జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, December 19, 2010

బాగానే ఉందనిపించే ‘ఆరెంజ్’ జనానికి ఎందుకు నచ్చలేదు?

(‘ఆరెంజ్’ అంతలా ఫ్లాపయ్యిందేం? - పార్ట్ 2)

ఫస్టాఫ్ మొదలు అప్పటి దాకా ‘ఆరెంజ్’ కథానాయక పాత్ర ప్రతిపాదించిన అంశాలతో సహానుభూతి చెందుతున్న ప్రేక్షకులను నాగబాబు పాత్ర హితోపదేశ ఘట్టం నుంచి దర్శకుడే స్వయంగా దూరం చేసుకున్నారనిపిస్తుంది. ప్రేమ విషయంలో హీరో భావాలకూ, అభిప్రాయాలకూ కారణం - అతని గత జీవితంలో ఎదురైన సంఘటనలు, అనుభవాలేనని సినిమాలో చూపిన ఫ్లాష్ బ్యాక్ తో అర్థమవుతుంది. ఆ అభిప్రాయాలు, ఆ సంఘటనలతో యువతరం ప్రేమికుల నుంచి పెళ్ళయిన పెద్దల దాకా అందరూ ఎంతో కొంత కనెక్ట్ అవుతారు. కానీ, ఆ తరువాత కేవలం నాగబాబు చెప్పిన నాలుగు మాటలతో హీరో ఒక్కసారిగా తన పంథానే మార్చేసుకోవడం ఏ మాత్రం నమ్మబుద్ధిగా, ప్రేక్షకులకు సంతృప్తిగా అనిపించదు. అప్పటిదాకా తెరపై దృశ్యాలతో సంలీనమై ఉన్నవాళ్ళను ఒక్కసారిగా వెనక్కి రప్పించే సన్నివేశాలు ఆ తరువాత ఒకదాని వెంట మరొకటిగా వచ్చేస్తాయి.

హీరో అప్పటి దాకా తాను ప్రవచించిన సిద్ధాంతాలను వదిలేసుకోవడానికి సిద్ధమై, హీరోయిన్ ప్రేమ కోసం ఆమె వెంటబడుతున్నట్లుగా అక్కడ నుంచి కథ దిశ మార్చుకుంది. వ్యక్తిగత ఇష్టానిష్టాలను మరచి, తెర మీద కథానాయకుడు చెప్పిన సిద్ధాంతాలను తలకెక్కించుకున్న వారికి సైతం ఈ అనూహ్యమైన అకస్మాత్తు మార్పు ఏ మాత్రం మింగుడు పడే విషయం కాదు.

హీరో అంటే సామాన్య తెలుగు ప్రేక్షకులకు విజేత అనే అర్థం. హీరో పాత్ర అనుకున్నది, చేసేదే కరెక్ట్. ఎప్పటికైనా అతని వాదనే నిలవాలి, గెలవాలి తప్ప, మరొకరి ముందు అతని వాదన నీరు గారిపోయినట్లు చూపిస్తే, సగటు ప్రేక్షకులను మెప్పించలేం. పైపెచ్చు, ఈ సినిమాలో హీరో అలా వాదన మార్చుకోవడానికి తగిన కారణం కానీ, సంఘటనలు కానీ - సందర్భాలు కానీ (ఫ్లాష్ బ్యాక్ లో లాగా) లేనే లేవు.

ఇక అక్కడ నుంచి దర్శకుడికి కూడా కథ ఎలా నడపాలనే గందరగోళం వచ్చినట్లు అనిపిస్తుంది. అందుకే, హీరో పాత్ర ద్వారా తాను ప్రవచించదలచిన, అప్పటి దాకా ప్రవచిస్తూ వచ్చిన అంశాన్ని పక్కనబెట్టి, మళ్ళీ రొటీన్ గా హీరో, హీరోయిన్లను కలపాలని చూశారు. అలా కాకుండా, హీరో ఆది నుంచి చెబుతూ వస్తున్న సిద్ధాంతాన్నే చూపుతూ, హీరో, హీరోయిన్ల ప్రేమ పెళ్ళి పీటలకు ఎక్కలేదని వాస్తవిక రీతిలో చెబుతూ, ముగించడానికి భయపడ్డారేమో అనిపిస్తుంది.

హీరో పాత్రచిత్రణకు నప్పని రీతిలో కథ చివరి భాగం సాగడంతో, ఆరెంజ్ ఏ వర్గానికీ సంతృప్తి నివ్వలేదు. ఈ సినిమా ఇంతగా పరాజయం పాలవడానికి నాకు అనిపించిన, కనిపించిన ప్రధాన కారణం అది. అలాగే, సినిమాలో జెనీలియా మేకప్ కానీ, ఆమె నటన కానీ బాగాలేవని చెప్పక తప్పదు. ఇక, తెరపై దృశ్యాల్లోని రంగుల గాఢతను కావలసినట్లుగా మార్చుకోవడం కోసం చేసిన డి.ఐ. (డిజిటల్ ఇంటర్మీడియట్) ప్రక్రియ కూడా నాసిగా ఉంది. అందుకే కావచ్చు - సినిమాలో చాలా చోట్ల హీరో, ప్రత్యేకించి హీరోయిన్ మేకప్ లు ముఖానికి మెత్తినట్లుగా, తెల్ల తెల్లగా, ముద్ద ముద్దగా ఉన్నట్లు అనిపించాయి. ఇక, హీరోయిన్ తండ్రి పాత్రలో తమిళ నటుడు ప్రభు, హీరోయిన్ అక్కబావలుగా నటుడు మహేశ్ బాబా సొంత అక్క మంజుల, బావ సంజయ్ స్వరూప్ లు నటించడం వల్ల సినిమాకు వచ్చిన అదనపు హంగేమీ లేదు. నటనలో అంతంత మాత్రం, తెలుగు డైలాగులకు డబ్బింగ్ సాయం అవసరమైన వీరందరినీ ఎందుకు తెచ్చుకున్నారో దర్శకుడు భాస్కర్ కు తెలియాలి.

నిజం చెప్పాలంటే - ఈ సినిమాలో హారిస్ జైరాజ్ బాణీలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఆస్ట్రేలియాలో జరిగినా, అనకాపల్లిలో జరిగినా పెద్ద తేడా లేని ఈ కథను ప్రత్యేకించి హిందీ చిత్రాల ఫక్కీలో ఆస్ట్రేలియాలో అందమైన లొకేషన్లలో షూటింగ్ జరిపారు. పప్పీ పాత్రలో బ్రహ్మానందం బాగానే నవ్వించారు. ‘ప్రేమంటే - నాలుగు అబద్ధాలు, మూడు ఎస్.ఎం.ఎస్.లు, రెండు కుళ్ళు జోకులు’, ‘మొదట ప్రేమిస్తాం. ఆ తరువాత పుట్టిన పిల్లల కోసం ఆ బంధాన్ని కొనసాగిస్తాం’ తరహా మాటలూ గుర్తుంటాయి. ఒక్కో సినిమాకూ నటుడిగా మెరుగుపడుతున్న రామ్ చరణ్ తేజ్ లోని నటుడికి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఘట్టం ఓ ఉదాహరణ. ప్రేమ కోసం జీవితాన్నే అబద్ధాలమయంగా మార్చుకోలేనంటూ ప్రేయసి ఇంటి నుంచి వచ్చేస్తూ, కథానాయక పాత్ర మాట్లాడే మాటలు, చేసే నటన రామ్ చరణ్ లోని మెరుగుదలకు మచ్చుతునకలు.

ఇలా సినిమాలో సానుకూల అంశాలు చాలానే ఉన్నాయి. కానీ, సెకండాఫ్ లో సగమయ్యాక హీరో పాత్ర చిత్రణలో వచ్చిన అకస్మాత్తు మార్పుతో, పూర్తిగా ఈ సినిమా కథే అడ్డం తిరిగింది. మిగతా లోపాలకు ఇది తోడై, కుండెడు పాలల్లో ఒక్క విషపు బొట్టు చిందినట్లయింది. ‘ఆరెంజ్’కు అదే పెద్ద శాపం. మంచి కథాంశాన్ని ఎంచుకున్నా, దాన్ని సమర్థంగా పాత్రల ద్వారా చివరి వరకు డ్రైవ్ చేయకపోతే, విమర్శకుల పరంగానూ, వాణిజ్యపరంగానూ మిగిలేది అసంతృప్తేనని ఆరెంజ్ ఋజువు చేసింది.

3 వ్యాఖ్యలు:

శరత్ కాలమ్ said...

మీ ఆరెంజ్ అభిప్రాయాలు నిజమే. దర్శకుడు చివర్లో తను చెబుతున్న భావాల నుండి పలాయనం చిత్తగించాడు. అందువల్ల అతడితో పాటూ మనమూ ఇంతే సంగతులు - చిత్తగించవలయును అనుకుంటూ ఈ సినిమాను చీదేసుకుంటూ సినిమా నుండి బయటకి వస్తాం. అలా ఓ చక్కని చిత్రం కావాల్సింది కాస్తంత చెత్తగా అయిపోయింది.

Mauli said...

oka problem ni create chesi, explain chesi solution suggest chesaaru ...

problem nizam anipinchina vallaku, solution possible anipinchaledemo andi :)

Shiva Bandaru said...

మీరు మొదటి 15నిమిషాలు చూడకపోవడంతో మీకు నాగబాబు పాత్ర అర్దం కాకపోయిండవచ్చు. దాన్ని బేస్ చేసుకుని విశ్లేసించారు. ఇది మాస్ సినిమా కాకపోవడంతో ఎక్కువమమ్ది నచ్చకపోవచ్చు. తెలుగు సినిమా మహారాజపోషకులు మాసే. వాల్లే సినిమాలను నిలబెడుతుంది. వాల్లకి ఎక్సోజింగ్,డబుల్ మీనింగ్స్ , వెకిలి కామెడీ, ఐటెం సాంగులు కావాలి. అవిలేని సినిమాలు మాస్ కి అంతగా నచ్చవు.