జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, August 13, 2010

మహా బోరు శీను!





రవితేజ సినిమా అంటే కాసేపు కాలక్షేపం గ్యారెంటీ అనుకొనే జనం చాలా మందే ఉన్నారు. అలా తెగే టికెట్ల మినిమమ్ గ్యారెంటీ చూసుకొనే - నిర్మాతలు రవితేజతో సినిమాకు ఉత్సాహం చూపిస్తుంటారు. బాల్కనీ నుంచి నేల దాకా ప్రతి తరగతి ప్రేక్షకుడిలోనూ అంతర్గతంగా ఉండే మాస్ లక్షణాన్ని ఆధారంగా చేసుకొనే రవితేజ చిత్రాల కథలల్లుతుంటారు. అందుకే, ‘ఏ’ నుంచి ‘సి’ దాకా అన్ని సెంటర్లలో రవితేజ చిత్రాలకు కనబడని క్రేజు.

అల్లరి చిల్లరిగా తిరిగే జులాయి తరహా కుర్రాడి పాత్రచిత్రణ రవితేజ బాడీ లాంగ్వేజ్ కు సరిపోతూ వచ్చింది. అందుకే, ఆయన సినిమాలన్నీ ఆ పద్ధతిలోనే సాగుతున్నాయి. అయితే, ఎల్లకాలమూ అదే మంత్రం పనిచేస్తుందని అనుకోవడానికి వీలు లేదు. దానికి తగిన కథ, కథనం లేకపోతే, ఆ పాచిక పారదు. అలాంటి పారని పాచికకు ఉదాహరణ - తాజా ‘డాన్ శీను.’

ఈ సినిమా ఓ పెద్ద కథ. మలుపు మీద మలుపుతో ఓ దశ దాటాక ప్రేక్షకుడికి చీకాకు తెప్పించే సుదీర్ఘమైన కథ. స్థూలంగా ఏమిటంటే - డాక్టరో, యాక్టరో కావాలనుకొనే వాళ్ళకు భిన్నమైన వాడు శీను. ‘డాన్’ కావాలన్నది చిన్నప్పటి నుంచి శీను ఆశ, ఆశయం. అమితాబ్ బచ్చన్ కు వీరాభిమాని అయిన శీను పెద్దయ్యాక నగరానికి వస్తాడు. నగరంలోని ఇద్దరు పెద్ద ముఠా నాయకులైన మాచిరాజు (శాయాజీ శిందే), నర్సింగ్ (శ్రీహరి)లలో ఎవరో ఒకరి దృష్టిని ఆకర్షించి, వాళ్ళలో ఏదో ఒక గ్రూపులో చేరాలనుకుంటాడు. ఆ క్రమంలో మాచిరాజు దగ్గర చేరతాడు.

విరోధి అయిన నర్సింగ్ ను దెబ్బతీయడానికి శీనూని జర్మనీకి పంపిస్తాడు మాచిరాజు. జర్మనీలో ఉన్న నర్సింగ్ చెల్లెల్ని శీనుతో ప్రేమలో పడేయించి, ఆ రకంగా నర్సింగ్ ను దెబ్బ తీయాలన్నది మాచిరాజు ప్లాను. అలా అక్కడ జర్మనీలో దీప్తి (శ్రియ)ను ప్రేమలో పడేయడానికి హీరో చేసే నానారకాల చేష్టలతో ఫస్టాఫ్ కాస్తంత వినోదాత్మకంగా గడిచిపోతుంది. తీరా, ఆమెతో అతను తిరిగొచ్చేసరికి ఆమె జర్మనీలోనే ఉండి చదువుకుంటున్న మాచిరాజు చెల్లెలని తెలుస్తుంది. అక్కడికి ఇంటర్వెల్.

ఆ తరువాత నుంచి కథ బోలెడన్ని మలుపులు తిరుగుతుంది. అటు మాచిరాజుతోనూ, ఇటు నర్సింగ్ తోనూ దోస్తీగా ఉంటూ, హీరో వారిని బోల్తా కొట్టిస్తుంటాడు. దుబాయ్ లో ఉండే బడా పారిశ్రామికవేత్త దుగ్గల్ (మహేశ్ మంజ్రేకర్), అతని విలన్ కొడుకుల కథ మరొకటి సమాంతరంగా నడుస్తుంటుంది. ఇంతకీ అసలు ఈ మాచిరాజు, నర్సింగ్ ల దగ్గరకు హీరో ఎందుకు వచ్చాడన్నది మరో బ్లాక్ అండ్ వైట్ సినిమా కష్టాల ఫ్లాష్ బ్యాక్. చివరకు దుగ్గల్ వగైరా విలన్లపై హీరో చేసే క్లైమాక్స్ ఫైటుతో కథ కంచికి... మనం ఇళ్ళకి...

టామ్ అండ్ జెర్రీ కార్టూన్ పాత్రల తరహాలో ఒకరిని మరొకరు వెంటాడి, వినోదభరితంగా కష్టపెట్టే పాత్రచిత్రణ హిట్టయింది కదా అని ప్రతిసారీ ఆ దోవే తొక్కితే కష్టమే. గతంలో ఇదే రవితేజతో ‘కిక్’ సినిమా తీసిన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత అయిన నిర్మాత వెంకట్ అనుకోకుండా ఆదరణకు నోచుకున్న ఆ సినిమాను ప్రాతిపదికగా చేసుకొని, రెండోసారి ఈ గందరగోళ కథను తెరకెక్కించారు. కోన వెంకట్ రచన చేసిన ఈ సినిమాలో ‘ఢీ’, ‘రెఢీ’ లాంటి ఆయన గత చిత్రాలు సహా అనేక ఇతర సినిమాల ఛాయలు ఇట్టే తెలిసిపోతుంటాయి. డాన్ సొంత చెల్లెల్ని అతనికి తెలియకుండా ప్రేమలో పెట్టడం లాంటివి అక్కడ చూసేసినవే.

ఇలాంటి పాత్రలు, రవితేజ వాటిని పోషించే తీరు ఇప్పటికి కొన్ని పదులసార్లు తెరపైకి వచ్చేసినవే. నిజజీవితంలో కూడా అమితాబ్ వీరాభిమాని అయిన రవితేజ ఆ తరహా స్టెప్పులు వేస్తున్నప్పుడు ఒడ్డూ పొడుగుతో అమితాబ్ ను గుర్తుకు తెస్తారు. ఈ సినిమా నుంచి ‘మాస్ రాజా’ అంటూ కొత్త పట్టంతో కనిపించిన రవితేజ ఆ మాట నిలబెట్టుకోవాలంటే, కథల ఎంపికలో కొంత శ్రద్ధ వహించక తప్పదు. మొనాటనీని బ్రేక్ చేయకా తప్పదు.

చాలా రోజుల తరువాత తెలుగు తెరపై మెరిసిన శ్రియ - అందంలో, ఆకర్షణలో పాత మెరుపును కోల్పోయారు. జానా బెత్తెడు దుస్తుల్లో, పెట్టుడు అందాలతో ఎంత ఒళ్ళు ఊపినా లాభం లేకపోయింది. తెరపై రవితేజనే కాదు, తెర ముందున్న ప్రేక్షకుల్ని కూడా ఇంప్రెస్ చేయడానికి శ్రియ చిన్న చిన్న చెడ్డీలతో, ఊపుకొంటూ డ్యాన్సులు చేశారు. అయినా సరే, కొన్నిచోట్ల శ్రియ కన్నా రెండో హీరోయిన్ అంజనా సుఖానీ (శ్రీహరి చెల్లెలు పాత్రధారిణి) మెరుగని ఫీలైతే, అందులో ప్రేక్షకుల తప్పేమీ లేదు. హాస్యం కోసం అబద్ధపు గుడ్డివాడు పిత్రేగా వేణుమాధవ్, సినిమా చివరలో వచ్చే అప్ డేట్ల విశ్వాస్ గా బ్రహ్మానందం పాత్రలను సృష్టించారు. ఇలా సినిమా నిండా జనమైతే ఉన్నారు కానీ, జనం మెచ్చే పాత్రలు, పాత్రపోషణలు కనిపించవు.

హీరోయిజాన్ని పెంచి చూపే తాపత్రయంలో నుంచి వచ్చిన ‘‘...ఒంటి పేరు శీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కు చాలా పెద్ద ఫ్యాను...’’ లాంటి డైలాగులు కొన్నిచోట్ల మాస్ తో ఈలలు వేయించవచ్చు. అలాగే, ‘‘....ఉచ్చ పోసే ప్రతోడూ మొగోడు కాదు. ఉచ్చ పోయించెటోడు మగోడు...’’ (హీరో గురించి శ్రీహరి) లాంటి అనర్ఘ రత్నాలు కూడా విని తరించవచ్చు. అలీ, రవితేజల మాటల్లో, చేష్టల్లో కావాల్సినంత ద్వంద్వార్థాలు పలికించారు. ఇదే వినోదం అనుకుంటే, మన వాళ్ళ అభిరుచికి సిగ్గుపడాలి.

పాటల్లోని మాటలు కూడా (దీన్ని సాహిత్యం అంటే మహాపాపం) ఇందుకేమీ తీసిపోలేదు. ‘‘....అందమేమో ఇస్తరాకు, మడత చూస్తే మామిడాకు, తడిమి చూస్తే తామరాకు... లంగరేసి లాగమాకు.....’’ అనేది నాయికా నాయకుల మధ్య ప్రణయగీతం. మరో పాటలో ‘‘....బలుపుగాడు...., ....ప్రేమంటే పెంట....’’ లాంటి మాటలు వినిపిస్తాయి. ఇదీ నేటి తెలుగు సినిమా పాట. మణిశర్మ సంగీతంలో గుర్తుండే బాణీ కానీ, పాట కానీ ఒక్కటైనా ఉంటే ఒట్టు.

విదేశీ అందాలను చూపడంలో సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం ఓ.కె. సినిమా చివరలో వచ్చే ‘‘....రాజ రాజా రవి తేజా తేజా...’’ పాటకు వేసిన సెట్టు, వాడిన కాస్ట్యూములు ఆకట్టుకుంటాయి. దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఇదే తొలి చిత్రం. గతంలో ఇ.వి.వి. సత్యనారాయణ, శీను వైట్ల లాంటి పలువురి దగ్గర పనిచేసిన ఈయన పది కథలతో ఒక కథను వండే పని మానేసి, తనదైన శైలి కోసం ప్రయత్నించడం ఆయనకూ, ప్రేక్షకులకూ కూడా మంచిది.

వెరసి సుదీర్ఘంగా సాగిన భావన కలిగించే డాన్ శీను ఫస్టాఫ్ వరకు కొంత ఫరవాలేదనిపించినా, సెకండాఫ్ మాత్రం పరమ బోర్. ‘‘.....ఇంకా ‘తెర’ వాలదేమి...ఈ చీకటి విడిపోదేమీ....’’ అనుకుంటూ అసహనంగా సినిమా చూడాల్సి వస్తుంది. రవితేజ తరహా జులాయి పాత్రల చిత్రీకరణలోని వినోదాన్ని ఆస్వాదించేవారు సైతం ఈ చిత్రంలోని లెక్కలేనన్ని అనవసర మలుపుల గందరగోళాన్ని ఏ మేరకు భరించగలరో అనుమానమే.

Wednesday, August 11, 2010

వివాదాల ఉచ్చులో ‘రోబో’

భారీ సినిమా వస్తోందంటే, రకరకాల హంగులతో పాటు హంగామాలు కూడా
చాలానే ఉంటాయి. అందుకు తాజా ఉదాహరణ - శంకర్ దర్శకత్వంలో
రజనీకాంత్ నటిస్తున్న ‘రోబో’ (తమిళ మాతృక పేరు ‘యంతిరన్’).
షూటింగ్ రోజుల నుంచి వివాదాలను ఎదుర్కొంటూ వచ్చిన సినిమా ఇది.
నిజానికి, మొదట్లో ఈ చిత్రకథను బాలీవుడ్ నటుడు షా రుఖ్ ఖాన్ తో
తీయాలని శంకర్ సంకల్పం. ఆ మేరకు చర్చలు కూడా జరిగాయి. తీరా
అన్నీ ఖరారయ్యాక షారుఖ్ కీ, శంకర్ కీ మధ్య పొసగలేదు. షారుఖ్
పక్కకు తప్పుకున్నారు. దాంతో, తన మునుపటి చిత్రమైన ‘శివాజీ’ హీరో,
ఆలిండియా ఇమేజ్ ఉన్న రజనీకాంత్ నే శంకర్ మళ్ళీ ఆశ్రయించక
తప్పలేదు.


‘శివాజీ’ రోజుల్లోనే ఈ కథ తెలిసిన రజనీకాంత్ వెంటనే ఓకే
చెప్పేశారు. దాదాపు వంద కోట్ల పైచిలుకు ఖర్చయ్యే ఈ సినిమాను
మొదలు పెట్టిన నిర్మాత మొదట వేరొకరు. తీరా సినిమా పట్టాల మీదకు
ఎక్కి, షూటింగ్ మొదలై రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు తీశాక, ఈ
ఖర్చు తన వల్ల కాదంటూ సదరు నిర్మాత చేతులెత్తేశాడు. దాంతో, మళ్ళీ
వివాదం. పక్కవాడు పడిపోయాడంటే, పండగ చేసుకొనే చిత్ర పరిశ్రమలో
నానా మాటలూ వినిపించాయి. రజనీకాంత్, శంకర్ ల బృందాన్ని చూసి
నవ్విన వాళ్ళే ఎక్కువ.


చివరకు రజనీకాంత్, శంకర్లకున్న పేరు, పలుకుబడి
ఫలించాయి. దక్షిణ భారత టీవీ చానళ్ళ గ్రూపులో అతి పెద్దదైన సన్ టి.వి.
నెట్ వర్క్ లిమిటెడ్ సంస్థ సినిమా పూర్తి చేయడానికి ముందుకొచ్చింది.
దాని అనుబంధ విభాగమైన సన్ పిక్చర్స్ పేరిట బరిలోకి దిగింది. ఇప్పటికే
తమిళ చిత్రాల పంపిణీ, పూర్తయిన చిత్రాల గుదిగుత్త కొనుగోళ్ళతో మార్కెట్
ను మింగేస్తున్న సరికొత్త తిమింగలంగా సన్ పిక్చర్స్ (అప)ఖ్యాతి
తెచ్చుకుంది. అలాంటి సంస్థ తొలిసారిగా తామే పూర్తిగా చిత్ర నిర్మాణానికి
శ్రీకారం చుట్టింది. అలా సన్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ తొలి
చిత్రం ఎట్టకేలకు రెండేళ్ళ నిర్మాణం తరువాత ఇప్పుడు తుది మెరుగుల్లో
పడింది.

తాజాగా ఈచిత్రం కొనుగోళ్ళపై వివాదం రేగింది. తెలుగు ‘రోబో’
చిత్రం ప్రదర్శన హక్కుల్ని మరో నిర్మాత, పంపిణీదారు చదలవాడ
శ్రీనివాసరావు దాదాపు రూ. 30 కోట్లకు కొనుగోలు చేశారంటూ రెండు
రోజుల క్రితం పత్రికల్లో వార్తలు వచ్చాయి. అది చూసి, సన్ పిక్చర్స్ వారు
ఖంగారు పడ్డారు. సర్వసాధారణంగా ఎవరికీ, ఏ వివరణకూ అందుబాటులో
ఉండని సన్ సంస్థ వారు తమంతట తాముగా హడావిడిగా తెలుగు
విలేఖరుల సమావేశం పెట్టారు. ‘రోబో’ హక్కుల్ని తామింతవరకు ఎవరికీ
అమ్మనే లేదంటూ వివరణ నిచ్చుకున్నారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా
తెలుగు రోబో హక్కుల అమ్మకం కోసం చదలవాడ శ్రీనివాసరావు పలువురి
నుంచి రూ. 5 కోట్ల దాకా సొమ్ము వసూలు చేశారంటూ సన్ పిక్చర్స్ చీఫ్
ఆపరేటింగ్ ఆఫీసర్ (సి.ఓ.ఓ.) డబ్ల్యు. హన్స్ రాజ్ సక్సేనా వాపోయారు.

చదలవాడ శ్రీనివాసరావు ఎవరో తమకు తెలియనే తెలియదనీ, అతనికి
డబ్బులిచ్చి ఎవరూ మోసపోవద్దనీ వివరించారు. హక్కుల అమ్మకం
వార్తను ఆగస్టు 8న ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రికకూ, ప్రసారం చేసిన
ఆంధ్రజ్యోతి - ఏ.బి.ఎన్. చానల్ కూ ఘాటుగా లేఖ రాస్తున్నట్లూ చెప్పారు.
అలాగే, చదలవాడ, తదితరులపై పోలీసు కేసు పెడుతున్నట్లూ, చట్టపరంగా
దావా వేస్తున్నట్లూ తెలిపారు. అవును మరి, దాదాపు రూ. 130 - 140 కోట్ల
దాకా పెట్టిన ఖర్చును వెనక్కి రాబట్టుకొనేందుకు ఎవరికి మాత్రం ఆందోళన
ఉండదు చెప్పండి.

కాగా, తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్ అధినేత చదలవాడ శ్రీనివాసరావు మాత్రం సన్ సంస్థతో తనకు ఒప్పందం కుదిరిందనీ, ఆగస్టు 7న రూ. 2 కోట్లు ఆ సంస్థకు డి.డి. రూపంలో చెల్లించాననీ వివరణ ఇస్తున్నారు. రూ. 27 కోట్లకు రోబో హక్కులు ఇవ్వాలంటూ తమ మధ్య ప్రాథమిక అంగీకారం కుదిరిందంటూ, కొన్ని పత్రాలు చూపిస్తున్నారు. సన్ సంస్థ ప్రతినిధి ఉదయ్ కుమారే దగ్గరుండి అన్నీ చూసుకున్నారని చెబుతున్నారు. దీనికి సన్ వారు ఏమంటారో చూడాలి. ఇందులో ఎవరిది నిజమో, ఏది నిజమో నిలకడ మీద కానీ తేలేలా లేదు. అందాకా రోబోకు వివాదాల జడి తప్పేలా లేదు.

Monday, August 9, 2010

బెజవాడలో అభివృద్ధి అంటే ఇదేనా?!

(కళ్ళుండీ చూడలేని వారి కోసం మా బెజవాడ ఘనత -2 )

బెజవాడలో కొద్ది నెలల క్రితం ‘మెట్రో ఎక్స్ ప్రెస్’ల పేరిట కొత్త సిటీబస్సులు వేశారు. వీటిలో ఎక్కితే కనీసం 6 రూపాయల దాకా టికెట్టు. సాధారణబస్సు టికెట్ ధర కన్నా 2, 3 రూపాయల పైనే ఎక్కువ. దూరం పెరిగే కొద్దీటికెట్ రేటు, ఈ తేడా మరీ పెరిగిపోతాయి. కానీ, అది మామాలు బస్సువేగంతోనే, అదే విధంగా అన్ని స్టాపుల్లోనూ ఆగుతూ వెళుతుంది. అలా వెళ్ళేబస్సు ఎక్స్ ప్రెస్ ఎలా అవుతుంది! ఆదాయం పెంచుకోవడానికి పాలనా యంత్రాంగం,రోడ్డు రవాణా సంస్థలు చేస్తున్న రైట్ రాయల్ దోపిడీ ఇది!! వీటి గురించిప్రజా క్షేమం కోసమే ఉన్నామంటున్న పార్టీలు కానీ, పెద్దలు కానీ, అందుకోసమేకలం పట్టామంటున్న పత్రికల వాళ్ళు కానీ పెదవి విప్పరు.

సత్యనారాయణపురం రైల్వే లైను తొలగించాక, ఆ రోడ్డును చాలా వెడల్పు చేసి,ప్రత్యేక బి.ఆర్.టి.ఎస్. బస్సు మార్గంగా చేస్తున్నామన్నారు. మూడు
నాలుగేళ్ళు గడిచాక ఎలాగైతేనేం, అక్కడి మట్టి తొలగించి, కొంత మేర రోడ్డువేశారు. కానీ, పూర్తి కాకుండానే ఆ మార్గానికి తూతూ మంత్రంగాప్రారంభోత్సవం జరపాలని ప్రయత్నించారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డినిరప్పించారు. పూర్తవని రోడ్డులో, వెళ్ళని బస్సులకు ప్రారంభోత్సవం ఏమిటనితెలుసుకున్న మంత్రి గారు కారు దిగకుండానే కూకలేసి, ప్రారంభోత్సవంజరపకుండానే వెనక్కివెళ్ళిపోయారు. కొద్ది నెలల క్రితం జరిగిన ఈ ఘటన మనబెజవాడ అభివృద్ధికి గీటురాయి కాదా!

ఇవాళ్టికీ బెజవాడలో కాలక్షేపానికి సినిమా తప్ప మరేదైనా ఉందా? కనీసం పెద్దపార్కులు కూడా లేవు. ఉన్న ఒకటి రెండింటిలో సౌకర్యాలు లేవు. గాంధీనగరంలోదుర్గా కళామందిరం పక్కన కాలువ ఒడునున్న గోరా పార్కు లాంటివి కూడాప్రభుత్వ శాఖల భవన నిర్మాణాల చేతిలో ఆక్రమణ పాలై, కుంచించుకుపోయాయి.చదువుకోవడానికి గ్రంథాలయాలు లేవు. వందేళ్ళ నాటి రామమోహన లైబ్రరీ, పాతశివాలయం భ్రమరాంబా మల్లేశ్వర స్వామి లైబ్రరీ లాంటి వాటిని గబ్బిలాలకొంపలుగా మార్చేసి, శిథిలావస్థలో వదిలేశాం. పోటీ పరీక్షల పుస్తకాలతోనిండిపోయిన ఠాగూర్ లైబ్రరీ మినహా మరో దిక్కు లేకుండా పోయింది. ఈతప్పెవరిది? మీదీ, నాదీ, మనదీ, మనం ఎన్నుకున్న పాలకులదీ కాదా? (ఇక్కడపార్టీల తేడాలేవీ లేవు. అన్నీ ఆ తాను ముక్కలే).

తాతల కాలం నాటి హనుమంతరాయ గ్రంథాలయం, రోడ్ల వెడల్పులో అగ్గిపెట్టెంత అయినరోటరీ క్లబ్ ఆడిటోరియం, ఒక్కగానొక్క తుమ్మలపల్లి వారి క్షేత్రయ్యకళాక్షేత్రం తప్ప మనకు ఓ శాశ్వత కళా, సాంస్కృతిక కేంద్రాన్నిఏర్పాటుచేసుకోగలిగామా? అయితే హాల్లో, లేదంటే టీవీలో సినిమాలు చూడడానికేతప్ప, మన సంస్కృతికీ, సాహిత్యానికీ పెద్దపీట వేసే కార్యక్రమాలకు బెజవాడనుకేంద్రంగా మలుచుకోగలిగామా? ఒకప్పుడు వెలిగిన ఆ పాత వైభవాన్ని మన చేతులతోమనమే ధ్వంసం చేయలేదా!!

విజయవాడకు ఇవాళ్టికీ సరైన విమానాశ్రయం ఉందా! లేదు కదా....!! చీకటి పడితేవిమానాలు దిగడానికి వీలుండని గన్నవరం విమానాశ్రయమే అప్పటికీ, ఇప్పటికీదిక్కు. ఇన్నేళ్ళలో దాన్ని అభివృద్ధి చేసిన నాథుడు లేడు. సమీపభవిష్యత్తులో అభివృద్ధి చేసే దాఖలాలూ లేవు. రాష్ట్రంలోని నాలుగు ముఖ్యనగరాల్లో ఒకటిగా పేరే తప్ప, ఒకప్పటితో పోలిస్తే బెజవాడ జనాభాలోనే తప్ప,
వసతుల్లో పెరిగినట్లు చెప్పలేం.

లక్షల కొద్దీ జనాభా ఉంటేనో, చుట్టుపక్కలి ఊళ్ళ కన్నా వైశాల్యంలో,వ్యాపారంలో పెద్దది అయితేనో, మౌలిక వసతులు లేకుండా విలాసాలకు విడిదిఅయితేనో నగరమని చెప్పడం ఒంటి కన్నుతో చూడడమే! బి.ఆర్.టి.ఎస్. బస్సులువచ్చేస్తున్నాయనీ, హైదరాబాద్ నుంచి బెజవాడ మార్గం నాలుగు లైన్ల మార్గంఅయిపోతోందనీ, కారులో ప్రయాణం సుఖంగా సాగిపోతుందనీ చంకలు గుద్దుకుంటేసరిపోతుందా! సామాన్యమైన జీతంతో సాధారణ జీవితం గడిపే సగటు మనిషికి రోడ్లు,నీళ్ళు లేకపోయినా, ఉన్నవాటికి డబ్బు ఎక్కువ వెచ్చించాల్సి వచ్చినా -మనకేం లెమ్మని ఊరుకుందామా?!

సోకాల్డ్ కార్పొరేషన్ పేట పెద్దల మొదలు మన వోట్లతో ఢిల్లీ దాకా ఎదిగిననోట్ల మూటలు సంపాదిస్తున్న నేతల దాకా ఎవరికీ ఇవేవీ పట్టనందుకు నిజంగా మనంగర్వించాల్సిందే! ఇన్ని లోటుపాట్లున్నా సరే, ఉష్ట్రపక్షిలా తల ఎక్కడోపెట్టుకొని, ఆకాశంలో చుక్కలు చూస్తూ, నేల మీద కాళ్ళెక్కడున్నాయోచూసుకోకుండా మైమర్చిపోవాల్సిందే! ‘మాది ఎంతో అందమైన నగరం’ అంటూ శుష్కవచనాలతో, కాలం గడపాల్సిందే! అలా నింగిచూపుల దృష్టితో చూస్తే మాత్రం -అవును ‘పెద్ద పల్లెటూరు’ బెజవాడ అతి అందమైన నగరం.

(పారిశ్రామికంగానే కాదు, ప్రజావసరాల రీత్యా కూడా అభివృద్ధికి నోచుకోక,సంస్కృతి - సాహిత్యపరంగా కూడా పాత వైభవాన్ని కూడా పోగొట్టుకుంటున్న నాపుణ్యభూమి - జన్మభూమి మీద ప్రేమతో, బాధతో........)

కళ్ళుండీ చూడలేని వారి కోసం మా బెజవాడ ఘనత - 1



‘బెజవాడ పెద్ద పల్లెటూరు’ - అనే సరికి చాలామందికే కోపాలొచ్చాయి. ‘అంత మాట అంటావా’ అంటూ, నేను రాసిన పోస్టు మీద తమ అసహనాన్ని నాతో నేరుగా చెప్పినవారు కొందరైతే, కామెంట్లు రాసినవారు మరికొందరు. ఇంకొందరు అంతటితో ఆగక, ఏకంగా బెజవాడ ఎంత సుందర నగరమో ప్రత్యేకంగా పోస్టులు రాశారు. బెజవాడ మీద నాకేదో ద్వేషం ఉన్నట్లు, నేను ఉద్దేశపూర్వకంగా నిందలు వేసినట్లూ భావించారు. యీ నేపథ్యంలో కామెంట్ల రూపంలో కాక, నా భావాలను మరింత వివరంగా చెప్పాలనే ప్రత్యేకంగా ఈ పోస్టు!

నిజానికి, నన్ను పెంచి, పెద్ద చేసిన బెజవాడ మీద నాకెంత ప్రేమో మొదటి టపాలోనే చెప్పా. ఏ ఊరెళ్ళినా, ఎక్కడున్నా అక్కడికీ, మా బెజవాడలో ఉన్న సుఖానికీ పోలిక చూసుకొని, గర్వంగా భుజాలెగరేయడం నాకూ అలవాటే! అంతమాత్రాన ‘...నా జన్మభూమి ఎంత అందమైన దేశమూ...’ అంటూ కళ్ళు మూసుకొని, ఊహల్లో విహరిస్తూ, వాస్తవ పరిస్థితులను మర్చిపోవడం సబబూ కాదు ! సాధ్యమూ కాదు !! నా బాధల్లా అప్పటికీ, ఇప్పటికీ - బెజవాడలో వచ్చిన అసలు సిసలు అభివృద్ధి - దేశంలోని, రాష్ట్రంలోని అనేక ఇతర నగరాలతో పోలిస్తే - అతి తక్కువేనని!

నేను ట్రాఫిక్ గురించే మాట్లాడుతున్నానని కొందరు మిత్రులు పొరబడ్డారు. కేవలం ట్రాఫిక్ అయితే, బెజవాడ కన్నా హైదరాబాద్ లాంటి ఊళ్ళు మరీ దారుణమని వాపోయారు. నా వాదన ఏమిటంటే - కార్లు, బంగళాల వాళ్ళ మాట అటుంచండి, సగటు మనిషి బతకడానికి సాధారణ వసతులు ఉండాలి కదా! కొన్ని వేల మంది కోసమంటూ ప్రభుత్వమే ఏర్పాటు చేసిన హౌసింగ్ బోర్డ్ కాలనీలో కనీసం రోడ్లు వేయరేం! వారాల కొద్దీ బస్సులే లేకపోతే, ఆ కాలనీలోని దిగువ, మధ్యతరగతి ఆదాయ వర్గ (ఎల్.ఐ.జి, ఎం.ఐ.జి) నివాసులకు రవాణా మాటేమిటి! అక్కడి పిల్లలు చదువులకూ, పెద్దలు ఉద్యోగాలకూ ఎలా వెళ్లాలి? కార్పొరేషనైన ఇన్నేళ్ళ తరువాత కూడా కీలకమైన కూడళ్ళలో కూడా సరైన రోడ్లకు నోచుకోని బస్తీని ఏమనాలి? నగరం అనాలా, పల్లెటూరు అనాలా?

నగరమంటే ఓ ముందు చూపు, ఓ నిర్దిష్ట ప్రణాళికతో నిర్మాణం, విస్తరణ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే పెరిగే జనాభా అవసరాలను ఆ నగరం తీర్చగలుగుతుంది. కానీ, ప్రధాన కూడలి అయిన బస్ స్టాండ్ లాంటి చోట్ల కూడా నగర అవసరాలను గుర్తించని / తీర్చని రీతిలో ఫ్లయ్ ఓవర్ వేసి, ట్రాఫిక్ సిగ్నల్ పెట్టేస్తే సరిపోతుందా! మామూలు రోజుల్లోనే బెజవాడ బస్టాండ్ ఎదుట అంతంత సేపు బస్సులు ఆగిపోతూ, పావు ఫర్లాంగైనా లేని దూరానికి పది నిమిషాల పాటు హారన్ల మోత, జనం కూతల మధ్య కదలని బస్సుల్లో ఖైదీలుగా కూర్చోవాల్సి వస్తోంది.

ఇక అమ్మవారి పండుగలైన దసరా లాంటి రోజుల్లో పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఇది ఎంత నరకమో రోజూ ఆ దోవలో చదువులకూ, ఉద్యోగాలకూ, అత్యవసరమైన పనులకూ వెళుతున్న మామూలు వాళ్ళతో మాట్లాడి చూస్తే తెలుస్తుంది. ‘ఏలూరు రోడ్డు బాగుంది’, ‘బందరు రోడ్డుకేం బ్రహ్మాండంగా ఉంది’... అనుకుంటే చాలదు. ఏడాది క్రితం వర్షాలకు వన్టౌన్ మొత్తం మునిగిపోయిన సంఘటన అప్పుడే మర్చిపోదామా! మరోసారి వర్షాల్లో మునిగితేనో, టూ టౌన్ దాకా ఆ ప్రమాదం వస్తేనో - అప్పుడు కళ్ళు తెరుద్దామా!!

భారీ వర్షాలు వస్తే బుడమేరు పొంగి, కాలనీలు మునిగిపోవడం ఎన్నిదశాబ్దాలుగా మనం చూస్తున్న తతంగం. దానికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడానికి మన వాళ్ళకు చిత్తశుద్ధి లేదేం! ఆ కాలనీల్లో ఉండేవాళ్ళు మనుషులు కారా!

(మిగతా భాగం మరి కాసేపట్లో....)

Saturday, August 7, 2010

చిరంజీవి నటించడం ఖాయమే!

('రోబో' ఆడియో ఆవిష్కరణ సభలో రామానాయుడు, కెమెరా మాన్ రత్న వేలు, మోహన్ బాబు, దర్శకుడు శంకర్, సన్ పిక్చర్స్ సక్సేనా, రజనీ కాంత్, చిరంజీవి)


ప్రాచుర్యం, ప్రజాదరణ ఉండే కళా రంగాల్లోని వ్యక్తులు ఆ యా రంగాలను వదిలిపెట్టడం అంత ఈజీ
కాదు. అలవాటై పోయిన బాజా భజంత్రీలను వదులుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది
చెప్పండి. నూటికి 90 మంది చివరి దాకా కళామతల్లినే కొలుస్తూ ఉంటామనేది అందుకే. సరిగ్గా అవే కారణాలతో కాకపోయినా, గడచిన రెండు రోజులుగా వేర్వేరు వేదికలపై తన సినీ రంగ పునఃప్రవేశం గురించి చిరంజీవి చేస్తున్న వ్యాఖ్యలు ఆ చూస్తే,నటన మీద ఆయనకు మక్కువ తీరలేదని ఇట్టే అర్థమై పోతోంది. తాజాగా ఈ రోజు శంకర్ - రజనీకాంత్ ల రోబో చిత్రం ఆడియో ఆవిష్కరణ సభలో చిరంజీవి మళ్ళీ తన సినిమా ఆశలను బయటపెట్టారు.



జెంటిల్మన్ చిత్రం చూసినప్పటి నుంచి శంకర్ దర్శకత్వంలో నటించాలని ఉందనీ, అప్పట్లోనే ఆ
సంగతిని సభా ముఖంగా శంకర్ కు చెప్పాననీ రోబో సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి వివరించారు. మద్రాసులో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్లో చదువుతున్న రోజుల్లోనే తమ బ్యాచ్ కు రెండు మూడేళ్ళు సీనియరైన రజనీకాంత్ ను చూసి స్ఫూర్తిపొందానని చిరు ఆ సంగతులు చెప్పుకొచ్చారు. ''అప్పటికే నాలుగైదు తమిళ చిత్రాల్లో నటించి, పేరు తెచ్చుకున్న రజనీని చూసి, సాదా సీదాగా ఉండే రజనీయే నటుడిగా నిలదొక్కుకుంటున్నప్పుడు ఏదో ఒక రోజు నేనూ అంతటి వాణ్ణి అవుతానని అనుకున్నాను, అయ్యాను" అని చిరంజీవి తెలిపారు.

ఆ తరువాత సినిమా జీవితంలో తనకన్నా కొద్ది అడుగులు ముందుండి, మార్గదర్శకుడిగా నిలిచిన రజనీ ఒక్క విషయంలో మాత్రం మోసం చేశారని చిరంజీవి ఛలోక్తిగానే మనసులో మాట చెప్పారు. "..అభిమానుల మొదలు అనేకుల నుంచి వస్తున్న ఒత్తిళ్ళ కారణంగా సినిమాల్లో నుంచి రాజకీయాలకు రజనీకాంత్ వస్తారనుకున్నా. నాకూ అలాంటి ఒత్తిళ్ళే ఉండడంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. కానీ, రజనీ మాత్రం నన్ను రాజకీయాల్లోకి నెట్టేసి, తాను రోబో సినిమాలో నటించారు. ఇది నిజంగా మోసమే..." అంటూ చిరంజీవి వేదికపై నుంచి చెప్పుకొచ్చారు.


"...ఎంతో భారీ వ్యయంతో, భారీ సాంకేతిక విలువలతో రూపొందిన రోబో
చిత్రం ట్రైలర్లు వగైరా చూస్తుంటే, కళాకారుడిగా నాకు ఈర్ష్య కలుగుతోంది. శంకర్ తో సినిమా చేయడం
సుఖం. మనం బుర్ర పెట్టి ఆలోచించాల్సిన పని లేదు. మన నుంచి తనకు కావాల్సింది చెప్పి
చేయించుకుంటాడని రజనీ నాతో చెప్పారు. నువ్వు, శంకర్ తో కలసి సినిమా చేయాలంటూ
రజనీ అంటే సరేనన్నా. తీరా రోబో చిత్రం రజనీ చేశారు..." అని శంకర్ దర్శకత్వంలో
నటించాలన్న తన చిరకాల వాంఛను మరోసారి చిరు బయటపెట్టారు.


మొత్తం మీద రాజకీయాల్లోకి వచ్చినా, ఇప్పటి వరకు ఆశించిన విజయాలు
దక్కని చిరు మనస్సు మళ్ళీ సినిమాల వైపు మళ్ళుతున్నట్లే ఉంది. రెండు రోజుల ముందు
అభిమానుల సమావేశంలోనూ, ఇవాళ రోబో పాటల విడుదలలోనూ ఆయన మాటలు అందుకు
నిదర్శనం. అందుకే, "...సామాజిక స్పృహనూ, వ్యాపారాత్మకతనూ సమపాళ్ళలో
మేళవించగల నేర్పు ఒక్క శంకర్ కే ఉందంటూ" చిరు ప్రశంసల జల్లు కురిపించారు. మళ్ళీ
అవకాశం వస్తే శంకర్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమన్న సూచనలు బాహాటంగానే చెప్పేశారు.
రోబో ట్రైలర్ భావోద్వేగంతో మాట్లాడుతున్న చిరును చూసి, రజనీ సైతం లేచి నిలబడి చప్పట్లు
కొట్టారు. "...మీరు సినిమాల్లో మళ్ళీ నటించాలి. ఇది నా అభ్యర్థన..." అని కూడా రజనీ
మైకులో చెప్పేశారు. అక్కడి దాకా తెచ్చిన చిరు వెంటనే "అంతా భగవంతుడి ఇచ్ఛ.
చూద్దాం" అన్న పద్ధతిలో పైకి చూస్తూ, సైగ చేశారు.


రాజకీయాల్లోకి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నపడూ, రాజకీయాల్లోకి
వచ్చేసిన తరువాత చిరంజీవికి ఒకటే ఆలోచన. సామాజిక స్పృహతో కూడిన చిత్రాల్లో నటిస్తే అది
సినీ గ్లామర్ కూ, రాజకీయ జీవితానికీ ఉభయతారకంగా ఉంటుందని ఆయన భావన.
రాజకీయ రంగ ప్రవేశానికి కొద్ది నెలల ముందు ఆయన అందుకు ప్రయత్నాలు చేయడం,
పరుచూరి బ్రదర్స్, గుణశేఖర్, వి.వి. వినాయక్ తదితర సినీ ప్రముఖులతో స్ర్కిప్టులు
చర్చించడం స్వయంగా గమనించాను.


రాష్ట్రంలో ఎన్నికలకు మామూలుగా అయితే మరో
నాలుగేళ్ళ దాకా సమయం ఉన్నందు వల్ల, రాజకీయాలకు కూడా పనికొచ్చే ఒకటి రెండు
సినిమాలు చేస్తే బాగుంటుందనే ఆలోచన చిరు మనస్సును తొలుస్తున్నట్లుంది. సామాజిక
స్పృహను స్ర్కిప్టులో మిళాయించే శంకర్ తో సినిమా అయితే, అటు ఆయనతో కలసి
పనిచేయాలన్న చిరకాల వాంఛా తీరుతుంది. ఇటు రాజకీయ జీవితానికీ పనికొస్తుందని చిరు
మనస్సులో ఆశ వెలుగుతోంది. మరి, 75 కోట్లు (శివాజీ), ఇప్పుడు 130 - 140
కోట్లు (రోబో) అంటూ ఎప్పటికప్పుడు బడ్జెట్ ను పెంచుకుంటూ, వివిధ భాషల్లో మార్కెట్ ను
విస్తరించుకుంటూ వెళుతున్న శంకర్, చిరంజీవితో సినిమాకు ముందుకొస్తారా.. శంకర్ సై
అంటే, సరైన స్ర్కిప్టు కోసం చూస్తున్న చిరు సినీ రంగంలోకి రీ ఎంట్రీ దాదాపు ఖాయమనే
చెప్పాలి.

Friday, August 6, 2010

బెజవాడ... ఓ పెద్ద పల్లెటూరు!

కొన్ని నెలల తరువాత మళ్ళీ మా ఊరు బెజవాడ... అదే విజయవాడ వెళ్ళా. ఎంతైనా పుట్టి పెరిగిన ఊరు కదా... ఎవరికైనా ఆపేక్ష ఎక్కువుండడం సహజం. నా మటుకు నాకూ అంతే. ఎప్పుడు వెళ్ళినా ఒకటి రెండు రోజుల సెలవులో ఏదో హడావిడిగా పని చూసుకొని,మళ్ళీ ఉద్యోగానికి వచ్చేయడమే. ఈసారీ అంతే. కాకపోతే, బయట కొద్దిగా ఎక్కువ తిరగాల్సి రావడం, దానికి తోడు వర్షాకాలం కావడంతో, ఊరి అసలు పరిస్థితులు కాస్త ఎక్కువగానే తెలిసొచ్చాయి.
అందుకనో ఏమో నాకీ సారి బెజవాడ అంతగా నచ్చలేదు. ఊహ తెలిసినప్పటి నుంచీ చూస్తున్న ఊరు... నన్ను పెంచి
పెద్ద చేసిన ఊరు... మార్పులు చాలానే వచ్చాయి. కానీ, అవన్నీ మంచికా, చెడుకా... అంటే ఏక పద, ఏక వాక్య సమాధానాలు చెప్పలేం. మార్పు సహజం అనుకొని మనల్ని మనం ఊరడించుకోవచ్చు. కానీ, మారని
విషయాల మీద అసహనాన్ని మాత్రం ఎలా శాంతింపజేసుకోవాలి.

నాకు జన్మనిచ్చిన ఊరు, నాకు చదువు చెప్పిన ఊరు ఇప్పుడు అప్పటి బెజవాడ కాదు. కనీసం నిన్న మొన్నటి విజయవాడా కాదు. జనం పెరిగారు. వాహనాలు పెరిగాయి. రద్దీ పెరిగింది. మునుపటి కన్నా విలాసాలు
పెరిగాయి. కానీ, ఇప్పటికీ ఊళ్ళో ప్రాథమిక సౌకర్యాలు పెరిగినట్లు కనిపించలేదు. కాస్తంత వర్షానికే కాలనీల నిండా బురద. మనుషులు కాదు కదా, కనీసం పశువులు కూడా తిరగడానికి భయపడేంత బురద... బస్సులు
లోపలికి రావడం బంద్. కనకదుర్గ గుడి కొండ వెనుక వైపున ఉండే భవానీపురం, ఆ చుట్టుపక్కలి హౌసింగ్ బోర్డ్ కాలనీ లాంటి వాటిల్లో జనం పడే బాధ వర్ణనాతీతం. హైదరాబాదుకు దారి తీసే 9వ నంబరు జాతీయ రహదారి
(ఎన్.హెచ్. 9)కు కూతవేటు దూరంలో ఉన్న కాలనీల పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయంటే ఎవరైనా నమ్మగలరా...

ఇక, కృష్ణలో స్నానం చేసి, కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి రోజూ కొన్ని వేల మంది వస్తుంటారు. కానీ, అదేం
పాపమో... దుర్గా ఘాట్ దగ్గర కనీసం రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఎన్.హెచ్. 9 మీదుగా హైదరాబాద్ వైపు నుంచి ఊళ్ళోకి వచ్చే వాహనాలు, అవి కాక సిటీ బస్సులు, ఆటోలు, బండ్లు... అన్నిటికీ ఆ రోడ్డే గతి. కొండ వెనక పక్క
నుంచి కొండ ముందుకు దూరం కిలోమీటరైనా ఉంటుందో, ఉండదో... కానీ, ఆ కాస్త దూరం ప్రయాణానికి అరగంట పైనే పడుతోంది. అంటే, అక్కడ మన వాళ్ళ ట్రాఫిక్ నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోండి. బస్సెక్కితే నరకమే...

బెజవాడలో స్థానిక సిటీ బస్సులన్నీ బస్టాండ్ మీదుగానే వెళతాయి. గమ్యం ఏదైనా సరే, మార్గమధ్యంలో బస్ స్టాండులోకి వెళ్ళి, ఆ తరువాతే గమ్యం దిశగా ప్రయాణం. బస్టాండ్ ముందే పోలీసు కంట్రోల్ రూం, ఓ
ఫ్లయ్ ఓవర్. అక్కడ నాలుగు పక్కలకూ దోవలు. వన్టౌన్ మీద నుంచి టూ టౌన్ లోకి బస్ లో రావాలన్నా, ఏలూరు రోడ్డు - బందరు రోడ్డుల్లోకి వెళ్ళాలన్నా అదే కీలకమైన కూడలి. కొన్నేళ్ళ క్రితం అక్కడ ఓ ఫ్లయ్ ఓవర్ వేశారు - వన్టౌన్
నూ, టూ టౌన్ ను కలపడానికి. కానీ, భవిష్యత్ అవసరాలను పట్టించుకోకుండా ఈ రోజు గడిస్తే చాలు అన్న పద్ధతిలో కట్టిన ఆ ఫ్లయ్ ఓవర్ తో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరిగాయి. బస్ స్టాండ్లోకి బస్ వెళ్ళి, బయటకు
రావడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు పడుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వరుసగా ఆగిపోయిన బస్సులు.

వన్టౌన్ గా పేరున్న పాత బస్తీ ప్రాంతంలో ఇవాళ్టికీ పూర్తి అండర్
గ్రౌండ్ డ్రైనేజీ వసతి లేదు. గట్టి వాన పడితే, ఆ ప్రాంతమంతా జలమయం.
ఇదుగో అదుగో అంటున్న పాలకులు గత రెండు, మూడేళ్ళుగా మురుగు నీటి
పారుదల వసతి కంటూ రోడ్లు తవ్వుతూనే ఉన్నారు. మట్టి పోస్తూనే ఉన్నారు.
నిధులు ఖర్చవుతున్నాయి కానీ, పనులు జరిగిన దాఖలాలు లేవు. రోడ్లన్నీ
అలాగే తవ్వి పడేసి ఉన్నాయి. వానలో కాదు కదా, మామూలుగానైనా సరే
నడవాలంటే భయపడే పరిస్థితి.

అందుకే, వాణిజ్య రాజధాని, సినీ రాజధాని, కోస్తాకు గుండె
కాయ - ఇలా బోలెడు పేర్లయితే ఉన్నాయి కానీ, విజయవాడ నిజంగా ఏ
మేరకు అభివృద్థి చెందిందంటే అనుమానమే. సరైన రోడ్లు, పారిశుద్ధ్యం,
మురుగునీటి పారుదల వసతి లేని ప్రాంతం మహానగరం ఎలా అవుతుంది..
రాబోయే రాష్ట్రానికి కాబోయే రాజధాని (ప్రత్యేక ఆంధ్ర ఇవ్వాలంటున్న వారి వాదన)
ఎలా అవుతుది...

ఈ సెప్టెంబర్ నాటికి కార్పొరేషన్ కాలం ముగుస్తుందట.
అందుకని ఇప్పుడు ఏదో పని అయిందంటే అయిందనిపించాలని పాలకులు
హడావిడి పడుతున్నారు. వీలుంటే అయిదారు నెలల పైగా ఎన్నికలు వాయిదా
వేయించాలని చూస్తున్నట్లు జనం చెప్పుకుంటున్నారు. అంటే, ఎన్నికలంటే
భయం తప్ప, జనానికి ఏదైనా చేయాలని ఎవరికీ లేదన్నమాట.

కావాలంటే మీరిప్పుడు బెజవాడ వెళ్ళి చూడండి. అది రాష్ట్రంలోని
పేరున్న పెద్ద నగరమంటే మీరే కాదు, ఆ ఊరికి కొత్తగా వచ్చినవాళ్ళూ నమ్మరు.
అభివృద్ధి అంటే, ఏ బందర్ రోడ్డులోనో కనిపించే బంగళాలు, షాపింగ్ మాల్స్
కాదు... మన చుట్టూ వెలిసిన ఐ నాక్స్ థియేటర్లూ కాదు... ఏరి కోరి వెళ్ళే
ఏసి వస్త్ర దుకాణశాలలూ కాదు... సామాన్యుడి జీవితంలో ప్రమాణాలు
పెరగనప్పుడు అది ఏ రకం అభివృద్ధి.

అందుకే, మళ్ళీ మళ్ళీ అంటున్నా - మా
బెజవాడ ఇప్పుడు సిటీ కాదు, పే...ద్ద పేరున్న పల్లెటూరు.... బెజవాడ
బాగుపడాలంటే... కనీసం బాగున్నట్లన్నా కనిపించాలంటే... అక్కడ
ఎన్నికలు రావాలి. అదీ ప్రతి రోజూ రావాలి... అప్పటి దాకా నా కిష్టమైన నా
ఊరు ఓ పల్లెటూరే...