జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, January 25, 2015

పేరడీ కామెడీలో సునామీ - ఎమ్మెస్

పేరడీ కామెడీలో సునామీ
హిట్టయిన పాత్రలు, నిజజీవిత మనుషులను వెండితెరపై అనుకరించడంలో అగ్రశ్రేణి నటుడు - ఎమ్మెస్. ఆ సినిమాలు ఇవాళ్టికీ టీవీ చానళ్ళలో వాటి ఒరిజినల్ హీరోలనూ, గెటప్‌లనూ గుర్తు చేస్తూ కామెడీ పండిస్తున్నాయి. ‘ఒట్టేసి చెబుతున్నా’లో ఫ్యాక్షన్ చిత్రాల హీరోలకు పేరడీగా రెడ్డినాయుడు (రెనా) పాత్రలో నవ్వించారు. ‘బాద్షా’లో హార్రర్ చిత్రాల రివెంజ్ నాగేశ్వరరావుగా ఒక ప్రముఖ దర్శకుణ్ణి గుర్తుకు తెస్తూ, పదే పదే ట్వీట్లు చేసే పాత్రను పండించారు.
‘దుబాయ్ శీను’లో నటుడు ఫైర్‌స్టార్ సాల్మన్‌రాజుగా నిన్నటి తరం అగ్రహీరో ఒకరిని అనుకరిస్తూ ఆయన చేసిన గోడ మీద పిడకల స్టెప్పు, డైలాగ్ మాడ్యులేషన్ తెగ నవ్వించాయి. ‘దూకుడు’లో పోషించిన బొక్కా వెంకటరత్నం పాత్ర రిపీట్ ఆడియన్స్‌ను రప్పించింది. దాంతో ఎమ్మెస్ పేరడీ కామెడీలో స్టార్ హీరో అయ్యారు.

...............................

నీ దూకుడు సాటెవ్వరూ..! ( నటుడు ఎమ్మెస్ నారాయణకు శ్రద్ధాంజలి!)

నీ దూకుడు సాటెవ్వరూ..!
‘ఈ నగరానికి ఏమైంది? ఒక వైపు నుసి... ఒక వైపు పొగ...’ తెలుగునాట థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసేవారందరికీ సుపరిచితమైన ధూమపాన వ్యతిరేక ప్రచార ప్రకటన ఇది. ఇప్పుడు ప్రేక్షకులతో పాటు తెలుగు సినీపరిశ్రమ వర్గీయులందరి మదినీ తొలిచివేస్తున్న ప్రశ్న - ‘ఈ చలనచిత్ర సీమకు ఏమైంది? దాదాపుగా వారానికి ఒకరుగా వెంట వెంటనే ఎంతోమంది ప్రముఖులను పోగొట్టుకుంటున్నాం’ అని! సంగీత దర్శకుడు  చక్రి , దర్శకుడు కె. బాలచందర్, రచయిత గణేశ్ పాత్రో, నటుడు ‘ఆహుతి’ ప్రసాద్, నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్... ఇప్పుడు నటుడు ఎమ్మెస్ నారాయణ... నిండా నెలరోజుల్లోనే ఆరుగురు ప్రముఖులు దూరమయ్యారు.
సంక్రాంతి సందర్భంగా సొంత ఊరు వెళ్ళి, అక్కడ తీవ్ర అనారోగ్యం పాలైన ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూయడంతో - ఈ చలనచిత్ర నగరానికి ఏ శాపం తగిలిందంటూ అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కెరీర్‌లోనే కాదు... ఆఖరికి  కన్నుమూయడంలోనూ తొందరపడి దూకుడు ప్రదర్శించిన ఎమ్మెస్ మరణంతో కామెడీ కన్నీళ్ళు పెడుతోంది.
 
‘‘నువ్వు హీరోవంటే ఎలా నమ్మావ్ రా కళ్ల కింద క్యారీ బ్యాగ్‌లు వేసుకుని’’ అని బ్రహ్మానందం అంటే ‘‘గ్రాఫిక్స్‌లో తీసేస్తారేమో అనుకున్నా’’అని అమాయకంగా చెప్పి, ‘దూకుడు’ చిత్రంలో కడుపుబ్బ నవ్వించిన  కామెడీ యాక్టర్ ఎమ్మెస్ నారాయణ ఉరఫ్ మైలవరపు సూర్యనారాయణ.

సమకాలీన నటుల్లో తాగుబోతు క్యారెక్టర్లకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన నటుడు ఎమ్మెస్ ఇలా తెరపై పూయించిన నవ్వులు ఎన్నో. ‘‘నిద్రపోయేటప్పుడే విశ్రాంతి తీసుకో... మెలకువగా ఉండి పడుకోవద్దు ’’ అని తండ్రి చెప్పిన సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న ఒకప్పటి లెక్చరర్ సినీ రచయితగా ప్రారంభించి, నటుడిగా నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 1951 ఏప్రిల్ 16న పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో పుట్టిన ఎమ్మెస్ వ్యవసాయ కుటుంబీకులు.
 
తెలుగంటే మక్కువ...
తెలుగంటే ఎంతో ఇష్టమున్న ఎమ్మెస్ ‘భాషా ప్రవీణ ’ కోర్సులో చేరారు. అది పాసయ్యాక దగ్గర్లోని ఊళ్లోని ఓ హైస్కూల్‌లో తెలుగు పండి ట్‌గా పనిచేశారు. చదువుకొనే రోజుల్లోనే 1971లో తమ కాలేజీ లెక్చరర్ పరుచూరి గోపాలకృష్ణ రాసిన ‘సోషలిజం’ అనే నాటకంలో కథానాయకుడిగా నటించారు. పెన్నుతోనూ ప్రాణాలు కాపాడవచ్చన్న ఒకే ఒక్క ఆశయంతో 1977నాటి  దివిసీమ ఉప్పెన  బాధితులను ఆదుకోవడానికి  ‘జీవచ్ఛవం’ అనే నాటిక రాసి, స్కూల్ పిల్లలతో వేయించారు.

అలా చందాలు పోగుచేసి తన వంతు సాయం చేసిన ఉదార మనస్తత్త్వం ఎమ్మెస్‌ది. ఆ తరువాత ఆయన భీమవరం కాలేజీలో లెక్చరర్‌గా చేశారు. అక్కడ విద్యార్థులతో వేయించిన నాటకాలకు ప్రైజులు కూడా రావడంతో మంచి పేరు వచ్చింది.  ‘‘మా నారాయణ మాస్టార్’’  అనిపించుకుని అభిమానానికి పాత్రుడయ్యారు.

భార్య ప్రోత్సాహంతో సినిమాల్లోకి....

ఉద్యోగం చేస్తుండగానే కథలు రాయడం మొదలుపెట్టారు. భార్య కళాప్రపూర్ణ ప్రోత్సాహంతో శనివారాలు సర్కారు ఎక్స్‌ప్రెస్ ఎక్కి మద్రాసు వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు.  కానీ ఫలితం లేకపోయే సరికి ఉద్యోగానికి ‘లాస్ ఆఫ్ పే’ పెట్టి మద్రాసులోనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సమయంలోనే ‘పేకాట పాపారావు’, ‘హలో నీకు పెళ్లంట’,‘ ప్రయత్నం’, ‘అలెగ్జాండర్’ చిత్రాలకు కథలందించారు. ఎమ్మెస్ ఒకేరోజు ఏడుసార్లు కథ చెప్పిన రోజులున్నాయి.  
 
సీరియల్ రైటర్‌గా..
మేకప్‌మేన్ జాస్తి మాధవరావు టీవీ సీరియల్‌కు కథ రాసే అవకాశం వచ్చింది. వెంటనే ఒప్పుకొని ‘నారీమణిహారం’ పేరుతో స్త్రీ జీవితంలోని ముఖ్యఘట్టాలను 13 ఎపిసోడ్లుగా రాసి ఇచ్చారు. ఎమ్మెస్ ప్రతిభ చూసి ముచ్చటపడిన మాధవరావు ఆయనను నటుడు మురళీమోహన్‌కు పరిచయం చేశారు. ఆయన ఓ ఎపిపోడ్ కథ విని ఎమ్మెస్‌కు వెంటనే చాన్స్ ఇచ్చారు. కానీ అప్పుడే తండ్రి చనిపోవడం ఎమ్మెస్ జీవితంలో పెద్ద విషాదం.

తరువాత మళ్ళీ మద్రాసు వెళుతూ, రాత్రి సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో రాసుకున్న ‘సవ్యసాచి’ కథ మురళీమోహన్‌కి వినిపించారు. ‘అది బాగా నచ్చింది కానీ, ఇంత మంచి కథకు నేను సరిపోను’ అని మురళీమోహన్ వెనక్కు తగ్గారు. అది రవిరాజా పినిశెట్టి చేతుల్లోకి వెళ్లింది. కానీ రవిరాజా ‘చంటి’ సినిమాతో బిజీ కావడంతో ‘సవ్యసాచి’ తెరకెక్కలేదు.
 
రవిరాజా పరిచయంతో...
ఎమ్మెస్ కథలు చెప్పే విధానం నచ్చడంతో దర్శకుడు రవిరాజా పినిశెట్టి ఆయనలో మంచి నటుడు దాగున్నాడని పసిగట్టారు. ‘ఎమ్. ధర్మరాజు ఎంఏ’లో చెవిటి వాడి పాత్రతో తొలి అవకాశమిచ్చారు. కాలక్రమంలో హాస్యనటుడిగా, ముఖ్యంగా తాగుబోతు పాత్రలకూ, పేరడీ రోల్స్‌కూ మారుపేరుగా నిలిచారు. ఆయన కామెడీకి వరుసగా ఐదు సార్లు (‘మా నాన్నకు పెళ్లి’ (1997), ‘రామసక్కనోడు’ (1999), ‘సర్దుకుపోదాం రండి’ (2000), ‘శివమణి’’ (2003), ‘దూకుడు’ (2011) చిత్రాలకు) నంది అవార్డులు అందుకున్నారు.

‘దూకుడు’ చిత్రానికే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. తాగుబోతు పాత్రలలో ఆయన నటించిన తీరు నిజంగా అద్భుతం. కెరీర్‌లోని 700కు పైగా చిత్రాల్లో సుమారు 200 సార్లు తాగుబోతు పాత్రలు పోషించి, ప్రతిసారీ మెప్పించారు. నవ్వించడమే కాక, గుండెలు పిండే పాత్రలతో కన్నీళ్లు కూడా పెట్టించారాయన. ‘పిల్ల జమిందార్’ చిత్రంలో తెలుగు మాస్టారు పాత్ర అందుకు ఒక మచ్చుతునక.
 
దర్శకుడిగా....
స్వయానా రచయిత, నటుడైన ఎమ్మెస్ దర్శకుడిగానూ ప్రయత్నించారు. ఏకైక కుమారుడు విక్రమ్ కుమార్ హీరోగా ‘కొడుకు’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం ఆయనను ఆర్థికంగా బాగా దెబ్బతీసింది. ఆ తరువాత శివాజీ నటించిన ‘భజంత్రీలు’ అనే మరో చిత్రానికీ దర్శకత్వం వహించారు. ఆయన కుమార్తె శశికిరణ్ సైతం ఇటీవలే ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకురాలయ్యారు.

పిల్లలు స్థిరపడాలంటూ చివరి వరకు ఆయన పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. అయితే, అలవాట్ల విషయంలో అజాగ్రత్త, ఆరోగ్యంపై చూపిన అశ్రద్ధ ఎమ్మెస్‌ను అర్ధంతరంగా 63 ఏళ్లకే మింగేశాయి. తెలుగు తెరపై నవ్వులు పూయించిన ఈ తెలుగు మాస్టారి హఠాన్మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
విచిత్రం ఏమిటంటే, ఎమ్మెస్ కన్నుమూసిన శుక్రవారం ఉదయమే విడుదలైన ‘పటాస్’ చిత్రంలోనూ ఆయన ఒక పేరడీ హీరోగా నటిస్తే, ఆయన కుమారుడు విక్రమ్ దర్శకుడిగా తండ్రితో కలిసి ఒక షాట్‌లో కనిపిస్తారు. ఆ చిత్రం క్లైమాక్స్‌లో ‘సునామీ స్టార్ సుభాష్’ పాత్రలో ఎమ్మెస్ నారాయణ యాదృచ్ఛికంగా చెప్పిన ఆఖరి డైలాగ్ కూడా ‘ఈ నగరానికి ఏమైంది?...’ అన్నదే! చనిపోయిన రోజు కూడా థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిన ఆ హాస్య సంజీవికి చెమర్చిన కళ్ళతో శ్రద్ధాంజలి!

- రెంటాల జయదేవ 

(published in 'Sakhi' daily, 24th Jan 2015, Saturday)
........................................

అక్కినేనికి ‘నటసామ్రాట్’బిరుదు అలా ఇచ్చాం! - సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు

నేడు (22nd Jan 2015) అక్కినేని ప్రథమ వర్ధంతి

‘నటసామ్రాట్’బిరుదు అలా ఇచ్చాం!


 ఎంతలో తిరిగివచ్చింది ఏడాది! ‘నట సామ్రాట్’ అక్కినేని మనల్ని విడనాడి దివికేగి సంవత్సరమైందా? ఆయన మన మధ్య ఉన్నట్టు, ఇంకా హైదరాబాద్ రవీంద్రభారతిలో సభలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నదే! అందులోనూ ఆయన పార్థివ శరీరాన్ని చూడని నాకు ఆయన తన అభిమానులతో తన అనుభవాల గురించి ముచ్చటిస్తున్నట్టే అనిపిస్తున్నది! అక్కినేని నాగేశ్వరరావు జీవితం బహువిచిత్రమైనది. అదొక అద్భుత గాథ. వ్యక్తిత్వ వికాస విద్యార్థులకు ఆదర్శ పాఠ్యగ్రంథం!
 
 లేకపోతే, ఒక సాధారణ రైతు కుమారుడు అలభ్యమైన అప్పటి మద్రాసులో చిత్రజగత్తుకు వెళ్లడమేమిటి? అక్కడ హీరోలకు హీరో కావడమేమిటి? నాల్గవ తరగతి కూడా సరిగ్గా చదవని ఆ అబ్బాయి అమెరికా ప్రభుత్వం ఆహ్వానంపై అమెరికా వెళ్లడమా? చివరికి ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’లు ఆయన నట జీవితాన్ని అలంకరించడమా? అందువల్లనే, అక్కినేనిది అద్భుత చరిత్ర; ఆయన బాల్య జీవితాన్ని పరిశీలిస్తే, ప్రపంచ ప్రఖ్యాతులైన పెక్కుమంది
 
 మహామహుల బాల్య జీవితంలో కానవచ్చే విశేషాలే కానవస్తాయి! తల్లిదండ్రులకు అక్కినేని కడగొట్టు సంతానం. పుట్టిన వారి వరుసలో ఆయన తొమ్మిదవవాడు! ఆయనకు ముందు పుట్టిన బేసి సంఖ్య పిల్లలు పోవడం వల్ల ఈ తొమ్మిదో వాడేం జీవిస్తాడని అందరూ ఆశ వదులుకున్నారు!
 
 గండాలమారి
 దానికి తగ్గట్టే ఆ పిల్లవాడికి మెడపై కణితి లేవడం ప్రారంభించింది! ఇంకేమున్నది? ఇక లాభం లేదని వైద్యం కూడా మానేశారు. కాని, ఆ గొంతు లక్షలాది ఆంధ్ర ప్రేక్షకుల హృదయాలను భవిష్యత్తులో ఉర్రూత లూగించడం విధి విలాసమైతే, ఆ కణితి ఏమి చేస్తుంది? మందు లేకుండానే అది మానిపోయింది! చిన్నప్పుడు ఆయనకు జలగండం, అగ్ని గండం తప్పాయి. గండాలన్నీ గడిచి అక్కినేని వారి అబ్బాయి గట్టెక్కాడు!
 
 పున్నమ్మ గారికి ఆడపిల్లలు లేరు. ఈ అబ్బాయినే అమ్మాయిగా చూసుకుని సంతోషించాలని అతనికి ఆడపిల్లవలె జడవేసేది, పరికిణీలు తొడిగేది! మరి, వేష భాషలే కదా మనిషిని మార్చివేసేది! అమ్మాయి వేషం వేసే సరికి అబ్బాయి గారికి అమ్మాయిల వలె కులకడం, నడవడం అలవాటయింది. అందువల్ల, నాటకాలలో ఆడ వేషాలు వేయడం నాగేశ్వరరావుకు చిన్నప్పుడే అబ్బింది! తల్లి ఆరోగ్యం సరిగా లేనందున, ఆమెకు వంట, మిగిలిన ఇంటి పని చేసిపెట్టి, బడికి వెళ్లి చదువుకుంటూ, అది అయిన తరువాత మైలు దూరంలో ఉన్న నాటకాల రిహార్సల్ స్థలానికి వెళ్లేవాడు. ఆయన ఆడవేషం, ఆ తళుకు, ఆ బెళుకు, ఆ కులుకు చూసి కొందరు ఆ పాత్రధారి నిజంగా అమ్మాయే అనుకునేవారట! అప్పుడు ఆయన పారితోషికం మూడు రూపాయలు!
 
 ఒకసారి తెనాలిలో నాటకం వేసి, విజయవాడ మీదుగా గుడివాడ వెళదామని విజయవాడ రైలు స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్న నాగేశ్వరరావును ‘ప్రతిభా పిక్చర్స్’ ఘంటసాల బలరామయ్య చూశారు! అప్పుడు తాను తీస్తున్న ‘శ్రీ సీతారామ జననం’లో శ్రీరాముడు వేషానికి ఈ కుర్రవాడు సరిపోయేట్టు ఉన్నాడని భావించి, అక్కినేని అన్నగారితో మాట్లాడి, ఆ తరువాత ఆ ఆడపాత్రధారి చేత తన చిత్రంలో మొదటిసారిగా మగ పాత్రను వేయించారు! అక్కడి నుంచి అక్కినేని వెనుదిరిగి చూడలేదు. ఇది 1944 నాటి మాట. అప్పటికి నాగేశ్వరరావు వయస్సు 19 సంవత్సరాలు. ఇక అప్పటి జానపద చిత్రాల యుగంలో ఈ నవ యువకుడే అమ్మాయిల కలల రాకుమారుడు! అలా ఆనాటి జానపద చిత్రాలలో నాగేశ్వరరావు ‘హీరో నాగేశ్వరరావు’ అయ్యాడు!

 
 అక్కినేని ‘దేవదాసు’కు అర్హుడా?
 1952లో వినోదా పిక్చర్స్ వారు బెంగాలీ నవల ‘దేవదాసు’ను తెలుగులో చిత్రించదలచి అక్కినేనిని కథానాయకుడుగా నిర్ణయించి, ప్రకటించేసరికి చాలామందికి ఆశ్చర్యం కలిగింది! జానపద చిత్రాల రాకుమారుడు ఆ తాగుబోతు పాత్రకు ఏమి పనికి వస్తాడన్న విమర్శలు బయలుదేరాయి! అప్పటిలో - 1952లో - నేను ‘ప్రతిభ’ అనే తెలుగు వారపత్రికకు ఎడిటర్‌గా పని చేస్తున్నాను. ‘‘అక్కినేని దేవదాసు పాత్రకు అర్హుడా?’’ అన్న శీర్షికతో నేను నా పత్రికలో ఒక వ్యాసం రాశా. అది నాగేశ్వరరావు దృష్టికి వెళ్లింది! 1953లో ఆ చిత్రం విడుదలై, యావదాంధ్ర దేశంలో నాగేశ్వరరావు ‘దేవదాసు’ పాత్రను గురించి జనం వింతగా చర్చించుకుంటున్నారు. విజయవాడలో నాగేశ్వరరావుకు అప్పుడే సన్మానం జరిగింది. ఆ సన్మానానికి నేను కూడా వెళ్లాను. సభానంతరం అక్కినేని నా వద్దకు వచ్చి, ‘‘ఏమండీ! ‘దేవదాసు’ పాత్రకు నేను అర్హుడినా? అనర్హుడినా?’’ అని చిరునవ్వుతో అడిగేసరికి నేను కొంచెం బిడియంతో ‘‘హ్యాట్సాఫ్ టు యు’’ అని అభినందించేసరికి ఆయన ముఖంలో ఆనందం వెల్లివిరిసింది!
 
 అక్కినేనికి ముఖస్తుతి పనికిరాదు. సద్విమర్శనే ఆయన ఆహ్వానించేవారు. ‘దేవదాసు’కు తాను పనికిరానన్న విమర్శను పెద్ద సవాల్‌గా తీసుకుని, ఆ పాత్రలో మెప్పు పొందడానికి తాను అహోరాత్రులు తపనపడ్డానని ఆయన నాతో అన్నారు. ఆ తరువాత దాదాపు పది సంవత్సరాల అనంతరం నేను లక్నోలో ‘హిందీ సినీ లెజెండ్’ దిలీప్‌కుమార్‌ను కలుసుకున్నప్పుడు ఆయన ‘దేవదాసు’ పాత్రను అభినందించారు. ఆయనకు ‘ట్రాజెడీ కింగ్’ అని బిరుదు. ‘నా కంటే మీ నాగేశ్వరరావే బాగా నటించారు’’అని దిలీప్ అన్నారు.
 
 అలాగే ‘కన్నడ కంఠీరవ’ రాజ్‌కుమార్ కూడా అదే మాట అన్నారు. మొత్తం మీద ‘దేవదాసు’ పాత్రను సైడల్, బారువా, దిలీప్, షారుక్‌ఖాన్ మొదలైన మహానటులు ఎందరు పోషించినా, అక్కినేని ‘దేవదాసు’కు ఆయనే సాటి!ఆ తరువాత ఆయన నట జీవితంలో 60వ చిత్రం ‘దొంగల్లో దొర’ 1957 జూలై 19న విడుదలైంది. అది అక్కినేని నట జీవిత వజ్రోత్సవం. ఆ సందర్భంగా ఆయనను సినీ జీవితంలోకి పంపిన విజయవాడలో ఆయనకు భారీ ఎత్తున సన్మానాన్ని తలపెట్టాము. ఎలా సన్మానించాలన్న సమస్య వచ్చినప్పుడు అక్కినేనికి దీటైన సాంఘిక చిత్రాల హీరో లేడని, ఆయనకు ‘నటసామ్రాట్’ అన్ని బిరుదు అన్ని విధాల తగినదని నేను సూచించినప్పుడు ఆహ్వాన సంఘం వారు అంగీకరించారు.
 
 అక్కినేని ఎత్తిపొడుపు!
 1957లో ఆగస్టులో విజయవాడలో జరిగిన అక్కినేని సన్మాన సభలో ‘నటసామ్రాట్’ బిరుదు ఇస్తూ, సన్మాన పత్రం రాసిన నేనే దాన్ని చదివి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బెజవాడ గోపాలరెడ్డితో కలిసి, అక్కినేనికి సమర్పించగా, ఆయన ‘‘ ‘నేను నటసామ్రాట్’ బిరుదుకు తగినవాడినంటారా?’’ అంటూ నా వంకకు తిరిగి నవ్వుతూ అన్నారు. నవ్వడం నా వంతు, ఏమిటో తెలియక ఆశ్చర్యపోవడం గోపాలరెడ్డిగారి వంతు అయింది! ఆ తరువాత ఆయనకు ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’ - ఎన్ని అవార్డులు వచ్చినా, ‘నట సామ్రాట్’కు చాలిన బిరుదు లేదని ఆయన చాలా సందర్భాల్లో అంటూ వచ్చారు.
 
 చివరికి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అక్కినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పుడు ఆయనను అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి కూడా ‘నటసామ్రాట్ నాగేశ్వరరావుజీ’ అని సంబోధించారు!ఔను! నటసామ్రాట్ అంటే నాగేశ్వరరావు! నాగేశ్వరరావు అంటే నటసామ్రాట్! అందువల్లనే, తనకు ఆ బిరుదు వచ్చి, 50 ఏళ్లు అయిన సందర్భంగా 2007లో అక్కినేని నన్ను హైదరాబాద్ ఆహ్వానించి, నాకు స్వర్ణకంకణం తొడిగారు! ‘నటసామ్రాట్’ అంటే అక్కినేనికి అంత ప్రియతమ బిరుదు!


తుర్లపాటి కుటుంబరావు

(సీనియర్ జర్నలిస్ట్)         

(Published in 'sakshi' daily, 22nd Jan 2015, Thursday)
...................................

Friday, January 23, 2015

అప్పుడాయన కళ్లెర్రజేసి ఉంటే...నా పరిస్థితి ఏమయ్యేదో! - రావి కొండలరావు


సినిమా ప్రపంచంలో పాత్ర పరంగా కాకుండా వ్యక్తిగతంగా కొందరు ఆలోచిస్తారు. ఒక పాత్ర ఇంకో పాత్రని దూషిస్తే రెండో పాత్రధారి, మొదటి పాత్రధారిని ఉద్దేశించి ‘‘అతనెవడు నన్ను తిట్టడానికి?’’ అని అడిగిన సందర్భాలున్నాయి. రాజ్యం పిక్చర్స్ ‘హరిశ్చంద్ర’లో యస్.వి. రంగారావు- హరిశ్చంద్రుడు, గుమ్మడి -విశ్వామిత్రుడు. ఒక దృశ్యంలో విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడు తన ముందు మోకరిల్లి ఉండగా, తలను కాలితో తన్నాలి. రంగారావు ఒప్పుకోలేదు. ‘‘గుమ్మడెవరు నన్ను తన్నడానికి?’’ అని అంగీకరించపోతే, ‘డూప్’ షాట్ తీసుకున్నారు. ‘ప్రేమించి చూడు’లో రేలంగిని, అల్లు రామలింగయ్య ‘బావా’ అనాలి - దృశ్యపరంగా. రేలంగి ఒప్పుకోలేదు. అలిగి కూచుంటే దర్శకుడు పి. పుల్లయ్య బుజ్జగించారు. ఇలాంటివి ఇంకా ఎన్నో కనిపిస్తాయి. ‘ప్రేమించి చూడు’లో నేను, అక్కినేని వారికి (హీరో) తండ్రిని.

  పదిమంది నా గురించి చెప్పి.. చెప్పి.. చెబితేగాని, దర్శకుడు పి. పుల్లయ్యగారు ఆ వేషం నాకివ్వలేదు. ఆ భయం ఉంది వేషం మొదలు పెడుతున్నప్పుడు. పైగా, మొట్టమొదటి రోజు నా షూటింగు, నాగేశ్వరరావుగారిని తిట్టడంతో ఆరంభం! ‘‘ఒరే గాడిదా, ఎక్కడ తిరుగుతున్నావురా?’’ అని డైలాగు ఆరంభం. ఒళ్లు వణుకు, గుండె దడ. నాగేశ్వరరావు గారు నాకు బాగా తెలుసు గాని, ఆయనతో నటించడం అదే మొదలు. పైగా దృశ్యంలో గుమ్మడి, జగ్గయ్య, రేలంగి కూడా ఉన్నారు. ‘‘ఈ రావి కొండలరావు నన్ను గాడిదా అని తిడతాడా? అసలు ఈ వేషం ఇతనికెందుకు ఇచ్చారు?’’ అని అక్కినేని, కళ్లెర్రజేస్తే? అమ్మో! ‘‘రిహార్సల్ - రావయ్యా కొండల్రావు చెప్పు డైలాగ్’’ అని పుల్లయ్యగారు అరుస్తున్నారు. నా పక్కనే ఉన్న సహాయ దర్శకుల దగ్గర నెమ్మదిగా మొర పెట్టుకుంటున్నాను.

  షాట్‌కి వెళ్లడం లేదు. ‘‘ఏం జరుగుతోందక్కడ? ఏమిటాలస్యం?’’ అని హీరోగారూ ఓ కేక వేశారు. సహాయకులు వెళ్లి అక్కినేనికి వివరించారు - నాలో జరుగుతున్న ఘర్షణ. ‘రండి - రండి ఇలా’ అని పిలిచారు హీరో. నెమ్మదిగా వెళ్లాను. ‘‘ఏమిటి? ఏమిటా సందేహం?... ఎవర్ని తిడుతున్నారు మీరు? నన్నా? మీ కొడుకునా?... తన కొడుకుని, తండ్రి ‘గాడిదా’ అని తిడుతున్నాడు. అంతేగాని, అక్కినేని నాగేశ్వరరావుని, రావి కొండలరావు ‘గాడిద’ అనడం లేదు కదా. ఆలోచిస్తారేమిటండీ - విజృంభించండి. రండి’’ అని భుజం తట్టి ప్రోత్సహించారు.

  అంతే. రిహార్సల్‌లో దంచాను. టేక్‌లోనూ మార్కులు కొట్టాను. అదీ - అక్కినేని ప్రోత్సాహం! తక్కిన కొందరు పెద్ద తారలు అన్నట్టుగా ‘వీడెవడు నన్ను గాడిదా’ అనడానికి అని, ఆయన ఒక్క మాట అని ఉంటే - నేను సినిమాల్లో నిలదొక్కుకోగలగడానికి కారణమైన ఆ పాత్ర పోయేది. అసలు నా సినిమా జీవితం- నటుడిగా - అక్కడే ఆగిపోయేది! ఆయన ముఖ్య నటుడు. ఏం చెబితే అది జరుగుతుంది. కానీ ఆయన పాత్రపరంగా ఆలోచించారే గాని, వ్యక్తిగతంగా ఆలోచించలేదు. ఎంతటి పెద్ద మనసు! నాలాగా ఎంతోమంది కొత్తవారికి ఇచ్చిన ప్రోత్సాహం విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇది నేను మరచిపోలేను!     
     
- రావి కొండలరావు
సీనియర్ నటుడు, జర్నలిస్ట్  

................................

Monday, January 19, 2015

సమస్యలను ఎదుర్కొనే కిటుకు అదే! - - స్వామి జ్ఞానదానంద, ‘రామకృష్ణ మఠం’ హైదరాబాద్ అధ్యక్షులు

సమస్యలను ఎదుర్కొనే కిటుకు అదే!

‘‘ఇనుప నరాలు, ఉక్కు కండరాలున్న యువకులు వంద మందిని నాకు ఇస్తే, ఈ దేశాన్నే మార్చేస్తాను!’’ అన్న ద్రష్ట స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి మొత్తం యువతీ యువకుల చేతుల్లోనే ఉందని నూరేళ్ళ క్రితమే గుర్తించి, ఆ సంగతిని అప్పుడే బాహాటంగా చాటిన దార్శనికత ఆయనది. నేడు స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా రామకృష్ణ మఠం హైదరాబాద్ అధ్యక్షులు స్వామి జ్ఞానదానందతో సాక్షి సంభాషణ...

- స్వామి జ్ఞానదానంద,  ‘రామకృష్ణ మఠం’ హైదరాబాద్ అధ్యక్షులు

దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితం అమెరికా నుంచి స్వామి వివేకానంద తన సోదర శిష్యులకు ఉత్తరం రాస్తూ, ‘‘కిన్నామ రోదసి... న జడః కదాచిత్‌॥అని పేర్కొన్నారు. అంటే, ‘ఓ మిత్రమా! నువ్వెందుకు విలపిస్తున్నావు? సమస్త శక్తీ నీలోనే ఉంది. ఓ శక్తిశాలీ! నీ సర్వశక్తి స్వభావాన్ని వెలికి తీసుకురా! ఈ లోకం సమస్తం నీకు పాదాక్రాంతమవుతుంది’ అని! ముఖ్యంగా, యువతరం ఈ సంగతిని గుర్తుంచుకోవాలి. దేనికీ దిగాలుపడకుండా, నిరాశలో కూరుకుపోకుండా మనలోని దైవిక స్వభావాన్ని గుర్తు చేసుకోవాలి. మనం సామాన్యులం కాదనే స్పృహతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చు.

ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలను‘నువ్వెందుకూ పనికిరావు. శుద్ధదండగ... ‘నువ్వు పాపివి! నిష్ర్పయోజకుడివి’ అని పదే పదే అనడం వల్ల చివరకు వారు అలానే తయారవుతారు. అలా కాకుండా, సానుకూల దృక్పథంతో ప్రోత్సహిస్తే - పైకి వస్తారు! యువతరం ఇప్పుడు నిద్రాణ స్థితిలో ఉంది. కమ్ముకున్న తెరలను చీల్చుకొని, నిద్రావస్థ నుంచి వాళ్ళు మేల్కొనాలి. తమలోని శక్తిని గ్రహించి, తమ లోపలే ఉన్న ఆ మహాపురుషుణ్ణి దర్శించాలి. అలా తమ అసలు సిసలు ఆత్మ స్వభావాన్ని గ్రహించి, తమ ఔన్నత్యాన్ని తెలుసుకుంటే చాలు - అన్నిటా విజయం వరిస్తుంది.  ‘లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి!’ అని స్వామి వివేకానంద పదే పదే గుర్తు చేసింది అందుకే!

మన ఆత్మస్వభావం తెలుసుకోకపోతే - ఎలా తయారవుతామనడానికి ఒక కథ ఉంది. అనగనగా ఒక గొర్రెల కాపరి. ఒకసారి నిండు గర్భిణి అయిన ఒక ఆడసింహం అతని గొర్రెల మంద మీద పడింది. ఆ గందరగోళంలో ఆ సింహం మరొక సింహం పిల్లకు జన్మనిచ్చి, మరణించింది. గొర్రెల కాపరి దగ్గర, ఆ మందలో ఒక గొర్రెపిల్లగా, గడ్డి తింటూ, గొర్రెస్వభావంతో పెరిగిందా - గొర్రెసింహం. తీరా ఒకసారి ఒక సింహం దాడికి వచ్చినప్పుడు, గొర్రెల్లో ఒకదానిలా భయపడిపోతున్న ఈ గొర్రెసింహాన్ని చూసి, తీసుకెళ్ళి, బావిలోని నీటిలో ప్రతిబింబం చూపి, దాని స్వభావాన్ని ఎరుకపరిచింది. అప్పటి నుంచి ఆ పిల్ల సింహం మరుగునపడ్డ తన స్వభావాన్ని గ్రహించి, గర్జన చేసింది. ఈ కథలో ఈ పిల్ల సింహం మనమైతే, మనకు మన నిజ స్వభావాన్ని తెలియజెప్పే పెద్ద సింహం - స్వామి వివేకానంద. ఇవాళ్టికీ స్వామీజీ బోధనల్ని చదివి, తమకు తాము బోధించుకొని, ఆచరణలో పెడితే యువకులు సింహాలై గర్జిస్తారు. వారి వ్యక్తిత్వమే పూర్తిగా మారిపోతుంది.

దురదృష్టవశాత్తూ ఇవాళ్టి సమాజంలో జనం తమలో దైవత్వం ఉందనీ, తాము అమృతపుత్రులమనీ విస్మరిస్తున్నారు. సమస్యలొస్తే - దైర్యంగా ఎదుర్కోవడం లేదు. దూరంగా పారిపోతున్నారు. తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు.  కానీ, దాని వల్ల లాభం లేదు. పారిపోయే కొద్దీ సమస్యలు ఇంకా బలపోతమవుతాయి. వెంటాడతాయి. వేధిస్తాయి. మనం బలహీనమైపోతాం. అలాకాక, ధైర్యంగా ఎదుర్కొంటే,  సమస్యలు బలహీనమై, పారిపోతాయి. అదే అసలు కిటుకు!

చదువంటే మార్కులు, ర్యాంకుల పంటలే కాదు...  మనిషి శీల నిర్మాణ విద్య. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ మనిషిలో మానసిక బలాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ, నిర్భీతినీ పెంపొందించాలి. అలాంటివి బోధించడానికే, రామకృష్ణ మఠం శాఖలు కృషి చేస్తున్నాయి. హైదరాబాద్ శాఖలో ఏటా దేశం నలుమూలల నుంచి వచ్చిన యువతీ యువకులతో ‘యువజన సమ్మేళనం’ జరుపుతున్నాం. అలాగే, ‘హౌ టు ఓవర్‌కమ్ టెన్షన్ అండ్ వర్రీ’, ‘హౌ టు ఓవర్‌కమ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్’ లాంటి అంశాలపై తరచూ క్లాసులు, సెమినార్లు, ఉపన్యాసాలు నిర్వహిస్తున్నాం. వాటివల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడడం స్వయంగా చూస్తున్నాం.

ఒక్కముక్కలో చెప్పాలంటే - స్వామీజీ ఆ రోజుల్లోనే అన్నట్లు - యువతరానికి ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం. అది ఉంటే చాలు - మిగిలినవన్నీ జీవితంలో సాధించుకోగలుగుతారు. మరి, అలా మన మీద మనకు నమ్మకం కలిగించే బోధనలంటే - ఈ తరానికి స్వామి వివేకానంద బోధనల వినా మరో మార్గం లేదు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఏటా జరుపుకొనే ఈ జాతీయ యువజన దినోత్సవం నాడు మరోసారి ఆయన మాటలను పునశ్చరణ చేసుకుందాం. ఆ మాటలను ఆచరణలో పెట్టి, నవ భారత నిర్మాణానికి నడుం కడదాం!! సర్వం శ్రీ రామకృష్ణార్పణమస్తు

- రెంటాల  జయదేవ

(Published in 'Sakshi' daily, 12th Jan 2015, Monday)
.....................................

Sunday, January 18, 2015

‘జగపతి’వారి టాప్ 5 మూవీస్

 ఆరాధన (1962): సక్సెస్‌ఫుల్ ఎక్స్‌పెర్‌మెంట్
 చాలా రిస్కీ కథాంశమిది. సినిమా సగంలో కథానాయకుడు గుడ్డివాడవుతాడు. ఏయన్నార్‌లాంటి రొమాంటిక్ హీరోతో ఇలాంటి సినిమా చేయడమంటే సముద్రంలో ఈత కొట్టడంలాంటిదే. దర్శక, నిర్మాత బీఎన్ రెడ్డి సగం షూటింగ్ అయ్యాక రష్ చూసి ‘మీ ప్రయత్నం వృథా’ అని హెచ్చరించినా, వీబీ రాజేంద్రప్రసాద్ వెన్ను చూపలేదు. కథే శ్రీరామరక్ష అనుకున్నారు. ఆయన మొండితనం, సాహసం ఫలించింది. ‘ఆరాధన’ సినీ చరిత్రలో నిలిచిపోయింది. ‘నా హృదయంలో నిదురించే చెలి’, ‘ఆడదాని ఓరచూపులో’, ‘వెన్నెలలోని వికాసమే’ లాంటి గొప్ప గొప్ప పాటలు ఇందులోవే.
 
 ఆత్మబలం (1964): వండర్‌ఫుల్ థ్రిల్లర్
 ఒక్క పాటతో హిస్టరీలో నిలిచిపోవడం, హిస్టరీగా మారడం అంటే ఇదేనేమో! ఈ సినిమా పేరు చెప్పగానే ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ పాట గుర్తుకు రాకపోతే ఒట్టు. ఈ సినిమా లేకపోతే జగపతి సంస్థ లేదు. ‘ఆరాధన’ తర్వాత ప్రధాన భాగస్వామి చనిపోవడం, ఇతర భాగస్వాములు దూరమవడంతో ఒంటరైపోయారు వీబీ రాజేంద్రప్రసాద్. అయితే ఊరు తిరిగి వెళ్లిపోవాలి. లేకపోతే ఒంటరిగా సినీ సముద్రాన్ని ఈదాలి. వీబీ రాజేంద్రప్రసాద్ మొండివాడు. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలనుకున్నారు. అలా ‘ఆత్మబలం’ మొదలు పెట్టారు. హిట్టుకొట్టారు. ఇందులో ఏడు పాటలూ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి.
 
 అదృష్టవంతులు (1969): అడ్వాన్స్‌డ్ యాక్షన్
 ఏయన్నార్‌తో చేసిన యాక్షన్ సినిమా ఇది. మేకింగ్ చాలా అడ్వాన్డ్స్ థాట్స్‌తో ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్రెయిన్ ఫైట్ అయితే ఎక్స్‌లెంట్. గ్లామర్ హీరోయిన్ జయలలితతో మేల్ కేరెక్టర్ చేయించాలనుకోవడం తమాషా ఆలోచన. ఇందులో జగ్గయ్య విలన్‌గా చేశారు. ఆయన డెన్‌ని సీసీ టీవీలతో మోడ్రన్‌గా డిజైన్ చేయించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నాగార్జునకు ఈ సినిమాలో యాక్షన్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా విలన్ డెన్ సెటప్ ఆయనకు తెగ నచ్చేసింది.
 
 దసరా బుల్లోడు (1971): బాక్సాఫీస్‌కి న్యూ బ్లడ్
 ఈ సినిమాతో అనుకోకుండా దర్శకుడయ్యారు వీబీ రాజేంద్రప్రసాద్. ‘జగపతి’ సంస్థ ఆస్థాన దర్శకుడైన వి. మధుసూధనరావు బిజీగా ఉండటంతో తానే మెగాఫోన్ పట్టాల్సి వచ్చింది. తొలి షెడ్యూలు కృష్ణా జిల్లాలో తీస్తే, రష్ మొత్త పోయింది. మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా అంతా దాదాపుగా అవుడ్డోర్‌లోనే తీశారు. సినిమా సూపర్‌హిట్టయ్యింది.అక్కినేని స్టెప్పుల హవా మొదలైంది ఈ సినిమాతోనే. ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా’, ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్’ తదితర పాటల కోసం కుర్రకారు వేలంవెర్రిగా ఎగబడ్డారు. అక్కినేని-వాణిశ్రీ కాంబినేషన్, పాటలు, స్టెప్పులు, మాటలు, మాస్ ఎలిమెంట్స్, మేకింగ్ వేల్యూస్‌తో బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిసింది. ఈ సినిమా విజయంతో వీబీ రాజేంద్రప్రసాద్ విజృంభించి దర్శకునిగా 17 సినిమాలు తీశారు. ‘దసరాబుల్లోడు’ని హిందీలో జితేంద్ర, రేఖ, షబనా ఆజ్మీతో ‘రాస్తే ప్యార్’గా రీమేక్ చేసి విజయం సాధించారు.
 
 బంగారు బాబు (1973): గెస్ట్ మల్టీ స్టారర్
 ఓ సినిమా హీరోయిన్ పారిపోయి రహస్యంగా ఓ స్టేషన్ మాస్టర్ దగ్గర ఆశ్రయం పొందుతుంది. జీవితంలో కొంగొత్త రుచులేంటో చూస్తుంది. ఇదీ ‘బంగారు బాబు’ సినిమా కథ. అప్పట్లో ప్రేక్షకులకు చాలా కిక్కిచ్చిన కథ ఇది. ‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది’ అంటూ ఏయన్నార్, వాణిశ్రీ పాడిన డ్యూయెట్ ఇప్పటికీ రెపరెపలాడుతూనే ఉంటుంది. ప్రముఖ నటులు శివాజీ గణేశన్, రాజేష్‌ఖన్నా, కృష్ణ, శోభన్‌బాబులు గెస్ట్‌లుగా కనిపించడం అప్పట్లో నిజంగా గ్రేట్.
 

(Published in 'Sakshi' daily, 13th Jan 2015, Tuesday)
.............................................