జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, November 14, 2013

సస్పెన్స్ గా మిగిలిపోయిన 'సత్య-2'! (సినిమా సమీక్ష)

(''సత్య2'' సినిమాపై '10 టివి' ప్రసారం చేసిన సమీక్ష ఇది...)


'రామ్ గోపాల్ వర్మ'.. మన సినిమా ఇండస్ట్రీలో సంచలన కామెంట్స్ కు కేరాఫ్. తన సినిమా విడుదలకు సిద్ధంగా ఉందంటే చాలు.. దానికి సంబంధించి ఎదో ఒక వివాదంగాని, సంచలనాత్మకమైన కామెంట్స్ గానీ చేసి అందరి చూపు తన తనవైపు తిప్పుకుంటాడు. సినిమాను వివాదస్పదంగా మార్చి పబ్లిక్ సిటి చేసుకుంటాడు. అంతేకాదు.. వర్మ సినిమా చేస్తున్నాడంటే.. అటు బాలీవుడ్..ఇటు టాలీవుడ్.. సినిమాపై టాక్ క్రేజీ గా మారిపోతుంది. అతని సినిమా చూడడానికి చాలా మంది అతృతగా ఎదురు చూస్తుంటారు. ఎక్కువగా హారర్, మాఫియా అంటు వచ్చే వర్మ తన సినిమాల్లో ఎదో కొత్త చూపించే ప్రయత్నం చేస్తాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అలాంటి వర్మ.. ఒకప్పుడు సంచలనం సృష్టించిన 'సత్య'కు సీక్వెల్ గా 'సత్య-2' మూవీతో వస్తున్నాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదలయ్యింది. మరి వర్మ స్పెషల్ గా, భారీ అంచనాలతో విడుదలయిన ఈ చిత్ర ఫలితం ఎలా ఉందో.. చూద్దాం..


  కథ విషయానికి వస్తే:

పల్లెటూరు నుంచి ముంబై వచ్చిన ఓ కుర్రాడు సత్య(శర్వానంద్). అక్కడ
తన ప్రాణ స్నేహితుడైన నారా దగ్గర ఉంటాడు. జాబ్ కోసం వేతుకులాటలో భాగంగా..సత్య కొంతమంది
బిజినెస్ మాన్ లతో కలిసి కొత్త రకమైన మాఫియాని సృష్టించడం మొదలు పెడతాడు. "కంపెనీ" అనే పేరుతో
మొదలైన ఈ మాఫియా దేశం మొత్తం వ్యాపిస్తుంది. అదే సమయంలో ఈ కంపెనీ వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోడానికి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ని నియమిస్తుంది. అప్పటినుండి సత్య జీవితంలో అనుకోని సంఘటనలు
చోటు చేసుకుంటాయి. అప్పుడే సత్యకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అని తెలుస్తుంది .. సత్య జీవితంలో చోటు
చేసుకున్న ఆ సంఘటనలు ఏంటి ?
 సత్య పోలీస్ ల నుండి తప్పించుకున్నాడా..? లేదా..? అన్నది మిగతా కథ.


విశ్లేషణ:

   ''క్రైమ్ చావదు.. దాని రూపం మార్చుకుంటుందంతే'', ''ఆంధ్ర ప్రదేశ్ లో

 ఉన్న గుండాలు, రౌడీలు, ఫ్యాక్షనిస్టులు ప్రస్తుతం ఏం చేయడం లేదు
కాబట్టి ఓ కొత్త రకం క్రిమినల్ మనముందుకు వస్తున్నాడు'' అనే వర్మ
వాయిస్ ఓవర్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసింది.
అయితే ఇది చెప్పుకోవడానికి సీక్వెల్ మూవీనే అయినా.. తెలుగులో వచ్చిన మహేష్ 'బిజినెస్ మేన్' లా
అనిపించడంతో ప్రేక్షకులు కొత్త బోర్ గా ఫీలవుతారు.

అయితే.. దీనిలో కథ సింపుల్ గా ఉన్నా.. వర్మ టేకింగ్ మాత్రం చాలా రోజుల తర్వాత పర్వాలేదనిపించింది.
కానీ క్లైమాక్స్ ను సస్పెన్స్ తో ముగించడం ప్రేక్షకుడిలో అసంతృప్తిని మిగిల్చింది. వర్మ సినిమా అంటే ఓ
ప్రత్యేకత ఉంటుంది. అతని మార్క్ మూడ్ ను ఎలివేట్ చేసే ఆర్ ఆర్ ఈ సినిమాలో మరోసారి బాగా ఉపయోగించుకున్నాడు. కొన్ని చోట్ల సన్నివేశాలు ప్రశ్నగా మిగిలిపోతాయి. మాటలు బాగున్నాయి.

క్లైమాక్స్ సీన్స్ లో నిశ్శబ్ధం ఒక ఆసక్తిని క్రియేట్ చేసింది. వర్మ వాయిస్ ఓవర్ పర్వలేదనిపించింది.
కాకపోతే.. అదే పనిగా ఉండడం బోర్ ను తెప్పిస్తుంది. ఇక హీరో నేపథ్యం చూపించడంలో దర్శకుడు
నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సత్యకు సీక్వెల్ గా వచ్చినా.. దానికి.. దీనికి
ఎలాంటి  సంబంధం కనిపించదు. హీరో తను ఏది అనుకుంటే అది అయిపోతుంది. అతని చర్యలకు ప్రభుత్వం
నుంచి ఏలాంటి ప్రతిచర్యా కనిపించకపోవడం సెట్ కాలేదు. సత్య ల్యాప్ టాప్ లో రెండు సార్లు అటు ఇటు
అని ప్లాన్ లు చెప్పడం వంటి సీన్లు చాలా సిల్లీగా అనిపిస్తాయి.

ఇక ఈ చిత్రంలో నటీనటుల గురించి ఓ సారి చూస్తే..
సత్యగా నటించిన శర్వానంద్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నలిచాడు. కళ్లతో అతను పలికించిన భావాలే కథను నడిపించాయి. హీరోయిన్ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. కేవలం నామమాత్రంగానే మిగిలిపోయింది.

 శర్వానంద్ తప్ప మిగతా ఆర్టిస్టులంతా ఇతర భాషల వాళ్లే కావడం పెద్ద మైనస్. చాలా రోజుల తర్వాత
ఈ సినిమాతో వర్మ తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. అతను పాడిన పాట కూడా బాగుంది. కాకపోతే.. సినిమా అక్కడక్కడ అతుకులుగా అనిపిస్తుంది.

 'సత్య2' తీసేటప్పుడు వర్మ చెప్పిన మాట ప్రకారం మాఫియా కన్సెప్ట్ తో ఇది నాకు చివరి సినిమా అన్నాడు.
అతను అన్నట్టుగానే ఈ మూవీతోనే ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని
సినీ విమర్శకుల అభిప్రాయం.

ప్లస్ లు:.. వర్మ టేకింగ్, శర్వానంద్ యాక్షన్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.

మైనస్ లు చూస్తే:.. పాత స్టోరీ, పాటలు, ఎంటర్ టైన్ మెంట్ లేదు. లాజిక్ లేని కథనాలు, మాటలతో నడిచే సన్నివేశాలు.

ఓవరాల్ గా 'బిజినెమేన్'ను తలపించే ఈ సినిమా చివరకు సస్పెన్స్ గానే మిగిలిపోయింది.
అయితే ఇది వర్మ చిత్రాలను ఇష్టపడేవారికి మాత్రం పర్వాలేదనిపిస్తుంది.

కానీ సాధారణ ప్రేక్షకులు ఇబ్బంది పడతారనడంలోనూ డౌట్ లేదు.

ఇక ఈ చిత్రానికి '10టివి' ఇచ్చే రేటింగ్.. 2/5.
..............................

Wednesday, November 13, 2013

'చండీ'.. 'సముద్రం'లో కలిసిపోయింది.! (సినిమా సమీక్ష)

(''చండీ'' సినిమాపై '10 టివి' ప్రసారం చేసిన సమీక్ష ఇది...)


సాధారణంగా ఏ హీరోయిన్ అయినా.. సినిమాల్లో ఫేడ్ అవుట్ అవుతున్న దశలో టర్న్ తీసుకుని తమ కెరీర్ కి క్లైమాక్స్ ఇచ్చే పాత్రలు చేస్తుంటారు. రీసెంట్ గా ఇండస్ట్రీలో 'ఛార్మి' కూడా ఇలాంటి పాత్రలే చేసింది. ఇక ఈ రూట్ లోకి ఇప్పుడు ప్రియమణి వచ్చి చేరింది. తనకు స్టార్ హీరోయిన్ ఇమేజ్ దూరమయ్యాక హీరోల ప్రక్కన ఛాన్స్ లు దొరక్క ఇలా టర్న్ తీసుకుంది. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఇక సోలో యాక్షన్ లో తన సత్తా చాటాలని ప్రియమణి ఫిక్స్ అయ్యింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చిత్రాలలో వస్తుంది. అయితే 'అరుంధతి'లో అనుష్కలా.. అనిపించే 'చండీ'లో నటించింది. భారీ అంచనాలతో ఈ శుక్రవారం విడుదలయిన ఈచిత్రం ఎలా ఉందో .. చూద్దాం..


సాధారణంగా ఏ హీరోయిన్ అయినా.. సినిమాల్లో ఫేడ్ అవుట్ అవుతున్న దశలో టర్న్ తీసుకుని తమ కెరీర్ కి క్లైమాక్స్ ఇచ్చే పాత్రలు చేస్తుంటారు. రీసెంట్ గా ఇండస్ట్రీలో 'ఛార్మి' కూడా ఇలాంటి పాత్రలే చేసింది. ఇక ఈ రూట్ లోకి ఇప్పుడు ప్రియమణి వచ్చి చేరింది. తనకు స్టార్ హీరోయిన్ ఇమేజ్ దూరమయ్యాక హీరోల ప్రక్కన ఛాన్స్ లు దొరక్క ఇలా టర్న్ తీసుకుంది. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఇక సోలో యాక్షన్ లో తన సత్తా చాటాలని ప్రియమణి ఫిక్స్ అయ్యింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చిత్రాలలో వస్తుంది. అయితే 'అరుంధతి'లో అనుష్కలా.. అనిపించే 'చండీ'లో నటించింది. భారీ అంచనాలతో ఈ శుక్రవారం విడుదలయిన ఈచిత్రం ఎలా ఉందో .. చూద్దాం..
కథ విషయానికి వస్తే.:. దేవీపట్నం అనే ఓ ఊరి పెద్ద 'అశోక గజపతి రాజు'. అల్లూరి సీతారామరాజు వంశీకుడు. అతని కుమార్తె గంగ(ప్రియమణి). చిన్నప్పటి నుంచి తాత వీరత్వం పునికి పుచ్చుకుంటుంది. ఊరి క్షేమం కోసం గంగ కుటుంబం ఎలాంటి త్యాగానికైనా ముందుటుంది. ఆ ఊరి భూగర్భంలో విలువైన గనులు ఉన్నాయని తెలుసుకున్న ఓ కంపెనీ.. మంత్రి(ఆశిష్ విద్యార్థి) అండతో కబ్జాకు రెడీ అవుతుంది. కబ్జా క్రమంలో విలన్లతో తలపడి గంగ మినహా మొత్తం కుటుంబ బలవుతుంది. తన కుటుంబాన్ని, ఊరి ప్రజలను మట్టుబెట్టిన వారిపై గంగ ఎలా ప్రతీకారం తీర్చుకుందన్నదే 'చండీ' మూవీ కథ.


విశ్లేషణ:.. చండీ సినిమా చూసిన ప్రేక్షకుడికి మొదట టాలీవుడ్ లోని సినిమాలు గుర్తొస్తాయి. విలన్ లను వేటాడే సమయంలో హీరోలందరూ.. గంగ క్యారెక్టర్ లో కనిపిస్తారు. సమర్థుడైన దర్శకుడు ఒక పడవను నడిపే కెప్టెన్ లాంటివాడు. అన్ని క్రాఫ్టులను అనుసంధానం చేసుకుంటూ... సినీమాను ముగింపు వరకు నడిపిస్తాడు. కానీ నిర్లక్ష్యంగా డైరెక్షన్ చేస్తే.. సినిమా అంతా పడవలా మునిగిపోవడం ఖాయం. ప్రస్తుతం చండీ సినిమాతో దర్శకుడు సముద్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికే వచ్చిన చిత్రాల్లోకి కొన్ని సీన్లను కాపీ కొట్టి దానికి కొత్త రంగులు అద్ది చండీని తెరపైకి తెచ్చాడు. కానీ సినిమా ఎలా ఉండాలనేది మాత్రం మరిచిపోయాడు. 




నిర్మాతతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించేముందు...పేపర్ పై కథ ఎలా ఉండాలి..? సన్నివేశాలు ఎలా సాగాలి...? ఎక్కడ ఎమోషన్ తెప్పించాలి..? అన్న కనీస హోమ్ వర్క్ చేయకుండా 'చండీ'తో ప్రేక్షకులను చెండాడాడు. సినిమా మీద భారీ అంచనాలతో థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు దర్శకుడు నరకం చూపించాడనే చెప్పవచ్చు. సినిమా గోల సినిమాదే, ప్రేక్షకుల గోల ప్రేక్షకులదే అన్నట్లు థియేటర్లో చండీ పరిస్థితి తయారైంది. చివరిదాకా సినిమాతో ప్రేక్షకులు ఎక్కడా కనెక్ట్ కాలేదు.

చండీ పాత్రలో 'ప్రియమణి' బాగా పర్వాలేదనిపించింది. పాటల్లో అందాన్ని, ఫైట్లలో తన పవర్ ను బాగా చూపించింది. అదే క్రమంలో కొద్దిగా ఓవరాక్షన్ ను చూపించింది. ఇక 'నేను రెబల్, నా ఫ్యామిలీ రెబల్' అంటూ.. కృష్ణంరాజు చేసిన హంగామా సినిమాకు ఏ మాత్రం ప్లస్ కాలేకపోయింది. శరత్ కుమార్, ఆశిష్ విద్యార్థి, నాగబాబు, వినోద్ కుమార్, అలీ, పోసాని ఇలా అందరి పాత్రలు యావరేజ్ గానే మిగిలిపోతాయి.


సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. గత కొన్నేళ్లుగా ఔట్ డేటెడ్ సినిమాలు చేస్తున్న సముద్ర...చండీతో ప్రేక్షకులను జడిపించాడు. కాకపోతే.. ఇంకా ఎడిటింగ్ చేయాల్సిన అంశాలు బాగానే ఉన్నాయి. కుటుంబాన్ని కోల్పోయిన బాధ ఉన్న ఏ అమ్మాయైనా...క్లబ్ డాన్సులు చేస్తూ పాటలు పాడుతుందా...క్లబ్ డాన్సర్లా పాటలు పాడాక...ఇక ఆ హీరోయిన్ చెప్పే నీతి పాఠాలు ఎవరైనా వింటారా..? అనేది అక్కడ పెద్ద ప్రశ్న సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. సన్నివేశాల్లో లింకులు లేకుండా, బాధ్యతా రహితంగా సినిమా తీశాడు. కథ ప్రేక్షకులకు నచ్చేలా తీయాలన్న నిజాయితీ దర్శకుడిలో ఎక్కడా కనిపించలేదు.


ప్లస్ లు:.. ప్రియమణి నటన ఓకే అనిపించింది. నాగబాబు ఉన్నంతలో బాగానే నటించాడు. ఫోటోగ్రఫీ పర్వాలేదు.

మైనస్ లు:.. పాటలు, మూస కథ, దర్శకత్వం, లింకులు లేని సన్నివేశాలు, ఎడిటింగ్.


పాత చరిత్రకు కొత్త రంగు వేసి సముద్ర తీసిన 'చండీ'కి '10టివి' ఇచ్చే రేటింగ్.. 1/5.

.................................................

Tuesday, November 12, 2013

సేవా బాణీలోనే... ఆకాశవాణి!

- ఇవాళ (నవంబర్‌ 12) 'ప్రజాసేవా ప్రసార దినం'

   



ఏకకాలంలో ఇటు విజ్ఞానాన్నీ, అటు వినోదాన్నీ, మరోపక్క విషయ సమాచారాన్నీ ఎంతో సరళంగా, వేగంగా అందించే సాధనంగా రేడియోను చెప్పుకోవచ్చు. మన దేశంలో ప్రజా ప్రసార సాధనంగా 'ఆకాశవాణి' ఎన్నో దశాబ్దాలుగా ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తోంది. ఇప్పుడు ప్రైవేటు రేడియోలు, ఇంటర్నెట్‌ రేడియో సేవలు, ప్రైవేట్‌ ఎఫ్‌.ఎం. ఛానళ్ళు ఎన్ని వచ్చినా, ప్రజా సేవకు పూర్తిగా కట్టుబడిన సాధనంగా 'ఆకాశవాణి' తన చారిత్రక కర్తవ్యాన్ని విస్మరించకుండా ముందుకు నడుస్తోంది. ఆ కర్తవ్యాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ, ప్రజాసేవకు పునరంకితమవుతూ మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నవంబర్‌ 12న 'ప్రజాసేవా ప్రసార దినం' (పబ్లిక్‌ సర్వీస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ డే) జరుపుకొంటోంది. 

ఈ ప్రత్యేక దినోత్సవానికి ఓ చారిత్రక నేపథ్యం కూడా ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947 నవంబర్‌ 12న మహాత్మా గాంధీ తొలిసారిగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రాన్ని సందర్శించారు. రేడియో ద్వారా ప్రసంగించారు. రేడియో కేంద్రానికి వచ్చి గాంధీజీ ప్రసంగించడం అదే మొదటిసారి, చివరిసారి కూడా! దేశవిభజన తరువాత కురుక్షేత్ర ప్రాంతంలోని శిబిరంలో తలదాచుకున్న పాకిస్తానీ శరణార్థులను ఉద్దేశించి, గాంధీ ఆ ప్రసంగం చేశారు. ఆ సందర్భానికి గుర్తుగా ప్రతి ఏటా నవంబర్‌ 12వ తేదీని 'ప్రజాసేవా ప్రసార దినం'గా పరిగణించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అలా 2001 నుంచి ప్రతి ఏటా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. 


నిజానికి, భారతీయ కళలు, సంస్కృతికి సంబంధించిన వివిధ రూపాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ప్రజాప్రసార మాధ్యమం 'ఆకాశవాణి' అని చెప్పుకోవచ్చు. శాస్త్రీయ సంగీతం, నాటకం, కవిత్వం, జానపద గీతాల లాంటివాటికి ఇప్పటికీ అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. అలాగే, పంటల సంరక్షణ, కొత్త రకం సేద్య విధానాలపై ఉపయుక్త సమాచారాన్ని తెలియజేస్తోంది. దేశంలో 23 భాషల్లో, 146 మాండలికాల్లో వినోదాన్నీ, వార్తలనూ అందిస్తున్న ఏకైక మాధ్యమంగా ఆకాశవాణి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ముందంజలో నిలుస్తోంది. ఇన్ని భాషల్లో ప్రసారాలు అందిస్తూ, ప్రపంచంలోని అతి పెద్ద ప్రసార సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దేశం నలుమూలల్లో మొత్తం 403 'ఆల్‌ ఇండియా రేడియా' కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా దేశంలోని 92 శాతం ప్రాంతానికీ, మొత్తం జనాభాలో 99.19 శాతం మందికీ ఈ ప్రసారాలు అందుతుండడం విశేషం. 


ఈ సారి 'ప్రజాసేవా ప్రసారదినం' సందర్భంగా 'రేడియో ప్రచార సభ' ద్వారా ప్రత్యేక ప్రచారోద్యమానికి ఆకాశవాణి - హైదరాబాద్‌ కేంద్రం శ్రీకారం చుట్టింది. ''ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరంగా తెలియజేసి, వాటిని వినడం వల్ల కలిగే ప్రయోజనాన్ని చెప్పడం, వారిని చైతన్యవంతుల్ని చేయడం ఈ 'రేడియో ప్రచార సభ' ముఖ్యోద్దేశం'' అని ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ మంగళగిరి ఆదిత్యప్రసాద్‌ తెలియజేశారు. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మండలంలోని బాకారం గ్రామంలోని ప్రజలను నేరుగా కలుసుకొని, వారిని చైతన్యవంతుల్ని చేసే పని చేపట్టింది. అందుకోసం నవంబర్‌ 10న ఆ గ్రామంలో ఓ ప్రత్యేక సమావేశం నిర్వహిచింది. ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌, సీనియర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త అయిన డాక్టర్‌ ఎల్‌. జలపతిరావుతో రైతుల సందేహాలకు సమాధానాలు ఇప్పించింది. సరికొత్త సేద్య విధానాల గురించి వారికి అవగాహన కల్పించేందుకు కృషి చేసింది. ఈ కార్యక్రమం మొత్తాన్నీ రికార్డు చేసి, ఓ 30 నిమిషాలకు కుదించి, ఈ రోజు ఉదయం 7.15 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్‌, రెయిన్‌బో ఛానళ్ళలో ప్రసారం చేస్తోంది.



''గడచిన ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల్లో ఆహూతుల సమక్షంలో మూడు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలను నిర్వహించాం. ఈ కార్యక్రమాల రికార్డింగులను దేశవ్యాప్తంగా అన్ని రేడియో కేంద్రాలూ రిలే చేశాయి'' అని ఆదిత్యప్రసాద్‌ చెప్పారు. అలాగే, మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో నిర్వహించిన జానపద కళోత్సవం, నల్గొండలో అందరూ మహిళలే సమర్పించిన దేశభక్తి పూరిత సంగీత - సాహిత్య రూపకం, వంద మంది పిల్లలు పాల్గొన్న రూపకం లాంటివి పలువురిని ఆకట్టుకున్నాయి. 

ప్రస్తుతం ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం అందిస్తున్న 'లలిత సంగీత సమీరం', 'వేయి పడగలు' ధారావాహిక నాటకం, 'మధుర గీతామృతం', 'రైతుల ఫోన్‌-ఇన్‌ కార్యక్రమాల'కు విశేష స్పందన వస్తోందని ఆయన వివరించారు. హైదరాబాద్‌ కేంద్రం ప్రసారం చేస్తున్న అయిదు ఛానళ్ళూ శ్రోతల నుంచి ఆదరణ అందుకుంటున్న ట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌, విశాఖపట్నం నగరాల్లో టీవీలకు 'సెట్‌ టాప్‌ బాక్స్‌'లు తప్పనిసరి అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 'డైరెక్ట్‌ టు హౌమ్‌' (డి.టి.హెచ్‌) వేదికపై ఆకాశవాణి ఇరవై నాలుగు గంటలూ నిర్విరామంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ఆ సెట్‌ టాప్‌ బాక్సుల ద్వారా టీవీ సెట్లలోనూ కొందరు శ్రోతలు వింటూ ఉండడం విశేషం. 

మొత్తానికి, 'రేడియో ప్రచార సభ'ల లాంటి వినూత్న ప్రచారాల ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాల వైపు మరింతగా దృష్టిసారిస్తే, అనేక ఆధునిక మాధ్యమాల మధ్యన కూడా 'బహు జన హితాయ - బహు జన సుఖాయ' అన్న తన ఆశయానికి 'ఆకాశవాణి' మరింత దగ్గరవుతుంది.

     - రెంటాల జయదే


(Published in 'Praja Sakti' daily dated 12 Nov 2013 -Tuesday, Page No.5)
.....................................................

సీరియల్ కు ఎక్కువ..సినిమాకు తక్కువ.. ఈ 'చిన్న పిల్ల'! (సినిమా సమీక్ష)

('‘నేనేం చిన్నపిల్లనా..?’' సినిమాపై '10 టివి' ప్రసారం చేసిన సమీక్ష ఇది...)


దాదాపు 50ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత డా.డి. రామానాయుడు చాలా రోజుల తర్వాత నిర్మాతగా తీసిన పూర్తి కుటుంబ కథా చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా..?’. ఇప్పటి వరకు ‘గంగ పుత్రులు’, ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ లాంటి సినిమాలను తీసిన పి. సునీల్ కుమార్ రెడ్డి ఈ సారి డిఫరెంట్ గా ఓ కుటుంబ కథా చిత్రానికి దర్శకత్వం వహించాడు. 'అందాల రాక్షసి ఫేం' రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా మాజీ మిస్ ఇండియా 'తన్వి వ్యాస్' హీరోయిన్ గా పరిచయమైంది. వీరందరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'నేనేం చిన్నపిల్లనా..?.


కథ విషయానికి వస్తే..:
కట్టుబాట్లు సంప్రదాయాల మధ్య పెరిగిన స్వప్నకు అవి చాలా ఇబ్బందిగా ఉంటాయి. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న స్వప్న ఇంట్లో పెద్దలను అతి కష్టం మీద ఒప్పించి పైచదువుల కోసం స్వీడన్ వెళ్తుంది. అక్కడ క్రిష్ పరిచయం అవుతాడు.. తనకు నచ్చినట్టు ఉండే ఆనాథ అయిన క్రిష్ ను స్వప్న ఇష్టపడుతుంది. అలా వారి ప్రేమ సాగుతున్న క్రమంలో ఓసారి తల్లిదండ్రుల 'షష్టి పూర్తి' సందర్భంగా తనతో పాటు క్రిష్ ను ఇండియాకు తీసుకువస్తుంది. అక్కడ తన కుటుంబంలోని అనుబంధాలను చూసి స్వప్న పై మరింత ఇష్టం పెంచుకుంటాడు క్రిష్. వీరి ప్రేమ విషయం స్వప్న ఇంట్లో తెలుస్తుంది. ఆ తర్వాత వారి ప్రేమ ఫలించిందా..? ఆమె తండ్రి పెళ్లికి ఒప్పుకున్నాడా..? అనేది మిగిలిన కథ..

విశ్లేషణ:.. ఒక సినిమాకి కథను ఎంచుకునేముందు థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించేంత బలమైన అంశాలు ఏమున్నాయని దర్శక, నిర్మాతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ ఇలాంటి ఆత్మపరిశీలన లోపించిన కథ.. కథనాలకు రూపమే 'నేనేం చిన్న పిల్లనా ?'. అసలు ఈ టైటిల్ కు కథకు సంబంధం లేదు. హీరోయిన్ ఎక్స్ ప్రెషన్స్ కి, డైలాగ్స్ కి పొంతనే లేదు. ఏ పాత్రకూ క్యారక్టరైజేషన్ సెట్ కాలేదు. మాటలు కొత్తగా అనిపించవు, కొన్ని అర్థంకావు. కమెడియన్స్.. నవ్వించలేక నవ్వుల పాలయ్యారు. ఎల్బీ శ్రీరామ్.. బలవంతంగా ఇంగ్లీష్ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేసినా.. ప్రేక్షకులు నవ్వకపోగా.. అసహనానికి గురయ్యారు. ఇక దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మార్క్ సినిమాలో ఎక్కడా కనిపించదు. గత చిత్రాలతో పోల్చితే అసలు ఈయనే డైరెక్ట్ చేశాడా..? అనే సందేహం కూడా కల్గుతుంది. శత చిత్ర నిర్మాతగా ఖ్యాతి గాంచిన రామానాయుడు.. ఈ కథను ఎంచుకోవడంలో తన అనుభవానికి పనిచెప్పలేదని తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలో ఎక్కడా.. కొత్తదనం కనిపించదు. ఎమ్.ఎమ్. శ్రీలేఖ మ్యూజిక్ లో రెండు పాటలు పర్వాలేదనిపించాయి. కాకపోతే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దారుణంగా ఉంది. నటనలో రాహుల్ ఓకే అనిపించాడు. ఇతర ఆర్టిస్టులు ఎవరూ.. పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంట్లో తీరిగ్గా కూర్చుని చూసే సీరియల్స్ లో ఇంతకంటే బెటర్ కథ.. కథనాలు కన్పిస్తాయనడంలో సందేహం లేదు.


ప్లస్ పాయింట్స్: కుటుంబ కథా చిత్రంగా ఉండడం ఒక్కటే దీనిలో ప్లస్.

మైనస్ పాయింట్స్: తన్వీవ్యాస్, ఆకట్టుకోని పాత్రలు, నీరసంగా సాగే కథనం, పండని సెంటిమెంట్.

ఇక.. నేనేం చిన్న పిల్లనా అంటూ వచ్చిన ఈ చిత్రం కనీసం చిన్న పిల్లలకు కూడా నచ్చదని సినీ విమర్శకుల అభిప్రాయం. 
ఈ చిత్రానికి '10టివి' ఇచ్చే రేటింగ్.. 1/5.
..................................

Monday, November 4, 2013

పౌరుషం లేని.. 'పల్నాడు'! (సినిమా సమీక్ష)

('పల్నాడు' సినిమాపై '10 టివి' ప్రసారం చేసిన సమీక్ష ఇది...)

'విశాల్'.. తెలుగులో 'పందెంకోడి', 'పొగరు', వంటి సినిమాలతో ఇక్కడ తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న నటుడు. అయితే చాలా రోజులుగా మంచి హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తీసుకొని 'పల్నాడు' సినిమా చేశాడు. అంతేకాదు తన ఓన్ ప్రొడక్షన్ 'విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ' అనే బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక 'నాపేరు శివ' వంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన సుశీంద్రన్ దీనికి దర్శకత్వం వహించాడు. చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు కథ గురించి చూద్దాం.. 

చిత్ర కథ విషయానికి వస్తే..      సెల్‌ ఫోన్‌ షాప్‌ నడుపుకునే శివకుమార్‌ (విశాల్‌) స్వతహాగా పిరికివాడు. తమ ఇంటిపైనే అద్దెకుండే మాలతిని (లక్ష్మి మీనన్‌) ప్రేమిస్తాడు. ఆ ఊరికి పెద్ద దాదా అయిన కాటం రవి.. తన మైనింగ్‌ వ్యాపారానికి అడ్డు తగిలాడని, శివకుమార్‌ అన్నయ్యని చంపేస్తాడు. దాంతో శివకుమార్‌, అతని తండ్రి (భారతీరాజా) విడివిడిగా రవిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. వీరు ఆ విలన్ ను చంపుతారా..? ఆ తర్వాత ఏమైందనేది మిగతా కథ. 


విశ్లేషణ:..    సినిమా ఎక్కువగా రీవెంజ్ స్టోరీగానే కనిపిస్తుంది. మొదటి అర్థభాగంలో సరదాగా సాగినా.. సెకండాఫ్ లో కక్ష సాధించడానికి హీరో ప్రయత్నిస్తుంటాడు. దీని వల్ల రెండవ భాగంలో ఎంటర్ టైన్ మెంట్ అసలే ఉండదు. ఇది ప్రేక్షకులకు బోర్ తెప్పిస్తుంది. కథలో ఉన్న పటుత్వం సెకండాఫ్ లో మిస్ అయ్యింది. నటీనటుల పనితీరు.. హీరో విశాల్ నటన బాగుంది. విశాల్ కాస్త డిఫరెంట్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపిస్తుంది. అతని హవాభావాలతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ మంచి అమ్మాయిలా కనిపిస్తూనే అందంతో ఆకట్టుకుంటుంది. తండ్రి పాత్రలో భారతీ రాజా పరవాలేదనిపించాడు. 




కమర్షియల్ కోసం అనవసర హంగులు లేకుండా.. కథను నిజాయితీగా నడిపించేందుకు దర్శకుడు జాగ్రత్త పడ్డారు. పాటలు బాగున్నాయి. కానీ ఈ సినిమా 'పల్నాడు' పౌరుషాన్ని చూపించలేకపోయింది. ఎప్పుడూ కొత్త కథలు చేసే దర్శకుడు సుశీంద్రన్.. ఈ సినిమాలో 'రీవెంజ్' అంటూ వెళ్లడం ప్రస్తుత పరిస్థితులకు సెట్ కాలేదనిపించింది. హీరో అన్నని చంపిన విలన్ ను మట్టుపెట్టడానికి తండ్రితో, విశాల్ చేస్తున్న ప్రయత్నాలేవి సినిమాలో కనిపించవు. రీవెంజ్ కథతో ఎప్పుడు సినిమా తీసినా ఓ ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే దానిలో ప్రధానంగా ఎంటర్ టైన్ మెంట్ లోపిస్తుంది. ఈ సినిమాలో కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ లొపిస్తుందని ప్రేక్షకుడికి స్పష్టంగా అర్థమవుతుంది. 


కథలో యాక్షన్ సీన్ లకు ప్రాధాన్యత లేకపోతే.. అది అతుకులుగా మారుతుంది. గతంలో 'నాపేరు శివ' సినిమాలో యాక్షన్ సీన్ లను బోర్ లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు సుశీంద్రన్..'పల్నాడు'లో మాత్రం ఈ లోపాలను సవరించుకోలేక పోయాడు. ఫలితంగా ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ లేని ఈ మూవీ యావరేజ్ గా మిగిలిపోయిందని చెప్పవచ్చు. 


ప్లస్, మైనస్ లు:.. విశాల్ నటన బాగుంది. మ్యూజిక్ ఓకే, ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇతర నటులు కూడా తమ పాత్ర మేరకు న్యాయం చేశారు.


 మైనస్ లు చూస్తే.. సెకండాఫ్ స్టోరీ సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది. ఎంటర్ టైన్ మెంట్ అసలే లేదు. కామెడీ కూడా అంతే. యాక్షన్ సీన్స్ ఒక్కటీ కనిపించదు. సందర్భం వచ్చినప్పుడు ''పిల్లి కూడా పులిలా తిరగబడుతుంది' అనేది దర్శకుడు దీని ద్వారా చూపించాలనుకున్నాడని సినిమా చూసిన వారికి అర్థమవుతుంది.


 చివరగా చెప్పాలంటే.. ఈ సినిమా మిడిల్ క్లాస్ రీవెంజ్ ఫార్ములా చిత్రంగా మిగిలిపోతుంది. 


ఇక ఈ చిత్రానికి '10టివి'ఇచ్చే రేటింగ్.. 1.5/5. 

..............................................................

Saturday, November 2, 2013

సాంకేతికంగా మరో ముందడుగు - 'క్రిష్‌ 3' (సినిమా సమీక్ష)




     మానవ జాతిని నాశనం చేయాలనీ, ప్రపంచం మీద తన ఆధిపత్యం నెలకొల్పాలనీ అనుకొనే విలన్ల కథలు, వాళ్ళను మట్టి కరిపించే శాస్త్రవేత్తలు, హీరోల కథలు మనకు తెలియనివేమీ కావు. ఇలాంటి సూపర్‌ హీరో సినిమాలు, సైన్స్‌ ఫిక్షన్‌ - ఫ్యాంటసీ సినిమాలు హాలీవుడ్‌లో కోకొల్లలు. కానీ, మన వెండితెర మీద మాత్రం ఖర్చు, సాంకేతిక పరిజ్ఞానాల రీత్యా అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. 'క్రిష్‌3' అచ్చమైన అలాంటి హాలీవుడ్‌ తరహా కథ. కాకపోతే, దానికి భారతీయ సినిమా కథల తరహా ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. పిల్లల్ని ఆకట్టుకొనే అంశాలు మునుపటి భాగాలతో పోలిస్తే తగ్గినా, ఫరవాలేదనిపించారు. 
..........................................................................
చిత్రం - క్రిష్ 3, తారాగణం - హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా, వివేక్ ఓబెరాయ్, కంగనా రనౌత్, సంగీతం - రాజేశ్ రోషన్, కెమేరా - ఎస్. తిరు, నిర్మాత, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - రాకేశ్ రోషన్
..........................................................................

దాదాపు పదమూడేళ్ళ క్రితం 'కహో నా ప్యార్‌ హై' సినిమాతో తెరంగేట్రం చేసిన హృతిక్‌ రోషన్‌ కెరీర్‌ మొదట్లో ఫ్లాపులను ఎదుర్కొన్నా, తరువాత హీరోగా నిలబడ్డారు. దర్శక - నిర్మాత అయిన తండ్రి రాకేశ్‌ రోషన్‌ సారథ్యంలో కృష్ణ అలియాస్‌ 'క్రిష్‌' పాత్రలో మన భారతీయ వెండితెరపై సూపర్‌హీరోగా ఎదిగారు. ఆ తండ్రీ కొడుకుల కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా - 'క్రిష్‌3'. ఈ సైన్స్‌- ఫిక్షన్‌ చిత్రం 'కోయీ... మిల్‌ గయా', 'క్రిష్‌' చిత్రాల సూపర్‌హిట్ల తరువాత అదే సిరీస్‌కు కొనసాగింపుగా వచ్చిన మూడోది.

సూపర్‌ మ్యాన్‌ లాంటి హీరో, 'ఎక్స్‌ మెన్‌' లాంటి విలన్‌ ముఠా సభ్యులు, వాళ్ళ మధ్య పోరాటం - అనే హాలీవుడ్‌ సినీ వాణిజ్య కథలను బాగా కలగలిపి, ఈ సినిమాలో యథేచ్ఛగా వాడుకున్నారు. 'ఎప్పటికైనా, చెడు మీద మంచి విజయం సాధిస్తుంది' అనే వెండితెర సూత్రానికి తగ్గట్లుగా సినిమాను నడిపారు. కృష్ణ అలియాస్‌ క్రిష్‌ (హృతిక్‌ రోషన్‌) చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ గడిపేస్తుంటాడు. ఆపదలో ఉన్నవాళ్ళను ఆదుకొనేందుకు అవసరమైనప్పుడల్లా 'క్రిష్‌'గా అవతారమెత్తి, తన సూపర్‌మ్యాన్‌ శక్తులతో రక్షిస్తూ ఉంటాడు. జర్నలిస్టు ప్రియ (ప్రియాంకా చోప్రా) అతని భార్య. కృష్ణ తండ్రి డాక్టర్‌ రోహిత్‌ మెహ్రా (ద్విపాత్రాభినయంలో హృతిక్‌ రోషన్‌) ఓ శాస్త్రవేత్త. వెలుతురు జీవం పోస్తుందన్న దానిపై పరిశోధనలు చేస్తుంటాడు. 

ఇక, మెదడుతో ఆలోచించి, చేతి వేళ్ళతో ఏదైనా చేయగల శక్తిసంపన్నుడైన వికలాంగుడు కాల్‌ (వివేక్‌ ఓబెరారు) ఓ దుష్టుడు. తన డి.ఎన్‌.ఏ.కు సరిపడే బోన్‌ మ్యారో (ఎముక మూలగ)ను శరీరంలో ప్రవేశపెట్టుకొని మామూలు మనిషి కావాలనీ, మానవాళిని ధ్వంసం చేయాలనీ తనదైన లోకంలో ప్రయోగాలు చేస్తుంటాడు. రకరకాల జంతువుల నుంచి మ్యుటేషన్‌ ద్వారా అతను సృష్టించిన రకరకాల మానవ మృగాలు అతని బంట్లు. రంగులు మార్చే ఊసరవెల్లి నుంచి అలా తయారైన మానవ మృగం కాయ (కంగనా రనౌత్‌). కాల్‌ ఓ ప్రాణాంతక వైరస్‌ను కనిపెట్టి, దాన్ని ప్రపంచంపై ప్రయోగించి, దానికీ విరుగుడు కూడా తన డి.ఎన్‌.ఏ. నుంచే చేసి, కోట్లు గడిస్తుంటాడు. భారత్‌లో అతను ప్రవేశపెట్టిన వైరస్‌ను అరికట్టే మందును హీరో డి.ఎన్‌.ఏ. నుంచి అతని తండ్రి తయారు చేస్తాడు. అదెలా సాధ్యమైంది? అది తెలిసి విలన్‌ ఏం చేశాడు? విలన్‌కూ, హీరోకూ ఉన్న సంబంధమేమిటి? చివరకు ఆ విలన్‌పై హీరో ఎలా విజయం సాధించాడు? లాంటి వన్నీ మిగతా సినిమా.
   మొదట కాసేపు నెమ్మదిగా సాగే ఈ చిత్రం క్రమంగా పుంజుకొని ఇంటర్వెల్‌ దగ్గర కీలకమైన మలుపుతో ఆగుతుంది. ద్వితీయార్ధం రకరకాల మలుపులతో కొంత వేగం అందుకుంటుంది. చివరకు మాత్రం సుదీర్ఘమైన హీరో, విలన్‌ పోరాటంతో ముగుస్తుంది. క్లిష్టమైన ప్రోస్థెటిక్‌ మేకప్‌తో వృద్ధుడైన తండ్రి పాత్రను చక్కటి బాడీ లాంగ్వేజ్‌తో హృతిక్‌ చక్కగా అభినయించాడు. ఇక, కుమారుడు క్రిష్‌ పాత్రలో సిక్స్‌ - ఎయిట్‌ ప్యాక్‌తో దృఢంగా కనిపిస్తాడు. హీరోయిన్‌ ప్రియాంక కన్నా, కంగనా రనౌత్‌ పోషించిన విలన్‌ తరహా పాత్ర కథకు కీలకం. ఆ పాత్రను ఆమె పండించారు. అలాగే, విలన్‌గా వివేక్‌ ఓబెరారు కేవలం చక్రాల కుర్చీకే పరిమితమై కూడా ఆకట్టుకున్నారు. 

కెమేరా వర్క్‌ బాగున్న ఇంత భారీ కథను ఊహించడం, దాన్ని కెమేరా కన్నుతో తెరపై చూపించడం కష్టమే. టీమ్‌ వర్క్‌గా సాగిన ఆ పనిలో దర్శక, నిర్మాత సఫలమయ్యారు. చాలాభాగం మన హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుకొన్న ఈ చిత్రం సాంకేతికంగా బాగుంటుంది. సినిమాలో వాడిన కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ (సి.జి.ఐ - కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజెస్‌) కానీ, యాక్షన్‌ సన్నివేశాలు - వాటి చిత్రీకరణ కానీ ఆశ్చర్యానందాలను కలిగిస్తాయి. ఏదైనా హాలీవుడ్‌ సినిమా చూస్తున్నామేమో అనిపిస్తాయి. హృతిక్‌ రోషన్‌ చెప్పినట్లు ''విజువల్‌ ఎఫెక్ట్‌ ్సకు సంబంధించినంత వరకు మన భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలుపుతుంది - 'క్రిష్‌3'. 

అయితే, హృతిక్‌ రోషనే ఈ మధ్య అన్నట్లు, ''ఏ సినిమా అయినా అనుకున్న ఫలితం సాధించాలంటే, టెక్నాలజీ ఒక్కదాని మీదే ఆధారపడితే సరిపోదు. టెక్నికల్‌గా సినిమా ఎంత బాగున్నా కథ ఉండాలి. అందులో విషయం ఉండాలి. సినిమాలోని ఆ పాత్రలతో ప్రేక్షకులు తాదాత్మ్యం చెందాలి. అది చాలా కీలకం'' అన్నారు. ఈ సినిమాలో లోపం ఏదైనా ఉందంటే, పెద్ద హృతిక్‌ రోషన్‌ పాత్ర చివరికి ఏమైంది లాంటి ఒకటి రెండు ఘట్టాలు మినహా ప్రేక్షకులకు భావోద్వేగాలు కలిగించే సన్నివేశాలు తక్కువగా ఉండడం. చావు బతుకుల్లో ఉన్న హీరోను చూసి, తండ్రి బాధపడడం లాంటి దృశ్యాలు ఆశించినంత పండలేదు.

సినిమాను సుదీర్ఘంగా చిత్రీకరించి, రెండున్నర గంటలకు కుదించడం వల్లనో, ఏమో కొన్ని చోట్ల లింకులు కనిపించవు. ఉదాహరణకు, హీరో తండ్రి, శాస్త్రవేత్త అయిన పెద్ద హృతిక్‌ రోషన్‌ సింగపూర్‌ వెళ్ళాక, అతను కిడ్నాప్‌ అయ్యాడనే దృశ్యమే కనిపించదు. నేరుగా అతణ్ణి విలన్‌ డెన్‌లో చూపెడతారు. ఇలాంటివి ఒకటి రెండు కనిపిస్తాయి. అలాగే, సర్వశక్తిమంతుడిగా చూపుడువేలుతో ఏ.కె. 47 గన్‌లను వంచేస్తూ, గుప్పిట మూసి ఆకాశంలోని హెలికాప్టర్లను కూడా పేల్చివేయగల సామర్థ్యం, ఎక్కడేం జరుగుతోందో ఇట్టే తెలుసుకొనే సత్తా ఉన్న విలన్‌ తీరా చివరలో హీరో భార్య ప్రియాంకా చోప్రా ఎక్కడుందంటూ వెతకడం లాంటివి మరీ సిల్లీగా ఉన్నాయి. విలన్‌కు కావాల్సింది తన డి.ఎన్‌.ఏ.కు సరిపడే 'ఎముక మూలగ' (బోన్‌ మ్యారో). ఆ అన్వేషణలో ఉన్న విలన్‌ డి.ఎన్‌.ఏ. ద్వారా వైరస్‌ను సృష్టించడం, మానవ మృగాల ద్వారా విధ్వంసం జరపడం లాంటివి అతని ప్రాథమికమైన లక్ష్యానికి తగినట్లుగా కనిపించవు.

అయితే, ఇప్పటికే 'కోయీ మిల్‌ గయా', 'క్రిష్‌' చిత్రాలు చూసి, ఆనందించినవాళ్ళు ఆ రకమైన ఆలోచనా దృక్పథంతో, ముందుగానే ట్యూన్‌ అయి ఈ 'క్రిష్‌3'కి వస్తారు కాబట్టి, వాళ్ళను ఈ సినిమా అధునాతనమైన సాంకేతికతతో అబ్బురపరుస్తుంది. అందుకే, స్క్రిప్టులో లోపాలున్నా, మిగిలిన హంగులు, ఆర్భాటాలతో సినిమా పాసై పోతుంది.

కొసమెరుపు: అన్నట్లు, ఈ సిరీస్‌లో మొదటి సినిమా పేరు - 'కోయీ మిల్‌ గయా'. రెండో సినిమా పేరు -'క్రిష్‌'. మరి, వీటి తరువాతి తాజా సినిమా ఏకంగా 'క్రిష్‌3'. మరి, మధ్యలో 'క్రిష్‌2' అనేది రానే లేదు. ఒకటి తరువాత 2వ నంబర్‌ రాకుండానే, 3వ నంబర్‌ రావడమేమిటంటారా? ఇలాంటి సినిమాల కథలోనే కాదు, పేరులోనూ లాజిక్‌ వెతకడం వృథా శ్రమే!
- రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 2 నవంబర్ 2013, శనివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
........................................................................