జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, July 19, 2013

హాలీవుడ్‌ స్థాయి సినిమా ఇది..అందుకు నేను హామీ! -'ఓం-3డి' హీరో కల్యాణరామ్‌తో ఇంటర్వ్యూ (పార్ట్ 1)


హాలీవుడ్‌ స్థాయి సినిమా ఇది..అందుకు నేను హామీ!



  • 'ఓం-3డి' హీరో కల్యాణరామ్‌
ఓ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌కు దాదాపు పది నెలలు... ప్రొడక్షన్‌కు మరో ఏడాదికి పైగా... రీ-రికార్డింగ్‌కే రెండున్నర నెలలు... వట్టి సౌండ్‌ మిక్సింగ్‌కు 35 రోజులు... వెరసి ఒక్క పోస్ట్‌ ప్రొడక్షన్‌కే సంవత్సర కాలం..ఇదంతా ఏ హాలీవుడ్‌ చిత్ర నిర్మాణమో కాదు! సినిమా తీస్తున్నది ఏ హాలీవుడ్‌ నిర్మాతో అంత కన్నా కాదు! ''భారతదేశంలోనే మొట్టమొదటి యాక్షన్‌ 3డి చిత్రం''గా వస్తున్న ఆ సినిమా పక్కా తెలుగు చిత్రం. తీస్తున్నది తెలుగు నిర్మాత, హీరో. '' సినిమా మీద ప్రేమతో, కొత్తదనం కోసం తపనతో '' ఇలా రెండున్నరేళ్ళ పైచిలుకు కాలాన్నీ, పాతిక కోట్లకు పైగా ధనాన్నీ వెచ్చించి 'ఓం - 3డి' చిత్రాన్ని నిర్మించారు హీరో నందమూరి కల్యాణరామ్‌. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్ర విడుదలకు సంబంధిం చిన పనుల్లో తలమునకలై ఉన్న ఆయన తీరిక చేసుకొని మరీ దాదాపు రెండు గంటల పాటు 'ప్రజాశక్తి'కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ భారీ ప్రయత్నం వెనుక కథా కమామిషు, తన కెరీర్‌ గురించి వివరించారు. హీరోయిజమ్‌ కానీ, వారసత్వ హజం కానీ లేకుండా మామూలుగా వ్యవహరించే ఈ 35 ఏళ్ళ యువకుడితో భేటీలోని ముఖ్యాంశాలు:
పదేళ్ళ కెరీర్‌ను సింహావలోకనం చేసుకుంటే ఏమనిపిస్తోంది?
ఈ పదేళ్ళ ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగిచూసుకుంటే, ఓ చిన్న తృప్తి ఉంది. ప్రతి సినిమానూ ఓ మెట్టుగా చేసుకొని, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనేది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ప్రయాణం సాగించాను. నా మొదటి రెండు సినిమాలూ ఫ్లాపులే. ఆ సమయంలో కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో నేను చేసిన ప్రయత్నం 'అతనొక్కడే!' ఆ సినిమా పెద్ద హిట్టయ్యింది. జనం నన్ను తమవాణ్ణి చేసుకున్నారు. ఎప్పటికప్పుడు జనం స్పందన, అభిమానుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, కొత్త తరహా చిత్రాలు చేస్తూ వచ్చాను. తప్పులు తెలుసుకుంటూ, వాటిని దిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాను. ఈ పదేళ్ళనే కాదు, ఇలా జీవితాంతం ఓ నటుడిగా నన్ను నేను విశ్లేషించుకుంటూ వెళతా. ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ, ఈ పదేళ్ళలో పది చిత్రాలతో పది మెట్టు ఎక్కా. కొత్త తరహా ప్రయత్నం చేసి, వాళ్ళు ఆశించినది ఇచ్చినప్పుడల్లా జనం నన్ను ఆశీర్వదించారు.
జనం ఏం ఆశిస్తున్నారో ఎలా తెలుసుకుంటారు?
చిత్రాల జయాపజయాలతో పాటు, ప్రేక్షకుల నుంచి, అభిమా నుల నుంచి వచ్చే స్పందనను బట్టి తెలుసుకుంటాం. ప్రతి నటుడికీ ఒక యాక్సెప్టెన్స్‌ రేషియో ఉంటుంది. ఆ నటుడు ఏ తరహా పాత్రలు, కథలు చేసినప్పుడు జనం అక్కున చేర్చుకుంటున్నారో గ్రహించడం కీలకం. మా బాబాయి బాలకృష్ణ కానీ, తారక్‌ (ఎన్టీయార్‌ జూని యర్‌) కానీ పక్కా కమర్షియల్‌ చేసెయ్యగలరు. కానీ, నేను పూర్తి కమర్షియల్‌ సినిమా చేసినా, పూర్తి వినోదభరిత చిత్రం చేసినా నప్పదు. నా నుంచి జనం ఆశిస్తున్నది - కమర్షియల్‌ సినిమాలైనా, విభిన్న తరహా స్క్రీన్‌ప్లే ఉన్న చిత్రాలనే! కథలో, కథనంలో ఏదో ఒక్క కొత్త కోణం ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి 'అతనొక్కడే', 'హరేరామ్‌' చిత్రాలు చేసినప్పుడల్లా జనం నన్ను ఆశీర్వదించారు. 'అతనొక్కడే' పెద్ద హిట్టయింది. ఇక, 'హరే రామ్‌' చిత్ర విజయ స్థాయి ఒక రేంజ్‌లోనే ఉన్నప్పటికీ, దానికి నా కెరీర్‌లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్ళు వచ్చాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో 'ఓం' చిత్రాన్ని త్రీడీలో తీస్తున్నాం.

పదేళ్ళలో పది సినిమాలంటే చాలా తక్కువ కదా! ఎందుకలా?
తక్కువే! కానీ, నేను అంతే! నా దగ్గరకు వచ్చిన ప్రతి సినిమా చేయను. నాకు నచ్చితేనే చేస్తాను. అందులో ఏదైనా కొత్తదనం ఉందేమో చూసుకొంటాను. అలాగైతే, 'మీరు చేసిన ప్రతి సినిమాలో ఏం కొత్తదనముంది? వాటిలో ఏం నచ్చి చేశారు? వాటిలో కూడా కొన్ని ర కూడా ఫ్లాపయ్యాయి కదా!' అని మీరు అడగవచ్చు. ఆ నిర్ణీత క్షణంలో నాకు బాగుందని, కొత్తగా అనిపిస్తే చేసేశానంతే! ఆ క్రమంలో కొన్నిసార్లు మంచి సినిమాకు 'నో' చెప్పి, రొటీన్‌ సినిమా చేయడమూ జరిగింది. నచ్చితేనే సినిమా చేస్తాననే విధానం వల్ల ఓ సుఖం ఉంది. తీరా సినిమా వచ్చాక, దాని ఫలితం ఎలా ఉన్నా సరే మనల్ని మనమే తప్ప, వేరెవరినీ తప్పు పట్టనక్కర లేదు. నేనెవరినీ తప్పు పట్టాలనుకోను. కాబట్టి, ఈ పద్ధతి హాయి కదా!
మీ చిత్ర నిర్మాణ సంస్థకు యన్టీఆర్‌ ఆర్ట్స్‌ అని పేరు పెట్టడం సెంటిమెంటల్‌ గానా? వారసత్వ లబ్ధి కోసమా?
వారసత్వ లబ్ధి కోసం కానే కాదు! ఒకవేళ ఎవరైనా అలా అనుకున్నా, మా తాత గారి పేరు వాడుకొనే సర్వహక్కులూ ఆ రక్త సంబంధీకులం, మనుమలమైన మాకు ఉన్నాయి కదా! నిజం చెప్పాలంటే, అలా అనుకోలేదు. నేను నిర్మాతగా మారదామనుకొన్నప్పుడు మా నాన్న గారికి (హరికృష్ణ) చెప్పాను. గతంలో 'దాన వీర శూర కర్ణ', 'డ్రైవర్‌ రాముడు', 'అనసూయమ్మ గారి అల్లుడు', 'పట్టాభిషేకం' లాంటి పలు చిత్రాలు నిర్మించిన నాన్న గారు 'చిత్ర నిర్మాణం చాలా కష్టమ'ని చెప్పినా, నా పట్టుదల చూసి 'సరే! నీ ఇష్టం నాన్నా' అన్నారు. మా చిత్ర నిర్మాణ సంస్థకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ, నాన్న గారినే సలహా అడిగాను. నేనెప్పుడూ కుటుంబ వ్యవస్థనూ, విలువలనూ నమ్ముతాను. మనల్ని కని, పెంచినవారి అండదండలు, ఆశీస్సులకు మించి మనకు ఏం కావాలి? అందుకే, 'మీరేం పేరు చెబితే అది పెడతా!' అన్నాను. అప్పుడాయన క్షణం కూడా ఆలస్యం చేయకుండా 'నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌' అని చెప్పారు. అయితే, ఫిల్మ్‌ ఛాంబర్‌లో వేరెవరైనా యన్‌.టి.ఆర్‌. అనే సంక్షిప్త నామం వచ్చేలా పేరు పెడితేనో అన్న అనుమానం లేవనెత్తారు. దాంతో, నేనే ఆ రెండు పేర్లతోనూ బ్యానర్‌ను రిజిస్టర్‌ చేయించాను. మా నిర్మాణ సంస్థ పేరు వెనక ఇంత కథ ఉంది.

కానీ, నిర్మాతలకు, దర్శకులకు అందుబాటులో ఉంటున్నారా?
పారితోషికం గురించి కూడా ఎన్నడూ ఆలోచించని నేను అందరికీ అందు బాటులోనే ఉన్నా. ఎవరైనా మంచి కథతో రావచ్చు.

మీ చిత్రాల్లో సరైన హిట్లు రెండే! అయినా పట్టుదలగా ఇప్పుడీ 'ఓం' లాంటి భారీ చిత్రాన్ని నెత్తికెత్తుకున్నారు. ఏమిటీ ధైర్యం?

ఏమోనండీ నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి నాది మొండి పట్టుదల, ధైర్యం. నాకు నచ్చిన పని చేయడానికి తెగించి ముందుకు వెళుతుంటాను. ఇక, భారీగా చిత్రాలు తీయడం మాటంటారా? నాకు నచ్చిన పని చేస్తున్నాను. వీటి వల్ల ప్రాణాలు పోయేదేమీ లేదు కదా! మహా అయితే, వాణిజ్య ఫలితం కాస్త అటూ ఇటూ అవుతుంది. అంతేగా! లాభమైనా, నష్టమైనా అది నాకు, నా కుటుంబానికే కదా! వేరెవరినీ ఎఫెక్ట్‌ చేయడం లేదు కదా! పైగా, ఈ రోజు వరకు నా ఫ్యామిలీ నన్నెప్పుడూ ఎంతో ప్రోత్సహిస్తూ, ధైర్యంగా నిలిచారు. వాళ్ళకే అంత నమ్మకం, ధైర్యం ఉన్నప్పుడు నేనెందుకు ఆందోళన చెందడం! పైగా, ఏ విషయంలోనైనా ఆశావహంగా ఉండాలి. దాన్ని బట్టే ఫలితం!
మొండితనం వచ్చింది నాన్న గారి నుంచా?
మా నాన్న గారి నుంచి, అంత కన్నా ముఖ్యంగా మా తాత గారి నుంచి! కథ ఎంతో నచ్చి, ఇండస్ట్రీలో ఎంతో అందగాడని పేరున్న ఆయనే ముడతలు పడిన ముఖంతో కనిపించే 'బడిపంతులు' చిత్రంలోని వేషం వేశారు. అందరూ ఏవేవో అనుకున్నా, ఆయన మొండి తనం ఫలితాన్నిచ్చింది. కాబట్టి, ధైర్యే సాహసే లక్ష్మీ అంటూ తెగించాల్సిందే! అయితే, 'ఓం' త్రీడీ చిత్రం విషయంలో నాది ఆత్మవిశ్వాసం. దానితో వచ్చిన మొండితనం. (నవ్వుతూ...) మొండితనం, మూర్ఖత్వం, ఆత్మవిశ్వాసం - మూడూ ఒకే వరసలో ఉంటాయి. ఒక్కోదానికీ మధ్య కొద్దిగా తేడా! ఆ గీత దాట కూడదు.
ఇంత భారీగా 'ఓం' తీయడానికి కారణం?
సినిమా కథ బాగా నచ్చింది. ఓ ప్రత్యేకమైన స్క్రీన్‌ప్లే ఉంది. గతంలో హీరోయిన్‌ ఒకరిని చంపడమనే దానితో కథ మొదలుపెట్టి, 'అతనొక్కడే' చిత్రంతో కొత్త తరహా స్క్రీన్‌ప్లేను అందించాం. అలాగే, ఇప్పుడీ 'ఓం -3డి' కూడా ఓ అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో, విభిన్నమైన కోణంతో నడిచే సినిమా. తరువాత వచ్చే సన్నివేశం ఏమిటన్నది ఊహించలేం. పైగా, ఇది చక్కటి కమర్షియల్‌ చిత్రం.
ట్రైలర్‌ బాగుంది. కానీ, రొటీన్‌ పగ, ప్రతీకారాల కథేమోనని అనిపిస్తోంది. ఈ కథకు త్రీడీ అవసరమంటారా?
(ఠక్కున అందుకుంటూ...) చూడండి. 'హరే రామ్‌' సినిమాకు మేము 'ఫ్లరు కామ్‌'ను వాడార. 'ఫ్లరు కామ్‌' అంటే, మనం రిమోట్‌తో నియంత్రిస్తూ ఉంటే, మనకు కావాల్సిన పద్ధతిలో గాలిలో ఎగురుతూ, కావాల్సిన కోణంలో చిత్రీకరణ సాగించే కెమేరా! ఆ వినూత్న టెక్నాలజీని వాడి, సినిమా తీయడం తెలుగు చలనచిత్ర చరిత్రలో అదే తొలిసారి. ఆ తరువాత దాన్ని తారక్‌ 'శక్తి', వెంకటేశ్‌ 'షాడో', తదితర చిత్రాల్లో వాడారు. అందుబాటులో ఉన్న ఆధునికతను వాడుకుంటే ప్రేక్షకుడి సినిమా వీక్షణ అనుభూతి ఎంతో పెరుగుతుంది. గతంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలు హిట్టవుతున్నా కలర్‌కు వెళ్ళాం కదా! అలాగే, ఆడియోలో కూడా మోనో నుంచి స్టీరియో, డి.టి.ఎస్‌, డాల్బీ మీదుగా ఇప్పుడు ఆరో-3డి దాకా వచ్చాం కదా! ఇవన్నీ ఎందుకంటే, సినిమా బాగుందంటే, దానిలోని అనుభూతిని ఒకటికి పదింతలు చేయడానికి! 


 - రెంటాల జయదేవ    
(Published in 'Praja Sakti' daily, Monday, 15 July 2013)
.............................................................

Thursday, July 18, 2013

ఎన్.టి.ఆర్. చిత్ర నిర్మాణ సంస్థ - ఆరు పదుల ఘన చరిత్ర


తొలి పూర్తి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' 1932 ఫిబ్రవరి 6న విడుదలైనప్పటి నుంచి ఇప్పటి దాకా ఎనభై ఒక్కేళ్ళ పై చిలుకు కాలంలో 4 వేలకు పైగానే తెలుగు సినిమాలు వచ్చినట్లు ఓ అంచనా. ఈ చిత్రాల నిర్మాణం ద్వారా తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపించినవారు ఎందరో ఉన్నారు. తొలినాళ్ళ బొంబాయి, కలకత్తా నిర్మాతల నుంచి స్ఫూర్తిని అందుకొని, 'వేల్‌ పిక్చర్స్‌' (పి.వి. దాసు), 'రోహిణీ పిక్చర్స్‌' (హెచ్‌.ఎం. రెడ్డి), 'వాహినీ' పిక్చర్స్‌ (బి.ఎన్‌. రెడ్డి), సారథీ, భరణి (రామకృష్ణ - భానుమతి), 'విజయ' (నాగిరెడ్డి - చక్రపాణి) లాంటి తెలుగువారెందరో చిత్ర నిర్మాణంలోకి వచ్చారు. అయితే, చిత్ర పరిశ్రమలోని ప్రధాన విభాగాలైన చిత్ర నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన, స్టూడియో నిర్వహణలు - నాలుగింటిలోనూ నాటి నుంచీ నేటి దాకా కొనసాగుతున్న సంస్థ తెలుగునాట 'ఎన్‌.ఏ.టి' ఒక్కటే! ఇది నటుడు, దర్శక - నిర్మాత కీర్తిశేషులు నందమూరి తారక రామారావు స్థాపించిన సంస్థ. 'నేషనల్‌ ఆర్ట్‌ ్స'గా మొదలై 'రామకృష్ణా హార్టీకల్చరల్‌ స్టూడియోస్‌'గా ఇవాళ్టికీ కొనసాగుతున్న ఈ ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థకు ఇవాళ్టితో 60 ఏళ్ళు నిండుతున్నాయి. ఆ సంస్థ పతాకంపై ఎన్టీయార్‌ నిర్మించిన తొలి చిత్రం 'పిచ్చి పుల్లయ్య' ఇప్పటికి సరిగ్గా ఆరు దశాబ్దాల క్రితం 1953 జూలై 17న విడుదలైంది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఘనచరిత్రలోని వివరాలు, విశేషాల ప్రత్యేక కథనం...

కాలేజీ రోజుల నుంచే రంగస్థల పాత్రలు పోషిస్తూ వచ్చిన ఎన్టీయార్‌ తరువాతి రోజుల్లో మిత్రులతో కలసి 'నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌' పేరు మీద నాటక సమాజం నెలకొల్పారు. 1945 ప్రాంతం నుంచి అప్పటి బెజవాడ (నేటి విజయవాడ) కేంద్రంగా రంగస్థల ప్రదర్శనలిచ్చేవారు. ఆ నేపథ్యమే ఆయనను 1947లో సినిమా రంగం వైపు నడిపించింది. ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలో ప్రణాళికా రచన దశలోనే ఆగిపోయిన 'శ్రీమతి' చిత్రానికి గాను 1947లో ఎన్టీయార్‌ తొలిసారిగా మేకప్‌ స్టిల్‌ దిగారు. ఆ పైన ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలోనే 'మనదేశం' (విడుదల: 1949 నవంబర్‌ 24)తో వెండితెర మీదకు వచ్చారు.

కళాభిరుచితో చిత్ర నిర్మాణంలోకి...
రంగస్థలం మీద నటుడిగా మొదలైన ఎన్టీయార్‌ సినీ రంగానికి వచ్చాక కేవలం నటనతో సరిపెట్టుకోలేదు. అక్కడ నుంచి నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక, స్టూడియో విభాగాలకు ఎన్టీయార్‌ క్రమంగా విస్తరించారు. తాను ఏ రంగంలోకి వచ్చి, పేరు, డబ్బు సంపాదించారో, అదే రంగ పురోభివృద్ధికి తన వంతుగా తోడ్పడ్డారు. తొలిసారిగా తెరపై కనిపించిన సంవత్సరం మీద నాలుగు నెలలకే 'పాతాళభైరవి' (1951 మార్చి 15)తో 'స్టార్‌ హీరో'గా జనసామాన్యానికి చేరువైన ఎన్టీయార్‌ను ఆయనలోని కళారాధన ఊరుకోనివ్వ లేదు. కళాకారుడిగా అభిరుచిని నిలుపుకొని, కళాత్మక విలువలున్న చిత్రాల నిర్మాణంతో ఆత్మసంతృప్తిని పొందడం కోసం సినీ నటుడైన మూడేళ్ళకే ఆయన నిర్మాతగా మారారు. 'నేషనల్‌ ఆర్టు ్స' పతాకంపై 'పిచ్చి పుల్లయ్య' నిర్మించారు.


ఆ చిత్రానికి పేరొచ్చినా, డబ్బు రాలేదు. దాంతో, చిత్ర నిర్మాణ సంస్థ పేరును స్వల్పంగా మార్చి, తమ నాటక సమాజమైన 'నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌' (ఎన్‌.ఏ.టి) పేరుతో 'తోడు దొంగలు' (1954 ఏప్రిల్‌ 15) నిర్మిస్తూ, నెగటివ్‌ టచ్‌ ఉన్న వయసు మళ్ళిన పాత్ర వేశారు. ఆ చిత్రానికీ ప్రశంసలే తప్ప, వసూళ్ళు రాలేదు. దాంతో, 'కేవలం సందేశాలతో కళాత్మక చిత్రాలు నిర్మించడం కాకుండా, కళనూ - వ్యాపారాన్నీ సమతూకంలో కలిపి, పంచదార పూతతో కూడిన మాత్రగా సందేశాన్ని అందించాలన్న అభిప్రాయానికి వచ్చా'రు ఎన్టీయార్‌. అలా ఆయన నిర్మాతగా తన మూడో చిత్రం 'జయసింహ' మొదలు చిత్ర నిర్మాణంలో విజయ పరంపరకు శ్రీకారం చుట్టారు.

అలా 1953లో ఆయన స్థాపించిన సంస్థ పెద్దబ్బాయి రామకృష్ణ మరణించాక 1966లో 'శ్రీకృష్ణ పాండవీయం'తో 'రామకృష్ణ - ఎన్‌.ఏ.టి' అయింది. స్టూడియో నిర్మాణం ప్రారంభించాక, 1974లో 'తాతమ్మ కల' నుంచి 'రామకృష్ణా సినీ స్టూడియోస్‌' అయింది. 1992లో 'సామ్రాట్‌ అశోక' నాటి నుంచి 'రామకృష్ణా హార్చీకల్చరల్‌ సినీ స్టూడియో'గా చిత్ర నిర్మాణం సాగిస్తోంది. కాలగతిలో రకరకాల పేర్లు మార్చుకుంటూ వచ్చినా ఇప్పటికి 60 ఏళ్ళుగా తెలుగు నాట చిత్ర నిర్మాణంలో ఉన్న ఏకైక సంస్థ ఇదే కావడం విశేషం. మధ్యలో 'ఎన్టీయార్‌ ఎస్టేట్‌ ప్రొడక్షన్‌' (200వ చిత్రం 'కోడలు దిద్దిన కాపురం' - 1970 అక్టోబర్‌ 21), 'తారకరామా ఫిల్మ్‌ యూనిట్‌' (చిత్రం 'డ్రైవర్‌ రాముడు' - 1979 ఫిబ్రవరి 2), 'ఎన్టీయార్‌ ట్రస్ట్‌' (క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు నిధుల కోసం 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' - 1991 ఏప్రిల్‌ 19) లాంటి వివిధ పతాకాలను నెలకొల్పారు ఎన్టీయార్‌. 996లో ఎన్టీయార్‌ మరణం తరువాత కూడా 'పెద్దన్నయ్య' (1997), 'శుభలేఖలు', 'గొప్పింటి అల్లుడు', 'యువరత్న', తాజాగా తారకరత్న హీరోగా 'వెంకటాద్రి' (2009) వరకు ఆయన వారసులు చిత్ర నిర్మాణ సంస్థను కొనసాగిస్తూ, సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు.

గణాంక వివరాల్లోకి వెళితే... ఈ ఆరు పదుల ప్రస్థానంలో మొత్తం 43 చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది. అందులో తెలుగు చిత్రాలు 40 కాగా, తమిళం రెండు ('శ్రీకృష్ణ పాండవీయం' తమిళ వెర్షన్‌ 'రాజసూయం', శివాజీ గణేశన్‌తో ఎన్టీయార్‌ 'చండశాసనుడు' రీమేక్‌ 'చరిత్ర నాయకన్‌'), హిందీ ఒకటి ('బ్రహ్మర్షి విశ్వామిత్ర' హిందీ వెర్షన్‌). ఈ చిత్రాల్లో కొన్నింటికి ఎన్టీయారే నిర్మాతగానూ వ్యవహరిస్తే, మరికొన్నింటికి ఆయన తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు, ఇంకొన్నిటికి కుమారులు హరికృష్ణ, రామకృష్ణ, మోహనకృష్ణల పేర్లు కనిపిస్తాయి. సాంఘికం, పౌరాణికం, చారిత్రక, జానపద కోవలు నాలుగింటిలోనూ చిత్రాలు తీసి, ఘనవిజయాలు సాధించిన తెలుగు సినీ సంస్థ ఇదొక్కటే కావడం మరో విశేషం. 'సీతారామ కల్యాణం' నుంచి 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' దాకా 10 పౌరాణికాలు, స్థల పురాణ కథ అయిన 'పాండురంగ మాహాత్మ్యం' నుంచి 'శ్రీనాథ కవిసార్వభౌమ' దాకా 7 చారిత్రకాలు తీసిన చిత్ర నిర్మాణ సంస్థగా చెరిగిపోని రికార్డు సృష్టించింది. 

ప్రతిభావంతులకు అవకాశం
ఎన్టీయార్‌ తన చిత్రాల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులను తెలుగు తెరకు తెచ్చారు. హీరోయిన్లుగా వహీదా రెహమాన్‌ ('జయసింహ'), బి. సరోజాదేవి ('పాండురంగ మాహాత్మ్యం'), గీతాంజలి ('సీతారామ కల్యాణం'), నాగరత్నం ('గులేబకావళి కథ'), కె.ఆర్‌. విజయ ('శ్రీకృష్ణ పాండవీయం'), మీనాక్షీ శేషాద్రి ('బ్రహ్మర్షి విశ్వామిత్ర')లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. సంగీత దర్శకుల్లో జోసెఫ్‌ - కృష్ణమూర్తి (గులేబకావళి కథ), సుప్రసిద్ధ హిందీ సంగీత దర్శకులు సి. రామచంద్ర (అక్బర్‌ - సలీం - అనార్కలి), రవీంద్ర జైన్‌ (బ్రహ్మర్షి విశ్వామిత్ర), మాటల రచయితల్లో సముద్రాల జూనియర్‌ (తోడు దొంగలు), కొండవీటి వెంకట కవి (దానవీర శూర కర్ణ), నాగభైరవ కోటేశ్వరరావు (బ్రహ్మర్షి విశ్వామిత్ర), రతన్‌బాబు (సామ్రాట్‌ అశోక), జంట రచయితలుగా పరుచూరి బ్రదర్స్‌ (అనురాగ దేవత), సినీ గీత రచయితల్లో సి. నారాయణ రెడ్డి (గులేబకావళి కథ), ఛాయాగ్రాహకుల్లో రవికాంత్‌ నగాయిచ్‌ ('సీతారామ కల్యాణం'), కె.ఎస్‌. ప్రకాశ్‌ ('డ్రైవర్‌ రాముడు'), నందమూరి మోహనకృష్ణ ('అగ్గి రవ్వ') తదితరులు ఈ బ్యానర్‌ నుంచి తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించినవారే!

ఏటికి ఎదురీదే ప్రయోగాలు
చిత్ర నిర్మాణంలో ప్రయోగాలకు కూడా ఎన్టీయార్‌ వెరవలేదు. కొంత ఆఫ్‌బీట్‌ దోవలో, డీ గ్లామర్‌ పాత్రలు వేసే ధోరణికి 'తోడు దొంగలు' శ్రీకారం చుట్టింది. నెగటివ్‌ పాత్ర వేస్తూ, కొత్త హీరో హీరోయిన్లతో 'సీతారామ కల్యాణం' తీశారు. హీరో, విలన్‌ పాత్రలు రెండూ తానే ధరించి, ఏకకాలంలో నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించి 'శ్రీకృష్ణ పాండవీయం' తీయడం అప్పట్లో ఓ సంచలనం. అలాగే తెలుగులో త్రిపాత్రాభి నయానికీ (కులగౌరవం - 1972), దుర్యోధనుణ్ణి పాజిటివ్‌ కోణంతో చూపడానికీ (దాన వీర శూర కర్ణ - 1977), పంచపాత్రాభినయానికీ (శ్రీమద్విరాటపర్వం - 1979) తెర తీశారు.

నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఏటికి ఎదురీదే తత్వంతో సొంత సంస్థపై సినిమాలు తీయడానికీ ఎన్టీయార్‌ వెనుకాడలేదు. రాష్ట్ర విభజన ఉద్యమం జరుగుతున్నప్పుడు సమైక్యంగా ఉండాలంటే 'తెలుగు జాతి మనది... నిండుగ వెలుగు జాతి మనది...' అని పాట పెట్టి మరీ 'తల్లా? పెళ్ళామా?' (1970 జనవరి 8) తీశారు. అలాగే, దొంగ బాబాలను వ్యతిరేకంగా 'కోడలు దిద్దిన కాపురం' (1970 అక్టోబర్‌ 21) నిర్మించారు. ఊరందరికీ భిన్నంగా కేంద్ర ప్రభుత్వ కుటుంబ నియంత్రణ విధానాన్ని వ్యతిరేకిస్తూ, 'తాతమ్మ కల' (1974 ఆగస్టు 30) కన్నారు. కథాపరంగా వేమన చరిత్రలో వచ్చే నగ సన్నివేశాన్ని సెన్సార్‌ కట్‌ చేయడానికి ఒప్పుకోకుండా, మూడేళ్ళ పాటు సెన్సార్‌తో పోరాడి 'శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' (1984 నవంబర్‌ 29) రూపొందించారు.

గమ్మత్తేమిటంటే, ఈ సంస్థపై వచ్చిన చిత్రాలు తొమ్మిందింటికి కేంద్ర ప్రభుత్వ ('తోడు దొంగలు', 'సీతారామ కల్యాణం', 'వరకట్నం'), రాష్ట్ర ప్రభుత్వాల (శ్రీకృష్ణ పాండవీయం, కోడలు దిద్దిన కాపురం, శ్రీకృష్ణసత్య, తల్లా పెళ్ళామా, తాతమ్మ కల) నుంచి అవార్డులు, గుర్తింపులు దక్కాయి. (1968లో రష్యాలో జరిగిన మాస్కో చలనచిత్రోత్సవానికి తెలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన చిత్రం 'ఉమ్మడి కుటుంబం'). తెలుగు నాట ఇప్పటి దాకా ఏ ఒక్క నిర్మాణ సంస్థకూ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఇన్ని అవార్డులు, ఇంత గుర్తింపు రాకపోవడం విశేషం.

ఇప్పటికీ ప్రదర్శన, పంపిణీ, స్టూడియో విభాగాల్లో..

రాష్ట్రంలోనే మొట్టమొదటి 70 ఎం.ఎం. థియేటర్‌గా రాజధాని హైదరాబాద్‌లో 'రామకృష్ణా' థియేటర్‌ (1968 నవంబర్‌ 8)ను నిర్మించి, ప్రదర్శక రంగంలోకీ ఎన్టీయార్‌ చిత్ర నిర్మాణ సంస్థ విస్తరించింది. ఆపైన అక్కడే 'రామకృష్ణా 35 ఎం.ఎం', అటు తరువాత కాచిగూడలో 'తారకరామా' (1978) హాళ్ళు కట్టారు. ఇప్పటికీ ఈ మూడు సినిమా హాళ్ళూ ఎన్టీయార్‌ కుటుంబ సభ్యుల నిర్వహణలోనే ఉన్నాయి.

అలాగే, 'అగ్గి రవ్వ' (1981 ఆగస్టు 14) చిత్రాన్ని 'రామకృష్ణా మోషన్‌ పిక్చర్‌ డిస్ట్రిబ్యూషన్‌' పేర విడుదల చేసి, పంపిణీ రంగంలోకి వచ్చారు. అప్పటి నుంచి నైజామ్‌ ప్రాంతంలో ఈ పంపిణీ సంస్థ ద్వారా సినిమాల విడుదల సాగిస్తూ వచ్చారు. ఇవాళ్టికీ సికింద్రాబాద్‌లోని ఆర్పీ రోడ్‌లో ఈ పంపిణీ సంస్థ నడుస్తోంది.

రాష్ట్ర రాజధానిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో 1974లో స్టూడియో నిర్మాణానికి కూడా ఎన్టీయార్‌ నడుం బిగించారు. ముషీరాబాద్‌లోని సుమారు 3 ఎకరాల సొంత స్థలంలో 'రామ కృష్ణా స్టూడియో' కట్టారు. 1976 జూన్‌ 7న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేతుల మీదుగా దాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 1980 మార్చిలో నాచారం ప్రాంతంలో పన్నెండెకరాల స్థలంలో 'రామకృష్ణా హార్టీకల్చరల్‌ సినీ స్టూడియో'ను నెలకొల్పారు. తరువాతి రోజుల్లో ముషీరాబాద్‌ నుంచి నాచారానికి స్టూడియోను పూర్తిగా తరలించారు. ఇప్పటికీ ఈ స్టూడియోలో షూటింగ్‌లు జరుగుతున్నాయి.

తొలి రోజుల్లో అభిరుచి గల కథా చిత్రాల నిర్మాణానికి మొగ్గు చూపిన ఎన్టీయార్‌ తీరా స్టూడియో నిర్మించాక, దానికి రోజువారీ పని కల్పించడం కోసం స్వీయ నిర్మాణ సంస్థపై 'అగ్గిరవ్వ', 'రౌడీ రాముడు - కొంటె కృష్ణుడు', 'సింహం నవ్వింది' లాంటి తక్కువ స్థాయి వాణిజ్య పంథా చిత్రాలనూ నిర్మించడం విషాదం.

ఏమైనా అరవై ఏళ్ళ క్రితం ఎన్టీయార్‌ నాటిన విత్తనం వటవృక్షమై, వివిధ శాఖలుగా విస్తరించి, ఇవాళ్టికీ చిత్ర పరిశ్రమలో తనదైన స్థానంలో కొనసాగడం విశేషం. ఇక, నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక, స్టూడియో విభాగాల్లో ఎన్టీయార్‌ కుటుంబం తరువాత నిర్మాత డి. రామానాయుడి 'సురేష్‌ ప్రొడక్షన్స్‌', రామోజీరావు 'ఉషాకిరణ్‌ మూవీస్‌' లాంటివి తెలుగు వారి కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాయి. దక్షిణాది సినీసీమలో ఇంతటి ఘన చరిత్ర మన తెలుగు సినిమాకు ఉండడం సినీ ప్రియులకు గర్వకారణమే!

- రెంటాల జయదేవ     

............................................................................

Monday, July 15, 2013

అరిగిపోయిన పోలీసు ఫార్ములా 'సింగం' ('యముడు2')- సమీక్ష



















 నిజాయతీగా ఉండే నిఖార్సయిన పోలీసు అధికారుల కథలు తెలుగు సినిమాకు అరిగిపోయిన బాక్సాఫీస్‌ ఫార్ములా. ఈ ఫార్ములాతో సవాలక్ష కథలు వచ్చేసినా, మళ్ళీ మళ్ళీ తీయడానికి బాక్సాఫీస్‌ విజయ సూత్రమే కారణం. అందులోనూ ఒక కథ కానీ, కథానాయక పాత్ర చిత్రణ కానీ జనరంజకమైందంటే, దాన్ని తిరగేసి, మరగేసి, బోర్లేసి ఒకటికి వంద కథలు అల్లడం సినీ సీమ అనుసరించే పద్ధతి. సినిమాలు కూడా సీరియళ్ళ లాగా ఒకటికి రెండు భాగాలుగా, సీక్వెల్స్‌గా వస్తున్నది అందుకే! ఆ కోవలోదే తాజా 'సింగం - యముడు2'.

........................................................................................................
తారాగణం : సూర్య, అనూష్క, హన్సిక, ముఖేశ్‌ ఋషి, రహమాన్‌, మాటలు : శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు : సాహితి, రామజోగయ్య శాస్త్రి, అనంత్‌ శ్రీరామ్‌, ఛాయాగ్రహణం : ప్రియన్‌, కూర్పు : వి.టి. విజయన్‌ - టి.ఎస్‌. జెరు, సమర్పణ: కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా, నిర్మాత: ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : హరి
.........................................................................

తమిళ హీరో సూర్యతో అక్కడి దర్శకుడు హరి తమిళంలో రూపొందించిన సినిమా 'సింగమ్‌' అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ 'యముడు' (2010)గా పెద్ద హిట్టయింది. దానికి కొనసాగింపు కథ - 'యముడు2'. భారతీయ పోలీసు గొప్పవాడనీ, దోషులను పట్టుకోవడానికి ప్రాణాల్ని పణంగా పెడతాడనీ, హీరో పాత్ర ద్వారా చెప్పించడం ఈ చిత్ర ఇతివృత్తం.

కథ ఏమిటంటే...

మొదటి భాగంలో లాగానే ఈ చిత్ర కథలోనూ కథానాయకుడు నరసింహం (సూర్య) నిజాయతీపరుడైన పోలీసు అధికారి. సముద్రతీర ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి అతడిని నియమిస్తారు. స్వయంగా రాష్ట్ర హౌమ్‌ మంత్రి అండదండలతో డి.ఎస్‌.పి.గా అతను నియమితుడవుతాడు. అయితే, పదవీ బాధ్యతలు చేపట్టకుండా, ఓ స్కూల్‌లో ఎన్‌.సి.సి. టీచర్‌గా పనిచేస్తూ, తీర ప్రాంతంలోని అసాంఘిక శక్తుల గుట్టుమట్లను ముందుగా పసిగట్టాలన్నది హీరో ఆలోచన. మంత్రి గారు కూడా అందుకు సరేనంటారు! ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఆ పనిలో ఉంటాడు హీరో.

కాకినాడ తీరంలో జరిగే ఈ కథలో భారు (ముఖేశ్‌ ఋషి) ముఠా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నట్లు హీరో గ్రహిస్తాడు. పైకి పరస్పర విరోధులుగా కనిపిస్తున్నా, ఊళ్ళోని మరో పెద్ద పారిశ్రామికవేత్త త్యాగరాజు (రెహమాన్‌) కూడా ఆ దంధాలో అతనికి భాగస్వామే! వారికి ఆ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న సూత్రధారి ఎవరన్నది హీరో కనిపెట్టే లోపలే, ఊళ్ళో కుల ఘర్షణలతో అదుపు తప్పుతున్న శాంతి భద్రతలను కాపాడడానికి హీరో తన పోలీసు ఉద్యోగంలో చేరిపోవాల్సి వస్తుంది. ఇక, అక్కడ నుంచి హీరోకూ, ఆ విలన్లకూ మధ్య మాటలు, చేతల యుద్ధం.
మన సముద్ర తీరానికి వస్తున్న మాదక ద్రవ్యాల వెనుక ఉన్నది అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా నేత డానీ (లండన్‌లో ఉంటున్న ఘనా సంతతికి చెందిన ఇంగ్లీష్‌ నటుడు డానీ సపానీ) అని యాదృచ్ఛికంగా హీరోకు తెలుస్తుంది. భారతీయ పోలీసులు లంచగొండులంటూ వెక్కిరించి, వేళాకోళం చేసి ఈ పెద్ద విలన్‌ తప్పించుకుంటాడు. ఓ పక్క ఊళ్ళోని విలన్లను ససాక్ష్యంగా పట్టుకోవడం, ఆ వెంట ఈ అంతర్జాతీయ విలన్‌ను వెంటాడడం - ఇదీ స్థూలంగా చిత్రకథ. ఈ ప్రధానమైన కథలో మధ్య మధ్య వచ్చిపోయేవి - హీరో పెళ్ళి వ్యవహారం, అతణ్ణి ప్రేమిస్తున్నానంటూ వెంటపడే స్టూడెంట్‌ సత్య (హన్సిక) ఉదంతం. హీరో అనుచర పోలీసులు, ఇతరులతో వినోదాత్మక ఘట్టాలు ఈ కథలో తాలింపులు.

నటన, సాంకేతిక విలువలు

అత్యంత రొటీన్‌గా సాగే ఈ కథలో హీరో సూర్య పోలీసు అధికారిగా శక్తిమంతంగా నటించారు. అతనికి డబ్బింగ్‌ కూడా అదే స్థాయిలో కుదిరింది. ఇక, కథానాయిక కావ్యగా అనూష్కది ఓ రెండు పాటలు, నాలుగు సన్నిశాలకు పరిమితమైన పాత్ర. హన్సిక విషయమూ అంతే! కనిపించేదే అంతంత మాత్రమైన ఈ పాత్రల్లో సహజంగా ఆ పాత్రధారులు నటించగలిగేదీ అతి తక్కువే. వినోదం కోసం సినిమాలో మరో పోలీసు అధికారి జమదగ్నిగా వివేక్‌, స్కూలులో పనిచేసే దాసుగా సంతానం కనిపిస్తారు. ముఖేశ్‌ ఋషి, రహమాన్‌లు తమ ప్రతినాయక పాత్రలను ఉన్నంతలో బాగానే పోషించారు. హీరోయిన్‌ తండ్రిగా నాజర్‌, హీరో తండ్రిగా రాధారవి, పోలీసు అధికారి కరీమ్‌గా మన్సూర్‌ అలీ ఖాన్‌, రాష్ట్ర హౌమ్‌ మంత్రిగా విజయకుమార్‌, ముఖ్యమంత్రిగా కె. విశ్వనాథ్‌, ఇంకా మనోరమ - ఇలా సినిమా నిండా తెలిసిన ముఖాలు చాలానే ఉన్నాయి.

'ఆపరేషన్‌ డి' పేరిట హీరోకు అన్ని రకాల పర్మిషన్లూ ఇచ్చేయడం, రాష్ట్ర హౌమ్‌ మంత్రి ఓ పోలీసును అంతర్జాతీయ డాన్‌ వేటకు దక్షిణాఫ్రికా పంపడం లాంటి వాటిలో లాజిక్‌లు వెతుక్కోవడం అనవసర శ్రమ. కథా రచయిత కూడా తానే అయిన దర్శకుడు విలన్లకూ, హీరోకూ మధ్య సంఘర్షణను సమర్థంగా చూపెట్టలేకపోయారు. అందరినీ గడగడలాడించే అంతర్జాతీయ ముఠా నేతగా చెప్పిన డానీకీ, హీరోకూ మధ్య ఎత్తులు పైఎత్తుల లాంటివేమీ లేకుండా, మాటలకూ, ముష్టి ఘాతాలకే చిత్ర కథ పరిమితమైపోయింది. అది ఒక రకంగా మైనస్సే! సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి దాకా ఏదో జరిగిపోతోంది, దాన్ని హీరో అడ్డుకుంటున్నాడనే బిల్డప్‌లే ఎక్కువ. అసలు కథ జరిగేది తక్కువ. అయితే, సినిమా ఎక్కడా నిదానమనిపించకుండా తెర మీద దృశ్యాలు ఏవో ఒకటి చకచకా వెళ్ళిపోతుంటాయి. ఈ సినిమాకున్న బలం అదే! ఆ మేరకు దర్శకత్వం, కూర్పు విభాగాలు విజయవంతమైనట్లే!
శశాంక్‌ వెన్నెలకంటి మాటలు, సాహితి, రామజోగయ్య శాస్త్రి, అనంత్‌ శ్రీరామ్‌ల పాటలు అనువాద వాసనలకు సాధ్యమైనంత దూరంగా సాగాయి. సినిమాలో వేర్వేరు చోట్లు హీరో పోలీసు హౌదాను వేర్వేరు రకాలుగా చూపించడం, రహమాన్‌ పోషించిన పాత్ర పేరును కూడా రెండు వేర్వేరు రకాలుగా చెప్పడం, అక్కరలేని చోట తెలుగు సబ్‌ టైటిల్సూ, అవసరమున్న సింహళీ యాస తమిళ డైలాగుల దగ్గర సబ్‌ టైటిల్సే లేకపోవడం లాంటి లోపాలు సినిమాలు తెలిసిపోతుంటాయి.

''వయసులో ఫిగర్‌ రావడం, వయసు మళ్ళాక షుగర్‌ రావడం'' కామన్‌ లాంటి ఒకటి రెండు డైలాగులకు థియేటర్‌లో జనం ఆనందిస్తారు.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంలో 'సింగం' అనే థీమ్‌ మ్యూజిక్‌తో పాటు ఒకటి రెండు పాటలు అలరిస్తాయి. నృత్యాల్లో సూర్య చులాగ్గా ఒదిగాడు. కొన్ని స్టెప్పుల్లో చిరంజీవి శైలిని గుర్తు తెచ్చాడు. యాక్షన్‌ సన్నివేశాల కోసం సూర్య సినిమా అంతా హడావిడిగా పరిగెడుతూనే ఉంటాడు. గొంతు చించుకొని అరుస్తూనే ఉంటాడు.

శివాలెత్తుతూ చెప్పే ఆ డైలాగులు, సింహపు పంజా విసురు శైలిలో హీరో కొట్టే దెబ్బల శబ్దాలతో థియేటర్‌లో చెవులు దిమ్మెత్తిపోతాయి. మధ్య మధ్యలో పాటలు. సినిమా ఆరంభమే మాస్‌ పాటతో! కథానాయిక అంజలి అందాలు ఆరబోస్తూ, ఐటమ్‌ గర్ల్‌గా నర్తించడం ఈ తొలి పాట విశేషం. సూర్య, అనూష్కల మధ్య పాటల్లో క్లైమాక్స్‌కు ముందు వచ్చే పాట ఆకట్టుకుంటుంది. కొన్నిసార్లు అతి అయినప్పటికీ, యాక్షన్‌ సన్నివేశాలు, హెలికాప్టర్ల షాట్ల చిత్రీకరణ దగ్గర సహజంగానే ఛాయాగ్రాహకుడు ఎవరన్న ఆసక్తిని రేకెత్తిస్తుంది. మొత్తం మీద, రెండున్నర గంటల సమయాన్ని ఎలాగోలా ఏ.సి. హాలులో గడిపేయాలను కోవడానికైతేనే, ఈ మాస్‌ కథా కథన చిత్రం జోలికి పోవడం ఒంటికీ, జేబుకీ మంచిది.

కొసమెరుపు : అంతర్జాతీయ విలన్‌ను హీరో పట్టి, కొట్టి జైలులో పెట్టడంతోనే సినిమాకు 'శుభం' కార్డు వేసేశారు. కొంపదీసి, మళ్ళీ హీరో పెళ్ళి, ఈ కొత్త విలన్‌ తదుపరి కథతో 'సింగం - యముడు 3' తీస్తారా ఏమిటి! బాబోరు! వెండితెర సింహం!! 

- రెంటాల జయదేవ 
(Published in Praja Sakti daily, 6th July 2013, Saturday, Page no.8)
.............................................

Sunday, July 14, 2013

'ఇన్ని లెక్కలుంటే.. అది చేసుండేవాణ్ణి కాదు!' - దర్శకుడు యేలేటి చంద్రశేఖర్‌తో ఇంటర్వ్యూ



















'ఇన్ని లెక్కలుంటే.. అది చేసుండేవాణ్ణి కాదు!' - దర్శకుడు యేలేటి చంద్రశేఖర్‌


ఆయన తొలి సినిమా వచ్చి ఇప్పటికి పదేళ్ళు. ఈ దశాబ్ద కాలంలో ఆయన రూపొందించినవి అయిదే సినిమాలు. కానీ, ప్రేక్షకుల్లో, పరిశ్రమలో మాత్రం ప్రతి సినిమా ముందు ఓ అంచనా పెంచగలిగారు. ఈ రోజు విడుదలవుతున్న సినిమాయే కాదు, ఆయన ప్రతి సినిమా ఏదో ఒక విభిన్నమైన ఆలోచనతో ఒక 'సాహసమే'. పదేళ్ళ క్రితం 'అన్ని సినిమాలూ ఒకేలా ఉండవు' అంటూ 'ఐతే..' చిత్రంతో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్న ఆ యువ దర్శకుడు యేలేటి చంద్రశేఖర్‌. నిధి అన్వేషణ చుట్టూ సాగే సరికొత్త అడ్వెంచరస్‌ యాక్షన్‌ చిత్రం 'సాహసం'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారీ ఈ నాలుగు పదుల సృజనశీలి. మాట తీరు, మనిషి తీరు కూడా సాదాసీదాగా ఉంటూ, 'అందరు దర్శకులూ ఒకేలా ఉండరు' అనిపించే ''చందు''తో ప్రజాశక్తి 'జీవన' సంభాషించింది. ముఖ్యాంశాలు: 

అసలు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది? 

మాది తూర్పు గోదావరి జిల్లా తుని దగ్గరలోని రేకవాని పాలెం. నాకు ఓ అక్క, ఓ చెల్లి! విజయవాడ సమీపంలోని గన్నవరంలో సెయింట్‌ జాన్స్‌ స్కూల్‌లో పదో తరగతి దాకా చదివాను. ఆ తరువాత కాకినాడలో ప్రగతి కాలేజ్‌లో ఇంటర్‌ చేశాను. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి కొత్తగా చేయాలని ప్రయత్నించడమనేది నాలో ఉంది. కానీ, సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. చదువుకొంటున్న రోజుల్లోనే నాలోని సృజనాత్మకతను గమనించింది - ఇవాళ్టి దర్శక, నిర్మాత గుణ్ణం గంగరాజు. ఇది 1990లలో సంగతి. ఆయన నాకు వరుసకు బావ అవుతారు. మా నాన్న గారి అక్కయ్య కొడుకు! అప్పటికే ఆయనకు 'ఫౌంటెన్‌ హెడ్‌ డిజైన్‌ స్టూడియో' అని ఉండేది. 'ఫాంట్‌ కార్డ్స్‌' అంటూ ఆయన సరికొత్త డిజైన్లతో గ్రీటింగ్‌ కార్డులు వేసి, అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయన నాలోని సృజనాత్మకత చూసి, ప్రోత్సహించారు. అప్పటికి నేను విశాఖపట్నంలో మెరైన్‌ రేడియో ఇంజనీరింగ్‌ చదువుతున్నాను. ఆ కోర్సులో చేరిన ఏడాదికే అది నాకు బోర్‌ కొట్టి, ఇటు వచ్చేశాను. గంగరాజు గారి దగ్గర 'ఫాంట్‌ కార్డ్స్‌'కు కాపీ రైటింగ్‌ లాంటి పనులు చేయడంతో నా సినీ రంగ ప్రవేశానికి బీజం పడింది. 

అది సినిమాల దిశగా ఎలా సాగింది? 

గంగరాజు గారు ఆ తరువాత 1994 - '95 ప్రాంతంలో సొంత ప్రొడక్షన్‌లో 'లిటిల్‌ సోల్జర్స్‌' (1996) సినిమా చేస్తున్నప్పుడు, అక్కడే ప్రొడక్షన్‌ విభాగంలో చేశాను. అలాగే, ఆయన రూపొందించిన యాడ్‌ ఫిల్మ్‌ ్సకూ, ప్రైవేట్‌ పాటల ఆల్బమ్స్‌కూ దర్శకత్వ శాఖలో పనిచేశా. ఆ తరువాత దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారి దగ్గర అప్పటి ప్రభుత్వ పక్షాన 'జన్మభూమి' యాడ్స్‌ చేయడం, ఆ క్రమంలోనే గంగరాజు గారి 'అమృతం' టీవీ సీరియల్‌ తొలి పది ఎపిసోడ్లకూ దర్శకత్వం వహించడం జరిగింది. అప్పుడు తయారుచేసుకున్న కథతో, 'ఐతే..' (2003) చిత్రం తీస్తూ దర్శకుడినయ్యా. 

మీ నాన్న గారు ఉన్నత విద్యావంతులని విన్నాం. సినిమాల్లోకి వెళుతుంటే, ఇంట్లో ఏమీ అనలేదా? 

మా నాన్న గారి పేరు యేలేటి సుబ్బారావు. ఆ రోజుల్లోనే ప్రతిష్ఠాత్మక ఐ.ఐ.టి - మద్రాసులో చదువుకున్నారు. అంత ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఆయన కావాలంటే, అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడవచ్చు. కానీ, తన కాళ్ళ మీద తాను నిలబడాలనే లక్ష్యంతో, ఊరికి వచ్చేసి, అక్కడే పొలాలు చూసుకుంటూ గడిపారు. ఇవాళ ఆయన స్నేహితులందరూ ప్రభుత్వంలోనూ, బయటా ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అంత స్వతంత్ర భావాలున్న మా నాన్న గారితో సహా మా ఇంట్లో అందరికీ మా బంధువు గంగరాజు గారంటే ఎంతో గౌరవం, గురి. ఆయన సినీ రంగంలోనే ఉన్నారు గనక, ఆయన నాలోని సృజనాత్మకతను గుర్తించి చెప్పారు గనక మా వాళ్ళు కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు. 

గంగరాజు గారి నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు? 

చాలానే ఉన్నాయి. ఆయన చాలా పర్‌ఫెక్షనిస్టు. గ్రీటింగ్‌ కార్డుల కోసం బెంగుళూరులోని అగ్రశ్రేణి ఫోటోగ్రాఫర్‌తో ఫోటోలు తీయించేవారు. కార్డు తయారీలో ఫోటోకు రెండు యాపిల్‌ పండ్లు కావాలంటే, ఊరంతా వెతికి, మచ్చలు లేని పండ్లు తెచ్చి, వాటిని బాగా తళతళా మెరిసేలా చేసేవారంటే, ఆయన ఏ పని అయినా ఎంత నిర్దుష్టంగా చేసేవారో అర్థం చేసుకోవచ్చు. ఏ పనినైనా అంత పర్‌ఫెక్షనిజమ్‌తో చేయడానికి ప్రయత్నించాలనీ, ఆ ప్రయత్నంలో మనకు సాధ్యమైనంత మేర అత్యుత్తమమైన ఫలితాన్ని అందించాలనీ ఆయన నుంచి నేర్చుకున్నా. అదే సమయంలో, చిత్ర నిర్మాణంలో పూర్తిగా పర్‌ఫెక్షనిజమ్‌తో వెళితే కుదరదు కాబట్టి, దాని కోసం ప్రయత్నిస్తూ, పరిస్థితిని బట్టి ఆచరణాత్మకంగా కొంత సర్దుకుపోవాలనీ తెలుసుకున్నా. 

మీ మీద ఆయన ప్రభావం ఏ మేరకు ఉంది? 

తొలి రోజుల్లో చాలానే ఉంది. 'కొత్తదనం ఉండేలా ఆలోచించాలి.ఆలోచించ డానికి బద్ధకించకూడదు' అన్న ఆయన అభిప్రాయాలు నాపై ప్రభావం చూపాయి. ఆ పద్ధతిలోనే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాను. పర్‌ఫెక్షని జమ్‌ కోసం తపిస్తూ, ఈ మార్గంలో వెళ్ళడం వల్ల కొన్ని లాభాలూ ఉన్నాయి, కొన్ని నష్టాలూ ఉన్నాయి. సరైన నిర్మాత, యూనిట్‌ దొరికితేనేమో ఈ పద్ధతి మంచి ఉత్పత్తిని బయటకు తీసుకురావడానికి ఉపకరిస్తుంది. లేకపోతే మాత్రం పర్‌ఫెక్షనిజమ్‌ కోసం మనం పడే తపన అవతలివాళ్ళకు నస అనిపించే ప్రమాదం ఉంది. 

'ఐతే'తో దర్శకుడైన మీకు పదేళ్ళలో 'సాహసం' అయిదో సినిమాయే! తక్కువ అనిపించడం లేదా? 

(నవ్వుతూ...) నన్ను అందరూ ఇలా అడుగుతుం టారు కానీ, ఈ మధ్య నేను చాలా మంది దర్శకుల చిత్రావళి చూస్తే, వాళ్ళూ ఈ కాల వ్యవధిలో తీసిన సినిమాలు ఇదే సంఖ్యలో ఉన్నాయి. కాకపోతే, ఒకటో, రెండో ఎక్కువ ఉండవచ్చు. 'ఐతే...' తరువాత ఉదయకిరణ్‌తో తీయబోయిన చిత్రం, ఈ 'సాహసం' ముందు దాదాపు ఏణ్ణర్ధం పాటు వర్క్‌ చేసిన ఇంకొక చిత్రం - ఆ రెండూ ఆగిపోయాయి. అవి గనక చేసి ఉంటే, నావీ ఏడు సినిమాలు అయ్యుండేవి. 

'ఐతే...' దగ్గర నుంచి ఇప్పటి దాకా మీరు చేసిన 5 సినిమాలూ కథలోనో, కథనంలోనో ఏదో ఒక రకంగా సాహసాలే! 

(నవ్వేస్తూ...) 'ఐతే..' చేసినప్పుడు మాత్రం అది సాహసం కాదు, అమాయకత్వం! అప్పట్లో సినిమా అంటే ఇలా ఉండాలి, ఈ ఈ కేంద్రాల్లో ఆడాలంటే ఇలాంటి అంశాలుండాలి లాంటి లెక్కలు నాకు లేవు. ఒక వేళ ఇన్ని లెక్కలు గనక ఉంటే, అసలు 'ఐతే..' చేసుండేవాణ్ణి కాదు. ఆ లెక్కలేవీ తెలియకపోవడం వల్ల నాకు నచ్చిన కథతో, నచ్చిన విధంగా తీశాను. ఆ తరువాత కూడా ఏదో ఒక కొత్తదనంతో జనం ముందుకు రావాలన్న ఆలోచనల వల్లే మిగిలిన సినిమాలు వచ్చాయి. 

మీరు ఎక్కువగా థ్రిలర్లు, అడ్వెంచర్‌ తరహా కథలే తీస్తున్నట్లున్నారు. అవి మీకు ఇష్టమా? 

దర్శకుడన్నాక అన్ని రకాల కోవలకు చెందిన చిత్రాలూ తీయాలని ఉటుంది. కానీ, అన్నీ కుదరాలి కదా! నేను తీసిన 'ప్రయాణం' (2009) థ్రిల్లర్‌ కాదుగా! పట్టాల మీదకు ఎక్కకుండానే ఆగిపోయిన రెండు చిత్రాలూ ప్రేమకథలు. కాబట్టి, అవి కూడా తీస్తాను. ఇంత విరామం రాకుండా, ఇప్పుడు ఒకేసారి మూడు కథల మీద పని చేస్తున్నా. అవి ప్రేమ కథలే! 

'ఐతే...' విడుదల తర్వాత నుంచి మీ చిత్రాలంటే జనంలో ఆసక్తి ఉంది. కానీ, వాటి ఆర్థిక విజయం ఆశించినంత ఉన్నట్లు లేదే! 

కొన్నిసార్లు మనం కాలాని కన్నా కొద్దిగా ముందుకు వెళ్ళి, సినిమా తీస్తాం. ఓ కామిక్‌ బుక్‌ లాగా సాగుతూ, జీవితంలోని క్షణాలను ఒడిసిపట్టే ప్రయత్నంగా చేసిన 'ప్రయాణం' సినిమా నేను అనుకున్నట్లే ఆడింది. కానీ, ఆ చిత్రం అప్పుడు కాకుండా రెండు, మూడేళ్ళ తరువాత వచ్చి ఉంటే, దాని వాణిజ్య విజయం ఇంకా ఎక్కువ ఉండేది. అలాగే, 'అనుకోకుండా ఒక రోజు' (2005) నాటికి ఇన్ని మల్టీప్లెక్సులు, ఇంత ఆదరణ లేదు. ఏమైనా, కొత్త తరహా కాన్సెప్టులకు జనం కొద్దిగా అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది.

మీ చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే ఎక్కువ భాగం మీవే! వాటి ఆలోచనలు ఎక్కడ నుంచి అందిపుచ్చుకుంటూ ఉంటారు? 

నా కథల్లో చాలా వాటికి ప్రేరణ - కాల్పనిక సాహిత్యం కాదు, కాల్పనికేతర సాహిత్యమే! చిన్నప్పుడు ఎక్కువగా కథలు, నవలలు చదివేవాణ్ణి. కానీ, పెద్దయ్యాక, అందులోనూ దర్శకుడినయ్యాక ఎక్కువగా నాన్‌-ఫిక్షనే చదువుతున్నా. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు ఎక్కువగా చదువుతా. చిన్న వార్త దగ్గర నుంచి, ఎక్కడో జరిగిన ఏదో సంఘటన దాకా అన్నీ నా కథలకు ప్రేరణే. అందుకే, నేను ఉద్దేశపూర్వకంగా ఇతర కథలు, రచనల నుంచి కానీ, చిత్రాల నుంచి కానీ అంశాలను కాపీ కొట్టలేదు. చదివిన, చూసిన వార్తలు, అంతరాంతరాళాల్లోని ఆలోచనలే కథలుగా రూపుదిద్దుకుంటున్నాయి. 

కథ, స్క్రీన్‌ప్లే మీవే అయినా, సంభాషణలకు వేరేవాళ్ళను పెట్టుకుంటారే? 

నేను చదువుకొనే రోజుల్లో ఇంగ్లీషు మీడియమ్‌లో చదువుకోవడం, ఇంగ్లీషులో మాట్లాడడం ఓ ఫ్యాషన్‌. అలా పెరగడం వల్ల నేను ఎక్కువగా ఇంగ్లీషు పుస్తకాలు చదువుతుంటాను. నా కథ, వగైరా కూడా ఇంగ్లీషులోనే రాస్తుంటాను. తెలుగులో కూడా కొద్దిగా గిలుకుతుంటాను. కానీ, సంభాషణలు రాయాలంటే, తెలుగు భాష మీద గట్టి పట్టున్న రచయిత నాకు తప్పకుండా కావాలి. మన భాషలో చిన్న చిన్న మాటలతో మొత్తం అర్థాలే మారిపోతుంటాయి. నా దగ్గర దాదాపు పదేళ్ళుగా పనిచేస్తున్న రాధాకృష్ణ గతంలో 'ప్రయాణం' చిత్రానికీ, ఇప్పుడు 'సాహసం' చిత్రానికీ మంచి డైలాగులు రాశారు. త్వరలోనే అతను దర్శకుడు కూడా కానున్నాడు.

'సాహసం' సినిమా ఇతివృత్తం? 

ఇది ఒక యాక్షన్‌ ఎడ్వంచర్‌ చిత్రం. డబ్బు లేక సాధారణ జీవితం గడుపు తున్న ఓ మామూలు వ్యక్తి, తాను పెద్ద ఆస్తిపరుడిననీ, కానీ ఆ ఆస్తి వేరొక చోట ఎక్కడో నిధి రూపంలో ఉందనీ తెలుసుకున్నప్పుడు, దాన్ని సాధించుకోవడం కోసం చేసే సాహసమే ఈ చిత్ర కథ. 

ఇలా నిధి కోసం సాగే అన్వేషణలు చాలా చిత్రాల్లో చూశాం. జనానికి నచ్చితే ఇలాంటి చిత్రాల్ని నెత్తిన పెట్టుకుంటారు. లేదంటే, ఏముందంటూ నాలుక చప్పరించేస్తారు! ఇలాంటి కథ సినిమాగా తీయడం కత్తి మీద సాము కదా! 

ఆ మాటకొస్తే వినోదాత్మక చిత్రంతో సహా, ఏ సినిమా తీయడమైనా కత్తి మీద సామే! ప్రేక్షకుల అభిరుచిని కనిపెట్టడం చాలా కష్టం. వాళ్ళ అభిరుచి, మనం తెరపై చూపాలనుకొన్నది - సరిగ్గా సరి పోవడం చాలా కష్టం. సరిపోయేలా తీయగలిగితే ఆ సినిమా పెద్ద హిట్‌. లేదంటే, ఫ్లాప్‌. 'సాహసం' చిత్ర విషయానికి వస్తే, గోపీచంద్‌ లాంటి యాక్షన్‌ హీరోను పెట్టుకొన్నప్పుడు, అతని ఇమేజ్‌కు సరి పడేలా మాస్‌ మెచ్చే యాక్షన్‌ చిత్రమే చేయాలి. అంతేతప్ప, బుద్ధిబలంతో సాగే కథ తీయలేం. 'సాహసం'లో మొదటి నుంచి చివరి వరకు ఆసక్తికరమైన ఘట్టాలెన్నో ఉంటాయి. క్లైమాక్స్‌లో అరగంట పైగా వచ్చే దృశ్యాలు, అక్కడి కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ జనానికి నచ్చుతాయి. హైదరాబాద్‌, కర్నూలుతో పాటు, ఢిల్లీ, కర్ణాటకలోని బీదర్‌, భారత - పాక్‌ సరిహద్దుల్లోని లడఖ్‌ ప్రాంతాల్లో కూడా చిత్రీకరణ జరిపాం. 

సరిహద్దుల్లో సినిమా తీయడం ఇబ్బంది కాలేదా? 

లేదు. సామాన్య పౌరులను అనుమతించే ప్రాంతాల్లోనే సినిమా తీశాం. సరిగ్గా తీస్తే, అక్కడే మూడు, నాలుగు సినిమాలు తీయగలిగినన్ని అందమైన లొకేషన్లెన్నో ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. కాకపోతే, లడఖ్‌ పరిసరాలు ఎంతో ఎత్తయిన ప్రాంతం కాబట్టి, ఆక్సిజన్‌ తక్కువ. మొదట రెండు, మూడు రోజులు శారీరకంగా శ్రమ అనిపిస్తుంది. కానీ, అలవాటయ్యాక ఆ తాజా గాలి, వాతావరణం ఎంతో బాగుంటుంది. అక్కడే 30 రోజులు షూటింగ్‌ చేశాం. 

జనం అభిరుచి ఎవరికీ తెలియదన్నారు! తెలియదని తెలిశాక, ఇక ఎవరైనా సినిమా తీయడమే కష్టమేమో! 

(వెంటనే అందుకుంటూ...) అలా కాదు. ప్రేక్షకుల అభిరుచి నూటికి నూరు పాళ్ళు ఎవరికీ తెలియదు. తెలిస్తే, ఇన్ని ఫ్లాపులే ఉండవు కదా! కానీ, తెలుసు అనుకొని ముందుకు వెళుతూ ఉంటాం. ప్రతి సినిమా హిట్‌ అవుతుందనే యూనిట్‌ అందరూ గట్టిగా నమ్మి, సినిమాకు పని చేస్తారు. ఆ మాట కొస్తే, యాడ్‌ చిత్రాల మొదలు నవలా సాహిత్యం దాకా అన్నింటికీ ఇది వర్తిస్తుంది. విడుదలై, జనం స్పందనతో కానీ, వారి అభిరుచికి సరిపోయామా, లేదా అన్నది తెలియదు. నా చిత్రాల్లో 'అనుకోకుండా ఒక రోజు' నేను అనుకున్న దానికీ, జనం ఆశించిన దానికీ ఏ మాత్రం సరిపోలేదు. అందుకే, ఆ చిత్రం కేవలం ఓ స్థాయి కలిగినవారికీ, విద్యావంతులకే నచ్చింది. ఆ సినిమా పతాక సన్నివేశాలను మాదక ద్రవ్యాల మీద కాక, పాతుకుపోయిన మూఢ విశ్వాసాల మీద చూపించడం సామాన్యులకు నిరాశ కలిగించింది. ఆ తరువాత నుంచి ఏదైనా సరే, మరీ చిక్కగా కాకుండా, సామాన్యులకు సులభంగా చేరేలా పలచన చేసి చెప్పాలని నా ఆలోచన తీరును చాలా మార్చుకున్నా. 

నిజానికి మీ చిత్రాల్లో 'అనుకోకుండా ఒక రోజు' వినూత్నం గానే కాక, గుడ్డి నమ్మకాలపై ఆలోచనాత్మకంగా ఉంటుంది! 

అవును. 'ఫలానా స్వామీజీ డ్రైనేజీ నీళ్ళిస్తే ఆరోగ్యం కుదుట పడుతుంది' లాంటి మూఢ విశ్వాసాలతో అమాయకుల్ని మోసం చేస్తున్న అనేక మంది మోసకారీ బాబాల గురించి అప్పట్లో అనేక వార్తా కథనాలు వచ్చాయి. మరో పక్క అప్పుడే హైదరాబాద్‌లో పబ్‌ కల్చర్‌, పార్టీలో డ్రగ్స్‌ తీసుకోవడం లాంటివి మొదల య్యాయి. అటు మూఢనమ్మకం, ఇటు మాదకద్రవ్యాలు - రెండూ మనిషి ఆలోచనను ప్రభావితం చేసేవే. కాబట్టి, ఆ రెంటికీ ముడిపెడుతూ, ఆలోచింపజేసేలా తీశాను. అలాగే, మత్తు ప్రభావం వల్ల కొద్ది గంటల పాటు ఏం జరిగిందో తెలి యని స్థితిలోకి కథానాయిక పాత్ర వెళితే ఎలా ఉంటుందనే పాయింట్‌ చూపెట్టాను. నేను చెబితే, గొప్పలు చెప్పుకుంటు న్నట్లు ఉంటుంది కానీ, ఆ తరువాత అదే పాయింట్‌తో 'హ్యాంగోవర్‌', ఈ మధ్యే తెలుగులో 'యాక్షన్‌' లాంటి చాలా చిత్రాలు వచ్చాయి. కానీ, దురదృష్టవశాత్తూ, ఆ సినిమా నేను ఆశించినంత ఎక్కువ మందికి చేరుకోలేకపోయింది. అయితేనేం, కథ, పాటలు, పాత్రధారుల నటన పరంగా నా చిత్రాల్లోకెల్లా నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమా, నా బెస్ట్‌ సినిమా అది. 

మీ మీద, మీ చిత్రాల మీద ప్రేక్షకులకు ప్రత్యేక అంచనా ఉంటోంది. దానికి మీరేమంటారు? 

(నవ్వుతూ...) 'ఐతే' చిత్రంతో వచ్చిన ఆ అంచనాను ఆ తరువాత నేను తీసిన ఇతర చిత్రాలు ముందుకు తీసుకు వెళ్ళాయి. కానీ, ఎప్పటికప్పుడు వాళ్ళ అంచనాలను అందుకో గలమా అన్న బెరుకు ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు ఏ సినిమాకూ నేను హైప్‌ చేయకూడదనుకుంటా. 'అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆహా, ఓహౌ' అని చెప్పకుండా ఉంటే, ఏ రకమైన అంచనాలూ లేకుండా జనం వస్తారు. వారికి దానిలోని కొత్తదనం ఏ మాత్రం బాగున్నా, ఆనందంగా స్వాగతి స్తారు. అందుకే, ప్రేక్షకులకు నా చిత్రాల పట్ల అంచనా ఉండడం నాకు ఆనందంతో పాటు భయాన్ని కూడా కలిగిస్తోంది.

'సాహసం'కి కార్పొరేట్‌ సంస్థ రిలయన్స్‌ భాగ స్వామ్యం కూడా ఉంది. చిత్ర నిర్మాణంలో ఈ సంస్థల భాగస్వామ్యంతో పని పద్ధతుల్లో వచ్చే తేడా? 

నాకు తెలిసి పని పద్ధతుల్లో పెద్దగా తేడా ఏమీ ఉండదు. కాకపోతే, ఇప్పటికీ సాంప్రదాయికంగా చిత్ర నిర్మాణానికి క్రమబద్ధమైన ఆర్థిక ఋణ వ్యవస్థ లేదు. బ్యాంకులు ఇవ్వవచ్చంటూ నియమ నిబంధనలున్నా, ఆ ఫైనాన్స్‌ అందరికీ అందుబాటులోకి రాలేదు. పైపెచ్చు, సినిమాలకు ఫైనాన్స్‌ చేయడానికి బ్యాంకులు అడిగే, కో-లేటరల్‌ ఆస్తులు ఎంత మంది దగ్గర ఉంటాయి. అందుకే, ఇప్పటికీ చిత్ర నిర్మాణంలో ఫైనాన్స్‌ వ్యవస్థలో పెద్ద వెలితి ఉంది. కార్పొరేట్‌ సంస్థల వద్ద భారీగా నిధులుండడం వల్ల, వాళ్ళు ఆ వెలితిని పూడ్చగలరు. వాళ్ళ భాగస్వామ్యం వల్ల నిర్మాతల మీద భారం తగ్గుతుంది. వడ్డీలు పెద్దగా పడవు. చిత్ర కథా సంగ్రహం, స్క్రిప్టు అన్నీ ముందుగానే ఇవ్వాల్సి ఉంటుంది. పైగా, చిత్ర నిర్మాణం కూడా మరింత క్రమశిక్షణాయుతంగా సాగుతుంది. ఇప్పటికే హిందీ, తమిళాల్లో కార్పొరేట్‌ సంస్థల వారి చిత్ర నిర్మాణం చాలా జోరుగా సాగుతోంది. తెలుగులో ఊపందుకోలేదు. 

'ఐతే'లో పవన్‌ మల్హోత్రా, 'ఒక్కడున్నాడు'లో మహేశ్‌ మంజ్రేకర్‌, 'సాహసం'లో శక్తికపూర్‌, లక్కీ అలీ - ఇలా మీ విలన్లంతా ఉత్తరాది వాళ్ళే! ఎందుకలా? 

ఆ కథల్లోని విలన్‌ పాత్రల స్వరూప స్వభావా లను బట్టే వాళ్ళను తీసుకున్నా. మనకు కోట శ్రీనివాసరావు లాంటి అద్భుతమైన యాక్టర్లున్నారు. కానీ, కథ ప్రకారం విలన్‌ పాత్ర ఉత్తరాదిది అయినప్పుడు, సహజత్వానికి దగ్గరగా ఉండేలా పాత్రధారుల్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే, ప్రేక్షకులు కూడా మునుపటిలా కాకుండా, ఇప్పుడు ఎక్కువగా వాస్తవికతనే చూస్తున్నారు, ఆదరిస్తు న్నారు. అయినా, ఇప్పుడు తెలుగులో మాత్రం ఎంచుకోవ డానికి అంత అద్భుతమైన విలన్లు ఎవరున్నారు చెప్పండి! 

'ఐతే', 'ఆనంద్‌' లాంటి విభిన్న తరహా ప్రయత్నాలు తెలుగు తెరపై ఎక్కువగా రావడం లేదేం? 

ఏ ఉత్పత్తి అయినా, దాన్ని ఉద్దేశించిన వినియోగదారుడి మద్దతు లేకుండా మనలేదు. సినిమా కూడా ఓ వినియోగ దారుల ఉత్పత్తి. ఇక్కడ వినియోగదారులైన ప్రేక్షకులకు ఏది కావాలో, దాన్నే ఇచ్చే పనిలో ఉంటారు. అలా ఇవ్వకపోతే, ఇక్కడ వ్యవహారం ముందుకు నడవదు. 'ఐతే', 'ఆనంద్‌' లాంటి చిత్రాలను పెద్ద ఇమేజ్‌ ఉన్న హీరోలతో తీయలేం. కొత్త కాన్సెప్ట్‌తో కూడిన అలాంటి చిత్రాలను కొత్తవాళ్ళతోనే తీయ గలం. వాళ్ళ చిత్రాలకు వాణిజ్య విస్తృతి ఉండదు. అందుకనే, కళ ఎప్పుడైతే కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ అయిందో, అప్పుడే దానిలోని సృజనాత్మకత కొంత వెనుకపట్టున ఉండాల్సి వస్తుంది.

తెలుగులో తీసిన కథలే తీస్తూ, మన దర్శక, రచయితలు సృజనాత్మక, భావ దారిద్య్రంలో ఉన్నారని ఓ విమర్శ ఉంది! 

(మధ్యలోనే అందుకుంటూ...) లేదు లేదు. మన దర్శక, రచయితల్లో ఎంతో పరిజ్ఞానం ఉంది. వాళ్ళ దగ్గర ఎన్నో వినూత్నమైన కాన్సెప్టులున్నాయి. అవి తెరకెక్కాలంటే, మార్కెట్‌ పరిస్థితులు కూడా అందుకు అనుకూలించాలి. ప్రస్తుతం ఎక్కువ శాతం ప్రేక్షకులు వినోదాన్నే కోరుకుంటున్నారు. వారి అభిరుచికి తగ్గట్లే, మనమూ సినిమాలు తీస్తున్నాం. అంతెందుకు! మీరు పత్రికలో వార్త, ఇంటర్వ్యూ రాసేటప్పుడు కూడా అందులో అందరినీ ఆకర్షించే అంశాన్ని శీర్షికగా పెట్టి, ఆ న్యూస్‌ను పాఠకుడికి నచ్చేలా చేస్తారు కదా! సినిమాతో సహా ఏ ఉత్పత్తి అయినా అంతే! ఏమైనా, మొత్తం మీద మీతో, నాతో సహా మన ప్రేక్షకులందరి అభిరుచిలో మార్పు రావాలి. దానికి తగ్గట్లే దర్శకుల, రచయితలూ మారాలి. ఈ మథనంలో మార్పులు వచ్చి, మళ్ళీ ఓ స్థిరత్వం వస్తుందని నా నమ్మకం. 

ఇవాళ కథ చెప్పడం కాకుండా, ఫలానా హీరోతో సినిమా అంటూ కాంబినేషన్లు చెప్పే స్థాయికి పడి పోయిందనీ విమర్శ ఉంది. దీనికి మీ వ్యాఖ్య?

(ఆశ్చర్యపోతూ...) నాకు తెలిసినవారిలో కాంబి నేషన్ల పేరు చెప్పి, కథ నడిపే దర్శకులు ఎవరూ లేరు. నా మటుకు నాకెప్పుడూ అలాంటి అనుభవం, పరిస్థితి రాలేదు. నన్నడిగితే, సినిమాలో ఇప్పటికీ దర్శకుడిదే ప్రథమ స్థానం, ముఖ్యస్థానం. సెట్స్‌ మీదకు సినిమా వెళ్ళక ముందు నుంచి ఆ సినిమా మొత్తం మీద అవగాహన ఉన్న వ్యక్తి, మొత్తాన్నీ తన మనో నేత్రంతో దర్శించే వ్యక్తి దర్శకుడు ఒక్కడే! గాలిలోనే పెయింటింగ్‌ వేసే సృజనశీలి దర్శకుడు. 

ఇవాళ నూతన దర్శకులకు అవకాశాల మాటేంటి? 

కొత్తగా దర్శకత్వంలోకి వస్తున్నవారికి ఇప్పుడు మంచి మార్కెట్‌ ఉంది. మునుపటి కన్నా ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మల్టీప్లెక్సులు చాలా వచ్చాయి. కాబట్టి, చక్కటి కాన్సెప్టులతో, తక్కువ బడ్జెట్‌లో సినిమా తీస్తే ఆదరణ బాగుంటుంది. బడ్జెట్‌ మాత్రం పరిమితి మీరకూడదని గట్టిగా గుర్తుంచుకోవాలి. 

సీరియల్‌గా మీకు తొలిసారి దర్శకుడి హౌదానిచ్చిన 'అమృతం' ఇప్పుడు గంగ రాజు దర్శకత్వంలో సినిమాగా వస్తోంది కదా! పాత జ్ఞాప కాలతో ఆ సినిమాకు సరదాగా మీరూ పని చేశారా? 

(నవ్వుతూ..) చేస్తే బాగుండేది. కానీ, ఓ పక్క నా 'సాహసం' షూటింగ్‌, మరోపక్క గంగరాజు గారి షూటింగ్‌ ఒకేసారి జరిగాయి. దాంతో, ఆయనతో మాటామంతీ అయితే జరపగలిగాను కానీ, షూటింగ్‌కు వెళ్ళి పాల్గొనలేకపోయాను. ఆ సినిమాలోనూ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ (సి.జి) చాలానే ఉన్నాయి. 

కెరీర్‌లో ఏదైనా తడబాటు ఎదురైనప్పుడు, మీరు ఎవరి నుంచి మార్గ నిర్దేశం పొందుతుంటారు? 

ప్రత్యేకించి నాకు గైడింగ్‌ ఫోర్స్‌ అంటూ ఎవరూ లేరు. కెరీర్‌ తొలి రోజుల్లో గంగరాజు గారి నుంచి సలహాలు పొందా. ఇప్పటికీ ఏదైనా సమస్యంటూ వస్తే గిస్తే, ఆయన ఎలాగూ ఉంటారు. అయితే, ఎక్కువ భాగం ఆత్మ పరిశీలన, స్వీయ విశ్లేషణ ద్వారా తప్పొప్పులు తెలుసుకుంటాను. సరిదిద్దు కుంటా. పైగా, నిజాయతీగా విశ్లేషించే విమర్శకులు ఉండనే ఉన్నారు. విమర్శకుల విశ్లేషణను సహృదయంతో స్వాగతిస్తా. అలాగే, చిత్ర నిర్మాణం చివరి దశకు వచ్చేసరికి సినిమా మీద ఒక నిర్దిష్టమైన అంచనా యూనిట్‌లో వాళ్ళకు వచ్చే స్తుంది. వాళ్ళు ఆ మాట నిర్మొహమాటంగా చెప్పే స్తారు. ఎందుకంటే, ఒక ఉత్పత్తిని రూపొందించి జనంలోకి వదిలిపెట్టాక, దాని మీద ఎలాంటి స్పందన వచ్చినా స్వీకరించాల్సిందే! తప్పదు! 

'సాహసం' చూశాక, యూనిట్‌ చేసిన ఓ వ్యాఖ్య? 

(ఒక్క క్షణం ఆగి...) 'చాలా బాగుంది' అని చెప్పారు. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని నమ్ము తున్నాం. ఆ రకమైన సానుకూల ప్రకంపనలు వస్తున్నాయి.

మీ తరువాతి చిత్రాలు ఎలా ఉండబోతున్నాయి? 

ఈ సారి ఇంత విరామం రాకుండా చకచకా సినిమాలు తీయాలనుకుంటున్నాను. అందుకే, ఇప్పుడు రెండు కథలు రాస్తున్నాను. మరో ప్రేమకథ సిద్ధంగా ఉంది. వీటిలో ముందుగా ఏది పట్టాల మీదకు ఎక్కుతుందో చూడాలి. వీటిలో ఒక ప్రేమ కథ కొత్తవాళ్ళతో తీయాల్సింది అయితే, మరో కథ పెద్ద హీరోలకు సరిపోయే కథ. 

గతంలో ఉదయ కిరణ్‌తో అనుకున్న కథా ఇది? 

(నవ్వుతూ...) కాదు! కొత్తది. ఎందుకనో, ఒకసారి రాసేసిన స్క్రిప్టు మీదకు మళ్ళీ నా మనసు వెళ్ళదు. ఏదైనా కొత్త పాయింట్‌ మరింత ప్రేరణనిచ్చేదిగా ఉన్నదాని మీద మనసు పోతుంది. అందుకని ఎప్పటికప్పుడు కొత్త కథలే చేస్తుంటాను. 

మీ జీవితంలోని మర్చిపోలేని ఘట్టం ఏమిటి? 
'ఐతే' విడుదలైన తరువాత నాకు లభించిన ప్రశంసలన్నీ ఇన్నీ కావు. అది ఎప్పటికీ మర్చిపోలేను. నిజానికి, ఆ చిత్రం అంతా పూర్తి అయిపోయాక కూడా, రిలీజుకు నోచుకోకుండా చాలా రోజులు అలా ఆఫీసులోనే బాక్సులో పడి ఉంది. ఆ పరిస్థితుల్లో రోజు రోజుకూ ఆత్మవిశ్వాసం క్షీణిస్తూ వచ్చింది. చివరకు ఎలాగైతేనేం, సినిమా విడుదలై, మా యూనిట్‌ అందరికీ పేరు తెచ్చి, జాతీయ స్థాయిలో అవార్డు సాధించడం ఎన్నటికీ మర్చిపోలేను. దర్శకుడిగా నాకు, కళా దర్శకుడిగా రవీందర్‌కూ, కెమేరా మన్‌గా సెంథిల్‌ కుమార్‌కూ - ఇలా ఎంతోమంది కొత్తవాళ్ళకు ఆ చిత్రం జీవితాన్నిచ్చింది. ఆ చిత్ర యూనిట్‌లోని అందరూ ఇవాళ పరిశ్రమలో పెద్ద స్థాయిలో ఉండడం ఎంతో సంతోషం కలిగిస్తోంది.

-         రెంటాల జయదేవ


.........................................................................

Friday, July 12, 2013

సంగీత సాధుమూర్తి నూకల చిన సత్యనారాయణ




  • నిన్న మరణించిన సంగీత విద్వన్మణి నూకల చిన సత్యనారాయణకు నివాళిగా ఈ స్మ ృత్యంజలి వ్యాసం
సంగీతంలో గొప్ప పండితులు, జ్ఞానస్థులు నూకల చిన సత్యనారా యణ ఇక నన్నెప్పుడూ పలకరించలేని లోకానికి వెళ్ళి పోయారని తెలిసిన క్షణం నా మనస్సు అదొకలా అయి పోయింది. సరిగ్గా పదిహేను రోజుల క్రితం ఆయన, నాకు ఫోను చేశారు - 'స్టంటు వేయించుకున్నావని తెలిసింది. ఇప్పుడెలా ఉంది?' అంటూ! ఆయన ఎప్పుడు ఫోన్‌లో పలకరించినా మా అమ్మాయి గురించి అడిగేవారు. ఈసారి కూడా రెండో పలకరింపు ఫోనులో 'అమ్మాయి ఎలా ఉంది' అని! అంత అభి మానం ఆయనకి! దానికో పిల్ల కథ ఉంది.
ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం ముచ్చట. నూకల గారు విజయవాడలో సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌. అక్కడే నేను సంగీతం లెక్చరర్‌ని. సాధారణంగా ప్రిన్సి పాల్‌ హౌదాలో వారు కింద పనిచేసే వారి ఇళ్ళకు రారు. కానీ ఆయనకి తన సిబ్బంది అంటే చాలా అబి óమానం. సంగీత ప్రపంచంలో అధికం, అల్పం భేదాలు ఆయనికి ఎప్పుడూ రాలేదు. అందర్నీ 'మీరు' అంటూ గౌరవంగా పిలవడమే కాదు, మనసారా గౌరవించే లక్షణం ఆయనది. నూకల వారు మా ఇంటికి వచ్చి కూర్చునేసరికి మా రెండేళ్ళ అమ్మాయి తను ఆడుకునే కుర్చీలో కూర్చుంది. నూకల వారు సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్నారు. మా అమ్మాయి ముద్దుగా 'కాఫీ సోఫాలో పోస్తావు.. మా అమ్మ తన్నుతుంది' అని ప్రిన్సి పాల్‌ గారికి వార్నింగ్‌ ఇచ్చింది. అప్పటి నుంచీ మా అమ్మాయి అంటే ఆయనకి ఎంతో పితృవాత్సల్యం.
ఆయన మనిషిగా ఎంతో ఉన్నతుడు. చిన్న ఉద్యోగి అంటే ఎంత ప్రేమో మరో ఉదాహరణ చెప్తాను. ఆఫీసులో ప్యూను వర్షంలో తన చంటి పిల్లను భుజాల మీద వేసుకొని వెళ్తూ కనబడ్డాడు. ఇలా వర్షంలో ఎక్కడికి అని నూకల పలకరిస్తే తడిసి ముద్ద యిన ప్యూను 'ఆసుపత్రికి' అని చెప్పాడు. నడవటం ఎందుకంటే డబ్బులు లేవన్నాడు. నూకల గారు అతణ్ణి ముందు తన ఇంటికి తీసుకెళ్ళి, పిల్లని తను మోస్తూ, అతనికి పొడిబట్టలిచ్చి, డబ్బిచ్చి ఆసుపత్రికి పంపారు. ఇలా నిజంగా ఎవరైనా చేస్తారా అనిపిస్తుంది.
ఈసారి ఆఫీసు పని మీద బందరు వెళ్ళాం. జీతం బిల్లులు కలెక్టర్‌ ఆఫీసులో సంతకం పెట్టించుకోవాల్సి ఉంది. అక్కడ లంచం తీసుకోని ఓ కఠినమైన పెద్ద గుమాస్తా మాసిన బట్టల్లో కనబడ్డాడు. పని అయిన తర్వాత అతనికి ఏమైనా స్వీటు పాకెట్‌ ఇస్తే బాగుం టుందనుకున్నాం. కానీ గుమస్తా ఏమంటాడో అని వెనక్కి తగ్గాం. పోనీ ఇంటికి వెళ్ళి పిల్లలకిద్దాం అన్నారు నూకల. ఇల్లు తెలుసుకొని ఇంటికి వెళ్తే భార్య, పిల్లలు పాకలో ఉంటున్నారు. మేము బహుమతి అంద చేయ బోతే భార్య నిరాకరించింది. వద్దంది. 'ఆయన కిష్టం ఉండదు' అని చెప్పి తలుపేసుకుంది. తిరిగి వస్తూ నూకల, 'దేవుడికి గుడి కడతాం. కానీ, ఇలాంటి వారికి గుడి కట్టాలయ్యా' అంటూ గద్గదంగా మాట్లాడారు.
ఆయనకున్న బంధుప్రేమ అపారం. ఇల్లంతా కళకళ లాడుతూండేది ఎప్పుడూ. ఆయన చిన్ననాటి స్నేహితుల పట్లా అంతే అభిమానం పరవళ్ళు తొక్కేది. ఒక్కొక్కసారి సినిమాల్లో దృశ్యంలా కనబడేది. విజయ నగరంలో చదువుకునే సమయంలో నూకల గారికి వాసా కృష్ణమూర్తి గారు బాగా మిత్రులు. అందువల్ల ఎప్పుడు విజయవాడ రేడియో రికార్డింగుకు వచ్చినా నూకల గారింట్లోనే ఆయన మకాం చేసేవారు. ఒక సారి నూకల గారింటికి రాకుండా శ్రీరంగం గోపాల రత్నం గారింట దిగారు. మర్నాడు కాలేజీకి నూకల గారిని పలకరిద్దామని కృష్ణమూర్తి వచ్చారు. ఆయన అంతదూరంలో ఉండగానే ఇక్కడ నుంచి నూకల 'ఇంతకంటే నన్ను చంపెయ్యరా! ఎవరింట్లోనో దిగు తావా!' అంటూ సీను సృష్టించారు నిజంగా ఏడుస్తూనే! కృష్ణమూర్తి గారెంత బ్రతిమాలినా ఆయన ఆగలేదు.
నూకల వారు విజయనగరం కళాశాల విద్యార్థిగా చేరకముందు బాలమురళి తండ్రి పట్టాభిరామయ్యగారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఆ రోజుల్లో వారాలు చేసి చదువుకోవడం మామూలు. ఒకరింట్లో వారం కుదిరింది. ఆ ఇంటి వారబ్బాయి తరువాత కాలంలో విజయవాడ కేంద్రంలో తంబురా విద్వాంసుడుగా చేరారు. ఇప్పుడు నూకలగారు ఒక కార్యక్రమం రిహార్సల్‌ చేస్తూ పాడుతు న్నారు. ఆ రికార్డింగ్‌ ప్రత్యేకతల వల్ల అర్ధరాత్రి రెండ యింది. నూకల గారు ఒక ఆలాపన చేస్తూ రికార్డింగ్‌ చేస్తూ ఉంటే అపశ్రుతి వచ్చి ఆపారు. తంబురా వేస్తున్న కుటుంబయ్య విరామంగా తాంబురా కింద పెట్టారు. తరువాత కొంతసేపటికి నూకల రెడీ అయి 'తంబురా తీయండి కుటుంబయ్య గారూ!' అన్నారు. కుటుంబయ్య గారు వెంటనే తంబురా మీటకుండా 'అవసరమంటారా! అన్నారు. అందులో నూకల గార్కి ఏదో వేళాకోళం కనబడి 'ఎంతమాటన్నారండీ! మీ ఇంట్లో భోంచేశాను కనుక కానీ, లేదంటే డైరెక్టర్‌గార్కి రిపోర్టు చేసేవాడి'నంటూ అందరిలోనూ గొడవ పెట్టుకున్నారు. మొత్తానికి ఆ రాత్రి రికార్డింగ్‌ పూర్తి చేయలేదు. మరునాటికి వాయిదా వేశారు. అలాంటి మానవ సహజమైన గుణాలతో జీవితం ఆనందంగా సాగించగల్గిన అసాధారణ వ్యక్తిత్వం నూకలగారిది.
నేనూ రమణమూర్తి వృద్ధిలోకి వస్తున్న తరుణంలో ఎంతో మందికి మా గురించి చెప్పి పాడటానికి అవకా శాలు కల్పించారాయన. సాధారణంగా సంగీత విద్వాం సులలో మొదటి తరగతికి చెందిన విద్వాంసులు శిష్యులు కానటువంటి విద్వాంసులను అలా ప్రోత్సహిం చటం తక్కువ. కానీ నూకలగారికి తన తోటి సీనియర్‌ విద్వాంసులు బాగా పాడుతుంటే ఆనందించే గుణమే ఉండేది. ఒకసారి కె.వి. నారాయణస్వామి గారు కచేరీ చేస్తున్నారు తిరుపతిలో. అప్పుడు తిరుపతిలో నూకల వారు ప్రిన్సిపాల్‌. చివరి అంశాలు కదా అని నేను సెలవు కోరాను. నూకల 'కృష్ణా బేగడ - నారాయణ స్వామి బాగా పాడతారు. పాడించుకొంటాను' అని నన్ను కావాలంటే వెళ్ళమన్నారు. నారాయణస్వామితో ఆ పాట పాడించుకొని నూకల విన్నారు. ఇతరులైనా, సాటివారైనా అంతటిసంగీత సమాదరణ ఆయనది.
ప్రిన్సిపాల్‌గా పనిచేసినన్నేళ్ళూ విజయవాడలో ఆయన అందరి ఉద్యోగులనూ గౌరవంతో చూడటమే కాదు పాఠం చెప్పేవారిని ఎప్పుడూ ఎవరి ముందూ ఏ క్లాసులోనూ కించపరిచేవారు కాదు. ఎప్పుడైనా చెప్ప దలచుకుంటే లెక్చరర్‌ ఒక్కడినీ తనతో కూర్చోబెట్టు కుని సూచనలు చేసేవారు.
ఆయన సంగీతపరంగా సాధించిన విద్వత్తు చాలా సంపన్నమైనది. రక్తిగా పాడటంలో ఆయనకున్నంత సదుపాయం చాలా తక్కువమందికి ఉంటుంది. ఎన్ని గంటలైనా అంత రక్తిగానూ, అంత పాండిత్యంతోనూ పాడి ఒప్పించి, ఆయన దేశమంతా పేరు సంపాదించు కున్నారు. నళినికాంతి, అభేరి వంటి జారుడుగుణం గల రాగాలనూ, అన్యస్వరాలకు పీట వేసే ఉపాంగ రాగాలనూ ఎంతో తేలికగా కష్టం కనబడకుండా అంత దృఢంగా పాడగల ప్రతిభ ఆయనది. ఇక సోదాహరణ ప్రసంగాలు చేశారంటే అటు విద్వాంసులకూ, సీనియర్‌ శ్రోతలకూ పండుగగా వినిపించేవారు. ఆయన లాంటి కచేరీ విద్వాంసులు పుస్తకాలను, అందులోనూ సంగీ తాన్నీ, రాగాలనూ గూఢంగా తర్కించే గ్రంథాలను వ్రాయలేరు. కానీ నూకల మాత్రం చాదస్తం లేకుండా, అంటే అనవసర విషయాలు చర్చించకుండా సంగీ తాన్ని ఆనందింపచేయగల విజ్ఞానంగా, అందాలు, అనుస్వరాల గొప్పతనం చెబుతూ స్టడీ చేసి ప్రచురిం చారు. అలా రెండు వందల రాగాలు చర్చించారు.
మంచి గొంతు చాలా మంది పాడేవారికి ఉండవచ్చు. సంగీతం చాలా మంది గొప్పగా వినిపించవచ్చు. కానీ హుందాగా, గౌరవంగా, మానవీయ స్పర్శతో, ఆత్మీయంగా నూకల గారిలా జీవితం ధన్యం చేసుకున్నవారు తక్కువ మంది ఉంటారు. ఆయన లేకపోవటం నాకు వ్యక్తిగతంగా ఎంతో లోటు.
- పెమ్మరాజు సూర్యారావు
(ఈ వ్యాస రచయిత ప్రముఖ కర్ణాటక సంగీత విద్యాంసుడు, విమర్శకుడు) 
(Published in Praja Sakti daily, 12th July 2013, Page No.5)
...............................................................

Thursday, July 11, 2013

‘పద్మభూషణ్‌’ నూకల కన్నుమూత - దిగ్భ్రాంతి చెందిన కర్ణాటక సంగీత లోకం



‘పద్మభూషణ్‌’ (2010) పురస్కార0 
సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు ‘పద్మభూషణ్‌’ నూకల చిన సత్యనారాయణ కన్నుమూశారు. జూలై 11వ తేదీ గ్నురువారం నాడు ూదయం సికింద్రాబాద్‌లోని పద్మారావు నగ్నర్‌లోని తన స్వగ్నృహంలో ఆయన శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. కర్ణాటక సంగీత శిక్షణతో ఎందరో శిష్యులను తీర్చిదిద్దిన ఈ ‘మహామహోపాధ్యాయు’ని వయస్సు 86 సంవత్సరాలు. ఆయన ఆకస్మిక మరణవార్తతో సంగీత, కళా ప్రియులు దిగ్భ్రాంతి చెందారు. సినీ రచయిత, నటుడు తనికెళ్ళ భరణితో సహా పలువురు సంగీత విద్వాంసులు, శిష్యులు, కళా ప్రియులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

చిన్ననాటి నుంచే సంగీతాభిరుచి

బహుముఖ ప్రజ్ఞావంతులైన డాక్టర్‌ నూకల అటు కర్ణాటక సంగీత గాయకుడిగా, ూత్తమమైన ూపాధ్యాయుడిగా, సరళమైనరీతిలో సోదాహరణ ప్రసంగాలు ఇచ్చే నిపుణుడిగా అందరినీ అలరించారు. సంగీతంపై ఎన్నో అమూల్యమైన గ్న్రంథాలను వెలువరించారు.  1927 ఆగ్నస్టు 4న అనకాపల్లిలో ఆయన జన్మించారు. శ్రీమతి యజ్ఞచయనమ్మ, అన్నపూర్ణేశ్వర శర్మలు ఆయన తల్లితండ్రులు. తల్లి ప్రోత్సాహంతో, ఆమె దగ్న్గర ప్రాథమిక శిక్షణతో ఆయన తన సంగీత ప్రతిభకు పదును పెట్టుకున్నారు. సంగీతం పట్ల తన తరగ్నని అనురాగానికి తల్లే కారణమని ఆయన చెబుతూ ూండేవారు.


తొలి రోజుల్లో వయొలిన్‌ విద్యార్థిగా మొదలైన నూకల చిన సత్యనారాయణ అనంతరం విజయవాడలో మంగ్నళంపల్లి పట్టాభిరామయ్య (బాలమురళీకృష్ణ తండ్రి) వద్ద మూడేళ్ళు శిష్యరికం చేశారు. ఆ పైన విజయనగ్నరం వెళ్ళి ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద వయొలిన్‌ విద్యలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నారు. దేశం నలుమూలలా ద్వారం వారితో కలసి కచ్చేరీలలో పాల్గొన్నారు. కర్ణాటక సంగీత పారంగ్నతులైన డాక్టర్‌ శ్రీపాద పినాకపాణికి నూకలను పరిచయం చేసింది ద్వారం వారే! అక్కడ నుంచి నూకల చిన సత్యనారాయణ సంగీత జీవితం మరో పెద్ద మలుపు తిరిగింది.

దశాబ్దాలుగా సంగీత సేవ


పినాకపాణి శిష్యరికంలో నూకల తన విశ్లేషణాత్మక దృక్పథానికి మరింత పదును పెట్టుకున్నారు. సంగీత కళనూ, అందులోని శాస్త్రాన్నీ లోతుగా పట్టుకున్నారు. తనదైన సొంత బాణీకి మెరుగ్నులు దిద్దుకున్నారు. ప్రతి స్వరంలో, పదంలో రాగ్న భావాన్ని జొప్పించి పాడడం మొదలుపెట్టారు. అలా ఆ కౌమార వయస్సు నుంచి నిన్నటి వరకు ఎన్నో దశాబ్దాల పాటు ఆయన సంగీత సేవకే కట్టుబడి ూండడం విశేషం. స్వయంగా పాడుతూనో, శిష్యులకు సంగీతం బోధిస్తూనో, సంగీతంపై గ్న్రంథాలు రాస్తూనో, సంగీత విద్యా బోధనలో సరికొత్త పద్ధతులను కనిపెడుతూనో, కర్ణాటక సంగీత వ్యాప్తికి కృషి చేస్తూనో జీవితమంతా గ్నడిపారాయన.


సంగీత గ్నురువుగా అందరి మన్ననలు పొందిన నూకల సికింద్రాబాద్‌ ` హైదరాబాద్‌ ` విజయవాడ ` తిరుపతిల్లోని ప్రభుత్వ సంగీత కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా, విజయనగ్నరంలోని మహారాజా సంగీత కళాశాలలో, హైదరాబాద్‌లోని తెలుగ్ను విశ్వవిద్యాలయంలో సంగీత ప్రొఫెసర్‌గా సేవలందించారు. అలాగే, ఆంధ్ర ` శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో సంగీత శిక్షణకు సంబంధించి బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆకాశవాణి కేంద్రంలోని సంగీత ఆడిషన్‌ బోర్డు, కమిటీలో సభ్యులైన ఆయన ప్రతిష్ఠాత్మక మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ ఎక్స్‌పర్ట్‌ మెంబర్‌గా నిలిచారు.

విశిష్ట గౌరవాలు

ఈ మహామహోపాధ్యాయుని సంగీత పాఠాలు ఇప్పటికీ ఆకాశవాణి, దూరదర్శన్‌ల ద్వారా మార్గదర్శనం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం నుంచి ఎమెరిటస్‌ ఫెలోషిప్‌ అందుకున్న నూకల ప్రతిష్ఠాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. పలు సాంస్కృతిక సంస్థలు ఆయనకు ‘గానకళా గ్నంధర్వ’, ‘సంగీత సార్వభౌమ’, ‘నాద సుధార్ణవ’, ‘అన్నమాచార్య విద్వన్మణి’ తదితర బిరుదులిచ్చి, గౌరవించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ‘హంస’ అవార్డునిచ్చింది. కర్ణాటక సంగీత రంగానికి నూకల చేసిన విశిష్ట సేవలకు గ్నుర్తింపుగా భారత ప్రభుత్వం  ఆయనకు ‘పద్మభూషణ్‌’ (2010) పురస్కారాన్నిచ్చి, సత్కరించింది.


తిరుమల తిరుపతి దేవస్థానం, కంచి, శృంగేరి, పుష్పగిరి పీఠాలకు ‘ఆస్థాన విద్వాంసుడి’గా నూకల గౌరవం పొందారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వి.వి. గిరి, జవహర్‌లాల్‌ నెహ్రూ, పి.వి. నరసింహారావు లాంటి దేశ నాయకుల ముందు సంగీత పాండిత్యాన్ని ప్రదర్శించిన నూకల చిన సత్యనారాయణ దేశ విదేశాల్లో అసంఖ్యాకంగా కచ్చేరీలు ఇచ్చారు. వందలాది శిష్యులను సంపాదించుకున్నారు. ‘‘సాధారణ జీవితం, అసాధారణ ఆలోచనా విధానమే జీవన సూత్రం’’గా చేసుకున్నట్లు స్వయంగా చెప్పుకున్న ఆయన ‘ది మోనోగ్రాఫ్‌ ఆఫ్‌ త్యాగ్నరాజాస్‌ పంచరత్న కృతీస్‌’, ‘రాగ్నలక్షణ సంగ్న్రహం’, ‘సంగీత సుధ’, ‘శ్రీత్యాగ్నరాజ సారస్వత సర్వస్వం’ తదితర రచనలు చేశారు.

నూకల వారికి అపారమైన శిష్యవాత్సల్యం. ఆయన, ఆయన భార్య శ్రీమతి శేష ఆతిథ్యానికి పెట్టింది పేరు. దాంతో, వారి నివాసం నిత్యం అతిథులు, విద్యార్థులు, సందర్శకులతో కళకళలాడుతూ ూంటుంది. ఆ దంపతులకు ముగ్న్గురు కుమార్తెలు, నలుగ్నురు కుమారులు ూన్నారు. పెద్ద కుమారుడు సికింద్రాబాద్‌లో నివసిస్తుండగా, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె విదేశాల్లో ూన్నారు. కుటుంబ సభ్యులు స్వదేశానికి చేరుకున్న తరువాత జూలై 13వ తేదీ శనివారం నాడు చిన సత్యనారాయణ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగ్ననున్నాయి.

‘‘ఎప్పుడూ వాణిజ్య దృక్పథంతోనే ూండకండి. ప్రాథమిక దశలోనే కచ్చేరీలు ఇచ్చేయాలని ఆత్రపడకండి. శ్రద్ధాసక్తులతో నిరంతరం సంగీతం నేర్చుకుంటూ ూంటే, డబ్బు, కీర్తి ప్రతిష్ఠలు వాటంతట అవే వస్తాయి’’ అంటూ యువ సంగీత కళాకారులకు విలువైన సందేశమిచ్చిన నూకల మృతితో కర్ణాటక సంగీత ప్రపంచం ఓ అమూల్య సంగీత రత్నాన్ని కోల్పోయింది. ముఖ్యంగా, మన కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన విద్వాంసుల్లో మరో ముఖ్యుడు దూరమవడం తెలుగ్నువారికి తీరని లోటు!
....................................................................