చిత్రం : 'సౌఖ్యం'
తారాగణం : గోపీచంద్, రెజీనా
కథ, మాటలు : శ్రీధర్ సీపాన
కెమేరా : ప్రసాద్ మూరెళ్ళ
సంగీతం : అనూప్
నిర్మాత : ఆనంద్ ప్రసాద్
స్ర్కీన్ ప్లే,దర్శకత్వం : ఏ.యస్. రవికుమార్ చౌదరి
హీరో గోపీచంద్‌ది చిత్రమైన కెరీర్. నటుడిగా హీరో పాత్రలతో
మొదలై విలన్‌గా రాణించి, మళ్ళీ హీరోగా విజృంభించిన
వెర్సటాలిటీ అతనిది. కానీ ఒకసారి అగ్రహీరోగా పేరు
తెచ్చుకున్నాక సక్సెస్ నిలబెట్టుకోవడం అనుకునేంత
ఈజీ కాదు. ఆ క్రమంలో కొన్ని సెంటిమెంట్లకూ, మరికొన్ని
ఇమేజ్ చట్రాలకూ బందీ కావాల్సి వస్తుంది. ఒక రకమైన
యాక్షన్, కామెడీ ఫార్ములా ఇటీవల అందరికీ సేఫ్ బెట్
అయింది. ‘సాహసం’ లాంటి కొన్ని ప్రయోగాలు ఆశించినంత
విజయం సాధించకపోవడంతో గోపీచంద్ ఆ మార్గం పట్టారు.
అందుకు తగ్గట్లే గత ఏడాది వచ్చిన ‘లౌక్యం’ ఊహించని
రీతిలో విజయం సాధించింది.
అలా ‘శంఖం’, ‘శౌర్యం’, ‘లౌక్యం’ తర్వాత ఆయన నవ్వులకే
ప్రాధాన్యమిస్తూ చేసిన యాక్షన్ ఫిల్మ్ ఈ ‘సౌఖ్యం’.
టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి లాంటి యక్షప్రశ్నలేయకుండా
కథలోకి వెళితే - అమ్మానాన్న (ప్రగతి, ముఖేశ్‌రుషి),
బాబాయ్ (రఘుబాబు) లాంటి బంధాలెన్నో ఉన్నా రెక్లెస్‌గా
జీవితం గడిపే ఒక యువకుడు శ్రీను (గోపీచంద్).
అనుకోకుండా అతనికి ఒక రైలు ప్రయాణంలో శైలజ (రెజీనా)
ఎదురవుతుంది. చూసీచూడగానే ఆమెను ప్రేమించేస్తాడు.
యాదృచ్ఛికంగా పదే పదే ఆమెను కలుస్తాడు. తమది
విధి కుదిర్చిన బంధమని అంటాడు.
మొదట కాదనుకున్నా, చివరకు హీరో ప్రేమకు ఆమె
సరేనంటుంది. తీరా ఆమె వల్ల హీరో కుటుంబం చిక్కుల
పాలవుతుంది. అప్పటికే ఊళ్ళో భావూజీ అనే విలన్ (ప్రదీప్ రావత్)
గుంపుతో హీరో గొడవపడి ఉంటాడు. హీరోను తెలివిగా తప్పించడం
కోసం కలకత్తా వెళ్ళి, కింగ్ మేకర్ పి.ఆర్. (మలయాళ నటుడు దేవన్)
కూతురిని తీసుకురమ్మంటాడు భావూజీ. సరేనని అక్కడకు
బయల్దేరతాడు హీరో. తీరా ఆ పి.ఆర్. కూతురే, హీరో ప్రేమించిన హీరోయిన్.
కలకత్తా వెళ్ళిన హీరో అక్కడ పి.ఆర్.ను ధైర్యంగా ఎదిరించి
మరీ, హీరోయిన్‌ను వెంటబెట్టుకొని వస్తాడు. అయితే,
భావూజీ గ్యాంగ్ అసలు పన్నాగం తెలిసి, వాళ్ళకు మాత్రం
చెప్పడు. హీరోయిన్‌ను తన కోడల్ని చేసుకోవాలనుకున్న
భావూజీ అది తెలిశాక ఏం చేశాడు? కలకత్తా ముఖ్యమంత్రి
కొడుక్కి తన కూతుర్ని కట్టబెట్టా లనుకున్న పి.ఆర్.
కలకత్తా నుంచి వచ్చి, హైదరాబాద్‌లో ఏం చేశాడు?
హీరో తన ప్రేమనెలా పెళ్ళి పీటలకెక్కించాడన్నది ఓపికగా
వెండితెరపై చూడాలి.
గోపీచంద్ సహా సుపరిచిత తారలెందరో కనిపించిన ఈ సినిమా
కథలో చాలా సీన్లు ముందే ఊహించేయగలుగుతాం.
ఫస్టాఫ్‌లో హీరోయిన్ అడ్రస్ కనుక్కోవడానికి హీరో పడే
శ్రమతో మంచి లవ్‌స్టోరీగా నడు స్తుందనుకుంటాం.
అంతలోనే అది ముగిసి, కథ యాక్షన్ టర్‌న తీసుకుంటుంది.
ఆ తరువాత మళ్ళీ పూర్తిగా కామెడీ బాట పట్టించారు.
ఇవాళ అందరూ వినోదానికే మార్కులేస్తున్నారనే భావంతో
స్క్రిప్ట్‌లో నవ్వులపాళ్ళే ఎక్కువుండేలా చూసుకున్నారు.
ఫస్టాఫ్‌లో ట్రైన్ ఎపిసోడ్‌లో బామ్మ పాత్రధారి సీనియర్ నటి
‘షావుకారు’ జానకితో మద్యం ఎపిసోడ్, పోసాని లోదుస్తుల
ఎపిసోడ్ లాంటివి పెట్టారు. సెకండాఫ్‌కు వచ్చేసరికి పృథ్వి,
కృష్ణభగవాన్, జ్యోతి బృందంతో ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’
లాంటి పాపులర్ సినిమాల స్పూఫ్ బిట్స్ చేయించారు.
చివరలో బ్రహ్మానందం ఎపిసోడ్, అలాగే ప్రదీప్‌రావత్‌తో
‘గబ్బర్‌సింగ్’శైలి అంత్యాక్షరి ఎపిసోడ్ లాంటి కామెడీ బిట్స్ -
ఇలా వీలున్నవన్నీ చేశారు.
మధ్య మధ్యలో జీపుల్లో ఛేజ్‌లు, పవర్‌ఫుల్ ఫైట్లతో
గోపీచంద్ యాక్షన్ ఇమేజ్ యథాశక్తి వాడారు.
కెమేరా వర్‌క, కొన్నిపాటల చిత్రీకరణ బాగున్న
ఈ సినిమాకు ప్రధాన బలంతో పాటు బలహీనతా
కామెడీనే. బలమైన భావోద్వేగాలుంటేనే వినోదం
దానికి అదనపు బలమని మర్చిపోతే ఎంత నవ్వుకున్నా ఏం లాభం?
- రెంటాల జయదేవ
.............................................
0 వ్యాఖ్యలు:
Post a Comment