జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, November 13, 2015

దయ్యం ఫార్మ్‌లో ఉంది ('త్రిపుర' మూవీ రివ్యూ)

దయ్యం ఫార్మ్‌లో ఉంది

......................................
తారాగణం: స్వాతి, నవీన్‌చంద్ర, రావు రమేశ్, సప్తగిరి, శ్రీమాన్, 
‘షకలక’ శంకర్; స్క్రీన్‌ప్లే: కోన వెంకట్ - వెలిగొండ శ్రీనివాస్;
 మాటలు:  రాజా; పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి; 
కెమేరా: రవికుమార్ సానా; ఎడిటింగ్: ఉపేంద్ర,  సంగీతం:
 కామ్రాన్; సమర్పణ:  జవ్వాజి రామాంజనేయులు, 
నిర్మాతలు: ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్; కథ - దర్శకత్వం: 
రాజకిరణ్; నిడివి: 151 ని॥
.......................................

దయ్యం సినిమాలు ఇప్పుడు స్టయిల్.
అదే ‘ఫార్ము’లా ఇప్పుడు నడుస్తోంది.


గత ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద హిట్టయిన కామెడీ హార్రర్ థ్రిల్లర్ ‘గీతాంజలి’.
 ఆ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు రాజ్‌కిరణ్. ఇప్పుడు ఆయన 
తన రెండో చిత్రంలోనూ ఆ మార్గమే అనుసరించారు. ‘ప్రేమకథా చిత్రమ్’,
 తమిళ డబ్బింగ్ ‘పిజ్జా’ లాంటి సూపర్‌హిట్స్‌తో రెండు మూడేళ్ళ క్రితం 
 పుంజుకున్న ఈ తరహా హార్రర్ కామెడీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద
 మినిమమ్ గ్యారంటీ ఫార్ములా. కాబట్టి, ‘సేఫ్ బెట్’గా రాజ్‌కిరణ్ 
రాసుకున్న కథ, తీసిన విధానం అర్థం చేసుకోదగినవే.

కథగా చెప్పాలంటే... వరహాపట్నం అనే గ్రామం. అందులో 
శివన్నారాయణ దంపతుల (శివన్నారాయణ, రజిత) పెద్దమ్మాయి
 త్రిపుర అలియాస్ చిట్టి (స్వాతి). మరదలు త్రిపురకూ, ఇంట్లోవాళ్ళకీ 
ఇష్టం లేకపోయినా ఆమెనే పెళ్ళాడాలని తిరిగే మేనమామ
 సన్న్యాసిరాజు (సప్తగిరి). పెళ్ళీడుకొచ్చినా వచ్చిన సంబంధాలన్నీ
 తప్పిపోతున్న త్రిపురకు ఒక చిత్రమైన లక్షణం. ఆ అమ్మాయికి 
ఎవరి గురించైనా, ఏదైనా కలలో వస్తే - అది నిజమవుతుంటుంది. 
ఊరు ఊరంతా ఆ అమ్మాయి నిద్ర లేవగానే - ఆమె కలల్లో తమ
 గురించి, తమ వాళ్ళ గురించి ఏమొచ్చిందో తెలుసుకోవడానికి 
క్యూలు కడుతుంటారు.

కలలపై ట్రీట్‌మెంట్ కోసం త్రిపురను హైదరాబాద్‌లో ప్రొఫెసర్ 
రమేశ్ (రావు రమేశ్) దగ్గరకు తీసుకువెళతారు. అక్కడ డాక్టర్
 నవీన్ (‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర) ఆమెకు ట్రీట్‌మెంట్
 చేయడం మొదలుపెడతాడు. అప్పటి దాకా ఎవరిని చూసినా
 పెళ్ళికి వద్దనే హీరోయిన్ తీరా ఒక్క అనుకోని ముద్దుకే సదరు 
డాక్టర్‌ను ఇష్టపడుతుంది. ఆ మరునాడే అతని బెకైక్కి ఊరంతా 
తిరుగుతుంది. అతనూ ఆనందంగా తిప్పుతాడు. పెళ్ళికి ఒప్పుకోని 
తల్లితండ్రుల్ని వదిలేసి, లేచిపోదామని హీరోయిన్ అంటుంది. 
చివరకు డాక్టర్‌తో హీరోయిన్ పెళ్ళవుతుంది.

పెళ్ళయి హైదరాబాద్ వచ్చిన హీరోయిన్‌కు రకరకాల 
అనుభవాలు. ఊరికి దోవ అడిగిన వ్యక్తి మరణిస్తాడు. కలలో 
వచ్చినట్లే బ్రోకర్ తాతారావుకు యాక్సిడెంట్ అవుతుంది. 
ఇంతలో తన భర్తను తానే కత్తితో పొడిచినట్లు కల. అక్కడ ఇంటర్వెల్.  

 మరోపక్క డాక్టర్ నవీన్‌తో చాలా సన్నిహితంగా మెలిగిన కొలీగ్ 
డాక్టర్ ఈషా (పూజా రామచంద్రన్) నెలరోజులుగా కనిపించదు. 
డాక్టర్ నవీన్‌కు ఫ్రెండ్‌‌స గ్రూప్‌లో ఒకడైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ 
తిలక్ (కన్నడ నటుడు తిలక్) దర్యాప్తు చేస్తుంటాడు.  కనిపించకుండా 
పోయిన ఆ అమ్మాయిని చంపిందెవరు? హీరో అమ్మేద్దామనుకుంటున్న
 ఫార్మ్‌హౌస్‌లో ఉన్న దయ్యం కథేమిటి? దయ్యం పగ ఏమిటి?
 ఇంతకీ హంతకుడెవరన్నది మిగతా ఫిల్మ్.

‘కలర్స్’ స్వాతికి ఈ సినిమా వెరైటీనే. తెలుగులో ఎక్కువగా 
ఉత్సాహం ఉరకెలెత్తే పాత్రలు, చిలిపితనం నిండిన పాత్ర 
చిత్రణలతో పాపులరైన ఆమెకిది కొత్త కోణం. పల్లెటూరి 
పిల్లగా మొదలై పెళ్ళయిన అమ్మాయిగా అనుకోని పరిస్థితుల్లో 
ఇరుక్కునే పాత్రలో పెద్ద తరహాగా కనిపించారు. లేడీ
 ఓరియంటెడ్ సినిమా కాబట్టి కథలోని హీరోయిన్ పేరే
 సినిమాకూ పెట్టారు. అందుకు తగ్గట్లే - సినిమాలో అసలు 
గుట్టు విప్పడంలో ఆ పాత్ర నుంచి మరింత యాక్టివ్ రోల్ 
ఆశిస్తాం. పాజిటివ్, నెగిటివ్‌ల మధ్య ఊగిసలాడే పాత్ర 
నవీన్‌చంద్రది. రావు రమేశ్, శివన్నారాయణ, ఇళ్ళ బ్రోకర్ 
తాతారావుగా శ్రీమాన్, పనిమనిషిగా ప్రీతీ నిగమ్ 
తదితరులది పరిధి మేరకు పాత్రపోషణ.

 భయపెట్టడం కన్నా మాస్ మసాలా కమర్షియల్ వినోదం 
మీదే ఆధారపడ్డ ‘త్రిపుర’లో లేటెస్ట్ కామెడీ సంచలనం సప్తగిరి
 మళ్ళీ తన మార్క్ కామెడీతో కనిపిస్తారు. హీరో కావాలనుకొనే 
కోమల్‌బాబుగా ‘షకలక’ శంకర్, అతని తండ్రి రొయ్యల రెడ్డిగా
 జయప్రకాశ్‌రెడ్డి కనిపించేది కాసేపే అయినా సామాన్య ప్రేక్షకుల్ని 
నవ్విస్తారు. చిత్ర నిర్మాణ బృందమంతా ఎక్కువగా కొత్తవాళ్ళూ. 
ఉత్సాహవంతులే. వాళ్ళ కష్టం తెర మీద కనపడుతుంటుంది. 
కొత్త మ్యూజిక్ డెరైక్టర్, కొత్త రైటర్, కన్నడంలో పేరు తెచ్చుకున్న
 కెమేరామన్ - ఇలా ఎక్కువ కొత్త రక్తమే. దాంతో వచ్చే 
ఎడ్వాంటేజ్‌లు, డిజెడ్వాంటేజ్‌లూ తెరపై మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి.

 కలలు నిజం కావడం, ఇన్‌ట్యూషన్‌తో జరగబోయేది ముందుగానే
 ఊహించడం - లాంటి అంశాలతో ఇప్పటికే సవాలక్ష ఇంగ్లీష్ 
సినిమాలొచ్చాయి. కానీ, ఇది మనదైన చిత్రం, చిత్రీకరణ. 
దర్శకుడు రాజ్‌కిరణే కథ రాసుకున్న ఈ చిత్రానికి కోన, వెలిగొండ 
లాంటి పేరున్న రచయితలు స్క్రీన్‌ప్లే ఇచ్చారు. ‘గీతాంజలి’ కథ 
దయ్యం ఉన్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్ చుట్టూ తిరిగితే, ‘త్రిపుర’ కథ
 మొత్తం ఫార్మ్‌హౌస్‌లోని దయ్యం చుట్టూ నడుస్తుంది. అక్కడైనా, 
ఇక్కడైనా - మన సగటు సినిమాలన్నిటి లాగానే ఆడ దయ్యమే 
తిరుగుతుంటుంది. ఆ దయ్యం ఏం చేసింది? ఆ పనుల్లో ఎంత 
భయం, మరెంత వినోదం వచ్చాయన్నదే ఇంపార్టెంట్. ఈ కొలతలతోనే 
‘త్రిపుర’ నడుస్తుంది. ఆ క్రమంలో కొన్ని కొరుకుడు పడవు. ఊరవతల
 మర్రిచెట్టు దగ్గర ఒక దయ్యముందని హీరోయిన్ చెబుతుంది. 
తీరా అక్కడ ఆగిపోయిన కారులోని మనిషిని చంపే దయ్యం 
మాత్రం మర్రిచెట్టు దయ్యం కాదు... ఫార్‌‌మహౌస్ దయ్యం.  
అలాగే, ఫస్టాఫ్ అంతా తెగ కలలు కనే హీరోయిన్‌కు సెకండాఫ్‌లో
 కలలు కనే తీరిక ఉండదు. కానీ, ఇలాంటివెన్నో వినోదంలో 
కొట్టుకుపోతాయని ఆశించాలి. ‘‘దీని గురించి ఎక్కువ పట్టించుకోకు. 
కొన్ని విషయాలంతే! లాజిక్‌కు అందవు’’ అని సినిమా చివరలో
 ఒక డైలాగ్ వస్తుంది. కలలు నిజం కావడం లాంటి మిస్టీరియస్
 అంశాలున్న ‘త్రిపుర’కు అంతకు మించి పర్‌ఫెక్ట్ ఎండింగ్ ఇంకేముంటుంది!

.............................................

తెర వెనుక ముచ్చట్లు

- హీరోయిన్ స్వాతి టైటిల్ రోల్ చేయడం ఇదే తొలిసారి. పెళ్ళయిన స్త్రీ పాత్ర
 కోసం ఆరు కిలోల బరువు పెరిగారు.
- ఈ సినిమా చిత్రీకరణకు పట్టిన మొత్తం షూటింగ్ డేస్ 68. 
- {పధాన భాగమంతా హైదరాబాద్ చుట్టుపక్కల తీశారు. సినిమా 
ప్రారంభ గీతంతో పాటు కలర్‌ఫుల్‌గా కనిపించే మరో పాటను 
కర్ణాటకలోని బాదామిలో చిత్రీకరించారు.
- మ్యూజిక్ డెరైక్టర్ అనూప్ దగ్గర కీబోర్డ్ ప్లేయర్ అయిన కామ్రాన్
 సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు.డైలాగ్ రైటర్ రాజాకు 
ఇది తొలియత్నం. కన్నడ హిట్ ‘ఉగ్రమ్’ కెమేరామన్ రవికుమార్ 
‘త్రిపుర’కు పనిచేశారు.  
- షూటింగ్ పూర్తి కాక ముందే ‘గీతాంజలి’ క్రేజ్ వల్ల శాటిలైట్ రైట్స్
 అమ్ముడైపోయాయి. ఇటీవలి కాలంలో ఒక చిన్న చిత్రం రైట్స్ 
రూ. 2.6 కోట్ల దాకా పలకడం విశేషం. 
- తమిళ తెరకు కూడా సుపరిచితులైన స్వాతి, నవీన్ చంద్ర, 
శ్రీమాన్ లాంటి నటీనటులు ఉండడంతో, ఏకకాలంలో తెలుగుతో 
పాటు ‘తిరుపుర సుందరి’ పేరు మీద తమిళ వెర్షన్‌ను కూడా
 తెరకెక్కించారు.
- ‘షకలక’ శంకర్, జయప్రకాశ్‌రెడ్డి ఎపిసోడ్‌ను తమిళ వెర్ష న్‌లో 
అక్కడి నటులతో చేయించారు. తమిళంలో నేరుగా సెన్సార్ చేశారు. 
అక్కడ ఈ నెల 27న రిలీజ్ చేస్తారు.
................................................

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 7th Nov 2015, Saturday)
..........................................

కీచక సంహారం కోసం.... ('కీచక' మూవీ రివ్యూ)

కీచక సంహారం కోసం....

సినిమా - 'కీచక' , మాటలు: రామ్‌ప్రసాద్ యాదవ్; పాటలు: వెన్నెలకంటి,
 రామజోగయ్య శాస్త్రి, గోరటి వెంకన్న; సంగీతం: డాక్టర్ 
జోస్యభట్ల; కెమెరా: కమలాకర్; నిర్మాత: పర్వతరెడ్డి 
కిశోర్‌కుమార్; కథ- స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: ఎన్.వి.బి. చౌదరి

ఆడవారిని కేవలం ఆటవస్తువులుగా చూసే మనస్తత్త్వం నుంచి 
బయటపడని పురుషాధిక్య ప్రపంచం మనది. ఆడవారి పట్ల 
భరించలేనివెన్నో జరుగుతూ ఉంటాయి. యథార్థగాథలైనప్పటికీ
 అతి జుగుప్సాకరమైన అలాంటి అంశాలను సినిమా లాంటి 
మాస్‌మీడియవ్‌ులో ఎంతవరకు చూపించాలి?... వాటిని
న్యూస్ రిపోర్ట్ స్థాయి నుంచి మూవీ ఆర్ట్ స్థాయికి ఎంతవరకు 
తేవాలంటే  ఎప్పుడూ చర్చే. ఆ చర్చకు మరోసారి తావిస్తూ 
వచ్చిన సినిమా ‘కీచక’.

కథగా చెప్పాలంటే... సుజాత (యామినీ భాస్కర్) 
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేరింజనీర్. టీమ్‌తో కలసి చేపట్టిన 
ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేసే ఆమె ఈసారి 
ఒంటరిగా ఒక ప్రాజెక్ట్‌ను తలకెత్తుకుంటుంది. అది 
ఏమిటంటే - ఊళ్ళోని గాంధీనగర్ బస్తీలో ‘కీచకుడి’గా 
తిరుగుతున్న కోటి (జ్వాలా కోటి)ని ఎలాగైనా చంపేయడం! 
ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ, కోటి ఉండే పేరుమోసిన
 బస్తీకి వస్తుంది. ఆ బస్తీకి 20 ఏళ్ళుగా మకుటం లేని 
మహారాజు - కోటి. వంద మర్డర్లు, 300 రేప్‌లు చేసిన 
చరిత్ర అతనిది. అయితే, భయంతో బస్తీవాసులు, 
రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల పోలీసులు - 
అతణ్ణి ఏమీ చేయలేకపోతుంటారు. బస్తీకి ఒక 
సామాన్య మహిళగా వచ్చిన హీరోయిన్‌కు అతని
 మీద అంత పగ ఎందుకు అన్నది చిన్న ఫ్లాష్‌బ్యాక్‌లో
 చూపిస్తారు. మరోపక్క ఆమెను ఎలాగైనా 
అనుభవించాలనుకుంటాడు విలన్. అతణ్ణి ఏమారుస్తూనే, 
బస్తీలో అందరి ఎదుటే అతణ్ణి ఎదిరిస్తుంది హీరోయిన్. 
ఆమె ఇచ్చిన ధైర్యంతో జనమేం చేశారన్నది మిగతా స్టోరీ.

ఈ సినిమాకు కీలకమైన హీరోయిన్, విలన్... పాత్రధారులిద్దరూ 
ఆ పాత్రలకు తగ్గట్లు, చూడడానికి బాగున్నారు. క్రూరమైన 
విలన్ పాత్రకు జ్వాలా కోటి సరిగ్గా సరిపోయారు. సైకిల్ మీద
 క్యారియర్‌లో ఇడ్లీలమ్మే దాసు పాత్రలో రఘుబాబు 
అలవాటైన తన కామెడీకి భిన్నంగా సెంటిమెంటల్‌గా 
కనిపిస్తారు. ఆ పాత్ర ముగింపు, ఆయన నటన బాగున్నాయి. 
పరిమితమైన వనరులతో తీసిన ఈ సినిమాకు ఉన్నంతలో
 కెమేరా, రీరికార్డింగ్ వర్‌‌క బాగున్నాయి.

సినిమా మొదలైన కాసేపటికే హీరోయిన్ లక్ష్యమేమిటో, 
దానికి కారణమేమిటో కూడా చెప్పేశారు. దాంతో, తరువాతంతా 
లక్ష్యాన్ని ఆమె ఎలా చేరుకుందన్నదే! దాన్ని ఆసక్తిగా 
చెప్పాల్సింది. మళ్ళీ మళ్ళీ అవే తరహా రేప్ దృశ్యాలు,
 నేపథ్య గీతాలు, ఒక ప్రత్యేక నృత్య గీతం, ఇంకా విలన్ 
ముఠా మాటలు, చేష్టలతో సినిమాను 111 నిమిషాల 
నిడివికి చేర్చారు.

చిత్రంగా, విలన్‌ను చంపడమే ధ్యేయంగా కత్తి పట్టుకు
 తిరిగిన కథానాయిక ఆఖరుకి అదే కత్తితో విలన్ చేతిలో
 పోట్లు తింటుంది. అంతటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బస్తీకి 
పోగానే, ఆటోడ్రైవర్‌తో ప్రేమలో మునగడంలో లాజిక్ 
వెతకడం కన్నా సినిమాటిక్ సృజన అని తృప్తిపడిపోతే
 గొడవుండదు. అత్యాచారానికి గురైన స్త్రీ ఆ దుర్మార్గానికి
 పాల్పడిన విలన్‌పై పగ తీర్చుకోవడమనే ఫార్ములా 
తాతల కాలం నాటిదే. కాకపోతే దాన్ని నిజజీవిత 
ఘటనకూ, స్త్రీ చైతన్యానికీ ముడిపెట్టడమే తాజాదనం.
 సీను సీనుకీ రేప్ దృశ్యం, సైకో తరహా శాడిజమ్, అనేకానేక 
ఆడియో కట్స్‌తో మనసును డిస్ట్రబ్ చేసే సంఘటనల
 సమాహారం ‘కీచక’.    
.......................................................... 
- నాగపూర్ ప్రాంతంలో అక్కూ యాదవ్ అనే వీధి రౌడీ జీవితం స్ఫూర్తితో ఈ సినిమా కథను అల్లుకున్నారట.  
- ఈ చిత్ర దర్శకుడు ఒకప్పుడు టీవీ చానల్స్‌లో పనిచేసిన జర్నలిస్టు
.................................

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 31st October 2015, Saturday)
.........................................

Monday, November 9, 2015

వెంటాడి... వేటాడే షేర్ ( ‘షేర్’ మూవీ రివ్యూ)

సినిమా - ‘షేర్’ 
తారాగణం: నందమూరి కల్యాణ్రామ్, 
సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, ముఖేశ్ రుషి, 
షఫీ, రావు రమేశ్, రోహిణి;
కథ: డైమండ్ రత్నబాబు
సంగీతం: తమన్
కెమేరా: సర్వేష్ మురారి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్: రామ్ - లక్ష్మణ్
నిర్మాత: కొమర వెంకటేశ్

దర్శకత్వం: మల్లికార్జున్

‘నా గురించి నీకు తెలుసు కదా బాబాయ్! నచ్చితే ఎంత రిస్కయినా చేస్తాను!’
...‘షేర్’ సినిమాలోని ఓ సీన్‌లో బ్రహ్మానందంతో హీరో కల్యాణ్‌రామ్ చెప్పే డైలాగ్
 ఇది. సినిమాకే కాదు... కల్యాణ్‌రామ్ కెరీర్‌కూ వర్తించేలా దర్శక,  రచయితలు 
రాసుకున్న డైలాగ్ అనొచ్చేమో. ఎంచుకొనే కథ, పాత్రల్లో రిస్క్ చేయడానికెప్పుడూ
 వెనకాడని కల్యాణ్‌రామ్ తనకు నచ్చిన కథ, దర్శకుడితో చేసిన కొత్త ఫిల్మ్ - ‘షేర్’.

కథ ఏమిటంటే... హైదరాబాద్‌లో గౌతమ్ (కల్యాణ రామ్) ఒక సివిల్ ఇంజనీర్.
 తల్లితండ్రులు (రావు రమేశ్, రోహిణి). తమ్ముడు చెస్ ప్లేయర్. జీవితం సాఫీగా
 సాగిపోతున్న టైమ్‌లో పప్పీ (‘రుద్రమదేవి’లో విలన్ పాత్రధారి విక్రమ్‌జీత్ విర్క్)తో
 హీరో ఢీ అంటే ఢీ అనాల్సొస్తుంది. పప్పీ తండ్రి దాదా (ముఖేశ్ ఋషి) కలకత్తాలో 
బడా మాఫియా డాన్. తమ్ముడు ఛోటా (షఫీ), ఇంకా చాలా పరివారం ఉంటుంది.
 ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మన కుర్ర విలన్ పప్పీకేమో పెళ్ళి పిచ్చ. జీవితంలో ఎలాగైనా
 పెళ్ళి చేసుకోవాలనీ, అదే ‘నా గోల్, ఎయిమ్, లక్ష్యం’ అని తిరుగుతుంటాడు. 
‘నాది అనేది నా దగ్గర ఎవడైనా తీసుకుంటే వాడిది అనేది నేను లాక్కుంటా’ 
అన్నది కుర్ర విలన్ పప్పీ పద్ధతి. అతని పెళ్ళి చెడిపోవడానికి హీరో 
కారణమవుతాడు. దాంతో ప్రతీకారం తీర్చుకోవడానికి హీరో ప్రేమించిన 
అమ్మాయిని తాను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు.

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సాయాజీ షిండే) కూతురు నందిని (సోనాలీ చౌహాన్)కీ, 
హీరోకీ మధ్య ప్రేమ. ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని కుర్ర విలన్ ఆరాటం. 
ఈ క్రమంలో ఏకంగా హీరోయిన్ తండ్రి దగ్గరకే వెళ్ళి డి.జి.పి.ని చేస్తానని ఆశ 
చూపించి పెళ్ళికి ఒప్పిస్తాడు. అప్పుడిక హీరో గారూ కాబోయే మామగారి 
దగ్గరకు వెళ్ళి, మాఫియాగాళ్లను ఎన్‌కౌంటర్ చేసి, ఆ క్రెడిట్ మామగారికి 
వచ్చేలా చేసి, తానే డి.జి.పి.ని చేస్తానంటాడు. అలా ముందుగా కుర్ర విలన్
 బంధువును చంపడంతో ఎన్‌కౌంటర్ల పర్వానికి శ్రీకారం చుడతాడు. ఇక 
సెకండాఫ్‌లో కూడా ఆ పర్వం కొనసాగిస్తూనే, ‘శ్రీను వైట్ల సినిమాల ఫక్కీ’లో
 హీరో వెళ్ళి కుర్ర విలన్ పెళ్ళి ఇంట్లో తిష్ఠ వేస్తాడు. అక్కడ కామెడీకి తోడు, 
హీరో ఎన్‌కౌంటర్లకు సంబంధించి ఒక సస్పెన్‌‌స ఫ్లాష్‌బ్యాక్ కూడా తెలుస్తుంది. 
హీరోకు అంత పగ ఎందుకు, కుర్ర విలన్‌ను అడ్డుపెట్టుకొని పెద్ద విలన్
 దాదాను హీరో ఏం చేశాడు, ఏమిటన్నది మిగతా సినిమా.

నటీనటుల విషయానికొస్తే... కల్యాణ్‌రామ్ అలవాటైన నటన చూపారు. 
అలాగే, నందమూరి వారసత్వాన్ని గుర్తు చేసేలా పెద్ద ఎన్టీయార్ ఫోటోలు, 
కటౌట్లు, ప్రస్తావనలు, ఆయన ముసుగు ముఖానికి వేసుకొని విలన్
 ముఠా వాళ్ళను కొట్టడాలు లాంటివన్నీ సినిమాలో పుష్కలం. గాలిలో 
ఎగిరి విలన్లను కొట్టడాలు, తుపాకీలతో కాల్పుల తరహా యాక్షన్ 
సన్నివేశాలు ఉన్నాయి. ‘రేయ్... వాయిస్ ఉంది కదా అని 
వాల్యూమ్ పెంచితే, స్పీకర్లు పగిలిపోతాయ్’ లాంటి (విలన్‌తో)
 ‘హీరో’చిత డైలాగులూ ఉన్నాయి. పాటలకు చేసే డ్యాన్సుల్లో
 కల్యాణ్‌రామ్ మునుపటి కన్నా నైసు తేలినట్లూ అర్థమవుతుంది.
 ఇలా సగటు తెలుగు సినిమా హీరో చేయగలిగినవన్నీ సినిమాలో
 ఉన్నాయి. హీరోయిన్ సోనాలీ చౌహాన్ సెకండాఫ్‌లో ఆట్టే 
కనిపించకపోయినా కనిపించిన ఫస్టాఫ్ అంతా డ్యాన్సులు,
 హీరోతో లవ్ సీన్లతో సరిపెడుతుంది. సినిమాలో కామెడీకి 
బ్రహ్మిగా బ్రహ్మానందం,‘గబ్బర్ సింగ్’ బ్యాచ్ ఫిష్ వెంకట్, 
ఒకటి రెండు సీన్లలో వచ్చే అలీ, పృథ్వి, స్వర్గీయ ఎమ్మెస్ నారాయణ -
 ఇలా తెర నిండా చాలామంది ఉన్నారు. కొన్ని డైలాగ్ పంచ్‌లు
 నిజంగానే నవ్విస్తాయి. ‘పోలవరం ప్రాజెక్టు, వీడి (కుర్రవిలన్) పెళ్ళి 
జరిగినట్టే ఉంటాయ్. కానీ, జరగవ్... చిరాగ్గా’ అని ట్రైలర్‌లో
 వినిపించిన డైలాగ్ సినిమాలో సెన్సార్ వల్లో, శ్రేయోభిలాషుల
 హెచ్చరిక వల్లో కానీ ‘సల్మాన్‌ఖాన్ పెళ్ళి.. వీడి పెళ్ళి..’ అంటూ మారింది.

సినిమాలో విలన్ల బ్యాచ్ కూడా పెద్దదే. కలకత్తాలోని దాదాగా 
ముఖేశ్ రుషి, అతని కుడి భుజంగా ఆశిష్ విద్యార్థి, అలాగే
 కొడుకులుగా విక్రమ్‌జీత్ విర్క్, షఫీ - ఇలా చాలామందే ఉన్నారు. 
కుర్ర విలన్‌తో హీరోకు సవాలు ఎదురైన దగ్గర నుంచి కథ వాళ్ళ 
పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచినా, మధ్యకొచ్చేసరికి అది ప్రేమను 
గెలిపించుకోవడం కోసం కాబోయే మామగారైన సాయాజీ షిండేను 
డి.జి.పి.ని చేయడానికి హీరో సాగిస్తున్న ఎన్‌కౌంటర్ల వ్యవహారంగా
 కనిపిస్తుంది. సినిమా ముగింపుకొచ్చేసరికి అప్పటి దాకా 
జరుగుతున్నదంతా విలన్‌పై హీరో వ్యక్తిగత ప్రతీకారపు కథ 
అని కలర్ మారింది. ఇలాంటి చిత్రమైన కథాకథన పద్ధతి
 అనుస రించారు. కెమేరా వర్‌‌క, ఒకట్రెండు పాటలు బాగున్నాయి.

మొత్తానికి, పాపను చంపిన వ్యక్తుల మీద పగతో చిరంజీవి 
‘జై చిరంజీవా’ అనడం చూశాం. ఇదే దర్శక, హీరోల కాంబినేషన్‌లో
 చెల్లెలి సెంటిమెంట్‌తో వచ్చిన ‘కత్తి’ చూశాం. ఇంకా చాలా చాలానే
 చూశాం. ఇప్పుడు వీటన్నిటికీ వినోదాత్మక నయారూపం ఈ ‘షేర్’.
 వెరసి, ఈ కథలో ప్రేమ షేర్ ఎంత, పగ షేర్ ఎంత అన్నది వదిలేస్తే, 
ప్రేక్షకులు ఆలోచించేది మాత్రం తమకు దక్కే 
వినోదం షేర్ ఎంత అనే... చిరాగ్గా!
 ..........................................

- నిజానికి, ఈ సినిమా కల్యాణ్‌రామ్ గత చిత్రం ‘పటాస్’ 
రిలీజ్ కన్నా ముందే ప్రారంభమైంది. అయితే, రకరకాల
 కారణాల వల్ల నిర్మాణంలో ఆలస్యమైంది. 

-  ‘షేర్’ నిర్మాణంలో ఉండగానే ‘పటాస్’ రిలీజై, కమర్షియల్ 
సక్సెస్ సాధించడంతో, యూనిట్ పునరాలోచనలో పడింది. 
కథ మార్చలేదు కానీ, ‘పటాస్’కు ప్లస్సయిన వినోదాన్ని
 ఇందులోనూ జొప్పించడానికి కామెడీ సీన్లు కొత్తగా
 తిరగరాసుకున్నారు.

- మొదట ఈ సినిమాకు వన్యా మిశ్రా అనే అమ్మాయిని
 హీరోయిన్‌గా తీసుకున్నారు. పది రోజుల షూటింగ్
 తరువాత రషెస్ చూసుకొని, తాము అనుకొన్న పాత్రకు 
ఆమె నప్పడం లేదని, కొత్త హీరోయిన్‌ని పెట్టుకొన్నారు. 
అలా సోనాల్ చౌహాన్ వచ్చింది. రీషూట్ చేయాల్సొచ్చింది.  

-దర్శకుడు మల్లికార్జున్‌కు ఇది 4వ సినిమా. అందులో
 మూడింటిలో (‘అభిమన్యు’, ‘కత్తి’, ‘షేర్’) కల్యాణ్‌రామే హీరో.
..........................................................................
- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 31st Oct 2015, Saturday)
.................................

Saturday, November 7, 2015

ఎవరయ్యా... ఈ త్రివిక్రముడు? (ఇవాళ త్రివిక్రమ్ పుట్టినరోజు Special Article)


ఇవాళ త్రివిక్రమ్ పుట్టినరోజు
 
ఎవరయ్యా... ఈ త్రివిక్రముడు?

 ‘అతడు’ - తెలుగు సినిమా రచయితల విలువను కోటి రూపాయలకు
 చేర్చిన మాటల మాంత్రికుడు. ‘ఖలేజా’ ఉన్న దర్శకుడు.
 ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’లా విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తి.
 మా చెల్లి మల్లీశ్వరి - నువ్వు నాకు నచ్చావ్! నువ్వే కావాలి! 
మన్మథుడా అంటే... అత్తారింటికి దారేది అని మర్యాదగా పెళ్ళి
 చేసుకున్న మంచివాడు. (మా చెల్లి సీతారామశాస్త్రి గారి 
తమ్ముడు శ్రీరామ్ గారి కూతురు చిన్నూ... త్రివిక్రమ్ భార్య).

1997 -98 మధ్యకాలంలో నేను దర్శకుడు జయంత్ సి. పారాన్జీ 
గారి దగ్గర అసోసియేట్‌గా ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి 
‘బావగారూ బావున్నారా’ సినిమాలో అర్జంట్‌గా ఒక సీను మార్చి 
రాయాల్సి వచ్చింది. తెల్లారితే షూటింగు. ముందు రోజు గురువులు
 పరుచూరి బ్రదర్స్ ఇద్దరూ అందుబాటులో లేరు. చివరికి వాళ్ళ 
శిష్యుడైన పోసాని కృష్ణమురళితో రాయించమని నన్ను ఆదేశించారు. 
పోసాని గారింటికి వెళ్ళి, మొత్తం కథంతా రెండు గంటలు చెప్పాను. 
ఆయన విని, రేపు పొద్దున్న ఆరింటికి వచ్చి పట్టుకెళ్ళిపొమ్మన్నారు.
 ‘సరే’ అని వచ్చేశాను. పొద్దున్న వెళితే, నన్ను ‘వెయిట్ చేయ’మన్నారు.
ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్న
 ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్ కోసం! ఓ అరగంట తరువాత వచ్చారు - 
చేతిలో ముప్ఫై పేజీల స్క్రిప్టుతో.

 ‘ఒక్క సీను రాయమంటే, సగం సినిమా రాశారేమిటి మాస్టారూ?
 ‘ఏమో! పోసాని గారు రాత్రికి రాత్రి అర్జంటుగా కావాలని కథ చెప్పారు. 
కథలో నేను ఎక్కడి నుంచి మార్పులు చేయాలనుకున్నానో, అక్కడి 
నుంచి క్లైమాక్స్ దాకా రాసేశాను’ అన్నారు.

 అప్పటి వరకూ నాకు తెలిసి అలా రాయగలిగింది - పరుచూరి గోపాలకృష్ణ గారొకరే! 
చివరికి, మొత్తం చదివి, అందులో నుంచి పనికొచ్చేవి జయంత్ గారికి చెప్పాను. 

ఒక పెద్ద ప్రొడ్యూసర్ - త్రివిక్రమ్‌ని పరిచయ్ చేయమని అడిగితే, పంజగుట్టలోని
 ఆయన రూమ్‌కి తీసుకెళ్ళాను. బ్లాంక్ చెక్ ఆయన చేతిలో పెట్టారు - 
సినిమా రాయమని. అది 2001లో! ఈ రోజు వరకు త్రివిక్రమ్ ఆ చెక్ వాడలేదు... 
వాళ్ళకి సినిమా చేయలేదు. కానీ... ఫ్రెండ్లీగా దర్శకుడు దశరథ్‌కి 
‘సంతోషం’లో ఒక సీన్, దర్శకుడు షిండే గారికి ‘నిన్నే ప్రేమిస్తా’ - 
మొత్తం సినిమా రాసి పెట్టారు తక్కువ పారితోషికానికే! అప్పట్లో 
సునీల్‌నీ, త్రివిక్రమ్‌నీ - ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా చూడలేకపోయేవాళ్ళం. 
ఈ రోజుకీ తన పంజగుట్ట గదిని అలాగే ఉంచుకున్న త్రివిక్రమ్ లాంటి 
నిరాడంబరుణ్ణి తెలుగు సినీ పరిశ్రమలో ఇంకొకరిని నేను చూడలేదు.

 ఈయన బయట పరిచయం ఉన్నవాళ్ళతో బోల్డన్ని కబుర్లు చెబుతారు. 
జోకులు పేలుస్తారు. తన సినిమాల్లో హీరోల్లాగే సెటైర్లేస్తారు. ఎడ్యుకేట్
 చేస్తారు. మైకు ముందు మాత్రం పెద్దగా మాట్లా డరు. ఎప్పుడైనా 
మాట్లాడితే - ఆ మధ్య ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి గురించి
 మాట్లాడినట్టు విస్ఫోటనం చెందుతారు.

 ‘ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి’ లాంటి పాత తరం 
భావజాలాలేవీ లేని ఆధునిక యువకుడు. ఏ ఎత్తులో ఉంటే, 
ఆ ఎత్తులో నుంచి ప్రపంచాన్ని తనదైన శైలిలో చూసే
 పర్వతారోహకుడు. 2001 - 02 మధ్య కాలంలో ‘సిరివెన్నెల’
 సీతారామశాస్త్రి గారింట్లో త్రివిక్రమ్‌కీ, శాస్త్రి గారి తమ్ముడి 
కూతురికీ నిశ్చితార్థం. ఈయన పీటల మీద కూర్చొని ఉన్నారు.
 పెళ్ళి కూతురింకా రాలేదు. నన్ను చూడగానే - పీటల మీద 
నుంచి లేచొచ్చి, ‘మీతో అర్జంట్‌గా మాట్లాడా’లని నన్ను కారులో 
అన్నపూర్ణా స్టూడియో రోడ్డు చుట్టూ రౌండ్లు కొట్టించి, నాకు క్లాసు పీకారు. 
అది కూడా తనకు సంబంధించిన విషయం కాదు. నా కోసం... నా కెరీర్ కోసం!

 ‘పోసాని గారి కథ చిరంజీవి గారు బావుందంటే, మీరు బాలేదన్నారట!
 మీకెందుకు? మెగాస్టార్ ఒప్పుకున్న కథను బాలేదని, మీకు వచ్చిన 
అంత మంచి డెరైక్షన్ అవకాశం పోగొట్టుకోకండి. ఒప్పుకొని ఎలా బాగు
చేయాలో ఆలోచించండి. చిరంజీవి గారితో సినిమా చేయాలని 
మనందరి డ్రీమ్ కదా! మీకు ఆ ఛాన్స్ ముందు వస్తే మీరెలా 
వదులుకుంటారు’ అని నాకు పదే పదే చెప్పారు. 

‘మీరు రాస్తారా మాటలు. ఇప్పుడే వెళ్ళి ఒప్పేసుకుంటా’ అన్నాను. 

నన్ను మూర్ఖంగా ఆలోచించవద్దని చాలా చెప్పారు. ఆ టైమ్‌లో నాకు 
అలా చెప్పడం ఆయనకు అవసరం లేదు. అయినా హితబోధ చేశారు. 

చాలా కాలం తర్వాత ఈ మధ్యే పార్క్ హయత్ హోటల్‌లో ఓ 
రెండు గంటలు గడిపాను. అదే త్రివిక్రమ్. మేము కూర్చున్న స్థలం
 మారింది కానీ, మనిషి మారలేదు! ఆతడి మమత తీరలేదు!!

 భీమవరం నుంచి వైజాగెళ్లి ఆంధ్రా యూని వర్సిటీలో ఎమ్మెస్సీ
 చదివిన యువ కుడు హైదరాబాదొచ్చి సినీ పరిశ్రమలో కాలూనుకోవడం
 కోసం నానాకష్టాలూ పడి ట్యూషన్లు చెప్పి, అసిస్టెంట్ రైటర్‌గా 
పోసాని గారి దగ్గర పనిచేసి, ‘స్వయంవరం’తో కొంత పేరు
 సంపాదించినా, వెంటనే మరో సినిమా రాసెయ్యకుండా 
గ్యాప్‌లో కృష్ణవంశీ గారి ‘సముద్రం’కి అసోసియేట్‌గా చేరి, 
డెరైక్షన్ నేర్చు కుంటూ ‘చిరునవ్వుతో’ కథ రాసి, అది
 రామ్‌ప్రసాద్ గారి దర్శకత్వంలో సూపర్‌హిట్టయ్యాక, 
‘నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, 
మల్లీశ్వరి’ వరకూ అప్రతిహతంగా హిట్లిచ్చిన రచయితగా
 ఎదగడం మామూలు విషయం కాదు.

 లగడపాటి శ్రీధర్‌గారు నిర్మాతగా నా దర్శకత్వంలో త్రివిక్రమ్
 రచయితగా ఓ కథ అనుకున్నాం. అదే - తర్వాత దర్శకుడిగా
 ఆయన మొదటి సినిమా - ‘నువ్వే నువ్వే’.  ఇద్దరికీ తలో
 పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు. బయట కొచ్చాం. ఓ నెల
 ఇబ్బంది లేదనుకున్నాం.

 ‘మంచి చెప్పులు కొనుక్కుందాం  మాస్టారూ!’ అన్నారు.
 ‘సరే’ అన్నాను.
 ఏడెనిమిది వేల రేంజ్‌లో రెండు జతలు సెలక్ట్ చేశారు. 
‘సార్! డబ్బులన్నీ అయిపోతే మళ్లీ వెతుక్కోవాలి.
 కష్టం కదా!’ అన్నా. 

‘సంపాదిద్దాం సార్! ఇవే దాచుకుని నెలంతా ఉన్నా, 
తర్వాతి నెల కోసం ఆలోచించాలి కదా! రేపటి కోసం ఆలోచిద్దాం.
 ఇవ్వాళ ఖర్చు పెట్టేద్దాం! ముందు మనం మనకిష్టమైంది 
చేశామనుకోండి... మంచి థాట్స్ అవే వస్తాయి’ అన్నారాయన.

 నాకు జ్ఞానోదయం అయింది.

 2004 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు - 
ఏవిఎస్ గారినీ, ఇంకొందరినీ కూర్చోపెట్టి ఎన్నికల్లో చెయ్యాల్సిన 
యాడ్స్ గురించి చర్చిస్తున్నారు. ‘రోజూ పార్టీ ఆఫీసుకు వందల 
ఉత్తరాలు వస్తున్నాయి - ఈ సారి యాడ్స్‌నీ, బ్రోచర్‌నీ, స్పీచెస్‌నీ 
త్రివిక్రమ్‌తో రాయించుకోమని! ఎవరయ్యా త్రివిక్రమ్?’ అని అడిగారు.

 నిజమే! ఎవరయ్యా త్రివిక్రమ్? మొన్న ఎన్నికల్లో కూడా సాక్షాత్తూ 
పవన్‌కల్యాణ్  కూడా ‘జనసేన’ ప్రారంభోత్సవం స్పీచ్‌లో ‘నా వెనక
 త్రివిక్రమ్ హస్తం లేదు’ అని క్లారిఫై చెయ్యాల్సి వచ్చింది. 
ఇంతకీ... ఎవరయ్యా త్రివిక్రమ్?

 ఎవరిదైనా ప్రమేయం ఉంటే, వారి గురించి మాట్లాడుకుంటారు. 
అది సహజం. ప్రమేయం లేదని కూడా వారి గురించి మాట్లాడడం 
అసాధారణం. అదయ్యా త్రివిక్రమ్..!!

 అభిమానులు కోట్ల మంది ఉన్నా తన సినిమాల ద్వారా వారిని
 పలకరి స్తారే గానీ, సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పరు.
 ఆహ్వానాలు కొన్ని వందలున్నా ఆత్మీయులను కలుస్తారే గానీ
 ఏ ఫంక్షన్‌కీ అడుగుపెట్టరు. ఫోన్‌లో కూడా ఎవ్వరికీ అందరు - 
అంత ఈజీగా. కానీ అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు.
 ‘ఇంత ఒత్తిడిలో కూడా ఇంత కంట్రోల్డ్‌గా జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ 
చేస్తున్నావయ్యా మిత్రమా’ అని అడిగితే యోగా గురువులా
 ‘చిరునవ్వే’ సమాధానంగా చెప్తారు.

 త్రివిక్రమ్ గురించి రాస్తానని గడచిన పుట్టినరోజుకే చెప్పాను 
‘సాక్షి’ వారికి. ఆ అవకాశం ఈసారి దొరికినందుకు చాలా
 ఆనందంగా ఉంది.

 బాపు గారిని నేను ‘సాక్షి’ కోసం ఇంటర్వ్యూ చేసినపుడు 
ఆయనకి ఈతరంలో అభిమాన దర్శకులు ఇద్దరే అని 
చెప్పారు- త్రివిక్రమ్, రాజమౌళి. జీవితంలో కొంతకాలం 
ఈ ఇద్దరితోనూ ప్రత్యేకంగా మంచి అనుబంధం కలిగినవాడిని. 
నేను కాకపోతే వీళ్ల గురించి అథెంటిక్‌గా ఎవరు 
రాస్తారు? అని నా అభిప్రాయం.

 త్రివిక్రమ్ గురించి రాయాలన్న నా కోరికకి కారణం ఆయన్ని 
పొగడడం కాదు. నన్ను నేను రీఛార్జ్ చేసుకోవడం! కెరీర్ 
మొదలైన రోజులు గుర్తు చేసుకొని, మళ్లీ రిజొనవేట్ అవ్వడం
 కోసం! పంజగుట్ట గదిలో మొదటి టీవీ కొన్నరోజుల నుంచి, 
ఆడియో సీడీలు విన్నరోజుల నుంచి- తిన్న బిర్యానీలు, 
చూసిన సినిమాలు, చర్చించుకున్న సినిమాలు, స్టార్లు, 
జీవిత విశేషాలు, గడిపిన తెల్లారగట్టలు, మధ్యరాత్రులు, 
మధ్యాహ్నాలు, సాయంత్రాలు - సీతారామశాస్త్రి గారింట్లో 
పాటల కోసం వెయిటింగుల మధ్య నడిచిన సంభాషణలు, 
ఉద్బోధలు, ప్రవచనాలు, ఉత్ప్రేరకాలు - అన్నీ ఉప్పెనలా 
గుర్తుకొచ్చిన ఈ శుభవేళ... పుట్టినరోజు మీదైనా, మళ్లీ 
పుట్టినరోజు నాది కూడా మిత్రమా!

 సభాముఖంగా శతాధిక శుభాభినందనలు. పుట్టినరోజు
 శుభాకాంక్షలు. శతమానం భవతి! తెలుగు సినిమాకు 
వన్నెతెచ్చిన మహాను భావుల ఎత్తుకు  మీరూ ఎదుగుతారు. 
మీరందుకే పుట్టారు. 
ఇది నిజం... ఇది తథ్యం. 

 మీ
 వి.ఎన్. ఆదిత్య, 
దర్శక, రచయిత

(Published in 'Sakshi' daily, 7th Nov 2015, Saturday)
........................................

Friday, November 6, 2015

సంక్రాంతికి... డాడీ సినిమా షురూ! - హీరో రామ్‌చరణ్ ఇంటర్వ్యూ

ఆలోచన ఆకాశాన్ని అంటాలి... ఆచరణ భూమి మీద కనపడాలి.
తల్లి తండ్రి అక్క చెల్లి పాద ధూళితో గుండె నింపుకున్న చరణ్
కొత్తగా అనిపిస్తున్నాడు... కొత్తగా వినిపిస్తున్నాడు.
చరణ్ అంటేనే పాదం!
హిజ్ ఫీట్ ఆర్ రియల్లీ ఆన్ ద గ్రౌండ్!
మీరే చదవండి... కొత్తగా కనిపిస్తాడు కూడా!


సంక్రాంతికి... డాడీ సినిమా షురూ!
ఇంటర్వ్యూ ఇస్తూ... రామ్‌చరణ్


♦  ‘బ్రూస్‌లీ’లో చిరు స్పెషల్ రోల్ టాకాఫ్ ది ఆడియన్సైంది
(నవ్వేస్తూ...) నిజమే. మేము సినిమా మొత్తం కష్టపడితే, నాన్నగారు చివరలో
 నాలుగు నిమిషాలొచ్చి, అంతా కొట్టుకుపోయారు. కానీ, అది సినిమాకెంతో 
ఉపయోగపడింది. తెరపై ఆయన నటనకు జనం స్పందన చూశాక ఎప్పుడెప్పుడు 
ఆయన హీరోగా సినిమా స్టార్ట్ చేద్దామా అని ఉంది. దసరా లోపలే సినిమా, 
దర్శకుడు కన్‌ఫర్మ్ చేస్తాం. సంక్రాంతి కల్లా షూటింగ్ షురూ...
     
♦  ‘బ్రూస్‌లీ’లో సరే... జీవితంలో మీ సిస్టర్స్‌తో అనుబంధం?
కజిన్స్‌తో కలుపుకొంటే, నాకు ఆరుగురు సిస్టర్స్. అందరికీ నేనొక్కణ్ణే బ్రదర్‌ని. 
తోడబుట్టిన మా అక్కయ్య సుస్మిత, నేను చిన్నప్పుడు బాగా కొట్టుకొనేవాళ్ళం. 
పెద్దయ్యాక బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. చెల్లెలు శ్రీజను మేము అప్పుడూ, ఇప్పుడూ 
చిన్నపిల్లగానే చూస్తాం.  
     
♦  ‘బ్రూస్‌లీ’లో చూపినట్లు మగపిల్లలకు ప్రాధాన్యమివ్వడం...
మన పురుషాధిక్య సమాజంలో ఇలాంటివి చూస్తూ ఉంటాం. కానీ, ఆడపిల్లల 
చేతిలో అధికారం, పని పెడితే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. నేను ముంబయ్‌లో
 పనిచేసిన యాడ్స్‌లో కానీ, హిందీ సినిమా ‘జంజీర్’లో కానీ చాలామంది 
ఆడవాళ్ళు పనిచేస్తూ కనిపిస్తారు. వాళ్ళు కరెక్ట్‌గా పనిచేస్తారు. వాళ్ళను చూసి
 మగవాళ్ళు కూడా తామూ సరిగ్గా పనిచేయాలనే భావనలో ఉంటారు. అందుకే, 
భవిష్యత్తులో నా ప్రొడక్షన్ హౌస్‌లో ఎక్కువ మంది ఆడవాళ్ళకే అవకాశాలివ్వాలనుకుంటున్నా. 
మా అక్కయ్య సుస్మితనూ, అలాగే మా పెదనాన్నవరసయ్యే 
డాక్టర్ కె. వెంకటేశ్వరరావు గారి అమ్మాయి కూడా మా ‘కొణిదెల ప్రొడక్షన్స్’లో
 ముఖ్యపాత్రలు పోషిస్తారు.
     
♦  మరి, నాగబాబు గారమ్మాయి తెరంగేట్రంపై మాటలేంటి?
నీహారిక టీవీ షోస్ చేసింది. ఇప్పుడిక హీరోయిన్‌గా వస్తోంది. ఎంకరేజ్ 
చేయాలని నా అభిప్రాయం. కాకపోతే, సినీరంగంలో ‘ఇటీజ్ టఫ్ లైఫ్’ 
అని తెలియజేస్తాం. ఇక్కడ సవాలక్ష రాజకీయాలూ ఉంటాయి. ఇలాంటివన్నీ
 నీహారికకు తెలియజేస్తాం. కానీ, తను ఈ రంగాన్నే ఎంచుకోదలుచుకున్నప్పుడు
 కాదనడానికి మనమెవరం? లక్ష్మి మంచు, సుప్రియ లాంటి వాళ్ళు పేరున్న
 కుటుంబాల నుంచి వచ్చారు కదా! తప్పేముంది!
     
♦  ‘మెగా’ కుటుంబం నుంచి చాలామంది వారసులొచ్చారు!
ఎవరూ లేకుండానే డాడీ సినీరంగంలో పైకొచ్చారు. ప్రతిభ, కష్టపడే తత్త్వం
 ఉంటే ఎవరైనా ఒక రజనీకాంత్, చిరంజీవి అవుతారు. వారసులమని
 చెప్పుకొని వచ్చినా, నిలదొక్కుకోవాలంటే కష్టపడాల్సిందే.
     
♦  ఎవరినో రోడ్డు మీద కొట్టారని, ఏదో అన్నారని మీ గురించి 
వివాదాలొస్తూ ఉండేవి. ఎందుకలా?
కొన్నిట్లో నా ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంది. ఆ సంగతి తెలుసు. కానీ చాలాసార్లు 
నాదేమీ లేకుండానే నా గురించి ఏదో ఒకటి అంటారు, మాట్లాడతారు. 
తాజాగా ‘రుద్రమదేవి’, ‘బ్రూస్‌లీ’ రిలీజ్ వ్యవహారం అందుకో ఉదాహరణ. 
ఇలాంటి వాటికి గతంలో దూకుడుగా రియాక్టయ్యేవాణ్ణి. ఇప్పుడు మారాను.  
     
♦  పని మీద దృష్టి పెట్టమని బాబాయ్ చెప్పారట! అందుకా?  
అలా ఏమీ లేదు. ఇక్కడ ఇవన్నీ ఎవరికి వారు తమ పర్సనల్ జర్నీ
 ద్వారా తెలుసుకోవాల్సిందే తప్ప, ఎవరో చెబితే వచ్చేది కాదు. 
అంతెందుకు, వరుణ్ (తేజ్), (సాయిధరమ్) తేజ్‌లకు నేను కూడా 
ఎక్కువ ఏమీ చెప్పను. ఎవరికి వాళ్ళు తెలుసుకొని, నేర్చుకొంటేనే 
ఆ అనుభవం నిలబడుతుంది. బాబాయ్ కూడా ఇవన్నీ స్వయంగా
 చూసి, దాటొచ్చారు.
     
♦  మునుపటి కన్నా సంయమనంతో మాట్లాడుతున్నారు. 
పరిణతి వచ్చిందా? లేక తెచ్చిపెట్టుకొన్నారా?
ఇదేమీ అసలు రూపాన్ని దాచి, ముసుగు వేసుకోవడం కాదు.
 కేవలం నా పర్సనల్ గ్రోత్. అన్నిటికీ రియాక్టవడం మన స్థాయిని 
మనమే తగ్గించుకోవడం! ప్రతి దానికీ రియాక్ట్ అవడం మొదలుపెడితే, 
రోజూ వంద వస్తుంటాయి. వాటికి వివరణలివ్వడంతోనే టైమ్ 
గడిచిపోతుంది. జీవితంలో చాలా పనులున్నాయి.

♦  కానీ, మన అనుకున్నవాళ్ళను ఎవరో ఏదో అన్నప్పుడు...
(మధ్యలో అందుకుంటూ...) అప్పుడు రియాక్ట్ కావాల్సిందే. మనవాళ్ళను 
మనం కాపాడుకోవాలిగా! నాన్న గారిని ఎవరైనా, ఏదైనా అనుచితంగా
 వ్యాఖ్యానించినప్పుడు మేము రియాక్ట్ అయ్యేది అందుకే!  
     
♦  నటుడిగా మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకుంటారు?
కెరీర్‌లో ముందుకు వెళ్ళాలంటే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్తగా 
చేయాలి. కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి. గతంలో యాక్టింగ్ కోర్స్
 చేసినా, మళ్ళీ వెళ్ళి పదును పెట్టుకోవాలి. ఎన్నో ఏళ్ళుగా నేర్చినా
 నాకొచ్చినవి డ్యాన్స్ స్టైల్స్‌లో 5 శాతమే. నేర్చుకోవాల్సిందెంతో ఉంది. 
కథ విన్నప్పుడు జడ్జ్ చేసే కెపాసిటీ కోసం స్క్రిప్ట్‌రైటింగ్ కోర్స్ చేయాలి. 
నవంబర్, డిసెంబర్‌లో ఆ కోర్స్ చేద్దామనుకుంటున్నా.
     
♦  కొత్తగా చేయాలంటున్నా మూసలో వెళ్ళారే!
నిజమే. కొంత కమర్షియల్‌గానే వెళ్ళా. నేనేమిటో ప్రూవ్ చేసుకున్నా
 కాబట్టి, ఇక కొత్త కథలు, పాత్రల కోసం ప్రయత్నిస్తాను. జనం 
కూడా కథలో జెన్యూనిటీ కోరుకుంటున్నారు. అబద్ధపు ఎమోషన్లు 
చూపిస్తే చూడడం మానేశారు. కేవలం డ్యాన్సులు, ఫైట్లు 
చేస్తామంటే కుదరదు. బలమైన కథ, ఎవరున్నా హిట్టయ్యే 
లక్షణాలున్న స్క్రిప్టు ఎంచుకోవాలి.

♦  వయసుకు తగ్గట్లు మంచి లవ్‌స్టోరీ చేయచ్చుగా!
చేయాలనే వుంది. ఫ్లాపైనా సోషల్ మీడియాలో అంతా చెప్పుకోనే
 నా ఫిల్మ్ ‘ఆరెంజ్’. అది నా ఫేవరెట్ ఫిల్మ్. ఈసారి అందరికీ
 నచ్చే, కమర్షియల్‌గా వర్కౌటయ్యే లవ్‌స్టోరీ చేస్తా.
................................................

Box Matters

♦  అమ్మ కోసం అమరనాథ్‌కి వెళ్ళా!
డాడీ లాగే నేనూ ఆంజనేయ భక్తుణ్ణి. తరచూ తిరుమల 
వెళుతుంటా. డాడీ 18 ఏళ్ళు అయ్యప్ప మాల వేశారు. 
నాకూ అలవాటైంది. ఆ మధ్య అమ్మ మొక్కు తీర్చడానికి 
అమరనాథ్ యాత్రకు వెళ్ళా. అదో అద్భుతమైన అనుభూతి.
 ........................
♦  నేను చేయకపోతే, సల్మానే చేస్తారు!
డాడీ, సల్మాన్‌ఖాన్ కలసి థమ్సప్ యాడ్స్ చేశారు. అప్పటి
 నుంచి పరిచయం. ఎప్పుడు ముంబయ్‌కి వెళ్ళినా ఫోన్ 
చేయాల్సిందే. నేను చేయకపోతే ఆయనే చేసి, ‘పెద్దవాడివైపోయావా’
 అంటారు. ఆయన అంత మంచి మనిషి.
 .................................
♦  అనుబంధాలు పెరిగేది అలాగే!
పరిచయస్థులు, పెద్దవాళ్ళు ఎవరైనా ముంబయ్ నుంచి 
ఇక్కడకు షూటింగ్‌కు వస్తే, ఇంటి నుంచి భోజనం పంపడం 
లాంటి అతిథిమర్యాదలు డాడీ చేస్తారు. ఆయన దగ్గర అది 
నేర్చుకున్నా. అనుబంధాలు, ఆప్యాయతలు అలానేగా పెరిగేది!
 ..........................................
♦  ఊసరవెల్లిని కాపాడా!
చిన్నప్పటి నుంచి యానిమల్ లవర్‌ని. మా ఆవిడా అంతే. మా
 ‘ఉపాసనా ఫార్మ్’లో ఆవులు, గుర్రాలు, ఒంటె ఉన్నాయి.
 ‘బ్రూస్‌లీ’ సెట్స్‌లో గాయపడ్డ ఊసరవెల్లి దొరికింది. దాన్ని 
ఇంటికి తెచ్చి కాపాడి, బాగయ్యాక వదిలేశా.
 .....................................
♦  స్త్రీమూర్తుల ప్రభావం ఎక్కువ
మా డాడీ లైఫ్‌లో, నా లైఫ్‌లో స్త్రీమూర్తుల ప్రభావం ఎక్కువ. 
అమ్మ, అక్క, చెల్లి - వీళ్ళంతా మమ్మల్ని ప్రభావితం చేశారు.
 విమర్శించేది, మెచ్చుకొనేది ముందుగా వాళ్ళే. వాళ్ళు 
లేకుండా నేను లేను. ఇప్పుడు మా ఆవిడ వచ్చి చేరింది.
 .............................................
♦  ఇంట్లో లుంగీనే!
‘బ్రూస్‌లీ’లో లుంగీ డ్యాన్స్ చూసి డాడీ సినిమాలు, షారుఖ్ 
‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ లాంటివి గుర్తు చేసుకున్నారు. నిజానికి సెట్స్‌లో, 
బయట రకరకాల డిజైనర్ దుస్తులు వేసుకొని, వేసుకొని
 విసుగొచ్చేసింది. అందుకే, ఇంటికి రాగానే హాయిగా లుంగీ 
కట్టుకుంటా. ఇంట్లో ఎప్పుడూ ఖద్దరు చొక్కాలు, తెల్ల జుబ్బాలు 
వేసుకుంటా. లుంగీ కట్టుకోవడంతో వర్క్ నుంచి బయట పడి
 రిలాక్సైన ఫీలింగ్ ఉంటుంది.
 ..........................................................
♦  అమ్మ... సహనం
ఇంట్లో ఒక్కొక్కరి నుంచి ఒక్కోటి- అమ్మ నుంచి సహనం 
అలవరచు కున్నా. అలసి ఇంటికొచ్చాక, అమ్మ పెద్ద రిలాక్సేషన్. 
బయటివి మాట్లాడదు. మంచీచెడ్డా కనుక్కుంటుంది.

♦  నాన్న... స్విచ్చాన్, స్విచ్చాఫ్
సినిమా వార్తలు, పేపర్లు, విషయాలన్నీ డ్రాయింగ్ రూమ్ వరకే తప్ప, 
బెడ్‌రూమున్న ఫ్లోర్‌కు రానిచ్చేవారు కాదు డాడీ. స్విచ్చాన్,
 స్విచ్చాఫ్. నేనూ అలా ప్రయత్నిస్తున్నా.

♦  అక్కయ్య... స్టైలింగ్
అక్క సుస్మితకు క్రియేటివిటీ ఎక్కువ. ఫ్యాషన్ డిజైనింగ్ షోస్
 చేసింది. మా డాడీ ఫిల్మ్స్‌కు స్టైలిస్ట్‌గా పనిచేసింది. నాకివాళ
 కొద్దిగా స్టైలింగ్‌పై అభిరుచి వచ్చిందంటే, అది అక్క చలవే.

♦  చెల్లెలు... శాంతం
చెల్లి అచ్చం మా అమ్మ టైప్. సహన మెక్కువ. ఆవేశంతో 
రియాక్టవదు... శాంతం. అందరిలోకీ మోస్ట్ లవబుల్ చైల్డ్. 
డాడీకి గారాబుబిడ్డ. చెల్లి సహనం, శాంతం నేర్చుకుంటున్నా.  

♦  మా ఆవిడ... సరదా, కలుపుగోలుతనం

మాది పెద్ద కుటుంబం. అందరితో మా ఆవిడ ఉపాసన ఎలా
 సర్దుకుపోతుందా అని భయపడ్డా. కానీ, రాగానే అందరితో 
కలిసిపోయింది. సరదాగా ఉంటుంది. లంచ్‌కి కూర్చుంటే
 అందరికీ వడ్డిస్తుంది.
............................
- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 21st Oct 2015, Wednesday, Family Page)
.................................