జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, April 16, 2015

'మా' కథ (‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు)

-  దక్షిణ భారత సినీ నటీనటుల సంఘంగా 1950ల నాటికే మద్రాసులో ‘నడిగర సంగం’ మొదలైంది. ఏ భాషా సినీపరిశ్రమ ఆ భాషా ప్రాంతానికి తరలివెళ్ళడంతో, ఎక్కడికక్కడ కొత్తగా ప్రాంతీయ భాషా నటీనటుల సంఘాలు వచ్చాయి. అలా తెలుగు నటులకు ‘మా’ ఏర్పాటైంది. కళాకారులకు ‘అమ్మ’ లాంటిదనే ఉద్దేశంతో, అమ్మ ఒడిని లోగోగా పెట్టుకున్న ఈ సంఘాన్ని 21 ఏళ్ళ క్రితం 1993 అక్టోబర్ 4న స్థాపించారు.

- చిరంజీవి సంస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ సంస్థ కార్యవర్గ కాలపరిమితి రెండేళ్ళు. ప్రతి రెండేళ్ళకూ ఎన్నికలు జరగాలి. గతంలో కృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, నాగబాబు తదితరులు ‘మా’ అధ్యక్షులుగా పనిచేశారు. మురళీమోహన్ అత్యధికంగా 6 సార్లు (12 ఏళ్లు) అధ్యక్షపదవి నిర్వహించారు.

 -  తెలుగు సినిమాల్లో నటించే తారలంతా ‘మా’లో కానీ, దీని గుర్తింపున్న ఇతర ఆర్టిస్టు సంఘాల్లో కానీ తప్పనిసరిగా సభ్యులై ఉండాలి. సభ్యుల సంక్షేమం, పారితోషిక సమస్యల పరిష్కారం ‘మా’ చూస్తుంది.  కనీసం 8 చిత్రాల్లో నటిస్తే కానీ, ‘మా’లో సభ్యత్వమివ్వరు. జీవిత కాల సభ్యులు (709), గౌరవ సభ్యులు (2), సీనియర్ సిటిజన్లు (28) కలిపి ‘మా’లో సభ్యుల సంఖ్య 739. వీరిలో ఓటు హక్కున్నది 702 మందికే.

‘- మా’లో సభ్యత్వానికి రుసుము ఒకప్పుడు స్వల్పమే కాగా, ఇప్పుడది అక్షరాలా లక్ష రూపాయలు. ఇంత భారీ రుసుముతో పేద కళాకారులకు దూరమై, పెద్దవాళ్ళకు గొడుగుగా ‘మా’ మారిందనేది ఒక విమర్శ.  కళాకారుల సంక్షేమానికీ, ప్రకృతి వైపరీత్యాల బాధితుల సహాయానికీ పలు కార్యక్రమాలు చేసిన నిధులు సేకరించిన ఘన చరిత్ర ‘మా’ది. ప్రస్తుతం 3 కోట్ల 22 లక్షల దాకా నిధీ ఉంది.

- అయితే, నిరుపేదలూ, వృద్ధులూ అయిన అర్హులైన అనేకమంది కళాకారులకూ ఆర్థిక సహాయం, మెడీక్లెయిమ్ లాంటి వసతులు ఇవాళ్టికీ మృగ్యమే.  ‘మా’కు ఇప్పటికీ సొంత భవనం లేదు. కొనుగోలు చేసిన ఒక అంతస్తు వేరే చోట ఉన్నా, చాలాకాలంగా హైదరాబాద్‌లోని ఏ.పి. ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రాంగణంలో చిన్న కార్యాలయంలోనే నడుస్తోంది.

- రెంటాల

(Published in 'Sakshi' daily, 29th March 2015, Sunday)
..................................................

ఎన్నికల సిని 'మా' నేడే!

ఎన్నికల సినిమా నేడే!
దాదాపు వారం రోజులుగా రకరకాల వివాదాలు, వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలతో సినీ పరిశ్రమతో పాటు, సామాన్యుల దృష్టిని కూడా ఆకర్షిస్తున్న ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఏ.పి. ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రాంగణంలో ఆదివారం నాడు పోలింగ్ జరగనుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే పోలింగ్‌లో 702 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆపు చేయాలంటూ నటుడు ఒ. కల్యాణ్ వేసిన పిటిషన్‌ను విచారిస్తున్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ఎన్నికలను ఆపకుండా నిర్వహించ వచ్చనీ, అయితే తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు కౌంటింగ్ జరపడం కానీ, ఫలితాలు ప్రకటించడం కానీ చేయవద్దనీ శుక్రవారం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు ఎన్నికల అధికారి - ‘మా’కు న్యాయ సలహాదారైన వి. కృష్ణమోహన్ ‘సాక్షి’కి తెలిపారు. ‘‘కోర్టు ఆదేశాల మేరకే అంతా జరపడానికి ఏర్పాట్లు చేశాం. పోలింగ్ ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

 ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు - ఇలా మొత్తం 6 విభాగాల్లో పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగా 6 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇ.వి.ఎంల)ను వినియోగిస్తున్నారు. ‘‘సాంకేతిక ఇబ్బందులెదురైతే ప్రత్యామ్నాయంగా మరొక యంత్రాన్ని అదనంగా అట్టిపెడుతున్నాం’’ అని ఆయన వివరించారు. గతంలోని అనేక ఎన్నికల లాగానే ఈసారీ సీనియర్ నటుడు జి. నారాయణరావు సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. నిజానికి, 1993లో ఏర్పాటైన ‘మా’కు తొలి అయిదు కార్యవర్గాలూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 2000లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. కాగా, 2002 అక్టోబర్ 10న జరిగిన ఎన్నికల్లో ‘మా’ అధ్యక్ష పదవికి మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లు పోటీపడ్డారు.

అప్పట్లో 8 ఓట్ల తేడాతో రాజేంద్రప్రసాద్ ఓడిపోయారు. ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ బరిలోకి దిగారు. ఈ సారి కూడా ఆయనకూ, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడైన మురళీ మోహన్ ఆశీస్సులున్న జయసుధకూ మధ్య అధ్యక్ష పదవికి పోటీ జరగడం విశేషం. ‘‘ఈ మధ్య ఇంత భీకరమైన ‘మా’ ఎన్నికల పోరు జరగలేదు’’ అని పలువురు సీనియర్లు పేర్కొన్నారు. ఇప్పటి దాకా ఏ ఎన్నికల్లోనూ 50 శాతం మించి పోలింగ్ జరగని ‘మా’లో ఆదివారం పోలింగ్ ముగిసినప్పటికీ, 31వ తేదీ మంగళవారం కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు ఫలితాల ఉత్కంఠ కొనసాగనుంది. ఆ తరువాత కూడా కోర్టు వాయిదాలు, తుది తీర్పుకు మరికొంత ఆలస్యమయ్యే సూచనలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.

 నోరు నొక్కేశారు!
 ఇది ఇలా ఉండగా, తాజా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న ఒ. కల్యాణ్ ‘మా’లోని అవకతవకలపై శనివారం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్‌తో పాటు జయసుధ, అలీ, నరేశ్, హేమ తదితరులపై ఆయన విమర్శనా స్త్రాలు సంధించారు. ‘మురళీమోహన్ బంధుప్రీతి వల్ల ‘మా’కు 50 లక్షల నష్టం వచ్చింది. ఇప్పటి దాకా అనేక లేఖలు రాసినా లాభం లేకపోయింది. ధైర్యం చేసి, పెదవి విప్పిన నా నోరు నొక్కేస్తున్నారు’ అని కల్యాణ్ ఆరోపించారు. రాజేంద్రప్రసాద్ ప్యానెల్‌కూ, తనకూ సంబం ధం లేదనీ, స్వతంత్రంగా పోటీ చేస్తున్నాననీ ఆయన వివరించారు. ‘మా’లో అంతా మురళీమోహన్ చెప్పిందే వేదం, రాసిందే చట్టంలా నడుస్తోందని కల్యాణ్ ఆరోపించారు.
- రెంటాల

(Published in 'Sakshi' daily, 29th March 2015, Sunday)
............................................

Monday, April 13, 2015

మా మధ్య...గొడవలు పెట్టకండి బాబూ! - త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ

మాటల మాంత్రికుడు’... మంచి మనిషి... మనవైన విలువలను తెరపై చూపెట్టే దర్శకుడు... సంక్లిష్టంగా కాకుండా సరళంగా జీవితాన్ని జీవించమనే సినీ తాత్త్వికుడు... త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఎవరి నిర్వచనం వారిది. ఆయన మాత్రం ఎవరేమన్నా... అవేవీ పట్టించుకోనట్లే ఫకాలున నవ్వేసి... చేయి కలిపి, పక్క నుంచి ముందుకెళ్ళిపోయే పాదరసం. ‘స్వయంవరం’తో స్వతంత్ర సినీ రచయితగా మొదలుపెట్టి, ‘నువ్వే - నువ్వే’తో దర్శకుడైన ఈ భీమవరం బుల్లోడు ఇప్పటికి అరడజను సినిమాలను దర్శకుడిగా అందించారు. మనుషుల మధ్య అనుబంధాలు, మనవైన విలువలను తెరపై ఆవిష్కరించి, మనల్ని మనకే గుర్తుచేసే ఈ దిట్ట అల్లు అర్జున్‌తో తన తాజా ఏడో చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’లోనూ ఆ పనే విజయవంతంగా చేశారు. ఏణ్ణర్ధం క్రితం పవన్‌కల్యాణ్‌తో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ ‘అత్తారింటికి దారేది’ అందించిన త్రివిక్రమ్ తాజా రిలీజ్‌పై సంధించిన ప్రశ్నల పరంపరకిచ్చిన జవాబులు...
మా మధ్య...గొడవలు పెట్టకండి బాబూ!
 
  ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి స్పందన అంచనాలకి తగ్గట్టే ఉందా?
 ప్రతి సినిమాకూ నేను కోరుకునేది ఒకటే - సినిమా కొను క్కున్న బయ్యర్లకు వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చేయాలని.  మాట్లాడకుండా చూసేసే మల్టీప్లెక్స్ జనం కన్నా, నవ్వుతూ, ఈలలేస్తూ, తెర మీది కథ నచ్చిందో నచ్చలేదో తమ స్పందన ద్వారా చెప్పేసే సింగిల్ థియేటర్‌లోనే నేనెప్పుడూ సినిమా చూస్తా. హైదరాబాద్ సుదర్శన్‌లో చూశా. సామాన్య ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోంది. ప్రాథమికంగా ‘సన్నాఫ్...’ మాస్ సినిమా కాదు కాబట్టి, క్రమంగా కుటుంబ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంది. మరి కొద్ది రోజులైతే కానీ వాణిజ్య పరంగా సినిమా స్థాయి ఏమిటో తెలియదు. ఇక, నా వరకు అంటారా? కథ రాసి, సినిమా తీయడమే తప్ప, ప్రత్యేకించి అంచనాలు పెట్టుకోను.

  గత చిత్రాలతో పోలిస్తే, ఇందులో వినోదం తగ్గిందని..
 (మధ్యలోనే అందుకుంటూ...) కేవలం వినోదాత్మక కథలే కాక, వేరే కథలు కూడా చెబుతూ ఉండాలి కదా. నేను రాసుకున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కథను నిజాయతీగా తెర కెక్కించడానికి ప్రయత్నించా. ఆ క్రమంలో ఏ మేరకు కుది రితే అంతే వినోదం ఉంది. ఏవేవో ఐటమ్ ఇరికించలేదు.

  అంటే... హీరోలకు తగ్గట్లు కథలు రాయనంటారు...
 ఆ మాటంటే అబద్ధం. ఒక కథ అనుకున్నాక, ఆ కథలో చేసే హీరోకు తగ్గట్లు కొంత సర్దడం సహజం. కథను నిజాయతీగా తెరకెక్కిస్తూనే, వాణిజ్యపరంగా పెట్టుబడి తిరిగొచ్చేలా డిజైన్ చేస్తుంటాం. అదే సమయంలో నా మటుకు నేను చెప్పాలనుకున్న విలువల గీత దాటకుండా చూసుకుంటా.

  కానీ, హీరో పాత్రను 300 కోట్లొదులుకొనే మంచివాడిగా చూపడం...
 మంచివాళ్ళ కథలు బోరింగ్‌గా ఉంటాయని మనకు అపనమ్మకం. కానీ, ఈ భూమండలంపై అతి మంచివాడిగా కనిపించే రామాయణంలో రాముడి కథే చూడండి - అది ఇప్పటికి ఎన్నో భాషల్లో వచ్చింది. ఎన్నోసార్లు తెరకెక్కింది. ఒక మంచి వాణ్ణి హీరోగా పెట్టుకొని, అతనికి ఎదురయ్యే సవాళ్ళను అతనెదు ర్కొన్న తీరుతో, కథను ఆసక్తికరంగా, ఇష్టపడేలా చెప్పాలని ప్రయత్నించా.

  ఈ చిత్రకథకూ, మీ నిజజీవితానికీ సంబంధం ఉందా?
 నా వ్యక్తిగతం కాదు కానీ, చాలామంది జీవితాల్లో జరిగిన విషయాలు, నా స్నేహితులు, బంధువుల కుటుంబాల్లో జరిగిన కొన్ని ప్రధాన ఘటనల్ని సినిమాకు తగ్గట్లు నాటకీయంగా మలుచుకొని చేశా. ఎమ్మెస్ నారాయణ, రావు రమేశ్‌ల ఘట్టం పశ్చిమగోదావరి జిల్లాలోని వేగేశ్వరపురం అనే చిన్న ఊరులోని మా అమ్మ మేనమామల జీవితం నుంచి ప్రేరణ పొంది తీసుకున్నా. అన్న ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టిన తమ్ముడు, ఆస్తుల గురించి పట్టించుకోకుండా మూడు తరాలుగా కలిసుంటున్న ఆ కుటుంబాల స్ఫూర్తితో ఆ ఘట్టాన్ని సినిమాకు తగ్గట్లుగా మలిచా.

  తండ్రీ కొడుకులు ప్రకాశ్‌రాజ్, బన్నీల మధ్య ఇంకా సీన్లు పెట్టాల్సిందేమో?
 ఈ కథలో తండ్రి గొప్పతనం గురించి చెప్పాలనుకున్నా కానీ, ఆ పాత్రతోనే కథ నడపాలనుకోలేదు. కొడుకుకూ, తండ్రికీ మధ్య సీన్లతో ఆ గొప్పతనం చెప్పా లనుకోలేదు. తండ్రి, ఆస్తి ఉండగా కొడుకు గొప్పగా మాట్లాడే కన్నా, రెండూ పోయాక, తండ్రి గొప్పతనం కోసం కొడుకు పాటుపడడం గొప్పే కదా!

 కానీ, ‘మాటల మాంత్రికుడి’ పంచ్‌లు లేవనీ, బన్నీ ఎనర్జిటిక్‌గా లేరనీ...
 (నవ్వేస్తూ...) ‘మాటల మాంత్రికుడ’ని మీరంటారు కానీ, అదేమీ నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా... ఆ కథకు, ఆ సన్నివేశానికి అనిపించిన మాటలు రాయడమే. తండ్రి చనిపోయాక ఆ బాధలో ఉన్న హీరో వెంటనే పంచ్ డైలాగులు మాట్లాడితే బాగుండదు కదా! ఇక, ‘జులాయి’, ‘రేసుగుర్రం’ లాంటి చిత్రాల్లో ఉరికే జలపాతంలో ఉత్సాహంగా ఉండే బన్నీని చూశాం. మళ్ళీ అదే పద్ధతిలో కంఫర్‌‌ట జోన్‌లో వెళ్ళకుండా, హుందాగా, బాధ్యతతో కూడిన పాత్రలో ఆయనను చూపాలని కావాలనే నిర్ణయించుకున్నాం.

ఒక మెయిన్‌స్ట్రీమ్ సిన్మాలో సమంతను డయాబెటిక్‌గా చూపడం విచిత్రమేనే?
 హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలని మనం ఒక మూసలో పడ్డాం. ఏం? నల్లగా ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలున్న అమ్మాయిలు కథలో హీరోయిన్ పాత్ర కాకూడదా? అయినా ఇవాళ ప్రపంచాన్నీ, అందులోనూ మన దేశాన్నీ పట్టిపీడిస్తున్న మహమ్మారి డయాబెటిస్. అది వచ్చినవాళ్ళను మనం జాలిగా చూస్తుంటాం. కానీ, కమలహాసన్, యాంకర్ గౌరవ్ కపూర్, క్రికెటర్ వసీం అక్రం లాంటి విజయసాధకులు డయాబెటిక్స్. అందుకే, అలాంటి ఆరోగ్య సమస్య ఉన్న వ్యక్తిని అందరూ ప్రేమించేలా, ఇష్టపడేలా చూపాలని హీరో యిన్‌ను అలా చూపించాం. మొదట మా యూనిట్‌లోనూ భిన్నాభిప్రాయా లొచ్చాయి. తీరా చూశాక, ముఖ్యంగా సూట్‌కేస్ ఫైట్, అక్కడి కామెడీ చూశాక, అంతా ఇష్టపడ్డారు. సినిమా టైటిల్‌పైనా అలాంటి చర్చే జరిగింది.

  ‘సన్నాఫ్...’లో భారత, రామాయణాల్ని ఎక్కువ ప్రస్తావించారు. కారణం?
 నా దృష్టిలో రామాయణ, భారతాలను మించిన అద్భుత సాహిత్యం ఎవరూ రాయలేదు. వాటిలో స్పృశించని అంశం లేదు. అందుకే, వాటిని సందర్భాను సారంగా ప్రస్తావించా. అందులో తప్పేం లేదు కదా.

 బలమైన విలన్ లేరనీ, హీరోతో అతణ్ణి చంపించలేదనీ కూడా ఒక విమర్శ?
 నిజానికి, ఈ కథలో నటుడు ఉపేంద్ర విలన్ కాదు. బయట ఏం చేసినా, భార్య ఎదుట మంచిగా ఉండాలనుకొనే వ్యక్తి. ప్రాథమికంగా ఈ కథలో ఉపేంద్రను చంపాలని చూసే సంపత్‌రాజ్ విలన్. కానీ, అతనికీ, హీరోకూ నేరుగా ఘర్షణ లేదు. పైగా, హీరోతో, విలన్‌ను చంపించడమనే కాన్సెప్ట్‌కు నేను కొంత వ్యతిరేకిని. ‘వాదనల ద్వారా అభిప్రాయాలు మారవు, వ్యక్తులను చంపడం ద్వారా వ్యవస్థ మారదు’ అని నా నమ్మకం. అందుకే, ‘అతడు’, ‘జల్సా’ - ఇలా దాదాపు నా ప్రతి సినిమాలో ఊహించని పరిస్థితులు, ఘటనల్లో విలన్ చనిపోతాడు తప్ప, హీరో చంపడు. ఇందులోనూ అంతే!

 ‘సన్నాఫ్...’పై సినీవర్గాల్లో కొంత మిశ్రమ స్పందన వినిపిస్తోంది...
 మనం ఏ ట్రేడ్‌లో ఉంటే అందులో తెలియకుండానే కొంత స్టిఫ్ అయిపోతుం టాం. సినీరంగంలోనూ అంతే. సామాన్య ప్రేక్షకుల్లాగా నవ్వొస్తే నవ్వి, ఏడు పొస్తే ఏడవం. బాగుందో, బాగాలేదో ఒక్క ముక్కలో చెప్పలేం. ఫస్టాఫ్ బాగున్నా సరే, సెకండాఫ్ ఎలా తీశాడో చూడాలంటూ ఇంటర్వెల్‌లో వ్యాఖ్యా  నిస్తాం. హాలులో కూర్చున్నా, చూస్తున్న సినిమాను ఆస్వాదించకుండా క్షణ క్షణానికీ అప్‌డేట్లు వాట్సప్‌లో, ట్విట్టర్‌లో ఇస్తాం. ఇది మనందరి బలహీనత. నా ఒక్క సినిమానే ఆడాలి, ఇతరులెవరివీ ఆడకూడదనుకుంటే తప్పు. అందరి సినిమాలూ పోతే, మనతో మళ్ళీ సినిమా తీయడానికి మిగిలేదెవరు?

 ఈ సినిమా నిర్మాణంలో మీరూ భాగస్వామి అని ఒక టాక్ నడుస్తోంది...
 (గట్టిగా నవ్వుతూ...) మా నిర్మాత రాధాకృష్ణ గారు, నేను బాగున్నాం. మా మధ్య గొడవలు పెట్టకండి బాబూ! ఇప్పటి దాకా ఏ సినిమాలోనూ నేను పైసా పెట్టుబడి పెట్టలేదు. భాగస్వామినీ కాలేదు. కాకపోతే, బడ్జెట్ నియంత్రణ లాంటి విషయాల్లో నిర్మాతకు మన వైపు నుంచి వీలైనంత సాయం చేస్తుంటాం. ఇవాళ సినిమాలపై పణంగా ఒడ్డుతున్న సొమ్ము పెద్దది కాబట్టి, నిర్మాత క్షేమం కోసం యూనిట్ తన వంతు పాత్ర పోషిస్తుంది. అంతే.

  మీరు తీసిన సినిమా మీరే చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది?
 ఏ క్రియేటర్‌కీ తన సృష్టి తనకు పూర్తిగా నచ్చదు. ఇంకా ఏదో, మెరుగ్గా చేయాలనిపిస్తూ ఉంటుంది. మనకున్న పరిమిత సమయం, బడ్జెట్‌లో ఉన్నంతలో బాగా తీస్తాం. తీరా అంతా అయ్యాక,  బయటివాళ్ళకు తెలియకపోయినా మన లోటుపాట్లు మనకు తెలుస్తుంటాయి. అందుకే తీయడమైపోయాక, నా సినిమా కూడా నేను చూడలేను. నేను తీసింది నాకే నచ్చదు. ఆ సృజనాత్మక తృష్ణతో ఎప్పటికప్పుడు ఇంకా నేర్చుకొని, మరింత మంచి సినిమా తీయాలనుకుంటా.

 పాటలకూ, భోజనం సీన్‌కూ పేరొచ్చింది!
 కథ, సందర్భాలు చెప్పగానే దేవిశ్రీ చాలా మంచి పాటలిచ్చాడు. ‘కమ్ టు ది పార్టీ’ పాటకైతే, సీతా రామశాస్త్రి గారు పల్లవి రాశాక ట్యూన్ కట్టాడు. ‘సూపర్ మచ్చీ’ పాట మొదటి ట్యూన్ నచ్చలేదంటే, మరునాటికల్లా తానే పాట పల్లవి రాసి మరీ అద్భుతమైన ట్యూన్‌తో వచ్చాడు. ఇలా ఎన్నో! ఇక, ఉపేంద్ర ఇంట్లో భోజనం సీన్‌లో ఒక పాత్రకు భయం, మరోపాత్రకు ఆశ్చర్యం, వేరొక పాత్రకు జరిగిందేమిటో తెలియని తనం - ఇలా రకరకాల ఎమో షన్‌‌స ఉంటూనే, ప్రేక్షకు డికి మాత్రం వినోదం  కలిగించాలి. అది రాయడం, తీయడం చాలా కష్టమైంది. అలాగే, అందరితో కటువుగా, భార్య వస్తుంటే మాత్రం మంచిగా ఉండే ఉపేంద్ర పాత్రలోని రెండు పార్శ్వాలను చూపే సీన్ కూడా! ఇలాంటివి బాగా రాశాక, దానితో కలిగే ఆనందం వేరు. అందుకే నేను తుది ఫలితం కన్నా, ఆ పని చేసే క్రమాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తా.

  రాజమౌళి హీరోలతో మీరు, మీ హీరో లతో ఆయన చేయరని వెబ్‌సైట్ల కథనం...
 (నవ్వేస్తూ...) కథకు తగ్గట్లు కుది రిన హీరోలతో చేస్తాం తప్ప, ఫలానా వాళ్ళతో చేయకూడదని ఎవరూ అను కోరు. ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇలా అందరితో చేయాలని ఉంది. కథ, డేట్లు కుదరాలిగా! ఏమైనా ఈ వార్త నాకు కొత్త. నేను వెబ్‌సైట్లు చదవను. టీవీ పెద్ద చూడను. దాని వల్ల జీవితం ఎంత సుఖంగా ఉందో చూడండి (నవ్వులు...).

  రాజమౌళిలా మీరూ మన సినిమాను ఇతర భాషల్లోకి తీసుకెళ్ళి, మార్కెట్ పెంచే కథలతో సినిమా తీయచ్చుగా?
 ‘ఈగ’, ‘బాహుబలి’ లాంటివి అలాంటి అద్భుత ప్రయ త్నాలు. నిజాయతీగా మన దగ్గరా అలాంటి కథ ఉంటే చేయాలి తప్ప, ఆయన చేస్తున్నారని మనమూ చేయాలనుకోవడం తప్పు.

 మీ తదుపరి చిత్రం?
 ఇంకా ఏదీ ఖరారవలేదు.

 పవన్ కల్యాణ్, మీరు తీస్తామన్న ‘కోబలి’?
ఉంది. అది ఒక రకంగా ప్యారలల్ సినిమా. అందుకే, మేమే తీయాలను కున్నాం. సాంకేతికంగా క్లిష్ట మైన, ఉన్నత ప్రమా ణాలున్న ఆ చిత్రం కోసం విదేశీ నిపు ణుల్నీ సంప్రతిం చాం. అందుకే కొన్ని లక్షలు ఖర్చు చేశాం. త్వరలోనే చేస్తాం.

ఆడియో ఫంక్షన్‌లో అన్నట్లు పవన్ మీకు దేవుడా? అంతకు మించా?
 మంచి మిత్రుడు. అంతే.

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' Telugu daily, 12th April 2015, Sunday)

.......................................


Sunday, April 12, 2015

మానవ సంబంధాలే... త్రివిక్రమ్ బాక్సాఫీస్ ఆస్తి (సినిమా రివ్యూ - సన్ ఆఫ్ సత్యమూర్తి)

..........................................
 చిత్రం - సన్ ఆఫ్ సత్యమూర్తి, తారాగణం - అల్లు అర్జున్, సమంత, నిత్యా మీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, సంపత్‌రాజ్, ‘వెన్నెల’ కిశోర్, పాటలు - ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్, సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్- సాయిగోపాల్ ఆర్., కెమేరా - ప్రసాద్ మురెళ్ళ, ప్రొడక్షన్ డిజైనర్ - ఎస్. రవీందర్, యాక్షన్ - పీటర్ హెయిన్, కూర్పు - ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.వి. ప్రసాద్, నిర్మాత - సూర్యదేవర రాధాకృష్ణ, రచన - దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్
.........................................

సినిమా రివ్యూ - సన్ ఆఫ్ సత్యమూర్తి

ఒకే కథను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతారు. చెప్పేవాడు గనక చేయితిరిగిన కథకుడైతే, మామూలు కథ కూడా వెండితెరపై కళ్ళకు కొత్తగా కనిపిస్తుంది. హఠాత్తుగా నాన్న చనిపోవడంతో వీధిన పడ్డ కుటుంబాన్ని కాపాడే ఒక కథానాయకుడి కథ మనకు కొత్త కాకపోవచ్చు. కానీ, దానికి నాన్న బోధించిన విలువలే అతి పెద్ద ఆస్తి అనే పాయింట్‌నూ, ఆయన గౌరవాన్ని కాపాడేందుకు హీరో ఎంత దూరమైనా వెళ్ళడాన్నీ జోడించి తీస్తే? త్రివిక్రమ్ - అల్లు అర్జున్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (‘...విలువలే ఆస్తి’ అనేది ఉపశీర్షిక) అలాంటి కథే. ఆస్తికీ, ఆనందానికీ లింక్ లేదని ప్రతిపాదిస్తుంది.

కథ ఏమిటంటే...

విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) ఒక పెద్ద కోటీశ్వరుడైన సత్యమూర్తి (అతిథి పాత్రలో ప్రకాశ్‌రాజ్) కుమారుడు. మనుషులు, అనుబంధాల కన్నా ఆస్తులు, డబ్బులు విలువైనవి కావనే మంచి మనిషి. అనుకోని ఒక దుర్ఘటనలో ఆయన చనిపోతాడు. తండ్రి చెప్పిన విలువల్ని కాపాడడం కోసం రూ. 300 కోట్ల ఆస్తిని అప్పులవాళ్ళకు వదిలేసి హీరో తన కుటుంబంతో వీధిన పడతాడు. అప్పటికే పల్లవి (అదాశర్మ)తో కుదిరిన పెళ్ళిని మామ (రావు రమేశ్) క్యాన్సిల్ చేస్తాడు. అమ్మ (పవిత్రా లోకేశ్), మతి చెడిన అన్నయ్య (‘వెన్నెల’ కిశోర్), వదిన, వాళ్ళ చిన్నారి పాప సంరక్షణభారం హీరో మీద పడుతుంది. ఆర్థిక సంపాదన కోసం హీరో చివరకు వెడ్డింగ్ ప్లానర్ అవతారమెత్తుతాడు. తీరా ఆ పెళ్ళి తనను కాదన్న పల్లవిదే! అక్కడ జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో సమీరా అలియాస్ సుబ్బలక్ష్మి (సమంత)తో హీరో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికీ, చనిపోయిన తన నాన్న మీద ఆమె తండ్రి సాంబశివరావు (రాజేంద్రప్రసాద్) వేసిన అభాండాన్ని చెరిపివేయడానికీ హీరో ఏకంగా తమిళనాడులోని రెడ్డియార్‌పట్టి వద్ద స్థిరపడ్డ ఓ తెలుగు కుటుంబం దగ్గరకు వెళతాడు. అక్కడికి ఫస్టాఫ్.

తమిళనాట కొన్ని గ్రామాలకు నియంతగా వ్యవహరించే దేవరాజు నాయుడు (ఉపేంద్ర), అతని భార్య (స్నేహ)ల కుటుంబంలోకి హీరో, అతని మిత్రుడు పరంధామయ్య (అలీ) చేరతారు. అక్కడ జరిగిన అనేక సంఘటనల మధ్య 600 మంది ప్రైవేటు సైన్యమున్న దేవరాజు తన చెల్లెలు వల్లి (నిత్యామీనన్)ని హీరోకు ఇచ్చి పెళ్ళిచేయాలనుకుంటాడు. ఇష్టం లేని ఆ పెళ్ళిని హీరో ఎలా తప్పించుకున్నాడు, 8 వేల గజాల స్థలం అమ్మకం విషయంలో తన తండ్రి మీద పడ్డ అభాండాన్ని ఎలా చెరిపేసుకున్నాడన్నది మిగతా కథ.

ఎలా చేశారంటే...

క్యారెక్టర్ ఆర్టిస్టు ఎమ్మెస్ నారాయణ ఆకస్మికంగా మరణించడానికి ముందు నటించిన చివరి సినిమాల్లో ఒకటి ఇది. షూటింగ్ అయిపోయాక ఆయన మరణించడంతో, వేరొకరి మిమిక్రీతో డబ్బింగ్‌ను తెలివిగా మేనేజ్ చేసిన ఈ చిత్రబృందం ఈ సినిమాను గౌరవంగా ఎమ్మెస్‌కే అంకితం చేసింది. నిజానికి, ఈ సినిమా నిండా బోలెడంతమంది నటీనటులు. కాబట్టి, ఏ ఫ్రేమ్‌లో చూసినా తెర నిండుగా నటీనటులు కనిపిస్తూనే ఉంటారు. ఇన్ని పాత్రల మధ్యనా అల్లు అర్జున్ విపరీతమైన ఎనర్జీతో, విచిత్రమైన ఒక డైలాగ్ డెలివరీ శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. బాధ్యతాయుతమైన కొడుకుగా, చలాకీ ప్రేమికుడిగా రకరకాల షేడ్స్ ఉన్న పాత్రను బాగా పోషించారు. కొన్ని పాటలకు చులాగ్గా అతను వేసిన స్టెప్పులు బాగున్నాయి. మెయిన్‌స్ట్రీమ్ సినిమాల హీరోయిన్ సమంత డయాబెటిక్ పేషెంట్ లాంటి పాత్ర పోషించడం విశేషమే. అందం, అభినయం కలగలిసిన పాత్రపోషణ ఆమెది. నిత్యా మీనన్ కనిపించేది కాసేపే అయినా, బాగున్నారు. అదాశర్మది చాలా కొద్దిసేపు కనిపించే పాత్ర. ఫస్టాఫ్‌లో అలీ, సెకండాఫ్ చివరలో బ్రహ్మానందం కామెడీ పండించే పనిని భుజానికి ఎత్తుకున్నారు. ఉపేంద్ర, కోట శ్రీనివాసరావు, స్నేహ లాంటి వారు నిడివి రీత్యా చిన్నవే అయినా, ఆ యా పాత్రలు నిండుగా కనిపించడానికి తోడ్పడ్డారు.

సాంకేతిక విభాగాల పనితీరేమిటంటే...

ఫస్టాఫ్ సెంటిమెంట్ సన్నివేశాలతో కొంత నిదానంగా నడుస్తుంది. ఇక, సెకండాఫ్‌లో కొంత వేగంగానే నడిచినా, అనేక అంశాలను ఒక్కచోట గుదిగుచ్చడంతో ఏ పాత్ర మీదా, సంఘటన మీదా పూర్తి శ్రద్ధ పెట్టే అవకాశం లేకుండాపోయింది.అయితేనేం, ఈ సినిమాకున్న అనేక బలాల్లో పాటలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ముఖ్యమైనవి. ఇప్పటికే ఈ పాటలు రేడియోలో, టీవీల్లో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా, ‘చల్ చలో చలో....’ (రచన - రామజోగయ్య శాస్త్రి, గానం - రఘు దీక్షిత్) అనే పాట జీవన తాత్త్వికతను బోధిస్తూ, ఆలోచింపజేసేలా సాగుతుంది. దేవిశ్రీ ప్రసాదే స్వయంగా రాసి, శ్రావణభార్గవితో కలసి పాడిన ‘సూపర్ మచ్చీ...’ పాట సినిమా చివరలో పక్కా మాస్ శైలిలో ఉర్రూతలూపుతుంది. అలాగే, ‘కమ్ టు ది పార్టీ...’ (గానం - విజయ్ ప్రకాశ్) అనే పార్టీ గీతం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కలానికి ఉన్న ఆధునిక పాళీని చూపుతుంది. రాగల కొద్దిరోజులు జనం నోట నానుతుంది. శ్రీమణి రాసిన ‘జారుకో...’ గీతం (గానం - దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్, ఎం.ఎం. మానసి) గమ్మత్తుగా ధ్వనిస్తుంది. ఇక, ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫీ, రవీందర్ కళా దర్శకత్వం కథానుగుణంగా సాగుతాయి. పీటర్ హెయిన్ చేసిన యాక్షన్ సన్నివేశాల్లో సూట్‌కేసు దొంగలపై హీరో చేసే ఫైటు లాంటివి బాగుంటాయి.

ఎలా ఉందంటే...

హీరో ప్రయాణం ఎక్కడో మొదలై మరెక్కడే తేలినట్లూ, బలమైన విలన్ సినిమాకు కరవైనట్లూ అనిపించే ప్రమాదం ఉన్న ఈ స్క్రిప్టు నిజానికి అంతకన్నా బలమైన మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మనం ఎదుటివాళ్ళకు ఏది చేస్తే, అదే మనకూ తిరిగి వస్తుంది. ఎదుటివాళ్ళకు మనం మంచి చేసినా, కోరుకున్నా... అదే మనకూ లభిస్తుందనే విషయాన్ని అంతర్లీనంగా చెప్పే వెండితెర కథ ఇది. త్రివిక్రమ్‌కు బాగా పేరు తెచ్చిన ‘అతడు’, ‘అత్తారింటికి దారేది’ లాంటి వాటి లాగానే ఈ చిత్రం కూడా మానవ సంబంధాలు, బంధాలు, బాంధవ్యాల చుట్టూ తిరిగే కథే. బహుశా అందుకే కావచ్చు... అక్కడక్కడా ఇది త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్‌ల ‘అత్తారింటికి దారేది’నీ, తమిళ నేపథ్యంతో వచ్చిన షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’నూ గుర్తుకుతెస్తుంది. ఇవన్నీ కుటుంబ కథలు కావడం, సకుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసినవి కావడం అనివార్యంగా పోలికలు తెస్తుంది.

కాకపోతే, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా మనసుకు హత్తుకొనేలా, అదీ ప్రేక్షకుడు ఒక్కక్షణం ఆగి ఆలోచించేలాగా కూడా చెప్పడం రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్‌కు ఉన్న పెద్ద బలం. పైగా, కథలోని ఏ సంఘటననూ ఏకబిగిన ఒకేసారిగా పూర్తిగా వెల్లడించరు. దాన్ని విడతల వారీగా చెప్పుకుంటూ, ముడులు విప్పుకుంటూ వెళ్ళడంలో ఒక ప్రయోజనం ఉంది. ఆ సంఘటనలోని రకరకాల కోణాలు మెల్లగా వెల్లడవుతూ, ఒక సస్పెన్స్‌నూ, సర్‌ప్రైజ్‌నూ ఆఖరు వరకూ కొనసాగిస్తాయి. హీరో తండ్రి తాలూకు ప్రమాదమనే సంఘటనను హీరో దృష్టిలో ఒకసారి కొంత, హీరోకు ప్రత్యర్థి (విలన్ అనచ్చా?) దృష్టిలో మరికొంత, దానికి కొనసాగింపుగా నిత్యా మీనన్ దృష్టిలో మరికొంత వెల్లడించడం అలాంటిదే! ఇలాంటి సినీ కథన పద్ధతి ఆసక్తికరంగానూ, రొటీన్‌కు భిన్నంగానూ అనిపిస్తుంది. డైలాగ్ కామెడీ కన్నా దృశ్యాలు, భావప్రకటన ద్వారా విజువల్ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వడం కూడా కొత్తగా అనిపిస్తుంది.

ఈ సినిమా మొత్తాన్నీ ఆయన ఒక మంచి నవల తరహాలో నేరేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో పాత్రలు, సంఘటనలు, కొన్నిచోట్ల రచయితగా రాసిన డైలాగులు మామూలు కన్నా ఎక్కువే. హీరో మరీ ఎక్కువ మాట్లాడుతున్నాడేమో అనీ అనిపిస్తుంది. అయితే, రొటీన్ సినిమాలకు భిన్నమైన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. కొన్నిచోట్ల త్రివిక్రమ్ రాసిన డైలాగులు, పాత్రల ద్వారా వల్లించిన జీవన సూక్తులు చిరకాలం గుర్తుండిపోతాయి. హీరో మాటల్లో వచ్చే ‘‘ మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత. పిల్లలు  మోయాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం’’..., ‘‘మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్’’..., ‘‘భార్యను గెలవాలంటే కప్పులు పగలగొట్టడం కాదు సార్! (మధ్యలో ఉన్న) ఆ గోడ బద్దలుకొట్టండి!’’ లాంటి డైలాగులు అందుకు ఉదాహరణ. తమిళనాట సన్నివేశాలకు ‘కూడు తిన్నారా?’ లాంటి అక్కడ మాట్లాడే తెలుగే వాడేందుకు శ్రమించారు. ఇవన్నీ సినిమాకు పాజిటివ్ అంశాలు

అయితే, ఏ సీన్‌కు ఆ సీన్‌గా బాగుందనిపించే ఈ రెండు గంటల 42 నిమిషాల సినిమాలో వచ్చే సవాలక్ష సబ్‌ప్లాట్లు, తండ్రి గౌరవాన్నీ - ఆయన చెప్పిన విలువలనూ కాపాడుకోవడం కోసం హీరో పడే పాట్లు చూశాక కొన్నింటికి సరైన వివరణలు, తార్కికమైన ముగింపులు కనపడవు. హీరో ప్రేమిస్తున్నది అదాశర్మ స్నేహితురాలైన సమంతను అని పెళ్ళి ఏర్పాట్ల మధ్య పదే పదే చెబుతూ వస్తారు కానీ, ఆ పక్కనే కనిపిస్తున్న రాజేంద్రప్రసాద్ కూతురే ఆ అమ్మాయన్న సంగతిని తరువాత సీన్ల ఎప్పుడో బయటపెట్టడం ఒక సినిమాటిక్ స్క్రీన్‌ప్లే కన్వీనియన్స్. ఇక, నిత్యామీనన్ నిజానికి ప్రేమిస్తున్నది తన మేనమామనే అయినా, హీరోతోనూ ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం తికమక కలిగిస్తుంది. అలాగే, ఉపేంద్ర ఇంటిపక్కనే అతని బావమరిది ఉన్నాడని చెబుతారు, చూపిస్తారు కానీ, సినిమాలో అతను మళ్ళీ కనిపించడు. తమిళనాడులోని ఉపేంద్ర ఇంటికి హీరో బృందం రావడానికే కారణమైన సదరు బావమరిది పాత్ర ఆ తరువాత వారి గురించి పట్టించుకోదెందుకో తెలియదు.

ఇలాంటి లూజ్ ఎండ్స్‌ను పక్కనపెడితే, మొత్తం మీద ఈ సినిమా సగటు ప్రేక్షకులను నిరాశ పరచదు. అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. మర్చిపోతున్న మానవ సంబంధాలు, మనం వదిలేసుకుంటున్న మంచి విలువలను మరోసారి గుర్తు చేస్తుంది. ఆ మేరకు ఈ దర్శక - రచయితనూ, తీసిన నిర్మాతనూ అభినందించాల్సిందే! కాకపోతే, పెళ్ళి భోజనానికని సిద్ధమై వచ్చిన ప్రేక్షకులు పూర్తిస్థాయిలో సంతృప్తి పొందుతారా అన్నదే కించిత్ అనుమానం. అయితే, అవేవీ ఈ సినిమా కమర్షియల్ విజయాన్ని అడ్డుకోలేవన్నది మాత్రం అనుమానం అక్కర్లేని నిజం.

కొసమెరుపు - 
అన్నట్లు... ఈ సినిమాలో హీరో పాత్రను ఒకరు నందు అంటారు... మరొకరు ఆనంద్ అంటారు... ఇంకొందరు విరాజ్ అని పిలుస్తారు. వెరసి అతని పూర్తి పేరు - విరాజ్ ఆనంద్ అని ప్రేక్షకులే గ్రహించాలి. మొత్తానికి, సినిమాలో ఒక ప్రధానమైన కథకు బోలెడన్ని ఉపకథలు కలిపినట్లే, ఒక హీరో పాత్రకు ఇన్ని పేర్లు, ముద్దు పిలుపులూ ఉండడం అరుదైన విచిత్రమే! మొత్తానికి, త్రివిక్రమ్ మార్కు డైలాగులు, కథన విధానం, అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ బాణీల్లోని పాటలు లాంటి వాణిజ్య విలువలు ఈ ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి బాక్సాఫీస్ వద్దే కాక, రేపు పదే పదే టీవీ చానళ్లలో ప్రసారానికీ తరగని ఆస్తి. ‘త్రివిక్రమ్ సినిమా అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి’ అనుకొంటూ, గత చిత్రాల పోలికలతో ‘అంతకు మించి...’ కావాలని కోరుకోకపోతే, వేసవి సినీ కాలక్షేపానికి ఇంతకు మించి కావాల్సింది ఇంకేముంటుంది!

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' Web edition, 9th Apr 2015, Thursday)
...........................................................

Thursday, April 9, 2015

ఆ హీరోయిన్ల నుంచి...ఎంతో నేర్చుకున్నా! - అల్లు అర్జున్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ,

ఆ హీరోయిన్ల నుంచి...ఎంతో నేర్చుకున్నా!

బుధవారం మధ్యాహ్నం 3 గంటల వేళ... హైదరాబాద్‌లో సూర్య ప్రతాపంతో వీధులు వేడెక్కి ఉన్నాయి. ఉదయం నుంచి పుట్టినరోజు హంగామా... ‘ట్విట్టర్’ రంగప్రవేశపు ఆర్భాటం... ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా రిలీజు హడావిడి... వీటన్నిటి మధ్య హీరో అల్లు అర్జున్‌కు క్షణం తీరిక లేదు. ‘గీతా ఆర్ట్స్’ కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో వేచి ఉన్న అభిమానులను ఆత్మీయంగా పలకరిస్తూ, తరువాతి చిత్రాల తాలూకు కథల గురించి ఇద్దరు ప్రముఖ దర్శకులతో చర్చకు సిద్ధమవుతూనే, సినిమా రిలీజు వేడి... పత్రికల్లోని వార్తల వాడిని తట్టుకుంటూ, వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారీ స్టైలిష్ స్టార్. మనసు పెట్టి చేసిన భారీ బడ్జెట్ చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మొదలు ‘రుద్రమదేవి’లో ముఖ్య పాత్ర, సినిమాతో నేర్చుకున్న అంశాల దాకా అనేక విష యాలపై మనసులోని మాటలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు...

 ఆ హీరోయిన్ల నుంచి...ఎంతో నేర్చుకున్నా!


‘అత్తారింటికి దారేది-2’ అంటూ ‘సన్నాఫ్..’పై వ్యాఖ్య వినిపిస్తోంది.
ఇంటర్నెట్‌లో ఏవేవో రాస్తుంటారు. దానికీ, దీనికీ పోలికే లేదు. ‘అత్తారింటికి’లానే ఇదీ సకుటుంబ వినోద తరహా చిత్రం కావడంతో పోలిక తెస్తున్నారు. మంచి కథ కుదిరింది. చేశాం. అంతే.

 మరి, సన్నాఫ్ సత్యమూర్తికీ, సన్నాఫ్ అరవింద్‌కీ పోలికలు, తేడాలు?
 సన్నాఫ్ సత్యమూర్తికీ, సన్నాఫ్ అల్లు అరవింద్‌కీ పెద్ద తేడా లేదు. నిజం చెప్పాలంటే, ‘ఖుషి’ సూపర్‌హిట్ తర్వాత పవన్‌కల్యాణ్ గారిని కలిసినప్పుడు ‘నువ్వేంటో నీ సినిమా అదే’ అని నాతో అన్నారు. అప్పటికి నా ‘ఆర్య’ సినిమా వచ్చింది. నాకూ, దానికీ పోలిక లేదే అనుకున్నా. తరువాత నాకు అర్థమైంది ఏమిటంటే, మన భావోద్వేగాలు, ఆలోచన లకు తగ్గ కథలనే మనం ఏరుకుంటామని. ‘ఆర్య’ కథకు నా వయసు, ‘రేసుగుర్రం’ కథకు మా ఇంట్లోని అన్నదమ్ముల బంధం, ఇప్పుడీ సినిమాకు నాన్నతో కొడుకు అనుబంధం లాంటివి కనెక్టయ్యాయి. ఇందులో కొంత మా ఇంట్లోనే చిత్రీకరించాం.  త్రివిక్రమ్ అడగగానే, తాముండే గ్రౌండ్ ఫ్లోర్‌లోనే షూటింగ్‌కు నాన్న గారు ఒప్పుకున్నారు.

 మీ గత చిత్రాల్లో కన్నా ఈ సారి బాగా స్టైల్ పెంచినట్లున్నారు!
 (నవ్వేస్తూ...) ఇటీవల వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో...’ సినిమాలో రాక్ గిటార్ ప్లేయర్‌గా చేశాను. ‘రేసు గుర్రం’లో మధ్యతరగతి అబ్బాయిగా చేశాను. వాటితో పోలిస్తే, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’లో నాది కొంత డిగ్నిటీ ఎక్కువున్న పాత్ర. హుందాతనం నిండిన ఆ పాత్రలో కూడా వస్త్రధారణలో ఒక స్టైల్ తెచ్చేందుకు ప్రయత్నించాం. పైగా, నేనెప్పుడూ ఒకటికి నాలుగు అలంకరణలతో నిండిన వస్త్రధారణ చేస్తుంటా. కానీ, పాటలు వదిలేస్తే, ఈ సినిమాలో కావాలనే అవన్నీ వదిలించుకొని, సింపుల్‌గా, సింగిల్ పీస్‌లో ఉండేలా చూశా. దాంతో, నేను కొత్తగా కనిపిస్తాను.

 ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ముగ్గురు హీరోయిన్లున్నారు. అప్పుడు ‘ఇద్దరమ్మాయిలతో...’ అయితే, ఇప్పుడు ‘ముగ్గురమ్మాయిలతో’నా?
 (నవ్వేస్తూ...) ఏకకాలంలో ముగ్గురమ్మాయిలతో షూటింగ్ లేదు. ఉండి ఉంటే, ఆ షాట్ ఎప్పటికీ తెమలదేమో! (మళ్ళీ నవ్వేస్తూ...) జోక్‌గా అలా అంటున్నాను కానీ, ఇప్పుడొస్తున్న యువ కథానాయికలు చాలా ప్రొఫెషనల్. నిజానికి, ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు ఎక్కువ కనిపిస్తారు. వారితో పోలిస్తే, అదా శర్మ కనిపించేది తక్కువే.

 ఈ ముగ్గురు హీరోయిన్ల ప్రత్యేకత ఏమిటో?
 సినిమాలో ముగ్గురివీ ముఖ్యపాత్రలే. నిజజీవితంలో ఈ ముగ్గురు హీరోయిన్లకూ ఎవరి వ్యక్తిత్వం వారికుంది. సమంతలో ఒక విలక్షణ లక్షణం ఉంది. ఆమె ఇటు ఎంతో అందంగా కనిపిస్తూనే, అటు మంచి అభినయం పండించగలదు. ఇక, నిత్యామీనన్‌లోని అద్భుతమైన గుణం ఏమిటంటే, తనకు ఇవ్వజూపిన పాత్ర బాగుందా, లేదా అని మాత్రమే ఆలోచిస్తుంది. అంతేతప్ప, తనదే సినిమాకు ప్రధాన పాత్ర కావాలనీ, అలా మెయిన్ క్యారెక్టర్ కాకపోతే తన ఇమేజ్ పోతుందనీ భయపడదు. వెనుకాడదు. ఇక, అదాశర్మ ప్రతిభావంతురాలు. ఈ చిన్న వయసులోనే ఎంతో అద్భుతంగా అవతలివాళ్ళను అనుకరిస్తుంది. అంత మిమిక్రీ చేయగల అమ్మాయిని తొలిసారి చూశా. వీళ్ళతో వర్‌‌క వల్ల ఎంతో నేర్చుకున్నా.

 నిజంగానా? ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నారేమిటి?
 నా దగ్గర పనిచేసేవాళ్ళను నేను బాగా చూసుకుంటూ ఉంటా. కానీ, సమంతను చూశాక, మన దగ్గర పనిచేసే సిబ్బందిని తనంత బాగా చూసుకోవాలని నేర్చుకున్నా. నిత్యా మీనన్‌ను చూశాక ఏ విషయంలోనైనా తగినంత మేరకు సరైన భయం పెట్టుకోవాలే తప్ప, అనవసరపు భయం పెట్టుకోకూడదని అర్థం చేసుకున్నా. ఉదాహరణకు, ఒక స్టెప్ వేయాలంటే నేర్చుకోకుండా కెమేరా ముందుకు వెళితే భయపడాలి. అది సరైన భయమే. కానీ, అంతా నేర్చుకొని వెళ్ళాక, సరిగ్గా చేస్తానో, లేదో అనే భయం అనవసరం. ఆత్మవిశ్వాసంతో వెళ్ళి, నేర్చుకున్నది అద్భుతంగా చేసేయడమే! ఇక, చాలా చిన్న వయసు అమ్మాయైన అదాశర్మను చూశాక, ఏ విషయంలో అయినా సరే వేగంగా నిర్ణయం తీసుకొనే ఆ వయసులోని లక్షణాన్ని ఎప్పటికీ వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. కొన్నేళ్ళ క్రితం దాకా నేనూ అలాగే ఉండేవాణ్ణి.

 త్రివిక్రమ్ పనితీరు ఎలా అనిపించింది?
  త్రివిక్రమ్ తో సినిమా అంటే చాలు నేను ఒప్పేసుకుంటా. ఆ తరువాతే స్క్రిప్టు వింటా. మా కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘జులాయి’ సమయంలోనే ఆ మాట చెప్పా. దానికే, ఇప్పటికీ కట్టుబడి ఉన్నా.  సెట్స్‌లో ఆయన ఎక్కువగా ఏదీ చెప్పరు. కాకపోతే, షూటింగ్‌కు వెళ్ళడానికి ముందే కథ, పాత్రల గురించి మాట్లాడతారు. ఆ పాత్రను అలా చేయాలి, ఇలా చేయాలని బాగా మాట్లాడుకుంటాం. సెట్స్ మీద పైకి కనపడని హోవ్‌ువర్‌‌క ఆయనది. ప్రపంచ సినిమా మీద ఆయనకున్న జ్ఞానం అపారం. ‘జులాయి’తో పోలిస్తే, ఇప్పుడు నేను, ఆయన ఎదిగాం. మునుపటి కన్నా ఆయనలో వేగం, పరిణతీ పెరిగాయి. దర్శకత్వంలో అది స్పష్టంగా అర్థమైంది.

 త్రివిక్రమ్‌లో మీకు బాగా నచ్చిన విషయం?
 ‘నేను అనుకున్నది, చెప్పినది, రాసినదే జరగాలి’ అంటూ దాన్నే పట్టుకొని కూర్చొనే రకం కాదాయన. అవతలివాళ్ళు చెప్పింది వింటారు. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తారు. అవసరమైతే తాను అప్పటి దాకా అనుకున్నది మార్చేసుకుంటారు. ఆ ఓపెన్ మైండ్ ఆయనలోని గొప్ప లక్షణం. అది నాకు బాగా నచ్చుతుంది. ఆయన ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఆయనలోని విద్వత్తును నటీనటులందరూ ఎంతో గౌరవిస్తారు.

 ఇంతకీ, దర్శకుణ్ణి ఎంచుకొనేటప్పుడు మీరు చూసేది?
 ఆ దర్శకుడి మైండ్‌సెట్. అది చాలా ముఖ్యం. అతను మనతో సినిమా తీస్తున్నది డబ్బు కోసమా, ఖాళీ లేకుండా చూసుకోవడానికా, మరో  దానికా అన్నది చూస్తాను. సరైన మైండ్‌సెట్‌తో వస్తే ఓ.కె.చెప్పేస్తా. నిజం చెప్పాలంటే, దర్శకులు రెండు రకాలు. మన నుంచి రాబట్టుకొనేవారు ఒక రకం. మనకు ఎంతో ఇన్‌పుట్స్ ఇచ్చేవారు రెండో రకం. త్రివిక్రవ్‌ు రెండో రకం దర్శకుడు. ‘జులాయి’కి ఆయన ఇచ్చిన ఇన్‌పుట్స్ ఎంతో ఉపయోగపడ్డాయి. అప్పటి నుంచి నటుడిగా క్రమంగా ఒక్కో పొరనూ చీల్చుకుంటూ, బాగా బయటకు వస్తున్నా.

 ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ చేశారనీ...?
 (మధ్యలోనే అందుకుంటూ) అదేమీ లేదు. ‘ఆర్య-2’, ‘వరుడు’, ‘వేదం’ చిత్రాల్లో నేను గతంలో చేశా. కానీ, దానివల్ల యువతరానికే దగ్గరవుతాను తప్ప, పిల్లలకూ, కుటుంబ ప్రేక్షకులకూ దూరమవుతున్నా. వెరసి, ఈ లిప్‌లాక్‌ల వల్ల వచ్చే లాభం కన్నా, కలిగే నష్టం ఎక్కువగా ఉంది. కథకు నిజంగా అవసరమైతే అవి చేయడం పెద్ద విషయం కాదు. అలా కానప్పుడు అనవసరమని లిప్‌లాక్‌లకు దూరంగా ఉండదలిచా.

 ఇంతకీ ఈ సినిమా ద్వారా మీరు పొందిందేమిటి? పోగొట్టుకున్నదేంటి?
 కొద్దిగా బరువైతే పెరిగాను. (నవ్వులు...). వస్త్రధారణతో సహా అనేక అంశాల్లో కొన్ని అనవసర భయాలు, ఆందోళనలు, అలవాట్లు వదిలేశాను.

 పెద్ద హీరో అయ్యుండీ ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డిగా చేస్తున్నారే?
 ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటివి తెలుగు సినిమా ప్రమాణా లనూ, వాణిజ్య పరిమాణాన్నీ - రెంటినీ పెంచుతాయి. శంకర్ లాంటి వారు అలా చేయబట్టే, తమిళంలో వంద కోట్ల పెట్టుబడితో సినిమాలు తీయగలుగుతున్నారు. మనం కూడా ఇతర భాషా పరిశ్రమల మార్కెట్‌ను కూడా సంపాదించాలి. అందుకు మనకు ‘మగధీర’, ‘ఈగ’ లాంటివి దోవ చూపాయి. రానున్న ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ అలాంటివే. అవి బాగా ఆడాలి. అందుకే, నా వంతుగా గోన గన్నారెడ్డి పాత్ర చేశా.

 ఎవరెవర్నో దాటి ఆ పాత్ర మీకొచ్చినట్లుంది?
 దర్శక - నిర్మాత గుణశేఖర్‌తో నా కాంబినేషన్‌లో ‘వరుడు’ చిత్రం ఫ్లాపైనా, ఆయనపై నాకు అపారమైన గౌరవం ఉంది. ‘వరుడు’ ఆడలేదంటే దానికి కారణం - మా పొరపాటే తప్ప, నిర్లక్ష్యం కాదు. ‘రుద్రమదేవి’ 3-డి సినిమా. మన చరిత్రను చెప్పే సినిమా. అలాంటి 3డి చిత్రాలు ఆడితే, తెలుగు సినిమా సైజ్ కనీసం మరో 40 శాతం పెరుగుతుంది. ‘రుద్రమదేవి’ కథలో కీలకమైన గోన గన్నారెడ్డి పాత్ర ఎవరైనా పెద్ద హీరో చేస్తే బాగుంటుందనీ, అదనపు మార్కెట్ వస్తుందనీ ఆగింది. అది తెలిసి, నేనే ఆయనను సంప్రతించాను. నాకు తగ్గట్లు పాత్రను మలచగలనేమో ఆలోచించి చెబుతానన్నారు.  కొద్దిరోజులాగి, అప్పుడు సరేనన్నారు. నేనూ ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేశా.

 ‘నేను తెలుగు భాష లెక్క... అక్కడా ఉంటా, ఇక్కడా ఉంటా’ అని దాన్లో డైలాగ్. మీ ఉద్దేశం రెండు రాష్ట్రాలనా?
 అటు అడవిలోనూ, ఇటు కోటలోనూ అని కథా పరంగా అర్థం. (నవ్వేస్తూ...) రెండు తెలుగు రాష్ట్రాలనీ అనుకోవచ్చు.
  తెలుగు ప్రేక్షకులంతా నాకు కావాల్సినవాళ్ళే!

 మలయాళంలో డబ్బింగ్‌తో మీరు 3 రాష్ట్రాల్లో ఉన్నారు...
 మనం, మన సినిమా ఒక మెట్టు ఎక్కడమంటే అదే! ‘సన్నాఫ్...’ మలయాళ డబ్బింగ్ కూడా రెండు వారాల్లో రిలీజవుతోంది. నాకు నేరు మలయాళ చిత్రాలూ చేయాలని ఉంది. సరైన కథ, దర్శకుడొస్తే చేస్తా. హిందీలోనూ అంతే. ‘ఏబీసీడీ’లో చిన్న పాత్రకు అడిగారు కానీ చేయనన్నా.

 ‘సన్నాఫ్..’ ఆడియోలో చిరంజీవిని దాసరి ప్రస్తావిం చకపోవడం అనేక వ్యాఖ్యలకు తావిచ్చింది?
 సహజంగానే బయట విమర్శలు వస్తాయి కదండీ! ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత పవన్ కల్యాణ్ ప్రత్యేక స్టయిల్ తెచ్చారని ఆయన అన్నారు. కొన్నిసార్లు వేదికపై కొన్ని పేర్లు చెప్పడం మర్చిపోతుంటాం. ఒకసారి ఆడియో వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పడం నేనే మర్చిపోయా. దాసరి గారు అలాగే మర్చిపోయి ఉండవచ్చు. అది కావాలని జరిగిందో, అనుకోకుండా జరిగిందో నాకు తెలియదు. ఏమైనా, దాసరిగారు మా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన్ని మేము గౌరవించాలి. అంతే!

 దానికి వచ్చిన విమర్శల వల్లనేనా మీరు వరంగల్‌లో ‘రుద్రమదేవి’ ఆడియోలో చిరంజీవి పేరు తెచ్చి, ఆ చెట్టు నీడన పెరిగామన్నారు?
 అవును. కచ్చితంగా అందుకే అన్నాను. ఆ మాట నిజమే కదా!

 తకాలానికి ట్విట్టర్‌లో ఖాతా తెరవడమెలా ఉంది?
అభిమానులకు దగ్గరవడం ఆనందంగా ఉంది. కానీ, రావడమే చాలా ఆలస్యమైంది. మా తమ్ముడు అల్లు శిరీష్ నన్ను మొదటి నుంచి బలవంతం చేస్తున్నా ఇవాళ్టికి కుదిరింది.

 చాలామందిలా మీ ట్విట్టర్‌ను వేరెవరో హ్యాండిల్ చేస్తారా?
 నా విషయాలు, ఫోటోలు పంచుకోవడానికి ట్విట్టర్ వేదిక. నా పేరు మీద వచ్చేది కాబట్టి, స్వయంగా నేనే చూసుకుంటా.

 మీ అబ్బాయి అయాన్‌కు ఈ మధ్యే ఏడాది నిండింది కదా. తండ్రి బాధ్యతల్లో ఎలా ఉన్నారు?
పిల్లవాడు పుట్టాక సహజంగానే నాలో కొంత మార్పు వచ్చింది. మా వాడి మొదటి పుట్టినరోజుకని ఈ మధ్యే సింగపూర్‌కు కుటుంబ సమేతంగా వెళ్ళాం. అక్కడే సరదాగా గడిపి, వచ్చాం.

 మీ తదుపరి చిత్రం ఏమిటి? దర్శకుడు బోయపాటి శ్రీనుతోనేనా?
 చర్చల్లో ఉన్నాం. కొలిక్కిరాగానే తక్షణ చిత్రమేంటో చెబుతా.

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 9th April 2015, Thursday)
......................................... 

వేసవి కలిసొచ్చే 'జిల్'

వేసవిలో కలిసొచ్చే 'జిల్'

చిత్రం - జిల్..., తారాగణం - గోపీచంద్, రాశీఖన్నా, కబీర్ (నూతన పరిచయం), బ్రహ్మాజీ, చలపతిరావు, ఐశ్వర్య, కెమేరా - శక్తి శరవణన్, సంగీతం - జిబ్రాన్, ఫైట్స్ - అనల్ అరసు, కళ - ఏ.ఎస్. ప్రకాశ్, కూర్పు - కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు - వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - రాధాకృష్ణ కుమార్
 .............................................
 కొన్ని సినిమాలకు కొన్ని బాక్సాఫీస్ సానుకూలతలు కలిసొస్తాయి. మాస్ మెచ్చే ఫార్ములా కథ... తక్కువ నిడివి సినిమా... చకచకా నడిచే కథనం... అక్కడక్కడా కథ పక్కదోవ పట్టినట్లు అనిపించినా చటుక్కున బండిని పట్టాల మీదకెక్కించే సంఘటనలున్న స్క్రిప్ట్... వీటన్నిటికీ తోడు కొత్తగా మొదలవుతున్న వేసవి సెలవుల సీజన్ కూడా కలిసొస్తే? గోపీచంద్ నటించిన తాజా చిత్రం 'జిల్'కి కూడా అవన్నీ సమకూరాయి. గత ఏడాది వచ్చిన వాణిజ్య విజయం 'లౌక్యం'తో ఊపు మీదున్న గోపీచంద్, గతంలో ప్రభాస్‌తో 'మిర్చి' తీసిన నిర్మాతలు కలసి కొత్త దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌తో చేసిన తాజా ప్రయత్నం ఇది. అన్ని సానుకూలతులున్నా... కథను బిగువుగా తెరపై నడిపించారా అన్నది చూద్దాం...

కథ ఏమిటంటే...
ముంబయ్‌లో ఒక మాఫియా డాన్ ఛోటా నాయక్ (నూతన పరిచయం - మోడల్ కబీర్). పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కిన అతను తప్పించుకుంటాడు. ఈ మాఫియా డాన్ తనను మోసం చేసి, వెయ్యి కోట్లు కొట్టేసిన మాజీ సహచరుడు రంగనాథం (బ్రహ్మాజీ) కోసం వెతుకుతుంటాడు. రంగనాథం హైదరాబాద్‌లో తలదాచుకొంటాడు.

మరోపక్క హైదరాబాద్‌లోనే జై (గోపీచంద్) ఒక అగ్నిప్రమాద నివారక దళ అధికారి. స్వయానా ఫైర్ ఆఫీసరైన బాబాయ్ (చలపతిరావు), పిన్ని (ఐశ్వర్య) కుటుంబంతో అతనిది అందమైన అనుబంధం. అనుకోని పరిస్థితుల్లో ఒక టీనేజ్ అమ్మాయి సావిత్రి (రాశీఖన్నా)ని కాపాడిన హీరో, ఆమెతో ప్రేమలో పడతాడు. ఒక సందర్భంలో రంగనాథాన్ని విలన్ అనుచరుల నుంచి హీరో కాపాడతాడు. దాంతో, విలన్‌కూ, హీరోకూ మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ తరువాత ఒక అగ్ని ప్రమాదంలో రంగనాథ్ మరణిస్తాడు. ఆ మరణించే క్రమంలో హీరోతో ఏదో చెబుతాడు. దాంతో విలన్ ఆ వెయ్యికోట్ల రహస్యం హీరోకే చెప్పాడని వెంటపడతాడు. అక్కడ నుంచి రెండు వర్గాల మధ్య జరిగే పిల్లీ ఎలక పోరాటం మిగతా సినిమా.

 ఎలా చేశారంటే...
కథానాయకుడిగా గోపీచంద్ మునుపటి కన్నా మరింత స్లిమ్‌గా, కొత్త లుక్‌తో, ఉత్సాహంగా కనిపించారు. సన్నివేశాల్లోనే కాక, పాటలు, ఫైట్లలోనూ అది కొట్టొచ్చినట్లు కనిపించింది. కథానాయిక రాశీ ఖన్నా కాస్తంత బొద్దుగా, ముద్దుగా ఉన్నారు. పాత్ర తాలూకు చిలిపితనం దానికి తోడైంది. దాంతో, తెర మీద అందంగా మెరిశారు. విలన్‌గా పరిచయమైన కబీర్ మంచి ఒడ్డూ పొడుగు, గడ్డంతో బాగున్నారు. చలపతిరావు, ఐశ్వర్య, చిన్న పాత్రలో కనిపించే అవసరాల శ్రీనివాస్ లాంటి వారు సరేసరి.

ఈ సినిమాకు ప్రధాన బలం - కెమేరా పనితనం. కొంత డిజిటల్ కెమేరాతో, మరికొంత ఫిల్మ్‌తో చిత్రీకరించిన ఈ సినిమాలో శక్తి శరవణన్ ఛాయాగ్రహణ పనితనం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఫారిన్ లొకేషన్లలో పాటల నుంచి చిన్న అపార్ట్‌మెంట్ల మధ్యలో, శ్మశానంలో ఫైట్ల దాకా తెరపై కనువిందైన విజువల్స్ అలరిస్తాయి.పాటల విషయంలో జిబ్రాన్ నవతరం శైలిలోని అనుసరించినా, సినిమాలో వచ్చే రెండో పాట ఒక్కటే పాడుకోవడానికి వీలుగా అనిపిస్తుంది. అనల్ అరసు ఫైట్లు,

 ఎలా ఉందంటే...
 ఈ చిత్ర కథలో లోపాలూ చాలానే కనిపిస్తాయి. విలన్ అయిన మాఫియా డాన్‌కూ, అతను వెతుకుతున్న మాజీ అనుచరుడు రంగనాథం (బ్రహ్మాజీ)కూ మధ్య ఏం జరిగిందన్నది, అతనెలా వెయ్యికోట్లతో తిరుగుతున్నాడన్నది కథలో వివరంగా చూపరు. అలాగే, హైదరాబాద్‌లో రంగనాథంకు అందించే పాస్‌పోర్ట్, వగైరాల కథ గురించీ పెద్దగా వివరం లేదు. అవన్నీ ఒక్క సీన్‌లో, మూడు ముక్కల్లో డైలాగుల్లో తేల్చేశారు. ఆ రకంగా స్క్రిప్టులో మరింత చిక్కదనానికి ఉన్న అవకాశాన్ని తామే చేజేతులా వదులుకున్నారు. అలాగే, ఉన్నట్టుండి సినిమాలో కామెడీ తగ్గిందనే భావన కలగడం వల్లనో ఏమో పోసాని, అతని అనుచరుడు హీరో ఇంటికి వెళ్ళి వెతికే ఘట్టాన్ని బలవంతాన జొప్పించారు. దాని వల్ల సినిమా నిడివి పెరగడం, చకచకా వెళుతున్న కథ కాళ్ళకు అడ్డం పడడం తప్ప, ఆ సీన్ వల్ల వినోదం కానీ, సినిమాకొచ్చిన విశేష ప్రయోజనం కానీ లేదనే చెప్పాలి.

హీరో కుటుంబంపై విలన్ దాడి, అతని మీద ప్రతీకారానికి హీరో చెలరేగడం దగ్గరే ప్రేక్షకులకు కూడా కొంత విలన్ మీద కోపం పెరుగుతుంది. లేదంటే, విలన్ తన వెయ్యి కోట్ల కోసం తానే కొట్లాడుతున్నాడు కదా, అందులో తప్పేముంది అనిపించే ప్రమాదం హెచ్చు. సినిమా కోసమని లాజిక్‌లతో పని లేకుండా కొంత స్వేచ్ఛ తీసుకొని, ఎక్కడికక్కడ కథ ముందుకు నడవడానికి తగ్గట్లు కన్వీనియంట్ స్క్రీన్‌ప్లే రాసుకున్న సినిమా ఇది. కాసేపు ప్రేమ, ఇంకాసేపు విలనిజం, మరికాసేపు పగ - ప్రతీకరం లాంటి వాటిని తీసుకొని, దేని మీదా పూర్తి దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది.

అలాంటి లోటుపాట్లు పక్కనపెడితే, తొలి చిత్ర దర్శకుడిగా రాధాకృష్ణ కుమార్ మంచి మార్కులే పడతాయి, కొన్నిచోట్ల ఆయన రాసుకున్న డైలాగులూ, 'హీరోతో ఫోన్‌లో మాట్లాడినవారినల్లా చంపేస్తా'నంటూ విలన్ వేసిన పీటముడి లాంటివి ప్రేక్షకులకు బాగుంటాయి. అయితే, అవన్నీ ఈ రెండు గంటల 20 నిమిషాల సినిమాను దీర్ఘకాలం బాక్సాఫీస్ వద్ద నిలబడతాయా అన్నది చూడాలి. మీదకొచ్చి పడే కొత్త సినిమాల సత్తా ఏమిటన్న దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అప్పటి దాకా 'జిల్' అనే పేరు ఎందుకు పెట్టారా అని ఆలోచించకుండా, సామాన్య యాక్షన్ చిత్ర ప్రేమికులు కాలక్షేపానికి నిరభ్యంతరంగా ఈ సినిమా చూసేయవచ్చు. మొదటే చెప్పుకున్న అది 'జిల్'కు ఉన్న బలం, సానుకూలత కూడా!

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' Web Edition, 28th March 2015, Saturday)
.........................................