ఆరాధన (1962): సక్సెస్‌ఫుల్ ఎక్స్‌పెర్‌మెంట్
చాలా రిస్కీ కథాంశమిది. సినిమా సగంలో కథానాయకుడు గుడ్డివాడవుతాడు. ఏయన్నార్‌లాంటి రొమాంటిక్ హీరోతో ఇలాంటి సినిమా చేయడమంటే సముద్రంలో ఈత కొట్టడంలాంటిదే. దర్శక, నిర్మాత బీఎన్ రెడ్డి సగం షూటింగ్ అయ్యాక రష్ చూసి ‘మీ ప్రయత్నం వృథా’ అని హెచ్చరించినా, వీబీ రాజేంద్రప్రసాద్ వెన్ను చూపలేదు. కథే శ్రీరామరక్ష అనుకున్నారు. ఆయన మొండితనం, సాహసం ఫలించింది. ‘ఆరాధన’ సినీ చరిత్రలో నిలిచిపోయింది. ‘నా హృదయంలో నిదురించే చెలి’, ‘ఆడదాని ఓరచూపులో’, ‘వెన్నెలలోని వికాసమే’ లాంటి గొప్ప గొప్ప పాటలు ఇందులోవే.
ఆత్మబలం (1964): వండర్‌ఫుల్ థ్రిల్లర్
ఒక్క పాటతో హిస్టరీలో నిలిచిపోవడం, హిస్టరీగా మారడం అంటే ఇదేనేమో! ఈ సినిమా పేరు చెప్పగానే ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ పాట గుర్తుకు రాకపోతే ఒట్టు. ఈ సినిమా లేకపోతే జగపతి సంస్థ లేదు. ‘ఆరాధన’ తర్వాత ప్రధాన భాగస్వామి చనిపోవడం, ఇతర భాగస్వాములు దూరమవడంతో ఒంటరైపోయారు వీబీ రాజేంద్రప్రసాద్. అయితే ఊరు తిరిగి వెళ్లిపోవాలి. లేకపోతే ఒంటరిగా సినీ సముద్రాన్ని ఈదాలి. వీబీ రాజేంద్రప్రసాద్ మొండివాడు. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలనుకున్నారు. అలా ‘ఆత్మబలం’ మొదలు పెట్టారు. హిట్టుకొట్టారు. ఇందులో ఏడు పాటలూ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి.
అదృష్టవంతులు (1969): అడ్వాన్స్‌డ్ యాక్షన్
ఏయన్నార్‌తో చేసిన యాక్షన్ సినిమా ఇది. మేకింగ్ చాలా అడ్వాన్డ్స్ థాట్స్‌తో ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్రెయిన్ ఫైట్ అయితే ఎక్స్‌లెంట్. గ్లామర్ హీరోయిన్ జయలలితతో మేల్ కేరెక్టర్ చేయించాలనుకోవడం తమాషా ఆలోచన. ఇందులో జగ్గయ్య విలన్‌గా చేశారు. ఆయన డెన్‌ని సీసీ టీవీలతో మోడ్రన్‌గా డిజైన్ చేయించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నాగార్జునకు ఈ సినిమాలో యాక్షన్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా విలన్ డెన్ సెటప్ ఆయనకు తెగ నచ్చేసింది.
దసరా బుల్లోడు (1971): బాక్సాఫీస్‌కి న్యూ బ్లడ్
ఈ సినిమాతో అనుకోకుండా దర్శకుడయ్యారు వీబీ రాజేంద్రప్రసాద్. ‘జగపతి’ సంస్థ ఆస్థాన దర్శకుడైన వి. మధుసూధనరావు బిజీగా ఉండటంతో తానే మెగాఫోన్ పట్టాల్సి వచ్చింది. తొలి షెడ్యూలు కృష్ణా జిల్లాలో తీస్తే, రష్ మొత్త పోయింది. మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా అంతా దాదాపుగా అవుడ్డోర్‌లోనే తీశారు. సినిమా సూపర్‌హిట్టయ్యింది.అక్కినేని స్టెప్పుల హవా మొదలైంది ఈ సినిమాతోనే. ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా’, ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్’ తదితర పాటల కోసం కుర్రకారు వేలంవెర్రిగా ఎగబడ్డారు. అక్కినేని-వాణిశ్రీ కాంబినేషన్, పాటలు, స్టెప్పులు, మాటలు, మాస్ ఎలిమెంట్స్, మేకింగ్ వేల్యూస్‌తో బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిసింది. ఈ సినిమా విజయంతో వీబీ రాజేంద్రప్రసాద్ విజృంభించి దర్శకునిగా 17 సినిమాలు తీశారు. ‘దసరాబుల్లోడు’ని హిందీలో జితేంద్ర, రేఖ, షబనా ఆజ్మీతో ‘రాస్తే ప్యార్’గా రీమేక్ చేసి విజయం సాధించారు.
బంగారు బాబు (1973): గెస్ట్ మల్టీ స్టారర్
ఓ సినిమా హీరోయిన్ పారిపోయి రహస్యంగా ఓ స్టేషన్ మాస్టర్ దగ్గర ఆశ్రయం పొందుతుంది. జీవితంలో కొంగొత్త రుచులేంటో చూస్తుంది. ఇదీ ‘బంగారు బాబు’ సినిమా కథ. అప్పట్లో ప్రేక్షకులకు చాలా కిక్కిచ్చిన కథ ఇది. ‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది’ అంటూ ఏయన్నార్, వాణిశ్రీ పాడిన డ్యూయెట్ ఇప్పటికీ రెపరెపలాడుతూనే ఉంటుంది. ప్రముఖ నటులు శివాజీ గణేశన్, రాజేష్‌ఖన్నా, కృష్ణ, శోభన్‌బాబులు గెస్ట్‌లుగా కనిపించడం అప్పట్లో నిజంగా గ్రేట్.
(Published in 'Sakshi' daily, 13th Jan 2015, Tuesday)
.............................................
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
5 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment