జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, July 16, 2014

సినిమా రివ్యూ: ఐస్‌క్రీమ్ --- అవును... ఇది భయపెట్టే సినిమానే!


అవును... ఇది భయపెట్టే సినిమానే!

సినిమా రివ్యూ
చిత్రం: ఐస్‌క్రీమ్,
తారాగణం: తేజస్వి, నవదీప్, సంగీతం:
పద్యోతన్, కెమెరా: అంజి, నిర్మాత: తుమ్మలపల్లి
రామసత్యనారాయణ, దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ


దర్శకుడు వర్మకూ, హారర్ చిత్రాలకూ తెగని బంధం. జనాన్ని కుర్చీ అంచులో కూర్చోబెట్టే చిత్రాలు తీయాలని ఆయనకు చాలాకాలంగా తపన. పదే పదే విఫలమవుతూ వచ్చినా, ఆ కోరిక ఆయన్ను వదల్లేదు. ఈసారైనా సక్సెస్ సాధించాలనుకుంటూ ఆయన చేసిన తాజా విఫల యత్నం ‘ఐస్‌క్రీమ్’.

కథ ఏంటంటే...
రేణు (తేజస్వి) ఓ మెడికల్ స్టూడెంట్. ఆమె ప్రియుడు విశాల్ (నవదీప్). తల్లితండ్రులు పెళ్ళికి వెళ్ళడంతో లంకంత కొంపలో రేణు ఒంటరిగా ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు ఎదురైన అనుభవాలేమిటి? ఆమె ప్రియుడు విశాల్ ఏం చేశాడు? ఏం జరిగిందన్నది ఈ ‘ఐస్‌క్రీమ్’.

ఎలా ఉందంటే...
ఈ సినిమా పేరే విచిత్రం. కథానాయికకు ఐస్‌క్రీమ్ అంటే తెగ ఇష్టం. ఆమె తరచూ అది తింటూ కనిపిస్తుంటుంది. అందుకనో ఏమో ఈ సినిమాకు అదే పేరు పెట్టారు. కానీ, తీరా సినిమాలో, మరీ ముఖ్యంగా చిత్ర ప్రథమార్ధంలో హీరోయిన్ చేసేదల్లా పడుకోవడం, లేవడం, పై దుస్తులు, లోదుస్తులు మార్చుకోవడం, స్నానం చేయడమే! ద్వితీయార్ధంలోనూ దాదాపు ఇదే తంతు. హీరోయిన్ కలగంటోందా, అతీంద్రియ శక్తులేమైనా ఉన్నాయా - అన్నది అర్థం కాక జనం జుట్టు పీక్కుంటారు. హఠాత్తుగా వర్మ చేసిన ముగింపు, చూపిన కై్లమాక్స్ తొందరగా జీర్ణించుకోలేరు.

హారర్ సినిమా అనగానే కెమేరా పనితనం, రీరికార్డింగ్ కీలకం. విచిత్రమైన కోణాల్లో కెమేరాను ఉంచి తీసిన మాట నిజమే కానీ, సినిమా అంతటా హీరోయిన్ నడుము కింది భాగాన్నే పదే పదే చూపించారు. ఒక దశలో హీరోయిన్ ముఖం నేరుగా తెర మీద కనిపించేది చాలా తక్కువనిపిస్తుంది. వెరసి, ఈ చిత్రీకరణతో దర్శకుడు మరేదో ఉద్దేశించినట్లు అనిపిస్తుంది.

అలాగే, వర్మ మార్కు సంచలనమైన హీరోయిన్ నగ్న సన్నివేశ చిత్రీకరణ కూడా ఫక్తు పబ్లిసిటీ స్టంటేనని అర్థమవుతుంది. కిర్రుమనే తలుపు చప్పుళ్ళు, బాత్రూమ్ కుళాయి నుంచి బొట్లు బొట్లుగా నీళ్ళు పడే చప్పుడు, సన్నటి శబ్దంతో సుడులు తిరిగే గాలి లాంటి హారర్ సౌండ్ ఎఫెక్ట్‌లన్నీ ఉన్నా, నిర్దిష్టమైన కథ కానీ, బలమైన సన్నివేశాలు కానీ ‘ఐస్‌క్రీమ్’లో లేవు.


వెండితెర దుస్సాహసం    
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో సమంత పక్కన మెరిసిన తేజస్వి నాయికగా ప్రమోటై, భయోద్విగ్నతలు బాగానే పలికించారు. ఆమెకు జంటగా నవదీప్ ఫరవాలేదనిపిస్తారు. సినిమా మొత్తం హీరో, హీరోయిన్, ఆమెకు దెయ్యంగా తారసపడే ముసలావిడే కనిపిస్తుంటారు. మరో మూడు పాత్రలు అలా వచ్చి, ఇలా వెళ్ళిపోతాయి. ఇన్ని తక్కువ పాత్రలతో, సినిమా తీయడం ఓ ప్రయోగం, సాహసమే. కానీ, తెలుగు సినిమా మార్కు పాటలేమీ లేకుండానే కాదు... కనీసం కథైనా లేకుండా సినిమా తీయడం వర్మ మాత్రమే చేయగల దుస్సాహసం. సినిమా అంతా ఓ పెద్ద ఇంట్లో కింద హాలు, పైన బెడ్‌రూమ్, బాత్‌రూమ్‌లోనే జరుగుతుంది.

 దాంతో, ఖర్చు కలిసొచ్చిందేమో కానీ, చూసిన పరిసరాలు, సన్నివేశాలే చూస్తున్నట్లనిపించి, కళ్ళతో పాటు బుర్రకూ అలసటనిపిస్తుంది. మొత్తానికి, అంచనాలతో వెళ్ళి, ఈ సినిమాను ధైర్యం చేసి గంటాము ప్పావు భరించగలిగితే చాలు... ఇక సినిమాలంటేనే ఎవరైనా భయపడడం ఖాయం. వర్మ అలా సక్సెసయ్యారు. వాణిజ్యపరంగా చూస్తే, ఈ వెండితెర కల జనం చూడక ముందే హాలులో నుంచి కరిగిపోయే ఐస్‌క్రీమ్. కొసమెరుపు: సినిమా చూసి మల్టీప్లెక్స్ నుంచి బయటకొస్తూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బృందం కాస్తంత బిగ్గరగానే, తమలో తాము అనుకుంటుండగా చెవినపడ్డ మాట -‘‘వర్మా! మాకు ఇదేం ఖర్మ!!’’

బలాలు:  వర్మ ఇమేజ్  తొలిసారిగా ఫ్లోకామ్ టెక్నాలజీ వాడకం, నగ్నంగా నటించిన హీరోయిన్ లాంటి ప్రచారం
 తక్కువ నిడివి సినిమా

బలహీనతలు:  యథార్థ ఘటన ఆధారంగా అల్లుకున్నామని వర్మ ప్రకటించిన అర్థం పర్థం లేని స్క్రిప్టు  విసుగెత్తించే టేకింగ్
 పస లేక నస పెట్టే స్క్రీన్‌ప్లే

- రెంటాల జయదేవ

...................................................

Monday, July 14, 2014

సినిమా రివ్యూ: 'దృశ్యం'


నటీనటులు: వెంకటేశ్, మీనా, నదియా, నరేశ్, రవి కాలే, కృతిక, బేబి ఎస్తేర్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
నిర్మాతలు: డి సురేశ్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి
సంగీతం: శరత్
సినిమాటోగ్రఫి: ఎస్ గోపాల్ రెడ్డి
ఎడిటింగ్: మార్తాండ్ వెంకటేశ్
దర్శకత్వం: శ్రీ ప్రియ
 
- రెంటాల జయదేవ

Saturday, July 12, 2014

వేదిక... వెండితెరల సవ్యసాచి - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు



వేదిక... వెండితెరల సవ్యసాచి
 చిలకలపూడి సీతారామ ఆంజనేయులు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులంటే తెలియని తెలుగు సినీ ప్రియులుం డరు. హీరోగా, ఆ పైన విలన్‌గా, కమెడియన్‌గా, చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా జీవితంలోని వివిధ దశల్లో విభిన్న తరహా పాత్రలను పోషించి, అన్నింటిలోనూ సమాన ఆదరణ పొందిన అరుదైన నటుడాయన.

 రంగస్థలిపై రాణింపు
 రంగస్థలం నుంచి వచ్చినా, వెండితెరకు అనుగుణంగా కొద్ది రోజుల్లోనే తమను తాము మలుచుకొని, రెండు రంగాల్లోనూ సమాన ప్రతిభ చూపిన వారి జాబితాలో మొదట నిలిచే పేరు - సి.ఎస్.ఆర్. 1907 జూలై 11న నరసరావుపేటలో పుట్టి, పొన్నూరు, గుంటూరుల్లో  చదివి, మద్రాసులో స్థిరపడిన ఆయన నాటక, సినీ రంగాలు రెంటిలోనూ మకుటం లేని మహారాజుగా వెలిగారు. చిన్నతనంలోనే నాటకాలు వేసిన ఆయన పెద్దయ్యాక తీరైన విగ్రహం, తీయనైన కంఠంతో అభిమానుల్ని సంపాదించుకున్నారు.

 అప్పటికే ఆడపాత్రలు వేసే పురుషుడిగా ప్రతిష్ఠ సంపాదించుకున్న ‘పద్మశ్రీ’ స్థానం నరసింహారావు పక్కన ముఖ్య పాత్రలో సి.ఎస్.ఆర్.ది అపూర్వమైన కాంబినేషన్‌గా రంగస్థలంపై వెలిగిపోయింది. స్వతహాగా జాతీయవాదైన సి.ఎస్.ఆర్. ఆ రోజుల్లోనే హరిజనుల అభ్యుదయంపై ‘పతిత పావన’, అలాగే సంత్ ‘తుకా రామ్’ లాంటి నాటకాలు రాయించుకొని, తన సొంత నాటక సమాజం ‘శ్రీలలిత కళాదర్శ మండలి’ పక్షాన ప్రదర్శించడం ఓ చరిత్ర. తుకారామ్ నాటక ప్రదర్శన ద్వారా వచ్చిన డబ్బును సుభాష్ చంద్రబోస్ ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’కి అందజేయడం ఓ అపూర్వ ఘట్టం. ఆ రంగస్థల పేరుప్రతిష్ఠలు ఆయనకు సినీ ఆహ్వానమిచ్చాయి.

 వెండితెరకు కొత్త వెలుగు
 1933లో తీసిన ‘రామదాసు’ చిత్రంలో సి.ఎస్.ఆర్. శ్రీరాముడి పాత్ర పోషించినా, అది వెలుగులోకి రాలేదు. కానీ, ఆ తరువాత హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోని బాక్సాఫీస్ హిట్ ‘ద్రౌపదీ వస్త్రాపహరణము’ (1936)లో శ్రీకృష్ణుడిగా తెరపై స్థిరపడ్డారు. ‘తుకారామ్’ (’37)గా వెలిగారు. పి. పుల్లయ్య తీసిన ‘శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యము’ (’38) ఘన విజయంతో తొలి తెర వేలుపయ్యారు. అక్కడ నుంచి ఒకపక్క ‘జయప్రద’, ‘భీష్మ’ లాంటి చిత్రాల్లో పురాణ, చారిత్రక కథా పాత్రల్లో, మరో పక్క ‘చూడామణి’, ‘గృహప్రవేశం’ లాంటివాటిల్లో నవతరం సాంఘిక పాత్రల్లో సమాన ప్రజ్ఞను చూపడం ఆయనలోని గొప్పదనం. ముఖ్యంగా సారథీ వారి ‘గృహప్రవేశం’ (’46)లో ‘మై డియర్ తులశమ్మక్కా’ అంటూ ఆయన పాడిన పాట, చేసిన నృత్యం ఇవాళ్టికీ హైలైట్. విజయా వారి ‘మాయాబజార్’ (’57)లో శకునిగా ఆయన చూపిన అభినయం, ‘ముక్కోపానికి మందు ముఖస్తుతి ఉండనే ఉందిగా!’ అంటూ చెప్పిన డైలాగులు ఇవాళ్టికీ జనానికి గుర్తే. ‘లైలా మజ్ను’, ‘దేవదాసు’, ‘కన్యాశుల్కం’, ‘రోజులు మారాయి’, ‘అప్పు చేసి పప్పుకూడు’ లాంటి చిత్రాల్లో అటు దుష్టత్వమైనా, ఇటు లలితమైన హాస్యమైనా, సాత్త్వికాభినయమైనా  - తూకం వేసినట్లు పండించిన ఆయన పాత్రలు నవతరం నటులకు ఓ పెద్దబాలశిక్ష. దర్శకుడిగా ‘శివగంగ’, ‘రిక్షావాలా’ లాంటి ప్రయత్నాలు పురిటిలో సంధి కొట్టడంతో సి.ఎస్.ఆర్.లోని మరో ప్రతిభా పార్శ్వం బహిర్గతం కాలేదు. 


 పాండీబజార్ పరమ శివుడు
 చిత్రసీమ మద్రాసు మహానగరంలో వెలిగిన ఆ రోజుల్లో నటీనటులకు ఆటపట్టయిన టి.నగర్‌లోని పాండీబజార్ ఉదయాస్తమాన వేళల్లో సి.ఎస్.ఆర్‌కు శాశ్వత చిరునామా. అందమైన ‘బ్యూక్’ కారు వేసుకొని వచ్చి, పాండీబజార్ గీతా కేఫ్ (ఇప్పటికీ ఉంది) సెంటర్‌లో, చెట్టు కింద నిలబడి, వచ్చే పోయే సినీ జనాన్ని పలకరిస్తూ ఆయన నడిపిన మాట కచ్చేరీలు అనంతం. అందరినీ ఆదరిస్తూ, గుప్తదానాలతో ఆదుకుంటూ వచ్చి, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుణ్ణి వదిలి, పెద్ద వయసు రాకుండానే కన్నుమూశారు. ఆయన చనిపోతే, రంగస్థల ప్రియులు ‘తుకారామ్ పోయాడ’న్నారు. సీనియర్ సినీ జర్నలిస్టు ఇంటూరి ‘సి.ఎస్.ఆర్. లేని పాండీబజార్... శివుడు లేని కైలాసం’ అని వాపోయారు.

 తెలుగు తెర చరిత్రను పరికిస్తే, మాటకు ముక్కును కూడా ఒకింత ఆసరాగా చేసుకున్న సి.ఎస్. ఆర్. విలక్షణ వాచికం అప్పటికీ, ఇప్పటికీ ప్రత్యేకమే. పద్యాన్నీ, వచనాన్నీ విలక్షణ రీతిలో చెప్పడమే కాక, ఒకే మాటను ఆయా సమయ, సందర్భాలకు తగ్గట్లు భిన్న రసాలతో పలికించి, మెప్పించేవారు. ప్రత్యేకమైన ఆంగికాభినయం కూడా అంతే ప్రత్యేకం. వాటికి పాత్రోచితమైన ఆహార్యం కూడా తోడవడంతో, సి.ఎస్.ఆర్. ఏ పాత్ర చేసినా, అక్కడ ఆ పాత్ర తాలూకు స్వరూప స్వభావాలే సాక్షాత్కరించేవి. నాగయ్య లాంటి గొప్ప నటుడు సైతం ‘ఒక రకంగా సి.ఎస్.ఆర్. నాకు గురువు’ అన్నది అందుకే. ఈనాటి బాక్సాఫీస్ ప్రమాణాల్లో టాప్ స్టార్‌గా వెలగకపోయినా, ఉత్తమ నటుడిగా ిసి.ఎస్.ఆర్. వెలిగారు. నూట ఏడేళ్ళ క్రితం పుట్టి, అయిదు దశాబ్దాల క్రితమే (1963 అక్టోబర్ 8) భౌతికంగా దూరమైనా ఇవాళ్టికీ జనం నోట మిగిలారు.

 - రెంటాల జయదేవ
.................................................

Friday, July 11, 2014

విజయం - నాడు రిక్షావాలా... నేడు రాష్ట్రపతికి అతిథి!

నాడు రిక్షావాలా... నేడు రాష్ట్రపతికి అతిథి!
రిక్షా కార్మికుడిగా మొదలైన ఆయన ఇప్పుడు సాక్షాత్తూ భారత రాష్ట్రపతి నివాసంలో అతిథి. ఇరవై ఏడేళ్ళ క్రితం ఢిల్లీలో ఈ బ్రిటిష్ కాలపు భవనాలను అబ్బురంగా చూస్తూ తిరిగిన ఆయనకు ఇది ఊహించని అనుభవం. హర్యానా వాసి అయిన 51 ఏళ్ళ ధరమ్‌వీర్ కాంబోజ్ ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి ఉంది. ఎంతోమందికి ఉపయోగపడే యంత్రాన్ని రూపొందించిన పట్టుదల ఉంది.

ధరమ్‌వీర్ కథ అచ్చంగా ఓ సినిమా కథలా ఉంటుంది. హర్యానాలోని యమునా నగర్ ధరమ్‌వీర్ సొంత ఊరు. ఒకానొక దశలో కన్నకూతురి స్కూల్ ఫీజు కూడా కట్టలేని దుర్భర స్థితిలో గడిపారు. భార్యాబిడ్డల్ని పోషించలేక, తండ్రితో మాటా మాటా రావడంతో, 23 ఏళ్ళ వయసప్పుడు 1986లో ధరమ్‌వీర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఢిల్లీకి చేరిన ఆ యువకుడు రిక్షా కార్మికుడిగా మారాడు. కానీ, 1987లో ప్రమాదానికి గురవడంతో తప్పనిసరై, ఇంటికి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది.

అప్పుడు కొన్ని నెలల పాటు మంచానికే పరిమితమవ్వాల్సి వచ్చింది. అప్పుడే ఓ ఆలోచన ఆయన మెదడును తొలిచేసింది. రైతులైన తాము గ్రామాల్లో పండించే పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలకు ఆట్టే లాభం రావడం లేదనీ, అదే గనక వాటిని ప్రాసెస్ చేసి, ప్యాకేజ్ చేస్తే లాభం వస్తోందని ఢిల్లీలో ఉండగా ఆయన గమనించారు. ఆ ఆలోచన జీవితాన్నే మార్చేసింది.

ప్రమాదం నుంచి కోలుకోగానే రైతులతో మాట్లాడడం మొదలుపెట్టారు. సేంద్రియ వ్యవసాయంలో అనేక రకాల ప్రయోగాలు చేశారు. చివరకు రూపొందించిన ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రం ఘన విజయం సాధించింది. గంటకు 200 కిలోలకు పైగా టమోటాల నుంచి గుజ్జు తీసే యంత్రమది.

కలబంద, ఉసిరి, నేరేడు లాంటి వాటి నుంచి, అనేక ఇతర ఔషధమూలికల నుంచి రసం తీయడానికీ, వాటిని రకరకాల ఉత్పత్తులుగా తయారు చేయడానికి కూడా ఉపకరించే ఆ యంత్రమే ఇప్పుడు ఆయనను దేశ ప్రథమ పౌరుడికి అతిథిని చేసింది. రాష్ట్రపతి భవన్ అతిథులుగా ఎంపిక చేసిన అయిదుగురు నవీన ఆవిష్కర్తల్లో ఒకరిని చేసింది.
 ‘‘ఈ యంత్రాన్ని తయారుచేయడానికి నాకు 11 నెలలు పట్టింది.

‘నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్’కు చెందిన అధికారులు 2008లో నేనుంటున్న దామ్లా గ్రామానికి వచ్చి, యంత్రం ఎలా పనిచేస్తుందో చూశారు’’ అని ధరమ్‌వీర్ చెప్పుకొచ్చారు. ఆ ప్రయత్నం ఫలించి, గుర్తింపు తేవడంతో ఈ నెల ఒకటి నుంచి ఇరవై రోజుల పాటు రాష్ట్రపతి భవన్‌లో అతిథిగా గడుపుతున్నారాయన. ధరమ్‌వీర్ రూపొందించిన యంత్రం ద్వారా పువ్వుల నుంచి, ఔషధ మొక్కల నుంచి సారం తీసి, జెల్ లాగా కూడా చేయవచ్చు.

‘‘హోలీ రంగుల కోసం మా అమ్మ పువ్వులు సేకరించడం, వాటి నుంచి రసం తీయడం లాంటి నా చిన్ననాటి సంగతులు ఇప్పటికీ గుర్తే’’ అంటూ ఔషధ రసాలు తీయడం వెనుక తనకున్న ఆసక్తికి కారణాన్ని ఈ అయిదుపదుల సృజనశీలి తెలిపారు. చెరుకుగడల పిప్పి సాయంతో పుట్టగొడుగులు పెంచి, రికార్డు స్థాయి దిగుబడి సాధించారు. టేప్ రికార్డర్ మోటార్‌ను వాడుతూ, బ్యాటరీ ద్వారా పని చేసే స్ప్రేయింగ్ యంత్రం, అలాగే క్రిమికీటకాలను పట్టుకొనే మరో సాధనం లాంటివి కూడా రూపొందించారు.

ఆయన ఈ ప్రయోగాలు చేస్తున్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. కానీ, ఇవాళ నవ్విన నాపచేనే పండింది. ఈ యంత్రాల కోసం ఇప్పటికే విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ‘‘కెన్యాలోని ఓ సంస్థకు ఇలాంటి 20 యంత్రాలు సరఫరా చేస్తున్నా’’ అని ధరమ్‌వీర్ చెప్పారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, పదో తరగతి పైన చదువుకోలేకపోయిన ఆయన బడిలో చదువుకుంటున్నప్పుడే సైన్స్ ఎగ్జిబిషన్లలో ఎమర్జెన్సీ లైట్ తయారు చేశారు.

ఆ దశ నుంచి గంటలో 100 కిలోల కలబందను ప్రాసెస్ చేసే యంత్రాన్ని రూపొందించే స్థాయికొచ్చారు. అది బాయిలర్‌గా, స్టెరిలైజర్‌గా, కుకర్‌గా రకరకాలుగా ఉపయోగపడుతుంది. దాంతో, బియ్యం ఉడికించవచ్చు. టొమేటా కెచప్ చేయవచ్చు. మసాలా దినుసులు, పండ్ల నుంచి పొడి తీయవచ్చు.

ఈ ఉత్సాహవంతుడి కృషిని గమనించి హర్యానా ప్రభుత్వం ఇప్పటికే తమ హిసార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బోర్డ్ సభ్యుడిగా కూడా ఆయనను నియమించింది. అనేక అవార్డులూ వచ్చాయి. అయితే, ఒకప్పుడు తిట్టిన తండ్రి ఈ ఘన విజయాలను కళ్ళారా చూడలేకపోయారని ఆయన ఇప్పటికీ బాధపడుతుంటారు. తిండికి గడవని రోజుల నుంచి ఇవాళ నెలకు రూ. 50 వేలు సంపాదిస్తూ, కనీసం పాతికమందికి పైగా ఉపాధి కల్పించే దశకు చేరుకోవడం ఆయన ఘనత.

తాను పెద్దగా చదువుకోకపోయినా కొడుకును కంప్యూటర్ ఇంజనీర్‌నూ, కూతుర్ని ఎం.బి.ఎ. పట్టభద్రురాలినీ చేశారు. అలోవెరా షాంపూలూ, చూర్ణాలు, జెల్, ఫేస్‌ప్యాక్, ఉసిరికాయ జ్యూస్, లడ్డూ, బర్ఫీ లాంటివి తన కుమారుడు ప్రిన్స్ పేరు మీద తయారు చేస్తున్నారు. ఉత్తరాదిన ఈ ఉత్పత్తులు జోరుగా అమ్ముడవుతున్నాయి. భార్య సహకారం వల్లే ఇదంతా సాధ్యమైందంటున్న ధరమ్‌వీర్ సానుకూల దృక్పథం, కఠోర పరిశ్రమ, ఏదైనా సరే నేర్చుకోవాలన్న తపన తన బలాలంటున్నారు. విజయ సాధకులకు కావాల్సినవేమిటో ఇక వేరే చెప్పాలా?     - మహతి

(Published in 'Sakshi' daily, 9th July 2014, Wednesday)

..........................................

Thursday, July 10, 2014

ఆ వారం నాన్నగారితోకలసి పనిచేయడం కష్టమైంది! - దర్శకుడు అక్కినేని అక్షయ్

ఆ కుర్రాడికి పెద్ద సినీ నేపథ్యమే ఉంది. తాత ఎ. సంజీవి పేరున్న ఎడిటర్. తండ్రి ఎ.శ్రీకర్‌ప్రసాద్ ఏకంగా ఎనిమిది జాతీయ అవార్డులు అందుకున్న ఎడిటర్. అలాంటి కుటుంబంలోని కుర్రాడు సినీ రంగంలోకి రావడం చిత్రమేమీ కాదు. కానీ, 27 ఏళ్ళ అక్షయ్ అక్కినేని... ఎడిటింగ్ శాఖలో కాకుండా దర్శకత్వంలో అడుగుపెట్టడం మాత్రం చిత్రమే. పైగా, తొలి అడుగే హిందీ చిత్రసీమలో! పెపైచ్చు తొలి చిత్రమే 3డిలో! అదీ కాక, ఆ సినిమా తమిళ, తెలుగు భాషల్లో సూపర్‌హిట్టయిన ‘పిజ్జా’కు రీమేక్! ఇన్ని విశేషాలతో వచ్చే నెల 18న ‘పిజ్జా-3డి’ దర్శకుడిగా జనం ముందుకొస్తున్న అక్షయ్‌తో కాసేపు...

 మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది?
 చిన్నప్పటి నుంచీ సినిమా రంగంలోకి రావాలన్నది నా కల. అయితే, అది దర్శకత్వమా, ఎడిటింగా అనుకోలేదు. పెద్దయ్యాక దర్శకత్వం వైపు మొగ్గు చూపా. ఆలిండియా స్థాయిలో మంచి ర్యాంక్ వచ్చి, ఐ.ఐ.టి.లో చేరాల్సి ఉన్నప్పటికీ, అటు వెళ్ళకుండా సినీ రంగం వైపు వచ్చేశా.

  మీ ఇంట్లో ఏమీ అనలేదా? నాన్నగారు ‘అలా కాదు... ఇలా’ అని చెప్పలేదా?
 నేను సినిమాల్లోకి వెళతానని చెప్పగానే, నాన్న ఎందుకు, ఏమిటి అని అడుగుతారనుకున్నాను. కానీ, ఒక్క క్షణమైనా మరో ఆలోచన చేయకుండా ఆయన సరే అన్నారు. ఒక్కగానొక్క బిడ్డనైన నన్ను మా అమ్మ కూడా ప్రోత్సహించింది.

 దర్శకత్వంలోకి రావాలనుకున్నప్పుడు మీరు ఎలాంటి శిక్షణ తీసుకున్నారు?
 చిన్నప్పటి నుంచి నాన్న ఎడిటింగ్ సూట్‌లలో, సినిమా ల్యాబ్‌లలో తిరుగుతూ పెరగడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చా. చెన్నైలోని పూనమల్లి హైరోడ్‌లో ఉన్న ఎస్.ఐ.ఐ.టి-జె.ఇ.ఇ.లో ప్లస్ 2 చదివిన నేను లయోలా కాలేజ్‌లో విజువల్ కమ్యూనికేషన్స్ కూడా చేశా. ఆ సమయంలోనే చాలా మ్యూజిక్ వీడియోలకూ, షార్ట్‌ఫిల్మ్‌లకూ పనిచేశా. పవన్‌కల్యాణ్ ‘పంజా’ చిత్రానికి దర్శకుడు విష్ణువర్ధన్ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా సినీ రంగంలో అడుగుపెట్టా. ‘అడియోస్’ అనే లఘుచిత్రానికి రచన, దర్శకత్వం వహించా. అది చూపెట్టినప్పుడు, దర్శక - రచయిత బిజయ్ నంబియార్‌కు నచ్చి, తన దగ్గర పని చేయడానికి నన్ను ముంబయ్‌కి వచ్చేయమన్నారు. ఆయన దర్శకత్వంలో ‘ఎం’ టి.వి.లో వచ్చిన ‘రష్’ అనే టీవీ షోకు కూడా సహాయ దర్శకుడిగా పనిచేశా. ఆ పైన ఆయన దర్శకత్వంలోనే విక్రమ్ హీరోగా తయారైన ‘డేవిడ్’ అనే తమిళ, హిందీ చిత్రానికి పనిచేశాను. ఆయనే నాకు ‘పిజ్జా’ హిందీ రీమేక్‌తో దర్శకుడిగా భారీ అవకాశమిచ్చారు.

 దర్శకుడిగా తొలి అవకాశమే పెద్దది రావడం విశేషమే! తొలి చిత్రంగా రీమేక్‌ను ఎంచుకోవడం సేఫ్ అనా?
 తెలుగు అనువాద రూపంలోనే కాక, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్‌గా కూడా అలరించిన కథ కావడం, అలాగే హిందీలో ప్రతిష్ఠాత్మక యు టి.వి. సంస్థ నిర్మించడం లాంటివన్నీ తొలి సినిమాకే లభించడం విశేషమే. మంచి అవకాశం వచ్చిందని అంగీకరించానే తప్ప, రీమేకా, మరొకటా అన్నది ఆలోచించనే లేదు. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కథలో మార్పులు చేశాను. మాతృకతో పోలిస్తే, దాదాపు 60 నుంచి 70 శాతం మార్చాం కాబట్టి, ఓ కొత్త సినిమా చూస్తున్నట్లే అనిపిస్తుంది.


 మరి 3డి ఎందుకు ఎంచుకున్నట్లు?
 కథను బాగా చెప్పడానికి 3డి టెక్నాలజీ తోడ్పడుతుందని నేనేప్పుడూ అనుకుంటూ ఉంటాను. పైగా, ‘పిజ్జా’ కథకు ఇది అతికినట్లు సరిపోతుంది. సినిమా ప్రారంభిస్తున్నప్పుడే 3డిలో తీయాలనుకున్నాం.

 తొలి సినిమానే 3డిలో తీయడం కష్టం కాలేదా?
 3డి వ్యవహారం చూడడానికి ఓ టీమ్ ఉంది. సినిమా చిత్రీకరణ ప్రారంభించే ముందు నేను, నా కెమెరామన్ జయకృష్ణ గుమ్మడి కలసి 3డిలో చిత్రీకరణ గురించి వారం రోజుల పాటు అధ్యయనం చేశాం. పుస్తకాలు చదివి, నెట్‌లో చూసి, దాని మీద అవగాహన పెంచుకున్నాం. 3డిలో చిత్రీకరణ విధానమైన స్టీరియోస్కోపీలో రకరకాల పద్ధతులున్నాయి. అందులో ఒకటి ఎంచుకున్నాం. వేగంగా, సాఫీగా పని చేసే సెమీ-ఆటోమేటిక్ రిగ్ అయిన ‘టి.ఎస్ 5’ను వాడాం. ఇన్ని జాగ్రత్తల వల్ల ముంబయ్‌లోనే 45 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసేశాం.

 మీ నాన్న దగ్గర ఎడిటింగ్ చూశారు. ఇప్పుడు దర్శకత్వం చేశారు. ఇదే కష్టమనిపించిందా?
 ఎడిటింగ్‌లోకి నేను వెళ్ళకూడదని కాదు కానీ, నా మటుకు నాకు దర్శకత్వం మరింత ఆనందదాయకమని అనిపించింది. నన్నడిగితే ఎడిటింగ్, దర్శకత్వం - దేనికదే ఓ పెను సవాలు. ఆ రెండు సవాళ్ళనూ పోల్చలేం.

 ఈ చిత్రానికి మీ నాన్నే ఎడిటర్. ఆయనతో కలసి దర్శకుడిగా పని చేయడం ఎలా ఉంది?
 మొదటి వారం రోజులు కష్టమైంది. వ్యక్తిగతంగా తండ్రీ కొడుకులుగా కాక, వృత్తి నిపుణులమైన ఎడిటర్ - దర్శకులుగా వ్యవహరించడానికి కాస్తంత టైమ్ పట్టింది. ఆ తరువాత ఈ ప్రక్రియ అందమైన ప్రయాణంగా మారింది.

 దర్శకుడిగా మీ పని తీరు చూసి, ఆయన ఏమన్నారు?
 సంతోషించారు. ఓ ఎడిటర్‌గా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పట్ల ఆనందం వెలిబుచ్చారు. కొన్నిచోట్ల మరికొంత బాగుండాల్సిందన్నారు.

 ఇంతకీ దర్శకునిగా ఏం నేర్చుకున్నారు?
 ఎంతో నేర్చుకున్నాను. గతంలో నేర్చుకున్నవెన్నో వదిలించుకున్నాను. నా తోటి టెక్నీషియన్ల నుంచి నేర్చుకుంటూనే ముందుకు వెళ్ళాలి... వెళతాను కూడా!

 ఒక వ్యక్తిగా మీ నాన్న నుంచి మీరు నేర్చుకున్నది?
 అది చెత్త సినిమా కావచ్చు, మంచి సినిమా కావచ్చు... పని చేస్తున్నప్పుడు త్రికరణశుద్ధిగా, సర్వశక్తులూ పెట్టి కృషి చేయాలి. ఆ విషయం ఆయన నాకెప్పుడూ చెప్పలేదు కానీ, ఆయన ఆ పనే చేస్తారు. ఆయనను చూసి నేనది నేర్చుకున్నాను.

 దర్శకుడిగా  తదుపరి ప్రణాళికలు
 ‘పిజ్జా - 3డి’ తరువాత ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. కాకపోతే, దర్శకుడిగా ప్రయాణం సాగిస్తాను. ప్రస్తుతం ముంబయ్‌లో ఉన్నా, నా కేంద్రస్థానం - మద్రాసే. తమిళనాట పుట్టి పెరిగి, ముంబయ్ దాకా వచ్చిన తెలుగు కుర్రాడిగా తమిళ, హిందీ, తెలుగు భాషలు మూడింటిలోనూ తప్పక సినిమాలు చేస్తాను. ప్రేక్షకులను అలరిస్తాను.

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 7th July 2014, Monday)
..............................................

Monday, July 7, 2014

నాకు సంగీతం తెలియదు... సంగీతానికి నేను తెలుసు! - డాక్టర్ మంగళంపల్లి బాలమురళి


నాకు సంగీతం తెలియదు...  సంగీతానికి నేను తెలుసు!
 ఆయన అపర త్యాగయ్య అంటారు కొందరు! 
ఆయనకు అహంకారమంటారు... ఇంకొందరు!
 మితిమీరిన ఆత్మవిశ్వాసమంటారు... మరికొందరు! 
ఎవరేమన్నా, అనుకొన్నా వెరవని స్వభావం...
 సంగీతంలో, జీవితంలో నిత్య ప్రయోగశీల వ్యక్తిత్వం...
 నమ్మినదాన్ని ఆచరించే పట్టుదల...
 నమ్మి వచ్చినవారికి ఆశ్రయమిచ్చే ఔదార్యం...
 సమకాలీన కర్ణాటక సంగీత ప్రపంచంలో
 అరుదైన వాగ్గేయకారుడిగా గౌరవం...
 76 ఏళ్ళుగా పాడుతున్నా...
 ఇప్పటికీ వన్నె తగ్గని ఆ మధు మురళి...
 డాక్టర్ మంగళంపల్లి బాలమురళి.

 త్యాగరాజ స్వామి వారి శిష్యపరంపరలో అయిదో తరం వ్యక్తిగా... తెలుగువారి ఆస్తి ఆయన.
 ‘పద్మశ్రీ’, ‘పద్మవిభూషణ్’, ఫ్రాన్స్ దేశపు అత్యున్నత సత్కారం ‘షెవాలియర్’...
 ఇలా అన్నీ ఈ భారత జాతిరత్నం ద్వారా తమ గౌరవాన్ని పెంచుకున్నవే.

ఎంత ఎత్తు ఎదిగినా, హృదయంలోని
 పసితనాన్ని ఇప్పటికీ పోగొట్టుకోని...
 84 వసంతాల నిత్య బాలుడాయన.

 నేడు (June 6) పుట్టినరోజు జరుపుకొంటున్న
 ఈ ముగ్ధమోహన గాన మురళితో
 ‘సాక్షి’ మాటకచ్చేరీ...

............................................


 త్యాగరాజస్వామి ప్రత్యక్ష శిష్యపరంపరలో నేను అయిదో తరం వాణ్ణి... త్యాగరాజస్వామి, వారికి మానాంబుచావిడి (ఆకుమళ్ళ) వెంకట సుబ్బయ్య, ఆయనకు సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి, సుసర్లకు పారుపల్లి రామకృష్ణయ్య, ఆయనకు నేను... ఇలా!
 
గానమే కాకుండా అనేక వాద్యాల మీద నాకు పట్టు మొదలైంది ద్వారం వెంకట స్వామి నాయుడుగారి వయొలిన్ కచ్చేరీతో! ఆయన వాయిస్తుంటే విని విని, చూసి చూసి, చటుక్కున వయొలిన్ తీసి వాయించడం మొదలు పెట్టాను.
తర్వాత వయోలా, మృదంగం, కంజీరా, వీణ ఇలా... చాలానే!
నేను పాడిన తెలుగు సినిమా పాటల్లో నాకిష్టమైనవి... ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు..’ (ఉయ్యాల - జంపాల),


‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా...’ (గుప్పెడు మనసు), ‘పాడనా వాణి కల్యాణిగా...’ (మేఘసందేశం), ‘నర్తనశాల’లోని ‘సలలిత రాగ సుధారస సారం...’లాంటివి..!

ఆత్మకథ రాయమని అడిగేవారికి నేను చెప్పేదొక్కటే... నా మీద ఇప్పటికే చాలా పుస్తకాలు వచ్చాయి. ఎంతోమంది నా జీవితానికి అక్షరరూపం ఇచ్చారు, ఇస్తున్నారు కూడా. నా జీవితం, సంగీత కృషి మీద ఇప్పటికే విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగింది. పిహెచ్.డి. పట్టా కూడా దక్కాయి. ఇక నేను రాయడమెందుకు!

సంగీతానికి నేనిచ్చే నిర్వచనం... లైఫ్! సంగీతం అంటే ప్రాణం, జీవం. అదే మనిషి జీవితం. అంతేతప్ప, సంగీతం అంటే ఏవో నాలుగైదు కీర్తనలు పాడడం కాదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొనే మాటల్లో కూడా సంగీతం ఉంటుంది. ఆ సంగీతం సరిగ్గా కుదరకపోతే, ఒకరు మాట్లాడేది మరొకరికి అర్థం కాదు. ఆ సంగీతం సమశ్రుతిలో ఉంటే, అదే బ్రహ్మానందం!

................................................

ఎనిమిదేళ్ళు నిండీనిండగానే కచ్చేరీలు మొదలు పెట్టారు. ఇప్పటికి 76 ఏళ్ళుగా వేల కచ్చేరీలు చేశారు. అసలు తొలిసారిగా మీరిచ్చిన కచ్చేరీ..?
1938 జూలైలో అనుకుంటా... బెజవాడలోని దుర్గాపురంలో శరభయ్యగారి గుళ్లో హాలు ప్రారంభోత్సవం... మా గురువుగారైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు తమ గురువులైన సుసర్ల దక్షిణామూర్తిగారి పేర ‘సద్గురు ఆరాధనోత్సవాలు’ జరుపుతున్నప్పుడు నాతో కచ్చేరీ చేయించారు. కొద్దిసేపనుకున్న నా గానం కొన్ని గంటలు మంత్రముగ్ధంగా సాగింది. నా తరువాత హరికథ చెప్పాల్సిన సుప్రసిద్ధులు ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ తన ప్రోగ్రామ్ కూడా వద్దని, నన్ను ఆశీర్వదించారు. అప్పటి దాకా నా పేరు మురళీకృష్ణ. పసివాడినైన నాకు ‘బాల’ అనే మాట ఆయనే చేర్చి, ‘బాల మురళీకృష్ణ’గా దీవించారు.

అసలు మీరు పుట్టింది... చదువుకున్నది ఏ ఊరిలో..?
 తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో పుట్టా. నేను పుట్టిన పక్షం రోజులకే మా అమ్మ సూర్యకాంతమ్మ చనిపోయింది. దాంతో, మా అమ్మగారి అక్కల్లో అందరి కన్నా పెద్దవారూ, బాలవితంతువైన మా పెద్దమ్మ సుబ్బమ్మ గారు నన్ను పెంచారు. నేను స్కూల్‌లో చేరి చదివింది సరిగ్గా 3 నెలలే. నా పాట విని, విజయవాడ గవర్నర్‌పేటలోని మునిసిపల్ స్కూల్‌లో హెడ్‌మాస్టర్ నాకు ఫస్ట్ ఫారమ్‌లో ప్రవేశం కల్పించారు. మా నాన్నగారు నన్ను ముందు కూర్చోబెట్టుకొని, సైకిల్ తొక్కుతూ బడికి తీసుకువెళ్ళడం నాకిప్పటికీ గుర్తే. బడిలో కూడా నా పాటలే ఆకర్షణ. అంతా నా చుట్టూ చేరేవారు.

అయితే, నా సంగీతంతో మిగిలిన పిల్లల చదువు కూడా పాడవసాగింది. ఇంతలో నేను క్వార్టర్లీ పరీక్షలు తప్పాను. దాంతో, ‘మీ వాడికి చదువు కన్నా సంగీతమే కరెక్ట్. అందులోనే కృషి చేయించండి’ అని హెడ్‌మాస్టర్ నాన్న గారికి చెప్పారు. (నవ్వుతూ) అలా 6వ తరగతి ఫెయిలై, స్కూలు చదువు అటకెక్కినా, వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 12 డాక్టరేట్లు అందుకొని, డాక్టర్‌నయ్యా. రేడియోలో పని చేస్తున్న రోజుల్లో బెజవాడలో ఓ ఆడ ఇంగ్లీష్ ఎనౌన్సర్ నా పాట విని నచ్చి, ఇంగ్లీషులో మెచ్చుకొని, షేక్‌హ్యాండ్ ఇవ్వబోతే అర్థంకాక జంకాను. ఆ తరువాత పట్టుబట్టి, 3 నెలల్లో ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించి, ఆమెతో అనర్గళంగా మాట్లాడా. రోటరీక్లబ్‌లో ఇంగ్లీషులో నా తొలి ఉపన్యాసమిచ్చా. అలాగే, సంస్కృతం మీద పట్టు సాధించా.

చిన్ననాటి అనుభవాలు మరికొన్ని...

 నా 11వ ఏట తిరువయ్యారులో త్యాగరాయ ఆరాధనోత్సవాలలో పారుపల్లివారికిచ్చిన సమయంలో నేను పాడినప్పుడు, జనం నుంచి అపూర్వ స్పందన వచ్చి, చుట్టూ మూగితే, నాగరత్నమ్మ గారు నన్ను తీసుకువెళ్ళి, త్యాగరాజస్వామి విగ్రహం పాదాల చెంత పడేశారు. ‘ఏ నరదృష్టీ సోకకుండా ఈ పిల్లవాణ్ణి కాపాడమ’ని ప్రార్థించారు. ఇక, బెజవాడలోని సత్యనారాయణపురంలో మా ఇంటికి ఎదురుగా ఉన్న దూబగుంట వారి సత్రంలో చాతుర్మాస్య దీక్షకని కుర్తాళం పీఠాధిపతి వచ్చారు.

ఆయన పారుపల్లి వారికి ఆధ్యాత్మిక గురువు. స్వామీజీని కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రేరణ, ఆశీర్వాదం అందుకొని, 72 మేళకర్త రాగాల్లో కీర్తనల రచన ‘జనక రాగ కృతి మంజరి’ మొదలుపెట్టాను. ఇక, శరభయ్యగారి గుళ్ళలో ఉండే దేవీ ఉపాసకుడు, పండితుడు అయ్యప్పశాస్త్రి నాకు యతి, ప్రాస, కవితా లక్షణాలను చెప్పడం, కృతి, కీర్తన, పాట, పదం, జావళీల భేదాలు, రచనా రహస్యాలు తెల్పడం నా సాహితీ రచనకు వన్నెలద్దింది. ప్రతిభకు పెద్దల ఆశీర్వాద బలం తోడైంది.

మీ జీవితంలో గురువుగారి పాత్ర? ఆయనలో మీరు చూసిన ప్రత్యేకత?

 మా గురువు పారుపల్లి వారు లేకపోతే, ఆంధ్రదేశంలో ఇవాళ కర్ణాటక సంగీతం ఇంతగా ప్రాచుర్యంలోకి వచ్చేది కాదు. బెజవాడలో గాంధీనగర్‌లోని ఆయన ఇంటికి సైకిల్ మీద వెళ్ళి, పాఠం చెప్పించుకున్న రోజులు నాకింకా గుర్తే. శిష్యులమైన మా అందరికీ ఆయన తనకు తెలిసిన విద్యనంతా నేర్పారు. గమ్మత్తేమిటంటే, పారుపల్లి వారి దగ్గర మా నాన్న గారూ పాఠం చెప్పించుకున్నారు. తండ్రీ కొడుకులిద్దరికీ ఆయనే గురువన్న మాట!

కానీ, పారుపల్లి వారి వద్ద నేర్చుకున్న త్యాగరాయ సంగీతం కన్నా, మీ సొంత బాణీకీ, కృతులకే మీరు ప్రాధాన్యమిచ్చారని మరో విమర్శ...
త్యాగరాజస్వామి ముందువాళ్ళు ఎవరు ఎలా పాడేవారో ఎవరికీ తెలీదు కదా! ఆయన ఆ రాగాల్లో కృతులు రాసుకొని, ఆలపించారు. ఆ త్యాగరాయ సంగీతం పరంపరాగతంగా మా వరకు వచ్చింది. ఆ సంగీతాన్ని పాడుతూనే, పెద్దగా పాపులర్ కాని రాగాల్లో సైతం కీర్తనలు రాసి పాడాను. రాగాలు కనిపెట్టాను. అలా రచన, గానంతో వాగ్గేయకారుణ్ణయ్యాను. నా పద్ధతి, పాట ‘బాలమురళి బాణీ’గా ప్రచారంలోకి వచ్చింది. అదేదో నేను ఉద్దేశపూర్వకంగా కొత్తగా, ధైర్యంగా చేశానని చెప్పను కానీ, అలా జరగాలని రాసి ఉంది....  జరిగింది. అంతే!

రేడియో పాపులారిటీకి కూడా ఎంతో శ్రమించారు. ఉదయం వేళ ‘భక్తి రంజని’ ఆలోచన మీదేనట!
అవును. ఆ రోజుల్లో కోరి మరీ రేడియోలో చేరాను. ఉదయాన్నే నిద్ర లేస్తూనే, మంచి సంగీతం వింటే, శ్రోతలకు బాగుంటుందని ఆ భక్తి సంగీత కార్యక్రమం పెట్టాను. దాని కోసం ఎన్నో తత్త్వాలు, భక్తి కీర్తనలు సుప్రసిద్ధులెందరితోనో పాడించాను. సంగీతం, నాటకం, స్పోకెన్ వర్డ్ లాంటి వివిధ విభాగాలకు ప్రొడ్యూసర్లనే పోస్టులు పెట్టించి, ఆయా రంగాల్లోని సుప్రసిద్ధులను అధిపతులుగా నియమించేలా చూశాను. ఆకాశవాణికి అది స్వర్ణయుగం!

విజయవాడలో ప్రభుత్వ సంగీత కళాశాల పెట్టించి, తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన మీరు మద్రాసుకు మారిపోయి, 50 ఏళ్ళుగా స్థిరపడడానికి కారణం?
 ఉత్తరాదికి బొంబాయి ఎలాగో, దక్షిణాదికి మద్రాసు అలా! కళాసాంస్కృతిక రంగాలకు ఇది కేంద్రం. ఇక్కడ అవకాశాలు ఎక్కువ. బెజవాడ మ్యూజిక్ కాలేజీకి రాజీనామా చేశాక, మళ్ళీ మద్రాసు ఆకాశవాణిలో మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా చేస్తూనే, కచ్చేరీలిస్తూ వచ్చా. ఆ తరువాత పూర్తిగా సంగీతం మీదే దృష్టి పెడుతూ, ఉద్యోగం వదిలేశాను.

ఉత్తరాదిన ఎందరికో దక్కిన ‘భారతరత్న’ మీకు రాలేదు. వివక్ష కారణమా?
ఫలానాది కావాలి, రావాలి అని నేనెప్పుడూ అనుకోలేదు... ‘భారతరత్న’ గురించీ అంతే! ఎవరికి ఏది ప్రాప్తమో అదే వస్తుంది. లతా మంగేష్కర్, భీమ్‌సేన్ జోషీ, బిస్మిల్లా ఖాన్, హరిప్రసాద్ చౌరసియా, పండిట్ రవిశంకర్ లాంటి దిగ్గజాలూ, నేనూ కలిసి ఎన్నో వేదికలపై కచ్చేరీలు చేశాం. కానీ, దురదృష్టవశాత్తూ ఇవాళ ప్రతిదీ రాజకీయమైపోయింది.

ఈ ఆధునిక యుగంలో కర్ణాటక సంగీతానికి భవిష్యత్తు ఉందంటారా?
కర్ణాటక సంగీతం అనగానే మీరు గిరి గీసుకొని, సంకుచితంగా ఆలోచించకండి. చెవులకు ఇంపుగా ఉండేది అని ఆ మాటకు అసలైన అర్థం. కాబట్టి, శాస్త్రీయ, జానపద, లలిత, పాశ్చాత్య సంగీతాలు ఏవైనా సరే, ఇంపుగా ఉంటే అది కర్ణాటక సంగీతమే. ప్రపంచమే ఓ కుగ్రామమైపోయి, సరిహద్దులు చెరిగిపోవడంతో, మునుపటితో పోలిస్తే ఈ తరానికి వేదికలు, అవకాశాలు ఎక్కువ. కాబట్టి, కచ్చితంగా కర్ణాటక సంగీతానికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంది. అయినా, కాలంతో పాటు వచ్చే మార్పులకు తగ్గట్లుగా కొత్త కూరలు వస్తాయి, రుచులు మారతాయే తప్ప, తినడమైతే మానేయం కదా! సంగీతమూ అంతే!

అన్నట్లు, మీకు అత్యంత ఇష్టమైన రాగం..?

 75 మేళకర్త రాగాలలో కీర్తనలు రాశాను. అలాగే, సరికొత్త తాళ విధానాన్ని కనిపెట్టాను. ఇక, మహతి, లవంగి, గణపతి - ఇలా నేను సృష్టించిన రాగాలే దాదాపు 25 పైగా ఉంటాయి. అన్నీ నా పిల్లలే. వాటిలో ఏది ఎక్కువంటే చెప్పడం కష్టం.

కానీ, కల్యాణి మీకు ఇష్టమైన రాగమని విన్నట్టు గుర్తు..?
 (నవ్వేస్తూ...) గతంలో ఒకసారి కేరళలోని త్రివేండ్రంలో అనుకుంటా. కచ్చేరీ చేస్తున్నా. ఆ సమయంలో నేను కల్యాణి రాగం పాడుతుంటే, ఒక అందమైన అమ్మాయి వచ్చి, నా పక్కన కూర్చొంది. ‘సొగసు నీ సొమ్ము కల్యాణి రాగిణీ, వగలు విరజిమ్ము నా భావజాలమ్ములో...’ అని అప్పటికప్పుడు పాట, వరుస కట్టాను. ఆ కృతి అయిపోగానే ఎలా వచ్చిన అమ్మాయి అలా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో ఎవరికీ తెలీదు. దానికి ఆ కచ్చేరీకి వచ్చినవాళ్ళే సాక్షులు. కల్యాణి రాగదేవతే అలా వచ్చిందనుకుంటా!

అవును... రోజుకి ఎంత సేపు సాధన చేస్తుంటారు?
కచ్చేరీకి వెళ్ళేముందు ఒక రిహార్సల్ కానీ, ప్రాక్టీస్ కానీ అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. మైకు ముందుకు వెళ్ళే వరకూ ఏం పాడతానో నాకే తెలియదు. కూర్చోగానే, ఇవాళ పాడాలి కదా, వీళ్ళందరినీ సంతోషపెట్టాలి కదా అనిపిస్తుంది. అంతే... సంగీతం, పాట వాటంతట అవే వస్తాయి. వాటికి నేను వాహికనవుతాను.

కానీ, ఇలా సాధన లేకుండా, అప్పటికప్పుడు తిల్లానా రాసుకొని, అక్కడికక్కడ సంగతులు వేసుకొని పాడేయడం..?
నేనెప్పుడూ చెబుతుంటాను... సంగీతం నాకు రాదు, తెలియదు. కానీ, సంగీతానికి నేను తెలుసు. అందుకే, అది నన్ను వెతుక్కుంటూ వచ్చినంత కాలం నేను వాహికగా ఉంటాను. పాట నా నోట పలుకుతుంది.

ఎందరికో సంగీతం నేర్పారు... వారసులు ఎవరంటారు?
నా బాణీని కొనసాగించే, ప్రతిభావంతులైన శిష్యులు ఎందరో ఉన్నారు. వారందరూ నాకు సమానమే. నా శిష్యుల్లో ఎవరో ఒకరు ఈ పరంపరను కొనసాగిస్తారు. కానీ, ఫలానావాళ్ళు నా వారసులని చెప్పలేను.. చెప్పకూడదు కూడా!

ఆంధ్రప్రదేశ్ అవతరించిన 1956 నవంబర్ 1న ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వయొలిన్‌తో, మీరు గాత్రంతో రసానందంలో ముంచి తేల్చారని చదివా. కొత్త రాష్ట్రాల్లో కూడా ఆ భాగ్యం కలిగిస్తారా?
నన్ను ఆహ్వానిస్తే... తప్పకుండా వెళ్ళి, అవతరణ దినోత్సవాల్లో పాడతాను. సంగీతామృతాన్ని పంచుతాను.

గతంలోకి వెళితే... ఎన్టీఆర్‌తో మీ అనుబంధం? ఎన్టీఆర్ ముఖ్య మంత్రి పదవిలో ఉండగా, తెలుగు నేలపై పాడనని శపథం పట్టారే..?
ఎన్టీఆర్ మంచి నటుడు, గొప్పవారు. ‘నర్తనశాల’, ‘శ్రీమద్విరాటపర్వము’ లాంటి చిత్రాల్లో ఆయనకు నేను మంచి పాటలు పాడాను. మా మధ్య ఆ గౌరవాదరాలు ఉండేవి. కానీ, ఆయన లలిత కళా అకాడెమీలన్నిటినీ ఒక్క కలం పోటుతో రద్దు చేసేసరికి, భేదాభిప్రాయం వచ్చింది. కళాకారులకు అవమానం జరిగిందనే బాధతో ఆయన తన పంథా మార్చుకొనే దాకా పాడనన్నాను. ఏడేళ్ళ విరామం తరువాత ముఖ్యమంత్రి చెన్నారెడ్డిగారి అభ్యర్థనతో మళ్ళీ హైదరాబాద్‌లో పాడాను. తరువాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ తన తప్పు తెలుసుకొని, పంథా మార్చుకొని, సాదరంగా మళ్ళీ పిలిచి, గౌరవించడంతో వెళ్ళాను. పాడాను. ప్రాథమికంగా మేమిద్దరం ఆర్టిస్టులం. ఆయన నటన నాకూ, నా పాటలు ఆయనకూ నచ్చేవి. అధికారానికో, అహంకారానికో, ఆర్థిక బలిమికో కాదు... నేను ప్రేమకు కట్టుబడతాను.

కానీ, సంగీత, సాహిత్య, నాటక అకాడెమీలు పైరవీల మీద, ఆశ్రీతపక్షపాతం మీద నడవడం తప్పే కదా! అయినా అకాడెమీల అవసరం ఉందంటారా?

అకాడెమీలు ఇవాళ్టికీ అవసరమే. ఇక, వాటిలో జరిగే తప్పొప్పులు అంటారా... అవన్నీ జరిగితేనే కదా, ఎలా చేయాలి, ఎలా చేయకూడదనే అనుభవం వస్తుంది. తప్పు జరిగిందని మొత్తం వ్యవస్థనే వద్దనడం తప్పు కదా?!  


సినిమా రంగంతో కూడా మీది అవిస్మరణీయమైన అనుబంధం...
అక్కినేని, నా శిష్యురాలు ఎస్. వరలక్ష్మి నటించిన ‘సతీ సావిత్రి’  మొదలుకొని మొన్నామధ్య దాకా నన్ను అడిగినవాళ్ళకు పాడాను. అలాగే, ఏ.వి.ఎం. వారి ‘భక్త ప్రహ్లాద’లో నారదుడిగా నటించాను. జి.వి. అయ్యర్ రూపొందించిన ‘హంస గీతె’ (కన్నడం), ‘ఆది శంకరాచార్య’ (సంస్కృతం), ‘మధ్వాచార్య’, ‘భగవద్గీత’ లాంటి చిత్రాలకు సంగీతం అందించాను. ఉత్తమ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అవార్డులందుకున్నాను. బెంగాలీలో ఉత్పలేందు చక్రవర్తి దర్శకత్వంలోని ‘చచందనిర్’లో కాసేపు కనిపిస్తాను. ఓ సంగీత విద్వాంసుడి జీవితం చుట్టూ తిరిగే కథగా మలయాళంలో రూపొందిన ‘సంధ్య కెందిన సింధూరం’ చిత్రంలో ఆ కథానాయక పాత్ర చేశాను.

మీ భార్యాపిల్లల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు..?
 నా భార్య పేరు అన్నపూర్ణ. నాకు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. అందరూ జీవితంలో స్థిరపడ్డారు. అందరికీ సంగీతం వచ్చు. కానీ, సంపాదనలో స్థిరత్వం ఉండని ఈ రంగం వైపు రావద్దని సూచించాను. మా పెద్దమ్మాయి అమ్మాజీ హైదరాబాద్‌లో ఉంటుంది. పెద్దబ్బాయి అభిరామ్ ప్రింటింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. రెండో అమ్మాయి లక్ష్మి గృహిణి. వాళ్లూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఇక, ఆ తరువాత పిల్లలైన సుధాకర్, వంశీ మోహన్‌లు డాక్టర్లు. సుధాకర్ చెన్నైలోనే ఆదంబాక్కమ్‌లో ఎస్.పి.హాస్పిటల్ పేరిట పెద్ద ఆసుపత్రి నడుపుతూ బిజీగా ఉన్నాడు. వంశీ మోహన్ పేరున్న డయాబెటాలజిస్ట్. నాతోనే చెన్నైలో ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇక, నా ఆఖరు అమ్మాయి మహతి కూడా మద్రాసులోనే ఉంటోంది. ఇదీ నా కుటుంబం.

‘మహతి’ పేరు బాగా ఇష్టమా? మీ ఇంటికీ అదే పేరు పెట్టుకున్నారు..?

మా అమ్మ వీణావాదనలో దిట్ట. నారదుడి వీణ పేరు కూడా మహతే కదా... అందుకే, ఈ పేరు.
దీర్ఘకాలం మీ వెంట ఉండి, మీ చరిత్రనూ, కృషినీ ఎం.బి.కె. ట్రస్ట్ ద్వారా భావితరాలకు అందించే ప్రయత్నంచేసిన నర్తకి సరస్వతి మరణించడం...(తీవ్రమైన భావోద్వేగానికి గురై...) ఆమె లేకపోవడం నాకు అపారమైన నష్టం. షి వజ్ మై లైఫ్! ఆమె మరణం తరువాత అనేక అంశాలపై నాకు ఆసక్తి కూడా పోయింది.

మరి, మీ గాత్రంలోనే మీ కృతులన్నిటినీ వీడియో రికార్డు కూడా చేయాలన్న ప్రయత్నం ఎంతవరకు వచ్చింది?
దాదాపు 500 రచనల్లో కొన్ని రికార్డు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఆ పని జరుగుతోంది.

మీ పుట్టినరోజంటే, కచ్చేరీలు, ఇతర కళాకారులకు సన్మానాలతో సాగేవి. ఈ సారి ఎలా జరుపుకోబోతున్నారు?
నేనెప్పుడూ పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకోను. అభిమానులే చేస్తుంటారు. ఈ సారి ‘సరిగమ’ సంస్థవారు 1950ల నుంచి ఇప్పటి దాకా నా రికార్డింగుల్లోని ఆణిముత్యాలన్నిటినీ ఏరి, ‘సెలస్టియల్ ట్రెజర్’ అని ఓ సీడీ విడుదల చేస్తున్నారు.

గడచిన 83 ఏళ్ళు మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేస్తే, ఎలా బతకాలనుకుంటున్నారు? మళ్ళీ ఇప్పటి బాల మురళీలాగానేనా?
నా 83 ఏళ్ళ జీవితంలో నాకు చేతనైనంత మంచే చేశాను. నాకు నచ్చినట్లుగా బతికాను. ఏం జరిగినా, అది నా మంచికే అనుకుంటా. ప్రతి క్షణం నాకు చిరస్మరణీయమే!

 - రెంటాల జయదేవ

....................................................