జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, September 11, 2011

తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' రిలీజైంది 1931లో కాదు, 1932లో!(తొలి తెలుగు టాకీ 1931 సెప్టెంబర్ 15న విడుదలైందన్న తప్పుడు చరిత్ర దీర్ఘకాలంగా ప్రచారంలో ఉంది. తీరా ఈ 2011 సెప్టెంబర్ 15న ఆ సినిమా వచ్చి, 80 ఏళ్ళు పూర్తయ్యాయనే పండుగ కూడా సినీ పరిశ్రమ పెద్దలు చేసేస్తున్నారు. కానీ, విడుదల తేదీపై వాస్తవ చరిత్ర అందుకు భిన్నంగా ఉన్నట్లు ఎంతో శ్రమించి చేసిన పరిశోధనలో తేలింది. మరి, అసలు తెలుగు సినిమాయే పుట్టని తేదీన పుట్టిన రోజు పండుగ చేస్తున్న మనవాళ్ళు ఇకనైనా కళ్ళు తెరుస్తారా?)

మాటలు లేని మూగ సినిమాలు నిర్మాణమవుతున్నంత కాలం ఏ భాష వారు ఆ చిత్రాన్ని తీసినా, దాన్ని భాషల చట్రాల్లో బిగించలేం. అది అందరి సినిమాయే తప్ప, ఫలానా భాషా చిత్రంగా చెప్పడానికి వీలు కాదు. కానీ, తెర మీద కదిలే బొమ్మలు మాటలు నేర్చుకోవడం మొదలైన తరువాత నుంచి పరిస్థితి మారింది. ఏ భాషలో మాటలు వినిపిస్తుంటే, ఆ భాషా చిత్రంగా పేర్కొనడం మొదలైంది.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ సంగతికొస్తే, మూకీలను వెనక్కి నెడుతూ టాకీలు వచ్చింది - 1931లో. హిందీ - ఉర్దూల మిశ్రమ భాష (హిందుస్థానీ)లో తయారై, 1931 మార్చి 14న బొంబాయిలోని మెజిస్టిక్ థియేటర్‌లో విడుదలైన 'ఆలమ్ ఆరా'యే తొలి భారతీయ టాకీ చిత్రం. బొంబాయిలోని ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత అర్దేషిర్ ఎం.ఇరానీ ఆ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. 'ఆలమ్ ఆరా' తరువాత మరో ఏడు నెలలకు కానీ, మన దక్షిణాది భాషలో మాట్లాడే చిత్రాలు రాలేదు.

తొలి సినిమాపై తప్పుడు చరిత్ర

తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రం 'కాళిదాస్' 1931 అక్టోబర్ 31న విడుదలైంది. ఆ చిత్రంలో కథానాయక పాత్రధారి తెలుగులో మాట్లాడితే, మరో కథానాయిక సౌదామిని పాత్రధారిణి టి.పి. రాజలక్ష్మి తమిళంలో సమాధానమిచ్చారు. (కథానాయిక పాత్ర పేరు విద్యాధరి అని కొందరి కథనం) ఈ చిత్రంలో కథానాయిక రెండు త్యాగరాయ కీర్తనలను సైతం ఆలపించారు. అంటే తెలుగు, తమిళ భాషలు రెండూ ఈ సినిమాలో ఉన్నాయి. అయితే ఎక్కువగా తమిళంలోనే మాటలు, పాటలు వినిపించాయి కాబట్టి, ప్రధానంగా దాన్ని తమిళ భాషా చిత్రంగానే పరిగణించారు. ఇలా 'కాళిదాస్'ను తొలి తమిళ టాకీగా తీర్మానించారు.

అయితే, ఆ తర్వాత పూర్తి తెలుగు సంభాషణలతో వచ్చిన తొలి తెలుగు టాకీ మాత్రం 'భక్త ప్రహ్లాద'. ఇంతవరకూ ఆ చిత్రం సరైన విడుదల తేదీ ఏమిటన్నది ఎవరికీ తెలియదు. తొలి తమిళ టాకీ 1931 అక్టోబర్ చివరలో వచ్చింది కాబట్టి, దానికి కనీసం నెలన్నర ముందు 1931 సెప్టెంబర్ 15న తొలి తెలుగు టాకీ విడుదలైనట్లు ఎవరో తెలివిగా ఓ కథనాన్ని పుట్టించారు. అందులోని నిజానిజాలు నిగ్గు తేల్చకుండా, ఆ కథనాన్నే ప్రతి ఒక్కరూ ప్రచారంలో పెట్టారు. తొలి తెలుగు టాకీ విడుదలైంది సెప్టెంబర్ 15నే అంటూ సాక్ష్యాధారాలు లేకుండానే మన చరిత్రకారులు గొఱ్ఱెదాటు ధోరణిని ప్రదర్శించారు. ఇటీవల పెరిగిన ఈ ధోరణితో, ఏటేటా సెప్టెంబర్ 15ను 'తెలుగు సినిమా జన్మదినం'గా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ ప్రకారం ఈ 2011 సెప్టెంబర్ 15తో తొలి తెలుగు సినిమా విడుదలై 80 ఏళ్లు పూర్తవుతున్న పండుగ కూడా చేసేస్తున్నారు.

కానీ, చరిత్ర మీద సిసలైన అభిమానంతో లోతుగా పరిశీలిస్తే, వాస్తవాలు వీటికి విరుద్ధంగా ఉన్నాయి. 'భక్త ప్రహ్లాద' 1931 సెప్టెంబర్ 15న విడుదలైందన్న వాదన కానీ, కనీసం తమిళ టాకీ కన్నా ముందే తెలుగు టాకీ వచ్చేసిందన్న వాదన కానీ శుద్ధ తప్పు అని ఈ పరిశోధకుడి అన్వేషణలో తేలింది.

సెన్సార్ కన్నా ముందే రిలీజెట్లా?

తొలి తమిళ, తెలుగు టాకీలు రెండింటికీ దర్శకుడు ఒకరే - హెచ్.ఎం.రెడ్డి. తమిళ టాకీ 'కాళిదాస్' 1931 అక్టోబర్ 31న మద్రాసులోని 'కినిమా సెంట్రల్' (ఇప్పుడు ఈ హాలు పేరు 'మురుగన్' టాకీస్)లో విడుదలైందనడానికి పత్రికా ప్రకటనలతో సహా తమిళ చరిత్రకారులు సాక్ష్యాధారాలు సేకరించారు. "10 వేల అడుగుల నిడివి'' గల ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ కూడా పొందింది. ప్రదర్శన కాలం 112 నిమిషాలైన ఈ చిత్రం సర్టిఫికెట్ నెంబర్ "ఎం (మద్రాసు?) - 1598.''

కానీ, అంతకన్నా ముందే రిలీజైనట్లు పుట్టించిన పుక్కిటి చరిత్ర చెబుతున్న తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' మాత్రం సెన్సారైంది - 1932 జనవరి చివరిలో! ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, 1932 జనవరి 22న! మొత్తం 9,762 అడుగుల నిడివి గల 10 రీళ్ల ఆ చిత్రం బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకొంది. 'బొంబాయి బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సెన్సార్స్' అదే తేదీతో సెన్సార్ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. ఆ సెన్సార్ సర్టిఫికెట్ "నెంబర్ - 11032, తేదీ 22 జనవరి 1932''. దీన్నిబట్టి, ఒక విషయం స్పష్టం. 1932 జనవరి చివరిలో సెన్సారింగ్ జరుపుకొన్న మన 'భక్త ప్రహ్లాద' 1931 సెప్టెంబర్ మధ్యకే రిలీజై పోయిందనడం తలాతోకా లేని వాదన.

హెచ్.ఎం. రెడ్డి ఏం చెప్పారు?

దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి సైతం తాను ముందుగా తెలుగు టాకీ నిర్మించి, ఆ పైన తమిళ టాకీ చేశానని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. పైపెచ్చు, తమిళ టాకీ తీశాకే, తెలుగు టాకీ తీసినట్లు తన మాటల్లో, రాతల్లో స్పష్టంగా పేర్కొన్నారు. "... మొదటి హిందీ టాకీ అయిన 'ఆలమ్ ఆరా'ను తయారు చేసిన నలుగురు ప్రముఖులలో ఒకణ్ణి నేను" అని ఆయన చెప్పారు.

(బెంగళూరులోని సూర్యా ఫిలిమ్స్‌వారు తీసిన మూకీ చిత్రాలతో సినీ పరిశ్రమతో అనుబంధం పెంచుకున్న హెచ్.ఎం.రెడ్డి ఆ తరువాత బొంబాయికి మకాం మార్చి, దర్శక - నిర్మాత అర్దేషిర్ ఎం. ఇరానీ వద్ద సహాయకుడిగా పనిచేశారు. ఇరానీ నిర్మించిన 'విజయ్ కుమార్'లాంటి మూకీలకు దర్శకత్వం వహించారు.

తొలి టాకీ 'ఆలమ్ ఆరా' విజయంతో దక్షిణాది భాషల్లోనూ టాకీలు నిర్మించాలని అర్దేషిర్ ఇరానీ అనుకున్నప్పుడు ఆయన సహజంగానే తన వద్ద ఉన్న అనుభవజ్ఞుడైన దక్షిణ భారతీయుడు హెచ్,ఎం.రెడ్డి వైపు మొగ్గారు. ఆ భాషలు తెలిసిన రెడ్డికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆ రకంగా, అర్దేషిర్ ఇరానీ నిర్మించిన తొలి తమిళ టాకీకి హెచ్.ఎం.రెడ్డి స్వయంగా దర్శకత్వం వహించారు).

"...మొదటి అరవ ఫిలిమ్ డైరెక్ట్ చేసినవాణ్ణీ నేనే! అది - టి.పి.రాజలక్ష్మి యాక్టు చేసిన 'కాళిదాస్'. అది నాదేగా! ... ఆ పైన అఖిల భారతదేశంలో ప్రథమ తెలుగు టాకీ అయిన 'ప్రహ్లాద'ను నేనే డైరెక్టు చేశాను...'' అని హెచ్.ఎం. రెడ్డి అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీన్నిబట్టి చూసినా, తమిళ టాకీ తరువాతే తెలుగు టాకీ వచ్చిందని అర్థమవుతోంది.

ఎల్.వి.ప్రసాద్ ఏం చెప్పారు?

మూకీల రోజుల నుంచి బొంబాయిలో ఉన్న నటుడు, తరువాత ప్రముఖ దర్శక - నిర్మాతగా మారిన ఎల్.వి. ప్రసాద్ సైతం తమిళ టాకీ తరువాతే తెలుగు టాకీ వచ్చినట్లు పేర్కొన్నారు. తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా'లో ఉన్న ఎల్.వి. ప్రసాద్, తొలి తమిళ టాకీ 'కాళిదాస్'లోనూ ఓ చిన్న వేషం వేశారు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలోనే తయారైన తొలి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద'లో సైతం ఆయన ప్రహ్లాదుడి సహాధ్యాయీ, గురువు చండామార్కుల వద్ద శిష్యుల్లో ఒకడూ అయిన మొద్దబ్బాయి పాత్ర ధరించారు. ఆ రకంగా హిందీ, తమిళం, తెలుగు - ఈ మూడు భారతీయ భాషల్లోనూ తొలి టాకీ చిత్రాలతో సంబంధం ఉన్న వ్యక్తులు - హెచ్.ఎం.రెడ్డి, ఎల్.వి. ప్రసాద్.

ఓ సందర్భంలో ఎల్.వి. ప్రసాద్ తన అనుభవాలను వివరిస్తూ 'బొంబాయిలో (హెచ్.ఎం) రెడ్డి గారు నాకు పరిచయమయ్యారు. ఆయనేదో అక్కడ పృథ్వీరాజ్ కపూర్ హీరోగా ఒక సైలెంట్ పిక్చర్ డైరెక్ట్ చేస్తున్నారు. అప్పుడే 'టాకీ' ప్రారంభమైంది. 'ఆలమ్ ఆరా' వచ్చింది. అర్దేషిర్ గారికి తమిళంలో ఏదైనా సినిమా తీద్దామని ఉద్దేశం కలిగి, 'కాళిదాస్' ప్లాన్ చేశారు. అప్పుడు టి.పి. రాజలక్ష్మినీ, వారినీ పిలిపించారు. నేను కూడా ఉన్నాను కనుక అందులో నేనూ ఒక వేషం వేశాను. ఆ విధంగా హెచ్.ఎం.రెడ్డి గారితో పరిచయమైంది. ఆయన తెలుగువాడైనా, అక్కడ బాగా కమాండ్ చేసేవాడు. ఆయనంటే అందరికీ హడల్. ఆ ('కాళిదాస్') సినిమా అవగానే, కృష్ణా ఫిలిమ్ కంపెనీ వారికి 'భక్త ప్రహ్లాద' తీయాలనే ఉద్దేశం కలిగింది. (హెచ్.ఎం) రెడ్డిగారే డైరెక్ట్ చెయ్యడం కనుక ఆయనే నన్ను పిలిచారు' అని 'భక్త ప్రహ్లాద' విషయాలు తెలిపారు. ఆయన చెప్పిన మాటలను బట్టి చూసినా, తెలుగులో టాకీలు వచ్చింది తమిళం తరువాతే అన్నది స్పష్టం!

నోటి మాట కాదు, రాతలోనూ అదే!

వట్టి నోటి మాటగా చెప్పడమే కాదు, హెచ్.ఎం. రెడ్డి స్వయంగా ఈ వివరాలు రాశారు కూడా. భారతీయ టాకీ రజతోత్సవాల సమయంలో హెచ్.ఎం. రెడ్డి 'గడిచిన 25 ఏళ్లలో దక్షిణ భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ' శీర్షికతో ఓ వ్యాసం రాశారు. అందులోనూ ఆయన తమిళ టాకీ విజయమే తనను తెలుగు టాకీ నిర్మాణానికి ప్రోత్సహించినట్లు చాలా స్పష్టంగా తెలిపారు.

"... ఎన్నో పురిటినొప్పుల మధ్య తొలి తమిళ చిత్రం 'కాళిదాస్' (9000 అడుగులు)ను బొంబాయిలోని ఇంపీరియల్ స్టూడియోస్‌లో నిర్మించాం. అప్పట్లో తారలంటే రంగస్థల తారలే! సుప్రసిద్ధ రంగస్థల నటీనటులకు ఎంతో గిరాకీ ఉండేది. నిజం చెప్పాలంటే, ఆ తొలి సంవత్సరాల్లో నిర్మించిన చిత్రాలు కేవలం సుప్రసిద్ధ నాటకాల పునర్నిర్మాణాలే! కాకపోతే, సరికొత్త మాధ్యమమైన వెండితెరపై ఆ నాటకాలు చూపేవాళ్లం!

తమిళ చిత్రం సాధించిన విజయం తెలుగులో ఓ చిత్ర నిర్మాణానికి ప్రోత్సాహమిచ్చింది. అలా నేను దర్శకత్వం వహించిన (తెలుగు చిత్రం) 'భక్త ప్రహ్లాద' 1932లో విడుదలైంది. ఈ చిత్రం విజయం సాధించడంతో, తెలుగులో, తమిళంలో వరుసగా ఎన్నో పౌరాణిక చిత్రాలు వచ్చాయి. స్వర్గీయ రాజా శాండో, నారాయణ్ లాంటి అనుభవజ్ఞులైన సీనియర్లు, సి. పుల్లయ్య, హెచ్.వి.బాబు, స్వర్గీయ చిత్రపు నరసింహారావు లాంటి వారు ఆ పౌరాణికాలకు దర్శకత్వం వహించారు...'' అని సాక్షాత్తూ హెచ్.ఎం.రెడ్డే రాశారు. 'భక్త ప్రహ్లాద' విడుదలైంది 1931లో కానే కాదనడానికి ఆ చిత్ర దర్శకుడు రాసిన ఈ మాటలే ప్రబలమైన సాక్ష్యం!

మరి 'భక్త ప్రహ్లాద' రిలీజైంది ఎప్పుడు?

ఇంతకీ, 'భక్త ప్రహ్లాద' విడుదల తేదీ ఏమిటన్నట్లు? ఈ పరిశోధకుడి అన్వేషణలో తేలిందేమిటంటే, "తొలి 100 % తెలుగు టాకీ''గా సగర్వంగా ప్రకటించుకున్న 'భక్త ప్రహ్లాద' చిత్రం విడుదలైంది తెలుగు సంవత్సరాది కానుకగా - 1932 ఏప్రిల్ 2న! మద్రాసులోని నేషనల్ పిక్చర్ ప్యాలెస్‌లో 'భక్త ప్రహ్లాద' విడుదలైంది. "ప్రేక్షకులచే క్రిక్కిరిసి పోవుచున్నది. గనుక ముందుగ స్థలము కొరకై జాగ్రత్త పడుడు. ఈ 100% సంపూర్ణ తెలుగు టాకీ చూచు యవకాశము బోగొట్టుకొనకుడు'' అంటూ ప్రకటనలు ఇచ్చారు. అప్పట్లో రోజుకు రెండు ఆటలే (సాయంత్రం ఫస్ట్ షో, రాత్రి వేళ సెకండ్ షో) ప్రదర్శించేవారు. ఏవైనా పండుగలు, పబ్బాలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మధ్యాహ్నం వేళ ప్రత్యేకంగా మ్యాట్నీ షో వేసేవారు. 'భక్త ప్రహ్లాద'కు కూడా ఆ తెలుగు సంవత్సరాది పండుగ నాడు సాయంత్రం 3 గంటల 15 నిమిషాలకు 'ప్రత్యేక మేటనీ ప్రదర్శన' వేశారు.

'భక్త ప్రహ్లాద' విడుదలైంది 1932లోనే అని చెప్పడానికి మరో ప్రాసంగిక సాక్ష్యాధారం కూడా ఉంది. అది ఏమిటంటే - ఆ సినిమాకు సమీక్షలు సైతం 1932లోనే వచ్చాయి. 'ఆనంద బోధిని' లాంటి పత్రికలు 1932 మార్చి సంచికలో ఈ చిత్రాన్ని సమీక్షించాయి. ఒకవేళ పుక్కిటి చరిత్ర చెబుతున్నట్లు, 1931 సెప్టెంబర్‌లో 'భక్త ప్రహ్లాద' సినిమా రిలీజై ఉంటే, దొంగలు పడ్డ ఆరు నెలలకు సమీక్షించరు కదా! ఆ రకంగా చూసినా, 'భక్త ప్రహ్లాద' విడుదల 1931లో కాదు, 1932లో అని చెప్పవచ్చు.

('భక్త ప్రహ్లాద' రిలీజైంది ఏప్రిల్‌లో అయితే, మార్చి సంచికలో సమీక్ష రావడానికి కారణం ఏమిటని ఎవరైనా అనుమానం వ్యక్తం చేయవచ్చు. దానికి ఈ పరిశోధకుడి వివరణ ఏమిటంటే - అప్పటి పత్రికలు ఇప్పటిలా ముందస్తు తేదీలతో కాక, ఏ నెలకు ఆ నెలే రావడం కద్దు. పైగా , కొన్ని పత్రికలు నెల మధ్యలోనో, ఒక్కోసారి మరీ ఆలస్యంగా నెలాఖరులోనో విడుదలయ్యేవి. ఆర్థికాది అనేక కారణాలతో మరీ ఆలస్యమైనప్పుడు అరుదుగా కొన్నిసార్లు ముందటి నెల తేదీతోనే తరువాతి నెలలో వచ్చేవి. ఓపిగ్గా వెతికితే అలాంటి ఉదాహరణలు చాలా కనపడతాయి. కాబట్టి, పత్రిక మీద "మార్చి నెల'' అని రాసినా సదరు పత్రిక మార్చి నెల చివరలోనో, ఏప్రిల్‌లోనో వచ్చి ఉండవచ్చు.

ఇక, సినిమా రిలీజు ముందే సమీక్ష ఏమిటని కూడా నోళ్ళు నొక్కుకోనక్కర లేదు. ఎందుకంటే, సినీ పరిశ్రమ పెద్దలకూ, పత్రికల వారికీ సినిమాను ముందుగానే ప్రదర్శించి చూపే అలవాటు అప్పటికే చిత్రసీమలో ఉంది. సినిమా విడుదలకు ముందు రోజునో, రిలీజ్ రోజునో పెద్దలకూ, సన్నిహితులకూ ప్రివ్యూ వేసి చూపడం ఇప్పటి వాడుక. కానీ, అప్పట్లో అలా కాదు! సినిమా విడుదల కన్నా వారం రోజులు, ఒక్కోసారి పది రోజుల ముందరే ప్రివ్యూ వేసేవారు. తొలి తమిళ టాకీ 'కాళిదాస్'కూ ఆ పద్దతి పాటించారు. అదే పద్ధతిని ఆ తరువాత వచ్చిన 'భక్త ప్రహ్లాద'కూ అనుసరించారని ఊహించవచ్చు. ఫలితంగా, ఏప్రిల్ 2న రిలీజైన 'భక్త ప్రహ్లాద'కు మార్చి నెల పత్రికలోనే సమీక్ష వచ్చి ఉండవచ్చు).

ఏమైనా, ఒకటి వాస్తవం. ఏ రకంగా చూసినా తొలి తమిళ టాకీ తరువాతే తొలి తెలుగు టాకీ విడుదలైందనేది చేదు నిజం! తెలుగు సినిమా పుట్టిన రోజు 1931 సెప్టెంబర్ 15 తేదీ కాదనేది ఖాయం!! ఇప్పటి వరకు లభిస్తున్న సాక్ష్యాధారాలను బట్టి చూస్తే 1932 జనవరి చివరిలో సెన్సారైన తరువాతా, చిత్ర తొలి విడుదల సమాచారం దొరుకుతున్న ఏప్రిల్ లోపలా 'భక్త ప్రహ్లాద' విడుదలైనట్లు స్పష్టమవుతోంది. కాబట్టి, 'భక్త ప్రహ్లాద' 1931లో విడుదలైందన్న మాటే సత్యదూరం. మరి, ఇప్పటికైనా మన సినీ చరిత్రకారులు తెలుగు సినిమా పుట్టిన తేదీ గురించి ప్రచారంలో ఉన్న పాత తప్పులను సవరించుకుంటారా? పుట్టని సెప్టెంబర్ 15ను వదిలేసి, ఇకనైనా తెలుగు సినిమాకు సరైన రోజునే జన్మదినం జరుపుతారా?!

కొసమెరుపు :

'ఇన్నాళ్లూ తమిళ టాకీ కన్నా ముందే తెలుగు టాకీ ముందు వచ్చిందని సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆ సంతోషం లేకుండా చేశారే'మని మిత్రులు బాధపడనక్కర లేదు. ఎందుకంటే, తెలుగు మాటలు, పాటలు ఉన్నాయి కాబట్టి, హెచ్.ఎం. రెడ్డి 'కాళిదాస్' సినిమాను కేవలం తమిళ టాకీగా కాక, తొలి తెలుగు - తమిళ టాకీగా చెప్పుకోవచ్చు! అందులో హీరోయిన్ మన అచ్చ తెలుగు కీర్తనలు రెండు కూడా పాడారు. "తమిళ లిపిలో రాసుకొని మరీ, తెలుగు సంభాషణలు పలికా''రు. హీరో కూడా తెలుగులో డైలాగులు చెప్పారు. నిజానికి, 'కాళిదాస్' చిత్రానికి "తమిళ - తెలుగు భాషల్లో మాట్లాడే చిత్రం'' అనే ప్రకటనలిచ్చారు. ఆ రకంగా, తెర మీద బొమ్మలు తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి మాట్లాడాయి కాబట్టి, తమిళంతో సమానంగా తెలుగూ నిలిచిందని చెప్పుకోవచ్చు! సంతోషపడవచ్చు!!

(మద్రాసు విశ్వవిద్యాలయంలో సమర్పించిన పరిశోధన వ్యాసం నుంచి...)

4 వ్యాఖ్యలు:

mandaakini said...

జయదేవ గారు,

పొద్దుట ఆంధ్రజ్యోతి లో మీ వ్యాసం చదివి చాలా బావుంది అనుకున్నాను. మీరు ఎంత కష్టపడి ఈ పరిశోధన చేశారో ఈ విషయం తెలుసుకున్నారో కదా! మీ కృషి కి నిజంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎంత గానో రుణపడి ఉంటుంది.

మీ పరిశోధనలో ఇలాంటి మంచి విషయాలు మరిన్ని వెలుగులోకి రావాలని ఆశిస్తున్నాను.

Anonymous said...

" మన చరిత్రకారులు గొఱ్ఱెదాటు ధోరణిని ప్రదర్శించారు."

మీరు భలే జోకు వేశారు. తెలుగు సినిమా చరిత్ర మీద కృషి చేసింది అసలు ఎవరండీ బాబూ! తారల తళుకు బెళుకుల మీద దృష్టి తప్ప చరిత్ర ఎవరికి కావాలండీ ఈ రోజుల్లో...మీలాంటి నిజమైన సినిమా అభిమానులు పూనుకొని ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఆహా, వోహో అని ఆకాశానికి ఎత్తేసి పొగుడుతారు.

మీ కృషి కి నిజంగా జోహర్లు...( ఈ మాట అనవచ్చా? తప్పు అయితే క్షమించండి)

Anonymous said...

సార్, మీ పరిశోధనేమో గానీ తెలుగు టాకీ ముందు రాలేదని చెప్పి మన గాలి తీసేశారు గా! :-))

best of luck with your research.

Anonymous said...

JAYADEVA GARU

It does not really matter whether the telugu cinima was realased in 31 or 32. however i appreciate your research work. congrats.