జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, December 16, 2014

చక్రి మృతికి స్థూలకాయమే కారణమా?


నలభై ఏళ్ళ చిన్న వయసులోనే సంగీత దర్శకుడు చక్రి కన్నుమూయడానికి కారణం ఏమిటి? వ్యక్తిగతంగా అందరితో స్నేహంగా వ్యవహరించే చక్రి తన ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టలేదా? సినీ వర్గాలు ఆ మాటే అంటున్నాయి. సినీ రంగానికి వచ్చిన తొలిరోజుల్లో పాతికేళ్ళ పైచిలుకు వయసులో ఆయన ముద్దుగా, బొద్దుగా ఉండేవారు. అయితే, క్రమంగా ఆహార విహారాల్లోని మార్పు, సినీ రంగంలో తీరిక లేని పనితో వేళాపాళా లేని జీవనవిధానం కొంత దెబ్బతీశాయని చెప్పవచ్చు. క్రమంగా అది స్థూలకాయానికి దారి తీసింది. భోజన ప్రియత్వం కూడా అందుకు తోడైంది.
 
హిందీ చిత్రసీమలోని బప్పీలహరి లాగా చక్రి కూడా లావుగా తయారైనా, తనదైన ప్రత్యేక శైలి దుస్తులు, చేతికి లావాటి బంగారు గొలుసులతో వినూత్నంగా కనిపించేవారు. క్రమంగా ఆయన రూపంతో పాటు, ముఖం రంగులో కూడా కొంత మార్పు వస్తూ వచ్చింది. అయితే, అన్ని విధాలుగా తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చక్రి ఎప్పుడూ ఉత్సాహంగా చెప్పేవారు. లైపోసక్షన్ లాంటివి చేయించుకోవాలనుకున్నా, దుష్ఫలితాలు ఉంటాయేమోనని చక్రి బాధపడ్డారు.
 
 అయితే, శరీరంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ కావడం చివరకు ఆయనకు ప్రాణాంతకంగా పరిణమించినట్లు కనిపిస్తోంది. చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఆదివారం కూడా అర్ధరాత్రి దాటే వరకు చక్రి తన రికార్డింగ్ పనుల్లో బిజీగా గడిపినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఇంటికి తిరిగొచ్చిన ఆయన నిద్ర పోయారు. ఆ నిద్రలోనే తీవ్రమైన గుండెపోటుకు గురై ఆయన కన్నుమూసినట్లు వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గించుకోవాలని గతంలో పలువురు సన్నిహితులు సలహా ఇచ్చినా, చివరకు అది చక్రికి ప్రాణాంతకంగా పరిణమించిందని భావించవచ్చు.
...............................

0 వ్యాఖ్యలు: