జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, December 15, 2015

టైటిలాభరణం ('శంకరాభరణం' మూవీ రివ్యూ)

టైటిలాభరణం
కొత్త సినిమా గురూ!  ‘శంకరాభరణం’

కెమేరా- సాయిశ్రీరామ్, ఎడిటింగ్ - ఛోటా కె. ప్రసాద్,
నిర్మాత - ఎం.వి.వి. సత్యనారాయణ, 
కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వ పర్యవేక్షణ - 
కోన వెంకట్, దర్శకత్వం - ఉదయ్ నందనవనమ్,

శంకరాభరణం. పేరు వినగానే ఆణిముత్యం లాంటి సినిమా గుర్తుకొస్తుంది.
 తెలుగువాణ్ణి తలెత్తుకు తిరిగేలా చేసిన ఆ ఫిల్మ్ టైటిల్‌తో మరో సినిమా 
చేయడం సాహసం. పెపైచ్చు, ఆ టైటిల్‌తో క్రైమ్ కామెడీ తీయడం మరీ
 సాహసం. కానీ, ‘సాహసం శాయరా డింభకా! విజయం వరిస్తుంది’ అన్నది
 నమ్మి, ఆ పనికే దిగారు ఇప్పుడీ కొత్త చిత్ర దర్శక, నిర్మాతలు. అలా వచ్చింది 
కోన వెంకట్ అన్నీ తానై తీసి, తీయించిన కొత్త ‘శంకరాభరణం’.

టైటిల్ క్యూరియాసిటీ పక్కనపెట్టి, ‘దొరకునా ఇటువంటి సినిమా’ అని
పాడుకుంటూ కథలోకొస్తే - రఘు (సుమన్) అమెరికాలో కోటీశ్వరుడు.
 అతని భార్య రజ్జూ దేవి (సితార). ఓ కూతురు, ఓ కొడుకు
 గౌతమ్ (నిఖిల్). కష్టపడకుండా, కులాసా జీవితం గడిపే హీరో 
జీవితంలో ఒక పెద్ద కుదుపు. నమ్మినవాళ్ళు మోసం చేయడంతో 
ఆస్తులు పోయి, అర్జెంటుగా కోట్లు కట్టకపోతే కటకటాల వెనక్కి వెళ్ళే
 ముప్పులో పడతాడు హీరో తండ్రి.

పాతికేళ్ళ క్రితం ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని, అమెరికా
 వచ్చేశాననీ, బీహార్‌లోని ‘శంకరాభరణం’ అనే ప్యాలెస్‌కు తానే
 వారసురాలిననీ, దాన్ని అమ్మి అప్పుల నుంచి బయటపడవచ్చనీ
 హీరో తల్లి చెబుతుంది. ఆ ప్యాలెస్ అమ్మి డబ్బు తేవడానికి అమెరికా
 నుంచి హీరో బీహార్ బయల్దేరతాడు.

ఇక్కడ బీహార్‌లో విలువైన దేనినైనా కిడ్నాప్ చేసి, డబ్బులు గుంజడం 
బిజినెస్. రాష్ట్ర హోమ్ మంత్రి  (‘మిర్చి’ సంపత్) కూడా ఆ కిడ్నాపింగ్
 ముఠాల వెనుక మనిషే. బీహార్ వచ్చిన హీరో తమ ప్యాలెస్‌లో ఉంటున్న
 మామయ్య బద్రీనాథ్ (రావు రమేశ్)నీ, ఆయన బంధుగణాన్నీ మాయ
 చేసి, ప్యాలెస్ అమ్మేయడానికి ప్లాన్ చేస్తాడు. అమెరికా వెళ్ళాలని
 మోజు పడే మామయ్య చిన్న కూతురు హ్యాపీ (నందిత) హీరోను
 ప్రేమిస్తుంది. మరోపక్క అతనూ దగ్గరవుతాడు.

ఈ అమెరికా ఎన్నారై దగ్గర బోలెడంత డబ్బుందని ఊరంతా
భ్రమపడుతుంది. దాంతో, కిడ్నాపర్ భాయ్ సాబ్ (సంజయ్ మిశ్రా)
 హీరో, హీరోయిన్లను కిడ్నాప్ చేస్తాడు. తీరా తన దగ్గర డబ్బులే 
లేవని అసలు నిజం చెప్పి, హీరో తనను మరో కిడ్నాపర్‌కి కోట్లకు 
అమ్మించేలా చేస్తాడు. అలా ఒక కిడ్నాపర్ నుంచి మరో 
కిడ్నా పర్‌కు హీరో, హీరోయిన్లు ట్రాన్‌‌సఫరవుతుంటారు. 
ఈ కిడ్నాప్ డ్రామాల కథ ఎటు నుంచి ఎటు, ఎన్ని 
మలుపులు తిరిగిందన్నది మిగతా సినిమా.         

కథ కన్నా సీన్లు, క్యారెక్టర్లు సవాలక్ష ఉన్న ఈ సినిమాకు
 తీసుకున్న పాయింట్ బాగుంది. కానీ, దాన్ని ఆసక్తికరంగా
 చెప్పడంలో తడబాటు తప్ప లేదనిపిస్తుంది. తెర నిండా
కళకళలాడుతూ చాలా మంది ఆర్టిస్టులున్నారు. ఒకరి వెంట
 మరొకరుగా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు. కానీ, మనసు 
కెక్కేలా వాళ్ళ నటనను చూపెట్టే సన్నివేశాలే వెతుక్కోవాలి.
వెరైటీ స్క్రిప్ట్‌లతో ముందుకొస్తున్న హీరో నిఖిల్ ఈసారి అమెరికన్ 
ఇంగ్లీష్ యాసలో ఎన్నారైగా అలరించడానికి శాయశక్తులా యత్నించారు.

అమెరికా మోజున్న హ్యాపీగా నందితది కాలక్షేపం క్యారెక్టర్. 
కిడ్నాపింగ్ విలన్లుగా ఒకరికి ముగ్గురున్నారు. ఎవరికివారు
 ఫరవాలేదనిపిస్తారు. కానీ, ఎవరూ ప్రధాన విలన్ కాకపోవడమే
 చిక్కు. లేడీ కిడ్నాపింగ్ లీడర్ మున్నీ దీదీగా అంజలిది సినిమా
చివర కాసేపు వచ్చే స్పెషల్ అప్పీయరెన్స్. నాలుగు సీన్లు, కాసిన్ని
 డైలాగులు, ఒక స్పెషల్ సాంగ్ ఉన్నాయి. సినిమా నిండా చాలామంది
 కమెడియన్లున్నారు.

కొన్నిచోట్ల నవ్విస్తారు. ఎక్కువ మార్కులొచ్చేది థర్టీ ఇయర్స్ పృథ్వికి, 
అతని ఎస్సై పాత్ర ‘పర్సంటేజ్’ పరమేశ్వర్‌కి! అయితే, 
లేడీ కిడ్నాపింగ్ ముఠా స్త్రీలంతా కలసి అతడిపై పడి, 
గదిలోకి తీసుకెళ్ళడం లాంటివి కామెడీ అనుకోలేం.   

‘లాజిక్‌లు వెతక్కండి... మ్యాజిక్ చూడండి’ అని స్టాట్యూటరీ
 సిల్వర్‌స్క్రీన్ వార్నింగ్‌తో మొద లయ్యే సినిమా ఇది. కాబట్టి, 
బీహార్‌లో మనుషులు అచ్చ తెలుగు యాసల్లో ఎలా మాట్లా డుతున్నారు
లాంటి సందేహాలు శుద్ధ వేస్ట్. ముందే చెప్పేశారు కాబట్టి, ఇక
 సినిమా అంతా మ్యాజిక్ చూడడం కోసం కళ్ళలో వత్తులు 
వేసుకోవాల్సి ఉంటుంది! సీనియర్ కో-డెరైక్టర్ ఉదయ్నం
దనవనమ్‌కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. కానీ, 
దర్శకత్వ పర్యవేక్షణంతా కోన వెంకట్‌దే. ఎవరి భాగమెంతో 
తెరపై చూసి చెప్పడం కష్టమే.

కథనంలో బిగింపు, ఎడిటింగ్‌లో తెగింపు అవసరమని
 గుర్తొచ్చే ఈ సినిమాలో అందమైన లొకేషన్లలో కెమేరా
 పనితనం భేష్. ప్రవీణ్ లక్కరాజు బాణీల్లో కొన్ని బాగున్నాయి.
 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దగ్గరే వాద్యఘోష పెంచారు. వెరసి, ఫస్టాఫ్‌లో 
కథ ముందుకు జరగకపోయినా డైలాగ్ మీద డైలాగ్ పడిపోయే
 ఆర్టిస్టుల హడావిడి, రీరికార్డింగ్ హంగామాతో ఉక్కిరిబిక్కిరవుతాం.
 సెకండాఫ్‌లో పృథ్వి ఎంటరయ్యాక జనం వినోది స్తారు. 
డబ్బు కన్నా అనుబంధాలు ఎక్కువని చెప్ప డానికీ,
హీరోకూ- ఫ్యామిలీకీ మధ్య ఎమోషనల్ స్ట్రగుల్‌కీ తోడ్పడే
 సీన్లు ఇంకా అల్లుకోవాల్సింది.

ముగింపు దగ్గరకొస్తుంటే వేగం పెరిగే ఈ ఫిల్మ్‌లో ఆఖరి
 టైటిల్ కార్డు - ‘వేర్లు బలంగా ఉంటేనే చెట్టు నిలుస్తుంది. 
బంధాలు బలంగా ఉంటేనే కుటుంబం నిలుస్తుంది’. అలాగే,
 స్క్రిప్టు బలంగా ఉంటేనే సినిమా నిలుస్తుంది. మరి, ఆ బలం,
 బాక్సా ఫీస్ దగ్గర అలా నిలిచే సత్తా ఈ ‘శంకరాభరణం’కి ఉందా? 
అది ప్రేక్షకదేవుళ్ళు చెప్పాల్సిన తీర్పు.

 - రెంటాల జయదేవ

.................................................. 
* హిందీ హిట్ ‘ఫస్ గయేరే ఒబామా’ హక్కులు కొని, దాన్ని
 తెలుగులోకి మలుచుకున్నారు కోన వెంకట్.  ఈ చిత్రానికి
 పనిచేసిన సంగీత దర్శకుడు ప్రవాస భారతీయుడు.

* బీహార్ నేపథ్యంలో జరిగే ఈ కిడ్నాప్ కథ షూటింగ్
 ప్రధానంగా  మహారాష్ట్ర, పరిసరాల్లో చేశారు. ఇటీవల 
రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చిన కొద్ది సినిమాల్లో ఇది ఒకటి.
....................................................

(Published in Sakshi daily, 5th Dec 2015, Saturday)

0 వ్యాఖ్యలు: