జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, January 23, 2015

అప్పుడాయన కళ్లెర్రజేసి ఉంటే...నా పరిస్థితి ఏమయ్యేదో! - రావి కొండలరావు


సినిమా ప్రపంచంలో పాత్ర పరంగా కాకుండా వ్యక్తిగతంగా కొందరు ఆలోచిస్తారు. ఒక పాత్ర ఇంకో పాత్రని దూషిస్తే రెండో పాత్రధారి, మొదటి పాత్రధారిని ఉద్దేశించి ‘‘అతనెవడు నన్ను తిట్టడానికి?’’ అని అడిగిన సందర్భాలున్నాయి. రాజ్యం పిక్చర్స్ ‘హరిశ్చంద్ర’లో యస్.వి. రంగారావు- హరిశ్చంద్రుడు, గుమ్మడి -విశ్వామిత్రుడు. ఒక దృశ్యంలో విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడు తన ముందు మోకరిల్లి ఉండగా, తలను కాలితో తన్నాలి. రంగారావు ఒప్పుకోలేదు. ‘‘గుమ్మడెవరు నన్ను తన్నడానికి?’’ అని అంగీకరించపోతే, ‘డూప్’ షాట్ తీసుకున్నారు. ‘ప్రేమించి చూడు’లో రేలంగిని, అల్లు రామలింగయ్య ‘బావా’ అనాలి - దృశ్యపరంగా. రేలంగి ఒప్పుకోలేదు. అలిగి కూచుంటే దర్శకుడు పి. పుల్లయ్య బుజ్జగించారు. ఇలాంటివి ఇంకా ఎన్నో కనిపిస్తాయి. ‘ప్రేమించి చూడు’లో నేను, అక్కినేని వారికి (హీరో) తండ్రిని.

  పదిమంది నా గురించి చెప్పి.. చెప్పి.. చెబితేగాని, దర్శకుడు పి. పుల్లయ్యగారు ఆ వేషం నాకివ్వలేదు. ఆ భయం ఉంది వేషం మొదలు పెడుతున్నప్పుడు. పైగా, మొట్టమొదటి రోజు నా షూటింగు, నాగేశ్వరరావుగారిని తిట్టడంతో ఆరంభం! ‘‘ఒరే గాడిదా, ఎక్కడ తిరుగుతున్నావురా?’’ అని డైలాగు ఆరంభం. ఒళ్లు వణుకు, గుండె దడ. నాగేశ్వరరావు గారు నాకు బాగా తెలుసు గాని, ఆయనతో నటించడం అదే మొదలు. పైగా దృశ్యంలో గుమ్మడి, జగ్గయ్య, రేలంగి కూడా ఉన్నారు. ‘‘ఈ రావి కొండలరావు నన్ను గాడిదా అని తిడతాడా? అసలు ఈ వేషం ఇతనికెందుకు ఇచ్చారు?’’ అని అక్కినేని, కళ్లెర్రజేస్తే? అమ్మో! ‘‘రిహార్సల్ - రావయ్యా కొండల్రావు చెప్పు డైలాగ్’’ అని పుల్లయ్యగారు అరుస్తున్నారు. నా పక్కనే ఉన్న సహాయ దర్శకుల దగ్గర నెమ్మదిగా మొర పెట్టుకుంటున్నాను.

  షాట్‌కి వెళ్లడం లేదు. ‘‘ఏం జరుగుతోందక్కడ? ఏమిటాలస్యం?’’ అని హీరోగారూ ఓ కేక వేశారు. సహాయకులు వెళ్లి అక్కినేనికి వివరించారు - నాలో జరుగుతున్న ఘర్షణ. ‘రండి - రండి ఇలా’ అని పిలిచారు హీరో. నెమ్మదిగా వెళ్లాను. ‘‘ఏమిటి? ఏమిటా సందేహం?... ఎవర్ని తిడుతున్నారు మీరు? నన్నా? మీ కొడుకునా?... తన కొడుకుని, తండ్రి ‘గాడిదా’ అని తిడుతున్నాడు. అంతేగాని, అక్కినేని నాగేశ్వరరావుని, రావి కొండలరావు ‘గాడిద’ అనడం లేదు కదా. ఆలోచిస్తారేమిటండీ - విజృంభించండి. రండి’’ అని భుజం తట్టి ప్రోత్సహించారు.

  అంతే. రిహార్సల్‌లో దంచాను. టేక్‌లోనూ మార్కులు కొట్టాను. అదీ - అక్కినేని ప్రోత్సాహం! తక్కిన కొందరు పెద్ద తారలు అన్నట్టుగా ‘వీడెవడు నన్ను గాడిదా’ అనడానికి అని, ఆయన ఒక్క మాట అని ఉంటే - నేను సినిమాల్లో నిలదొక్కుకోగలగడానికి కారణమైన ఆ పాత్ర పోయేది. అసలు నా సినిమా జీవితం- నటుడిగా - అక్కడే ఆగిపోయేది! ఆయన ముఖ్య నటుడు. ఏం చెబితే అది జరుగుతుంది. కానీ ఆయన పాత్రపరంగా ఆలోచించారే గాని, వ్యక్తిగతంగా ఆలోచించలేదు. ఎంతటి పెద్ద మనసు! నాలాగా ఎంతోమంది కొత్తవారికి ఇచ్చిన ప్రోత్సాహం విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇది నేను మరచిపోలేను!     
     
- రావి కొండలరావు
సీనియర్ నటుడు, జర్నలిస్ట్  

................................

0 వ్యాఖ్యలు: