జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, November 29, 2011

‘శ్రీరామరాజ్యం’ - చేజారిన మహదవకాశం?



(‘శ్రీరామరాజ్యం’ సినిమా సమీక్ష - పార్ట్ 3)

(మునుపు రాసినవేమో...

పార్ట్ 1 - ‘రామరాజ్యమంటే ఇదా...!?’,
పార్ట్ 2 - ‘శ్రీరామరాజ్యం - చిన్న లోపాలే పెద్ద శాపాలా?

ఆ రెండు పోస్టులకు కొనసాగింపుగా ఇది చివరి భాగం)



పౌరాణికాలకు పెట్టింది పేరైన మన తెలుగు చిత్ర పరిశ్రమలో 14 ఏళ్ళ తరువాత వచ్చిన పూర్తిస్థాయి పౌరాణిక చిత్రం - ఈ 'శ్రీరామరాజ్యం'. దీనికి ముందు తెలుగులో ఆఖరుగా వచ్చిన నేరు పౌరాణిక చిత్రం చిన్న ఎన్టీయార్ పసివయసులో రాముడిగా నటించిన బాలల చిత్రం 'రామాయణం' (1997). ఆ తరువాత వచ్చిన 'శ్రీరామదాసు', 'పాండురంగడు' లాంటివి పూర్తి పౌరాణిక చిత్ర వర్గంలోకి రావు. చిరంజీవి 'శ్రీమంజునాథ' పౌరాణికమైనా, అది అనువాద చిత్రం. మీడియాలో ఒక వర్గం మాత్రం 'రామాయణం' కన్నా ఏడాది ముందే బాలకృష్ణ నటించిన విజయా వారి 'శ్రీకృష్ణార్జున విజయం' (1996) చిత్రాన్నే ఆఖరుగా వచ్చిన పౌరాణిక చిత్రంగా పేర్కొంటూ, 'శ్రీరామరాజ్యం' ప్రచార కథనాలు ఇటీవల ప్రసారం చేసింది. ఏమైనా, చాలా ఏళ్ళ తరువాత వస్తున్న భారీ పౌరాణిక చిత్రంగా సహజంగానే 'శ్రీరామరాజ్యం' పై అందరిలో ఆసక్తి, తెలుగుదనానికి ప్రతీకలైన బాపు - రమణల చిత్రం కావడంతో కొన్ని అంచనాలు నెలకొన్నాయి. పైగా, పెరిగిన సాంకేతికత నేపథ్యంలో వస్తున్న మహదవకాశమైన ఈ భారీ పౌరాణికానికి పెద్ద సంఖ్యలో పెద్ద పెద్ద సాంకేతిక నిపుణులు పనిచేశారు.

సంగీతం, సాహిత్యం, నృత్యాల శ్రమ ఫలించిందా ?

సంగీతం ఇళయరాజా అందించారు. పాటలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాశారు. ఇళయరాజా సంగీతంలో ఒకటి, రెండు పాటల్లో తప్ప, మిగిలిన చోట్ల మునుపటి మ్యాజిక్ లేదు. 'సాగర సంగమం' లాంటి కొన్ని చిత్రాల్లో ఇప్పటికీ చెప్పుకొనే ఆయన మార్కు రీ-రికార్డింగు 'శ్రీరామరాజ్యం'లో వినిపించదు. ఉదాహరణకు, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులతో రాజమందిరంలో రాముడు వేదనాపూర్వకంగా సంభాషించే సన్నివేశం లాంటివి చూస్తే, రీ-రికార్డింగ్ జరపడానికి ముందే రీలు హాలుకు వచ్చేసిందేమో అనిపిస్తుంది. రీ-రికార్డింగ్ కి అంటూ హంగేరీకి కూడా వెళ్ళి వచ్చిన ఇళయరాజా బృందం అక్కడ ప్రత్యేకంగా చేసినదేమిటమని అనుమానం కలుగుతుంది.

కవి, పండితుడైన జొన్నవిత్తుల పాటల్లో 2, 3 వినగా, వినగా బాగున్నాయి. 'జగదానంద కారకా... జయ జానకీ ప్రాణనాయకా... ' అన్న త్యాగరాయ కీర్తన మకుటంతో రాసిన పల్లవి సినిమా రిలీజుకు ముందు నుంచే తెలుగు నాట ఇంటింటా మారుమోగింది. ఇక, 'దేవుళ్ళే మెచ్చింది... మీ ముందే జరిగింది... ' అంటూ లవకుశులు చేసే రామాయణ గానం కూడా విన్నకొద్దీ ఎక్కే పాట. అందులో ముఖ్యంగా సీతకు అగ్నిపరీక్ష సందర్భాన్ని ప్రస్తావిస్తూ రాసిన '...ఎవ్వరికీ పరీక్ష, ఎందులకీ పరీక్ష, ...రాముడి ప్రాణానికా, జానకి దేహానికా.... ' లాంటి వాక్యాలు మనసుకు తాకుతాయి. సీతను అడవిలో వదిలే సమయంలో వచ్చే విషాద గీతం 'గాలి..నింగి..నీరు... ' కూడా ఇళయరాజా బాణీలో, భావోద్వేగాలను పండించిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వాణిలో కదిలిస్తుంది. శ్రేయా ఘోశల్ లాంటి గాయనీ గాయకులు ఈ చిత్ర గీతాలను బాగానే పాడారు.

అయితే, వచ్చిన చిక్కేమిటంటే, మొత్తం మీద పాటల్లో సాహిత్యం బాగున్నా, కథకు కావాల్సిన ఆర్తి, ఆవేదన, ఆవేగం అన్ని చోట్లా పలకలేదు. పైగా, విడిగా వినప్పటి కంటే, తెరపై దృశ్యంతో కలసి విన్నప్పుడు వాటి స్థాయి మరికొంత తగ్గిందేమో అనిపిస్తుంది. ఇక, ఆల్ టైమ్ హిట్లుగా నిలిచిన 'లవకుశ'లోని 'శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా... ', 'ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు...' లాంటి పాటలతో పోలికలు రానే వస్తాయి. అదీ ఓ ప్రతికూలతే. అన్నట్లు ఈ చిత్రానికి మొదట్లో వెన్నెలకంటితో 2 పాటలు, కొన్ని పద్యాలు కూడా రాయించారు. రికార్డు కూడా చేసినట్లున్నారు. మరి, సినిమాలో అవేవీ లేవు. జొన్నవిత్తులదే సింగిల్ కార్డు. దీనికి వెనుక కథేమిటో తెలియదు.

ఈ చిత్రానికి డ్యాన్స్ మాస్టర్ సీనియర్ టెక్నీషియన్ శ్రీను. అయితే, ఈ సినిమాలోని నృత్యగీతాలు, ముఖ్యంగా రాముల వారి అయోధ్యా నగర ప్రవేశం, సీతమ్మవారి సీమంతం పాటలకు కంపోజ్ చేసిన బృంద నృత్యాలు పౌరాణిక సినిమాలకు తగ్గట్లుగా అనిపించవు. పైగా శాస్త్రానుసారం రంగస్థలి మీద ఉండకూడని లోపాలూ ఉన్నాయి. ఉదాహరణకు, ముఖ్య తార (ల)ను మధ్యలో పెట్టుకొని, బృంద నర్తకులు చుట్టూ తిరిగి నర్తిస్తున్నప్పుడు కథకూ, సినిమాకూ ప్రధానమైన ఆ ముఖ్య తారలు, వారి ముఖాలు కనపడాలి కదా. వారు కనపడరు సరి కదా, ఈ బృంద నర్తకుల పృష్ఠ భాగాలు తెరపై తారట్లాడుతూ, చూపరులకు చెప్పుకోలేని చీకాకు కలిగిస్తాయి.

అతుకుల బొంతగా ఆధునిక సాంకేతికత

జి.జి. కృష్ణారావు కూర్పు అద్భుతాలు, ఆశ్చర్యాలు లేకుండా, సాఫీగా సాగిపోతుంది. కళా దర్శకత్వానికి వస్తే - ఎస్. రవీందర్, కిరణ్ కుమార్ లు ఆ బాధ్యతలు నిర్వహించారు. ప్రధానంగా, వాల్మీకి ఆశ్రమం (కళా దర్శకుడు ఎస్. రవీందర్), అయోధ్య రాజమందిరం లాంటివి పూర్తి స్థాయి అచ్చమైన సెట్లయితే, మిగిలినవి కొద్దిగా వేసిన సెట్ కు, మిగతా భాగం విజువల్ ఎఫెక్టులు జోడించిన వర్చ్యువల్ సెట్లు.

సుమారు రెండుమ్ముప్పావు గంటల ఈ సినిమాలో దాదాపుగా రెండుంబావు గంటల దాకా గ్రాఫిక్స్ ఉన్నాయి. అందు కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు - ఏకంగా నాలుగు సంస్థల వారు (ఇ.ఎఫ్.ఎక్స్, పిక్సెలాయిడ్, మకుట, ఆరెంజ్ మీడియా) శ్రమించారు. కానీ, తెరపై తుది ఫలితం మాత్రం తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. అయోధ్యా నగర వీధులు, రాజ ప్రాసాదంలో కోటంత ఎత్తు గోడలు, ద్వారాలు, తలుపులు వగైరాలన్నీ కంప్యూటర్ లో రూపొందించిన వర్చ్యువల్ సెట్లే. ఇలాంటి వర్చ్యువల్ సెట్లు సైతం కంటికి తేడా తెలియకుండా గ్రాఫిక్స్ లో నేర్పుగా చేసిన తీరు మనం మునుపటి ‘అరుంధతి’, ‘మగధీర’ (2009) చిత్రాల్లో చూశాం. కానీ, ‘శ్రీరామరాజ్యం’లో మాత్రం ఈ గ్రాఫిక్స్ విశ్వామిత్ర సృష్టి సెట్స్ లో చాలా భాగం సహజంగా లేవు. నాటకాల్లో, పాత కాలపు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో పరిసర వాతావరణాన్ని సృష్టించడానికి గుడ్డ మీద వేసిన బొమ్మలను వాడినట్లుగా ఉంది.

పైగా, కెమేరా కంటి (ప్రేక్షకుడి) దృక్కోణానికి కానీ, సన్నివేశంలోని పాత్రధారులు నిలబడిన తలానికి సారూప్యంగా కానీ, వారి కదలికలకు తగ్గట్లుగా కానీ ఈ బ్లూ మ్యాట్ ద్వారా సృష్టించిన గ్రాఫిక్ సెట్లు లేవు. ఒకరకంగా ఇవి ఆధునిక సాంకేతికతలోనూ మనం ఇంకా ఆటవిక యుగంలోనే ఉన్నామని చెప్పకనే చెబుతాయి.

ఇక, అయోధ్యలోని రాజమందిర అంతర్భాగంలోని సూర్య భగవానుడి భారీ విగ్రహం మనవాళ్ళ అరకొర గ్రాఫిక్స్ లో మెల్లకన్నుతో సాక్షాత్కరిస్తుంది. పైగా, సినిమాలో ఓ సన్నివేశంలో దాన్ని మిడ్ క్లోజప్పులో చూపేసరికి, హాలులో ప్రేక్షక జనం హాహాకారం చేయడం ఒక్కటే తక్కువ. ఆ మందిరంలో రాముడి పూర్వీకులైన రఘువంశ రాజుల విగ్రహాలూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక్క విగ్రహం మాత్రం చేతిలో ధనుస్సుతో 'సత్య హరిశ్చంద్ర' సినిమాలోని పెద్ద ఎన్టీయార్ పోలికలతో చూడగానే, గుర్తుపట్టేలా ఉంటుంది.

జంతు సంక్షేమ మండలి కఠిన నిబంధనలైతేనేం, ఈ రోజుల్లో పెరిగిన ఖర్చు వల్ల అయితేనేం ఈ సినిమాలో వాల్మీకి ఆశ్రమంలో కనిపించే లేళ్ళు, జింకలు, నెమళ్ళు వగైరాలన్నీ గ్రాఫిక్స్ సృష్టే. అయితే, వాటిని సరిగా దృశ్యంలో అతకకపోవడంతో, జింకల పక్కనే, వాటి కొమ్ముల మధ్య నుంచి పాత్రధారులు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇక్కడ కూడా కంప్యూటర్ సృష్టికీ, కెమేరా కంటితో పాత్రధారుల మీద తీసిన దృశ్యానికీ పర్ స్పెక్టివ్ లో తేడా తెలుస్తుంటుంది. రథంలో లక్ష్మణుడు, సీతను అడవికి తీసుకువెళ్ళే దృశ్యంలో వచ్చే టాప్ యాంగిల్ షాట్లకూ ఇదే తంటా వచ్చింది.

కెమేరాతోనూ కొరవడిన తృప్తి

ఇటీవల కాలంలో బాపు చిత్రాలు, ‘శ్రీభాగవతం’ సీరియల్ కు పనిచేసిన సీనియర్ టెక్నీషియన్ పి.ఆర్.కె. రాజు గారే ఈ చిత్రానికీ ఛాయాగ్రాహకులు. పాత్రధారులను చూపిన తీరు, లైటింగ్ వగైరాల్లో కెమేరా పనితనం బాగుందనిపిస్తుంది. బాపు మార్కు క్లోజప్పులు సరే సరి. కానీ, ఇద్దరు పాత్రధారుల మధ్య సాగే సంవాదాల లాంటి దృశ్యాల్లో కెమేరా తేలిపోయింది.

పాత్రధారుల్లో ఒకరు కెమేరాకు దగ్గరగా ముందు, వేరొకరు కెమేరాకు కాస్త దూరంగా వెనుక ఉన్నప్పుడు కెమేరాను స్థిరంగా ఉంచి, డైలాగు చెబుతున్న పాత్రధారి మీదకు లెన్సును ఫోకస్ పెట్టడం సాధారణంగా ఆనవాయితీ. డైలాగు చెప్పే అతను ఫోకస్ లో, డైలాగు లేని రెండో పాత్రధారి అవుటాఫ్ ఫోకస్ లో ఒకే ఫ్రేములో కనిపించడం మనం సినిమాల్లో చూస్తుంటాం. కెమేరా కదలకుండా ఉంటూనే, డైలాగు చెప్పే పాత్రధారి మారినప్పుడల్లా ఆ పాత్ర మీదకు ఫోకస్ మాత్రం మారుతూ వస్తుంది. ఈ ప్రాథమికమైన పద్ధతిని పాటించకుండా, కెమేరాతో పాటు ఫోకస్ ను కూడా కదపకుండా అలాగే ఉంచేసిన దృశ్యాలు 'శ్రీరామరాజ్యం'లో కొన్నిచోట్ల కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. దాంతో, కొన్నిసార్లు డైలాగు చెబుతున్న పాత్రధారి అవుటాఫ్ ఫోకస్ లో ఉంటాడు. అందుకే, ఇంతటి బ్రహ్మాండమైన నిర్మాణ విలువలున్న భారీ బడ్జెట్ సినిమాలోనూ, ఈ లోపాలు ప్రేక్షకుడికి రసభంగం కలిగిస్తాయి. తెలియని అసంతృప్తిని కలిగిస్తాయి.

నిజాయితీ, నిర్మాణ విలువలే శ్రీరామరక్ష

78 ఏళ్ళ వయసులోనూ దర్శకుడిగా బాపు తన మార్కు చూపడానికి తపించారు. ప్రతి ఫ్రేమునూ సౌందర్యభరితంగా చూపాలని ప్రయత్నించారు. తనకు మాత్రమే ప్రత్యేకమైన ఫ్రేములతో దృశ్యాలను కన్నులపండుగ చేశారు. నేటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని ముళ్ళపూడి వెంకట రమణ సామాన్య జనభాషలో రచన చేశారు. ఒకటి, రెండు చోట్ల తన కలంలో మెరుపులూ మెరిపించారు.

కానీ, కథను తెరపై నడిపిన తీరులో, అందుకు ఎంచుకున్న ఘట్టాల్లో క్రమానుగత పరిణామం, రసావిష్కరణకు ప్రాతిపదిక, ఆ దిశగా ప్రయాణం, తుది ఫలితం సమగ్ర రూపం ధరించలేదు. ఈ కథ మొత్తాన్నీ సింహావలోకనం చేస్తే - కథలోని పాత్రలకు ఎదురయ్యే సమస్యకు మూలం - సీతపై లోకనింద. దానికి వెరచిన రాముడి ప్రతిస్పందన ఏమిటంటే - సీతాపరిత్యాగం. అంటే ఆ యాక్షన్ కు రాముడి రియాక్షన్ అది. దాని పర్యవసానం - భార్యాభర్తల వియోగం, రాముడికీ, సీతకూ మానసిక సంఘర్షణ. ఈ చిక్కుముడిని విడదీసే ముగింపు - రాముడు, లవకుశులు తమ బాంధవ్యం తెలుసుకొని కలుసుకోవడం.

స్క్రిప్టుకు ప్రధానమైన ఈ అంశాల్లో రాముడి మానసిక సంఘర్షణ, భర్తృ వియోగ బాధతో సీతా సాధ్వి వేదన, తల్లితండ్రులు అని తెలియకుండానే శ్రీరాముడి మీద, సీతమ్మ మీద లవకుశులు గౌరవ అనురాగాలు పెంచుకోవడం, రాముడు సీతమ్మను కారడవుల పాలు చేశాడని తెలిసి సాక్షాత్తూ ఆయననే తిరస్కరించడం లాంటివి ఎంత బాగా ఎలివేట్ అయితే, తెరపై కథ అంత బాగా పండుతుంది. దానికి బాల లవకుశుల చేష్టలతో అద్భుత, హాస్య రసాలు కూడా తగు పాళ్ళలో చేరిస్తే మరింత బాగుంటుంది. కానీ, ఈ చిత్రంలో అవన్నీ దేనికవిగా మిగిలాయి. కలసికట్టుగా కుదరలేదు. పైగా, మామూలు ఘట్టాలుగానే వచ్చాయి తప్ప, మనస్సును ఆర్ద్రపరిచే అనుభవాలుగా మారలేదు.

సినిమా అనేది నటీనటులు, సాంకేతిక నిపుణుల సమష్టి కృషి అయిన సమాహార కళ కావడంతో ఏ విభాగంలోని ఏ చిన్న లోపమైనా, ఇతర విభాగాలపై ప్రభావం చూపుతుంది. అది అనివార్యం. 'శ్రీరామరాజ్యం'కూ అదే జరిగింది. ఇంతటి ప్రచార ఆర్భాటంలోనూ, దేవతా వస్త్రాల కథలో లాగా అందరి ఆహా ఓహోల మధ్యలోనూ సినిమాకు ప్రేక్షకులూ, వసూళ్ళూ తక్కువగా ఉండడానికి కారణం అదే.

ఈ సినిమాకు సంబంధించి మారు మాట్లాడకుండా మెచ్చుకోవాల్సింది మాత్రం - నిర్మాతనే. లాభనష్టాల ధ్యాస లేకుండా, ఈ కథను ఈ తరం వారికి అందించాలన్న ఆయన కృత నిశ్చయానికి జోహార్లు. అందుకోసం ఆయన సర్వశక్తులూ కేంద్రీకరించి చేసిన వ్యయం సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. ఈ పౌరాణిక చిత్రం ఈ రోజుల్లో ప్రతి ఫ్రేములో ఇంత రిచ్ గా కనబడడానికి ఆయనే కారణం. యూనిట్ ను నమ్మి ఆయన పెట్టిన ప్రతి పైసానూ తెర మీద కళకళలాడే దృశ్యాల్లో చూడవచ్చు. కరెన్సీ కట్టల కోసమే సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో ఇప్పటి తరం కోసం, ఇలాంటి చిత్రం తీయాలనే ఈ రకం నిర్మాత ఉండడమే పెద్ద విచిత్రం, విశేషం. తమ ఊళ్ళోని ఆలయంలో వెలసిన శ్రీరామచంద్రుణ్ణి నమ్ముకొని ఆయన ఇంత సాహసం చేశారు. ఆ భక్తి శ్రద్ధలూ, నిజాయితీలే ఆయనకూ, ఈ సినిమాకూ శ్రీరామరక్ష. ఆయన కోసమైతే ఈ సినిమా అందరం తప్పనిసరిగా చూడాల్సిందే. ఉత్తర రామాయణ గాథను బాపు - రమణల బాణీలో ఈ తరం పిల్లలకూ చూపాల్సిందే.

కొసమెరుపు --

పౌరాణిక చిత్రాలతో ఇంటింటా దేవుడిగా వెలిసిన పెద్ద ఎన్.టి.ఆర్.కు నిజజీవితంలో వీపు మీద ఎడమవైపున చింతగింజంత పుట్టుమచ్చ ఉంటుంది. ఆయన సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంటుంది. గమ్మత్తేమిటంటే, ఆయన కుమారుడైన బాలకృష్ణకు ఈ సినిమాలో కావాలని వీపు మీద పెట్టుడు పుట్టుమచ్చను మేకప్ లో సృష్టించారు. అయినా వారసత్వ హీరోల వెర్రి కానీ, ఈ పెట్టుమచ్చలతో పెద్దాయనను అనుకరించే కన్నా, ఆ అనుకరణేదో ఇలాంటి పాత్రపోషణ సందర్భంలో ఆయన పాటించే నియమాలు, చేసే కఠోర పరిశ్రమలో ఉండి ఉంటే, ఈ ముదురు రాముడు కూడా తెరపై మరింత అందంగా ఉండేవాడేమో...!?

అన్నట్లు, 'శ్రీరామరాజ్యం' చిత్ర నిర్మాణం మొదలైనప్పుడు ఈ సినిమాలో భరతుడి పాత్ర సాయికుమార్ పోషిస్తున్నట్లు దర్శక, నిర్మాతలు చెప్పారు. తీరా ఏమైందో కానీ, సినిమా విడుదలయ్యాక తెర మీద మాత్రం భరతుడి పాత్రలో నటుడు సమీర్ కనిపించారు. అయితే, ఈ సినిమా గురించి టీవీల్లో, పేపర్లలో, ఇంటర్నెట్ లో విపరీతమైన హడావిడి చేస్తున్న మీడియాలో కొందరు సినిమా విడుదల రోజు దాకా భరతుడిగా సాయికుమార్ అని రాస్తూ వచ్చారు. అంతే కాదు, తీరా సినిమా విడుదలయ్యాక కూడా ఇప్పటికీ భరతుడిగా సాయికుమార్ నటించినట్లు రాస్తూనే ఉండడం చిత్రాతిచిత్రం. విడుదలకు ముందు వివరాలు కనుక్కొని రాయకపోతే మానె, కనీసం విడుదలై కళ్ళారా సినిమా చూశాకైనా తప్పు దిద్దుకోకపోతే.... ఇంకేమనాలి..!?

రామ......! రామ.....!

23 వ్యాఖ్యలు:

Anil Dasari said...

The best review on a Telugu movie I've seen in years. Bravo. Very very well done. I hope folks from the famous 'Empty Head' site will read this and learn a lesson or two on how to review a movie.

Gowri Kirubanandan said...

శ్రీ రామరాజ్యం సినిమా గురించి చాలా చక్కగా, సాంకేతిక పరంగా, నటన పరంగా అన్ని కోణాలనూ ప్రస్తావిస్తూ విశ్లేషించారు. ముఖ్యంగా వీపు మీద పుట్టుమచ్చ గురించి మీరు చెప్పింది అక్షర సత్యం. హీరోల వారసత్వం వెర్రిగా కొనియాడ బడటం తెలుగు ప్రేక్షకుల దురదృష్టం.
--
Gowri Kirubanandan

sri said...

wonderful analysis in every review.what was expected,what was seen,why the difference, where we feel some missings in a lucid manner
told by jayadeva garu. This is the reason ishtapadi nijamga ishtapade.

వేణూశ్రీకాంత్ said...

ఇప్పటివరకూ చదివిన సమీక్షలలో అద్భుతమైన సమీక్ష జయదేవ గారు. చాలా బాగా రాశారు. కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం రెండవ వారం నుండి మెరుగుపడిందని విన్నాను. చిన్నలోపాలే పెద్ద శాపాలైనాయి ప్రేక్షకుని రసాస్వాదనకు అడ్డంపడతాయి అనే మీ ఆభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించలేను. ప్రతిభావంతులైన దర్శకుని చిత్రం కనుక ఈ లోపాలు కూడా లేకుంటే ఒక అద్భుతమైన కావ్యమై ఉండేది కానీ ఇపుడు కూడా సాధారణ ప్రేక్షకుడు చిత్రంలో లీనమై బాగానే ఆస్వాదించగలుగుతున్నారని నా అభిప్రాయం.

మీ సమీక్షకు లింకును నా బజ్ మిత్రులతో పంచుకున్నాను మీకు అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నాను.
https://plus.google.com/117385813833830611794/posts/NQMgBE2y7P5?authuser=0

యశోదకృష్ణ said...

mee analysis baagundi, రాముడి ప్రాణానికా, జానకి దేహానికా ee sentence naaku baaga nachhindi. bapu mark shots bagunnayi.

Anonymous said...

చాలా మంచి సమీక్ష . ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని ఆరోజుల్లోనే అంత వుత్తమ స్థాయి ' లవకుశ ' ను నిర్మించగలిగితే , అత్యున్నతమైన సాంకేతికతతో , కోటానుకోట్ల పెట్టుబడితో తీసిన ఈ సినిమా ను ఇంకా అందం గా మలచి వుండవచ్చు . నా మనసులో మెదిలిన ప్రతిభావానికీ అక్షర రూపం యిందులో వుంది. అయితే , ఏదో గతానుగతికం గా కాకుండా తార్కికంగా విశ్లేషించిన మీ మీద వీర బాపు భక్తులు , నాలుగు రాళ్లేయడానికి సిద్ధమై వస్తారు , కాస్త కాచుకోండి .

ఆ.సౌమ్య said...

very nice review...enjoyed it thoroughly!

Gopal said...

శ్రీ రమణ గారు లేకపోవడం కూడా చిత్రంయొక్క నాణ్యత తగ్గడానికి కారణమై ఉండవచ్చుకదా. చిత్రం నిర్మించే టప్పుడు, తరువాత రచయిత కనక చిత్రాన్ని చూస్తే తనదృష్టితో చిత్ర నిర్మాణం జరిగిందా లేదా అన్నది చూసి సరి చేయించుకునే అవకాశం ఉండేది. ఆ మహానుభావుడు లేకపోవడం కూడా ఈ చిత్రం యొక్క నాణ్యత తగ్గడానికి కారణమై ఉండవచ్చు

Anonymous said...

*స్క్రిప్టుకు ప్రధానమైన ఈ అంశాల్లో రాముడి మానసిక సంఘర్షణ, భర్తృ వియోగ బాధతో సీతా సాధ్వి వేదన, తల్లితండ్రులు అని తెలియకుండానే శ్రీరాముడి మీద, సీతమ్మ మీద లవకుశులు గౌరవ అనురాగాలు పెంచుకోవడం, రాముడు సీతమ్మను కారడవుల పాలు చేశాడని తెలిసి సాక్షాత్తూ ఆయననే తిరస్కరించడం లాంటివి ఎంత బాగా ఎలివేట్ అయితే, తెరపై కథ అంత బాగా పండుతుంది. దానికి బాల లవకుశుల చేష్టలతో అద్భుత, హాస్య రసాలు కూడా తగు పాళ్ళలో చేరిస్తే మరింత బాగుంటుంది. కానీ, ఈ చిత్రంలో అవన్నీ దేనికవిగా మిగిలాయి. కలసికట్టుగా కుదరలేదు. పైగా, మామూలు ఘట్టాలుగానే వచ్చాయి తప్ప, మనస్సును ఆర్ద్రపరిచే అనుభవాలుగా మారలేదు. *

ఇప్పటివరకు మీరు రాసిన విశ్లేషణ పైన రాసిన మీ అభిప్రాయాలను దృష్ట్టిలో పెట్టుకొని రాశారనిపించిది. అందులో ఎవీ కొత్తగా చెప్పుకొదగ్గవి లేదు. ఆ అభిప్రాయాలన్ని పాత లవకుశ సినేమా చూసిన ప్రతివారికి అనుభూతులుగా కలుగుతాయి. ఈ సినేమాను పాత లవకుశ మాదిరిగా, అంజలిదేవి ని దిగులుగా, గుబులుగా, కదిలిస్తె బోరు మని ఏడుస్తూ తీసి ఉంటే చూసే ప్రేక్షకులకి రసానుభూతి కలిగి ఉండేదేమో! బాపు రమణలు ఈ సినేమా లో సీతను పరిణతి చెందిన, ఆత్మవిశ్వాసం గల వనితగా చూపించారు. అందువలన మీరు చెప్పిన రాసానుభూతులు కొంచెం తక్కువయ్యి ఉండవచ్చు.
ఇళయరాజా సంగీతం మీద మీరు రాసిన అభిప్రాయాన్ని అంగీకరించను. లవకుశ సినేమా పేర్లేసేటప్పుడుయ్ నాదస్వరం వినిపిస్తారు. ఆసినేమాకి, ఆకాలానికి, ఆ బడ్జేట్ కి తగిన సంగీతం. అదే ఈ సినేమాలో ఇళయరాజా ఎంతో చక్కని సంగీతం అదించారు, భారితనానికి, సేటింగ్సికి తగిన విధంగా. ఫైస్టార్ హోటల్ కి వేళితే కదరి గోపాలనాథ్ saxophone వినిపిస్తూ ఉంటారు, అంతే కాని నాదస్వరం ఎక్కడా ప్లే చేసినట్టు చూడలేదు. కారణం స్టార్ హోటల్ రిచ్ నేస్కి ఆ వాద్యం మూడు ఎలివేట్ చేస్తుంది. అలాగే బాపు దృశ్యానికి, రమణ మాటలకి, ఇళాయ రాజా సంగీతం చాలా సరిగ్గా సరిపోయింది. పాత సినేమాలో పాటలు ఒకింత ఎక్కువ ఎమోషన్ ఆకాలనికి తగినట్టుగా కలిగి ఉన్నాయి. ఇళయరాజా సంగీతం గురించి ఇక్కడ ఎక్కువ చర్చ జరిగింది చదివేది.
http://navatarangam.com/2011/11/sriramarajyam_review/
__________________________
మీరు పైకి అందరిలాగా చెప్పక పోయినా లవకుశ ను చూసిన కన్నులతో ఈ సినేమాని చూసి విశ్లేషించారని తెలిసి పోతున్నాది. వయసులో పెద్దవారైన బాపు రమణలే మీలాంటి వారికన్నా ముందు చూపుతో ఆలోచించి సీత పాత్ర విశిష్ట్టతను దృష్ట్టీలో ఉంచుకొని, ఆకోణంలో ఈ సినేమాను పాత సినేమా కంటె బాగా తీశారని అనిపించిది. మీరు ప్రస్థావించిన కొన్ని టెక్నికల్ మిస్ టేక్స్ తో మాత్రమే ఏకీభవిస్తాను. మీరు రాసిన వాటికన్నాఇంకా రెండు మూడు అదనంగా రాయగలను. వీలు చూసుకొని మళ్లి రాస్తాను.

విజయవర్ధన్ (Vijayavardhan) said...

మీకు బాపు రమణ గార్లంటే ఎంత గౌరవమో నాకు బాగా తెలుసు. ఐనా మీకు అనిపించింది నిజాయితీగా వ్రాసారు. "శ్రీ రామాంజేయ యుద్ధం"లో ఆంజనేయుడు రాముడితో యుద్ధము చేయాల్సివచ్చినపుడు పడే సంఘర్షణ గుర్తుకొస్తుంది.

సినిమా సమిష్టి కృషితోనే సాధ్యమవుతుంది. కాబట్టి కొన్ని అంశాలు బాపు గారు అనుకున్నట్టుగా కుదరకపోయివుండవచ్చు. ఐతే రాముడు సీతను అడివికి పంపే ముందు మథన పడే సన్నివేశం నాకు చాలా నచ్చింది. అంత convincingగా పాత "లవ కుశ" లో కూడా లేదు.

Anonymous said...

అద్భుతమైన సమీక్ష. మీరు చెప్పిన 'లోపాల' వల్లనే ఈ సినిమా విఫలమైతే నాకు అంతకన్నా సంతోషకరమైన విషయం ఉండదు. అంటే తెలుగు ప్రేక్షకులు అంత గొప్పగా ఒక సినిమాయొక్క బాగోగుల్ని పట్టించుకుంటున్నారన్నమాట. వాళ్ళ అభిరుచీ, స్టాండర్డూ అంత గొప్పగా ఉన్నాయన్నమాట.

నాకర్థమైనంతలో మీరు పేర్కొన్న లోపాలు -

1. పేరుకీ సినిమాకీ సంబంధం లేకపోవడం

2. సీతారాముల మధ్య సున్నితమైన, సంస్కారవంతమైన‌ శృంగార దృశ్యాలు చూసి మూతి ముడుచుకున్న మహాభక్తులైన తెలుగు ప్రేక్షకులు. (ఈ ప్రేక్షకులేనా రాఘవేంద్రరావుగారి భక్తి-రక్తి సినిమాలకి బ్రహ్మరథం పట్టినది? లేకపోతే వాళ్ళు వేరేమో!)

3. బాలయ్య శరీరం, మేకప్.

4. సీతమ్మ మానసిక సంఘర్షణను వెల్లడించేలా తెరపై పండే సీన్లు లేవు. డబ్బింగ్ డామినేట్ చేసింది.

5. అక్కినేని ముసలితనం, చిన్నదైన ఎడమ కన్ను.

6. బాలరాజు వయసు పెరగదు.

7. దుశ్శాసనుడిలా ఉన్న లక్ష్మణుడు, అతని బ్యాండు మేళం దుస్తులు. (హతవిధీ. మూడుసార్లు సినిమా చూసిన నాకు అలా ఒక్కసారికూడా అనిపించనే లేదు.)

8. ఓ సీన్లో పెగలని హనుమంతుడి నోరు, కానీ డైలాగు మాత్రం వినిపిస్తుంది. హనుమంతుడి కండలు కూడా జారిపోతున్నాయి. (టీ.వీ రామాయణ్ లో దారాసింగ్ అంత కాదేమో??)

9. బాలయ్య డైలాగులు. (పాపం ప్రేక్షకులకి సమరసింహారెడ్డి డైలాగుల్లా వినిపిస్తున్నాయేమో??)

10. కె. ఆర్. విజయ ముసలితనం, ఏడుపు. ఏడుస్తున్న తల్లి కొడుకుని చూసి ఏడుపు కంటిన్యూ చెయ్యకుండా సంబాళించుకోవడం.

11. భూదేవి భారీ కాయం.

12. ఋష్యశృంగుడి బాడి లాంగ్వేజి, కొమ్ము లేకపోవడం. ఒకే ఒక్క సీన్లో.

13. రచయితకి నచ్చని రీ‍రికార్డింగ్. చాలామందికి ఇదే అద్భుతంగా ఉందనిపించింది.

14. ఒకటి,రెండు తప్ప మిగతా పాటలు గొప్పగా లేవు.

15. పాటల్లో కొంచం ఎబ్బెట్టుగా ఉన్న స్టెప్సు.

16. సరిగ్గా అతకని గ్రాఫిక్సు.

17. గ్రాఫిక్సులో కనిపించే సూర్యుడి బొమ్మని చూసి హాలులో ప్రేక్షక జనం హాహాకారం చేయడం ఒక్కటే తక్కువ. (మూడు సార్లు వరసగా ఆ సినిమాని దీక్షగా చూసినా నా కళ్ళకి ఆ బొమ్మలో లోటేమీ కనిపించలేదు.)

18. రసభంగం కలిగించే కెమెరా యాంగిల్సు. (ఈ విషయంలో నేనో పామరుణ్ణి. నాకు దీన్లో రసభంగం ఎక్కడా కలగలా...)

19. ఘట్టాలు మనస్సును ఆర్ద్రపరిచే అనుభవాలుగా మారలేదు. (నాకు మొదటి రెండుసార్లు సినిమా చూసినప్పుడు నాలుగైదుసార్లు ఏడుపు వచ్చింది.)

20. 'దేవతావస్త్రాల కథలోలాగా అందరి ఆహా ఓహోలు'. ఇది మొత్తం సమీక్షలో అత్యద్భుతమైన కామెంటు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోబిగ్గెస్టు హిట్లైన సినిమాలు భౌతికవస్త్రాలు. ఈ సినిమా ఒక దేవతావస్త్రం. అయ్యా, మీకు హేట్సాఫ్. పాదాభివందనం.


ఇవండీ ఈ సినిమాలో లోపాలు. ఈ లోపాల‌వల్ల తెలుగు ప్రేక్షకులకి 'రసభంగమై', 'రసానుభవాన్ని' పొందలేక, మనసులో ఆర్ద్రతాభావాన్ని పొందలేక ఈ సినిమాని తిరస్కరిస్తూ ఉన్నారు. అద్భుతం. అత్యద్భుతం.

ఈరోజు ఈ వ్యాసాలు చదివాక‌ నాకు తెలుగు సినిమా ప్రేక్షకులు హిమాలయమంత ఎత్తులో కనపడుతున్నారు. నేనే అపార్థం చేసుకున్నాను. అవును, తెలుగు ప్రేక్షకుల స్టాండర్డ్ కి ఈ సినిమా చాలదు.

రచయితకి ఒక మనవి. అయ్యా, గత పదీ, ఇరవై ఏళ్ళలో మీరు 'రసానుభూతి'చెంది ఆస్వాదించిన తెలుగు సినిమాల లిస్టుని నాకు ఇస్తే వాటిని అర్జంటుగా డీవీడీలు కొనుక్కుని చూసి, నా స్టాండర్డ్ ని పెంచుకోవాలని నాకు చాలా కోరికగా ఉంది. దయచేసి చెప్పండి.

కనీసం 1985 తర్వాత వచ్చిన, శ్రీరామరాజ్యం కన్నా గొప్పగా ఉండే, తెలుగు పౌరాణిక చిత్రం ఏదన్నా ఉంటే నాకు తెలియజెయ్యండి. నాకు చూడాలని ఉంది.

అపార్థం చేసుకోకండి. నేనో అజ్ఞానిని. రెండేళ్ళకో తెలుగు సినిమా చూసే, వెనకబడిన జీవిని. మిమ్మల్ని తక్కువ చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు. మీరు ఒక ప్రొఫెషనల్ రైటర్ అనీ, గొప్ప విమర్శకులనీ నాకు తెలుసు. మీ మీద నాకు చాలా గౌరవం. ఇండియా టుడే లో చాలా కాలం క్రితం మీ రచనలు చదివి చాలా ఆనందిస్తూ ఉండేవాణ్ణి.

ఈ సినిమా పైన మీ విమర్శ యథాతథంగా నాకు అంగీకారమే. కానీ మీరు చేసిన‌ కొన్ని కామెంట్లు శృతి మించాయనిపించింది. అందుకే కొంచం ఆవేదనగా ఈ కామెంటు రాశాను.

కొత్త పాళీ said...

జయదేవ్ గారూ, చాలా బాగుంది. ఇంత ఓపిగ్గా అనేక లోతైన కథా విషయాలు, సంకేతిక విషయాలు వివరిస్తూ రాసిన మీకు జోహార్లు! కానీ నిన్న ఏకబిగిని మూడు టపాలూ చదివి కొంచెం అలిగాను. అందుకే వెంటనే వ్యాఖ్య రాయలేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెమ్మదిగా అన్ని భాగాలూ చదివాను. మీ విమర్శలు సహేతుకమే. ఐతే, వోల్మొత్తం సినిమా గురించి నా వుద్దేశం ఏమిటంటే, ఈ లోపాలు ఉన్నా సినిమాని ఆస్వాదించేందుకు ఇవేవీ అడ్డం కాలేదనే. దానికి నేనే నిదర్శనం. ఏ సినిమా అయినా ఆటోమేటిగ్గా టైటిల్సు దగ్గర్నించీ శుభం కార్డుదాకా గుచ్చి గుచ్చి చూసే నాకు, అసలు అలా చూడాలి అని తోచను కూడా లేదు.
ఇది చెబుతున్నది నా అనుభవాన్ని పంచుకోవడానికి మాత్రమే, మీ విమర్శని విమర్శించడానికి కాదు. బాగున్న సినిమా పర్ఫెక్టుగా ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదుగా! విపులమైన విమర్శకి మరోసారి అభినందనలు.

కొత్త పాళీ said...

@ విజయ వర్ధన్,
"ఐతే రాముడు సీతను అడివికి పంపే ముందు మథన పడే సన్నివేశం నాకు చాలా నచ్చింది. అంత convincingగా పాత "లవ కుశ" లో కూడా లేదు."
Very well said.
రామారావుగారి రాముడు ఉదాత్తంగా ఎక్కడో మనకి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆయన దుఃఖపడినా ఏడ్చినా అదీ ఉదాత్తంగానే ఉన్నది. బాలకృష్ణ రాముడు మనకి దగ్గరగా మనవాడే అనేట్టుగా ఉన్నాడు. అందుకే అతని దుఃఖం మనకీ కంటతడి పెట్టించింది.

9thhouse.org said...

నా అభిప్రాయం ప్రకారం తెలుగు ప్రేక్షకులు ఒకవేళ ఈ సినిమాని తిరస్కరిస్తే దానికి బహుశా రెండు కారణాలు.

1. తెలుగు ప్రేక్షకులు వ్యక్తి ఆరాధకులు. ఎన్టీఆర్ రాముడిగా, ఎస్వీఆర్ రావణుడిగా, నాగయ్య వాల్మీకిగా లేకపోతే పౌరాణికాలు చూడరు. భవిష్యత్తులో గ్రాఫిక్సు ఉపయోగించి ఈ కేరెక్టర్లు సృష్టించి పౌరాణిక సినిమాలు తీసుకుంటే నయం.

2. పౌరాణికాలంటే సురభి నాటకాల మార్కు పౌరాణికాలైతేనే, అందులో పద్యాలుంటేనే నచ్చుతాయి.

పైకారణాల వల్ల ఈ సినిమా జనాలకి నచ్చకపోతే తప్పేం లేదు. బాపు పౌరాణికాలు పెద్ద హిట్లేం కాదు. ఆయన మాస్టర్ పీస్ అయిన సీతాకల్యాణం కమర్షియల్ గా పెద్ద వైఫల్యం. (అందులో రాముడిగా ఓ ఎరిగున్న ఫేస్ లేకపోవడం ప్రధాన కారణాల్లో ఒకటి.)

ఒక టేస్టుకి అలవాటు పడ్డవాళ్ళకి మరొక టేస్టు నచ్చకపోవడం విడ్డూరం కాదు. ఇడ్లీ ఇష్టపడేవాడికి ఉప్మా నచ్చకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఆ మాట చెప్పకుండా ఉప్మాలో కరివేపాకు కొద్దిగా మాడింది, పోపు గింజలు కొద్దిగా ఎక్కువయ్యాయి, ఇలాంటి చిన్న, చిన్న లోపాలవల్ల అసలు ఉప్మాయే బాగాలేదు అనడం పొరపాటు. ఉప్మా ఇష్టమైనవాడికి చిన్న, చిన్న లోపాలున్నా మొత్తంగా బాగాచేస్తే బాగానే నచ్చుతుంది.

Anonymous said...

*బాలరాజు వయసు పెరగదు*

ఆ ప్రశ్న వేసిన వారికి హనుమంతుడు అసలికి మనిషి గా ఎలా మారాడని ప్రశ్నించుకోవాలి?

Anonymous said...

మీరు రెండు పాత్రలను అనాలిసి చేయటం మరచి పోయారు ఒకరు నారదుడు రేండో వారు తుంబురుడు:-)

చదువరి said...

"తనకు మాత్రమే ప్రత్యేకమైన ఫ్రేములతో దృశ్యాలను కన్నులపండుగ చేశారు." - సమీక్ష మొత్తం చాలా హోమోజెనస్ గా ఉంది, ఇలాంటి ఒకటీ రెండు పానకంలో పుడకలు తప్ప.

(నేను సినిమా చూళ్ళేదు. ఈ సమీక్ష చదివి ఇది రాసాను.)

Chowdary said...

జయదేవ్ గారూ:

విపులంగా వ్రాశారు. సంతోషం.

ఇంతకీ, సినిమాకి వెళ్ళినప్పుడు మీరు, మీ మిత్రులు ఏ మూడ్‌లో ఉన్నారేమిటి?

మీ సమీక్ష చదువుతుంటే గుర్తొచ్చిన సంగతి. సీతాకల్యాణం విడుదలైన రోజున గుంటూర్లో కాలేజీ మిత్రులందరితో కలసి చూశాను; ఎందుకనో సినిమా ప్రారంభంలో విశ్వామిత్రుడి వేషం వేస్తున్న ముక్కామలను చూసి మిత్రబృందం జోకులు వేయటం మొదలుబెట్టింది. అక్కడనుండీ సినిమా అయ్యేవరకూ హాలంతా ఒకటే నవ్వులు; ఆ పూట ఆ హాల్లో సినిమా చూసిన వారందరికీ అది గొప్ప హాస్సె చిత్రంగా అనిపించింది. సీతాకల్యాణం ఎలాంటి చిత్రమో మీకు నేను చెప్పక్కర్లేదు.

శ్రీరామరాజ్యం చిత్రాన్ని నేను మీకంటే వేరే మూడ్‌లో చూసినట్టున్నాను, రెండు సార్లూ. మధ్యలో లవకుశ కూడా డివిడిలో చూశాను. నాకు కనిపించిన లోపాలు ఈ చిత్రాన్ని ఆనందించడానికి నాకు ఏమాత్రం అడ్డం రాలేదు. ఉదాహరణకు నాగేశ్వరరావు చిన్న కన్ను, రోజా భారీతనమూ, గ్రాఫిక్స్ జింకలూ నాకెట్టి ఇబ్బందీ కలిగించలేదు. వశిష్టుడిగా బాలయ్య గొంతు, కౌసల్యగా కె.ఆర్.విజయ ఆహార్యమూ, ఆవిడ ఏడుపూ మాత్రం కొద్దిగా ఇబ్బంది పెట్టాయి కానీ పెద్దగా పట్టించుకోవలసిన స్థాయిలో మాత్రం కాదు.

మీకు లోపాలుగా కనిపించిన కొన్ని నాకూ లోపాలుగానే కనిపించాయి. కొన్ని అలా అనిపించలేదు. ఉదాహరణకు సునీత అతిగా చేసింది అనుకోవటంలేదు; సీత పాత్ర అంత బలమైన ముద్ర వేయటానికి కారణాల్లో సునీత గాత్రధారణది ముఖ్యపాత్ర అనుకొంటున్నాను. (ధర్మఘంటను విని శయ్యామందిరంలోంచి హడావిడిగా బయలుదేరబోతాడు శ్రీరాముడు. ఆయన ఉత్తరీయాన్ని పట్టుకొని ఆపుతుంది సీత. వెనక్కి తిరిగి చూస్తాడు రాముడు. ఉత్తరీయం పైనుంచి కళ్ళు కొద్దిగా పైకెత్తి చూస్తూ నవ్వుతుంటుంది సీత. తాంబూలం అని సాగదీస్తూ కొంటెగా ఆమె గొంతు. బాపురే!)

మీతో నేను బొత్తిగా ఏకీభవించని విషయం: రాముడు సీతని అడవికి పంపించటానికి నిర్ణయం తీసుకొన్న దృశ్యాన్ని (దాని ముందువెనుకల శయ్యాగృహం దృశ్యాలతో కలిపి) రమణ గారు చాలా బాగా వ్రాశారని, బాపు అద్భుతంగా చిత్రీకరించారని, బాలకృష్ణ బాగా చేశాడని నేను అనుకొన్నాను.

చిత్రమంతా బాపుగారి ఫ్రేమింగ్, టైట్ క్లోజప్స్, పెర్స్పెక్టివ్ షాట్స్, క్రేన్ అండ్ ట్రాలీల వాడుక గొప్పగా ఉన్నాయి. ఇక రాముడికీ సీతకూ ఇచ్చిన భంగిమలు, వాటిని ఫ్రేం చేసిన తీరూ చూస్తుంటే నాకైతే లీలాజనార్దనం బొమ్మలే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చాయి.

ఈ చిత్రాన్ని శబ్దం లేకుండా చూసినా, చిత్రం లేకుండా శబ్దం మాత్రమే వింటున్నా కూడా ఆనందించవచ్చని అనిపించింది నాకు.

ఈ నిర్మాతను అభినందించాలి అన్న విషయంలో మీతో నూటికి నూరు పాళ్ళూ ఏకీభవిస్తున్నాను.

ఈ చిత్రం లవకుశ కాదు, శ్రీ రామరాజ్యం. కొన్నివిషయాల్లో ఈ చిత్రం లవకుశ కన్నా చాలా బాగుంది.

-- జంపాల చౌదరి

Mauli said...

బాపు సినిమానో ,బాలకృష్ణ సినిమానో అని చూసే వారికి ఇవేమీ అనుభవంలోకి రావండీ. వివరం తెలికుండా, సామాన్య ప్రేక్షకుడి కి కలిగే అసౌకర్యాలను ఓపిగ్గా వివరించారు.

నాకయితే ఇప్పటి వరకు చివరికొచ్చేసరికి మాత్రం, భర్త కాస్త ఎక్కువ సమానమని చూపే బాపు, ఈ సినిమాకి మాత్రం వ్యత్యాసం చూపడం నచ్చింది :)

మీ విశ్లేషణ కు సాధికారం గా స్పందించ గలిగేది ఒక్క ఎం.బి. యస్ గారే ..ఆ మధ్య ఇంకో టపా ఏదో వస్తే కూడా చక్కగా సమాధానం చెప్పారు.

Anonymous said...

అద్సరే. గొప్ప హిట్లుగా నిలిచిన అన్నమయ్య, రామదాసులు అందిపుచ్చుకున్న సువర్ణావకాశాలంటారా? కాకపోతే మరేమంటారు? జనాలు మెచ్చిన సినిమా కాబట్టి గొప్పవా? ఈ తరహా రివ్యూ చేస్తే ఆ రెండు సినిమాల గతేమిటా అని నేను ఆశ్చర్యపోతున్నా.

Anonymous said...

రాక రాక ఒక మంచి సినిమా (మీ స్టాండర్డ్‌లో కాదనుకోండి) వస్తే, ఉడుతా భక్తిగా దాన్ని ప్రోత్సహించకుండా ఇంత అనాలిసిస్ అవసరమా? నేను మీతో ఏకిభవించను. శ్రీ రామ రాజ్యం అందరూ చూడదగ్గ చిత్రం.

Vivek said...

పౌరాణికాలకు పెట్టింది పేరైన మన తెలుగు చిత్ర పరిశ్రమలో 14 ఏళ్ళ తరువాత వచ్చిన పూర్తిస్థాయి పౌరాణిక చిత్రం - ఈ 'శ్రీరామరాజ్యం'. దీనికి ముందు తెలుగులో ఆఖరుగా వచ్చిన నేరు పౌరాణిక చిత్రం చిన్న ఎన్టీయార్ పసివయసులో రాముడిగా నటించిన బాలల చిత్రం 'రామాయణం' (1997).
------------------------------
Mari Annamayya pouranikam kada?

Unknown said...

@ Vivek garu,
Namaste. ANNAMAYYA, RAMADASU laantivi mana madhya batikina manushula kathalu kaabatti, cine charithra lo 'Biographical pictures' (Jeevitha Charitralu)category loki vastaayi - vaatilo Devudu, bhakti prastaavana unnappatiki!