జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, August 11, 2010

వివాదాల ఉచ్చులో ‘రోబో’

భారీ సినిమా వస్తోందంటే, రకరకాల హంగులతో పాటు హంగామాలు కూడా
చాలానే ఉంటాయి. అందుకు తాజా ఉదాహరణ - శంకర్ దర్శకత్వంలో
రజనీకాంత్ నటిస్తున్న ‘రోబో’ (తమిళ మాతృక పేరు ‘యంతిరన్’).
షూటింగ్ రోజుల నుంచి వివాదాలను ఎదుర్కొంటూ వచ్చిన సినిమా ఇది.
నిజానికి, మొదట్లో ఈ చిత్రకథను బాలీవుడ్ నటుడు షా రుఖ్ ఖాన్ తో
తీయాలని శంకర్ సంకల్పం. ఆ మేరకు చర్చలు కూడా జరిగాయి. తీరా
అన్నీ ఖరారయ్యాక షారుఖ్ కీ, శంకర్ కీ మధ్య పొసగలేదు. షారుఖ్
పక్కకు తప్పుకున్నారు. దాంతో, తన మునుపటి చిత్రమైన ‘శివాజీ’ హీరో,
ఆలిండియా ఇమేజ్ ఉన్న రజనీకాంత్ నే శంకర్ మళ్ళీ ఆశ్రయించక
తప్పలేదు.


‘శివాజీ’ రోజుల్లోనే ఈ కథ తెలిసిన రజనీకాంత్ వెంటనే ఓకే
చెప్పేశారు. దాదాపు వంద కోట్ల పైచిలుకు ఖర్చయ్యే ఈ సినిమాను
మొదలు పెట్టిన నిర్మాత మొదట వేరొకరు. తీరా సినిమా పట్టాల మీదకు
ఎక్కి, షూటింగ్ మొదలై రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు తీశాక, ఈ
ఖర్చు తన వల్ల కాదంటూ సదరు నిర్మాత చేతులెత్తేశాడు. దాంతో, మళ్ళీ
వివాదం. పక్కవాడు పడిపోయాడంటే, పండగ చేసుకొనే చిత్ర పరిశ్రమలో
నానా మాటలూ వినిపించాయి. రజనీకాంత్, శంకర్ ల బృందాన్ని చూసి
నవ్విన వాళ్ళే ఎక్కువ.


చివరకు రజనీకాంత్, శంకర్లకున్న పేరు, పలుకుబడి
ఫలించాయి. దక్షిణ భారత టీవీ చానళ్ళ గ్రూపులో అతి పెద్దదైన సన్ టి.వి.
నెట్ వర్క్ లిమిటెడ్ సంస్థ సినిమా పూర్తి చేయడానికి ముందుకొచ్చింది.
దాని అనుబంధ విభాగమైన సన్ పిక్చర్స్ పేరిట బరిలోకి దిగింది. ఇప్పటికే
తమిళ చిత్రాల పంపిణీ, పూర్తయిన చిత్రాల గుదిగుత్త కొనుగోళ్ళతో మార్కెట్
ను మింగేస్తున్న సరికొత్త తిమింగలంగా సన్ పిక్చర్స్ (అప)ఖ్యాతి
తెచ్చుకుంది. అలాంటి సంస్థ తొలిసారిగా తామే పూర్తిగా చిత్ర నిర్మాణానికి
శ్రీకారం చుట్టింది. అలా సన్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ తొలి
చిత్రం ఎట్టకేలకు రెండేళ్ళ నిర్మాణం తరువాత ఇప్పుడు తుది మెరుగుల్లో
పడింది.

తాజాగా ఈచిత్రం కొనుగోళ్ళపై వివాదం రేగింది. తెలుగు ‘రోబో’
చిత్రం ప్రదర్శన హక్కుల్ని మరో నిర్మాత, పంపిణీదారు చదలవాడ
శ్రీనివాసరావు దాదాపు రూ. 30 కోట్లకు కొనుగోలు చేశారంటూ రెండు
రోజుల క్రితం పత్రికల్లో వార్తలు వచ్చాయి. అది చూసి, సన్ పిక్చర్స్ వారు
ఖంగారు పడ్డారు. సర్వసాధారణంగా ఎవరికీ, ఏ వివరణకూ అందుబాటులో
ఉండని సన్ సంస్థ వారు తమంతట తాముగా హడావిడిగా తెలుగు
విలేఖరుల సమావేశం పెట్టారు. ‘రోబో’ హక్కుల్ని తామింతవరకు ఎవరికీ
అమ్మనే లేదంటూ వివరణ నిచ్చుకున్నారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా
తెలుగు రోబో హక్కుల అమ్మకం కోసం చదలవాడ శ్రీనివాసరావు పలువురి
నుంచి రూ. 5 కోట్ల దాకా సొమ్ము వసూలు చేశారంటూ సన్ పిక్చర్స్ చీఫ్
ఆపరేటింగ్ ఆఫీసర్ (సి.ఓ.ఓ.) డబ్ల్యు. హన్స్ రాజ్ సక్సేనా వాపోయారు.

చదలవాడ శ్రీనివాసరావు ఎవరో తమకు తెలియనే తెలియదనీ, అతనికి
డబ్బులిచ్చి ఎవరూ మోసపోవద్దనీ వివరించారు. హక్కుల అమ్మకం
వార్తను ఆగస్టు 8న ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రికకూ, ప్రసారం చేసిన
ఆంధ్రజ్యోతి - ఏ.బి.ఎన్. చానల్ కూ ఘాటుగా లేఖ రాస్తున్నట్లూ చెప్పారు.
అలాగే, చదలవాడ, తదితరులపై పోలీసు కేసు పెడుతున్నట్లూ, చట్టపరంగా
దావా వేస్తున్నట్లూ తెలిపారు. అవును మరి, దాదాపు రూ. 130 - 140 కోట్ల
దాకా పెట్టిన ఖర్చును వెనక్కి రాబట్టుకొనేందుకు ఎవరికి మాత్రం ఆందోళన
ఉండదు చెప్పండి.

కాగా, తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్ అధినేత చదలవాడ శ్రీనివాసరావు మాత్రం సన్ సంస్థతో తనకు ఒప్పందం కుదిరిందనీ, ఆగస్టు 7న రూ. 2 కోట్లు ఆ సంస్థకు డి.డి. రూపంలో చెల్లించాననీ వివరణ ఇస్తున్నారు. రూ. 27 కోట్లకు రోబో హక్కులు ఇవ్వాలంటూ తమ మధ్య ప్రాథమిక అంగీకారం కుదిరిందంటూ, కొన్ని పత్రాలు చూపిస్తున్నారు. సన్ సంస్థ ప్రతినిధి ఉదయ్ కుమారే దగ్గరుండి అన్నీ చూసుకున్నారని చెబుతున్నారు. దీనికి సన్ వారు ఏమంటారో చూడాలి. ఇందులో ఎవరిది నిజమో, ఏది నిజమో నిలకడ మీద కానీ తేలేలా లేదు. అందాకా రోబోకు వివాదాల జడి తప్పేలా లేదు.

0 వ్యాఖ్యలు: