జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, August 30, 2010

మన వాళ్ళు ఇలాంటి సినిమా తీయరేం..?
ఇటీవల తమిళంలో 'మదరాస పట్టిణం' అనే ఓ సినిమా వచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొద్ది కాలం ముందు నాళ్ళ నేపథ్యంలో రూపొందిన కల్పిత కథ అది. దానికి అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, దాని రాజధాని మద్రాసు వేదికలు. అలా అరవై ఏళ్ళ వెనక్కి తీసుకువెళ్ళి, అప్పటి మద్రాసు పట్టణం రూపురేఖలను చూపే ప్రయత్నం ఈ సినిమాలోని ప్రత్యేకత. కథాంశం తెలియకపోయినా, కథా నేపథ్యం తెలుసు కాబట్టి, విడుదలకు ముందు నుంచి ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశాను. తీరా సినిమా విడుదలై నెల రోజులు దాటినా, రకరకాల కారణాల వల్ల 'మదరాస పట్టిణం' చూడడం కుదరలేదు.

ఎట్టకేలకు గత వారం ఆ సినిమాకు వెళ్ళగలిగాను. లండన్ లోని ఓ ముసలావిడ మనస్సు అటు గతానికీ, ఇటు వర్తమానానికీ మధ్య తారట్లాడుతుండగా ఈ సినిమా కథ మొత్తం జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఆ ముసలావిడ ఓ బ్రిటిషు గవర్నర్ కూతురు. మద్రాసు నగరానికి వచ్చిన ఆ యువతి, అక్కడి రజకుల పేటకు చెందిన ఓ కుర్రాణ్ణి (తెలుగు చిత్రం వరుడులో విలన్ ఆర్య) చూసి, ప్రేమలో పడుతుంది. కుస్తీ యోధుడు కూడా అయిన ఆ కుర్రాడికీ, ఆ అమ్మాయికీ మధ్య ప్రేమ కథ నడుస్తుంది. దాన్ని అంగీకరించని గవర్నర్... ఆ అమ్మాయితో పెళ్ళికి నిశ్చితార్థం కూడా అయిన ఓ బ్రిటిషు పోలీసు అధికారి.... - ఇలా రకరకాల పాత్రల మధ్య కథ జరుగుతుంది. చివరకు 1947 ఆగస్టు 14 నాటి రాత్రి దేశానికి స్వాతంత్ర్యం వస్తున్న వేళ జరిగే గొడవ మధ్య ఆ ప్రేమ జంట అనూహ్యంగా విడిపోతుంది. ఆ తరువాత ఇంగ్లండ్ వెళ్ళిపోయిన ఆమె మళ్ళీ ఇన్నేళ్ళకు భారత్ కు తిరిగి వచ్చిందన్నమాట. ఆ తరువాత జరిగే కొన్ని సంఘటనలు మిగతా సినిమా.

'ఈ సినిమా కథలో, కథనంలో లోపాలు లేవా?' అంటే బోలెడు ఉన్నాయి. కురిసే వాన కోసం రజక పేటలో ఆనంద నృత్యం, బ్రిటిషు అధికారికీ, భారత యోధుడికీ మధ్య కుస్తీ పోటీ లాంటి సన్నివేశాల్లో హిందీ హిట్ 'లగాన్' ప్రభావమూ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, కథాకాలం నాటి వాస్తవిక సామాజిక పరిస్థితికి ఈ సినిమా ఏ మేరకు దగ్గరగా ఉందనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ముగింపు కూడా అర్ధంతరమనే అనిపిస్తుంది.

మరి, 'ఇంతకీ ఆ సినిమా గురించి ఎందుకు చెబుతున్నట్లు?' అంటారా! ఎందుకంటే, ఈ సినిమా కోసం కొన్ని వందల మంది సాంకేతిక నిపుణులు చేసిన కృషి కోసం! 60 ఏళ్ళ పైచిలుకు క్రితం నాటి మద్రాసును మళ్ళీ తెరపై పునఃసృష్టించడం కోసం వారు పడ్డ శ్రమ కోసం! కళా దర్శకుడు వి. సెల్వకుమార్ ప్రతిభ కోసం! కథా నేపథ్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన గ్రాఫిక్స్ ను అద్భుతంగా ఉపయోగించుకున్న తీరు కోసం! ఛాయాగ్రాహకుడు నీరవ్ షా పనితనం కోసం!! .... ఇవన్నీ ఆ సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి.

విజయ్ అనే ఓ నూతన దర్శకుడు ధైర్యంగా ఇలాంటి నేపథ్యంలో కథను అల్లుకోవడం, నిర్మాతలు కూడా సాహసించి చిత్రం నిర్మించడం చూస్తే మనకు ముచ్చటేస్తుంది. అందుకు చేసిన పరిశోధనకు ఆనందం అనిపిస్తుంది. ఆలోచనా దారిద్ర్యం లేకపోవడం, దేశవాళీ తరహాలో తెరపై కొత్త దృశ్యాన్ని ఆవిష్కరించాలని అనుకోవడం, ఫార్ములా కథల ఏటికి ఎదురీదడం... వీటన్నిటికీ కలిపిమెచ్చుకోవాలనిపిస్తుంది. సెక్సీ పాటలు కానీ, వీరబాదుడు పోరాటాలు కానీ లేకుండా సినిమా తీసినందుకైనా అభినందించాలనిపిస్తుంది. మన సగటు తెలుగు సినిమాల్లో ఉపయోగం కన్నా దురుపయోగం ఎక్కువ జరిగే డిజిటల్ ఇంటర్ మీడియట్ (డి.ఐ), విజువల్ ఎఫెక్టుల లాంటి వాటిని కథకు ఎలా మూలస్తంభాలుగా వాడవచ్చో ఈ సినిమా చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు మన తెలుగులో రావడం లేదేమని బాధ పడాలనిపిస్తుంది. ఇంకా మనం ఆరు పాటలు, ఆరు ఫైట్ల రోజుల్లోనే ఉన్నందుకు సిగ్గు పడాలనిపిస్తుంది.

'లగాన్, టైటానిక్' లాంటి సినిమాల ప్రభావం ఈ సినిమా మీద ఉందని కొందరు తక్కువ చేయవచ్చు. నిజమే. కానీ, ఆ సినిమాలు మనవాళ్ళూ చూశారుగా! ఆ ప్రేరణతోనైనా మనం కథలెందుకు అల్లలేకపోయాం? సినిమాలెందుకు తీయలేకపోయాం? 400 ఏళ్ళ చరిత్ర ఉన్న హైదరాబాద్ మొదలు దశాబ్దాల చరిత్ర ఉన్న మన పట్టణాల నేపథ్యంలో మనకున్న కథలు, చారిత్రక గాథలనైనా తెరకెక్కించేందుకు ప్రయత్నించనైనా ప్రయత్నించామా? లేదే!! ఇలాంటి సినిమాలు పక్క రాష్ట్రాల్లో వచ్చినప్పుడైనా మనవాళ్ళు కళ్ళు తెరుస్తారంటారా?!

పి.ఎస్. - అన్నట్లు ఈ తమిళ సినిమా ఇప్పుడు తెలుగులోకి అనువాదమవుతోందట. పాత మద్రాసునూ, ఊళ్ళో అప్పటి ట్రామ్ ప్రయాణాలనూ, (ఇప్పుడు మురుగు కాలువగా మారిన అప్పటి అందమైన కూవమ్ నదిలో) ఆహ్లాదభరిత నదీ విహారాలనూ తెరపైనే చూడగలిగే ఈ తరానికి ఇది ఓ కనువిందు. ఆ తరం మద్రాసు ప్రేమికులకు ఓ నోస్టాల్జియా. సినిమా ముందు, సినిమా చివర టైటిల్స్ లో చూపే మద్రాసు రేఖా చిత్రం, అప్పటికీ ఇప్పటికీ మద్రాసులోని ప్రధాన ప్రాంతాల్లో వచ్చిన మార్పును ప్రతిఫలించే పాత, కొత్త ఫోటోలు చూడడం మిస్ కాకండేం!!

5 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar said...
This comment has been removed by the author.
Kathi Mahesh Kumar said...

నేనూ ఈ సినిమా ప్రోమో మొదలైనప్పటినుంచీ చూద్దామనుకుంటున్నా, మీకు కుదిరింది. నాకింకా ఆ ఛాన్స్ రాలేదు. :)

ఈ వ్యాసాన్ని నవతరంగంలో పెట్టమంటారా?

Anonymous said...

I beg to differ. నేనూ ప్రొమోలు చూసి మద్రాసులో ఇంటిల్లిపాదినీ నస పెట్టి సినిమా చూసి చాలా నిరాశ చెందాను. వ్యాసంలో చెప్పినట్టు సాంకేతికంగా చాలా బాగుంది. కానీ, కథ కొంచెం అతుకుల బొంతలాగనిపించింది. కథనం "టైటానిక్", "లగాన్" లని కలిపి వండినట్టుంది. ఎందుకో నాకంతగా నచ్చలెదు సినిమా!
శారద

Unknown said...

@ కత్తి మహేశ్ కుమార్ గారూ, నమస్తే. ఎన్నాళ్ళగానో చూద్దామనుకుంటున్న సినిమా చూడడం కుదరకపోయినా, చూడడానికి అందుబాటులో లేకపోయినా సినీ జీవులకు ఊపిరాడనంత ఇబ్బంది. ఆ సంగతి నాకూ అనుభవమే. మదరాస పట్టిణం విషయంలో మీ కన్నా ముందు నాకు అవకాశం దొరికిందన్న మాట. ఈ టపాను మీరు నవతరంగంలో వాడడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. ధన్యవాదాలు.

Unknown said...

@ శారద గారూ, నమస్తే. 'మదరాస పట్టిణం'లో బాగోగులు రెండూ ఉన్నాయి. నా టపాలో కూడా ఆ సంగతి స్పష్టంగా సూచించాను. కథ, కథనంలో బోలెడు లోపాలున్నాయన్న మాట రాశాను. అయితే, కథా నేపథ్యం, దాన్ని పునఃసృష్టించడానికి పడ్డ శ్రమ, సాంకేతిక నైపుణ్యం రీత్యానే ఈ సినిమా ప్రస్తావనార్హం అయింది. నా టపా ఆ కోణం మీదే దృష్టి పెట్టింది. కథ, కథనాల లోపాల విశ్లేషణ వైపు వెళ్ళలేదు. కథ, కథనాల లోపాల విషయంలో మీరూ, నేనూ ఒకే భావంతో ఉన్నాం. కాబట్టి, ఇక డిఫర్ అవడం ఏముంది. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.