జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, November 27, 2011

రామరాజ్యమంటే ఇదా...!?



(‘శ్రీరామరాజ్యం’సినిమా సమీక్ష - పార్ట్ 1)

ఆఫీసు పని ఒత్తిళ్ళ వల్లనైతేనేం, ఆరోగ్య కారణాల వల్లనైతేనేం, వ్యక్తిగత సమయాభావం వల్లనైతేనేం, ఇటీవల సినిమాలకు వెళ్ళడం అనివార్యంగా తగ్గింది. కానీ, చాలా ఏళ్ళ తరువాత వస్తున్న పౌరాణికం, బాపు గారి దర్శకత్వం, బాలకృష్ణ శ్రీరామపాత్రపోషణ అనేసరికి మనసు పీకింది. ‘శ్రీరామరాజ్యం’సినిమాకు ఇవాళ ఆదరా బాదరాగా వెళ్ళింది అందుకే. అయితే, అంచనాలు ఎక్కువగా పెట్టుకొని వెళితే, ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా నాకు మరోసారి రుచి చూపించింది.

సినిమాకు వెళ్ళకముందే సాయంత్రం ఓ మిత్రుడి ఫోన్. సినిమా కన్నుల పండుగ అని చెప్పాడు. మరో మిత్రుడు ఫోన్ చేసి, సినిమాకు టాక్ - ఆంధ్రాలో సూపర్. అమెరికాలో అయితే మరీ సూపర్ డూపర్ అన్నాడు. అంతే, ఇనుమడించిన ఉత్సాహంతో ఆఖరి నిమిషంలో టికెట్లు ఎలాగోలా కొనుక్కుని వెళ్ళాను. అంతకు ముందు ‘‘ రాము గాక రాము‘‘ అని భీష్మించుకున్న కొందరు మిత్రులు కూడా, ఈ పాజిటివ్ ఫీడ్ బ్యాక్, టాక్ విని, ఉత్సాహపడ్డారు. అంతా కలసి వెళ్ళాం.

కానీ, ఆఖరికి అనుకున్నదే అయింది. సినిమా ఎందుకో అందరూ చెబుతున్నంత ఆహా, ఓహోగా అనిపించలేదు. అదే సమయంలో, సినిమా తయారీలో ఉండగా బాలకృష్ణ, నయనతార, తదితరుల గురించి వ్యక్తం చేసిన నెగటివ్ కామెంట్లంత నాసిగానూ లేదు. అయితే, ‘శ్రీరామరాజ్యం’ అన్న టైటిల్ కూ, ఈ సినిమా కథకూ సంబంధం చాలా తక్కువ. ఆ టైటిల్ పెట్టడం వెనుక ఉన్న భావమేమిటో సినిమాలో ఎక్కడా స్పష్టం కాదు.

రామరాజ్యమంటే ఎలా ఉండేదో, రామరాజ్యాన్ని ఇవాళ్టికీ ఎందుకు ఆదర్శంగా చెప్పుకుంటారో అన్న విషయాలు సినిమాలో చూపలేదు. పట్టాభిషేక సమయంలో కిరీటధారి రాముడిగా బాలకృష్ణ నోట నాలుగు పొలిటికల్ డైలాగుల ఉపన్యాసంలో పొడిపొడి మాటలు మాత్రం వినిపిస్తారు.

ఒక కథ - మూడు సినిమాలు

ఉత్తరరామాయణ కథ తెలుగు తెరకు కొత్త కాదు. దేవకీ బోస్ దర్శకత్వంలో తీసిన హిందీ ‘సీత’ (1934)ఆధారంగా, ఆ సెట్లు, ఆభరణాలు ఆసరాగా చేసుకొని సి. పుల్లయ్య దర్శకత్వంలో అదే నిర్మాతలు ఈస్టిండియా వారు తెలుగులో ‘లవకుశ’ (1934) నిర్మించారు. అది మొదటిది. గ్రామీణ జనం బళ్ళు కట్టుకొని మరీ పట్నానికి వచ్చి, సినిమా చూసిన సినిమా అది. అప్పుడప్పుడే మూకీల నుంచి టాకీలకు మళ్ళుతున్న తెలుగు నాట సినిమా హాళ్ళు తీర్థప్రజతో నిండిన తొలి చిత్రం దాదాపు అదే. అప్పటి దాకా మూగ చిత్రాలను ప్రదర్శిస్తున్న హాళ్ళు చకచకా టాకీ ఎక్విప్మెంట్ ను బిగించుకున్నదీ ఈ సినిమా అపూర్వ విజయ పర్యవసానమే.

ఆ సినిమా మన తండ్రులు, తాతల తరమే తప్ప మనం చూడలేదు. ఆ సినిమా వీడియో కూడా అలభ్యం. ఇక, మన మనస్సుల్లో చెరగని ముద్ర వేసిందల్లా ఆ తరువాత , అదే సి. పుల్లయ్య గారి దర్శకత్వంలో మొదలై, ఆయన కుమారుడు సి.ఎస్. రావు నిర్దేశకత్వంలో పూర్తయిన లలితా శివజ్యోతి వారి ‘లవకుశ’ చిత్రం (1963). సీతారాములుగా అంజలీదేవి, ఎన్టీయార్ నటించిన ఆ చిత్రం ఏ రకంగా చూసినా ఓ క్లాసిక్. పట్టుగా నడిచే స్క్రీన్ ప్లే, సదాశివబ్రహ్మం రచన, పాత్రధారుల అభినయం, మరీ ముఖ్యంగా ఘంటసాల సంగీతం, పి.లీల - సుశీల లాంటి గంధర్వ గాయనీమణుల అద్భుత గానవైదుష్యం, వీటన్నిటినీ సమస్థాయిలో నడిపిన దర్శకత్వ ప్రతిభ - ఇలా అన్నీ ఒకదానితో మరొకటి పోటీపడుతూ ఆ సినిమాను అజరామరం చేశాయి.


ఆ ‘లవకుశ’ ఓ చరిత్ర

వసూళ్ళలోనూ, చూసిన ప్రేక్షకుల సంఖ్యలోనూ ఎన్టీయార్ ‘లవకుశ’ చిత్రానిది ఓ చరిత్ర. అప్పటి దాకా తెలుగులో ఏ సినిమాకూ అత్యధికంగా రూ. 25 లక్షలు మించి వసూళ్ళు రాలేదు. కానీ, ‘లవకుశ’ చిత్రం వసూళ్ళు ఏకంగా కోటి రూపాయలు దాటాయి. సినిమా హాళ్ళలో అమ్మిన టికెట్ల ఆధారంగా లెక్కవేస్తే, అంతకు మునుపెన్నడూ ఏ సినిమానూ చూడనంత మంది ఆ సినిమాను చూశారు. చుట్టుపక్కలి గ్రామాల వారందరూ సమీపంలోని పట్టణ సినీ కేంద్రానికి వెళ్ళి సినిమా చూడాల్సిన ఆ 1960ల ప్రథమార్ధంలో, దాదాపు ప్రతి రిలీజు కేంద్రంలోనూ ఆ ఊరి జనాభా కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ మంది ఎన్టీయార్ ‘లవకుశ’ చిత్రం చూశారు. అప్పట్లో వరంగల్ కేంద్రం గురించి వచ్చిన ప్రకటనే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. 1963లో వచ్చిన ఆ చిత్రం ఆ తరువాతెప్పుడో పుట్టిన 1970లు, 1980ల నాటి తరానికి కూడా సుపరిచితమైనదే. అంటే, ఆ సినిమా మళ్ళీ మళ్ళీ హాళ్ళలో విడుదలై, ఎన్ని రోజులు ఆడిందో, ఎంతెంత మందిని ఆకర్షించిందో, ఆ రిపీట్ రన్లలో ఇంకెంత వసూలు చేసిందో ఊహించుకోవచ్చు. ఆ రకంగా తెలుగు సినీ చరిత్రలో అత్యధిక కాలం ఆడిన సినిమాగా ‘లవకుశ’ను పేర్కొన్నా తప్పు లేదు. అలాంటి చిత్రకథను మళ్ళీ తెరకెక్కించడం సాహసమే అయినా, ‘‘శ్రీరామరాజ్యం’’ యూనిట్ అందుకు సిద్ధపడింది.

ఇప్పుడు యలమంచిలి సాయిబాబు నిర్మాతగా, బాలకృష్ణతో బాపు - రమణల ‘‘శ్రీరామరాజ్యం’’ ముచ్చటగా మూడోది. తెలుగు రంగస్థలం మీద, సినీ లోకంలో ‘లవకుశ’గా ప్రసిద్ధమైన ఉత్తర రామాయణ కథను తెరకెక్కిస్తూ, ఆ పేరు పెట్టకపోవడంలోనే జంకు తెలుస్తోంది. కానీ, పోల్చిచూడడాలు అనివార్యమని వారికీ తెలుసు. అయితే, కొత్త పేరు పెట్టినా ఆ పేరుకు న్యాయం చేయలేకపోయారు. (ఈ పేరు కూడా 1943లో హిందీ, మరాఠీల్లో విజయ్ భట్ దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్ హిట్ ‘రామ్ రాజ్య’ పేరు నుంచి అరువు తెచ్చుకున్నదే. అదీ లవకుశుల కథే). ఇంకా చెప్పాలంటే, గొప్పగా చెప్పుకొనే రామరాజ్యంలో జరిగింది ఇదా అని అనుమానపడేలా చేశారు.

పాత కథకు కొత్త మార్పులు

పధ్నాలుగేళ్ళ అరణ్యవాసం, రావణ సంహారం తరువాత సీతా లక్ష్మణ హనుమత్ సమేతుడై వానర ప్రముఖులు తోడు రాగా రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు చేరడం, పట్టాభిషిక్తుడు కావడం, సీతాదేవి గర్భవతి కావడం, లోకనిందకు వెరచి సీతా సాధ్విని రామచంద్రుడు అడవిలో వదిలి రమ్మనడం, లక్ష్మణుడు అన్న ఆజ్ఞను శిరసావహించడం, వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి ఆశ్రయం పొందడం, లవకుశుల జననం, విద్యాబుద్ధులు నేర్వడం, వారి రామాయణ కథా గానం, రాముడి అశ్వమేథ యాగం, అశ్వాన్ని లవకుశులు బంధించడం, తండ్రితోనే యుద్ధానికి తలపడడం, ఆఖరికి అసలు విషయం తెలియడం, సీతాదేవి భూమాత ఒడిలో చేరడం, లవకుశులకు పట్టాభిషేకం చేసి, రాముడి అవతార సమాప్తి - ఇదీ స్థూలంగా కథ.

నిజానికి, అందరికీ తెలిసిన, తెరపై చూసేసిన కథను మరోసారి చెప్పదలిచినప్పుడు ఇబ్బందే. అయితే, చెబుతున్నది సెల్ ఫోన్లు, సోషల్ నెట్ వర్క్ సైట్ల నవతరానికి, పౌరాణిక చిత్రాల పొడ తెలియని యువతరానికి కాబట్టి, ఈ చిత్ర రచయిత ముళ్ళపూడి వెంకట రమణ భాష, భావం వీలైనంత సరళంగా ఉండేలా చూశారు. (పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కూడా ఆ బాటలోనే నడిచారు). వాల్మీకి ఆశ్రమంలో సీతా సాధ్వి సేవ కోసం బాల హనుమంతుణ్ణి బాలరాజు పాత్రగా ప్రవేశపెట్టి మూలంలో లేని మార్పు చేశారు ముళ్ళపూడి. తద్వారా కథాగమనంలో కొత్తదనం కోసం కృషి చేశారు. ఆ మార్పు బాగున్నా, దాన్ని సమర్థంగా స్క్రిప్టులో వాడుకోలేకపోయారు. ఆ కొత్త పాత్రతో ప్రధాన రసానికి పరిపోషకంగా హాస్య, అద్భుత, కరుణ రసాలు వేటినీ పండించడానికి ప్రయత్నించనేలేదు.

అలాగే, సీతారాముల ప్రణయ సన్నివేశాల్లో బాపు - రమణల మార్కు కనబడుతుంది. మోతాదు మించనివ్వకపోయినా, రెగ్యులర్ కమర్షియల్ ప్రేమ సినిమాలు చాలకనా, ఆరాధ్యదేవతలైన సీతారాముల మధ్య ఇలాంటి ఘట్టాలు చూపెట్టాలా అని మొహం చిట్లించిన వాళ్ళూ లేకపోలేదు. సినిమాగా, కళాత్మక వ్యక్తీకరణగా మనం సరిపెట్టుకున్నా, మూతిముడుచుకున్న మహాభక్తుల ఆ సెంటిమెంట్ ను పూర్తిగా కొట్టిపారేయలేం.

ఇక, రాముల వారి ఏకపత్నీ వ్రతాన్నీ, పరాయి కాంతల నీడనైనా తాకని ఆయన నిష్ఠనూ తెలిపే సంఘటన సినిమాలో కొత్తగా ఉంది.

రాముడిగా అనూహ్యంగా బాలయ్య

ఉద్దేశపూర్వకంగానో, యాదృచ్ఛికంగానో, ‘శ్రీరామరాజ్యం’ అనే పేరు, హీరోల చుట్టూ తిరిగే సినీ పరిశ్రమ ధోరణికి తగ్గట్లుగా ఉన్నా, నిజానికి ఇది సీత కథ. అడవిలో వదిలి రమ్మని భర్తే ఆజ్ఞాపించడంతో ఆమెకు కలిగిన వ్యధ. అక్కడే అడవిలో పుట్టిన ఆమె పిల్లలు ఆఖరికి తండ్రిని చేరిన గాథ. అందుకే, సహజంగానే ఇందులో శ్రీరాముడి పాత్ర తెరపై ఆట్టే కనిపించదు. అయినా సరే, పౌరాణిక పాత్రల మీద మమకారం, తండ్రి పోషించిన పౌరాణికాలకు తెలుగు నాట తనదే పేటెంట్ అన్న నమ్మకంతో ఈ సినిమాలో బాలకృష్ణ నటించారు.

తండ్రి పోలికలే తప్ప, స్వరూప, స్వభావాల రీత్యా పెద్దాయనకు ఉన్న సానుకూలతలు కొన్ని లేకపోవడం బాలయ్యకు లోటే. అదుపులో లేని శరీరం చాలా సార్లు అడ్డొస్తూ, అర్థమై పోతూ ఉంటుంది. శాంత, శోక, కరుణ రసాన్వితమూర్తి అయిన ఉత్తర రామాయణ రాముడు అందుకు పూర్తి భిన్నంగా, ఎర్రటి కళ్ళతో రోజూ రాత్రి పొద్దుపోయే దాకా నిద్ర లేదని తెలిసిపోతుంటాడు. కరుణ రసపూరిత ఘట్టాల్లోనూ ఎర్రటి కళ్ళతో క్రోధావేశంతో ఉన్నాడేమో అనిపిస్తాడు.

అయినప్పటికీ, అనూహ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఊహించినదాని కన్నా చాలా బాగున్నారు. అదే పనిగా అలవాటైపోయిన ఆంగిక, వాచిక హావ భావ విన్యాసాలకు దూరంగా, నియంత్రితమైన నటనను కనబరచడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. డైలాగులే లేని కొన్ని దృశ్యాల్లో, ముఖ్యంగా వేగు భద్రుడు వచ్చి, లోకనిందను తెలిపిన సందర్భంలో మ్రాన్పడిపోవడం లాంటి చోట్ల దర్శకుడి ఆలోచనలు, సూచనలకు తగ్గట్లు క్లోజప్పుల్లో బాలకృష్ణ లీనమై నటించిన తీరు బాగుంది.

(తరువాయి భాగం మరికాసేపట్లో...)

Sunday, October 23, 2011

కనుగొంటి కనుగొంటి ఇప్పుడిటు కనుగొంటి... తొలి తెలుగు సినిమా పుట్టిన తేదీ కనుగొంటి...



* ‘భక్త ప్రహ్లాద’ విడుదలైంది 1932 ఫిబ్రవరి 6న!

* తొలి పూర్తి తమిళ టాకీ కన్నా మనదే ముందు!



తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ చిత్రం విడుదల తేదీ మీద చివరకు నా పరిశోధనే నిజమని తేలింది. ఆ సినిమా అటు సెన్సారైందీ,
ఇటు విడుదలైందీ కూడా 1932లోనే. ఇన్నేళ్ళుగా ప్రచారంలో ఉన్న 1931లో,అందులోనూ సెప్టెంబర్ 15న ఆ చిత్రం విడుదల కానే కాలేదని నేను చేసిన వాదనకు మరిన్ని తిరుగులేని సాక్ష్యాధారాలు దొరికాయి. మన తొలి తెలుగు సినిమా తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ విడుదలైందీ అన్వేషణలో తేలింది.

టి.వి. 9 లాంటి చానళ్ళు నా వాదనను వినిపిస్తూ ప్రత్యేక వార్తాకథనాలు ప్రసారం చేశాయి. అయితే, సత్యాన్వేషణ దృష్టి, పరిశోధన మీద ఆసక్తి తప్ప నాకు మరో ఉద్దేశమేమీ లేకపోయినా, ‘ఆంధ్రప్రభ’తో సహా పలువురు నా పరిశోధనకు దురుద్దేశాలు ఆపాదించారు. అనుమానాలు వ్యక్తం చేశారు. అవన్నీ నా మునుపటి పోస్టు పరిశోధనపై ‘‘ఆంధ్రప్రభ’’ అనుమానాలు, ఆరోపణలు లో తెలిపాను.

వాటిలోని డొల్లతనాన్నినిరూపిస్తూ, నేనిచ్చిన వివరణ ఇవాళ్టి ‘ఆంధ్రజ్యోతి’దినపత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చింది. ఆ రిజాయిండర్ ఇదీ --

.......................................................................

పరిశోధన


తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్తప్రహ్లాద' విడుదలైన తేదీ ఎట్టకేలకు దొరికింది.

అది 1932 ఫిబ్రవరి 6.


గతంలో (11.9.2011 ఆదివారం ఆంధ్రజ్యోతి సంచిక) ప్రచురితమైన నా పరిశోధనా పత్రంలో- ఇంతకాలం అనుకున్నట్టుగా 'భక్తప్రహ్లాద' 1931 సెప్టెంబర్ 15న విడుదల కాలేదనీ, సగం తెలుగున్న ''తమిళ - తెలుగు టాకీ'' 'కాళిదాస్' 1931 అక్టోబర్ 31న విడుదలయ్యాకే అసలు ఈ పూర్తి తెలుగు టాకీ నిర్మాణమైందనీ చెప్పాను. 1932 జనవరి 22న మాత్రమే భక్త ప్రహ్లాద సెన్సారై, సర్టిఫికెట్ పొందిందని ఆధారం చూపాను. ఆ సెన్సార్ తేదీ నుంచి మద్రాసు రిలీజ్ సమాచారం ససాక్ష్యంగా దొరుకుతున్న ఏప్రిల్ 2వ తేదీ లోపల ఎప్పుడయినా విడుదలై ఉండవచ్చని చెప్పాను. అప్పటికి కచ్చితమైన తేదీ నాకూ సాక్ష్యాధారాలతో లభించ లేదు. ఆ తర్వాత ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మరిన్ని ఆధారాలు సంపాదించి ఈ విషయాలు మీ ముందు పెడుతున్నాను.

తొలి తెలుగు టాకీ 'భక్తప్రహ్లాద', తమిళ - తెలుగు టాకీ 'కాళిదాస్' తర్వాతే వచ్చిందని చెప్పడంలో నాకేవో దురుద్దేశ్యాలు ఉన్నట్లు మరికొంతమంది రాశారు. చరిత్ర పట్ల గౌరవం, పరిశోధన పట్ల ఆసక్తి తప్ప నాకు ఇతరత్రా ఉద్దేశం ఏదీ లేదని మరోసారి తెలియజేసుకుంటున్నాను.


ప్రామాణికమైన సెన్సార్ సర్టిఫికెట్

1931 చివరలో నిర్మాణమై, 1932 జనవరిలో బొంబాయిలో సెన్సారైన 'భక్త ప్రహ్లాద' సెన్సార్ సర్టిఫికెట్ ''నంబర్ 11032.'' ఆ మాటే చెబితే, 'సెన్సార్ అయిన తేదీ కరెక్టేననే నమ్మకం ఏమిటి' అని కొందరు అడిగారు. పైగా 'సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్ వేలల్లో (11032) ఎందుకు ఉంది, అప్పుడప్పుడే కదా టాకీలు ప్రారంభమయ్యాయి' అని కూడా సందేహం వెలిబుచ్చారు.

ఆ రోజుల్లో సెన్సారైన చిత్రాలన్నిటి వివరాలనూ సాక్షాత్తూ ప్రభుత్వమే ఏ నెలకానెల చెబుతూ వచ్చింది. 1932 ఫిబ్రవరి 4 నాటి 'ది బాంబే
గవర్నమెంట్ గెజిట్', పార్ట్-1 (పేజీ 313)లో ఆ క్రిందటి నెల సెన్సారైన అన్ని చిత్రాల వివరాలూ ఉన్నాయి. అందులో 'భక్తప్రహ్లాద' కూడా ఉంది. మన దేశంలో సినిమాటోగ్రాఫ్ చట్టం-1918 అమలవడం మొదలైన దగ్గర నుంచి స్వదేశీ ఫిల్ములూ, విదేశీ దిగుమతి చిత్రాలు, డాక్యుమెంటరీలు, న్యూస్ రీళ్లు సైతం సెన్సారింగ్ జరుపుకుని సర్టిఫికెట్ నెంబర్లు పొందుతూ వచ్చాయి.

దాంతో, 1932 వచ్చేసరికి 'భక్తప్రహ్లాద'కు సర్టిఫికెట్ నెంబర్ వేల సంఖ్యలోకి వచ్చింది.


సెన్సారైతేనే రిలీజు! ఒకచోట సెన్సారైతే చాలు!


'సెన్సార్ కాకముందే విడుదలయ్యే అవకాశం లేదా? బొంబాయి కంటే ముందు ఇంకెక్కడయినా సెన్సార్ అయి ఉండొచ్చు కదా' ఇత్యాది
సందేహాలు కూడా లేవనెత్తారు.


ఆ అవకాశం లేదు. ఎందుకంటే 'సినిమాటోగ్రాఫ్ చట్టం - 1918' ప్రకారం 1920 నుంచే దేశంలో సెన్సార్ బోర్డులు ఏర్పాటయ్యాయి. "బొం బాయి, కలకత్తా, మద్రా సు, రంగూన్, ఆ తరువాత (ఏర్పాటైన) పంజాబ్ (అంటే లాహోర్)లలోని ప్రాంతీయ బోర్డ్ ఆఫ్ సెన్సార్స్‌లో ఒక దాని నుంచి మాత్రమే సెన్సార్ సర్టిఫికెట్ పొందాలి. అలా పొందకుండా ఏ ఫిల్మునూ ప్రదర్శించడానికి వీలు లేదు...'' ('మేకింగ్ మీనింగ్ ఇన్ ఇండియన్ సినిమా',సంపాదకత్వం: రవి ఎస్. వాసుదేవన్; పేజీ 52).


అలాగే "భారతదేశం మొత్తానికీ చెల్లుబాటయ్యేలా (చిత్రాలకు) సర్టిఫికెట్లను మంజూరు చేసే అధికారాన్ని ఈ (ప్రాంతీయ సెన్సార్) బోర్డులకు ఇచ్చారు. అయితే ఏ ప్రావిన్షియల్ ప్రభుత్వమైనా సరే, సదరు చిత్రం తమ ప్రావిన్సులో బహిరంగ ప్రదర్శనకు తగినది కాదని భావించినట్లయితే, ఆ ఫిల్ముకున్న సర్టిఫికెట్‌ను రద్దు చేయవచ్చు...'' ('కొలోనియల్ ఇండియా అండ్ ది మేకింగ్ ఆఫ్ ఎంపైర్ సినిమా', రచన : ప్రేమ్ చౌధ్‌రీ; పేజీ 19) అంటే, 1932 జనవరి చివరలో బొంబాయి బోర్డులో సెన్సార్ జరుపుకున్న 'భక్తప్రహ్లాద'కు దేశమంతటా ప్రదర్శనకు ఆ సర్టిఫికెట్ సరిపోతుంది. ప్రతిచోటా మళ్లీ మళ్లీ సెన్సార్ జరుపుకుని, కొత్త సర్టిఫికెట్ నెంబర్ పొందాల్సిన అవసరం లేదు.
ఇక అసలు విషయానికి వద్దాం.


1932 ఫిబ్రవరి 6 : తొలిసారిగా తెరపై 'ప్రహ్లాద'


సెన్సారైన తరువాత సరిగ్గా పక్షం రోజులకు 1932 ఫిబ్రవరి 6, శనివారం నాడు 'భక్తప్రహ్లాద' రిలీజైనట్లు నా తాజా అన్వేషణలో తేలింది. అంటే ఇంకా మూడున్నర నెలలకు గాని పూర్తి తొలి తెలుగు టాకీ చిత్రానికి 80 ఏళ్ళు నిండవు. మరో ముఖ్యమైన విషయం ఈ చిత్రం మన దేశంలో మొట్టమొదటిసారిగా విడుదలైంది- అప్పటికి ఆంధ్రులు పెద్దసంఖ్యలో ఉన్న బొంబాయిలో. సెన్సారైన మరుసటి వారమే "తెలుగులో మాటలు, పాటలున్న భారత్ మూవీటోన్ వారి భక్తి రస చిత్రం 'భక్తప్రహ్లాద్' త్వరలో విడుదల'' అంటూ ప్రకటనలు వేశారు. ('ది బాంబే క్రానికల్', 1932 జనవరి 31).

ఆ ప్రకటన వచ్చిన వారం లోపలే బొంబాయిలోని న్యూ ఛార్నీ రోడ్డులోని 'కృష్ణా సినిమా'లో తొలిసారిగా 'భక్తప్రహ్లాద విడుదలైంది. రిలీజ్ రోజున కూడా బొంబాయి పత్రికలు ప్రకటనలు వేశాయి. ప్రివ్యూ చూడడం వల్ల అదే రోజుకి వచ్చేలా సమీక్షలు రాశాయి.

'సంపూర్ణ తెలుగు టాకీ' అనే శీర్షికతో "భారతదేశంలో తొలి సంపూర్ణ తెలుగు టాకీని నిర్మించిన ఘనత బొంబాయికి చెందిన భారత్ మూవీటోన్ కంపెనీకి దక్కింది. కృష్ణా స్టూడియోలోని యంత్ర సామగ్రిని ఉపయోగించుకుని,నిపుణులైన సాంకేతిక సిబ్బందితో కలిసి పనిచేయడం ద్వారా పూర్తిగా మాటలు, పాటలున్న చిత్రం (భక్త) 'ప్రహ్లాద'ను ఆ సంస్థ పూర్తి చేసింది...'' అంటూ సమీక్ష రాశారు. ('ది టైమ్స్ ఆఫ్ ఇండియా', 1932 ఫిబ్రవరి 6).

దీన్నిబట్టి కూడా 'భక్తప్రహ్లాద' తయారైందీ, తొలిసారిగా విడుదలయిందీ బొంబాయిలోనేనని అర్థమవుతోంది.

మద్రాసులో ఏప్రిల్ 2న! అంతకన్నా ముందే ఆంధ్రాలో!!

ఈ సినిమా మద్రాసుకు రావడానికి మరో రెండు నెలలు పట్టింది. తెలుగు ఉగాదికి నాలుగు రోజుల ముందు 1932 ఏప్రిల్ 2 శనివారం నాడు 'నేషనల్ పిక్చర్ ప్యాలెస్' (ఇప్పటి '(న్యూ) బ్రాడ్వే టాకీస్')లో విడుదలై రెండు వారాలు ప్రదర్శితమైంది. బొంబాయి నుంచి, అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రాజధాని చెన్నపట్నానికి వచ్చే లోపల 'భక్తప్రహ్లాద' ఇంకెక్కడెక్కడ ఆడిందో తెలియదు గాని "... రాజమహేంద్రవరము నందు వరుసగా మూడు వారముల వరకు ప్రజల నాకర్షించెను...'' ('ఆంధ్రపత్రిక' దినపత్రిక, 1932 ఏప్రిల్
2, పేజీ 14) అనే వాక్యం ఒక్కటే తెలుసు మనకు. ఆ ఒక్క వాక్యం మినహా,తెలుగు నేలపై ఏయే ప్రాంతాలలో, ఏయే తేదీల్లో ఈ తొలి పూర్తి తెలుగు టాకీ ప్రదర్శించబడిందో తెలిపే సాక్ష్యాలు దురదృష్టవశాత్తూ ఇప్పటికీ లభించడం లేదు.


రాజమండ్రిలో, బెజవాడలో రిలీజైందెక్కడ?


రికార్డులను బట్టి చూస్తే, 1932 నాటికి రాజమండ్రిలో 'శ్యామలా టాకీస్'నిర్మాణమే కాలేదు. అప్పటికి ఉన్నవి రెండే హాళ్ళు 'శ్రీకృష్ణా సినిమా', 'బాబ్జీ సినిమా' (ఇప్పటి 'విజయా టాకీస్'). 'భక్తప్రహ్లాద' ఈ రెండిట్లో ఒక దానిలో విడుదలై ఉండాలి. నిడమర్తి వారి 1923-24 నాటి 'శ్రీకృష్ణా సినిమా'ను ఇప్పటికీ 'శ్రీసాయికృష్ణా'గా నిర్వహిస్తున్న మూడో తరానికి చెందిన 58 ఏళ్ళ నిడమర్తి మురళి "తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా', తొలి పూర్తి తెలుగు టాకీ 'భక్తప్రహ్లాద'- రెండూ రాజమండ్రిలో మా హాలులోనే రిలీజయ్యాయి'' అని తమ పెద్దలు చెబుతూ వచ్చిన సంగతుల్ని ఈ పరిశోధకుడికి తెలిపారు. దాన్నిబట్టి ఇది 'శ్రీకృష్ణా సినిమా'లోనే రిలీజయిందని అనుకోవాలి.

నిజానికి అప్పటికి రాజమండ్రి కన్నా బెజవాడ పెద్ద పట్నం. మూకీలు కూడా జోరుగా ప్రదర్శితమైన సినీ కేంద్రం. కాబట్టి, కచ్చితంగా రాజమండ్రి కన్నా ముందే బెజవాడలోనూ 'భక్తప్రహ్లాద' ప్రదర్శింపబడి ఉండొచ్చు.

అప్పటికి బెజవాడలోనూ ఉన్నవి రెండే హాళ్ళు- శ్రీమారుతీ సినిమా, శ్రీదుర్గా కళామందిరం. 1932 డిసెంబర్ తొలినాళ్ళకు గానీ దుర్గా
కళామందిరంలో 'టాకీ' యంత్రాన్ని అమర్చలేదు. కాబట్టి, తొలి విడుదలలో 'మారుతీ'లోనే 'భక్తప్రహ్లాద' వచ్చి ఉండాలి.

అప్పట్లో బెజవాడలో 'భక్తప్రహ్లాద' చూసిన వయోవృద్ధులు తాము 'మారుతీ'లోనే ఆ సినిమాని చూసినట్లు గుర్తు చేసుకున్నారు. ఏడాది
తర్వాత మళ్లీ రిలీజయినపుడు మాత్రం దుర్గాకళామందిరంలో వచ్చింది. ఇవాళ మీడియాలో తరచూ కనిపిస్తున్న 'భక్తప్రహ్లాద' వాణిజ్య ప్రకటన ఆ రెండో రిలీజ్‌కు సంబంధించినదే.


తొలి తెలుగు టాకీల వరుస క్రమం

1932లో సెన్సారైన మొత్తం తెలుగు చిత్రాలు మూడు. వాటి వరుస 'భక్తప్రహ్లాద' (సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్ 11032, తేదీ 22 జనవరి 1932. తొలి రిలీజ్ : బొంబాయిలోని 'కృష్ణా సినిమా'లో 1932 ఫిబ్రవరి 6). రెండోది 'శ్రీరామ పాదుకా పట్టాభిషేకము' (నెం. 11739, తేదీ 17 నవంబర్ 1932. తొలి రిలీజ్ : మద్రాసులోని 'కినిమా సెంట్రల్'లో 1932 డిసెంబర్ 24). మూడో టాకీ 'శకుంతల' (నెం. 11830, తేదీ 21 డిసెంబర్ 1932. తొలి రిలీజ్ : అదే 'కినిమా సెంట్రల్'లో 1933 మార్చి 25). చిత్ర నిర్మాణం వరుసలో 'శకుంతల' మూడో తెలుగు టాకీ అయినా, విడుదల విషయానికి వచ్చేసరికి ఐదోది అయింది. ఎందుకంటే 1933 ఫిబ్రవరి 4,5 తేదీల్లో రెండు 'సతి సావిత్రులు' విడుదలయ్యాయి. వాటి తరువాతే 'శకుంతల' మార్చి 25న రిలీజైంది.


కొసమెరుపు :

తమిళం కన్నా ముందే తెలుగు


ఇంత చెప్పాక ఇదేమిటని ఆశ్చర్యపోకండి. సగం తమిళం, సగం తెలుగుతో 'తమిళ- తెలుగు టాకీ'గా 1931లో రూపొందిన 'కాళిదాస్'ను ప్రభుత్వ సెన్సార్ బోర్డు తమిళ టాకీగానే లెక్కలో వేసుకున్నా 1932 ఏప్రిల్ 9న పూర్తి తమిళ మాటలు, పాటలతో విడుదలైన 'హరిశ్చంద్ర'నే ఆనాటి పత్రికలు "మొట్టమొదటి తమిళ టాకీ'' అని పేర్కొన్నాయి ('ది హిందూ', 1932 ఏప్రిల్ 8). అదెలాగున్నా 'కాళిదాస్'ని ఉమ్మడి వారసత్వంలో చేర్చేసుకుని తెలుగు, తమిళాల్ని విడివిడిగా చూస్తే దక్షిణాదిలో తొలి సంపూర్ణ టాకీ చిత్రం రూపకల్పనలోనూ, విడుదలలోనూ తమిళుల కన్నా మనమే రెండు నెలల పైచిలుకు ముందున్నామనేది స్పష్టం.


మూడు భాషల్లోనూ సినిమాకు మాట నేర్పింది మనవాళ్ళే!


ఆ మాటకొస్తే ఒక్క మలయాళం మినహా దక్షిణాది భాషల్లోని మిగతా మూడింటిలో సినిమాకు మాటలు నేర్పిన దర్శకబ్రహ్మలు తెలుగువారే
కావడం గర్వకారణం. ('కాళిదాస్', 'భక్తప్రహ్లాద'లకు హెచ్.ఎం. రెడ్డి, 1934 మార్చి 3న రిలీజైన తొలి కన్నడ టాకీ 'సతీ సులోచన'కు వై.వి. రావు). ఎస్. నోట్టానీ దర్శకత్వంలో వచ్చిన 'బాలన్' (1938) తొలి మలయాళ టాకీ. అయితే గర్వకారణమైన ఇలాంటి ఎన్నో విశేషాల చరిత్ర రచన నమ్మకాల మీద కాక, వాస్తవాల ఆధారంగా సాగాలి.

దురదృష్టవశాత్తూ, ఆ దృష్టి మందగించడం వల్ల మన సినిమా చరిత్ర రచన ఇప్పటికీ ససాక్ష్యంగా, సాకల్యంగా సాగడం లేదు. గురజాడ, చలం, శ్రీశ్రీల పుట్టిన తేదీల్లో దశాబ్దాలుగా చలామణిలో ఉన్న తప్పులను పరిశోధకులు బయటపెట్టినపుడు సరిదిద్దుకున్నాం. సాహిత్యం, సామాజిక చరిత్ర లాంటి ఎన్నో అంశాల్లో ఎంతో సాధారణమైన ఈ చరిత్ర నిర్మాణ సూత్రాన్ని సినీ చరిత్రకూ వర్తింపజేస్తే తప్పేముంది?

- రెంటాల జయదేవ
.....................................................................

Saturday, October 22, 2011

పరిశోధనపై ‘‘ఆంధ్రప్రభ’’ అనుమానాలు, ఆరోపణలు




ఆరోపణలు చేయడం సులభం. తర్కం, ఆధారాలు లేకుండా ఆరోపించడమైతే మరీ సులభం. తొలి సంపూర్ణ తెలుగు టాకీ భక్త ప్రహ్లాద

విడుదల తేదీ మీద నేను సమర్పించిన పరిశోధన పత్రంలోని అంశాలపై
కొందరు ఆ పనే చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మరికొందరు ఓ మెట్టు పైకెక్కి పరిశోధనకు దురుద్దేశాలు పులిమే ప్రయత్నం చేశారు. వాస్తవాలను నివేదిస్తూ, వాటి ఆధారంగానే వార్తలు, వ్యాసాలు అందించాల్సిన పత్రికా రచయితలలోని సీనియర్లు కొందరూ, దీర్ఘకాలంగా పత్రికా రంగంలో సమున్నత సేవలందిస్తున్న ప్రముఖ పత్రికలలో కొన్నీ - కూడా తొందరపాటుతో ఆ అవాంఛనీయ వైఖరినే అవలంబించడం ఆశ్చర్యకరమే కాదు, బాధాకరం కూడా. తొలి తెలుగు టాకీ పుట్టిన ‘‘తేదీపై వివాదమెందుకు?’’ అంటూ ఆంధ్రప్రభ దినపత్రిక తమ వారం వారీ సినీ ప్రత్యేకానుబంధం ’’చిత్రప్రభ’’లో ఏకంగా సంపాదకుడి సంతకంతో ఎడిటోరియల్ రాసింది (ఆ ఎడిటోరియల్ తాలూకు డిజిటల్ బొమ్మ, అందులోని సమాచారం ఈ పోస్టులోనే పక్కనే చూడగలరు).

తెలుగు సినిమా ఎనభై ఏళ్ళ ఉత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో ఈ హడావిడి ఏమిటంటూ, పరిశోధన ఉద్దేశాన్నే ప్రశ్నించింది. దురుద్దేశాలు అంటగట్టేందుకు ప్రయత్నించింది. తర్కానికి అందని వ్యాఖ్యలెన్నో చేసింది. చేసిన పరిశోధనను సహృదయంతో అనుశీలించకపోగా, మళ్ళీ తానే గొంతు సవరించుకొని - ‘‘కొత్త తేదీ వెలుగులోకి రావడం వల్ల అసలు తేదీ ఏదనే దానిపై పరిశోధన జరగాల్సిన అవసరం కనిపిస్తోంది’’ - అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఆ వెంటనే తానే తీర్పరి పాత్ర పోషిస్తూ - ‘‘అయితే తేదీ ఏదనే విషయం ప్రధానం కాదు. ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 15వ తేదీని తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకగా ప్రతి ఏడు ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నించాలి’’ - అని ఆ పత్రిక ముక్తాయించింది.

పరిశోధన జరపాలని ఓ నాలికతో అంటూ, ఇప్పటిదాకా సరైన సాక్ష్యాధారమేదీ లేని సెప్టెంబర్ 15వ తేదీనే తెలుగు సినిమా పుట్టినరోజు జరుపుకోవాలని అలా తెగేసి మరో నాలికతో తీర్మానించేయడం ఏమిటో అర్థం కాదు. పరిశోధన చేస్తేనేమో దురుద్దేశాలు అంటగడుతున్నారు. కానీ పరిశోధన జరగాల్సి ఉందనీ మళ్ళీ తామే అంటున్నారు. ఇదెక్కడి చిత్రం.


పరిశోధనపై ఆరోపణలు చేసి, అనుమానాలు వ్యక్తం చేసిన ఆంధ్రప్రభ ఎడిటోరియల్ పూర్తిపాఠం ఇదీ --


..........................................
తేదీపై వివాద మెందుకు?


భక్త ప్రహ్లాద విడుదల తేదీపై వివాదం చెలరేగింది. ఇప్పటి వరకు 1931 సెప్టెంబర్‌ 15న ఈ చిత్రం విడుదలైందని చరిత్రకారులు చెబుతూ వస్తున్నారు. ఇటీవలే భక్త ప్రహ్లాద విడుదలైన తేదీని తెలుగు సినిమా పుట్టినరోజుగా పరిశ్రమ ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలోనే కొత్త తేదీ ప్రచారంలోకి వచ్చింది. ఐదు సంవత్సరాల క్రితం వజ్రోత్సవాలను అట్టహాసంగా జరుపుకుని, ఇప్పుడు
ఎనబై యేళ్ళ ఉత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలోనే విడుదల తేదీ, సంవత్సరం సరికాదంటూ వివాదం చేయడం వెనుక వారికి ఉన్న ఉద్దేశాల గురించి రంధ్రాన్వేషణ చేయడం అనవసరం.

సినీ ప్రముఖులు దాసరి నారాయణరావుగారు పేర్కొన్నట్టు తేదీపై సంపూర్ణ సమాచారం లేదు. ఆ రోజుల్లో తొలుత విజయవాడ మారుతీ టాకీస్‌లో తర్వాత రాజమండ్రి శ్యామల టాకీసులో విడుదలైన తర్వాత మద్రాసులో 1932లో విడుదలై ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, దీనిపై శాస్త్రీయంగా పరిశోధన జరగాలని సూచించారు. దాసరిలాంటి ప్రముఖులు ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడరనే విషయం పరిశ్రమకు తెలియంది కాదు. హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన భక్త ప్రహ్లాద తొలి టాకీ తెలుగు సినిమానా, లేక హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలోనే తెలుగు తమిళ సంభాషణలతో, తెలుగు పాటలకు ప్రాధాన్యత ఇస్తూ తమిళ చిత్రంగా రూపొందిన కాళిదాసు తొలి తమిళ చిత్రమా అనేది కూడా తేలాలి.

దీనిపై సినీ పరిశోధకులు ఇంటూరి వెంకటేశ్వరరావు, వి.ఏ.కె.రంగారావు వంటి వారు ఎప్పుడో శోధించారు. వారి సూచన మేరకే 1931 సెప్టెంబర్‌ 15 అని పరిశ్రమ నిర్ణయానికి వచ్చింది. 1932న విడుదలైందంటూ కొన్ని ఆధారాలు చూపుతున్న పరిశోధకులు ఇంతకాలం మౌనంగా ఎందుకున్నారనేది ఆలోచించాల్సిన విషయం. ఎనిమిది దశాబ్ధాల ఉత్సావాన్ని సంబరంగా చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలోనే ఇవిగో సాక్ష్యాలంటూ హడావుడి చేయడం వెనుక ఉన్న వారి ఉద్దేశాన్ని తెలియజేస్తోంది. ఎనిమిది దశాబ్ధాలుగా నిజమని విశ్వసిస్తున్న తెలుగువారి నమ్మకాన్ని కాదని చెబుతున్నారు.

భక్త ప్రహ్లాద విడుదలైన తర్వాత సెన్సార్‌ జరిగి ఉండవచ్చు, లేదా దాసరి చెప్పినట్టు విజయవాడ, రాజమండ్రి తర్వాత మద్రాసులో రిలీజై
వుండవచ్చు కూడా. మన దేశంలో తక్కువ సంఖ్యలో అప్పట్లో టాకీచిత్రాలు (అంతకుముందు మూకీ చిత్రాలు వచ్చాయి) వస్తున్న సందర్భంలో సెన్సార్‌ శాఖ వేలసంఖ్య (11032)ను పొందు పరుస్తూ ఎందుకు సర్టిఫికెట్‌ జారీ చేసిందో మరి. ఏది ఏమైనప్పటికీ, విడుదల తేదీని పెద్ద వివాదం చేయడం సరికాదు. కొత్త తేదీ వెలుగులోకి రావడం వల్ల, అసలు తేదీ ఏదనే దానిపై పరిశోధన జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే తేదీ ఏదనే విషయం ప్రధానం కాదు. ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్‌ 15వ తేదీని తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకగా ప్రతి ఏడు ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నించాలి.

- పి. విజయబాబు,
ఎడిటర్‌
................................

Friday, October 21, 2011

తెలుగు సినిమా పుట్టినరోజు వివాదంపై టి.వి 9 స్టోరీ - వీడియో లింకు

తొలి తెలుగు సినిమా పుట్టిందెప్పుడు అన్న నా పరిశోధన పత్రంలోని అంశాలు పెద్ద చర్చకే దారి తీశాయి. తొలి సంపూర్ణ తెలుగు టాకీ భక్త ప్రహ్లాద 1931 సెప్టెంబర్ 15న విడుదల కానే లేదనీ, కాబట్టి తెలుగు సినిమా పుట్టినరోజంటూ ఆ తేదీని ప్రామాణికంగా తీసుకోవడం సరికాదనీ సాక్ష్యాధారాలతో నేను చేసిన వాదనను కొన్ని టి.వి. చానళ్ళు ప్రస్తావించాయి. సరికొత్త సాక్ష్యాధారాలను పట్టించుకోకుండా తెలుగు సినిమా 80 ఏళ్ళ పండుగంటూ పరిశ్రమ ఏటేటా ఆ రోజు ఉత్సవం చేస్తామన్నసందర్భంలోనే ప్రముఖ ఉపగ్రహ టీవీ చానల్ టి.వి. 9 దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనం తాలూకు వీడియో లింకును మిత్రులు ఈ మధ్యే నాకు మెయిల్ చేశారు.

1932 జనవరి 22న సెన్సారైన భక్త ప్రహ్లాద ఆ తరువాత ఏప్రిల్ 2న మద్రాసులో విడుదలైనట్లు నా పరిశోధనలో సాక్ష్యం దొరికింది. ఆ మధ్యలో ఎక్కడెక్కడ ఏ తేదీల్లో వచ్చిందో ససాక్ష్యంగా వివరాలు లభించలేదు. ఏమైనా, సినిమా సెన్సారైన 1932 జనవరి 22 నుంచి మద్రాసులో సినిమా విడుదల సమాచారం తొలిసారిగా లభిస్తున్న ఏప్రిల్ 2వ తేదీ మధ్యలోనే భక్త ప్రహ్లాద తొలి రిలీజు తేదీ ఉంటుందని నా వాదన.

పరిశోధించి, ప్రాథమిక, ప్రాసంగిక సాక్ష్యాధారాల సహాయంతో నేను చేసిన ఈ వాదనను టి.వి 9 జనం ముందుకు సమర్థంగానే తీసుకువెళ్ళింది. 30 నిమిషాల రికార్డింగును 300 సెకన్లకు కుదించడంలో ఒకటీ, అరా తప్పులు దొర్లినా, చరిత్రను సవ్యంగా అందించే కృషిలో భాగమైనందుకు టి.వి 9 బృందానికి కృతజ్ఞతలు. అక్కడ ప్రసారమైన వార్తా కథనం ఇక్కడ చూడండి.

Sunday, September 11, 2011

తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' రిలీజైంది 1931లో కాదు, 1932లో!



(తొలి తెలుగు టాకీ 1931 సెప్టెంబర్ 15న విడుదలైందన్న తప్పుడు చరిత్ర దీర్ఘకాలంగా ప్రచారంలో ఉంది. తీరా ఈ 2011 సెప్టెంబర్ 15న ఆ సినిమా వచ్చి, 80 ఏళ్ళు పూర్తయ్యాయనే పండుగ కూడా సినీ పరిశ్రమ పెద్దలు చేసేస్తున్నారు. కానీ, విడుదల తేదీపై వాస్తవ చరిత్ర అందుకు భిన్నంగా ఉన్నట్లు ఎంతో శ్రమించి చేసిన పరిశోధనలో తేలింది. మరి, అసలు తెలుగు సినిమాయే పుట్టని తేదీన పుట్టిన రోజు పండుగ చేస్తున్న మనవాళ్ళు ఇకనైనా కళ్ళు తెరుస్తారా?)

మాటలు లేని మూగ సినిమాలు నిర్మాణమవుతున్నంత కాలం ఏ భాష వారు ఆ చిత్రాన్ని తీసినా, దాన్ని భాషల చట్రాల్లో బిగించలేం. అది అందరి సినిమాయే తప్ప, ఫలానా భాషా చిత్రంగా చెప్పడానికి వీలు కాదు. కానీ, తెర మీద కదిలే బొమ్మలు మాటలు నేర్చుకోవడం మొదలైన తరువాత నుంచి పరిస్థితి మారింది. ఏ భాషలో మాటలు వినిపిస్తుంటే, ఆ భాషా చిత్రంగా పేర్కొనడం మొదలైంది.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ సంగతికొస్తే, మూకీలను వెనక్కి నెడుతూ టాకీలు వచ్చింది - 1931లో. హిందీ - ఉర్దూల మిశ్రమ భాష (హిందుస్థానీ)లో తయారై, 1931 మార్చి 14న బొంబాయిలోని మెజిస్టిక్ థియేటర్‌లో విడుదలైన 'ఆలమ్ ఆరా'యే తొలి భారతీయ టాకీ చిత్రం. బొంబాయిలోని ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత అర్దేషిర్ ఎం.ఇరానీ ఆ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. 'ఆలమ్ ఆరా' తరువాత మరో ఏడు నెలలకు కానీ, మన దక్షిణాది భాషలో మాట్లాడే చిత్రాలు రాలేదు.

తొలి సినిమాపై తప్పుడు చరిత్ర

తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రం 'కాళిదాస్' 1931 అక్టోబర్ 31న విడుదలైంది. ఆ చిత్రంలో కథానాయక పాత్రధారి తెలుగులో మాట్లాడితే, మరో కథానాయిక సౌదామిని పాత్రధారిణి టి.పి. రాజలక్ష్మి తమిళంలో సమాధానమిచ్చారు. (కథానాయిక పాత్ర పేరు విద్యాధరి అని కొందరి కథనం) ఈ చిత్రంలో కథానాయిక రెండు త్యాగరాయ కీర్తనలను సైతం ఆలపించారు. అంటే తెలుగు, తమిళ భాషలు రెండూ ఈ సినిమాలో ఉన్నాయి. అయితే ఎక్కువగా తమిళంలోనే మాటలు, పాటలు వినిపించాయి కాబట్టి, ప్రధానంగా దాన్ని తమిళ భాషా చిత్రంగానే పరిగణించారు. ఇలా 'కాళిదాస్'ను తొలి తమిళ టాకీగా తీర్మానించారు.

అయితే, ఆ తర్వాత పూర్తి తెలుగు సంభాషణలతో వచ్చిన తొలి తెలుగు టాకీ మాత్రం 'భక్త ప్రహ్లాద'. ఇంతవరకూ ఆ చిత్రం సరైన విడుదల తేదీ ఏమిటన్నది ఎవరికీ తెలియదు. తొలి తమిళ టాకీ 1931 అక్టోబర్ చివరలో వచ్చింది కాబట్టి, దానికి కనీసం నెలన్నర ముందు 1931 సెప్టెంబర్ 15న తొలి తెలుగు టాకీ విడుదలైనట్లు ఎవరో తెలివిగా ఓ కథనాన్ని పుట్టించారు. అందులోని నిజానిజాలు నిగ్గు తేల్చకుండా, ఆ కథనాన్నే ప్రతి ఒక్కరూ ప్రచారంలో పెట్టారు. తొలి తెలుగు టాకీ విడుదలైంది సెప్టెంబర్ 15నే అంటూ సాక్ష్యాధారాలు లేకుండానే మన చరిత్రకారులు గొఱ్ఱెదాటు ధోరణిని ప్రదర్శించారు. ఇటీవల పెరిగిన ఈ ధోరణితో, ఏటేటా సెప్టెంబర్ 15ను 'తెలుగు సినిమా జన్మదినం'గా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ ప్రకారం ఈ 2011 సెప్టెంబర్ 15తో తొలి తెలుగు సినిమా విడుదలై 80 ఏళ్లు పూర్తవుతున్న పండుగ కూడా చేసేస్తున్నారు.

కానీ, చరిత్ర మీద సిసలైన అభిమానంతో లోతుగా పరిశీలిస్తే, వాస్తవాలు వీటికి విరుద్ధంగా ఉన్నాయి. 'భక్త ప్రహ్లాద' 1931 సెప్టెంబర్ 15న విడుదలైందన్న వాదన కానీ, కనీసం తమిళ టాకీ కన్నా ముందే తెలుగు టాకీ వచ్చేసిందన్న వాదన కానీ శుద్ధ తప్పు అని ఈ పరిశోధకుడి అన్వేషణలో తేలింది.

సెన్సార్ కన్నా ముందే రిలీజెట్లా?

తొలి తమిళ, తెలుగు టాకీలు రెండింటికీ దర్శకుడు ఒకరే - హెచ్.ఎం.రెడ్డి. తమిళ టాకీ 'కాళిదాస్' 1931 అక్టోబర్ 31న మద్రాసులోని 'కినిమా సెంట్రల్' (ఇప్పుడు ఈ హాలు పేరు 'మురుగన్' టాకీస్)లో విడుదలైందనడానికి పత్రికా ప్రకటనలతో సహా తమిళ చరిత్రకారులు సాక్ష్యాధారాలు సేకరించారు. "10 వేల అడుగుల నిడివి'' గల ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ కూడా పొందింది. ప్రదర్శన కాలం 112 నిమిషాలైన ఈ చిత్రం సర్టిఫికెట్ నెంబర్ "ఎం (మద్రాసు?) - 1598.''

కానీ, అంతకన్నా ముందే రిలీజైనట్లు పుట్టించిన పుక్కిటి చరిత్ర చెబుతున్న తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' మాత్రం సెన్సారైంది - 1932 జనవరి చివరిలో! ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, 1932 జనవరి 22న! మొత్తం 9,762 అడుగుల నిడివి గల 10 రీళ్ల ఆ చిత్రం బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకొంది. 'బొంబాయి బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సెన్సార్స్' అదే తేదీతో సెన్సార్ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. ఆ సెన్సార్ సర్టిఫికెట్ "నెంబర్ - 11032, తేదీ 22 జనవరి 1932''. దీన్నిబట్టి, ఒక విషయం స్పష్టం. 1932 జనవరి చివరిలో సెన్సారింగ్ జరుపుకొన్న మన 'భక్త ప్రహ్లాద' 1931 సెప్టెంబర్ మధ్యకే రిలీజై పోయిందనడం తలాతోకా లేని వాదన.

హెచ్.ఎం. రెడ్డి ఏం చెప్పారు?

దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి సైతం తాను ముందుగా తెలుగు టాకీ నిర్మించి, ఆ పైన తమిళ టాకీ చేశానని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. పైపెచ్చు, తమిళ టాకీ తీశాకే, తెలుగు టాకీ తీసినట్లు తన మాటల్లో, రాతల్లో స్పష్టంగా పేర్కొన్నారు. "... మొదటి హిందీ టాకీ అయిన 'ఆలమ్ ఆరా'ను తయారు చేసిన నలుగురు ప్రముఖులలో ఒకణ్ణి నేను" అని ఆయన చెప్పారు.

(బెంగళూరులోని సూర్యా ఫిలిమ్స్‌వారు తీసిన మూకీ చిత్రాలతో సినీ పరిశ్రమతో అనుబంధం పెంచుకున్న హెచ్.ఎం.రెడ్డి ఆ తరువాత బొంబాయికి మకాం మార్చి, దర్శక - నిర్మాత అర్దేషిర్ ఎం. ఇరానీ వద్ద సహాయకుడిగా పనిచేశారు. ఇరానీ నిర్మించిన 'విజయ్ కుమార్'లాంటి మూకీలకు దర్శకత్వం వహించారు.

తొలి టాకీ 'ఆలమ్ ఆరా' విజయంతో దక్షిణాది భాషల్లోనూ టాకీలు నిర్మించాలని అర్దేషిర్ ఇరానీ అనుకున్నప్పుడు ఆయన సహజంగానే తన వద్ద ఉన్న అనుభవజ్ఞుడైన దక్షిణ భారతీయుడు హెచ్,ఎం.రెడ్డి వైపు మొగ్గారు. ఆ భాషలు తెలిసిన రెడ్డికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆ రకంగా, అర్దేషిర్ ఇరానీ నిర్మించిన తొలి తమిళ టాకీకి హెచ్.ఎం.రెడ్డి స్వయంగా దర్శకత్వం వహించారు).

"...మొదటి అరవ ఫిలిమ్ డైరెక్ట్ చేసినవాణ్ణీ నేనే! అది - టి.పి.రాజలక్ష్మి యాక్టు చేసిన 'కాళిదాస్'. అది నాదేగా! ... ఆ పైన అఖిల భారతదేశంలో ప్రథమ తెలుగు టాకీ అయిన 'ప్రహ్లాద'ను నేనే డైరెక్టు చేశాను...'' అని హెచ్.ఎం. రెడ్డి అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీన్నిబట్టి చూసినా, తమిళ టాకీ తరువాతే తెలుగు టాకీ వచ్చిందని అర్థమవుతోంది.

ఎల్.వి.ప్రసాద్ ఏం చెప్పారు?

మూకీల రోజుల నుంచి బొంబాయిలో ఉన్న నటుడు, తరువాత ప్రముఖ దర్శక - నిర్మాతగా మారిన ఎల్.వి. ప్రసాద్ సైతం తమిళ టాకీ తరువాతే తెలుగు టాకీ వచ్చినట్లు పేర్కొన్నారు. తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా'లో ఉన్న ఎల్.వి. ప్రసాద్, తొలి తమిళ టాకీ 'కాళిదాస్'లోనూ ఓ చిన్న వేషం వేశారు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలోనే తయారైన తొలి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద'లో సైతం ఆయన ప్రహ్లాదుడి సహాధ్యాయీ, గురువు చండామార్కుల వద్ద శిష్యుల్లో ఒకడూ అయిన మొద్దబ్బాయి పాత్ర ధరించారు. ఆ రకంగా హిందీ, తమిళం, తెలుగు - ఈ మూడు భారతీయ భాషల్లోనూ తొలి టాకీ చిత్రాలతో సంబంధం ఉన్న వ్యక్తులు - హెచ్.ఎం.రెడ్డి, ఎల్.వి. ప్రసాద్.

ఓ సందర్భంలో ఎల్.వి. ప్రసాద్ తన అనుభవాలను వివరిస్తూ 'బొంబాయిలో (హెచ్.ఎం) రెడ్డి గారు నాకు పరిచయమయ్యారు. ఆయనేదో అక్కడ పృథ్వీరాజ్ కపూర్ హీరోగా ఒక సైలెంట్ పిక్చర్ డైరెక్ట్ చేస్తున్నారు. అప్పుడే 'టాకీ' ప్రారంభమైంది. 'ఆలమ్ ఆరా' వచ్చింది. అర్దేషిర్ గారికి తమిళంలో ఏదైనా సినిమా తీద్దామని ఉద్దేశం కలిగి, 'కాళిదాస్' ప్లాన్ చేశారు. అప్పుడు టి.పి. రాజలక్ష్మినీ, వారినీ పిలిపించారు. నేను కూడా ఉన్నాను కనుక అందులో నేనూ ఒక వేషం వేశాను. ఆ విధంగా హెచ్.ఎం.రెడ్డి గారితో పరిచయమైంది. ఆయన తెలుగువాడైనా, అక్కడ బాగా కమాండ్ చేసేవాడు. ఆయనంటే అందరికీ హడల్. ఆ ('కాళిదాస్') సినిమా అవగానే, కృష్ణా ఫిలిమ్ కంపెనీ వారికి 'భక్త ప్రహ్లాద' తీయాలనే ఉద్దేశం కలిగింది. (హెచ్.ఎం) రెడ్డిగారే డైరెక్ట్ చెయ్యడం కనుక ఆయనే నన్ను పిలిచారు' అని 'భక్త ప్రహ్లాద' విషయాలు తెలిపారు. ఆయన చెప్పిన మాటలను బట్టి చూసినా, తెలుగులో టాకీలు వచ్చింది తమిళం తరువాతే అన్నది స్పష్టం!

నోటి మాట కాదు, రాతలోనూ అదే!

వట్టి నోటి మాటగా చెప్పడమే కాదు, హెచ్.ఎం. రెడ్డి స్వయంగా ఈ వివరాలు రాశారు కూడా. భారతీయ టాకీ రజతోత్సవాల సమయంలో హెచ్.ఎం. రెడ్డి 'గడిచిన 25 ఏళ్లలో దక్షిణ భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ' శీర్షికతో ఓ వ్యాసం రాశారు. అందులోనూ ఆయన తమిళ టాకీ విజయమే తనను తెలుగు టాకీ నిర్మాణానికి ప్రోత్సహించినట్లు చాలా స్పష్టంగా తెలిపారు.

"... ఎన్నో పురిటినొప్పుల మధ్య తొలి తమిళ చిత్రం 'కాళిదాస్' (9000 అడుగులు)ను బొంబాయిలోని ఇంపీరియల్ స్టూడియోస్‌లో నిర్మించాం. అప్పట్లో తారలంటే రంగస్థల తారలే! సుప్రసిద్ధ రంగస్థల నటీనటులకు ఎంతో గిరాకీ ఉండేది. నిజం చెప్పాలంటే, ఆ తొలి సంవత్సరాల్లో నిర్మించిన చిత్రాలు కేవలం సుప్రసిద్ధ నాటకాల పునర్నిర్మాణాలే! కాకపోతే, సరికొత్త మాధ్యమమైన వెండితెరపై ఆ నాటకాలు చూపేవాళ్లం!

తమిళ చిత్రం సాధించిన విజయం తెలుగులో ఓ చిత్ర నిర్మాణానికి ప్రోత్సాహమిచ్చింది. అలా నేను దర్శకత్వం వహించిన (తెలుగు చిత్రం) 'భక్త ప్రహ్లాద' 1932లో విడుదలైంది. ఈ చిత్రం విజయం సాధించడంతో, తెలుగులో, తమిళంలో వరుసగా ఎన్నో పౌరాణిక చిత్రాలు వచ్చాయి. స్వర్గీయ రాజా శాండో, నారాయణ్ లాంటి అనుభవజ్ఞులైన సీనియర్లు, సి. పుల్లయ్య, హెచ్.వి.బాబు, స్వర్గీయ చిత్రపు నరసింహారావు లాంటి వారు ఆ పౌరాణికాలకు దర్శకత్వం వహించారు...'' అని సాక్షాత్తూ హెచ్.ఎం.రెడ్డే రాశారు. 'భక్త ప్రహ్లాద' విడుదలైంది 1931లో కానే కాదనడానికి ఆ చిత్ర దర్శకుడు రాసిన ఈ మాటలే ప్రబలమైన సాక్ష్యం!

మరి 'భక్త ప్రహ్లాద' రిలీజైంది ఎప్పుడు?

ఇంతకీ, 'భక్త ప్రహ్లాద' విడుదల తేదీ ఏమిటన్నట్లు? ఈ పరిశోధకుడి అన్వేషణలో తేలిందేమిటంటే, "తొలి 100 % తెలుగు టాకీ''గా సగర్వంగా ప్రకటించుకున్న 'భక్త ప్రహ్లాద' చిత్రం విడుదలైంది తెలుగు సంవత్సరాది కానుకగా - 1932 ఏప్రిల్ 2న! మద్రాసులోని నేషనల్ పిక్చర్ ప్యాలెస్‌లో 'భక్త ప్రహ్లాద' విడుదలైంది. "ప్రేక్షకులచే క్రిక్కిరిసి పోవుచున్నది. గనుక ముందుగ స్థలము కొరకై జాగ్రత్త పడుడు. ఈ 100% సంపూర్ణ తెలుగు టాకీ చూచు యవకాశము బోగొట్టుకొనకుడు'' అంటూ ప్రకటనలు ఇచ్చారు. అప్పట్లో రోజుకు రెండు ఆటలే (సాయంత్రం ఫస్ట్ షో, రాత్రి వేళ సెకండ్ షో) ప్రదర్శించేవారు. ఏవైనా పండుగలు, పబ్బాలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మధ్యాహ్నం వేళ ప్రత్యేకంగా మ్యాట్నీ షో వేసేవారు. 'భక్త ప్రహ్లాద'కు కూడా ఆ తెలుగు సంవత్సరాది పండుగ నాడు సాయంత్రం 3 గంటల 15 నిమిషాలకు 'ప్రత్యేక మేటనీ ప్రదర్శన' వేశారు.

'భక్త ప్రహ్లాద' విడుదలైంది 1932లోనే అని చెప్పడానికి మరో ప్రాసంగిక సాక్ష్యాధారం కూడా ఉంది. అది ఏమిటంటే - ఆ సినిమాకు సమీక్షలు సైతం 1932లోనే వచ్చాయి. 'ఆనంద బోధిని' లాంటి పత్రికలు 1932 మార్చి సంచికలో ఈ చిత్రాన్ని సమీక్షించాయి. ఒకవేళ పుక్కిటి చరిత్ర చెబుతున్నట్లు, 1931 సెప్టెంబర్‌లో 'భక్త ప్రహ్లాద' సినిమా రిలీజై ఉంటే, దొంగలు పడ్డ ఆరు నెలలకు సమీక్షించరు కదా! ఆ రకంగా చూసినా, 'భక్త ప్రహ్లాద' విడుదల 1931లో కాదు, 1932లో అని చెప్పవచ్చు.

('భక్త ప్రహ్లాద' రిలీజైంది ఏప్రిల్‌లో అయితే, మార్చి సంచికలో సమీక్ష రావడానికి కారణం ఏమిటని ఎవరైనా అనుమానం వ్యక్తం చేయవచ్చు. దానికి ఈ పరిశోధకుడి వివరణ ఏమిటంటే - అప్పటి పత్రికలు ఇప్పటిలా ముందస్తు తేదీలతో కాక, ఏ నెలకు ఆ నెలే రావడం కద్దు. పైగా , కొన్ని పత్రికలు నెల మధ్యలోనో, ఒక్కోసారి మరీ ఆలస్యంగా నెలాఖరులోనో విడుదలయ్యేవి. ఆర్థికాది అనేక కారణాలతో మరీ ఆలస్యమైనప్పుడు అరుదుగా కొన్నిసార్లు ముందటి నెల తేదీతోనే తరువాతి నెలలో వచ్చేవి. ఓపిగ్గా వెతికితే అలాంటి ఉదాహరణలు చాలా కనపడతాయి. కాబట్టి, పత్రిక మీద "మార్చి నెల'' అని రాసినా సదరు పత్రిక మార్చి నెల చివరలోనో, ఏప్రిల్‌లోనో వచ్చి ఉండవచ్చు.

ఇక, సినిమా రిలీజు ముందే సమీక్ష ఏమిటని కూడా నోళ్ళు నొక్కుకోనక్కర లేదు. ఎందుకంటే, సినీ పరిశ్రమ పెద్దలకూ, పత్రికల వారికీ సినిమాను ముందుగానే ప్రదర్శించి చూపే అలవాటు అప్పటికే చిత్రసీమలో ఉంది. సినిమా విడుదలకు ముందు రోజునో, రిలీజ్ రోజునో పెద్దలకూ, సన్నిహితులకూ ప్రివ్యూ వేసి చూపడం ఇప్పటి వాడుక. కానీ, అప్పట్లో అలా కాదు! సినిమా విడుదల కన్నా వారం రోజులు, ఒక్కోసారి పది రోజుల ముందరే ప్రివ్యూ వేసేవారు. తొలి తమిళ టాకీ 'కాళిదాస్'కూ ఆ పద్దతి పాటించారు. అదే పద్ధతిని ఆ తరువాత వచ్చిన 'భక్త ప్రహ్లాద'కూ అనుసరించారని ఊహించవచ్చు. ఫలితంగా, ఏప్రిల్ 2న రిలీజైన 'భక్త ప్రహ్లాద'కు మార్చి నెల పత్రికలోనే సమీక్ష వచ్చి ఉండవచ్చు).

ఏమైనా, ఒకటి వాస్తవం. ఏ రకంగా చూసినా తొలి తమిళ టాకీ తరువాతే తొలి తెలుగు టాకీ విడుదలైందనేది చేదు నిజం! తెలుగు సినిమా పుట్టిన రోజు 1931 సెప్టెంబర్ 15 తేదీ కాదనేది ఖాయం!! ఇప్పటి వరకు లభిస్తున్న సాక్ష్యాధారాలను బట్టి చూస్తే 1932 జనవరి చివరిలో సెన్సారైన తరువాతా, చిత్ర తొలి విడుదల సమాచారం దొరుకుతున్న ఏప్రిల్ లోపలా 'భక్త ప్రహ్లాద' విడుదలైనట్లు స్పష్టమవుతోంది. కాబట్టి, 'భక్త ప్రహ్లాద' 1931లో విడుదలైందన్న మాటే సత్యదూరం. మరి, ఇప్పటికైనా మన సినీ చరిత్రకారులు తెలుగు సినిమా పుట్టిన తేదీ గురించి ప్రచారంలో ఉన్న పాత తప్పులను సవరించుకుంటారా? పుట్టని సెప్టెంబర్ 15ను వదిలేసి, ఇకనైనా తెలుగు సినిమాకు సరైన రోజునే జన్మదినం జరుపుతారా?!

కొసమెరుపు :

'ఇన్నాళ్లూ తమిళ టాకీ కన్నా ముందే తెలుగు టాకీ ముందు వచ్చిందని సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆ సంతోషం లేకుండా చేశారే'మని మిత్రులు బాధపడనక్కర లేదు. ఎందుకంటే, తెలుగు మాటలు, పాటలు ఉన్నాయి కాబట్టి, హెచ్.ఎం. రెడ్డి 'కాళిదాస్' సినిమాను కేవలం తమిళ టాకీగా కాక, తొలి తెలుగు - తమిళ టాకీగా చెప్పుకోవచ్చు! అందులో హీరోయిన్ మన అచ్చ తెలుగు కీర్తనలు రెండు కూడా పాడారు. "తమిళ లిపిలో రాసుకొని మరీ, తెలుగు సంభాషణలు పలికా''రు. హీరో కూడా తెలుగులో డైలాగులు చెప్పారు. నిజానికి, 'కాళిదాస్' చిత్రానికి "తమిళ - తెలుగు భాషల్లో మాట్లాడే చిత్రం'' అనే ప్రకటనలిచ్చారు. ఆ రకంగా, తెర మీద బొమ్మలు తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి మాట్లాడాయి కాబట్టి, తమిళంతో సమానంగా తెలుగూ నిలిచిందని చెప్పుకోవచ్చు! సంతోషపడవచ్చు!!

(మద్రాసు విశ్వవిద్యాలయంలో సమర్పించిన పరిశోధన వ్యాసం నుంచి...)

Monday, August 29, 2011

కౌబాయ్ లకు కౌబాయ్




ఆ సినిమా వచ్చి ఇప్పటికి సరిగ్గా నాలుగు దశాబ్దాలైంది. విడుదలైన రోజుల నుంచి ఇవాళ్టి వరకు దాని గురించి గొప్పగా చెప్పుకుంటూనే ఉన్నారు. తెలుగు చలనచిత్ర లోకానికి కౌబాయ్ కథలను పరిచయం చేసి, సంచలనం రేపిన ఆ చిత్రం - 'మోసగాళ్ళకు మోసగాడు'. ఆ రోజుల్లో ''ఏ తెలుగు నిర్మాతా సాహసించని లొకేషన్లలో, విశేష వ్యయ ప్రయాసలతో నిర్మించిన అపూర్వ చిత్రం''గా ఓ విశిష్ట స్థాయిని అందుకున్న ఈ ''తొలి తెలుగు కౌబాయ్ చిత్రం'' విడుదలై, ఈ ఆగస్టు 27 నాటికి సరిగ్గా నలభై ఏళ్ళయింది. తెలుగు తెరపై హాలీవుడ్‌ పోకడలకు తెర తీసి, ఒక తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించి, వివిధ భాషల్లోకి అనువాదమైన ఈ సూపర్‌హిట్‌ చిత్రం జ్ఞాపకాల స్వారీకి స్వాగతం...

ఒకే రకమైన జానపదాలు, పౌరాణిక చిత్రాలతో జనానికి విసుగెత్తుతున్న కాలం అది. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లు తారలుగా స్థిరపడిపోయి చాలా కాలం అవడంతో, యువతరానికి చెందిన నవ తారలకు అవకాశాలు తెరుచుకున్న సమయం. కృష్ణ, శోభన్‌బాబు లాంటి నటులు ఆ అవకాశాలను అందుకోవాలని తపిస్తున్న తరుణం. ఆ పరిస్థితుల్లో ఇంగ్లీషు, హిందీ చిత్రాల స్ఫూర్తితో తెలుగు సినిమా సైతం క్రైమ్‌, యాక్షన్‌ తరహా చిత్రాల వైపు క్రమంగా మొగ్గింది. అలాంటి కొత్త కథల అన్వేషణలో తెలుగు మసాలాతో వండి, వడ్డించిన పాశ్చాత్య తరహా కౌబాయ్ వంటకం - 'మోసగాళ్ళకు మోసగాడు' (సంక్షిప్తంగా 'మో.మో').

కౌబాయ్ కథే ఎందుకు?

తెలుగు సినీ లోకానికి అప్పటికి కొత్తగా అనిపించే ఈ సాహస గాథను హీరో కృష్ణ అసలు ఎందుకు ఎంచుకున్నారు? దాని వెనుక కూడా నాటకీయత, సాహసం ఉన్నాయి. 1960ల ద్వితీయార్ధంలో సినిమాల్లోకి వచ్చిన కృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ, 1970 నాటికి 40కి పైగా సినిమాలు చేశారు. కానీ, నటుడి నుంచి తార స్థాయికి తనకు పదోన్నతి కల్పించే చిత్రాలు చేయలేకపోతున్నాననే అసంతృప్తి ఆయనలో కలిగింది. ఆ అసంతృప్తి నుంచే సొంత చిత్ర నిర్మాణ సంస్థ, సొంత సినిమాల నిర్మాణమనే ఆలోచనలకు బీజం పడింది. అనుకున్నదే తడవుగా పెద్దమ్మాయి పేరు మీద 'శ్రీపద్మాలయా మూవీస్‌' సంస్థను నెలకొల్పారు. ఆ పతాకంపై తొలి సొంత చిత్రంగా తానే హీరోగా 'అగ్ని పరీక్ష' (1970) నిర్మించారు. కానీ, అది ఫ్లాపైంది. హీరోగా కృష్ణ ఆశించిన ఫలితమూ దక్కలేదు.

దాంతో, స్వీయ చిత్ర నిర్మాణ సంస్థలో పెద్ద హిట్‌ సాధించాలనీ, ఇటు నిర్మాతగా, అటు హీరోగా పేరు తెచ్చుకోవాలనీ సహజంగానే కృష్ణలో పట్టుదల పెరిగింది. అలాంటి విజయం సాధించాలంటే, ఓ కొత్త తరహా సినిమా తీయాలని భావించారు. సరైన కథ కోసం వెతుకులాట మొదలైంది. అదే సమయంలో 'మెకన్నాస్‌ గోల్డ్‌' లాంటి హాలీవుడ్‌ కౌబాయ్ చిత్రాలు మద్రాసులో సంచలనం రేపుతున్నాయి. కృష్ణ మనసులో తళుక్కున ఆలోచన మెరిసింది. అలాంటి కౌబాయ్ కథే తెలుగులో తీస్తే? అలా 'మెకన్నాస్‌ గోల్డ్‌', 'గుడ్‌, బ్యాడ్‌, అగ్లీ', 'ఫ్యూ డాలర్స్‌ మోర్‌' తదితర హాలీవుడ్‌ చిత్రాలను కలిపి, తెలుగులో కొత్త వంటకం తీయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ పాశ్చాత్య కథలు, సంఘటనలను పక్కాగా తెలుగు వాతావరణానికి తగ్గట్లు వండి, వడ్డించే బాధ్యతను రచయిత ఆరుద్రకు అప్పగించారు. అదిగో అలా తయారైన కథే - 'మోసగాళ్ళకు మోసగాడు'.

ఊళ్ళూ, పేర్లూ మాత్రం తెలుగు వాతావరణానికి తగ్గట్లు మార్చి, పాత్రల రూపురేఖలు, వస్త్రాలంకరణ మాత్రం ఇంగ్లీషు కౌబాయ్ సినిమాల శైలిలోనే ఉండేలా చూశారు. ఇంగ్లీషు చిత్రాల స్ఫూర్తితోనే తెలుగులో స్క్రీన్‌ప్లే సిద్ధం చేసుకున్నారు. కృష్ణతో 'టక్కరి దొంగ - చక్కని చుక్క' (1969) తదితర చిత్రాలు రూపొందించిన కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ రౌడీ రాణి' (1970) చిత్ర విజయంతో మంచి జోరు మీదున్నారు. దాంతో, యువకుడు దాస్‌ను ఈ యాక్షన్‌ చిత్రానికి డైరెక్టర్‌గా ఎంచుకున్నారు.

సాహస గాథకు సాహసోపేత చిత్రీకరణ

ఒక్క ముక్కలో చెప్పాలంటే, ప్రేమికులైన హీరో హీరోయిన్లు తమ తండ్రులను చంపినవారిపై ఎలా పగ సాధించుకున్నారనేది ఈ చిత్ర కథ. హంతకులెవరో కనిపెట్టి, వారిని వెంటాడి, వేటాడే ఈ క్రైమ్‌ ఫార్ములాకు అమూల్యమైన నిధి కోసం అన్వేషణ, దాన్ని శోధించి సాధించడం, ప్రజల పరం చేయడం ఆసక్తికరమైన పైపూత! ఎడారుల్లో ఒంటెల మీద ప్రయాణం, గుర్రాల మీద ఛేజింగులు, పేలే తుపాకులు, కాలే ఇళ్ళు, దుర్గమమైన ప్రాంతాల్లో ప్రయాణాలు, సరసాలు, సరదాలు, వినోదాలతో ఊపిరి సలపనివ్వని ఉత్కంఠతో, చకచకా సాగిపోయే కథా కథనం 'మో.మో'ను అప్పట్లో ప్రత్యేకంగా నిలిపాయి. ఈ సాహస గాథను సెల్యులాయిడ్‌పై చిత్రీకరించిన తీరు కూడా నిజంగా సాహస గాథే.

అప్పట్లో హీరో కృష్ణ సినిమాలను మూడు, నాలుగు లక్షల బడ్జెట్‌లో తీసేవారు. కానీ ఈ చిత్రానికి అంతకు రెట్టింపు మొత్తాన్ని ఖర్చు చేశారు. ''భారతదేశంలోనే తొలి కౌబాయ్ మా 'మోసగాళ్ళకు మోసగాడు'. ఆ సినిమాను సిమ్లా, రాజస్థాన్‌లోని బికనీర్‌, మద్రాసు, పాండిచ్చేరిలలో తీశాం. ఎడారి దృశ్యాలను రాజస్థాన్‌లోని కోటా అనే చోట చాలా శ్రమపడి చిత్రీకరించాం'' అని కథానాయకుడు కృష్ణప్రసాద్‌ పాత్రను పోషించిన హీరో కృష్ణ చెప్పుకొచ్చారు. కథానాయిక రాధగా నటించిన విజయనిర్మల సైతం తన కెరీర్‌లో ఎంతో కష్టపడి నటించిన సినిమా 'మో.మో' అని చెప్పారు. ''ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ఎన్నడూ అలవాటు లేని ఫైట్లు, గుర్రపుస్వారీ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం నేను, కృష్ణ గారు, నాగభూషణం గారు రోజూ మద్రాసులోని మెరీనా సముద్రతీరంలో గుర్రపు స్వారీ సాధన చేసేవాళ్ళం'' అని విజయనిర్మల చెప్పారు.

''ఆ చిత్ర నిర్మాణం కోసం కృష్ణ ఎంతో శ్రమపడ్డారు. యూనిట్‌ సభ్యులందరినీ రైళ్ళలో ఢిల్లీకి తీసుకువెళ్ళి, అక్కడ గదులు బుక్‌ చేసి ఉంచి, అక్కడ నుంచి సిమ్లాకు తీసుకువెళ్ళారు'' అని కృష్ణ కెరీర్‌ తొలి రోజుల నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఉన్న సీనియర్‌ సినీ జర్నలిస్టు మోహన్‌ కుమార్‌ చెప్పారు. హీరో కృష్ణ నిర్మించిన చిత్రాలకు కొద్దికాలం పాటు నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, జ్యోతిలక్ష్మి తదితర ప్రముఖ నటీనటులెందరో ఈ చిత్రంలో నటించారు. రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో మనుషులు తిరగని, మంచినీళ్ళు కూడా దొరకని చోట ప్రాణాలకు తెగించి, ఈ చిత్ర షూటింగ్‌ చేశారు. బికనీర్‌ కోటలో, సట్లెజ్‌ నదీ తీరంలోని తట్టాపానీ ప్రాంతంలో చిత్రీకరణ జరిపారు. ''మో.మో. ఓపెనింగ్‌ షాటే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. వి.ఎస్‌.ఆర్‌. స్వామి కెమేరా పనితనం తెలియాలంటే, 'మో.మో' చూడాల్సిందే!'' అని మోహన్‌ కుమార్‌ అన్నారు.

విలన్లు ఎడారిలో వదిలేసి వెళ్ళినప్పుడు, తాగడానికి నీళ్ళయినా లేక ఎండలో మాడిపోయి హీరోకు ముఖమంతా పొక్కులు వచ్చినట్లు చూపించే సన్నివేశం ఈ చిత్రంలో ఉంది. సరైన మేకప్‌ సామగ్రి దొరకని సమయంలో కృష్ణ వ్యక్తిగత మేకప్‌మ్యాన్‌ సి. మాధవరావుకు చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. దగ్గరలోనే బఠాణీలు దొరికితే తెప్పించారు. ఆ బఠాణీల పైన పొరలా ఉండే, తొక్కు తీయించారు. ఆ తొక్కులను హీరో కృష్ణ ముఖంపై అంటించారు. అంతే! సన్నివేశానికి కావాల్సిన ముఖంపై పొక్కుల ఎఫెక్ట్‌ వచ్చింది. సాంకేతిక నిపుణులు చూపిన అలాంటి సమయస్ఫూర్తి, 'గుడ్‌, బ్యాడ్‌, అగ్లీ' చిత్రంలోని 'అగ్లీ' పాత్ర స్ఫూర్తితో మలచిన నక్కజిత్తుల నాగన్న (పాత్రధారి విలక్షణ నటుడు నాగభూషణం) పాత్రచిత్రణ, ఫైట్‌ మాస్టర్లు మాధవన్‌, రాఘవులు చేసిన సాహసాల లాంటివి ఇవాళ్టికీ ఓ పెద్ద గాథ.

తప్పిన అంచనాలు! తప్పని గురి!!

అయితే, ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతున్నప్పుడు నిరుత్సాహపరిచినవారూ లేకపోలేదు. ప్రముఖ నిర్మాత - దర్శకుడు, చిత్ర పరిశ్రమలో హీరో కృష్ణకు మొదటి నుంచీ శ్రేయోభిలాషీ అయిన చక్రపాణి ఒకసారి షూటింగ్‌ జరుగుతుండగా వచ్చారు. సెట్‌లోని కౌబాయ్ వాతావరణం, నటీనటుల గెటప్‌లు చూసి, ఆయన పెదవి విరిచారు. మన తెలుగు వాతావరణానికి దూరంగా ఉండే ఈ గెటప్పులనూ, సెటప్పులనూ సామాన్య ప్రేక్షక జనం మెచ్చరని తన అంచనా అడక్కుండానే చెప్పేశారు. కానీ, అప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్‌ అయిపోయింది. దాంతో, హీరో కృష్ణ బృందం ఆ అభిప్రాయాలను పక్కనపెట్టి, ముందుకు సాగారు. మొదట ఈ చిత్రానికి 'అదృష్ట రేఖ' అని పేరు పెడదామనుకున్నా, చివరకు 'మోసగాళ్ళకు మోసగాడు' అనే మాస్‌ టైటిల్‌నే ఎంచుకున్నారు.

తీరా షూటింగ్‌ పూర్తయి, తొలి కాపీ వచ్చాక కూడా ప్రివ్యూలు చూసినవారెవరూ, ఈ సినిమాపై సరైన అంచనా చెప్పలేకపోయారు. కానీ, హీరో ఎన్టీఆర్‌ మాత్రం 'బాగుంది బ్రదర్‌! నిజంగా విభిన్నమైన మాస్‌ సినిమా తీశారు. అయితే, ఈ సినిమాలో ఆడవాళ్ళకు నచ్చే అంశాలు మిస్సయ్యారు. కాబట్టి, వాళ్ళు పెద్దగా చూడరు. ఫస్ట్‌ రిలీజ్‌ కన్నా, రీ-రిలీజుల్లో మరింత డబ్బు వస్తుంది. సంచలనం రేపుతుంది' అన్నారు. సరిగ్గా ఆయన అన్నట్లే అయింది. 1971 ఆగస్టు 27 శుక్రవారం నాడు బెంగుళూరుతో సహా తెలుగు నాట సుమారు 27 కేంద్రాల్లో, ''దాదాపు 35 ప్రింట్లతో'' 'మోసగాళ్ళకు మోసగాడు' విడుదలైంది. చివరకు, ''ఎన్టీఆర్‌ చెప్పినట్లే అయింది. మహిళాదరణ దక్కలేదు కానీ, సినిమా సంచలనాత్మక విజయం సాధించింది'' అని హీరో కృష్ణ అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

సక్సెస్‌కు సహకరించిన అంశాలు

తెలుగులో అంతకు మునుపెన్నడూ రాని సాహస గాథా చిత్రమైన 'ఈ కొత్త తరహా సినిమా తెలుగు తెరకు శోభాయమానమైన అమూల్య కానుక' అని అధికశాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంకా బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలే రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో పూర్తిగా ''ఈస్ట్‌మన్‌ కలర్‌లో నిర్మించిన ఈ చిత్రంలో కథ కన్నా, కథా గమనం కన్నా కమనీయమైన దృశ్యాలు ప్రేక్షకులను విశేషంగా'' ఆకర్షించాయి. ''ఒక చక్కని ఆంగ్ల చిత్రం చూస్తున్నట్లు'' అనిపించింది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది దర్శకుడు, ఛాయాగ్రహణ దర్శకుల చిత్రం. ఈ చిత్రానికి వన్నె తెచ్చింది, ప్రాణం పోసింది - ముఖ్యంగా వి.ఎస్‌.ఆర్‌. స్వామి సినిమాటోగ్రఫీ. అప్పుడప్పుడే వాడుకలోకి వస్తున్న రంగుల ఫిలిమ్‌ను ప్రకృతి రామణీయతను చూపేందుకు సద్వినియోగం చేసుకున్నారు. కెమేరా కోణాలను వి.ఎస్‌.ఆర్‌. స్వామి ఎంత వేగంగా మారుస్తూ వెళ్ళారో, సన్నివేశ పరంపరను కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ అంతే వేగంగా నడిపిస్తూ వెళ్ళారు. ఫలితంగా చిత్రంలోని లోటుపాట్లు చటుక్కున ఎవరికీ తట్టలేదు.

ఈ చిత్రకథకు సందర్భశుద్ధి కల్పించడానికి ఆరుద్ర ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, అవి లోపరహితం కాలేకపోయాయి. ఈ సినిమాలో చూపినట్లు చిత్ర కథ జరిగే కర్నూలు సబాలో ఎడారులుండవు. గుంటూరు సర్కార్‌లో మంచుకొండలూ ఉండవు. అయినా, ఆ ఊపులో ఈ అనౌచిత్యం గురించి ప్రేక్షకులు ఎవరూ ఆలోచించ లేదు. ''దర్శకుడు కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కెమేరా కదలికలు వాడాలని ఆయన ప్రయత్నిస్తుంటారు. 'మోసగాళ్ళకు మోసగాడు'లో ప్రధానంగా 8 ఆకారంలో కనిపించే కెమేరా కదలిక ఆయన సృష్టించినదే!'' అని కృష్ణ, ఈ వ్యాసకర్తకు వెల్లడించారు.

ఇక, సంగీతం, ప్రధానంగా నేపథ్య సంగీతాన్ని చిత్ర వాతావరణానికి అనుకూలంగా, కొత్త తరహాలో ఉంటూ జనాన్ని బాగా హుషారు పరిచేలా ఆదినారాయణరావు సమకూర్చారు. 'కోరినది దరి చేరినది...' అనే యుగళగీతం ఆకట్టుకుంది. డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్ల కృషి ఫలించడానికి కోటగిరి గోపాలరావు కూర్పు కూడా బాగా తోడ్పడింది. విచిత్రం ఏమిటంటే, అప్పటి దాకా నాయిక, ప్రధాన పాత్రలకే పరిమితమైన శాస్త్రీయ నర్తకి, నటి రాజసులోచనతో ఈ చిత్రంలో ఓ శృంగార నృత్యం చేయించడం! 'సిగ్గేలా మగాడికీ.. పగ్గాలా వయారికీ...' అనే ఆ పాటలో రాజసులోచన నృత్యం ఆనాటి ప్రమాణాల్లోనే ఆంగ్ల చిత్రాల స్థాయిని అందుకుంది.

సరికొత్త చరిత్రకు శ్రీకారం

హీరోగా కృష్ణకు 60వ సినిమాగా విడుదలైన 'మోసగాళ్ళకు మోసగాడు' చిత్రం విమర్శలు, లోపాలకు అతీతంగా విజయవంతమైంది. 'పద్మాలయా' పతాకానికి తొలి విజయం అందించడమే కాక, తొలి తెలుగు కౌబాయ్ సినిమాగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. కృష్ణ ఈ చిత్రంతో స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. అంతకు పదింతల పేరు నిర్మాతగా సంపాదించుకున్నారు. ''కేవలం 7 లక్షల రూపాయల బడ్జెట్‌లో 28 రోజుల్లో ఆ చిత్రాన్ని నిర్మించాం. తొలి రిలీజ్‌లోనే దాదాపు రూ. 32 లక్షలు వసూలు చేసింది. స్టార్‌ ఇమేజ్‌ కోసం సొంత బ్యానర్‌ను పెట్టిన నా లక్ష్యం నెరవేరింది. వెరసి 'మోసగాళ్ళకు మోసగాడు' ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అయింది'' అని కృష్ణ అన్నారు.

ఆ సినిమాతో కృష్ణ ఎంత బిజీ అయ్యారంటే, మరో 12 చిత్రాలు విడుదలయ్యాక కానీ, ఆయన మళ్ళీ సొంత సినిమాను ప్రారంభించలేనంత బిజీ!

ఈ సక్సెస్‌ఫుల్‌ సినిమా సహజంగానే ఇతర భాషల్లోకి డబ్‌ అయింది. తమిళంలో 'మోసక్కారనుక్కు మోసక్కారన్‌'గా, హిందీలో 'గన్‌ఫైటర్‌ జానీ' పేరుతో, ఇంగ్లీషులో 'ది ట్రెజర్‌ హంట్‌'గా అనువాదమైంది. ''తమిళంలో వంద రోజులాడింది. హిందీలో వంద రోజులు ఆడలేదు కానీ, బాగా వసూళ్ళు సాధించింది'' అని కృష్ణ చెప్పారు. గమ్మత్తేమిటంటే, హాలీవుడ్‌ చిత్రాల స్ఫూర్తితో అటు నుంచి ఇటు వచ్చిన ఈ చిత్ర కథ, మళ్ళీ ఇటు నుంచి అటు ఇంగ్లీషులోకి అనువాదమై, అక్కడి ప్రేక్షకుల్ని అలరించడం! ''ఇంగ్లీషు డబ్బింగ్‌ రూపం గల్ఫ్‌ దేశాలు, సింగపూర్‌, కౌలాలంపూర్‌, టర్కీ, ఆఫ్రికన్‌ దేశాలన్నిటిలో కలిపి దాదాపు 80 దేశాల్లో విడుదలైంది'' అని కృష్ణ తెలిపారు.

సినిమా విడుదలైన తొలి రోజుల్లో ప్రచారంలో పేర్కొన్నట్లుగానే ఈ చిత్రం ''తెలుగు చలనచిత్ర చరిత్రలో నూతనాధ్యాయం ప్రారంభించిన చిత్రం''గా నిలిచింది. ఆ పైన మరెన్నో కౌబాయ్ చిత్రాలు తెలుగులో రావడానికీ, కృష్ణ కూడా మరిన్ని కౌబాయ్ వేషాలు వేయడానికీ తోడ్పడింది. 'మోసగాళ్ళకు మోసగాడే' ప్రేరణగా దాదాపు 15 కౌబాయ్ చిత్రాల్లో కృష్ణ నటించారు. అయితే, ఆ తదుపరి చిత్రాలేవీ తొలి విజయాన్ని మరిపించలేక పోయాయి.

సాక్షాత్తూ కృష్ణకు నట వారసుడైన యువ హీరో మహేష్‌బాబుతో కూడా మళ్ళీ అదే రకమైన కథతో పదేళ్ళ క్రితం భారీ వ్యయంతో 'టక్కరి దొంగ' (2002) చిత్రం నిర్మితమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, హాలీవుడ్‌ కౌబాయ్ ల అసలు సిసలు లొకేషన్లలో ఆ సినిమా తీశారు. హీరో కృష్ణ కూడా ఆ సినిమా శుభం కార్డు పడే సమయంలో ఒక్క క్షణం తెరపై మెరిశారు. కానీ, అవేవీ ఆ సినిమాకు విజయం అందించలేకపోయాయి. ఏమైనా, ఇవాళ్టికీ తెలుగులో కౌబాయ్ హీరో అంటే కృష్ణే! కౌబాయ్ సినిమా అంటే - 'మోసగాళ్ళకు మోసగాడే'!