జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, December 13, 2015

వెళ్ళాలని తను.. వద్దని నేను! (‘తను - నేను’ మూవీ రివ్యూ)

వెళ్ళాలని తను..  వద్దని నేను!
చిత్రం: ‘తను - నేను’
తారాగణం: సంతోష్ శోభన్, అవికా గోర్, రవిబాబు
కథ - స్క్రీన్‌ప్లే - మాటలు:సాయి సుకుమార్, పి. రామ్మోహన్
ఆర్ట్: ఎస్. రవీందర్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్
సంగీతం: సన్నీ ఎం.ఆర్
సమర్పణ: డి. సురేశ్‌బాబు
నిర్మాత - దర్శకుడు: పి. రామ్మోహన్


కథ చెబుతూ... కళ్ళకు కట్టించడం వేరు. కళ్ళెదుట తెరపై చూపిస్తూ,
 మెప్పించడం వేరు. మొదటిది రచన, కథన సామర్థ్యాలకు గీటురాయి 
అయితే, రెండోది తెరపై కథాకథనమనే దర్శకత్వ నైపుణ్యానికి పరీక్ష. 
గతంలో ‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘ఉయ్యాల - జంపాల’
 లాంటి విభిన్న తరహా ప్రయత్నాలను తెర పైకి తేవడంలో పేరు
 తెచ్చుకున్న ఉన్నత విద్యావంతుడు పి. రామ్మోహన్ ఈసారి
 దర్శకుడిగా కొత్త అవతారమెత్తారు. అమెరికా డబ్బు మీద 
మోజు, ఆ జీవితం మీద వ్యామోహం పెరిగిన ప్రస్తుత 
పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో ఒక రొమాంటిక్ కామెడీ అల్లారు.

కథేమిటంటే... హైదరాబాద్‌లో ‘ఈస్ట్ వెస్ట్’ మనీ ట్రాన్స్‌ఫర్
 కంపెనీ కాల్‌సెంటర్‌లో పనిచేస్తుంటాడు కిరణ్ (సంతోష్ శోభన్). 
పెంచిన నాయనమ్మ చనిపోతే, ఆమె ఇంట్లోనే ఒంటరిగా ఉంటాడు. 
అతనికి నరేశ్ (అభిషేక్ మహర్షి) వగైరా మంచి ఫ్రెండ్స్.
 బెంగుళూరులో ఉంటున్న నరేశ్ ఫ్రెండ్ కీర్తి (అవికా గోర్)
 ఒకసారి హైదరాబాద్ వస్తుంది. ఆమెను చూసీ చూడగానే
 హీరో ప్రేమిస్తాడు. కొన్ని సీన్ల తరువాత ఆమె కూడా అతని 
ప్రేమలో పడుతుంది.

కీర్తి కుటుంబానిదో కథ. తండ్రి బండిరెడ్డి సర్వేశ్వరరావు (రవిబాబు)కు 
అమెరికా పిచ్చి. కొడుకు, కూతురైనా బాగా చదివి, అమెరికా వెళ్ళి, 
డబ్బు సంపాదిస్తే, తాను పెద్ద ఇల్లు, కారు కొనుక్కోవాలనుకొనే 
తరహా. కొడుకేమో లవ్ మ్యారేజ్ చేసుకొని, చెక్కేస్తాడు. 
తండ్రి కోరికకు కట్టుబడి, ఎనిమిదో ఏటే దేవుడి మీద ఒట్టేసి మరీ
 ఒప్పుకున్న కూతురు కీర్తి. అమెరికా వెళ్ళాలన్నది ఆమె ధ్యేయం. 
హీరో అందుకు పూర్తిగా విరుద్ధం. అమెరికా అన్నా, అక్కడ సెటిలైన 
ఎన్నారైలన్నా కడుపు మంట. ఛస్తే అక్కడికి పోనంటాడు.
 అక్కడికి ‘బ్రేక్’ (అప్).

 సెకండాఫ్‌కి వస్తే, హీరోకూ, అమెరికా అంటే అతనికున్న
 అసహ్యానికీ ఒక చిన్న ఫ్లాష్‌బ్యాక్. ఏడాది వయసున్న హీరోను 
వదిలేసి, అతని అమ్మా నాన్న డబ్బు సంపాదన వేటలో అమెరికా
 వెళ్ళిపోతారు. గత 20 ఏళ్ళలో మూడే మూడుసార్లు ఇండియా వచ్చి, 
చూసిపోతారు. నాయనమ్మ దగ్గరే పెరిగిన హీరోకు, ఆమె చనిపోయినా
 రాని నాన్న అంటే సహజంగానే అసహ్యం. అందుకే, ఎవరూ లేరన్నట్లు
 పెరుగుతుంటాడు. ఈ విషయం తెలిసిన హీరోయిన్ అమెరికా వెళ్ళడం
 మానేసి అయినా, హీరోనే పెళ్ళాడాలనుకుంటుంది. కానీ, వాళ్ళ
 పెళ్ళికి హీరోయిన్ తండ్రి అడ్డంకి అవుతాడు. అప్పుడు హీరో 
ఏం కోరుకున్నాడు? ఏమైంది?

వినోదం నిండిన ఈ ప్రేమకథ సంతోష్ శోభన్‌కు హీరోగా తొలి సినిమా.
 ఆ అనుభవ రాహిత్యమేదీ కనిపించనివ్వలేదీ కొత్త కుర్రాడు. 
అవికా గోర్ కెరీర్ జాబితా లెక్క ఈ సినిమాతో మరో అంకె పెరిగింది.
 పురుషాధిక్య భావజాలం, బద్ధకం నిండిన శాడిస్టు బండిరెడ్డి
 సర్వేశ్వరరావు పాత్రలో హీరోయిన్ తండ్రిగా రవిబాబు ఉన్న 
కాసేపు హాలులో కొత్త ఉత్సాహం తెస్తారు. ఇక, హీరోయిన్ తల్లి
 పాత్రలో సత్యా కృష్ణన్‌ది మొగుడి ప్రవర్తనను సదా మనసులోనే
 తిట్టుకొనే మహిళ పాత్ర. అందుకే, భర్త చనిపోయాక ఆమెలో
 విషాదఛాయలేమీ లేకపోవడం సహజమనుకోవాలి. అభిషేక్
 మహర్షి వినోదం పంచుతారు.  

ఇప్పటి వరకు నిర్మాతగా ఉన్న పి. రామ్మోహన్‌కు దర్శకుడవడంతో 
వంట చేయించుకొనే బాధ్యత నుంచి చేసే బాధ్యతకు మారినట్లయింది.
 దాని వల్ల వచ్చే పాజిటివ్‌లు, నెగటివ్‌లు కూడా సహజమే. ఆ శైలి 
చూస్తే - నగేశ్ కుకునూర్, శేఖర్ కమ్ముల లాంటి దర్శకుల తొలినాళ్ళు, 
స్వతంత్ర సినీ రూపకర్తల సినిమాలు గుర్తుకొస్తాయి. అందుకే, దీన్ని
 పూర్తి కమర్షియల్ సినిమాగా చూడలేం. సాంకేతిక విభాగాల తీరూ 
అందుకు తగ్గట్లే ఉన్నాయి.

సెపరేట్ కామెడీ, స్పెషల్ ఐటమ్ సాంగ్‌లు లేని ఈ ప్రేమకథలో తీసుకున్న
 పాయింట్ చిన్నది. 130 నిమిషాల సినిమాగా మజ్జిగ పల్చ నైంది. 
వరస చూస్తే పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం 
మంచిదని ఈ దర్శక, నిర్మాతల అభిప్రాయమేమో అనిపిస్తుంది.
 వేగంగా పరుగులు తీయకున్నా, ఫస్టాఫ్ బాగుందనిపించేలా 
నడిపారు. హీరో ఫ్లాష్‌బ్యాక్ కథ బయటికొచ్చి, కథలో కీలక
 పాయింట్ తెలిసిన తరువాత పరిస్థితి మారింది. ఒక్కముక్కలో- 
ఈ కథ సంసారపక్షం. కథనమే కాదు, నిర్మాణమూ అంతే. 
రొమాంటిక్ కామెడీలు చూసేవారి కిది ఓ.కె. అంతకు మించి 
అదనంగా ఏదైనా కోరుకుంటేనే చిక్కు!

.......................................................
ఈ స్క్రిప్ట్ రామానాయుడు ఫిల్మ్‌స్కూల్ సాయిసుకుమార్ రాసింది.
 కేవలం 33 షూటింగ్ డేస్.  
హైదరాబాద్ పరిసరాల్లో, వికారాబాద్‌లో షూటింగ్. 
సెకండాఫ్‌లోని డ్యూయట్ పుణే దగ్గర లోనావాలా పరిసరాల్లో తీశారు.
  హీరో సంతోష్ శోభన్ ‘వర్షం’ చిత్ర దర్శకుడైన శోభన్ 
కుమారుడు. గతంలో ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంలో 
క్రికెట్ టీవ్‌ు కెప్టెన్ పాత్ర పోషించారు. ఇప్పుడు హీరోగా పరిచయం.
...........................................................

- రెంటాల జయదే 

(Published in 'Sakshi' daily, 28th Nov 2015, Saturday)
.......................................

0 వ్యాఖ్యలు: