జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, December 31, 2010

'రగడ' - బాగుందన్నవాడితో పెట్టుకోవాలి గొడవ!



ముగిసిపోతున్న ఈ 2010లో ఇప్పటి దాకా తెలుగు సినిమా ఒకటీ అరా సందర్భాల్లో తప్ప, మిగిలిన అన్నిసార్లూ అన్యాయంగా ప్రేక్షకుల్ని వీరబాదుడు బాదింది. ఆ సంగతి తెలిసీ నేను బుక్ అయి వచ్చిన తాజా సినిమా - ‘రగడ’. సినిమా ఫరవాలేదట అని కొందరూ, బాగానే ఆడుతోంది - ఆడుతుందని మరికొందరూ పొద్దుటి నుంచీ ఆఫీసులో ఒకటే రగడ. సరే, ‘యథా ప్రకారం సిద్ధిరస్తు’ అని అనుకుంటూనే, వెళ్ళాం.

కథా సంగ్రహం

రాయలసీమలో కడపకు చెందిన సత్యారెడ్డి అనే ఓ యువకుడి కథగా ఈ సినిమా నడుస్తుంది. హైదరాబాద్ నగరానికి వచ్చిన ఈ ‘‘కడపోడు’’ డబ్బు కోసం ఏం చేయడానికైనా రెడీ అంటూ ఉంటాడు. పెద్ద పెద్ద రిస్కీ ఫైట్లు కూడా చేసేస్తుంటాడు. నగరంలోని పెద్దన్న (ప్రదీప్ రావత్) గ్యాంగులోని ఛోటా నేతల్లో ఒకడికీ, నగరంలోని మరో గ్యాంగు నేత జి.కె. (‘మగధీర’లో రాజమౌళి చూపించిన కొత్త విలన్ దేవ్ గిల్)కూ మధ్య గొడవ. జి.కె.కు దగ్గరైన హీరో అతనికి ప్రత్యర్థులైన పెద్దన్న గ్యాంగుల్లోని ఛోటా నేతలను ఒక్కొక్కణ్ణీ చంపి, అడ్డు తొలగిస్తుంటాడు. ఆ క్రమంలోనే అతను శిరీష (అనూష్క)తోనూ, అష్టలక్ష్మి (ప్రియమణి)తోనూ దగ్గరవుతాడు. అతను సీమ నుంచి ఆ ఊరెందుకు వచ్చాడు, వాళ్ళను ఎందుకు చంపుతున్నాడు లాంటి అంశాలకు సమాధానంగా ఓ ఫ్లాష్ బ్యాక్. ఆ తరువాత సినిమాలో మాత్రమే సాధ్యమయ్యే బోలెడన్ని ట్విస్టులు. ఆఖరికి ది ఎండ్.

కంటి చూపుతో కాదు, కత్తులతోనే చంపేసే హీరో

కుటుంబ, హాస్య కథా చిత్రాల హీరోగా సంతోషం చిత్రం రోజుల నుంచీ రూటు మార్చిన నాగ్ ను మళ్ళీ చాలా వెనక్కి తీసుకెళ్ళిందీ సినిమా. బహుశా ‘విక్రమ్’ (1986) నుంచి ఇప్పటి వరకు - గడచిన 25 ఏళ్ళ కెరీర్ లో నాగార్జున ఇంతగా తెరపై హింస, రక్తపాతాలు చూపించలేదేమో. నాకైతే మునుపెన్నడూ చూసిన గుర్తు లేదు. రాయలసీమ నేపథ్యం, కత్తి పట్టుకొని వందల మందిని కసక్కున పొడిచేసే కథానాయకుడి కదన కుతూహలం, ఒకరికి ముగ్గురు నాయికలు లాంటి కమర్షియల్ అంశాలు నాగ్ మీద అతిగా ప్రయోగించడం ఇదే తొలిసారి. ఒక్క హిట్ కోసం ఇంత హింస అవసరమా!?

వయసు మీద పడుతున్నా గ్లామర్ తగ్గకుండా కనిపించే నాగార్జున ఎందుకో, ఈ చిత్రంలో అంత ఆహ్లాదంగా కనిపించరు. కొన్ని దృశ్యాల్లో వయసు తెలిసిపోయింది. అనూష్క, ప్రియమణి - నటించడానికి ఏమీ లేకపోవడంతో, పాటల్లో తక్కువ దుస్తులతో ఆకట్టుకోవడానికి శ్రమపడ్డారు. బ్రహ్మన్న, బ్రహ్మీ డార్లింగ్ గా బ్రహ్మానందం కొన్ని ఘట్టాల్లో నవ్వించారు. ధర్మవరపు, బాల నటుడు భరత్ ల బ్యాచ్ కామెడీ కాసేపయ్యాక నవ్వు కాదు, నస అనిపిస్తుంది.

మాటలెక్కువ, చేసింది తక్కువ

కథ, మాటల రచయితగా మొదలై, ఆనక దర్శకుడైన వీరూ పోట్ల ఈ చిత్రానికి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. కలిసొస్తే చెరుకుగడ, ఎదురొస్తే రగడ ..... లాంటి పంచ్ (!?) డైలాగులను మార్చి, మార్చి సినిమాలో వాడారు. వాటిని పాటక జనం ప్రశంసిస్తారని దర్శక, నిర్మాతలు, హీరో అభిప్రాయం. కథే అస్తుబిస్తుగా ఉన్న ఈ చిత్రంలో ఇక, స్క్రీన్ ప్లే, మాటల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. దర్శకత్వ ప్రతిభ కూడా చాలా యావరేజ్.

సినిమాకు సంగీతం (థమన్ ఎస్.) పెద్ద ఎసెట్ కావాల్సింది. కానీ, ఈ చిత్రంలోని పాటలేవీ ఆ ఫక్కీలో నడవలేదు. కనీసం ఒక్క పాటైనా బావుంటుందనుకుంటే, అదీ నిరాశే. అసలే ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం మోకాలుకు చేయించుకున్న సర్జరీతో డ్యాన్సులు, ఫైట్లు నాగ్ కు కష్టంగా మారాయి. దానికి తోడు ఇప్పుడు మీద పడుతున్న వయస్సు. దాంతో, చిన్న చిన్న మూవ్ మెంట్లు హీరో చేస్తుంటే, హీరోయిన్లు, డ్యాన్సర్లు మాత్రం తెగ నర్తించేస్తుంటారు. స్టెప్పులు వేస్తుంటారు. ఈ వరుస చూస్తే, ఎన్టీయార్ 1980ల నాటి సినిమాల్లో చేసిన డ్యాన్సులు గుర్తొస్తే, తప్పు ప్రేక్షకులది కాదు. ఫైట్లూ అంతే - ఒక దెబ్బకు పదుల సంఖ్యలో జనం పడిపోవడమే. కాస్తయినా రియలిస్టిక్ గా అనిపించవు.

కథనంలోనూ లోటుపాట్లు

అమ్మలా తనను పెంచిన డాక్టరమ్మ నిర్మలమ్మను చంపారని తెలిసిన హీరో ఆమెను చంపినవారిని హతమార్చి, పగ తీర్చుకోవడానికి నగరానికి వచ్చాడు. సెకండాఫ్ లో వచ్చే రెండో ఫ్లాష్ బ్యాక్ లో ఆ సంగతే చూపారు. అలాగే, ఒక్కొక్కరినీ చంపుతూ వస్తుంటాడు. సో, ఇక అక్కడ మహేందర్ రెడ్డి (సత్యప్రకాశ్)కి మూడునెలల్లో రూ. 87 కోట్లిచ్చి, అమ్మతో ఆ ఆసుపత్రిని ఖాళీ చేయించకుండా ఉంచాలన్న బంధం ఏమీ హీరోకు లేదు. కానీ, బండి దగ్గర కోట శ్రీనివాసరావు ఎదురై, తమతో చేతులు కలిపేయమంటూ హీరోను బెదిరించే సన్నివేశంలోనే ముందుగా హైదరాబాద్ - కడప బస్సులో వేరెవరి ద్వారానో సంచీ నిండా హీరో డబ్బులు పంపుతున్న షాట్ ఎందుకు చూపినట్లన్నది అర్థం కాని ప్రశ్న.

అలాగే, మహేందర్ రెడ్డి (సత్యప్రకాశ్), అతని అన్న పెద్దన్నల పనుపునే ఛోటా నేతలు వచ్చి హీరో తల్లిని చంపుతారు. ఆ హంతకుల్ని చంపుతానని తల్లి సమాధి సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన హీరో, చివరకు వచ్చేసరికి - పెద్దన్నను చంపడమే తప్ప, మహేందర్ రెడ్డిని ఎందుకు వదిలేసినట్లు. ఈ సినిమాలో ఇలాంటి లోపాలు ఇంకా అనేకం.

కొసమెరుపు -

ఈ సినిమాలో కథ కోసం బలవంతాన తెచ్చిపెట్టిన మలుపులు చూస్తే పిచ్చెక్కిపోతుంది. పైపెచ్చు, అసలు ఈ ట్విస్టులు నచ్చే సినిమా చేశానన్న హీరో గారి మాటలు చదివాక, నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. ఏమైనా, ఈ 14 రీళ్ళ సినిమాను ఓపిగ్గా మొదటి నుంచి చివరి దాకా చూసి బయటకు వచ్చాక నాకు అనిపించింది కాస్త ప్రాసలో చెప్పాలంటేఒకటే- 'రగడ' ..... ఈ సినిమా చాలా బాగుందని చెప్పినవాడితో వేసుకోవాలి గొడవ!

చివరిగా, చిన్నమాట.

2010కి వీడ్కోలు చెబుతూ, 2011కు శుభస్వాగతం పలుకుతూ, మన బ్లాగు మిత్రులకూ, పాఠకులకూ, హితులకూ, స్నేహితులకూ

విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యపీ, జాయ్ ఫుల్ అండ్ ఫ్రూట్ ఫుల్ న్యూ ఇయర్.

1 వ్యాఖ్యలు:

వేణూశ్రీకాంత్ said...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు జయదేవ్ గారు :)