జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, August 28, 2010

ఇప్పుడిక నేరుగా శిర్దీకే!(ఫోటో - శిర్దీలో సాయిబాబా)

ఎన్నో ఏళ్ళ కల ఇప్పటికి తీరింది. ఎందరికో ఆరాధ్యదైవమైన సాయిబాబా నడయాడిన పవిత్ర శిర్దీ ప్రాంతానికి ఇప్పుడు నేరుగా రైలు వచ్చేసింది. ఇప్పటి దాకా శిర్దీకి దగ్గరలోని మన్మాడ్ వరకే రైలులో వెళ్ళగలిగేవాళ్ళం. అక్కడ నుంచి బస్సులోనో, వేరే బండిలోనే శిర్దీకి వెళ్ళాల్సి వచ్చేది. కానీ, ఆగస్టు 27 శుక్రవారం నాటి నుంచి శిర్దీ సైతం భారతదేశపు రైల్వే పటంలోకి వచ్చేసింది. తాజాగా ముంబయ్ తో శిర్దీని కలుపుతూ, వారానికి మూడు సార్లు నడిచే ఓ సూపర్ ఫాస్ట్ రైలు బండి వేశారు.

శిర్దీలో తాజాగా ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ కు సాయినగర్ శిర్దీ అని పేరు పెట్టారు. ఈ కొత్త రైల్వే స్టేషన్ పుణ్యమా అని మన తెలుగునేల నుంచి నేరుగా శిర్దీకి వెళ్ళడానికి వీలు దొరికింది. ఇప్పటి దాకా సికింద్రాబాద్ - మన్మాడ్ ఎక్స్ ప్రెస్, కాకినాడ - మన్మాడ్ ఎక్స్ ప్రెస్, విజయవాడ - మన్మాడ్ ఎక్స్ ప్రెస్ - ఇలా అన్ని రైలు బళ్ళూ మన్మాడ్ దాకానే నడిచేవి. భక్తుల సౌకర్యం కోసం ఈ రైలుబళ్ళన్నిటినీ సాయినగర్ శిర్దీ దాకా పొడిగిస్తున్నారు. అంటే, మన తెలుగు నేల మీద నుంచి శిర్దీకి వెళ్ళే లక్షలాది భక్తులు ఇక నుంచి నేరుగా తమ ఊళ్ళో రైలెక్కి, శిర్దీలోనే దిగవచ్చన్నమాట. బాబా భక్తులకు ఇది గొప్ప వరమే.

5 వ్యాఖ్యలు:

శ్రీనివాస్ said...

శుభపరిణామం

maha said...

మంచి విషయం చెప్పారు..

సుజాత వేల్పూరి said...

సంతోషించదగ్గ విషయ మేభక్తులకు ! ఇంకొకటి ఆలోచిస్తున్నా నేను! ఏడాదికి రెండు సార్లన్నా షిర్డీ వెళ్తాము మేము! నాగర్ సోల్ లో దిగి మారుతి వాన్లోనో, ఇండికాలోనో ప్రయాణిస్తూ,కోపర్ గావ్, ఏవలా మొదలైన గ్రామాల ఉదయపు అందాల్ని ఆస్వాదిస్తూ,దార్లో కనపడే గోదార్ని పలకరిస్తూ షిర్డీ వరకూ సాగే గంట ప్రయాణాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను. డైరెక్ట్ రైలుంటే నాగర్ సోల్ లో దిగం గా! (కావాలంటే దొగొచ్చనుకోండి)!ఇదంతా మిస్ అవుతామన్నమాట.

నాగర్ సోల్ నుంచి షిర్డీ వెళ్ళే టాక్సీల మీదనే ఆధారపడి బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు.ఈ అభివృద్ధి వల్ల వాళ్ళు వేరే జీవనోపాధి వెదుక్కోవాలన్నమాట.ప్చ్!

ఒకరికి మోదం ఒకరికి ఖేదం అంటే ఇదేనేమో కదా!

శ్రీనివాస్ said...

కేవలం యావత్ ఆంద్ర మొత్తం అదే రైల్లో వెళ్ళలేదు కనుక కొందరు పాత మార్గాన్నే ఎంచుకుంటారు :))

Unknown said...

@ మహా గారూథ్యాంక్యూ.

@ శ్రీనివాస్ గారూనమస్తే. మీరన్నది నిజమే. యావదాంధ్ర అదే రైల్లో వెళ్ళలేదు. కానీఇప్పుడు బండి మారే పని లేకుండా నేరుగా శిర్దీకి వెళ్ళే అవకాశం వచ్చిందని తెలియపరచడమే టపా ఉద్దేశం.

@ సుజాత గారూనమస్తే. మీ శిర్దీ ప్రయాణ పద్ధతిఆ వివరాలు అసూయ పుట్టించేటంత బాగున్నాయి. మీరన్నట్టు మధ్యలో ట్యాక్సీ వాళ్ళ జీవనం ఈ కొత్త రైలు మార్గంతో మారిపోతుంది. ఏమీ చేయలేం.. ప్చ్...