జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, April 13, 2011

విశిష్ట వాచికమే వశీకరణ మంత్రం



నటులు చాలా మంది ఉంటారు. కానీ, ఆంగికం, వాచికం, ఆహార్యం - మూడింటితో మెప్పించే అభినయవిదులు మాత్రం కొందరే ఉంటారు. 1970లలో తెలుగు చిత్రసీమలో ప్రవేశించిన నటులలో ఈ మూడింటిలోనూ దిట్టగా కనిపించిన కొద్దిమందిలో ఒకరిగా నూతన్‌ ప్రసాద్‌ ఓ చిరకాల జ్ఞాపకం. కథానాయక పాత్రల దగ్గర నుంచి కామెడీ పాత్రలు, క్యారెక్టర్‌ పాత్రల వరకు ఏ వేషం కట్టినా, దాన్ని తనదిగా చేసుకొని సొంత ముద్ర వేయడం, మనిషి చూపులో, మాట విరుపులో విలక్షణత చూపడం 'నూతన్‌ ప్రసాద్‌'గా స్థిరపడ్డ తాడినాడ వరప్రసాద్‌లోని విశిష్టత. అనారోగ్యంతో గతనెల 30 వ తేదీన నూతన్‌ ప్రసాద్‌ కన్నుమూయడంతో తెలుగు సినీ రంగంలోని గుణచిత్ర నటుల చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది.

నిజానికి, నూతన్‌ ప్రసాద్‌ పెద్ద ఇంట్లో పుట్టి, వెనుక ఉన్న అండదండలతో సినీ రంగంలోకి నడిచొచ్చిన వాడు కాదు. ఆ మాటకొస్తే నటన కూడా ఆయనకు యాదృచ్ఛికంగా ఒంటబట్టినదే! చిన్నతనంలో బడికి వెళుతున్నప్పుడు ఊళ్ళో ఓ పౌరాణిక నాటక సమాజం వారి రిహార్సల్సు చూసీ చూసీ, పద్యాలు వినీ వినీ అనుకోకుండా అర్జునుడి పాత్ర పోషించడంతో ఆయన రంగస్థల జీవితం ఆరంభమైంది.

నూతన్‌ ప్రసాద్‌ అసలు పేరు - దుర్గా సత్యవరప్రసాద్‌. స్వస్థలం - కృష్ణాజిల్లా కైకలూరు. తాడినాడ సుబ్బారావు, శ్యామలాంబ దంపతులకు 1945 డిసెంబర్‌ 12న జన్మించిన వరప్రసాద్‌ చదువుకున్నది కూడా అంతంత మాత్రమే. ఐ.టి.ఐ. పూర్తి చేసినా, నాటకాల మీద ఆసక్తితో అటువైపు నడిచారాయన. ఆయన తండ్రి కైకలూరులోని సమితి కార్యాలయంలో గుమస్తాగా పనిచేసేవారట! ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో తల్లి నిత్యం కుట్టుమిషన్‌ మీద పనిచేస్తూ, దుస్తులు కుడుతూ కుటుంబ భారాన్ని మోసేవారు. ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. వరకు కైకలూరులో చదివి, 1965లో మచిలీపట్నంలోని జాతీయ కళాశాలలో ఐ.టి.ఐ. పూర్తి చేశారు.

నాటకాల నుంచి సినిమాల్లోకి...

1966లో పి.డబ్ల్యు.డి.లో చిరుద్యోగిగా మొదలైన వరప్రసాద్‌ ఆ తరువాత హైదరాబాద్‌లోని 'హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌' (హెచ్‌.ఏ.ఎల్‌)లో చేరారు. అక్కడ సహోద్యోగి, ప్రముఖ రంగస్థల నటుడు భానుప్రకాశ్‌ నిర్వహిస్తున్న 'కళారాధన' నాటక సంస్థలో చేరి, ఎన్నో నాటకాలు వేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాటక ప్రదర్శనలిచ్చి, ఉత్తమ నటుడిగా బహుమతులు గెల్చుకున్నారు. 'రాగరాగిణి', 'గాలివాన', ఏ.ఆర్‌. కృష్ణ దర్శకత్వంలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారి 'మాలపల్లి' నవల నాటకరూపం - ఇలా ఎన్నో నాటకాల్లో ఆయన పాత్రపోషణ అందరినీ ఆకట్టుకుంది. ''పాతికేళ్ళ వయస్సులో 'గాలివాన' నాటకంలో 65 ఏళ్ళ వృద్ధుడి పాత్ర పోషించి ఉత్తమ నటుడి అవార్డు పొందిన ప్రతిభ ఆయన సొంతం'' అని రంగస్థల ప్రదర్శనలతోనే సినీ నటుడిగా ఎదిగిన ప్రముఖ నట - నిర్మాత మురళీమోహన్‌ గుర్తు చేసుకున్నారు.

రాళ్ళపల్లి, పరుచూరి బ్రదర్స్‌, కోట శ్రీనివాసరావు లాంటి నాటి రంగస్థల, నేటి సినీ రంగ ప్రముఖులకు ఆ నాటకాల రోజుల నుంచే వరప్రసాద్‌ సుపరిచితుడు. 1971 ప్రాంతంలో విజయవాడలోని నాటకపోటీల్లో ఏకకాలంలో అటు గంభీరమైన 'గాలివాన' నాటకంలోనూ, ఇటు 'పైడిరాజు' అనే హాస్య నాటికలోనూ పరస్పర విభిన్నమైన పాత్రల్లో వరప్రసాద్‌ చూపిన ఉత్తమ నటనకు ఆకర్షితులైన రచయిత పినిసెట్టి శ్రీరామమూర్తి ఆయనను తెలుగు సినీ రంగంలోని తెలిసినవారికి పరిచయం చేశారు.

కొత్తవాళ్ళతో నిర్మిస్తున్న 'నీడలేని ఆడది' (1974)తో ఆయన కెమేరా ముందుకు వచ్చారు. అయితే, దాని కన్నా ముందే బాపు - రమణల 'అందాల రాముడు' (1973) ఆయనను సినీ ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. వెండితెరపై వరప్రసాద్‌ ఆవిర్భావం జరిగింది. ఆ తరువాత 'ముత్యాల ముగ్గు' (1975)లో నిత్య పెళ్ళికొడుకు పాత్రతో మెప్పించారు. 'కల్పన', 'ఊరుమ్మడి బ్రతుకులు' చిత్రాల్లో నటించారు. అయితే, ప్రతిభకు తగ్గట్లుగా ఆశించినన్ని సినిమా అవకాశాలు రాని పరిస్థితుల్లో కొన్ని నెలల పాటు ఆయన మద్యానికి బానిసగా మిగిలిపోయారు. ఆనక, తల్లి, భార్య తదితరుల అనునయంతో, ఆ అలవాటు నుంచి బయటపడ్డారు. ఆ వెంటనే కొద్ది రోజులకే వచ్చిన 'చలిచీమలు' (1978) అవకాశంతో సరికొత్త నటుడిగా, 'నూతన్‌ ప్రసాద్‌' అనే కొత్త పేరుతో తిరిగి విజృంభించారు.

నిత్య నూతన వాచికాభినయ వరప్రసాద్‌

'ప్రెసిడెంట్‌ పేరమ్మ' (1979), 'తాతయ్య ప్రేమలీలలు' (1980), 'అమ్మ మనసు' లాంటి చిత్రాల్లో నాయక పాత్రధారిగా అలరించిన నూతన్‌ ప్రసాద్‌ది విశిష్టమైన వాచికం. మాటలోని స్పష్టత, స్వచ్ఛత, డైలాగును చెబుతున్నట్లుగా కాకుండా ఆ పాత్రే ప్రవర్తిస్తున్నట్లుగా విరుపులతో కొత్త అందం తీసుకురావడం, వ్యంగ్యం మిళాయించిన విలనీ ఆయనను విలక్షణ నటుడిగా నిలబెట్టాయి. 'చలిచీమలు' చిత్రానికి పరుచూరి బ్రదర్స్‌ రాసిన ''నూటొక్క జిల్లాలకు అందగాణ్ణి'' అనే డైలాగు నూతన్‌ నోట తెలుగు నాట చిరంజీవిగా మారిపోయింది. ఆ చిత్రంతో వచ్చిన గుర్తింపు ఆయనను వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం లేకుండా చేసింది. ప్రాథమికంగా రంగస్థలం మీద నుంచి కెమేరా ముందుకు రావడం వల్ల నూతన్‌ ప్రసాద్‌ ఎంత నిడివి గల సంభాషణలనైనా, అలవోకగా గుర్తుంచుకొని, సింగిల్‌ టేక్‌లో షాట్‌ ఓ.కె. చేసేవారు.

మహాభారత పౌరాణిక గాథను నేటి ఎన్నికల భారతావనికి వర్తింపజేస్తూ రూపొందిన 'కలియుగ మహాభారతం' (1979) చిత్రంలో రారాజు పాత్రలో నూతన్‌ ప్రసాద్‌ మెప్పించారు. ఆ పాత్రకు ఆయన చెప్పిన డైలాగుల గురించి జనం అప్పట్లో చెప్పుకున్నారు. చిత్రం నిడివిని పెంచడం కోసం ఆ పాత్రకు ఆఖరి నిమిషంలో రాసిన సుదీర్ఘమైన సంభాషణల్ని ఆయన అద్భుతంగా పండించారు. 'కుడి ఎడమైతే?' (1979) చిత్రంలో 450 అడుగుల షాట్‌ను ఆయన సింగిల్‌ టేక్‌లో చేసేశారనీ, అలాగే 'షోకిల్లా రాయుడు' సినిమాలో 786 అడుగుల షాట్‌ కూడా ఆయన అలా సింగిల్‌ టేక్‌లో చేసినదేననీ ఆ నాటి సినిమా సంగతులు తెలిసినవారు చెప్పేమాట.

'రాజాధిరాజు' (1980) చిత్రంలో సైతాను వేషంలో ఆయన ఆహార్యం, ఆంగికం, ''శిశువా!'' అంటూ ప్రత్యేక తరహా వాచికం ఆ పాత్రను చిరస్మరణీయంగా మార్చాయి. ఆ సినిమాలో ''కొత్తా దేవుడండీ! కొంగొత్తా దేవుడండీ! ఇతడే దిక్కని మొక్కనివారికి దిక్కూ మొక్కూ లేదండండీ! రాండి! రాండి! శిశువా!...'' అంటూ నూతన్‌ ప్రసాద్‌ ధరించిన సైతాను పాత్రపై వచ్చే పాట అప్పట్లో సామాన్య జనంలో కూడా ప్రాచుర్యం పొందింది. ఇక, 'పట్నం వచ్చిన పతివ్రతలు' (1982) చిత్రంలో నూతన్‌ పలికిన ''దేశం చాలా క్లి...ష్ట పరిస్థితుల్లో ఉంది'' డైలాగు ఆ నాటి నుంచి ఈనాటి వరకూ నిత్యనూతనమే.

తెలిసిన మనిషిలో తెలియని సంగతులు

చాలామందికి తెలియనిదేమిటంటే - 'ఈలపాట'లో వరప్రసాద్‌ సిద్ధహస్తుడు. హైదరాబాద్‌, తదితర ప్రాంతాల్లో ఆయన దాదాపు 50 పై చిలుకు సార్లు 'ఈలపాట' ప్రదర్శనలిచ్చారు. అలాగే, సినిమాల్లోకి వచ్చాక నూతన్‌ ప్రసాద్‌ ప్రభ వెలిగిపోతున్న సందర్భాన్నే సర్వసాధారణంగా అందరూ చెబుతుంటారు. కానీ, కెమేరా ముందు ఆ స్థాయి నటన చూపడానికి మునుపే, రంగస్థలంపై ఆయన ఎంతటి విశ్వరూపం దాల్చేవారో, ఎన్ని వందల ప్రదర్శనల్లో నటుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నారో ఈ తరంలో కొద్దిమందికే తెలుసు. మంచి సినిమాల పట్ల అభిరుచి ఉన్న నూతన్‌ ప్రసాద్‌ చిత్ర నిర్మాణంలోనూ దాన్ని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నించారు. 'పవన్‌ ఇంటర్నేషనల్‌' పతాకంపై ఆయన సమర్పకుడిగా వచ్చిన 'ఓ అమ్మ కథ' (1981) వాణిజ్య విజయం సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలను అందుకొంది. 'మృణాల్‌సేన్‌' తదితర ప్రసిద్ధ వాస్తవిక చిత్ర దర్శకుల ఫక్కీలో ఆ సినిమాకు దర్శకుడు పేరాల సుబ్రహ్మణ్యం పేరును 'వసంత్‌ సేన్‌'గా మార్చడం ఓ గమ్మత్తు!

ఏ వేషం కట్టినా, దాన్ని తెర మీది కథలోని పాత్రగా కాక, వాస్తవ జీవితంలో నుంచి నడిచొచ్చిన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి నూతన్‌ ప్రసాద్‌ తపించేవారు. అందుకే, ఆయన ఏ పాత్ర వేసినా దానిలో సమాజంలోని ఆ యా వర్గాల వ్యక్తుల ప్రవర్తన, చిత్రమైన మ్యానరిజమ్‌లను కలగలిపేవారు. ఆ మేరకు సాధ్యమైనంత వరకు ఆ పాత్రలో వాస్తవికతను రంగరించేవారు. ''పదిమందిని ఏడిపించడం కన్నా, పదిమందినీ నవ్వించడం మంచిది కదా!'' అని చెబుతూ వచ్చిన నూతన్‌ ప్రసాద్‌ విలనీలో కూడా తనదైన శైలిలో వ్యంగ్యాన్ని దట్టించేవారు. సంభాషణల ఉచ్ఛారణలో తనకున్న అపారమైన బలంతో ఏ పాత్రకైనా కొత్త రంగు, రుచి, వాసన అద్దేవారు. తల్లి ఎంతో కష్టపడి తమను పోషించిన తీరు ఆయనకు ఎప్పటికీ గుర్తే. ''ఆ కుట్టు మిషన్‌ శబ్దాలు నేనెప్పటికీ మర్చిపోలేను'' అనేవారాయన. నటుడిగా స్థిరపడ్డాక తల్లిని మరింత సుఖంగా, ప్రాణప్రదంగా చూసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం ఆయన మనస్సులోని సెంటిమెంట్‌కు నిదర్శనం.

ఒకసారి మనస్సుకు దగ్గరై, తనకు ప్రేమ పాత్రుడైన వ్యక్తిని చిరకాలం ప్రేమించడం కూడా నూతన్‌ ప్రసాద్‌ లక్షణం. 'చలిచీమలు' తరువాత వేషాల కోసం మద్రాసులో తిరుగుతూ, లాడ్జీలో అవస్థలు పడుతున్నప్పుడు బాపు - రమణలు ఏడాది పాటు తమ ఆఫీసులో ఆశ్రయం ఇచ్చిన సంగతిని ఆయన ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా చెబుతుండేవారు. అలాగే, నటుడిగా సక్సెసయ్యాక తాను కూడా రచయితలు పరుచూరి బ్రదర్స్‌కు అలాంటి అండదండలే ఇచ్చారు. దాదాపు ఎనిమిదేళ్ళు తమ ఇంటి మేడ మీద స్థానం కల్పించారు.

ఆత్మవిశ్వాసానికి అసలైన ప్రతీక

బామ్మ మాట - బంగారు బాట' (1989) చిత్రం షూటింగ్‌లో ప్రమాదానికి గురై, నడుము కింది భాగమంతా చచ్చుబడిపోయి, చక్రాల కుర్చీకే పరిమితమైనా, ఆయన తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పరుచూరి బ్రదర్స్‌ లాంటి రచయితలు తన కోసం ప్రత్యేకంగా రాసిన న్యాయమూర్తి, దెబ్బతిన్న సైనికాధికారి లాంటి పాత్రలను కేవలం వాచికంతో, ముఖకవళికలతో మెప్పించారు. వాచికంలోని తన విశిష్టతను టీవీ కార్యక్రమాల వ్యాఖ్యానానికి వినియోగించారు. ఉపగ్రహ తెలుగు టి.వి. చానల్‌ 'ఈ' టి.వి.తో మొదటి నుంచి అనుబంధం ఉన్న నూతన్‌ ప్రసాద్‌ మహామహుల నటనా వైదుష్యాన్ని విశ్లేషించే 'హ్యాట్సాఫ్‌' కార్యక్రమంతో సహా కొన్ని టీవీ షోలకు యాంకర్‌గానూ వ్యవహరించారు. 'నేరాలు - ఘోరాలు' లాంటి కార్యక్రమాలకు ఆయన మాట ఊపిరి అయింది.

నిజానికి, సినిమాల్లోకి రాకముందే ఆయన టీవీలో నటించారు. అప్పట్లో దూరదర్శన్‌లో ప్రసారమైన 'పండగొచ్చింది' నాటికలో ఇంటల్లుడి పాత్ర పోషించారని కొద్దిమందికే తెలుసు. హీరో కృష్ణ రూపొందించిన 'సింహాసనం' (1986) చిత్రం తెలుగు రూపంలో హిందీ నటుడు అమ్జాద్‌ ఖాన్‌కు గళదానం చేసిన నూతన్‌ ప్రసాద్‌, 'ఆయనకు ఇద్దరు' చిత్రంలో గుమ్మడికీ డబ్బింగ్‌ చెప్పారు. దాదాపు 475 చిత్రాల్లో నటించిన నూతన్‌ ప్రసాద్‌ అనేక అవార్డులు అందుకున్నారు. 'సుందరి - సుబ్బారావు' (1984)లో ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు పొందారు. 'ప్రజాస్వామ్యం' (1987), 'నవభారతం' (1988), 'వసుంధర' చిత్రాల్లోని నటన కూడా ఆయన ఇంటికి 'నందు'లను నడిపించుకొచ్చింది. అలాగే, 'గాజుపూలు' టీవీ సీరియల్‌కు సైతం ఆయన 'నంది' అవార్డు అందుకున్నారు. 2000లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.

ఆఖరి వరకు అలుపెరుగని కళాసేవ

చివరి రోజుల వరకు తనకు వచ్చిన పాత్రలకు న్యాయం చేయడానికే నూతన్‌ ప్రసాద్‌ ప్రయత్నించారు. ''మేము నాటకం వేస్తున్నామని తెలిస్తే చాలు, ఇవాళ్టికీ చక్రాల కుర్చీలో సభకు వచ్చి, ప్రదర్శన చూసి, అభినందించే అరుదైన నాటక ప్రియుడు ఆయన'' అని రంగస్థల ప్రదర్శనలతోనే సినీ రంగానికి ఎదిగిన మరో సీనియర్‌ నటుడు రాళ్ళపల్లి గద్గదస్వరంతో నూతన్‌ ప్రసాద్‌ను గుర్తు చేసుకున్నారు. 'తెలుగుదేశం పార్టీ'కి సన్నిహితంగా మెలిగిన నూతన్‌ప్రసాద్‌ శారీరక వైకల్యం వచ్చి పడ్డ తరువాతి కాలంలోనే హైదరాబాద్‌లోని రంగస్థల వేదిక 'రవీంద్రభారతి'కి కార్యదర్శిగా ప్రభుత్వ పక్షాన నియమితులయ్యారు. ఆ హోదాలోనూ తనదైన కళాసేవను కొనసాగించారు.

ప్రముఖ చిత్రకారుడు - దర్శకుడు బాపు చేత శృంగార, హాస్య, కరుణాది నవరసాలకూ వర్ణచిత్రాలు వేయించి, ఆ నవరసాల చిత్ర మాలికను రవీంద్రభారతిలో పెట్టించారు. ఇవాళ ఆ నవరసాల చిత్రమాలిక రాష్ట్రంలోని అనేక ప్రాంగణాల్లో వెలసి, కళాప్రియులను అలరిస్తోందంటే దానికి నూతన్‌ ప్రసాద్‌ ప్రయత్నమే కారణమని చెప్పక తప్పదు. అలాగే, భారతీయ శాస్త్రీయ నృత్య రీతులను పరిచయం చేసే వర్ణచిత్రాలను గీయించి, 1973 జూన్‌ 10న ప్రమీలతో వివాహమైన నూతన్‌ ప్రసాద్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వాళ్ళబ్బాయి నూతన్‌ కుమార్‌ అనే పేరుతో వెండితెరకు పరిచయమై, 'సాంబ', 'సోగ్గాడు' లాంటి చిత్రాల్లో నటించారు. అబ్బాయిని మంచి నటుడిగా చూడాలని నూతన్‌ ప్రసాద్‌ కలలు కన్నారు. ఆ కలలు పూర్తిగా ఫలించకుండానే కన్నుమూశారు.

చాలాకాలంగా, పూర్తిస్థాయి పాత్రల్లో కనిపించకపోయినా, ఇవాళ్టికీ ప్రేక్షకులకు నూతన్‌ ప్రసాద్‌ గుర్తుండిపోవడం ఆయన మునుపు పోషించిన పాత్రల చిరస్మరణీయతకు చిహ్నం. సినిమా నటుడిగా ఆయన ప్రభ వెలిగింది గట్టిగా ఓ దశాబ్దమే అయినా, ఆయన గురించి జనం చెప్పుకోవడానికి ఆ పాత్రలే కారణం. అందుకే, 1960ల చివర నుంచీ నూతన్‌ ప్రసాద్‌తో స్నేహం ఉన్న మరో నటుడు కోట శ్రీనివాసరావు చెప్పినట్లు, 'తనకంటూ ఓ బ్రాండ్‌ను సృష్టించుకొని, తనదైన ఓ దశాబ్దాన్ని లిఖించుకున్న నటుడు - నూతన్‌ ప్రసాద్‌'. 1970ల ద్వితీయార్ధం నుంచి 1980ల చివరి వరకు తెలుగు సినిమా చరిత్ర రాస్తే - ఆ కాలంలో ఓ వెలుగు వెలిగిన విశిష్ట నటుడిగా నూతన్‌ ప్రసాద్‌ది నిత్య నూతన చరిత్ర. నటన పట్ల అంకితభావం, నిజాయతీ ఉన్న ఆయనకు కళాంజలి!

Sunday, April 3, 2011

సెంటిమెంట్ నిలిచింది... నమ్మకం గెలిచింది... వరల్డ్ కప్ నా వల్లే వచ్చింది...





బహుశా భారతదేశంలో 121 కోట్లమందికే కాదు, ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న భారతీయ సంతతికి కూడా ఇది ఓ ఆనందభరిత క్షణం. దాదాపు 28 ఏళ్ళ తరువాత దేశ ప్రజల కల, దాదాపు 21 ఏళ్ళుగా సచిన్ టెండూల్కర్ స్వప్నం నిజమైన క్షణం. విశ్వవిజేతగా భారత క్రికెట్ జట్టు నిలిచిన క్షణం. 2011 ఐ.సి.సి. వరల్డ్ క్రికెట్ కప్ ను మన జట్టు గెలుచుకున్న గర్వకారణమైన క్షణం. 1983 నాటికి ఊహ తెలియకపోయినా, ఆ తరువాత బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్, షార్జా కప్, ఆసియా కప్ ల మీదుగా భారత క్రికెట్ ను ఆసక్తిగా చూస్తూ వస్తున్న నాకు ఇవాళ ఓ ఉద్విగ్నపరిస్థితి. అయితే, కలసికట్టుగా కష్టపడితే ఎంతటి క్లిష్ట పరిస్థితుల నుంచి అయినా ఎలా బయటపడవచ్చో ఇవాళ మన జట్టు మరోసారి నిరూపించింది.


ఈ మ్యాచ్ చూస్తున్నప్పుడు దేశంలోని కొన్ని కోట్ల మంది భారతీయ క్రీడాభిమానుల లాగానే నేను కూడా మునుపెన్నడూ లేనంత ఉద్విగ్నతకు గురయ్యాను. నిజం చెప్పద్దూ.... ఒకానొక దశలో టెన్షన్ భరించలేక టీవీ కాసేపు ఆపేశా. కాసేపైన తరువాత మనవాళ్ళు పరుగుల లక్ష్య సాధనలో మరికొంత ముందుకు వెళ్ళాక అప్పుడు టీవీ పెట్టి చూడవచ్చులే అనుకున్నా. అలాగే చేశా, చూశా. నేను అనుకున్నట్లుగానే వికెట్లు పడడం ఆగి, మనవాళ్ళు లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళడం జరిగింది. దాంతో, అదో సెంటిమెంట్ గా మారి, మ్యాచ్ అంతా అదే పద్ధతిలో టీవీ కాసేపు ఆపడం, మళ్ళీ పెట్టడం అనే కలిసొచ్చిన సెంటిమెంట్ పద్ధతిలోనే చూశాను. చివరకు మనం గెలిచాం. భారత జట్టు సమష్టి కృషే కాదు, ధోనీ కెప్టెన్సీయే కాదు, నా లాంటి కోట్లాది అభిమానులు పాటించిన ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఇవాళ మన జట్టు గెలవడానికి కారణం. ఈ మాటను చాలా మంది కొట్టిపారేయవచ్చు. కానీ, అంతకంతమందికి నా లాంటి సెంటిమెంట్లు ఉంటాయనీ, వాటిని పాటించడం వల్లే మనం కప్పు గెలిచామని వారు ఏకీభవిస్తారనీ అనడంలో నాకు సందేహం లేదు. ఇది పిచ్చి వాదనే కావచ్చు, తర్కానికి నిలవకపోవచ్చు. కానీ, నమ్మకాన్ని మించినది లేదు కదా.

శ్రీలంక బ్యాటింగ్ ముగిసి, 275 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించిన తరువాత, మన వాళ్ళు బ్యాటింగ్ కు దిగే లోపల ఓ మిత్రుడు కమ్ జర్నలిస్టు నాకు ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావని అడిగాడు. ఇంట్లో టీవీలో మ్యాచ్ చూస్తున్నానని చెప్పా. ఏం రెండో లడ్డూ తినాలని అత్యాశగా ఉందా అన్నాడు. అదేమిటన్నా. పాక్ తో మనవాళ్ళు అనూహ్యంగా గెల్చి, మనతో ఓ లడ్డు తినిపించారు. మళ్లీ ఈ రోజు ఈ 275 పరుగుల లక్ష్యం ఛేదించి, గెలుస్తారని కల కనకు. అన్ని సార్లూ అద్భుతాలు జరగవు అన్నాడు. అసలే శ్రీలంక ఆఖరి 5 ఓవర్ల పవర్ ప్లేలో చేసిన బ్యాటింగ్ దాడి చూసి, బిత్తరపోయి ఉన్న నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. రెట్టించి అతను అడిగేసరికి, ఏమనాలో తెలియక - ఏమో గుర్రం ఎగరావచ్చు - అని అపనమ్మకం నిండిన స్వరంతో నమ్మకాన్ని ధ్వనించా. ఆఖరికి నేను అన్నట్లే జరిగింది. సెహ్వాగ్, సచిన్లు బ్యాటింగ్లో విఫలమైనా, గంభీర్, ధోనీల సమయోచిత బ్యాటింగ్తో చివరకు మన జట్టు గెలిచింది. అవును. గుర్రం ఎగిరింది.

కప్పు గెలవగానే నేను వేరే వేరే ఊళ్ళల్లో ఉన్న మా అమ్మతో, మా అన్నయ్యతో అందరితో ఎస్టీడీలు చేసి మరీ ఆనందం పంచుకున్నా. మా ఇంట్లో టీవీ వాల్యూమ్ గట్టిగా పెట్టి, పిల్లలతో కలసి డ్యాన్సులు చేశా. మేడ మీది నుంచి వీధిలోకి చూస్తూ అరిచా. ప్రపంచంలోని శతాధిక భారతీయులతో నేనూ గొంతు కలిపా. ఈ ప్రపంచ కప్ తో భారతదేశంలోని సమస్యలేవీ తీరకపోవచ్చు. మన జీవితం ఒక్క కప్పుతో మారకపోవచ్చు. కానీ, జాతి మొత్తం జయహో అనే క్షణాలు చాలా కొద్దిగా వస్తాయి. రకరకాల విభేదాలు, అంతరాలు, కుమ్ములాటలతో కుంగిపోతున్న నవ భారతావనికి ఇప్పుడు సరికొత్త స్ఫూర్తిప్రదాతలు దొరికారు. క్రీడల్లోనే కాదు, జీవితంలోనూ ఇవాళ మనకు ఇలాంటి స్ఫూర్తిదాతలు, గర్వకారకులు ఎంతైనా అవసరం. అందుకే, ఈ మన విజయం జీవిత కాలంలో ఓ చిరస్మరణీయ జ్ఞాపకం. భారత జట్టుకే కాదు, మనం గెలవాలనీ, గెలుస్తామనీ నమ్మిన ప్రతి ఒక్కరికీ అభినందనలు.


(బ్లాగు మిత్రులందరికీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వేజనా : సుఖినో భవన్తు... సమస్త సన్మంగళాని భవన్తు).

Tuesday, March 15, 2011

త్వరలో రంగుల్లో ‘పాతాళ భైరవి’




(‘జై పాతాళ భైరవి’ - పార్ట్ 2)

‘పాతాళ భైరవి’లో స్క్రిప్టు, నటీనటుల ప్రతిభ, రచనా చమత్కృతి, సంగీతం, కళాదర్శకత్వం, ఛాయాగ్రహణం, దర్శకత్వం - అన్నింటినీ ఉత్కృష్టస్థాయిలో చూడవచ్చు. అందుకే, ఆ సినిమా 60 ఏళ్ళ తరువాత ఇప్పటికీ జనాదరణ పొందుతోంది. కొత్త సినిమాలకు సైతం రిపీట్ రన్లు లేని ఈ రోజుల్లో ఏడాదికీ, ఏణ్ణర్థానికీ పాత ప్రింట్లతో ఏదో ఒక ఊళ్ళో ఆడుతూనే ఉంది. పండుగలు, పబ్బాలు వచ్చాయంటే, ఈ సినిమాను మన టీవీ చానళ్ళ వాళ్ళు ప్రధాన ప్రసార సమయంలో ప్రసారం చేసి, అటు వాణిజ్య ప్రకటనలూ, ఇటు టి.ఆర్.పి.లు సాధించడం విశేషం.

ఇవాళ్టికీ కాసులు కురిపించే కామధేనువే


ఇప్పటికీ బెజవాడలో శ్రీదుర్గాకళామందిరం హాలులో ఈ సినిమా పదే పదే విడుదలవడం ఆ నగర వాసులకు చిరపరిచితమే. చిత్రం ఏమిటంటే - నాలుగు నెలల క్రితం ఈ సినిమా గుంటూరులోని గణేశ్ మహల్ లో రిలీజైంది (గుంటూరులోని 3వ అతి పాత హాలు ఇది. 1943లో సరస్వతీ టాకీస్ గా మొదలై, ఆ తరువాత రత్నా టాకీస్ గా, లీలా మహల్ గా పేర్లు మార్చుకొని, ఇప్పుడు గణేశ్ మహల్ గా నడుస్తోంది). పాత ప్రింటుతో రిలీజైనా సరే, ఆరు రోజుల పాటు ఆడి, ఖర్చులు, పన్నులు అన్నీ పోనూ, పంపిణీదారుకు రూ. 14 వేలు నికర ఆదాయం మిగిల్చింది. ఇవాళ కొత్త సినిమాలు సైతం ఈ మాత్రం షేర్ రాని పరిస్థితుల్లో 60 ఏళ్ళ పాత చిత్రం ఈ పాటి లాభం సంపాదించడం ‘పాతాళ భైరవి’ పట్ల ప్రజాదరణకు నిదర్శనం.

అందుకే, ఈ చిత్రాన్ని త్వరలో రంగుల్లో రిలీజు చేయనున్నారు. ఆ మధ్య ‘మాయాబజార్’ చిత్రాన్ని రంగుల్లోకి తెచ్చిన గోల్డ్ స్టోన్ సంస్థ వారే ఈ చిత్రం రంగుల పని పూర్తి చేసినట్లు భోగట్టా. నిజానికి, ఈ చిత్రం అప్పట్లో కూడా కొంత రంగుల్లో విడుదలైందనే విషయం ఆసక్తికరమైన సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా చిత్రం ఇదే. తెలుగులో 1951 మార్చి 15న విడుదలైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది. రెండు భాషల్లోనూ సినిమా సూపర్ హిట్. ఆ తరువాత జెమినీ ఎస్. ఎస్. వాసన్ ఈ చిత్రంలోని 3 పాటలను కలర్ లో తీసి, మిగతా చిత్రాన్ని మాత్రం బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంచేసి, ఉత్తరాదిన 1952లో రిలీజ్ చేశారు. అక్కడా పాతాళ భైరవి పెద్ద హిట్. ఆ తరువాత చాలా ఏళ్ళకు 1980లలో హీరో కృష్ణ సారథ్యంలోని పద్మాలయా సంస్థ జితేంద్ర హీరోగా ఇదే సినిమాను మళ్ళీ హిందీలో, కలర్ లో తీయడం మరో కథ.

కెరీర్ ను మార్చేసిన సినిమా


గమ్మత్తు ఏమిటంటే - ‘పాతాళ భైరవి’ విడుదలయ్యే వరకూ ఏయన్నార్ ప్రధానంగా జానపద చిత్రాల హీరో. ఎన్టీయార్ చేసినవన్నీ సాంఘిక చిత్రాలు. ఈ ఒక్క సినిమాతో ఎన్టీయార్ జానపద హీరోగా స్థిరపడి, తన సినీ జీవితంలో అత్యధిక భాగం జానపద చిత్రాల హీరోగా ఎదిగారు. ఏయన్నార్ తనను తాను పునరావిష్కరించుకొని, దేవదాసు వగైరా చిత్రాలతో సాంఘిక, ప్రేమ కథా చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్నారు. పాతాళ భైరవి తరువాత ఏయన్నార్ నటించిన జానపదాలు మూడే మూడని సినీ గణాంక వివరాల నిపుణుల ఉవాచ. ‘నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా...’ అనే పాతాళ భైరవిలోని తోట రాముడి పాత్రతో ఎన్టీయార్ కు దక్కిన మాస్ హీరో ఇమేజ్ చిరకాలం నిలిచిపోవడం విశేషం. ఒక్క సినిమా కెరీర్ నే మార్చేస్తుందనడానికి ఇదో పెద్ద ఉదాహరణ.

‘సాహసం శాయరా డింభకా. రాకుమారి వరిస్తుంది...’ అంటూ నేపాల మాంత్రికుడిగా ఎస్వీ రంగారావు చూపిన నట వైదుష్యాన్ని ఎవరైనా మర్చిపోగలరా. ఈ సినిమా తరువాతే ఆయనకూ స్టార్ నటుడి హోదా లభించింది. ఇక, ఘంటసాల సంగీతంలోని ‘కలవరమాయే మదిలో...’, ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడూ...’, ‘ఎంత ఘాటు ప్రేమయో...’ లాంటి పాటలు, అడవిలో మాంత్రికుడితో హీరో నడిచివెళ్ళేటప్పుడు వచ్చే నేపథ్య సంగీతం తలుచుకుంటే, ఇప్పటికీ ఒళ్ళు పులకలెత్తుతుంది.

రికార్డుల గణాంకాలు


తొలి సారి విడుదలలో 13 కేంద్రాల్లో రిలీజై విశాఖపట్నం (సరస్వతీ టాకీస్ ), భీమవరం (మారుతీ), కర్నూలు (saibaba టాకీస్)ల్లో 91 రోజులు ఆడితే, మిగిలిన 10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది - పాతాళ భైరవి. అలాగే, థియేటర్ మారకుండా తెలుగులో ద్విశత దినోత్సవం జరుపుకొన్న తొలి చిత్రమూ - ‘పాతాళ భైరవే.’ బెజవాడ (శ్రీ దుర్గా కళామందిరం), నెల్లూరు (శేష్ మహల్), గుడివాడ (శరత్), బళ్ళారి (ప్రభాత్ థియేటర్)లలో అలా హాలు మారకుండా 200 రోజులు ఆడింది.

మరో గమ్మత్తు ఏమిటంటే, తెలుగు పాతాళ భైరవి 100 రోజులు పండుగ చేసుకొనే నాటికి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సీమల్లో కలిపి, ఈ చిత్రం తెలుగు, తమిళ రూపాలు 100 కేంద్రాల్లో, 100 ప్రింట్లతో ఆడుతుండడం. 1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రమూ - ‘పాతాళ భైరవే.’ ఇన్ని విశేషాలున్న ఓ అపురూపమైన చిత్రాన్ని అందించిన మన సినీ స్రష్టలకు ఈ సందర్భంగా మరో మారు అంజలి ఘటించడం కళాభిమానుల కర్తవ్యం కాదంటారా!

జై పాతాళభైరవి !




భారతీయ టాకీ నిన్న 80 ఏళ్ళు పూర్తి చేసుకుంటే, ఓ మహత్తర తెలుగు టాకీ చిత్రం ఇవాళ 60 ఏళ్ళ పండగ జరుపుకొంటోంది. సాహసం శాయరా డింభకా..., హే డింగరీ... లాంటి పదాలతో తెలుగు జనజీవితంలో మమేకమైన ఆ చిత్రం - ఎన్టీయార్ నటించిన ‘పాతాళభైరవి.’ ఇవాళ విడుదలైన ఏ సినిమా అయినా సరే రేపటికి రెండురోజులు, పదేళ్ళకు పదేళ్ళు పూర్తి చేసుకోవడం సహజం. కాలం ఆ వస్తువు, లేదా మనిషి వయస్సును చెప్పే కొలమానమే తప్ప, వాటి గొప్పదనానికి కొండగుర్తు మాత్రం కాదు. అయితే, ‘పాతాళ భైరవి’ విషయం అలా కాదు. 1951 మార్చి 15న ఆంధ్రదేశంలోని 13 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రానికి ఇవాళ్టితో 60 ఏళ్ళు నిండుతున్నాయని చెప్పుకోవడం కేవలం తారీఖులు, దస్తావేజుల చరిత్ర కోసం కానే కాదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఆ చిత్రం ఆబాలగోపాలాన్నీ అలరిస్తూ చిరంజీవిగా మిగలడం వెనుక ఉన్న కృషిని స్మరించుకోవడానికే.

విజయా పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలుగా, కె.వి. రెడ్డి దర్శకత్వంలో ఎన్టీయార్ హీరోగా తయారైన ‘పాతాళభైరవి’ తెలుగు వెండితెరపై కథానాయక పాత్రకు ఓ ఫార్ములాను సృష్టించింది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని, ప్రతినాయకుడిపై విజయం సాధించి, నాయికను తనదాన్ని చేసుకోవడమనే ఓ పెద్ద బాక్సాఫీస్ ఫార్ములాకు ఈ సినిమా శ్రీకారం చుట్టింది. అరేబియన్ నైట్స్ కథల్లోని అల్లావుద్దీన్ - అద్భుత దీపం కథను ప్రేరణగా తీసుకొని అల్లుకున్న ఈ కథ అచ్చ తెలుగు జానపదంగా ఒదిగిపోవడం వెనుక దర్శక (కె.వి. రెడ్డి), రచయిత (పింగళి నాగేంద్రరావు)ల కృషి ఎంతో అబ్బురపరుస్తుంది.

అసలు ఈ సినిమాను అక్కినేని నాగేశ్వరరావును హీరోగా, గోవిందరాజుల సుబ్బారావును కానీ, ముక్కామలను కానీ విలన్ గా పెట్టుకొని తీద్దామనుకున్నారు. కానీ, వాహినీ ప్రాంగణంలో ఎన్టీయార్, ఏయన్నార్ల మధ్య టెన్నీస్ ఆట చూసిన దర్శకుడు కె.వి. రెడ్డి తమ చిత్ర కథలోని నాయకపాత్రకు ఎన్టీయారే తగినవాడని ఆయనను ఎంచుకోవడం జరిగింది.

అలా ‘పాతాళభైరవి’, ‘మల్లీశ్వరి’, ‘చంద్రహారం’, ‘పెళ్ళి చేసి చూడు’ - మొత్తం విజయా - వాహినీ వారి నాలుగు చిత్రాల్లోనూ నటించేందుకు నెలకు రూ. 750 జీతం మీద ఎన్టీయార్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

పాతాళ భైరవిలోని తోట రాముడు (ఎన్టీయర్ ), నేపాళ మాంత్రికుడు (యస్వీ రంగారావు), అంజిగాడు (కమెడియన్ బాలకృష్ణ), సదా జపుడు (పద్మనాభం), రాజు గారి బావమరిది (రేలంగి) లాంటి పాత్రలన్నీ మనకు ఇవాళ్టికీ కళ్ళకు కడుతుంటాయి.

(మిగతా భాగం మరికాసేపట్లో)

Monday, March 14, 2011

టాకీ చిత్రాల తొలి నాళ్ళ కబుర్లు



(మన భారతీయ టాకీకి ఇవాళ్టితో 80 ఏళ్ళు - పార్ట్ 2)

తొలి భారతీయ టాకీ ఆలమ్ ఆరా చిత్ర కథ కూడా రంగస్థలం మీద నుంచి వెండితెరకు నడిచి వచ్చినదే! పార్శీ ఇంపీరియల్‌ థియేటరికల్‌ కంపెనీకు చెందిన నాటక రచయిత జోసెఫ్‌ డేవిడ్‌ రాసిన 'ఆలమ్‌ ఆరా' నాటకం అప్పట్లో రంగస్థలంపై విజయవంతమైంది.

నాటకం నుంచి సినిమాగా 'ఆలమ్‌ ఆరా'

అందులో కథ ఏమిటంటే - కుమార్‌పూర్‌ రాజు గారికి ఇద్దరు భార్యలు. ఆ రాణులిద్దరికీ పిల్లలు లేరు. ఓ ఫకీరు చెప్పిన జోస్యం ప్రకారం వారిద్దరిలో సుగుణశీలి అయిన రాణి నవ్‌బహార్‌కు ఓ కొడుకు పుడతాడు. దాంతో, దుష్ట రాణి దిల్‌బహార్‌కు విపరీతమైన అసూయ కలుగుతుంది. మరోపక్క, సైన్యాధ్యక్షుడైన అదిల్‌ మీద దిల్‌బహార్‌ మనసు పడుతుంది. కానీ, అతనేమో ఆమె కోరికను తోసిపుచ్చుతాడు. ప్రతీకారంతో ఆమె అతణ్ణి ఖైదు చేయిస్తుంది. అదిల్‌ భార్య ఓ ఆడపిల్లకు జన్మనిచ్చి చనిపోతుంది. ఆ ఆడపిల్లే - ఆలమ్‌ ఆరా (నటి జుబేదా). కోయగూడెంలో ఆ అమ్మాయి పెరుగుతుంది. ఖైదులో ఉన్న తండ్రిని చూడడం కోసం ఒకసారి ఆ అమ్మాయి రాజప్రాసాదానికి వస్తుంది. మెడలోని హారం వల్ల ఆమె ఎవరన్నదీ తెలుస్తుంది. అక్కడ ఆమె, యువరాజు (నటుడు మాస్టర్‌ విఠల్‌)ను కలుస్తుంది. వారిద్దరూ ప్రేమలో పడతారు. చివరకొచ్చేసరికి - అదిల్‌ ఖైదు నుంచి విడుదలవుతాడు. దుష్టరాణి దిల్‌బహార్‌కు శిక్ష పడుతుంది. యువరాజు, ఆలమ్‌ ఆరాల పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.

సంచలనాత్మక ఆదరణ

అనేకానేక పాటలు, నృత్యాలను గుదిగుచ్చి అందించడానికి ఈ సాదాసీదా ఇతివృత్తం తోడ్పడింది. అయితేనేం, కథ ఏమిటని కాక, తెర మీద కదిలే బొమ్మలను చూడడమే కాక మాటలూ వినవచ్చని జనం వేలంవెర్రిగా థియేటర్లకు తరలివచ్చారు. 'ఆలమ్‌ ఆరా' విడుదల రోజున తెల్లవారుజాము నుంచే జనం బొంబాయిలోని మెజెస్టిక్‌ సినిమా దగ్గరకు గుంపులు గుంపులుగా చేరడం మొదలైంది. ''ఎంతో కష్టం మీద గానీ మేము కూడా థియేటర్‌లోకి ప్రవేశించలేకపోయాం'' అని అర్దేషిర్‌ ఇరానీ భాగస్వామి అబ్దులాలీ యూసూఫాలీ తెలిపారు.

''అప్పట్లో 'వరుస'లో నిల్చొని, టికెట్లు తీసుకొనే పద్ధతి కూడా ప్రేక్షకులకు తెలియదు. దాంతో, జనం టికెట్‌ బుకింగ్‌ ఆఫీసు మీదకు గుంపుగా వచ్చి పడ్డారు. తమకు అర్ధమైన భాషలో మాట్లాడే సినిమాను చూడడానికి, ఎలాగోలా టికెట్‌ సంపాదించాలని తాపత్రయపడ్డారు. దాంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. చివరకు జనాన్ని అదుపు చేయడానికి పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది... వారాల తరబడి టికెట్లు అమ్ముడైపోయాయి. ఎక్కువ రేటుకు బ్లాకులో టికెట్లు అమ్మేవాళ్ళు యథేచ్ఛగా సొమ్ము చేసుకున్నారు'' అని ఆనాటి అనుభవాలను ఆయన గతంలో వెల్లడించారు.

సినిమా కష్టాలు

'ఆలమ్‌ ఆరా' తీయడానికి పడ్డ కష్టాలను ఆయన వివరిస్తూ, ''అప్పట్లో సౌండ్‌-ప్రూఫ్‌ స్టేజీలు లేవు. దాంతో మేము స్టూడియో లోపల, అదీ రాత్రి వేళ చిత్రీకరణ జరపడానికి మొగ్గు చూపేవాళ్ళం. మా స్టూడియో పక్కనే రైలు మార్గం ఉండేది. ఫలితంగా, ఆ శబ్దం రికార్డు కాకుండా ఉండడం కోసం, రైళ్ళు రాకపోకలు లేని సమయంలోనే షూటింగ్‌ జరపాల్సి వచ్చేది. పైగా, ఒకే సిస్టమ్‌తో కూడిన టానర్‌ రికార్డింగ్‌ సామగ్రితోనే శబ్దగ్రహణం చేయాల్సి వచ్చింది... అలాగే, నటీనటులు నటిస్తూ పలికే మాటలు, పాటలు రికార్డింగ్‌ చేయడానికి బూమ్‌లు (దూరంగా ఉంచి రికార్డు చేసే మైకులు) కూడా లేవు. కెమేరా కన్నులో పడకుండా మైక్రోఫోన్లను ఎక్కడెక్కడో రహస్యంగా ఉంచి, మాట, పాట రికార్డు చేయాల్సి వచ్చింది'' అని ఇరానీ చెప్పారు. కఠినమైన రికార్డింగ్‌ పరిస్థితుల కారణంగా 'ఆలమ్‌ ఆరా' రూపకల్పనకు నెలలకొద్దీ సమయం పట్టింది. పైగా, ప్రత్యర్థి సినిమా సంస్థల నుంచి పోటీని నివారించడం కోసం అంతా గుట్టుచప్పుడు కాకుండా చేయాల్సి వచ్చింది.

భారతీయ తొలి టాకీ 'ఆలమ్‌ ఆరా'లో సాంకేతిక, కళాత్మక విలువలు స్వల్పమే! అయినప్పటికీ, తొలి ప్రయత్నంగా అందరూ దాన్ని ఆదరించారు. 'ఆలమ్‌ ఆరా' అఖండ విజయంతో 'పాత్రలన్నీ మాట్లాడుతూ, పాటలు పాడుతూ, నృత్యం చేసే' చిత్రాలు చకచకా తయారయ్యాయి. గళం ప్రధానం కావడంతో రంగస్థల నటీనటుల్ని దర్శక - నిర్మాతలు తీసుకోసాగారు. 'ఆలమ్‌ ఆరా' విడుదలైన సరిగ్గా మూడు వారాల కల్లా తొలి బెంగాలీ టాకీ 'జమాయ సష్టి'ని మదన్‌ థియేటర్స్‌ విడుదల చేసింది. ఆ వెంటనే 'షిరీన్‌ ఫర్హాద్‌' అనే మరో భారతీయ టాకీని రూపొందించింది.

'షిరీన్‌ ఫర్హాద్‌' చిత్రాన్ని 22 సార్లు చూడడం కోసం లాహోర్‌లో టాంగా తోలే ఓ పంజాబీ ఏకంగా తన గుర్రాన్నే కుదవపెట్టాడట! ఆ ఊపులో ఒక్క 1931లోనే 8 టాకీ చిత్రాలనూ, 1932లో 16 టాకీలనూ మదన్‌ థియేటర్స్‌ రూపొందించింది.

భారతీయ టాకీలు తెచ్చిన మార్పులు

టాకీల ప్రవేశంతో సౌండ్‌ ప్రక్రియకు మారే స్థోమత లేక చాలా స్టూడియోలు మూతపడ్డాయి. అలాగే, అప్పటి దాకా మూకీల్లో ప్రసిద్ధ తారలుగా వెలిగిన ఆంగ్లో - ఇండియన్‌ నటీమణులు సైతం ధారాళంగా హిందీ, ఉర్దూ మాట్లాడలేక, తెర మరుగయ్యారు. పాటలు పాడుకోవడం రాని వారు కూడా నటనకు దూరం కావాల్సి వచ్చింది. శబ్దగ్రహణంలోని ఇబ్బందుల రీత్యా నటీనటులంతా మైకును దృష్టిలో పెట్టుకొని, దాని మీద ధ్యాసతో నటించాల్సి వచ్చేది. పాటలన్నీ ఒకే షాట్‌లో చిత్రీకరించేవారు. ఎవరికీ నైపుణ్యం లేదు గనక, ప్రయోగాలు చేస్తూ చిత్రీకరణ జరపడంతో బోలెడంత ముడి ఫిల్ము వృథా అయ్యేది. అయితేనేం, కొత్త ఒక వింతగా జనం విపరీతంగా వచ్చి, ఈ చిత్రాలు చూసేవారు. ఈ బాక్సాఫీస్‌ వసూళ్ళతో చాలా సినిమా హాళ్ళు, సంస్థలు అప్పుల ఊబి నుంచి బయటపడ్డాయి. ఆర్థిక మాంద్యం కారణంగా మూతబడ్డ హాళ్ళు మళ్ళీ తెరుచుకున్నాయి.

దాదాపు 16 ప్రధాన భాషలు, కొన్ని వందల మాండలికాలకు నెలవైన భారతదేశంలో వివిధ భాషల్లో టాకీ చిత్రాలు తయారవడం మొదలైంది. మొదట్లో అన్ని ప్రాంతాల వారికీ అర్ధమయ్యేలా, హిందీ, ఉర్దూ కలగలిసిన హిందుస్థానీలో తొలి భారతీయ శబ్ద చిత్రాలు తయారయ్యేవి. ఆ తరువాత బెంగాలీలో 'జమాయ సష్టి' (1931), తమిళంలో 'కాళిదాస్‌' (1931- ఇందులో తెలుగు డైలాగులు, త్యాగరాజ కీర్తనలు ఉండడంతో, దీన్ని తొలి తమిళ, తెలుగు టాకీ అనేవారూ ఉన్నారు), తెలుగులో 'భక్త ప్రహ్లాద', మరాఠీలో 'అయోధ్యా చే రాజా' (1932), గుజరాతీలో 'నరసింహ మెహతా' (1932), కన్నడంలో 'సతీ సులోచన' (1934) చిత్రాలు ఆ యా భాషల్లో తొలి టాకీలుగా విడుదలయ్యాయి. 1931లో హిందీ, బెంగాలీ, తమిళ, తెలుగు టాకీలు తయారు కావడంతో, ఈ ఏడాది ఈ చిత్ర పరిశ్రమలన్నీ ఎనభై వసంతాలు జరుపుకొంటున్నాయి.

(తొలి భారతీయ టాకీ 'ఆలం ఆరా'కు ఇవాళ్టితో ఎనభై వసంతాలు నిండుతున్న సందర్భంగా...)

మన భారతీయ టాకీకి ఇవాళ్టితో 80 ఏళ్ళు



(తొలి భారతీయ టాకీ 'ఆలం ఆరా'కు ఎనభై వసంతాలు నిండుతున్న సందర్భంగా...)

మన దేశంలో వెండితెర మీద బొమ్మ మాట్లాడడం మొదలై ఇప్పుడు సరిగ్గా 80 ఏళ్ళు కావస్తోంది. మాటలు లేని మూగ సినిమాల (మూకీల) యుగం నుంచి భారతీయ సినిమా మాట, పాట నేర్చిన (టాకీల) స్థాయికి ఎదిగిన కథ ఎన్నో గమ్మత్తయిన అనుభవాల సమాహారం. తొట్టతొలి భారతీయ టాకీ 'ఆలం ఆరా' ఇప్పటికి సరిగ్గా ఎనిమిది దశాబ్దాల క్రితం 1931 మార్చి 14న విడుదలైంది. మూకీ చిత్రాల నుంచి మాట్లాడే సినిమాల వైపు జనం ఎలా విపరీతంగా ఆకర్షితులయ్యారనే సంగతులు ఇవాళ్టికీ మనకు ఆసక్తి కలిగిస్తాయి, అబ్బురపరుస్తాయి. ఆ విశేషాల ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం. రండి!

మన దేశంలో మూగ సినిమాల చలనచిత్ర ప్రదర్శన తొలిసారిగా 1896 జూలై 7న, బొంబాయిలో జరిగినట్లు సినిమా చరిత్ర చెబుతోంది. మొదట్లో విదేశాల నుంచి ఈ మూకీ చిత్రాలను తెచ్చి, ఇక్కడ ప్రదర్శించేవారు. 1910వ దశకంలో భారతదేశంలో మన దేశీయులే పూర్తిస్థాయి మూకీ కథా చిత్రాల నిర్మాణం ప్రారంభించారు. ఆర్‌.జి. టోర్నీ, దాదాసాహెబ్‌ ఫాల్కే లాంటి తొలితరం సినీ రూపకర్తలతో భారతదేశంలో సినిమా పరిశ్రమకు బీజం పడింది. మరి, ఆ తరువాత మూకీల నుంచి టాకీలకు ఎదగడం వెనుక పెద్ద కథే జరిగింది.

ఆర్థిక మాంద్యం తెచ్చిన అనూహ్యమైన మార్పు

తెరపై కదిలే బొమ్మల ప్రదర్శనగా మొదట్లో మూకీలు ప్రపంచమంతటినీ అమితంగా ఆకర్షించాయి. భారతదేశంలోనూ అదే పరిస్థితి. అంతా బాగా జరుగుతోందని అనుకుంటున్న సమయంలో 1920ల చివరలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం పాశ్చాత్య దేశాల లాగానే భారతదేశం మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపింది. చలనచిత్ర పరిశ్రమ మీద ఆ దెబ్బ గట్టిగా పడింది. ప్రజలకు కదిలే చిత్రాల మీద ఆసక్తి క్రమంగా క్షీణించింది. ప్రజల్లో మారుతున్న వైఖరిని గమనించకుండా గబగబా సొమ్ములు చేసుకోవాలన్న నిర్మాతల వైఖరి, చలనచిత్ర కళలో శరవేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా దర్శక - నిర్మాతలు మారకపోవడం వల్ల బాక్సాఫీస్‌ వసూళ్ళు క్రమంగా క్షీణించాయి. దాంతో, మనదేశంలో చాలా భాగం సినిమాహాళ్ళు మూతపడ్డాయి. అనేక చలనచిత్ర నిర్మాణ సంస్థలు బిచాణా ఎత్తేశాయి.

శబ్ద శకానికి శ్రీకారం

అయితే, 1930ల నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్లే 'శబ్ద సహిత చిత్రాలు' (సౌండ్‌ ఫిల్మ్‌) ఆవిర్భవించాయని చెప్పుకోవచ్చు. అప్పటి దాకా శబ్దం లేని మూగ చిత్రా (సైలెంట్‌ ఫిల్మ్‌)లే చూస్తూ వచ్చిన ప్రేక్షకులకు ఈ 'సౌండ్‌ ఫిల్మ్‌'లు ఒక కొత్త వింతగా మారాయి. అలా 'సౌండ్‌ ఫిల్మ్‌'ల ఆవిర్భావంతో అమెరికాలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ బాక్సాఫీస్‌ వసూళ్ళకు మళ్ళీ కొత్త ఊపు వచ్చింది. 'డాన్‌ జువాన్‌' అనే సైలెంట్‌ ఫిల్మ్‌లోని దృశ్యాలకు తగ్గట్లుగా సంగీతాన్నీ, సౌండ్‌ ఎఫెక్ట్‌లనూ జత చేసి, వార్నర్‌ బ్రదర్స్‌ వాణిజ్యపరంగా సినిమాల్లో శబ్ద శకానికి శ్రీకారం చుట్టారు. 1926 ఆగస్టు 6న ఇది జరిగింది.

ఆ తరువాత ఓ సంవత్సరానికి 'ది జాజ్‌ సింగర్‌' చిత్రంలో తెర మీద బొమ్మకు తగ్గట్లుగా మాట, సంగీతం కూడా జత చేసి, వార్నర్‌ బ్రదర్సే ఓ సంచలనాత్మక విజయం సాధించారు. ఆ చిత్రంలో ''ఒక్క క్షణం ఆగండి, ఒక్క క్షణం ఆగండి! ఇప్పటి వరకు మీరింకా ఏమీ వినలేదు...'' అంటూ ఓ సహజమైన స్వరం వినిపించినప్పుడు జనం ముగ్ధులైపోయారు. 'ది జాజ్‌ సింగర్‌' విజయం తరువాత 1928లో వార్నర్‌ బ్రదర్స్‌ తొలిసారిగా 'అన్ని పాత్రలూ మాట్లాడే' చలనచిత్రం 'ది లైట్స్‌ ఆఫ్‌ న్యూయార్క్‌'ను విడుదల చేశారు. నిజానికి, తెర మీద కదిలే బొమ్మలకూ, రికార్డు చేసిన శబ్దానికీ జత కట్టాలన్న ఆలోచన చాలా పాత కాలం నుంచీ ఉన్నదే! అయితే, అవి చాలాకాలం ప్రయోగదశలోనే మిగిలాయి. తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్‌' ప్రక్రియను డాక్టర్‌ లీ డి ఫారెస్ట్‌ కనిపెట్టారు. ఆ ప్రక్రియను తొలిసారిగా భారతదేశంలో 1927 మే నెలలో బొంబాయిలోని రాయల్‌ ఒపేరా హౌస్‌లో ప్రదర్శించారు.

భారతదేశంలో తొలి శబ్దచిత్ర ప్రయత్నాలు

వీటన్నిటి తరువాత భారతదేశంలో సైతం బొమ్మలకు తగ్గట్లు శబ్దాన్ని జోడించి, చలనచిత్రాన్ని రూపొందించేందుకు మదన్‌ థియేటర్స్‌ సంస్థ అందరి కన్నా ముందుగా ప్రయత్నాలు చేసింది. 1929లో మదన్‌ థియేటర్స్‌ సంస్థ భారతదేశంలోనే తొలిసారిగా కలకత్తాలోని ఎల్ఫిన్‌స్టన్‌ పిక్చర్‌ ప్యాలెస్‌లో యూనివర్సల్‌ వారి 'మెలొడీ ఆఫ్‌ లవ్‌' అనే టాకీ చిత్రాన్ని ప్రదర్శించింది. నిజానికి, భారతదేశ తూర్పు ప్రాంతంలో అలా శాశ్వత ప్రాతిపదికన శబ్ద యంత్రాలను సమకూర్చుకున్న మొట్టమొదటి హాలు కలకత్తాలోని ఆ ఎల్ఫిన్‌స్టనే! విదేశాల నుంచి టాకీ చిత్రాలు వస్తుండే సరికి 1930 చివరి నాటికల్లా భారతదేశంలోని మొత్తం 370 థియేటర్లలో 30కి పైగా థియేటర్లు (అంటే దాదాపు 10 శాతం హాళ్ళన్న మాట!) శబ్ద సహిత చిత్రాలను ప్రదర్శించేందుకు వీలుగా తగిన సామగ్రిని సమకూర్చుకున్నాయి.

తరచూ విదేశాల్లో పర్యటించే మదన్‌ థియేటర్స్‌ సంస్థ యజమాని జె.జె. మదన్‌ న్యూయార్క్‌లో 'ది జాజ్‌ సింగర్‌'ను చూశారు. దానికి ప్రజల నుంచి వస్తున్న అనూహ్యమైన స్పందనను గమనించారు. ఇక, సినిమా భవిష్యత్తు అంతా శబ్దంతో కూడిన చిత్రాల్లోనే ఉందని గ్రహించారు. సరికొత్త పరిణామాలను లోతుగా పరిశీలించడం కోసం హాలీవుడ్‌ను సందర్శించి, భారత్‌లోని తన స్టూడియోకు శబ్ద సామగ్రి కొనుగోలు చేసేందుకు ఆర్డరు పెట్టారు. అదే సమయంలో కలకత్తా శివార్లలోని టాలీగంజ్‌ ప్రాంతంలో ఓ సౌండ్‌-ప్రూఫ్‌ స్టూడియో నిర్మాణం మొదలైంది. ఆ టాలీగంజ్‌ ప్రాంతం పేరిటే అక్కడి చిత్ర పరిశ్రమ ఆ తరువాత 'టాలీవుడ్‌'గా ప్రసిద్ధమైంది. (అలా బెంగాలీ పరిశ్రమకు ప్రసిద్ధమైన పేరును అజ్ఞానంతో అరువు తెచ్చుకొని, దానికి సంబంధమే లేని తెలుగు చిత్ర పరిశ్రమను 'టాలీవుడ్‌' అని తప్పుడు పేరుతో పిలవడం గడచిన పదేళ్ళ పైచిలుకుగా తప్పుగా ప్రచారంలోకి వచ్చింది!)

పోటాపోటీలో ముందు వచ్చిన 'ఆలమ్‌ ఆరా'

మరి, కలకత్తాకు చెందిన మదన్‌ థియేటర్స్‌ ఇంత కృషి చేస్తుంటే, బొంబాయికి చెందిన అర్దేషిర్‌ ఇరానీ నేతృత్వంలో ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీ వారి 'ఆలమ్‌ ఆరా' తొలి భారతీయ టాకీ ఎలా అయింది? దీని వెనుక కూడా ఓ చిన్న కథ ఉంది. నిజానికి, పూర్తిస్థాయి భారతీయ టాకీ చిత్రాల రూపకల్పన కోసం అప్పట్లో కనీసం మూడు సిండికేట్‌ సంస్థలు పోటాపోటీగా ప్రయత్నించాయి. పూర్తి స్థాయిలో మాట్లాడే చలనచిత్రాన్ని రూపొందించాలన్న పోటాపోటీలో ఎట్టకేలకు అర్దేషిర్‌ ఇరానీ నేతృత్వంలోని 'ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీ'యే ప్రత్యర్థులపై పైచేయి సాధించింది. ఎనభై ఏళ్ళ క్రితం 1931 మార్చి 14న తొలి పూర్తి నిడివి భారతీయ టాకీ 'ఆలమ్‌ ఆరా'ను బొంబాయిలోని 'మెజెస్టిక్‌ సినిమా' హాలులో విడుదల చేసింది.

(మిగతా భాగం మరి కాసేపట్లో....)