జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, December 21, 2014

గురితప్పని... ‘పీకే’ 47


గురితప్పని... పీకే 47

‘పీకే’... ఇటీవలి కాలంలో దేశమంతటా అందరి నోటా నానుతున్న పేరు ఇది. కించిత్ కథ కానీ, కనీసం పాత్రల వివరాలు కానీ వెల్లడించకుండా అంతా గుట్టుగా అట్టిపెడుతూనే, విశేష ప్రచారం పొందిన సినిమా అంటే ఇదే. హీరో ఆమిర్‌ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, నిర్మాత విధు వినోద్‌చోప్రా - ఇలా ముగ్గురు దిగ్దంతుల కలయికలో వస్తున్న సినిమా అయినప్పుడు ఆ మాత్రం హల్‌చల్ సహజమే. రైలు పట్టాల మధ్య నగ్నంగా, ట్రాన్సిస్టర్‌ను అడ్డుపెట్టుకొని నిలబడ్డ ఆమిర్‌ఖాన్ ఫస్ట్‌లుక్ ఫోటో నుంచి ఇవాళ్టి దాకా ఆ సినిమా మీద ఆసక్తి పెరగడమే తప్ప తగ్గింది లేదు. మరి, ఇంతగా జనం నోట నానిన ‘పీకే’లో అసలింతకీ ఏముంది!
 
2014 దాదాపుగా ముగింపునకు వచ్చిన వేళ ఈ ఏడాది కాలంలో విడుదలైన హిందీ చిత్రాలను గమనిస్తే,  ఏ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందన్న దగ్గరే చర్చ మొదలై, అక్కడే ఆగిపోతోంది. ఎన్ని లక్షలమంది ప్రేక్షకుల హృదయాలను కదిలించింది, ఎంత వినూత్న కథాంశంతో వచ్చిందన్న చర్చ జరగడానికే అవకాశం లేకుండా తామరతంపరగా సినిమాలొచ్చాయి. తీరా, ఏడాది చివరలో ఒక్కసారిగా వెండితెరపై వచ్చిన కుదుపు - ‘పీకే’. కథాంశం ఎంతో సమకాలీనమైనదే కాక, అంతకు అంత ఆలోచించాల్సిన విషయం కావడం విశేషం.
 
అంతరిక్ష పరిశోధనలో భాగంగా గ్రహాల పైకి వ్యోమనౌకల్ని పంపి, జీవరాశి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఒక గ్రహాంతరవాసి (ఆమిర్‌ఖాన్) మన భూమండలం మీదకు వస్తే? మనిషికే కాక మనసుకు కూడా దుస్తుల ముసుగులు లేని అలాంటి వ్యక్తికి ఇక్కడి మోసాలు, అబద్ధాలు ఎదురైతే? తన వ్యోమనౌక తాలూకు రిమోట్‌గా పనికొచ్చే పచ్చల పతకాన్ని ఇక్కడి జనం కొట్టేస్తే? సరిగ్గా అదే జరుగుతుందీ సినిమాలో. దుస్తులు కానీ, భాష కానీ లేని అతనెలా భాష నేర్చాడన్నది ఆసక్తికరమనిపిస్తుంది.

 
పోయిన పచ్చల పతకాన్ని వెతుక్కుంటూ తిరిగే అతనిలోని మంచితనం, అతడు అడిగే అమాయకపు ప్రశ్నలు చూసి, ‘పీకే’ హై క్యా (తాగి ఉన్నావా) అని అందరూ అడుగుతుంటారు. ‘పోయిన వస్తువు దక్కాలంటే... దేవుడే దిక్కు’ అన్నప్పుడు అతను మనస్ఫూర్తిగా దేవుడి కోసం పడే ఆరాటం కథను మరో మెట్టు పైకి ఎక్కిస్తుంది. ఈ క్రమంలో అతనికి జగజ్జనని అలియాస్ జగ్గు (అనుష్క శర్మ) అనే టీవీ జర్నలిస్టు తారసపడుతుంది. ఒకరు వినాయకుడు, మరొకరు లక్ష్మీదేవి, ఇంకొకరు శంకరుడు - ఇలా ఒక్కొక్కరు ఒక్కో దేవుణ్ణి ప్రార్థించడం పీకేకు ఒక విచిత్రంగా కనిపిస్తుంది.
అలాగే, మతాల సారం ఒకటేననీ, అందరి దేవుడూ ఒకడేననీ చెప్పే ఈ దేశంలో మనిషికో మతం ఉండడం, ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన విశ్వాసం కావడం లాంటివి పీకేను గందరగోళానికి గురి చేస్తాయి. కట్టెదుట కనిపించని దేవుడు కరుణించకపోవడంతో ‘కనిపించుట లేదు’ అంటూ దేవుళ్ళ బొమ్మలు ముద్రించి పంచే పీకే ఆసక్తిరేపే న్యూస్‌స్టోరీ అవుతాడని భావిస్తుంది జగ్గు. అతని వెంట పడి, అసలు కథ తెలుసుకుంటుంది. ఇంతలో అందరూ ఆరాధించే ‘గాడ్ మన్’ (సౌరభ్ శుక్లా) దగ్గర ఆ పచ్చల పతకం ఉన్నట్లు గ్రహిస్తారు.

ఇక అక్కడ నుంచి పీకే తన గ్రహానికి తిరిగి వెళ్ళేందుకు తోడ్పడే ఆ పతకాన్ని తిరిగి సంపాదించుకొనే ప్రయత్నంతో సినిమా నడుస్తుంది. జగ్గు ప్రేమకథ... గ్రహాంతరవాసి అయిన పీకెలో చిగురించే అనురాగం... దేవుడి మీద మనుషుల్లో ఉన్న భక్తిని భయంగా మార్చి, వారి నమ్మకాలను వ్యాపారంగా మార్చుకొనే గాడ్‌మన్ల వ్యవహారం... టీవీ న్యూస్ చానల్‌లో సాగే డిస్కషన్ షో... ఇలా సాగుతుంది సినిమా. ఆఖరుకు పీకే ఆ పతకం ఎలా సాధించాడు, అతని అనురాగం ఏమైంది లాంటివన్నీ ఆకట్టుకొనే రీతిలో నడుస్తాయి.
 
నిజం చెప్పాలంటే, ఈ సినిమాకు ఒకరు కాదు - ఇద్దరు హీరోలు. ఆమిర్ కాక, రెండో హీరో ఎవరయ్యా అంటే - దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ. ‘మున్నాభాయ్ ఎం.బి. బి.ఎస్’లో వైద్య విధానాన్ని ప్రశ్నించి, ‘లగే రహో మున్నాభాయ్’లో గాంధీగిరిని ప్రస్తావించి, ‘3 ఇడియట్స్’లో విద్యావిధానాన్ని నిలదీసిన హిరానీ ఇప్పుడు దేశంలో ‘భగవంతుడికి మేనేజర్లు’గా చలామణీ అవుతున్న గాడ్‌మన్లపై కెమేరా గురిపెట్టారు. ఈ చిత్రం అతని చేతిలో ‘ఏకె 47’.
 
దేవుడనే భావన, నేటి సమాజంలో దైవస్వరూపులుగా తమను తాము ప్రచారం చేసుకుంటున్న సోకాల్డ్ ఆధ్యాత్మికవేత్తల వైఖరిని హిరానీ చర్చనీయాంశాలు చేశారు. మతం, విశ్వాసాల గురించి మాట్లాడడమే పాపం... దుస్సహమైపోతున్న సమకాలీన సందర్భంలో ఇది కత్తి మీద సాము. అయినా, అనేక అంశాలను చాలా నేర్పుగా, వ్యంగ్యాత్మకంగా ప్రస్తావించారు దర్శక, రచయితలు. సున్నితమైన మతపరమైన అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు ఏ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ పాటించారు. ఈ క్రమంలో డైలాగ్‌‌స సెటైరికల్‌గా వినోదం అందిస్తూనే, వివేచనను మేల్కొల్పుతాయి.

ఈ కథను ఆలోచించడానికీ, ఆలోచించినదాన్ని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా నైసుగా తెరపై చెప్పడానికి హిరానీ చాలా శ్రమించారని అర్థమవుతుంది. అంత శ్రమ ఉంది కాబట్టే, ‘3 ఇడియట్స్’ తరువాత అయిదేళ్ళ విరామంతో వచ్చిన హిరానీ సినిమా వచ్చినా, జనం సీట్లకు అతుక్కుపోయి చూస్తారు. కథలోని ప్రతి పాత్రకూ ఒక ప్రాధాన్యం... ప్రతి సంఘటనకూ కథలో ఒక లింకు కుదిరేలా ఈ స్క్రిప్టును అల్లుకోవడం చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. చక్కటి స్క్రీన్‌ప్లే పాఠం అనిపిస్తుంది. ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధంలో జిగిబిగి కొంత తగ్గిందేమో అన్న అనుమానం కలిగినప్పటికీ... ప్రేక్షకులు సంతృప్తిగా హాలులో నుంచి బయటకు వస్తారు. పరేశ్ రావల్ నటించిన ‘ఒ మై గాడ్’ (రానున్న ‘గోపాల గోపాల’కు మాతృక)తో కొద్దిపాటి పోలిక కనిపించినా, దీని అనుభూతి వేరు.
 
వాస్తవానికి, బాక్సాఫీస్ ఫార్ములా శంక మనసును పట్టి పీడిస్తున్నప్పుడు దాని నుంచి బయటపడడం ఎవరికైనా అంత సులభం కాదు. కానీ, ప్రేక్షకుల తెలివితేటల్నీ, అవగాహననూ, అభిరుచినీ తక్కువగా అంచనా వేయడమనే మానసిక దౌర్బల్యం నుంచి బయట పడి, దర్శక - నిర్మాతలు సినిమా తీస్తే ఎంత మంచి ఇతివృత్తాలు తెరపైకి వస్తాయో చెప్పడానికి ‘పీకే’ ఒక ఉదాహరణ. ఈ సినిమా చూశాక బుద్ధిజీవులు ఈ ‘పీకే’తో ప్రేమలో పడతారు. దర్శక, రచయితల నిబద్ధత మీద, నమ్మి ఈ కథ కోసం ప్రాణం పెట్టిన ఆమిర్ లాంటి నట, సాంకేతికుల మీద గౌరవం పెరుగుతుంది.

ఔత్సాహికులకే కాదు... వసూళ్ళే పరమావధిగా ఆరు పాటలు మూడు ఫైట్ల వరదలో కొట్టుకుపోతున్న అన్ని భాషల్లోని అనేకమంది సీనియర్ సినీ పెద్దలకూ ‘పీకే’ తాజా పాఠం అనిపిస్తుంది. ఏళ్ల తరబడి మనం తీస్తున్న, చూస్తున్న సినిమాల్లో ఇలాంటివి కదా రావాల్సిందనే భావన కలుగుతుంది. అందుకే, మంచి కథ, కథనం, ఐటమ్ సాంగులు -ఫైట్లు లేని ఆహ్లాదకరమైన వినోదం ఆశించేవారికి ‘పీకే’ ఒక మరపురాని జ్ఞాపకం. వినోదం అందిస్తూనే, మన ప్రవర్తన మీద మనకే ఆలోచన రేపే అనుభవం. ఏ సృజనాత్మక కృషికైనా అంతకు మించి పరమార్థమేముంటుంది!


 - రెంటాల జయదేవ


(Published in 'Sakshi' daily, 20th Dec 2014)
........................................

0 వ్యాఖ్యలు: