జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, December 15, 2015

టైటిలాభరణం ('శంకరాభరణం' మూవీ రివ్యూ)

టైటిలాభరణం
కొత్త సినిమా గురూ!  ‘శంకరాభరణం’

కెమేరా- సాయిశ్రీరామ్, ఎడిటింగ్ - ఛోటా కె. ప్రసాద్,
నిర్మాత - ఎం.వి.వి. సత్యనారాయణ, 
కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వ పర్యవేక్షణ - 
కోన వెంకట్, దర్శకత్వం - ఉదయ్ నందనవనమ్,

శంకరాభరణం. పేరు వినగానే ఆణిముత్యం లాంటి సినిమా గుర్తుకొస్తుంది.
 తెలుగువాణ్ణి తలెత్తుకు తిరిగేలా చేసిన ఆ ఫిల్మ్ టైటిల్‌తో మరో సినిమా 
చేయడం సాహసం. పెపైచ్చు, ఆ టైటిల్‌తో క్రైమ్ కామెడీ తీయడం మరీ
 సాహసం. కానీ, ‘సాహసం శాయరా డింభకా! విజయం వరిస్తుంది’ అన్నది
 నమ్మి, ఆ పనికే దిగారు ఇప్పుడీ కొత్త చిత్ర దర్శక, నిర్మాతలు. అలా వచ్చింది 
కోన వెంకట్ అన్నీ తానై తీసి, తీయించిన కొత్త ‘శంకరాభరణం’.

టైటిల్ క్యూరియాసిటీ పక్కనపెట్టి, ‘దొరకునా ఇటువంటి సినిమా’ అని
పాడుకుంటూ కథలోకొస్తే - రఘు (సుమన్) అమెరికాలో కోటీశ్వరుడు.
 అతని భార్య రజ్జూ దేవి (సితార). ఓ కూతురు, ఓ కొడుకు
 గౌతమ్ (నిఖిల్). కష్టపడకుండా, కులాసా జీవితం గడిపే హీరో 
జీవితంలో ఒక పెద్ద కుదుపు. నమ్మినవాళ్ళు మోసం చేయడంతో 
ఆస్తులు పోయి, అర్జెంటుగా కోట్లు కట్టకపోతే కటకటాల వెనక్కి వెళ్ళే
 ముప్పులో పడతాడు హీరో తండ్రి.

పాతికేళ్ళ క్రితం ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని, అమెరికా
 వచ్చేశాననీ, బీహార్‌లోని ‘శంకరాభరణం’ అనే ప్యాలెస్‌కు తానే
 వారసురాలిననీ, దాన్ని అమ్మి అప్పుల నుంచి బయటపడవచ్చనీ
 హీరో తల్లి చెబుతుంది. ఆ ప్యాలెస్ అమ్మి డబ్బు తేవడానికి అమెరికా
 నుంచి హీరో బీహార్ బయల్దేరతాడు.

ఇక్కడ బీహార్‌లో విలువైన దేనినైనా కిడ్నాప్ చేసి, డబ్బులు గుంజడం 
బిజినెస్. రాష్ట్ర హోమ్ మంత్రి  (‘మిర్చి’ సంపత్) కూడా ఆ కిడ్నాపింగ్
 ముఠాల వెనుక మనిషే. బీహార్ వచ్చిన హీరో తమ ప్యాలెస్‌లో ఉంటున్న
 మామయ్య బద్రీనాథ్ (రావు రమేశ్)నీ, ఆయన బంధుగణాన్నీ మాయ
 చేసి, ప్యాలెస్ అమ్మేయడానికి ప్లాన్ చేస్తాడు. అమెరికా వెళ్ళాలని
 మోజు పడే మామయ్య చిన్న కూతురు హ్యాపీ (నందిత) హీరోను
 ప్రేమిస్తుంది. మరోపక్క అతనూ దగ్గరవుతాడు.

ఈ అమెరికా ఎన్నారై దగ్గర బోలెడంత డబ్బుందని ఊరంతా
భ్రమపడుతుంది. దాంతో, కిడ్నాపర్ భాయ్ సాబ్ (సంజయ్ మిశ్రా)
 హీరో, హీరోయిన్లను కిడ్నాప్ చేస్తాడు. తీరా తన దగ్గర డబ్బులే 
లేవని అసలు నిజం చెప్పి, హీరో తనను మరో కిడ్నాపర్‌కి కోట్లకు 
అమ్మించేలా చేస్తాడు. అలా ఒక కిడ్నాపర్ నుంచి మరో 
కిడ్నా పర్‌కు హీరో, హీరోయిన్లు ట్రాన్‌‌సఫరవుతుంటారు. 
ఈ కిడ్నాప్ డ్రామాల కథ ఎటు నుంచి ఎటు, ఎన్ని 
మలుపులు తిరిగిందన్నది మిగతా సినిమా.         

కథ కన్నా సీన్లు, క్యారెక్టర్లు సవాలక్ష ఉన్న ఈ సినిమాకు
 తీసుకున్న పాయింట్ బాగుంది. కానీ, దాన్ని ఆసక్తికరంగా
 చెప్పడంలో తడబాటు తప్ప లేదనిపిస్తుంది. తెర నిండా
కళకళలాడుతూ చాలా మంది ఆర్టిస్టులున్నారు. ఒకరి వెంట
 మరొకరుగా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు. కానీ, మనసు 
కెక్కేలా వాళ్ళ నటనను చూపెట్టే సన్నివేశాలే వెతుక్కోవాలి.
వెరైటీ స్క్రిప్ట్‌లతో ముందుకొస్తున్న హీరో నిఖిల్ ఈసారి అమెరికన్ 
ఇంగ్లీష్ యాసలో ఎన్నారైగా అలరించడానికి శాయశక్తులా యత్నించారు.

అమెరికా మోజున్న హ్యాపీగా నందితది కాలక్షేపం క్యారెక్టర్. 
కిడ్నాపింగ్ విలన్లుగా ఒకరికి ముగ్గురున్నారు. ఎవరికివారు
 ఫరవాలేదనిపిస్తారు. కానీ, ఎవరూ ప్రధాన విలన్ కాకపోవడమే
 చిక్కు. లేడీ కిడ్నాపింగ్ లీడర్ మున్నీ దీదీగా అంజలిది సినిమా
చివర కాసేపు వచ్చే స్పెషల్ అప్పీయరెన్స్. నాలుగు సీన్లు, కాసిన్ని
 డైలాగులు, ఒక స్పెషల్ సాంగ్ ఉన్నాయి. సినిమా నిండా చాలామంది
 కమెడియన్లున్నారు.

కొన్నిచోట్ల నవ్విస్తారు. ఎక్కువ మార్కులొచ్చేది థర్టీ ఇయర్స్ పృథ్వికి, 
అతని ఎస్సై పాత్ర ‘పర్సంటేజ్’ పరమేశ్వర్‌కి! అయితే, 
లేడీ కిడ్నాపింగ్ ముఠా స్త్రీలంతా కలసి అతడిపై పడి, 
గదిలోకి తీసుకెళ్ళడం లాంటివి కామెడీ అనుకోలేం.   

‘లాజిక్‌లు వెతక్కండి... మ్యాజిక్ చూడండి’ అని స్టాట్యూటరీ
 సిల్వర్‌స్క్రీన్ వార్నింగ్‌తో మొద లయ్యే సినిమా ఇది. కాబట్టి, 
బీహార్‌లో మనుషులు అచ్చ తెలుగు యాసల్లో ఎలా మాట్లా డుతున్నారు
లాంటి సందేహాలు శుద్ధ వేస్ట్. ముందే చెప్పేశారు కాబట్టి, ఇక
 సినిమా అంతా మ్యాజిక్ చూడడం కోసం కళ్ళలో వత్తులు 
వేసుకోవాల్సి ఉంటుంది! సీనియర్ కో-డెరైక్టర్ ఉదయ్నం
దనవనమ్‌కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. కానీ, 
దర్శకత్వ పర్యవేక్షణంతా కోన వెంకట్‌దే. ఎవరి భాగమెంతో 
తెరపై చూసి చెప్పడం కష్టమే.

కథనంలో బిగింపు, ఎడిటింగ్‌లో తెగింపు అవసరమని
 గుర్తొచ్చే ఈ సినిమాలో అందమైన లొకేషన్లలో కెమేరా
 పనితనం భేష్. ప్రవీణ్ లక్కరాజు బాణీల్లో కొన్ని బాగున్నాయి.
 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దగ్గరే వాద్యఘోష పెంచారు. వెరసి, ఫస్టాఫ్‌లో 
కథ ముందుకు జరగకపోయినా డైలాగ్ మీద డైలాగ్ పడిపోయే
 ఆర్టిస్టుల హడావిడి, రీరికార్డింగ్ హంగామాతో ఉక్కిరిబిక్కిరవుతాం.
 సెకండాఫ్‌లో పృథ్వి ఎంటరయ్యాక జనం వినోది స్తారు. 
డబ్బు కన్నా అనుబంధాలు ఎక్కువని చెప్ప డానికీ,
హీరోకూ- ఫ్యామిలీకీ మధ్య ఎమోషనల్ స్ట్రగుల్‌కీ తోడ్పడే
 సీన్లు ఇంకా అల్లుకోవాల్సింది.

ముగింపు దగ్గరకొస్తుంటే వేగం పెరిగే ఈ ఫిల్మ్‌లో ఆఖరి
 టైటిల్ కార్డు - ‘వేర్లు బలంగా ఉంటేనే చెట్టు నిలుస్తుంది. 
బంధాలు బలంగా ఉంటేనే కుటుంబం నిలుస్తుంది’. అలాగే,
 స్క్రిప్టు బలంగా ఉంటేనే సినిమా నిలుస్తుంది. మరి, ఆ బలం,
 బాక్సా ఫీస్ దగ్గర అలా నిలిచే సత్తా ఈ ‘శంకరాభరణం’కి ఉందా? 
అది ప్రేక్షకదేవుళ్ళు చెప్పాల్సిన తీర్పు.

 - రెంటాల జయదేవ

.................................................. 
* హిందీ హిట్ ‘ఫస్ గయేరే ఒబామా’ హక్కులు కొని, దాన్ని
 తెలుగులోకి మలుచుకున్నారు కోన వెంకట్.  ఈ చిత్రానికి
 పనిచేసిన సంగీత దర్శకుడు ప్రవాస భారతీయుడు.

* బీహార్ నేపథ్యంలో జరిగే ఈ కిడ్నాప్ కథ షూటింగ్
 ప్రధానంగా  మహారాష్ట్ర, పరిసరాల్లో చేశారు. ఇటీవల 
రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చిన కొద్ది సినిమాల్లో ఇది ఒకటి.
....................................................

(Published in Sakshi daily, 5th Dec 2015, Saturday)

Monday, December 14, 2015

యాక్టింగ్ గ్రేట్... డెరైక్షన్ వీక్... తమాషా ( ‘తమాషా’ (హిందీ) మూవీ రివ్యూ)

యాక్టింగ్ గ్రేట్... డెరైక్షన్ వీక్... తమాషా
కొత్త సినిమా గురూ! -  ‘తమాషా’ (హిందీ)


రొమాంటిక్ సినిమాలు తీయడంలో దిట్ట దర్శకుడు ఇమ్తియాజ్ అలీ.
మాజీ ప్రేమికులు - రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకోనే.
వీళ్ళ ముగ్గురి కాంబినేషన్‌లో ఒక చిత్రమైన ప్రేమకథ.
తాజా హిందీ చిత్రం ‘తమాషా’ మీద ఆసక్తి కలగడానికి 

అంతకన్నా ఇంకేం కావాలి?
కానీ, ఇందులో చర్చించిన పాయింట్ అంతకు మించి!

చిత్రం - ‘తమాషా’ (హిందీ)
తారాగణం - రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనే
కెమేరా - రవివర్మన్
సంగీతం - ఏ.ఆర్. రహమాన్,
ఎడిటింగ్ - ఆర్తీ బజాజ్
నిర్మాత - సాజిద్ నడియాడ్‌వాలా
రచన, దర్శకత్వం - ఇమ్తియాజ్ అలీ

జీవితం ఎలా జీవించాలి? ఎవరి కోసం జీవించాలి? చిన్నప్పుడు 
ఇంట్లో తల్లి తండ్రుల నుంచి స్కూల్‌లో టీచర్ దాకా, పెద్దయ్యాక
 ఫ్రెండ్‌‌స మొదలు ఆఫీస్‌లో బాస్ దాకా ప్రతి ఒక్కరూ కండిషనింగ్ 
చేసేవాళ్ళే. చుక్కలకు ఎగరనివ్వకుండా రెక్కలు కత్తిరించేవాళ్ళే. 
మరి అప్పుడు జీవితం ఎలా జీవించాలి? ఎవరి కోసం జీవించాలి? 
తాత్త్వికంగా అనిపించినా, వాస్తవికంగా అందరూ ఎదుర్కొనే
 సమస్య ఇది.

ముఖ్యంగా, మనసుకు సంకెళ్ళు లేకుండా, ఊహాప్రపంచంలోకి 
విహరిస్తూ, నచ్చింది చేస్తూ నచ్చినట్లు బతకాలని తపించేవాళ్ళకు
 అది మరీ పెద్ద సమస్య. మరి, అలాంటి ఒక అబ్బాయి
 వేద్ (రణబీర్‌కపూర్)కీ, ఒక అమ్మాయి తార (దీపిక)కీ 
మధ్య ఒకరి గురించి మరొకరికి తెలియనప్పుడు ప్రేమ పుడితే?
 పేర్లయినా తెలియకుండానే విడిపోయిన వారిద్దరూ నాలుగేళ్ళ
 తరువాత మళ్ళీ ఎదురైతే? ఇలాంటి ఒక చిత్రమైన నేపథ్యాన్ని, 
ఎంచుకున్న సమస్యకు జోడించి, దర్శకుడు ఇమ్తియాజ్ అలీ 
అందించిన న్యూ ఏజ్ లవ్‌స్టోరీ - ‘తమాషా’.

నవతరం మనస్తత్తాన్నీ, చిత్రమైన ప్రేమకథల్నీ రంగరించి 
విచిత్రంగా చెప్పడంలో పేరున్న ఇమ్తియాజ్ అలీ ఈసారీ 
ఆ శైలినే అనుసరించారు. సాదాసీదాగా సినిమాలన్నీ నడిచే
 లీనియర్ పద్ధతిలో కాక, నాన్-లీనియర్ కథనాన్ని
 ఎంచుకున్నారు. అందుకు తగ్గట్లే ఆయన తీసుకున్న
 హీరో, హీరోయిన్ పాత్రల్లో బోలెడంత మానసిక సంఘర్షణ, 
వదులుకోలేని భయాలు, వదిలించుకోలేని గతం - వర్తమానాలు
 ఉంటాయి.

ఆ పాత్రలకు తెరపై బొమ్మ కట్టడంలో రణ్‌బీర్ కపూర్, దీపికా
 పదుకొనేలు నూటికి నూరుపాళ్ళూ సక్సెస్ అయ్యారు. 
ముఖ్యంగా తండ్రితో పాటు సొసైటీ చేసిన కండిషనింగ్‌తో 
మనసును చంపుకొని, యాంత్రికంగా ఉద్యోగం చేసే వేద్
 పాత్రలో రణ్‌బీర్ నటన బాగుంది. అలాగే, అతనెవరో తెలీని
పరిస్థితుల్లో అతనిలోని ఆ కోణాన్నే ఇష్టపడి, ప్రేమించి, ఆనక
 ఆ లక్షణం కనబడనప్పుడు దూరం జరిగే లవర్‌గా దీపిక 
యాక్షన్ సూపర్. ఈ నిజజీవిత మాజీ లవర్‌‌స మధ్య కెమిస్ట్రీ 
వెండితెరను వెలిగించింది.

గతంలో ‘జబ్ ఉయ్ మెట్’, ‘లవ్ ఆజ్ కల్’తో అభినందనలు 
అందు కున్న ఇమ్తియాజ్ అలీ ఈ సారి అనుకున్న కథను 
వెండితెరపై కన్విన్సింగ్‌గా చూపించడంలో తడబడ్డారనిపిస్తుంది.
 ఫస్టాఫ్‌లో చిన్న పిల్లాడి ఎపిసోడ్ దగ్గరే చాలాసేపు గడవడంతో, 
ఇంటర్వెల్ ముందు కానీ కాస్తంత కథ జరిగినట్లు అనిపించదు. 
అసలు కథ నడిచేదంతా సెకండాఫ్‌లో.

కాకపోతే, సెకండాఫ్‌లో ఒక దశ దాటిన తరువాత హీరో పాత్ర
 ప్రవర్తన అతని మానసిక స్వస్థతను అనుమానించేలా చేస్తుంది.
 ఒక దశలో హీరో పెళ్ళి ప్రతిపాదనను హీరోయిన్ కాదనడానికి 
కానీ, ఆ తరువాత అతణ్ణి మక్కువతో అక్కున చేర్చుకోవడానికి 
కానీ సరైన భూమికను సినిమాలో చూపెట్టలేకపోయారు. 
ఈ లోపాలు నీరుగార్చినా, సినిమాలో కాస్తయినా గుర్తుండేవి
 హీరో, హీరోయిన్ల అభినయమే.

రవివర్మన్ కెమేరా వర్‌‌కలో సిమ్లా మొదలు ఫ్రాన్‌‌స మీదుగా
 కలకత్తా, ఢిల్లీ దాకా అన్నీ కనువిందు చేస్తాయి. ఏ.ఆర్. 
రహమాన్ సంగీతంలో పంజాబీ సాంగ్ లాంటి కొన్ని ఊపు 
తెప్పిస్తాయి. హిందీ సినిమాల నిర్మాణ విలువల సంగతి 
వేరుగా చెప్పనక్కరలేదు. అన్నీ ఉన్నా... అదేదో అన్నట్లు...
 డెరైక్షన్ వీక్ అవడంతో ఆశించిన తృప్తి కలగకపోతే, ఎవరిని 
తప్పు పడతాం. 
                    
- రెంటాల

(Published in 'Sakshi' daily, 28th Nov 2015, Saturday)
.....................................

Sunday, December 13, 2015

వెళ్ళాలని తను.. వద్దని నేను! (‘తను - నేను’ మూవీ రివ్యూ)

వెళ్ళాలని తను..  వద్దని నేను!
చిత్రం: ‘తను - నేను’
తారాగణం: సంతోష్ శోభన్, అవికా గోర్, రవిబాబు
కథ - స్క్రీన్‌ప్లే - మాటలు:సాయి సుకుమార్, పి. రామ్మోహన్
ఆర్ట్: ఎస్. రవీందర్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్
సంగీతం: సన్నీ ఎం.ఆర్
సమర్పణ: డి. సురేశ్‌బాబు
నిర్మాత - దర్శకుడు: పి. రామ్మోహన్


కథ చెబుతూ... కళ్ళకు కట్టించడం వేరు. కళ్ళెదుట తెరపై చూపిస్తూ,
 మెప్పించడం వేరు. మొదటిది రచన, కథన సామర్థ్యాలకు గీటురాయి 
అయితే, రెండోది తెరపై కథాకథనమనే దర్శకత్వ నైపుణ్యానికి పరీక్ష. 
గతంలో ‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘ఉయ్యాల - జంపాల’
 లాంటి విభిన్న తరహా ప్రయత్నాలను తెర పైకి తేవడంలో పేరు
 తెచ్చుకున్న ఉన్నత విద్యావంతుడు పి. రామ్మోహన్ ఈసారి
 దర్శకుడిగా కొత్త అవతారమెత్తారు. అమెరికా డబ్బు మీద 
మోజు, ఆ జీవితం మీద వ్యామోహం పెరిగిన ప్రస్తుత 
పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో ఒక రొమాంటిక్ కామెడీ అల్లారు.

కథేమిటంటే... హైదరాబాద్‌లో ‘ఈస్ట్ వెస్ట్’ మనీ ట్రాన్స్‌ఫర్
 కంపెనీ కాల్‌సెంటర్‌లో పనిచేస్తుంటాడు కిరణ్ (సంతోష్ శోభన్). 
పెంచిన నాయనమ్మ చనిపోతే, ఆమె ఇంట్లోనే ఒంటరిగా ఉంటాడు. 
అతనికి నరేశ్ (అభిషేక్ మహర్షి) వగైరా మంచి ఫ్రెండ్స్.
 బెంగుళూరులో ఉంటున్న నరేశ్ ఫ్రెండ్ కీర్తి (అవికా గోర్)
 ఒకసారి హైదరాబాద్ వస్తుంది. ఆమెను చూసీ చూడగానే
 హీరో ప్రేమిస్తాడు. కొన్ని సీన్ల తరువాత ఆమె కూడా అతని 
ప్రేమలో పడుతుంది.

కీర్తి కుటుంబానిదో కథ. తండ్రి బండిరెడ్డి సర్వేశ్వరరావు (రవిబాబు)కు 
అమెరికా పిచ్చి. కొడుకు, కూతురైనా బాగా చదివి, అమెరికా వెళ్ళి, 
డబ్బు సంపాదిస్తే, తాను పెద్ద ఇల్లు, కారు కొనుక్కోవాలనుకొనే 
తరహా. కొడుకేమో లవ్ మ్యారేజ్ చేసుకొని, చెక్కేస్తాడు. 
తండ్రి కోరికకు కట్టుబడి, ఎనిమిదో ఏటే దేవుడి మీద ఒట్టేసి మరీ
 ఒప్పుకున్న కూతురు కీర్తి. అమెరికా వెళ్ళాలన్నది ఆమె ధ్యేయం. 
హీరో అందుకు పూర్తిగా విరుద్ధం. అమెరికా అన్నా, అక్కడ సెటిలైన 
ఎన్నారైలన్నా కడుపు మంట. ఛస్తే అక్కడికి పోనంటాడు.
 అక్కడికి ‘బ్రేక్’ (అప్).

 సెకండాఫ్‌కి వస్తే, హీరోకూ, అమెరికా అంటే అతనికున్న
 అసహ్యానికీ ఒక చిన్న ఫ్లాష్‌బ్యాక్. ఏడాది వయసున్న హీరోను 
వదిలేసి, అతని అమ్మా నాన్న డబ్బు సంపాదన వేటలో అమెరికా
 వెళ్ళిపోతారు. గత 20 ఏళ్ళలో మూడే మూడుసార్లు ఇండియా వచ్చి, 
చూసిపోతారు. నాయనమ్మ దగ్గరే పెరిగిన హీరోకు, ఆమె చనిపోయినా
 రాని నాన్న అంటే సహజంగానే అసహ్యం. అందుకే, ఎవరూ లేరన్నట్లు
 పెరుగుతుంటాడు. ఈ విషయం తెలిసిన హీరోయిన్ అమెరికా వెళ్ళడం
 మానేసి అయినా, హీరోనే పెళ్ళాడాలనుకుంటుంది. కానీ, వాళ్ళ
 పెళ్ళికి హీరోయిన్ తండ్రి అడ్డంకి అవుతాడు. అప్పుడు హీరో 
ఏం కోరుకున్నాడు? ఏమైంది?

వినోదం నిండిన ఈ ప్రేమకథ సంతోష్ శోభన్‌కు హీరోగా తొలి సినిమా.
 ఆ అనుభవ రాహిత్యమేదీ కనిపించనివ్వలేదీ కొత్త కుర్రాడు. 
అవికా గోర్ కెరీర్ జాబితా లెక్క ఈ సినిమాతో మరో అంకె పెరిగింది.
 పురుషాధిక్య భావజాలం, బద్ధకం నిండిన శాడిస్టు బండిరెడ్డి
 సర్వేశ్వరరావు పాత్రలో హీరోయిన్ తండ్రిగా రవిబాబు ఉన్న 
కాసేపు హాలులో కొత్త ఉత్సాహం తెస్తారు. ఇక, హీరోయిన్ తల్లి
 పాత్రలో సత్యా కృష్ణన్‌ది మొగుడి ప్రవర్తనను సదా మనసులోనే
 తిట్టుకొనే మహిళ పాత్ర. అందుకే, భర్త చనిపోయాక ఆమెలో
 విషాదఛాయలేమీ లేకపోవడం సహజమనుకోవాలి. అభిషేక్
 మహర్షి వినోదం పంచుతారు.  

ఇప్పటి వరకు నిర్మాతగా ఉన్న పి. రామ్మోహన్‌కు దర్శకుడవడంతో 
వంట చేయించుకొనే బాధ్యత నుంచి చేసే బాధ్యతకు మారినట్లయింది.
 దాని వల్ల వచ్చే పాజిటివ్‌లు, నెగటివ్‌లు కూడా సహజమే. ఆ శైలి 
చూస్తే - నగేశ్ కుకునూర్, శేఖర్ కమ్ముల లాంటి దర్శకుల తొలినాళ్ళు, 
స్వతంత్ర సినీ రూపకర్తల సినిమాలు గుర్తుకొస్తాయి. అందుకే, దీన్ని
 పూర్తి కమర్షియల్ సినిమాగా చూడలేం. సాంకేతిక విభాగాల తీరూ 
అందుకు తగ్గట్లే ఉన్నాయి.

సెపరేట్ కామెడీ, స్పెషల్ ఐటమ్ సాంగ్‌లు లేని ఈ ప్రేమకథలో తీసుకున్న
 పాయింట్ చిన్నది. 130 నిమిషాల సినిమాగా మజ్జిగ పల్చ నైంది. 
వరస చూస్తే పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం 
మంచిదని ఈ దర్శక, నిర్మాతల అభిప్రాయమేమో అనిపిస్తుంది.
 వేగంగా పరుగులు తీయకున్నా, ఫస్టాఫ్ బాగుందనిపించేలా 
నడిపారు. హీరో ఫ్లాష్‌బ్యాక్ కథ బయటికొచ్చి, కథలో కీలక
 పాయింట్ తెలిసిన తరువాత పరిస్థితి మారింది. ఒక్కముక్కలో- 
ఈ కథ సంసారపక్షం. కథనమే కాదు, నిర్మాణమూ అంతే. 
రొమాంటిక్ కామెడీలు చూసేవారి కిది ఓ.కె. అంతకు మించి 
అదనంగా ఏదైనా కోరుకుంటేనే చిక్కు!

.......................................................
ఈ స్క్రిప్ట్ రామానాయుడు ఫిల్మ్‌స్కూల్ సాయిసుకుమార్ రాసింది.
 కేవలం 33 షూటింగ్ డేస్.  
హైదరాబాద్ పరిసరాల్లో, వికారాబాద్‌లో షూటింగ్. 
సెకండాఫ్‌లోని డ్యూయట్ పుణే దగ్గర లోనావాలా పరిసరాల్లో తీశారు.
  హీరో సంతోష్ శోభన్ ‘వర్షం’ చిత్ర దర్శకుడైన శోభన్ 
కుమారుడు. గతంలో ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంలో 
క్రికెట్ టీవ్‌ు కెప్టెన్ పాత్ర పోషించారు. ఇప్పుడు హీరోగా పరిచయం.
...........................................................

- రెంటాల జయదే 

(Published in 'Sakshi' daily, 28th Nov 2015, Saturday)
.......................................

Tuesday, December 8, 2015

సై..... జీరో! - వెయిట్ లెస్ ఎంటర్‌టైనర్! ( ‘సైజ్ జీరో’ మూవీ రివ్యూ)

సై జీరో!

కొత్త   సినిమా గురూ!
 
చిత్రం: ‘సైజ్ జీరో’
తారాగణం: అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్
రచన: కనిక కోవెలమూడి
సంగీతం: కీరవాణి
కెమేరా: నీరవ్ షా
ఆర్ట్: ఆనంద్ సాయి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం;
నిర్మాత: పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే
దర్శకత్వం: ప్రకాశ్ కోవెలమూడి.

 
సైజ్ జీరో... నాజూకైన నడుము... ఇవాళ తరచూ వినిపిస్తున్న మాట.
 అవును. సౌందర్య సాధనాలు, ఉత్పత్తులు, బరువు తగ్గడం 
అనేవి ప్రత్యేక పరిశ్రమలుగా, వేల కోట్ల రూపాయల 
వ్యాపారంగా మారినప్పుడు సహజమైన శరీరాకృతీ 
సహించరానిదే అవుతుంది. సమాజం మొత్తానికీ 
జెన్నీఫర్ లోపెజ్ లాంటి నాజూకు నడుములే కంపల్సరీ
 కండిషనింగ్ టెంప్లేట్‌లవుతాయి. అందాల పోటీలు మన
 ఇంటి దాకా దిగుమతి అయిందీ, మన అమ్మాయిల 
తల మీద అందాల రాణి కిరీటాలను ఎక్కించిందీ అందుకే! 
ఈ ఆలోచనల నేపథ్యంలో ‘సైజ్ జీరో’ పిచ్చిని ఆలంబనగా
 చేసుకొని ప్రకాశ్ కోవెలమూడి తీసిన సినిమా - ‘సైజ్ జీరో’ 
(సన్నజాజి నడుము అనేది ఉపశీర్షిక).సౌందర్య అలియాస్
 స్వీటీ (అనుష్క) కథ ఇది. బరువు తూచే మిషన్, దానిలో
 నుంచి వచ్చే కార్డు వెనుక ఉండే భవిష్యత్ వాణితో 
చిన్నప్పటి నుంచి ఆమెకు విడదీయరాని అనుబంధం.

చిన్నతనంలోనే నాన్న (రావు రమేశ్)ను పోగొట్టుకుంటుంది.
 అమ్మ రాజేశ్వరి (ఊర్వశి), తాత (గొల్లపూడి మారుతిరావు)... 
‘సాఫ్ట్‌వేర్’ అంటూ లోదుస్తుల వ్యాపారం చేసే తమ్ముడు 
యాహూ (భరత్) - హీరోయిన్ కుటుంబ సభ్యులు.
 హీరోయిన్ ‘సైజ్’ చూసి, వచ్చిన పెళ్ళి సంబంధాలన్నీ
 తప్పిపోతుంటాయి. ఎన్నారై డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ 
అభి (తమిళ హీరో ఆర్య) సంబంధం తప్పిపోయినా, వాళ్ళ 
మధ్య స్నేహం కొనసాగుతుంది. హీరోయిన్ అతణ్ణి మనసులో
 ఇష్టపడుతుంటుంది. ‘క్లీన్ ఇండియా’ డాక్యుమెంటరీ తీస్తున్న 
హీరో అదే టైమ్‌లో బ్రిటన్ నుంచి వచ్చిన మెరుపు తీగ లాంటి 
ఎన్జీఓ పిల్ల సిమ్రన్ (సోనాలీ చౌహాన్)కు క్రమంగా 
దగ్గరవుతుంటాడు. హీరోయిన్ గుండె బద్దలవుతుంది. 
అది ఫస్టాఫ్.

సత్యానంద్ (ప్రకాశ్‌రాజ్) నడుపుతున్న సైజ్ జీరో 
ప్రోగ్రామ్‌లో హీరోయిన్ చేరుతుంది. అందాల పోటీలకు
 వెళ్ళాలనుకుంటున్న హీరోయిన్ ఫ్రెండ్ కూడా అదే 
ప్రోగ్రామ్ చేస్తూ, ఒంట్లో కొవ్వు తగ్గించేందుకు అక్కడ 
వాడుతున్న అనారోగ్యకరమైన పద్ధతుల కారణంగా
 ఆస్పత్రి పాలవుతుంది. అక్కడ నుంచి హీరోయిన్ ఆ
 మోసకారి వెయిట్ రిడక్షన్ ప్రోగామ్ మీద పోరాటం
 మొదలుపెడుతుంది. దానికి, హీరో సాయం కూడా 
తీసుకుంటుంది. వాళ్ళు ‘పి.వి.పి. స్పోర్ట్స్’ శేఖర్ (అడివి శేష్) 
సాయంతో ఏం చేశారు? సిమ్రన్‌కూ, హీరోయిన్‌కూ మధ్య 
ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా సాగిన ప్రేమ చివరకు ఏమైందన్నది
 సినిమా రెండు గంటల పది నిమిషాల నిడివే ఉన్న 
ఈ సినిమాకు బలం - కొంత ప్యాడింగ్‌లు పెట్టుకున్నా,
 స్వయంగా బరువు పెరిగి మరీ అనుష్క చేసిన ‘బిగ్‌సైజ్’ 
సాహసం. ఆమె నటన చాలా ఈజ్‌తో సాగింది. ఆ తరువాత
 మనసుకు హత్తుకునేవి తల్లి పాత్ర, తాత పాత్ర. హీరోగా
 ఆర్య తమిళ వెర్షన్‌కూ పనికొచ్చే ఛాయిస్. హీరోయిన్
 తమ్ముడు కామిక్ రిలీఫ్.

నిర్మాణ విలువలు పుష్కలంగా ఉన్న ఈ సినిమాలో
 కెమేరా (నీరవ్ షా) వర్క్ బాగుంది. ‘‘ఇన్నాళ్ళూ 
నేను నీ కూతుర్ని అనుకున్నా. కానీ, కష్టాన్నని 
ఇప్పుడే అర్థమైంది’’ (తల్లితో హీరోయిన్) లాంటి 
కొన్ని డైలాగులు (రచయిత కిరణ్) బాగున్నాయి. 
నిజానికి లావాటి వ్యక్తులు, వాళ్ళ ప్రేమ, పెళ్ళి కష్టాలు 
 కొత్తేమీ కాదు. కమలహాసన్ ‘సతీ లీలావతి’, ఇ.వి.వి
 ‘కితకితలు’, ‘లడ్డూబాబు’, హిందీ హిట్ ‘దమ్ లగాకే హైసా’
 లాంటివన్నీ ఆ అంశాన్ని ఒక్కో రకంగా చూపెట్టినవే. ఇప్పుడీ
 ‘సైజ్ జీరో’ కొనసాగింపు. ‘క్లీన్ ఇండియా’ అంటూ 
‘టాయిలెట్ క్లీన్ చెయ్... డాక్టర్‌ను దూరం చెయ్’
 నినాదంతో ‘స్వచ్ఛభారత్’ ప్రోగ్రామ్‌కు ఫస్టాఫ్ మంచి
 పబ్లిసిటీ. హీరోయిన్ సమస్యకు పరిష్కారం చూపాల్సిన 
సెకండాఫ్ మరో టర్న్ తీసుకుంది. ‘గెట్ ఫిట్... డోన్ట్ క్విట్’ 
అంటూ ‘పి.వి.పి. స్పోర్ట్స్’ ఇనీషియేటివ్‌కూ, ఫిట్‌నెస్ 
అవసరానికీ పెద్ద పీట వేసింది. హీరోయిన్‌తో తన
 తల్లి పెంపకం గురించి ఊర్వశి చెప్పే సీన్లు లాంటివి
 సెంటిమెంటల్ ఫీల్ తెచ్చాయి. కథలో పోరాటం
 పెరిగి, ప్రేమ, హీరోయిన్  తాలూకు మానసిక 
సంఘర్షణ తగ్గడం చిక్కే.  
 
మొత్తం మీద అందమంటే మానసికమైనది 
కూడా అనీ, ‘సంతోషంతో ఉండే అమ్మాయిలే 
అసలైన అందమైన అమ్మాయిలు’ అనీ గుర్తుచేస్తుందీ
 ‘సైజ్ జీరో’. హాల్లో నుంచి బయటకొస్తుంటే ఎవరో అన్నట్లు, 
ఇది ‘బొద్దు’మనసుతో చూడాల్సిన వెయిట్ లెస్ ఎంటర్‌టైనర్!
 
 ................................................
► సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమా టైటిల్‌సాంగ్ సాకీ పాడుతూ, జోస్యుడిలా కనపడతారు.
► ఈ సినిమా కోసం అనుష్క ఏకంగా 17 కిలోల పైగా బరువు పెరిగారు.
 తెలుగుతో పాటు తమిళంలోనూ తీసిన ఈ సినిమా ‘ఇంజి ఇడుప్పళగి’గా అక్కడ రిలీజైంది.
 నాగార్జున, తమన్నా సహా 7 మంది తారలు ఒక చోట గెస్ట్‌లుగా మెరుస్తారు.
► ఆర్యకు యువహీరో నందు తెలుగుడబ్బింగ్ చెప్పారు.
......................................

- రెంటాల జయదే 

(Published in Sakshi daily, 28th November 2015, Saturday)
.................................

Saturday, November 28, 2015

ఎప్పటిలానే... 'స్పెక్టర్' బాండ్ ( 'స్పెక్టర్' మూవీ రివ్యూ)

ఎప్పటిలానే... 'స్పెక్టర్' బాండ్
చిత్రం - ‘స్పెక్టర్’
తారాగణం - డేనియల్ క్రెగ్, క్రిస్టఫ్ వాల్ట్జ్, లీ సేడాక్స్, మోనికా బెలూచీ 
కెమేరా - హొయ్‌టే వాన్ హోయ్‌టెమా
దర్శకత్వం- శామ్ మెన్‌డెస్
నిడివి- 147 నిమిషాలు 

‘బాండ్... జేమ్స్‌బాండ్...’ ప్రపంచం మొత్తాన్నీ ఊపేసిన డైలాగ్ ఇది. 
తెరపై ఆ డైలాగ్.., ‘ట..డ..ట్టడా...య్...’ అనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 
వినని వాళ్ళూ, విని ఇష్టపడనివాళ్ళూ అరుదు. జేమ్స్‌బాండ్ జానర్
 సినిమాలకున్న ఎడ్వాంటేజ్ అది. అశేష అభిమానులు, నిర్ణీతంగా
 సినిమాకొచ్చే ప్రేక్షకులూ ఎప్పుడూ రెడీ! తాజా జేమ్స్‌బాండ్ చిత్రం
 ‘స్పెక్టర్’ మీద అమితమైన ఆసక్తికి అదే కారణం. హాలీవుడ్
 జేమ్స్‌బాండ్ చిత్రాల సిరీస్‌లో ఇది 24వ సినిమా.

 ఒకప్పుడు సీన్ క్యానరీ, రోజర్ మూర్, పీర్స్ బ్రోస్నన్ లాంటి 
నటులు జేమ్స్‌బాండ్‌గా అలరిస్తే, ‘క్యాసినో రాయల్’, 
‘క్వాంటమ్ ఆఫ్ సోలేస్’, ‘స్కై ఫాల్’ లాంటి సినిమాల నుంచి
 డేనియల్ క్రెగ్ ఆ పాత్రను చేపట్టారు. ‘ఇదే నా ఆఖరి బాండ్ సినిమా’ 
అని డేనియల్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్న ఈ సినిమా 
కథ కూడా సగటు జేమ్స్‌బాండ్ సినిమాల్లో కథలానే ఉంటుంది. 
కాకపోతే, హీరోపై విలన్‌కు కాస్తంత పాత వ్యక్తిగత ద్వేషం 
కూడా ఉన్నట్లు కలిపారు. ‘స్పెక్టర్’ అనేది ఒక రహస్య
 సంస్థ పేరు. దాన్ని నడిపే ఒక విలన్. పేరు ఫ్రాంజ్ 
ఒబెర్‌హాసర్ (క్రిస్టఫ్ వాల్ట్జ్). అతను అలా సరికొత్త ఇంటెలిజెన్స్ 
సర్వీస్ నడుపుతూ దేశాల రహస్యాలను కనిపెట్టి, అందరినీ 
ఆట ఆడిస్తుంటాడు. ఆ టైమ్‌లో జేమ్స్‌బాండ్ 007 (డేనియల్ క్రెగ్) 
రంగప్రవేశం. ‘స్పెక్టర్’ కథా కమామిషు తెలుసుకోవడానికి ప్రయత్నాలు
 మొదలుపెడతాడు. ఆ క్రమంలో కథ లండన్, మొరాకో, ఆస్ట్రియా -
 ఇలా పది దేశాల మీదుగా తిరుగుతుంది.

 ఒకప్పుడు ‘స్పెక్టర్’లో పనిచేసిన ఒక ముసలి వ్యక్తిని హీరో 
కలుసుకుం టాడు. డాక్టరైన అతని కూతుర్ని (లీ సేడౌక్స్) 
కాపాడతానంటూ వాగ్దానం చేస్తాడు. వెంటాడుతున్న విలన్ 
అనుచరుల నుంచి తప్పించుకుంటూ, వాళ్ళ బారి నుంచి 
ఆ అమ్మాయిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తాడు. 
ఆ క్రమంలో కారు ఛేజ్‌లు, వైమానిక విన్యాసాలు,
 కాల్పులు, పేలుళ్ళ లాంటి అంశాలన్నీ మామూలే. 
చివరకు ‘స్పెక్టర్’ను నడిపే ప్రధాన విలన్ ఆటకట్టించాడన్నది 
మన తెలుగు సినిమాల లెక్కన రెండున్నర గంటలు 
తెరపై చూడాల్సిన కథ.

 ‘క్యాసినో రాయల్’ మొదలు మొన్నటి ‘స్కై ఫాల్’, 
ఇవాళ్టి ‘స్పెక్టర్’ దాకా జేమ్స్‌బాండ్ అంటే... డేనియల్ క్రెగ్గే. 
అతని బాడీ లాంగ్వేజ్, చేసిన యాక్షన్ ఘట్టాలు బాండ్ 
పాత్రకు కొత్త రూపం తెచ్చాయి. ప్రపంచాన్ని ఒంటిచేత్తో కాపాడే
 బ్రిటీష్ గూఢచారి పాత్రలో ఎప్పటికప్పుడు జీవించడానికి ఆయన
 కృషి చేస్తూనే ఉన్నారు. విశేషమేమంటే, ఈ సినిమాలో 
విలన్ అంతే దీటుగా ఉండడం. ఆస్కార్ లాంటి అత్యున్నత 
పురస్కారాలెన్నో అందుకున్న క్రిస్టఫ్ వాల్ట్జ్ విలన్ పాత్రనూ, 
క్రూరత్వాన్నీ నేర్పుగా చూపించారు.

 ఈ సినిమా కోసం భారీయెత్తున పెట్టిన ఖర్చు, చాలా శ్రమతో 
చేసిన యాక్షన్ సీన్లు, వేసిన సెట్లు, తిరిగిన దేశదేశాలు 
తెరపై కనిపిస్తుంటాయి. విజువల్స్ వండర్‌ఫుల్ అనిపిస్తాయి.
 ముఖ్యంగా, రీ-రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రత్యేకించి 
చెప్పుకోవాలి. కానీ, కథ మాత్రం పాత సినిమాల్లోని 
ఘట్టాలకు కొత్త తిరగమోత. అలాగే, పాత్రల మధ్య ఎమోషన్లూ
 సహజమనిపించవు. యాక్షన్ సీన్లను మినహాయిస్తే, 
మిగిలిన సందర్భాల్లో కథ సుదీర్ఘంగా సాగు తుంది. 
అందుకే, ‘స్కైఫాల్’ దర్శకుడు, రచయితల బృందమే 
ఈ సినిమాకూ పనిచేస్తోందంటే కలిగిన ఉత్సాహం 
ఈ సినిమా చూస్తుండగా నిలవదు.  

 అయితే, జేమ్స్‌బాండ్ తరహా సినిమాలను ఇష్టపడేవాళ్ళకు
 ఈ సినిమా మంచి కాలక్షేపమే. వరుసగా జేమ్స్‌బాండ్ 
సినిమాలన్నీ చూస్తూ వస్తున్న వాళ్ళకు వీటిలో కొత్త 
సంగతులు ఉండకపోవచ్చు. సరికొత్త విశేషాలు కనపడకపోవచ్చు. 
చాలా భాగం సంఘటనలు పదే పదే రిపీట్ అవుతున్నవే
 కావచ్చు. కానీ, వాటన్నిటినీ ఎప్పటికప్పుడు కొత్త తరహా దృశ్యాలుగా... 
ఉద్విగ్నభరితమైన సన్నివేశాలుగా... కుర్చీ అంచున కూర్చొని 
చూడాల్సిన విన్యాసాలుగా... తీర్చిదిద్దడంలోనే నేర్పు ఉంది. 
సక్సెస్‌ఫుల్ జేమ్స్‌బాండ్ సినిమాలు తీసేవాళ్ళకు అది తెలియాలి. 
చూసేవాళ్ళు అది తెలిసీ చూడాలి. హాలీవుడ్ మేకింగ్ వ్యాల్యూస్‌తో
 ‘స్పెక్టర్’ అలానే అనిపిస్తుంది. మునుపటి చిత్రాలతో పోలిస్తే 
నిరాశపరిచినా, లాజిక్ వెతకని సామాన్య బాండ్ ప్రేమి కుల్ని 
అలరిస్తుంది. పైగా, నాలుగు భాషల్లో (ఇంగ్లీషు, హిందీ, 
తెలుగు, తమిళం) వెయ్యికి పైగా హాళ్ళలో రిలీజవడం 
‘స్పెక్టర్’కు కలిసొచ్చే అంశం.
.........................................
నిజానికి, ‘స్పెక్టర్’ చిత్రం బ్రిటన్‌లో ఈ అక్టోబర్ 26న, అమెరికాలో, ఇతర ప్రాంతాల్లో ఈ నెల 6న రిలీజైపోయింది. మన దేశంలో మాత్రం ఆలస్యంగా వచ్చింది. ‘ప్రేమ్త్రన్ ధన్ పాయో’ లాంటి భారీ చిత్రాలు ఉండడంతో పంపిణీదారులైన సోనీ పిక్చర్స్ ఇండియా వారు ఈ చిత్రాన్ని ఇక్కడ ఆలస్యంగా రిలీజ్ చేశారని ఒక కథనం.
................................

 రెంటాల జయదేవ
..........................

Thursday, November 26, 2015

చాలా మెచ్యూరిటీ అవసరం..! ( ‘కుమారి 21ఎఫ్’ మూవీ రివ్యూ)

కొత్త సినిమాలు గురూ!
 చాలా మెచ్యూరిటీ అవసరం..!

చిత్రం: కుమారి 21ఎఫ్; తారాగణం: రాజ్ తరుణ్, హేబా పటేల్, హేమ; 
మాటలు: పొట్లూరి వెంకటేశ్వరరావు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; 
కెమేరా: ఆర్. రత్నవేలు; యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్;
 కథ, స్క్రీన్‌ప్లే, సమర్పణ: సుకుమార్; 
నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి; 
 దర్శకత్వం: పల్నాటి సూర్యప్రతాప్; నిడివి: 133 నిమిషాలు


ఒకమ్మాయి, ఒకబ్బాయిని చూసి ‘ఎంతకొస్తావ’ని అడగడం చిత్రమే! 
చూసీచూడగానే ప్రేమలో పడ్డ అబ్బాయికి ఫస్ట్ కిస్ ఇవ్వడం... అతను
 తనను చూడాలనుకుంటున్న రీతిలో చూపడం... కచ్చితంగా విచిత్రమే!
 ‘‘ఫీల్ మై లవ్’’ అంటూ... వన్‌సైడ్ లవ్ (‘ఆర్య’ గుర్తుందిగా) లాంటి విభిన్న
 తరహా న్యూ ఏజ్ లవ్‌స్టోరీలు అల్లే దర్శక- రచయిత బి. సుకుమార్
 ఆలోచనలు ఎప్పుడూ ఇలానే ఉంటాయి. అలా ఆయన రాసుకొని, 
నిర్మాతగా వెండితెరకు అందించిన కథ - ‘కుమారి 21ఎఫ్’.

టచ్ ఫోన్‌లో టైటిల్స్ వేయడం దగ్గర నుంచే రొటీన్ కథలకు విభిన్నమైన
 సినిమాగా ‘కుమారి 21ఎఫ్’ మొదలవుతుంది. కాలనీలో ఫ్రెండ్స్‌తో 
సరదాగా తిరిగే కుర్రాడు సిద్ధు (రాజ్‌తరుణ్). తల్లి నర్సు (హేమ). 
తండ్రి విడిపోయి, వేరొక చోట ఉంటాడు. చదివిన క్యాటరింగ్ చదువుతో 
సింగపూర్‌లో స్టార్ క్రూయిజ్‌లో షెఫ్‌గా చేరాలని హీరో లక్ష్యం. అతనికి 
శంకర్ (నోయెల్), సెల్‌ఫోన్ ఫోటో సురేశ్ (నవీన్), సొల్లు శీను (సుదర్శన్)లు
 ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. ఏ.టి.ఎం.లలో దొంగతనాల లాంటివి చేస్తూ 
ఆ ముగ్గురూ బతికేస్తుంటారు. చిన్నా చితకా సినిమాల్లో చేసే
 మోడల్ కుమారి (హేబా పటేల్) ముంబయ్ నుంచి వాళ్ళ కాలనీలోకి
 ఎంటరవుతుంది. బోల్డ్‌గా మాట్లాడుతూ, బోళాగా ఉండే ఆ అమ్మాయి 
తొలిచూపులో హీరోను ప్రేమిస్తుంది. తొలిముద్దు తొలిప్రేమ అతనితోనే 
పంచుకున్నానంటుంది.

కానీ, మోడళ్ళ జీవితం, హీరోయిన్ ప్రవర్తన గురించి నెగటివ్ కామెంట్స్‌తో
 హీరో మనసులో ఫ్రెండ్స్ అనుమాన బీజం నాటతారు. దాంతో, తీరా హీరో
 తన లవ్ చెప్పే టైమ్‌కి అతనికి మెచ్యూరిటీ లేదు పొమ్మంటుంది హీరోయిన్.
 అక్కడ నుంచి హీరోలో మానసిక ఘర్షణ. ఇక, ఈజీమనీకి అలవాటుపడ్డ
 హీరో ఫ్రెండ్స్ ఏ.టి.ఎం. లూఠీకి తెగబడతారు. అప్పుడేమైంది? హీరో ప్రేమ 
మాటేమిటన్నది మిగతా కథ.

 ‘సినిమా చూపిస్త మావ’ ఫేవ్‌ు రాజ్‌తరుణ్ అచ్చంగా సిద్ధూ పాత్రే 
అనిపిస్తారు. బ్యాక్‌గ్రౌండ్, బయోడేటా బదులు హైట్, వెయిట్, బాడీ కొలతలు 
చెప్పే మీనాకుమారి అలియాస్ కుమారిగా హేబా పటేల్ పొట్టి లాగూలు, 
స్కర్టులతో హుషారుగా కనిపిస్తారు. ఆమెకు తెలుగు డబ్బింగ్ (లిప్సిక)
 బాగా కుదిరింది. హీరో ఫ్రెండ్స్ పాత్రలు నవ్వించడానికి, అడల్ట్ కామెడీకి
 కథలో పనికొచ్చాయి. మ్యూజిక్ (దేవిశ్రీప్రసాద్), కెమేరా (రత్నవేలు) 
బాగున్నాయి. ఇక, సినిమాలోని బ్యాంకాక్ పాట, అలాగే
 ‘లవ్ చేయాలా... వద్దా’ పాటలోని సాహిత్యం నిజజీవితానికి 
అద్దం పట్టిన సమకాలీన భావవ్యక్తీకరణలు.

ఈ ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా పెద్దలు చూడాల్సినదే. పెద్దలు కావడానికి 
సిద్ధమవుతున్న టీనేజ్ ప్రేమికులూ చూసి, అర్థం చేసుకొని, 
ఆలోచించాల్సిన అంశాలూ దీనిలో ఉన్నాయి. ‘నేనెలాగైనా తిరగచ్చు
 కానీ, నేను జీవితం పంచుకొనేవాళ్ళు ఎన్నడూ, ఎవరితో తిరగని 
వాళ్ళయ్యుండాలి’ అనే పురుషస్వామ్య ఆలోచనకు ప్రతిబింబం హీరో 
పాత్ర. మరోపక్క, ఏ బంధానికైనా అమిత శత్రువు అనుమానం. 
దీన్ని తల్లి పాత్రలో ప్రస్తావిస్తారు.

ఒక విధంగా చూస్తే - ఇలాంటి అంశాలను ధైర్యంగా తెరపై చర్చించడం 
సాహసమే. ఆ సాహసానికి ఒడికట్టి, నవతరం మాట్లాడుకొనే యాస, భాష 
వాడడంతో అనివార్యంగా సినిమాలో దాదాపు పాతిక దాకా కత్తెరలు
 పడ్డట్లున్నాయి. ఒక డైలాగ్ రైటర్, మరో ముగ్గురు అదనపు రచయితలు 
పనిచేసిన ఈ సినిమాలో మాటలు ‘మ్యూట్’ అయ్యాయి. బొమ్మలు ‘బ్లర్’ 
అయ్యాయి. లవ్ ఏజ్‌లో ఉండే టీనేజర్ల అంతరంగంలోని గందరగోళాల్ని
 పచ్చిగానే అయినా, బోరనిపించకుండా బోల్డ్‌గా చెప్పడం ఫస్టాఫ్‌లో 
కనిపిస్తుంది. సెకండాఫ్‌లో పాత్రలతో పాటు కథ కూడా గుంజాటనలో 
పడుతుంది. క్లైమాక్స్ ముందు నుంచి వేరొక రూపం తీసుకుంటుంది. 
లవ్‌స్టోరీ ఫీల్‌తో సాగే ఫిల్మ్ చివరకొచ్చేసరికి క్రైమ్‌కథగా ముగుస్తుంది.
 విడాకులతో హీరో తల్లీ తండ్రి 20 ఏళ్ళ క్రితం విడిపోయారన్న సంఘటన, 
తండ్రి ప్రవర్తన, ముగింపు లాంటివన్నీ సినిమాటిక్ స్క్రీన్‌ప్లే కన్వీనియన్సే.
 లోటుపాట్లెలా ఉన్నా, ఆలోచించాల్సినవీ, యూత్‌ను ఆకర్షించేవీ ఉన్న
 సినిమాగా ‘కుమారి 21ఎఫ్’ నిలుస్తుంది. ఆకర్షణ సరే కానీ, ఆలోచించే
 మెచ్యూరిటీ ప్రేమించే వాళ్ళతో పాటు, సినిమా తీసేవాళ్ళు, చూసేవాళ్ళకూ
 అవసరమే. అది ఎందరికుందన్నది ప్రశ్న. అంత మెచ్యూర్డ్ కుమారి
 పాత్రల్ని బాహా టంగా ఎవరు, ఏ మేరకు స్వాగతిస్తారన్నది 
వేచిచూడాల్సిన జవాబు.

....................................
- హైదరాబాద్‌లో మలక్‌పేట ఆర్ అండ్ బి క్వార్టర్‌‌సలో 60 శాతం ఫిల్మ్ తీశారు. 
- ఒక్క పాట కోసం బ్యాంకాక్ వెళ్ళారు. 
- 70 వర్కింగ్ డేస్. బడ్జెట్ 6 కోట్లు.  
-దేవిశ్రీప్రసాద్, రత్నవేలు డబ్బు తీసుకో లేదు. సుకుమార్ పార్‌‌టనర్‌‌సగా చేశారు. 
- ‘ఆర్య’ నుంచి సుకుమార్‌తో పని చేస్తూ ‘కరెంట్’తో డెరైక్టరైన సూర్య ప్రతాప్‌కి ఇది రెండో సినిమా.
........................................

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 21st Nov 2015, Saturday, Family Page)
..................................