జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, January 14, 2015

‘గోపాల గోపాల’ సినిమా రివ్యూ

‘గోపాల గోపాల’  సినిమా రివ్యూ

తారాగణం: పవన్ కల్యాణ్, వెంకటేశ్, శ్రీయ, మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, ఆశిష్ విద్యార్థి, కృష్ణుడు, స్క్రీన్‌ప్లే: భూపతిరాజా, దీపక్‌రాజ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమేరా: జయనన్ విన్సెంట్, కళ: బ్రహ్మ కడలి, యాక్షన్: అలన్ అమీన్, డ్రాగన్ ప్రకాశ్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: డి. రామానాయుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అభిరామ్ దగ్గుబాటి, నిర్మాతలు: శరత్ మరార్, డి. సురేశ్‌బాబు, కథనం - దర్శకత్వం: కిశోర్‌కుమార్ పార్థసాని (డాలీ)

కొన్ని కథలు చెబితే ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని కథలు విన్నప్పటి కన్నా, చూస్తేనే ఆసక్తికరంగా ఉంటాయి. సినిమాకు వచ్చేసరికి మామూలు కథాంశాన్ని అయినా,తెరపై చూపడంలోని నేర్పును బట్టి ఆసక్తికరంగా మార్చేయవచ్చు. కానీ, ఆ నేర్పే గనక కొరవడితే, ఎంత మంచి కథాంశమైనా, సినిమా హాలు దాకా వచ్చేసరికి చప్పగా తయారవుతుంది. దర్శకుడి సామర్థ్యంతో పాటు అతనికి దక్కిన స్వేచ్ఛ, కథను సన్నివేశాలుగా, పాత్రలను సహజంగా మలుచుకోవడంలో చూపే సత్తా లాంటి అనేక అంశాలన్నీ అందుకు కారణాలే!

ముఖ్యంగా, ఒక భాషలో హిట్టయిన కథాంశాన్ని మన భాషలోకి తెచ్చుకున్నప్పుడు ఎక్కడ యథాతథంగా అనుసరించాలి, ఎక్కడ సృజనాత్మకత చూపాలి, మన పాత్రధారులతో ఆ పాత్రల్లోకి ఎలా పరకాయ ప్రవేశం చేయించాలన్నది అనుభవం, ఆలోచనతో చేయాల్సిన పని. పరేశ్ రావల్ నటించిన హిందీ హిట్ ‘ఓ మై గాడ్’ చిత్రాన్ని మనవాళ్ళు తెలుగులోకి ‘గోపాల... గోపాల...’గా తెచ్చిన తీరు చూశాక ఇలాంటి ఆలోచనలన్నీ కలుగుతాయి.

కథ ఏమిటంటే...
గోపాలరావు (వెంకటేశ్) ఒక మధ్యతరగతి మనిషి. దేవుడి బొమ్మలు, గంగాజలం - ఇలా భక్తి సంబంధమైన సామగ్రి అమ్మే వ్యాపారి. అయితే, విచిత్రంగా అతడికి దేవుడి మీద, పూజా పునస్కారాల మీద నమ్మకం ఉండదు. మానవత్వం మీద, తోటి మనిషికి సాయపడడం మీదే గురి. అతని భార్య మీనాక్షి (శ్రీయ) మహా దైవభక్తురాలు. చిన్నారి కొడుకు మోక్షను కూడా వీర దైవభక్తుడిగా చేస్తుంటుంది. ఈ క్రమంలో అనుకోకుండా సిద్ధేశ్వర మహరాజ్ (పోసాని కృష్ణమురళి) అనే దొంగ స్వామీజీతో గోపాలరావుకు ఘర్షణ ఎదురవుతుంది. దేవుణ్ణి నమ్మనివాడు నాశనమవుతాడంటూ సిద్ధేశ్వర్ శాపనార్థాలు పెడతాడు.

ఇంతలో అనుకోకుండా వచ్చిన చిన్న భూకంపంలో ఊరంతా బాగున్నా, గోపాలరావు కొట్టు ధ్వంసమవుతుంది. ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళేమో ఈ ప్రకృతి వైపరీత్యం ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అంటూ బీమా సొమ్ము ఇచ్చేది లేదంటారు. ఆ క్రమంలో తనకు నష్టపరిహారం ఇవ్వాలంటూ గోపాలరావు చివరకు దేవుడి మీద కోర్టులో కేసు వేస్తాడు. దేవుడి పేరు చెబుతూ ఆశ్రమాలు, ఆలయాలు నడుపుతున్న స్వామీజీలకు నోటీసులిస్తాడు. ఆ క్రమంలో మతవాదులు అతనిపై దాడికీ దిగుతారు. ఆ సమయంలో సాక్షాత్తూ దేవుడే (పవన్‌కల్యాణ్) మానవరూపంలో దివి నుంచి భువికి దిగి వస్తాడు. దేవుడిపైనే కేసు వేసిన వ్యవహారం నచ్చక, బంధువులతో పాటు పెళ్ళాం బిడ్డలు కూడా హీరో ఇల్లొదిలి వెళ్ళిపోతారు. అక్కడికి సినిమా ప్రథమార్ధం. ఆ తరువాత సంచలనాత్మకమైన ఈ దేవుడిపై గోపాలరావు కేసు కోర్టులో ఏమైంది? మానవరూపంలో వచ్చి, గోపాలం ఇంటిలోనే దిగిన దేవుడు అతనికి ఏం చెప్పాడు, ఏం చేయించాడు, చివరకు గోపాలరావు జీవితం ఏమైందన్నది మిగతా సినిమా.

ఎలా నటించారంటే....
దేవుడి మీద నమ్మకం కన్నా మానవత్వం మీద నమ్మకం ఎక్కువున్న గోపాలరావు పాత్రలో వెంకటేశ్ పాత్ర పరిధి మేరకు నటించడానికి ప్రయత్నించారు. అయితే, మానవత్వం మిన్న అని వాదించే కొన్ని ఘట్టాల్లో మాత్రమే ఆయన అభినయ ప్రతిభ వెలికి వచ్చింది. దేవుడుగా పవన్ కల్యాణ్ తన మాటలో, నటనలో మార్దవాన్ని మేళవించి, దైవత్వం ఉట్టిపడేలా చేయాలని చూశారు. అలవాటైన హావభావాలకు దూరంగా ఉంటూ కొత్తగా కనిపించారు. ప్రస్తుతం జనంలో ఉన్న క్రేజుతో హాలులో కేరింతలు కొట్టించారు.

ఇక, మనిషిలో, ప్రవర్తనలో  స్త్రీత్వాన్నీ, వ్యూహరచనలో క్రూరత్వాన్నీ కలగలుపుకొన్న లీలాధర స్వామిగా మిథున్ చక్రవర్తికి ఇది తొలి తెలుగు సినిమా. హిందీ ‘ఓ మై గాడ్’లో పోషించిన పాత్రనే మరింత సమర్థంగా ఆయన అభినయించారు. కొన్ని చిన్న చిన్న హావభావాలను కూడా తన అనుభవంతో తెరపై బాగా పండించారు. వెంకటేశ్ భార్యగా శ్రీయది ప్రాధాన్యం లేని చిన్న పాత్ర. మిగిలిన పాత్రలు, పాత్రధారులు సన్నివేశానికి తగ్గట్లు వచ్చిపోతుంటారు.

సాంకేతిక నిపుణుల పనితీరెలా ఉందంటే...
అసలు ‘కిషన్ వర్సెస్ కన్హయ్య’ అనే నాటకం ఈ చిత్రకథకు మూలం. దాని ఆధారంగా వచ్చిన ‘ఓ మై గాడ్’ హిందీ చిత్రం అధికారిక మాతృక. ఆ స్క్రిప్టును తెలుగుకు తగ్గట్లు చిన్న చిన్న మార్పులు, చేర్పులతో అల్లుకున్నారు. ‘‘వేగం బండిలో కాదు మిత్రమా... దాన్ని నడిపేవాడి నరంలో ఉంటుంది!’’ (వెంకటేశ్‌తో పవన్ కల్యాణ్) లాంటి కొన్ని మెరుపులు డైలాగుల్లో ఉన్నాయి.

‘కొన్నిసార్లు రావడం లేటవచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా’, ‘సమర్థులు మాకెందుకని ఇంట్లో కూర్చుంటే, అసమర్థులు రాజ్యమేలతారు’, ‘దారి చూపించడం వరకే నా పని. గమ్యాన్ని చేరుకోవడం నీ పని’ (పవన్ కల్యాణ్) లాంటి రాజకీయ ధ్వనితో కూడిన మాస్ డైలాగులు సన్నివేశం, సందర్భంతో పని లేకుండా అభిమానులకు వీనులవిందు చేస్తాయి. అయితే, చాలాచోట్ల సన్నివేశాల రూపకల్పనలో, డైలాగుల్లో సహజత్వం కన్నా తెచ్చిపెట్టుకున్న కృత్రిమత్వం తెలుస్తుంటుంది.

పిల్లి ఎదురురావడం, బల్లిపాటు, వాస్తు లాంటి మనలోని మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ సినిమా మొదట్లో వచ్చే ‘ఎందుకో ఎందుకో రెండు కాళ్ళు ముఖ్యమంటు...’ పాట ఆలోచింపజేస్తుంది. ఇక, ద్వితీయార్ధంలో ‘భాజే భాజే...’ అంటూ పవన్ కల్యాణ్ బృందంపై వచ్చే పండగ పాట ప్రేక్షకులతోనూ స్టెప్పులు వేయిస్తుంది. మిగిలిన పాటలు కూడా సందర్భోచితంగా వచ్చినవే అయినా, గుర్తుండేలా సాగవు. సినిమా అనేక చోట్ల నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని భావోద్వేగాలను పెంచడానికి ఉపకరిస్తుంది.

శ్రీయతో, పవన్ కల్యాణ్ మాట్లాడే సన్నివేశం లాంటి చోట్ల ఛాయాగ్రహణ పనితనం కనిపిస్తుంటుంది. సినిమాలో మొదటి పాట లాంటి చోట్ల చకచకా సన్నివేశాన్ని నడిపిన ఎడిటర్, సెకండాఫ్‌కు వచ్చేసరికి ఆ సన్నివేశాలు, వాటిలోని అంశాల తాలూకు అనివార్యత వల్లనేమో ఆ ‘టెంపో’ను చూపలేకపోయారు. పవన్ కల్యాణ్ భువి మీదకు వచ్చే సన్నివేశం, అక్కడి యాక్షన్ ఘట్టం ఇంటర్వెల్‌కు ముందు సినిమాలో ఊపు తెస్తుంది.

ఎలా ఉందంటే...
ఫస్టాఫ్‌కే కథ, హీరో లక్ష్యం తెలిసిపోతాయి. ఇక, సెకండాఫ్‌లో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పడ్డ కష్టం, దేవుడి సాయం, మానవత్వం వర్సెస్ దైవం పేరుతో సాగే వ్యాపారం లాంటి కీలక ఘట్టాలను చూపాలి. కానీ, సరిగ్గా అక్కడకు వచ్చే సరికే కథనం నీరసపడిపోయింది. కోర్టులో వెంకటేశ్ వాదన, ‘బోనులో భగవంతుడు’ టీవీ చర్చాకార్యక్రమం లాంటివి, ఆ మాటకొస్తే చివరాఖరులో గోపాలరావుకూ - గోపాలదేవుడికీ జరిగే సంభాషణ లాంటివి సుదీర్ఘమైన మోనో యాక్షన్ లాగా సాగుతాయి. దాంతో, ప్రేక్షకుడు సహనానికి పరీక్ష ఫీలవుతాడు.

నిజానికి, మతం పేరిట, మనిషిలో దేవుడి పట్ల ఉన్న భయాన్ని సొమ్ము చేసుకుంటూ సాగుతున్న వ్యాపారమనే పాయింట్‌ను ‘ఓ మై గాడ్’ బాగా చర్చకు పెట్టింది. అదే విషయాన్నే తాజాగా ఆమిర్‌ఖాన్ ‘పీకె’ కూడా మరో కోణంలో సహజంగా, సమర్థంగా చూపెట్టింది. ఆ రెండిటినీ జనం చూసేసిన తరువాత రావడం - ‘గోపాల... గోపాల...’కున్న బలహీనత!

ఈ రకమైన ఇతివృత్తానికి ప్రేక్షకులను మానసికంగా సిద్ధం చేయడానికి మాతృకలు ఉపయోగపడినా, ఇప్పటికే చూసేసిన కథాంశంలా ఆనుకొనే ప్రమాదం ఉంది. పైగా, దైవం మీద ప్రేమ కన్నా భయంతో చేసే శుష్క పూజల కన్నా, సాటి మనిషిని ఆదుకోవడమే అసలు దైవత్వమనే పాయింట్‌ను ఇంకా బలంగా చెప్పాల్సింది. మరోపక్క స్వామీజీలు మతం, దైవం పేరుచెప్పి మోసం చేస్తుంటే, గంగాజలమంటూ ట్యాప్ తిప్పి పట్టిన నీళ్ళిచ్చే హీరో చేస్తున్నది మాత్రం ఏమిటనిపిస్తుంది. వెరసి, పాత్రధారులే తప్ప, పాత్రలు కనిపించని ఈ రీమేక్‌కు పండగ సెలవులు, పవన్ కల్యాణ్ క్రేజు కలిసొస్తాయి కానీ, అది ఎన్ని రోజులన్నది దాదాపు రూ. 50 కోట్ల పైచిలుకు ప్రశ్న.


- రెంటాల జయదేవ
 

(Published in 'Sakshi' internet, 11th Jan 2015, Sunday)
.............................................

0 వ్యాఖ్యలు: