జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, October 20, 2010

ఇది రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ చరిత్ర!

సినిమా సిద్ధమవుతుండగానే, దానికి ఏ రకంగా ప్రచారం పొందాలా అని చూడడం దర్శక - నిర్మాతల్లో సహజం. బహుశా, సినిమా మొదలైన దగ్గర నుంచి విడుదల వరకు ఏదో ఒక వివాదంతో మీడియాను తన చుట్టూ తిప్పుకోవడం దర్శక - నిర్మాత రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా మరొకరికి తెలియదేమో అనుకోవాలి. ఏ సినిమా తీస్తున్నా, దాని గురించి నలుగురూ చెప్పుకొనేలా చేయడంలో ఆయన కళకు తాజా ఉదాహరణ - రానున్న రక్తచరిత్ర చిత్రం.

ఆంధ్రదేశంలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లోని ముఠా నేతల నిజజీవితాలను ఆధారంగా చేసుకొని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆయన సిద్ధం చేసిన రక్తచరిత్ర సినిమా ఇప్పటికి ఎన్ని వివాదాలు సృష్టించిందో అందరికీ తెలుసు. కానీ, ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ప్రకటన దానికి పరాకాష్ఠ. ఈ సినిమాలో ఎవరిని ఎక్కువగా, మరెవరిని తక్కువగా చూపారో అనీ ఇప్పటికే కొందరు కత్తులు నూరుతుంటే, అనంతపురంలో రక్తచరిత్ర ప్రీమియర్ ప్రదర్శన జరగనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇదేమిటి, పబ్లిసిటీ వ్యూహమా అని అడిగిన వాళ్ళకు వర్మ నిర్లజ్జగా ఒకే మాట చెప్పారు. ‘‘అవును. పబ్లిసిటీ కోసమే’’ అని తడుముకోకుండా బదులిచ్చారు. పైగా, ‘‘నేను చేస్తున్నది సినిమా వ్యాపారం. దేనికైనా పబ్లిసిటీ అవసరం. సినిమాకు మరీ అవసరం’’ అని ఓ విశ్లేషణ కూడా వాక్రుచ్చారు. వర్మాజీ, వాట్ యాన్ ఎనాలసిస్. అంటే, ఇటు పబ్లిసిటీ కోసం వాస్తవికత, అటు (అ)వాస్తవికతతో పబ్లిసిటీ అన్న మాట.

రాయలసీమ అంటేనే రక్తపాతాలు, బాంబులు, బరిసెలు, వందలాది టాటా సుమోలని చూపుతున్న సగటు తెలుగు సినిమా చాలదన్నట్లు, ప్రచారం కోసం మీరూ ఏదన్నా చేస్తారన్నమాట. అన్నట్లు, మొన్నే వర్మ గారు మరో మాట అన్నారు. ‘‘నేను ఏవో పాత్రలు తీసుకొని సినిమా కథలు రాసుకుంటున్నా. దానికి మీడియానే లేని పోని వివాదం రేపుతోంది’’ అని వర్మ ఉవాచ. పబ్లిసిటీ కోసమే అంతా అని స్పష్టత ఉన్న రామ్ గోపాల్ వర్మ తప్పు మరెవరిదో అనేస్తున్నారు. ఆయన మాటలు వింటే, ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే, దూడకు గడ్డి కోసం’ అన్న మాటకు నాలుగు ఆకులు ఎక్కువగా - ‘గడ్డి మేస్తున్న దూడ కోసం’ అని చెబుతున్నట్లుంది.

Monday, October 18, 2010

ఎవరు మాసు? ఎవరు క్లాసు? - ఇంతకీ చిన్న ఎన్టీయార్ మాస్ హీరోనా? క్లాస్ హీరోనా?

ఎవరు మాసు? ఎవరు క్లాసు? ఇది చాలా చిత్రమైన ప్రశ్న. చిక్కుప్రశ్న. జవాబు తెలుసని అనిపిస్తూనే, చెప్పాలంటే ఇబ్బందిగా మారే అంశం. బృందావనం - ఈ గోవిందుడు 'ఎందరి' వాడోలే... అన్న నా టపాపై కొత్త పాళీ గారు పెద్ద చర్చకే తెర తీశారనిపించింది. దీనికి జవాబు మీకు తెలియనిదని నేను అనుకోను. నాకు పూర్తిగా తెలుసని చెప్పడానికి ధైర్యం చేయను. అయితే, ఇటీవల నేను రాసిన బృందావనం... చిత్రంపై సమీక్ష వరకు పరిమితమై నాకు తోచిన వివరణ ఇవ్వదలిచాను.

చెప్పాలంటే - ఒక్కో నటుడికి / హీరోకు ఒక్కో వర్గం ప్రేక్షకులలో అభిమానం, ఆదరణ ఎక్కువ ఉండడం చిత్ర సీమలోని లక్షణం. అయితే, ప్రతి వర్గమూ దానికదే ప్రత్యేక ఉనికితో కూడినదని కానీ, మరొక వర్గం ప్రేక్షకులతో ఎక్కడా ఉమ్మడి లక్షణాలు లేనిదని కానీ చెప్పలేం. అలాగే, అన్ని వర్గాలనూ, అన్ని వేళలా, అన్ని సినిమాల్లో ఆకట్టుకొనే నటుడు, నటన ఉంటాయని అనుకోలేం.

మార్కెట్ లో ఉన్న విశ్లేషణను బట్టి చెప్పాలంటే - చిన్న ఎన్టీయార్ మాస్ హీరో. మొదటి నుంచి అతని సినిమాలకు ఉన్న ఓ నిర్దిష్ట ప్రేక్షక వర్గాన్ని ఉద్దేశించి చేసిన ఉరామరిక వర్గీకరణ అది. అతని సినిమాలు సామాన్య ప్రేక్షక జనాన్ని ఉద్దేశించి, ఎక్కువగా సాగుతాయన్నది ఆ అంచనా. తదనుగుణంగానే, ఎక్కువ భాగం అతని సినిమాలకు వారే మహారాజ పోషకులు. సింహాద్రి, ఆది, నా అల్లుడు, ఆంధ్రావాలా, యమదొంగ, అదుర్స్ లాంటి ఆయన చిత్రాల సరళి, వాటిలోని అంశాలు గమనిస్తే - ఆ మాటలోని అంతరార్థమేమిటో గ్రహించవచ్చు.

అది రచన అయినా, సినిమా అయినా, మరొకటైనా సరే - ప్రతి సృజనకూ దానికంటూ ఓ లక్షిత పాఠక వర్గం / వీక్షక వర్గం ఉంటుంది. అయితే, ఆ లక్షిత వర్గాన్ని అవి రంజింపజేస్తాయా లేదా అన్నది వేరే అంశం. ఇప్పటి వరకు చిన్న ఎన్టీయార్ చిత్రాలన్నీ ప్రధానంగా పైన చెప్పిన సామాన్య ప్రేక్షక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని తీసేవే.

అయితే, చిత్రాల మార్కెట్ ను విస్తరించుకోవాలన్నా, వాటికి వసూళ్ళు పెంచుకోవాలన్నా, నటుడిగా చిరకాలం నిలబడాలన్నా - ఉన్న అభిమాన ప్రేక్షక వర్గ పునాదిని నిలుపుకొంటూనే, కొత్త వర్గాలను కూడా తన చిత్రాలకు వీక్షకులుగా మార్చుకోవాలి. స్టార్ హీరోలు అయిన వారు, అవుదామని ప్రయత్నించేవారు అనివార్యంగా చేసే ప్రయత్నం ఇదే. పైగా, ఎప్పుడూ ఒకే వర్గ ప్రేక్షకులను ఆకర్షించే చిత్రాలు చేసి, చేసీ, హీరోలకూ మొహం మొత్తడం మొదలవుతుంది. ఆ పరిస్థితుల్లో కొత్త వర్గాన్ని ఆకర్షించేలా ఇమేజ్ మార్పునకు హీరో ప్రయత్నిస్తాడు.

ఎన్.టి.ఆర్. జూనియర్ తాజాగా బృందావనం చిత్రంలో చేసిన పని అదే. పోరాటాలు నిండిన యాక్షన్ పాత్రలతో, నృత్యాలతో తాను అభిమానులుగా సంపాదించుకున్న ప్రధానమైన సామాన్య ప్రేక్షక వర్గానికి తోడుగా, కుటుంబ ప్రేక్షకులనూ, ఎగువ తరగతి ప్రేక్షక వర్గాలనూ కూడా మరింత ఎక్కువగా ఆకర్షించాలనీ, ఆ రకం కథలు, పాత్రలు ఎంచుకోవాలనీ అతను నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. కెరీర్ పురోగమనంలో అది అతనికి తప్ప లేదు. అందులో తప్పూ లేదు. అందుకే, బృందావనం కథ, అతని రూపురేఖలు ఈ ఆశించిన కొత్త మార్పునకు తగ్గట్లు ఉన్నాయి. దీన్నే ముతకగా సినిమా పరిభాషలో మాస్ నుంచి క్లాస్ హీరోగా ఇమేజ్ మార్చుకోవడం అంటున్నాం. (అఫ్ కోర్స్, మళ్ళీ తనకున్న సామాన్య అభిమాన వర్గం పునాదిని కోల్పోకుండా ఉండడం కోసం ఇదే సినిమాలో ఎన్.టి.ఆర్. జూనియర్ యాక్షన్ తరహా చిత్రాల ఫైట్లూ ఎక్కువే చేశారు. అది వేరే సంగతి).

అయితే, ఇక్కడే ఓ చిక్కొస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమాకు రోజు కూలీ శ్రామికుడు రాజ పోషకుడు. మహిళలు మహారాజ పోషకులు. మాయ చేసి, జోల పాడే సినిమా అప్పట్లో సమస్యల నుంచి మధ్యతరగతి జనం ఎస్కేపిజానికి మార్గం. ఈ వర్గాలన్నిటికీ సినిమా తప్పనిసరి వినోదం. ఇలాంటి విస్తృత జనబాహుళ్యాన్ని మెప్పించడమే ధ్యేయంగా మన సినిమా నడిచింది.

టీవీ చానళ్ళ ప్రభంజనం మొదలయ్యాక, హాళ్లలో టికెట్ రేట్లు అందీ అందకుండా పోయాక, ఇవాళ హాలుకు వచ్చే ప్రేక్షక వర్గాలు, వారి అభిరుచులు మారిపోయాయన్నది నిష్ఠుర సత్యం. ఈ పరిస్థితుల్లో, సినిమాను వ్యాపారంగానే చూస్తున్న ప్రస్తుత తరుణంలో మన సినిమాలన్నీ ప్రధానంగా యువతరాన్నీ, కాలేజీ కుర్రకారునూ (తెలుగునాట వాళ్ళే ఇవాళ ఎక్కువగా సినిమాలకు వస్తున్నారన్నది ఓ థీరీ) దృష్టిలో పెట్టుకొని వస్తున్నాయి. తరచూ సినిమాలకొచ్చే శ్రామిక వర్గం, ఈ యువజన వర్గాలే ఇవాళ తెలుగు సినిమాకు పోషకులు. కాబట్టి అదే నేటి సామాన్య ప్రేక్షక వర్గం.

ఇక, ఒకప్పుడు సినిమాలు చూసినా ఇప్పుడు ఆ జోరు తగ్గించేసిన పెద్దలు, నడి వయసు దాటిన మహిళలు, సకుటుంబ ప్రేక్షకులు - వీరంతా అదనపు వర్గాలు. అరుదుగానో, అప్పుడప్పుడో, తమను ఆనందింపజేసే కథ తెరపై వచ్చినప్పుడో మాత్రమే హాళ్ళకు కదిలే ఈ వర్గాన్నే సినిమా ట్రేడ్ వర్గాలు క్లాస్ అంటున్నారు. ఈ వర్గీకరణలు ఏ మేరకు నిర్దుష్టమైనవన్నది పెద్ద చర్చే. కానీ, ఈ పరిభాషను తప్పించుకొంటూ, సినిమాలను సమీక్ష చేయడం అసాధ్యం కాకపోవచ్చు. అలాగని ఈ నేపథ్యాన్ని పూర్తిగా విస్మరిస్తూ, విశ్లేషణకు దిగడం మాత్రం ఆచరణలో, అనుభవంలో అవివేకమయ్యే ప్రమాదం ఉంది.

Saturday, October 16, 2010

ఇమేజ్ మార్పు కోసం చిన్న ఎన్టీయార్ విఫలయత్నం - 'బృందావనం'


(‘బృందావనం’: ఈ గోవిందుడు ‘ఎందరి’ వాడోలే...?! - పార్ట్ 2)

జగపతిబాబు 'శుభమస్తు' (నిజానికి అది ఓ తమిళ చిత్రానికి రీమేకట)మొదలు పతాక సన్నివేశంలో బాలకృష్ణతో నిర్మాత 'యువచిత్ర' కాట్రగడ్డ మురారి తీసిన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం దాకా అనేకానేక చిత్రాల ప్రభావం బృందావనం... గోవిందుడు అందరి వాడేలే... సినిమా మీద కనిపిస్తూనే ఉంటుంది.

చూపిన కథలే చూపితే....

పలు విజయవంతమైన చిత్రాల నుంచి వీలైనన్ని ముక్కలు ఏరుకొని తీసిన ఈ సినిమాకు కథ, కథనం, దర్శకత్వం - మూడూ వంశీ పైడిపల్లివే. ఈ సినిమా నిడివి పదహారు రీళ్ళే అయినా, కనీసం పదహారేళ్ళ కథను ఏకబిగిన చూపిస్తున్న భావన కలిగిస్తుంది. దర్శకుడి కథన మహిమ అది. ఇదే 'బృందావనం'చిత్ర నిర్మాత దిల్ రాజు హీరో ప్రభాస్ తో నిర్మించిన 'మున్నా' చిత్రం తీసిన దర్శకుడు ఈయనే.

నటులు సరే... నటన మాటేమిటి...

'బృందావనం...'లో నటీనటుల సంగతి చూస్తే - బాగా ట్రిమ్ చేసిన మీసం, గడ్డంతో క్రిష్ పాత్రలో చిన్న ఎన్టీయార్ బాగున్నారు. ప్రేమికుడిగా, రౌడీలను ఎదిరించే సాహసికుడిగా ఏక కాలంలో అటు కుటుంబ ప్రేక్షకులనూ, ఇటు సామాన్య జనాన్నీ ఆకట్టుకోవాలని ఆయన ప్రయత్నించారు. అయితే, నిజమైన భావోద్వేగాలకు అవకాశం లేని ఈ స్క్రిప్టులో ఆయన అద్భుతంగా చేసిన నటన ఏమిటంటే - ప్రశ్నార్థకమే.

పైపెచ్చు ఆ ప్రయత్నమేదో పూర్తిగా నిజాయతీతో చేసి ఉండాల్సింది. అదీ లేదు. సినిమా మరీ క్లాస్ అవుతుందన్న భయమో ఏమో, దర్శకుడు వీలైన చోటల్లా హీరోతో మానవమాత్రులకు సాధ్యం కాని ఫైట్లు చేయించారు. మాస్ ను మెప్పించాలని అతిగా శ్రమించారు. (ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్లు - రామ్ - లక్ష్మణ్ సోదరులు). కానీ,పల్లెటూరి ఎర్రబస్సులో పవర్ స్టీరింగ్, కత్తితో వందల అడుగుల చెట్టును కూల్చేయడం, ఎంత భారీ మనిషినైనా సరే అందులో సగమైనా లేని హీరో ఒంటిచేతితో గాలిలో గిరగిరా తిప్పేయడం లాంటి నమ్మశక్యం కాని ఆ ఫైట్లతో ఏ వర్గం ప్రేక్షకుడైనా మమేకం కావడం కష్టమే. దాంతో, ఈ నిమా అటూ, ఇటూ - ఎటూ చెందకుండా తయారైంది.

కథానాయికలుగా సమంత, కాజల్ - ఇద్దరూ ఉన్నా వారు కథలో అందమైన బొమ్మలే తప్ప, ప్రాణమున్న పాత్రలుగా కనిపించే ఘట్టాలు సినిమాలో అరుదు. ఆహుతి ప్రసాద్, రఘుబాబు, బ్రహ్మాజీ, సురేఖావాణి, తనికెళ్ళ భరణి, సితార - ఇలా సినిమా నిండా పేరున్న నటులు చాలా మందే ఉన్నారు. కానీ, మనసును తాకే పాత్రలే కరవు.

పాత్రచిత్రణలో లోటుపాట్లు

కాజల్ కు తాత పాత్రలో కోట శ్రీనివాసరావు, అతని పెద్ద కొడుకుగా ప్రకాశ్ రాజ్, చిన్న కొడుకుగా శ్రీహరి - వీరి మధ్య బంధాలనూ, అంతస్సంఘర్షణనూ బలంగా చెప్పగల అవకాశం స్క్రిప్టులో ఉంది. అయితే, ఆ పని చేయలేకపోయారు. భావోద్వేగ ప్రకటన అంటే గొంతు చించుకొని అరవడమని మన చిత్ర రూపకర్తలు అనుకున్నట్లు ఉన్నారు. అందుకే, సినిమాలో కొన్నిచోట్ల ప్రకాశ్ రాజ్, శ్రీహరి ఆంగికాన్ని వదిలి వాచికం మీద అతిగా పడ్డారు. ఫలితం - దృశ్యప్రాధాన్యం పోయి, శబ్ద కాలుష్యం మిగిలింది. అలాంటి సన్నివేశాల్లోని ఆ మితిమీరిన నాటకీయ ఫక్కీ ఏ తరం ప్రేక్షకులకైనా సహన పరీక్ష అని దర్శకుడు గుర్తించగలిగితే బాగుండేది.

ఈ సినిమాలో పాత్రల ప్రవర్తనకు క్రమానుగత పరిణామం కూడా లేదు. ‘‘ పాతికేళ్ళ వైరాన్ని పది నిమిషాల్లో పోగొట్టే మొనగాడివా’’ అని ఓ దశలో హీరోను ప్రకాశ్ రాజ్ ప్రశ్నిస్తాడు. పాత్ర ద్వారా తాను వేసుకున్న ప్రశ్నను తానే మర్చిపోయిన దర్శకుడు చివరకు సినిమాలో చూపించింది అదే. ప్రకాశ్ రాజ్, శ్రీహరి పాత్రలు ద్వేషం నుంచి ప్రేమకూ, ప్రేమ నుంచి ద్వేషానికీ ఎప్పటికప్పుడు మీట నొక్కినంత సులభంగా మారిపోయినట్లు కనిపిస్తుంది.

అలాగే, ‘‘మా అందరి మనసూ చూరగొని, మమ్మల్ని మార్చేశాడు. ఈ ఇంటిని బృందావనం చేశాడు’’ - అంటూ హీరో పట్ల ప్రకాశ్ రాజ్ కుటుంబం ప్రేమ చూపడానికీ, ఇంటిపెద్ద ప్రకాశ్ రాజ్ తోనే వాదించడానికీ కారణమైన సన్నివేశాలేవీ సినిమాలో లేవు. (ఒక్క ఆహుతి ప్రసాద్, రఘుబాబులను నాటకీయంగా మార్చేసిన సీన్ తప్ప). దాంతో, వాళ్ళ డైలాగులు తెచ్చి పెట్టుకొని చెప్పినట్లు ఉంటాయే తప్ప, కథనంలో అతకవు. హీరో తల్లి తండ్రుల పాత్రలు కూడా కథ కోసం రాసుకున్నట్లు కనబడేవే. పాత్రల్లోనూ, వాటి భావోద్వేగాల్లోనూ సహజత్వం కన్నా కృత్రిమత్వమే తాండవిస్తుంది.

కామెడీయే కొంత అండ

ఎటొచ్చీ మధ్య మధ్య వస్తూ పోయే వినోదమే ఈ సినిమాకు ఉన్నంతలో పెద్ద బలం. ప్రకాశ్ రాజ్ కుటుంబంలోని చిట్టి పాత్రలో వేణుమాధవ్ కాసేపు కామెడీకి ఉపకరించారు. 'రత్తాలు - రైసు మిల్లు' సి.డి. లాంటి సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అలాగే, 'బొమ్మరిల్లు' టైపు తండ్రినంటూ సెకండాఫ్ లో హీరోకు తండ్రిగా నాటకమాడడానికి వచ్చిన కాసేపు బ్రహ్మానందం - ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్.

సాంకేతిక విభాగాల సంగతి

ఈ చిత్ర సాంకేతిక విభాగాల్లో కొట్టొచ్చినట్లు కనపడేది - ఛోటా కె. నాయుడి ఛాయాగ్రహణ శ్రమ. మార్తాండ్ కె. వెంకటేశ్ తన ఎడిటింగ్ కత్తెరకు మరింత పదును పెట్టి ఉంటే బాగుండేది. అఫ్ కోర్సు ఇప్పుడు కూడా వచ్చిన నష్టమేమీ లేదు. హాలులోని ప్రొజెక్టర్ ఆపరేటర్లే ఆ పని చేయడం ఖాయమని అర్థమవుతూనే ఉంది.

అలాగే, ఆ మధ్య కొన్ని మెరుపులు మెరిపించిన థమన్ ఎస్. ఈ చిత్రానికి అందించిన సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గతంలో మెలొడీ పాటలు కూడా కట్టిన ఈ యువ సంగీత దర్శకుడు పాటల్లోని బీజియమ్ ల మొదలు సినిమాలోని సన్నివేశాల వరకు బీట్ కే పెద్దపీట వేశారు. రీ-రికార్డింగులోనూ అదే వరస. సన్నివేశంలోని ఎఫెక్టును పెంచడానికి సంగీతంలో నిశ్శబ్దం కూడా ఓ భాగమేనని మర్చిపోయేసరికి, ప్రతి దృశ్యంలో రీ-రికార్డింగ్ శబ్దాలు చెవులకు హోరెత్తిస్తుంటాయి, మనసుకు ఠారెత్తిస్తుంటాయి.

పాటలు, డ్యాన్సులు


కొన్ని పాటలకు ఎంచుకున్న లొకేషన్లు (ముఖ్యంగా కాజల్, ఎన్టీయార్ల పల్లె సీమ పాట), వాటిని చూపిన తీరు కంటికి బాగున్నాయి. పాటల చిత్రీకరణ కోసం కూడా బాగానే ఖర్చు పెట్టారు. అయితే, ఈ చిత్రంలోని పాటలు గుర్తుంచుకోగలిగేలా లేవు. నాకైతే, ఈ డి.టి.ఎస్.ల హోరులో పాటల్లో మాటలు అక్కడక్కడే వినిపించాయి. రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్, లలిత నృత్య దర్శకత్వం వహించిన ఈ పాటల్లో చిన్న ఎన్టీయార్ తన స్వతఃసిద్ధంగా చులాగ్గా నర్తించారు. (నర్తించలేక ఇబ్బంది పడ్డ పాట ఒకటి ఉంది. దాని గురించి చివరలో...)

ఇక, పిక్స్ లాయిడ్ సంస్థకు చెందిన యుగంధర్, నయీమ్ ల బృందం ఈ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్ లు సమకూర్చారు. ప్రకాశ్ రాజ్ ఇల్లుగా సినిమాలో కనపడే నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలోని ఇంటి సెట్టింగ్ చుట్టూరా అంత ఖాళీ స్థలం, ప్రకృతి దృశ్యాలు వగైరా మొత్తం కంప్యూటర్ లో విజువల్ ఎఫెక్ట్ ల క్రియేషనే.

వంశీ పైడిపల్లి రాసుకున్న ఈ చిత్ర కథకు ముగ్గురు రచనా సహకారం అందించారు. ఆ ముగ్గురిలో ఒకరైన కొరటాల శివ దీనికి సంభాషణలు సమకూర్చారు. కొన్ని చోట్ల పాటక జన ప్రశంసలందే డైలాగులూ రాశారు. ‘సిటీ నుంచి వచ్చాడు కదా - సాఫ్టుగా ఉన్నాడనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని రెచ్చగొట్టకు. రెచ్చగొడితే రచ్చ రచ్చే...’ (విలన్ తో హీరో)లాంటివి ఆ కోవ లోవే. ‘‘భయమా, వినయమా’’ అని హీరో అడిగితే, ‘భయంతో కూడిన
వినయంతో వచ్చిన....’ అంటూ వేణుమాధవ్ చెప్పే డైలాగు మహేశ్ బాబు ‘అతడు’లో త్రివిక్రమ్ రాసిన డైలాగుకు నకలు.

చిన్న ఎన్టీయార్ ఇమేజ్ పెంపు కోసం మళ్ళీ ‘యమదొంగ’ వగైరా చిత్రాల్లో లాగా పెద్ద ఎన్టీయార్ పాత్రను సినిమాలోకి రప్పించారు. దాన వీర శూర కర్ణ చిత్రంలోని గీతోపదేశం సన్నివేశంలోని విశ్వరూప కృష్ణుడి వేషంలో పెద్దాయన క్లైమాక్స్ లో కనిపిస్తారు. కానీ, అక్కడ రెండు మూడు డైలాగులకు మిమిక్రీ వాళ్ళతో చెప్పించిన పెద్ద ఎన్టీయార్ డబ్బింగ్ ఆ పాత సినిమాలను చూసి పెరిగిన తరానికి చీకాకు తెప్పిస్తుంది.

'ఢీ, రెఢీ, బిందాస్' - ఇలా ఈ మధ్య కాలంలో వినోదాత్మక పంథాలో నడిచిన మాస్ చిత్రాలు అందరికీ గుర్తే. నాలుగు డబ్బులు చేసుకున్న ఆ చిత్రాల తోవే ఈ కథకూ శ్రేయస్కరమని దర్శక, నిర్మాతలు భావించినట్లున్నారు. అందుకే, చాలా చోట్ల ఆ బాటలోనే నడిచారు. కానీ, 'బావగారూ బాగున్నారా', 'అల్లుడు గారు వచ్చారు' లాంటి పలు సినిమాలను గుర్తుకు తెచ్చేలా, అనేక అంశాల కిచిడీగా మార్చడంతో, ఓ దశ గడిచేసరికే హాలులోని ప్రేక్షకులకు విసుగు పుడుతుంది. ఎప్పటికప్పుడు అయిపోవచ్చిందని అనిపిస్తూనే అవకుండా సినిమా ఇంకా ముందుకు సా....గుతున్నట్లు కనిపిస్తుంది. అదే ఈ చిత్రంలోని పెద్ద బలహీనత. అందుకే, విశ్రాంతి దగ్గరే పతాక సన్నివేశం చూపించినంత భావన కలిగించే, ఈ గోవిందుడు - ప్రేక్షక జనులందరి వాడు కాలేకపోయాడు. ఇమేజ్ మార్పు ప్రయత్నంలో ఆశించినంత సఫలం కాలేకపోయాడు.

కొసమెరుపు -

సినిమా చివరలో వచ్చే ‘‘ రా.. ఎయ్ రా... ఏసేయ్ రా...’’ పాటలో ఎన్టీయార్ పదే పదే కింద కూర్చొని, పైకి లేచే ఓ స్టెప్పు వేయడానికి కష్టపడుతున్నట్లు తెరపై కనిపించేస్తుంది. ఇప్పటికే ఆర్య-2 లాంటి చిత్రాల్లో అల్లు అర్జున్ లాంటి వాళ్ళు వేసి మెప్పించిన అదే తరహా స్టెప్పును (యాక్సిడెంట్ అనంతరం కొంత ఇబ్బంది పడుతున్న)చిన్న ఎన్టీయార్ మీద ప్రయోగించాల్సిన పనేమిటి. ఆ స్టెప్పు వేయకపోయినా అతని నృత్య ప్రతిభకు వచ్చిన కొరతేమీ లేదు కదా. (అన్నట్లు కాళ్ళతో నేలను తుడిచినట్లుండే ఈ ఫ్లోర్ క్లీనింగ్ స్టెప్పు నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ దేనా...)

‘బృందావనం’: ఈ గోవిందుడు ‘ఎందరి’ వాడోలే...?!

ఒక ఇమేజ్ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న పెద్ద హీరోను మరో ఇమేజ్ వైపు మరలించడం అంత సులభం కాదు. ఆ మార్పునకు అభిమాన ప్రేక్షక జనంతో అవుననిపించుకోవాలంటే చాలా శ్రమే పడాలి. మంచి కథ, ఆసక్తి కరమైన కథనం, ఆర్టిస్టుల అభినయ ప్రతిభ, ఆహ్లాదకరమైన సంగీతం - అన్నీ కావాలి. అవన్నీ ఆశించిన స్థాయిలో కుదరకపోతే కష్టమే. మాస్ హీరోగా ముద్ర పడిన చిన్న ఎన్టీయార్ ను, మంచి లవర్ బాయ్ గా చూపి, క్లాస్ కు దగ్గర చేయాలనే ప్రయత్నంగా ‘బృందావనం’ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. కానీ, ఆ ప్రయత్నం ఉడికీ ఉడకని అన్నంగా తయారవడమే విషాదం.

వేల కోట్ల రూపాయల కూడిన కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు అధినేత సురేంద్ర (ముఖేశ్ ఋషి). అతనికి ఏకైక సంతానం కృష్ణ అలియాస్ క్రిష్ (ఎన్టీయార్ జూనియర్). ప్రాణాలకు తెగించి అయినా సరే, స్నేహితుడి ప్రేమను సఫలం చేసే రకం. ఏ సమస్యా లేకుండా హాయిగా కాలం గడిపేస్తున్న హీరో, కాలేజీలో ఇందు (‘ఏ మాయ చేశావే’ చిత్ర ఫేమ్ సమంత)ను ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని తెచ్చి, ఇంట్లో అమ్మా నాన్నకు పరిచయం కూడా చేస్తాడు.

స్నేహితురాలి సమస్యకు పరిష్కారం కోసం హీరోను ఇందు ఆశ్రయిస్తుంది. ఇందు స్నేహితురాలు భూమి (కాజల్ అగర్వాల్). ఆమెకు విదేశాల్లో పై చదువులు చదవాలని ఉంటుంది. కానీ, ఆమె నాన్న (ప్రకాశ్ రాజ్) మాత్రం తన అక్క కొడుకు (అజయ్)కు ఆమెను ఇచ్చి పెళ్ళి చేసేయాలని నిర్ణయిస్తాడు. ఆ పెళ్ళి తప్పించుకోవడం కోసం తాను ఇప్పటికే ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు భూమి తమ ఇంట్లో అబద్ధం చెబుతుంది. ఆ అబ్బాయిని తీసుకురమ్మంటాడు ఆమె తండ్రి. లేని బాయ్ ఫ్రెండ్ ను ఎక్కడ నుంచి తేవడమా అని భూమి ఇబ్బంది పడుతుంటుంది. భూమితో పాటు వాళ్ళ ఊరుకి వెళ్ళి, బాయ్ ఫ్రెండ్ గా నటించి, ఆ గండం నుంచి ఆమెను గట్టెక్కించాల్సిందిగా హీరోను ఒప్పిస్తుంది ఇందు.

భూమికి బాయ్ ఫ్రెండ్ గా నటిస్తూ, ఆమెతో పాటు ఊరెళ్ళిన హీరో ఆ పెద్ద కుటుంబంలో అందరి అభిమానాన్నీ సంపాదిస్తాడు. బద్ధశత్రువులుగా వేరు వేరు ఊళ్ళలో బతుకుతున్న భూమి తండ్రి (ప్రకాశ్ రాజ్)నీ, బాబాయ్ (శ్రీహరి)నీ కూడా కలుపుతాడు. భూమిని ఏకంగా హీరోకే ఇచ్చి పెళ్ళి చేసేయాలన్న దాకా కథ వెళుతుంది. అప్పటి దాకా బాయ్ ఫ్రెండ్ గా నటిస్తున్న హీరో ఒక్కసారి ఉలిక్కిపడతాడు. అదే సమయంలో పట్నం నుంచి ఇందు కూడా ఆ ఊరికి, ఆ ఇంటికి వస్తుంది. దాంతో కథ రసకందాయంలో పడుతుంది. గోవిందుడు ఏమవుతాడో... అంటూ ఫస్టాఫ్ ముగుస్తుంది.

పట్నం నుంచి వచ్చిన ఇందుకూ, ఆ ఇంటికీ సంబంధం ఏమిటి, ఈ దొంగ బాయ్ ఫ్రెండ్ నాటకం ఏమైంది, భూమిని పెళ్ళాడాలని తపిస్తున్న విలన్ బావ సంగతి ఏమైంది, ఇద్దరు భామల మధ్యన నలిగిన హీరో చివరకు ఏం చేశాడు - లాంటి ప్రశ్నలకు జవాబులన్నీ సెకండాఫ్ లో చూడవచ్చు.

(మిగతా భాగం మరి కాసేపట్లో...)

Friday, October 15, 2010

'బృందావనం' టికెట్ల కోసం ఇక్కట్లు


ఈ దసరా పండుగ సినిమాల్లో భాగంగా వచ్చిన ఆఖరి పెద్ద తెలుగు సినిమా బృందావనం. నిన్న అక్టోబర్ 14న రిలీజైంది. అయితే, మా ఊళ్ళో బృందావనం టికెట్లకు నానా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఓ పక్క రోబో, మరో పక్క ఖలేజా వచ్చి పక్షం రోజులైనా పూర్తికాకపోవడంతో, మా ఊళ్ళో ఉన్న ఒకటి రెండు రెగ్యులర్ తెలుగు సినిమా హాళ్ళలో బృందావనం ఎక్కడ, ఎన్ని ఆటలు వేస్తున్నారన్నది ఆఖరి దాకా ఖరారు కాలేదు. అది ఓ పెద్ద తలకాయనొప్పిగా మారింది.

దాంతో, సినిమా రిలీజు రోజు ఉదయానికి కూడా సెకండ్ షో మాకు దగ్గరలో ఏ హాల్లో అయినా ఉందా, ఉంటే టికెట్లున్నాయా అన్నది తేలలేదు. అప్పటికీ మా సినీ మిత్ర బృందంలో ఒకరు అన్ని రకాలుగా ప్రయత్నించి చూశారు. ఇంటర్నెట్ బుకింగ్ కు సైతం సై అన్నా, సినిమా ఎక్కడ ఆడుతోందన్నది ఖరారవలేదు. దాంతో ఇబ్బంది పట్టుకుంది.

క్రమం తప్పకుండా తెలుగు సినిమాలు మాత్రమే ప్రదర్శించే హాలుకు మా మిత్రుడు రెండు, మూడు సార్లు బండి వేసుకు తిరిగాడు. కానీ, ఆఖరికి రిలీజ్ రోజు మధ్యాహ్నానికి ఆ హాలు వాడు చేతులెత్తేశాడు. రాత్రి 10 గంటలకు సెకండ్ షో గా బృందావనం వేద్దామని అనుకున్నప్పటికీ, రోజు మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క ఆట కూడా పోతుందని ఖలేజా వాళ్ళు పట్టుబట్టారట. దాంతో, ఖలేజా స్థానంలో బృందావనం సెకండ్ షో వేయడం కుదరలేదని హాలు మేనేజర్ చెప్పారు.

కానీ, ఎలాగైనా సినిమా చూడాలని ఓ కోరిక. చివరకు, మాకు చాలా దూరంగా ఉండే ఓ థియేటర్ లో సెకండ్ షో వేస్తున్నట్లు ఆఖరి నిమిషంలో కన్ఫర్మ్ చేశారు. దానికి మా మిత్రుడు కష్టపడి, ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేశాడు. విచిత్రం ఏమిటంటే ఆ సాదాసీదా థియేటర్లో మల్టీప్లెక్సు హాళ్ళకు దీటుగా టికెట్ రేటు వసూలు చేయడం. నిజానికి, ఆ థియేటర్లో నేల (రూ. 10), కుర్చీ (రూ. 50), బాల్కనీ (రూ. 70) ఉన్నాయి. కానీ, తెలుగు సినిమాలకు ఉండే వేలం వెర్రి దృష్ట్యా అక్కడ బాల్కనీ టికెట్ ను రూ. 100కు అధికారికంగా అమ్మేస్తున్నారు. ఇంటర్నెట్ లో బుకింగ్ చేసుకుంటే, ప్రతి టికెట్ కీ అదనంగా మరో 10 రూపాయలు బొక్క. ఇలా థియేటర్ యజమానులు ప్రేక్షకుల ఆసక్తిని ఆసరాగా చేసుకొని, నిలువు దోపిడీ చేయడం అక్షరాలా అన్యాయం. దీని గురించి మాట్లాడేవాళ్ళు కూడా లేరు. (ఈ పిట్టకథ గురించి మరోసారి, మరో సందర్భంలో...). మొత్తానికి, అలా ఒక్కో టికెట్ రూ. 110 వంతున ఖర్చు పెట్టుకొని, మా మిత్ర బృందమంతా ఆ దూరపు థియేటర్ కి 'బృందావనం' కోసం వెళ్ళాం. చూశాం. సినిమా ఎలా ఉందంటారా. చెబుతా. కాస్త ఆగండి.

( ‘బృందావనం’ సమీక్ష.....తరువాతి టపాలో...)

Wednesday, October 13, 2010

'మేస్త్రి' ని ఏమైనా అనచ్చు కానీ, 'మగధీర' మీద మాట్లాడకూడదా!?

సినీ రంగంలో, అభిమానుల్లో ఓ వైపరీత్యం ఉంది. ఏ చిన్న విమర్శ వచ్చినా ఎవరూ తట్టుకోరు. కువిమర్శ చేస్తే సరే కానీ, సద్విమర్శ చేసినా అది పరిస్థితి. ‘నంది’లో మోసం జరిగిందా..? ‘మగధీర’లో నటన ఉత్తమమైనదేనా..? అని రాసిన పోస్టు మీద కొందరు నా మీద కోపం చూపారు. దాసరి చేసిన (చేశారనే మనవాళ్ళ అభిప్రాయం) పైరవీ గురించే మాట్లాడాలి కానీ, ‘మగధీర’ గురించి కూడా మాట్లాడడమేమిటని కొందరు అన్నారు. ఇంకొందరు వ్యాఖ్యలు రాశారు. వారికి సుదీర్ఘ వివరణగానే ఈ తాజా టపా.

నా మటుకు నేను మునుపటి టపా రాయడానికి ఓ కారణం ఉంది. ఆ ఉత్తమ నటుడి అవార్డు దాసరికి ఇవ్వడం సరైనదా, కాదా అన్నది ఒక అంశం. దానికి తోడు 'మగధీర'లో రామ్ చరణ్ తేజ్ నటన సైతం అందుకు అర్హంగా ఉన్నదా, లేదా అన్నది మరో అంశం. ఈ రెండు అంశాలూ తాజాగా జనం ఎదుట చర్చకు నిలవాల్సినవే. అలా కాకుండా వాటిలో ఎంతసేపూ ఒకదాన్నే పట్టుకొని మాట్లాడడం సరైనది కాదు.

అందరూ నాణానికి ఒకవైపే చూస్తూ, 'మేస్త్రీ' సినిమా గురించే ప్రస్తావిస్తుండడంతో, నాణానికి రెండో వైపు దృష్టి సారించేలా చేయాలన్నదే ఈ టపా ఉద్దేశం. నన్నడిగితే, ఇలాంటి అవార్డుల్లో ఎవరి ప్రమేయం ఎంత ఉంటుందన్నది జనానికి తెలియనిది కాదు. అంతమాత్రాన ఈ అంశాలను చర్చకు పెట్టడమే నేరం, ఇది చిరంజీవినీ, ఆయన కుటుంబాన్నీ లక్ష్యంగా చేసుకోవడమే అనుకుంటే శుద్ధ పొరపాటు.

ఇక, కొందరేమో, అసలు సంగతి వదిలేసి, చిరు ఒళ్ళు తగ్గడమనే అంశంపైన దృష్టి పెట్టారు. నా టపాలో లేని అర్థాలు వెతికారు. లైపో సక్షన్ అంటే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగించు (తొలగించు) కోవడమనే నాకు తెలిసిన అర్థం. కొవ్వు కరిగించుకోవడమని రాస్తే, రాతలో లేని అహంకారమనే అర్థం తీసుకుంటే, అది చదువుతున్న వారి ఆలోచనే తప్ప, రాతలో ఉన్నది కాదు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం ఎవరికీ లేదు. నాకైతే ఏ కోశానా లేదు.

దాసరి సీనియర్ నటుడు కాబట్టి, ఎలాగైనా బాగా నటించేస్తాడని మీ ఉద్దేశ్యమా అని ఇంకొందరు అన్నారు. అదే నా ఉద్దేశమైతే, మేస్త్రీ చిత్రాన్నీ, నటననూ నేను భుజానికెత్తుకోవాలిగా. ఆ పని చేయలేదే. అలాగే, నేనిక్కడ దాసరి, రామ్ చరణ్ తేజ్ ల ఇద్దరి నటననూ పోల్చడం లేదు. ఆడలేదు కాబట్టి మేస్ర్తీ చిత్రంలో నటనకు అవార్డు ఏమిటని వస్తున్న విమర్శలో ఎంత న్యాయముందో, జనం చూశారు కాబట్టి మగధీరలో నటనకు అవార్డు ఇవ్వాలన్న వాదనలోనూ అంతే న్యాయముంది. ఒకటి ఎడమ చేయి, రెండోది పుర్ర చేయి. అంతే తేడా. బ్లాగర్ బద్రి గారి కామెంట్ మాటల్లో చెప్పాలంటే... ‘‘ ‘నంది’లో మోసం జరిగిందా ? అవును. ‘మగధీర’లోది ఉత్తమ నటనేనా ? కాదు...’’