జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, February 29, 2012

వ్యంగ్యభరిత హాస్యానికి వజ్రోత్సవ చిరునామా 'పెళ్ళి చేసి చూడు'














ఏ సినిమా అయినా సాధారణ స్థాయిలో విజయవంతమైందంటే, దానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ, ఓ సినిమా అఖండ విజయం సాధించిందంటే, దానికి ప్రధాన కారణం మాత్రం ఒకటే. అప్పటి దాకా ఉన్న మూసను ఛేదించి, కొత్త పంథా తొక్కడం. ఆంతకు మునుపు వచ్చిన చిత్రాలకు భిన్నమైన దోవలో నడక సాగించడం. సరిగ్గా ఇవాళ్టికి 60 ఏళ్ళ క్రితం వచ్చిన 'పెళ్ళి చేసి చూడు' చిత్రం చేసినది అదే. ఇన్నేళ్ళ తరువాత కూడా ఆ సినిమా గుర్తున్నదీ, ఇవాళ్టికీ దాన్ని గుర్తు చేసుకుంటున్నదీ అందుకే.

నాలుగేళ్ళకు ఒకసారి మాత్రమే ఫిబ్రవరిలో 29 రోజులుండే లీపు సంవత్సరంలో 'పెళ్ళి చేసి చూడు' విడుదలైంది. విజయవాడలోని శ్రీదుర్గాకళా మందిరంలో ఈ హాస్యరసభరిత చిత్రం ఏకంగా 182 రోజులు ఆడింది. ఇంకా చెప్పాలంటే, ఆ దశకంలో 'పాతాళ భైరవి' తరువాత అతి పెద్ద ఘన విజయం సాధించిన చిత్రం ఇదే. 1952లో ఫిబ్రవరి 29న విడుదలైన ఈ చిత్రం అలా తెలుగు గడ్డ మీద రజతోత్సవం జరుపుకొన్న తొలి సాంఘిక చిత్రంగా రికార్డు సృష్టించింది.

మూసను బద్దలు కొట్టి, మరెందరికో స్ఫూర్తి

తొలి పూర్తి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' విడుదలయ్యాక సరిగ్గా 20 ఏళ్ళకు వచ్చిన చిత్రం -'పెళ్ళి చేసి చూడు'. నిజానికి, 'పెళ్ళి చేసి చూడు' కన్నా ముందే గణనీయమైన సంఖ్యలో సాంఘికాలు వచ్చాయి. వాటిలో 'బారిస్టర్ పార్వతీశం', 'బోండాం పెళ్ళి', 'భలే పెళ్ళి' లాంటి కొన్ని హాస్యరస చిత్రాలూ ఉన్నాయి. కానీ, అంతకు మునుపటి సాంఘిక చిత్రాల్లో కథానాయక పాత్రలు ఎక్కువ భాగం కొంత పెద్ద వయసువి. పెళ్ళాం, పిల్లలతో, కుటుంబంలోని రకరకాల జంఝాటాలతో సతమతమవుతూ ఉండేవి. కొండకచో, విషయలోలత, స్వార్థపరత్వం లాంటి అవలక్షణాలూ ఉండేవి. మానసిక దౌర్బల్యంతో బాధపడుతుండేవి. అలా ప్రధానంగా కొంత మేర నెగటివ్ క్యారెక్టరైజేషన్ తో నాయక పాత్రలు ఉండేవి.

సరిగ్గా ఆ మూసను బద్దలుకొట్టి, కొత్త పుంత తొక్కడం 'పెళ్ళి చేసి చూడు'లోని ప్రత్యేకత. ఇందులో హీరోది పాజిటివ్ క్యారెక్టరైజేషన్. అనుకున్నది చేయడానికి అవసరమైతే అబద్ధమాడి, అన్ని రకాల సాహసాలూ చేయడానికి తెగించే ధీరుడు. ముఖ్యంగా బామ్మ గారి, తాత గారి భావాలకు ఎదురొడ్డే యోధుడు. యువతరం భావావేశాలకు సరైన సైదోడు. పెళ్ళి కావాల్సిన నవ యువకుడు. వరకట్నం లాంటి దురాచారాలను ఎదిరించే కుర్రవాడు. ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్ళి చేసుకొని, వంద అబద్ధాలైనా ఆడి, ఆఖరికి ఇంట్లో వాళ్ళను కూడా ఒప్పించే నవతరం ప్రతినిధి. అందుకే, 'పెళ్ళి చేసి చూడు'లో ఎన్టీయార్ పోషించిన వెంకట రమణ పాత్రలో అప్పటి కుర్రకారు తమను చూసుకుంది. వయసు మీద పడ్డ పెద్ద తరం చిన్న వయసులో ధైర్యం చాలక తాము చేయని పనిని తెరపై హీరో చేసి చూపిస్తే, చప్పట్లు కొట్టింది.

కేవలం హాస్యరస భరితంగానే మిగిలిపోకుండా, దానికి వ్యంగ్యాన్ని మిళాయించడం ఈ సినీ వంటకానికి గుబాళింపు తెచ్చిన తాళింపు. సెటైర్ తో కలగలిసిన హాస్యరసభరిత చిత్రంగా 'పెళ్ళి చేసి చూడు' నూటికి నూటయాభై మార్కులు తెచ్చుకుంది. తెలుగు తెరకు అప్పట్లో కొత్తగా తోచిన ఆ రకం హాస్యానికి తరతరాలకూ తరగని స్ఫూర్తిగా నిలిచింది. 'పెళ్ళి చేసి చూడు' ప్రత్యేకత అది.

పాటలు, పిల్లల తీపి చేష్టలు

ఆణిముత్యాల లాంటి చిత్రాలెన్నిటినో అందించిన విజయా సంస్థ వారి కానుకే ఈ 'పెళ్ళి చేసి చూడు' కూడా. ఎన్టీయార్, ఈ సినిమాలో హాస్యం, పాత్రధారుల అభినయానికి తోడు పాటలు, సంగీతం చిత్ర విజయానికి కీలకమయ్యాయి. 'ఓ భావిభారత భాగ్య విధాతలారా...' అంటూ మొదలై, 'పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని....' అంటూ సాగే పింగళి నాగేంద్రరావు రచన, ఘంటసాల మార్కు స్వరాలాపనలతో ఆ పాట ఇవాళ్టికీ నిత్య నూతనం. పెళ్ళీడు కొచ్చిన కుర్రకారుకు తారక మంత్రం. అలాగే, బాల నటులైన మాస్టర్ కుందు (గాదె రామకృష్ణారావు) తదితరుల మీద వచ్చే 'అమ్మా నొప్పులే... అమ్మమ్మా నొప్పులే...' అనే ఊటుకూరి సత్యనారాయణ రచన ఒక తరంలో పిల్లలకూ, పెద్దలకూ పెద్ద ఫేవరెట్ గీతం. బడికి వెళ్ళమనగానే కడుపు నొప్పి అని మారాం చేసే పిల్లలు, ఇంట్లో గారెలు వండామనగానే నొప్పి పోయి, ఆకలి అని చెప్పడం లాంటివి మన నిజ జీవితాల్లో నుంచి తెర మీదకు నడిచొచ్చిన సన్నివేశాలే. ఆబాలగోపాలం తెర మీది పాత్రల్లో తమను తాము చూసుకోవడానికి అంతకు మించి ఇంకేం కావాలి. సినిమాలోని మొత్తం 17 పాటల్లో 'రాధనురా...', 'ఎవడొస్తాడో చూస్తాగా...', 'చిట్టీ భయమెందుకే...' లాంటి చాలా పాటలు జనానికి ఇవాళ్టికీ గుర్తే.

ఎన్టీయార్, కథానాయిక జి. వరలక్ష్మి, ఎస్వీయార్ లాంటి చేయి తిరిగిన నటీనటుల మాట చెప్పనక్కర లేదు. కానీ, 'రేడియో బాలన్నయ్య'గా ప్రసిద్ధులైన న్యాయపతి రాఘవరావు శిక్షణలోని 'బాలానంద' సంఘం పిల్లలు కెమేరా ముందు నటిస్తున్నట్లు కాకుండా, సహజంగా ప్రవర్తించడం, ముఖ్యంగా సిసింద్రీ పాత్రలో మాస్టర్ కుందు అభినయం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఆ సినిమా బాల నటీనటుల్లో ఒకరైన మాస్టర్ మోహన్ (అమ్మా నొప్పులే... అంటూ పాటలో అభినయించే అబ్బాయి) ఇవాళ మనకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నత బాధ్యతలు నిర్వహించిన ఐ.ఏ.ఎస్. అధికారి కందా మోహన్ అంటే, ఒకింత ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి.

తెలుగు సినీ ఫార్ములాల్లో చక్రపాణీయం

అంతకు ముందు 'ధర్మపత్ని' (1941)తో మాటల రచయితగా మొదలై, 'స్వర్గసీమ' (1945) కథా రచయితగా ఎదిగి, 'షావుకారు' (1950)కు కథ, సంభాషణలూ రెండూ తానే అందించిన చక్రపాణి అదే వరుసలో కథ, కథనం, సంభాషణలు అందించిన సినిమా ఇది. ఇందులో చక్రపాణి మార్కు హాస్యం, సమకాలీన సామాజిక పరిస్థితులపై చురకలు చోటుచేసుకున్నాయి. విజయా సంస్థపై నాగిరెడ్డి - చక్రపాణి సంయుక్తంగా అందించిన చాలా భాగం చిత్రాల్లో ఇవి తప్పనిసరి దినుసులు. 'పెళ్ళి చేసి చూడు'తో సహా ఆ చిత్రాలు ఇవాళ్టికీ ఎవర్ గ్రీన్ గా మిగలడానికీ, తరువాతి తరాల దర్శక - నిర్మాతలకు పాఠ్యగ్రంథాలుగా మారడానికీ అది ఓ ముఖ్య కారణం. గమనిస్తే, విజయా వారి చిత్రాలైన ఆ తరువాతి 'మిస్సమ్మ', 'అప్పు చేసి పప్పు కూడు' మొదలు ఇటీవలి జంధ్యాల మార్కు సినిమాల దాకా ఈ వ్యంగ్యభరితమైన హాస్య రస పూరిత కథలు చాలానే వచ్చాయి. జనానికి నచ్చాయి. 'నేను దర్శకుడిగా హాస్యరసభరిత చిత్రాల తీయడానికి విజయా వారి చిత్రాలే కారణమ'ని సాక్షాత్తూ జంధ్యాలే ఓ సందర్భంలో చెప్పారంటే, ఆ తరహా చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ గా 'పెళ్ళి చేసి చూడు' ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు.

సావిత్రికి గుర్తింపు

ఇక, 'గృహప్రవేశం' రోజుల నుంచి ఇలాంటి ఘట్టాలను తెర కెక్కించడంలో అనుభవమున్న దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ 'షావుకారు' తరువాత 'పెళ్ళి చేసి చూడు' మీదుగా 'మిస్సమ్మ'కు వచ్చేసరికి హాస్యరస పరిపోషణలో చేయి తిరిగిన నిర్దేశకుడు కావడం కూడా గమనించదగ్గ విషయం. హీరోయిన్ గా ఎదగడానికి ముందు అభినేత్రి సావిత్రి కాస్తంత గుర్తుపెట్టుకొనే పాత్ర వేసింది కూడా తొలిసారిగా 'పెళ్ళి చేసి చూడు'లోనే. 'సంసారం'లో కథానాయిక స్నేహితుల్లో ఒకరైన జూనియర్ ఆర్టిస్టుగా తెరపై తళుక్కున మెరిసి మాయమైన ఆమె 'పాతాళ భైరవి'లో డ్యాన్సర్ గా, 'రూపవతి'లో వ్యాంప్ తరహా పాత్రలోనే కనిపించారు. తొలిసారిగా 'పెళ్ళి చేసి చూడు'లో నటుడు యండమూరి జోగారావుకు జోడీగా, సహాయక పాత్రకు ఎదిగారు. ఆ సినిమా తరువాతే సావిత్రి 'పల్లెటూరు'లో ఎన్టీయార్ సరసన నాయిక అయ్యారు. ఆ పైన 'దేవదాసు'తో తిరుగులేని నటి అనిపించుకున్నారు.

గమ్మత్తేమిటంటే, 'పెళ్ళి చేసి చూడు' అంత హిట్టయినా, ఎన్టీయార్ సరసన నాయికగా నటించిన జి. వరలక్ష్మి ఆ తరువాత ఆయన పక్కన రెండు మూడు సినిమాల్లో మాత్రమే నాయికగా, అదీ పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో కనిపించడం. ఆ తరువాత కాలంలో జి. వరలక్ష్మి తల్లిగా నటిస్తే, ఆమెకు కొడుకుగా ఎన్టీయార్ పాత్ర పోషణ చేయడం తెలుగు సినిమాల్లో కనిపించే హీరో డామినేషన్ కూ, ఎన్టీయార్ లాంటి ఆ తరం నటీనటుల సుదీర్ఘమైన హీరో ఇన్నింగ్స్ కూ ప్రతీకలు.

విజయ గాథ

'పెళ్ళి చేసి చూడు' చిత్రకథ తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇదే హీరో హీరోయిన్లతో ఏకకాలంలో నిర్మాణమైంది. తెలుగు వెర్షన్ వచ్చి విజయవంతమయ్యాక, కాస్త ఆలస్యంగా 1952 ఆగస్టు 15న 'కల్యాణం పణ్ణి పారు'గా ఆ తమిళ రూపం విడుదలైంది. ఆ తమిళ చిత్రంలో మాత్రం ఓ పాటను రంగుల్లో చిత్రీకరించారట. అప్పట్లో అదో పెద్ద విశేషం. తమిళంలోనూ సినిమా హిట్టే. అప్పట్లోనే విజయా వారే ఈ చిత్రాన్ని హిందీలోనూ తీద్దామనుకున్నా కుదరలేదు. ఆఖరికి ఇరవై ఏళ్ళ తరువాత 1972లో దర్శక - నిర్మాత ఎల్వీ ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో 'షాదీ కే బాద్'గా ఈ కథను హిందీలో నిర్మించారు. కానీ, స్క్రిప్టులో చేసిన మార్పులు, బాల నటీనటుల పాత్రల ప్రాధాన్యం మాతృకలో కన్నా తగ్గడం లాంటి అనేక కారణాలతో సినిమా ఆడలేదు.

తెలుగు 'పెళ్ళి చేసి చూడు' వాణిజ్య విజయానికి వస్తే, తొలివిడతలో 15 కేంద్రాల్లో విడుదలై, 11 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. ఆలస్యంగా మలి విడతలో విడుదలైన కేంద్రాలను కూడా కలుపుకొంటే, మొత్తం 26 కేంద్రాల్లో నూరు రోజులు ఆడింది. విజయవాడలో రజతోత్సవం సరేసరి. నిజానికి, ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలోనే ఎన్టీయార్, ఏయన్నార్ నటించిన సాంఘిక చిత్రం 'సంసారం' (1950) కూడా రజతోత్సవ చిత్రంగా పేరు తెచ్చుకుంది. కాకపోతే, ఆ సినిమా ఆడింది 170 రోజులు. అదీ మద్రాసులోని పల్లవరంలోని జనతా థియేటర్ లో. పూర్తిగా మన తెలుగు గడ్డ మీదకు వస్తే, తొలి తెలుగు సాంఘిక రజతోత్సవ చిత్రంగా విజయవాడ దుర్గాకళామందిరంలో 182 రోజులు ఏకధాటిగా వీరవిహారం చేసిన 'పెళ్ళి చేసి చూడు' నిలుస్తుంది. పంచదార గుళిక లాంటి హాస్యం, చురుక్కున తగిలీ తగలని వ్యంగ్యం, మాటల్లో కాకుండా పాత్రల ప్రవర్తనల్లో కలగలసిపోయిన సందేశం - ఇవన్నీ 'పెళ్ళి చేసి చూడు'ను మరెన్నో శతమానోత్సవాల దాకా చెప్పుకొనేలా చేస్తాయి. వాణిజ్య విజయమే కాదు, విశేష ప్రభావమే ఏ సినిమా వజ్రపు తునకో చెప్పేందుకు అసలైన గీటురాయి.

తాజా కలం - ఇప్పుడే అందిన వార్త. ఇవాళ రాత్రి 10.30 గంటలకు తెలుగు టీవీ చానల్ 'ఈ' టి.వి.లో 'పెళ్ళి చేసి చూడు' చిత్రం ప్రసారమవుతోంది. హాస్యరసాభిమానులు మిస్ కాకండి...

Tuesday, February 7, 2012

తెలుగు ‘టాకీ’ పుట్టుకపై.... ‘సాక్షి’....లో

ఇది ఇవాళ్టి సాక్షి దినపత్రికలోది...




తెలుగు ‘టాకీ’ పుట్టి 80 ఏళ్ళు!

భారతీయ చలనచిత్ర రంగంలో మూకీలను వెనక్కి నెడుతూ టాకీలు వచ్చింది 1931లో! హిందీ - ఉర్దూల మిశ్రమ భాషలో తయారై, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ 1931 మార్చి 14న విడుదలైంది. ఆ తరువాత మరో ఏడు నెలలకు కానీ, మన దక్షిణాది భాషలలో మాట్లాడే టాకీ చిత్రాలు రాలేదు. తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రం ‘కాళిదాస్’ 1931 అక్టోబర్ 31న విడుదలైంది. తెలుగు, తమిళ భాషలు రెండూ ఈ సినిమాతోనే తెరపై తొలిసారిగా వినిపించినప్పటికీ, ఎక్కువగా తమిళంలోనే మాటలు,పాటలున్నాయి కాబట్టి, తమిళులు దాన్ని తమ లెక్కలో వేసుకొని,‘కాళిదాస్’ ను తొలి తమిళ టాకీగా చెప్పుకొంటున్నారు. కానీ, నిజానికి అప్పట్లో ఆ చిత్రానికి ‘‘తమిళ - తెలుగు భాషల్లో మాట్లాడే చిత్రం’’ అంటూనే ప్రకటనలిచ్చారు.

ఇక, పూర్తిగా తెలుగులోనే సంభాషణలున్న తొలి టాకీ ‘భక్త ప్రహ్లాద’. ఇంతవరకూ ఆ చిత్రం సరైన విడుదల తేదీ ఏమిటన్నది ఎవరికీ తెలియదు. ‘కాళిదాస్’ 1931 అక్టోబర్ చివరలో వచ్చింది కాబట్టి, దానికి కనీసం నెలన్నర ముందు 1931 సెప్టెంబర్ 15న తొలి తెలుగు టాకీ విడుదలైనట్లు అందరూ భావిస్తున్నారు. ఏటేటా సెప్టెంబర్ 15ను ‘తెలుగు సినిమా జన్మదినం’గా జరుపుకొంటున్నారు. కానీ, ఈ పరిశోధకుడి అన్వేషణలో బయటపడ్డ వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.

దక్షిణాది భాషల్లో వచ్చిన తొలి టాకీలైన ‘కాళిదాస్’కూ, ‘భక్త ప్రహ్లాద’కూ రెండింటికీ దర్శకుడు ఒకరే. ఆయనే హెచ్.ఎం. రెడ్డి. తొలి తమిళ - తెలుగు టాకీ ‘కాళిదాస్’ 1931 అక్టోబర్ 31న విడుదలైతే, అంతకన్నా ముందే రిలీజైనట్లు ప్రచారంలో ఉన్న పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సెన్సారైందే - 1932 జనవరి చివరలో! ఆ జనవరి 22న ‘బొంబాయి బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్స్’ సెన్సారింగ్ చేసి, అదే తేదీన సెన్సార్ సర్టిఫికెట్ ను కూడా జారీ చేసింది. దీన్నిబట్టి, ఒకటి స్పష్టం. ‘భక్త ప్రహ్లాద’ 1931 సెప్టెంబర్ మధ్యలో విడుదల కాలేదు. ఇక, దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి సైతం సగం తమిళం - సగం తెలుగు మాటలున్న ‘కాళిదాస్’ విడుదలై విజయవంతమయ్యాకే, ఆ ఉత్సాహంతో పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ను రూపొందించినట్లు ఆ రోజుల్లోనే ఇంటర్వ్యూల్లో చెప్పారు. హెచ్.ఎం. రెడ్డితో అనుబంధం... తొలి నాళ్ళ టాకీలైన ‘ఆలమ్ ఆరా’, ‘కాళిదాస్’, ‘భక్త ప్రహ్లాద’లు మూడింటిలో పనిచేసిన సంబంధం ఉన్న ఎల్.వి. ప్రసాద్ సైతం ఆ వరుసే చెప్పారు. 1930ల తరం దర్శకుడు పి. పుల్లయ్య కూడా ఆ క్రమాన్నే పేర్కొనడం మరో ధ్రువీకరణ.

మరి ఇంతకీ, ‘భక్త ప్రహ్లాద’ అసలు సిసలు విడుదల తేదీ ఏమిటన్నట్లు? అది - 1932 ఫిబ్రవరి 6. అంటే ఈ 2012 ఫిబ్రవరితో పూర్తి తెలుగు టాకీ చిత్రానికి 80 ఏళ్ళు నిండుతున్నాయి. ఈ సాక్ష్యాధారాలను బట్టి, సగం తమిళం - సగం తెలుగు సినిమా వచ్చిన తరువాతే, పూర్తి తెలుగు టాకీ విడుదలైందనీ, తెలుగు సినిమా పుట్టిన రోజు సెప్టెంబర్ 15 కాదు, ఫిబ్రవరి 6 అనీ తేలిపోయింది. ఇకనైనా, తెలుగు సినిమాకు సరైన తేదీనే జన్మదినం జరుపుకోవడం విధాయకం!



- డాక్టర్ రెంటాల జయదేవ

Monday, February 6, 2012

తెలుగు టాకీకి అసలు సిసలు 80 ఏళ్ళు ఇవాళే! - 'ఈ' టి.వి.లో వచ్చిన స్టోరీ

ఈనాడు టెలివిజన్ చానల్ తమ రెండు చానళ్ళలోనూ ('ఈ' టి.వి. తెలుగులో, 'ఈ' టి.వి.-2లో) కూడా ఈ అంశంపై నా పరిశోధనను పేర్కొంటూ, కథనాలు ప్రసారం చేసింది. 'ఈ' టి.వి. - 2 చానల్ ఇవాళ ప్రసారం చేసిన ప్రత్యేక వార్తా కథనం లింకు ఇదుగో....

తొలి తెలుగు సినిమా పుట్టిందెప్పుడు? - అసలు చరిత్ర ఏంటి?- - టి.వి 9లో స్టోరీ

ఈ అంశంపై నా పరిశోధనను పేర్కొంటూ, టి.వి - 9 చానల్ ఇవాళ ప్రసారం చేసిన ప్రత్యేక వార్తా కథనం లింకు ఇదుగో....





తొలి పూర్తి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద విడుదలై ఇవాళ్టికి, అంటే ఈ 2012 ఫిబ్రవరి 6వ తేదీకి సరిగ్గా 80 ఏళ్ళు. ఇంతకాలం ఈ సినిమా 1931లో విడుదలైందని అనుకుంటూ వచ్చారు చాలామంది. అలాగే, విడుదల తేదీ సెప్టెంబర్ 15 అంటూ సాక్ష్యాధారాలేవీ లేని ఓ ప్రచారం జరుగుతూ వచ్చింది. అదే అందరం నమ్మాం. కానీ, ఆ నమ్మకం తప్పు అని నా పరిశోధన తేల్చింది.

ముందుగా దర్శకుడు హెచ్. ఎం. రెడ్డి సగం తెలుగు - సగం తమిళంలో డైలాగులు, పాటలున్న కాళిదాస్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అప్పటి పత్రికలన్నీ ఆ చిత్రాన్ని తొలి తమిళ - తెలుగు టాకీ అనే పేర్కొన్నాయి. ఆ చిత్రం 1931 అక్టోబర్ 31న విడుదలైంది. ఆ సినిమా విజయవంతమయ్యాక, పూర్తిగా తెలుగులోనే సినిమా తీయాలని తనకు ఆలోచన వచ్చినట్లు స్వయంగా ఆయనే ఇంటర్వ్యూల్లో చెప్పారు, వ్యాసాల్లో రాశారు.

ఆ రకంగా 1931లో నిర్మాణం మొదలైన పూర్తి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద బొంబాయిలో చిత్రీకరణ జరుపుకొంది. అక్కడే సెన్సారింగూ పూర్తి చేసుకుంది. 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారైన ఆ సినిమా, సరిగ్గా పక్షం రోజులకు బొంబాయిలోనే న్యూ ఛార్నీ రోడ్డులోని కృష్ణా సినిమా హాలులో విడుదలైంది. అలా ఆ సినిమా తొలి విడుదల తేదీ 1932 ఫిబ్రవరి 6. అంటే, ఇవాళ్టితో మన తొలి తెలుగు సినిమాకు 80 ఏళ్ళు నిండాయన్నమాట.

ప్రామాణికమైన సాక్ష్యాధారాలు సేకరించి, అవి ప్రత్యక్షంగా చూపిస్తూ నేను చేసిన ఈ పరిశోధనను సినీ విమర్శకులు, చరిత్రప్రేమికులు వి.ఏ.కె. రంగారావు, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, వకుళాభరణం రామకృష్ణ లాంటి వారు స్వయంగా చూసి, ప్రశంసించారు. తెలుగు సినిమా జన్మదినం ఫిబ్రవరి 6న జరుపుకోవడమే సముచితమని అంగీకరించారు. మరి, ఇక నుంచైనా మన సినీ చరిత్రకారులు, పరిశ్రమ పెద్దలు ఈ అంశంపై దృష్టి సారిస్తారా....!?

Saturday, December 10, 2011

నిజం చెబితే నేరమా?




‘శ్రీరామరాజ్యం’పై ఇష్టపదిలో రాసిన మూడు భాగాల సమీక్షపై వచ్చిన ప్రశంసలకు కానీ, విమర్శలకు కానీ వెంటనే స్పందించలేకపోయాను. సమీక్ష రాస్తున్న నాటికే ఉన్న పని ఒత్తిళ్ళు, అనారోగ్య సమస్యలు మరికొంత పెరగడంతో, తీరిక చేసుకొని తాపీగా స్పందించాలన్న ఆలోచన సఫలం కాలేదు. ఏమైనా, అందుకు ముందుగా మన్నించాలి. ఆ హడావిళ్ళ మధ్యనే ఈ నాలుగు మాటలు...


విషయానికి వస్తే, సినిమా చూశాక అందులో కనిపించిన, అనిపించిన తప్పొప్పుల గురించి మాట్లాడుకోవడం మామూలుగా ఎవరమైనా చేసే పనే. సినిమా గురించి సమీక్షిస్తున్నప్పుడు ఎవరైనా సరే తప్పనిసరిగా చేయాల్సిన పని. ఆ మధ్య తాజా ‘శ్రీరామరాజ్యం’ సినిమా గురించి ఈ ‘ఇష్టపది’ బ్లాగులో అదే చేశాను. కానీ, చిత్రంగా ఈ విషయానికి చాలా మందికి కోపాలు వచ్చాయి. కొందరేమో నన్ను, నా సమీక్షనూ దుమ్మెత్తి పోశారు. ఆవేశంతో ఊగిపోయిన వీరవరులేమో ఏకంగా వ్యక్తిగత జీవితాలపై విమర్శలకూ దిగారు. శ్రీరామరాజ్యం దర్శక, రచయితలకూ, హీరోకూ అపారంగా ఉన్న భక్త జనగణం ఎనానిమస్ గా ప్రచురణార్హం కాని వ్యాఖ్యలూ చేశారు.

సినిమా బాగోగుల మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పచ్చు. అందులో అందరి అభిప్రాయాలూ, అన్ని అభిప్రాయాలూ ఒకటేలా ఉండాలన్న రూలూ ఏమీ లేదు. ఏకీభవించడానికి ఎంత అవకాశం ఉందో, అవతలివారి అభిప్రాయంతో గౌరవపూర్వకంగానే విభేదించడానికీ అంతే స్వేచ్ఛ ఉంది. కానీ, విభేదించినంత మాత్రాన దూషణలు, దోషారోపణలు చేయడమన్నది వారి వారి సంస్కారానికి సంబంధించిన విషయం.

ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా ఆ చిత్రం మీద కానీ, ఆ చిత్రానికి పని చేసిన వారి మీద కానీ రాగద్వేషాలు లేకుండా సినిమాను సమీక్షించడం శాస్త్రీయమైన, సమర్థనీయమైన పద్దతి. అది ఎంత చక్కగా చేస్తే, అంత నిష్పాక్షికంగా సమీక్ష ఉంటుందనేది విజ్ఞులకు చెప్పనక్కరలేదు. శ్రీరామరాజ్యంపై ఈ సమీక్షకుడు ఇష్టపదిలో చేసిందీ అదే. పైగా, మన తెలుగు జాతికి కల్ట్ ఫిగర్లయిన బాపు - రమణలంటే గౌరవం, వారి సృజనాత్మక కృషి పట్ల అభిమానం, వారి స్నేహ సౌశీల్యాలతో సన్నిహిత పరిచయం ఉన్నా, వీలైనంత వరకు అవేవీ అవరోధం కాకుండా, శ్రీరామరాజ్యం సినిమాను సమీక్షించాలని ప్రయత్నించడం జరిగింది.

కానీ, ఫలానా వారి సినిమా కాబట్టి, ఫలానా తరహా (పౌరాణికం, జానపదం, వగైరా వగైరా) సినిమా కాబట్టి, ఫలానా కథాంశం మీద కాబట్టి ఎలా ఉన్నా సరే బాగుందనే అనాలంటే, ఇక దానిలో చర్చ లేదు. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలోని లోటుపాట్ల గురించి చేదు నిజాలు చెబితే, ఆ లోటుపాట్ల మీద మాట్లాడకుండా, నాకు నచ్చింది కాబట్టి, నచ్చలేదనడానికి నువ్వెవడివి అంటూ ఒళ్ళంతా కారం పూసుకొంటే చెప్పగలిగిందేమీ లేదు. తేటతెలుగులో తిట్టినా, తిట్టుకున్నా లాభం లేదు.


పాత్ర చిత్రణలోనైనా, చిత్రీకరణలోనైనా, సాంకేతికంగానైనా లోటుపాట్ల గురించి చర్చించుకొంటే, సినిమా మీద అవగాహన పెంచుకోవడానికి తోడ్పడుతుంది. అలా కాకుండా రాజుగారి దేవతా వస్త్రాల కథలో లాగా డూడూ బసవన్నలా ఉందామంటే.... ఏ సినిమా ఎలా ఉన్నా సూపర్ హిట్ అందామంటే.... పుంజాలు తెంపుకొని ఏ దర్శకుడికి, ఆ దర్శకుడికి, ఏ హీరోకు ఆ హీరోకు భట్రాజుల్లా వ్యవహరిద్దామంటే.... దానికి మళ్ళీ బ్లాగులెందుకు? ఇప్పటికే ఉన్న కొన్ని భజన పత్రికలు, చానళ్ళు చాలవా?


ఉన్నది ఉన్నట్లు చెప్పాలనే తప్ప, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించాలన్నది నా ఉద్దేశం కాదు --- అది సమీక్షలు రాయడంలోనైనా..! పోస్టు వేయడంలోనైనా..! వ్యాఖ్యలు, ప్రశంసలు, విమర్శలు రాసినవాళ్ళకీ, రాళ్ళు విసిరిన వారికీ - అందరికీ కృతజ్ఞతలు.

Tuesday, November 29, 2011

‘శ్రీరామరాజ్యం’ - చేజారిన మహదవకాశం?



(‘శ్రీరామరాజ్యం’ సినిమా సమీక్ష - పార్ట్ 3)

(మునుపు రాసినవేమో...

పార్ట్ 1 - ‘రామరాజ్యమంటే ఇదా...!?’,
పార్ట్ 2 - ‘శ్రీరామరాజ్యం - చిన్న లోపాలే పెద్ద శాపాలా?

ఆ రెండు పోస్టులకు కొనసాగింపుగా ఇది చివరి భాగం)



పౌరాణికాలకు పెట్టింది పేరైన మన తెలుగు చిత్ర పరిశ్రమలో 14 ఏళ్ళ తరువాత వచ్చిన పూర్తిస్థాయి పౌరాణిక చిత్రం - ఈ 'శ్రీరామరాజ్యం'. దీనికి ముందు తెలుగులో ఆఖరుగా వచ్చిన నేరు పౌరాణిక చిత్రం చిన్న ఎన్టీయార్ పసివయసులో రాముడిగా నటించిన బాలల చిత్రం 'రామాయణం' (1997). ఆ తరువాత వచ్చిన 'శ్రీరామదాసు', 'పాండురంగడు' లాంటివి పూర్తి పౌరాణిక చిత్ర వర్గంలోకి రావు. చిరంజీవి 'శ్రీమంజునాథ' పౌరాణికమైనా, అది అనువాద చిత్రం. మీడియాలో ఒక వర్గం మాత్రం 'రామాయణం' కన్నా ఏడాది ముందే బాలకృష్ణ నటించిన విజయా వారి 'శ్రీకృష్ణార్జున విజయం' (1996) చిత్రాన్నే ఆఖరుగా వచ్చిన పౌరాణిక చిత్రంగా పేర్కొంటూ, 'శ్రీరామరాజ్యం' ప్రచార కథనాలు ఇటీవల ప్రసారం చేసింది. ఏమైనా, చాలా ఏళ్ళ తరువాత వస్తున్న భారీ పౌరాణిక చిత్రంగా సహజంగానే 'శ్రీరామరాజ్యం' పై అందరిలో ఆసక్తి, తెలుగుదనానికి ప్రతీకలైన బాపు - రమణల చిత్రం కావడంతో కొన్ని అంచనాలు నెలకొన్నాయి. పైగా, పెరిగిన సాంకేతికత నేపథ్యంలో వస్తున్న మహదవకాశమైన ఈ భారీ పౌరాణికానికి పెద్ద సంఖ్యలో పెద్ద పెద్ద సాంకేతిక నిపుణులు పనిచేశారు.

సంగీతం, సాహిత్యం, నృత్యాల శ్రమ ఫలించిందా ?

సంగీతం ఇళయరాజా అందించారు. పాటలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాశారు. ఇళయరాజా సంగీతంలో ఒకటి, రెండు పాటల్లో తప్ప, మిగిలిన చోట్ల మునుపటి మ్యాజిక్ లేదు. 'సాగర సంగమం' లాంటి కొన్ని చిత్రాల్లో ఇప్పటికీ చెప్పుకొనే ఆయన మార్కు రీ-రికార్డింగు 'శ్రీరామరాజ్యం'లో వినిపించదు. ఉదాహరణకు, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులతో రాజమందిరంలో రాముడు వేదనాపూర్వకంగా సంభాషించే సన్నివేశం లాంటివి చూస్తే, రీ-రికార్డింగ్ జరపడానికి ముందే రీలు హాలుకు వచ్చేసిందేమో అనిపిస్తుంది. రీ-రికార్డింగ్ కి అంటూ హంగేరీకి కూడా వెళ్ళి వచ్చిన ఇళయరాజా బృందం అక్కడ ప్రత్యేకంగా చేసినదేమిటమని అనుమానం కలుగుతుంది.

కవి, పండితుడైన జొన్నవిత్తుల పాటల్లో 2, 3 వినగా, వినగా బాగున్నాయి. 'జగదానంద కారకా... జయ జానకీ ప్రాణనాయకా... ' అన్న త్యాగరాయ కీర్తన మకుటంతో రాసిన పల్లవి సినిమా రిలీజుకు ముందు నుంచే తెలుగు నాట ఇంటింటా మారుమోగింది. ఇక, 'దేవుళ్ళే మెచ్చింది... మీ ముందే జరిగింది... ' అంటూ లవకుశులు చేసే రామాయణ గానం కూడా విన్నకొద్దీ ఎక్కే పాట. అందులో ముఖ్యంగా సీతకు అగ్నిపరీక్ష సందర్భాన్ని ప్రస్తావిస్తూ రాసిన '...ఎవ్వరికీ పరీక్ష, ఎందులకీ పరీక్ష, ...రాముడి ప్రాణానికా, జానకి దేహానికా.... ' లాంటి వాక్యాలు మనసుకు తాకుతాయి. సీతను అడవిలో వదిలే సమయంలో వచ్చే విషాద గీతం 'గాలి..నింగి..నీరు... ' కూడా ఇళయరాజా బాణీలో, భావోద్వేగాలను పండించిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వాణిలో కదిలిస్తుంది. శ్రేయా ఘోశల్ లాంటి గాయనీ గాయకులు ఈ చిత్ర గీతాలను బాగానే పాడారు.

అయితే, వచ్చిన చిక్కేమిటంటే, మొత్తం మీద పాటల్లో సాహిత్యం బాగున్నా, కథకు కావాల్సిన ఆర్తి, ఆవేదన, ఆవేగం అన్ని చోట్లా పలకలేదు. పైగా, విడిగా వినప్పటి కంటే, తెరపై దృశ్యంతో కలసి విన్నప్పుడు వాటి స్థాయి మరికొంత తగ్గిందేమో అనిపిస్తుంది. ఇక, ఆల్ టైమ్ హిట్లుగా నిలిచిన 'లవకుశ'లోని 'శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా... ', 'ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు...' లాంటి పాటలతో పోలికలు రానే వస్తాయి. అదీ ఓ ప్రతికూలతే. అన్నట్లు ఈ చిత్రానికి మొదట్లో వెన్నెలకంటితో 2 పాటలు, కొన్ని పద్యాలు కూడా రాయించారు. రికార్డు కూడా చేసినట్లున్నారు. మరి, సినిమాలో అవేవీ లేవు. జొన్నవిత్తులదే సింగిల్ కార్డు. దీనికి వెనుక కథేమిటో తెలియదు.

ఈ చిత్రానికి డ్యాన్స్ మాస్టర్ సీనియర్ టెక్నీషియన్ శ్రీను. అయితే, ఈ సినిమాలోని నృత్యగీతాలు, ముఖ్యంగా రాముల వారి అయోధ్యా నగర ప్రవేశం, సీతమ్మవారి సీమంతం పాటలకు కంపోజ్ చేసిన బృంద నృత్యాలు పౌరాణిక సినిమాలకు తగ్గట్లుగా అనిపించవు. పైగా శాస్త్రానుసారం రంగస్థలి మీద ఉండకూడని లోపాలూ ఉన్నాయి. ఉదాహరణకు, ముఖ్య తార (ల)ను మధ్యలో పెట్టుకొని, బృంద నర్తకులు చుట్టూ తిరిగి నర్తిస్తున్నప్పుడు కథకూ, సినిమాకూ ప్రధానమైన ఆ ముఖ్య తారలు, వారి ముఖాలు కనపడాలి కదా. వారు కనపడరు సరి కదా, ఈ బృంద నర్తకుల పృష్ఠ భాగాలు తెరపై తారట్లాడుతూ, చూపరులకు చెప్పుకోలేని చీకాకు కలిగిస్తాయి.

అతుకుల బొంతగా ఆధునిక సాంకేతికత

జి.జి. కృష్ణారావు కూర్పు అద్భుతాలు, ఆశ్చర్యాలు లేకుండా, సాఫీగా సాగిపోతుంది. కళా దర్శకత్వానికి వస్తే - ఎస్. రవీందర్, కిరణ్ కుమార్ లు ఆ బాధ్యతలు నిర్వహించారు. ప్రధానంగా, వాల్మీకి ఆశ్రమం (కళా దర్శకుడు ఎస్. రవీందర్), అయోధ్య రాజమందిరం లాంటివి పూర్తి స్థాయి అచ్చమైన సెట్లయితే, మిగిలినవి కొద్దిగా వేసిన సెట్ కు, మిగతా భాగం విజువల్ ఎఫెక్టులు జోడించిన వర్చ్యువల్ సెట్లు.

సుమారు రెండుమ్ముప్పావు గంటల ఈ సినిమాలో దాదాపుగా రెండుంబావు గంటల దాకా గ్రాఫిక్స్ ఉన్నాయి. అందు కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు - ఏకంగా నాలుగు సంస్థల వారు (ఇ.ఎఫ్.ఎక్స్, పిక్సెలాయిడ్, మకుట, ఆరెంజ్ మీడియా) శ్రమించారు. కానీ, తెరపై తుది ఫలితం మాత్రం తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. అయోధ్యా నగర వీధులు, రాజ ప్రాసాదంలో కోటంత ఎత్తు గోడలు, ద్వారాలు, తలుపులు వగైరాలన్నీ కంప్యూటర్ లో రూపొందించిన వర్చ్యువల్ సెట్లే. ఇలాంటి వర్చ్యువల్ సెట్లు సైతం కంటికి తేడా తెలియకుండా గ్రాఫిక్స్ లో నేర్పుగా చేసిన తీరు మనం మునుపటి ‘అరుంధతి’, ‘మగధీర’ (2009) చిత్రాల్లో చూశాం. కానీ, ‘శ్రీరామరాజ్యం’లో మాత్రం ఈ గ్రాఫిక్స్ విశ్వామిత్ర సృష్టి సెట్స్ లో చాలా భాగం సహజంగా లేవు. నాటకాల్లో, పాత కాలపు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో పరిసర వాతావరణాన్ని సృష్టించడానికి గుడ్డ మీద వేసిన బొమ్మలను వాడినట్లుగా ఉంది.

పైగా, కెమేరా కంటి (ప్రేక్షకుడి) దృక్కోణానికి కానీ, సన్నివేశంలోని పాత్రధారులు నిలబడిన తలానికి సారూప్యంగా కానీ, వారి కదలికలకు తగ్గట్లుగా కానీ ఈ బ్లూ మ్యాట్ ద్వారా సృష్టించిన గ్రాఫిక్ సెట్లు లేవు. ఒకరకంగా ఇవి ఆధునిక సాంకేతికతలోనూ మనం ఇంకా ఆటవిక యుగంలోనే ఉన్నామని చెప్పకనే చెబుతాయి.

ఇక, అయోధ్యలోని రాజమందిర అంతర్భాగంలోని సూర్య భగవానుడి భారీ విగ్రహం మనవాళ్ళ అరకొర గ్రాఫిక్స్ లో మెల్లకన్నుతో సాక్షాత్కరిస్తుంది. పైగా, సినిమాలో ఓ సన్నివేశంలో దాన్ని మిడ్ క్లోజప్పులో చూపేసరికి, హాలులో ప్రేక్షక జనం హాహాకారం చేయడం ఒక్కటే తక్కువ. ఆ మందిరంలో రాముడి పూర్వీకులైన రఘువంశ రాజుల విగ్రహాలూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక్క విగ్రహం మాత్రం చేతిలో ధనుస్సుతో 'సత్య హరిశ్చంద్ర' సినిమాలోని పెద్ద ఎన్టీయార్ పోలికలతో చూడగానే, గుర్తుపట్టేలా ఉంటుంది.

జంతు సంక్షేమ మండలి కఠిన నిబంధనలైతేనేం, ఈ రోజుల్లో పెరిగిన ఖర్చు వల్ల అయితేనేం ఈ సినిమాలో వాల్మీకి ఆశ్రమంలో కనిపించే లేళ్ళు, జింకలు, నెమళ్ళు వగైరాలన్నీ గ్రాఫిక్స్ సృష్టే. అయితే, వాటిని సరిగా దృశ్యంలో అతకకపోవడంతో, జింకల పక్కనే, వాటి కొమ్ముల మధ్య నుంచి పాత్రధారులు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇక్కడ కూడా కంప్యూటర్ సృష్టికీ, కెమేరా కంటితో పాత్రధారుల మీద తీసిన దృశ్యానికీ పర్ స్పెక్టివ్ లో తేడా తెలుస్తుంటుంది. రథంలో లక్ష్మణుడు, సీతను అడవికి తీసుకువెళ్ళే దృశ్యంలో వచ్చే టాప్ యాంగిల్ షాట్లకూ ఇదే తంటా వచ్చింది.

కెమేరాతోనూ కొరవడిన తృప్తి

ఇటీవల కాలంలో బాపు చిత్రాలు, ‘శ్రీభాగవతం’ సీరియల్ కు పనిచేసిన సీనియర్ టెక్నీషియన్ పి.ఆర్.కె. రాజు గారే ఈ చిత్రానికీ ఛాయాగ్రాహకులు. పాత్రధారులను చూపిన తీరు, లైటింగ్ వగైరాల్లో కెమేరా పనితనం బాగుందనిపిస్తుంది. బాపు మార్కు క్లోజప్పులు సరే సరి. కానీ, ఇద్దరు పాత్రధారుల మధ్య సాగే సంవాదాల లాంటి దృశ్యాల్లో కెమేరా తేలిపోయింది.

పాత్రధారుల్లో ఒకరు కెమేరాకు దగ్గరగా ముందు, వేరొకరు కెమేరాకు కాస్త దూరంగా వెనుక ఉన్నప్పుడు కెమేరాను స్థిరంగా ఉంచి, డైలాగు చెబుతున్న పాత్రధారి మీదకు లెన్సును ఫోకస్ పెట్టడం సాధారణంగా ఆనవాయితీ. డైలాగు చెప్పే అతను ఫోకస్ లో, డైలాగు లేని రెండో పాత్రధారి అవుటాఫ్ ఫోకస్ లో ఒకే ఫ్రేములో కనిపించడం మనం సినిమాల్లో చూస్తుంటాం. కెమేరా కదలకుండా ఉంటూనే, డైలాగు చెప్పే పాత్రధారి మారినప్పుడల్లా ఆ పాత్ర మీదకు ఫోకస్ మాత్రం మారుతూ వస్తుంది. ఈ ప్రాథమికమైన పద్ధతిని పాటించకుండా, కెమేరాతో పాటు ఫోకస్ ను కూడా కదపకుండా అలాగే ఉంచేసిన దృశ్యాలు 'శ్రీరామరాజ్యం'లో కొన్నిచోట్ల కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. దాంతో, కొన్నిసార్లు డైలాగు చెబుతున్న పాత్రధారి అవుటాఫ్ ఫోకస్ లో ఉంటాడు. అందుకే, ఇంతటి బ్రహ్మాండమైన నిర్మాణ విలువలున్న భారీ బడ్జెట్ సినిమాలోనూ, ఈ లోపాలు ప్రేక్షకుడికి రసభంగం కలిగిస్తాయి. తెలియని అసంతృప్తిని కలిగిస్తాయి.

నిజాయితీ, నిర్మాణ విలువలే శ్రీరామరక్ష

78 ఏళ్ళ వయసులోనూ దర్శకుడిగా బాపు తన మార్కు చూపడానికి తపించారు. ప్రతి ఫ్రేమునూ సౌందర్యభరితంగా చూపాలని ప్రయత్నించారు. తనకు మాత్రమే ప్రత్యేకమైన ఫ్రేములతో దృశ్యాలను కన్నులపండుగ చేశారు. నేటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని ముళ్ళపూడి వెంకట రమణ సామాన్య జనభాషలో రచన చేశారు. ఒకటి, రెండు చోట్ల తన కలంలో మెరుపులూ మెరిపించారు.

కానీ, కథను తెరపై నడిపిన తీరులో, అందుకు ఎంచుకున్న ఘట్టాల్లో క్రమానుగత పరిణామం, రసావిష్కరణకు ప్రాతిపదిక, ఆ దిశగా ప్రయాణం, తుది ఫలితం సమగ్ర రూపం ధరించలేదు. ఈ కథ మొత్తాన్నీ సింహావలోకనం చేస్తే - కథలోని పాత్రలకు ఎదురయ్యే సమస్యకు మూలం - సీతపై లోకనింద. దానికి వెరచిన రాముడి ప్రతిస్పందన ఏమిటంటే - సీతాపరిత్యాగం. అంటే ఆ యాక్షన్ కు రాముడి రియాక్షన్ అది. దాని పర్యవసానం - భార్యాభర్తల వియోగం, రాముడికీ, సీతకూ మానసిక సంఘర్షణ. ఈ చిక్కుముడిని విడదీసే ముగింపు - రాముడు, లవకుశులు తమ బాంధవ్యం తెలుసుకొని కలుసుకోవడం.

స్క్రిప్టుకు ప్రధానమైన ఈ అంశాల్లో రాముడి మానసిక సంఘర్షణ, భర్తృ వియోగ బాధతో సీతా సాధ్వి వేదన, తల్లితండ్రులు అని తెలియకుండానే శ్రీరాముడి మీద, సీతమ్మ మీద లవకుశులు గౌరవ అనురాగాలు పెంచుకోవడం, రాముడు సీతమ్మను కారడవుల పాలు చేశాడని తెలిసి సాక్షాత్తూ ఆయననే తిరస్కరించడం లాంటివి ఎంత బాగా ఎలివేట్ అయితే, తెరపై కథ అంత బాగా పండుతుంది. దానికి బాల లవకుశుల చేష్టలతో అద్భుత, హాస్య రసాలు కూడా తగు పాళ్ళలో చేరిస్తే మరింత బాగుంటుంది. కానీ, ఈ చిత్రంలో అవన్నీ దేనికవిగా మిగిలాయి. కలసికట్టుగా కుదరలేదు. పైగా, మామూలు ఘట్టాలుగానే వచ్చాయి తప్ప, మనస్సును ఆర్ద్రపరిచే అనుభవాలుగా మారలేదు.

సినిమా అనేది నటీనటులు, సాంకేతిక నిపుణుల సమష్టి కృషి అయిన సమాహార కళ కావడంతో ఏ విభాగంలోని ఏ చిన్న లోపమైనా, ఇతర విభాగాలపై ప్రభావం చూపుతుంది. అది అనివార్యం. 'శ్రీరామరాజ్యం'కూ అదే జరిగింది. ఇంతటి ప్రచార ఆర్భాటంలోనూ, దేవతా వస్త్రాల కథలో లాగా అందరి ఆహా ఓహోల మధ్యలోనూ సినిమాకు ప్రేక్షకులూ, వసూళ్ళూ తక్కువగా ఉండడానికి కారణం అదే.

ఈ సినిమాకు సంబంధించి మారు మాట్లాడకుండా మెచ్చుకోవాల్సింది మాత్రం - నిర్మాతనే. లాభనష్టాల ధ్యాస లేకుండా, ఈ కథను ఈ తరం వారికి అందించాలన్న ఆయన కృత నిశ్చయానికి జోహార్లు. అందుకోసం ఆయన సర్వశక్తులూ కేంద్రీకరించి చేసిన వ్యయం సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. ఈ పౌరాణిక చిత్రం ఈ రోజుల్లో ప్రతి ఫ్రేములో ఇంత రిచ్ గా కనబడడానికి ఆయనే కారణం. యూనిట్ ను నమ్మి ఆయన పెట్టిన ప్రతి పైసానూ తెర మీద కళకళలాడే దృశ్యాల్లో చూడవచ్చు. కరెన్సీ కట్టల కోసమే సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో ఇప్పటి తరం కోసం, ఇలాంటి చిత్రం తీయాలనే ఈ రకం నిర్మాత ఉండడమే పెద్ద విచిత్రం, విశేషం. తమ ఊళ్ళోని ఆలయంలో వెలసిన శ్రీరామచంద్రుణ్ణి నమ్ముకొని ఆయన ఇంత సాహసం చేశారు. ఆ భక్తి శ్రద్ధలూ, నిజాయితీలే ఆయనకూ, ఈ సినిమాకూ శ్రీరామరక్ష. ఆయన కోసమైతే ఈ సినిమా అందరం తప్పనిసరిగా చూడాల్సిందే. ఉత్తర రామాయణ గాథను బాపు - రమణల బాణీలో ఈ తరం పిల్లలకూ చూపాల్సిందే.

కొసమెరుపు --

పౌరాణిక చిత్రాలతో ఇంటింటా దేవుడిగా వెలిసిన పెద్ద ఎన్.టి.ఆర్.కు నిజజీవితంలో వీపు మీద ఎడమవైపున చింతగింజంత పుట్టుమచ్చ ఉంటుంది. ఆయన సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంటుంది. గమ్మత్తేమిటంటే, ఆయన కుమారుడైన బాలకృష్ణకు ఈ సినిమాలో కావాలని వీపు మీద పెట్టుడు పుట్టుమచ్చను మేకప్ లో సృష్టించారు. అయినా వారసత్వ హీరోల వెర్రి కానీ, ఈ పెట్టుమచ్చలతో పెద్దాయనను అనుకరించే కన్నా, ఆ అనుకరణేదో ఇలాంటి పాత్రపోషణ సందర్భంలో ఆయన పాటించే నియమాలు, చేసే కఠోర పరిశ్రమలో ఉండి ఉంటే, ఈ ముదురు రాముడు కూడా తెరపై మరింత అందంగా ఉండేవాడేమో...!?

అన్నట్లు, 'శ్రీరామరాజ్యం' చిత్ర నిర్మాణం మొదలైనప్పుడు ఈ సినిమాలో భరతుడి పాత్ర సాయికుమార్ పోషిస్తున్నట్లు దర్శక, నిర్మాతలు చెప్పారు. తీరా ఏమైందో కానీ, సినిమా విడుదలయ్యాక తెర మీద మాత్రం భరతుడి పాత్రలో నటుడు సమీర్ కనిపించారు. అయితే, ఈ సినిమా గురించి టీవీల్లో, పేపర్లలో, ఇంటర్నెట్ లో విపరీతమైన హడావిడి చేస్తున్న మీడియాలో కొందరు సినిమా విడుదల రోజు దాకా భరతుడిగా సాయికుమార్ అని రాస్తూ వచ్చారు. అంతే కాదు, తీరా సినిమా విడుదలయ్యాక కూడా ఇప్పటికీ భరతుడిగా సాయికుమార్ నటించినట్లు రాస్తూనే ఉండడం చిత్రాతిచిత్రం. విడుదలకు ముందు వివరాలు కనుక్కొని రాయకపోతే మానె, కనీసం విడుదలై కళ్ళారా సినిమా చూశాకైనా తప్పు దిద్దుకోకపోతే.... ఇంకేమనాలి..!?

రామ......! రామ.....!