తారాగణం - విక్రమ్, అమీ జాక్సన్, సంతానం, సురేష్ గోపి, రామ్‌కుమార్, మాటలు - శ్రీరామకృష్ణ, పాటలు - సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, సంగీతం - ఏ.ఆర్. రెహమాన్, ఛాయాగ్రహణం - పి.సి. శ్రీరామ్, ఎడిటింగ్ - ఆంథోనీ, కళ - ముతురాజ్, నిర్మాత - ‘ఆస్కార్’ వి. రవిచంద్రన్, దర్శకత్వం - శంకర్ ............................................... ఒక మామూలు కథాంశం, ఇతివృత్తం కూడా దాన్ని మనం ఊహించుకొనే తీరు వల్ల అత్యద్భుతంగా మనోనేత్రం ముందు సాక్షాత్కరించవచ్చు. సృజనశీలురైన దర్శకులకు సర్వసాధారణంగా ఉండే లక్షణం ఇదే! ముఖ్యంగా, తమిళనాడులో మొదలుపెట్టి, ఇవాళ దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన దర్శకుడు శంకర్‌లో తరచూ కనిపించే లక్షణం అది. డొనేషన్లు, అవినీతి లాంటి మామూలు కథల్ని కూడా విజువలైజేషన్ ప్రతిభతో, తన టేకింగ్ సామర్థ్యంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. అది ఆయన బలం. ఏ మాత్రం తేడా వచ్చినా, అదే బలహీనత అవుతుంది.
ఇప్పటి వరకు ఒక్క ‘స్నేహితులు’ (తమిళ హీరో విజయ్ నటించిన చిత్రం) మినహా ప్రతిసారీ ఆ ఊహాశక్తితో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన శంకర్ తాజా కానుక - ‘ఐ’ (...మనోహరుడు). సుదీర్ఘ కాలం నిర్మాణంలో ఉండి, అనేక అవాంతరాలను దాటుకొని, ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా ‘భోగి’ నాడు విడుదలైంది ఈ సినిమా. మరి, పెరిగిన అంచనాలను తన సెల్యులాయిడ్ కల్పనా సామర్థ్యంతో శంకర్ అందుకున్నారా?
కథ ఏమిటంటే... లింగేశ (విక్రమ్) మంచి బాడీ బిల్డర్. వ్యాయామశాలలో కష్టపడి కసరత్తులు చేసి, ప్రత్యర్థులను కూడా ఎదుర్కొని, మిస్టర్ ఆంధ్రాగా ఎంపికవుతాడు. అలా అనుకోకుండానే ప్రత్యర్థులకు శత్రువు అవుతాడు. ఇంతలో అతను చిరకాలంగా వాణిజ్య ప్రకటనల్లో చూసి ఆరాధిస్తున్న మోడల్ దియా (ఎమీ జాక్సన్) పరిచయమవుతుంది.
తోటి మోడల్ జాన్ నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొని, అతని వల్ల యాడ్స్ నుంచి తొలగింపునకు గురవుతుంది. ఆ క్రమంలో కొత్త మోడల్‌గా బాడీ బిల్డర్ లింగేశను ఎంచుకొని, అతణ్ణి ‘లీ’గా తీర్చిదిద్దుతుంది. ఆ క్రమంలో వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. లీ ఎదుగుదలను చూసి ప్రత్యర్థి బాడీ బిల్డర్ రవి, జాన్, స్టైలిస్ట్ ఓజ్మా తదితరులు ఓర్వలేకపోతారు. ఆ పరిస్థితుల్లో వారేం చేశారు? అప్పుడు లీ ఏమయ్యాడు? లీ, దియాల ప్రేమ కథ ఏమైంది? మొదలైనవన్నీ మిగతా సినిమా.
ఎలా నటించారంటే... ‘ఐ’ చిత్రంలో ఉన్న కీలక పాత్రలు, పాత్రధారులు కొద్దే. కానీ, అందరిలోకీ అత్యధికంగా శ్రమించిందీ, ఎక్కువ మార్కులు కొట్టేసేదీ మాత్రం నిస్సందేహంగా విక్రమ్. కండలు తిరిగిన బాడీ బిల్డర్‌గా, ఆ వెంటనే అందమైన నాజూకు మోడల్‌గా, అటు వెంటనే కండలు కరిగిపోయి - ఒళ్ళంతా వికృతంగా తయారైన గూనివాడిగా విభిన్న ఛాయలున్న పాత్రను ఆయన పోషించారు.
నిజం చెప్పాలంటే, ఈ వేర్వేరు షేడ్స్‌లోనూ ఆయన అచ్చంగా అతికినట్లు సరిపోవడమే కాక, ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఒకే చిత్రంలో ఒకదానికొకటి సంబంధం లేని ఇన్ని ఛాయల్ని పోషించడానికి శారీరకంగా, మానసికంగా మూడేళ్ళ పాటు విక్రమ్ పడిన కష్టం, ఆ పాత్రల స్వరూప స్వభావాలకు తగ్గట్లు చూపిన హావభావాలు కచ్చితంగా అవార్డు దక్కించుకోదగ్గవి అనిపిస్తుంది.
మోడల్‌గా ఎమీ జాక్సన్ అందంగా ఉన్నారు. కొంతసేపు బలమైన ఎమోషన్స్ పండించే అవకాశం దక్కించుకున్నారు. హీరో ఫ్రెండ్‌గా సంతానం (తెలుగులో డబ్బింగ్ వాయిస్ ఇచ్చింది కమెడియన్ శ్రీనివాసరెడ్డి) తన పంచ్ డైలాగులతో కాసేపు నవ్విస్తారు. డాక్టర్ వాసుదేవరావుగా సురేష్ గోపి, ఇతరులది పాత్రోచిత నటనకే పరిమితం.
సాంకేతిక నిపుణుల పనితీరేమిటంటే... సినిమా 24 క్రాఫ్ట్స్ సమష్టి కృషి అయినప్పటికీ, చాలా కొద్ది సినిమాల్లోనే సాంకేతిక నిపుణులందరి పనితనం, సమష్టి కృషి తెరపై కనిపిస్తుంటుంది. ‘ఐ’ సినిమా కచ్చితంగా 24 క్రాఫ్ట్స్ సమష్టి కృషికి నిదర్శనమే. పి.సి. శ్రీరామ్ కెమేరా వర్క్, లైటింగ్ చేసిన తీరు చైనాలోని వివిధ లొకేషన్స్‌లో, పాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏ.ఆర్. రెహమాన్ బాణీల్లో వేదనను ధ్వనించే ‘నువ్వుంటే నా జతగా...’ (రచన - రామజోగయ్యశాస్త్రి, గానం - సిద్ శ్రీరామ్, ఇషత్ ్రఖాద్రే), శ్రావ్యంగా వినిపించే ‘పూలనే కునుకేయమంటా...’(రచన- అనంత శ్రీరామ్, గానం - హరిచరణ్, శ్రేయా ఘోషల్) ఆకట్టుకుంటాయి.
అలాగే, ద్వితీయార్ధంలో కొన్నిచోట్ల రెహమాన్ నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని గాఢతను పెంచింది. ముతురాజ్ కళా దర్శకత్వ ప్రతిభ దాదాపు ఎకరంపైగా స్థలంలో వేసిన ‘నువ్వుంటే నా జతగా...’ పాటలోని విశాలమైన సెట్‌లో, అలాగే గూనివాడి డెన్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీరామకృష్ణ డబ్బింగ్ డైలాగ్‌ల్లోనూ పంచ్‌లు బాగానే పడ్డాయి.
సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి - యాక్షన్ సీన్లు, విజువల్ ఎఫెక్ట్‌లు, మేకప్. ప్రథమార్ధంలో వచ్చే బాలీ బిల్డర్ల ఫైట్, చైనాలో జరిగే సైకిల్ ఫైట్, ద్వితీయార్ధంలో చేతులు కట్టేసిన స్థితిలో హీరో చేసే ఫైట్, క్లైమాక్స్‌కు ముందొచ్చే ట్రైన్ ఫైట్ - ఈ నాలుగూ మాస్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. సినిమా మొదట్లో వచ్చే ‘పరేషానయ్యా...’ (రచన - సుద్దాల, గానం - విజయ్ ప్రకాశ్, నీతీ మోహన్)లో చేతిలోని మొబైల్ ఫోన్, నీటిలో నుంచి చేప హీరోయిన్‌గా మారడం లాంటి విజువల్ ఎఫెక్ట్‌లు (జాతీయ అవార్డు గ్రహీత శ్రీనివాస్ ఎమ్. మోహన్) బాగున్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన ‘వీటా’ వారు గూనివాడి వేషానికి వేసిన మేకప్ సహజంగా అనిపిస్తుంది. ఈ వంద కోట్ల పైచిలుకు సినిమాలో చిత్ర నిర్మాణ విలువలూ పుష్కలంగా ఉన్నాయి.
ఎలా ఉందంటే... ఒక దిగువ మధ్యతరగతి అబ్బాయి, అందమైన హై సొసైటీ అమ్మాయిల మధ్య సాగే ప్రేమకథ ఇది. అందులోనే పైకి వస్తున్నవాళ్ళ మీద పక్కనున్న ప్రత్యర్థులకు ఉండే ఈర్ష్య, అసూయ, ద్వేషం,ఆ పైన ప్రతీకారం లాంటి అంశాలన్నీ కలగలిపారు. ప్రేమ అనేది బాహ్య సౌందర్యానికి సంబంధించినదా? లేక హృదయ సౌందర్యానికి సంబంధించినదా? అనే మౌలికమైన ఆలోచనను చాలా తెలివిగా వీటన్నిటి మధ్య జొప్పించారు. ఆ సందర్భంలో ఎదురయ్యే వేదనను చూసినప్పుడు ఆ రూపం మీద జుగుప్స కన్నా ప్రేక్షకులకు కూడా కరుణ, జాలి కలుగుతుంది. అయితే, కురూపి, అందగత్తెల ప్రేమ లాంటివి కె.వి. రెడ్డి తీసిన వాహినీ వారి ‘గుణసుందరి కథ’ రోజుల నుంచి బాలకృష్ణ ‘భైరవద్వీపం’ దాకా చాలా జానపదాల్లోనే చూశాం. దాన్ని సోషలైజ్ చేసి, ఆధునిక హంగులు కలిపితే - ‘ఐ’.
సినిమా మొదలుపెట్టడమే ఒక కురూపి, అందమైన హీరోయిన్‌ను ఎత్తుకుపోవడంతో! అలా ఆసక్తికరంగా మొదలైన కథ వర్తమానానికీ, గతానికీ మధ్య తిరిగే స్క్రీన్‌ప్లే విధానంతో ముందుకు నడుస్తుంది. మొదట కాస్తంత ఇబ్బందిగా అనిపించినా, గడుస్తున్న కొద్దీ ఈ రకమైన కథాకథనానికి ప్రేక్షకుడు అలవాటు పడతాడు. ప్రథమార్ధమంతా కాస్తంత నిదానంగా నడుస్తూ, ఫ్లాష్‌బ్యాక్‌లోని ఒక దశను చెప్పడానికే సరిపోతుంది. ద్వితీయార్ధంలో అసలు కురూపి అయిన గూనివాడి రూపం వెనుక ఉన్న అసలు ఫ్లాష్‌బ్యాక్. ఆ తరువాత విలన్లపై ప్రతీకారం విషయానికి వచ్చేసరికి మళ్ళీ చిత్రం ఊపందుకుంటుంది. వెరసి సినిమా కొన్ని ఘట్టాల్లో విజువల్‌గా వండర్ అనిపిస్తుంది.
అయితే, ఈ చిత్ర కథలోనూ లాజిక్కులు వెతికితే చాలా లోపాలే కనిపిస్తాయి. ఒక మామూలు మోడల్‌ను నాశనం చేయడానికి అంత పెద్ద కంపెనీ యజమాని అలా రంగంలోకి దిగుతాడా? హీరోయిన్‌తో జాన్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నా కోపగించుకోని డాక్టర్ ఆ తరువాత హీరోపై మాత్రం ఎందుకు పగబడతాడు? లాంటి ప్రశ్నలకు జవాబులు వెతికినా దొరకవు. గతంలో ఎప్పుడూ ఒక సందేశంతో ప్రేమ కథను మిళితం చేస్తూ, మరింత అద్భుతాలు చూపిన శంకర్ ఇలాంటి కథను తీశారేమిటని పెదవి విరిచేవారూ ఉంటారు. 3 గంటల ఆరు నిమిషాల ఏడు సెకన్ల నిడివి ఉండడం కూడా సినిమాకు ఒక రకంగా మైనస్సే.
మొత్తం మీద దీర్ఘకాలం నిర్మాణంలో ఉండిపోవడం వల్ల పెరిగిపోయిన నిర్మాణవ్యయం, అంతకు మించి పెరిగిన అంచనాలను అందుకోవాలంటే ‘ఐ’లోని విజువల్ వండర్ అంశాలు, సాంకేతిక నైపుణ్యం సరిపోతాయా? లేక సినిమాలో పదే పదే వినిపించే డైలాగ్ లాగా.... ప్రేక్షకులు కూడా.... ‘‘అంతకు మించి...’’ ఆశించామంటారా? అదే ఇప్పుడు వేచి చూడాల్సి ఉంది. - రెంటాల జయదేవ (Published in 'Sakshi' website, 14th Jan 2015, Wednesday) .....................
0 వ్యాఖ్యలు:
Post a Comment