జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, October 9, 2015

‘రుద్రమదేవి’...... మేకింగ్ కూడా చరిత్రే!


మేకింగ్ కూడా చరిత్రే!










దర్శకుడు గుణశేఖర్ తన చిన్ననాటి కలను ఎట్టకేలకు నిజం
 చేసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యపు సామ్రాజ్ఞి  ‘రుద్రమదేవి’ 
కథను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. ఈ చారిత్రక కథా చిత్రం 
కోసం స్వయంగా నిర్మాత అవతారం కూడా ఎత్తారాయన. విశేషం
 ఏమిటంటే, తానే నిర్మాత అయినా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా
 అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గుణశేఖర్ 
వినియోగించడం! తెలుగు వారందరి చరిత్ర అయిన ‘రుద్రమదేవి’ 
జీవితాన్ని ఆయన స్టీరియోస్కోపిక్ 3డీలో తీశారు. అలాగే, 
‘డాల్టీ - ఎట్మాస్’ అనే శబ్ద సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. 
మన దేశంలో తయారైన ‘ఫస్ట్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్
 3డీ ఫిల్మ్’ ఇదే!


స్టీరియోస్కోపిక్ 3డీ ఫిల్మ్ అంటే?
3డీ ఫిల్మ్ మేకింగ్‌లో కీలకమైన అంశం - ‘స్టీరియోగ్రఫీ’. సాధారణంగా 
రెండు రకాల 3డీ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి - మనం
 మామూలుగా చూసే సినిమాల లాగా రెగ్యులర్ 2డీ పద్ధతిలో సినిమా 
తీసి, ఆ తరువాత దాన్ని పోస్ట్ ప్రొడక్షన్‌లో 3డీలోకి మార్చడం. ఎక్కువ 
భాగం మనం చూస్తున్న 3డీ సినిమాలు ఇలాంటివే. మహా అయితే, 
కొన్ని కీలక దృశ్యాలను మాత్రం 3డీలో తీస్తారు. మిగతాదంతా 2డీ
 నుంచి 3డీకి కన్వర్షనే! ఇక, రెండోది - సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే 
మొత్తం 3డీలోనే చిత్రీకరించడం. ఈ రెండో పద్ధతి వల్ల అసలు సిసలైన 
3డీ అనుభూతి కలుగుతుంది. ‘రుద్రమదేవి’ని ఇలా రెండో పద్ధతిలో,
 షూటింగ్ చేస్తున్నప్పుడే మొత్తం 3డీలో చిత్రీకరించారు. అందుకే, 
భారతదేశంలో చారిత్రక కథాంశంతో వచ్చిన మొట్టమొదటి స్టీరియో
స్కోపిక్ 3డీ ఫిల్మ్ అనే కీర్తి కిరీటం ఈ సినిమాకు దక్కింది.

నిజజీవితంలో మనం కుడి, ఎడమ కళ్ళతో ఎదురుగా ఉన్న వస్తువులనూ,
 మనుషులనూ ఎలా చూస్తామో అచ్చంగా అలాగే వెండితెరపై దృశ్యాలను
 చూసే థ్రిల్లింగ్ అనుభూతిని ‘స్టీరియోస్కోపిక్ 3డీ’ ఇస్తుంది. ఇలా సినిమా
 తీయాలంటే, ఏకకాలంలో 2 కెమేరాలతో చిత్రీకరించాలి. సామాన్య
 పరిభాషలో చెప్పాలంటే, ఒక కెమేరా ఏమో మన కుడి కన్నులా, 
రెండో కెమేరానేమో ఎడమ కన్నులా పనిచేస్తాయన్నమాట.
 మన రెండు కళ్ళ మధ్య ఉన్న దూరం లాగానే, ఈ రెండు కెమేరాల 
లెన్స్‌లనూ, రెండు ఫ్రేమ్‌లనూ నిర్ణీత దూరంలో ఫిక్స్ చేసి, ఒకే 
దృశ్యంగా తీయాలి. దీని వల్ల లొకేషన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడే
 3డీలో ఎలా వస్తోందో చూడవచ్చు.

ఇంకాస్త వివరంగా చెప్పాలంటే - మన రెండు కళ్ళూ ఎదుటి
 వస్తువులను చూస్తున్న అనుభూతి కలిగించినట్లే, రేపు 
హాలులో తెరపై కూడా ఆ ఎఫెక్ట్ రావడానికి - ఆ రెండు 
కెమేరాలను కూడా ఎలైన్‌మెంట్ చేసి, రెండు కెమేరాల్లోని 
దృశ్యాల్ని కన్వర్జెన్స్ చేయాలి. ఆ పని ‘స్టీరియోగ్రాఫర్’ది.
 3డీలో ‘నెగటివ్ స్పేస్’ (ఎదురుగా ఉన్న వస్తువు తెరపై ముందు
కు పొడుచుకు వచ్చినట్లు కనిపించడం)నూ, ‘పాజిటివ్ స్పేస్’ 
(తెర మీద దృశ్యం తాలూకు ఇన్నర్ డెప్త్)నూ సరిగ్గా ఎలైన్‌మెంట్ 
చేయాలి. ఆ పని కూడా స్టీరియోగ్రాఫర్ నిపుణులే చేస్తారు. అలా
 సరిగ్గా అనుసంధానం చేసినప్పుడే ప్రత్యేకమైన కళ్ళద్దాలు పెట్టుకొని
 చూస్తున్నప్పుడు మనకి చక్కటి 3డీ దృశ్యానుభూతి కలుగుతుంది. 
ఒక 3డీ చిత్రం షూటింగ్ అంటే ఇంత తతంగం ఉంటుంది కాబట్టే,
 ‘రుద్రమదేవి’ నిర్మాణానికి చాలా సమయం పట్టింది. బాగా 
డబ్బు ఖర్చయింది.

మామూలుగా తీసే 2డీ సినిమాల్లో తీస్తున్న షాట్‌ను బట్టి
 కెమేరాకున్న లెన్సులు మార్చడం 4 నిమిషాల్లో పూర్తవుతుంది. 
కానీ, ఈ ‘స్టీరియోస్కోపిక్ 3డీ’ చిత్రీకరణకు ఒక్కసారి లెన్స్ 
మార్చాలంటే 45 నిమిషాల దాకా పడుతుంది. ఒక్కో షాట్‌కీ 
ఇంత టైమ్ పడుతున్నా, నటీనటులు చాలా ఓపిగ్గా నిరీక్షించడమే
 కాకుండా, ఆ పాత్ర, ఆ సన్నివేశం తాలూకు మూడ్‌ను నిలుపుకోవాల్సి 
ఉంటుంది. అందుకే, ఇలాంటి సినిమా దర్శక, నిర్మాతలు,
 టెక్నీషియన్లకే కాదు... నటీనటులకు కూడా సవాలే!

‘డాల్బీ- ఎట్మాస్’ అంటే?

‘డాల్బీ - ఎట్మాస్’అనేది ఇటీవలి కాలంలో తెలుగు సినిమాకు విస్తరించిన
 సినీ శబ్ద సాంకేతిక విధానం. ఒకప్పుడు ‘6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్’, 
ఆ తరువాత ‘డి.టి.యస్’, అటుపైన ‘డాల్బీ’లాగా - వాటి తరువాత 
ఆధునిక సాంకేతిక విజ్ఞానం. తెర మీద దృశ్యంలో కనిపిస్తున్న 
వాతావరణం (ఎట్మాస్‌ఫియర్) తాలూకు శబ్దాలను కూడా స్పష్టంగా, 
థియేటర్‌లో వినేలా చేయడం ఈ పద్ధతిలో ప్రత్యేకత. ఇటీవల వచ్చిన 
‘బాహుబలి’, ఇప్పుడు ‘రుద్రమదేవి’ఈ డాల్బీ - ఎట్మాస్ పద్ధతిలో 
థియేటర్లలో కొత్త శబ్దానుభూతిని కలిగిస్తున్నాయి. ఈ డాల్బీ -ఎట్మాస్
 విధానంలో సినిమాను ప్రదర్శించేందుకు వీలుగా రాష్ట్రంలోని 
పలు థియేటర్లు ఇప్పుడు అధునాతన పరికరాలను ఏర్పాటు
 చేసుకుంటున్నాయి.

................................

నాకు నేను... ‘సో క్యూట్’ అనుకున్నా! - అనుష్క (ప్రత్యేక ఇంటర్వ్యూ)



















అనుష్క... తెర మీద సూపర్‌స్టార్. తెర వెనుక ముద్దుగా... ‘స్వీటీ’.
 మాట తీరులో, మనిషి నడతలో ఎక్కడా సగటు సినిమా స్టార్‌ల తాలూకు 
హిపోక్రసీ లేని అసలు సిసలు స్వీటీ. అక్టోబర్ 9 నుంచి ప్రపంచ వ్యాప్తంగా 
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 3డీలో అలరించనున్న అభినవ 
‘రుద్రమదేవి’. ఆ చిత్ర ప్రమోషన్‌కి చెన్నై, బొంబాయిల మధ్య టూర్స్‌తో ఆమె
 బిజీ బిజీ. ఆ క్రమంలో హఠాత్తుగా జూబ్లీహిల్స్ ‘యునెటైడ్ కిచెన్‌‌స ఆఫ్ ఇండియా’లో 
తారసపడ్డారు. అందమంటే, మానసిక - శారీరక ఆరోగ్యాలు రెండూ అనే ఈ మాజీ 
యోగా టీచర్ అచ్చమైన గోలీ సోడాను ఆస్వాదిస్తూ మామూలు మధ్యతరగతి 
అమ్మాయిలా కనిపించారు. ‘సైజ్ జీరో’ కోసం పెరిగిన బరువును ఇప్పుడు తగ్గించుకొనే 
పనిలో ఉన్నా, చిన్నప్పటి గోలీ సోడా ఆనందాన్ని వదులుకోవడానికి ఇష్టం లేక, 
ఆరెంజ్ రంగు గోలీసోడా రెండోది లాగిస్తూ, రీల్ లైఫ్ ‘రుద్రమదేవి’ నుంచి తన 
రియల్ లైఫ్ ఫిలాసఫీ దాకా అనేక విషయాలు మనసు విప్పి పంచుకున్న 
ఈ బెంగళూరు భామతో  ‘సాక్షి’ ప్రత్యేక భేటీ...


‘బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో’ - వరుసగా మూడు విలక్షణప్రాజెక్ట్‌లు 
చేస్తున్న హీరోయిన్ మీరే!
 (నవ్వుతూ...) థ్యాంక్స్. ఒకేసారి ఇలాంటి మంచి స్క్రిప్ట్స్ రావడం నా అదృష్టం.

  మేకర్స్ గుణశేఖర్, రాజమౌళితో ఒకేసారి వర్‌‌క చేయడం...?
 ఇద్దరూ ఇద్దరే! ఇద్దరివీ వేర్వేరు స్కూల్స్. కానీ, ఇద్దరికీ పని మీదే ఏకాగ్రదృష్టి.
సక్సెస్ రేట్‌తో సంబంధం లేకుండా ఇద్దరూ చాలా మంచి టెక్నీషియన్స్. ఒకేసారి
 ఇద్దరితో కలసి పనిచేయడం బాగుంది.

  ముందుగా ఏ సినిమా ఆఫర్ వచ్చింది?
 సరిగ్గా గుర్తులేదు. ‘రుద్రమదేవి’ అనుకుంటా. దాదాపు అప్పుడే ‘బాహుబలి’
ఆఫర్. రెండూ ఒప్పుకున్నా.

  ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి మారడం కష్టమనిపించలేదా?
 బేసిక్‌గా అయామ్ ఎ డెరైక్టర్స్ యాక్టర్. వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని
చేస్తుంటాను. సెట్స్‌కు వెళ్ళగానే ఐ విల్ స్విచ్చాన్ విత్ డెరైక్టర్. స్విచ్చాఫ్
 విత్ డెరైక్టర్. నిజానికి, ఇప్పటికీ నేను నటన నేర్చుకొంటున్నా.

  నిజంగానే అంటున్నారా? పదేళ్ళు అయిపోయిందిగా?
 నిజమే. నాగార్జున ‘సూపర్’తో నటిగా నా జర్నీ మొదలుపెట్టి,
ఇప్పటికి పదేళ్ళయింది. ‘సూపర్’ నాటికి అసలు నటనంటే ఏమిటని
కూడా తెలీదు. నాగ్, పూరీ జగన్నాథ్ చాలా ప్రోత్సహించారు. మేకప్,
డ్యాన్స్, యాక్టింగ్ - ఇలా అన్నీ పూరీ దగ్గరుండి చూసుకున్నారు. అప్పటి
నుంచి ఒక్కో సినిమాకు, ఒక్కో డెరైక్టర్ దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉన్నా.

  తొలి రోజుల్లో ఈ రంగం వదిలిపోదామనుకొని, చివరకింత స్టారయ్యారే!
 (ఆలోచనలోకెళుతూ...) మొదట ఏడాదిన్నర పాటు అయితే, వెళ్ళిపోవాలనే
అనుకున్నా. తరువాత కుదురుకున్నా. ఇప్పటికీ నాకు స్టిల్ కెమేరాలంటే
కూడా అయామ్ వెరీ షై. ఇప్పుడిప్పుడే ఆ సిగ్గు వదిలించుకోగలుగుతున్నా.
ఈ పదేళ్ళ సినీ అనుభవంతో నటిగానే కాదు, వ్యక్తిగానూ ఎదిగా. ఈ
రంగాన్ని వదిలేసి, పారిపోయి ఉంటే చాలా బాధపడి ఉండేదాన్ని.

  ఈ ప్రయాణంలో వ్యక్తిగా మీలో వచ్చిన మార్పు, పరిణతి ఏమిటి?
 చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వారో అర్థమవుతుంటుంది. ఎంత
ఎదిగినా, కాళ్ళు నేల మీదే ఉండాలనే భావన మరీ దృఢమైంది. నాతో
నేను దగ్గరగా ఉంటున్నా. నా స్నేహితులు, నా యోగా గురువు భరత్
ఠాకూర్ లాంటి నా వాళ్ళకు దగ్గరయ్యా.

  ఇక్కడకు వచ్చాక మీరు మార్చుకున్న గుణం?
 నాకో చెడ్డ అలవాటుండేది. ఫోన్ సెలైంట్ మోడ్‌లో ఉంచేదాన్ని.
ఫోన్‌కాల్స్ వచ్చినా, తీసి మాట్లాడేదాన్ని కాదు. ఏదో పని చూసుకొంటూ
ఉండేదాన్ని. దాని వల్ల నాకు ఏమైందో, ఏమిటోనని అవతలివాళ్ళు
కంగారుపడేవాళ్ళు. ఆ అలవాటు మార్చుకున్నా.

  ఫోన్లు కూడా తీయనంటున్నారు. ఎమోషనల్‌గా మీరు ఎవరి 
మీదా ఆధారపడరేమో?
 అదేమీ లేదు. ఎమోషనల్‌గా ఇతరుల మీద చాలా ఆధారపడుతుంటా.
చెన్నైలో నా మేకప్ ఉమన్ భాను, అక్కడి ఫ్రెండ్స్, నా యోగా ఫ్రెండ్స్ -
ఇలా పెద్ద లిస్టే ఉంది.

  మీకు మీరు నచ్చని సందర్భాలు ఉంటాయా?
 అయామ్ నాట్ వెరీగుడ్ ఎట్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనిపిస్తుంటుంది.
 మా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌కు నా గురించి అన్నీ తెలుసు.
వాళ్ళతో అన్నీ పంచుకుంటా. వాళ్ళందరూ తమ కష్టాలు నాతో
చెప్పుకుంటారు. వాళ్ళ ఒత్తిడి నాకూ ఉంటుంది.

  ఒకప్పుడు యోగా టీచరైన మీకు మానసిక ఒత్తిడా?
 నేనూ మనిషినేగా! ఒత్తిడి ఉంటుంది. అయితే, విందులు,
వినోదాలు, పార్టీలకు వెళ్ళను. ఇంట్లోనే ఉంటా. నా యోగా
 ఫ్రెండ్స్ దుబాయ్, మలేసియా - ఇలా రకరకాల చోట్ల ఉన్నారు.
 టైమ్ దొరికితే, వాళ్ళను కలుస్తా.

  ‘రుద్రమదేవి’ లాంటి పాత్రలకు చాలా శారీరక శ్రమ చేస్తారు.
 షూటింగ్ నుంచి ఇంటికొచ్చాక ఎలా ఉంటుంది?
 శారీరక శ్రమ వల్ల ఒంటి నిండా నొప్పులు, గాయాలే. షూటింగై
ఇంటికి వచ్చాక, అలసటతో పాటు, వెర్రెత్తిపోయుంటాం. అలాంటప్పుడు
నా సహాయకులతో ‘మీరు నన్ను సరిగ్గా చూసుకోవడం లేద’ని కాస్తంత
మారాం చేస్తా. అలుగుతా. అలాంటప్పుడు వాళ్ళు గారం చేసి,
బుజ్జగించాలనుకుంటా. ఇంట్లో ప్రతి ఒక్కరి అటెన్షన్ నా మీదే
ఉండాలని పిచ్చిగా కోరుకుంటా. ఇప్పటికీ బెంగళూరులో మా
ఇంటికి వెళితే, అన్నయ్య రూమ్‌లో హాయిగా పడుకుంటా.
కొన్నిసార్లు ఎవరితోనూ పెద్దగా మాట్లాడను కూడా మాట్లాడను.
అయితే, నా చుట్టూ మనుషులుండాలి. వాళ్ళు మాట్లాడుకుంటూ
 ఉండాలి. అలా ఉంటే నా కిష్టం.

  చాలామందిలా మీ అమ్మ, నాన్న మీ వెంట కనిపించరే!
 వాళ్ళ జీవితం వదిలేసి, రాత్రింబగళ్ళు నా వెంటే సెట్స్‌లో ఉండి
 టైమ్ వేస్ట్ చేసుకోవడమెందుకు? పైగా, వాళ్ళుంటే వాళ్ళ
బాగోగుల మీదే నా ఫోకస్ ఉంటుందని సినిమా ఫంక్షన్లకు
 కూడా రానివ్వను. చూడాలనిపిస్తే వాళ్ళు రావడమో, నేను వెళ్ళడమో చేస్తాం.

  వరంగల్‌లో వేలమంది మధ్య ‘రుద్రమ..’ ఆడియోకు 
తొలిసారి వచ్చినట్లున్నారు!
 అది ఏదో అనుకొని కావాలని చేసింది కాదు. గుణశేఖర్ భార్య
రాగిణి గారితో సాన్నిహిత్యంతో అలా కుదిరింది. గుణశేఖర్ గారు
ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడిన ఆ ఆడియో ఫంక్షన్‌లో వేలాది జనం
 మధ్య మా అమ్మా నాన్న గురించి నేను కొంచెం ఆందోళన పడ్డాను.
 కానీ, వాళ్ళు మాత్రం ‘రుద్రమదేవి’ పాత్ర నేను పోషించినందుకు
చాలా సంతోషించారు. వాళ్ళు కూడా ఈ సినిమా చూడాలని
ఎదురుచూస్తున్నారు.

తొలిసారిగా రుద్రమదేవి గెటప్‌లో అద్దంలో చూసుకున్నప్పుడూ,
 ట్రైలర్ ఆవిష్కరణలో ‘ఐమ్యాక్స్’ తెరపై చూసుకున్నప్పుడూ
 మీ మనసులో కలిగిన భావం?
 షూటింగ్‌లో 3 - 4 కేజీల బంగారు నగలు వేసుకున్నా. బరువైన
 కాస్ట్యూమ్స్ కూడా ధరించా. అద్దంలో చూసుకున్నప్పుడు నాకు
నేను ‘సో క్యూట్’ అనుకున్నా. ఇక, అంత మంది ముందు, ఐమ్యాక్స్
 తెరపై చూసుకొనే ముందు కొద్దిగా టెన్షన్ ఫీలయ్యా. అలాంటి చోట్ల
ఎలా రియాక్ట్ కావాలో నాకు తెలీదు. అందుకే, నా పక్కనే
కూర్చొన్న నా సన్నిహితుల బుర్ర తినేస్తుంటా. అందరూ
బాగుందనడంతో టెన్షన్ తీరింది.

  మీరు దేవుణ్ణి నమ్ముతారా?
 కచ్చితంగా. బేసిక్‌గా నేను గాడ్ లవింగ్ తప్ప గాడ్
 ఫియరింగ్ కాదు. గుడి, దర్గా, చర్చి - అన్నిటికీ వెళతా.
దేవుళ్ళందరిలోకీ నాకు శివుడంటే ఇష్టం. అలాగే, షిర్డీ సాయి,
 దుర్గాదేవి అంటే కూడా ఇష్టం. అయితే, పూజలు, వ్రతాలు లాంటివి
అలవాటు లేదు. అవి చేయను, తెలియదు కూడా! నాకు అనిపించినట్లు
చేస్తానే తప్ప, ఫలానాగా చేయాలని ఎవరైనా చెప్పడం నాకు ఇష్టం
ఉండదు. ఎవరైనా ఫలానా లాగా చేయాలని బలవంతపెడితే, నాలో
 ప్రతిఘటన మొదలైపోతుంది. కానీ, నేను బేసిక్‌గా ప్రకృతిని ఆరాధిస్తా.
ఉదయం, సాయంత్రం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేస్తా. అలాగే,
నీళ్ళు, పువ్వులు పెడతా. ఇలా గాలి, నీరు, నిప్పు లాంటి పంచభూతాలు
 మనసుకు ఆహ్లాదమిస్తాయి.

  డిఫరెంట్, సీరియస్ పాత్రల్లో ఇమిడిపోయారు. మళ్ళీ గ్లామర్
 హీరోయిన్‌గా ఎప్పుడు?
 (నవ్వేస్తూ) నాకూ ఇప్పుడలాంటి పాత్ర చేయాలని ఉంది. సీరియస్,
 గ్లామర్ పాత్రలు - రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం నాకిష్టం.
వేర్వేరు తరహా చిత్రాలు, పాత్రలు చేయాల నుంది. కానీ ముందుగా
 ప్లాన్ చేసుకోను. ఎందుకంటే, అది నాకు సూట్ కాదు. దానంతట
అది జరగాలంతే!

  అంటే, మీరు విధి మీద వదిలేస్తారన్న మాట!
 విధిని నమ్ముతాను, కానీ డెస్టినీకి వదిలేయకూడదు. మన బెస్ట్
ఇవ్వాలి. చివరకేం జరిగితే అది డెస్టినీ.

  ‘సైజ్‌జీరో’ను కూడా పోటీగా ఈ 9వ తేదీనే రిలీజ్ చేయాలని 
ఆ మధ్య కొందరు ఆలోచన చేసినట్లున్నారే?
 లేదు. ఎప్పుడూ రెండూ ఒకేరోజు రిలీజ్ అనుకో లేదు. ఒకవేళ
ఒక సినిమా రిలీజ్ కాకపోతే, రెండోదనే అనుకున్నారు. ‘సైజ్‌జీరో’ను
లేట్‌గా రిలీజ్ చేస్తారు.

  మరి సినిమాల రిలీజ్ ముందురోజు ఎలా ఉంటారు?
 నేను నటించిన ఏ సినిమాకూ ఎవరికీ నష్టం రాకూడదనుకుంటా.
రిలీజ్ ముందు రోజు చాలా నెర్వస్‌గా ఉంటుంది. ఎలా రియాక్టవాలో
 తెలీదు. స్ట్రెస్ భరించలేక అమ్మానాన్న, ఫ్రెండ్స్‌తో కూర్చొని రాత్రి
మాట్లాడుతూంటా. రిలీజయ్యాక జనం మధ్య సినిమా చూస్తా.

  లేడీ ఓరియంటెడ్ ‘రుద్రమదేవి’కి రూ. 70 కోట్ల బడ్జెటని మన 
హీరోలు ఉడుక్కోరూ?
 అలా ఏమీ లేదు. రానా, ప్రభాస్, అల్లు అర్జున్ అంతా ఎంకరేజ్ చేశారు.

  రుద్రమదేవి, దేవసేన లాంటి పాత్రల్లో మీరు కాకుంటే, మరెవరిని
మీరు ఊహిస్తారు?
 నన్ను ఇలాంటి సినిమాల్లో, పాత్రల్లో ఊహించుకొని, ‘అరుంధతి’ ఛాన్స్
 ఇచ్చిన నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి గారికి థ్యాంక్స్. ఆయన లేకపోతే
 ఇవాళ నాకీ పాత్రలు లేవు. ఇప్పటి హీరోయిన్స్‌లో ఇలాంటి రాజసిక
పాత్రలకు నయనతార ఫేస్ సూట్ అవుతుంది.

  ‘రుద్రమదేవి’ సినిమా, పాత్ర... ఒక నటిగా సరే, ఒక వ్యక్తిగా మీకు 
ఇచ్చిందేమిటి?  
 ఇది నాకు మోస్ట్ ఎమోషనల్ జర్నీ. నేను చూస్తుండగానే, గుణశేఖర్ గారి
పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. పెద్దమ్మాయి నీలిమ నాకు అన్న,
 చిన్నమ్మాయి యుక్త నా తమ్ముడు.

  ‘రుద్రమదేవి’ లాంటి ఛాన్‌‌స మీకు మళ్ళీ వస్తే?
 తప్పకుండా చేస్తా! గుణశేఖర్ లాంటి క్రియేటర్స్ దగ్గర ఛాన్సొస్తే కాదంటామా!

  ‘రుద్రమదేవి’కి సీక్వెల్ ‘ప్రతాపరుద్రుడు’ తీస్తారని టాక్
 అది నాకు తెలీదు కానీ, నేను చేసిన ఏ ప్రాజెక్ట్‌కైనా సీక్వెల్ చేయమంటే,
ఆలోచించకుండా అంగీకరిస్తా. ఇలాంటి అవకాశాలు  అందరికీ రావు కదా!

  ‘రుద్రమదేవి’పై ఇప్పుడు మీ మనసులోని ఆలోచన?
 ‘రుద్రమదేవి’ కథే తప్ప, వేషభాషల లాంటి రిఫరెన్స్‌లేమీ హిస్టరీలో లేవు. పాత్రల ‘లుక్’ నుంచి అన్నీ దర్శక - నిర్మాత గుణశేఖర్ చాలా కష్టపడి రీ-క్రియేట్ చేశారు. చరిత్రను డాక్యుమెంటరీలా కాక, మంచి ఎమోషనల్ స్టోరీగా, విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా తీశారు. చాలా ఏళ్ళుగా ఆయన కంటున్న కల ఇది. దాన్ని నిజం చేసుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టి, మూడేళ్ళు శ్రమపడ్డారు. ఆయన భార్య, పిల్లలిద్దరూ కష్టపడ్డారు. ఇది నాకు మోస్ట్ ఎమోషనల్ జర్నీ. వాళ్ళ సపోర్ట్, చూపిన దీక్ష మర్చిపోలేను. టెక్నీషియన్లు ప్రాణం పెట్టి, నిజాయతీగా పనిచేస్తే, మరెన్నో కుటుంబాలు ఆధారపడ్డ ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి. తెలుగువారి చరిత్రను ప్రపంచానికి చాటిన వెండితెర కృషిగా చరిత్ర సృష్టించాలి. సినీచరిత్రలో ప్రత్యేకంగా నిలవాలి.

  - రెంటాల జయదేవ

.......................................................

Wednesday, October 7, 2015

మూడేళ్ల తరువాత నిర్మాతలుండరేమో! - నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌తో ప్రత్యేక భేటీ

మూడేళ్ల తరువాత నిర్మాతలుండరేమో!
అరవై ఏళ్ళ జీవితం... నిర్మాతగా ముప్ఫై ఏళ్ళ కెరీర్... రిలీజ్‌కు రెడీగా 
34వ సినిమా (‘శివమ్’)... షూటింగ్‌లో మరో సినిమా (‘హరికథ’)... 
వెరసి ‘స్రవంతి’ రవికిశోర్‌కు పాత జ్ఞాపకాలు, కొత్త అనుభవాలూ 
బోలెడు. వ్యాపారంగానే సినిమాల్లోకి వచ్చినా, తీస్తున్న సినిమాల్లో 
మనసు లెక్కలు మర్చిపోరీ ఆలిండియా సి.ఏ. ర్యాంకర్. ముప్ఫై 
ఏళ్ళ క్రితం ‘లేడీస్ టైలర్’తో మొదలుపెట్టిన ఆయన - ఈ 
అక్టోబర్ 2న ‘శివమ్’తో పలకరించ నున్నారు. ఈ సందర్భంగా 
ఆయనతో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ...

 ఈ ముప్ఫై ఏళ్ళ జర్నీని తలుచుకొంటే ఏమనిపిస్తుంటుంది?
 వ్యాపారంగానే సినిమాల్లోకొచ్చా. వచ్చాక వంశీ, తనికెళ్ళ, సీతారామ
శాస్త్రి, ఇళయరాజా మొదలు ఇవాళ్టి దేవిశ్రీ ప్రసాద్ దాకా ఎందరో
క్రియేటివ్ పీపుల్‌తో కలసి జర్నీ చేశా. ఈ అదృష్టం ఎందరికొస్తుంది!
 సినిమాల్లోకి రాక పోతే, ఎవరి లెక్కల్లోనో తప్పులు దిద్దుతూ, పి.వి.
 రవికిశోర్‌గా మిగిలేవాణ్ణి.

 అసలు సినిమా రంగంలోకి తొలి అడుగు ఎలా వేశారు?
 సినిమాల్లోకి రావడం నా డ్రీమ్ ఏమీ కాదు. అప్పట్లో దర్శకుడు వంశీతో
పరిచయంతో ‘ఆలాపన’ లాంటి షూటింగ్‌లకెళ్ళేవాణ్ణి. జర్నలిస్టు
వేమూరి సత్యనారాయణ లాంటి వాళ్ళు తోడయ్యారు. ఒకసారి
అరకులో ఉండగా తొలిచిత్రం ‘లేడీస్‌టైలర్’ (1986)కి బీజం పడింది.
అది గట్టి పునాది. అప్పటి నుంచి ‘నువ్వేకావాలి’ మీదుగా ఇప్పటి
దాకా జర్నీ కంటిన్యూస్.

నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్‌లోనూ ఉన్నట్లున్నారు?
 అవును. 1987 నుంచే డిస్ట్రిబ్యూషన్‌లోనూ ఉన్నా. కాకపోతే,
నిర్మాతగా చేతిలో 13 పేకముక్కలుంటాయి. ఉన్న ముక్కలేమిటో
మనకు తెలుసు. కానీ, డిస్ట్రిబ్యూషన్ మూడు ముక్కలాట లాంటిది.
ఏ ముక్కలో ఏముందో తెలియకుండా పందెం కాస్తాం. అలా చాలా
 డబ్బులు పొగొట్టుకున్నా. చేదు అనుభవాలెదురైనా, పెట్టాబేడా
సర్దుకొని వెళ్ళిపోదామని అనుకోలేదు.

 లేడీస్ టైలర్’ నాటికీ, ఇప్పటికీ చిత్ర నిర్మాణంలోని 
మార్పులపై మీ వ్యాఖ్య?
 అప్పట్లో నూటికి 90 మంది గుడికెళ్ళినంత పవిత్రంగా ఈ రంగాని కొచ్చేవారు.
ఇవాళ నూటికి 70 మంది సినిమాపై మోజుతో వస్తు న్నారు. నౌ ఉయ్
ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ విత్ అవర్ హెడ్‌‌స. నాట్ విత్ అవర్ హార్‌‌ట్స.

 ఇవాళ ఆడియన్‌‌సలో కూడా చాలా మార్పు వచ్చింది కదా?
 ఒకప్పుడు అర్థవంతమైన పాటలు, సినిమా చూశాక మంచి విషయం
 ఇంటికి తీసుకెళ్ళాలనే ఆలోచన ఉండేవి. ఇప్పుడు వినోదమే ఆశిస్తున్నారు.
 అప్పట్లో కథెక్కువ, కామెడీ తక్కువ. ఇప్పుడు కామెడీ ఎక్కువ,
 కథ తక్కువ. కానీ, మారిన కాలానికి తగ్గట్లు దర్శక, నిర్మాతలం
 మారాల్సిందే. లేకపోతే, మనం హిస్టరీగా మారతాం. ఐ డోంట్ వాంట్
టు బికమ్  పాస్ట్ ఆర్ హిస్టరీ.

 మీ సమకాలీన నిర్మాతల మధ్య పోటీ ఉండేదట...
 శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, అరవింద్, పోకూరి బాబూరావు, గోపాలరెడ్డి -
ఇలా చాలామంది ఉండేవాళ్ళం. హెల్దీ కాంపిటీషనుండేది. ‘భలే భలే
మగాడి వోయ్’ హిట్ తర్వాత అరవింద్ పార్టీ ఇచ్చి, నెక్స్ట్ పార్టీ మీదే అన్నారు.

 మరి మీ రాబోయే ‘శివమ్ ’, ‘హరికథ’ ఎలా ఉంటాయ్?
 ఫ్యామిలీ అంతా చూసే ఎంటర్‌టైనర్ ‘శివమ్ ’. తండ్రీ కూతుళ్ళ మధ్య
 అనుబంధంతో హార్‌‌టటచింగ్‌గా డిసెంబర్‌లో ‘హరికథ’ వస్తుంది.

 ఒక డబ్బింగ్‌తో కలిపి ఈ ఏడాది ఏకంగా 3 సినిమాలు ప్రొడ్యూస్ చేశారే?
 (నవ్వేస్తూ...) ‘రఘువరన్ బిటెక్’ (తమిళ ‘వి.ఐ.పి’) కూడా రీమేక్ చేద్దామనుకున్నా.
కానీ, ధనుష్ బాగా చేశాడని డబ్బింగ్ చేశాం. మిగిలిన రెండు సినిమాలంటారా,
వాటి స్క్రిప్ట్ ముందే చేసేశాం. ఇప్పుడు చేస్తున్నది కేవలం ఎగ్జిక్యూషనే. అందుకే,
ఈసారి మూడు సినిమాలు తీయగలిగా.

 మీ తమ్ముడి కొడుకు రామ్‌తోనే కొన్నేళ్ళుగా సినిమాలు చేస్తున్నారేం?
 ఇప్పుడు డబ్బులు పెట్టేవాళ్ళనే తప్ప, అవసరమైతే హీరోనూ, దర్శ కుణ్ణీ
ప్రశ్నించే నిర్మాతల్ని ఎవరూ ఇష్టపడడం లేదు. కోరుకోవడం లేదు. కోట్లమంది
 ప్రేక్షకులకు నచ్చేది కాకుండా, హీరో ఒక్కడికి నచ్చితే చాలు... కోట్ల మందికి
నచ్చుతుందనే భ్రమలో సినిమా తీయడం వేస్ట్. అందుకే, 2008 నుంచి
రామ్‌తోనే చేస్తున్నా. మా వాడితో అయితే, ఆ సమస్య ఉండదుగా! రామ్ 
అనే హీరో చేయూత లేకపోతే, నేనూ ఇబ్బంది పడేవాణ్ణి.

 ఇంటి హీరో కావడంతో ఆర్థికంగానూ మీకు వెసులుబాటు ఉంటుందేమో!
 (నవ్వుతూ) భారీ అడ్వాన్సులివ్వక్కర్లేదు. దానికి అప్పులు తేనక్కర్లేదు.

 రామ్  కెరీర్‌లో, నిర్ణయాల్లో మీ ప్రభావం?
 సిన్మా చేసేముందు మంచీచెడు చర్చించుకుంటాం. తీసుకెళ్ళిన ప్రాజె క్ట్‌లు
తనకు సరిపోవని, ఎనాలిసిస్‌తో నన్ను కన్విన్‌‌స చేసిన ఘట్టాలున్నాయి. 

 మరి, మీరు అతణ్ణి కన్విన్‌‌స చేసిన సందర్భాలు ?
 రామ్  పూర్తిగా ఇష్టపడకుండా చేసింది ‘మసాలా’. మల్టీస్టారర్ చేయడం
ఇష్టమైనా, క్యారెక్టరైజేషన్ తనకు నచ్చలేదు. నా వల్ల చేయాల్సి వచ్చింది.

 పెదనాన్నగా కాకుండా, హీరోగా రామ్ లో మీకు నచ్చే విషయం?
 ఇంటెలిజెంట్ బాయ్. ఆల్వేస్ ఫోకస్డ్. విశ్లేషణా సామర్థ్యం ఎక్కువ.
పైగా అంత హార్‌‌డవర్‌‌క చేసే హీరోను ఈ మధ్య చూడలేదు. అదే శ్రీరామరక్ష.

 ‘నువ్వేకావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మసాలా’ లాంటివి 
ఇతర నిర్మాత లతో పార్‌‌టనర్‌షిప్‌లో తీశారు. ఇప్పుడలాంటి ప్రయత్నాలు
 మానేశారేం?
 అలా చేస్తే, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కానీ, ఇండిపెండెంట్‌గా
 పనిచేసినవాళ్ళం, మనకి మనం బాస్‌గా కాకుండా, మరొక బాస్ కింద
పని చేయడం కొంత కష్టమే. నిర్ణయానికి మరొకరి కోసం నిరీక్షించడం ఇబ్బందే.

 ఇన్నేళ్ళ కెరీర్‌లో నిర్మాతగా మోస్ట్ డిజప్పాయింటింగ్ ఫిల్మ్?
 (క్షణం ఆలోచించి) ‘ఎందుకంటే ప్రేమంట’. నేను, రామ్ ప్రాణం పెట్టి
పనిచేశాం. ఆడలేదు. అలాంటి తరహాదే ఆమిర్‌ఖాన్ ‘తలాష్’ చేస్తే అది
ఆడింది. ఎక్కడో మేం తప్పు చేశామన్న మాట. ఇక, కెరీర్‌లో బెస్ట్‌ఫిల్మ్
 ‘నువ్వు నాకు నచ్చావ్’. ప్రతి క్షణం ఆస్వాదిస్తూ, చేశా.

  కెరీర్‌లో తీవ్రంగా పశ్చాత్తాపపడిన సందర్భం, సంఘటన?
 అలా ఏమీ లేదు. ప్రతి వ్యక్తినీ, సందర్భాన్నీ ఒకలా అంచనా వేస్తాం.
అది తప్పని తేలితే రెండోసారి జాగ్రత్తపడతాం. అంతకు మించి పగ,
 ప్రతీకారం లాంటివుండకూడదు. నేర్చుకొంటే, ఇక్కడ ప్రతీదీ అనుభవమే.

  రాబోయే రోజుల్లో సినీ నిర్మాణం ఎలా ఉండనుంది?
 తెలుగు పరిశ్రమ గట్టి దెబ్బలు కొట్టడంతో కార్పొరేట్ సంస్థలు
 గుమ్మం దగ్గరే నిలబడిపోయాయి కానీ, అవి వస్తాయి. మూడేళ్ళ
 తర్వాత స్వతంత్ర నిర్మాతలంటూ ఎవరూ మిగలకపోవచ్చు. అసోసియేట్,
లైన్ ప్రొడ్యూసర్, వర్కింగ్ పార్‌‌టనర్‌‌సగా కార్పొరేట్స్‌తో చేతులు
కలపాల్సి వస్తుంది. ‘నువ్వే కావాలి’ టైమ్ కే నేను ఊహించిన పరిణామం
15 ఏళ్ళు ఆలస్యమైంది.

 ఈ 30 ఏళ్ళ సినీ కెరీర్‌లో ఏం తెలుసుకున్నారు?
 అందరిలా తప్పులు చేశాం. సక్సెస్ ప్రమాదకరం. తలకెక్కి తప్పుదోవ
 పట్టిస్తుంది. సక్సెస్ ఒక్కరిది కాదు, టీమ్‌వర్కని మర్చిపోతుంటాం.
అందుకే, ఫెయిల్యూర్ కన్నా సక్సెస్ వచ్చినప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండాలి.

 కొత్తగా రానున్న చిత్ర నిర్మాతలకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
 ఇక్కడ ప్రతివాడూ పక్కవాడి కంటే తాను గొప్పనుకుంటాడు. కాబట్టి,
సలహాలు చెప్పి, నవ్వులపాలు కాకూడదు. ఇక్కడ ఎవరూ వినరు, మారరు.

 మీ ‘స్రవంతి’ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి వారసులు సిద్ధమేనా?
 నా రెండో తమ్ముడి కొడుకు రామ్  హీరో. ఇక, న్యూజిలాండ్‌లో కమర్షి యల్
 పైలట్ కోర్‌‌స చేసిన రామ్  వాళ్ళ అన్నయ్య కృష్ణచైతన్య నా వెంటే ఉంటూ
 ప్రొడక్షన్ చూస్తున్నాడు. నా మొదటి తమ్ముడు డాక్టర్ రమేశ్ కొడుకు
రాజా నిశాంత్ అమెరికాలో డెరైక్షన్ కోర్‌‌స చేశాడు. భవిష్యత్తు వీళ్ళదే.

 - రెంటాల జయదేవ

.........................................................

Tuesday, October 6, 2015

చంద్రముఖి ప్యాట్రన్ చంద్రిక

చంద్రముఖి ప్యాట్రన్ చంద్రిక










కొత్త సినిమా గురూ! - చంద్రిక

  బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు బాగా పారుతున్న పాచిక - భయపెట్టడం!
ఈ లేటెస్ట్ బాక్సాఫీస్ హార్రర్ సక్సెస్ ట్రెండ్‌లో ‘చంద్రకళ’, ‘పిశాచి’,
గత వారం రిలీజ్ ‘మయూరి’ (తమిళంలో ‘మాయ’) తర్వాత వచ్చిన చిత్రం ‘చంద్రిక’.

బంగళాలో భూతం!

 అర్జున్ (జయరామ్ కార్తీక్) అనే ప్రముఖ చిత్రకారుడు పెద్ద హవేలీని కొంటాడు.
అతని గురువైన ప్రసిద్ధ చిత్రకారుడు రవివర్మ (గిరీష్ కర్నాడ్) ఆ బంగళాలో
ఒకప్పుడు నివసించేవాడు. ఈ ఏకలవ్య శిష్యుడు ఆ భవనం కొనడానికి కారణం
 అదే. అలా ఆ భవంతిలోకి అతను, అతని భార్య శిల్ప (టీవీ యాంకర్,
నటి శ్రీముఖి) అడుగుపెడతారు. అయితే, ఆ బంగళాలోకి అడుగుపెట్టినప్పటి
 నుంచి శిల్ప ప్రవర్తనలో చిత్రమైన మార్పులు మొదలవుతాయి. చివరకు
ఆ బిల్డింగ్‌లో ఒకప్పుడు తాను గీసిన పెద్ద స్త్రీమూర్తి చిత్తరువులోని చంద్రికనే
తానంటూ భార్యను పూనిన దయ్యం చెబుతుంది. అక్కడికి ఫస్టాఫ్ ముగుస్తుంది.

 భార్యను పట్టిన ఆ బంగళాలోని దయ్యాన్ని వదిలించడానికి అర్జున్ ఒక
మంత్రోపాసకుణ్ణి ఆశ్రయిస్తాడు. చంద్రికకూ, నీకూ సంబంధం ఏమిటన్న
ఆ ఉపాసకుడి దగ్గర అర్జున్ తన ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ చేస్తాడు. చంద్రిక, తాను
 ఒకప్పటి ప్రేమికులమనీ, పీటల దాకా వచ్చి తమ పెళ్ళి ఆగిపోయిందనీ
 చెబుతాడు. అయితే, ఆ ఫ్లాష్‌బ్యాక్ ముగిశాక కూడా చంద్రిక మరణం
మిస్టరీ వీడదు. ఆ పజిల్‌ను సాల్వ్ చేయడానికి అర్జున్ అన్వేషణ
ప్రారంభిస్తాడు. ఆ అన్వేషణలో అతనికి తెలిసిందేమిటి? ఏమైందన్నది
మిగతా సినిమా.

 కీలకంగా.. సౌండ్ ఎఫెక్ట్స్
 తెలుగు కన్నా ఒక రోజు ముందే కన్నడ వెర్షన్ రిలీజైన ‘చంద్రిక’
ప్రాథ మికంగా కన్నడ సినిమా. ‘సత్యం’ రాజేశ్, ఎల్బీ శ్రీరామ్,
‘తాగుబోతు’ రమేశ్ లాంటి వాళ్ళతో షూట్ చేసిన సీన్లు దీన్ని కన్నడ,
తెలుగు ద్విభాషా చిత్రం చేశాయి. కానీ, కన్నడ తరహా టేకింగ్, ఆ
నిర్మాణ విలువలు తెలిసిపోతుంటాయి. అర్జున్ పాత్రధారి మనకు
కొత్త. కామ్నా జెత్మలానీ కనిపించేది కాసేపు. వారిద్దరి మధ్య ప్రణయగీతం
 మాత్రం ఇవాళ్టి సినిమాల్లోని ఐటమ్ సాంగ్‌లా మాస్‌ను ఆకట్టుకుంటుంది.
 ‘జులాయి’లో అల్లు అర్జున్ చెల్లెలు పాత్ర పోషించిన టీవీ యాంకర్ శ్రీముఖిది
 సినిమాలో ప్రధానపాత్ర. గృహిణిగా, దయ్యంగా వేరియేషన్ బాగా
చూపారు. ఇంటర్వెల్ ముందు ముగ్గులో విచిత్ర విన్యాసాలతో ఆమె నటన
బాగుంది. మిగతా పాత్రలన్నీ కాసేపు కనిపించి పోయేవి. బ్యాక్‌గ్రౌండ్‌లో
 వచ్చే దయ్యం పాట ముక్కలు ముక్కలుగా విన్నప్పుడు బాగుంది.
గుణ్వంత్ సంగీతం, సేతు సౌండ్ ఎఫెక్ట్స్ కొంత ప్లస్. కెమేరా వర్క్ ఫరవాలేదు.

 సినిమా మొదలైన కాసేపటికే క్యారెక్టర్లు, దయ్యం విషయం పరిచయం
 అయిపోతుంది. కానీ, ముందే ఊహించగల సీన్లతోనే ఫస్టాఫంతా
సాగు తుంది. ఇంటర్వెల్‌కి కానీ బండి పట్టాలెక్కదు. ఫ్లాష్‌బ్యాక్ నుంచి
సెకండాఫ్ ఆసక్తిగా సాగాలి. అక్కడకొచ్చేసరికి, ప్రేమ సీన్ల లాగుడు.
చివరకు ప్రాబ్లమ్ సాల్వ్ కావడాన్ని కూడా తేలిగ్గా తేల్చేశారు.
భవంతిలోని దయ్యం హీరో మీద పగబట్టి ఉంటే, అతనక్కడికి
వచ్చేదాకా ఏమీ చెయ్యదెందుకని? జరిగిన సంగతేదీ తెలియకుండా
హీరో బతికేస్తున్నాడా? లాంటి ప్రశ్నలకు జవాబులు ఎవరికి
వారు ఊహించుకోవాల్సిందే! కథలోని సమస్యను పరిష్కరించడానికి
సోకాల్డ్ హీరో చేసిందేమిటంటే జవాబు దొరకదు. కథలో బలమైన
విలన్లు, ఆ విలన్లు చేసిన దుర్మార్గాలు, దుష్కృత్యాలూ లేవు. అందుకే,
 వ్యవహారమంతా ఉపరితల స్పర్శే. బలమైన హార్రర్ కథ కానీ, ఇటీవలి
 హార్రర్ కామెడీ కానీ కనిపించవు. రజనీకాంత్ ‘చంద్రముఖి’ తరహా
 సినిమా చేయాలన్న బలమైన కోరిక మాత్రం అడుగడుగునా
 అర్థమవుతుంటుంది. అదే ఈ కథకు మైనస్సూ, ప్లస్సూ కూడా!

.........................................

చూడాలంటే భయపెట్టే.. చంద్రిక (సినిమా రివ్యూ: చంద్రిక)


చూడాలంటే భయపెట్టే.. చంద్రిక








చిత్రం - ‘చంద్రిక’,
తారాగణం - జయరామ్ కార్తీక్, శ్రీముఖి, కామ్నా జెత్మలానీ,
గిరీష్ కర్నాడ్, ఎల్బీ శ్రీరామ్, ‘సత్యం’ రాజేశ్
మాటలు - నాగేశ్వరరావు
పాటలు - వనమాలి
సంగీతం - గుణ్వంత్
కెమెరా - కె. రాజేందర్ బాబు
ఎడిటింగ్ - వి. సురేష్‌కుమార్
కథ, స్క్రీన్‌ప్లే - సాజిద్ ఖురేషీ
నిర్మాత - వి. ఆశ
దర్శకత్వం - యోగేశ్

బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు హార్రర్ సినిమాలు చాలా వస్తున్నాయి.
అందులో లేటెస్ట్ ఎడిషన్ ఈ ‘చంద్రిక’. వాల్‌పోస్టర్లలో ‘చంద్రముఖి’
 తరహాలో డ్యాన్స్ దుస్తుల్లో హీరోయిన్ కనిపించడం, అలాగే కామ్నా
 జెత్మలానీ లాంటి పేరున్న తార కూడా నటించడం వల్ల ఈ సినిమా
పట్ల కొంత ఆసక్తి నెలకొంది. మరి, ఈ శుక్రవారం వచ్చిన ‘చంద్రిక’
ఆ ఆసక్తికి తగ్గట్లే ఉందా?

కథేమిటంటే..
అనగనగా ఒక ఊరు. అందులో ఓ పెద్ద బంగళా. ఆ బంగళాను
 కొనుక్కున్నవాళ్ళకు చిత్రవిచిత్రమైన అనుభవాలు ఎదురవుతుంటాయి.
 దాంతో, అందరూ భయపడి పారిపోతుంటారు. ఆ పరిస్థితుల్లో
ఆ బంగళాను అర్జున్ (తొలి పరిచయం - జయరామ్ కార్తీక్)
అనే చిత్రకారుడు కొనుక్కుంటాడు. అది తన గురువైన చిత్రకారుడు
 రవివర్మ ఒకప్పుడు ఉన్న బంగళా అనీ, అందుకే దాన్ని కొన్నాననీ
తన భార్య శిల్ప (తెలుగు యాంకర్, నటి శ్రీముఖి)కి చెబుతాడు.
ఆ హవేలీలో ఆర్ట్ గ్యాలరీ పెడదామని అతను అనుకుంటే,
‘లేదు... అక్కడే ఉందామ’ని భార్య అంటుంది. అలా ఆ
 దంపతులు ఆ బంగళాకు కాపురం మారుస్తారు.

అక్కడ నుంచి శిల్ప ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కనిపిస్తూ
 ఉంటాయి. ఆ మార్పులను భర్త మొదట పట్టించుకోడు. భవంతిలో
 ఆత్మ ఉందనే సంగతి అతనికీ క్రమంగా అర్థమవుతుంది. ఆ
బంగళాలోని ఒక పెద్ద చిత్తరువు (ఆ బొమ్మలో కామ్నా జెత్మలానీ)ని
 చూపించి, చంద్రికను అనడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.

సెకండాఫ్‌కు వచ్చేసరికి, ఆ చంద్రిక ఎవరనే ప్రశ్న వస్తుంది. ఆ
 భూతాన్ని వదిలించడానికి వచ్చిన మంత్రవేత్త సమక్షంలో ఫ్లాష్‌బ్యాక్
ఓపెన్ అవుతుంది. చంద్రిక ఎవరనే విషయం అడిగిన మంత్రవేత్తతో హీరో
జరిగిన కథ చెప్పడం మొదలుపెడతాడు. ఆ బంగళా ప్రసిద్ధ చిత్రకారుడు
రవివర్మ (గిరీష్ కర్నాడ్)ది అనీ, అతని తమ్ముడి కూతురే చంద్రిక
(కామ్నా జెత్మలానీ) అనీ చెబుతాడు. ఏకలవ్య శిష్యుడిగా గురువు గారి
వద్ద చిత్రకళ నేర్చుకోవడానికి వచ్చిన తనకూ, చంద్రికకూ మధ్య
పెరిగిన ప్రేమ బంధం గురించి చెబుతాడు. తమ ప్రేమ పెళ్ళిదాకా
 వచ్చినా, పీటల మీద పెళ్ళి ఆగిపోయినట్లు చెబుతాడు. కానీ,
దానికి తాను కారణం కాదని చెబుతాడు. మంత్రవేత్త మాటలతో
ఆ తరువాత జరిగిన కథ తెలుసుకోవడం కోసం అన్వేషణ
 మొదలుపెడతాడు. ఇంతకీ అసలేమైంది? చంద్రిక ఎలా
చనిపోయింది? లాంటివన్నీ మిగతా కథ.

ఎలా చేశారంటే...?
ఇది ప్రధానంగా కన్నడ సినిమా. అయితే, కొంతమంది
 తెలుగు ఆర్టిస్టుల్ని కూడా పెట్టుకొని, రీషూట్స్ చేసి  ఏకకాలంలో
తెలుగు, కన్నడ భాషల్లో తయారైన సినిమా అనగలిగారు.
ఈ చిత్ర కథానాయక పాత్రధారికి తెలుగులో ఇదే తొలిచిత్రం.
ఆ పాత్రలో ఆయన చేయగలిగిందీ, చేసిందీ ఏమీ లేదు. టీవీ
 యాంకర్, ‘జులాయి’ చిత్రంలో అల్లు అర్జున్ చెల్లెలు పాత్రధారిణి
అయిన శ్రీముఖి ఈ చిత్రంలో హీరోయిన్. ఆమె కొన్ని చోట్ల
చూడడానికి బాగుంది. ముఖ్యంగా, చంద్రిక (కామ్నా జెత్మలానీ)
 పూనినట్లు అనిపించే సీన్స్‌లో బాగా చేశారు.

ఇంటర్వెల్‌కు ముందు తానే చంద్రికను అంటూ వచ్చే
 ముగ్గులోని ఆత్మ సీన్‌లో శ్రీముఖి ఆంగికం, ఆహార్యం,
క్లిష్టమైన భంగిమల్లో ఆమె చేసిన వర్క్ బాగుంది. చంద్రికగా
 కామ్నా జెత్మలానీ కనిపించేది కాసేపే అయినా, సినిమాకు
అదనపు ఆకర్షణ. ఆమెకూ, హీరోకూ మధ్య పెట్టిన రొమాంటిక్
సాంగ్ ఒక రకంగా చెప్పాలంటే, స్పెషల్ ఐటమ్ సాంగ్.
గిరీష్ కర్నాడ్ లాంటి సీనియర్ నటుడున్నా, కథలో
ఆయనకున్న పాత్ర కొద్దిగానే. ‘సత్యం’ రాజేశ్, ఎల్బీ
శ్రీరామ్, ‘తాగుబోతు’ రమేశ్ లాంటి వారందరూ చేసినవి
 తెరపై కనిపించడానికే తప్ప కథను నడిపించడానికి
ఉపయోగపడిన పాత్రలు కావు.

ఎలా ఉందంటే...?
దర్శకుడు యోగేశ్‌కు ఇదే తొలి చిత్రం. ఆ అనుభవ
రాహిత్యం బయటపడిపోయింది. క్యారెక్టర్ల పరిచయం
కాసేపటికే అయిపోతుంది. బంగళాలోని భూతం సంగతి
 సినిమా మొదలైన కాసేపటికే అర్థమైపోతుంది. ఇక, ఆ తరువాత
కథను పట్టాలెక్కించి, వేగంగా నడపాల్సింది. కానీ, అక్కడ
అవసరం లేని, ఆసక్తి కలిగించని సీన్లు పెట్టారు. వాటికి తోడు
 పానకంలో పుడక లాగా పాటలు. సెకండాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్
మొదలుపెట్టినప్పటి నుంచి సినిమా రసకందాయంలో పడాలి.
కానీ, అలా జరగలేదు. సరికదా... అనాసక్తిగా తయారైంది.
ఫ్లాష్‌బ్యాక్ ఘట్టం కూడా అంతంత మాత్రంగానే ఉంది. హీరో,
కామ్నా జెత్మలానీల ప్రేమఘట్టాన్ని అతిగా సాగదీశారు. ఫ్లాష్‌బ్యాక్
 తరువాతహీరో కనిపెట్టిన అంశాలు కూడా ఆసక్తిగా లేవు. చివరకు
వచ్చేసరికి, రజనీకాంత్ ‘చంద్రముఖి’ తరహా క్లైమాక్స్‌ను
అనుకరించారు. కానీ, అదీ అంతంత మాత్రమే.

మాటి మాటికీ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే దయ్యం పాట ముక్కలు
ముక్కలుగా విన్నప్పుడు బాగుంది. గుణ్వంత్ సంగీతం, సేతు
సౌండ్ ఎఫెక్ట్స్ కొంత సినిమాను కాపాడాయి. కెమేరా వర్క్
 ఫరవాలేదు. కానీ, కథలో పస లేనప్పుడు, చెప్పిన విధానంలో
దమ్ము లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు. విషాదం
ఏమిటంటే, ‘చంద్రముఖి’ని చూసి, ఆ ధోరణిలో వెళ్ళాలని
వాత పెట్టుకున్న ఈ హార్రర్ జానర్ సినిమాలో క్రైమ్
ఎలిమెంట్ కానీ, భయపెట్టే అంశాలు కానీ, కనీసం కాసేపు
 నవ్వు తెప్పించే విషయాలు కానీ లేకపోవడం! కన్నడంలో
ప్రధానంగా తీసిన సినిమా కావడంతో ఆ తరహా టేకింగ్
తెలిసిపోతుంటుంది. వెరసి, తెలుగులో కన్నా ఒక రోజు
ముందే కన్నడంలో విడుదలైన ఈ ద్విభాషా ‘చంద్రిక’
జనం చూడడానికి భయపడే సినిమాయే తప్ప, చూస్తే
భయపడే సినిమా కాదు!

- రెంటాల జయదేవ

Monday, October 5, 2015

శివమెత్తించే... ప్రేమ (కొత్త సినిమా గురూ! - శివమ్)

శివమెత్తించే... ప్రేమ
తారాగణం: రామ్, రాశీఖన్నా, అభిమన్యు సింగ్, వినీత్‌కుమార్, బ్రహ్మానందం, 
పాటలు: భాస్కరభట్ల, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, నిర్మాత:
 ‘స్రవంతి’ రవికిశోర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి, నిడివి: 
168  నిమిషాలు, రిలీజ్: అక్టోబర్ 2
 .................................

లవ్‌స్టోరీ ఉన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘శివమ్’తో దర్శకుడైన శ్రీనివాసరెడ్డి గతంలో
 సురేందర్ రెడ్డి దగ్గర ‘కిక్’, ‘రేసుగుర్రం’ లాంటి చిత్రాలకు పనిచేశారు.  దాదాపు
34 మంది ఆర్టిస్టులున్న ఈ సినిమాకైన బడ్జెట్ సుమారు రూ. 20 కోట్లు 
మొత్తం వర్కింగ్ డేస్ 87. ఊటీ, హైదరాబాద్, నార్వే, స్వీడన్‌లలో షూటింగ్.
నార్వే, స్వీడన్‌లలో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా ఇదే. అక్కడ డ్రోన్
కెమేరాలు వాడారు.
..............................................

సినిమా రచనలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. కథ అనుకొని దానికి తగ్గట్లు సీన్లు
రాసుకోవడం సంప్రదాయంగా అందరూ అనుసరించే విధానం. అయితే, ఒక్కోసారి
ప్రేక్షక జనాన్ని మెప్పించే తపనలో, సీన్లు అనుకొని కథలు కూడా వండుకోవడమూ
 సహజం. అలాంటి ఆసక్తికరమైన సీన్లు, ఎపిసోడ్లన్నీ కలసి తెరపై సినిమాగా
పరిణమిస్తే, కొన్నిసార్లు కథ కన్నా సీన్లదే ఎక్కువ ప్రాధాన్యమ వుతుంది. చిత్ర
నిర్మాణంలో ముప్ఫయ్యో ఏట అడుగుపెట్టిన ‘శ్రీస్రవంతీ మూవీస్’ సంస్థ నుంచి
 మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘శివమ్’ సినిమా చూసినప్పుడు ఈ
 ఆలోచనలన్నీ మెదులుతాయి.

కథ ఏమిటంటే...: 

ఇది శివ (రావ్‌ు) అనే కుర్రాడి కథ. అతనిది ఒక విలక్షణ తత్త్వం. ప్రేమికుల
 పెళ్ళిళ్ళకు ఇంట్లో పెద్దలు అభ్యంతరపెడుతున్నారని తెలిస్తే చాలు... నేరుగా
 తాను బరిలోకి దిగిపోతాడు. పెద్దవాళ్ళతో ఫైట్లు చేసి మరీ, ప్రేమికుల జంటను
 కలుపుతూ ఉంటాడు. అలా అప్పటికి 112 పెళ్ళిళ్ళు చేయించాడా కుర్రాడు.
ఆ క్రమంలో జడ్చర్ల పట్నాన్ని గడగడలాడించే భోజిరెడ్డి (వినీత్ కుమార్) అనే
విలన్ మనుషుల్ని కొట్టి, వాళ్ళకు శత్రువవుతాడు. అలాంటి కుర్రాడు రైలులో
 వెళుతూ, ఒకమ్మాయి ఏదో షూటింగ్ కోసం అన్న ‘ఐ లవ్ యూ’ అన్న
 మాటను సీరియస్‌గా తీసుకుంటాడు. ఆ అమ్మాయినీ, ఆమె ప్రేమనూ
 వెతుక్కుంటూ వెళతాడు. అదే టైవ్‌ులో పోయిన పరువును తిరిగి
తెచ్చుకోవడం కోసం భోజిరెడ్డి మనుషులు హీరో కోసం వెతుకుతుంటారు.
 మరోపక్క అభిమన్యు సింగ్ అనే మరో విలన్ కూడా హీరో కోసం
వెతుకుతుంటాడు. అతనెందుకు వెతుకుతున్నాడన్నది కాసేపు సస్పెన్‌‌స.
తీరా హీరో కనిపించినప్పుడు అతణ్ణి వదిలేసి, హీరోయిన్‌ను కిడ్నాప్ చేసుకొని
వెళతాడతను. అక్కడికి ఇంటర్వెల్. విలన్ దగ్గర నుంచి ఆమెను హీరో
రక్షించడం, హీరో పనిపట్టడం కోసం ఇద్దరు విలన్ల మధ్య ఒప్పందం కుదరడం
 లాంటివన్నీ తర్వాతి కథ. ఒక దశలో హీరోయిన్‌తో ప్రేమ కన్నా, ప్రేమించినవాళ్ళను
ఏకం చేయడం వైపే హీరో మొగ్గుతాడు. అలా ఎందుకన్నది ఫ్లాష్ బ్యాక్. అదేమిటి,
 హీరో అసలు ‘శివ’ అని పేరు పెట్టుకోవడానికీ, తాను పెళ్ళి చేసిన ప్రేమికుల
 మొదటి బిడ్డకు ‘శివ’ అని వచ్చేలా పేరు పెట్టమనడానికీ కారణం ఏమిటి,
ప్రేమ అనే విషయం వచ్చేసరికి అతనెందుకు శివమెత్తుతాడు, చివరకు విలన్ల
కథెలా కంచికి చేరిందన్నది మిగతా సినిమా.

తెర నిండా యాక్టర్లే...:

 ‘ఎనర్జిటిక్ స్టార్’ బిరుదాంకితుడైన యువ హీరో రామ్ఆ పేరుకు తగ్గట్లు
 నటించారు. మొదటి నుంచి చివరి దాకా హుషారుగా, ఎందరినైనా కొట్టి,
 ఏదైనా సాధ్యం చేయగల వీరాధివీరుడి తరహా పాత్రలో కనిపిస్తారు. ఇక,
 క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఘట్టంలో పొడవాటి జుట్టున్న విగ్‌లో
 విభిన్నంగా, విచిత్రంగా ఉన్నారు. ప్రేమిస్తున్నాననే విషయాన్ని కూడా
నేరుగా చెప్పడంలో కూడా ‘ఇగో’ ఫీల్ అయ్యే కథానాయిక తనూజగా హీరోయిన్
 రాశీఖన్నాది విగ్రహపుష్టి. ఈ చిత్రంలో విలన్లు ఒకరు కాదు - ఇద్దరు.
ఒకరు అభిమన్యు సింగ్, రెండో వ్యక్తి వినీత్ కుమార్. కానీ, చిత్రంగా ఈ
ప్రతినాయక పాత్రల్లో ఏదీ బలంగా కనిపించదు. విలన్లు కూడా కామెడీ
చేయడమనే కాన్సెప్ట్‌తో కథను తీర్చిదిద్దుకోవడం అందుకు ఒక కారణం.
 బలమైన విలన్లు, సన్నివేశాలు, సందర్భాలు లేనప్పుడు హీరోనెంత గొప్పగా
 చూపినా, హీరోయిజవ్‌ు ఎంతవరకు ఎలివేటవుతుందన్నది ప్రశ్న.

వీళ్ళు కాక - కామెడీ కోసం బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి
నుంచి సప్తగిరి, ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్.... ఇలా లెక్కేసుకుంటూ
పోతే, ఆ పేర్ల జాబితానే కొండవీటి చాంతాడు. ఇటీవలి కాలంలో తన అమాయకపు
 డైలాగుల చిన్న చిన్న పాత్రలతోనే అలరిస్తున్న ‘ఫిష్’ వెంకట్ కూడా ఉన్నారు.
కనిపించే కొద్ది సీన్లలో ఎవరికి వారు తమ వంతు నవ్వించడానికి ప్రయత్నించారు. 
ఇక, హీరో తండ్రి పాత్రలో పోసాని కృష్ణమురళి, హీరోయిన్ తండ్రి పాత్రలో
 గాయకుడు మనో లాంటి పేరున్న తారలూ కనిపిస్తారు. అప్పటికే సినిమా
 నిడివి 2 గంటల 48 నిమిషాలు కావడం వల్ల కావచ్చు... వారిని ఇంకా
 వినియోగించుకొనే సీన్లకు అవకాశం కష్టమైనట్లుంది. అలాగే, తండ్రి
పోసాని పాత్ర గన్ను పుచ్చుకొని మరీ హీరోను కనిపిస్తే... కాల్చేస్తానంటూ
తిరగడం వెనుక కారణం ఏమిటన్నది చెప్పడం మర్చిపోయినట్లున్నారు.

అనుభవం నిండిన టెక్నీషియన్‌‌ వర్క్:
     
                     శ్రీనివాసరెడ్డికి దర్శకుడిగా ఇది తొలిసినిమా. కథ కూడా
ఆయన రాసుకున్నదే. పాత్రల పరిచయం, కథ ఎస్టాబ్లిష్‌మెంట్‌తోనే సినిమా
 ఫస్టాఫ్ అంతా గడిచిపోతుంది. దానికి మూడు పాటలు, కొన్ని ఫైట్లు అదనం.
 చిన్న ట్విస్ట్ దగ్గర ఫస్టాఫ్ ఆగినా, సెకండాఫ్ మొదట్లోనే ఆ ట్విస్ట్‌ను బయటపెట్టేస్తారు.
ఇక, ఆ తరువాత అంతా టావ్‌ు అండ్ జెర్రీ తరహాలో హీరోకూ, విలన్లకూ మధ్య
జరిగే కథ. హీరో స్వభావానికీ కారణం తెలిపే ఫ్లాష్‌బ్యాక్ కథ చివరాఖరుకు వస్తుంది.
అప్పటి దాకా ఆసక్తినీ, సహనాన్నీ కోల్పోకుండా నిలుపుకోవాలి. మాటల రచయిత
కిశోర్ తిరుమల ఉన్నా, ఆ క్రెడిట్‌నూ దర్శకుడు కూడా పంచుకున్న ఈ సినిమాలో,
 ముఖ్యంగా ఫస్టాఫ్‌లో డైలాగ్‌‌స కొంత బాగున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో
‘నా కోసం నువ్వేమీ ప్రేమించక్కర్లేదు...’ లాంటి 2-3 పాటలు బాగున్నాయి.
 నార్వే, స్వీడన్ లాంటి చోట్ల అందమైన లొకేషన్లను కెమేరాలో బంధించిన తీరూ
 బాగుంది. పీటర్ హెయిన్ ఫైట్స్ సరేసరి. ఇలాంటి అనుభవజ్ఞులైన నిపుణులతో
 పాటు నిర్మాణ విలువలూ పుష్కలమే. ఇన్ని సమకూరిన సినిమాలో సీన్లు,
 పాటలు, ఫైట్లూ ఉన్నాక... ఇంకా కథ గురించి ఆలోచించడం ఎందుకు?

.......................................