జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, December 24, 2010

బతుకు భయం కలిగించే ‘నాగవల్లి’



(వసూళ్ళ యావే తప్ప, ఆత్మే లేని ఆత్మ కథ ‘నాగవల్లి’ - పార్ట్ 2)

‘నాగవల్లి’ సినిమాలో ప్రేక్షకుడికి నచ్చే అంశాల కన్నా నచ్చని అంశాలే ఎక్కువ. ‘నాగవల్లి’ చిత్రంలో సాఫీగా సాగే కథ లేదేమో కానీ, నటీనటులు మాత్రం బోలెడంత మంది. హీరోగా రజతోత్సవ సంవత్సరంలో ఉన్న వెంకటేశ్ ఈ చిత్రంలో డాక్టర్ విజయ్ గా, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రాజు నాగభైరవ రాజశేఖరుడిగా ద్విపాత్రాభినయం చేశారు. 130 ఏళ్ళుగా బతికుండి, ఓ అఘోరా లాగా పెరిగిన మీసాలు, గడ్డాలు, గోళ్ళతో మూడో వేషంలోనూ కనిపిస్తారు.

పాత్రలు - పాత్రధారులు

కానీ విషాదం ఏమిటంటే - ఒక్క డాక్టర్ విజయ్ వేషంలోనే ఆయన ఫరవాలేదనిపిస్తారు. మిగిలిన వేషాల్లో ఆయన ఆంగిక, వాచికాలు అన్యాయంగా ఉన్నాయి. రాజు వేషంలో ఆహార్యమైనా బాగుంది (రమా రాజమౌళి స్టైలింగ్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలి), కెమేరాలో కాళ్ళకు బూట్లతో కనిపించేస్తున్న అఘోరా వేషానికి వచ్చేసరికి ఆయన మేకప్ కానీ, ఆ కుంగ్ ఫూ తరహా యుద్ధ విన్యాసాలు, ఆ అరుపులు ఏ మాత్రం ప్రొఫెషనల్ గా లేవు. రాజు అంటే ఓ హుందాతనం, ఆ నడకలో, కరచరణ విన్యాసాల్లో ఓ ఠీవి కనిపించాలి. కానీ, దురదృష్టవశాత్తూ ఈ సినిమాలో అవేవీ లేవు. పైగా, హీరోయిన్ తో పాట పాడుతూ, రాజు నడిచే నడక, భుజాలు ఊపే తీరు విదూషకుడిని తలపించాయి. సంభాషణల్లోనూ, వాటి ఉచ్చారణలోనూ పాత్రల తాలూకు స్థల కాలాలను చూపెట్టడంలో కూడా విఫలమయ్యారు.

ప్రధానపాత్ర నాగవల్లి (అసలు పేరు నాగవల్లి. నాట్యకళలో ప్రావీణ్యంతో అందరూ పిలిచే పేరు చంద్రముఖి అని సినిమాలో చెప్పించారు)లో అనూష్కను సైతం పోస్టర్లలో చూపించినంత పాటి అందంగానైనా తెర మీద చూపలేకపోయారు. నృత్యంలో అభినివేశం లేని ఆమె శాస్త్రీయ నృత్యం చేస్తుంటే, తెరపై ఎలా ఉందో వేరుగా చెప్పనక్కర లేదు. ఆమె ప్రియుడైన గుణశేఖరన్ పాత్రధారి ఆమె కన్నా పొట్టిగా, లేత ముఖంతో ఆమెకు చిన్న తమ్ముడిలా కనిపించాడు.

సినిమాలో శరత్ బాబు - ప్రభల కుమార్తెలుగా కమలినీ ముఖర్జీ (నాట్యకళాకారిణి గాయత్రి పాత్ర), శ్రద్ధాదాస్ (చిత్రకారిణి గీత పాత్ర), రిచా గంగోపాధ్యాయ (పరిశోధకురాలు గౌరి పాత్ర), ఇంకా ధర్మవరపు కుమార్తెలుగా లహరి తదితరులతో గ్లామర్ కు తక్కువ ఏమీ లేదు. కానీ, ఏ పాత్రనూ చిరకాలం గుర్తుంచుకోలేం. బ్రహ్మానందం కామెడీ కూడా నవ్వించడానికి విఫలయత్నం చేస్తుంది. కొంతసేపయ్యాక విసుగు కలిగిస్తుంది.

సాంకేతిక విభాగాలు

ఈ సినిమాలో హంపీ తదితర ప్రాంతాలను శ్యామ్ కె. నాయుడి కెమేరా అందంగా తెరకెక్కించింది. గురుచరణ్ సంగీతంలో హీరో పరిచయ గీతం మినహా మరేవీ జనం పదే పదేలా పాడుకొనేలా గుర్తుండవు. కళాదర్శకత్వం (చిన్నా) చాలా నాసిగా ఉంది. రాజు గారి ఆస్థానం లాంటి వాటికి అంత గాడీగా ఉన్న రంగులు ఎలా వాడారో అర్థం కాదు. గమ్మత్తేమిటంటే - చంద్రముఖిని రాజు బంధించి ఉంచిన ప్రణయ కేళీ మందిరమంతా ఎర్రటి రంగు గోడలతో ఉండడం ఆలోచన, అవగాహనల రాహిత్యానికి నిదర్శనం. అలాగే, తలుపునకు నాగుపాము, త్రిశూలం వగైరాలతో తాళం ఉండే ఘనమైన దర్వాజాను కూడా మనకు ఆ ప్రాచీన భావాన్ని కలిగించేలా తీర్చిదిద్దకపోవడం పెద్ద తప్పు. చంద్రముఖిని అష్ట దిగ్బంధనం లాంటి దృశ్యాల్లో సైతం వాడిన తాళాలు, తాళం చెవులు లాంటివి కూడా క్లోజప్ లో కనిపిస్తూ, కథాకాలం నాటికి సంబంధం లేని రూపురేఖలతో చీకాకు తెప్పిస్తాయి. సినిమా చూసే ప్రేక్షకులు ఇవేవీ నోరువిప్పి వివరించకపోవచ్చు కానీ, వారి అంతరాంతరాళాల్లో ఇవి చూపే తెలియని ప్రభావమే చిత్ర ఫలితానికి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.

డిజిటల్ ఇంటర్మీడియట్ (డి.ఐ) చేసిన ఈ చిత్రంలో కొన్ని చోట్ల దృశ్యాలు అలికేసినట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హీరో పరిచయ గీతం లాంటి చోట్ల డి.ఐ.లోని లోపాలు తెలిసిపోతున్నాయి. గ్రాఫిక్స్ సంగతికొస్తే - చంద్రముఖి 30 అడుగుల పొడవున్న పాము రూపంలో వెళ్ళిపోతోందని చెబుతూ వస్తారు. కానీ, గ్రాఫిక్స్ లో పాములా కాకుండా అది కొండచిలువలా తయారైంది. పడగ విప్పినప్పుడు మాత్రం అది పాములా అనిపిస్తుంది. కథలోనే కొంత కన్ఫూజన్ ఉండడంతో, ఎడిటింగ్ మరేమీ చేయలేకపోయింది.

లోటుపాట్లు

కథలో చంద్రముఖి వెంటాడడం ఏమో కానీ, ‘నాగవల్లి’ చిత్రాన్ని చూస్తుంటేనూ, చూసొచ్చాకా ప్రేక్షకుల్ని బోలెడన్ని ప్రశ్నలు వెంటాడతాయి, వేధిస్తాయి. చాలా భాగం జవాబులు దొరకని ప్రశ్నలే. చంద్రముఖి వ్యవహారంలో సాయం కోరుతూ సిద్ధాంతే స్వయంగా డాక్టర్ విజయ్ ని పిలిపిస్తాడు. నిజానికి, వాళ్ళిద్దరూ కలసి ఆ ఎదురైన సమస్యను పరిష్కరించాలి. కానీ, అది పోయి, చివరకు ఒకరిపై మరొకరు పోటీ పడుతూ, నువ్వు తప్పా, నేను తప్పా అని వాదనకు దిగుతున్నట్లుగా తయారైంది.

హేతువాదానికీ, ఆచారాల పట్ల నమ్మకానికీ మధ్య వాదులాట లాగా కనిపించినా, రెండు పాత్రలకూ సమప్రాధాన్యం ఇస్తూ, రెంటిలో ఏదీ దేనికీ తక్కువ కాదన్నట్లు చూపాల్సింది. ‘చంద్రముఖి’లో అలాంటి ప్రయత్నమే చూశాం. కానీ, ‘నాగవల్లి’ అందుకు విరుద్ధంగా సాగింది. చివరకు సిద్ధాంతి పాత్రను డమ్మీని చేసేశారు. క్లైమాక్స్ లో డాక్టర్ విజయ్ పాత్ర ప్రవర్తన కానీ, సమస్య పరిష్కారంలో అతని పాసివ్ పాత్ర కానీ అర్థరహితంగా ఉన్నాయి.

ఎంత సీక్వెల్ అయినా ఇంత కాపీనా?

అలాగే, పెద్ద హిట్ చిత్రానికి సీక్వెల్ అయినంత మాత్రాన అక్షరాలా అంతకు ముందు సినిమా ఫార్ములానే యథాతథంగా వాడేస్తామంటే కుదురుతుందా? కానీ, ఈ చిత్ర దర్శక రచయిత పి. వాసు (కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం మూడూ ఆయనవే) ఆ పిచ్చి పనే చేశారు.

‘చంద్రముఖి’లో రజనీకాంత్ ఇంట్రడక్షన్ పాట (దేవుడా దేవుడా తిరుమల దేవుడా...)కు కాపీ లాగా ఇక్కడా అలాగే హీరో పరిచయ గీతం (అభిమాని లేనిదే హీరోలు లేరులే...). అక్కడ ఇంటిల్లపాదీతో రజనీ పాడే గాలిపటం పాటకు, ఇక్కడ వెంకటేశ్ ఆడవాళ్ళందరితో కలసి కబడ్డీ ఆడి, ఆ పైన పాడే పాట. అక్కడ ‘రారా సరసకు రారా’ పాట ఉంటే, ఇక్కడ ‘ఘిరని ఘిరని...’ అంటూ నర్తకి నాగవల్లి చంద్రముఖి (అనూష్క) డ్యాన్సుకు రాజు గారు (వెంకటేశ్) తాళం వేస్తూ పాడే పాట.

పాటలే కాదు, పాత్రల విషయంలోనూ ఆ వేలంవెర్రి అనుకరణనే కొనసాగించారు. ‘చంద్రముఖి’లో ఇంటికొచ్చిన హీరో, తన భార్యకు దగ్గరైపోతున్నాడేమోనని అనుమానించే వడివేలు పాత్ర గుర్తుందిగా. సరిగ్గా దానికి జిరాక్స్ కాపీ లాంటిది ‘నాగవల్లి’లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పోషించిన పాత్ర. అందులో హీరోకు ఓ సహాయకుడు. ఇందులోనూ హీరోకు ఓ సహాయకుడు. బహుశా సీక్వెల్ ముసుగులో తమ హిట్ సినిమాను తామే ఇంత పచ్చిగా, అడుగడుగునా కాపీ కొట్టుకుంటూ మరో సినిమా తీయడం మన చిత్ర సీమల్లోనే సాధ్యం. ఇలాంటి దర్శక, రచయితలను గుడ్డిగా నమ్మి, ఫార్ములా చట్రంలోనే గుడుగుడు గుంజాలాడాలని అనుకోవడం మన సోకాల్డ్ నిర్మాతలు, హీరోల అవివేకం. దీనికి కోట్ల కొద్దీ కుమ్మరించడం దాన్ని మించిన అహంభావం.

కొసమెరుపు -

ఈ సినిమాకు కొందరు మిత్రులం కలసి వెళ్ళాం. ఆఫీసు పని ముగించుకొని, హడావిడిగా రాత్రి భోజనాలు చేసి, సెకండ్ షోకి వెళ్ళాలని ఆలోచన. అడ్వాన్సుగా టికెట్లు తీసుకొద్దామని ఓ మిత్రుడు ఆటకు రెండున్నర గంటల ముందే హాలుకు వెళ్ళాడు. టికెట్లిమ్మంటే కౌంటర్ వాడు వాడి మాతృభాషలో బదులిస్తూ, ఓ కాగితం చూపాడు. దాని మీద రూ. 1000 అని అంకె ఉంది. మన ఊరు కాని ఊళ్ళో ఆ భాష బాగా తెలియకపోయినా, వాడి భావం మాత్రం మా వాడికి బాగా తెలిసింది.

‘‘ఇక్కడ జనం లేక తెరిచిపెట్టుకు కూర్చున్నాం. మునుపటి ఆటకు వచ్చిన కలెక్షనే రూ. 1000 (అంటే 20 మందే వచ్చారన్నమాట). మీరు తాపీగా సినిమా మొదలు కావడానికి పది నిమిషాల ముందు వస్తే చాలు. ఎన్ని టికెట్లంటే అన్ని టికెట్లిస్తాం, హాలంతా మీదే’’ అన్నది కౌంటర్ వాడి కామెంట్ భావం. అయినా ధైర్యం చేసి సినిమాకు వెళ్ళి, మా లాంటి మరో 25 మంది సినిమా పిచ్చి వాళ్ళతో హాలంతా ఏలుతూ సినిమా చూసేశాం. కానీ, మరునాడు ఉదయం పేపర్లో ‘‘ఈ ఏటి మేటి 5 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి ’’అంటూ నాగవల్లి వాణిజ్య ప్రకటన చూశాక, నమ్మాలో, నవ్వాలో అర్థం కాలేదు.

10 వ్యాఖ్యలు:

శరత్ కాలమ్ said...

సమీక్ష బావుంది. రక్షించారు మమ్మల్ని. అయితే ఓ సందేహం. 12, 15 డాలర్లకు బదులుగా $5 కయినా ఈ సినిమా చూడొచ్చు అంటారా?

Anil Atluri said...

జీవత కాలంలో మరో నాలుగు గంటలు పొడిగించినందుకు మీకు మనస్పూర్థిగా కృతజ్ఞతలు.

సుజాత వేల్పూరి said...

అబ్బ, అవునండీ, సినిమా చూసి బయటికి వచ్చేసరికి తల్లోంచి పొగలొచ్చాయి. అమ్మో!

Unknown said...

Your review is correct. The movie is very very poor in technical front... The movie looked like, it is directed by an amateur.

Indian Minerva said...

రాత్రే కన్నడ మాతృకను చూడ్డం షురూజేసినమన్నా... అదే అంత జెత్తగున్నప్పుడు ఇదింకెంతుండాలె?

3g said...

//‘‘ఈ ఏటి మేటి 5 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి ’’అంటూ నాగవల్లి వాణిజ్య ప్రకటన చూశాక, నమ్మాలో, నవ్వాలో అర్థం కాలేదు. // :):):)

మీ రివ్యూలు, మీరు రాసే మిగతా సినిమా ఆర్టికల్స్ చాలాబాగుంటయండీ. మీ బ్లాగ్ లో పోస్టులకోసం నేనెప్పుడూ ఎదురుచూస్తూంటాను.

astrojoyd said...

90% of telugu movies r come under ur caption"bathuku bhayam"

Buchchi Raju said...

please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.

Unknown said...

@ శరత్ గారూ, డబ్బు మీది. రిస్కూ మీదే. మీ ఇష్టం!
@ అనిల్ గారూ, @ 3జి గారూ థ్యాంక్యూ.
@ సుజాత గారూ, మీరు చేసిన కామెంట్ లోని దృశ్యాన్ని ఊహించుకుంటూ ఉంటే, సినిమా కన్నా కామెడీగా ఉంది. హ్హ... హ్హ... హ్హ.
@ ప్రదీప్ గారూ, @ ఇండియన్ మినర్వా గారూ, యు ఆర్ ట్రూ.
@ ఆస్ట్రో జాయిడ్ గారూ, ఐ టూ ఎగ్రీ విత్ యూ.
@ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.

వేణూశ్రీకాంత్ said...

హ హ కొసమెరుపు బాగుందండి :-)