జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, March 10, 2015

స్కూళ్లలో బోధించాలి! - కార్టూన్లపై ఆర్.కె. లక్ష్మణ్ (ఇంటర్వ్యూ: పన్నాల సుబ్రహ్మణ్యభట్టు)

కార్టూన్లపై ఆర్.కె. లక్ష్మణ్

ఇంటర్వ్యూ: పన్నాల సుబ్రహ్మణ్యభట్టు

స్కూళ్లలో బోధించాలి!

మంచి బొమ్మలతో పాటు రాజకీయ వ్యంగ్య చిత్రాలకు తలమానికం వంటి ఆలోచనలతో ఎక్కడా వన్నె తగ్గకుండా, ప్రజాదరణ కోల్పోకుండా, తేలిపోని చిత్రాలు వేసినవారు ఆంగ్లపత్రికా రంగంలో ఇద్దరే ఇద్దరు. వారు ఇద్దరూ ‘ఆకుంచె శ్రీమంతులు’. బంగారు కుంచెతో పుట్టినవారి క్రింద లెక్క. వారు - శంకర్, ఆర్.కె. లక్ష్మణ్. అతి తక్కువ లైన్లతో రంగులు పూసిన గీతల క్యారికేచర్లు అనే పోలికల హెచ్చుతగ్గుల ఆలోచనాత్మకమైన ముఖ కవళికల రూపురేఖలు దిద్దగల్గిన దిగ్దంతులు వాళ్లిద్దరే. మరొకరు జన్మించరేమో!

 లక్ష్మణ్ ‘ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ’లో అతి తక్కువ గీతలతో గీసిన రంగు బొమ్మలను కాపీ చేస్తూ నా మిత్రుడూ, నేనూ 1965లో సెలవులు గడుపుతుండేవాళ్ళం. మొహంలో కండలు నిర్ణయించే గీతలు, వ్యక్తి పోలికలకు పారా కాసే రేఖలు పట్టుకోవడానికి తంటాలుపడుతూ ఉండేవాళ్ళం. పెద్ద కుర్చీలో కూర్చున్న చిన్న లాల్‌బహదూర్ శాస్త్రి బొమ్మను కాపీ చేయడం దగ్గర నుండి ఆరంభమయిన నా యాత్ర త్వరగానే ముగిసింది కానీ, ఆ బొమ్మలు గీసిన మహానుభావుణ్ణి చూడాలన్న కోరిక మాత్రం నాలుగు దశాబ్దాలకు గానీ తీరలేదు. అదీ నాటకీయంగా కుదిరింది.

 ఆమధ్య ‘విజయవాడ పుస్తక ప్రదర్శన’కు అతిథిగా వచ్చిన ఆర్.కె. లక్ష్మణ్ గారిని దుర్గ గుడికి తీసుకెళ్లడం నా పని. ఆయనకు దేవాలయ సందర్శనం అప్పుడు చేయడం ఇష్టం లేదు. శ్రీమతి కమలా లక్ష్మణ్ తప్పదన్నారు. ప్రత్యేక ఏర్పాట్లతో ఆవిడ ముందు వరుసకు పదోన్నతి పొందారు. లక్ష్మణ్‌గారు వెనుకబడ్డారు. క్యూలో చాలాసేపు పట్టింది. ‘మీకూ తప్పలేదు చూశారా’ అని నేను నవ్వాను. ‘ఇదే మనకు ఆహారం’ అన్నారాయన. నెత్తి మీద అక్కడే కోతి కిచకిచలు. ‘‘హనుమంతుడు కూడా నిరసన తెలియజెబుతున్నాడు చూశావా’’ అన్నారు. ప్రక్కనే ఎవరి చంకలోనో ఉన్న పిల్లాడు ఆయనకు ముద్దు వచ్చాడు. ఆయన ఆ పిల్లవాడి బుగ్గ మీద చిటికేశారు. తండ్రికి కోపం లాంటి విసుగొచ్చింది.  రెండేళ్ళు నిండని తన పసిపిల్లాణ్ణి తాకిన పరాయివాడంటే సద్భావం కలగలేదు. ఆయనకు ‘‘మనం ఆమోదయోగ్యులం కాదు కదా! నాకు తెలుసు’’ అన్నారు ఆర్.కె. లక్ష్మణ్. కమలగారు దర్శనం చేసుకున్నారు. ఈయన ఆనందంగా బయటకు వచ్చారు.

 ఈ నేపథ్యంలో నేను ఆయన్ని తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయాలి. ఆయనకు చెప్పలేదు ఇంటర్వ్యూ అని! ఆయన కాదంటే మొదటికే మోసం వస్తుంది. ‘‘మీకు దండలు వేయడానికి అక్కడ ఒకాయన చాలాసేపు నుంచి వెయిటింగ్. సాధారణ మనిషి ఒకరు ఎదురుచూస్తున్నా’’రని చెప్పి రేడియో స్టేషనుకి తీసుకెళ్ళాను. సంతోషించారు. నాలుగు మాటలు... మీ అభిమానులు సంతోషిస్తారని మైకు ముందు మొదలుపెట్టాను. చివరన ‘‘అభిమాని మంచి ప్రశ్నలు వేశాడే’’ అని నవ్వారు. ఆ ఇంటర్వ్యూ ఇంగ్లీషులో సాగింది.

అందులోని కొన్ని భాగాలు:

  ప్రశ్న: మీలాటి గొప్ప కార్టూనిస్టులు అరుదుగా కనబడతారు ఏ దేశంలోనైనా! కోపం వస్తే నివారించుకోవడానికి కార్టూన్లను వేసుకుంటూ ఉంటారా? నిజం చెప్పండి.

 ఆర్.కె. లక్ష్మణ్: కోపం అని అనుకోను, వంగ్య వ్యాఖ్య అంటాను. ప్రజల మీద, ముఖ్యంగా రాజకీయ నాయకుల మూర్ఖత్వం మీద, నాయకులం అనుకుని దేశాన్ని నడిపించే నాయకుల మీద! నాయకులే కాదు, మామూలు ప్రజలు కూడా! తప్పని తెలిసే రోడ్లను ఆక్రమించేవారు, మార్గమధ్యంలో నించునేవారు, లారీలు వస్తున్నా రోడ్లు దాటేవారు, ఎర్రదీపాన్ని ధిక్కరించేవారు - అందరూ నాకు కార్టూనుకు పనికొచ్చే సంగతులే.

ఇది వేయాలన్న ఆలోచన తటాలున వస్తుందా?

ఆర్.కె: లేదు. గంటలకొద్దీ మథనపడితే కానీ రాదు. అది కాదని, ఇది కాదని, చివరికి ఎంపిక చేసుకుని రేపటికి పనికివస్తుందో రాదో చూసుకునీ - చాలా తంటాలుపడాలి.

చాలా అలసిపోయాననిపిస్తుందా?
 

ఆర్.కె: నిజమే. అయిదారు గంటలు శ్రమపడితే కానీ కార్టూన్ గీయడానికి ఆ రోజుకు ఆలోచన రాదు. అదో నిరంతర ప్రక్రియ. ఇక్కడ కూర్చున్నా అదే ధ్యాస. బుర్రలో కదలాడుతూ ఉంటుంది. కానీ గీతల్లో గ్రాఫిక్‌గా రిజిస్టర్ కాదు. అక్కడ సంఘటనలో ఏదో వ్యంగ్యం తారాడుతూనే ఉంటుంది.

తరచూ, రోజుకో ఆలోచనను ఎలా దింపగల్గుతున్నారు?

ఆర్.కె: నాకు భోజనం పెట్టేదే అది. చేయక తప్పదు. కార్టూనిస్టును కాకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇంజనీరుగా ఇళ్లు కడుతూ ఉండేవాడినేమో!

మంచి కార్టూన్ కాకపోయినా ప్రచురించి, పాఠకులు పొగిడితే, బాగుందంటే - మీరు వాళ్ళను చూసి నవ్వుకున్న సందర్భాలున్నాయా?

ఆర్.కె: బాగుండని కార్టూనే ప్రతిరోజూ వేస్తున్నాను. వేసినందుకు విచారిస్తాను. రేపు మంచిది వేద్దామని ఆశపడతాను.

నా కార్టూను విజయానికి వీళ్ళు కారకులు అని ఎవరినైనా చెప్తారా?


ఆర్.కె: నా దేశం, నా ప్రజాప్రతినిధులు. వీళ్లు తెంపు లేకుండా నా జీవితంలో ప్రతిరోజూ ఆలోచనలు సరఫరా చేస్తున్నవారు. వీళ్ళే కారకులు నా విజయానికి!
     
ఇక కార్టూను గీసే యంత్రాంగంలో ఏయే నాయకులు సదుపాయంగా, గీతలకు ఆదర్శవంతంగా కనబడతారు?

 ఆర్.కె: దీనికి సమాధానం కష్టం. క్యారికేచర్ కళాకారుడికి నెహ్రూ బొమ్మ గీయడం కష్టంగా ఉంటుంది. అయితే గాంధీ దేశానికి సేవ చేయడానికే జన్మించలేదు, కార్టూనిస్టులకీ సదుపాయం కల్గించాడు. ఆయన రూపం అలాంటిది. బట్టతల, పెద్ద చెవులు, చట్టిముక్కు, ముఖంమీద ఎప్పుడూ నవ్వు, దుస్తులు, ధోతీ, కండువా, నడుము వద్ద వేలాడుతున్న జేబు గడియారం - అన్నీ క్యారికేచర్ వేసేవాళ్ళ కోసమా అన్నట్లుంటాయి.

కార్టూన్లకు పనికి వచ్చే వస్తువులకు వస్తే నెహ్రూ గారి యుగం బాగా ఉత్సాహం కలిగించేదిగా చెప్పుకోవచ్చా?

ఆర్.కె: అబ్బే! అన్ని కాలాలూ ప్రోత్సాహజనకాలే. నెహ్రూ యుగమనేమీ లేదు. ఆ మాటకొస్తే మీ తెలుగు ప్రాంతం నుంచి వచ్చిన పి.వి. నరసింహారావు నా కార్టూన్ల అయిడియాలకి చాలా ఉపయోగపడ్డారు.

రాజకీయ వ్యంగ్య చిత్రాలనే మా మీద బలంగా రుద్దుతున్నారెందుకు? సాంఘిక పరిస్థితుల మీద, కుటుంబ విషయాల మీద కార్టూన్లకు ప్రాముఖ్యం లేదేం?

ఆర్.కె: ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్న నీకు తోచినదనుకోవడం లేదు. మన దేశంలో రాజకీయాలు లేకుండా సాంఘిక జీవనం లేదు. సోషల్ లైఫ్ లేకుండా రాజకీయాలు లేవు. గుడికెళ్ళు. ఇవాళ వెళ్ళాం కదా! ఇద్దరు ఎంపిలు, ఎమ్మెల్యేలు వచ్చి గర్భగుడిలోకి సామాన్య ప్రజలను వెళ్ళనీయకుండా అడ్డుపడ్డారు కదా! దేవాలయం పవిత్రమైన స్థలం. అందరూ సమానమే. కానీ రాజకీయ నాయకులొచ్చి - రేపు మళ్ళీ ఈ పదవుల్లో ఉంటారో ఉండరో తెలియని రాజకీయ నాయకులు వచ్చి - దర్శనాన్ని రాజకీయం చేశారు. పుస్తక ప్రదర్శన ఆరంభించడానికి రాజకీయ నాయకుడు కావాలి. మీ ఇంటికి నీరు సరఫరా కావాలంటే స్థానిక ఎం.పి. సాయపడాలి. సాంఘిక విషయాల కంటే మనం రాజకీయాలే ఎక్కువ చర్చిస్తాం. అందుకని మన దేశంలో రాజకీయ జీవితం, సాంఘిక జీవితం అని విడివిడిగా లేవు.
     
ఇక్కడ ఒకే పాత్రల వరుస వ్యంగ్య చిత్రాలు - స్ట్రిప్ కార్టూన్లు - వృద్ధి చెందలేదేం?

ఆర్.కె: ఇంగ్లండ్‌లోనూ పెంపొందలేదు. అమెరికా వారు వీటిని ముందు ఆరంభించారు. వారే కొనసాగించారు. మన దేశంలో ఇది నడిచే వ్యవహారం కాదు.
    
ఏం ఎక్కువ చిత్రాలు వరుసగా ఏక్షన్‌తో వేయాల్సి ఉండడం వల్లనా?


ఆర్.కె: అలాగని కాదు. దాంట్లో సృజనాత్మకత ఉండదు. అంతేకాకుండా కార్టూనిస్టు అనేవాడు బొమ్మగీయడం అనే ఆలోచనలో నుంచి జన్మిస్తాడు. కార్టూన్లు గీయడం పాఠశాలలో బోధించడం లేదు. బోధించాలి.రచయితలకు ముందు తరం వారి రచనలు ఆదర్శంగా ఉంటాయి. ఎక్కడ నుంచి ఆలోచన తోస్తుందో వారి రచనలు చెప్పి, సాయపడతాయి.

 ఆర్.కె: కాదు. చిత్రకారుడికీ, రచయితకీ చాలా భేదాలున్నాయి. రచయితకి దృశ్యం సాక్షాత్కరించే గుణం ఉండదు. ఉదాహరణకు బేట్‌మాన్, ఫాంటమ్ పాత్రలు ఆకాశహర్మ్యాల నుండి వీధిలోకి ఎగురుతూ రావడం, దాన్ని చూపటం - ఒక దర్శనీయ అనుభవం. రచయిత రచించగలడు, కాని ఎలా ఎగురుతుందో చూపించే విధంగా ఊహించలేడు. ఆ రెండూ రాయడం, ఊహించగలగడం కలిసి రావాలి.
   
బొమ్మలు వేయడం, వాటిని కార్టూన్లుగా మలచడంలో మీ మీద ఇతర వ్యంగ్య చిత్రకారుని ప్రభావం ఎవరిది ఉంది?


 ఆర్.కె: నా మీద డేవిడ్‌లో అనే వ్యంగ్య చిత్రకారుడి ప్రభావం చాలా ఉంది. ఇప్పుడు ఆయనను ఎవరూ గుర్తుంచుకోరు. చాలా గొప్ప కార్టూనిస్టు... ఇంగ్లండులో. తరువాత ‘సర్’ బిరుదు పొందాడు. సరే ఇంగ్లండులోనే కార్టూన్ కళ ఆరంభమైంది. యూరప్‌లో ప్రారంభం కాలేదు. చిన్నప్పటి నుండీ నా మీద అమిత ప్రభావం చూపాడు ఆయన. అతని ఆలోచనలు నాకు అప్పుడు అర్థమయ్యేవి కావు. ఐర్లండ్ విప్లవం మీద ఉండేవి. డ్రాయింగ్‌లు మాత్రం బలమైన ప్రభావం చూపాయి. డ్రాయింగ్‌లో పనితనాన్ని నిర్లక్ష్యంగా చూడకూడదు. ఒక పద్ధతిలో మనిషి కార్టూనులో నిలబడినా, చేతులు పెట్టుకొని ఒక విదంగా నిద్రపోతున్నా - ఉదాహరణకి ‘గౌడా’లా -ఆ పోజు ఎలా వస్తుంది? నువ్వు మంచి డ్రాయింగ్ వేసే కళాకారుడివి కాగలిగినప్పుడే సాధ్యమవుతుంది. ముందు డ్రాయింగ్ చిత్రకారుడు, తరువాత కార్టూనిస్టు, తర్వాతే వ్యంగ్యం చూపగల సెటైరిస్టు కాగలరు.

వ్యంగ్య రచయితలకీ, కార్టూనిస్టులకీ మధ్య కామిక్ ఊహాశక్తి సంబంధమైన పోలికలున్నాయా?

 ఆర్.కె: నేను వ్యంగ్య రచనలు చేపట్టలేదు. మనం చూసేవాటిలో ప్రతిదాన్లోనూ ఒక వ్యంగ్య దృష్టి ఉంటుంది. ప్రతివాడి అనుభవాన్నీ వ్యంగ్యాత్మకంగా మలచవచ్చు. వ్యంగ్యం రాసేవారికీ, వ్యంగ్య రచయితలైన వోలటైర్, షాలాంటి వాళ్లకీ మధ్యన; వ్యంగ్య రచయితలైన వారికీ కార్టూనిస్టులకీ మధ్య బంధం ఒకటి ఉంది.

మంచి డ్రాయింగులు కాకుల మూకనీ, జంతువులనీ వాష్ డ్రాయింగ్‌లో చాలా బలంగా, అందంగా చిత్రిస్తూ బొమ్మలు వేశారు కదా!
 ఆర్.కె: నా చిన్నతనం నుండి నాకు కాకులంటే ఎంతో అభిమానం. మన దేశంలో ప్రతి పిల్లవాడూ కిటికీలో నుంచి మొదట చూసేది కాకిని. పచ్చటి చెట్టు వెనుక ఉంటే కాకి కనబడుతుంది. ముందు కాకి, వెనుక నీలాకాశం ఉంటుంది. ఎక్కడైనా అది సిద్ధంగా అందరికీ కనబడుతుంది. నెమలి అనే అంద వికారమైన పక్షినీ, పావురాన్నీ ఎవరూ గమనించకపోవచ్చు. అందుకే, నేను ఈ కాకి అనే పక్షినే చిత్రిస్తూ ఆనందించాను.

హైందవ చిత్రకళ, వాస్తుకళ, శిల్పాలు మిమ్మల్ని అబ్బురపరచలేదా?

ఆర్.కె: లేదు. దానికి కారణం ఉంది. భారతీయ వాస్తు శిల్పకళలు పరిణతి చెందిన శైలితో విలసిల్లుతూ ఉంటాయి. దుర్గామాత చాలా ఎత్తుగా కనబడుతుంది. ఎంత ఎత్తు అంటే ముందు నిల్చున్న అర్చకుడు చాలా చిన్నవాడుగా ఉంటాడు. వాస్తు శిల్పాలలో భాగాల విభజన వాస్తుకళను గమనించేవారికి చాలా ఆసక్తిని కలిగిస్తుంది, మురిపిస్తుంది.

పురాణ పాత్రల నుండి కార్టూనిస్టులు చాలా విషయాలు గీయగలరేమో?

అసంఖ్యాకమైన ఆలోచనలు పుడతాయి - పురాణాల నుండి! కానీ నేను పూర్తిగా వద్దనుకున్నాను.
     
మతపరమైనవి కదా అని మానివేశారా?

ఆర్.కె: అలాగని కాదు. అవి సందర్భాలను చిన్నగా చిత్రింప చేస్తాయి. విపులంగా తెలివిగా చెప్పనీయవు. రావణుడికి పదితలలు కదా అని ఒక తల బీదరికం, మరొకటి అజ్ఞానం, అనారోగ్యం... అలా చిత్రిస్తూపోవడం గొప్పకాదు.

కార్టూన్ అంటేనే సూక్ష్మీకరించి చెప్పడం కూడా కదా?

ఆర్.కె: కాదు కాదు. కార్టూన్లో వ్యంగ్యం ఉంటుంది. దెప్పిపొడుస్తున్న వ్యాఖ్యానం ఇస్తూ, నువ్వు అర్థం చేసుకునేలా గీయడం ఉంటుంది. అలా సూక్ష్మంగా చేస్తే కార్టూన్ కాదు. విపులీకరించే చిత్రం మాత్రం కాగలదు.
     
ఈ దేశంలో కార్టూనిస్టులకు గౌరవం ఇస్తున్నారా?

ఆర్.కె: సారీ! ఇస్తున్నారు అనే అంటాను. నేను ఇందిరాగాంధీని ప్రతిరోజూ దాడి చేస్తూనే వచ్చాను. ‘పద్మభూషణ్’ గౌరవం ఇచ్చారు. మర్యాద చేసినట్లే కదా! ఎన్నో బహుమతులు, గౌరవాలు నాకు లభించాయి. నేను వారి పట్ల మర్యాదగా ఉన్నందుకు కాదు... వాళ్లను గౌరవించనందుకు లభించాయి.

మీ కార్టూన్ బాగులేదని తోచి మీకు మీరే మీ కార్టూన్ బయటకు రాకుండా చూసుకున్నారా?

ఆర్.కె: నాకో చిత్రమైన పని చేసే పద్ధతి ఉంది. ఆఫీసుకెళ్లి రెండు మూడు గంటలు పేపర్లు చదువుతాను. ప్రతీదీ విశ్లేషిస్తాను. ఆలోచన వచ్చేదాకా సతమతమవుతాను. అయిడియా కుదిరాక ఫ్రేములో ఎలా దృశ్యంగా దాన్ని మలచడం అనే బాధ మొదలవుతుంది. అంటే ఆ ఆరాటం సినిమా దర్శకుడి చిత్రీకరణ లాంటిది. సీతారామ్ కేసరిని ఇక్కడ నిలబెట్టాలా, లేక లాలూప్రసాద్‌ని మరోచోట ఉంచాలా, లేదా లాలూని శిఖరాగ్రం మీద పెట్టి, కేసరి శిఖరం మీదకు పరిగెడ్తూ ఇద్దరూ పడిపోతారా - ఇలా సినీ దర్శకుడిలా ఆలోచిస్తాను. చివరికి ఓ ఏర్పాటు చేస్తా. ఒక చోట కేసరి, ఒక చోట రబ్రీదేవి, మరొక చోట లాలూప్రసాద్‌ని పెట్టి - అప్పుడు నేపథ్యం వగైరాలు చిత్రిస్తాను. తర్వాత వ్యాఖ్యానం తయారవుతుంది. ఎవరు ఏమంటారు అనే విషయం... అటువంటివి. మొన్న ఒక కార్టూన్ వేశాను. కేసరిగారి గదిలో కాంగ్రెస్ నాయకులు బయటకు పోదామని చూస్తూ ఉంటారు. గది తలుపు సగం తెరచి ఉంటుంది. తలుపు మీద ‘కేసరి’గారి పేరు. పైన మామూలు మనిషి పత్రిక చదువుతూ నిలబడి ఉంటాడు. ఆ పత్రిక మీద ‘కాంగ్రెస్ నుండి వలసలు’ అని రాసి ఉంటుంది. తలుపు నుండి బయటకు మహాత్మాగాంధీ లాంటివాడు బయటకు వస్తూంటాడు. తలుపులో నుండి ఒక గొంతు వినబడుతుంది. ‘బెంగపడకండి... చాలామంది గతంలో కాంగ్రెస్ నుండి వెళ్లిపోయారు’ అని! ఇలా కార్టూన్‌ను చిత్రించడానికి చాలా సమయం పడుతుంది. వ్యంగ్యంతో ఏమీ చేయలేము అని భావంతో నిండి ఉంటుంది. నా మెదడులో పూర్తిగా ఈ ఆలోచన చిత్రరూపం పొందేవరకు పెన్సిల్, కాగితం చేత పట్టను. అప్పుడే కార్టూన్ గీయడం ఆరంభిస్తాను. అంతవరకూ చేయను. ఆలోచన ఒకటి నడవకపోతే, ఇంకొకటి ఆలోచిస్తాను. అలా అశాంతితో ఉంటాను.

మీరు అందర్నీ కార్టూన్ల ద్వారానే వేళాకోళం చేస్తారు, విమర్శిస్తారు. మరి మీలోని కార్టూనిస్టు మిమ్మల్ని ఎప్పుడైనా విమర్శించాడా?
 ఆర్.కె: ప్రతిదాన్నీ, ప్రతివాడినీ నేను విమర్శిస్తాను - నన్ను తప్ప.
   
మీ కార్టూనుని, మీ సంపాదకుడు ఎప్పుడైనా కాదన్నాడా? తిరస్కరించాడా?


ఆర్.కె: ఎవడూ, నా కార్టూన్‌ని ఎడిట్ చేయడు. నాకు ఎడిటర్ లేడు. నేను చిత్రించిన కార్టూన్‌ని మొదట చూసేవాడు నా దగ్గర పనిచేసే వ్యక్తి. నేను ఇచ్చింది తీసుకొని ముద్రణశాఖకు వెళ్తాడు. అక్కడి నుంచి ఆ కార్టూన్ పదకొండు కేంద్రాలకు వెళుతుంది. ఎడిటర్లు, మిగతావాళ్లు తరువాత ప్రింట్‌లో చూస్తారు. అంతే! అమ్మయ్యో! ఎవరో నా కార్టూన్‌ను కాదనడమే!!

(Published in 'Sakshi' daily, 26th Jan 20015, Monday)
......................................

Monday, March 9, 2015

అనేక... కథల ఆసక్తికరమైన మేళవింపు (సినిమా రివ్యూ - అనేకుడు)

చిత్రం - అనేకుడు, తారాగణం - ధనుష్, అమైరా దస్తూర్, ఐశ్వర్యా దేవన్, కార్తీక్, ఆశిష్ విద్యార్థి, కథ - స్క్రీన్‌ప్లే - కె.వి. ఆనంద్, శుభ, మాటలు - శశాంక్ వెన్నెలకంటి, పాటలు - సాహితి, వనమాలి, సంగీతం - హ్యారిస్ జైరాజ్,  స్పెషల్ ఎఫెక్ట్స్ - వి. శ్రీనివాస మోహన్, ఛాయాగ్రహణం - ఓం ప్రకాష్, కూర్పు - ఆంటోనీ, నిర్మాతలు - కల్పాత్తి ఎస్. అఘోరమ్, కల్పాత్తి ఎస్. గణేశ్, కల్పాత్తి ఎస్. సురేశ్, దర్శకత్వం - కె.వి. ఆనంద్
సినిమా రివ్యూ - అనేకుడు

జన్మజన్మల బంధం, పూర్వజన్మ జ్ఞాపకాలు, అప్పుడేం జరిగింది లాంటి అంశాలు ఇన్నేళ్ళ ఆధునిక జీవనం తరువాత కూడా మనిషికి ఆసక్తి కలిగించే విషయాలు. మార్మికతతో కూడిన ఈ విషయాలు ఉత్కంఠ, ఉద్విగ్నత రేపుతాయి కాబట్టి, ఇవాళ్టికీ వాటి గురించి చదవడానికీ, చూడడానికీ ముందుకొస్తారు. వెండితెరపైనా ఇది హిట్ ఫార్ములా అని పాత చిత్రాల కాలం నుంచి నిన్న మొన్నటి ‘మగధీర’ వరకు ప్రతి సినిమా నిరూపిస్తూనే ఉంది. ఆ ఫార్ములాను తీసుకొని, దాని చుట్టూ ఒక కథ కాదు... రెండు మూడు పునర్జన్మల కథలను అల్లుకొని, దాన్ని వర్తమానానికి కలిపితే? అలాంటి ప్రయత్నమే - దర్శకుడు కె.వి. ఆనంద్ చేసిన ‘అనేకుడు’. ప్రేమికుల దినోత్సవ కానుకగా తమిళనాట మొన్న ఫిబ్రవరి 13నే విడుదలైన మాతృక ‘అనేగన్’కు ఇది తెలుగు అనువాద రూపం.

కథ ఏమిటంటే...

వీడియో గేమ్స్ డిజైన్ చేసే ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థలో ఆ గేమ్స్ రూపకల్పన బృందంలో ఒకరిగా పనిచేస్తుంటుంది మధుమిత (అమైరా దస్తూర్). అదే కంపెనీలో కొత్తగా హార్డ్‌వేర్ ఉద్యోగిగా వస్తాడు అశ్విన్ (ధనుష్). తనకూ, అతనికీ మధ్య జన్మజన్మల అనుబంధం ఉందని భావిస్తుంటుంది మధుమిత. అది కేవలం ఊహాజనితమైన భ్రమ అంటూ ఉంటాడు అశ్విన్.

కొత్త గేమింగ్ ప్రాజెక్టుల్ని తొందరగా పూర్తి చేయాలంటూ, తుది గడువు విషయంలో అందరి మీదా ఒత్తిడి పెడుతుంటాడు హీరోయిన్ వాళ్ళ కంపెనీ యజమాని రవికిరణ్ (సీనియర్ నటుడు కార్తీక్). ఒత్తిడిలో ఉన్న మధుమిత సహా అందరికీ డాక్టర్‌తో చికిత్స చేయిస్తుంటాడు. మధుమితకు రెట్రాగ్రెషన్ థెరపీ చేయిస్తూ, ఆమె అనుకుంటున్న పాత జన్మల జ్ఞాపకాలను ఆ డాక్టర్ చెప్పిస్తుంటుంది. పాత జన్మల్లో తాను - అశ్విన్ బర్మాలో ఉన్నామనీ, ఆ పైన వైజాగ్‌లో కాళి - కల్యాణిగా బతికామనీ అంటూ ఉంటుంది హీరోయిన్. ఇంతకీ ఆమె మాటలన్నీ నిజమేనా? భ్రమా? నిజమైతే, వివిధ జన్మల్లో వారిని కలవనివ్వకుండా చేసిందెవరు? లాంటివన్నీ సుదీర్ఘంగా సాగే ఈ రెండుమ్ముప్పావు గంటల సినిమా.

ఎలా చేశారంటే...

మూడు జన్మల కథల మేళవింపుగా సాగే ఈ చిత్రంలో పూర్తిగా పరస్పర విరుద్ధమైన మూడు వేర్వేరు గెటప్పులు, పాత్రల్లో ధనుష్ కనిపిస్తారు, మెప్పిస్తారు. 1960ల నాటి బర్మా కథలో కాందిశీకుడైన భారతీయ కార్మికుడు బుల్లెబ్బాయ్‌గా, 1987 నాటి వైజాగ్ కథలో రౌడీయిజమ్‌కు కూడా సిద్ధపడే చిత్రకారుడైన కాళిగా, వర్తమానంలో అధునాతన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగిగా - మూడు షేడ్స్‌లోనూ పాత్రల్లోకి ఆయన పరకాయ ప్రవేశం చేశారు. అలాగే, బర్మా అమ్మాయి సముద్రగా, అహింసను బోధించే కల్యాణిగా, ఆధునిక మధుమితగా అమైరా దస్తూర్ చూడడానికి బాగున్నారు. పాత జన్మల తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొచ్చీ రాని సమయం లాంటి చోట్ల ఆమె అభినయం బాగుంది.

ఇక, అప్పుడెప్పుడో ‘అభినందన’, ‘ఘర్షణ’ లాంటి చిత్రాల్లో కథానాయకుడిగా, యువ ప్రేమికుడిగా అద్భుతంగా నటించి, అందరి దృష్టినీ ఆకర్షించిన సీనియర్ నటుడు కార్తీక్. ఆ మధ్య కల్యాణరామ్ ‘ఓమ్ -3డి’ చిత్రంలోనూ విలన్ పాత్ర పోషించిన ఆయన ఇప్పుడీ సినిమాలో అలాంటి పాత్రలను తానెంత అద్భుతంగా పండించగలడో నిరూపించారు. ఆయన నుంచి ప్రేక్షకులకు ఇదొక సర్‌ప్రైజ్. పోలీసాఫీసర్‌గా ఆశిష్ విద్యార్థి, నేటి సుప్రసిద్ధ తమిళ చిత్రకారుడు మణియన్ సెల్వమ్ (మ.సె) బొమ్మలతో తెరపై చిత్రకారుడి పాత్రలో నటించిన ‘తలైవాసల్’ విజయ్, తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

హ్యారిస్ జైరాజ్ సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం బాగున్నాయి. సన్నివేశాల్లోని ఉత్కంఠను పెంచడానికి ఆయన రీరికార్డింగ్ ఉపకరించింది. రెండు, మూడు పాటలు కూడా వినాలనిపించేలా ఉన్నాయి. ప్రతి పాటనూ, సన్నివేశాన్నీ కనువిందుగా చూపడంలో ఛాయాగ్రాహక - దర్శకుడు కె.వి. ఆనంద్ ప్రతిభ కనిపించింది. అలాగే, విజువల్ ఎఫెక్ట్‌లు, ఫైట్లు ఆకట్టుకుంటాయి. రాజకుమారుడు, రాజకుమారి, సైన్యాధ్యక్షుడి జన్మ తాలూకు ఎపిసోడ్‌ను చిత్రీకరించి, ఎడిటింగ్‌లో కత్తెర వేశారని అర్థమవుతూ ఉంటుంది. బర్మా ఎపిసోడ్‌తో సహా మరికొన్ని చోట్ల కత్తెరకు ఇంకాస్త పదునుపెట్టినా ఇబ్బందేమీ ఉండేది కాదు.

ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం - ఈ సినిమా డబ్బింగ్ విషయంలో తీసుకున్న శ్రద్ధ. సినిమాలో ఆ యా కథల కాలానికి తగినట్లుగా పత్రికల మీద శీర్షికలు, గోడల మీద వాల్‌పోస్టర్లు లాంటివి తెలుగు వాతావరణానికి తగినట్లు మార్చడం శ్రద్ధకు తార్కాణం. ‘ఆర్.బి.ఎఫ్ (రాయపేట బెనిఫిట్ ఫండ్)’ లాంటి బోర్డుల మీద ‘ఆర్.బి.ఎఫ్’ అని ఉంటూనే పక్కనే ‘మార్గదర్శి చిట్‌ఫండ్’ అని రాయడం లాంటి ఒకటీ అరా నెరుసులున్నా మొత్తం మీద ‘మాయాబజార్’ పోస్టర్ మొదలు ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున లాంటి అప్పటి కాలానికి తగ్గ హీరోల కటౌట్లు ఇది నేరు తెలుగు చిత్రమా అనిపించేలా చేస్తాయి. అలాగే, ధనుష్‌కు (డబ్బింగ్ ఆర్టిస్ట్ వాసు), కార్తీక్‌కు (డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయుపుత్ర నాగార్జున) తెలుగులో చేసిన స్వరదానం ఆకట్టుకుంటుంది.

ఎలా ఉందంటే...

గతంలో తమిళంలో ‘కో’ (తెలుగులో ‘రంగం’) లాంటి హిట్ చిత్రాలు అందించిన ట్రాక్ రికార్డ్ దర్శకుడిగా మారిన ఒకప్పటి న్యూస్ ఫోటోగ్రాఫర్ కె.వి.ఆనంద్‌ది. ఆయన ఈ చిత్రంలోనూ తనదైన మార్కు చూపారు. బర్మా ఎపిసోడ్‌కూ, వర్తమానానికీ మధ్య తిరిగే ఫస్టాఫ్ ఆసక్తికరమైన ఘట్టం వద్ద ముగుస్తుంది. ఇక, ఇంటర్వెల్ తర్వాత వచ్చే వైజాగ్ ఎపిసోడ్ లాంటివి ప్రేమకథకు, క్రైమ్, సస్పెన్స్‌ను బాగా కలిపాయి.

నిజానికి, మునుపటి హాలీవుడ్, తమిళ, తెలుగు చిత్రాల ప్రభావం చాలానే ఉన్న సినిమా ఇది. మన తెరకూ పునర్జన్మ కథలూ కొత్త కాదు. అయితేనేం, ఒకటికి మూడు కథలను మేళవించడంలోనే అసలు నేర్పు అంతా ఉంది. అందమైన ప్రేమ కథలు, వాటిని ఆహ్లాదంగా చూపడం... కీలకమైంది. నిజానికి, మూడు జన్మలు, ఇన్ని పాత్రల మధ్య ఆసక్తికరంగా స్క్రీన్‌ప్లేను అల్లుకోవడం, కథను గందరగోళం లేకుండా ముందుకు నడపడం అంత సులభమేమీ కాదు. ఆ విషయంలో దర్శక, రచయిత విజయం సాధించారు. పైగా, ప్రతి సీన్‌కూ బాగానే హోమ్‌వర్క్ చేసుకున్నారని అర్థమవుతుంటుంది. ఒక్కొక్క కథలో ఒక్కొక్కరు... హీరో - హీరోయిన్ల ప్రేమకు విలన్‌గా మారడంతో, వర్తమాన కథకు ఎవరు ప్రతినాయకుడనే విషయంలో చివరి రీళ్ళ వరకు ఒక చిన్న ఉత్కంఠ ప్రేక్షకులలో కొనసాగుతుంది.

సినిమా పూర్తయ్యేసరికి బోలెడన్ని పాత్రలు, బోలెడంత కాలపు కథ చూసిన భావన కలుగుతుంది. సినిమా నిడివి కూడా అందుకు తగ్గట్లే ఉంది. అయినప్పటికీ, ఆఖరు క్షణం వరకు ప్రేక్షకుడు కూర్చుంటాడు. ఆ మాత్రం కాలక్షేపం అందించే సినిమాలు... అందులోనూ రోజూ చూస్తున్న రొటీన్ చిత్రాలకు భిన్నమైన ప్రయత్నాలు... కరవైపోయిన రోజుల్లో ఏ సినిమాకైనా అంతకు మించి కావాల్సింది ఏముంటుంది! ఇప్పటికే తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అనేకుడు’కు తెలుగులోనూ అది కలిసొస్తుందనడానికి హాలులో కనిపిస్తున్న సూచనలూ అనేకం!

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily website, 6th Mar 2015, Friday)
.......................................

Saturday, March 7, 2015

కాన్సెప్ట్‌ను మింగేసిన కథన లోపాలు (సినిమా రివ్యూ - సూర్య వర్సెస్ సూర్య)

సినిమా రివ్యూ - సూర్య వర్సెస్ సూర్య
చిత్రం - సూర్య వర్సెస్ సూర్య, తారాగణం - నిఖిల్, త్రిధా చౌధరీ, మధుబాల, తనికెళ్ళ భరణి, మాటలు - చందు మొండేటి, సంగీతం - సత్య మహావీర, కూర్పు - గౌతమ్ నెరుసు, నిర్మాత - మల్కాపురం శివకుమార్, రచన - ఛాయాగ్రహణం, దర్శకత్వం - కార్తీక్ ఘట్టమనేని
....................................
కొత్త రకం కథలు రావడం లేదనేది ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు చేసే ఫిర్యాదు. అయితే, ఎంచుకున్న ఇతివృత్తం, తీసుకున్న కథ కొత్తగా ఉంటే చాలా? వాటికి న్యాయం చేకూర్చేలా స్క్రిప్టును తీర్చిదిద్దుకొని, కథనాన్ని నడిపించకపోతే? అప్పుడూ మళ్ళీ నిరాశ తప్పదు. మరి, రొడ్డకొట్టుడు సినిమాలు ఎక్కువగా వస్తున్న సమయంలో ఆ మూసను బద్దలుకొట్టుకొని, ఒక చిన్న వెరైటీ పాయింట్‌తో వచ్చిన సినిమా - ‘సూర్య వర్సెస్ సూర్య’. సూర్యరశ్మి పడని ఒక యువకుడి చుట్టూ తిరుగుతుందీ చిత్రకథ.

 కథ ఏమిటంటే...
అనగనగా ఓ యువకుడు. పేరు సూర్య (నిఖిల్). కానీ, అతనికో విచిత్రమైన జబ్బు. సూర్యరశ్మి కాసేపు తగిలినా అతని ఒళ్ళు కాలిపోతుంది. ప్రాణాంతకమవుతుంది. శాస్త్రీయంగా ఆ జబ్బు పేరు మాటెలా ఉన్నా, అతని చిన్నప్పుడే ఆ సంగతి డాక్టర్ (రావు రమేశ్) ద్వారా తెలుసుకుంటుంది ధనికురాలైన అతని తల్లి (మణిరత్నం ‘రోజా’ ఫేమ్ మధుబాల). అప్పటి నుంచి పగటి పూట అతణ్ణి బయటకు పంపకుండా, ఇంట్లోనే పెంచుతుంది. సూర్యుణ్ణి చూడకుండా పెరిగే సూర్య జీవితమంతా సాయంత్రం 6.30 గంటల నుంచి తెల్లవారే ముందు దాకానే! అలాంటి సూర్య కాస్తా చదువు కోసం ఒక రాత్రిపూట కళాశాలలో చేరతాడు.
లేటు వయసులో చదువు కోసం కాలేజీలో చేరిన కిరాణాషాపు యజమాని ఎర్రిసామి అలియాస్ ఎర్‌శామ్ (తనికెళ్ళ భరణి), ఆటో డ్రైవర్ అరుణ్‌సాయి (సత్య అక్కల) అక్కడ హీరోకు పరిచయమవుతారు. వాళ్ళతో స్నేహం పెరిగిన హీరో, రెండేళ్ళుగా తాను ప్రేమిస్తున్న టీవీ యాంకర్ సంజన (త్రిధా చౌధరీ) ప్రేమ గెలుచుకోవడానికి వాళ్ళ సాయం తీసుకుంటాడు. తన జబ్బు సంగతి మిత్రుల ద్వారానే ఆమెకు తెలియజేస్తాడు. దాంతో, ఆమె, జర్నలిస్టయిన ఆమె తండ్రి (సాయాజీ షిండే) కోపగిస్తారు. హీరోను దూరం పెడతారు. ఆ పరిస్థితుల్లో ప్రేమను గెలుచుకోవడానికి సూర్య ఏం చేశాడు? ఏమైందన్నది మిగతా కథ.

 ఎలా చేశారంటే...
గతంలో ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ లాంటి విజయవంతమైన చిత్రాల రూపకల్పనకు కలసి కృషి చేసిన యువ బృందం మరోసారి చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఆ రెండు వరుస హిట్ల తరువాత ఇందులో సూర్య పాత్రలో నిఖిల్ ఎండ వేడిమికి తట్టుకోలేని వ్యాధి తాలూకు బాధను వ్యక్తం చేయడానికి ప్రయత్నించారు. తరచూ హుషారు పాత్రల్లోనే చూసే అతణ్ణి ఇలా చూడడం ప్రేక్షకులకు వెంటనే జీర్ణం కాదు. కథానాయికగా విభా నుంచి అందం, అభినయాలు ఆశించలేం.
తల్లి పాత్రధారిణి మధుబాల మంచి నటి అయినా, అతిగా సన్నబడి, హీరో పాత్రకు కాదు... తల్లి పాత్రకే అనారోగ్యమేమో అనిపించేలా ఉండడం మైనస్. ఆ బలహీనతకు సన్నివేశాల్లోని బలహీనత తోడైంది. చాలాకాలం తరువాత తనికెళ్ళ భరణి ఒక పూర్తి నిడివి పాత్రలో సినిమా అంతా కనిపించారు. కొన్నిచోట్ల నటనలో తనదైన చమక్కులు చూపించారు. ఆటో డ్రైవర్ పాత్రధారి కూడా కాసేపు నవ్వించారు.
   
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, ఛాయాగ్రహణం నుంచి దర్శకత్వానికి ఓ మెట్టు ఎదిగిన కార్తీక్ ఘట్టమనేని తన మునుపటి చిత్రాల కెమేరా వర్క్‌కు తక్కువ కాకుండా ఈ సినిమాను నడిపించారు. దృశ్యపరమైన అందం, లైటింగ్ తెలుస్తూ ఉంటాయి. అది సినిమాకు కొంత ప్లస్ పాయింట్. పాటలు, సంగీతం ఫరవాలేదనిపిస్తాయి. కాకపోతే, పదే పదే వినడానికీ, ప్రేక్షకులను రప్పించడానికీ దోహదపడతాయా అన్నది సందేహం. ఫస్టాఫ్‌లో వచ్చే ‘హృదయం పరిగెడుతోందే...’ అనే గజల్ తరహా గీతంలో హార్మోనియమ్ ముందేసుకొని, పాట పాడుతూ గీత రచయిత రామజోగయ్యశాస్త్రి క్షణకాలం తళుక్కుమంటారు. సన్నివేశాలు, సంభాషణల రచనలో లేని పదునును ఎడిటింగ్ దగ్గర ఆశించలేం.

ఎలా ఉందంటే...
నటీనటులు తక్కువే అయినా, నైట్ ఎఫెక్ట్‌ల మధ్య నిర్మాణ విలువలు బాగానే అనిపించే సినిమా ఇది. ఎటొచ్చీ స్క్రిప్టును అల్లుకున్న తీరులో, కథను నడిపించిన తీరులో తడబాట్లు ఉన్నాయి. దర్శకుడు కొత్తవాడు కావడమూ కొంత కారణమేమో అనిపిస్తుంది. నిజానికి, ఫస్టాఫ్ మొత్తం ఫ్లాష్‌బ్యాక్‌లో హీరో తన ప్రేమ, ఆ ప్రేమను పొందడానికి పడే తపనతో సరిపోతుంది. ఎండ ఉండగా బయటకు రాలేని హీరో, ఆ సంగతి బయటపెట్టకుండానే, కష్టంలో ఉన్న హీరోయిన్‌ను కాపాడే సీన్ దగ్గర ఇంటర్వెల్ కార్డు పడుతుంది.
ఫస్టాఫ్ కాస్తంత అటూ ఇటూగా ఉన్నా, బలమైన ఇంటర్వెల్ ఘట్టం లాంటివి తోడై ఫరవాలేదనిపిస్తుంది. తీరా సెకండాఫ్‌లో హీరోయిన్‌కు ఆ విషయాన్ని ఎలా తెలియజేశాడు, వాళ్ళకు ఎలాంటి కష్టాలు వచ్చాయి లాంటివి ఏమైనా చూపిస్తారేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తాం. కానీ, కథ అక్కడ గాడి తప్పినట్లనిపిస్తుంది. మామూలు ప్రేమ కథలాగే కొనసాగుతుంది. హీరోయిన్, ఆమె తండ్రి కలసి హీరోను ఎందుకు కాదన్నారు, చివరకు ఎందుకు సరే అన్నారన్నదానికీ బలమైన కారణం కనిపించదు.
జనం లేని దీవి లాంటి చోట హీరో కథ, అక్కడ పడవ దొరకడం, టీవీ చానల్‌లో హీరో బృందం ప్రత్యక్ష ప్రసారం లాంటివన్నీ కథను ముందుకు నడపడం కోసం సినిమాటిక్‌గా బలవంతాన అల్లుకున్నట్లనిపిస్తాయి. అలా కాకుండా, కథలో సహజమైన పురోగతి ఉండేలా చూసుకుంటే బాగుండేది.

నిజానికి, తల్లీ కొడుకుల అనుబంధం, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు అతని జబ్బు అనుకోని ఇబ్బందులు తేవడం, పగటి వేళ తప్పనిసరైన బయటకు రావాల్సి వచ్చిన హీరో దాన్ని తెలివిగా తప్పించుకొనే వైనం - ఇలా ఎన్నెన్నో అంశాలతో ఈ కాన్సెప్ట్‌ను మరింత బలంగా తీర్చిదిద్దుకొనే అవకాశం ఉంది. కానీ, దర్శక, రచయిత ఎందుకనో బంగారం లాంటి ఆ అవకాశాన్ని వదులుకున్నారు. బలహీనమైన సన్నివేశాలు, అనాసక్తికరమైన స్క్రీన్‌ప్లేతోనే సినిమా అయిందనిపించారు. వెరసి ఈ సినిమా కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకున్న చిత్రంగా గుర్తున్నా... చివరకు మంచి కాన్సెప్ట్ వర్సెస్ బలహీనమైన కథాకథనంగానే మిగిలిపోతుంది.

 - రెంటాల జయదేవ

..................................

రజనీకాంతరావుగారు అనుమతి తెప్పించారు... - వేటూరి

- వేటూరి సుందరరామమూర్తి, సినీ కవి - రచయిత

అనుమతి తెప్పించారు...


 ఆకాశవాణి పత్రిక ‘వాణి’లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల ప్రకటన చూసి 1969లో ఒకనాడు రేడియో స్టేషనుకు వెళ్ళి రజనీ కాంతరావు గారిని కలిశాను. ‘‘ఈ ఉద్యోగాలు నీకెందుకయ్యా! మంచి సంగీత నాటిక రాసి యివ్వు ప్రసారం చేద్దాం’’ అన్నారాయన. ఎన్నాళ్ళనుంచో ఈ ‘సిరికాకొలను చిన్నది’ అంతరంగ స్థలం మీద అప్పటికే గజ్జెకట్టి ఆడుతూ వుండేది. ...రజనీకాంతరావుగారి మాటతో, మా తండ్రిగారి (డాక్టర్ వేటూరి చంద్రశేఖరశాస్త్రిగారు) ఆజ్ఞతో వెంటనే మద్రాసు వెళ్లి రాత్రింబవళ్లు రాసి ఈ అందాలరాశిని నేను తొలిసారిగా అక్షరాలా చూసుకున్నా.

  పద్యాలు, పదాలు, పాటలూ, గద్యాలూ, పలు విన్యాసాలు! రేడియో నాటిక కదా అని చాలా కుదించాను. అంతకుముందు రూపకరచనలో చేయి తిరిగినవాడను కాను. రాగతాళాలకు, స్వరకల్పనకు సరితూగుతుందో లేదో అని సందేహం వచ్చింది. వెంటనే సుప్రసిద్ధ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావుగారికి ఈ కాగితాలన్నీ యిచ్చి నా సందేహం చెప్పాను. రెండు గంటలు వంచిన తల యెత్తకుండా ఆయన నాటిక అంతా చదివి, ‘‘దీనికి సంగీతం నేనే చేస్తాను’’ అంటూ రజనీగారికి ఫోను చేశారు. ‘‘మీరు చేస్తే అంతకన్నా కావలసిందేముంది. అయితే ఆ స్క్రిప్టు ఇంతవరకు నేను చూడలేదు.

  అది వెంటనే పంపమనండి’’ అన్నారు రజనీగారు. అటు తరువాత రజనీగారి సూచనల మేరకు దానిని మరింత తగ్గిస్తే ఒకటిన్నర గంటల నాటికి అయింది. అప్పటికి గంటకుమించి ‘ఆకాశవాణి’ రూపకాలు లేవు. కానీ సాహితీ సంగీత పక్షపాతులు, స్వయంగా కవీ, సాహితీవ్రతులూ అయిన రజనీగారు ‘సిరికాకొలను చిన్నది’ సంగీత నాటికను గంటన్నర కార్యక్రమంగా ప్రత్యేక అనుమతి పైనుంచి తెప్పించి మరీ ప్రసారం చేశారు.

 (స్వర్గీయ వేటూరి రచన ‘సిరికాకొలను చిన్నది’ నుంచి...)

(Published in 'Sakshi' daily, 29th Jan 2015, Thursday)
........................

Friday, March 6, 2015

ఇప్పటికీ నాతో ఆ పాట పాడించుకుంటూ ఉంటారు! - రావు బాలసరస్వతి

ఇప్పటికీ నాతో ఆ పాట పాడించుకుంటూ ఉంటారు!
   రజనీకాంతరావు గారి పేరు చెప్పగానే సినిమాల్లో, రేడియోలో ఆయన చేసిన కృషి, ఆయన రచనలు, నేను పాడిన పాటలు అన్నీ గుర్తుకువస్తాయి. ఇప్పటికి 75 ఏళ్ళ క్రితం నుంచి ఆయన మాట, పాట - అన్నీ పరిచయమే. నా కన్నా ఆయన ఎనిమిదిన్నరేళ్ళు పెద్ద. ఆ రోజుల్లో ఆయన సంగీతం కూర్చిన సినిమాల్లో నేను పాడింది తక్కువే అయినా, ఆ పాటలకు మంచి పేరు రావడం ఇప్పటికీ సంతోషం అనిపిస్తుంటుంది. ప్రసిద్ధ దర్శక - నిర్మాత వై.వి. రావు ‘మానవతి’ చిత్రానికి రజని సంగీత దర్శకుడు. ఆయన స్వీయ సాహిత్య, సంగీతాల్లో ఆ సినిమాకు తయారైన పాటల్లో నేను పాడిన ‘తన పంతమె తావిడువడు...’ ఇవాళ్టికీ ఆ తరం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు.

 ఆ పాటకు రజనీ బాగా వరుస కట్టారనీ, నేను బాగా పాడాననీ పేరొచ్చింది. తరువాత గోపీచంద్ దర్శక త్వంలో జగ్గయ్యతో రూపొందిన ‘ప్రియురాలు’ చిత్రానికీ రజని సంగీత దర్శకులు. దానికి ఆయన చేసిన వరుసల్లో నేనూ పాడాను. అయితే, రజనీ గారు సినిమాల్లో స్థిరపడలేదు. ఆకాశవాణిలో ఆయన సంగీత, సాహిత్య ప్రాభవం ఎక్కువగా బయటకు వచ్చింది. ఆయన రేడియో కోసం రాసి, బాణీ కట్టిన పాటలు కూడా పాడాను. ఆ రోజుల్లో సాలూరి రాజేశ్వరరావు గారు, నేను కలసి చాలా లలిత గీతాలు పాడేవాళ్ళం.

 రజని రాసిన ‘కోపమేల రాధ... దయ చూపవేల నాపై...’ పాట కూడా రాజేశ్వరరావు, నేను పాడితే రికార్డుగా వచ్చింది. దానికి, రాజేశ్వరరావు సంగీతం కూర్చారు. వ్యక్తిగతంగానూ రజని చాలా నెమ్మదైన వ్యక్తి. మంచి మనిషి. ఎంతో ప్రతిభ ఉన్నా, దాన్ని తలకెక్కిం చుకోని మనిషి. గాయకులకు చక్కగా పాట నేర్పేవారు. రచయిత, సంగీత దర్శకుడే కాక గాయకుడు కూడా కావడం ఆయనలోని మరో పెద్ద ప్లస్ పాయింట్. పాట నేర్పేటప్పుడు తానే పాడి వినిపిస్తారు. గాయకులు తమ గాత్రధర్మా నికి తగ్గట్లుగా స్థాయిని మార్చు కొని, పాటను అనువుగా మలుచుకొని పాడినా ఏమీ అనేవారు కాదు.

 ఆకాశవాణి స్టేషన్ డెరైక్టరైన రజని విజయవాడలోనూ, రిటైర్మెంట్‌కు ముందు బెంగుళూరులోనూ ఉన్న ప్పుడు  నన్ను ప్రత్యేకించి అక్కడకు పిలిపించి మరీ, లలితగీతాలు పాడించారు. అది ఆయన మంచితనం. ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం కూడా ఆయన రచించి, ట్యూన్ చేసిన ‘విరహా నలంపు బాధ భరియింప లేదు రాధ’ అన్న గీతాన్ని ‘ఈ మాసపు పాట’గా రేడియో కోసం పాడా. రచన, బాణీ ఆయనదే అయినా, నా గాత్రధర్మానికి తగ్గట్లుగా కొద్దిగా మార్చుకొన్నా. ఆయన కోపగించకపోగా, ప్రోత్సహించారు. ఇప్పటికీ ఆయన దగ్గరకు ఎప్పుడు వెళ్ళినా, నాతో ఆ పాట పాడించు కొంటారు. సాహిత్య, సంగీత జీవులకు అంతకన్నా ఆనందం ఏముంటుంది!
- రావు బాలసరస్వతి, తొలితరం సినీ, లలిత సంగీత గాయని - నటి

- Interview by Rentala Jayadeva

(Published in 'Sakshi' daily, 29th Jan 2015, Thursday)
...................................

లక్ష్మమ్మలో ఆ పాట నాకు బాగా ఇష్టం! - సి. కృష్ణవేణి, సీనియర్ నటి, గాయని, నిర్మాత

- సి. కృష్ణవేణి, సీనియర్ నటి, గాయని, నిర్మాత

లక్ష్మమ్మలో ఆ పాట నాకు బాగా ఇష్టం!

  బాలాంత్రపు రజనీకాంతరావు గారు అటు సంగీతంలోనూ, ఇటు సాహిత్యంలోనూ పరిజ్ఞానం ఉన్న అరుదైన ప్రతిభావంతులు. చక్కటి స్వరకర్తే కాక, మంచి కవి, గాయకుడు కూడా! నేను సినిమాల్లో నటిస్తూ, మీర్జాపురం రాజా వారు శోభనాచల పతాకంపై సినిమాలు తీస్తూ ఉన్న సమయంలోనే ఆయన సినిమాల్లో గీత రచన, సంగీతం ప్రారంభించారు. అప్పటికే ఆయన ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నారనుకుంటా. అందుకే, టైటిల్స్‌లో వేరే పేరు వేసేవారు. రజని రాసి, వరుస కట్టగా ‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహోహో పావురమా...’ పాట అందరికీ తెలిసిందే. ఇక ఎల్వీ ప్రసాద్, భానుమతి నటించిన ‘గృహప్రవేశం’ చిత్రానికైతే పాటలు, సంగీతం పూర్తిగా ఆయనవే. నా చిత్రాల్లో రజనీ గారి సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే ప్రధానంగా చెప్పుకోవలసిన చిత్రాలు ‘లక్ష్మమ్మ’, ‘పేరంటాలు’.

 లక్ష్మమ్మ’ చిత్ర నిర్మాణం ఒక పెద్ద కథ. రజనీకాంతరావు, రచయిత-దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ చాలా సన్నిహితులు. గోపీచంద్ గారు ‘లక్ష్మమ్మ’ స్క్రిప్టు మాత్రమే కాకుండా, పాటలు-వాటి వరుసలు కూడా అన్నీ సిద్ధం చేసుకొని, మద్రాసులో మా బంగళాకు వచ్చారు. స్క్రిప్టు, పాటలు వినిపించారు. పాటలు, వరుసలు - రజనీకాంతరావు గారివి. ఆ లక్ష్మమ్మ పాత్రకు నేను బాగుంటాననీ, నన్ను చేయమనీ గోపీచంద్ అడిగారు. అలాగే అనుకున్నాం. తరువాత చాలా కథ జరిగి, పలువురి చేతులు మారినా, చివరకు ప్రాజెక్ట్ నా దగ్గరకే వచ్చింది. చిత్ర నిర్మాణమూ మేమే చేపట్టాం. తీరా అదే సమయంలో జనబాహుళ్యంలో బాగా ప్రచారంలో ఉన్న నిజజీవిత కథ అయిన లక్ష్మమ్మ కథతోనే, అక్కినేని, అంజలీదేవి హీరో హీరోయిన్లుగా నిర్మించ తలపెట్టారు. మా ‘లక్ష్మమ్మ’, వాళ్ళ ‘లక్ష్మమ్మ కథ’ ఒకే రోజు షూటింగ్ మొదలై, అనేక సంచలనాల మధ్య ఒకే రోజు విడుదలయ్యాయి. మాది హిట్టయ్యింది.

 ‘లక్ష్మమ్మ’ పాటలు రజనీ రాసి, వరసలు కట్టినా, వాటిని సినిమాకు తగ్గట్లుగా రికార్డింగ్ చేసింది ఘంటసాల. అందుకే, టైటిల్స్‌లో సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరే ఉంటుంది. రజనీ గారి సాహిత్యం ఎంత సులభంగా, సహజంగా ఉంటుందంటే... ‘లక్ష్మమ్మ’లో పాటలన్నీ చాలా బాగుంటాయి. ముఖ్యంగా, లక్ష్మమ్మ పాత్ర అత్తవారింటికి పల్లకీలో వెళ్ళే సందర్భంలో వచ్చే ‘చిన్ననాటి స్వప్నసీమ... కన్న ఊరు విడువలేము...’ పాట నాకు మరీ మరీ ఇష్టం. ఆయన వరుసల్లో నా పాటలన్నీ నేనే పాడుకున్నా. అలాగే, ఆ తరువాత విజయలక్ష్మీ బ్యానర్‌పై మేమే నిర్మించిన ‘పేరంటాలు’కు కూడా గోపీచంద్ దర్శకుడు. రజనీ పాటలు రాశారు. అందులోనూ పాటలు పాడాను. ఇప్పుడు ఆ సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే, కాలం వెనక్కి వెళ్ళినట్లుంది.

-Interview by Rentala Jayadeva

(Published in 'Sakshi' daily, 29th Jan 2015, Thursday)
............................