జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, May 21, 2015

సమ్మరమే (ఈ సమ్మర్‌లో సినిమా ఇండస్ట్రీ)

సినిమాకి హీరో దేవుడంతటివాడు... కాదు... దేవుడే!
హీరోని ఏ వరం అడిగినా ‘ఓకే టేకిట్’ అంటాడు బోళాశంకరుడిలా!
అందుకే అతగాడు హీరో.
ఈ ఎండాకాలంలో హీరోని ఇండస్ట్రీ ఏమి అడుగుతుంది?
చల్లని హిట్ ఇవ్వు స్వామీ అని వేడుకుంటుంది. ఇస్తారా?
ఇవ్వకపోతే సమ్మర్‌లో మాడి మసైపోతుంది ఇండస్ట్రీ.
దట్ ఈజ్ ద ప్రాబ్లమ్ అవర్ హీరో ఈజ్ ఫేసింగ్!

ఈ సమ్మర్‌లో హీరోగారు సప్తసముద్రాలు దాటి
విలన్‌ని పంచ్‌లు కొట్టి,  హీరోయిన్ మీద పంచ్‌లు విసిరి,
 సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ టైమ్‌ని  పటాపంచ్‌లు చేసి హిట్ కొడతాడా?
అన్నదే క్లైమాక్స్ సీన్.
150 కోట్ల లాసులు... 500 కోట్ల స్టేకులు... 8 వీక్స్ టైము... దేఏఏఏవుడా!


సమ్మరమే

ఇరవై సినిమాలు... 500 కోట్లు... కేవలం అరవై రోజులు!!


మే నెల సెకండాఫ్ నుంచి జూలై ఫస్టాఫ్ దాకా రెండు నెలల కాలంలో వచ్చే సినిమాల రిజల్ట్‌తో ఇండస్ట్రీ భవిష్యత్తు ముడిపడి ఉంది. బాలకృష్ణ ‘లయన్’ మొదలు గుణశేఖర్ ‘రుద్రమదేవి’, రాజమౌళి ‘బాహుబలి’ దాకా పదుల కోట్ల పెట్టుబడితో, ప్రతిష్ఠాత్మకంగా తయారైన అనేక భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. మీడియమ్ రేంజ్ సినిమాలు సహా 20 కొత్త చిత్రాలు పలకరించనున్నాయి. ఒక్కముక్కలో పణంగా ఒడ్డుతున్న 500 కోట్ల సాక్షిగా తెలుగు ఇండస్ట్రీ వసూళ్ళ వర్షం కోసం ఎదురుచూస్తోంది.

సక్సెస్ దాహార్తిలో సినిమా


ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తెలుగులో ‘యూనివర్సల్ హిట్స్’ ఎన్ని అంటే, వెతుక్కోవాల్సి వస్తోంది. నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక రంగాలు మూడింటికీ తృప్తినిచ్చిన సినిమాగా కల్యాణరామ్ ‘పటాస్’ రీజనబుల్‌గా పే చేసింది. డబ్బింగ్‌ల సంగతికొస్తే - కొత్త ఏడాదికి శ్రీకారం చుట్టిన ధనుష్ ‘రఘువరన్ బి.టెక్’, ఇటీవలి లారెన్స్ ‘గంగ’ డబ్బులు తెచ్చాయని ఇండస్ట్రీ వర్గాల మాట. ‘‘గత డిసెంబర్‌లో వచ్చిన రజనీకాంత్ ‘లింగ’ నుంచి వరుస ఫ్లాపులే. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, అతను డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన ఫైనాన్షియర్ - ఇలా అందరూ పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక కష్టాల్లో ఉన్నారు. ఒక్క మాటలో తెలుగు సినిమా ‘ఫైనాన్షియల్ స్లంప్’లో ఉంది. ఇండస్ట్రీకిప్పుడు మంచి హిట్ రూపంలో టానిక్ కావా’’లని ‘లయన్’ నిర్మాత రుద్రపాటి రమణారావు వ్యాఖ్యానించారు.

ఫస్టాఫ్‌లో... గత ఏడాదే బెటర్!

లాస్ట్ ఇయర్ ఫస్ట్‌హాఫ్ ఇంత దారుణంగా లేదు. మహేశ్‌బాబు ‘1’ లాంటివి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, ‘లెజెండ్’, ‘రేసుగుర్రం’ లాంటి బాక్సాఫీస్ హిట్లతో ఇండస్ట్రీ కళకళలాడింది. ‘‘ఫ్లాపులొచ్చినా, కొన్ని సూపర్‌హిట్లు, కొన్ని సక్సెస్‌లతో గత ఏడాదే బ్యాలెన్స్ అయింది. ఈ ఏడాది ఇప్పటి దాకా రూ. 125 కోట్ల పైగా నష్టపోయాం. పరిశ్రమ బ్యాడ్‌షేప్‌లో ఉంది’’ అని నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ అభిప్రాయపడ్డారు.

అందుకే, టాలీవుడ్‌కి ఇది చాలా క్లిష్టమైన కాలం. రానున్న రెండు నెలల్లో  సగటున ప్రతి పది రోజులకూ ఒక భారీ చిత్రం రానుంది. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న డిఫరెంట్ జానర్ చిత్రాలైన గుణశేఖర్ ‘రుద్రమదేవి’, రాజమౌళి ‘బాహుబలి’ మీద ఇప్పుడు అందరి కళ్ళూ ఉన్నాయి.

అందరి కళ్ళూ అటువైపే!

ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉండి, ఇంకా రిలీజ్‌కు రెడీ కాకపోవడంతో, ఈ చిత్రాల నిర్మాణ వ్యయం, వ్యాపారం వగైరా గురించి ఎవరూ కచ్చితమైన గణాంకాలు చెప్పలేకపోతున్నారు. అయితే, సినీవ్యాపార వర్గాల అంచనా ప్రకారం కేవలం ఈ రెండు సినిమాల మీదే దాదాపు రూ. 200 నుంచి 260 కోట్ల పైచిలుకు సొమ్మును పణంగా ఒడ్డుతున్నారు. ‘‘ఒక సగటు భారీ తెలుగు సినిమాకయ్యే ఖర్చు కన్నా రెట్టింపు వ్యయంతో ‘బాహుబలి’ తయారవుతోంది. ఒక్క తెలుగు వెర్షన్ మీదే వంద కోట్ల పైగా స్టేక్ ఉంటుంది’’ అని సినీ వ్యాపారంలో మూడు దశాబ్దాల పైచిలుకు అనుభవజ్ఞుడు ఒకరు వివరించారు. అలాగే, కాకతీయ వీరనారి రుద్రమదేవి చారిత్రక గాథ ఆధారంగా గుణశేఖర్ తీస్తున్న తొలి తెలుగు స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి’ కూడా 60 కోట్ల పైచిలుకు పెద్ద పందెం. ఇక, మహేశ్‌బాబు, రవితేజ, రామ్, కల్యాణరామ్ లాంటి పేరున్న హీరోలు, పూరీ జగన్నాథ్ లాంటి ప్రముఖ దర్శకులు కూడా ఈ అరవై రోజుల సినీ మారథాన్‌లో కీ-ప్లేయర్స్. అందుకే, ఏలూరుకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎల్.వి.ఆర్. అన్నట్లు, ‘‘ఈ రెండు నెలల్లో రానున్న భారీ బడ్జెట్ చిత్రాలు అటు ప్రేక్షకులకూ, ఇటు పరిశ్రమకూ కొత్త ఎనర్జీని ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితేనే పరిశ్రమ మళ్ళీ కళకళలాడుతుంది.’’ అది ‘లయన్’తో మొదలవుతుందనీ, వరుస హిట్లతో ఈ రెండు నెలల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త ఉత్సాహం పుంజుకుంటుందనీ పరిశ్రమ వర్గీయుల ఆశ. స్పెక్యులేటివ్ బిజినెస్ అయిన సినిమా పయనించేది ఎప్పుడూ ఇలాంటి ఆశల గుర్రం మీదే కదా!

 - రెంటాల జయదేవ

.......................................................
Box Matters

హై స్టేక్స్  బాక్సాఫీస్ జూదం

పెట్టినఖర్చు, చేస్తున్న వ్యాపారం, ప్రింట్స్, పబ్లిసిటీ కలుపుకొని, పరిశ్రమ భారీగా పణం ఒడ్డుతున్న చిత్రాల్లో కొన్ని...

 బాహుబలి: *150 - 200 కోట్లు  (అన్ని భాషల్లో కలిపి) (జూలై 10న)
రుద్రమదేవి: *60 కోట్లు (జూన్)
మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’:  60 కోట్లు (జూలై 17 రిలీజ్)
 లయన్: *35 కోట్లు (మే 14)
రవితేజ ‘కిక్2’: *45 కోట్లు (జూన్)
రామ్ ‘పండగ చేస్కో’: 22-25 కోట్లు (మే 29)
కల్యాణ్‌రాం ‘షేర్’: *20 కోట్లు (జూన్)
 చార్మి ‘జ్యోతిలక్ష్మీ’: *12 కోట్లు (జూన్)
 సందీప్ కిషన్ ‘టైగర్’: *7.5 కోట్లు (మే 22)
అల్లరి నరేశ్ ‘జేమ్స్‌బాండ్’: *8-10 కోట్లు (జూన్)
మోసగాళ్ళకు మోసగాడు: *6-7 కోట్లు (మే 22)
సూర్య ‘రాక్షసుడు’: *14 కోట్లు (మే చివర)
నాగశౌర్య ‘జాదూగాడు’: *4 కోట్లు (జూన్)
ఈ అంకెలన్నీ సినీ వ్యాపార వర్గాల భోగట్టా
 ............................................................

 సెలవుల  సీజన్ వేస్ట్ చేశారు!
‘‘ఇవాళ నిర్మాతలు సరైన ప్లానింగ్ లేక, ఈ వేసవి సెలవుల సీజన్‌ను చాలా వృథా చేశారు. తీరా వేసవి సెలవులైపోతుండగా, ఇప్పుడు పెద్ద సినిమాల సీజన్ మొదలవుతోంది. ఈ సినిమాల విజయం మీదే కొన్ని వందల కోట్ల డబ్బు ఆధారపడి ఉంది.’’
 - సత్య రంగయ్య, ప్రముఖ సినీ ఫైనాన్షియర్     
 ..................................................................
 ఎవరి దగ్గరా డబ్బులు లేవు!
 ‘‘ఈ ఏడాది ఇప్పటి దాకా డిజప్పాయింట్‌మెంటే! ఓవర్ బడ్జెట్ వల్లే ఫ్లాపవుతు న్నాయి. ఎగ్జిబిటర్స్ డబ్బుల్లేక, ఫుల్ పేమెంట్ చేయడం లేదు. దాని మీద ఆధారపడ్డ డిస్ట్రిబ్యూటర్ డబ్బు కట్టడం లేదు. దాంతో ప్రతి రిలీజ్‌కూ కష్టమే.’’
 - తేజ, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, దర్శక, నిర్మాత
.............................
(Published in 'Sakshi' daily, Family Page, 14th May 2015, Thursday)
......................................

Saturday, May 16, 2015

ఎటో వెళ్ళిపోయింది శాటిలైట్

ఎటో వెళ్ళిపోయింది  శాటిలైట్
వెండితెర సినిమా
బుల్లితెరకు రావాలంటే
చాలా ఠీవి కావాలి.
పెద్ద హీరోల ఠీవి ఉండాలి.
పెద్ద హిట్ కొట్టిన ఠీవి సంపాదించాలి.
హీరో ఉండి హిట్టు లేకపోయినా
హిట్టు కొట్టి హీరో లేకపోయినా
మన టీవీకి మాత్రం
ఈ సినిమాల ఠీవి డౌటే!
అంతా... శాటిలైట్ మాయ!
స్టార్ల మధ్యలో తిరిగే శాటిలైట్ కాదు...
శాటిలైట్ చుట్టూ తిరిగే
స్టార్ల బిజినెస్ ఇది!


 ‘మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు’... ఉద్యోగంలో మునిగిపోయిన భర్త... మానసికంగా దగ్గరైన మరో యువకుడు... వారి మధ్య చిక్కిన ఒక యంగ్ మ్యారీడ్ ఉమన్... ఈ ముగ్గురి నడుమ సాగే ఈ సినిమా బాగుందని రివ్యూలు వచ్చినా, జనం వచ్చే లోపలే హాలులో నుంచి మాయమై పోయింది. టీవీలో వేసినప్పుడన్నా చూద్దామంటే శాటిలైట్ రైట్స్ ఇప్పటికీ అమ్ముడే కాలేదు. కాబట్టి టీవీలోనూ ఆ బొమ్మ కనపడదు.  

గడప దాటని సినిమాలెన్నో!


ఈ పరిస్థితి ఒక్క ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’కే పరిమితం కాదు. సినిమా బాగుందని పేరొచ్చినా, స్టార్స్ లేకపోవడంతో - ఇలా టీవీ ప్రసారానికి కూడా నోచుకోని సినిమాలు బోలెడు. పెద్ద వయసువాళ్ళ భావోద్వేగాలు చూపుతూ డాక్టర్ కిరణ్ తీసిన ‘చిన్ని చిన్ని ఆశ’ లాంటివి అందుకు ఉదాహరణ. సింగీతం శ్రీనివాసరావు లాంటివారు నటించినా... ప్చ్! మీకో సంగతి తెలుసా? ఫ్లాపైన స్టార్ హీరోల సినిమాల గతీ అంతే. మొన్నటి బాలకృష్ణ ‘పరమవీర చక్ర’ మొదలు ఇటీవలి రజనీకాంత్ ‘లింగ’, విక్రమ్ ‘ఐ’, సూర్య ‘సికిందర్’.... వేటికీ శాటిలైట్ బిజినెస్ ఇప్పటికీ కాలేదు. కనక ఇప్పట్లో ఇవి టీవీలో వచ్చే ఛాన్సూ లేదు. నాని, సమంత నటించిన గౌతమ్ మీనన్ సినిమా ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ పరిస్థితీ అంతే.

ఆ మాటకొస్తే బడా హీరోల భారీ చిత్రాలను మినహాయిస్తే - నూటికి పది, పదిహేను చిత్రాలకే శాటిలైట్ బిజినెస్ అవుతోంది. శాటిలైట్ రైట్స్ అమ్ముడై, ఆ మాత్రం డబ్బయినా చేతికొస్తే కానీ నిర్మాత సినిమా రిలీజ్ చేయలేడు. రైట్స్ కొనాల్సిన టీవీ చానల్సేమో - సినిమా రిలీజై, ఆడియన్స్ రియాక్షన్ బాగుండి, పేరున్న ఆర్టిస్టులుంటే అప్పుడు కొంటామంటున్నాయి. ‘‘ఒక్క మాటలో చెప్పాలంటే  పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కుదరదు. పెళ్ళి కుదిరితే కానీ పిచ్చి కుదరదు. సినిమాల శాటిలైట్ వ్యాపారం అలా ఉంది’’ అని తెలుగు సినీ నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఒక సగటు తెలుగు సినిమా శాటిలైట్ బిజినెస్ అయిందంటే... ఆ నిర్మాత నక్క తోక తొక్కినట్లే! సినిమా మీద పెట్టిన పెట్టుబడిలో పావువంతయినా వెనక్కి వచ్చిందని సంబరపడాల్సిందే!

శాటిలైట్ అంత కీలకమా?


ఒకప్పుడు సినిమా అంటే హాలులో రిలీజ్.... జనం అక్కడ చూడడమే! టీవీ వచ్చాక సీన్ మారింది. దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు, నిర్ణీత మొత్తం నిర్మాతకు చెల్లించి, సినిమా ప్రసారం చేసేవారు. అప్పట్లో డి.డి. నేషనల్ చానల్‌లో మన సినిమా మూడు నెలలకొకటి ప్రసారమైతే గొప్ప. అలా ప్రసారం కావడానికి పెద్ద పోటీ. జెమినీ, ‘ఈ’, ‘మా’, ‘జీ తెలుగు’ లాంటి శాటిలైట్ టీవీ చానల్స్ వచ్చాక పరిస్థితి మారింది. టి.ఆర్.పీలద్వారా యాడ్స్‌తో ఆదాయం తెచ్చుకోవాలంటే చానల్స్‌కు సినిమాలు రెడీమేడ్ సాఫ్ట్‌వేర్! దాంతో
 కనపడిన ప్రతి సినిమానూ టీవీ చానల్స్ పప్పుబెల్లాలు కొన్నట్లు కొనేశాయి. నిర్మాతలూ తమ సినిమాల టీవీ ప్రసార హక్కులు అడిగినవాడికి అడిగినట్లుగా - పదికీ, పరకకూ ఇచ్చేశారు. కొన్ని చానల్స్ దొరికిందే సందని... అతి తెలివితో, శాశ్వత హక్కులూ రాయించేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా తీస్తున్న సినిమాల నిర్మాతలకు ఈ శాటిలైట్ రైట్స్ నయా ఆమ్‌దానీ అయింది. సినిమా వ్యాపారంలో కొత్త ఐటమ్ వచ్చి చేరింది.

బాతును మింగిన గుడ్డు


కొన్నేళ్ళలోనే ఈ రైట్స్ రేట్లు బాగా పెరిగాయి. ఒక అగ్ర హీరో సంగతే తీసుకుంటే ఆయన సినిమా శాటిలైట్ రైట్స్ ఒకప్పుడు 30 లక్షల లోపు పలికింది. తరువాత అది కోటికీ, అటుపైన 4.5 కోట్లకీ ఎగబాకింది. ఇదంతా జస్ట్... ఫోర్... ఫైవ్ ఇయర్స్‌లో వచ్చిన ఛేంజ్! కానీ, రోజుకో గుడ్డు పెట్టే బంగారు బాతును పొట్ట కోసి చూస్తే? అదే జరిగింది! జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే శాటిలైట్ ఆదాయంతో సినిమా బడ్జెట్ తిరిగి వచ్చేస్తుందని నయా ప్రొడ్యూసర్స్‌ను ముగ్గులోకి లాగి ప్రాజెక్ట్ సెట్ చేసేవాళ్ళు వచ్చారు. చానల్స్‌కూ, ప్రొడ్యూసర్స్‌కూ మధ్యన వ్యవహారం నడిపే మీడియేటర్లు వచ్చారు. శాటిలైట్ రైట్స్ ఆదాయం కోసమే ఏదో ఒక సినిమా చుట్టేసేవాళ్ళు వచ్చారు. అది కొంతకాలం నడిచింది. ఇంతలో పేరుకుంటున్న నష్టాలు, మార్కెట్ పరిస్థితిని గమనించిన టీవీ చానల్స్ శాటిలైట్ రైట్స్ కోసం ఎగబడడం మానేశాయి.

ఖర్చు ఎక్కువ... రికవరీ తక్కువ!

 పెట్టిన కోట్ల పెట్టుబడికి తగినంత ఆదాయం రావడం లేదనేది చానల్స్ వాదన. సినిమాల మధ్యలో వేసే వాణిజ్య ప్రకటనల నిడివి తగ్గిస్తూ, ‘టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ’ (ట్రాయ్) విధించిన షరతులూ తోడయ్యాయి. ‘‘సినిమాల రైట్స్ కోసం చానల్స్ చాలా పెద్ద మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. తొలి మూడు టెలికాస్ట్‌ల తర్వాతా మాకు వెనక్కి వస్తున్నది - 30 నుంచి 40 శాతమే. గతంలో ‘ట్రాయ్’ నిబంధనలు లేనప్పుడు ఎక్కువ యాడ్స్ ద్వారా ఖర్చు రాబట్టుకొనేవాళ్ళం. ఇప్పుడా పరిస్థితి లేదు’’ అని ఒక ప్రముఖ తెలుగు టీవీ ఉన్నతోద్యోగి వివరించారు. కాకపోతే, ఖర్చయినా స్టార్స్ సినిమాలైతే, జనాన్ని ఆకట్టుకోవచ్చని ఆ సినిమాల వరకు మాత్రం కొంటున్నాయి.

మరోపక్క చానల్స్‌కు ఎలాగోలా అమ్మకపోతామా అని మీడియేటర్లు కొనుక్కున్న సినిమాలూ దాదాపు 50 - 60 దాకా మిగిలిపోయాయి. అలా వాళ్ళ డబ్బూ కోట్లల్లో ఇరుక్కుపోయింది. మరి, ఈ పరిస్థితి మారాలంటే? మళ్ళీ శాటిలైట్ బిజినెస్ కావాలంటే?
 ‘‘గతంలో పెరిగిన శాటిలైట్ రేట్లను బట్టి, రెమ్యూనరేషన్లు, సినిమా బడ్జెట్ పెంచేసు కుంటూ పోయారు. తీరా ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ పడిపోయింది. అందుకే, ఆ మేరకు ఖర్చులు తగ్గించుకొని, కేవలం థియేటర్లలో వచ్చే వసూళ్ళను బట్టే సినిమా బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి’’ అని ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల సూచించారు. ఆ పని చేస్తే శాటిలైట్ రైట్స్ కచ్చితంగా నిర్మాతకు అదనపు ఆదాయమే అవుతుంది. హాలులో కాకపోయినా కనీసం టీవీలో అయినా ‘బొమ్మ’ చూసే భాగ్యం ప్రేక్షకులకు కలుగుతుంది.

 - రెంటాల జయదేవ

 
Box Matters
......................................................
శాటిలైట్ రైట్స్... సోల్డ్ అవుట్

అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ - రూ. 8.5 కోట్లు (‘మా’ టి.వి)
రవితేజ ‘కిక్ 2’ - రూ. 7.5 కోట్లు (‘జెమినీ’) - రిలీజ్‌కు ముందే
రామ్ ‘పండగ చేస్కో’  - రూ. 6.5 కోట్లు (‘జీ తెలుగు’) - రిలీజ్‌కు ముందే
బాలకృష్ణ ‘లయన్’ - రూ. 5.5 కోట్లు (‘జెమినీ’) - రిలీజ్‌కు ముందే
‘అనుక్షణం’ ప్లస్ ‘కరెంట్ తీగ’ - రూ. 4.5 కోట్లు (‘జెమినీ’)
నితిన్ ‘చిన్నదాన నీ కోసం’ - రూ. 4.5 కోట్లు (‘జెమినీ’)
గోపీచంద్ ‘జిల్’ - రూ. 4 కోట్లు (‘జెమినీ’)
నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ - రూ. 3.9 కోట్లు (‘జెమినీ’)
కల్యాణ్‌రామ్ ‘పటాస్’ - రూ. 3.75 (‘జెమినీ’)
శర్వానంద్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ - రూ. 1.2 కోట్లు (‘మా’ టి.వి)
...........................................
 స్టిల్ ఫర్ సేల్!

బాలకృష్ణ ‘పరమవీర చక్ర’
రజనీకాంత్ ‘లింగ’
విక్రమ్ - శంకర్‌ల ‘ఐ’
సూర్య ‘సికిందర్’
కార్తీ ‘బిర్యానీ’, ‘బ్యాడ్‌బాయ్’
నాని  ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’
అల్లరి నరేశ్ ‘బందిపోటు’
సుధీర్‌బాబు ‘ఆడు మగాడ్రా బుజ్జీ‘
సందీప్ కిషన్ ‘రారా కృష్ణయ్య‘
నాని ‘జెండాపై కపిరాజు’
 .......................................

ఆ డబ్బు లేదనుకొని సినిమా తీయాలి!

 ‘‘శాటిలైట్ బిజినెస్ 22 నెలలుగా తగ్గి, మిడ్‌వే ఫిల్మ్స్, చిన్నచిత్రాలు ఇబ్బంది పడుతున్నాయి. మా ‘అంతకు ముందు ఆ తరువాత’ రిలీజయ్యాక 5 నెలలకి  అమ్ముడై, వడ్డీలకే పోయింది. ఇప్పటి దాకా శాటిలైట్ కలుపుకొని, బడ్జెట్‌వేసేవాళ్ళం. ఇప్పుడిక అది లెక్కలో నుంచి తీసేసి, ఖర్చు తగ్గించుకొని సినిమా తీయాలి.’’
 - కె.ఎల్. దామోదర ప్రసాద్, ‘అలా మొదలైంది’ తదితర చిత్రాల నిర్మాత
 .....................................................

సెన్సిబుల్ సినిమాను చంపేస్తున్నారు!

‘‘మా ‘మల్లెలతీరంలో...’కొచ్చిన ప్రశంసలు, రివ్యూలు ఫైల్ చేసి పంపినా, చానల్స్ నుంచి స్పందన లేదు. స్టార్స్, ప్యాడింగ్, కామెడీ ట్రాక్ ఉండాలి లాంటి షరతులు చానల్స్ కూడా పాటించడం అన్యాయం. అటు రిలీజుకు హాళ్ళూ ఇవ్వక, ఇటు శాటిలైట్ రైట్స్ కొనుక్కోకుండా సెన్సిబుల్ సినిమాను చంపేస్తున్నారు.’’
     
- రామరాజు, ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’ చిత్ర దర్శకుడు
....................................................
(Published in 'Sakshi' daily, Family page, 12th May 2015, Tuesday)
....................................

Friday, May 15, 2015

అజిత్ ..రజనీలా స్టైలిష్ స్టార్ కాడు

సావుక్కు  బయందవన్  దినమ్ దినమ్  సావాన్!
అజిత్ ..రజనీలా స్టైలిష్ స్టార్ కాడు

కొందరికి జుట్టు నెరుస్తుంది...
మనోడికి జుట్టు మెరుస్తుంది...
సదరన్ సినిమాలో అతనొక సిల్వర్ లైనింగ్!
లైఫ్ చాలా సింపుల్... నో వైనింగ్... నో డైనింగ్!!
రిస్కు అజిత్‌కుమార్ ఇంటిపేరు...
మంచితనం ఆయన ముద్దుపేరు...
రత్నం మాటల్లో చెప్పాలంటే -
తన కమ్‌బ్యాక్‌కు అజిత్ పెద్ద కట్నం.


‘నామ వాళనువ్‌ునా... యార వేణా, యతనపేర వేణా కొల్లలావ్‌ు’ (మనం బతకాలంటే... ఎవరినైనా, ఎంత మందినైనా చంపచ్చు). ఇది తమిళ సూపర్‌హిట్ ‘బిల్లా’ లోని డైలాగ్. రీల్ లైఫ్‌లో ఈ డైలాగ్‌తో మాస్‌ను ఉర్రూత లూపిన హీరో అజిత్. కానీ, రియల్ లైఫ్‌లో ఆయన క్యారెక్టర్ మాత్రం ఆ పాపులర్ డైలాగ్‌కు పూర్తి విరుద్ధం. మనం బతకడం కాదు... చుట్టూ అంతా బతకాలి, బాగుండాలి. ఇదీ అజిత్ తత్త్వం.
 అందుకే, అజిత్ గురించి మాట్లాడుకొనే ముందు...

నిర్మాత ఏ.ఎం. రత్నం గురించి చెప్పుకోవాలి! ఒకటా... రెండా... బోల్డన్ని కోట్లు పోసి, ‘భారతీయుడు’, ‘జీన్స్’ లాంటి భారీ చిత్రాలు తీసిన నిర్మాత. ఆయన అడగడమే ఆలస్యం... ఏ హీరో అయినా డేట్లివ్వాల్సిందే!  నిర్మాతగా రత్నానికున్న క్రేజ్, ఇమేజ్ అలాంటివి.

కానీ... అదంతా గతం! ఇప్పుడు రత్నం వాళ్ళెవరికీ గుర్తు లేడు.

ఒక్కడికి మాత్రం గుర్తున్నాడు. ఆ ఒక్కడూ - అజిత్. రత్నం లాంటి నిర్మాతను నిలబెడితే, ఇండస్ట్రీకి మంచిదని అజిత్ నమ్మాడు. అజిత్ ఎప్పుడూ అంతే! తను నమ్మిందే చేస్తాడు. అప్పుడెప్పుడో తన ‘కాదల్ కోట్టై’ని తెలుగులో ‘ప్రేమలేఖ’గా అందించిన రత్నాన్ని పిలిచి మరీ డేట్లి చ్చాడు. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా మూడు సినిమాలు. నిన్నటి ‘ఆరంబం’... తాజా ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ‘ఎంతవాడు గానీ’గా రానుంది) సూపర్‌హిట్. ఇప్పుడు మూడోది మొదలైంది. రత్నం పుంజుకున్నాడు. వైభవం మళ్ళీ మొదలైంది. ఇదంతా అజిత్ చలవే!

 మీకు శ్రీకర్ గుర్తున్నాడా?

 పోనీ... గొల్లపూడి మారుతీరావు కొడుకు తీసిన ‘ప్రేమ పుస్తకం’ (1993) సినిమా గుర్తుందా?  ఆ శ్రీకరే... ఈ అజిత్. హీరోగా అతని ఫస్ట్ ఫిల్మ్ అదే.    నిజానికి, హీరో అజిత్ తొలి అడుగులోనే సినిమా కథంత డ్రామా ఉంది. అవకాశమిచ్చిన గొల్లపూడి కొడుకు శ్రీనివాస్ షూటింగ్ మొదలైన తొమ్మిదో రోజే చనిపోయాడు. వైజాగ్ షూటింగ్‌లో రాకాసి సముద్రపు అల మింగేసింది. శ్రీనివాస్ శవాన్ని శ్మశానం దాకా మోశాడు అజిత్. దుఃఖాన్ని దిగమింగి, కొడుకు ప్రేమించిన వెండితెర పుస్తకాన్ని గొల్లపూడి పూర్తి చేశాడు. అజిత్ హీరో అయ్యాడు. ఆ సినిమా ఆడలేదు. కానీ, అజిత్‌కు తమిళ్ ఛాన్‌‌సలొచ్చాయి.

రజనీకాంత్, కమలహాసన్‌లను అభిమానించిన అజిత్... 

వాళ్ళు క్రమంగా స్లో అవుతున్న టైమ్‌లో వచ్చాడు. లిబరలైజేషన్ ఎరాలోని నవతరం ప్రేక్షకుల టైవ్‌ులో వచ్చాడు. విక్రమ్, విజయ్ లాంటి కొత్త నీటితో పైకొచ్చాడు. తెలుగు ఫీల్డ్‌లోకి మళ్ళీ రాలేనంత బిజీ అయ్యాడు.

తమ్ముడి భార్య మీద కన్నేసిన అన్న!

 ఏ హీరో అయినా ఇలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకుంటాడా? అజిత్ ఒప్పుకున్నాడు. తమ్ముడి పాత్ర తనే! మూగ, చెవిటివాడైన అన్న కూడా తనే! ఎంత కష్టం... ఎంత రిస్కు! కానీ, అజిత్ అదరగొట్టాడు. తెలుగులోనూ డబ్ అయింది. ఇప్పటికీ తెలుగువాళ్ళకు అజిత్ అంటే ‘వాలి’ గుర్తొస్తుంది.

యూత్‌ఫుల్, రొమాంటిక్ పాత్రలతో అజిత్ స్టార్టయ్యాడు. 

యాక్షన్ పాత్రలకు ఎదిగాడు. నెరిసిన జుట్టుతో మెచ్యూర్ పాత్రలకు మారాడు. 44 ఏళ్ళ వయసుకే పాతికేళ్ళ కెరీర్... 55 సినిమాలు. సినిమాను అజిత్ అమితంగా ప్రేమిస్తాడు. డబ్బు పెట్టిన నిర్మాత, తీస్తున్న దర్శకుడూ బాగుండాలని తపిస్తాడు. రిజల్ట్ - గత ఎనిమిదేళ్ళలో 5 హిట్స్ (‘బిల్లా, మంగాత్తా, ఆరంబమ్, వీరమ్, ఎన్నై అరిందాల్’).

అజిత్... రజనీకాంత్‌లా స్టైలిష్ స్టార్ కాడు!

కమల్‌లా అద్భుతమైన పెర్ఫార్మరూ కాడు! విజయ్, ధనుష్‌లా పచ్చి మాస్ హీరో అసలే కాడు! కానీ, వాళ్ళందరిలో లేనిది ఇతనిలో ఉంది. అదే జనాలకు నచ్చింది. ఎక్‌స్ట్రాలు లేవు... హంగామాలు లేవు... ఇప్పుడతను తమిళ సినిమాకు సెలైంట్ నంబర్‌వన్!

ఎన్ని సినిమాలు చేసినా ‘అమర్కళమ్’ అజిత్ లైఫ్‌లో స్పెషల్.

(‘అద్భుతం’గా డబ్ అయింది. ఎస్పీబీ గుక్కతిప్పుకోకుండా పాడిన ‘నిత్యం ఏకాంత క్షణమే అడిగా...’ పాట గుర్తుందిగా!) నటి శాలినితో అతను కలసి చేసిన సినిమా అదొక్కటే! మొదట వాళ్ళిద్దరూ కేవలం కో-స్టార్స్... ఆపైన ఫ్రెండ్సయ్యారు. ఆ ఫ్రెండ్‌షిప్ ప్రేమైంది. గుడి గంటలు, చర్చి బెల్స్ సాక్షిగా వారిని ఏకం చేసింది. పేరుకు తగ్గట్లే ఆ సినిమా వాళ్ళ లైఫ్‌లో జరిగిన అద్భుతం.

అజిత్... నచ్చింది చేస్తాడు... నచ్చినట్లు బతుకుతాడు

కేరళ అయ్యర్‌కీ, కలకత్తా సింధీకీ హిందువుగా పుట్టి, క్రిస్టియన్ శాలినిని పెళ్ళి చేసుకోవడం కావచ్చు... ఆరు సిన్మాలుగా జుట్టుకు రంగేయకపోవడం కావచ్చు... కలెక్షన్స్ కోసం సినిమా ప్రమోషన్‌కు తిరగకపోవడం కావచ్చు... యాడ్స్‌లో చేయనని భీష్మించుకోవడం కావచ్చు... చివరకు, ఇంట్లో పనివాళ్ళకు ఇళ్ళు కట్టించి ఇవ్వడం కావచ్చు...
 సినిమా ఫీల్డ్‌లో అజిత్ ఒక యునీక్ ఎగ్జాంపుల్!

ఆటో మెకానిక్‌గా మొదలై... రేసింగ్‌కి డబ్బు కోసం ఒక గార్మెంట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో ఉద్యోగం చేసి... పత్రికల్లో ప్రకటనలకు మోడల్‌గా మారి... సినిమాల్లో స్థిరపడిన రోజులన్నీ అజిత్‌కు బాగా గుర్తే!

ఒకటే జీవితం... దాన్ని అనుకున్న రీతిలో, ఆనందంగా గడపాలి. అది అతని తత్త్వం. ‘సావుక్కు బయందవన్ దినమ్ దినమ్ సావాన్. బయప్పడాదవన్ ఒరు తడవదాన్ సావాన్’ (చావంటే భయమున్నవాడు రోజూ చస్తాడు. భయం లేనివాడు ఒకేసారి చస్తాడు). ఇది అజిత్ సినిమా పంచ్ డైలాగే కాదు. ఆయన లైఫ్ ఫిలాసఫీ కూడా. అందుకే, భయపడకుండా రిస్క్ చేస్తాడు - అది షూటింగ్‌లో ఫైటైనా! బయట రేసైనా! పద్ధెనిమిదో ఏట నుంచి బైక్, కారు రేసుల్లో దేశ విదేశాల్లో పాల్గొన్న ప్రాణం అజిత్‌ది. ప్రమాదాల పాలయ్యాడు. ఒకటి కాదు... రెండు కాదు... 15 సర్జరీలు... అందులో 5 ఏకంగా వెన్నెముకకే! అయినా ఆగలేదు. ‘బిల్లా’లో డైలాగ్‌లా ‘అయావ్‌ు బ్యాక్’ అన్నాడు. ‘ఫార్ములా 2’ రేస్‌లో పాల్గొన్నాడు. బైకు, కారే కాదు... విమానం నడపాలని అజిత్ ఆశ. ప్రైవేట్ పైలట్ లెసైన్స్ రాలేదు. అజిత్ నిరాశపడి, ఆగిపో కుండా ఏరో- మోడలింగ్ చేశాడు. రెండేళ్ళ క్రితం స్విట్జర్లాండ్‌లో కొన్న కొత్త బి.ఎం.డబ్ల్యు బైక్‌పై పుణే నుంచి చెన్నై దాకా రైడ్ చేశాడు. తనలోని పసితనం కాపాడుకుంటున్నాడు.

మరి, ఇప్పుడు అజిత్ ఏం చేస్తున్నాడు?

నిన్నటి నుంచి తన 56వ సినిమా (నిర్మాత రత్నం) షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. షూటింగై పోగానే, వరుస హిట్ల విజయగర్వం తలకెక్కించుకోకుండా, హాయిగా ఇంట్లో ఏడేళ్ళ కూతురు అనౌష్కతో, రెండు నెలల చంటిపిల్లాడు ఆద్విక్‌తో గడుపుతున్నాడు.
 అజిత్ ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలే! సగటు సినీ హీరోగా క్వాలిఫై అయ్యేంత హైట్ అతనికి లేకపోవచ్చు. కానీ, లైఫ్ ఫిలాసఫీలో అతనిది టవరింగ్ పర్సనాలిటీ!

 విడ్డూరం ఏమిటంటే - అజిత్ ఫ్యాన్ క్లబ్స్ వద్దం టాడు. అమ్మానాన్నను బాగా చూసుకోండని చెబుతాడు. అవసరంలో ఉన్నవాళ్ళకు అండగా నిలబడమంటాడు.  ఎ.ఎం. రత్నానికి అజిత్ చేసింది అదే!  అందుకే, చాలా మంది స్టార్స్ ఉండచ్చు. కానీ, అభిమానులు అన్నట్లు ‘అల్టిమేట్ స్టార్’ మాత్రం అజితే!  పేరు, ప్రతిష్ఠ, డబ్బు, ఈ స్టార్ స్టేటస్... ఇవాళ ఉంటాయి. మరి, రేపటికి...? అజిత్ ఉంటాడు!!

 - రెంటాల జయదేవ
 

Box Matters
.....................................................
కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్

  ఇవాళ తమిళనాట అజిత్ సినిమా వస్తోందంటే, డిస్ట్రిబ్యూటర్లకూ, థియేటర్లకూ పండగే! సినిమా ఎలా ఉన్నా సరే, ఓపెనింగ్స్ అదిరిపోతుంటాయి. ఇంకా చెప్పాలంటే, ఇవాళ రజనీకాంత్ సినిమాల కన్నా ఎక్కువ ఓపెనింగ్స్ అజిత్‌కు వస్తున్నాయని తమిళ సినీ వ్యాపార వర్గాల కథనం. అందుకే, ఫ్యాన్స్ అజిత్‌ను ‘తల’ (నాయకుడనే అర్థంలో ‘తలైవా’కు సంక్షిప్త రూపం), ‘కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్’ అని పిలుస్తుంటారు.

తోటి హీరోలతో పోలిస్తే, సంఖ్యాపరంగా అజిత్ హిట్స్ తక్కువే కావచ్చు. కానీ, సినిమా హిట్టయిందీ అంటే... ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేసినట్లే! బాక్సాఫీస్ వద్ద ఆ క్రేజు, స్టార్‌డమ్ అజిత్ సొంతం. తక్కువ హిట్స్‌తో, ఎక్కువ పాపులారిటీ సాధించిన తమిళ హీరో అంటే అజితే!
.................................................

 మంచితనం ఎక్కువ


‘‘స్టార్స్‌కు భిన్నంగా అజిత్‌లో సింప్లిసిటీ, మంచితనం ఎక్కువ. ఎందరో నిర్మాతలు వెయిట్ చేస్తున్నా, ఆయనే నన్ను పిలిచి మరీ డేట్లిచ్చారు. యూనిట్‌లో ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా, అవసరమైన సాయం చేస్తారు. తమిళనాట యూత్‌కు ఆయనంటే క్రేజ్. ఆయనే తమ రోల్‌మోడల్, ఇన్‌స్పిరేషన్ అంటారు.’’
 - ఎ.ఎం. రత్నం, ప్రముఖ సినీ నిర్మాత
............................................................

(Published in 'Sakshi' daily, Family page, 8th May 2015, Friday)
...........................................

Wednesday, May 13, 2015

ఉత్త రిలీజులు ( సినిమా రిలీజ్‌కు ముందు సవాలక్ష కష్టాలు)


ఉత్త రిలీజులు
మే 1వ తేదీ... శుక్రవారం. ఉదయం 8.30 గంటలు... హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ-మ్యాక్స్ ప్రాంగణం... గుంపులుగా జనం...
 హీరో కమల్‌హాసన్ ‘ఉత్తమ విలన్’ను చూడడానికి ఉదయాన్నే సిద్ధమై వచ్చిన జనం... తమిళనాట వసూళ్ళ వర్షం కురిపిస్తూ... తెలుగులోకి లేట్ రిలీజైన లారెన్స్ ‘గంగ’ చూడాలని ఆసక్తిగా వచ్చిన ఆడియన్స్! తెలుగువాళ్ళు... తమిళులు... మలయాళీలు... భాషాభేదాలు లేకుండా సినిమా ఏకం చేసిన దాదాపు వెయ్యిమంది! ఎవరికి వారు పక్కవాళ్ళను విషయం అడుగుతూ, ఫోనుల్లో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. ‘సినిమా రాలేదట!’... ‘పడం వరలా’... ‘ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్!’... లాంగ్వేజ్ ఏదైనా డిస్కషన్ ఒకటే! ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని వచ్చినా, రీళ్ళ బాక్సులు (ఇప్పుడన్నీ డిజిటల్ ప్రింట్లే కాబట్టి, డిజిటల్ కోడ్‌లు) రాలేదని నిరుత్సాహం!

ఒక్క హైదరాబాద్‌లోనే కాదు... తెలుగునేల అంతటా ఆ రోజు మధ్యాహ్నానికి కానీ, తెరపై ‘గంగ’ బొమ్మ పడలేదు. తెలుగుతో పాటు తమిళనేల మీదా ఇలాంటి కష్టాలనే ఎదుర్కొన్న ‘ఉత్తమ విలన్’ అయితే శనివారం మధ్యాహ్నం తరువాత కానీ, ప్రేక్షకుల్ని పలకరించలేదు. ఇన్ని కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాలు... అదీ పేరున్న పెద్దవాళ్ళ సినిమాలు కూడా ఆఖరు క్షణంలో రిలీజ్ ఎందుకు ఆగినట్లు?

సినిమాలు బాగున్నా - ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్.  అంటే...?

సినిమా కష్టాలు... సినిమా రిలీజ్‌కు ముందు సవాలక్ష కష్టాలు...  పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్‌కు తగ్గట్లు బిజినెస్ జరగడం లేదు! ఫలానా ఏరియాను ఫలానా మొత్తానికి కొంటామన్న బయ్యర్లు ఆఖరు క్షణంలో... అనుకున్న మొత్తం కన్నా తక్కువ డబ్బే తెస్తున్నారు! తమకు చెల్లించాల్సిన పాత ఫ్లాప్ సినిమాల అప్పుల సంగతేంటో తేల్చమంటూ నిర్మాతల మీద పడే ఫైనాన్షియర్లు! వెరసి ఒక సినిమా ఎంత ఖర్చుతో తీస్తున్నామనే దాని కన్నా, ఎంత సులువుగా రిలీజ్ చేసుకుంటామనేది సమస్యగా మారింది.

ఈ కష్టాల కథేమిటో తెలుసుకోవాలంటే... ముందుగా సినీ వ్యాపారం ఏమిటో తెలుసుకోవాలి. అది ఏమిటంటే... గతంలో సినిమా అంటే నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన - ఈ మూడు సెక్టార్ల కలెక్టివ్ రెస్పాన్స్‌బిలిటీ. సినిమా అంటే నిర్మాత, దర్శకుడు ఒక కథ అనుకొని, ప్రయత్నాలు మొదలుపెట్టేవారు. నిర్మాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవాడు. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లే కింగ్ మేకర్లు. చిత్ర నిర్మాణానికి డబ్బు వాళ్ళ నుంచి అందేది. ఆ మనీతో సినిమా తయారయ్యేది. పంపి ణీకి డిస్ట్రిబ్యూటర్లు... అద్దె లేదా నెట్ కలెక్షన్లలో పర్సంటేజ్ మీద తమ హాలులో సినిమా వేయడానికి ఎగ్జిబిటర్లు రెడీ. కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాతల మధ్య పంపిణీ అయ్యేది. సినిమా ఆడక తేడా వస్తే, అప్పటికి ఆ నష్టం డిస్ట్రిబ్యూటర్ భరించేవాడు. సదరు దర్శక, నిర్మాతల తరువాతి సినిమాలో ఎడ్జస్ట్ చేసేవాడు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు.

రిలీజ్ ముందు నిద్ర లేని రాత్రులు!

డిస్ట్రిబ్యూటర్ల సిస్టమ్ పోయి, బయ్యర్లు వచ్చాక రిస్క్ ఫ్యాక్టరూ పెరిగింది. నిర్మాతలు క్రేజీ కాంబినేషన్స్ మాత్రం సెట్ చేసుకొంటారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో సినిమా స్టార్ట్ చేస్తారు. పదుల కోట్లు ఫైనాన్షియర్స్ నుంచి వడ్డీకి తెస్తారు. సినిమా సిద్ధమయ్యేవేళలో బయ్యర్లు క్రేజీ ఆఫర్లతో వస్తారు. కానీ, సినిమా కాస్త తేడాగా ఉందని ఏ మాత్రం ఉప్పందినా... వెంటనే ప్లేటు ఫిరాయిస్తారు. అనుకున్న దాని కన్నా తక్కువ రేటే ఇస్తారు. ఫలితం - నిర్మాతకు ఆశించిన బిజినెస్ కావడం లేదు. ఇప్పటికి ఈ సినిమా వరకు ప్రాఫిట్‌కే అమ్మినా, గత సినిమాలపై పేరుకున్న అప్పులు నిర్మాతను భూతంలా వెంటాడి వేధిస్త్తుంటాయి. ఉదాహరణకు, ఒక నవ యువ సామ్రాట్ మూడక్షరాల సినిమా ఏప్రిల్ చివరి వారంలో రూ. 10 కోట్ల దాకా బిజినెస్ కావాల్సింది. లాస్ట్‌మినిట్‌లో బయ్యర్లు 25 శాతం తగ్గించి, కట్టారు. వ్యాపారం తగ్గినా, నిర్మాత విధి లేక సినిమా రిలీజ్ చేశారు.

ఇక, గత చిత్రాల లాస్‌లు తడిసి మోపెడై, నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ను ‘గంగ’ రిలీజ్‌లో ఇబ్బంది పెట్టాయి. ‘ఉత్తమ విలన్’ను సమర్పిస్తున్న తిరుపతి బ్రదర్స్‌కు పాత ఫ్లాప్ ‘అంజాన్’ (తెలుగులో ‘సికిందర్’) తాలూకు అప్పులు ఇప్పుడడ్డుపడ్డాయి. ‘‘అక్కడెవరో తీసిన సినిమాను ఇక్కడ నుంచి వెళ్ళి ఎగబడి కొంటున్నప్పుడు, వాళ్ళకున్న పాత అప్పులేంటో మనకు తెలీదుగా! చివరకు మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని, తమిళ, తెలుగు వెర్షన్‌ల నిర్మాతలు, సినీ సంఘాలు శ్రమిస్తే కానీ ‘ఉత్తమ విలన్’ ఒకటిన్నర రోజులు ఆలస్యంగా మన దేశంలో విడుదల కాలేకపోయింది’’ అని ‘ఉత్తమ విలన్’ తెలుగు వెర్షన్ నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. నిజానికి, ఇలా ఒక పెద్ద సినిమా రిలీజ్ ఒక్క రోజు ఆలస్యమైనా ఆ సినిమాకొచ్చే మొత్తం రెవెన్యూలో 20 నుంచి 25 శాతం మేర నష్టపోవాల్సి వస్తుంది. ఇక, ఆ రోజున సినిమా థియేటర్‌లో సైకిల్ స్టాండ్ మొదలు ఇతర అనుబంధ వ్యాపారాలకు కలిగే లాస్ దీనికి అదనం.  

నిజానికి, ఇది ఒక రోజుకో... ఒక సినిమాకో... పరిమితమైన సమస్య కాదు. కలెక్షన్స్‌లో ఇండస్ట్రీ హిట్ పవన్‌కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ లాంటి బడా సినిమాల మొదలు ఛోటా నటుల చిన్న సినిమాల దాకా ఇదే పరిస్థితి. సినిమాల రిలీజ్ ముందు రోజు రాత్రి ల్యాబుల్లో, స్టార్ హోటళ్లలో ప్రైవేట్ ‘పంచాయతీ’లు మామూలే. కాకపోతే, కొన్ని బయటకొస్తాయి. చాలా మటుకు సినీ వ్యాపార వర్గాల ‘రహస్యాలు’గా మిగిలిపోతాయి.

‘‘ఇవాళ రెమ్యూనరేషన్స్‌తో సహా నిర్మాణవ్యయం 40 శాతం పెరిగింది. అదే సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల పర్చేజింగ్ పవర్ 30 నుంచి 40 శాతం తగ్గింది. వెరసి సినిమా వ్యాపారానికి 70 - 80 శాతం బొక్క పడింది’’ అని గుంటూరు డిస్ట్రిబ్యూటర్, చిత్ర నిర్మాణంలో అనుభవమున్న కొమ్మినేని వెంకటేశ్వరరావు వివరించారు. ఇలా కాస్ట్ పెరిగి, బిజినెస్ తగ్గి, పాత అప్పుల భారం తీరే మార్గంలేక, నిర్మాతలు రోడ్డున పడుతున్నారు. సినిమాల రిలీజ్‌లు లాస్ట్‌మినిట్‌లో లేట్ అవుతున్నాయి.

 ఇండస్ట్రీకి ఇప్పుడో హిట్ కావాలి!

కోట్ల ఖర్చుతో సినిమా తీసిన నిర్మాత... కోట్లు పారితోషికం తీసుకొనే హీరో... తెర ముందు కనిపించే షో ఇది. ఈ షోకు తెర వెనుక ఆర్థిక సూత్రధారులుగా ఫైనాన్షియర్లు, బయ్యర్లు, వీళ్ళకు డబ్బులు సమీకరించే ఎగ్జిబిటర్లు... సినిమా బిజినెస్ గ్లామర్ దీపం చుట్టూ శలభాలు. గత అయిదు నెలలుగా అన్నీ నష్టాలవడంతో బయ్యర్ల మొదలు ఫైనాన్షియర్స్ దాకా ఎవరికీ ఇప్పుడు చేతిలో డబ్బు ఆడని పరిస్థితి. ‘‘తక్షణమే కనీసం ఒక్క పెద్ద హిట్ రావాలి. అప్పుడు కానీ, డబ్బులు పెట్టే ఎగ్జిబిటర్లు, బయ్యర్లు ఈ ఫైనాన్షియల్ స్లంప్ నుంచి తేరుకోలేరు’’ అని ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘లయన్’ చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు అన్నారు. ‘‘మన దగ్గర రిలీజ్ ప్లానింగ్ లేదు. బయ్యర్ల నుంచి వస్తున్నదెంత, ఫైనాన్షియర్లకు తీర్చాల్సిన అప్పుల రూపంలో పోయేదెంత అనే లెక్క చూసుకోవడం లేదు. ఇవన్నీ సరిదిద్దుకోవాలి. నిర్మాతలంతా కూర్చొని, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి’’ అని సునీల్ నారంగ్ సూచించారు.

అవును... అది నిజం. ఒకప్పుడు సినిమా... కేవలం కళ! ఆ తరువాత.... కళాత్మక వ్యాపారం! మరి ఇప్పుడు కాసుల చుట్టూ తిరిగే వ్యాపార కళ!! ఈ పరిస్థితుల్లో సినిమా బిజినెస్ ప్రతి వారం టేబుల్స్ టర్న్ చేసే చిత్రమైన ‘ధందా’! ఈ వ్యాపారంలో ఆర్థిక కష్టాలను తట్టుకొని, హాలులోని జనం దాకా సినిమా రావడం... ప్రతి శుక్రవారం ఒక సెల్యులాయిడ్ సిజేరియన్ డెలివరీ!

 - రెంటాల జయదేవ

........................................................................
 నష్టాల్లో... అయిదు నెలలు

 ‘డిసెంబర్ నుంచి ఈ 5 నెలల్లో తెలుగులో వచ్చిన సినిమాల్లో నికరంగా డబ్బులు చేసుకున్నది ఒక్కటీ లేదు. కల్యాణ్‌రామ్ ‘పటాస్’ ఒక్కటే రీజనబుల్‌గా పే చేసింది.  పెద్ద స్టార్ల ‘లింగ’, ‘గోపాల గోపాల’ నుంచి లేటెస్ట్ సమ్మర్ రిలీజ్‌ల దాకా అన్నీ లాసే. బయ్యర్లను పోటు పొడిచినవే.’’
     - సుధాకర్ నాయుడు, ఎస్.వి.ఎస్. ఫిల్మ్స్ అధినేత - బయ్యర్, కర్నూలు
 ......................................................
 ‘‘తమిళనాట ఎవరో తీస్తున్న సినిమాను మనం ఎగబడి వెళ్ళి కొనుక్కోవడంలో ఎంత ఇబ్బంది ఉందో అర్థమైంది. అక్కడ వాళ్ళకున్న అప్పులేమిటో తెలియదుగా! 53 సినిమాలు నిర్మించినా రిలీజ్ డేట్ నాడు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఇప్పుడు 54వ సినిమా ‘ఉత్తమ విలన్’కు తొలిసారి అది నాకు అనుభవమైంది.’’
 - సి. కల్యాణ్
 ‘ఉత్తమ విలన్’ తెలుగు వెర్షన్ నిర్మాత
 .........................................................

 ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్  


 లేటెస్టయినా లేట్‌గా వచ్చిన కొన్ని!

  శంకర్ - విక్రమ్‌ల ‘ఐ’
  నాని నటించిన ‘జెండా పై కపిరాజు’
  వై.వి.ఎస్. - సాయిధరమ్ తేజ్‌ల ‘రేయ్’
  కమలహాసన్ ‘ఉత్తమ విలన్’
  లారెన్స్ ‘గంగ’
..........................................

షూటింగ్ ఫినిష్! రిలీజ్‌కే వెయిటింగ్!!

 నితిన్ ‘కొరియర్ బాయ్ కల్యాణ్’
 కమల్ దర్శకత్వంలోని ‘విశ్వరూపమ్ 2’
రాజశేఖర్ నటించిన ‘వందకు వంద’
వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ ‘పట్టపగలు’

 .......................................................................
 సెన్సారైంది..! రిలీజ్ ఆగింది!

  విజయశాంతి నటించిన ‘శివాని’
  రాఘవేంద్రరావు ‘ఇంటింటా అన్నమయ్య’
.........................................
(Published in 'Sakshi' daily, Family page, 5th May 2015, Tuesday)
.............................................

Wednesday, May 6, 2015

ఆయన్ని మిస్సవుతున్నా - త్రిష (Exclusive Interview)

థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ!

త్రిష ఎవరితోనూ మాట్లాడదు... మాట్లాడితే... తన గురించి ఎక్కువగా మాట్లాడతారని భయం కావచ్చు! ఆల్‌మోస్ట్ పదమూడేళ్ల పాటు డబ్బింగ్ చెప్పకుండానే మాట్లాడింది మరి! చిరంజీవి నుంచి చిన్న ఎన్టీఆర్ దాకా అందరితో మాట్లాడించేసింది. థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ!! షూటింగ్‌లో... ఎవరైనా అనవసరంగా మాట్లాడిస్తారేమోనని, తప్పించుకోవడానికి అనుకుంటా...సెల్‌ఫోన్‌లో తలదూర్చి, తన ప్రపంచాన్ని తాను ఆవిష్కరించుకుంటూ ఉంటుంది. మరి, అంతటి ‘మూకీ’ దేవత ‘సాక్షి’తో ఎందుకు మాట్లాడిందో! మరి అదే... మీ ‘సాక్షి’!
రామ్,ఎడిటర్, ఫీచర్స్

May 
పదమూడేళ్ళుగా చూస్తున్నాం. చిరు నుంచి చిన్న ఎన్టీఆర్ దాకా అందరితో నటించిన హీరోయిన్లలో మీరే ఆఖరేమో!
(నవ్వేస్తూ...)  నేను సినీరంగానికి వచ్చినప్పుడు సిమ్రాన్, జ్యోతిక, నేను - ఇలా ముగ్గురు, నలుగురమే ఉండేవాళ్ళం. ఇప్పుడు అందం, అభినయమున్న 10 - 15 మంది హీరోయిన్లున్నారు. దీనివల్ల పోటీ పెరిగి, హీరోయిన్ల యావరేజ్ కెరీర్ లైఫ్ శ్పాన్ చాలా తగ్గింది. అయినా ఇన్నేళ్ళు హీరోయిన్‌గా నిలవడం విశేషమే. అయామ్ బ్లెస్డ్. షార్ట్ శ్పాన్ ఆఫ్ టైమ్‌లో ఇంత స్టార్‌‌సతో నటించడం, పేరు తెచ్చుకోవడం హ్యాపీ.
     
ఈ స్థాయికి రావడంలో మీ కష్టమెంత? అదృష్టమెంత?
నన్నడిగితే సరైన స్క్రిప్ట్‌నూ, సరైన దర్శకుణ్ణీ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. భారీ, మాస్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు - ఇలా అన్నీ ప్యాకేజ్‌గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ చూసుకోవాలి. దానికి లక్ తోడవ్వాలి. లేదంటే, (చేతులతో పై నుంచి కిందకు చూపిస్తూ... చటుక్కున తమిళంలోకి మారి..) ‘అంగ వెచ్చిట్ట రసికర్‌గళ్ ఇంగ తూక్కి పోడువాంగ’ (ఆకాశానికి ఎత్తిన ప్రేక్షకులే, పాతాళానికీ పడదోస్తారు).
     
ఈ బ్యాలెన్సింగ్‌లో మీ అమ్మగారి పాత్ర ఉందట!
‘నా చుమ్మా సెట్స్‌కు వందు వేల పణ్ణిట్టి పోవేన్. బిహైండ్ ది సెట్స్ నరయ వేల ఇరుక్కు’ (నేరుగా సెట్స్‌కు వచ్చి, నటించి వెళ్ళిపోతుంటా. కానీ, తెర వెనుక చాలా శ్రమ ఉంటుంది). ఆ శ్రమ అంతా మా అమ్మదే! ఇప్పటికీ నాకు మోటివేషన్ - మా అమ్మే! అన్నీ నిశ్శబ్దంగా హ్యాండిల్ చేసే మా అమ్మ ‘సెలైంట్ మేనేజర్’. మేనేజరున్నా స్క్రిప్టు ఏమిటి, ఏ సినిమా చేయాలి - అన్నీ నేను, అమ్మే కలసి చర్చించుకుంటాం. సినిమా చేయాలా, వద్దా అనే ఫైనల్ డెసిషన్ మాత్రం నాదే!
     
అమ్మగారి సపోర్ట్ తెలిసిందే... మరి నాన్న?
అమ్మ దగ్గర కన్నా చనిపోయిన నాన్న దగ్గరే నాకు గారాబం ఎక్కువ. ఆయావ్‌ు అప్పాస్ గర్‌‌ల! న్యూయార్క్‌లో చత్వాల్ గ్రూపులో 13 ఏళ్ళ పాటు ఆయన పనిచేశారు. ఆ తరువాత ‘తాజ్’ గ్రూపులో చెన్నై, హైదరాబాద్‌లలో పనిచేశారు. (కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా...) ఆయన్ని మిస్సవుతున్నా.
     
బాధపెట్టినట్లున్నా! మళ్ళీ సినిమాల కొద్దాం. ‘లయన్’లో బాలకృష్ణతో తొలిసారి నటిస్తున్నట్లున్నారు!
రెండేళ్ళ గ్యాప్ తరువాత వస్తున్న నా తెలుగు సినిమా - ‘లయన్’. థ్రిల్లర్, యాక్షన్ ఫిల్మ్ ఇది. కానీ, సన్నివేశాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. నిజానికి, ‘అతడు’ తర్వాత ‘బాలా’ (బాలకృష్ణ)తో ఒక సినిమాకు అడిగారు. అలాగే, లాస్ట్ ఇయర్ ‘లెజెండ్’లో కూడా చేయాల్సింది. ఇన్నాళ్ళకు ఆయనతో యాక్ట్ చేయడం కుదిరింది. ఆయన చాలా కూల్. నాలెడ్జబుల్ మ్యాన్. వంద సినిమాలకు దగ్గరవుతున్నా, అంత హుషారుగా పనిచేసే వ్యక్తిని మరొకరిని చూడలేదు.    
పెద్ద స్టార్స్‌తో చేశారు. వాళ్ళతో మీ నటనానుభవం?
ఆ స్థాయికెళ్ళాక, మనకూ కొంత అహం ఉంటుంది. కానీ, కమల్, చిరంజీవి, నాగ్, వెంకీ, బాలా లాంటి వారంతా అహం లేకుండా పనిచేస్తారు. అది నేర్చుకోవాలి.

కెరీర్‌లో చాలా అప్స్ అండ్ డౌన్‌‌స చూసినట్లున్నారు?
ఈ 13 ఏళ్ళ కెరీర్‌లో ప్రతి మూడేళ్ళకూ కెరీర్‌లో నాకు ‘లల్’ వచ్చింది. అప్పుడు ఏదో ఒకటి ఒప్పుకోవడం కాకుండా, ఇంట్లోనే ఖాళీగా కూర్చొనేదాన్ని. మొదటిసారి ‘మంగాత్తా’, రెండోసారి ‘విన్నైతాండి వరువాయా’ వచ్చి హిట్టయ్యాయి. ఇలా కెరీర్ డల్లయినప్పుడల్లా ఏదో ఒక సినిమాతో పైకి లేచా.
     
మరి, చటుక్కున కన్నడ ‘పవర్’ (‘దూకుడు’ రీమేక్) చేశారేం!
బాలీవుడ్‌లో ఒక సినిమా చేసినట్లే, కన్నడంలో ఉత్తినే... ఛేంజ్ కోసం అలా చేశా. అదేదో అన్ని ఇండస్ట్రీల్లో ైపైకి ఎదిగిపోవాలని కాదు. ఆ సినిమా అక్కడ బాగా ఆడింది. ఫర్ మి - కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం - ఎవ్రీథింగ్ ఈజ్ ఫన్!
     
మీ గురు ప్రియదర్శన్ మలయాళంలో చేయమనడగలేదా?
ఆయన హిందీకి వెళ్ళి, అక్కడే ఎక్కువ చేస్తున్నారుగా! నా ఏకైక హిందీ ఫిల్మ్ ‘ఖట్టా మీఠా’ ఆయన తీసినదే! మలయాళంలో మొదట్లో కొన్ని ఛాన్స్‌లొచ్చాయి. చేయలేకపోయా. అయినా నా ప్లాన్ టూ వీక్స్ వరకే! అంతకు మించి కెరీర్‌లోనే కాదు... జీవితంలో కూడా ఏదీ ముందుగా ప్లాన్ చేయను.
     
హిందీలో ఒక సినిమా చేసినా, నిలబడాలని చూడలేదేం?
హిందీలో పనిచేయాలంటే, ముంబయ్‌లో ఉండాలి. కానీ, పుట్టి పెరిగిన చెన్నైలో ఉండడమే నాకు ఇష్టం. పైగా, నార్త్‌తో పోలిస్తే, సౌత్‌లో పనిచేయడమే నాకు కంఫర్ట్ కూడా! నార్‌‌తలో పనిచేయాలంటే, పబ్లిక్ రిలేషన్స్ కావాలి. పర్సనల్ లైఫ్ వదిలి, అక్కడకు మారాలి. దాని కన్నా ఇక్కడుంటే సుఖం.
     
ఇంకా మీకు తెలుగుపై పట్టు దొరికినట్లులేదు!
తెలుగు బాగా అర్థమవుతుంది కానీ, చదవలేను. రాయలేను. డైలాగులు చెప్పగలను కానీ, ఫ్లూయెంట్‌గా మాట్లాడలేను. కానీ, ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ తెలుగు మాట్లాడేస్తుంటే, అయామ్ జెలస్! నాకు భాషలంత తొందరగా పట్టుబడవు.
   
అడపా దడపా తమిళంలో డబ్బింగ్ చెబుతున్నట్లున్నారు!

ఇన్నేళ్ళ తర్వాత ఈ మధ్యే కొన్ని సినిమాలకు! మణిరత్నం దర్శకత్వంలోని ‘ఆయుధ ఎళుత్తు’ (తెలుగులో ‘యువ’), కమలహాసన్ నటించిన ‘మన్మదన్ అంబు’ (తెలుగులో ‘మన్మథ బాణం’) - రెండూ లైవ్ సౌండ్‌లో తీసినవే. దాంతో, సెట్స్‌పై తమిళంలో నా డైలాగులు నేనే చెప్పా. ఆ తరువాత డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. కమల్ డైలాగులు ఎలా పలకాలో పక్క నుండి ఆరు రోజుల పాటు నేర్పారు.
     
మీరెప్పుడూ మొబైల్‌ఫోన్‌తోనే కనిపిస్తుంటారు!  
(నవ్వేస్తూ...) బాగా గమనించారే! ప్రకాశ్‌రాజ్, వెంకటేశ్ లాంటి కో ఆర్టిస్టులు కూడా నా మొబైల్ వాడకం చూసి ఆటపట్టిస్తుంటారు. నిజం చెప్పాలంటే, మొబైల్ ఫోన్ నాకొక ఎడిక్షన్. అయితే, ఫోన్‌లో నేనెక్కువ మాట్లాడను. మెసేజ్ చేయడానికీ, ఆటలాడడానికీ, లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవడానికీ ఫోన్ వాడతా. కొత్త యాప్స్, గ్యాడ్జెట్లపై నాకు ఇంట్రస్టెక్కువ.
     
మీరు బాగా ఫుడీ అట! మరి, నాజూగ్గా ఉన్నారు?
ఆ విషయంలో అయామ్ రియల్లీ లక్కీ! కనపడిందల్లా తినేస్తాను. నేను తినే తిండి చూసి, ‘బకాసురుడిలా తింటావు. తిన్నదంతా ఎటు పోతోంది’ అంటూ దర్శకుడు ప్రభుదేవా ఆటపట్టిస్తుంటారు. సర్‌ప్రైజింగ్లీ... నేను జిమ్‌లకు వెళ్ళను. పెద్ద వ్యాయామాలు చేయను. సూర్య నమస్కారాలు, పవర్ యోగా చేస్తా. నేనెంత బద్ధకస్థురాలినంటే, చీకాకనిపిస్తే కొన్నాళ్ళు వర్కౌట్స్ కూడా చేయను.
     
మీ నిశ్చితార్థంపై చాలా వార్తలొస్తున్నాయి. పెళ్ళెప్పుడు?
లెటజ్ నాట్ టాక్ ఎబౌట్ మై పర్సనల్ మేటర్‌‌స. పర్స నల్ లైఫ్ ఈజ్ మై సీక్రెట్. దాని గురించి ఇతరులు మాట్లాడుకోవడం ఇష్టముండదు. అందుకే మాట్లాడను.
     
మరో అయిదేళ్ళ తరువాత త్రిష ఏం చేస్తుంటారు?
(నవ్వుతూ) అయిదు రోజుల తర్వాతేం చేస్తానో తెలీదు. ఇందాకే చెప్పినట్లు ఏదీ ప్లాన్ చేయను. నా నేచర్ అది.

 - రెంటాల జయదేవ
 .................................................

Box Matters

ఇటీవల ఆకట్టుకున్న తోటి నటి?
శ్రీయ నుంచి అనూష్క దాకా చాలా మందితో కలసి పనిచేశా. అనూష్క లాంటి మంచి అమ్మాయిని చూడలేదు. ఆమె ఎంత ఫ్రెండ్లీయో చెప్పలేను. ‘అరుంధతి’, రానున్న ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’లో ఆమె గెటప్‌లు, ఆ రాజసం అద్భుతం. అనూష్కలాగా ఇంకెవరూ చేయలేరు!

ఒత్తిడిగా ఉంటే... బ్రేక్ కోసం?
ఓ నెలరోజుల పాటు ఊళ్ళు తిరిగొస్తా!

పరిశ్రమలో మీ స్నేహితులు?
ఇక్కడ అంత ఆప్త మిత్రులు లేరు. నా ఫ్రెండ్సంతా స్కూల్, కాలేజ్‌మేట్లే.

జీవన సిద్ధాంతం?
‘హాయిగా బతుకు... ఇతరులను బతకనివ్వు’!
.......................................................


నచ్చిన దర్శకుల్లో కొందరి గురించి...

ప్రభుదేవా: సెట్‌లో కొంత ఛాలెంజ్ ఇస్తారు.
సెల్వరాఘవన్: పర్‌ఫెక్షన్ కోసం తపించే దర్శకుడు. అంతా సరిగ్గా ఉన్నా... పెదాలు మూసుకోవడంలో చిన్న తేడా ఉందనకున్నా మళ్ళీ కొత్తగా షూట్ చేస్తారు.
గౌతమ్ మీనన్: మన స్టైల్‌లోనే మన నుంచి ది బెస్ట్ తీసుకుంటారు. మనలోని ప్రతిభను ఆయన బయటకు తీస్తారు.
మణిరత్నం: ఆయనతో పని చేయడం నా కల. అది నిజమైంది. అనుకున్నది మన నుంచి రాబట్టే వరకు రాజీపడని తత్త్వం ఆయనది. ఆయనతో పని చేయాలంటే, అంతకు ముందు దాకా నేర్చుకున్నదంతా వదులుకోవాలి.
ప్రియదర్శన్: సినిమాల్లోకి వచ్చేందుకు నాకు తొలి అవకాశమిచ్చిన గురువు. ప్రతి ఒక్కరినీ ఒకేలా చూస్తారు. ఎంతో సాధించినా, కించిత్తు కూడా గర్వం చూపరు.
త్రివిక్రమ్: ఆయన చాలా కూల్. ఆయనతో పనిచేయడంలో ఫన్ ఉంది. కబుర్లాడుతూ, నవ్వుతూ పనిచేయించుకోవడం ఆయనకు అలవాటు. ‘అతడు’ నా బెస్ట్ ఎంటర్‌టైనర్‌‌సలో ఒకటి.
శ్రీను వైట్ల: వినోదం బాగా పండిస్తారు.
వి.వి. వినాయక్: ఆయన, రవితేజ, నేను గనక ఒక చోట ఉంటే, ఇక వినోదానికి కొదవ ఉండదు. బ్యాంకాక్‌లో షూటింగ్ సైతం, పిక్నిక్‌లా గడిచిపోయేది.
కె. రాఘవేంద్రరావు: ఆయనను ఒక మంచి మిత్రుడిలా చూస్తాను. శరీరానికే తప్ప మనసుకు వయసు రాదని నిరూపించిన మనిషి.
 .........................................................................
స్టార్ కామెంట్
త్రిష అద్భుతమైన నటి. తమిళంలో తన రెండో చిత్రం ‘మౌనమ్ పేసియదే’లో, ఆ తర్వాతా ఇద్దరం కలిసి యాక్ట్ చేశాం. త్రిష హావభావాలు సహజంగా ఉంటాయి. నటనకు అవకాశం ఉన్న పాత్ర అంటే  దర్శక, నిర్మాతలకు త్రిష గుర్తొస్తుంది.
 - హీరో సూర్య
 ....................................................
(Published in 'Sakshi' daily, Family Page, 3rd May 2015, Sunday)
................................................

Monday, April 27, 2015

నిదురిస్తున్న తోటలోకి... పాట ఒకటి వచ్చింది!

మీరెప్పుడైనా రాజమండ్రి వెళ్ళారా? అక్కడి దేవిచౌక్ సెంటర్‌కు వెళ్ళండి. ఒక భవనంలో మేడ మీద చిన్న గదిని బయట నుంచి చూస్తే, సవాలక్ష వ్యాపార దుకాణాల్లో అదీ ఒకటనే అనిపిస్తుంది. కానీ, ‘జనరంజని ఆడియో లైబ్రరీ’ అనే ఆ గదిలోని ర్యాకుల్లో ఎనభై మూడేళ్ళ తెలుగు సినీ చరిత్రకు సంబంధించిన కీలకమైన సాక్ష్యాధారాలున్నాయని ఎవరూ ఊహించరు. ఆ షాపు కాని షాపులోకి వెళితే కొద్ది గంటల వ్యాపార పనులు మినహాయిస్తే, రాత్రీ పగలూ అక్కడే నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ గడిపే నలభై ఎనిమిదేళ్ళ గోలి సాయిబాబు కనిపిస్తారు. గడచిన పదిహేడేళ్ళుగా తాను సాగిస్తున్న సినీ గీత సమాచార సేకరణతో సినీ ప్రియులకూ, పరిశోధకులకూ సాదరంగా స్వాగతం పలుకుతారు.

1932 ఫిబ్రవరి 6న విడుదలైన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ మొదలు రానున్న బాలకృష్ణ ‘లయన్’ దాకా ఈ ఎనభై మూడేళ్ళలోని దాదాపు 6 వేల నేరు తెలుగు సినిమాల్లోని 90 శాతం పాటల సమాచారాన్ని ఆనందంగా పంచుకుంటారు. తెలుగు సినీ చిత్రగీతాల వివరాలతో 1200 పేజీల్లో నాలుగు భాగాలుగా నాలుగు పుస్తకాలను అందించే ప్రయత్నంలో ఉన్నారాయన. ఇప్పటికే అందులో రెండు సంపుటాలు ‘జన రంజని... రాగం తానం పల్లవి’ పేరిట వెలువరించారు. ఇళయరాజా స్వరపరచిన తెలుగు పాటలన్నిటి సమాచారంతో ‘రాగబంధం’ అనే సినీగీత మాలికను తాజాగా ప్రచురించారు. ఇలాంటి మరిన్ని ప్రచు రణలతో సినీగీత సమాచారఖనిగా అవతరిస్తున్న పరిశోధకుడు కాని పరిశోధకుడు గోలి సాయిబాబు ప్రస్థానం చాలా చిత్రంగా అనిపిస్తుంది.


నిదురిస్తున్న తోటలోకి...  పాట ఒకటి వచ్చింది!

సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన సాయిబాబుది స్వస్థలం - తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి 3 కిలోమీటర్ల దూరంలోని వడ్లమూరు గ్రామం. పదేళ్ళ క్రితం రాజ మండ్రి వచ్చి, స్థిరపడ్డారు. ‘‘మా నాన్న గారు రైతు. అయితే, ఆయనకు సినిమా పాటలంటే మహా ఇష్టం. రేడియోలో, ఆయన ఇంటికి తెచ్చిన ఆడియో క్యాసెట్లలో పాటలు వినడం ద్వారా చిన్నప్పటి నుంచి వాటి మీద ఆసక్తి పెరిగింది’’ అని సాయిబాబు వివరిస్తారు.

నిజం చెప్పాలంటే, న్యాయశాస్త్రంలో డిగ్రీ వరకు చదువుకొన్న ఆయన చివరకు ఈ సినిమా పాటల సమాచార సేకరణ, ముద్రణే తన జీవితమవుతుందని ఎన్నడూ ఊహించ లేదు. ఆయన భార్య కూడా ‘లా’ గ్రాడ్యుయేటే. కానీ, ‘లా’ ప్రాక్టీస్ చేసే బదులు, ఓడరేవుల్లో సరుకుల ఎగుమతి, దిగుమతికి సంబంధించిన క్లియరెన్సులు చూసే ‘క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్’ అవ్వాలని మొదట్లో ఆయన భావించారు. అందుకోసం విశాఖ పట్నంలో మూడేళ్ళు అంతా నేర్చుకొని, పరీక్ష పాసై, లెసైన్‌‌స కూడా సంపాదించారు. తీరా అప్పటి కాకినాడ పోర్టును ప్రైవేట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అశనిపాతమైంది. ‘‘ఊహించని ఆ ఎదురుదెబ్బ నా జీవితాన్ని మలుపు తిప్పింది’’ అంటారాయన. విశాఖలోని ‘సర్వారాయుడు ప్రెస్’ చూసి, ముద్రణ రంగం వైపు మొగ్గారు. అయితే, సొంతంగా ప్రెస్ నడపడం కష్టమన్న మిత్రుల సలహా మేరకు, ప్రచురణ రంగానికి పరిమితమయ్యారు.

అప్పుతో మొదలైన ఆసక్తికర సేకరణ

మరి, ఈ సినిమా పాటల సమాచార ప్రచురణ ఆసక్తి ఎలా కలిగింది? ‘‘1997లో నాకు ఇష్టమైన కొన్ని పాటలు రికార్‌‌డ చేయించుకోవాలనుకున్నా. తీరా చూస్తే వాటి సమాచారం దొరకలేదు. ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయారు. నా లాంటి పాత పాటల ప్రియులకు సమాచారం దొరకడం ఎంత కష్టంగా ఉందో అప్పుడు తెలిసింది. హిందీలో సినీ గీతాల సమాచారంతో ‘గీత కోశాలు’న్నట్లే, తెలుగులోనూ ఉంటే ఎంత బాగుండనిపించింది’’ సరిగ్గా అదే సమయంలో ఊళ్ళో ఒకాయన పాటల రికార్డింగ్ షాపు తీసేస్తుంటే, పాటల మీద ప్రేమతో ఏకంగా ఆ షాపులోని గ్రావ్‌ుఫోన్ రికార్డులు, ఆడియో క్యాసెట్లు ‘‘ఇంట్లో తెలియకుండా రూ. 30 వేలు అప్పు చేసి, కొనేశా. అవన్నీ ఇంట్లో పెడితే తెలుస్తుందని, నా మిత్రుడి షాపులో అప్పజెప్పాను. అప్పట్లో వాటితో వ్యాపారం చేయాలని కూడా నాకు తెలీదు. ఆసక్తితో చేశాను’’ అంటారాయన. అలా మొదలైన ఆయన పాటల సేకరణ ఇవాళ తెలుగు సినిమా చరిత్రలోని 90 శాతం పాటల స్థాయికి చేరింది. ఈ సమాచారం సినిమా పత్రికలు, పుస్తకాల దాకా పాకింది.

ప్రామాణికంగా సినీగీత సమాచారం

అయితే, ఆ సమాచారం, పాటల వివరాలు కేవలం తన ఒక్కడికే పరిమితం కాకుండా, అందరికీ పంచాలనుకున్నారు. ఆడియో క్యాసెట్ల ముఖచిత్రాలు, గ్రావ్‌ుఫోన్ కవర్లు, 5 వేల పైచిలుకు నేరు - డబ్బింగ్ తెలుగు సినిమాల వీడియోలు ఆయనకు ప్రాథమిక ఆధారాలయ్యాయి. 1932 నుంచి 2010 దాకా విడుదలైన ప్రతి తెలుగు సినిమా పేరు, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, తారాగణం, ఆ చిత్ర గీతాల మొదటి లైన్లు - సంవత్సరాల వారీగా ఆయన సిద్ధం చేశారు.

‘జన రంజని... రాగం... తానం... పల్లవి’ అనే నాలుగు భాగాల పుస్తకంలో 3వ భాగం (1989-2005), 4వ భాగం (2006-2010) ఇప్పటికే వెలువడ్డాయి. ఇక, 1932 నుంచి 1975 వరకు పాటల సమాచారంతో మొదటి భాగం, 1976 నుంచి 1988 దాకా సమా చారంతో రెండో భాగం రానున్నాయి. అలాగే, తెలుగు సినిమాల్లో యాక్టర్, రచయిత, సింగర్, సంగీత దర్శకుల వారీగా 1980ల చివరి దాకా వచ్చిన 3650 ప్రసిద్ధమైన గీతాల వివరాలను ‘జనరంజని’ అనే చిరు పుస్తకంలో ఇప్పటికే అందించారు. గాయకులు రామ కృష్ణ, ఏసుదాస్, రచయితలు దేవులపల్లి, సినారె, కొసరాజు తదితరుల సమస్త సినీగీత వివరాల పుస్తకాలకూ డేటా సిద్ధం చేస్తున్నారు. ఆ సమాచారాన్నంతా ‘జనరంజని ఆడియో లైబ్రరీ’ (ఫోన్: 93901 58999)లో అందరికీ అందుబాటులో ఉంచారు. ఎవరైనా వచ్చి, వాటిని రిఫర్ చేసుకోవచ్చు.

పాటకు కేరాఫ్ అడ్రస్

బరువు తక్కువ కాగితంలో, అందుబాటు వెలలో సినీగీత సమాచార పుస్తకాలు తేవడం సాయిబాబు ప్రత్యేకత. తాజాగా ఇళయరాజా తెలుగులో చేసిన 347 సినిమాల్లోని 1800 పాటల వివరాలూ ‘రాగబంధం’ అనే పుస్తకంగా తెచ్చారు. పుస్తక విక్రేతలు అమ్మకం ధరలో 40 శాతం తీసేసుకుంటుండడంతో, తానే స్వయంగా తన బుక్స్ విక్రయిస్తున్నారు

పరిశ్రమ పట్టించుకోని బృహత్తర ప్రయత్నం

‘‘సినిమా చరిత్రకు సంబంధించి ఎవరూ ఎవరికీ సమాచారం అందించని దాపరికం ఉంది. అందుకే, నా దగ్గర ఉన్న సమాచారం మొత్తాన్ని అందరికీ అందించాలని పుస్తకాలుగా తెస్తున్నా’’ అని ఈ ఔత్సాహిక సినీగీత  సేకర్త, అపర పరిశోధకుడు చెప్పారు. ఈస్టిండియా ‘లవకుశ’ (1934) పాటల నుంచి ఆడియో, 1935 నుంచి తెలుగు సినిమాల వీడియోలు సాయిబాబు దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ ఏ ఊరెళ్ళినా, తన దగ్గర లేని పాటలు, సినిమాల లిస్టు పెట్టుకొని, వాటి సేకరణలో నిమగ్నమవుతారు. ఇందుకోసం ఇప్పటికి కొన్ని లక్షలు ఖర్చుచేశారు. అందుకు ఆయన భార్య కానీ, పదో తరగతికి వచ్చిన ఏకైక కుమారుడి బాధ్యత కానీ అడ్డు రాలేదు. ‘‘భావితరాలకు ఉపకరించే ఈ సమాచారానికి వెల కట్టలేం. ఇందులోని మానసిక తృప్తి నేను ఖర్చు చేసిన లక్షల కన్నా విలువైనది’’ అని నవ్వేస్తారాయన. ‘‘నెట్‌లో ఇప్పుడు డేటా లభిస్తున్నా, చాలా తప్పులుంటున్నాయి. పైగా నా దగ్గరున్న పాట, సినిమాలన్నీ ఒరిజినల్ క్వాలిటీవే. ఇవి చరిత్ర పునర్నిర్మాణానికి తోడ్పడ తాయి’’ అంటారాయన. సినీ పరిశ్రమ పెద్దలు, పరిశోధకులు చేయాల్సిన బృహత్తరమైన పనిని ఔత్సాహికుడైన ఒక సామాన్యుడు తన వ్యక్తిగత ఆసక్తితో లక్షల ఖర్చుతో నెత్తికెత్తుకోవడం విశేషం. నిదురిస్తున్న పరిశోధక, పండితమ్మన్యుల్ని మేల్కొల్పుతూ, తెలుగు సినిమా తోటలోకి వచ్చిన ఒక తీయటి పాట- సాయిబాబు ప్రయత్నం. ఆయన కృషి మరికొందరికి ఆదర్శమైతే, భవిష్యత్తులో సమగ్ర సినీగీత సమాచారాన్ని అందిస్తే, అంతకన్నా కావాల్సింది ఏముంది!                          

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 26th Apr 2015, Sunday, Family Page)
.......................................................