జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, January 25, 2015

అక్కినేనికి ‘నటసామ్రాట్’బిరుదు అలా ఇచ్చాం! - సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు

నేడు (22nd Jan 2015) అక్కినేని ప్రథమ వర్ధంతి

‘నటసామ్రాట్’బిరుదు అలా ఇచ్చాం!


 ఎంతలో తిరిగివచ్చింది ఏడాది! ‘నట సామ్రాట్’ అక్కినేని మనల్ని విడనాడి దివికేగి సంవత్సరమైందా? ఆయన మన మధ్య ఉన్నట్టు, ఇంకా హైదరాబాద్ రవీంద్రభారతిలో సభలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నదే! అందులోనూ ఆయన పార్థివ శరీరాన్ని చూడని నాకు ఆయన తన అభిమానులతో తన అనుభవాల గురించి ముచ్చటిస్తున్నట్టే అనిపిస్తున్నది! అక్కినేని నాగేశ్వరరావు జీవితం బహువిచిత్రమైనది. అదొక అద్భుత గాథ. వ్యక్తిత్వ వికాస విద్యార్థులకు ఆదర్శ పాఠ్యగ్రంథం!
 
 లేకపోతే, ఒక సాధారణ రైతు కుమారుడు అలభ్యమైన అప్పటి మద్రాసులో చిత్రజగత్తుకు వెళ్లడమేమిటి? అక్కడ హీరోలకు హీరో కావడమేమిటి? నాల్గవ తరగతి కూడా సరిగ్గా చదవని ఆ అబ్బాయి అమెరికా ప్రభుత్వం ఆహ్వానంపై అమెరికా వెళ్లడమా? చివరికి ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’లు ఆయన నట జీవితాన్ని అలంకరించడమా? అందువల్లనే, అక్కినేనిది అద్భుత చరిత్ర; ఆయన బాల్య జీవితాన్ని పరిశీలిస్తే, ప్రపంచ ప్రఖ్యాతులైన పెక్కుమంది
 
 మహామహుల బాల్య జీవితంలో కానవచ్చే విశేషాలే కానవస్తాయి! తల్లిదండ్రులకు అక్కినేని కడగొట్టు సంతానం. పుట్టిన వారి వరుసలో ఆయన తొమ్మిదవవాడు! ఆయనకు ముందు పుట్టిన బేసి సంఖ్య పిల్లలు పోవడం వల్ల ఈ తొమ్మిదో వాడేం జీవిస్తాడని అందరూ ఆశ వదులుకున్నారు!
 
 గండాలమారి
 దానికి తగ్గట్టే ఆ పిల్లవాడికి మెడపై కణితి లేవడం ప్రారంభించింది! ఇంకేమున్నది? ఇక లాభం లేదని వైద్యం కూడా మానేశారు. కాని, ఆ గొంతు లక్షలాది ఆంధ్ర ప్రేక్షకుల హృదయాలను భవిష్యత్తులో ఉర్రూత లూగించడం విధి విలాసమైతే, ఆ కణితి ఏమి చేస్తుంది? మందు లేకుండానే అది మానిపోయింది! చిన్నప్పుడు ఆయనకు జలగండం, అగ్ని గండం తప్పాయి. గండాలన్నీ గడిచి అక్కినేని వారి అబ్బాయి గట్టెక్కాడు!
 
 పున్నమ్మ గారికి ఆడపిల్లలు లేరు. ఈ అబ్బాయినే అమ్మాయిగా చూసుకుని సంతోషించాలని అతనికి ఆడపిల్లవలె జడవేసేది, పరికిణీలు తొడిగేది! మరి, వేష భాషలే కదా మనిషిని మార్చివేసేది! అమ్మాయి వేషం వేసే సరికి అబ్బాయి గారికి అమ్మాయిల వలె కులకడం, నడవడం అలవాటయింది. అందువల్ల, నాటకాలలో ఆడ వేషాలు వేయడం నాగేశ్వరరావుకు చిన్నప్పుడే అబ్బింది! తల్లి ఆరోగ్యం సరిగా లేనందున, ఆమెకు వంట, మిగిలిన ఇంటి పని చేసిపెట్టి, బడికి వెళ్లి చదువుకుంటూ, అది అయిన తరువాత మైలు దూరంలో ఉన్న నాటకాల రిహార్సల్ స్థలానికి వెళ్లేవాడు. ఆయన ఆడవేషం, ఆ తళుకు, ఆ బెళుకు, ఆ కులుకు చూసి కొందరు ఆ పాత్రధారి నిజంగా అమ్మాయే అనుకునేవారట! అప్పుడు ఆయన పారితోషికం మూడు రూపాయలు!
 
 ఒకసారి తెనాలిలో నాటకం వేసి, విజయవాడ మీదుగా గుడివాడ వెళదామని విజయవాడ రైలు స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్న నాగేశ్వరరావును ‘ప్రతిభా పిక్చర్స్’ ఘంటసాల బలరామయ్య చూశారు! అప్పుడు తాను తీస్తున్న ‘శ్రీ సీతారామ జననం’లో శ్రీరాముడు వేషానికి ఈ కుర్రవాడు సరిపోయేట్టు ఉన్నాడని భావించి, అక్కినేని అన్నగారితో మాట్లాడి, ఆ తరువాత ఆ ఆడపాత్రధారి చేత తన చిత్రంలో మొదటిసారిగా మగ పాత్రను వేయించారు! అక్కడి నుంచి అక్కినేని వెనుదిరిగి చూడలేదు. ఇది 1944 నాటి మాట. అప్పటికి నాగేశ్వరరావు వయస్సు 19 సంవత్సరాలు. ఇక అప్పటి జానపద చిత్రాల యుగంలో ఈ నవ యువకుడే అమ్మాయిల కలల రాకుమారుడు! అలా ఆనాటి జానపద చిత్రాలలో నాగేశ్వరరావు ‘హీరో నాగేశ్వరరావు’ అయ్యాడు!

 
 అక్కినేని ‘దేవదాసు’కు అర్హుడా?
 1952లో వినోదా పిక్చర్స్ వారు బెంగాలీ నవల ‘దేవదాసు’ను తెలుగులో చిత్రించదలచి అక్కినేనిని కథానాయకుడుగా నిర్ణయించి, ప్రకటించేసరికి చాలామందికి ఆశ్చర్యం కలిగింది! జానపద చిత్రాల రాకుమారుడు ఆ తాగుబోతు పాత్రకు ఏమి పనికి వస్తాడన్న విమర్శలు బయలుదేరాయి! అప్పటిలో - 1952లో - నేను ‘ప్రతిభ’ అనే తెలుగు వారపత్రికకు ఎడిటర్‌గా పని చేస్తున్నాను. ‘‘అక్కినేని దేవదాసు పాత్రకు అర్హుడా?’’ అన్న శీర్షికతో నేను నా పత్రికలో ఒక వ్యాసం రాశా. అది నాగేశ్వరరావు దృష్టికి వెళ్లింది! 1953లో ఆ చిత్రం విడుదలై, యావదాంధ్ర దేశంలో నాగేశ్వరరావు ‘దేవదాసు’ పాత్రను గురించి జనం వింతగా చర్చించుకుంటున్నారు. విజయవాడలో నాగేశ్వరరావుకు అప్పుడే సన్మానం జరిగింది. ఆ సన్మానానికి నేను కూడా వెళ్లాను. సభానంతరం అక్కినేని నా వద్దకు వచ్చి, ‘‘ఏమండీ! ‘దేవదాసు’ పాత్రకు నేను అర్హుడినా? అనర్హుడినా?’’ అని చిరునవ్వుతో అడిగేసరికి నేను కొంచెం బిడియంతో ‘‘హ్యాట్సాఫ్ టు యు’’ అని అభినందించేసరికి ఆయన ముఖంలో ఆనందం వెల్లివిరిసింది!
 
 అక్కినేనికి ముఖస్తుతి పనికిరాదు. సద్విమర్శనే ఆయన ఆహ్వానించేవారు. ‘దేవదాసు’కు తాను పనికిరానన్న విమర్శను పెద్ద సవాల్‌గా తీసుకుని, ఆ పాత్రలో మెప్పు పొందడానికి తాను అహోరాత్రులు తపనపడ్డానని ఆయన నాతో అన్నారు. ఆ తరువాత దాదాపు పది సంవత్సరాల అనంతరం నేను లక్నోలో ‘హిందీ సినీ లెజెండ్’ దిలీప్‌కుమార్‌ను కలుసుకున్నప్పుడు ఆయన ‘దేవదాసు’ పాత్రను అభినందించారు. ఆయనకు ‘ట్రాజెడీ కింగ్’ అని బిరుదు. ‘నా కంటే మీ నాగేశ్వరరావే బాగా నటించారు’’అని దిలీప్ అన్నారు.
 
 అలాగే ‘కన్నడ కంఠీరవ’ రాజ్‌కుమార్ కూడా అదే మాట అన్నారు. మొత్తం మీద ‘దేవదాసు’ పాత్రను సైడల్, బారువా, దిలీప్, షారుక్‌ఖాన్ మొదలైన మహానటులు ఎందరు పోషించినా, అక్కినేని ‘దేవదాసు’కు ఆయనే సాటి!ఆ తరువాత ఆయన నట జీవితంలో 60వ చిత్రం ‘దొంగల్లో దొర’ 1957 జూలై 19న విడుదలైంది. అది అక్కినేని నట జీవిత వజ్రోత్సవం. ఆ సందర్భంగా ఆయనను సినీ జీవితంలోకి పంపిన విజయవాడలో ఆయనకు భారీ ఎత్తున సన్మానాన్ని తలపెట్టాము. ఎలా సన్మానించాలన్న సమస్య వచ్చినప్పుడు అక్కినేనికి దీటైన సాంఘిక చిత్రాల హీరో లేడని, ఆయనకు ‘నటసామ్రాట్’ అన్ని బిరుదు అన్ని విధాల తగినదని నేను సూచించినప్పుడు ఆహ్వాన సంఘం వారు అంగీకరించారు.
 
 అక్కినేని ఎత్తిపొడుపు!
 1957లో ఆగస్టులో విజయవాడలో జరిగిన అక్కినేని సన్మాన సభలో ‘నటసామ్రాట్’ బిరుదు ఇస్తూ, సన్మాన పత్రం రాసిన నేనే దాన్ని చదివి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బెజవాడ గోపాలరెడ్డితో కలిసి, అక్కినేనికి సమర్పించగా, ఆయన ‘‘ ‘నేను నటసామ్రాట్’ బిరుదుకు తగినవాడినంటారా?’’ అంటూ నా వంకకు తిరిగి నవ్వుతూ అన్నారు. నవ్వడం నా వంతు, ఏమిటో తెలియక ఆశ్చర్యపోవడం గోపాలరెడ్డిగారి వంతు అయింది! ఆ తరువాత ఆయనకు ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’ - ఎన్ని అవార్డులు వచ్చినా, ‘నట సామ్రాట్’కు చాలిన బిరుదు లేదని ఆయన చాలా సందర్భాల్లో అంటూ వచ్చారు.
 
 చివరికి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అక్కినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పుడు ఆయనను అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి కూడా ‘నటసామ్రాట్ నాగేశ్వరరావుజీ’ అని సంబోధించారు!ఔను! నటసామ్రాట్ అంటే నాగేశ్వరరావు! నాగేశ్వరరావు అంటే నటసామ్రాట్! అందువల్లనే, తనకు ఆ బిరుదు వచ్చి, 50 ఏళ్లు అయిన సందర్భంగా 2007లో అక్కినేని నన్ను హైదరాబాద్ ఆహ్వానించి, నాకు స్వర్ణకంకణం తొడిగారు! ‘నటసామ్రాట్’ అంటే అక్కినేనికి అంత ప్రియతమ బిరుదు!


తుర్లపాటి కుటుంబరావు

(సీనియర్ జర్నలిస్ట్)         

(Published in 'sakshi' daily, 22nd Jan 2015, Thursday)
...................................

0 వ్యాఖ్యలు: