదేమో!

(Published in 'Sakshi' daily, 24th Dec 2014)
.......................................

0 వ్యాఖ్యలు: