జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, December 10, 2014

మనకు ఎరుకలేని మనోడు - పైడి జైరాజ్

మనకు ఎరుకలేని మనోడు!

పైడి జైరాజ్... మూకీల కాలం నుంచి మొన్నటి దాకా ఆరున్నర దశాబ్దాల పైగా సినీ రంగంలో కృషి చేస్తూ మన కళ్ళ ముందే ఉన్న నటుడు, పదహారణాల తెలుగువాడు. తొలి రోజుల్లోనే బొంబాయి వెళ్ళి, అక్కడే స్థిరపడిపోవడంతో ఆయన గురించి ఇక్కడ తెలిసింది కొంతే! అదీ కొద్దిమందికే! ‘ఫాల్కే అవార్డ్’ కూడా అందుకున్న ఆయన జీవితం అచ్చం సినిమా కథే...

 సుమారు డజను మూకీ చిత్రాల్లో, హిందీ, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ భాషల్లో కలిపి 200 దాకా టాకీ చిత్రాల్లో నటించి, భౌతికంగా దూరమైన పైడిపతి జైరుల నాయుడు పుట్టింది ఇప్పటికి సరిగ్గా 105 ఏళ్ళ క్రితం! కరీమ్‌నగర్‌లో 1909 సెప్టెంబర్ 28న ఆయన జన్మించారు. పౌర పనుల విభాగంలో అకౌంటెంట్‌గా తండ్రి పనిచేసేవారు. హైదరాబాద్‌లో స్కూల్ చదువు ముగించుకున్న జైరాజ్ ఇక్కడే బి.ఎస్సీ డిగ్రీ కోసం నిజామ్స్ కాలేజ్‌లో చేరారు. కాలేజీ రోజుల్లో షేక్‌స్పియర్ నాటకాల్లో పాత్రలు పోషించి, చదువు కన్నా నటన మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. బాగా చదివి, డాక్టర్ కావాలన్న ఇంట్లోవాళ్ళ అభీష్టానికి భిన్నంగా జైరాజ్ అర్ధంతరంగానే కాలేజీ చదువుకు స్వస్తి పలికి, 1928 ప్రాంతంలో బొంబాయికెళ్ళారు.

 జీవనోపాధికి డాక్‌యార్డ్‌లలో చిన్నాచితకా పనులు చేస్తూ వచ్చారు. తోటి విద్యార్థి, స్నేహితుడైన రంగయ్య ఆ పరిస్థితుల్లో జైరాజ్‌ను ఆదుకున్నారు. చూడడానికి అందంగా, మంచి ఒడ్డూ పొడుగుతో, దృఢంగా ఉండే జైరాజ్ తెరపై బాగుంటారని సినీ పంపిణీ సంస్థ ‘మహావీర్ ఫోటోప్లేస్’ మేనేజర్ రంగయ్య భావించారు. జెరాజ్‌ను ప్రోత్సహించారు. మరాఠీ రచయిత - నాటకకర్త మామా వారీర్కర్ అప్పుడప్పుడే మొగ్గ విచ్చుకుంటున్న సినీ పరిశ్రమలో భవిత బాగుంటుందంటూ, కులీనుడైన జైరాజ్‌ను నెట్టారు.

 మూడు రూపాయల జీతం... మూకీల్లో డూప్...

 అప్పట్లో జైరాజ్ ‘యంగ్ ఇండియా పిక్చర్స్’లో పూర్తి కాలిక ఉద్యోగిగా నెలవారీ జీతంపై పనిచేశారు. ఆ రోజుల్లో ఆయనకు రెండు పూటలా తిండి పెట్టి, నెలకు 3 రూపాయల జీతమిచ్చేవారు. గిర్గామ్‌లో మరో నలుగురితో కలసి ఒకే గది పంచుకొని, కాలం నెట్టేయాల్సి వచ్చేది. కెమేరా బృందానికి తోడ్పాటు, సెట్స్ వ్యవహారాలు చక్కదిద్దడం, ఎడిటింగ్‌లో సాయపడడం, ల్యాబ్‌లలో సహాయకుడిగా పని చేయడం - ఇలా తొలి రోజుల్లో ప్రతి పనీ చేసేవారు. సినిమాలకు పోస్టర్లు చిత్రించే పని కూడా చేశారు. అలా పోస్టర్లు చిత్రీకరిస్తూ వివిధ స్టూడియోలకు వెళ్ళడంతో, ఆయన రూపురేఖలు చూసి, అనేక మూకీల్లో అవకాశాలిచ్చారు.


 ఇవాళ ఫాల్కే అవార్డు గ్రహీతగా తెలిసిన జైరాజ్ కెరీర్ ప్రారంభంలో డూప్‌గా కూడా నటించారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన తొలి చిత్రం ‘జగ్మగాతీ జవానీ’ (1929) అనే మూకీ. అందులో హీరోకు స్నేహితుడిగా నటించడమే కాక, పోరాట సన్నివేశాల్లో హీరోకు డూప్‌గా కూడా చేశారు జైరాజ్. అలా చిన్న వేషాలు, ప్రముఖులకు డూప్‌గా నటించడంతో మొదలుపెట్టిన జైరాజ్ ‘రైఫిల్ గర్ల్’ లాంటి మూకీల్లో ముఖ్యపాత్రలతో ఎదిగారు. ‘రసీలీ రాణి’ (1930)కి వచ్చేసరికి ఆనాటి మేటి తార మాధురి సరసన ప్రణయధీరుడైన కథానాయకుడిగా కనిపించారు. ఆ సినిమా విజయంతో, కొత్త హీరోగా స్థానం పదిలం చేసుకున్నారు.

 మూకీ రోజుల్లో వెండితెర సాహసిక హీరో

 యంగ్ ఇండియా సంస్థలో నటించిన చిత్రాలన్నిటిలో మాధురితో కలసి కనువిందు చేసిన ఆయన ఆ తరువాత ‘శారదా ఫిలిమ్స్’కు మారారు. అక్కడ ఆయన జీతం 35 రూపాయలకూ, అక్కడ నుంచి ఏకంగా 75 రూపాయలకూ పెరిగింది. అక్కడ నటించిన చిత్రాలు జైరాజ్‌కు పెద్ద క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఆయన, ఆయనకు జోడీగా నటించే ఆ తరం నటి జేబున్నీసాలను చూసి, భారతదేశపు గిల్‌బర్ట్, గార్బోలుగా సంబోధిస్తుంటారు. అప్పట్లో జైరాజ్ నటించిన మూకీలన్నీ ప్రధానంగా ఇటలీ, అమెరికా చిత్రాల నుంచి, ప్రసిద్ధ నవలల నుంచి ప్రేరణ పొందినవే! ఆ రోజుల్లో జైరాజ్ ఈ సినిమాలన్నిటిలో సాహసికుడైన ధైర్యశాలి తరహా పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. సినీ రంగంలోకి వచ్చినవాళ్ళను లోకువగా చూడడం ఆ రోజుల్లో ఎక్కువ. జైరాజ్ వెళ్ళి సినిమాల్లో చేరాడని సాక్షాత్తూ సోదరుడే ఆయనతో చాలా ఏళ్ళు మాట్లాడలేదు.


 అగ్రనాయికలతో...! చరిత్ర ప్రసిద్ధపాత్రల్లో...!

 ‘ఆలమ్ ఆరా’ (1931)తో భారతీయ టాకీలు రావడం మొదలుపెట్టాక, జైరాజ్ సైతం మూకీల నుంచి టాకీ చిత్ర నటుడిగా సాఫీగా మారిపోయారు. హైదరాబాదీ కావడంతో ఉర్దూ ధారాళంగా మాట్లాడగలగడం టాకీలలో ఆయనకు వరమైంది. జైరాజ్ తన తొలి టాకీ ‘షికారీ’ (1932)లో క్రూరమృగాలతో కలసి తెరపై కనిపించారు. టాకీలొచ్చిన తొలి రోజుల్లో నటీనటులు తమ సొంత గొంతుతో పాటలు పాడేవారు. గానం రాని జైరాజ్‌కు మొదట్లో అది సమ స్యయింది. ఎలాగోలా నెట్టుకొస్తూ నటన కొనసాగించారు. 1935 కల్లా నేపథ్య గానమనే విధానం ప్రారంభమవడంతో సమస్య పరిష్కారమైంది.

 అప్పటి నుంచి 1950ల దాకా అన్ని తరహా చిత్రాల్లో జైరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. శాంతారామ్, పృథ్వీరాజ్‌కపూర్, మోతీలాల్ తదితరులతో పాటు రెండు దశాబ్దాలు అగ్ర నాయకుడిగా వెలిగారు. ఆనాటి అగ్ర కథానాయికలైన బిబ్బో, మెహ్‌తాబ్, దేవికా రాణి, లీలా చిట్నిస్, నర్గీస్, శోభనా సమర్థ్, మీనా కుమారి, సురయ్యా, దుర్గాఖోటే - ఇలా ఎంతోమంది ఆయన సరసన నటించారు.

 1950ల ప్రాంతం జైరాజ్ నటనకు స్వర్ణయుగం. కంచు కంఠం, చూడడానికి రాజసంగా, కండలు తిరిగిన శరీరంతో కనిపించే ఆయన అందుకు తగ్గట్లే అమర్‌సింగ్ రాథోడ్, పృథ్వీరాజ్ చౌహాన్, చంద్రశేఖర్ ఆజాద్ మొదలైన చరిత్ర ప్రసిద్ధులకు తన అభినయంతో తెరపై ప్రాణం పోశారు. అప్పట్లోనే జైరాజ్ నిర్మాణ, దర్శకత్వాలు చేపట్టి తీసిన సినిమా ‘సాగర్’ (1951). అది ఫ్లాపవడంతో మళ్ళీ ఆ జోలికి పోలేదు.

 అంతర్జాతీయ చిత్రాల్లో...

 నటీనట వర్గంలో కొత్త నీరు వచ్చి, కొత్త తరహా చిత్రాల తాకిడి పెరిగాక, మారిన పరిస్థితులకు తగ్గట్లుగా 1950ల ద్వితీయార్ధానికల్లా జైరాజ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. అంతర్జాతీయ చిత్రాల్లో కూడా నటించిన తెలుగువాడన్న ఘనతా జైరాజ్‌దే. రష్యన్ వారు నిర్మించిన ‘పర్‌దేశి’, ఎం.జి.ఎం. సంస్థ వారి ‘మాయ’ (1966), అలాగే ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ వారి ‘నైన్ అవర్స్ టు రామా’ (1963) - ఈ మూడింటిలో ఆయన నటించారు. గాంధీజీ హత్యపై రూపొందిన వివాదాస్పద ‘నైన్ అవర్‌‌స టు రామా’లో ఆయన జె.డి. బిర్లా పాత్ర ధరించారు. ఈ చిత్రం మన దేశంలో నిషేధానికి గురైంది.


 ఇక, 1970, ’80లలో కూడా ఆయన నటన కొనసాగించారు. అమితాబ్ ‘డాన్’, అలాగే ‘మాసూమ్’ (’82), ‘ఖూన్ భరీ మాంగ్’ (’88) లాంటి కలర్ చిత్రాల్లో అతిథి పాత్రల్లో అలరించారు. ఒక పక్కన సినిమాల్లో నటిస్తూనే, సినీ సంఘాల్లో, సహాయ కార్యక్రమాల్లో జైరాజ్ చురుకుగా పాల్గొనేవారు. 1939 నాటి నుంచి ‘సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’లో ఆయన క్రియాశీలక సభ్యుడు. సైనిక దళాల కోసం, జాతీయ ప్రయోజనాల నిమిత్తం నిధుల సేకరణ నిమిత్తం సంగీత విభావరుల నిర్వహణలో చురుకుగా పాల్గొనేవారు. శాస్త్రీయ సంగీతం, నృత్యాల ప్రచారంలోనూ ఆసక్తి చూపేవారు.

 ‘ఫాల్కే’ వచ్చిన మలి తెలుగువాడు

 సినీ రంగానికి జైరాజ్ సేవలను గుర్తించి, 1980కి గాను కేంద్రం ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును అందజేసింది. అయితే, ఫాల్కే అవార్డొచ్చిన తొలి తెలుగు సినీ ప్రముఖుడు పైడి జైరాజ్ అని చాలా మంది పొరపాటుగా ప్రస్తావిస్తుంటారు. కానీ చరిత్రను పరిశీలిస్తే, ఆయన కన్నా ముందే దర్శక - నిర్మాత బి.ఎన్. రెడ్డి (74), మన హైదరాబాద్‌లో మూకీలు తీసిన బెంగాలీయుడు ధీరేన్ గంగూలీ (’75)లు సైతం ఫాల్కే పురస్కారం అందుకున్నారని అర్థమవుతుంది.


 పంజాబీ కుటుంబానికి చెందిన సావిత్రిని పెళ్ళాడిన జైరాజ్‌కు ఇద్దరు మగపిల్లలు, ముగ్గురాడపిల్లలు. జీవిత చరమాంకంలో 1994 తర్వాత నటనకు దూరంగా ఉన్న ఈ సీనియర్ నటుడు భార్య చనిపోయాక, చివరి రోజుల్లో ఒక కుమారుడు ఆస్తి కోసం వేధించడంతో అవస్థలు పడ్డారు. అయితే, 2000 ఆగస్టు 11న తన 91వ ఏట తుదిశ్వాస విడిచేవరకు సినీ అభిమానాన్ని వదులుకోలేదు.

 ‘కవికోకిల’ సరోజినీ నాయుడు భర్త గోవిందరాజులు నాయుడుకు స్వయానా మేనల్లుడు జైరాజ్. అలా సరోజినీ నాయుడుతోనూ చుట్టరికం కలిసింది. అయితే, ఆమె చనిపోయే వరకు ఆ సంగతి ఆయన ఎక్కడా చెప్పుకొనే యత్నం చేయలేదు. విచిత్రమేమంటే, బొంబాయిలో స్థిరపడి గుజరాతీ, మరాఠీల్లో కూడా నటించిన ఈ తెలుగు బిడ్డ మద్రాసుకో, హైదరాబాద్‌కో వచ్చి ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించకపోవడం! ఈ సినీ కురువృద్ధుడు మరణిస్తే అతి కొద్దిమంది పాత తరం సినీ మిత్రులు తప్ప, ఎవరూ వచ్చి భౌతికకాయాన్ని దర్శించలేదు. అంత్యక్రియలకు హాజరూ కాలేదు. పత్రికలు సైతం మొక్కుబడిగా మూడు లైన్ల వార్తలిచ్చి, ఊరుకున్నాయి. అందుకే కావచ్చు, ఆయన గురించి ఇవాళ్టికీ తెలిసింది కొందరికే!

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 28th Sept 2014, Sunday)
.....................................

0 వ్యాఖ్యలు: