జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, August 30, 2010

మన వాళ్ళు ఇలాంటి సినిమా తీయరేం..?




ఇటీవల తమిళంలో 'మదరాస పట్టిణం' అనే ఓ సినిమా వచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొద్ది కాలం ముందు నాళ్ళ నేపథ్యంలో రూపొందిన కల్పిత కథ అది. దానికి అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, దాని రాజధాని మద్రాసు వేదికలు. అలా అరవై ఏళ్ళ వెనక్కి తీసుకువెళ్ళి, అప్పటి మద్రాసు పట్టణం రూపురేఖలను చూపే ప్రయత్నం ఈ సినిమాలోని ప్రత్యేకత. కథాంశం తెలియకపోయినా, కథా నేపథ్యం తెలుసు కాబట్టి, విడుదలకు ముందు నుంచి ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశాను. తీరా సినిమా విడుదలై నెల రోజులు దాటినా, రకరకాల కారణాల వల్ల 'మదరాస పట్టిణం' చూడడం కుదరలేదు.

ఎట్టకేలకు గత వారం ఆ సినిమాకు వెళ్ళగలిగాను. లండన్ లోని ఓ ముసలావిడ మనస్సు అటు గతానికీ, ఇటు వర్తమానానికీ మధ్య తారట్లాడుతుండగా ఈ సినిమా కథ మొత్తం జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఆ ముసలావిడ ఓ బ్రిటిషు గవర్నర్ కూతురు. మద్రాసు నగరానికి వచ్చిన ఆ యువతి, అక్కడి రజకుల పేటకు చెందిన ఓ కుర్రాణ్ణి (తెలుగు చిత్రం వరుడులో విలన్ ఆర్య) చూసి, ప్రేమలో పడుతుంది. కుస్తీ యోధుడు కూడా అయిన ఆ కుర్రాడికీ, ఆ అమ్మాయికీ మధ్య ప్రేమ కథ నడుస్తుంది. దాన్ని అంగీకరించని గవర్నర్... ఆ అమ్మాయితో పెళ్ళికి నిశ్చితార్థం కూడా అయిన ఓ బ్రిటిషు పోలీసు అధికారి.... - ఇలా రకరకాల పాత్రల మధ్య కథ జరుగుతుంది. చివరకు 1947 ఆగస్టు 14 నాటి రాత్రి దేశానికి స్వాతంత్ర్యం వస్తున్న వేళ జరిగే గొడవ మధ్య ఆ ప్రేమ జంట అనూహ్యంగా విడిపోతుంది. ఆ తరువాత ఇంగ్లండ్ వెళ్ళిపోయిన ఆమె మళ్ళీ ఇన్నేళ్ళకు భారత్ కు తిరిగి వచ్చిందన్నమాట. ఆ తరువాత జరిగే కొన్ని సంఘటనలు మిగతా సినిమా.

'ఈ సినిమా కథలో, కథనంలో లోపాలు లేవా?' అంటే బోలెడు ఉన్నాయి. కురిసే వాన కోసం రజక పేటలో ఆనంద నృత్యం, బ్రిటిషు అధికారికీ, భారత యోధుడికీ మధ్య కుస్తీ పోటీ లాంటి సన్నివేశాల్లో హిందీ హిట్ 'లగాన్' ప్రభావమూ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, కథాకాలం నాటి వాస్తవిక సామాజిక పరిస్థితికి ఈ సినిమా ఏ మేరకు దగ్గరగా ఉందనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ముగింపు కూడా అర్ధంతరమనే అనిపిస్తుంది.

మరి, 'ఇంతకీ ఆ సినిమా గురించి ఎందుకు చెబుతున్నట్లు?' అంటారా! ఎందుకంటే, ఈ సినిమా కోసం కొన్ని వందల మంది సాంకేతిక నిపుణులు చేసిన కృషి కోసం! 60 ఏళ్ళ పైచిలుకు క్రితం నాటి మద్రాసును మళ్ళీ తెరపై పునఃసృష్టించడం కోసం వారు పడ్డ శ్రమ కోసం! కళా దర్శకుడు వి. సెల్వకుమార్ ప్రతిభ కోసం! కథా నేపథ్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన గ్రాఫిక్స్ ను అద్భుతంగా ఉపయోగించుకున్న తీరు కోసం! ఛాయాగ్రాహకుడు నీరవ్ షా పనితనం కోసం!! .... ఇవన్నీ ఆ సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి.

విజయ్ అనే ఓ నూతన దర్శకుడు ధైర్యంగా ఇలాంటి నేపథ్యంలో కథను అల్లుకోవడం, నిర్మాతలు కూడా సాహసించి చిత్రం నిర్మించడం చూస్తే మనకు ముచ్చటేస్తుంది. అందుకు చేసిన పరిశోధనకు ఆనందం అనిపిస్తుంది. ఆలోచనా దారిద్ర్యం లేకపోవడం, దేశవాళీ తరహాలో తెరపై కొత్త దృశ్యాన్ని ఆవిష్కరించాలని అనుకోవడం, ఫార్ములా కథల ఏటికి ఎదురీదడం... వీటన్నిటికీ కలిపిమెచ్చుకోవాలనిపిస్తుంది. సెక్సీ పాటలు కానీ, వీరబాదుడు పోరాటాలు కానీ లేకుండా సినిమా తీసినందుకైనా అభినందించాలనిపిస్తుంది. మన సగటు తెలుగు సినిమాల్లో ఉపయోగం కన్నా దురుపయోగం ఎక్కువ జరిగే డిజిటల్ ఇంటర్ మీడియట్ (డి.ఐ), విజువల్ ఎఫెక్టుల లాంటి వాటిని కథకు ఎలా మూలస్తంభాలుగా వాడవచ్చో ఈ సినిమా చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు మన తెలుగులో రావడం లేదేమని బాధ పడాలనిపిస్తుంది. ఇంకా మనం ఆరు పాటలు, ఆరు ఫైట్ల రోజుల్లోనే ఉన్నందుకు సిగ్గు పడాలనిపిస్తుంది.

'లగాన్, టైటానిక్' లాంటి సినిమాల ప్రభావం ఈ సినిమా మీద ఉందని కొందరు తక్కువ చేయవచ్చు. నిజమే. కానీ, ఆ సినిమాలు మనవాళ్ళూ చూశారుగా! ఆ ప్రేరణతోనైనా మనం కథలెందుకు అల్లలేకపోయాం? సినిమాలెందుకు తీయలేకపోయాం? 400 ఏళ్ళ చరిత్ర ఉన్న హైదరాబాద్ మొదలు దశాబ్దాల చరిత్ర ఉన్న మన పట్టణాల నేపథ్యంలో మనకున్న కథలు, చారిత్రక గాథలనైనా తెరకెక్కించేందుకు ప్రయత్నించనైనా ప్రయత్నించామా? లేదే!! ఇలాంటి సినిమాలు పక్క రాష్ట్రాల్లో వచ్చినప్పుడైనా మనవాళ్ళు కళ్ళు తెరుస్తారంటారా?!

పి.ఎస్. - అన్నట్లు ఈ తమిళ సినిమా ఇప్పుడు తెలుగులోకి అనువాదమవుతోందట. పాత మద్రాసునూ, ఊళ్ళో అప్పటి ట్రామ్ ప్రయాణాలనూ, (ఇప్పుడు మురుగు కాలువగా మారిన అప్పటి అందమైన కూవమ్ నదిలో) ఆహ్లాదభరిత నదీ విహారాలనూ తెరపైనే చూడగలిగే ఈ తరానికి ఇది ఓ కనువిందు. ఆ తరం మద్రాసు ప్రేమికులకు ఓ నోస్టాల్జియా. సినిమా ముందు, సినిమా చివర టైటిల్స్ లో చూపే మద్రాసు రేఖా చిత్రం, అప్పటికీ ఇప్పటికీ మద్రాసులోని ప్రధాన ప్రాంతాల్లో వచ్చిన మార్పును ప్రతిఫలించే పాత, కొత్త ఫోటోలు చూడడం మిస్ కాకండేం!!

Saturday, August 28, 2010

ఇప్పుడిక నేరుగా శిర్దీకే!



(ఫోటో - శిర్దీలో సాయిబాబా)

ఎన్నో ఏళ్ళ కల ఇప్పటికి తీరింది. ఎందరికో ఆరాధ్యదైవమైన సాయిబాబా నడయాడిన పవిత్ర శిర్దీ ప్రాంతానికి ఇప్పుడు నేరుగా రైలు వచ్చేసింది. ఇప్పటి దాకా శిర్దీకి దగ్గరలోని మన్మాడ్ వరకే రైలులో వెళ్ళగలిగేవాళ్ళం. అక్కడ నుంచి బస్సులోనో, వేరే బండిలోనే శిర్దీకి వెళ్ళాల్సి వచ్చేది. కానీ, ఆగస్టు 27 శుక్రవారం నాటి నుంచి శిర్దీ సైతం భారతదేశపు రైల్వే పటంలోకి వచ్చేసింది. తాజాగా ముంబయ్ తో శిర్దీని కలుపుతూ, వారానికి మూడు సార్లు నడిచే ఓ సూపర్ ఫాస్ట్ రైలు బండి వేశారు.

శిర్దీలో తాజాగా ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ కు సాయినగర్ శిర్దీ అని పేరు పెట్టారు. ఈ కొత్త రైల్వే స్టేషన్ పుణ్యమా అని మన తెలుగునేల నుంచి నేరుగా శిర్దీకి వెళ్ళడానికి వీలు దొరికింది. ఇప్పటి దాకా సికింద్రాబాద్ - మన్మాడ్ ఎక్స్ ప్రెస్, కాకినాడ - మన్మాడ్ ఎక్స్ ప్రెస్, విజయవాడ - మన్మాడ్ ఎక్స్ ప్రెస్ - ఇలా అన్ని రైలు బళ్ళూ మన్మాడ్ దాకానే నడిచేవి. భక్తుల సౌకర్యం కోసం ఈ రైలుబళ్ళన్నిటినీ సాయినగర్ శిర్దీ దాకా పొడిగిస్తున్నారు. అంటే, మన తెలుగు నేల మీద నుంచి శిర్దీకి వెళ్ళే లక్షలాది భక్తులు ఇక నుంచి నేరుగా తమ ఊళ్ళో రైలెక్కి, శిర్దీలోనే దిగవచ్చన్నమాట. బాబా భక్తులకు ఇది గొప్ప వరమే.

Friday, August 27, 2010

ప్రకాశ్ రాజ్ కు పిల్లలంటే ప్రేమే!



(ప్రకాశ్ రాజ్ విడాకుల వెనక కథ - 2)

నిజం చెప్పాలంటే, ప్రకాశ్ రాజ్ కు తన కుటుంబమంటే మహా ప్రాణం. పిల్లలంటే మరీను. చిన్నవాడైన కొడుకు చనిపోయినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి ఆ సీరియస్ నటుడు ఎంతో ఉద్వేగంతో ఈ వ్యాసకర్తకు ఓ సందర్భంలో వివరించారు. అలాగే, ఆ కొడుకును ఖననం (?) చేసిన వ్యవసాయ క్షేత్రానికి తరచూ వెళుతుంటానని కూడా ఆయన చెప్పారు.

మద్రాసులో తరచూ ప్రకాశ్ రాజ్ తన కుటుంబంతో కలసి ఏదో ఒక స్టార్ హోటల్ లో సేదతీరుతూ కనిపించేవారు. సరిగ్గా రెండున్నరేళ్ళ క్రితం, బహుశా పవన్ కల్యాణ్ చిత్రం జల్సా రిలీజ్ టైములో అనుకుంటా - మద్రాసు మౌంటు రోడ్డులోని పార్క్ హోటల్లో ప్రకాశ్ రాజ్ కుటుంబ సమేతంగా కనిపించారు. పోయిన కొడుకు పోగా, ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఆయనకు తన పిల్లలంటే మహా ప్రాణం. యెన్ చెల్లం, యెన్ తంగం (నా బంగారు కొండ అని స్థూలంగా అర్థం) అని నేను, మరో మిత్రుడు (ఆయన సినిమాల్లో ఉన్నా, నన్ను స్నేహితుడిగానే ఎక్కువగా చూస్తారు) కూతుళ్ళను ముద్దు చేయడం చూశాం. ఎక్కడ కనిపించినా, నవ్వుతూ పలకరించే ప్రకాశ్ రాజ్ ఆ రోజు కూడా కాసేపు మాట్లాడారు.

మాతృభాష తుళుతో పాటు కన్నడం ఎలాగూ ప్రకాశ్ రాజ్ కు వచ్చు. ఇక, తమిళం, తెలుగు ఇత్యాది భాషలను వాటిలోని సాహిత్యం కూడా చదివేటంత బాగా నేర్చుకోవడం ఆయనలోని నిబద్ధుడైన నటుడికి గుర్తు. నటనలో ఆయన ఉద్దండుడు. అందులో సందేహం లేదు.

ప్రకాశ్ రాజ్ నటనలో జీవిస్తూ, ప్రేక్షకులకు కన్నీళ్ళు తెప్పించడం ఒక ఎత్తు అయితే, నటించడానికి సమయానికి సెట్స్ కు రాకుండా దర్శక, నిర్మాతలను ఏడిపించడం మరో ఎత్తు. ఎంతో మంది దర్శక - నిర్మాతలు ఈ బాధ పడలేకే, ప్రకాశ్ రాజ్ చేయాల్సిన పాత్రలను కూడా ఆయనకు ఇవ్వడానికి వెనకాడుతున్నారు, వెనకాడుతుంటారు. ఆ మధ్య జాతీయ అవార్డుకు ఎంపికైన తమిళ చిత్రం కాంజీవరం సినిమాకు వెళ్ళినప్పుడు, ప్రకాశ్ రాజ్ చాలా ఆలస్యంగా వచ్చి, పాత్రికేయుల మన్నింపు కోరారు. సొంతంగా ఓ పట్టు చీర నేసి, కుటుంబానికి ఇవ్వాలని తపించే ఓ నేత గాడి పాత్రలో ఆ సినిమాలో ప్రకాశ్ రాజ్ కళ్ళ వెంట నీళ్ళు తెప్పిస్తారు. ఆయన సమయానికి సెట్ కు రావడం కష్టమైతే కావచ్చు కానీ, వచ్చిన తరువాత తాము అనుకున్నదానికి రెట్టింపు అభినయ ప్రతిభను ఆయన చూపిస్తారని దర్శక, నిర్మాతలకు తెలుసు. ప్రకాశ్ రాజ్ కోసం కొంతమంది ఎదురుచూసేది అందుకే.

ఓ పక్క వృత్తి జీవితంలో, మరో పక్క వ్యక్తిగత జీవితంలో విపరీతమైన ఆకర్షణ ఉన్న ప్రకాశ్ రాజ్ ఓ బాధ్యత గల తండ్రిగా తన కుమార్తెల విషయం పట్టించుకుంటారేమో చూడాలి. తండ్రీ, కూతుళ్ళ మధ్య బంధం చుట్టూ తిరిగే అభియుమ్ నానుమ్ (తెలుగులో ఆకాశమంత) కథను అంతగా ఇష్టపడ్డ ప్రకాశ్ నిజజీవితంలోనూ ఆ బంధాన్ని వదలరని అనుకోవచ్చేమో. తాజా పెళ్ళికి కుమార్తెలిద్దరూ రావడం అందుకు ఉదాహరణ కావచ్చేమో. వేచి చూడాలి.

Thursday, August 26, 2010

ప్రకాశ్ రాజ్ విడాకుల వెనక కథ!




(ఫోటో - ప్రకాశ్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి)

పిల్లల మీద, భార్య మీద ప్రేమ చూపే ప్రకాశ్ రాజ్ మొదటి పెళ్ళి విడాకుల దాకా ఎందుకు వెళ్ళిందన్నది ఆశ్చర్యకరమే. కాపురాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. బాలీవుడ్ నృత్య దర్శకురాలు పోనీ వర్మతో ప్రకాశ్ రాజ్ తాజా పరిచయం అందుకు దోహదం చేసినట్లయింది. అందుకే, ప్రకాశ్ రాజ్ మాజీ భార్య లలిత కుమారి ఆ మధ్య మాట్లాడుతూ, పోనీ వర్మతో ప్రకాశ్ కు ఉన్న బంధం గురించి తనకు తెలుసని ఒప్పుకున్నారు. వారి వైవాహిక బంధం సంతోషంగా దీర్ఘకాలం సాగాలని ఆకాంక్షించారు. సినీ కుటుంబంలో పుట్టిన లలిత కుమారి విడాకుల తరువాత మళ్ళీ సినిమాల్లో జీవితం వెతుక్కోసాగారు. ఒకటి రెండు తమిళ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. మిగిలిన అన్ని విషయాల కన్నా ప్రస్తుతం తన కుమార్తెలిద్దరి భవిష్యత్తే ముఖ్యమని చెబుతున్నారు.

వాంటెడ్ (తెలుగు పోకిరికి హిందీ రీమేక్) రోజుల నుంచి ప్రకాశ్ రాజ్ కు, పోనీ వర్మతో స్నేహం ఉందని అభిజ్ఞవర్గాల భోగట్టా. వారి స్నేహం బలపడి, ప్రేమగా మారింది. తమిళ చిత్రం అభియుమ్ నానుమ్ (గత ఏడాది ఆకాశమంత... పేరిట కొన్ని జగపతిబాబు దృశ్యాల పునశ్చిత్రీకరణతో తెలుగులోకి అనువాదమైంది) అంటే ప్రకాశ్ రాజ్ కు బాగా ఇష్టం. అందుకే, అది వివిధ భాషల్లోకి వెళ్ళడానికి తోడ్పడ్డారు. ఆ చిత్ర కన్నడ రీమేక్ ప్రత్యేక స్ర్కీనింగ్ సందర్భంగా ప్రకాశ్, పోనీలు తొలిసారిగా జనం ముందు కనిపించారు. ఆ తరువాత ఆ బంధం మరింత బలపడింది. తాజాగా ప్రకాశ్ రాజ్ తమిళంలో నిర్మించిన ఇనిదు ఇనిదు (తెలుగు హిట్ హ్యాపీడేస్ కు రీమేక్) చిత్రానికి కూడా నృత్య దర్శకురాలిగా పోనీ వర్మ పనిచేశారు. లలిత కుమారితో విడాకులయ్యాక, చివరకు మొన్న ఆగస్టు 24న ప్రకాశ్, పోనీ ఓ ఇంటి వారయ్యారు. చిత్రం ఏమిటంటే, పంజాబీ శైలిలో ముంబయ్ లో జరిగిన ఆ పెళ్ళికి ప్రకాశ్ రాజ్ కుమార్తెలు కూడా హాజరైనట్లు వార్తలు వచ్చాయి.

(మిగతా భాగం మరి కాసేపట్లో....)

Wednesday, August 25, 2010

మళ్ళీ పెళ్ళికొడుకైన ప్రకాశ్ రాజ్!




(ఫోటో -- బొంబాయిలో పెళ్ళి వేడుకలో నటుడు ప్రకాశ్ రాజ్, బాలీవుడ్ నృత్య దర్శకురాలు పోనీవర్మ)

ఎట్టకేలకు అనుకున్నంతా అయింది. కొన్ని నెలలుగా వినిపిస్తున్న ప్రకాశ్ రాజ్ సరికొత్త ప్రేమకథ చివరకు పెళ్ళి పీటల కెక్కింది. శ్రావణ పౌర్ణమి (రాఖీ) పండుగ శుభవేళ ఆగస్ట్ 24 ముంబయ్ లో జరిగిన వివాహ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మళ్ళీ పెళ్ళి కొడుకయ్యారు. ఎంతో కాలంగా తాను ఇష్టపడుతున్న బాలీవుడ్ యువ నృత్యదర్శకురాలు పోనీ వర్మ మెడలో కల్యాణ మాల వేశారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న క్షణాలు ఎదురవడంతో ప్రకాశ్ రాజ్ ఆనందంగా కనిపించారట. మెడలో మంగళసూత్రం పడేసరికి పోనీ వర్మ కూడా హమ్మయ్య అని సంతోషించారు.

నిజానికి, నృత్య దర్శకురాలు పోనీవర్మతో కలసి ప్రకాశ్ రాజ్ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్న వార్త చాలా రోజులుగా సమాచార సాధనాల్లో షికారు చేస్తూనే ఉంది. అయితే, అది అవునని కానీ, కాదని కానీ ఖండించే తీరిక, ఓపిక కూడా ఇటీవలి దాకా ఆ జంటకు లేకుండా పోయింది. ఇప్పటికే పెళ్ళయిన ముదురు గృహస్థు ప్రకాశ్ రాజ్ మటుకు తన మొదటి భార్యకు విడాకులిచ్చే పనిలో చాలా రోజులుగా బిజీగా ఉన్నారు. అటు ఆ విడాకుల సంగతి ఓ కొలిక్కి రాగానే, కొద్ది నెలల క ల్లా ప్రకాశ్ రాజ్ రెండో పెళ్ళికి రెడీ అయ్యారు. పోనీ వర్మ మెడలో తాళి కట్టారు.

ప్రకాశ్ రాజ్ కు గతంలో నటి - నర్తకి డిస్కో శాంతి చెల్లెలు లలిత కుమారితో పెళ్ళయింది. డిస్కో శాంతి భర్త హీరో శ్రీహరి. ఆ రకంగా, శ్రీహరి, ప్రకాశ్ రాజ్ తోడల్లుళ్ళు. ఏమయిందో కానీ, ప్రకాశ్ రాజ్ కాపురంలో కొన్నాళ్ళుగా కలతలు రేగాయి. ప్రకాశ్ రాజ్ కూ, తన చెల్లెలుకూ సయోధ్య కుదర్చడానికి డిస్కో శాంతి చాలా ప్రయత్నించారు. చివరకు శ్రీహరి కూడా రంగం మీదకు వచ్చి, జోక్యం చేసుకున్నట్లు భోగట్టా. కానీ, అవేవీ ఫలించలేదు. కొన్నేళ్ళుగా హాయిగా సాగుతూ వచ్చిన ప్రకాశ్ రాజ్ కాపురం చివరకు కోర్టుకెక్కింది. విడాకులతో ఆ జంట విడిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటనతోనూ, తమిళ చిత్రాల నిర్మాణంతోనూ ఖాళీ లేకుండా తిరిగే ప్రకాశ్ రాజ్, చివరకు పోనీ వర్మ ను పెళ్ళి చేసుకొని, ఇన్నాళ్ళూ గుసగుసలుగానే వినిపిస్తున్న సంగతిని బాహాటం చేశారు. ప్రకాశ్ రాజ్ కు మరోసారి పెళ్ళి శుభాకాంక్షలు. ఈ పెళ్ళయినా కాలాన్ని గెలిచి, అన్యోన్య దాంపత్యంగా నిలుస్తుందని ఆశిద్దాం.

Monday, August 23, 2010

నెట్ మాయాజాలం - వినిపిస్తున్నది వివేకానందుల స్వరమేనా?






(చికాగో సభ లో స్వామి వివేకానంద)

ఎటుచూసినా అవినీతి, అక్రమాలు తాండవిస్తున్న ప్రస్తుత తరుణంలో నవ తరానికి స్ఫూర్తి ప్రదాతలు కరవయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారతీయ యువతరానికి కొన్ని దశాబ్దాలుగా నిరంతరం స్ఫూర్తినిస్తున్న మహోన్నతుడు - స్వామి వివేకానంద. మహాసమాధి చెంది నూరేళ్ళు దాటినా, ఆయన ఇప్పటికీ చెరగని ప్రేరణ నిస్తున్నారు. ఈ నిరంతర చైతన్య దీప్తి ప్రబోధాలను చదివినా, విన్నా సరికొత్త ప్రేరణ కలగడం తరతరాలుగా కొన్ని కోట్ల మందికి అనుభవైకవేద్యం. పరోక్షంగానే ఇంతటి ప్రభావం చూపుతున్న వివేకానందుణ్ణి ప్రత్యక్షంగా చూస్తే.... కనీసం ఆయన ధీర గంభీర ప్రబోధాన్ని ఆయన గొంతులోనే వింటే.... ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేం.

స్వామి వివేకానంద స్వరం ఇటీవల ఇంటర్ నెట్లో మెయిల్స్ రూపంలో ప్రచారంలో ఉంది. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ....సోదర సోదరీమణులారా.... అంటూ స్వామీజీ చేసిన ప్రసంగం, ఆ సంబోధనతోనే సభికులందరూ ఆగకుండా కరతాళ ధ్వనులు చేయడం అందరికీ తెలిసిన విషయాలే. సరిగ్గా ఆ ప్రసంగమేనంటూ ఇప్పుడు మెయిల్సు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రామకృష్ణ ఉద్యమానికి చెందిన భక్తులు, వివేకానంద భక్తులు ఈ మెయిల్స్ చూశారు. అందులో స్వామీజీ స్వరం విన్నారు. మరి, ఆ గొంతు స్వామి వివేకానందునిదేనా అన్నది ప్రశ్న.

దీని మీద ఇటీవల ఎంతో చర్చ జరిగింది. రామకృష్ణ - వివేకానంద భక్తులు ఒకరు దీని మీద ఏకంగా లోతైన పరిశోధనే జరిపారు. నిజానిజాల నిగ్గుతేల్చారు.

1893 సెప్టెంబరు 11న చికాగోలో విశ్వమత సమ్మేళనం జరిగింది. భారతదేశం నుంచి ఓ స్వతంత్ర ప్రతినిధిగా వివేకానంద దానికి హాజరయ్యారు. నిజానికి, అప్పుడు స్వామీజీ ఆ ప్రసంగం చేసే నాటికి ఇప్పటి లాగా ఆడియో రికార్డింగు వసతులు లేవు. రామకృష్ణ మఠం భక్తులైన బెంగుళూరుకు చెందిన ఎం.ఎస్. నంజుండయ్య అది గమనించి, ప్రస్తుతం నెట్ లో ప్రచారంలో ఉన్న ఆడియో క్లిప్పింగుల పూర్వాపరాల్ని లోతుగా పరిశీలించారు. అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.లో ప్రపంచ బ్యాంకులో దాదాపు 16 ఏళ్ళు పనిచేసి, ఉన్నత హోదాలు నిర్వహించిన ఆయన, అసలు 1893లో స్వామీజీ రికార్డింగులు ఏమైనా జరిగాయా అని విచారించారు. చికాగోలోని వివేకానంద వేదాంత సొసైటీకి చెందిన స్వామి చిదానంద ఈ విషయంపై విచారణలు జరిపి, అలాంటివేమీ జరగలేదని నంజుండయ్యకు తెలిపారు. అటుపైన సెయింట్ లూయీస్ లోని వేదాంత సొసైటీకి చెందిన స్వామి చేతనానంద సైతం ఈ విషయంపై తదుపరి విచారణ జరిపారు. చికాగో హిస్టారికల్ సొసైటీ (ఆర్కైవ్స్ అండ్ మ్యాన్యుస్క్రిప్ట్స్)తోనూ, వారి సలహా మేరకు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ తోనూ వివరాలు కనుక్కున్నారు. ఆ విచారణలో సైతం ఇలాంటి రికార్డింగులేవీ జరగలేదని తేలింది.

స్వామి వివేకానంద జరిపిన పాశ్చాత్య దేశాల సందర్శనలపై పరిశోధనలు జరిపిన మేరీ లూయిస్ బర్క్ సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. 1994 జనవరిలో ఆమె బేలూరు మఠాన్ని సందర్శించారు. ప్రస్తుతం రామకృష్ణ మఠం - మిషన్ల ప్రధాన కార్యదర్శి అయిన స్వామి ప్రభానందజీతో భేటీ అయ్యారు. అప్పుడు ఆమె కూడా ఇదే విధమైన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆ నిర్ణీత కాలం నాటి అమెరికా చరిత్రపై ప్రత్యేక కృషి జరిపిన మరో ఇద్దరు చరిత్రకారుల అభిప్రాయమే కాక, తన సొంత పరిశోధనల ప్రకారం కూడా విశ్వమత సభలో స్వామి వివేకానంద ఇచ్చిన ఉపన్యాసం రికార్డింగు జరగలేదని ఆమె వివరించారు.

అయితే, నంజుండయ్య అంతటితో సంతృప్తి పడలేదు. చికాగో హిస్టారికల్ సొసైటీకి చెందిన పరిశోధక విభాగంతోనూ, చికాగోలోని ఆర్ట్ ఇన్ స్టిట్యూట్ ఆర్కైవ్స్ తోనూ ఈ -మెయిల్ ద్వారా నేరుగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. అలాంటి రికార్డులేవీ లేవని ఆ సంస్థలు తెలిపాయి. అసలు ఆ విశ్వ మత సమ్మేళన సమయంలో ఎలాంటి వాయిస్ రికార్డింగులూ జరగనేలేదని ఆర్ట్ ఇన్ స్టిట్యూట్ ఆర్కైవ్స్ తెగేసి చెప్పింది.

ఆ మాటకొస్తే అప్పట్లో అందుబాటులో ఉన్న రికార్డింగ్ సాంకేతిక పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే. 1893 నాటికి అమెరికాలో ఎవరి గొంతైనా రికార్డు చేయాలంటే, ఆ మనిషి మాట్లాడుతున్న మాటల తాలూకు ప్రకంపనాలను తిరిగే స్తూపాకారపు వాటి మీదే నమోదు చేసేవారు. తిరిగే ఆ సిలిండర్లు సైతం 2 నుంచి 3 నిమిషాల పాటే రికార్డు చేయగలిగేవి. కాబట్టి దీర్ఘమైన స్వామీజీ ప్రసంగాన్ని రికార్డు చేయగలిగే అవకాశమే లేదు.

మరో సంగతి ఏమిటంటే, అప్పట్లో స్టూడియోల్లో రికార్డు చేయడానికి సైతం ఎంతో అవస్థ పడాల్సి వచ్చేది. ఇక, స్టూడియోలో కాకుండా బయట రికార్డు చేయడమనేది కలలో కూడా కుదరని పని. వీటన్నిటి దృష్ట్యా వివేకానందుని ఉపన్యాసం రికార్డయ్యే అవకాశం లేదని నంజుండయ్య తేల్చారు.

ఇక, ఇప్పుడు నెట్లో వినిపిస్తున్న ఆడియోలో వివేకానంద స్వామి చికాగోలో చేసిన తొలి ప్రసంగమే కాక, ఇతర ప్రసంగాలు కూడా ఉన్నాయి. అవన్నీ కలసి చాలా నిమిషాలున్నాయి. అప్పట్లో అంతంత సేపు రికార్డు చేసే వీలే లేదు.

అంతేకాకుండా, ఆ రికార్డింగులో ఓ మహిళ, వివేకానంద స్వామిని సభకు పరిచయం చేస్తున్నట్లు వినిపిస్తోంది. నిజానికి, చికాగో సభలో స్వామీజీని సభకు పరిచయం చేసింది - డాక్టర్ బారోస్ అనే పురుషుడు. మద్రాసుకు చెందిన అలసింగ పెరుమాళ్ అనే భక్తుడికి 1893 నవంబరు 2న వివేకానందే స్వయంగా లేఖ రాస్తూ, బారోస్ తనను సభకు పరిచయం చేసిన సంగతి చెప్పారు. దీన్నిబట్టి కూడా నెట్లో ఉన్నది తప్పని తేలుతోంది.

అలాగే, స్వామి వివేకానంద, ...సోదర సోదరీమణులారా... అని సంబోధించినప్పుడు రెండు నిమిషాల పాటు సభాంగణం చప్పట్లతో దద్దరిల్లింది. కానీ, నెట్లో ప్రచారంలో ఉన్న ఆడియోలో ఆ హర్షధ్వానాలు కొద్ది సెకన్లే ఉన్నాయి. పైపెచ్చు, ఆ నాటి ఎడిసన్ సిలిండర్ రికార్డింగులను ఇన్నేళ్ళ తరువాత పునరుద్ధరించినా, అందులో కీచు కీచు శబ్దాలు వినిపిస్తాయి. ఒకవేళ ఆ శబ్దాన్ని తొలగించాలని ప్రయత్నిస్తే, రికార్డయిన మాట దెబ్బ తింటుంది. కానీ, నెట్లోని స్వరం ఈ శబ్దాలేమీ లేకుండా సుస్పష్టంగా ఉంది. వీటన్నిటిని బట్టి నెట్లో ప్రచారంలో ఉన్నది ప్రామాణికమైన రికార్డింగు కాదని తేలిపోతోంది.

వివేకానందుని వాణి అంటూ ఎవరిదో గొంతు వినిపించి, జనాన్ని మోసగించడానికి కొందరు చేసిన కుట్ర ఇది. దీన్నిబట్టి, కనిపించేది, వినిపించేదంతా నిజమని అనుకోకూడదని తేలుతోంది. నెట్లో చేసే మాయకు ఇది ఓ తాజా ఉదాహరణ. తస్మాత్ జాగ్రత్త.