జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, August 15, 2013

దేశ విభజనను కెమేరాలో బంధించిన ఛాయాచిత్ర చరిత్రకారిణి మార్గరెట్

పురుషాధిక్యత ఎక్కువగా కనిపించే రంగంలో వారికి సవాలు విసిరిన మహిళ ఆమె. ఛాయాచిత్రాలు తీయడం మగవాళ్ళ గుత్త సొత్తుగా ఉన్న రోజుల్లో వారికి దీటుగా, చాలా సందర్భాల్లో వారి కన్నా మేటిగా వృత్తి నైపుణ్యం చూపిన ఉత్సాహశీలి ఆమె. అమెరికాకు చెందిన సుప్రసిద్ధ మహిళా ఫోటోజర్నలిస్టు మార్గరెట్‌ బూర్క్‌-వైట్‌కు ఇలాంటి విశిష్టతలెన్నో ఉన్నాయి. జన బాహుళ్యంలో విశేష ప్రాచుర్యమున్న 'లైఫ్‌' మ్యాగజైన్‌కు స్టాఫ్‌ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారామె. ఇరవయ్యో శతాబ్దానికి చెందిన కీలక ఘట్టాలెన్నిటినో ఆమె తన కెమేరాలో బంధించారు. ఆ క్రమంలో ఆమె ప్రపంచంలోని సంక్షుభిత ప్రాంతాలెన్నిటినో సందర్శించారు. మానవ జాతి చరిత్ర గతిని మార్చేసిన ఇరవయ్యో శతాబ్దపు ఘట్టాలెన్నింటినో ఆమె ఛాయాచిత్ర బద్ధం చేశారు.

ప్రపంచంలో యుద్ధ వార్తలను పత్రికలకు అందించే పనిలో నియుక్తురాలైన మొట్టమొదటి మహిళా విలేఖరి కూడా ఆమె. అలా తొలి మహిళా 'వార్‌ కరెస్పాం డెంట్‌'గా ఆమె రెండో ప్రపంచ యుద్ధ వార్తా దృశ్యాలను జనం ముందుకు తెచ్చారు. అలాగే, సోవియట్‌ యూనియన్‌లో పర్యటించి, అక్కడి అంశాలను ఛాయాచిత్ర బద్ధం చేయడానికి అనుమతి పొందిన తొలి అమెరికన్‌ కూడా ఆమే.
ఆమె సోవియట్‌ యూనియన్‌ అంతా తిరిగి, అక్కడ శరవేగంతో సాగుతున్న పారిశ్రామికీకరణను ఫోటోలు తీశారు. అంతే కాకుండా, క్రెమ్లిన్‌లో స్టాలిన్‌ ఫోటో కూడా తీశారు.
మన దేశానికి సంబంధించి కూడా మార్గరెట్‌ ఫోటోలకు ప్రత్యేకత ఉంది. ఆమె తీసిన అత్యంత ప్రముఖమైన ఫోటోలు అనేకం భారతదేశ స్వాతంత్య్ర సముపార్జన సమయంలోవి కావడం విశేషం. దేశం భారత, పాకిస్తాన్‌లుగా విభజనకు లోనై, బ్రిటీషు పరిపాలన నుంచి స్వాతంత్య్రం వైపు అడుగులు వేసిన సమయంలో ఆమె తీసిన అద్భుతమైన ఫోటోలెన్నో ఇవాళ ఆనాటి చరిత్రను కళ్ళకు కడుతున్నాయి.
మహాత్మా గాంధీ, మహమ్మద్‌ అలీ జిన్నాలతో సహా ఆ కాలపు ప్రముఖ నేతలందరినీ ఆమె ఫోటోలు తీశారు. పట్టుబట్టి, కావాల్సిన విధంగా ఆమె ఫోటోలు తీసే పద్ధతి చూసి, 'హింసాకారిణి' అంటూ ఆ రోజుల్లోనే గాంధీ ఆమెను ఛలోక్తిగా పిలిచేవారు. దేశ విభజన సమయంలో లక్షలాది ప్రజలు వలస పోవడం, మత ఘర్షణల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం ఆమె కళ్ళారా చూశారు. భారత ఉపఖండం రెండు స్వతంత్ర దేశాలుగా చీలిన ఘట్టానికి ఆమె, ఆమె కెమేరా ప్రత్యక్ష సాక్షులు.



''1946లో వసంతకాలపు తొలి రోజుల్లో నేను భారత్‌కు వెళ్ళాను. అప్పటికే భారతదేశ స్వాతంత్య్రానికి పునాది పడింది. ఆ ఏడాదిలో చాలా కాలం నేను భారత్‌లోని వివిధ ప్రాంతాలకు పర్యటించాను. ఆపైన నేను స్వదేశానికి తిరిగి వచ్చాను. ...కానీ, భారతదేశం గురించి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని గుర్తించాను. అందుకే, భారత్‌కు మళ్ళీ వచ్చి, 1947లో కొంత భాగం, ఆ మరుసటి ఏడాది అంతా ఇక్కడే గడిపాను'' అని మార్గరెట్‌ తన అనుభవాల్లో పేర్కొన్నారు.
1904 జూన్‌ 14న జోసెఫ్‌ వైట్‌, మిన్నీ బూర్క్‌ దంపతులకు మార్గరెట్‌ జన్మించారు. ఆ దంపతుల ముగ్గురి సంతానంలో రెండో వ్యక్తి - మార్గరెట్‌. ప్రకృతినీ, ప్రాణులనూ అమితంగా ప్రేమించే తల్లితండ్రుల ప్రభావంతో ఆమె పెరిగారు. పాముల లాంటి సరీసృపాలతో చెలిమి చేసిన ఆమె దాదాపు ఓ జంతుశాస్త్రవేత్త అవుతుందేమో అని అందరూ అనుకున్నారు.
అయితే, ఫోటోగ్రఫీ మీద, ఫోటోలు తీసే విధానాలను మెరుగుపరచడం మీద ఆమె తండ్రికి ప్రేమ చాలా ఎక్కువ. ఆయనకు సహాయకురాలిగా వ్యవహరించారు.
నిజానికి, ఆమె ఎన్నడూ ఓ ప్రొఫెషనల్‌ ఫోటోగ్రాఫర్‌ కావాలని అనుకోలేదు. అయితే, కాలేజ్‌లో ఉండగా తమ ఇంటి దగ్గర, కొండల నేపథ్యంలో ఓ శిబిరానికి ఆమె ఫోటోగ్రఫీ కౌన్సెలర్‌గా వ్యవహరించాల్సి వచ్చింది. తెలతెలవారుతుండగానే కొండల నేపథ్యంలో ఆ శిబిరం ఫోటోలు తీయడానికి రాత్రంతా ఆమె సహనంతో వేచి చూసేవారు. అలా తీసిన ఓ ఫోటో ప్రతులు కొన్ని వందల సంఖ్యలో అమ్ముడయ్యాయి.
దాంతో, ఫోటోగ్రఫీని వృత్తిగా చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. అదే జీవితంగా గడిపారు. ''నాకు పనే దైవం. పని మీద అంతటి గౌరవం నాలో పెంపొందింపజేయ డానికి మా నాన్న గారే కారణం!'' అని మార్గరెట్‌ చెప్పారు.
సమకాలీన పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ఫోటోల రూపంలో ప్రతిఫలించే మ్యాగజైన్‌గా 'లైఫ్‌' పత్రిక అమెరికాలో ప్రారంభమైనప్పుడు ఫోటో జర్నలిస్టుగా తొలి అవకాశం ఆమెకే దక్కింది. అవసరమైన ఒకే ఒక్క గొప్ప ఫోటో కోసం ఎన్ని రీళ్ళు ఖర్చు చేసినా నష్టం లేదని ఆమెకు కెరీర్‌ తొలినాళ్ళలోనే అర్థమైపోయింది. అందుకే, ఆమె మిగిలినవాళ్ళు చాలనుకొనేదాని కన్నా చాలా ఎక్కువ ఫోటోలు తీసేవారు. అందుకు ఒక్క కెమేరా చాలదు కాబట్టి, ఒకేసారి అయిదు కెమేరాలను వెంట ఉంచుకొనేవారు.
అలా ప్రపంచమంతా తిరుగుతూ ఫోటోలు తీయడం ద్వారా ఆమె పేరు, ముఖం, ఫోటోలు లక్షల మందికి సుపరిచితమయ్యాయి. భారత్‌, పాకిస్తాన్‌ల విభజనతో పాటు జనం లక్షలాదిగా వలస వెళ్ళిన ఘట్టాన్ని కెమేరాలో చిత్రాలుగా బంధించడానికి 'లైఫ్‌' మ్యాగజైన్‌ ఆమెను ప్రత్యేకంగా నియోగించింది. అలా 1946 నుంచి 1948 వరకు ఆమె భారతదేశం నలుమూలలా పర్యటించారు. ఎంతోమందితో స్నేహ సంబంధాలు నెరపారు. ఆమె రాతలు, ఫోటోలు ఆ కథలను మన కళ్ళకు కడతాయి. ''భారత, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న రోడ్లన్నీ శరణార్థుల గుంపులతో క్రిక్కిరిసిపోయాయి. కొత్తగా తలెత్తిన సరిహద్దుల వెంట భవిష్యత్తు తెలియకుండా వారంతా వెళుతున్న దృశ్యాలు బైబిల్‌ కాలాన్ని గుర్తు చేశాయి'' అని రాశారామె.
విశేషం ఏమిటంటే, భారతదేశంలో తనకు కలిగిన అనుభవాలనూ, దేశ స్వాతంత్య్రం, విభజన సమయంలో తాను తీసిన ఫోటోలనూ కలిపి 'హాఫ్‌వే టు ఫ్రీడమ్‌: ఎ రిపోర్ట్‌ ఆన్‌ ది న్యూ ఇండియా ఇన్‌ ది వర్డ్స్‌ అండ్‌ ఫోటోగ్రాఫర్స్‌ ఆఫ్‌ మార్గరెట్‌ బూర్క్‌-వైట్‌' పేరిట ఆ రోజుల్లోనే పుస్తక రూపంలో వెలువరించారామె.
ఫోటోజర్నలిస్టుగా విస్తృతమైన జీవితానుభవాలున్న మార్గరెట్‌ ఆ అంశాలన్నిటినీ స్పృశిస్తూ, 'పోర్‌ట్రయిట్‌ ఆఫ్‌ మైసెల్ఫ్‌' పేరిట ఆత్మకథ రాశారు. ఆమె మరణానంతరం ఆమెపై జీవిత చరిత్ర గ్రంథం కూడా వచ్చింది. చిత్రం ఏమిటంటే, దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌బరో రూపొందించిన 'గాంధీ' (1982) చిత్రంలో కూడా మార్గరెట్‌ పాత్ర కనిపిస్తుంది. దాన్ని బట్టి అప్పటి మన చరిత్రలో ఆమెకు ఎంతటి అవిస్మరణీయ పాత్ర ఉందో అర్థం చేసుకోవచ్చు.
నలభై ఏడేళ్ళ వయస్సులో తనకు పార్కిన్‌సన్స్‌ వ్యాధి వచ్చినట్లు గ్రహించిన ఆమె ధైర్యంగా ఆ వ్యాధిని ఎదుర్కొన్నారు. వ్యాయామం, ధ్యానం ద్వారా దాన్ని అదుపులో ఉంచుకొనేందుకు ప్రయత్నించారు. అందు కోసం వివాదాస్పదమైన ఓ శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆ తరువాత మరో ఇరవై ఏళ్ళ పాటు మార్గరెట్‌ చురుగ్గా ఫోటోలు తీస్తూ, ప్రయాణాలు సాగిస్తూ గడిపారు.
క్రమంగా పరిస్థితులు కష్టంగా మారినప్పటికీ, జీవితం మీద, చేస్తున్న పని మీద ఆఖరి వరకు ఆసక్తినీ, ఉత్సాహాన్నీ ఆమె కోల్పోవకపోవడం విశేషం. 1971లో ప్రమాదవశాత్తూ కిందపడిన ఆమె కదలలేని పరిస్థితికి చేరుకొని, కన్ను మూశారు. టెలివిజన్‌ ఆవిర్భావంతో ఫోటో జర్నలిజమ్‌లో స్వర్ణయుగానికి తెర పడుతున్న రోజుల్లోనే ఈ అత్యుత్తమ ఫోటో జర్నలిస్టు తుదిశ్వాస విడిచారు.
మార్గరెట్‌ చనిపోయిన ఓ ఏడాది తరువాత ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన 'లైఫ్‌' మ్యాగజైన్‌ ఆమె ఫోటోలతో పాపులరైన పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలోకి మారిపోవడం విషాదం. వెరసి, ప్రపంచంలోని అత్యుత్తమ మహిళా ఫోటో జర్నలిస్టుల్లో ఒకరిగా మార్గరెట్‌ ఇవాళ్టి నవ యువ మహిళా ఫోటోగ్రాఫర్లకు నిరంతర స్ఫూర్తిప్రదాత అంటే అతిశయోక్తి కాదు. ఆమె కెమేరాలో బంధించిన దృశ్యాలే అందుకు తిరుగులేని ఉదాహరణ
- రెంటాల జయదేవ 
(Published in 'Praja Sakti' daily, 15th Aug 2013, Thursday, Page No.5)
.....................................................

మానని గాయం... తీరని దుఃఖం... - భారతదేశ విభజన

వేర్వేరు మతాల ప్రాతిపదికన 1947లో 'రెండు దేశాల' ఆవిర్భావం జరిగింది. ఆ ఆవిర్భావ క్రమంలో కొన్ని పదుల లక్షల మంది తరతరాలుగా తమ పురిటిగడ్డ అయిన ప్రాంతాన్ని వదిలేసి, అనిశ్చితమైన, అగమ్యగోచరమైన ప్రాంతానికి శరణార్థులుగా వలస పోవాల్సి వచ్చింది. పశ్చిమ ప్రాతంలో దాదాపు కోటీ 12 లక్షల మంది, మరో మాటలో చెప్పాలంటే 78 శాతం మంది జనాభా అటు నుంచి ఇటూ, ఇటు నుంచి అటూ వలస వెళ్ళారు. వారిలో చాలామంది పంజాబ్‌ ప్రాంతానికి చెందినవారు. దాదాపు 53 లక్షల మంది ముస్లిమ్‌లు భారతదేశం నుంచి పాకిస్తాన్‌లోని పశ్చిమ పంజాబ్‌కు వెళ్ళి పోయారు. ఇక, పాకిస్తాన్‌ నుంచి 34 లక్షల మంది హిందువులు, సిక్కులేమో తూర్పు పంజాబ్‌కు వలస వెళ్ళారు.


''1947 శరత్కాలంలో భారత దేశానికి ఉత్తరాన పంజాబ్‌ ప్రాంతానికి నేను వెళ్ళాను. కొత్తగా పురుడు పోసు కున్న రెండు స్వతంత్ర దేశాలను కెమేరాలో బంధించడం మొదలుపెట్టేందుకని నేనక్కడికి చేరుకున్నాను. అప్పటికి, పెద్దయెత్తున ప్రజానీకం ఒక దేశం వైపు నుంచి మరో దేశం వైపునకు తరలిపోతోంది. భారత యూనియన్‌నూ, పాకిస్తాన్‌నూ కలిపే రోడ్లన్నీ రద్దీ వేళల్లో మన 'పులాస్కీ స్కై వే' (అమెరికాలోని బోస్టన్‌ రాష్ట్రంలో రద్దీగా ఉండే నాలుగు లేన్ల అతి పెద్ద బ్రిడ్జి), 'సన్‌సెట్‌ బోలెవార్డ్‌' (లాస్‌ ఏంజెల్స్‌లో హాలీవుడ్‌ ప్రముఖులతో నిండిన వీధి) ఉన్నట్లున్నాయి. అయితే, రెండు వైపులా వరుసగా సాగే మోటారు కార్లకు బదులు ఇక్కడ ఎడతెగకుండా ఎడ్ల బండ్లు, గాడిదల మీద ఎక్కిన మహిళలు, చిన్న పిల్లలనూ, వృద్ధులనూ తమ భుజాల కెత్తుకొని కాలినడకన సాగుతున్న పురుషులు కనిపించారు.
'' ...ఆ మార్గ మధ్యంలోనే ఎందరో తల్లులు తమ పిల్లలకు జన్మనిచ్చారు. మరెంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు కలరాతో మరణిస్తే, మరికొందరు శత్రుత్వం వహించిన మతోన్మాద వర్గాల దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే, వారిలో చాలామంది మాత్రం ఆ జన ప్రవాహంలో నడిచీ నడిచీ డస్సిపోయి, రహదారి పక్కన కూర్చుండి పోయారు. మరణించడానికి సిద్ధమై, సహనంతో నిరీక్షించసాగారు...
''ఇలా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు - రెండు వైపులకూ భారీయెత్తున జనం వలస పోవడం చూస్తే, నాకు బైబిల్‌లోని వాతావరణం గుర్తొచ్చింది. పాత నిబంధనల గ్రంథంలో వచ్చే ఇజ్రాయల్‌ ప్రజల భారీ వలస నా స్ఫురణకు వచ్చింది. అయితే, భారతదేశ విభజనతో భారీయెత్తున వలస వెళ్ళిన ముస్లిమ్‌లు, సిక్కులు, హిందువులతో పోలిస్తే, ఇజ్రాయలీ వలస వారి సంఖ్య చిన్నబోతుంది. నేను ఫోటోలు తీస్తున్న సమయంలో... దాదాపు 50 లక్షల మంది ప్రజలు వలస పోతున్నారు. కాస్తంత దోవ దొరకగానే, వారిని అనుసరించడానికి మరికొన్ని పదుల లక్షల మంది నిరీక్షిస్తున్నారు. అత్యంత దయనీయమైన స్థితికి చేరిన ఈ లక్షల మందికి స్వాతంత్య్రం అందించిన అత్యంత కఠినమైన, క్రూరమైన తొలి ఫలం ఇదే!''
(ఈ భాగాలు ఫోటో జర్నలిస్ట్‌ మార్గరెట్‌ బూర్క్‌-వైట్‌ రచన
'హాఫ్‌వే టు ఫ్రీడమ్‌' నుంచి...) 
(Published in 'PrajaSakti' daily, 15th Aug 2013, Thursday, Page No.5)
..........................................................................

Tuesday, August 13, 2013

గాడి తప్పిన 'బండి' - రవీంద్రభారతి నిర్వహణపై సమాచార కమిషనర్‌ ఘాటు విమర్శలు

  • రవీంద్రభారతి నిర్వహణపై సమాచార కమిషనర్‌ ఘాటు విమర్శలు 
  • నిధుల దుర్వినియోగమంటూ సాంస్కృతిక సంచాలకుడిపై ధ్వజం

  • ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరిక 
  • సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదు చేయమంటూ ప్రజలకు సూచన
రాష్ట్రంలో అనేక సుప్రసిద్ధ సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు వేదిక అయిన సమావేశ మందిరం రవీంద్రభారతి ఇవాళ కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైపోయిందా? అక్కడ ప్రతిభావంతులైన తెలుగు కళాకారులకూ, అభిరుచి గల కార్యక్రమాల నిర్వాహక సంస్థలకూ సరైన అవకాశాలు లభించడం లేదా? సోమవారం ఉదయం రవీంద్రభారతి వేదికపైనే ఈ అనుమానాలు బలపడే పరిస్థితి వచ్చింది. సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌లోని కమిషనర్లలో ఒకరైన పి. విజయబాబు సభాముఖంగా ఆ సందేహాన్ని అందరిలో కలిగించారు. అది వట్టి అనుమానం కాదు నిజమని అనిపించేలా వేదికపై జరుగుతున్న ఓ పుస్తకావిష్కరణ - సినీ సంగీత కార్యక్రమానికి నిర్వాహకులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఆయన బాహాటంగా ప్రస్తావించారు. ''రాష్ట్రంలో నాయకులు గాడి తప్పిన పరిస్థితి నెలకొంటే, అధికారులేమో గాడిదలలా వ్యవహరిస్తున్నారు'' అంటూ దుయ్యబట్టారు.

సమాచార హక్కు చట్టం అమలు తీరును పర్యవేక్షించే బాధ్యతాయుతమైన ప్రభుత్వ హౌదాలో నియమితుడైన వ్యక్తి ఇలా ప్రభుత్వ శాఖ పైన, అధికారుల పైన నిప్పులు చెరగడం విశేషం. సోమవారం ఉదయం రవీంద్రభారతి ప్రాంగణంలో సభ జరుగుతుంటే, వేదికపైన కుర్చీలను సర్దడానికి కూడా మనుషులు లేని పరిస్థితి అప్పుడే ప్రత్యక్షంగా తలెత్తడంతో, 'ఎక్కడెక్కడి నుంచో వచ్చి, ఈ వేదికపై కార్యక్రమాలు చేసుకొనే కళాకారులకూ, కళాప్రియులకూ మనమిచ్చే గౌరవం ఇదేనా?' అంటూ ఈ సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్‌ ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించారు.
''ఇవాళ రవీంద్రభారతిని ఒక ప్రైవేటు ఆస్తిగా మార్చేసి, అయినవారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్లు (రవీంద్రభారతిని నిర్వహిస్తున్న) ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారు. మౌన ప్రేక్షకుల లాగా మనం ఈ అరాచకాన్ని భరిస్తున్నాం'' అని గతంలో పాత్రికేయుడిగా సుదీర్ఘ అనుభవమున్న విజయబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన పౌరులుగా దీన్ని అందరూ ప్రశ్నించాలని అన్నారు. ''అంగుష్ఠ మాత్రులైన వాళ్ళు సైతం ఇవాళ తామే చక్రవర్తుల లాగా వ్యవహరిస్తున్నారు. సాంస్కృతిక రంగంలో వీళ్ళు వట్టి పేరిగాళ్ళుగా తయారయ్యారు'' అని ఆయన విమర్శించారు. సాంస్కృతిక శాఖలో రవీంద్రభారతి నిర్వహణలో లక్షలాది రూపాయలను అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని విజయబాబు ఆరోపించారు.

వేదికపై జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ ఆయన, ''అసలు రవీంద్రభారతిలో కార్యక్రమం నిర్వహించుకోవాలంటే, ఇక్కడ ఎవరినో బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఏమిటి? ఎక్కడో క్యాలిఫోర్నియాలో స్థిరపడిన చిమటా శ్రీనివాస్‌ లాంటి వారు తెలుగు సినిమా, సినీ సంగీతం మీద ప్రేమతో ఈ పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవాలంటే, నానా తంటాలు పడాల్సి వచ్చింది. అవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే, ఆవేదనతో ఈ మాట మాట్లాడుతున్నాను'' అని అన్నారు. అంతేకాక, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నూరు రోజుల సాంస్కృతికోత్సవాలుగా ఈ ఆగస్టు 2 నుంచి నవంబర్‌ 9 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'శతరూప - 2013' కార్యక్రమాన్ని సైతం విజయబాబు విమర్శించారు.
''ఇక్కడ 'శతరూప' కార్యక్రమాల పేరిట లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ, అధికారులు తమ వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా 'అవధాన' కార్యక్రమాల లాంటివి నిర్వహిస్తున్నారు'' అని ఆయన, సాంస్కృతిక శాఖ ప్రస్తుత సంచాలకుడు - అవధాని రాళ్ళబండి కవితా ప్రసాద్‌ను అన్యాపదేశంగా విమర్శించారు. అంతటితో ఆగకుకండా, ''ఇక్కడ కోట్లాది రూపాయలు దుర్వినియోగమవుతున్నాయి. సమాచార హక్కు చట్టం కింద మీరు (సభకు హాజరైన ప్రజలు) ఎవరైనా పది రూపాయలు కట్టి, సమాచారం కోరితే, నేను వీళ్ళను జనం ముందుకు లాగి, సమాచార కమిషన్‌లో విచారిస్తాను'' అని ఆయన చెప్పారు. కళాప్రియులైన తెలుగువాళ్ళు అనేక రకాలుగా అవమానపడుతుండడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.
సొంత శాఖను వదిలి, డిప్యుటేషన్‌పై ముందు ధర్మ ప్రచారపరిషత్తులో, ఆ పైన సాంస్కృతిక శాఖలో పనిచేస్తున్న ప్రస్తుత సంచాలకుడు కాలపరిమితి దాటిపోయినా, పొడిగింపులు తెచ్చుకొని ఆ హౌదాలో కొనసాగుతున్నారని దుయ్యబట్టారు. సభలో కొద్దిసేపు అన్యాపదేశంగా ఆయనపై ఆరోపణలు చేసిన విజయబాబు, ఆ పైన ''బండెనక బండి కట్టి... పదహారు బళ్ళు కట్టి... అంటూ దొరలనే తరిమికొట్టిన చరిత్ర మనది. ఈ 'రాళ్ళబండి' ఎంత?'' అంటూ నిప్పులు చెరిగారు. రవీంద్రభారతి మరమ్మత్తులకు కోటీ 70 లక్షల రూపాయల నిధులు కేటాయింపు జరిగితే, అవి ఏమైపోయాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందనీ, రవీంద్రభారతి ప్రాంగణంలోనే ట్రాన్స్‌ఫార్మర్‌ కాలినా, వర్షం వచ్చి జనం తడిసిపోతున్నా దిక్కులేదనీ ఆరోపణలతో పాటు ఆవేదన వెలిబుచ్చారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ హైదరాబాద్‌ నగరంలోని ఏకైక ప్రతిష్ఠాత్మక సభా వేదిక అయిన రవీంద్రభారతిని కాపాడుకోవాలనీ, సిసలైన కళాకారులకూ - కళాభిమానులకూ ఇక్కడ వేదిక దక్కేలా చూద్దామని అన్న విజయబాబు, సభా నిర్వాహకులకు హైదరాబాద్‌ కళాభిమానుల పక్షాన క్షమాపణలు తెలిపారు.

విజయబాబు ఆవేదనతో ఆవేశంగా చేసిన ప్రసంగాన్ని వేదికపై ఉన్న భాషా - సాంస్కృతిక ప్రియుడు, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు (సమైక్యాంధ్ర ఉద్యమంతో రాజీనామా చేసిన) మండలి బుద్ధప్రసాద్‌తో సహా సభికులందరూ నిశ్శబ్దంగా విన్నారు. ''ఈ పరిస్థితికి ప్రభుత్వం సిగ్గుపడాలి'' అంటూ కొందరు కళాభిమానులు బిగ్గరగా అరిచారు. మౌనంగా ఈ అరాచకాలను భరించవద్దనీ, నిద్ర నుంచి మేల్కొని, ఈ ''అనాగరక, ఆటవిక'' మూకలను అధికార స్థానాల నుంచి పారదోలాలంటూ విజయబాబు పిలుపునిచ్చారు. అంతేకాక, ''రానున్న నెల రోజుల్లో రాష్ట్ర సాంస్కృతిక శాఖను ప్రక్షాళన చేయాలి. అందుకోసం మీరు (ప్రజలు) ఉద్యమిస్తే , నేనూ మీతో కలసి పాల్గొంటాను'' అని ఆయన అన్నారు. ఈ ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రితో సహా ఎవరినైనా కలుద్దామని అన్నారు. సంచలనం రేపిన ఈ ఘాటైన ప్రసంగం అక్కడి సభికులతో పాటు, ఉన్న కొద్దిమంది ప్రభుత్వ అధికారుల్లో చర్చకు దారితీసింది. 
(Published in 'Praja Sakti' daily, 13th Aug 2013, Tuesday, Page No. 10)   
......................................................................................................

సినీ సంగీత స్వర్ణయుగానికి అక్షరాంజలి - 'స్వర్ణయుగ సంగీత దర్శకులు' రచన

తెలుగు సినీ సంగీత రంగానికి స్వర్ణయుగ సమయంలో సంగీతం అందించినవారి జీవిత, సినీ విశేషాలతో రూపొందించిన అపురూప గ్రంథం 'స్వర్ణయుగ సంగీత దర్శకులు' అని పలువురు సినీ, సామాజిక ప్రముఖులు ప్రశంసించారు. ఈ పుస్తక రచన ఓ పరిశోధనాత్మక గ్రంథం స్థాయిలో సాగిందంటూ పుస్తక రచయిత - జర్నలిస్టు పులగం చిన్నారాయణను అభినందించారు. 'స్వర్ణయుగ సంగీత దర్శకులు' పుస్తకం ఆవిష్కరణ సోమవారం నాడు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లలో ఒకరైన పి. విజయబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి, భాషా - సాంస్కృతిక ప్రియులు మండలి బుద్ధప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవాస భారతీయుడు కూచిభొట్ల ఆనంద్‌, ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్‌, ఆర్‌.పి. పట్నాయక్‌, చక్రి, సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, 'సంతోషం' సినీ వారపత్రిక అధిపతి - సినీ నిర్మాత సురేష్‌ కొండేటి, 'జగద్గురు ఆదిశంకర' హీరో కౌశిక్‌బాబు తదితరులు వేదికపై ఆసీనులైన ఈ కార్యక్రమం ఆద్యంతం సభికులను ఆనందపరిచింది.

''తెలుగుసినీ సంగీతంలో నాగయ్యది తొలి తరమైతే, ఘంటసాలది రెండో తరమనీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంది మూడో తరం'' అని పేర్కొంటూ, సినీ రంగంలో మూడు తరాలుగా తమ మాధవపెద్ది కుటుంబం భాగమంటూ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్‌ గుర్తుచేశారు. కొన్నేళ్ళు ముందు పుట్టి ఉంటే, సినీ సంగీత స్వర్ణయుగంలో భాగస్థుణ్ణి అయ్యుండేవాడిననీ, అలా జరగకపోవడం తన జీవితంలో తీరని లోటని ఆర్పీ పట్నాయక్‌ అన్నారు. చరిత్ర సృష్టించిన సంగీత దర్శకుల జీవిత కథా రచన ద్వారా ఈ పుస్తక రచయిత, ప్రచురణకర్త కూడా చరిత్రలో భాగమయ్యారని చక్రి పేర్కొన్నారు. రచయితతో తమకున్న అనుబంధాన్ని రామజోగయ్య శాస్త్రి, సురేష్‌ కొండేటి ప్రస్తావించారు. ప్రచురణకర్తకు అండదండగా నిలిచిన గూడూరు సూర్యనారాయణ తదితరులు ఆనందం వ్యక్తం చేశారు.

వేదికపై ఉన్న సంగీత దర్శకులు ముగ్గురూ కలసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం ధర కేవలం అయిదొందల రూపాయలే అయినా, తొలి ప్రతిని రూ. 10,001 మొత్తానికి సురేశ్‌ కొండేటి ఉదారంగా కొనుగోలు చేశారు. రెండో ప్రతిని సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌ ఎల్‌. బాబూరావు రూ. 5,001 మెత్తానికి కొన్నారు. రెండున్నరేళ్ళ క్రితం వెలువరించిన తొలి ముద్రణ కన్నా మరింత ఎక్కువ సమాచారం, ఫోటోలతో, మరింత మంది సంగీత దర్శకుల పరిచయంతో ఈ మలి ప్రచురణను అందించినట్లు ప్రచురణకర్త - 'చిమటా మ్యూజిక్‌ డాట్‌కామ్‌' అధిపతి అయిన ప్రవాస భారతీయుడు చిమటా శ్రీనివాస్‌ వివరించారు.

ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ కొని భద్రపరచుకోదగినదని విజయబాబు వ్యాఖ్యానించగా, దాదాపు 280 మందిలో ఈ రచనలోకి రాకుండా మిగిలిపోయిన ఇతర 260 మంది సంగీత దర్శకుల వివరాలతో మరిన్ని పుస్తకాలు రాయాలంటూ బుద్ధప్రసాద్‌, రచయితకు సూచించారు. ఈ పుస్తకాన్ని ఆన్‌లైన్‌లో సైతం చదువుకొనేందుకు వీలుగా అందించాలని కూచిభొట్ల ఆనంద్‌ సూచన చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీబీ గౌరవార్థం 'అంకితం... నీకే అంకితం...' పేరిట నిర్వహించిన సినీ సంగీత కార్యక్రమంలో పలువురు ప్రముఖ గాయనీ గాయకులు ఆణిముత్యాల లాంటి పాటలు పాడారు. గాయని, నర్తకి శ్రుతకీర్తి స్పష్టమైన తెలుగు ఉచ్చారణతో, కార్యక్రమాన్ని నడిపించారు. 
(Published in 'Praja Sakti' daily, 13th Aug 2013, Tuesday, Page no. 8) 
.....................................................................................

Saturday, August 10, 2013

తమిళ దర్శకుడి మరో ఫ్రీ 'మేకు' - 'అన్న' సినిమా




నిజజీవిత గాథలను తీసుకొని, వాటిని తెర మీదకు ఎక్కించడం సినీ రంగంలో ఉన్నదే! కాకపోతే, ఆ కథల్లో కొత్తదనం ఏమిటి, దాన్ని ఏ రకంగా తెరపై చూపాలన్నది అవగాహన లేకపోతే మాత్రం తెర మీదకు వచ్చిన సినిమా అటు జీవిత కథకు కానీ, ఇటు సినీ కాల్పనిక కథకు కానీ న్యాయం జరగదు. తమిళ హీరో విజరుతో అక్కడి దర్శకుడు ఏ.ఎల్‌. విజరు రూపొందించిన అరవ సినిమా 'తలైవా'కు తెలుగు అనువాదం 'అన్న' ('బోర్న్‌ టు లీడ్‌' అనేది ఉపశీర్షిక) విషయంలో జరిగింది అదే! అటు నిజజీవిత కథకు కానీ, దానికి అనుబంధంగా అరువు తెచ్చుకున్న పాత హిట్‌ సినిమాల్లోని దృశ్యాల సమ్మేళనానికి కానీ దర్శకుడు న్యాయం చేయలేక పోయిన వెండితెరపై సినిమాస్కోప్‌లో వెక్కిరిస్తుంది.
సామాన్యులకు అండగా నిలిచే ఓ ప్రజా నాయకుడు, వ్యవస్థలోని కొందరితో పోరాడడం లాంటి కథ చాలా సార్లు తెరపై చూసినదే. ఆ మూసలో నుంచి వచ్చినదే ఈ 'అన్న' సినిమా కూడా!
................................................
తారాగణం: విజయ్, అమలాపాల్‌, సత్యరాజ్‌, సురేశ్‌, అభిమన్యుసింగ్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: జి.వి. ప్రకాశ్‌ కుమార్‌, కెమేరా: నీరవ్‌ షా, కూర్పు: ఆంటొనీ, నిర్మాత: బి. కాశీవిశ్వనాథం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏ.ఎల్‌. విజయ్ 
................................................
కథ ఏమిటంటే..
బొంబాయిలోని సామాన్య తెలుగు వారి సంక్షేమం కోసం, పోర్టు కార్మికుల బాగు కోసం కృషి చేస్తుంటాడు రామ్మూర్తి (సత్యరాజ్‌). రాజకీయ నేతలతో, వ్యాపారవేత్తలతో తగాదాల్లో కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్న ఆయన చిన్న పిల్లవాడైన తన కుమారుడు విశ్వను దూరంగా ఉంచి, పెంచుతాడు. చాలా ఏళ్ళ తరువాత... ఆ విశ్వ (హీరో విజరు) ఆస్ట్రేలియాలో తల్లి పేరిట 'గంగ' అంటూ మినరల్‌ వాటర్‌ను అందించే కంపెనీని నడుపుతుంటాడు. మరోపక్క 'తెలుగు బాయిస్‌' పేర డ్యాన్స్‌ గ్రూప్‌ను నిర్వహించే వ్యక్తిగా ఎదుగుతాడు. అక్కడ ఓ రెస్టారెంట్‌ నడుపుతున్న తండ్రీ, కూతుళ్ళు (సురేష్‌, హీరోయిన్‌ అమలాపాల్‌) అతనికి పరిచయమవుతారు. మీరా (అమలాపాల్‌)తో ప్రేమలో పడతాడు. తండ్రితో మాట్లాడి, పెళ్ళికి ఒప్పించడానికి బొంబాయి వస్తాడు. తీరా అక్కడ అనుకోని పరిస్థితుల్లో తండ్రి అరెస్టవుతాడు.ప్రత్యర్థుల బాంబు పేలుడులో మరణిస్తాడు.
హీరో ప్రేమించిన మీరా, అతని తండ్రి ఏం చేశారు? హీరో తండ్రిని చంపిందెవరు? అనాథలైపోయిన సామాన్యులకు అండగా ఉండేందుకు ఏం చేశాడు? తండ్రిని చంపిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? మీరాతో అతని ప్రేమ ఏమైందన్నది మిగతా సినిమా.
వివాదాస్పదమైన నిజ జీవిత స్ఫూర్తి
ముంబరులోని ప్రసిద్ధమైన మురికివాడ 'ధారావి'లో స్థిరపడి, అక్కడ తమిళులకు అండగా నిలిచిన దళితుడు ఎస్‌.ఎస్‌. కందసామి జీవిత ఘట్టాల నుంచి ఈ చిత్ర కథ స్ఫూర్తి పొందింది. తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతం నుంచి దేశ స్వాతంత్య్రానికి ముందు రోజుల్లోనే ముంబరు వెళ్ళి, అక్కడ తోళ్ళ వ్యాపారంలో స్థిరపడి, నిరుపేదలైన తోటి తమిళులకు అండగా నిలిచిన వ్యక్తి కందసామి. అక్కడే 'సౌత్‌ ఇండియన్‌ ఆది ద్రావిడ మహాజన్‌ సంఫ్‌ు'కు ఉపాధ్యక్షుడిగానూ ఎదిగారు. ప్రత్యర్థుల చేతుల్లో హత్యకు గురయ్యారు. అతని కుమారుడు రామసామి సైతం తండ్రి బాటలో నడిచి, అక్కడ తమిళులకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళ వెంట నిలిచారు. ఆ రెండు పాత్రలనూ ఆధారంగా చేసుకొనే 'అన్న' చిత్రంలో సత్యరాజ్‌, హీరో విజరులు పోషించిన పాత్రలను తీర్చిదిద్దారు దర్శకుడు ఏ.ఎల్‌. విజరు.
తమిళనాట కన్నా ముందే తెలుగులో!
కానీ, అదే ఈ చిత్రానికి తమిళనాట పెద్ద ఇబ్బందిగా కూడా మారింది. తన తాతనూ, తండ్రినీ అవాస్తవికంగా, అమర్యాదకరంగా చూపారంటూ మనుమడు కోర్టులో కేసు వేశారు. వాళ్ళ తెల్ల చొక్కా, అడ్డపంచె లాంటి వేషధారణతో సహా అన్నింటినీ ఈ చిత్రంలో అనుకరించారని ఆరోపణ. వాళ్ళను ముఠా నాయకుల లాగా, అక్రమ కార్యకలాపాలు చేసినవారిగా చూపించారని వివాదం. మరోపక్క మద్రాసుతో సహా వివిధ ప్రాంతాల్లో ఈ చిత్ర తమిళ మాతృకను ప్రదర్శించే సినిమా థియేటర్లకు బెదిరింపు లేఖలు కూడా వచ్చాయి. ఫలితంగా శుక్రవారమైన రంజాన్‌ పండుగ నాడు తెలుగు నాట ఈ సినిమా విడుదలైనా, తమిళ మాతృక మాత్రం విదేశాల్లో తప్ప, తమిళనాట, పాండిచ్చేరీలో జనం ముందుకు రానే లేదు.
తెలిసిపోయే పాత సినీ ప్రభావాలు
ఈ చిత్ర దర్శకుడు ఏ.ఎల్‌. విజరు గతంలో అజిత్‌తో 'కిరీడమ్‌' (మలయాళం 'స్ఫటికమ్‌'కు రీమేక్‌), ఆర్యతో 'మదరాస పట్టినమ్‌' (తెలుగులో '1947 - ఒక ప్రేమ కథ'), విక్రమ్‌తో 'దైవ తిరుమగళ్‌' (తెలుగులో 'నాన్న'), జగపతిబాబును తెరపై తొలిసారిగా విలన్‌గా చూపించిన 'తాండవం' (తెలుగులో 'శివతాండవం') లాంటి చిత్రాలు రూపొందించారు. వీటిలో మొదటిది రీమేక్‌ అయితే, మిగిలినవన్నీ 'ఫ్రీమేక్‌'లు. 'దైవ తిరుమగళ్‌' సినిమా హాలీవుడ్‌ చిత్రం 'అయామ్‌ శామ్‌'కూ, 'తాండవం' ఏమో 'డేర్‌ డెవిల్స్‌'కూ నాసిరకం కాపీలే!
తాజా 'అన్న'లో కూడా మణిరత్నం అప్పుడెప్పుడో ఇలాంటి (ముంబరులోని తమిళ డాన్‌ వరదరాజ ముదలియార్‌) కథతోనే తీసిన కమలహాసన్‌ 'నాయకుడు', రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన 'సర్కార్‌' చిత్రాల ప్రభావం కనిపించేస్తుంటుంది. అనేక ఇతర తెలుగు, తమిళ హిట్‌ చిత్రాల్లోని దృశ్యాలు, లొకేషన్లతో సహా తెలిసిపోతుంటాయి. మరి పదే పదే ఇలా కాపీ కథలతో, వరుస ఫ్లాపులిస్తూ కూడా పరిశ్రమలో ఆదరణ, నిర్మాతలు, హీరోల నుంచి పదే పదే అవకాశాలు పొందుతుండడం ఈ దర్శకుడి ప్రత్యేక ప్రతిభ.
నట, సాంకేతిక విభాగాలూ సో సో!
రజనీకాంత్‌ తరువాత దాదాపు అంత క్రేజున్న యువ హీరోగా విజరుకు తమిళ నాట పేరుంది. మాస్‌ చిత్రాలు ఎక్కువ చేయడంతో తమిళంలో 'ఇళయ దళపతి' (నవ యువ సేనాని) అని ఇమేజ్‌ పెట్టుకున్న విజరు ఈ సారీ డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశారు. కానీ, ద్వితీయార్ధానికి వచ్చే సరికి, ఆర్తులకు 'అన్న'గా నటన అతి కృత్రిమంగా అనిపిస్తుంది. బిగుసుపోయి, కాలూ చేయీ కదపడాన్ని కూడా అతి కష్టం మీద చేసేలా ఆ పాత్రను తీర్చిదిద్దడం ఎందుకో దర్శకుడికే తెలియాలి. అలా ఉందేమిటని హీరో కూడా ఆయనను అడిగినట్లు లేరు. మునుపటి 'దైవతిరుమగళ్‌', 'తాండవం' చిత్రాల్లో లాగానే ఇందులోనూ తన అభిమాన నాయిక అమలా పాల్‌ నే ఈ సినిమాలోనూ పెట్టారు దర్శకుడు ఏ.ఎల్‌. విజరు. ఆమె అభినయించడానికి ఈ సినిమాలో ఏమీ లేదు. ప్రథమార్ధంలో కాసేపు కనిపించినా, ద్వితీయార్ధానికి వచ్చే సరికి తళుక్కున మెరిసి, మాయమైపోతుంటుందా పాత్ర. సత్యరాజ్‌ తన పరిధి మేరకు నటించారు.
ప్రథమార్ధం మొదట్లో కాసేపు సినిమా ఫరవాలేదనిపించినా, ఆ తరువాత నుంచి కథ జీడిపాకమే! ద్వితీయార్ధానికి వచ్చే సరికి, హీరో, విలన్ల మధ్య ఒక్క వీడియో క్యాసెట్‌ కోసం పావుగంటపైగా నడిచే ఘట్టం, హఠాత్తుగా వచ్చి జొరబడే పాటలు విసుగును మరీ పెంచేస్తాయి. 



ఎంతకూ అవదేమిటి అనిపించే ఈ సినిమాలో కాస్తంత చెప్పుకోదగినవల్లా కెమేరామన్‌ నీరవ్‌ షా, ఎడిటర్‌ ఆంటోనీల పనితనం. ప్రస్తుతం తమిళనాట స్టార్‌ కమెడియన్‌ అయిన సంతానం హీరోకు స్నేహితుడిగా అందించిన వినోదం ఒక్కటే ఈ సినిమాలో అక్కడక్కడా కొద్దిగా రిలీఫ్‌. ''అవతలి వాడి ఆటోకు ఆయుధపూజ చేయకురా'' (హీరోతో) లాంటి అతని డైలాగులు కాస్తంత నవ్విస్తాయి. 
బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో హీరోకు బిల్డప్‌ పెంచడానికి తప్ప, ఈ చిత్రంలో గుర్తుంచుకోదగ్గ బాణీలేమీ లేవు. శశాంక్‌ వెన్నెలకంటి మాటలు కొన్ని చోట్ల నవ్వించినా, అవి ఈ సినిమాను కాపాడడం కష్టమే. వెరసి, ప్రస్తుతం తెలుగులో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో, కాలక్షేపానికి ఏదో ఒక సినిమాకు వెళదామని అనుకున్న వారి సహనానికి దాదాపు మూడు గంటల ఈ సా...గదీత సినిమా ఓ పరీక్ష! 
- రెంటాల జయదేవ
(Published in Praja Sakti daily, 10th August 2013, Saturday, Page No. 8)

https://www.youtube.com/watch?feature=player_embedded&v=5pmpFXu-jxg
.....................................................................

Thursday, August 8, 2013

ఉద్యమాలతో తెలుగు సినిమా ఉక్కిరిబిక్కిరి



'ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు రావడమంటే' బహుశా ఇదేనేమో! రాష్ట్రాన్ని విభజించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, 'సమైక్యాంధ్ర ప్రదేశ్‌ పరిరక్షణ' కోసం కోస్తా ఆంధ్రలో సాగుతున్న ఉద్యమం తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలుగు చిత్ర సీమలో మునుపెన్నడూ లేని రీతిలో దాదాపు 60 కోట్ల దాకా వ్యాపారం చేసిన 'అత్తారింటికి దారేది', అలాగే రూ. 50 కోట్ల దాకా వ్యాపారం చేసిన 'ఎవడు' లాంటి పెద్ద సినిమాల విడుదల అనిశ్చితిలో పడింది. మరోపక్క చిన్న చిత్రాలు ఈ విరామాన్ని సైతం వినియోగించుకోలేని సంకట స్థితిలో ఇరుక్కున్నాయి. వెరసి, చిత్ర నిర్మాణానికని తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతూ నిర్మాత, ప్రదర్శనకు తగినన్ని సినిమాలు లేక - వసూళ్ళ రాక ఎగ్జిబిటర్‌ అస్తుబిస్తు అవుతున్నారు. వెరసి మొన్నటి దాకా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో, తాజాగా సమైక్య ఉద్యమంతో రెండిందాలా ఆర్థికంగా దెబ్బ తగిలింది - తెలుగు చిత్ర సీమకే!

దాదాపు మూడున్నరేళ్ళ పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడూ తెలుగు సినీ పరిశ్రమకు వ్యాపారపరంగా నష్టం జరిగింది. ఇప్పుడు తాజా 'సమైక్య' ఉద్యమంతోనూ అదే పరిస్థితి! నిజానికి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ సమయంలోనే విడుదలైన జూనియర్‌ ఎన్టీయార్‌ 'అదుర్స్‌', అల్లు అర్జున్‌ 'ఆర్య-2', పవన్‌కల్యాణ్‌ 'కెమేరామన్‌ గంగతో రాంబాబు' లాంటి కొన్ని ఎంపిక చేసిన హీరోల చిత్రాలకు ఉద్యమకారుల దెబ్బతో ఆర్థికంగా నష్టం వాటిల్లింది. అయితే, ఏకంగా భారీ చిత్రాల విడుదలలే వాయిదా పడడం లాంటివి జరగలేదు.

రిలీజ్‌కు రాజకీయాల దెబ్బ!
కానీ, ఈసారి 'సమైక్య' ఉద్యమ సెగ చిత్రాల రిలీజ్‌ తేదీలపై పడింది. ''అవును. అది నిజమే! అప్పట్లో నిరసనల వల్ల కొందరు హీరోల సినిమాల ఆదాయంపై దుష్ప్రభావం పడింది. ఇప్పుడేమో, కోస్తా ఆంధ్ర ప్రాంతంలోని పరిస్థితుల వల్ల భారీ చిత్రాలను విడుదల చేస్తే, బంద్‌ల నేపథ్యంలో అనుకున్నంత ఆదాయం రాదని నిర్మాతలు రిలీజ్‌ను పోస్ట్‌పోన్‌ చేసుకోవాల్సి వస్తోంది'' అని 'ఎవడు' చిత్ర నిర్మాత - నైజామ్‌ ప్రాంతంలో ప్రముఖ పంపిణీదారు అయిన 'దిల్‌' రాజు, 'ప్రజాశక్తి'తో అన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమానికి జై కొట్టి, మంత్రి పదవి రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు కేంద్రమంత్రి - నటుడు చిరంజీవి తలొగ్గకపోవడంతో, ఆయన 'మెగా' కుటుంబంలోని వ్యక్తుల చిత్రాలను అడ్డుకుంటామంటూ సమైక్య ఉద్యమకారులు బాహాటంగా ప్రకటించారు. దాంతో, భారీ మొత్తాలకు బేరం కుదుర్చుకొని, సీమాంధ్రలో రామ్‌చరణ్‌ తేజ్‌ 'ఎవడు', పవన్‌కల్యాణ్‌ 'అత్తారింటికి దారేది' చిత్రాలను విడుదల చేయడానికి సిద్ధమైన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలవరపడుతున్నారు. ఉద్యమం సెగ వల్ల తాము పెట్టే భారీ పెట్టుబడికి తగ్గట్లు వసూళ్ళు రావని అనుమానిస్తున్నారు. అందుకే, ఈ ఉద్యమ పరిస్థితుల్లో సినిమా విడుదల వద్దంటూ, వారిస్తున్నారు.

ఆగస్ట్ 21న అయినా 'ఎవడు' వస్తుందా?
ఇవన్నీ కలసి పెద్ద సినిమాలతో పాటు, చిన్న సినిమాలనూ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు ఇరకాటంలోకి నెట్టాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోని 'అంతకు ముందు - ఆ తరువాత', జె.కె. భారవి నిర్దేశకత్వంలోని 'జగద్గురు ఆది శంకర' లాంటి చిన్న చిత్రాలు అన్ని పనులూ పూర్తి చేసుకొని కూడా, ఈ పరిస్థితుల వల్ల ప్రస్తుతానికి రిలీజ్‌ డేట్‌ చెప్పలేక, విడుదలను ఆపుకొని కూర్చోక తప్పలేదు. 
''సినిమాలను ఎవరో అడ్డుకుంటారనో, ఆపుతారనో రిలీజ్‌లను పోస్ట్‌పోన్‌ చేయడం లేదు. గోదావరి జిల్లాలు, నెల్లూరు, సీడెడ్‌ లాంటి చోట్ల బంద్‌లతో, కీలకమైన తొలి వారం వసూళ్ళు తగ్గిపోయే ప్రమాదం ఉండడంతో, సినిమా విడుదలల్ని వెనక్కి నెట్టాల్సి వస్తోంది'' అని 'దిల్‌' రాజు సైతం అంగీకరించారు.
ఇక, 'అత్తారింటికి...' చిత్రానికి దారి ఇస్తూ, వెనక్కి వెళ్ళిన 'ఎవడు' నిజానికి ఈ ఆగస్టు 21న జనం ముందుకు రావాలి. కానీ, ఆ తేదీకైనా ఆ సినిమా వస్తుందా అన్నది అనుమానమే. ''ఎవరైనా సరే పరిస్థితులు నియంత్రణలోకి వచ్చే వరకు సినిమాల రిలీజ్‌ను ఆపుకోక తప్పదు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపులో ఉంటే, ఆగస్ట్‌ 21న 'ఎవడు' రిలీజ్‌ చేయాలనే ఇప్పటికీ అనుకుంటున్నాం. అఫ్‌కోర్స్‌! 'అత్తారింటికి...' వాళ్ళతో కూడా మాట్లాడి, ఓ తుది నిర్ణయం తీసుకుంటాం'' అని 'దిల్‌' రాజు వివరించారు.
అయితే, రేపు రాష్ట్రంలో పరిస్థితులు కొంత చక్కబడిన తరువాత కూడా తెలుగు సినీ పరిశ్రమకు మరో ఇబ్బంది తప్పదు.
అది ఏమిటంటే, అప్పటి దాకా రిలీజ్‌ను ఆపుకొని, వాయిదా వేసుకొని కూర్చొన్న సినిమాలన్నీ ఒక దాని వెంట మరొకటిగా, చకచకా వస్తాయి. దాంతో, అందుబాటులో ఉండే హాళ్ళ సంఖ్య, వచ్చే వసూళ్ళపై ప్రభావం పడుతుంది. ''ఆగస్ట్‌ తొలి వారాంతంలో రంజాన్‌, ఆ వెంటనే వస్తున్న స్వాతంత్య్ర దినోత్సవంతో వరుస సెలవులున్నాయి. సినిమా వసూళ్ళకు బాగా కలిసొచ్చే ఆ వారం కాస్తా ఇప్పుడు చిన్నా, పెద్దా తెలుగు సినిమాలేవీ లేకుండా వృథా అయిపోతోంది. ఇది సినీ పరిశ్రమకు నష్టమే'' అని 'దిల్‌' రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్న చిత్రాలే దిక్కు
రాష్ట్రంలోని పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయన్నది ఇప్పుడు బేతాళ ప్రశ్న. తెలంగాణ అనుకూల ప్రకటనతో ఇప్పుడు నైజామ్‌ ఏరియాలో ఆనందాతిరేకాలు వ్యక్తమవుతూ, సినిమాల విడుదలకు ఇబ్బంది లేని వాతావరణముంది. కానీ, మరోపక్క ఆంధ్రా, సీడెడ్‌ (దత్త మండలాలుగా పిలిచే రాయలసీమ) ఏరియాల్లో మాత్రం ఆవేదన, ఆగ్రహం పెల్లుబుకుతూ, సినిమాలు నడిచే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదో ఒక ప్రాంతాన్ని బుజ్జగించేందుకు ఏ చిన్న ప్రకటన వెలువడినా, అది రెండో ప్రాంతంలో నిరసనల్ని పెంచే ప్రమాదముంది. 

''అందుకే, ఇది చాలా సున్నితమైన పరిస్థితి. ఇదే ధోరణి కొనసాగితే, సరిగ్గా నెల తరువాత సెప్టెంబర్‌ 6న రావాల్సిన రామ్‌చరణ్‌ తేజ్‌ 'తుఫాన్‌' (హిందీ చిత్రం 'జంజీర్‌'కు తెలుగు వెర్షన్‌) మినహా ఇంకే పెద్ద చిత్రమూ రానున్న రోజుల్లో తెలుగులో విడుదల కాకపోవచ్చు. హిందీ చిత్ర నిర్మాతలు దాదాపు 6 నెలల ముందే డేట్లు, థియేటర్లతో సహా అన్ని నిర్ధారించుకొని ఉంటారు కాబట్టి, వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు. కాబట్టి, రాష్ట్రంలో పరిస్థితులతో సంబంధం లేకుండా 'తుఫాన్‌' సెప్టెంబర్‌ 6నే వచ్చేయాలి. అప్పటికీ ఉద్యమ ప్రభావం ఉంటే, ఆ చిత్రాన్ని కొనుగోలు చేసినవారిపై ఆ దెబ్బ పడే ముప్పు పొంచి ఉంది'' అని దర్శకుడు వరప్రసాద్‌ భవిష్యత్‌ పరిణామాలను అంచనా వేశారు.
అయితే, రోజువారీ సమస్యల నుంచి విరామం కోసం వెండితెర కాల్పనికతను ఆశ్రయించే సగటు సినీ ప్రియులకూ, అలాగే ఆ యా హీరోల అభిమానులకూ మాత్రం ఈ మొత్తం పరిణామాలు నిరాశ కలిగిస్తున్నాయి. 
''సినిమా చూసి సేద తీరదామంటే, వీలు లేకుండా పోయింది. ఫ్రెండ్స్‌ అందరం కలసి 'అత్తారింటికి...' చిత్రం చూద్దామని అనుకున్నాం. ఆ చిత్రం రిలీజ్‌ ఎప్పుడన్నది కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొనడం నిరాశ కలిగిస్తోంది'' అని ఇటీవలే ఇంజనీరింగ్‌ పూర్తయిన హైదరాబాద్‌ విద్యార్థిని మానస మోహన రవళి వ్యాఖ్యానించారు. 
ఆమె లాంటి సినీ ప్రియులు ఇంకా చాలామందే ఉన్నారు. వారంతా ప్రస్తుతానికి షారుఖ్‌ ఖాన్‌ 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' లాంటి హిందీ చిత్రాలతో, ఇంగ్లీషు చిత్రాలతో, 'అన్న, 'బిర్యానీ' లాంటి తమిళ డబ్బింగ్‌లతో, రిస్క్‌ చేసి విడుదలయ్యే ఒకటీ అరా చిన్న చిత్రాలతో సరిపెట్టుకోవాల్సిందే! మరి, వారందరిలో మళ్ళీ ఉత్సాహం నింపే తెలుగు సినీస్టార్ల భారీ చిత్రాల రిలీజ్‌ ఎప్పుడు? అది కచ్చితంగా ఆ సినిమాలపై పెట్టిన కొన్ని పదుల కోట్ల రూపాయల విలువైన ప్రశ్న. 
- రెంటాల జయదేవ 

(ప్రజాశక్తి దినపత్రిక, 7 ఆగస్టు 2013, బుధవారం నాటి సంచిక, పేజీ నం.8లో ప్రచురితం)
........................................