జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, December 11, 2014

ఆయన సినిమాలకు‘అభిమాన్’ను నేను: -- ‘పద్మశ్రీ’ కె. విశ్వనాథ్

(హృషీకేశ్ ముఖర్జీ Birth anniversary)

హృషీకేశ్ ముఖర్జీ నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. ల్యాబ్ అసిస్టెంట్‌గా మొదలై ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే రచనల మీదుగా సినీ దర్శకుడు కావడం హృషీకేశ్‌జీకి కలిసొచ్చిన అంశం. కలకత్తాలో న్యూ థియేటర్‌‌సలో దర్శకుడు బిమల్‌రాయ్ దగ్గర నుంచి పలువురు దర్శకుల శైలినీ, వారి సామర్థ్యాన్నీ దగ్గర నుంచి గమనించే అవకాశం ఆయనకు వచ్చింది. ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. వారిలోని సారాన్ని ఆయన గ్రహించారని నాకు అనిపిస్తుంటుంది. ‘ముసాఫిర్’తో మొదలుపెట్టి ‘అనుపమ’, ‘ఆనంద్’, ‘గుడ్డి’, ‘సత్యకావ్‌’ - ఇలా దాదాపు 50 చిత్రాలు తీసి, ప్రేక్షక హృదయాలను ఆయన గెలుచుకున్నారు.

  పద్మవిభూషణ్, ఫాల్కే పురస్కారాలందు కొన్నారు. హృషీకేశ్‌జీ చిత్రాలనగానే నాకు ఠక్కున గుర్తొచ్చేది ‘అభిమాన్’. నాకు ఎంతో ఇష్టమైన సినిమా అది. అందులోని సంగీతం, సున్నితమైన భావోద్వేగాలు, మనసును తాకే ఆ సన్నివేశ పరిమళాలు నా మనసులో ఇప్పటికీ అలా నిలిచిపోయాయి. ప్రతి సినిమాలో ఆయన మానవ సంబంధాలను అద్భుతంగా చూపిస్తారు. ‘అభిమాన్’లో కథానుసారం భార్యాభర్తల్లో ఒకరి ఆధిపత్య భావజాలం, వారి మధ్య నెలకొనే ఘర్షణ - చాలా సహజంగా చూపారు. ఒక సహజమైన భావోద్వేగాన్ని ఎక్కడా అతి చేయకుండా మామూలుగా చెబుతూనే, మనసుపై ముద్ర వేయడమనే హృషీకేశ్‌జీ శైలి నాకు నచ్చుతుంది.

  కథను తెరకెక్కించడంలో నా స్కూల్ కూడా అదే! అంతా తక్కువ మోతాదులోనే తప్ప, బీభత్సాలు, ఏడుపులు, పెడబొబ్బలు మా చిత్రాల్లో కనపడవు. అలాగే, చుట్టూ ఉన్న మనుషులు, వారి జీవితాలనే తప్ప, జీవితాన్ని మించిపోయిన అసహజమైన కథల జోలి కెళ్ళం. నిజానికి, ‘అభిమాన్’ స్ఫూర్తితో ఒక కథ నా మనసులో ఎప్పటి నుంచో తిరుగుతోంది. దానికెప్పటికైనా తెర రూపమివ్వాలని ఉంది.
 సినీ రంగంలోని చాలామందికి భిన్నంగా, హృషీకేశ్‌జీ ద్వారా పైకి వచ్చిన నటీనటులకు ఆయనంటే ఎంతో గౌరవం, గురుభావం. నటి జయభాదురి (బచ్చన్) ఒకసారి ‘ఫిల్మ్‌ఫేర్’ పత్రికలో ఇంటర్వ్యూ ఇస్తూ, హృషీకేశ్ పట్ల తనకున్న గౌరవాన్ని ఒక్క ముక్కలో చెప్పారు. ‘హృషీదా గనక ‘రేపటి నుంచి సినిమా ఉంది.

  నువ్వు నటించాలి’ అంటే చాలు... కథేమిటి, నా పాత్ర ఏమిటి లాంటివేవీ అడగనైనా అడగకుండానే, నా చేతిలో ఉన్న సినిమాలన్నీ క్యాన్సిల్ చేసుకొని మరీ ఆ సినిమాలో నటిస్తాను’ అని ఆమె బాహాటంగా చెప్పారు. ఒక దర్శకుడు తీర్చిదిద్దిన మైనంముద్దల లాంటి ఆర్టిస్టులు ఆ విషయాన్ని అంగీకరిస్తూ, అలా చెప్పడాన్ని మించిన కితాబు ఇంకేముంటుంది!హృషీకేశ్‌జీ మంచి సృజనశీలే కాక మంచి మనిషి కూడా! బొంబాయిలో నేను హిందీ చిత్రాలు తీస్తున్న సమయంలో రెండు మూడుసార్లు ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిశాను. ఇంట్లో మంచం పక్కనే కుక్కలతో ఆయన సరదాగా గడిపేవారు. అప్పటికే హిందీ చిత్రం ‘సర్‌గమ్’ (‘సిరిసిరిమువ్వ’కు రీమేక్)తో అక్కడివాళ్ళకు నేను తెలుసు. ‘శంకరాభరణం’ దర్శకుడిగా ఆయన నన్నెప్పుడూ గుర్తుపెట్టుకొని మాట్లాడేవారు. చలనచిత్రోత్సవాలు, జాతీయ అవార్డు కమిటీలు, సెన్సార్ బోర్డు లాంటి వాటిలో కీలక బాధ్యతలు నిర్వహించడం వల్ల దక్షిణాదిలో ఆయనకున్న పరిచయాలూ ఎక్కువే.

  పనుల మీద మద్రాసుకు ఆయన వచ్చినప్పుడూ కలిశాను. ఒకసారి ఆయన ప్రసిద్ధ మలయాళ నటుడు గోపికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి, కేరళ వెళ్ళి మరీ చూసిరావడం నాకిప్పటికీ గుర్తే!  సందర్భమేమిటో గుర్తులేదు కానీ, దక్షిణ, ఉత్తర భారతీయ సినిమా వాళ్ళం కొందరం కలసి ఒకసారి ఏదో పర్యటనకు వెళ్ళాం. ఆ బృందంలో హృషీకేశ్ ముఖర్జీ, గుల్జార్, నేను - ఇంకొందరం ఉన్నాం.  నటి జయభాదురో, షబనా ఆజ్మీయో కూడా ఉన్నారు. ‘దర్శకుడు, రచయిత, నటి - ఇలా మనందరం ఇక్కడే ఉన్నాం కదా! ఇక్కడే ఒక సినిమాకు సన్నాహాలు చేద్దామా’ అని మేమందరం సరదాగా అనుకున్నాం. అవన్నీ తీపి జ్ఞాపకాలు. ఏమైనా, భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన హృషీకేశ్ ముఖర్జీ, శ్యామ్‌బెనెగల్, బాసూ భట్టాచార్య, మృణాల్‌సేన్ లాంటి దర్శకులు, వారి చిత్రాలు మన జాతి సంపద.


- ‘పద్మశ్రీ’ కె. విశ్వనాథ్

 సంభాషణ: రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 30th Sept 20014)
....................................................................

0 వ్యాఖ్యలు: