జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, December 18, 2010

‘ఆరెంజ్’ అంతలా ఫ్లాపయ్యిందేం?

ప్రతి పెద్ద తెలుగు సినిమా వచ్చే మా ఊళ్ళో ఎందుకనో రామ్ చరణ్ తేజ్ ‘ఆరెంజ్’ సినిమా విడుదల కాలేదు. దాంతో, నేను చూడ లేదు. అనుకోకుండా ఇవాళ ఇక్కడ ఓ షో వేస్తే హడావిడిగా వెళ్ళి చూశా. వెళ్ళేటప్పటికి పది నిమిషాల ఆట అయిపోయింది కానీ, ఆద్యంతం కదలకుండా చూశా. బాక్సాఫీస్ దగ్గర సినిమా అడ్డంగా దొరికిపోయిందని (ఈ తెలుగు టీవీ భాషకు పాఠకులు నన్ను మన్నింతురు గాక) ఇప్పటికే విన్నాను. అయినా సరే, సినిమా చూస్తే, విశ్రాంతి దాకా వచ్చేసరికి నాకే డౌట్ వచ్చింది. సినిమా ఫరవాలేదు - బాగానే ఉంది కదా. మరి, ఎందుకింత నెగటివ్ టాక్ వచ్చింది అని నాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. దానికి సమాధానం సెకండాఫ్ లో కాసేపైన తరువాత నుంచి నాకు దొరికింది.

మొత్తం సినిమా చూశాక, కొత్త కథాంశంతో తీసిన ఈ సినిమా జనానికి ఎందుకు నచ్చి ఉండకపోవచ్చనడానికి నాకు కొన్ని కారణాలు తట్టాయి. వాటిని మీతో పంచుకుంటాను.

నిజం చెప్పాలంటే - ఈ చిత్ర కథకు తీసుకున్న అంశం చాలా మంచిది. ప్రేమలో ఏ మేరకు నిజాయతీ ఉంటోంది, ఓ మనిషిని జీవితాంతం ఒకే రకంగా ప్రేమించడం సాధ్యమా లాంటి సున్నితమైన అంశాలను ఈ కథలో డీల్ చేశారు. ఎలాంటి అబద్ధాలూ లేకుండా, జీవితాంతం ఒక వ్యక్తిని ప్రేమించడం కుదిరేపని కాదన్న కథానాయకుడు రామ్ పాత్ర (రామ్ చరణ్ తేజ్) దృష్టి కోణం నుంచి కథ మొత్తం నడుస్తుంది. ఈ చిన్న అంశం మీద ఐటమ్ సాంగ్ లు, విలన్లు, ఛేజ్ లు, భారీ ఫైట్లు, గ్రాఫిక్స్ లాంటివేమీ లేకుండా సంసారపక్షపు సినిమా తీయడమంటే - ఇవాళ్టి తెలుగు సినీ వ్యాపార లెక్కల ప్రకారమైతే పెద్ద రిస్కు. మామూలు సినిమా కథల ప్రకారం చూసినా సరే, ఎలాంటి హీరోకూ, దర్శకుడికైనా సరే ఇలాంటి అంశాన్నీ, స్క్రిప్టునూ తెర మీద రెండున్నర గంటలు చూపడం కత్తి మీద సాము. అందులోనూ పేరున్న హీరోతో, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ లాంటి మరో పేరున్న దర్శకుడు ఆ సినిమా తీస్తే - అది కత్తి మీద సామే కాదు, పీకల మీద కత్తి కూడా.

అయినా సరే, ఈ దర్శక, హీరోలు ఆ సాహసానికి దిగినందుకు అభినందించాల్సిందే. సన్నటి కథాసూత్రం మీదే నడిపించుకుంటూ వెళ్ళినా, చిత్ర ప్రథమార్ధం ఫరవాలేదన్నట్లుగా గడిచిపోతుంది. కానీ, ద్వితీయార్ధంలో నాగబాబు పోషించిన పాత్రతో హీరోకు గీతోపదేశం చేయించిన దగ్గర నుంచి సినిమా గాడితప్పింది. అప్పటి దాకా హీరో ప్రవర్తనకూ, అతని ఐడియాలకూ, ఐడియాలజీకీ ముక్కున వేలేసుకుంటూనే ముచ్చటపడుతూ వచ్చిన ప్రేక్షకులకు అక్కడ నుంచి షాకుల మీద షాకులు ఎదురవుతాయి.

(మిగతా భాగం తరువాయి పోస్టులో...)

6 వ్యాఖ్యలు:

Anonymous said...

మీరు కేక !

వేణూశ్రీకాంత్ said...

మిమ్మల్ని అడగలేదు కానీ ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గరనుండి మీ విశ్లేషణ కోసం ఎదురుచూస్తున్నానండీ. కేవలం దానికోసమే నాలుగురోజులకోసారి వచ్చి మీ బ్లాగ్ చూసి వెళ్ళేవాడ్ని. గుడ్ స్టార్ట్ మంచి వ్యాసం రాబోతుందని అర్ధమవుతుంది :-)

జర్నో ముచ్చట్లు said...

జయదేవా..
సినిమా సమీక్షని కూడా తెలుగు టీవీ జీడిపాకం ధారావాహికల మాదిరిగా లాగడమేంటి... ఈ పోస్టులోనే ఆసాంతం సమీక్షించి ఉంటే సరిపోయేది కదా..!
విజయ్‌

ఆ.సౌమ్య said...

ఈ సినిమా నాకెందుకు కొంచమే నచ్చిందో నేనొక రివ్యూ రాసాను, వీలైతే చదివి మీ అభిప్రాయం చెప్పండి.

http://vivaha-bhojanambu.blogspot.com/2010/12/blog-post_15.html

Mauli said...

:)

Unknown said...

@ మిత్రులారా (మౌళి గారూ, ఏ2జడ్ డ్రీమ్స్ గారూ, వేణూ శ్రీకాంత్ గారూ, తదితరులందరికీ) - నా మీద మీ అభిమానానికి కృతజ్ఞతలు. కానీ, మీ అంచనాలకు మాత్రం భయం వేస్తోంది. ఆరెంజ్ సినిమాను చూసిన వెంటనే నాకు కలిగిన అభిప్రాయం రాసేందుకు చేసిన ప్రయత్నాలే ఈ పోస్టులు. ఇప్పటికే అందరూ, అన్ని రకాల రివ్యూలు చదివేసి ఉంటారని (అధ్యక్షా, నేను మాత్రం నా అలవాటు ప్రకారం సినిమా చూసి, దాని గురించి రాసేవరకూ మరో రివ్యూ చదవకూడదనే పద్ధతినే ఆరెంజ్ కూ పాటించాను), జనం సినిమా ఎందుకు నచ్చలేదన్నారు, అసలీ సినిమా ఎందుకు ఫ్లాపైందన్న అంశానికే పరిమితమై రాసిన పోస్టులివి. ఏమైనా, మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు.

@ జర్నో ముచ్చట్ల విజయ్ గారూ, ఆఫీసు పని చేసి, ఆ వెంటనే రాత్రి సినిమా చూసొచ్చి, పొద్దు పోయాక పోస్టు కొంత రాసే సరికే నిద్ర ఆవహిస్తోంది. దాంతో, రాసినంత వరకు ఓ పోస్టు గబగబా వేసేసి, తరువాతి పోస్టు మరునాడు రాస్తున్నాను. గ్రహించగలరు.

@ సౌమ్య గారూ, నా పోస్టు రాసేసా కాబట్టి, ఇక మీ ఆర్టికల్ తప్పకుండా చదువుతాను.