జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, October 7, 2015

మూడేళ్ల తరువాత నిర్మాతలుండరేమో! - నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌తో ప్రత్యేక భేటీ

మూడేళ్ల తరువాత నిర్మాతలుండరేమో!
అరవై ఏళ్ళ జీవితం... నిర్మాతగా ముప్ఫై ఏళ్ళ కెరీర్... రిలీజ్‌కు రెడీగా 
34వ సినిమా (‘శివమ్’)... షూటింగ్‌లో మరో సినిమా (‘హరికథ’)... 
వెరసి ‘స్రవంతి’ రవికిశోర్‌కు పాత జ్ఞాపకాలు, కొత్త అనుభవాలూ 
బోలెడు. వ్యాపారంగానే సినిమాల్లోకి వచ్చినా, తీస్తున్న సినిమాల్లో 
మనసు లెక్కలు మర్చిపోరీ ఆలిండియా సి.ఏ. ర్యాంకర్. ముప్ఫై 
ఏళ్ళ క్రితం ‘లేడీస్ టైలర్’తో మొదలుపెట్టిన ఆయన - ఈ 
అక్టోబర్ 2న ‘శివమ్’తో పలకరించ నున్నారు. ఈ సందర్భంగా 
ఆయనతో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ...

 ఈ ముప్ఫై ఏళ్ళ జర్నీని తలుచుకొంటే ఏమనిపిస్తుంటుంది?
 వ్యాపారంగానే సినిమాల్లోకొచ్చా. వచ్చాక వంశీ, తనికెళ్ళ, సీతారామ
శాస్త్రి, ఇళయరాజా మొదలు ఇవాళ్టి దేవిశ్రీ ప్రసాద్ దాకా ఎందరో
క్రియేటివ్ పీపుల్‌తో కలసి జర్నీ చేశా. ఈ అదృష్టం ఎందరికొస్తుంది!
 సినిమాల్లోకి రాక పోతే, ఎవరి లెక్కల్లోనో తప్పులు దిద్దుతూ, పి.వి.
 రవికిశోర్‌గా మిగిలేవాణ్ణి.

 అసలు సినిమా రంగంలోకి తొలి అడుగు ఎలా వేశారు?
 సినిమాల్లోకి రావడం నా డ్రీమ్ ఏమీ కాదు. అప్పట్లో దర్శకుడు వంశీతో
పరిచయంతో ‘ఆలాపన’ లాంటి షూటింగ్‌లకెళ్ళేవాణ్ణి. జర్నలిస్టు
వేమూరి సత్యనారాయణ లాంటి వాళ్ళు తోడయ్యారు. ఒకసారి
అరకులో ఉండగా తొలిచిత్రం ‘లేడీస్‌టైలర్’ (1986)కి బీజం పడింది.
అది గట్టి పునాది. అప్పటి నుంచి ‘నువ్వేకావాలి’ మీదుగా ఇప్పటి
దాకా జర్నీ కంటిన్యూస్.

నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్‌లోనూ ఉన్నట్లున్నారు?
 అవును. 1987 నుంచే డిస్ట్రిబ్యూషన్‌లోనూ ఉన్నా. కాకపోతే,
నిర్మాతగా చేతిలో 13 పేకముక్కలుంటాయి. ఉన్న ముక్కలేమిటో
మనకు తెలుసు. కానీ, డిస్ట్రిబ్యూషన్ మూడు ముక్కలాట లాంటిది.
ఏ ముక్కలో ఏముందో తెలియకుండా పందెం కాస్తాం. అలా చాలా
 డబ్బులు పొగొట్టుకున్నా. చేదు అనుభవాలెదురైనా, పెట్టాబేడా
సర్దుకొని వెళ్ళిపోదామని అనుకోలేదు.

 లేడీస్ టైలర్’ నాటికీ, ఇప్పటికీ చిత్ర నిర్మాణంలోని 
మార్పులపై మీ వ్యాఖ్య?
 అప్పట్లో నూటికి 90 మంది గుడికెళ్ళినంత పవిత్రంగా ఈ రంగాని కొచ్చేవారు.
ఇవాళ నూటికి 70 మంది సినిమాపై మోజుతో వస్తు న్నారు. నౌ ఉయ్
ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ విత్ అవర్ హెడ్‌‌స. నాట్ విత్ అవర్ హార్‌‌ట్స.

 ఇవాళ ఆడియన్‌‌సలో కూడా చాలా మార్పు వచ్చింది కదా?
 ఒకప్పుడు అర్థవంతమైన పాటలు, సినిమా చూశాక మంచి విషయం
 ఇంటికి తీసుకెళ్ళాలనే ఆలోచన ఉండేవి. ఇప్పుడు వినోదమే ఆశిస్తున్నారు.
 అప్పట్లో కథెక్కువ, కామెడీ తక్కువ. ఇప్పుడు కామెడీ ఎక్కువ,
 కథ తక్కువ. కానీ, మారిన కాలానికి తగ్గట్లు దర్శక, నిర్మాతలం
 మారాల్సిందే. లేకపోతే, మనం హిస్టరీగా మారతాం. ఐ డోంట్ వాంట్
టు బికమ్  పాస్ట్ ఆర్ హిస్టరీ.

 మీ సమకాలీన నిర్మాతల మధ్య పోటీ ఉండేదట...
 శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, అరవింద్, పోకూరి బాబూరావు, గోపాలరెడ్డి -
ఇలా చాలామంది ఉండేవాళ్ళం. హెల్దీ కాంపిటీషనుండేది. ‘భలే భలే
మగాడి వోయ్’ హిట్ తర్వాత అరవింద్ పార్టీ ఇచ్చి, నెక్స్ట్ పార్టీ మీదే అన్నారు.

 మరి మీ రాబోయే ‘శివమ్ ’, ‘హరికథ’ ఎలా ఉంటాయ్?
 ఫ్యామిలీ అంతా చూసే ఎంటర్‌టైనర్ ‘శివమ్ ’. తండ్రీ కూతుళ్ళ మధ్య
 అనుబంధంతో హార్‌‌టటచింగ్‌గా డిసెంబర్‌లో ‘హరికథ’ వస్తుంది.

 ఒక డబ్బింగ్‌తో కలిపి ఈ ఏడాది ఏకంగా 3 సినిమాలు ప్రొడ్యూస్ చేశారే?
 (నవ్వేస్తూ...) ‘రఘువరన్ బిటెక్’ (తమిళ ‘వి.ఐ.పి’) కూడా రీమేక్ చేద్దామనుకున్నా.
కానీ, ధనుష్ బాగా చేశాడని డబ్బింగ్ చేశాం. మిగిలిన రెండు సినిమాలంటారా,
వాటి స్క్రిప్ట్ ముందే చేసేశాం. ఇప్పుడు చేస్తున్నది కేవలం ఎగ్జిక్యూషనే. అందుకే,
ఈసారి మూడు సినిమాలు తీయగలిగా.

 మీ తమ్ముడి కొడుకు రామ్‌తోనే కొన్నేళ్ళుగా సినిమాలు చేస్తున్నారేం?
 ఇప్పుడు డబ్బులు పెట్టేవాళ్ళనే తప్ప, అవసరమైతే హీరోనూ, దర్శ కుణ్ణీ
ప్రశ్నించే నిర్మాతల్ని ఎవరూ ఇష్టపడడం లేదు. కోరుకోవడం లేదు. కోట్లమంది
 ప్రేక్షకులకు నచ్చేది కాకుండా, హీరో ఒక్కడికి నచ్చితే చాలు... కోట్ల మందికి
నచ్చుతుందనే భ్రమలో సినిమా తీయడం వేస్ట్. అందుకే, 2008 నుంచి
రామ్‌తోనే చేస్తున్నా. మా వాడితో అయితే, ఆ సమస్య ఉండదుగా! రామ్ 
అనే హీరో చేయూత లేకపోతే, నేనూ ఇబ్బంది పడేవాణ్ణి.

 ఇంటి హీరో కావడంతో ఆర్థికంగానూ మీకు వెసులుబాటు ఉంటుందేమో!
 (నవ్వుతూ) భారీ అడ్వాన్సులివ్వక్కర్లేదు. దానికి అప్పులు తేనక్కర్లేదు.

 రామ్  కెరీర్‌లో, నిర్ణయాల్లో మీ ప్రభావం?
 సిన్మా చేసేముందు మంచీచెడు చర్చించుకుంటాం. తీసుకెళ్ళిన ప్రాజె క్ట్‌లు
తనకు సరిపోవని, ఎనాలిసిస్‌తో నన్ను కన్విన్‌‌స చేసిన ఘట్టాలున్నాయి. 

 మరి, మీరు అతణ్ణి కన్విన్‌‌స చేసిన సందర్భాలు ?
 రామ్  పూర్తిగా ఇష్టపడకుండా చేసింది ‘మసాలా’. మల్టీస్టారర్ చేయడం
ఇష్టమైనా, క్యారెక్టరైజేషన్ తనకు నచ్చలేదు. నా వల్ల చేయాల్సి వచ్చింది.

 పెదనాన్నగా కాకుండా, హీరోగా రామ్ లో మీకు నచ్చే విషయం?
 ఇంటెలిజెంట్ బాయ్. ఆల్వేస్ ఫోకస్డ్. విశ్లేషణా సామర్థ్యం ఎక్కువ.
పైగా అంత హార్‌‌డవర్‌‌క చేసే హీరోను ఈ మధ్య చూడలేదు. అదే శ్రీరామరక్ష.

 ‘నువ్వేకావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మసాలా’ లాంటివి 
ఇతర నిర్మాత లతో పార్‌‌టనర్‌షిప్‌లో తీశారు. ఇప్పుడలాంటి ప్రయత్నాలు
 మానేశారేం?
 అలా చేస్తే, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కానీ, ఇండిపెండెంట్‌గా
 పనిచేసినవాళ్ళం, మనకి మనం బాస్‌గా కాకుండా, మరొక బాస్ కింద
పని చేయడం కొంత కష్టమే. నిర్ణయానికి మరొకరి కోసం నిరీక్షించడం ఇబ్బందే.

 ఇన్నేళ్ళ కెరీర్‌లో నిర్మాతగా మోస్ట్ డిజప్పాయింటింగ్ ఫిల్మ్?
 (క్షణం ఆలోచించి) ‘ఎందుకంటే ప్రేమంట’. నేను, రామ్ ప్రాణం పెట్టి
పనిచేశాం. ఆడలేదు. అలాంటి తరహాదే ఆమిర్‌ఖాన్ ‘తలాష్’ చేస్తే అది
ఆడింది. ఎక్కడో మేం తప్పు చేశామన్న మాట. ఇక, కెరీర్‌లో బెస్ట్‌ఫిల్మ్
 ‘నువ్వు నాకు నచ్చావ్’. ప్రతి క్షణం ఆస్వాదిస్తూ, చేశా.

  కెరీర్‌లో తీవ్రంగా పశ్చాత్తాపపడిన సందర్భం, సంఘటన?
 అలా ఏమీ లేదు. ప్రతి వ్యక్తినీ, సందర్భాన్నీ ఒకలా అంచనా వేస్తాం.
అది తప్పని తేలితే రెండోసారి జాగ్రత్తపడతాం. అంతకు మించి పగ,
 ప్రతీకారం లాంటివుండకూడదు. నేర్చుకొంటే, ఇక్కడ ప్రతీదీ అనుభవమే.

  రాబోయే రోజుల్లో సినీ నిర్మాణం ఎలా ఉండనుంది?
 తెలుగు పరిశ్రమ గట్టి దెబ్బలు కొట్టడంతో కార్పొరేట్ సంస్థలు
 గుమ్మం దగ్గరే నిలబడిపోయాయి కానీ, అవి వస్తాయి. మూడేళ్ళ
 తర్వాత స్వతంత్ర నిర్మాతలంటూ ఎవరూ మిగలకపోవచ్చు. అసోసియేట్,
లైన్ ప్రొడ్యూసర్, వర్కింగ్ పార్‌‌టనర్‌‌సగా కార్పొరేట్స్‌తో చేతులు
కలపాల్సి వస్తుంది. ‘నువ్వే కావాలి’ టైమ్ కే నేను ఊహించిన పరిణామం
15 ఏళ్ళు ఆలస్యమైంది.

 ఈ 30 ఏళ్ళ సినీ కెరీర్‌లో ఏం తెలుసుకున్నారు?
 అందరిలా తప్పులు చేశాం. సక్సెస్ ప్రమాదకరం. తలకెక్కి తప్పుదోవ
 పట్టిస్తుంది. సక్సెస్ ఒక్కరిది కాదు, టీమ్‌వర్కని మర్చిపోతుంటాం.
అందుకే, ఫెయిల్యూర్ కన్నా సక్సెస్ వచ్చినప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండాలి.

 కొత్తగా రానున్న చిత్ర నిర్మాతలకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
 ఇక్కడ ప్రతివాడూ పక్కవాడి కంటే తాను గొప్పనుకుంటాడు. కాబట్టి,
సలహాలు చెప్పి, నవ్వులపాలు కాకూడదు. ఇక్కడ ఎవరూ వినరు, మారరు.

 మీ ‘స్రవంతి’ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి వారసులు సిద్ధమేనా?
 నా రెండో తమ్ముడి కొడుకు రామ్  హీరో. ఇక, న్యూజిలాండ్‌లో కమర్షి యల్
 పైలట్ కోర్‌‌స చేసిన రామ్  వాళ్ళ అన్నయ్య కృష్ణచైతన్య నా వెంటే ఉంటూ
 ప్రొడక్షన్ చూస్తున్నాడు. నా మొదటి తమ్ముడు డాక్టర్ రమేశ్ కొడుకు
రాజా నిశాంత్ అమెరికాలో డెరైక్షన్ కోర్‌‌స చేశాడు. భవిష్యత్తు వీళ్ళదే.

 - రెంటాల జయదేవ

.........................................................

Tuesday, October 6, 2015

చంద్రముఖి ప్యాట్రన్ చంద్రిక

చంద్రముఖి ప్యాట్రన్ చంద్రిక










కొత్త సినిమా గురూ! - చంద్రిక

  బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు బాగా పారుతున్న పాచిక - భయపెట్టడం!
ఈ లేటెస్ట్ బాక్సాఫీస్ హార్రర్ సక్సెస్ ట్రెండ్‌లో ‘చంద్రకళ’, ‘పిశాచి’,
గత వారం రిలీజ్ ‘మయూరి’ (తమిళంలో ‘మాయ’) తర్వాత వచ్చిన చిత్రం ‘చంద్రిక’.

బంగళాలో భూతం!

 అర్జున్ (జయరామ్ కార్తీక్) అనే ప్రముఖ చిత్రకారుడు పెద్ద హవేలీని కొంటాడు.
అతని గురువైన ప్రసిద్ధ చిత్రకారుడు రవివర్మ (గిరీష్ కర్నాడ్) ఆ బంగళాలో
ఒకప్పుడు నివసించేవాడు. ఈ ఏకలవ్య శిష్యుడు ఆ భవనం కొనడానికి కారణం
 అదే. అలా ఆ భవంతిలోకి అతను, అతని భార్య శిల్ప (టీవీ యాంకర్,
నటి శ్రీముఖి) అడుగుపెడతారు. అయితే, ఆ బంగళాలోకి అడుగుపెట్టినప్పటి
 నుంచి శిల్ప ప్రవర్తనలో చిత్రమైన మార్పులు మొదలవుతాయి. చివరకు
ఆ బిల్డింగ్‌లో ఒకప్పుడు తాను గీసిన పెద్ద స్త్రీమూర్తి చిత్తరువులోని చంద్రికనే
తానంటూ భార్యను పూనిన దయ్యం చెబుతుంది. అక్కడికి ఫస్టాఫ్ ముగుస్తుంది.

 భార్యను పట్టిన ఆ బంగళాలోని దయ్యాన్ని వదిలించడానికి అర్జున్ ఒక
మంత్రోపాసకుణ్ణి ఆశ్రయిస్తాడు. చంద్రికకూ, నీకూ సంబంధం ఏమిటన్న
ఆ ఉపాసకుడి దగ్గర అర్జున్ తన ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ చేస్తాడు. చంద్రిక, తాను
 ఒకప్పటి ప్రేమికులమనీ, పీటల దాకా వచ్చి తమ పెళ్ళి ఆగిపోయిందనీ
 చెబుతాడు. అయితే, ఆ ఫ్లాష్‌బ్యాక్ ముగిశాక కూడా చంద్రిక మరణం
మిస్టరీ వీడదు. ఆ పజిల్‌ను సాల్వ్ చేయడానికి అర్జున్ అన్వేషణ
ప్రారంభిస్తాడు. ఆ అన్వేషణలో అతనికి తెలిసిందేమిటి? ఏమైందన్నది
మిగతా సినిమా.

 కీలకంగా.. సౌండ్ ఎఫెక్ట్స్
 తెలుగు కన్నా ఒక రోజు ముందే కన్నడ వెర్షన్ రిలీజైన ‘చంద్రిక’
ప్రాథ మికంగా కన్నడ సినిమా. ‘సత్యం’ రాజేశ్, ఎల్బీ శ్రీరామ్,
‘తాగుబోతు’ రమేశ్ లాంటి వాళ్ళతో షూట్ చేసిన సీన్లు దీన్ని కన్నడ,
తెలుగు ద్విభాషా చిత్రం చేశాయి. కానీ, కన్నడ తరహా టేకింగ్, ఆ
నిర్మాణ విలువలు తెలిసిపోతుంటాయి. అర్జున్ పాత్రధారి మనకు
కొత్త. కామ్నా జెత్మలానీ కనిపించేది కాసేపు. వారిద్దరి మధ్య ప్రణయగీతం
 మాత్రం ఇవాళ్టి సినిమాల్లోని ఐటమ్ సాంగ్‌లా మాస్‌ను ఆకట్టుకుంటుంది.
 ‘జులాయి’లో అల్లు అర్జున్ చెల్లెలు పాత్ర పోషించిన టీవీ యాంకర్ శ్రీముఖిది
 సినిమాలో ప్రధానపాత్ర. గృహిణిగా, దయ్యంగా వేరియేషన్ బాగా
చూపారు. ఇంటర్వెల్ ముందు ముగ్గులో విచిత్ర విన్యాసాలతో ఆమె నటన
బాగుంది. మిగతా పాత్రలన్నీ కాసేపు కనిపించి పోయేవి. బ్యాక్‌గ్రౌండ్‌లో
 వచ్చే దయ్యం పాట ముక్కలు ముక్కలుగా విన్నప్పుడు బాగుంది.
గుణ్వంత్ సంగీతం, సేతు సౌండ్ ఎఫెక్ట్స్ కొంత ప్లస్. కెమేరా వర్క్ ఫరవాలేదు.

 సినిమా మొదలైన కాసేపటికే క్యారెక్టర్లు, దయ్యం విషయం పరిచయం
 అయిపోతుంది. కానీ, ముందే ఊహించగల సీన్లతోనే ఫస్టాఫంతా
సాగు తుంది. ఇంటర్వెల్‌కి కానీ బండి పట్టాలెక్కదు. ఫ్లాష్‌బ్యాక్ నుంచి
సెకండాఫ్ ఆసక్తిగా సాగాలి. అక్కడకొచ్చేసరికి, ప్రేమ సీన్ల లాగుడు.
చివరకు ప్రాబ్లమ్ సాల్వ్ కావడాన్ని కూడా తేలిగ్గా తేల్చేశారు.
భవంతిలోని దయ్యం హీరో మీద పగబట్టి ఉంటే, అతనక్కడికి
వచ్చేదాకా ఏమీ చెయ్యదెందుకని? జరిగిన సంగతేదీ తెలియకుండా
హీరో బతికేస్తున్నాడా? లాంటి ప్రశ్నలకు జవాబులు ఎవరికి
వారు ఊహించుకోవాల్సిందే! కథలోని సమస్యను పరిష్కరించడానికి
సోకాల్డ్ హీరో చేసిందేమిటంటే జవాబు దొరకదు. కథలో బలమైన
విలన్లు, ఆ విలన్లు చేసిన దుర్మార్గాలు, దుష్కృత్యాలూ లేవు. అందుకే,
 వ్యవహారమంతా ఉపరితల స్పర్శే. బలమైన హార్రర్ కథ కానీ, ఇటీవలి
 హార్రర్ కామెడీ కానీ కనిపించవు. రజనీకాంత్ ‘చంద్రముఖి’ తరహా
 సినిమా చేయాలన్న బలమైన కోరిక మాత్రం అడుగడుగునా
 అర్థమవుతుంటుంది. అదే ఈ కథకు మైనస్సూ, ప్లస్సూ కూడా!

.........................................

చూడాలంటే భయపెట్టే.. చంద్రిక (సినిమా రివ్యూ: చంద్రిక)


చూడాలంటే భయపెట్టే.. చంద్రిక








చిత్రం - ‘చంద్రిక’,
తారాగణం - జయరామ్ కార్తీక్, శ్రీముఖి, కామ్నా జెత్మలానీ,
గిరీష్ కర్నాడ్, ఎల్బీ శ్రీరామ్, ‘సత్యం’ రాజేశ్
మాటలు - నాగేశ్వరరావు
పాటలు - వనమాలి
సంగీతం - గుణ్వంత్
కెమెరా - కె. రాజేందర్ బాబు
ఎడిటింగ్ - వి. సురేష్‌కుమార్
కథ, స్క్రీన్‌ప్లే - సాజిద్ ఖురేషీ
నిర్మాత - వి. ఆశ
దర్శకత్వం - యోగేశ్

బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు హార్రర్ సినిమాలు చాలా వస్తున్నాయి.
అందులో లేటెస్ట్ ఎడిషన్ ఈ ‘చంద్రిక’. వాల్‌పోస్టర్లలో ‘చంద్రముఖి’
 తరహాలో డ్యాన్స్ దుస్తుల్లో హీరోయిన్ కనిపించడం, అలాగే కామ్నా
 జెత్మలానీ లాంటి పేరున్న తార కూడా నటించడం వల్ల ఈ సినిమా
పట్ల కొంత ఆసక్తి నెలకొంది. మరి, ఈ శుక్రవారం వచ్చిన ‘చంద్రిక’
ఆ ఆసక్తికి తగ్గట్లే ఉందా?

కథేమిటంటే..
అనగనగా ఒక ఊరు. అందులో ఓ పెద్ద బంగళా. ఆ బంగళాను
 కొనుక్కున్నవాళ్ళకు చిత్రవిచిత్రమైన అనుభవాలు ఎదురవుతుంటాయి.
 దాంతో, అందరూ భయపడి పారిపోతుంటారు. ఆ పరిస్థితుల్లో
ఆ బంగళాను అర్జున్ (తొలి పరిచయం - జయరామ్ కార్తీక్)
అనే చిత్రకారుడు కొనుక్కుంటాడు. అది తన గురువైన చిత్రకారుడు
 రవివర్మ ఒకప్పుడు ఉన్న బంగళా అనీ, అందుకే దాన్ని కొన్నాననీ
తన భార్య శిల్ప (తెలుగు యాంకర్, నటి శ్రీముఖి)కి చెబుతాడు.
ఆ హవేలీలో ఆర్ట్ గ్యాలరీ పెడదామని అతను అనుకుంటే,
‘లేదు... అక్కడే ఉందామ’ని భార్య అంటుంది. అలా ఆ
 దంపతులు ఆ బంగళాకు కాపురం మారుస్తారు.

అక్కడ నుంచి శిల్ప ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కనిపిస్తూ
 ఉంటాయి. ఆ మార్పులను భర్త మొదట పట్టించుకోడు. భవంతిలో
 ఆత్మ ఉందనే సంగతి అతనికీ క్రమంగా అర్థమవుతుంది. ఆ
బంగళాలోని ఒక పెద్ద చిత్తరువు (ఆ బొమ్మలో కామ్నా జెత్మలానీ)ని
 చూపించి, చంద్రికను అనడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.

సెకండాఫ్‌కు వచ్చేసరికి, ఆ చంద్రిక ఎవరనే ప్రశ్న వస్తుంది. ఆ
 భూతాన్ని వదిలించడానికి వచ్చిన మంత్రవేత్త సమక్షంలో ఫ్లాష్‌బ్యాక్
ఓపెన్ అవుతుంది. చంద్రిక ఎవరనే విషయం అడిగిన మంత్రవేత్తతో హీరో
జరిగిన కథ చెప్పడం మొదలుపెడతాడు. ఆ బంగళా ప్రసిద్ధ చిత్రకారుడు
రవివర్మ (గిరీష్ కర్నాడ్)ది అనీ, అతని తమ్ముడి కూతురే చంద్రిక
(కామ్నా జెత్మలానీ) అనీ చెబుతాడు. ఏకలవ్య శిష్యుడిగా గురువు గారి
వద్ద చిత్రకళ నేర్చుకోవడానికి వచ్చిన తనకూ, చంద్రికకూ మధ్య
పెరిగిన ప్రేమ బంధం గురించి చెబుతాడు. తమ ప్రేమ పెళ్ళిదాకా
 వచ్చినా, పీటల మీద పెళ్ళి ఆగిపోయినట్లు చెబుతాడు. కానీ,
దానికి తాను కారణం కాదని చెబుతాడు. మంత్రవేత్త మాటలతో
ఆ తరువాత జరిగిన కథ తెలుసుకోవడం కోసం అన్వేషణ
 మొదలుపెడతాడు. ఇంతకీ అసలేమైంది? చంద్రిక ఎలా
చనిపోయింది? లాంటివన్నీ మిగతా కథ.

ఎలా చేశారంటే...?
ఇది ప్రధానంగా కన్నడ సినిమా. అయితే, కొంతమంది
 తెలుగు ఆర్టిస్టుల్ని కూడా పెట్టుకొని, రీషూట్స్ చేసి  ఏకకాలంలో
తెలుగు, కన్నడ భాషల్లో తయారైన సినిమా అనగలిగారు.
ఈ చిత్ర కథానాయక పాత్రధారికి తెలుగులో ఇదే తొలిచిత్రం.
ఆ పాత్రలో ఆయన చేయగలిగిందీ, చేసిందీ ఏమీ లేదు. టీవీ
 యాంకర్, ‘జులాయి’ చిత్రంలో అల్లు అర్జున్ చెల్లెలు పాత్రధారిణి
అయిన శ్రీముఖి ఈ చిత్రంలో హీరోయిన్. ఆమె కొన్ని చోట్ల
చూడడానికి బాగుంది. ముఖ్యంగా, చంద్రిక (కామ్నా జెత్మలానీ)
 పూనినట్లు అనిపించే సీన్స్‌లో బాగా చేశారు.

ఇంటర్వెల్‌కు ముందు తానే చంద్రికను అంటూ వచ్చే
 ముగ్గులోని ఆత్మ సీన్‌లో శ్రీముఖి ఆంగికం, ఆహార్యం,
క్లిష్టమైన భంగిమల్లో ఆమె చేసిన వర్క్ బాగుంది. చంద్రికగా
 కామ్నా జెత్మలానీ కనిపించేది కాసేపే అయినా, సినిమాకు
అదనపు ఆకర్షణ. ఆమెకూ, హీరోకూ మధ్య పెట్టిన రొమాంటిక్
సాంగ్ ఒక రకంగా చెప్పాలంటే, స్పెషల్ ఐటమ్ సాంగ్.
గిరీష్ కర్నాడ్ లాంటి సీనియర్ నటుడున్నా, కథలో
ఆయనకున్న పాత్ర కొద్దిగానే. ‘సత్యం’ రాజేశ్, ఎల్బీ
శ్రీరామ్, ‘తాగుబోతు’ రమేశ్ లాంటి వారందరూ చేసినవి
 తెరపై కనిపించడానికే తప్ప కథను నడిపించడానికి
ఉపయోగపడిన పాత్రలు కావు.

ఎలా ఉందంటే...?
దర్శకుడు యోగేశ్‌కు ఇదే తొలి చిత్రం. ఆ అనుభవ
రాహిత్యం బయటపడిపోయింది. క్యారెక్టర్ల పరిచయం
కాసేపటికే అయిపోతుంది. బంగళాలోని భూతం సంగతి
 సినిమా మొదలైన కాసేపటికే అర్థమైపోతుంది. ఇక, ఆ తరువాత
కథను పట్టాలెక్కించి, వేగంగా నడపాల్సింది. కానీ, అక్కడ
అవసరం లేని, ఆసక్తి కలిగించని సీన్లు పెట్టారు. వాటికి తోడు
 పానకంలో పుడక లాగా పాటలు. సెకండాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్
మొదలుపెట్టినప్పటి నుంచి సినిమా రసకందాయంలో పడాలి.
కానీ, అలా జరగలేదు. సరికదా... అనాసక్తిగా తయారైంది.
ఫ్లాష్‌బ్యాక్ ఘట్టం కూడా అంతంత మాత్రంగానే ఉంది. హీరో,
కామ్నా జెత్మలానీల ప్రేమఘట్టాన్ని అతిగా సాగదీశారు. ఫ్లాష్‌బ్యాక్
 తరువాతహీరో కనిపెట్టిన అంశాలు కూడా ఆసక్తిగా లేవు. చివరకు
వచ్చేసరికి, రజనీకాంత్ ‘చంద్రముఖి’ తరహా క్లైమాక్స్‌ను
అనుకరించారు. కానీ, అదీ అంతంత మాత్రమే.

మాటి మాటికీ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే దయ్యం పాట ముక్కలు
ముక్కలుగా విన్నప్పుడు బాగుంది. గుణ్వంత్ సంగీతం, సేతు
సౌండ్ ఎఫెక్ట్స్ కొంత సినిమాను కాపాడాయి. కెమేరా వర్క్
 ఫరవాలేదు. కానీ, కథలో పస లేనప్పుడు, చెప్పిన విధానంలో
దమ్ము లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు. విషాదం
ఏమిటంటే, ‘చంద్రముఖి’ని చూసి, ఆ ధోరణిలో వెళ్ళాలని
వాత పెట్టుకున్న ఈ హార్రర్ జానర్ సినిమాలో క్రైమ్
ఎలిమెంట్ కానీ, భయపెట్టే అంశాలు కానీ, కనీసం కాసేపు
 నవ్వు తెప్పించే విషయాలు కానీ లేకపోవడం! కన్నడంలో
ప్రధానంగా తీసిన సినిమా కావడంతో ఆ తరహా టేకింగ్
తెలిసిపోతుంటుంది. వెరసి, తెలుగులో కన్నా ఒక రోజు
ముందే కన్నడంలో విడుదలైన ఈ ద్విభాషా ‘చంద్రిక’
జనం చూడడానికి భయపడే సినిమాయే తప్ప, చూస్తే
భయపడే సినిమా కాదు!

- రెంటాల జయదేవ

Monday, October 5, 2015

శివమెత్తించే... ప్రేమ (కొత్త సినిమా గురూ! - శివమ్)

శివమెత్తించే... ప్రేమ
తారాగణం: రామ్, రాశీఖన్నా, అభిమన్యు సింగ్, వినీత్‌కుమార్, బ్రహ్మానందం, 
పాటలు: భాస్కరభట్ల, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, నిర్మాత:
 ‘స్రవంతి’ రవికిశోర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి, నిడివి: 
168  నిమిషాలు, రిలీజ్: అక్టోబర్ 2
 .................................

లవ్‌స్టోరీ ఉన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘శివమ్’తో దర్శకుడైన శ్రీనివాసరెడ్డి గతంలో
 సురేందర్ రెడ్డి దగ్గర ‘కిక్’, ‘రేసుగుర్రం’ లాంటి చిత్రాలకు పనిచేశారు.  దాదాపు
34 మంది ఆర్టిస్టులున్న ఈ సినిమాకైన బడ్జెట్ సుమారు రూ. 20 కోట్లు 
మొత్తం వర్కింగ్ డేస్ 87. ఊటీ, హైదరాబాద్, నార్వే, స్వీడన్‌లలో షూటింగ్.
నార్వే, స్వీడన్‌లలో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా ఇదే. అక్కడ డ్రోన్
కెమేరాలు వాడారు.
..............................................

సినిమా రచనలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. కథ అనుకొని దానికి తగ్గట్లు సీన్లు
రాసుకోవడం సంప్రదాయంగా అందరూ అనుసరించే విధానం. అయితే, ఒక్కోసారి
ప్రేక్షక జనాన్ని మెప్పించే తపనలో, సీన్లు అనుకొని కథలు కూడా వండుకోవడమూ
 సహజం. అలాంటి ఆసక్తికరమైన సీన్లు, ఎపిసోడ్లన్నీ కలసి తెరపై సినిమాగా
పరిణమిస్తే, కొన్నిసార్లు కథ కన్నా సీన్లదే ఎక్కువ ప్రాధాన్యమ వుతుంది. చిత్ర
నిర్మాణంలో ముప్ఫయ్యో ఏట అడుగుపెట్టిన ‘శ్రీస్రవంతీ మూవీస్’ సంస్థ నుంచి
 మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘శివమ్’ సినిమా చూసినప్పుడు ఈ
 ఆలోచనలన్నీ మెదులుతాయి.

కథ ఏమిటంటే...: 

ఇది శివ (రావ్‌ు) అనే కుర్రాడి కథ. అతనిది ఒక విలక్షణ తత్త్వం. ప్రేమికుల
 పెళ్ళిళ్ళకు ఇంట్లో పెద్దలు అభ్యంతరపెడుతున్నారని తెలిస్తే చాలు... నేరుగా
 తాను బరిలోకి దిగిపోతాడు. పెద్దవాళ్ళతో ఫైట్లు చేసి మరీ, ప్రేమికుల జంటను
 కలుపుతూ ఉంటాడు. అలా అప్పటికి 112 పెళ్ళిళ్ళు చేయించాడా కుర్రాడు.
ఆ క్రమంలో జడ్చర్ల పట్నాన్ని గడగడలాడించే భోజిరెడ్డి (వినీత్ కుమార్) అనే
విలన్ మనుషుల్ని కొట్టి, వాళ్ళకు శత్రువవుతాడు. అలాంటి కుర్రాడు రైలులో
 వెళుతూ, ఒకమ్మాయి ఏదో షూటింగ్ కోసం అన్న ‘ఐ లవ్ యూ’ అన్న
 మాటను సీరియస్‌గా తీసుకుంటాడు. ఆ అమ్మాయినీ, ఆమె ప్రేమనూ
 వెతుక్కుంటూ వెళతాడు. అదే టైవ్‌ులో పోయిన పరువును తిరిగి
తెచ్చుకోవడం కోసం భోజిరెడ్డి మనుషులు హీరో కోసం వెతుకుతుంటారు.
 మరోపక్క అభిమన్యు సింగ్ అనే మరో విలన్ కూడా హీరో కోసం
వెతుకుతుంటాడు. అతనెందుకు వెతుకుతున్నాడన్నది కాసేపు సస్పెన్‌‌స.
తీరా హీరో కనిపించినప్పుడు అతణ్ణి వదిలేసి, హీరోయిన్‌ను కిడ్నాప్ చేసుకొని
వెళతాడతను. అక్కడికి ఇంటర్వెల్. విలన్ దగ్గర నుంచి ఆమెను హీరో
రక్షించడం, హీరో పనిపట్టడం కోసం ఇద్దరు విలన్ల మధ్య ఒప్పందం కుదరడం
 లాంటివన్నీ తర్వాతి కథ. ఒక దశలో హీరోయిన్‌తో ప్రేమ కన్నా, ప్రేమించినవాళ్ళను
ఏకం చేయడం వైపే హీరో మొగ్గుతాడు. అలా ఎందుకన్నది ఫ్లాష్ బ్యాక్. అదేమిటి,
 హీరో అసలు ‘శివ’ అని పేరు పెట్టుకోవడానికీ, తాను పెళ్ళి చేసిన ప్రేమికుల
 మొదటి బిడ్డకు ‘శివ’ అని వచ్చేలా పేరు పెట్టమనడానికీ కారణం ఏమిటి,
ప్రేమ అనే విషయం వచ్చేసరికి అతనెందుకు శివమెత్తుతాడు, చివరకు విలన్ల
కథెలా కంచికి చేరిందన్నది మిగతా సినిమా.

తెర నిండా యాక్టర్లే...:

 ‘ఎనర్జిటిక్ స్టార్’ బిరుదాంకితుడైన యువ హీరో రామ్ఆ పేరుకు తగ్గట్లు
 నటించారు. మొదటి నుంచి చివరి దాకా హుషారుగా, ఎందరినైనా కొట్టి,
 ఏదైనా సాధ్యం చేయగల వీరాధివీరుడి తరహా పాత్రలో కనిపిస్తారు. ఇక,
 క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఘట్టంలో పొడవాటి జుట్టున్న విగ్‌లో
 విభిన్నంగా, విచిత్రంగా ఉన్నారు. ప్రేమిస్తున్నాననే విషయాన్ని కూడా
నేరుగా చెప్పడంలో కూడా ‘ఇగో’ ఫీల్ అయ్యే కథానాయిక తనూజగా హీరోయిన్
 రాశీఖన్నాది విగ్రహపుష్టి. ఈ చిత్రంలో విలన్లు ఒకరు కాదు - ఇద్దరు.
ఒకరు అభిమన్యు సింగ్, రెండో వ్యక్తి వినీత్ కుమార్. కానీ, చిత్రంగా ఈ
ప్రతినాయక పాత్రల్లో ఏదీ బలంగా కనిపించదు. విలన్లు కూడా కామెడీ
చేయడమనే కాన్సెప్ట్‌తో కథను తీర్చిదిద్దుకోవడం అందుకు ఒక కారణం.
 బలమైన విలన్లు, సన్నివేశాలు, సందర్భాలు లేనప్పుడు హీరోనెంత గొప్పగా
 చూపినా, హీరోయిజవ్‌ు ఎంతవరకు ఎలివేటవుతుందన్నది ప్రశ్న.

వీళ్ళు కాక - కామెడీ కోసం బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి
నుంచి సప్తగిరి, ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్.... ఇలా లెక్కేసుకుంటూ
పోతే, ఆ పేర్ల జాబితానే కొండవీటి చాంతాడు. ఇటీవలి కాలంలో తన అమాయకపు
 డైలాగుల చిన్న చిన్న పాత్రలతోనే అలరిస్తున్న ‘ఫిష్’ వెంకట్ కూడా ఉన్నారు.
కనిపించే కొద్ది సీన్లలో ఎవరికి వారు తమ వంతు నవ్వించడానికి ప్రయత్నించారు. 
ఇక, హీరో తండ్రి పాత్రలో పోసాని కృష్ణమురళి, హీరోయిన్ తండ్రి పాత్రలో
 గాయకుడు మనో లాంటి పేరున్న తారలూ కనిపిస్తారు. అప్పటికే సినిమా
 నిడివి 2 గంటల 48 నిమిషాలు కావడం వల్ల కావచ్చు... వారిని ఇంకా
 వినియోగించుకొనే సీన్లకు అవకాశం కష్టమైనట్లుంది. అలాగే, తండ్రి
పోసాని పాత్ర గన్ను పుచ్చుకొని మరీ హీరోను కనిపిస్తే... కాల్చేస్తానంటూ
తిరగడం వెనుక కారణం ఏమిటన్నది చెప్పడం మర్చిపోయినట్లున్నారు.

అనుభవం నిండిన టెక్నీషియన్‌‌ వర్క్:
     
                     శ్రీనివాసరెడ్డికి దర్శకుడిగా ఇది తొలిసినిమా. కథ కూడా
ఆయన రాసుకున్నదే. పాత్రల పరిచయం, కథ ఎస్టాబ్లిష్‌మెంట్‌తోనే సినిమా
 ఫస్టాఫ్ అంతా గడిచిపోతుంది. దానికి మూడు పాటలు, కొన్ని ఫైట్లు అదనం.
 చిన్న ట్విస్ట్ దగ్గర ఫస్టాఫ్ ఆగినా, సెకండాఫ్ మొదట్లోనే ఆ ట్విస్ట్‌ను బయటపెట్టేస్తారు.
ఇక, ఆ తరువాత అంతా టావ్‌ు అండ్ జెర్రీ తరహాలో హీరోకూ, విలన్లకూ మధ్య
జరిగే కథ. హీరో స్వభావానికీ కారణం తెలిపే ఫ్లాష్‌బ్యాక్ కథ చివరాఖరుకు వస్తుంది.
అప్పటి దాకా ఆసక్తినీ, సహనాన్నీ కోల్పోకుండా నిలుపుకోవాలి. మాటల రచయిత
కిశోర్ తిరుమల ఉన్నా, ఆ క్రెడిట్‌నూ దర్శకుడు కూడా పంచుకున్న ఈ సినిమాలో,
 ముఖ్యంగా ఫస్టాఫ్‌లో డైలాగ్‌‌స కొంత బాగున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో
‘నా కోసం నువ్వేమీ ప్రేమించక్కర్లేదు...’ లాంటి 2-3 పాటలు బాగున్నాయి.
 నార్వే, స్వీడన్ లాంటి చోట్ల అందమైన లొకేషన్లను కెమేరాలో బంధించిన తీరూ
 బాగుంది. పీటర్ హెయిన్ ఫైట్స్ సరేసరి. ఇలాంటి అనుభవజ్ఞులైన నిపుణులతో
 పాటు నిర్మాణ విలువలూ పుష్కలమే. ఇన్ని సమకూరిన సినిమాలో సీన్లు,
 పాటలు, ఫైట్లూ ఉన్నాక... ఇంకా కథ గురించి ఆలోచించడం ఎందుకు?

.......................................

Sunday, October 4, 2015

ఒకటి.. రెండు.. మూడు.. మెగాస్టార్ వచ్చేస్తున్నాడు?!

ఒకటి.. రెండు.. మూడు.. మెగాస్టార్ వచ్చేస్తున్నాడు?!










మెగాసిప్ హల్‌చల్!
సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడనుందా? ఎప్పుడెప్పుడా అని
 సినీప్రియులు, ‘మెగా’ అభిమానులు ఎదురుచూస్తున్న క్షణాలు
వచ్చేశాయా? చిరంజీవి పూర్తి స్థాయిలో కథానాయకుడిగా మళ్ళీ
 తెరపై చిందేసే కథ కన్‌ఫర్మ్ అయిందా? అవునండీ..! అవును!!
 అత్యంత విశ్వసనీయమైన కృష్ణానగర్ ఖబర్. సినిమా సందళ్ళేమీ
 లేకుండా స్తబ్ధుగా ఉన్న గురువారం నాడు మధ్యాహ్నం దాటాక
ఈ బ్రేకింగ్ న్యూస్ ఫిల్మ్‌నగర్‌లో సంచలనం రేపింది. అందరి నోటా
 అదే చర్చ... కుమారుడు రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న
 ‘బ్రూస్‌లీ... ది ఫైటర్’లో అతిథి పాత్రపోషణతో ఇప్పటికే
వార్తల్లోకెక్కిన తెలుగుతెర ‘మెగాస్టార్’ ఇక హీరోగా రీ-ఎంట్రీ
ఇవ్వనున్నారట! సరైన స్క్రిప్ట్ కోసం అనేక నెలలుగా అన్వేషణలో
ఉన్న చిరంజీవి ఎట్టకేలకు కథపై ఒక క్లారిటీకి వచ్చారట!
 దర్శకుడెవరనేదీ ఒక స్పష్టత తెచ్చుకున్నారట!

అధికారిక ప్రకటన... ఇవాళే?
విశ్వసనీయ సమాచారం ప్రకారం సరిగ్గా ఏడాది క్రితం తమిళంలో
 విజయ్ హీరోగా వచ్చిన ‘కత్తి’ (2014) సినిమా స్క్రిప్ట్‌తో
 తెలుగుతెరపై మెగా రీ-ఎంట్రీకి చిరంజీవి సిద్ధమవుతున్నారట.
ఏ.ఆర్. మురుగదాస్ రచన, దర్శకత్వం వహించిన ఈ తమిళ
స్క్రిప్ట్‌ను మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్లు తీర్చిదిద్దే పని ప్రస్తుతం
 ముమ్మరంగా సాగుతోంది. మాస్ పల్స్ తెలిసిన కమర్షియల్
చిత్రాల దర్శకుడు వి.వి. వినాయక్ ఈ రీమేక్‌కు సారథ్యం
 వహించనున్నట్లు బోగట్టా. ఈ చిత్రానికి రామ్‌చరణే
నిర్మాతగా వ్యవహరిస్తారట. ఈ వివరాలను చిరంజీవే
 ప్రకటించే అవకాశం ఉందని మెగా కాంపౌండ్‌లోని
ఆంతరంగిక వర్గాల కథనం. శుక్రవారం సాయంత్రం
హైదరాబాద్‌లో జరిగే రామ్‌చరణ్ ‘బ్రూస్‌లీ’ పాటల
విడుదల వేడుకలో చిరంజీవి పాల్గొంటున్నారు.
ఆ సినిమాలో 3 నిమిషాల ఫైట్ సీక్వెన్స్‌లో అతిథిగా
అలరిస్తున్న చిరంజీవి - ఈ ఆడియో ఆవిష్కరణోత్సవంలో
‘కత్తి’ రీమేక్ ఖబర్‌ను అభిమానుల సాక్షిగా అధికారికంగా
 వెల్లడించవచ్చు.

ఊరంతా అనుకుంటున్నది  కన్‌ఫర్మ్ అయితే... 
తమిళ దర్శకుడు మురుగదాస్ కథతో చిరంజీవి
 తెరపైకి రావడం గత పన్నెండేళ్ళలో
 ఇది ముచ్చటగా మూడోసారి. గతంలో చిరంజీవి 
రాజకీయ తెరంగేట్రానికి మెట్లుగా  పనికొచ్చిన 
‘ఠాగూర్’ (2003), ‘స్టాలిన్’ (2006) చిత్రాలు కూడా
 మురుగదాస్ అందించిన కథలే! ఇప్పుడీ ‘కత్తి’ 
ముచ్చటగా మూడోది. ఈ మూడు సినిమాల కథలూ 
సమకాలీన అంశాలను ప్రస్తావిస్తూ, సమాజంలోని లోపాలను 
ఎత్తిచూపేవే కావడం యాదృచ్ఛికం అనుకోలేం.

 అవినీతిపై పోరాడే ‘ఠాగూర్’
 కొత్త మిలీనియమ్ ఆరంభమయ్యాక రాజకీయ అంశాలున్న
కథలతో చిరంజీవి సినిమాలు చేయడానికి ‘ఠాగూర్’ శ్రీకారం
చుట్టింది. ‘యాంటీ కరప్షన్ ఫోర్స్’ (ఏ.సి.ఎఫ్)ను స్థాపించి,
అవినీతిపై పోరాడే ప్రొఫెసర్‌గా అందులో చిరంజీవిది టైటిల్
రోల్. తమిళ స్టార్ విజయ్‌కాంత్‌కు కలిసొచ్చిన ‘రమణ’
చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఈ స్క్రిప్ట్ రీమేక్ ప్రతిపాదన
హీరో రాజశేఖర్ దగ్గరకు వెళ్ళినా, ఆఖరుకు అదృష్టం చిరంజీవి
 దగ్గరకు వచ్చి ఆగింది. ఆసుపత్రుల నుంచి ఆఫీసుల దాకా
 ప్రతిచోటా పెరిగిపోయిన అవినీతి, లంచగొండితనాలపై
 సంధించిన సెల్యులాయిడ్ అస్త్రం ఈ స్క్రిప్ట్. ‘తెలుగు భాషలో
 నాకు నచచని ఒకే ఒక్క మాట- క్షమించడం’ అనే డైలాగ్
ఎవర్‌గ్రీన్. ఈ చిత్రం తర్వాత నుంచి చిరంజీవి ఫిల్మ్ కెరీర్
 కొత్త దోవ పట్టింది. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి
ధారపోశాను...’ అన్న శ్రీశ్రీ కవితా మకుటంతో ఆ సినిమాకు
 సుద్దాల అశోక్‌తేజతో ప్రత్యేకంగా పాట రాయించారు.
ఉత్తేజం నింపే ఆ పాట, దాని బాణీయే ఆ తరువాత
చిరంజీవి రాజకీయ అరంగేట్రానికి ప్రచార గీతం, సంగీతమయ్యాయి.

మెరుగైన సమాజం కోసం... ‘స్టాలిన్’
కదులుతున్న సినీ సింహాసనానికి మళ్ళీ స్థిరత్వం తెచ్చిన
 ‘ఇంద్ర’, బాక్సాఫీస్ రికార్డ్‌ల బాద్‌షా అని చాటడానికి మరోసారి
 ఉపయోగపడ్డ ‘ఠాగూర్’ ఇచ్చిన ఊపు తరువాత చిరంజీవి
 ఆలోచనలో పడ్డారు. అంతర్గత రాజకీయ ఆకాంక్షలకు తగ్గ
కథ కోసం అన్వేషించసాగారు. అప్పుడు మళ్ళీ మురుగదాసే
 కనిపించారు. ఈ సారి మురుగదాస్‌కు కథతో పాటు మెగాఫోన్
బాధ్యతలూ ఆయన అప్పగించేశారు. అలా వచ్చిందే - ‘స్టాలిన్’.
చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగైన సమాజంగా మార్చడమే
లక్ష్యంగా పనిచేసే మాజీ సైనికాధికారిగా, కార్గిల్ యుద్ధంలో
 పోరాడిన మేజర్ పాత్రను చిరంజీవి ధరించారు. ప్రతి మనిషీ
ముగ్గురికి సాయం చేయాలనీ... సాయం అందుకున్న ఆ
ముగ్గురూ - ఒక్కొక్కరూ మరో ముగ్గురికి సహాయ హస్తం
అందించాలనీ... అలా అది తెగిపోని గొలుసులా సాగిపోవాలనే
 అంశం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. అంతకు సరిగ్గా
ఆరేళ్ళ ముందు 2000లో ‘పే ఇట్ ఫార్వర్డ్’ అనే ఇంగ్లీషు
నవల ఆధారంగా అదే పేరుతో తయారైన అమెరికన్
 సినిమా దీనికి స్ఫూర్తి.

‘కత్తి’ కథేమిటంటే..
.
 తమిళనాట కొత్త సినిమా రిలీజ్‌లకు పండగైన దీపావళికి
 గత అక్టోబర్ 22న విజయ్ ‘కత్తి’ విడుదలైంది. విజయ్
ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో సమంత హీరోయిన్.
 ‘కత్తి’ కథను సమకాలీన సమాజంపై మురుగదాస్ వ్యాఖ్యానం
 అనుకోవచ్చు. కార్పొరేట్ సంస్థల దురాక్రమణలతో ఉపాధి
 కోల్పోయి, దిక్కుతోచని రైతులు ఆత్మహత్యలకు
పాల్పడడమనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
చూడడానికి ఒకేలా కనిపించే కదిరేశన్, జీవానందం - అనే
 ఇద్దరు ప్రధాన పాత్రధారులు. రైతుల కోసం పోరాడే
ప్రగతిశీలవాది జీవానందం. అల్లరి చిల్లరిగా ఉండే ఖైదీ
 కదిరేశన్ అలియాస్ ‘కత్తి’. రెండు పాత్రలూ విజయ్
పోషించారు. గూండాల బారినపడి, బుల్లెట్
గాయమైన జీవానందాన్ని అనుకోని పరిస్థితుల్లో
‘కత్తి’ చూస్తాడు. చూడడానికి తనలానే ఉన్న అతని
కథ, పీడిత ప్రజానీకం పక్షాన అతను చేస్తున్న ఉద్యమం
 తెలుసుకొంటాడు. అతని స్థానంలోకి తాను వెళతాడు.
 రైతుల పక్షాన స్వయంగా పోరాటం చేస్తాడు. దుష్ట
రాజకీయ నాయకుల మెడలు వంచుతాడు. పొలిటికల్
 సెటైర్లు పుష్కలంగా ఉన్న ఈ సినిమా గత ఏడాది
 తమిళనాట హయ్యస్ట్ గ్రాసర్! ఈ కథనే ఇప్పుడు
 చిరంజీవి తనకు తగ్గట్లు మార్చుకొని, రీమేక్ చేస్తారట!

వెరసి, చిరంజీవి సినిమా కెరీర్‌ను గమనిస్తే - ఈ కొత్త
 సినిమా ‘కత్తి’ రీమేక్‌తో కలుపుకొని ఆయన హీరోగా
నటించిన గత ఎనిమిది సినిమాల్లో మూడు మురుగదాస్
కథలే! రాజకీయాల్లోకి వస్తున్నప్పటి నుంచి చిరంజీవికి
సామాజిక స్పృహ ఉన్న దర్శకుడు, ఆయన కథలు సరిగ్గా
 టైమ్‌కి కలిసొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన
 కథలంటే ఇవేనేమో!
....................................................

వినయాన్ని విజయం వరించింది!
చిరంజీవి హీరోగా చేసే కొత్త సినిమా స్క్రిప్ట్ కోసం నిజానికి
 చాలా నెలలుగా, చాలా కసరత్తే జరిగింది. పరుచూరి
బ్రదర్స్ లాంటి సీనియర్స్ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’
లాంటి శక్తిమంతమైన స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలతో
స్టోరీలైన్స్ సిద్ధం చేశారు. దర్శకుడు పూరి జగన్నాథ్, రచయిత
బి.వి.ఎస్. రవి ‘ఆటో జానీ’ లాంటి మాస్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్స్
 చిరంజీవికి వినిపించారు. ‘ఇంద్ర’ కథా రచయిత చిన్నికృష్ణ
కూడా కలానికి పదునుపెట్టారు. పూరితో చిరు సినిమా
దాదాపు ఖరారైనా, ఆఖరి క్షణంలో సెకండాఫ్ తృప్తికరంగా
 లేదంటూ బ్రేక్ పడింది. ‘ఆ మాట మీడియా ముందు
 కాకుండా, నాతో చెబితే మార్పులు చేసేవాణ్ణి’ అంటూ
బర్త్‌డే ఇంటర్వ్యూలో పూరి అన్నారు. ఆ వెంటనే,
‘ఎన్ని స్క్రిప్ట్‌లైనా చేస్తాను. 150 కాకపోతే, 151వ సినిమా
 అయినా చేస్తాను. చిరంజీవితో సినిమా చేయడమే నా కోరిక’
అంటూ ప్రకటన కూడా ఇచ్చారు. తీరా ఆయన ఆ మాట
 అని ఇరవైనాలుగు గంటలైనా గడవక ముందే ఈ ‘కత్తి’
రీమేక్ వార్త ప్రచారంలోకి వచ్చింది. చిరంజీవి సినిమాకు
దర్శకుడిగా వినయ్ (వి.వి. వినాయక్‌ను ముద్దుగా
అందరూ అలా పిలుస్తుంటారు) అవకాశం
దక్కిందహో అని కృష్ణానగర్ కోడై కూస్తోంది.


డబ్బింగ్... అయిపోయింది!
 విజయ్ ‘కత్తి’ సినిమాను అదే పేరుతో మొదట
 తెలుగులో డబ్బింగ్ చేయాలనుకున్నారు. ‘ఠాగూర్’
చిత్ర నిర్మాణంతో ‘ఠాగూర్’ మధుగా పేరు తెచ్చుకున్న
 నిర్మాత - డిస్ట్రిబ్యూటర్ బి. మధు తమిళ ‘కత్తి’ రైట్స్
కొన్నారు. డబ్బింగ్ కూడా పూర్తి చేసేశారు. మరికొద్ది
 రోజుల్లో రిలీజ్ అనుకుంటున్న టైమ్‌లో, తమిళంలో
 సూపర్‌హిట్టయిన ఈ సినిమాను రీమేక్ చేస్తే ఎలా
ఉంటుందనే ఆలోచన వచ్చింది. పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు,
అల్లు అర్జున్, ఎన్టీయార్ - ఇలా పలువురు హీరోల పేర్లూ
ఆ రీమేక్‌కు వినిపించాయి. వారు తమిళ ఒరిజినల్
చూడడమూ జరిగింది. చిన్న ఎన్టీయార్‌తో రీమేక్ దాదాపు
ఖాయమనే దాకా కథ వచ్చింది. కానీ, ఏదీ తేలలేదు. ఇంతలో
 ఇప్పుడు యాంటీ క్లైమాక్స్ లాగా కథలో ట్విస్ట్. సమకాలీన
 రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం మీద వ్యంగ్యబాణాలు విసిరే
ఈ స్క్రిప్ట్ వైపు చిరంజీవి మొగ్గారట. సామాజిక స్పృహ ఉన్న
ఈ కథ జోరు తగ్గిన ఆయన పొలిటికల్ ఇన్నింగ్స్‌కు మళ్ళీ
ఊపు తెస్తుందనీ, సినిమాల్లో రీ-ఎంట్రీకి పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్
అవుతుందనీ పరిశీలకుల అంచనా.
..........................................
 నైన్ ఇయర్స్ ఇచ్!
 మురుగదాస్ దర్శకత్వంలోని ‘స్టాలిన్’ తరువాత చిరంజీవి
 హీరోగా నటించింది ఒకే ఒక్క సినిమా - ‘శంకర్‌దాదా
జిందాబాద్’ (2007 జూలై 27)లోనే. ఆ తరువాత ఆయన
 తెరపై కనిపించిన రెండూ- ‘మగధీర’, రానున్న ‘బ్రూస్‌లీ’-
 తనయుడు రామ్‌చరణ్ సినిమాలే. పైగా, ఆ రెండిటిలోనూ
చిరువి అతిథి పాత్రలే. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా ఆయన
నటించే ‘కత్తి’ రీమేక్ గనక షూటింగ్ మొదలెడితే, రిలీజవడానికి
 వచ్చే 2016 ఫస్టాఫ్ అవుతుంది. అంటే... హీరోగా రీ-ఎంట్రీకి
 ‘నైన్ ఇయర్స్ ఇచ్’ తీరి, సరిగ్గా తొమ్మిదేళ్ళ తరువాత
మెగా సందడి చేస్తారన్న మాట!
.........................................
 అరవైలోనూ... అదే ఊపు

 మొన్న ఆగస్టు 22నే చిరంజీవికి 60 ఏళ్ళు నిండాయి.
అయినా, విదేశీ, స్వదేశీ చికిత్సలు, ఎక్సర్‌సైజ్‌లు,
ఆహారపుటలవాట్లతో నాలుగు పదుల కుర్రాడిలా
 తయారయ్యారు. మొన్న సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల
 పాటు శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్‌లీ’లో ఆయన ఫైట్స్
 చేసిన తీరు చూసి, సెట్స్‌లో యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారు.
‘ఇవాళ్టికీ మ్యూజిక్ ఆన్ చేస్తే చాలు... శరీరంలోని అణువణువూ
 డ్యాన్స్ చేస్తుం’దంటూ చాలా ఉత్సాహంగా చెప్పే చిరంజీవి
 ఇప్పుడీ ‘కత్తి’ రీమేక్‌లోనూ తన మునుపటి డ్యాన్సులు,
 ఫైట్లతో అలరించే అవకాశాలు పుష్కలం.
అభిమానధనంజీవి చిరంజీవికి ఆల్ ది బెస్ట్!

- రెంటాల జయదేవ

..........................................

అక్టోబర్ 9నే 'రుద్రమదేవి'


అక్టోబర్ 9నే రుద్రమదేవి










తెలుగు సినిమా చరిత్రలో మరొక 
ప్రతిష్ఠాత్మక ప్రయత్నం జనం 
ముందుకు రావడానికి అన్ని 
విధాలా రంగం సిద్ధమైంది. మన
 తెలుగు జాతి చరిత్రకు అద్దం 
పట్టే కాకతీయ సామ్రాజ్య 
విజయగాథ ‘రుద్రమదేవి’ సరిగ్గా 
మరో 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా
 అలరించనుంది. దర్శక - నిర్మాత 
గుణశేఖర్ దాదాపు మూడేళ్ళుగా 
చేస్తున్న ఈ భారీ చిత్రం అక్టోబర్ 9న రిలీజవడం 
కన్‌ఫర్‌‌మ అయింది. అటు 3డీలో, ఇటు
 రెగ్యులర్ 2డీలో - రెండు రూపాల్లోనూ ఈ చారిత్రక 
కథా స్వప్నం దేశవిదేశాల్లో తెరపై 
కనిపించనుంది. అగ్ర కథానాయిక అనుష్క ప్రాణం 
పెట్టి, ప్రధాన పాత్ర పోషించగా, 
గుణశేఖర్ తన సర్వశక్తులూ ఒడ్డి చేసిన వెండితెర 
యజ్ఞం - ‘రుద్రమదేవి’ గురించే 
ఇప్పుడందరి డిస్కషన్.

నాలుగు భాషల్లో... అదే డేట్‌లో...

ఈ సినిమా రిలీజ్ టైవ్‌ు గురించి ఇటీవల వ్యక్తమవుతున్న
 అనుమా నాలు,
 అసత్య ప్రచారాల నేపథ్యంలో అసలు నిజం కనుగొనేందుకు
 ‘సాక్షి’ ప్రయత్నించింది.
 వివిధ వర్గాలతో మాట్లాడింది. ‘‘సంక్లిష్టమైన 3డీ టెక్నాలజీ
 సినిమా కావడం,
తెరపై అడుగడుగుకీ ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా
నిర్మాణంలోనూ, నిర్మాణానంతర
కార్యక్రమా ల్లోనూ ఈ భారీ చిత్రం ఆలస్యమైంది. తప్పనిసరి
పరిస్థితుల్లో గతంలో కొన్నిసార్లు రిలీజ్ వాయిదా పడింది.
దాంతో, రిలీజ్ డేట్ గురించి కొందరు
అనుమానంగా మాట్లాడుతున్నారు. కానీ, సినిమా వర్క్
మొత్తం పూర్తయిపోయింది.
ఇప్పటికే సెన్సార్ కూడా అయిపోయింది. అక్టోబర్ 9న
తెలుగు, తమిళ, మలయాళ,
 హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ‘రుద్రమదేవి’ రిలీజ్
 అవుతోంది’’ అని చిత్ర
యూనిట్ వర్గాలు ‘సాక్షి’కి స్పష్టం చేశాయి.

ప్యాచ్ వర్‌‌కకీ... ఫారిన్ మ్యుజీషియన్‌‌
 ఆంతరంగిక వర్గాల ప్రకారం - ఈ సినిమాకు వివిధ ప్రాంతాల
నుంచి రావాల్సిన
విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఇప్పటికే వచ్చేశాయి. వాటన్నిటి 3డీ
కన్వర్షన్ శరవేగంతో
జరిగిపోతోంది. తెరపై దృశ్యాల్ని మరింత అందంగా,
ఆకర్షణీయంగా మార్చే
‘డిజిటల్ ఇంటర్మీడియట్’ (డి.ఐ) వర్‌‌కతో ముంబయ్‌లో
 సినిమాకు
 మెరుగులు దిద్దుతున్నారు.

విశేషం ఏమిటంటే, ఈ సెల్యులాయిడ్ శిల్పాన్ని ఆడియన్‌‌సకు
కన్నుల పండుగగా మలచడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ
గుణశేఖర్ వదిలి పెట్టడం లేదు. ఈ చిత్రం రీరికార్డింగ్‌ను విదేశాల్లో
జరిపారు. ఇటీవలే ఈ చిత్రంలో ఒకటి రెండు చోట్ల రీరికార్డింగ్‌లో
కొత్తగా ప్యాచ్‌వర్‌‌క చేస్తే బాగుంటుందని ఆయన, సంగీత దర్శకుడు
ఇళయరాజా భావించారు. అంతే, ఖర్చుకు వెనుకాడకుండా హంగేరీ
 నుంచి
డజను మంది మ్యుజీషి యన్‌‌సను మళ్ళీ ప్రత్యేకంగా ఇండియాకు
 పిలిపించారు.
వాళ్ళతో నాలు గైదు రోజుల పాటు శ్రమించి, ఆ దృశ్యాలకు కొత్త
 సొబగులు కూర్చారు.

సక్సెస్‌ఫుల్... చారిత్రక ఫార్ములా
అల్లు అర్జున్ (గోన గన్నారెడ్డి), రానా (రుద్రమదేవి భర్త చాళుక్య
వీరభద్రుడు) లాంటి ఎందరో స్టార్‌‌స నటించిన ఈ చిత్రానికి
 చాలానే ప్రత్యేకతలున్నాయి. దాదాపు రూ. 70
కోట్ల పైగా ఖర్చుతో రూపొందిన హీరోయిన్ ఓరియంటెడ్
కథా చిత్రం ఇది. మలయాళ, తమిళ, కన్నడ, మరాఠా
 నేలల దాకా తెలుగువారి అధికారాన్ని విస్తరించి, మన ఖ్యాతిని
దక్షిణ భారతదేశమంతటా వ్యాప్తి చేసిన కాకతీయ సామ్రాజ్యపు
కథకు తొలిసారిగా వెండితెర రూపం ఇది. ఎన్టీఆర్ ‘సమ్రాట్
అశోక’ (1992) తరువాత 23 ఏళ్ళకు తెలుగులో భారీ
తారాగణంతో వస్తున్న చారిత్రక కథా చిత్రం కూడా ఇదే.
గతంలో తెలుగులో వచ్చిన ‘పల్నాటి యుద్ధం’, ‘బొబ్బిలి
యుద్ధం’, ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరసు’,
‘అల్లూరి సీతారామరాజు’ లాంటి చారిత్రక కథాచిత్రాల్లో
నూటికి 95 శాతం హిట్లే. ఆ కోవలోనే ఈ సినిమానూ
 పకడ్బందీగా తీర్చిదిద్దారు.

టాప్ క్లాస్ టెక్నీషియన్ల శ్రమ
టెక్నికల్ అంశాల్లో కూడా ఈ సినిమా వెనుక చాలా
శ్రమే ఉంది. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో
స్కోపిక్ 3డీ ఫిల్మ్. ఈ  3డీ చిత్ర నిర్మాణం కోసం
గుణశేఖర్ ఏకంగా విదేశాలకు వెళ్ళి, ప్రత్యేకంగా
3డీ ఫిల్మ్ మేకింగ్ కోర్‌‌స కూడా చేసి వచ్చారు.
ఇన్నేళ్ళ తన అనుభవాన్ని ఈ సినిమా కోసం
వినియోగించారు. చిన్నప్పుడు చదివిన వీరనారి
 ‘రుద్రమదేవి’ కథను తెరకెక్కించాలన్న గుణశేఖర్
చిరకాల స్వప్నాన్ని నిజం చేయడానికి కృషి
చేసిన ఇళయరాజా (మ్యూజిక్), తోట తరణి
 (ఆర్‌‌ట డెరైక్టర్), శ్రీకర్ ప్రసాద్
 (ఎడిటింగ్), ‘జోధా అక్బర్’ ఫేవ్‌ు నీతా లుల్లా
 (కాస్ట్యూవ్‌ు్స) అందరూ
జాతీయ అవార్డు విజేతలైన సినీ సాంకేతిక
నిపుణులే కావడం మరో విశేషం.
చారిత్రక కథతో చేస్తున్న ఈ సినిమాలో తండ్రీ
 కూతుళ్ళ మధ్య అనుబంధం
లాంటి ఎమోషన్లూ చాలా ఉన్నాయి. ఇన్ని
విశేషాలున్న ఈ చిత్రం కోసం...
లెటజ్ వెయిట్ ఫర్... అక్టోబర్ 9.

.............................................