జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, January 15, 2014

వెలిగి, మలిగిన వెండితెర దీపాలు - హీరో ఉదయ్ కిరణ్‌ అనుమానాస్పద ఆత్మహత్యా ఉదంతం

- ఆత్మహత్యలు... అనుమానాస్పద మరణాలు...

      యువతరం హీరో ఉదయ్ కిరణ్‌ అనుమానాస్పద ఆత్మహత్యా ఉదంతంతో తెలుగు సినిమా పరిశ్రమతో పాటు సామాన్యులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శ్రీహరి, ఏ.వి.ఎస్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆదివారం అర్ధరాత్రి దాటాక ఉదయ్ కిరణ్‌ - ఇలా వరుసగా నాలుగు నెలల్లో నలుగురు తెలుగు సినీ ప్రముఖులు మరణించడం తెలుగు సినీ ప్రియులకు తీరని లోటే! పైగా, పలువురు నటీమణులు, దర్శకులు గురుదత్‌ లాంటి సినీ రంగ ప్రముఖులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు గతంలో జరిగినా, ఒక అగ్ర హీరో ఆత్మహత్యకు దిగడం మాత్రం మన చిత్ర సీమలో ఇదే తొలిసారి. 

ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే, వృత్తి జీవితంలోని ఒడుదొడుకులు, వరుస వైఫల్యాలు, వ్యక్తిగత జీవితంలోని ఇబ్బందులు, మానసికంగా కుంగుబాటుకు లోనవడం లాంటి అనేక కారణాలు ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణమవుతున్నాయి. వెండితెరపై పెను సమస్యలనూ, పెద్ద పెద్ద ప్రతినాయకులనూ ధైర్యంగా ఎదుర్కొని, విజయం సాధించిన నాయికా నాయకులు నిజజీవితంలో మాత్రం పిరికిగా మారి, ప్రాణాలు తీసుకోవడం పెను విషాదం. ఎంతోమంది అందాల తారలు నిజజీవితంలో అత్యంత దయనీయంగా అసువులు బాశారు. 

హాలీవుడ్‌ తార మార్లిన్‌ మన్రో దగ్గర నుంచి మన తెలుగమ్మాయి సిల్క్‌ స్మిత దాకా ఎంతోమంది అలా ఆత్మహత్యను ఆశ్రయించినవారే! వృత్తి జీవిత, వ్యక్తిగత సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని ఆత్మహత్యలో వెతుక్కున్నారు. బాలీవుడ్‌ యువ నటి నఫీసా జియా ఖాన్‌ కూడా ఉదయ్ కిరణ్‌ లాగానే, గత ఏడాది ఉరి పోసుకొని చనిపోయారు. పాతికేళ్ళ ఈ అమ్మాయి గడచిన జూన్‌ మొదటి వారంలో ఓ పక్కన ప్రేమలో వైఫల్యంతో పాటు, సినిమా కెరీర్‌లోని ఒడుదొడుకులతో తన జీవితాన్ని అంతం చేసుకున్నారు. తొలి చిత్రంలోనే అమితాబ్‌ తో ('నిశ్శబ్ద్‌' - 2007) నటించి, ఆ పైన ఆమిర్‌ ఖాన్‌ లాంటివాళ్ళ సినిమాల్లోనూ కనిపించిన ఈ యువ నటికి 2010లో విడుదలైన వినోద ప్రధాన చిత్రం 'హౌస్‌ఫుల్‌' తరువాత సినిమా అవకాశాలు రాలేదు. మరోపక్క సినీ కుటుంబానికే చెందిన సూరజ్‌ పంచోలీతో ప్రేమ బంధం తెగిపోయింది. నిజానికి, అస్తుబిస్తుగా సాగే సినీ జీవితం కన్నా ఇంటీరియర్‌ డెకరేటర్‌గా స్థిరపడాలని కూడా తన తల్లితో చెప్పారు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఓ తెలుగు సినిమాలోని పాత్ర కోసం ఆడిషన్‌కు కూడా హాజరైనప్పటికీ, ఆ అవకాశం ఆమెకు దక్కలేదు. వీటన్నిటితో నిరాశా నిస్పృహలకు లోనైన జియా చివరకు ప్రాణాలు తీసుకున్నారు. 1990ల ద్వితీయార్ధంలో బాల నటిగా ఓ చిన్న చిత్రంలో పని చేసిన ఆ యువ నటి జీవితం కేవలం మూడే సినిమాలతో అంతమైపోయింది. 

దక్షిణాది సినీ సీమను తన అందం, ఆకర్షణలతో ఓ ఊపు ఊపేసిన సిల్క్‌ స్మిత (అసలు పేరు విజయలక్ష్మి) సైతం పద్ధెనిమిదేళ్ళ క్రితం వ్యక్తిగత వైఫల్యాలు, ఆర్థిక కారణాలతో తాగుడుకు బానిసై, ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 400 చిత్రాల్లో నటించి, ఎంతోమందిని ఆకట్టుకున్న స్మిత జీవితం అలా ముగిసిపోయింది. 

అంతకన్నా ముందుకు వెళితే, కె. బాలచందర్‌ దర్శకత్వంలోని 'అంతులేని కథ'తో పాటు తమిళంలో పలు హిట్‌ చిత్రాల్లో నటించి, 'ఫటాఫట్‌' అనే సినీ మేనరిజమ్‌తో 'ఫటాఫట్‌' జయలక్ష్మిగా పేరు తెచ్చుకున్న నటి కూడా 1980లో ఓ ప్రేమ వ్యవహారంలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకున్నారు. తమిళ సినీ, రాజకీయ ప్రముఖుడు ఎం.జి.ఆర్‌. సోదరుడైన చక్రపాణి కుమారుణ్ణి ఆమె ప్రేమించారు. పెళ్ళికి అతను తాత్సారం చేయడంతో బాధపడి, 'ఫటాఫట్‌' జయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. 

కన్నడ చిత్రాల ద్వారా ఎంతో ప్రాచుర్యం సంపాదించిన నటి కల్పన కూడా జీవిత రంగస్థలం నుంచి హఠాత్తుగా పక్కకు తప్పుకున్నారు. నటిగా ఎంతో పేరు, డబ్బు సంపాదించి, అవార్డులు కూడా సాధించిన కల్పన ఆ వైభవం తగ్గాక నిరాశలో కూరుకుపోయారు. జీవితం గడపడానికి, చివరకు రంగస్థల నటిగా కూడా వ్యవహరించాల్సి వచ్చింది. కానీ, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులు చుట్టుముట్టి, చివరకు 1979 మేలో ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాయి. 

తమిళ చిత్రం 'పసి' ద్వారా 17 ఏళ్ళకే జాతీయ ఉత్తమ నటి అవార్డును సాధించిన మలయాళ అమ్మాయి శోభ (అసలు పేరు మహాలక్ష్మి) కూడా బలవంతపు మరణానికే దిగింది. బాల నటిగా మొదలై, దక్షిణాది భాషల్లోని చిత్రాల్లో నటించిన ఆమె ఉరిపోసుకున్నారు. దర్శక - ఛాయాగ్రాహకుడు బాలూ మహేంద్రతో సాన్నిహిత్యం ఆమె మరణానికి కారణమని వార్తలు వచ్చాయి. ఆమెది ఆత్మహత్యేనా, లేక హత్యా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. 

అదే పద్ధతిలో అనుమానాలు రేపిన మరో సినీ మరణం - తెలుగు నటి ప్రత్యూషది. ఓ సామాన్య ఉపాధ్యాయురాలి కుమార్తె అయిన ప్రత్యూషది కూడా ప్రేమకథతో ముడిపడిన బలవన్మరణమే! మరో సామాజిక వర్గానికి చెందిన సిద్ధార్థ రెడ్డి అనే అబ్బాయిని ప్రేమించిన వర్ధమాన తార ప్రత్యూష 2000 ఫిబ్రవరిలో అనూహ్య పరిస్థితుల మధ్య అర్ధంతరంగా జీవితం చాలించారు. ప్రేమికుడు సిద్ధార్థ్‌, ఆమె కలసి విషం తాగారని వార్తలు వచ్చినా, సిద్ధార్థ్‌ బతకడం, ప్రత్యూష మృతదేహం ముఖం మీద గోళ్ళ గాట్లు లాంటివి ఉండడం, కేర్‌ ఆస్పత్రి వర్గాలు అప్పట్లో వ్యవహరించిన తీరు లాంటివన్నీ అనుమానాలను పెంచాయి. 

ఉత్తరాది విషయానికి వస్తే, అందాల తార పర్వీన్‌ బాబీ సైతం 2004లో అన్నపానీయాలు మానేసి, ప్రాణాలు తీసుకున్నారు. తెలుగులో 'బొబ్బిలి రాజా' లాంటి చిత్రాలతో అందరినీ ఆకర్షించిన దివ్యభారతి కేవలం 19 ఏళ్ళ వయస్సులోనే 1993 ఏప్రిల్‌లో ముంబరులోని తన అయిదంతస్థుల అపార్ట్‌మెంట్‌ మీద నుంచి కిందకు దూకి మరణించారు. ఆమె మరణం వెనుక కారణం ఓ మిస్టరీగా మిగిలిపోయింది. 

ఇవాళ ఉదయ్ కిరణ్‌ మరణం మీద కూడా అనుమానపు మేఘాలు అలముకొన్నాయి. ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు అతను కాదనేది కొందరు సన్నిహితుల వాదన. మరోపక్క అతనికేమీ ఆర్థిక ఇబ్బందులు లేవనీ, పెళ్ళి చేసుకొని కూడా పట్టుమని పధ్నాలుగు నెలలే అయిందనీ, కాబట్టి ఈ మరణం అనుమానాస్పదంగా ఉందనీ మరికొందరు అంటున్నారు. ఏమైనా, సినీ పరిశ్రమ వర్గాలు మాత్రం ''సినిమా రంగంలో పోటీ అంతా ఇంతా కాదు. ఇక్కడ కెరీర్‌లో ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు అవకాశాలు, పారితోషికాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. కానీ, ఒక్కసారి కెరీర్‌లో వెనకబడితే మాత్రం ఎవరూ పట్టించుకోరు. వాళ్ళను దాటుకొని, ముందుకు వెళ్ళిపోవడానికి కొన్ని వందల మంది సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అది గ్రహించకుండా, సినిమాయే జీవితమనీ, ఈ ఆదాయం, ఆకర్షణ, పేరుప్రతిష్ఠలు శాశ్వతమనీ భ్రమ పడితే మాత్రం ఇబ్బందే!'' అని వెండితెర వెలుగు జిలుగుల వెనుక ఉన్న నీలినీడల్ని విశ్లేషిస్తున్నాయి.

 పంథొమ్మిదేళ్ళ చిన్న వయస్సుకే 'చిత్రం' సినిమాతో హీరో అయి, వరుసగా విజయాలు సాధించి, చిన్నతనంలోనే పెద్ద పేరు సంపాదించుకొన్న ఉదయ్ కిరణ్‌ బహుశా ఆ వాస్తవాన్ని గ్రహించలేదేమో! సోమవారం నిమ్స్‌' ఆసుపత్రి మార్చ్యురీలో చాలాసేపు బంధువుల రాక కోసం ఏకాకిగా ఎదురుచూసిన ఆయన మృతదేహం మాట్లాడలేదు కాబట్టి, ఆ సంగతులు తెలిసే అవకాశం లేదు!
- రెంటాల జయదేవ

(Published in 'Praja Sakti' daily, 7th Jan 2014, Tuesday, page no. 8)
...................................................................

ఫస్టాఫ్‌ ఒక సినిమా! సెకండాఫ్‌ మరో సినిమా! (ఎవడు - సినిమా రివ్యూ‌)



        సినిమా సిద్ధమైపోయి అయిదారు నెలలు దాటినా, విడుదల కోసం సుదీర్ఘంగా నిరీక్షించిన చిత్రం 'ఎవడు' ఎట్టకేలకు విడుదలైంది. అదీ సంక్రాంతి సందర్భంగా జనం ముందుకు వచ్చింది. పూర్తి స్థాయి మాస్‌ యాక్షన్‌ చిత్రమైన ఈ సినిమా ఆ తరహా చిత్రాల అభిమానుల్ని అలరించవచ్చు. ఎడతెగని వాయిదాలతో అంచనాలు తగ్గడం, పండుగ సెలవులు కలసి రావడం, చూడదగ్గ ఇతర సినిమాలు లేకపోవడంతో కొద్దో గొప్పో కాసులు కూడా కురిపించవచ్చు. కానీ, దర్శక, నిర్మాతలు ''నెక్ట్స్‌ జనరేషన్‌కు తీసుకువెళ్ళే చిత్రం''గా చెప్పుకొన్న ఈ సినిమాలో అసలు ఏమంత 
విషయం ఉందన్నది ప్రశ్న?

       విశాఖపట్నంలో సత్య (అల్లు అర్జున్‌), దీప్తి (కాజల్‌ అగర్వాల్‌) ప్రేమికులు. తీరా ఆమె మీద విలన్‌ వీరూ భారు (రాహుల్ దేవ్) ఆశపడతాడు. ఎదిరించి బస్సులో హైదరాబాద్‌కు పారిపోతున్న వారిద్దరిపై విలన్‌ బృందం దాడి చేస్తుంది. ఆ బస్సును కాల్చేస్తుంది. దీప్తి చనిపోయినా, కొనఊపిరితో సత్య బతుకుతాడు. డాక్టర్‌ శైలజ (జయసుధ) అతనికి ప్లాస్టిక్‌ సర్జరీ చేసి, బతికిస్తుంది. అలా మారిన ముఖంగా సత్య కాస్తా రామ్‌ (రామ్‌చరణ్‌) అవుతాడు. ఎవరికీ చెప్పా పెట్టకుండా ఆస్పత్రి నుంచి వెళ్ళిపోయి, తన ప్రియురాలిని చంపిన విలన్లు నలుగురినీ వరుసగా, తెలివిగా చంపేస్తాడు. అంతా అయిపోయిందనుకున్న సమయంలో ఎవరో తెలియనివాళ్ళు హీరోను చంపడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ పగ తన మీద కాదనీ, తన ముఖంతో ఉన్న వ్యక్తితో అనీ హీరో గ్రహిస్తాడు. అక్కడికి ఫస్టాఫ్‌. 

మారిన తన ముఖానికి కారణమైన డాక్టర్‌ (జయసుధ) దగ్గరకు వెళతాడు. మరణించిన తన కుమారుడు చరణ్‌ (రామ్‌ చరణ్‌) ముఖాన్నే ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా తనకు ఆమె పెట్టినట్లు హీరో గ్రహిస్తాడు. ఆమె అలా ఎందుకు చేసింది, అసలు ఆమె కుమారుడు ఎలా మరణించాడు, అతనికీ - హైదరాబాద్‌లోని విలన్లు ధర్మ (సాయికుమార్‌) తదితరులకూ గొడవేమిటన్నది ఫ్లాష్‌బ్యాక్‌. ఆ కథంతా తెలుసుకున్న హీరో తానే ఆ డాక్టర్‌కు కొడుకుగా ఏ లక్ష్యం పూర్తి చేశాడన్నది మిగిలిన సినిమా. 

ముఖాలు మారడమంటూ తీసుకున్న బేసిక్‌ పాయింట్‌ వరకు మన సినిమాల్లో కొత్తదే! ఆ మధ్య వచ్చిన 'బన్నీ అండ్‌ ఛెర్రీ'లో ఈ పాయింట్‌నే మరో రకంగా వాడారు. ఈ రెండింటికీ ఆ పాయింట్‌ వరకు మాతృక మాత్రం హాలీవుడ్‌ చిత్రం 'ఫేస్‌ ఆఫ్‌'. ఇక, ఆ పాయింట్‌ను 'ఎవడు'లో కథగా తయారు చేసుకొని, తెరపై చూపించిన విధానం మాత్రం చాలా రొటీన్‌గా ఉంది. ఇందులోని కొన్ని ఘట్టాలు చిన్న ఎన్టీయార్‌ 'ఆంధ్రావాలా' మొదలు రామ్‌ చరణే నటించిన 'రచ్చ', నిరుటి 'నాయక్‌' దాకా అనేక పాత సినిమాలను గుర్తుచేసేస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో తరువాతి సన్నివేశం ఏమిటన్నది ప్రేక్షకుడు ఊహించేయగలుగుతుంటాడు. 

మొదట కాసేపు బానే ఉందనిపించినా, హీరో మొదటి హత్య చేసిన తరువాత రెండో హత్య దగ్గర నుంచి ఫస్టాఫ్‌ మరీ చప్పబడిపోయింది. పైగా, ఫస్టాఫ్‌కే నలుగురు విలన్లనూ హీరో చంపేసేయడంతో సినిమానే అయిపోయిన ఫీలింగ్‌ వచ్చేస్తుంది. ఇంటర్వెల్‌ ముందు ఓ చిన్న పాటి ట్విస్టుతో రెండో కథకూ, సెకండాఫ్‌కు బీజం వేస్తాడు. సెకండాఫ్‌ అంతా ఎక్కువగా ఫ్లాష్‌ బ్యాక్‌. భూబకాసురులైన రాజకీయ నేతలు, గూండాల నుంచి సామాన్యులను కాపాడే హీరో కథగా అదీ రొటీనే అయినా, ఉన్నంతలో కొంత ఫరవాలేదనిపిస్తుంది. దాంతో, ఆకలి మీద హాలుకు వెళ్ళిన ప్రేక్షకులు పచ్చడి మెతుకులతో బయటపడ్డ ఫీలింగ్‌ మిగులుతుంది. 

అయితే, 'మెగా' కుటుంబ అభిమానులకు ఈ చిత్రం ఒక రకంగా పండగే. ఎందుకంటే, ఇందులో ఒక పక్క రామ్‌చరణ్‌ తేజ్‌, మరోపక్క అల్లు అర్జున్‌ - ఇద్దరూ తెరపై కనిపిస్తారు. ఒక సన్నివేశంలో ఇద్దరూ ఏకకాలంలో కనిపిస్తారు. ఆ విధంగా ఇది మల్టీ స్టారర్‌ చిత్రం అనుకోవచ్చు. అల్లు అర్జున్‌ కనిపించిన కాసేపూ బాగా చేశారు. సినిమా అంతా యాక్షనే కాబట్టి, యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా ఆద్యంతం తనకు అలవాటైన కోపపు ముఖం, ఒకే భావావేశంతో రామ్‌చరణ్‌ అయిందనిపించారు. హాస్య, ప్రేమ సన్నివేశాల్లో చేసింది తక్కువే! 

ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అతిథి పాత్రలో కాజల్‌ అగర్వాల్‌ కనిపించేది సినిమా మొదట్లో పది, పదిహేను నిమిషాలే. ఎమీ జాక్సన్‌ పాత్ర ఫస్టాఫ్‌కే పరిమితం. ఆమె నటించిందీ లేదు, నటించడానికీ ఆ పాత్రలో అంతకన్నా ఏమీ లేదు. మూడో హీరోయిన్‌ శ్రుతీ హాసన్‌ పరిస్థితీ అంతే! కాకపోతే, మూడు నాలుగు పాటల్లో డ్యాన్స్‌ చేయడం తప్ప!

చాలా రోజుల తరువాత జయసుధ కథకు కీలకమైన డాక్టర్‌ శైలజ పాత్ర పోషించారు. అనుభవజ్ఞురాలైన నటి కాబట్టి, ఉన్న కొద్ది సీన్లలోనూ, మంచి డైలాగులతో పాత్రను పండించారు. 'సామాన్యుడు', 'ప్రస్థానం' లాంటి చిత్రాలు చేసిన సాయికుమార్‌కు వాటికి కొనసాగింపుగా దక్కిన పాత్ర - ఇందులోని మెయిన్‌ విలన్‌ పాత్ర. వాచికం, ఆంగికాలతో ఆ పాత్రను ఆయన పండించారు. కనిపించేది చాలా కొద్ది సేపే అయినా నెల్లూరు మాండలికం డైలాగుల్లో కోట శ్రీనివాసరావు ఆకట్టుకుంటారు. ద్వితీయార్ధంలో హీరో ఫ్రెండ్‌ (శశాంక్‌)కు తండ్రి పాత్రలో రచయిత - నటుడు ఎల్బీ శ్రీరామ్‌ కనిపించారు. సెకండాఫ్‌లోని కీలక పాత్రల్లో అది ఒకటి. చాలా చిత్రాల్లో వచ్చిన తరహా పాత్రే అయినా, దాన్ని ఆయన జనరంజకంగా పోషించారు. 

రామ్‌ చరణ్‌ తేజ్‌ చిత్రానికి తొలిసారిగా సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతాలైతే చేయలేకపోయారు కానీ, రెండు మూడు పాటల్లో జనాన్ని ఆకట్టుకున్నారు. 'నీ జతగా నేనుండాలి! నీ ఎదలో నే నిండాలి! నీ కథగా నేనే మారాలి...' పాట రచన, బాణీ కూడా చెవికి ఇంపుగా ఉన్నాయి. తెరపై చూడసొంపుగా కూడా ఉన్న పాట ఇది. అలాగే, సినిమా మొదట్లో వచ్చే నేపథ్య గీతం 'చెలియా చెలియా...', హీరో హీరోయిన్ల యుగళ గీతం 'నిన్ను చూస్తే చాలు బుగ్గల్లోన...' బాగున్నాయి. నేపథ్య సంగీతం, ముఖ్యంగా సెకండాఫ్‌లో విలన్‌ వర్సెస్‌ హీరో లాంటి చోట్ల బాగుంది. కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే 'ఫ్రీడమ్‌...' పాటతో సహా మరో రెండింటిలో రామ్‌చరణ్‌ కష్టపడి వేసిన స్టెప్పులు అలరిస్తాయి. 

సినిమాలో కామెడీ దాదాపు లేదనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లలో మాత్రం కనిపించే బ్రహ్మానందం వల్ల ఆయన సినిమాల జాబితాలో మరో నంబర్‌ చేరిందేమో తప్ప, ప్రేక్షకులకు దక్కిన వినోదం తక్కువ. ఇక, సెకండాఫ్‌లో వచ్చే 'వెన్నెల' కిశోర్‌, విలన్‌ దెబ్బకు మధ్యలోనే చనిపోయే శశాంక్‌ లాంటివాళ్ళది కామెడీ అని దర్శక, రచయితలు అనుకొని ఉంటే, నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేం. ఒకటి, రెండు చోట్ల మంచి డైలాగులు వినిపించాయి. అయితే, స్త్రీలను 'అది', 'ఇది' అని ప్రస్తావించడం లాంటి అమర్యాదకర ధోరణి ఈ సినిమాలోనూ కొనసాగింది. అలసామాన్య గృహిణి పాత్రలకు కూడా 'కుమ్మేద్దాం కొడుకుల్ని!', 'ఏం పీకలేవు', లాంటి డైలాగులు పెట్టడం వర్తమాన తెలుగు సినీ సంభాషణల స్థాయికీ, అవి సమాజంపై చూపబోయే ప్రభావానికీ ప్రతీకలు. 

కెమేరా (సి.రామ్‌ప్రసాద్‌), కళ (ఆనంద్‌సాయి), యాక్షన్‌ (పీటర్‌హెయిన్‌) విభాగాల పనితనం బాగానే ఉపకరించిన ఈ సినిమాలో సులభంగా కొన్ని సీన్లు కట్‌ చేసుకొని ఉండాల్సింది. ఆ మేరకు ఎడిటింగ్‌ కత్తెరకు పదునుపెడితే, (ఎడిటిర్‌-మార్తాండ్‌ కె.వెంకటేష్‌) ఈ 'రెండు కథల ఒక సినిమా' కనీసం ఓ పావుగంట ముందే జనాన్ని వదిలిపెట్టి ఉండేది. 

'ఏ' సర్టిఫికెట్‌ దక్కిన 'ఎవడు'లో నరుక్కోవడాలు, చంపుకోవడాలు చాలా ఎక్కువే! ఫస్టాఫ్‌లో ప్రియురాలిని చావుకు కారణమైన విలన్లను నలుగురినీ హతమారుస్తానని రామ్‌చరణ్‌ తేజ్‌ ముఖంలో ఉన్న హీరో (కథానుసారమైతే అల్లు అర్జున్‌ అనుకోవాలి) బయలు దేరతాడు. అయితే, ఆ చంపడాల పరంపర ఆ నాలుగుతో ఆగదు... సినిమా కాసేపయ్యాక ఆ నాలుగు కాస్తా ఏడెనిమిది దాటుతుంది.... ఇక సెకండాఫ్‌ నడుస్తున్న కొద్దీ చేతివేళ్ళు సరిపోనంత మంది చచ్చిపోతుంటారు. విసుగొచ్చి ఇక ప్రేక్షకులే లెక్కపెట్టడం మానేస్తారు. 


ఈ సినిమాలో మిస్సయిన లాజిక్కులు చెబితే ఆ జాబితా ఓ కొండవీటి చాంతాడంత అవుతుంది. సినిమాలో రామ్‌చరణ్‌ చనిపోయినట్లు చూపించి, ముఖం కాలిపోయి కొనఊపిరితో కొట్టుకుంటున్న అల్లు అర్జున్‌కు ఆ ముఖాన్ని ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా అతికించినట్లు చెబుతారు. చనిపోయిన వాడి ముఖాన్ని ఈ బతికున్నవాడికి పెట్టడం ఎలా అని అడకండి! అలాగే, చేసింది ప్లాస్టిక్‌ సర్జరీ కాబట్టి, అల్లు అర్జున్‌కు రామ్‌ చరణ్‌ ముఖం రావడం వరకు ఓ.కె. కానీ, అల్లు అర్జున్‌ కంఠస్వరం కూడా రామ్‌చరణ్‌ది ఎలా మారిపోయిందని సగటు ప్రేక్షకులు ఎవరైనా అంటే, దానికి జవాబు దొరకదు. 

అలాగే, ఈ సినిమాలో పాత్రలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లోవి! ఎమీ జాక్సన్‌ పాత్ర అర్ధంతరంగా కనుమరుగై పోతుంది. అలాగే, బ్రహ్మానందం పాత్ర కూడా! ఫస్టాఫ్‌లో హత్యల రహస్యాన్ని ఛేదించడానికి తెగ తాపత్రయపడినట్లు కనిపించే అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (మురళీ శర్మ) పాత్ర కూడా ఇంటర్వెల్‌ తరువాత కనపడితే ఒట్టు. వైజాగ్‌లో అన్ని హత్యలు చేసి కనిపించకుండా పోయినవాడి గురించి పోలీసులు పట్టించుకోలేదను కోవాలేమో! 
ఇక కథలో దర్శక, రచయితలు అనుకున్నదే తడవుగా ఏదైనా జరిగిపోతుంటుంది. ఫస్టాఫ్‌లో విలన్లను ఆటపట్టిస్తూ, హతమార్చే హీరో తమ పక్కనే ఉండి, తమకే సమాచారం ఇస్తున్నా విలన్లకు కానీ, పోలీసులకు కానీ ఆవగింజంతైనా అనుమానం రాదెందుకో! 'ఇది సినిమా! అందులోనూ తెలుగు సినిమా!' అని ప్రేక్షకులు తమకు తామే సర్దిచెప్పుకుంటూ, సరిపెట్టుకోవాల్సిందే!

వెరసి, సకుటుంబంగా జరుపుకొనే సంక్రాంతి సెలవులకు వచ్చినా, ఈ రొటీన్‌ మాస్‌ యాక్షన్‌ సినిమా వినోదం మిస్సయి, వెండితెరపై మితిమీరిన హింసతో కుటుంబ ప్రేక్షకులకు దూరం చేసుకుంది. అభిమాన, మాస్‌ జనాలకు మాత్రం ఫరవాలేదనిపిస్తుంది. యావరేజ్‌కు పిసరంత పైన నిలుస్తుంది. 

కొసమెరుపు: ఫస్టాఫ్‌ ఒక సినిమా, సెకండాఫ్‌ మరో సినిమా ... ఇలా ఒకే టికెట్‌పై రెండు సినిమా కథలు చూపించారని హాలులోనే ప్రేక్షకులు కామెంట్లు చేసేశారు. ఒక టికెట్‌పై రెండు సినిమాలు చూపించడం గొప్పే కదా అంటారా! నిజమే కానీ, తీరా చూస్తే ఆ రెండూ ఇప్పటికే సవాలక్ష సార్లు చూసేసిన సినిమా (కథ)లు కావడమే 'ఎవడు'లోని అసలు ట్విస్టు!

- రెంటాల జయదేవ

(Published in 'Praja Sakti' daily, 13th Jan 2014, Monday, Page No. 8)
.........................................................

Tuesday, January 14, 2014

వానపాటకు యాభై ఏళ్ళు! ('ఆత్మబలం' 50 ఏళ్ళు పూర్తి)

'చిటపట చినుకులు పడుతూ ఉంటే... చెలికాడే సరసన ఉంటే...' - ఈ పాట తెలియని పాత తరం సినీ ప్రేక్షకులు ఎవరూ ఉండరు. తెలుగు తెరపై వానపాటలకు ఓ ఊపునిచ్చిన ఈ తొలినాళ్ళ వర్ష గీతం ఇప్పటికీ ఆల్‌టైమ్‌ సూపర్‌హిట్టే! ఆ పాటకు దృశ్య రూపమిచ్చిన ఆనాటి సక్సెస్‌ఫుల్‌ సినిమా ఏయన్నార్‌ 'ఆత్మబలం'. 1964 జనవరి 9న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా ఇవాళ్టితో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆ సినిమా సంగతుల్లో కొన్ని...

అక్కినేని నాగేశ్వరరావు, బి. సరోజాదేవి జంటగా నటించిన సినిమా ఇది. జగ్గయ్య మరో ముఖ్య పాత్ర పోషించారు. జగపతి పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయవంతమైన చిత్రాల దర్శకుడైన వి. మధుసూదనరావు దర్శకులు. నిజానికి, ఈ సినిమాకు 'అగ్ని సంస్కార' అనే ఓ బెంగాలీ చిత్రం ఆధారం. ఆ బెంగాలీ చిత్రానికి ఓ బెంగాలీ నవల మాతృక. అక్కడ విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగు వాతావరణానికి తగ్గట్లుగా దర్శక, నిర్మాతలు మార్పులు చేసుకున్నారు. 


పాట ఎలా పుట్టిందంటే...
మాటలు, పాటలు ఆచార్య ఆత్రేయ అందించారు. కె.వి. మహదేవన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. వానపాట 'చిటపట చినుకులు...' ఇవాళ్టికీ ఓ రొమాంటిక్‌ ఫీలింగే! అదొక్కటే కాదు... ఇంకా 'పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు...', 'గిల్లి కజ్జాలు పెట్టుకొనే...', 'ఎక్కడికి పోతావు చిన్నదానా...' లాంటి గీతాలన్నీ ఇవాళ్టికీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినీ గీత ప్రియుల నాలుకలపై నర్తిస్తున్నవే. 


అసలు ఈ చిత్రంలోని 'చిటపట చినుకుల...' పాట రచయిత మదిలో పుట్టడం వెనుక కూడా ఓ కథ ఉంది. ఈ సినిమాకు పాటలు రాయడం కోసం ఆత్రేయ ఇంకా తాత్సారం చేస్తున్నారట! హీరో, హీరోయిన్ల మధ్య యుగళ గీతానికి సరైన పల్లవి తట్టకపోవడంతో  కారులో షికారు చేస్తున్నారట! ఇంతలో వాన మొదలైంది. ఆ పరిస్థితుల్లో ఓ జంట ఆ కారుకు అడ్డం పడి పరిగెడుతూ, ఓ చెట్టు నీడకు పరిగెట్టారు. దాంతో, చటుక్కున ఆత్రేయకు పాట పల్లవి మదిలో మెరిసింది. అలా 'చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టాపట్టగా చేతులు పట్టి, చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి...' అంటూ చకచకా పల్లవి రాసేశారట! 

కొత్త ఫ్యాషన్‌కు శ్రీకారం


ఇక, అక్కినేని నాగేశ్వరరావు, బి. సరోజాదేవిపై చిత్రీకరించిన ఈ పాట షూటింగ్‌కు సంబంధించి మరో కథ ఉంది. ''వానలోని దృశ్యాలు చిత్రీకరించే సమయానికి ఓ హిందీ సినిమా షూటింగ్‌లో సరోజాదేవి తలకు గాయమైంది. దాంతో, వాన దృశ్యాల కోసం ఆమె తలకు స్కార్ఫ్‌ కట్టేశాం. అలా ఆపద్ధర్మంగా కట్టిన తలకు గుడ్డ కాస్తా ఆ తరువాత రోజుల్లో ఓ ఫ్యాషన్‌గా మారింది'' అని చిత్ర నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్‌ ఆ సంగతులను గుర్తు చేసుకున్నారు. 



ఫస్ట్‌ రిలీజ్‌లో సక్సెస్‌! రీ రిలీజుల్లో హిట్‌!

చిత్రం ఏమిటంటే, ఇవాళ ఇంతగా చెప్పుకొంటున్న 'ఆత్మబలం' ఆ రోజుల్లో మరీ సూపర్‌హిట్టేమీ కాదు. కథాబలం, వానపాట లాంటి కమర్షియల్‌ హంగులు, మరెన్నో పాపులర్‌ పాటలు ఉన్నా, ఈ సినిమా తొలి రోజుల్లో సక్సెస్‌ఫుల్‌ సినిమాగా మాత్రమే నిలిచింది. అందుకు కారణాలు అనేకం. నిజానికి, 1964 జనవరిలో అక్కినేని నటించిన చిత్రాలు ఒకటీ, రెండు కాదు... ఏకంగా మూడు రిలీజయ్యాయి. జనవరి 1న బి.ఎన్‌.రెడ్డి 'పూజాఫలం', జనవరి 9న 'ఆత్మబలం', అదే నెల 31న ఆదుర్తి సుబ్బారావు 'మూగ మనసులు' జనం ముందుకు వచ్చాయి. 


'పూజాఫలం' ఫ్లాపైతే, బాగానే నడుస్తున్న 'ఆత్మబలం'కి మూడు వారాల తరువాత అక్కినేని చిత్రమే అయిన 'మూగ మనసులు' పోటీ అయింది. సావిత్రి, ఏయన్నార్‌, జమునల 'మూగ మనసులు' ప్రభంజనం ముందు 'ఆత్మబలం' కళ తప్పింది. ఒక హీరో సినిమాకు అతనిదే మరో సినిమా పోటీగా మారి, సక్సెస్‌ను ప్రభావితం చేయడం విచిత్రమే. అయితే, ఆ పోటీ, పోలిక లేకపోవడంతో, తరువాతి రిలీజుల్లో 'ఆత్మబలం' బాగా ఆడి, కాసులు కురిపించింది. నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. 'ఆత్మబలం' గురించి, అందులోని 'చిటపట చినుకుల...' పాట గురించి ఇవాళ్టికీ చెప్పుకొనేలా చేసింది. 


మొత్తానికి, ఈ సూపర్‌ హిట్‌ వాన పాట తెలుగు తెరపై ఆ తరువాత మరెన్నో రెయిన్‌ సాంగ్స్‌కు దోవ చూపిందని చెప్పకతప్పదు. అప్పట్లో ఈ పాటలో కథానాయికను తడిసిన దుస్తుల్లో చూపించడం, ఆమె కొద్దిగా చీర కుచ్చిళ్ళు పైకెత్తి నడవడం లాంటివి ఎంతో అసభ్యంగా ఉన్నాయనీ విమర్శించిన వాళ్ళూ లేకపోలేదు. ఇవాళ్టి వానపాటలు చూశాక, ఇప్పుడు ఆ సంగతి చెబితే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ఏమైనా, వానపాటలకు జెండా ఎగరేసిన తెలుగు సినిమాగా 'ఆత్మబలం' మరిన్ని రోజులు గుర్తుండక మానదు. 

- రెంటాల జయదేవ


(Published in Praja Sakti daily, 9th Jan 2014, Thursday, Page No.8)
..........................................

Sunday, January 12, 2014

అక్కినేనిపై అన్నీ వదంతులే!

-కుటుంబ వర్గాల ప్రకటన

  అగ్ర సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు ఆరోగ్యం విషమంగా ఉందంటూ వస్తున్న వార్తలు వట్టి వదంతులేననీ, అభిమానులెవరూ వాటిని నమ్మవద్దనీ ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. అక్కినేని కులాసాగానే ఉన్నారనీ, క్యాన్సర్‌ ఆపరేషన్‌ అయిన తరువాత కొద్దిగా నీరసంగా ఉన్నారే తప్ప మరేమీ లేదనీ ఆయన కుమారుడు, మరో సినీ హీరో నాగార్జున బుధవారం నాడు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. రోజూ తాను దగ్గరుండి మరీ ఆయన యోగ క్షేమాలు చూసుకుంటున్నట్లు తెలిపారు. 

నిజానికి, తొలితరం తెలుగు హీరో ఏయన్నార్‌ ఆరోగ్యం విషమించిందంటూ మంగళవారం రాత్రి (January 7) బాగా పొద్దుపోయినప్పటి నుంచి వదంతులు వ్యాపించాయి. కొన్ని వెబ్‌సైట్లు ఆయన ఆరోగ్యం విషమించిందంటే, సినీ - టీవీ రంగానికి చెందిన ఇంకొందరు అత్యుత్సాహవంతులు ఏకంగా 'జరగరానిది జరిగిపోయింద'ంటూ ఫేస్‌బుక్‌లో అవాకులూ చెవాకులూ పెట్టేశారు. దీంతో, ఒక్కసారిగా సంచలనం చెలరేగి, ఈ కథనాల్లోని నిజానిజాలను తెలుసుకొనేందుకు బుధవారం (January 8) తెల్లవారుజాము వరకు పలువురు పత్రికా విలేఖరులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే, అవన్నీ వట్టి వదంతులేనని తేలింది. మరోపక్క బుధవారం ఉదయం పత్రికల్లోనూ ఈ వదంతుల వార్తలు రావడంతో, అభిమానుల్లో ఆందోళన పెరిగింది. ఈ పరిస్థితుల్లో అక్కినేని కుమారుడు నాగార్జున, మనుమలు సుమంత్‌, అఖిల్‌ కూడా సామాజిక సంబంధాల నెట్‌వర్క్‌ల ద్వారా వదంతులను ఖండిస్తూ, ప్రకటనలు చేశారు. అభిమానుల ఆశీర్వాదం వల్ల అక్కినేని ఆరోగ్యంగానే ఉన్నారని సుమంత్‌ పేర్కొన్నారు. 

తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా సంభవిస్తున్న మరణాలు, మరోపక్క ఉదయకిరణ్‌ అనుమానాస్పద ఆత్మహత్యా ఘటనతో ఓ అగ్ర హీరో కుటుంబంపై జనాగ్రహం, ఉదరు కిరణ్‌ అంతిమయాత్రలో వినపడ్డ నినాదాల నేపథ్యంలో ఈ వదంతులు రావడం గమనార్హం. 

ఇది ఇలా ఉండగా, జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్‌ వ్యాధితో కొంతకాలంగా అక్కినేని బాధపడుతున్నారు. కుమారుడు నాగార్జున, మనుమడు నాగచైతన్యలతో కలసి తాను నటిస్తున్న 'మనం' చిత్రం సెట్స్‌లో గడచిన అక్టోబర్‌ 19న విలేఖరుల సమావేశం పెట్టి మరీ, ఆయన తన అనారోగ్యం విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అయినా అభిమానుల ఆశీర్వాదంతో ముందుకు సాగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, అదే రోజున షూటింగ్‌లో అసౌకర్యానికి గురై, ఆసుపత్రిలో చేరడంతో అక్కినేనికి శస్త్రచికిత్స కూడా జరిగింది. శస్త్రచికిత్స తరువాత కొద్దిగా కోలుకున్న ఏయన్నార్‌ సినిమాలో మిగిలిన తన పాత్ర తాలూకు సన్నివేశాల షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో, ఇంటి వద్దే చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో స్వయంగా డబ్బింగ్‌ కూడా చెప్పేశారు. అయితే, ఆయన ఆరోగ్యం గురించి అధికారిక సమాచారం పెద్దగా లేకపోవడంతో, ఊహాగానాలు రేగుతున్నాయి. 


నీరసించినా... టీవీ చూస్తూ...
అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి 'ప్రజాశక్తి' సేకరించిన సమాచారం మేరకు, 90 ఏళ్ళ ఏయన్నార్‌ శస్త్రచికిత్స, ఆ వెంటనే క్యాన్సర్‌కు చేస్తున్న కెమోథెరపీ లాంటి చికిత్సల వల్ల బాగా నీరసంగా ఉన్నారు. ఇంట్లోనే ఉంటున్న ఆయన బాగోగులు చూసేందుకు ప్రత్యేకంగా నర్సును కూడా పెట్టారు. బలహీనంగా, కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుండడంతో చక్రాల కుర్చీని వాడుతున్నారు. ఎక్కువగా బెడ్‌ రెస్ట్‌ తీసుకుంటున్నారు. అయితే, అదే సమయంలో పాత సినిమాలు, టీవీలో కార్యక్రమాలు చూస్తూ వీలైనంత ఉల్లాసంగా సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం 'నమో వెంకటేశా' సినిమా కూడా చూస్తూ, ఆయన నవ్వుతూ గడిపారు.

 ''తాతయ్య ఎప్పటిలాగే ఉత్సాహంగా ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. ఆయన అస్వస్థతకు గురి కాలేదు'' అంటూ అఖిల్‌ బుధవారం చేసిన ప్రకటన కూడా ఆ విషయాన్ని బలపరుస్తోంది. అయితే, నాగార్జునతో సహా కుటుంబ సభ్యులందరూ వీలైనంత సేపు అక్కినేనితో గడపడానికే ప్రయత్నిస్తున్నారు. ఖాళీ సమయమంతా ఆయనతోనే గడపడానికీ, మాటామంతీ జరపడానికీ నాగార్జున మొగ్గుచూపుతున్నారు. కాగా, ఏటా అక్కినేని కుటుంబం జనవరిలో జరిపే 'ఏయన్నార్‌ జాతీయ అవార్డు' ప్రకటన, కార్యక్రమం వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఏమైనా, ఈ నేపథ్యంలో వైద్య చికిత్సలు, కుటుంబ సభ్యుల నైతిక మద్దతుతో క్యాన్సర్‌ను జయించి, అక్కినేనిని మళ్ళీ జనంలోకి రావాలని అభిమానులు, సినీ ప్రియులు కోరుకుంటున్నారు.

(Published in PrajaSakti daily, 9th Jan 2014, Thursday, Page No.8)
............................................

గందరగోళ పెట్టడంలో నంబర్ '1' (సినిమా సమీక్ష - 1... నేనొక్కడినే )


సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది. షూట్‌లు, రీషూట్‌లు, పెరిగిన పని రోజులు, పెరిగిపోయిన వ్యయం మధ్య ఎట్టకేలకు హీరో మహేశ్‌బాబు, దర్శకుడు సుకుమార్‌ల '1' తయారై, విడుదలైంది. 'ఈరోస్‌ ఇంటర్నేషనల్‌' సంస్థ కూడా జత కలసిన ఈ చిత్రం వ్యాపారం కూడా భారీ స్థాయిలోనే జరిగింది. వీటన్నిటితో పెరిగిన అంచనాల మధ్య ఈ సినిమాకు వెళితే, ఆశలు, అంచనాలు తలకిందులవుతాయి. కథలో కన్నా కథనంలో కన్‌ఫ్యూజన్‌ మరింత ఎక్కువైన చిత్రంగా ఈ '1' ప్రేక్షకులకు చాలారోజులు గుర్తుండిపోతుంది. 

'దూకుడు', 'బిజినెస్‌మేన్‌', క్రితం సంక్రాంతికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' - ఇలా వరుస విజయాలతో జోరు మీద ఉన్న హీరో మహేశ్‌బాబు ఈ సారి కొంత భిన్నమైన దోవ తొక్కారు. మామూలు రివెంజ్‌ ఫార్ములాకే, గుర్తుపెట్టుకొనే సామర్థ్యం తక్కువున్న (మరోమాటలో మతిమరుపు అనవచ్చేమో) కథానాయకుడి పాత్రను కలిపి, దర్శకుడు సుకుమార్‌ వండిన కథను ఎంచుకున్నారు. కథానాయక పాత్రకు మతిమరుపు లాంటిది (సినిమాలో దాన్ని 'ఇంటిగ్రేషన్‌ డిజార్జర్‌' అన్నారు) ఉంది అనగానే, అందరికీ హాలీవుడ్‌ చిత్రం 'బార్న్‌ ఐడెంటిటీ' లాంటివి గుర్తుకొస్తాయి. నిన్న మొన్నటి 'గజని' దాకా ఇలాంటి పాయింట్‌తో మనకు చాలానే సినిమాలు వచ్చాయి. అయితే, ఆ హాలీవుడ్‌ సినిమాలోని ఆ పాయింట్‌ వరకు మాత్రం తీసుకొని అల్లుకొన్న కథ ఈ '1 - నేనొక్కడినే'!


కథగా చెప్పాలంటే, గౌతమ్‌ (మహేశ్‌బాబు) ఓ రాక్‌ సంగీత గాయకుడు. ఈ రాక్‌స్టార్‌కు ఓ భయంకరమైన గతం. అది అతణ్ణి పీడకలలా వెంటాడుతూ ఉంటుంది. తన అమ్మా నాన్నను ముగ్గురు విలన్లు చంపేసినట్లు కల గనే హీరో, ఆ ముగ్గురినీ చంపాలని భావిస్తుంటాడు. ఆ క్రమంలో అతను ఊహల్లోనే ఆ ముగ్గురినీ చంపేసినట్లు భ్రమలకు లోనవుతుంటాడు. అయితే, అతనివన్నీ వట్టి భ్రమలేననీ, నిజానికి అతనికి తల్లితండ్రులు హత్యకు గురికావడమనేది కూడా భ్రమేననీ డాక్టర్‌తో సహా చుట్టుపక్కల ఉన్నవాళ్ళంతా అంటూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో ఆ రాక్‌స్టార్‌కు దగ్గరవుతుంది - టీవీ రిపోర్టర్‌ సమీర (కృతీ సనన్‌). అతడి వెంటపడుతూ అతణ్ణి ప్రేమలో పడేస్తుంది. ఆ క్రమంలో హీరోయిన్‌ను చంపడానికి ఎవరో వెంటాడుతున్నట్లు హీరో గుర్తిస్తాడు. అదే సమయంలో తన కలలో ఎప్పుడూ వచ్చే ఓ విలన్‌ ఎదురైతే, అతను తన భ్రమ అనుకుంటూనే కాల్చి చంపేస్తాడు. తీరా అది నిజమని తెలుసుకుంటాడు. అక్కడికి చిత్ర ప్రథమార్ధం అయిపోతుంది. 


ఇక, ద్వితీయార్ధానికి వచ్చేసరికి మిగిలిన విలన్ల కోసం హీరో వెతుకులాట! ఆ క్రమంలో అతను లండన్‌కు వెళ్ళడం! అక్కడ ఏం జరిగింది, హీరోయిన్‌ను చంపడానికి ప్రయత్నించినదెవరు, ఇరవై ఏళ్ళ క్రితం హీరో తల్లితండ్రుల్ని విలన్లు ఎందుకు చంపారు లాంటివన్నీ మిగతా కథ. విలన్‌ చనిపోయాక కూడా ఇంకా సహనంగా థియేటర్‌లో కూర్చోగలిగితే, తన పాత జ్ఞాపకాలను హీరో ఎలా గుర్తించాడన్నది ఆఖరు పది నిమిషాల సీన్‌. 


రొటీన్‌ కథలు, సినిమాలు చూసి విసిగిపోయిన వాళ్ళకు ఇది కొంత కొత్తగా అనిపించవచ్చు. అమ్మా నాన్నల్ని చంపినవాళ్ళ మీద హీరో పగ తీర్చుకోవడమనే మామూలు ప్రతీకార ఫార్ములా కథను కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించారని అనుకోవచ్చు. కథను ఎత్తుకోవడమే హీరోకు ఓ చిన్న సమస్య ఉంది... నిజమేదో, భ్రమ ఏదో తెలియని స్థితిలో అతను బతుకుతుంటాడని తెర మీద చూపించేసరికి ప్రేక్షకుడు మొదట కొద్దిగా షాక్‌కు గురవుతాడు. కానీ, ఆ తరువాత వరుసగా వాస్తవానికీ, ఊహకూ మధ్య హీరో పడే గందరగోళం హాలులోని ప్రేక్షకులకు కూడా విస్తరిస్తుంది. చివరకు మొత్తం విషయాన్ని తెర మీద చూపించిన తీరు గందరగోళంగా ఉందని ప్రేక్షకులు భావిస్తే, ఆ తప్పు దర్శక, రచయితలదే! 


నిజం చెప్పాలంటే, దర్శకుడు సుకుమార్‌ కొంత భిన్నంగా ఆలోచిస్తారు. సైకాలజీకి సంబంధించిన కథాంశాలను బాగానే ఎంచుకుంటారని పేరు. గతంలో ఆయన రూపొందించిన 'ఆర్య', 'జగడం', 'ఆర్య2', '100 % లవ్‌' లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. ఆ పేరుకు తగ్గట్లే ఈ '1' కథ ఉంది. కానీ, ఈ ''సైకలాజికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌''ను ఊహ, నిజాల మధ్య ఊగిసలాటగా తెర కెక్కించిన తీరు సామాన్య ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందన్నది సందేహం. 



ఈ చిత్ర కథలో అర్థం కాని విషయాలు కూడా బోలెడున్నాయి. హీరో రాక్‌స్టార్‌ అని చెబుతారు కానీ, అతనేదో మాఫియా గ్యాంగును ఎదుర్కొనే ధీరుడిలా గన్లు పట్టుకొని తిరుగుతుంటాడు. అలాగే, హీరో తల్లితండ్రులను చంపడానికి విలన్లు లండన్‌ నుంచి గోవాకు వచ్చారెందుకో అర్థం కాదు. లండన్‌లో చంపేసినా, వారిని అడ్డుకొనేదెవరు! ఇక, ఇరవై ఏళ్ళ క్రితం తప్పించుకున్న హీరో గురించి విలన్లు వెతకరెందుకో తెలీదు. అలాగే, కథ మొత్తానికీ గోల్డెన్‌ రైస్‌ వరి వంగడం కీలకమైనప్పుడు, దాని కోసం విలన్లు చేసిన ప్రయత్నమూ లేదు. ఇవన్నీ ప్రేక్షకులకు తెలియని అసంతృప్తినే మిగులుస్తాయి. 


హీరో తల్లితండ్రులెవరనే సస్పెన్స్‌ చివరి ఘట్టం దాకా కొనసాగించిన దర్శకుడు ఆ పాత్రల్లో ప్రముఖులనో, లేదంటే కనీసం మహేశ్‌తోనే ఆ తండ్రి పాత్ర కూడా వేయించేస్తేనో ప్రేక్షకులకు కాస్తంత థ్రిల్‌ అయినా ఉండేది. అవేవీ లేకపోవడంతో, ఆఖరి అమ్మా నాన్నల సెంటిమెంట్‌ ఘట్టమూ తేలిపోయింది.

ఈ సినిమాలో కనిపించే, కథను నడిపించే పాత్రలు తక్కువే. దాంతో, ఎక్కువ సేపు తెరపై మహేశ్‌బాబే ఉంటాడు. కొత్త లుక్‌ కోసం ఆయన కష్టపడ్డారు. రాక్‌స్టార్‌గా చూడడానికి స్టయిలిష్‌గా బాగున్నారు కూడా! తెలుగుతెరకు తొలి పరిచయమైన కృతీ సనన్‌ కురచ దుస్తుల్లో కనిపించిందే తప్ప, అభినయంలో కానీ, ఆకర్షణలో కానీ తనదైన ముద్ర వేయలేకపోయింది. సినిమాలో వచ్చే కెల్లీ దోర్జీ ('డాన్‌' తదితర చిత్రాల ఫేమ్‌), నాజర్‌ లాంటి వారు తమ పాత్ర మేరకు నటించారు. పోసాని కృష్ణ మురళి కాసేపు కారు డ్రైవర్‌గా కనిపిస్తారు. మహేశ్‌ కుమారుడు గౌతమ్‌ కృష్ణ చిన్నప్పటి మహేశ్‌ పాత్రలో కనిపించడం అభిమానులకు ఆనందం కలిగించే విషయం. 



సాంకేతిక నిపుణుల సంగతికొస్తే, సాధారణంగా తానే కథ రాసుకొనే సుకుమార్‌ ఈ చిత్రానికి ఆ బాధ్యత మరొకరి మీద పెట్టారు. పైపెచ్చు, ఓ అరడజనుకు పైగా రచయితలు రచనలో వేలు పెట్టారు. వెరసి, సినిమాలో లాజిక్‌లు తక్కువ, కన్‌ఫ్యూజన్‌ ఎక్కువ అయ్యాయి. ఒకటీ అరా చోట్ల మాటలు అలరించాయి. పాటలన్నీ తానే రాసిన చంద్రబోస్‌ పాత్ర వ్యక్తిత్వానికీ, సందర్భానికీ తగ్గట్లుగా రచన చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంలో 'హు ఆర్‌ యూ...' పాట, అలాగే 'ఔ తుజొ మౌకొత్తా' (కొంకిణి భాషలో ఐ లవ్‌ యూ అని అర్థం) అంటూ వచ్చే 'హలో రాక్‌స్టార్‌ అయామ్‌ యువర్‌ ఏంజల్‌...' పాట వినేందుకు బాగున్నాయి. 'ఐటమ్‌ సాంగ్‌'లకు పేరున్న సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్‌లో ఈసారి 'జానీ జానీ ఎస్‌ పాపా... నాకు రైమ్స్‌ రావప్పా...' అనే ప్రత్యేక నృత్య గీతం చిత్రీకరించారు. అయితే, అది ఆకట్టుకోవడం అనుమానమే. 

కెమేరామన్‌ రత్న వేలు గతంలో తానే చేసిన అత్యుత్తమ స్థాయి పనితీరును ప్రదర్శించకపోయినా, ఉన్నంతలో బాగానే పనితనం చూపారు. అయితే, డ్యాన్సులకు పేరున్న ప్రేమ్‌ రక్షిత్‌ ఈ సినిమాలోని పాటలన్నిటికీ కొరియోగ్రఫీ చేశారు కానీ, మహేశ్‌ ప్రాథమికంగా వేసే డ్రిల్లు స్టెప్పుల నుంచి బయటకు తీసుకురాలేకపోయారు. హిందీ 'ధూమ్‌' చిత్రాల సిరీస్‌ ప్రభావం కనిపించే పీటర్‌ హెయిన్స్‌ యాక్షన్‌ సన్నివేశాలు ఫరవాలేదనిపిస్తాయి. 



కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ద్వారానే ఇప్పటి ఈ ఇమేజ్‌నూ, భారీ విజయాలనూ సొంతం చేసుకున్న మహేశ్‌బాబు ఆ వర్గానికి దూరంగా ఉండే కథతో '1' సినిమా చేయడం విచిత్రం. పైపెచ్చు, స్వతహాగా అందగాడు, మంచి నటుడే అయినా హీరోగా ఇప్పటికే దశాబ్దిన్నర కాలం గడిపిన మహేశ్‌బాబు తన భావ ప్రకటనలో ఒక గిరి గీసుకొని ఉండిపోతున్న భావన కలుగుతోంది. ఆ గూటి నుంచి ఆయన బయటపడడం మంచిది. వెరసి, ఎంత సంక్రాంతి సెలవుల్లో వచ్చినప్పటికీ, '1' చిత్రం మహేశ్‌బాబు కెరీర్‌లో మరో 'బాబీ', 'నాని', 'వంశీ' అయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది. 


కొసమెరుపు: కథలోని బోలెడు ట్విస్టులు, గందరగోళం దాదాపు మూడు గంటలు భరించి హాలులో నుంచి బయటకొస్తున్న యువ ప్రేక్షకులు, మిత్రులు పలకరించినా సరే కణతలు నొక్కుకుంటూ, 'హు ఆర్‌ యూ' అని అడగడం ఈ సినిమాపై జనం తీర్పుకు పరాకాష్ఠ!
- రెంటాల జయదేవ


(ప్రజాశక్తి దినపత్రిక, 11 జనవరి 2013, శనివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
................................................................................

Saturday, January 11, 2014

స్ఫూర్తి ప్రదాత మాలతీచందూర్ - విజయవాడ పుస్తక మహోత్సవ సభలో వక్తలు


విజయవాడ, న్యూస్‌లైన్ : సుప్రసిద్ధ రచయిత్రి మాలతీచందూర్ యావత్ మహిళాలోకానికి స్ఫూర్తిప్రదాత అని పలువురు వక్తలు కొనియాడారు. రచయిత్రి మాలతీచందూర్ ‘జీవితం-సాహిత్యం’పై విజయవాడ పుస్తక మహోత్సవ ప్రాంగణంలో గురువారం సాయంత్రం సదస్సు జరిగింది. ప్రధానవక్తగా హాజరైన సాహితీ వేత్త కేబీ లక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ సాహిత్యాన్ని తెలుగువారికి చేరువ చేసిన సుప్రసిద్ధ రచయితల్లో మాలతీచందూర్ ఒకరన్నారు.

ఆమెను గొప్ప అనువాదకురాలిగా పేర్కొంటూ మాలతీచందూర్ అనువాద సాహిత్యాలను గురించి సభకు వివరించారు. సంప్రదాయ, అభ్యుదయ భావజాలాన్ని కలిపి నేటితరానికి రచనల ద్వారా మార్గనిర్దేశం చేశారని చెప్పారు. ఆరు దశాబ్దాల పాటు వివిధ పత్రికల్లో పాఠకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఘనత మాలతీచందూర్‌దేనన్నారు.



సభకు అధ్యక్షత వహించిన సాహితీవేత్త డాక్టర్ రెంటాల జయదేవ్ మాట్లాడుతూ మాలతీచందూర్‌ను సాహితీప్రియులందరూ తమ కుటుంబ సభ్యురాలిగా భావించేవారన్నారు. సాహిత్యంలోని వివిధ కోణాలను స్పృశించిన ఆమె అన్ని ప్రక్రియల్లోనూ తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చారన్నారు. ఆమె రచించిన పిండి వంటలు పుస్తకాలు సైతం ఎంతో జనాదరణ పొందిందని ఆయన గుర్తుచేశారు.


(సాక్షి దినపత్రిక, విజయవాడ, 3 డిసెంబర్ 2013, శుక్రవారం, పేజీ నం. 9లో ప్రచురితం - Sakshi | Updated: January 03, 2014 01:17 - IST)


ఇక, ఈనాడు దినపత్రిక, విజయవాడ, 3 డిసెంబర్ 2013, శుక్రవారం, పేజీ నం. 11లో ప్రచురితమైన వార్త లింకు ఇదీ....
http://www.eenadu.net/district/inner.aspx?dsname=Krishna&info=kri-zonal#25









































ఇక, ఆంధ్ర పత్రిక, విజయవాడ, 3 డిసెంబర్ 2013, శుక్రవారం, పేజీ నం. 8లో ప్రచురితమైన వార్త ఇదీ...


...............................................................