జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, April 12, 2015

మానవ సంబంధాలే... త్రివిక్రమ్ బాక్సాఫీస్ ఆస్తి (సినిమా రివ్యూ - సన్ ఆఫ్ సత్యమూర్తి)

..........................................
 చిత్రం - సన్ ఆఫ్ సత్యమూర్తి, తారాగణం - అల్లు అర్జున్, సమంత, నిత్యా మీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, సంపత్‌రాజ్, ‘వెన్నెల’ కిశోర్, పాటలు - ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్, సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్- సాయిగోపాల్ ఆర్., కెమేరా - ప్రసాద్ మురెళ్ళ, ప్రొడక్షన్ డిజైనర్ - ఎస్. రవీందర్, యాక్షన్ - పీటర్ హెయిన్, కూర్పు - ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.వి. ప్రసాద్, నిర్మాత - సూర్యదేవర రాధాకృష్ణ, రచన - దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్
.........................................

సినిమా రివ్యూ - సన్ ఆఫ్ సత్యమూర్తి

ఒకే కథను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతారు. చెప్పేవాడు గనక చేయితిరిగిన కథకుడైతే, మామూలు కథ కూడా వెండితెరపై కళ్ళకు కొత్తగా కనిపిస్తుంది. హఠాత్తుగా నాన్న చనిపోవడంతో వీధిన పడ్డ కుటుంబాన్ని కాపాడే ఒక కథానాయకుడి కథ మనకు కొత్త కాకపోవచ్చు. కానీ, దానికి నాన్న బోధించిన విలువలే అతి పెద్ద ఆస్తి అనే పాయింట్‌నూ, ఆయన గౌరవాన్ని కాపాడేందుకు హీరో ఎంత దూరమైనా వెళ్ళడాన్నీ జోడించి తీస్తే? త్రివిక్రమ్ - అల్లు అర్జున్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (‘...విలువలే ఆస్తి’ అనేది ఉపశీర్షిక) అలాంటి కథే. ఆస్తికీ, ఆనందానికీ లింక్ లేదని ప్రతిపాదిస్తుంది.

కథ ఏమిటంటే...

విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) ఒక పెద్ద కోటీశ్వరుడైన సత్యమూర్తి (అతిథి పాత్రలో ప్రకాశ్‌రాజ్) కుమారుడు. మనుషులు, అనుబంధాల కన్నా ఆస్తులు, డబ్బులు విలువైనవి కావనే మంచి మనిషి. అనుకోని ఒక దుర్ఘటనలో ఆయన చనిపోతాడు. తండ్రి చెప్పిన విలువల్ని కాపాడడం కోసం రూ. 300 కోట్ల ఆస్తిని అప్పులవాళ్ళకు వదిలేసి హీరో తన కుటుంబంతో వీధిన పడతాడు. అప్పటికే పల్లవి (అదాశర్మ)తో కుదిరిన పెళ్ళిని మామ (రావు రమేశ్) క్యాన్సిల్ చేస్తాడు. అమ్మ (పవిత్రా లోకేశ్), మతి చెడిన అన్నయ్య (‘వెన్నెల’ కిశోర్), వదిన, వాళ్ళ చిన్నారి పాప సంరక్షణభారం హీరో మీద పడుతుంది. ఆర్థిక సంపాదన కోసం హీరో చివరకు వెడ్డింగ్ ప్లానర్ అవతారమెత్తుతాడు. తీరా ఆ పెళ్ళి తనను కాదన్న పల్లవిదే! అక్కడ జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో సమీరా అలియాస్ సుబ్బలక్ష్మి (సమంత)తో హీరో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికీ, చనిపోయిన తన నాన్న మీద ఆమె తండ్రి సాంబశివరావు (రాజేంద్రప్రసాద్) వేసిన అభాండాన్ని చెరిపివేయడానికీ హీరో ఏకంగా తమిళనాడులోని రెడ్డియార్‌పట్టి వద్ద స్థిరపడ్డ ఓ తెలుగు కుటుంబం దగ్గరకు వెళతాడు. అక్కడికి ఫస్టాఫ్.

తమిళనాట కొన్ని గ్రామాలకు నియంతగా వ్యవహరించే దేవరాజు నాయుడు (ఉపేంద్ర), అతని భార్య (స్నేహ)ల కుటుంబంలోకి హీరో, అతని మిత్రుడు పరంధామయ్య (అలీ) చేరతారు. అక్కడ జరిగిన అనేక సంఘటనల మధ్య 600 మంది ప్రైవేటు సైన్యమున్న దేవరాజు తన చెల్లెలు వల్లి (నిత్యామీనన్)ని హీరోకు ఇచ్చి పెళ్ళిచేయాలనుకుంటాడు. ఇష్టం లేని ఆ పెళ్ళిని హీరో ఎలా తప్పించుకున్నాడు, 8 వేల గజాల స్థలం అమ్మకం విషయంలో తన తండ్రి మీద పడ్డ అభాండాన్ని ఎలా చెరిపేసుకున్నాడన్నది మిగతా కథ.

ఎలా చేశారంటే...

క్యారెక్టర్ ఆర్టిస్టు ఎమ్మెస్ నారాయణ ఆకస్మికంగా మరణించడానికి ముందు నటించిన చివరి సినిమాల్లో ఒకటి ఇది. షూటింగ్ అయిపోయాక ఆయన మరణించడంతో, వేరొకరి మిమిక్రీతో డబ్బింగ్‌ను తెలివిగా మేనేజ్ చేసిన ఈ చిత్రబృందం ఈ సినిమాను గౌరవంగా ఎమ్మెస్‌కే అంకితం చేసింది. నిజానికి, ఈ సినిమా నిండా బోలెడంతమంది నటీనటులు. కాబట్టి, ఏ ఫ్రేమ్‌లో చూసినా తెర నిండుగా నటీనటులు కనిపిస్తూనే ఉంటారు. ఇన్ని పాత్రల మధ్యనా అల్లు అర్జున్ విపరీతమైన ఎనర్జీతో, విచిత్రమైన ఒక డైలాగ్ డెలివరీ శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. బాధ్యతాయుతమైన కొడుకుగా, చలాకీ ప్రేమికుడిగా రకరకాల షేడ్స్ ఉన్న పాత్రను బాగా పోషించారు. కొన్ని పాటలకు చులాగ్గా అతను వేసిన స్టెప్పులు బాగున్నాయి. మెయిన్‌స్ట్రీమ్ సినిమాల హీరోయిన్ సమంత డయాబెటిక్ పేషెంట్ లాంటి పాత్ర పోషించడం విశేషమే. అందం, అభినయం కలగలిసిన పాత్రపోషణ ఆమెది. నిత్యా మీనన్ కనిపించేది కాసేపే అయినా, బాగున్నారు. అదాశర్మది చాలా కొద్దిసేపు కనిపించే పాత్ర. ఫస్టాఫ్‌లో అలీ, సెకండాఫ్ చివరలో బ్రహ్మానందం కామెడీ పండించే పనిని భుజానికి ఎత్తుకున్నారు. ఉపేంద్ర, కోట శ్రీనివాసరావు, స్నేహ లాంటి వారు నిడివి రీత్యా చిన్నవే అయినా, ఆ యా పాత్రలు నిండుగా కనిపించడానికి తోడ్పడ్డారు.

సాంకేతిక విభాగాల పనితీరేమిటంటే...

ఫస్టాఫ్ సెంటిమెంట్ సన్నివేశాలతో కొంత నిదానంగా నడుస్తుంది. ఇక, సెకండాఫ్‌లో కొంత వేగంగానే నడిచినా, అనేక అంశాలను ఒక్కచోట గుదిగుచ్చడంతో ఏ పాత్ర మీదా, సంఘటన మీదా పూర్తి శ్రద్ధ పెట్టే అవకాశం లేకుండాపోయింది.అయితేనేం, ఈ సినిమాకున్న అనేక బలాల్లో పాటలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ముఖ్యమైనవి. ఇప్పటికే ఈ పాటలు రేడియోలో, టీవీల్లో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా, ‘చల్ చలో చలో....’ (రచన - రామజోగయ్య శాస్త్రి, గానం - రఘు దీక్షిత్) అనే పాట జీవన తాత్త్వికతను బోధిస్తూ, ఆలోచింపజేసేలా సాగుతుంది. దేవిశ్రీ ప్రసాదే స్వయంగా రాసి, శ్రావణభార్గవితో కలసి పాడిన ‘సూపర్ మచ్చీ...’ పాట సినిమా చివరలో పక్కా మాస్ శైలిలో ఉర్రూతలూపుతుంది. అలాగే, ‘కమ్ టు ది పార్టీ...’ (గానం - విజయ్ ప్రకాశ్) అనే పార్టీ గీతం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కలానికి ఉన్న ఆధునిక పాళీని చూపుతుంది. రాగల కొద్దిరోజులు జనం నోట నానుతుంది. శ్రీమణి రాసిన ‘జారుకో...’ గీతం (గానం - దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్, ఎం.ఎం. మానసి) గమ్మత్తుగా ధ్వనిస్తుంది. ఇక, ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫీ, రవీందర్ కళా దర్శకత్వం కథానుగుణంగా సాగుతాయి. పీటర్ హెయిన్ చేసిన యాక్షన్ సన్నివేశాల్లో సూట్‌కేసు దొంగలపై హీరో చేసే ఫైటు లాంటివి బాగుంటాయి.

ఎలా ఉందంటే...

హీరో ప్రయాణం ఎక్కడో మొదలై మరెక్కడే తేలినట్లూ, బలమైన విలన్ సినిమాకు కరవైనట్లూ అనిపించే ప్రమాదం ఉన్న ఈ స్క్రిప్టు నిజానికి అంతకన్నా బలమైన మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మనం ఎదుటివాళ్ళకు ఏది చేస్తే, అదే మనకూ తిరిగి వస్తుంది. ఎదుటివాళ్ళకు మనం మంచి చేసినా, కోరుకున్నా... అదే మనకూ లభిస్తుందనే విషయాన్ని అంతర్లీనంగా చెప్పే వెండితెర కథ ఇది. త్రివిక్రమ్‌కు బాగా పేరు తెచ్చిన ‘అతడు’, ‘అత్తారింటికి దారేది’ లాంటి వాటి లాగానే ఈ చిత్రం కూడా మానవ సంబంధాలు, బంధాలు, బాంధవ్యాల చుట్టూ తిరిగే కథే. బహుశా అందుకే కావచ్చు... అక్కడక్కడా ఇది త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్‌ల ‘అత్తారింటికి దారేది’నీ, తమిళ నేపథ్యంతో వచ్చిన షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’నూ గుర్తుకుతెస్తుంది. ఇవన్నీ కుటుంబ కథలు కావడం, సకుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసినవి కావడం అనివార్యంగా పోలికలు తెస్తుంది.

కాకపోతే, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా మనసుకు హత్తుకొనేలా, అదీ ప్రేక్షకుడు ఒక్కక్షణం ఆగి ఆలోచించేలాగా కూడా చెప్పడం రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్‌కు ఉన్న పెద్ద బలం. పైగా, కథలోని ఏ సంఘటననూ ఏకబిగిన ఒకేసారిగా పూర్తిగా వెల్లడించరు. దాన్ని విడతల వారీగా చెప్పుకుంటూ, ముడులు విప్పుకుంటూ వెళ్ళడంలో ఒక ప్రయోజనం ఉంది. ఆ సంఘటనలోని రకరకాల కోణాలు మెల్లగా వెల్లడవుతూ, ఒక సస్పెన్స్‌నూ, సర్‌ప్రైజ్‌నూ ఆఖరు వరకూ కొనసాగిస్తాయి. హీరో తండ్రి తాలూకు ప్రమాదమనే సంఘటనను హీరో దృష్టిలో ఒకసారి కొంత, హీరోకు ప్రత్యర్థి (విలన్ అనచ్చా?) దృష్టిలో మరికొంత, దానికి కొనసాగింపుగా నిత్యా మీనన్ దృష్టిలో మరికొంత వెల్లడించడం అలాంటిదే! ఇలాంటి సినీ కథన పద్ధతి ఆసక్తికరంగానూ, రొటీన్‌కు భిన్నంగానూ అనిపిస్తుంది. డైలాగ్ కామెడీ కన్నా దృశ్యాలు, భావప్రకటన ద్వారా విజువల్ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వడం కూడా కొత్తగా అనిపిస్తుంది.

ఈ సినిమా మొత్తాన్నీ ఆయన ఒక మంచి నవల తరహాలో నేరేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో పాత్రలు, సంఘటనలు, కొన్నిచోట్ల రచయితగా రాసిన డైలాగులు మామూలు కన్నా ఎక్కువే. హీరో మరీ ఎక్కువ మాట్లాడుతున్నాడేమో అనీ అనిపిస్తుంది. అయితే, రొటీన్ సినిమాలకు భిన్నమైన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. కొన్నిచోట్ల త్రివిక్రమ్ రాసిన డైలాగులు, పాత్రల ద్వారా వల్లించిన జీవన సూక్తులు చిరకాలం గుర్తుండిపోతాయి. హీరో మాటల్లో వచ్చే ‘‘ మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత. పిల్లలు  మోయాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం’’..., ‘‘మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్’’..., ‘‘భార్యను గెలవాలంటే కప్పులు పగలగొట్టడం కాదు సార్! (మధ్యలో ఉన్న) ఆ గోడ బద్దలుకొట్టండి!’’ లాంటి డైలాగులు అందుకు ఉదాహరణ. తమిళనాట సన్నివేశాలకు ‘కూడు తిన్నారా?’ లాంటి అక్కడ మాట్లాడే తెలుగే వాడేందుకు శ్రమించారు. ఇవన్నీ సినిమాకు పాజిటివ్ అంశాలు

అయితే, ఏ సీన్‌కు ఆ సీన్‌గా బాగుందనిపించే ఈ రెండు గంటల 42 నిమిషాల సినిమాలో వచ్చే సవాలక్ష సబ్‌ప్లాట్లు, తండ్రి గౌరవాన్నీ - ఆయన చెప్పిన విలువలనూ కాపాడుకోవడం కోసం హీరో పడే పాట్లు చూశాక కొన్నింటికి సరైన వివరణలు, తార్కికమైన ముగింపులు కనపడవు. హీరో ప్రేమిస్తున్నది అదాశర్మ స్నేహితురాలైన సమంతను అని పెళ్ళి ఏర్పాట్ల మధ్య పదే పదే చెబుతూ వస్తారు కానీ, ఆ పక్కనే కనిపిస్తున్న రాజేంద్రప్రసాద్ కూతురే ఆ అమ్మాయన్న సంగతిని తరువాత సీన్ల ఎప్పుడో బయటపెట్టడం ఒక సినిమాటిక్ స్క్రీన్‌ప్లే కన్వీనియన్స్. ఇక, నిత్యామీనన్ నిజానికి ప్రేమిస్తున్నది తన మేనమామనే అయినా, హీరోతోనూ ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం తికమక కలిగిస్తుంది. అలాగే, ఉపేంద్ర ఇంటిపక్కనే అతని బావమరిది ఉన్నాడని చెబుతారు, చూపిస్తారు కానీ, సినిమాలో అతను మళ్ళీ కనిపించడు. తమిళనాడులోని ఉపేంద్ర ఇంటికి హీరో బృందం రావడానికే కారణమైన సదరు బావమరిది పాత్ర ఆ తరువాత వారి గురించి పట్టించుకోదెందుకో తెలియదు.

ఇలాంటి లూజ్ ఎండ్స్‌ను పక్కనపెడితే, మొత్తం మీద ఈ సినిమా సగటు ప్రేక్షకులను నిరాశ పరచదు. అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. మర్చిపోతున్న మానవ సంబంధాలు, మనం వదిలేసుకుంటున్న మంచి విలువలను మరోసారి గుర్తు చేస్తుంది. ఆ మేరకు ఈ దర్శక - రచయితనూ, తీసిన నిర్మాతనూ అభినందించాల్సిందే! కాకపోతే, పెళ్ళి భోజనానికని సిద్ధమై వచ్చిన ప్రేక్షకులు పూర్తిస్థాయిలో సంతృప్తి పొందుతారా అన్నదే కించిత్ అనుమానం. అయితే, అవేవీ ఈ సినిమా కమర్షియల్ విజయాన్ని అడ్డుకోలేవన్నది మాత్రం అనుమానం అక్కర్లేని నిజం.

కొసమెరుపు - 
అన్నట్లు... ఈ సినిమాలో హీరో పాత్రను ఒకరు నందు అంటారు... మరొకరు ఆనంద్ అంటారు... ఇంకొందరు విరాజ్ అని పిలుస్తారు. వెరసి అతని పూర్తి పేరు - విరాజ్ ఆనంద్ అని ప్రేక్షకులే గ్రహించాలి. మొత్తానికి, సినిమాలో ఒక ప్రధానమైన కథకు బోలెడన్ని ఉపకథలు కలిపినట్లే, ఒక హీరో పాత్రకు ఇన్ని పేర్లు, ముద్దు పిలుపులూ ఉండడం అరుదైన విచిత్రమే! మొత్తానికి, త్రివిక్రమ్ మార్కు డైలాగులు, కథన విధానం, అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ బాణీల్లోని పాటలు లాంటి వాణిజ్య విలువలు ఈ ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి బాక్సాఫీస్ వద్దే కాక, రేపు పదే పదే టీవీ చానళ్లలో ప్రసారానికీ తరగని ఆస్తి. ‘త్రివిక్రమ్ సినిమా అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి’ అనుకొంటూ, గత చిత్రాల పోలికలతో ‘అంతకు మించి...’ కావాలని కోరుకోకపోతే, వేసవి సినీ కాలక్షేపానికి ఇంతకు మించి కావాల్సింది ఇంకేముంటుంది!

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' Web edition, 9th Apr 2015, Thursday)
...........................................................

Thursday, April 9, 2015

ఆ హీరోయిన్ల నుంచి...ఎంతో నేర్చుకున్నా! - అల్లు అర్జున్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ,

ఆ హీరోయిన్ల నుంచి...ఎంతో నేర్చుకున్నా!

బుధవారం మధ్యాహ్నం 3 గంటల వేళ... హైదరాబాద్‌లో సూర్య ప్రతాపంతో వీధులు వేడెక్కి ఉన్నాయి. ఉదయం నుంచి పుట్టినరోజు హంగామా... ‘ట్విట్టర్’ రంగప్రవేశపు ఆర్భాటం... ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా రిలీజు హడావిడి... వీటన్నిటి మధ్య హీరో అల్లు అర్జున్‌కు క్షణం తీరిక లేదు. ‘గీతా ఆర్ట్స్’ కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో వేచి ఉన్న అభిమానులను ఆత్మీయంగా పలకరిస్తూ, తరువాతి చిత్రాల తాలూకు కథల గురించి ఇద్దరు ప్రముఖ దర్శకులతో చర్చకు సిద్ధమవుతూనే, సినిమా రిలీజు వేడి... పత్రికల్లోని వార్తల వాడిని తట్టుకుంటూ, వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారీ స్టైలిష్ స్టార్. మనసు పెట్టి చేసిన భారీ బడ్జెట్ చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మొదలు ‘రుద్రమదేవి’లో ముఖ్య పాత్ర, సినిమాతో నేర్చుకున్న అంశాల దాకా అనేక విష యాలపై మనసులోని మాటలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు...

 ఆ హీరోయిన్ల నుంచి...ఎంతో నేర్చుకున్నా!


‘అత్తారింటికి దారేది-2’ అంటూ ‘సన్నాఫ్..’పై వ్యాఖ్య వినిపిస్తోంది.
ఇంటర్నెట్‌లో ఏవేవో రాస్తుంటారు. దానికీ, దీనికీ పోలికే లేదు. ‘అత్తారింటికి’లానే ఇదీ సకుటుంబ వినోద తరహా చిత్రం కావడంతో పోలిక తెస్తున్నారు. మంచి కథ కుదిరింది. చేశాం. అంతే.

 మరి, సన్నాఫ్ సత్యమూర్తికీ, సన్నాఫ్ అరవింద్‌కీ పోలికలు, తేడాలు?
 సన్నాఫ్ సత్యమూర్తికీ, సన్నాఫ్ అల్లు అరవింద్‌కీ పెద్ద తేడా లేదు. నిజం చెప్పాలంటే, ‘ఖుషి’ సూపర్‌హిట్ తర్వాత పవన్‌కల్యాణ్ గారిని కలిసినప్పుడు ‘నువ్వేంటో నీ సినిమా అదే’ అని నాతో అన్నారు. అప్పటికి నా ‘ఆర్య’ సినిమా వచ్చింది. నాకూ, దానికీ పోలిక లేదే అనుకున్నా. తరువాత నాకు అర్థమైంది ఏమిటంటే, మన భావోద్వేగాలు, ఆలోచన లకు తగ్గ కథలనే మనం ఏరుకుంటామని. ‘ఆర్య’ కథకు నా వయసు, ‘రేసుగుర్రం’ కథకు మా ఇంట్లోని అన్నదమ్ముల బంధం, ఇప్పుడీ సినిమాకు నాన్నతో కొడుకు అనుబంధం లాంటివి కనెక్టయ్యాయి. ఇందులో కొంత మా ఇంట్లోనే చిత్రీకరించాం.  త్రివిక్రమ్ అడగగానే, తాముండే గ్రౌండ్ ఫ్లోర్‌లోనే షూటింగ్‌కు నాన్న గారు ఒప్పుకున్నారు.

 మీ గత చిత్రాల్లో కన్నా ఈ సారి బాగా స్టైల్ పెంచినట్లున్నారు!
 (నవ్వేస్తూ...) ఇటీవల వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో...’ సినిమాలో రాక్ గిటార్ ప్లేయర్‌గా చేశాను. ‘రేసు గుర్రం’లో మధ్యతరగతి అబ్బాయిగా చేశాను. వాటితో పోలిస్తే, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’లో నాది కొంత డిగ్నిటీ ఎక్కువున్న పాత్ర. హుందాతనం నిండిన ఆ పాత్రలో కూడా వస్త్రధారణలో ఒక స్టైల్ తెచ్చేందుకు ప్రయత్నించాం. పైగా, నేనెప్పుడూ ఒకటికి నాలుగు అలంకరణలతో నిండిన వస్త్రధారణ చేస్తుంటా. కానీ, పాటలు వదిలేస్తే, ఈ సినిమాలో కావాలనే అవన్నీ వదిలించుకొని, సింపుల్‌గా, సింగిల్ పీస్‌లో ఉండేలా చూశా. దాంతో, నేను కొత్తగా కనిపిస్తాను.

 ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ముగ్గురు హీరోయిన్లున్నారు. అప్పుడు ‘ఇద్దరమ్మాయిలతో...’ అయితే, ఇప్పుడు ‘ముగ్గురమ్మాయిలతో’నా?
 (నవ్వేస్తూ...) ఏకకాలంలో ముగ్గురమ్మాయిలతో షూటింగ్ లేదు. ఉండి ఉంటే, ఆ షాట్ ఎప్పటికీ తెమలదేమో! (మళ్ళీ నవ్వేస్తూ...) జోక్‌గా అలా అంటున్నాను కానీ, ఇప్పుడొస్తున్న యువ కథానాయికలు చాలా ప్రొఫెషనల్. నిజానికి, ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు ఎక్కువ కనిపిస్తారు. వారితో పోలిస్తే, అదా శర్మ కనిపించేది తక్కువే.

 ఈ ముగ్గురు హీరోయిన్ల ప్రత్యేకత ఏమిటో?
 సినిమాలో ముగ్గురివీ ముఖ్యపాత్రలే. నిజజీవితంలో ఈ ముగ్గురు హీరోయిన్లకూ ఎవరి వ్యక్తిత్వం వారికుంది. సమంతలో ఒక విలక్షణ లక్షణం ఉంది. ఆమె ఇటు ఎంతో అందంగా కనిపిస్తూనే, అటు మంచి అభినయం పండించగలదు. ఇక, నిత్యామీనన్‌లోని అద్భుతమైన గుణం ఏమిటంటే, తనకు ఇవ్వజూపిన పాత్ర బాగుందా, లేదా అని మాత్రమే ఆలోచిస్తుంది. అంతేతప్ప, తనదే సినిమాకు ప్రధాన పాత్ర కావాలనీ, అలా మెయిన్ క్యారెక్టర్ కాకపోతే తన ఇమేజ్ పోతుందనీ భయపడదు. వెనుకాడదు. ఇక, అదాశర్మ ప్రతిభావంతురాలు. ఈ చిన్న వయసులోనే ఎంతో అద్భుతంగా అవతలివాళ్ళను అనుకరిస్తుంది. అంత మిమిక్రీ చేయగల అమ్మాయిని తొలిసారి చూశా. వీళ్ళతో వర్‌‌క వల్ల ఎంతో నేర్చుకున్నా.

 నిజంగానా? ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నారేమిటి?
 నా దగ్గర పనిచేసేవాళ్ళను నేను బాగా చూసుకుంటూ ఉంటా. కానీ, సమంతను చూశాక, మన దగ్గర పనిచేసే సిబ్బందిని తనంత బాగా చూసుకోవాలని నేర్చుకున్నా. నిత్యా మీనన్‌ను చూశాక ఏ విషయంలోనైనా తగినంత మేరకు సరైన భయం పెట్టుకోవాలే తప్ప, అనవసరపు భయం పెట్టుకోకూడదని అర్థం చేసుకున్నా. ఉదాహరణకు, ఒక స్టెప్ వేయాలంటే నేర్చుకోకుండా కెమేరా ముందుకు వెళితే భయపడాలి. అది సరైన భయమే. కానీ, అంతా నేర్చుకొని వెళ్ళాక, సరిగ్గా చేస్తానో, లేదో అనే భయం అనవసరం. ఆత్మవిశ్వాసంతో వెళ్ళి, నేర్చుకున్నది అద్భుతంగా చేసేయడమే! ఇక, చాలా చిన్న వయసు అమ్మాయైన అదాశర్మను చూశాక, ఏ విషయంలో అయినా సరే వేగంగా నిర్ణయం తీసుకొనే ఆ వయసులోని లక్షణాన్ని ఎప్పటికీ వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. కొన్నేళ్ళ క్రితం దాకా నేనూ అలాగే ఉండేవాణ్ణి.

 త్రివిక్రమ్ పనితీరు ఎలా అనిపించింది?
  త్రివిక్రమ్ తో సినిమా అంటే చాలు నేను ఒప్పేసుకుంటా. ఆ తరువాతే స్క్రిప్టు వింటా. మా కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘జులాయి’ సమయంలోనే ఆ మాట చెప్పా. దానికే, ఇప్పటికీ కట్టుబడి ఉన్నా.  సెట్స్‌లో ఆయన ఎక్కువగా ఏదీ చెప్పరు. కాకపోతే, షూటింగ్‌కు వెళ్ళడానికి ముందే కథ, పాత్రల గురించి మాట్లాడతారు. ఆ పాత్రను అలా చేయాలి, ఇలా చేయాలని బాగా మాట్లాడుకుంటాం. సెట్స్ మీద పైకి కనపడని హోవ్‌ువర్‌‌క ఆయనది. ప్రపంచ సినిమా మీద ఆయనకున్న జ్ఞానం అపారం. ‘జులాయి’తో పోలిస్తే, ఇప్పుడు నేను, ఆయన ఎదిగాం. మునుపటి కన్నా ఆయనలో వేగం, పరిణతీ పెరిగాయి. దర్శకత్వంలో అది స్పష్టంగా అర్థమైంది.

 త్రివిక్రమ్‌లో మీకు బాగా నచ్చిన విషయం?
 ‘నేను అనుకున్నది, చెప్పినది, రాసినదే జరగాలి’ అంటూ దాన్నే పట్టుకొని కూర్చొనే రకం కాదాయన. అవతలివాళ్ళు చెప్పింది వింటారు. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తారు. అవసరమైతే తాను అప్పటి దాకా అనుకున్నది మార్చేసుకుంటారు. ఆ ఓపెన్ మైండ్ ఆయనలోని గొప్ప లక్షణం. అది నాకు బాగా నచ్చుతుంది. ఆయన ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఆయనలోని విద్వత్తును నటీనటులందరూ ఎంతో గౌరవిస్తారు.

 ఇంతకీ, దర్శకుణ్ణి ఎంచుకొనేటప్పుడు మీరు చూసేది?
 ఆ దర్శకుడి మైండ్‌సెట్. అది చాలా ముఖ్యం. అతను మనతో సినిమా తీస్తున్నది డబ్బు కోసమా, ఖాళీ లేకుండా చూసుకోవడానికా, మరో  దానికా అన్నది చూస్తాను. సరైన మైండ్‌సెట్‌తో వస్తే ఓ.కె.చెప్పేస్తా. నిజం చెప్పాలంటే, దర్శకులు రెండు రకాలు. మన నుంచి రాబట్టుకొనేవారు ఒక రకం. మనకు ఎంతో ఇన్‌పుట్స్ ఇచ్చేవారు రెండో రకం. త్రివిక్రవ్‌ు రెండో రకం దర్శకుడు. ‘జులాయి’కి ఆయన ఇచ్చిన ఇన్‌పుట్స్ ఎంతో ఉపయోగపడ్డాయి. అప్పటి నుంచి నటుడిగా క్రమంగా ఒక్కో పొరనూ చీల్చుకుంటూ, బాగా బయటకు వస్తున్నా.

 ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ చేశారనీ...?
 (మధ్యలోనే అందుకుంటూ) అదేమీ లేదు. ‘ఆర్య-2’, ‘వరుడు’, ‘వేదం’ చిత్రాల్లో నేను గతంలో చేశా. కానీ, దానివల్ల యువతరానికే దగ్గరవుతాను తప్ప, పిల్లలకూ, కుటుంబ ప్రేక్షకులకూ దూరమవుతున్నా. వెరసి, ఈ లిప్‌లాక్‌ల వల్ల వచ్చే లాభం కన్నా, కలిగే నష్టం ఎక్కువగా ఉంది. కథకు నిజంగా అవసరమైతే అవి చేయడం పెద్ద విషయం కాదు. అలా కానప్పుడు అనవసరమని లిప్‌లాక్‌లకు దూరంగా ఉండదలిచా.

 ఇంతకీ ఈ సినిమా ద్వారా మీరు పొందిందేమిటి? పోగొట్టుకున్నదేంటి?
 కొద్దిగా బరువైతే పెరిగాను. (నవ్వులు...). వస్త్రధారణతో సహా అనేక అంశాల్లో కొన్ని అనవసర భయాలు, ఆందోళనలు, అలవాట్లు వదిలేశాను.

 పెద్ద హీరో అయ్యుండీ ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డిగా చేస్తున్నారే?
 ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటివి తెలుగు సినిమా ప్రమాణా లనూ, వాణిజ్య పరిమాణాన్నీ - రెంటినీ పెంచుతాయి. శంకర్ లాంటి వారు అలా చేయబట్టే, తమిళంలో వంద కోట్ల పెట్టుబడితో సినిమాలు తీయగలుగుతున్నారు. మనం కూడా ఇతర భాషా పరిశ్రమల మార్కెట్‌ను కూడా సంపాదించాలి. అందుకు మనకు ‘మగధీర’, ‘ఈగ’ లాంటివి దోవ చూపాయి. రానున్న ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ అలాంటివే. అవి బాగా ఆడాలి. అందుకే, నా వంతుగా గోన గన్నారెడ్డి పాత్ర చేశా.

 ఎవరెవర్నో దాటి ఆ పాత్ర మీకొచ్చినట్లుంది?
 దర్శక - నిర్మాత గుణశేఖర్‌తో నా కాంబినేషన్‌లో ‘వరుడు’ చిత్రం ఫ్లాపైనా, ఆయనపై నాకు అపారమైన గౌరవం ఉంది. ‘వరుడు’ ఆడలేదంటే దానికి కారణం - మా పొరపాటే తప్ప, నిర్లక్ష్యం కాదు. ‘రుద్రమదేవి’ 3-డి సినిమా. మన చరిత్రను చెప్పే సినిమా. అలాంటి 3డి చిత్రాలు ఆడితే, తెలుగు సినిమా సైజ్ కనీసం మరో 40 శాతం పెరుగుతుంది. ‘రుద్రమదేవి’ కథలో కీలకమైన గోన గన్నారెడ్డి పాత్ర ఎవరైనా పెద్ద హీరో చేస్తే బాగుంటుందనీ, అదనపు మార్కెట్ వస్తుందనీ ఆగింది. అది తెలిసి, నేనే ఆయనను సంప్రతించాను. నాకు తగ్గట్లు పాత్రను మలచగలనేమో ఆలోచించి చెబుతానన్నారు.  కొద్దిరోజులాగి, అప్పుడు సరేనన్నారు. నేనూ ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేశా.

 ‘నేను తెలుగు భాష లెక్క... అక్కడా ఉంటా, ఇక్కడా ఉంటా’ అని దాన్లో డైలాగ్. మీ ఉద్దేశం రెండు రాష్ట్రాలనా?
 అటు అడవిలోనూ, ఇటు కోటలోనూ అని కథా పరంగా అర్థం. (నవ్వేస్తూ...) రెండు తెలుగు రాష్ట్రాలనీ అనుకోవచ్చు.
  తెలుగు ప్రేక్షకులంతా నాకు కావాల్సినవాళ్ళే!

 మలయాళంలో డబ్బింగ్‌తో మీరు 3 రాష్ట్రాల్లో ఉన్నారు...
 మనం, మన సినిమా ఒక మెట్టు ఎక్కడమంటే అదే! ‘సన్నాఫ్...’ మలయాళ డబ్బింగ్ కూడా రెండు వారాల్లో రిలీజవుతోంది. నాకు నేరు మలయాళ చిత్రాలూ చేయాలని ఉంది. సరైన కథ, దర్శకుడొస్తే చేస్తా. హిందీలోనూ అంతే. ‘ఏబీసీడీ’లో చిన్న పాత్రకు అడిగారు కానీ చేయనన్నా.

 ‘సన్నాఫ్..’ ఆడియోలో చిరంజీవిని దాసరి ప్రస్తావిం చకపోవడం అనేక వ్యాఖ్యలకు తావిచ్చింది?
 సహజంగానే బయట విమర్శలు వస్తాయి కదండీ! ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత పవన్ కల్యాణ్ ప్రత్యేక స్టయిల్ తెచ్చారని ఆయన అన్నారు. కొన్నిసార్లు వేదికపై కొన్ని పేర్లు చెప్పడం మర్చిపోతుంటాం. ఒకసారి ఆడియో వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పడం నేనే మర్చిపోయా. దాసరి గారు అలాగే మర్చిపోయి ఉండవచ్చు. అది కావాలని జరిగిందో, అనుకోకుండా జరిగిందో నాకు తెలియదు. ఏమైనా, దాసరిగారు మా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన్ని మేము గౌరవించాలి. అంతే!

 దానికి వచ్చిన విమర్శల వల్లనేనా మీరు వరంగల్‌లో ‘రుద్రమదేవి’ ఆడియోలో చిరంజీవి పేరు తెచ్చి, ఆ చెట్టు నీడన పెరిగామన్నారు?
 అవును. కచ్చితంగా అందుకే అన్నాను. ఆ మాట నిజమే కదా!

 తకాలానికి ట్విట్టర్‌లో ఖాతా తెరవడమెలా ఉంది?
అభిమానులకు దగ్గరవడం ఆనందంగా ఉంది. కానీ, రావడమే చాలా ఆలస్యమైంది. మా తమ్ముడు అల్లు శిరీష్ నన్ను మొదటి నుంచి బలవంతం చేస్తున్నా ఇవాళ్టికి కుదిరింది.

 చాలామందిలా మీ ట్విట్టర్‌ను వేరెవరో హ్యాండిల్ చేస్తారా?
 నా విషయాలు, ఫోటోలు పంచుకోవడానికి ట్విట్టర్ వేదిక. నా పేరు మీద వచ్చేది కాబట్టి, స్వయంగా నేనే చూసుకుంటా.

 మీ అబ్బాయి అయాన్‌కు ఈ మధ్యే ఏడాది నిండింది కదా. తండ్రి బాధ్యతల్లో ఎలా ఉన్నారు?
పిల్లవాడు పుట్టాక సహజంగానే నాలో కొంత మార్పు వచ్చింది. మా వాడి మొదటి పుట్టినరోజుకని ఈ మధ్యే సింగపూర్‌కు కుటుంబ సమేతంగా వెళ్ళాం. అక్కడే సరదాగా గడిపి, వచ్చాం.

 మీ తదుపరి చిత్రం ఏమిటి? దర్శకుడు బోయపాటి శ్రీనుతోనేనా?
 చర్చల్లో ఉన్నాం. కొలిక్కిరాగానే తక్షణ చిత్రమేంటో చెబుతా.

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 9th April 2015, Thursday)
......................................... 

వేసవి కలిసొచ్చే 'జిల్'

వేసవిలో కలిసొచ్చే 'జిల్'

చిత్రం - జిల్..., తారాగణం - గోపీచంద్, రాశీఖన్నా, కబీర్ (నూతన పరిచయం), బ్రహ్మాజీ, చలపతిరావు, ఐశ్వర్య, కెమేరా - శక్తి శరవణన్, సంగీతం - జిబ్రాన్, ఫైట్స్ - అనల్ అరసు, కళ - ఏ.ఎస్. ప్రకాశ్, కూర్పు - కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు - వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - రాధాకృష్ణ కుమార్
 .............................................
 కొన్ని సినిమాలకు కొన్ని బాక్సాఫీస్ సానుకూలతలు కలిసొస్తాయి. మాస్ మెచ్చే ఫార్ములా కథ... తక్కువ నిడివి సినిమా... చకచకా నడిచే కథనం... అక్కడక్కడా కథ పక్కదోవ పట్టినట్లు అనిపించినా చటుక్కున బండిని పట్టాల మీదకెక్కించే సంఘటనలున్న స్క్రిప్ట్... వీటన్నిటికీ తోడు కొత్తగా మొదలవుతున్న వేసవి సెలవుల సీజన్ కూడా కలిసొస్తే? గోపీచంద్ నటించిన తాజా చిత్రం 'జిల్'కి కూడా అవన్నీ సమకూరాయి. గత ఏడాది వచ్చిన వాణిజ్య విజయం 'లౌక్యం'తో ఊపు మీదున్న గోపీచంద్, గతంలో ప్రభాస్‌తో 'మిర్చి' తీసిన నిర్మాతలు కలసి కొత్త దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌తో చేసిన తాజా ప్రయత్నం ఇది. అన్ని సానుకూలతులున్నా... కథను బిగువుగా తెరపై నడిపించారా అన్నది చూద్దాం...

కథ ఏమిటంటే...
ముంబయ్‌లో ఒక మాఫియా డాన్ ఛోటా నాయక్ (నూతన పరిచయం - మోడల్ కబీర్). పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కిన అతను తప్పించుకుంటాడు. ఈ మాఫియా డాన్ తనను మోసం చేసి, వెయ్యి కోట్లు కొట్టేసిన మాజీ సహచరుడు రంగనాథం (బ్రహ్మాజీ) కోసం వెతుకుతుంటాడు. రంగనాథం హైదరాబాద్‌లో తలదాచుకొంటాడు.

మరోపక్క హైదరాబాద్‌లోనే జై (గోపీచంద్) ఒక అగ్నిప్రమాద నివారక దళ అధికారి. స్వయానా ఫైర్ ఆఫీసరైన బాబాయ్ (చలపతిరావు), పిన్ని (ఐశ్వర్య) కుటుంబంతో అతనిది అందమైన అనుబంధం. అనుకోని పరిస్థితుల్లో ఒక టీనేజ్ అమ్మాయి సావిత్రి (రాశీఖన్నా)ని కాపాడిన హీరో, ఆమెతో ప్రేమలో పడతాడు. ఒక సందర్భంలో రంగనాథాన్ని విలన్ అనుచరుల నుంచి హీరో కాపాడతాడు. దాంతో, విలన్‌కూ, హీరోకూ మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ తరువాత ఒక అగ్ని ప్రమాదంలో రంగనాథ్ మరణిస్తాడు. ఆ మరణించే క్రమంలో హీరోతో ఏదో చెబుతాడు. దాంతో విలన్ ఆ వెయ్యికోట్ల రహస్యం హీరోకే చెప్పాడని వెంటపడతాడు. అక్కడ నుంచి రెండు వర్గాల మధ్య జరిగే పిల్లీ ఎలక పోరాటం మిగతా సినిమా.

 ఎలా చేశారంటే...
కథానాయకుడిగా గోపీచంద్ మునుపటి కన్నా మరింత స్లిమ్‌గా, కొత్త లుక్‌తో, ఉత్సాహంగా కనిపించారు. సన్నివేశాల్లోనే కాక, పాటలు, ఫైట్లలోనూ అది కొట్టొచ్చినట్లు కనిపించింది. కథానాయిక రాశీ ఖన్నా కాస్తంత బొద్దుగా, ముద్దుగా ఉన్నారు. పాత్ర తాలూకు చిలిపితనం దానికి తోడైంది. దాంతో, తెర మీద అందంగా మెరిశారు. విలన్‌గా పరిచయమైన కబీర్ మంచి ఒడ్డూ పొడుగు, గడ్డంతో బాగున్నారు. చలపతిరావు, ఐశ్వర్య, చిన్న పాత్రలో కనిపించే అవసరాల శ్రీనివాస్ లాంటి వారు సరేసరి.

ఈ సినిమాకు ప్రధాన బలం - కెమేరా పనితనం. కొంత డిజిటల్ కెమేరాతో, మరికొంత ఫిల్మ్‌తో చిత్రీకరించిన ఈ సినిమాలో శక్తి శరవణన్ ఛాయాగ్రహణ పనితనం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఫారిన్ లొకేషన్లలో పాటల నుంచి చిన్న అపార్ట్‌మెంట్ల మధ్యలో, శ్మశానంలో ఫైట్ల దాకా తెరపై కనువిందైన విజువల్స్ అలరిస్తాయి.పాటల విషయంలో జిబ్రాన్ నవతరం శైలిలోని అనుసరించినా, సినిమాలో వచ్చే రెండో పాట ఒక్కటే పాడుకోవడానికి వీలుగా అనిపిస్తుంది. అనల్ అరసు ఫైట్లు,

 ఎలా ఉందంటే...
 ఈ చిత్ర కథలో లోపాలూ చాలానే కనిపిస్తాయి. విలన్ అయిన మాఫియా డాన్‌కూ, అతను వెతుకుతున్న మాజీ అనుచరుడు రంగనాథం (బ్రహ్మాజీ)కూ మధ్య ఏం జరిగిందన్నది, అతనెలా వెయ్యికోట్లతో తిరుగుతున్నాడన్నది కథలో వివరంగా చూపరు. అలాగే, హైదరాబాద్‌లో రంగనాథంకు అందించే పాస్‌పోర్ట్, వగైరాల కథ గురించీ పెద్దగా వివరం లేదు. అవన్నీ ఒక్క సీన్‌లో, మూడు ముక్కల్లో డైలాగుల్లో తేల్చేశారు. ఆ రకంగా స్క్రిప్టులో మరింత చిక్కదనానికి ఉన్న అవకాశాన్ని తామే చేజేతులా వదులుకున్నారు. అలాగే, ఉన్నట్టుండి సినిమాలో కామెడీ తగ్గిందనే భావన కలగడం వల్లనో ఏమో పోసాని, అతని అనుచరుడు హీరో ఇంటికి వెళ్ళి వెతికే ఘట్టాన్ని బలవంతాన జొప్పించారు. దాని వల్ల సినిమా నిడివి పెరగడం, చకచకా వెళుతున్న కథ కాళ్ళకు అడ్డం పడడం తప్ప, ఆ సీన్ వల్ల వినోదం కానీ, సినిమాకొచ్చిన విశేష ప్రయోజనం కానీ లేదనే చెప్పాలి.

హీరో కుటుంబంపై విలన్ దాడి, అతని మీద ప్రతీకారానికి హీరో చెలరేగడం దగ్గరే ప్రేక్షకులకు కూడా కొంత విలన్ మీద కోపం పెరుగుతుంది. లేదంటే, విలన్ తన వెయ్యి కోట్ల కోసం తానే కొట్లాడుతున్నాడు కదా, అందులో తప్పేముంది అనిపించే ప్రమాదం హెచ్చు. సినిమా కోసమని లాజిక్‌లతో పని లేకుండా కొంత స్వేచ్ఛ తీసుకొని, ఎక్కడికక్కడ కథ ముందుకు నడవడానికి తగ్గట్లు కన్వీనియంట్ స్క్రీన్‌ప్లే రాసుకున్న సినిమా ఇది. కాసేపు ప్రేమ, ఇంకాసేపు విలనిజం, మరికాసేపు పగ - ప్రతీకరం లాంటి వాటిని తీసుకొని, దేని మీదా పూర్తి దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది.

అలాంటి లోటుపాట్లు పక్కనపెడితే, తొలి చిత్ర దర్శకుడిగా రాధాకృష్ణ కుమార్ మంచి మార్కులే పడతాయి, కొన్నిచోట్ల ఆయన రాసుకున్న డైలాగులూ, 'హీరోతో ఫోన్‌లో మాట్లాడినవారినల్లా చంపేస్తా'నంటూ విలన్ వేసిన పీటముడి లాంటివి ప్రేక్షకులకు బాగుంటాయి. అయితే, అవన్నీ ఈ రెండు గంటల 20 నిమిషాల సినిమాను దీర్ఘకాలం బాక్సాఫీస్ వద్ద నిలబడతాయా అన్నది చూడాలి. మీదకొచ్చి పడే కొత్త సినిమాల సత్తా ఏమిటన్న దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అప్పటి దాకా 'జిల్' అనే పేరు ఎందుకు పెట్టారా అని ఆలోచించకుండా, సామాన్య యాక్షన్ చిత్ర ప్రేమికులు కాలక్షేపానికి నిరభ్యంతరంగా ఈ సినిమా చూసేయవచ్చు. మొదటే చెప్పుకున్న అది 'జిల్'కు ఉన్న బలం, సానుకూలత కూడా!

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' Web Edition, 28th March 2015, Saturday)
.........................................

Saturday, March 28, 2015

అవకతవకలు అనేకం: సి.వి.ఎల్. నరసింహారావు ఆరోపణ

 ఇది ఇలా ఉండగా, వీధికెక్కిన ‘మా’ వ్యవహారం, తాజా ఎన్నికల గురించి ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ’ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘కళాకారులంతా కలసికట్టుగా ఉండకపోతే, పోయేది మన పరువే’నని వారు అభిప్రాయపడ్డారు. ‘రోషం’ బాలు, దర్శక - నటుడు డాక్టర్ ఎల్. శ్రీనాథ్, ‘మా’లో కూడా సభ్యులైన సీనియర్ నటుడు - వకీలు సి.వి.ఎల్. నరసింహారావు, ప్రదీప్‌రెడ్డి శుక్రవారం ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు.  ‘మా’లో జీవిత సభ్యుడే కాక, గతంలో న్యాయ సలహాదారుగా కూడా పనిచేసిన నటుడు సి.వి.ఎల్. నరసింహారావు మాట్లాడుతూ, ‘మా’లో అనేక అవకతవకలు అధికారికంగానే చాలాకాలంగా సాగుతున్నాయనీ, అదంతా ఇప్పుడు బయటపడుతోందని ఆరోపించారు.

 మరణించిన తరువాత మౌనం పాటించడం కాకుండా, ఉండగానే అర్హులైన వారికి ఆర్థిక సాయం అందించాలని ఆయన పేర్కొన్నారు. కేవలం సొసైటీస్ చట్టం కింద రిజిస్టరైన ‘మా’లో తీరా ఇప్పుడు యూనియన్ వర్కర్‌‌స తరహాలో లబ్ధి తెస్తామని మురళీ మోహన్ తదితరులు చేస్తున్న వాదన సాధ్యం కానిదని ఆయన వ్యాఖ్యానించారు. ‘కుబుసం’ చిత్ర దర్శకుడు శ్రీనాధ్ మాట్లాడుతూ, ‘మా’లో సభ్యత్వం కేవలం కొందరి దయాధర్మంగా మారిందని ఆరోపించారు. ‘మా’ను సమూలంగా ప్రక్షాళన చేయాలనీ, సభ్యులకు సానుకూలంగా ఉండేలా మార్చాలనీ ఆయన అన్నారు.

(Published in 'Sakshi' daily, 28th March 2015, Saturday)
..........................................

ఎన్నికల వేళ...పేలుతున్న మాటల తూటాలు

ఎన్నికల వేళ...పేలుతున్న మాటల తూటాలు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగాల్సిన ఆదివారం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఎన్నికలు నిలిపి వేయాలంటూ నటుడు ఒ. కల్యాణ్ గురువారం కోర్టులో వేసిన పిటిషన్, దానిపై విచారణ జరిపి, ‘ఎన్నికలు జరపండి. కానీ, ఫలితాలు వెల్లడించవద్దు’ అంటూ కోర్టు శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వు తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. మరోపక్క నటుడు నాగబాబు, తదితరుల మద్దతున్న రాజేంద్రప్రసాద్ వర్గానికీ, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ మద్దతున్న జయసుధ వర్గానికీ మధ్య సాగుతున్న ఎన్నికల పోరులో మాటల తూటాలు శుక్రవారం కూడా పేలాయి.
 
 సాధారణ ఎన్నికలను తలపిస్తూ, వాగ్ధానాల వర్షం కురిసింది. అధ్యక్షపదవికి పోటీపడుతున్న జయసుధ, ఆమె ప్యానెల్‌లోని ఇతర పోటీదారులు శుక్రవారం సాయంత్రం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈసారి తమ ప్యానెల్‌ను గెలిపిస్తే, సభ్యులకు తాము చేయదలుచుకున్న పనుల గురించి చెప్పడానికి జయసుధ, బృందం ప్రయత్నించారు. అలాగే, బుధవారం నాటి మీడియా సమావేశంలో రాజేంద్రప్రసాద్ వర్గం చేసిన ఆరోపణలకు, వ్యాఖ్య లకు దీటుగా ఎదురు బాణాలు సంధించారు. తానెవరికీ డమ్మీని కాదని జయసుధ ఘాటుగా చెప్పారు.  
 
 ‘‘కార్పస్ ఫండ్ కోసం ప్రత్యర్థి వర్గం హామీ ఇస్తున్నట్లు ఎవరి దగ్గర నుంచో డబ్బులు తేవడం కాకుండా, ముందుగా మా ప్యానెల్ సభ్యులమే విరాళాలిస్తాం. అలాగే, ఆరు నెలలకొకసారైనా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాలకు నటీనటులం వెళ్ళి, వినోద కార్యక్రమాలు చేసి, నిధులు సేకరిస్తాం’’ అని జయసుధ పేర్కొన్నారు. సేకరించగల నిధి, లబ్ధిదారుల సంఖ్యను స్పష్టంగా పేర్కొనడానికి మాత్రం ఆమె ఇష్టపడలేదు. కేవలం కొద్దిమందికి కాకుండా, ప్రత్యేక సర్వే చేసి, అర్హులైన అందరికీ వైద్యబీమా, పెన్షన్ ఇస్తామంటూ జయసుధ తమ ప్యానెల్ వాగ్దానాలను వివరించారు. అలాగే, అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న కళాకారులకు అవకాశాలు వచ్చేలా సాయపడతామనీ హామీ ఇచ్చారు. కళాకారుల కష్ఠనష్టాలు తెలుసుకొని, వాటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక గ్రీవెన్‌‌స సెల్ పెడతామన్నారు. పేద కళాకారుల ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళకు సాయం చేసేందుకు కూడా ప్రయత్నిస్తామన్నారు.
 
 ఇది ఇలా ఉండగా, ‘‘నాలుగైదు రోజులుగా ఈ ఎన్నికల వ్యవహారం పెద్ద వినోదంగా, టీవీ చానల్స్‌లో చర్చలతో టి.ఆర్.పి. రేటింగులు పెరిగేలా తయారయ్యాయ’’ని జయసుధ వ్యాఖ్యానించడం విశేషం. బయట రాజకీయాల కన్నా ఈ ‘మా’ ఎన్నికల వేళ ఇక్కడ రాజకీయాలు దారుణంగా ఉన్నాయనీ, ఒకరిపై మరొకరం బురద జల్లుకోవడం ఇష్టం లేకనే దీనిపై ఏ టీవీ చానల్స్‌లోనూ చర్చలకు వెళ్ళడం లేదనీ ఆమె పేర్కొన్నారు. ‘‘మొన్న వాళ్ళు (రాజేంద్రప్రసాద్ వర్గం) నా గురించి ఎగతాళిగా మాట్లాడారు. అది చూసి, నా శ్రేయోభిలాషులు కూడా ‘నీకీ ఎన్నికలు, పోటీ అవసరమా?’ అని అడిగారు. కానీ, నేను మాత్రం ఈ సవాలును ధైర్యంగా ఎదుర్కొన దలిచా’’ అని ఆమె అన్నారు.
 
  జయసుధ ప్యానెల్ పక్షాన కోశాధికారి పదవికి పోటీ చేస్తున్న పరుచూరి వెంకటేశ్వర రావు, సంయుక్త కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న సీనియర్ నరేశ్, నటి హేమ, ఉపాధ్యక్షుడిగా ఇప్పటికే పోటీ లేకుండా ఎన్నికైన పి.శివకృష్ణ తదితరులు కూడా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ‘‘ఓడిపోతామనే భయంతో కొందరు కోర్టును ఆశ్రయించినా, ఎన్నికలు జరపాల్సిందేనంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వు క్షుద్రశక్తులకు గొడ్డలిపెట్టు’’ అని నరేశ్ వ్యాఖ్యానించారు. అలాగే, టీవీ చానల్‌లో మాట్లాడుతూ నాగబాబు పేర్కొన్న కొన్ని అంశాలను ఆయన తప్పుపట్టారు. కాగా, ఆర్థికంగా అన్ని విధాలుగా బాగున్నవారు సైతం కావాలని పింఛన్లకు వస్తుండడంతో, అసలైన అర్హులకే వాటిని పరిమితం చేయాలని గతంలో ప్రయత్నించామనీ, అందుకే వారి సంఖ్య తక్కువగా ఉందనీ మునుపటి కార్యవర్గాల్లో పనిచేసిన శివకృష్ణ వివరించారు.
 
(Published in 'Sakshi' daily, 28th March 2015, Saturday)
..................................................

Friday, March 27, 2015

‘మా’ ఇంట ఎన్నికల మంట!

  • ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’లో వివాదం
  • రాజేంద్రప్రసాద్, జయసుధ ప్యానెళ్ల మధ్య ఢీ అంటే ఢీ

సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా నటీనటులకు ప్రాతినిధ్యం వహించే ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’లో వివాదం చెలరేగింది. దీంతో ఈ నెలాఖరున జరగనున్న ‘మా’ అధ్యక్ష ఎన్నికలు రసకందాయంగా మారింది. ఈ పదవి కోసం బరిలోకి దిగిన సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్, ఆయన కన్నా సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ పరస్పరం ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందునుంచీ రాజేంద్రప్రసాద్ వెంట ఉంటూ వచ్చి, ఆయన ప్యానెల్ తరఫున పోటీకి దిగిన నటులు శివాజీరాజా, ఉత్తేజ్.. తాము పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఇక రాజేంద్రప్రసాద్‌కే మద్దతిస్తానని, ఆయనపై పోటీ చేసేది లేదని హీరో మంచు విష్ణు గతంలో ట్విట్టర్‌లో ప్రకటించగా, మరోపక్క ఆయన తండ్రి, సీనియర్ నటుడు మోహన్‌బాబు మాత్రం జయసుధకు మద్దతుగా బుధవారం ప్రకటన చేశారు. దీంతో రెండేళ్లకోసారి జరిగే ‘మా’ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠగా మారింది. చిత్ర పరిశ్రమలో ఎవరిని కదిలించినా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది.
 
హఠాత్తుగా నామినేషన్ల ఉపసంహరణ

ప్రస్తుతం ‘మా’ కోశాధికారిగా ఉన్న శివాజీరాజా ఈసారి ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ వేస్తే, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఉన్న నటుడు ఉత్తేజ్ ఇప్పుడు జాయింట్ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగారు. తీరా ఇప్పుడు విచిత్రంగా ‘వ్యక్తిగత కారణాల రీత్యా’ అంటూ ఉత్తేజ్ పక్కకు తప్పుకొన్నారు. కాగా, ఏకాభిప్రాయంతో ఎవరో ఒక్కరే పోటీలో ఉంటారంటేనే నామినేషన్ వేశానని, ఇప్పుడు మాట మార్చి, అవతలి వైపు నుంచి నటుడు అలీని ప్రత్యర్థిగా నిలబెట్టారని శివాజీరాజా పేర్కొన్నారు. ఈ రాజకీయం నచ్చకనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజేంద్రప్రసాద్ వర్గం బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు ఆయన ప్యానెల్‌లోని నటులు కాదంబరి కిరణ్, వింజమూరి మధు, వారికి మద్దతు ప్రకటించిన నాగబాబు తదితరులు ఇందులో పాల్గొని మాట్లాడారు.

చెప్పిందొకటి.. జరిగిందొకటా?


నిజానికి ఆరేడేళ్ల క్రితమే రాజేంద్రప్రసాద్ ‘మా’ అధ్యక్ష పదవికి మురళీమోహన్‌పైనే పోటీకి దిగి, కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి మురళీమోహన్ సహా పలువురు సినీ పెద్దలు ముందుగా మద్దతు పలకడంతో ఎన్నిక ఏకగ్రీవమవుతుందని ఆయన భావించారు. అయితే, ఆఖరు క్షణంలో పోటీ అనివార్యమైంది. ఈ పరిణామానికి విస్తుపోయిన రాజేంద్రప్రసాద్ తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చారు. ‘నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ జయసుధకు రాజకీయ నేతలతో చెప్పించామని, బెదిరించామని చేస్తున్న ఆరోపణ పచ్చి అబద్ధం. ఆమె, ఆమె వెనుక ఉన్న వ్యక్తి రాజకీయాల నుంచి వచ్చారు. కానీ నేను రాజకీయాల్లో నుంచి రాలేదు’ అని ఆయన అన్నారు. ‘మేం చేస్తున్నది ధర్మయుద్ధం. అవతల మాకు ప్రత్యర్థులుగా నిలిచిందీ మా వాళ్ళే! అయితే, ముందుగా నన్ను నిలబడమని చెప్పి, అన్నిటికీ ఒప్పుకొన్న మహా పెద్దలే ఆఖరు క్షణంలో ఎందుకు మాట మార్చి, వేరొకరిని పోటీకి పెట్టారో తెలియదు. నన్ను ఎన్నుకుంటే రూ. 5 కోట్లు సేకరించి నిధి ఏర్పాటు చేస్తా. పేద కళాకారులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్, అర్హులందరికీ పెన్షన్ అందేలా చూస్తా. దేశంలో మరే అసోసియేషన్‌కూ లేనంత అందమైన భవనం కట్టిస్తా’’ అని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఓటర్లకు సెల్‌ఫోన్లు పంచుతున్నామంటూ స్థాయి మరిచి, అసత్య ఆరోపణలు చేయడం బాధించినట్లు చెప్పారు. కాగా, ఈ ఎన్నికల్లో ఎన్నికల ఆఫీసర్‌గా చేస్తున్నది మురళీమోహన్ వ్యక్తిగత లాయరేననీ, అలాగే అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా వారికే సన్నిహితుడైన ‘మా’ సభ్యుడని రాజేంద్రప్రసాద్ వర్గం పేర్కొంది. మరోైవె పు గతంలో ‘మా’లో ఏం జరిగిందన్నది తనకు తెలియదని, ఈసారి తమ ప్యానల్‌ను ఎన్నుకుంటే కళాకారులందరికీ మంచి చేస్తామని జయసుధ పేర్కొన్నారు. కాగా, ఇంత జరుగుతున్నా సినీ పరిశ్రమలో విభేదాలనే మాటను మురళీమోహన్ అంగీకరించడంలేదు. ‘పరిశ్రమలో వర్గ విభేదాలు, ప్రాంతీయ విభేదాలు ఎప్పుడూ లేవు. ఏదైనా విషయంలో ఎదురెదురు నిలబడినా, అది అయిపోయాక అందరం కలిసిపోతాం’ అని ఆయన అన్నారు.
 .......................................................

ఆరోపణలు, ప్రత్యారోపణలు..  

‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ అండతో బరిలోకి దిగిన జయసుధ వర్గం మంగళవారం మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలపై రాజేంద్రప్రసాద్ వర్గం తీవ్రంగా స్పందించింది. ఇప్పటికి ఆరు పర్యాయాలు అంటే 12 ఏళ్ల పాటు ‘మా’ అధ్యక్ష పదవిని మురళీమోహన్ నిర్వహించారనీ, ఆయన పోటీ చేయబోనని చెప్పడంతోనే  కొందరు మిత్రుల కోరిక మేరకు రాజేంద్రప్రసాద్ ముందుకొచ్చారని, పెద్దలందరినీ కలసి మద్దతు తీసుకున్నారని నాగబాబు వివరించారు. నామినేషన్లు ముగిసేరోజున.. జయసుధ తదితరుల నామినేషన్లు వచ్చినట్లు ఆరోపించారు. పోటీ చేయబోనని చెప్పిన మురళీమోహన్... రాజేంద్రప్రసాద్ పోటీకి దిగిన తర్వాత ‘ఆ పదవికి తగ్గ స్థాయి రాజేంద్రప్రసాద్‌కు లేద’ని తనతో వ్యాఖ్యానించినట్లు నాగబాబు చెప్పారు. అలాగే, గతంలో ఉన్న ‘అసోసియేట్ మెంబర్‌షిప్’ను తొలగించి వర్ధమాన కళాకారులకు అసోసియేషన్‌ను దూరం చేశారని మురళీమోహన్‌పై మండిపడ్డారు. ‘నాగబాబు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 38 మంది పేద కళాకారులకు నెలకు రూ.1,000 ఇచ్చేవాళ్లం. ఇప్పుడవన్నీ తీసేసి, ఒక్కరికే ఇస్తున్నారు. కోట్ల నిధి ఉన్న ‘మా’కు ఇదేం కర్మ? అదేమంటే, అవన్నీ తీసేశామని మా లాంటి చిన్నవాళ్ల మీద కన్నెర్ర చేస్తున్నారు’ అని కాదంబరి కిరణ్ వాపోయారు.

(Published in 'Sakshi' daily, 26th March 2014, Thursday- in Main Page)
.................................................