జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, December 30, 2014

ఆ విషయంలో... బాలచందర్ నాకు స్ఫూర్తి: దాసరి

ఆ విషయంలో...ఆయనే నాకు స్ఫూర్తి: దాసరి

బాలచందర్ గారి లాంటి ఒక మహాదర్శకుడు కన్నుమూయడంతో భారతదేశంలో ఒక గొప్ప క్రియేటివ్ మ్యాన్ తన శకం ముగించినట్లయింది. నాకు ఆనాటి మద్రాసులో మొట్టమొదటి దర్శక మిత్రుడు బాలచందర్ గారు. మేము ఎప్పుడు కలసి మాట్లాడుకున్నా మా కబుర్లు నాటకాలు, సినిమాల గురించే సాగేవి. నిజానికి, మా ఇద్దరి జీవితాలూ చాలా ప్యారలల్‌గా నడిచాయి. సినిమాల కోసం ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నేనూ అలాగే సినిమా కోసం నా ఉద్యోగానికి రాజీనామా చేశాను.

ఇద్దరం నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్ళమే. రంగస్థలంపై నటుడిగా, దర్శకుడిగా కొన్ని వందల ప్రదర్శనలు చేశారాయన. నేనూ అలాగే చేశాను. సినిమాల్లో ఆయన మొదట మాటల రచయితగా ప్రారంభించి ఆ తరువాత దర్శకుడయ్యారు. నేనూ అంతే! అందుకే, నా కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథి అయితే, ఆయన కార్యక్రమాలకు నేను ముఖ్య అతిథిగా వెళ్ళేవాణ్ణి. ఆయనను చివరిసారిగా శిల్పకళావేదికలో మా కార్యక్రమానికి వచ్చినప్పుడు కలిశాను.

ఆయన చాలాసార్లు ‘నారాయణరావు గారూ! మీరంటే నాకు చాలా ఇష్టం’ అనేవారు. కారణం ఏమిటని అడిగితే... ‘మీరూ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడరు. నేనూ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడను. ఇద్దరం కొత్తవాళ్ళ కోసం, చిన్నవాళ్ళ కోసం కథలు రాసుకొని సినిమాలు తీస్తుంటాం. అలాగే తీసుకుందాం’ అనేవారు. నిజం చెప్పాలంటే, అలా కొత్తవాళ్ళతో, చిన్నవాళ్ళతో కొత్త తరహా కథలు రాసుకొని సినిమాలు తీయడంలో నాకు స్ఫూర్తి ఆయనే! బాలచందర్ సినీ జీవితాన్ని గమనిస్తే, ఆయన తీసుకొచ్చిన నటీనటులు స్టార్స్ అయ్యేవారు. అలా తన స్కూల్ నుంచి వచ్చిన స్టార్స్‌తో ఆయన సినిమాలు తీశారే తప్ప, ఒక్క శివాజీ గణేశన్ మినహా పెద్ద స్టార్లతో ఎప్పుడూ తీయలేదు! గమనిస్తే - ఆయన తీసుకొచ్చిన నటులు రజనీకాంత్, కమలహాసన్‌లు భారతదేశానికే సూపర్‌స్టార్లయ్యారు. అలాగే, ప్రకాశ్‌రాజ్ కూడా! ఇలా ఎంతోమంది ఆర్టిస్టుల్ని స్టార్స్‌ను చేశారాయన.

సమాజంలో జరుగుతున్న అంశాలనూ, కొన్ని చేదు నిజాలనూ మనం సినిమా ద్వారా చెప్పాలని బాలచందర్ గారు నాతో ఎప్పుడూ అంటూ ఉండేవారు. నా సినిమాల్లో నేనూ ఆ పని చేస్తుండేవాణ్ణి కాబట్టి, ఆయన సంతోషించేవారు. మనిద్దరి కోణాలూ ఒకేలా ఉన్నాయనేవారు. ఆయన నాటకాలు ‘మేజర్ చంద్రకాంత్’ లాంటివి ఆయనతో కలసి కూర్చొని, చూసేవాణ్ణి. నా ప్రతి సినిమా ఆయనకు చూపించేవాణ్ణి. నాకు బాగా గుర్తు.     నా ‘మేఘసందేశం’ చిత్రం చూసిన ఆయన ‘నారాయణరావ్! నేను ఇన్‌సై్పర్ అయ్యాను’ అన్నారు. ఒక దర్శకుడి నుంచి మరో దర్శకుడికి దక్కే అరుదైన ప్రశంస అది. ఆ మాటతో ఆగకుండా ఆయన ఆ కథలోని ఆత్మ తీసుకొని, తమిళంలో ‘సింధుభైరవి’ చిత్రం తీశారు. ‘మేఘసందేశం’ మోడల్‌లో, దానికి బాగా దగ్గరగా ఉండేలా ఆ సినిమా తీయడమే కాక, ఆ మాట చెప్పే చేయడం దర్శకుడిగా ఆయన సంస్కారం, గొప్పదనం.

ఇక, ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా, ఆయన తొలి రోజుల్లో తమిళంలో తీసిన సంచలనాత్మక ‘అరంగేట్రం’ చిత్రం చాలా బాగుంటుంది. ఇక, ఆయన సినిమా చూసి, ఆ కథ తెలుగులో నేను చేయాలనుకున్న సందర్భాలూ ఒకటి రెండు లేకపోలేదు. ఆయన అద్భుతంగా తీసిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ను తెలుగులో నేను ‘తూర్పు - పడమర’గా తీశా.

పోస్టర్ మీద దర్శకుడి పేరు ప్రత్యేకంగా కనిపించేలా వేయడమనే సంస్కృతిని ఆయన తమిళంలో, నేను తెలుగులో తెచ్చాం. ఆయన మాత్రం సెంటిమెంట్‌గా తన పేరును కిందే వేసుకొనేవారు. నేను మాత్రం ‘అందరి కన్నా డెరైక్టరే టాప్ కాబట్టి, నా పేరు పోస్టర్‌లో పైనే వేసుకుంటా’ అని ఆయనతో అంటుండేవాణ్ణి.

ఆయననూ, నన్నూ, కన్నడ దిగ్దర్శకుడు పుట్టణ్ణ కణగల్‌నూ ‘డెరైక్టర్స్ ఆఫ్ ది సౌత్’ అంటూ అప్పట్లో అందరూ గొప్పగా ప్రస్తావించేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా... ఒక పెద్ద హీరోకు ఉండేంత క్రేజున్న దర్శకుడు - బాలచందర్ గారు. ఆయనను చూసి ఈ తరం ఏం నేర్చుకోవాలంటే... దర్శకుడనేవాడు ఎప్పుడూ ఏ హీరో మోకాళ్ళ దగ్గరా ఉండకూడదని నేర్చుకోవాలి. మొదటి నుంచి చివరి దాకా అలాగే సింహంలా జీవించిన అలాంటి ఒక మహా వ్యక్తి ఈ రోజున లేరన్న నిజాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలు జీర్ణించుకోలేవు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

(సంభాషణ - రెంటాల జయదేవ)

Published in 'Sakshi' daily, 24th Dec 2014
...............................................

0 వ్యాఖ్యలు: