జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, July 9, 2013

సినీ సహారాలో ఓ ఒయాసిస్సు - మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు సినిమా సమీక్ష



 సినీ సహారాలో ఓ ఒయాసిస్సు


ఈ మధ్య కాలంలో థియేటర్‌కు వెళ్ళిన దగ్గర నుంచి ప్రత్యేక నృత్య గీతాలు, పంచ్‌డైలాగులు, వెకిలి కామెడీ, ఒళ్ళు వేడెక్కించే సన్నివేశాలు, చెవులు దిమ్మెత్తించే ఫైట్లతో విసిగిపోని సగటు తెలుగు సినీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ రొడ్డకొట్టుడు చిత్రాల బారి నుంచి బయటపడేసేవారి కోసం ఎదురుచూస్తున్న సమయంలో మిణుకు మిణుకుమంటూ వెలిగిన తాజా చిరు దీపం -మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు చిత్రం. ఎంతసేపటికీ ఫార్ములా లెక్కలతో, బాక్సాఫీస్‌భయాలతో సతమతమవుతూ, తీసిందే తీసే తెలుగు సినీ సహారాలో ఈ చిత్రం ఓ ఒయాసిస్సు!

 (ప్రజాశక్తి దినపత్రిక, 9 జూలై 2013, మంగళవారం, పేజీ నం. 8లో ప్రచురితమైన రివ్యూ తాలూకు పూర్తి పాఠం ఇది)
 .........................................................................
చిత్రం: మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, తారాగణం: శ్రీదివ్య, క్రాంతి చంద్‌, జార్జ్‌, రావు రమేశ్‌, ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, సంగీతం: రవీంద్ర ప్రసాద్‌, నేపథ్య సంగీతం: పవన్‌కుమార్‌, సమర్పణ: జక్కం జవహర్‌బాబు, నిర్మాత: జి. ఉమాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, కళ, దర్శకత్వం: జి.వి. రామరాజు
............................................................................
  
          పురుషుడు ఏ స్వేచ్ఛనైతే తన హక్కుగా భావిస్తాడో, ఆ స్వేచ్ఛను స్త్రీకి ఇస్తే చాలు. అంతకు మించి స్త్రీ ఏమీ ఆశించదు అన్నది ఈ చిత్ర ఇతివృత్తం. ఆ అంశాన్ని తన ఈ తొలి చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నారు దర్శకుడు రామరాజు.

          కథ:

జీవితంలోని చిన్న చిన్న సంతోషాలు, ఆనందాలను హాయిగా అనుభవిస్తూ గడపాలనుకొనే యువతి - లక్ష్మి (శ్రీదివ్య). జాతకాలు కుదిరాయంటూ, ఆమెకు ఓ యువకుడి (జార్జ్‌)తో పెద్దలు పెళ్ళి చేసేస్తారు. కానీ, అతనికేమో జీవితమంటే ప్రేమ, ఆప్యాయతలు కాదు... డబ్బు, హోదా మాత్రమే! నాకు సంబంధించినంత వరకు రెండే నిజాలు. ఒకటి - నేను! రెండు - డబ్బు!! అంటూ, సంపాదనే లోకంగా గడుపుతూ, కట్టుకున్న భార్యను వ్యక్తిత్వమున్న ఓ మనిషిగానైనా చూడడు.

          వైవాహిక జీవితంలోని ఈ అసంతృప్తిని దూరం చేసుకొనేందుకు లక్ష్మి ప్రయత్నిస్తుంది. తండ్రి (రావు రమేశ్‌), బంధువులు కూడా కొన్నాళ్ళయితే అంతా సర్దుకొంటుందని, ఆమెకు నచ్చజెబుతుంటారు. ఆ పరిస్థితుల్లో ఆమెకు అనుకోకుండా సినీ గీత రచయిత క్రాంతి (క్రాంతి చంద్‌)తో పరిచయం ఏర్పడుతుంది. విదేశాలకు వెళితే భారీ జీతంతో పెద్ద ఉద్యోగం చేసే అవకాశమున్న ఈ ఎలక్ట్రానిక్స్‌గోల్డ్‌మెడలిస్ట్‌అవన్నీ కాదనుకొని, తనకు ఇష్టమైన పని చేయాలని ఈ రచనా జీవితాన్ని ఎంచుకుంటాడు. అతనికీ, కథానాయికకూ మధ్య పరిచయం ఎలా పెరిగింది, వారి మధ్య అనుబంధం ఏమిటి, చివరకు ఏ మల్లెల తీరాలకు సిరిమల్లె పువ్వు లాంటి నాయిక చేరిందన్నది మిగతా చిత్ర కథ.

కథనం:

శారీరకంగా కొట్టకున్నా, ఆర్థిక, లైంగిక వేధింపులు లేకున్నా, వ్యక్తిత్వాన్ని గౌరవించనప్పుడు ఏ వైవాహిక బంధమైనా ఎంత బలహీనంగా మారుతుందో ఈ చిత్రకథ చూపెడుతుంది. పురుషాధిక్య భావజాలమే ప్రబలమైన మన సమాజంలోని సగటు ప్రేక్షకులకు కొత్త ఆలోచననూ, చూపునూ అందించేందుకు ప్రయత్నిస్తుంది. మనసు లేని చోట మనుగడ ఎంత కష్టమో గుర్తు చేస్తుంది. ఒకసారి పెళ్ళయిన తరువాత ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా భర్త తోడిదే లోకంగా బతకాలంటూ సతీ సూత్రాలను ప్రవచించిన సినిమాలు, దానికి తలొగ్గిన కథానాయిక పాత్రలు చాలానే వచ్చాయి. కాగా, స్త్రీ పాత్రల్లో వచ్చిన మార్పును చెప్పడానికి ఈ సినిమా తాజా ఉదాహరణ. ఇద్దరు స్త్రీ పురుషులు నాలుగు గోడల మధ్య, ఒకే చూరు కింద కలసి ఉండడానికీ, మనసులు కలిసే తీరం అన్వేషణలో అద్వైతానుభూతికి చేరడానికీ మధ్య ఉన్న తేడాను ఈ చిత్రం స్పష్టం చేస్తుంది.

కథాకథన శైలిలో శేఖర్‌కమ్ముల ఆనంద్‌ తరహా చిత్ర ధోరణిని ఇది గుర్తు చేస్తుంది. చకచకా తెరపై కదిలే దృశ్యాలకు అలవాటైపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా అతి నిదానం అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అయితే, పాత్రల మానసిక సంఘర్షణకు ప్రాధాన్యమిస్తూ, కథానాయిక ఆత్మకథనంగా సినిమాను నడిపే పద్ధతిని ఎంచుకోవడంతో ఆ రకమైన కథా గమనం తప్పినట్లు లేదు.

రెండు గంటల మీద కాసేపు సాగే ఈ చిత్రంలో ప్రథమార్ధమంతా కథానాయిక బలహీన వైవాహిక బంధాన్నీ, ఆమెకు ఎదురైన కొత్త పరిచయాన్నీ చూపి, ఆమె తన మనోభావాన్ని వ్యక్తం చేసిన చోట ఆసక్తికరంగా ఇంటర్వెల్‌ఇచ్చారు. ఆమె ఎటువైపు, ఎలా అడుగులు వేసి, తన భవిష్యత్‌జీవితాన్ని తీర్చిదిద్దుకుందన్నది ద్వితీయార్ధం.

అయితే, ఈ కథలో భర్త నుంచి నాయిక పూర్తిగా దూరమవడానికి చూపిన ప్రాతిపదిక మరింత బలంగా ఉండాల్సింది. పాత్రల మధ్య అంతస్సంఘర్షణకు మరికొన్ని బలమైన సన్నివేశాలను కథారచయిత రాసుకొని ఉంటే, సినిమా ఇంకా చిక్కగా ఉండేది.

అయితేనేం, కథానాయిక లక్ష్మి పాత్రను శ్రీదివ్య చాలా చక్కగా పోషించారు.  సినిమా చాలా వరకు ఆమె మాటల్లో సాగుతుంది. దాంతో, డబ్బింగ్‌ఎంతో కీలకం. అది కూడా బాగా కుదిరింది. భర్త, గీత రచయిత పాత్రధారులు పరిధుల మేరకు నటించారు. రావు రమేశ్‌తండ్రి పాత్ర కనిపించేది మూడు, నాలుగు సన్నివేశాల్లోనే అయినా, పాత్రను పండించారు. ముఖ్యంగా, చివరలో ఓ తండ్రిగా కుమార్తె పట్ల తన బాధ్యతను వ్యక్తం చేసే దృశ్యం కదిలిస్తుంది. సినీ సంగీత దర్శకఁడు రాజ్‌తన నిజజీవిత పాత్రలో ఓ సన్నివేశంలో కనిపిస్తారు.

లోకం స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది. కానీ, ఇవ్వదు. తను గీసిన గీతలోనే ఉండమంటుంది అంటూ మహిళా స్వేచ్ఛ వైపు, మనసును వెతుకుతూ పోతే మిగిలేవన్నీ మల్లెల తీరాలే అంటూ డబ్బే జీవితంగా కాక మనసుకు నచ్చిన విధంగా ఆనందంగా జీవించడం వైపు ఈ చిత్రం ఆలోచనలను ప్రేరేపిస్తుంది.

నిర్మాణ, సాంకేతిక విలువలు:

మూడే మూడు ప్రధాన పాత్రలతో, పరిమితమైన లొకేషన్లలో, సహజంగానే అతి పరిమిత బడ్జెట్‌లో ఈ సినిమాను రూపొందించారు. కానీ, సినిమా చూస్తూ ఒకసారి ఆ పాత్రల మానసిక స్థితిలోకి ప్రేక్షకుడు ప్రవేశించాక, అవేవీ గుర్తుకు రావు.

పైగా, మాటలు, పాటలు, నేపథ్య సంగీతం - చాలా చక్కగా అమరాయి. ‘‘ప్రేమ, మనసు, ఆకాశం -వీటిని నచ్చిన విధంగా వర్ణించుకోవచ్చు కానీ, హద్దులు గీయలేం!’’ (నాయికతో క్రాంతి), ‘‘సంపాదించు! కానీ లైఫ్‌ను బిజినెస్‌చేయకు!’’ (భర్తతో కథానాయిక), ‘‘భార్యగా అవడం వేరు! భార్యగా బతకడం వేరు!!’’ (కథానాయిక), ‘‘కోపం కూడా ఒక ఫీలింగే! నాకు తన మీద అది కూడా లేదు!’’ (భర్త గురించి నాయిక)‘‘మానవ సంబంధాలు గ్యారంటీలతో రావు, మనమే పోషించుకోవాలి’’ (హీరోయిన్‌తో క్రాంతి), ‘‘మానసికంగా తనతో లేనప్పుడు ఇంకా తను నా భర్త ఏమిటి?’’ (హీరోయిన్‌) - ఇలా సినిమాలోని వివిధ సందర్భాల్లో అభిప్రాయాల వ్యక్తీకరణగా వచ్చే అనేక సంభాషణలు ఎవరినైనా ఆలోచనలోకి నెడతాయి.

తెలుగుదనం నిండిన సాహిత్యం పాటల్లో పరుచుకుంది. అందులోనూ ఆ సాహిత్యం స్పష్టంగా వినిపించడం, బాణీలు శ్రావ్యంగా ఉండడం విశేషం. నీ నీడన ఇలా నడవనా..., మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా... లాంటి గీతాలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి (గీత రచయిత: ఉమా మహేశ్వరరావు). చీకటి నలుపున మనమే, చిగురాకుల ఎరుపున మనమే... లాంటి అభివ్యక్తీకరణలు మనసును మీటుతాయి.

చాలా సందర్భాల్లో మాటలు తక్కువ కాబట్టి ఆ సన్నివేశాల బలిమిని పెంచడానికి చిన్న చిన్న గీత ఖండికలు, బ్యాక్‌గ్రౌండ్‌మ్యూజిక్‌ను దర్శకుడు సమర్థంగా వినియోగించుకున్నారు.  కళ, ఛాయాగ్రహణం, కూర్పు కథావాతావరణానికి తగ్గట్లు ఉన్నాయి. అయితే, డిజిటల్‌కెమేరాతో చిత్రీకరణలోని పరిమితులు తెరపై కొంత తెలిసిపోతుంటాయి. సాహిత్యం మీద దర్శకుడికున్న అభిరుచి, చలంతో సహా పలువురు రచయితల ప్రభావం సినిమాలో స్పష్టమవుతుంటాయి.
సినీ నిర్మాణ, కథన పద్ధతులను మరికొంత మెరుగుపరుచుకుంటే, అభిరుచి ఉన్న ఈ దర్శకుడి నుంచి మరిన్ని మంచి చిత్రాలను ఆశించవచ్చనే ఆశ కలుగుతుంది.

వెరసి, రొటీన్‌పాటలు, ఫైట్ల కథలతో విసిగిపోయి, ఓ రెండు గంటల పాటు మనలాంటి ఓ మామూలు వ్యక్తి జీవితాన్ని స్లో పేస్‌లో, కవితాత్మక భావుకతతో వెండితెరపై చూద్దామనుకుంటే ఈ చిత్రానికి నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. కొంత సీరియల్‌ఫక్కీలో సాగినా, సీరియస్‌గా చేసిన సిన్సియర్‌ప్రయత్నం సున్నిత హృదయుల మనస్సును తాకుతుంది.

కొసమెరుపు:

ప్రారంభమైన పది నిమిషాల తరువాత  హాలులో అడుగుపెట్టిన దంపతులిద్దరు సినిమా అయిపోయాక బయటకు వస్తుండగా, మొదటి నుంచి చూస్తే ఇంకా బాగుండేది. సినిమా మళ్ళీ చూద్దామా? అని భర్తతో భార్య అనడం వినిపించింది. అవును మరి! సినిమాలో ఓ చోట భర్తతో కథానాయిక, ‘‘నీకు నీ ప్రపంచం బయట ఉంది. కానీ, నాకు నా ప్రపంచం నాలో ఉంది!’’ అంటుంది. అలా లోపల ప్రపంచంలోకి ప్రయాణించదలిచిన వారికి సినీ రూపకర్తలే చెప్పినట్లు ఈ సినిమా ఎ జర్నీ త్రూ యువర్‌హార్ట్‌!
-         రెంటాల జయదేవ

(Published in 'Praja Sakti' daily, 9th July 2013, Monday, Page No.8)
........................................................

Monday, July 8, 2013

లాజిక్‌ లేని త్రీడీ మ్యాజిక్‌ 'యాక్షన్‌' - సమీక్ష



లాజిక్‌ లేని త్రీడీ మ్యాజిక్‌ 'యాక్షన్‌'
సాంకేతికత ఎంత పెరిగినా, సినిమా హాలులోకి వెళ్ళి కూర్చున్నాక ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు సీట్లలో కూర్చోబెట్టాలంటే తెర మీద పండాల్సింది - భావోద్వేగాలే. చిత్ర నిర్మాణంలో, ప్రదర్శన పద్ధతుల్లో ఎంత అత్యాధునికత ఉన్నా, ఆఖరికి ప్రేక్షకులు కూడా చూసేది తమను మురిపించి, మైమరపించే ఆ కథన చాతుర్యం కోసమే! అది లేనప్పుడు మిగిలిన ఎన్ని అలంకరణలున్నా అవి వాసన లేని కాగితం పూలే అవుతాయి. 1980లో కొన్ని నేరు తెలుగు చిత్రాలు త్రీడీలో వచ్చాయి. మళ్లీ ఇన్నేళ్ళకు ఆధునిక సాంకేతికతతో తెలుగులో నేరుగా వచ్చిన త్రీడీ సినిమా 'యాక్షన్‌-3డి' ('విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' అనేది ఉపశీర్షిక) వ్యవహారం కూడా అచ్చంగా కాగితం పూల చందమే అయింది. కళ్ళద్దాలు పెట్టుకొని చూసే త్రీడీ ఎఫెక్ట్‌ల చిత్రంగా, మనస్సును మెప్పించే కథ కానీ, కథా కథనం కానీ, అభినయ ప్రతిభ కానీ లేని భారీ నిర్మాణ ప్రయత్నంగా మిగిలిపోతుంది.

కథ ఏమిటంటే... చిన్నప్పటి నుంచి కలసి మెలసి తిరిగి, పెరిగిన నలుగురు స్నేహితుల కథ ఇది. 'కలకాలం జీవిస్తామన్నట్లు కలగనాలి! రేపే మరణిస్తామన్నంత రీతిలో ఇవాళే జీవితాన్ని ఆస్వాదించాలి' అన్నది ఆ మిత్రుల సిద్ధాంతం. పెళ్ళికి కొద్ది రోజుల ముందు అజరు ('కిక్‌' శ్యామ్‌) తన మిగతా ముగ్గురు మిత్రులైన పందాల రాయుడు బా.వ. అలియాస్‌ బాలవర్ధన్‌ ('అల్లరి' నరేశ్‌), ఫ్యాషన్‌ డిజైనర్‌ పురుషోత్తమ్‌ (రాజు సుందరం), డెంటిస్ట్‌ శివ (వైభవ్‌)తో కలసి సరదాగా గడిపేందుకు గోవా బయలుదేరతాడు. ఆ నలుగురు మిత్రులకు ఎదురైన సంఘటనలు, అక్కడ గోవాలో వారికి ఎదురైన సమస్యలు, వారు చేసే ప్రతి పనీ మరో దానికి దారి తీయడం లాంటి వాటితో సినిమా అంతా నడుస్తుంది.
నటన ఎలా ఉందంటే... 'ఫ్రెండ్‌షిప్‌ అనేది వ్యాపారంలో చేసుకొనే వన్‌ ఇయర్‌ ఎగ్రిమెంట్‌ కాదు. వందేళ్ళ కమిట్‌మెంట్‌' అన్నది ఈ సినిమా ఇతివృత్తం. క్లైమాక్స్‌లో మినహా మిగతా ఎక్కడా దాన్ని బలంగా చెప్పలేదు. దాంతో, ఈ ఇతివృత్తానికీ, ఏ పాత్రకూ ఓ పరిపూర్ణత కనిపించదు. తమిళంలో 'ఓ పోడు!' (స్థూలంగా జై కొట్టు అని అర్థం) పేరుతో మూడు వారాల విరామం తరువాత విడుదల కానున్న ఈ ద్విభాషా చిత్రంలో 'అల్లరి' నరేశ్‌తో పాటు తమిళ తెరకు సుపరిచితులైన వైభవ్‌ (దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి కుమారుడు), 'కిక్‌' ఫేమ్‌ శ్యామ్‌, నటుడు - నృత్య దర్శకుడు రాజు సుందరం నలుగురు మిత్రులుగా నవ్వించడానికి శతవిధాల ప్రయత్నించారు. ఆ క్రమంలో కొంత ఎడల్ట్‌ కామెడీ, మరికొంత వల్గారిటీకి కూడా చోటిచ్చారు. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ లాంటి సీనియర్‌ కమెడియన్లు సరే సరి!
అతిథి పాత్రల్లో సునీల్‌, పోసాని కృష్ణ మురళి, 'ఈగ' ఫేమ్‌ సుదీప్‌ కనిపిస్తారు. నలుగురు హీరోలకూ జోడీలుగా నీలం ఉపాధ్యాయ, స్నేహా ఉల్లాల్‌, రీతూ బర్మేచా,కామ్నా జెఠ్మలానీ ఉన్నారు. సీజన్డ్‌ తారల సీజన్డ్‌ నటనే తప్ప, వీరెవరి నుంచీ ప్రత్యేక అభినయం కనిపించదు. 'దూకుడు', 'బొమ్మరిల్లు' లాంటి చిత్రాల్లోని పాపులర్‌ ఘట్టాల ఆధారంగా ఎమ్మెస్‌ నారాయణతో చేయించిన ప్యారడీ బిట్లు కాసేపు నవ్విస్తాయి. గతంలో శ్రీను వైట్లతో చిత్రాలు నిర్మించిన అనీల్‌ సుంకర దర్శకుడిగా ఆయన చిత్రాల నుంచి చాలానే స్ఫూర్తి పొందినట్లు అర్థమవుతుంది.
కథనం మాటేమిటంటే... నిజానికి, సినిమా ప్రథమార్ధం చాలా వరకు అసలు కథకు ఉపోద్ఘాతం లాంటిది. గోవా చేరిన నలుగురు స్నేహితులూ ముందు రోజు రాత్రి ఏం జరిగిందో తెలియనంత మత్తులో ఉండి, మరునాడు నిద్ర లేచాక తమలో ఒకరు మిస్సవడంతో కంగారు పడుతున్నప్పుడు ప్రథమార్ధం ముగుస్తుంది. సరిగ్గా అప్పుడే అసలు కథ మొదలువుతుంది. అసలేం జరిగిందన్న దాన్ని క్రమక్రమంగా ప్రేక్షకుడికి తెలిసేలా చేసే కీలకమైన కథంతా ద్వితీయార్థం.
కానీ, 'యాక్షన్‌' అక్కడే తడబడింది. కథను ఆసక్తిగా నడపడంలో కాకుండా, సన్నివేశాలతో, పాటలతో కాలక్షేపం చేయించడంగా సినిమా మారింది. ఆ రాత్రి ఆ నలుగురు మిత్రులకూ ఎదురైన సంఘటనల్ని ఒక్కోదాన్నీ ఒక్కో ఎపిసోడ్‌గా చూపారు. అయితే, అందులో ఏవీ ఆసక్తిగా నడిచేంత పట్టున్నవి కావు. అవే ఈ కథకు పెద్ద బలహీనతగా మారాయి. వెరసి, రెండు గంటల ముప్ఫై అయిదు నిమిషాల పాటు నడిచే ఈ సినిమాను ఒక దశ దాటిన తరువాత భరించడం కష్టమవుతుంది. చివరకొచ్చేసరికి త్రీడీ ఎఫెక్ట్‌లు, పాటలే తప్ప, మిగతాదంతా వట్టి గజిబిజి గందరగోళమనిపిస్తుంది.
సాంకేతిక శాఖల సంగతి... టైటిల్స్‌లో మరో ముగ్గురు మాటల రచయితల పేర్లున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం క్రెడిట్‌ కూడా అనీల్‌ సుంకరే తీసుకున్నారు. అయితే, తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు దర్శకుడిగా కన్నా, నిర్మాతగానే ఎక్కువ మార్కులు పడతాయి. గుర్తింపున్న నటీనటులు చాలా మందితో పాత్రధారణ చేయించడం, నిర్మాణంలో ఖర్చుకు వెనుకాడకపోవడం తెరపై తెలుస్తుంటాయి.
సాంకేతిక అంశాల సంగతికి వస్తే, 3డి థియేటర్లే తక్కువ కాబట్టి, సినిమాలో సగం దృశ్యాలను సర్వసాధారణ చిత్రాల లాగా 2డిలో, ఇతర దృశ్యాలను 3డి ఎఫెక్ట్‌లో తీసినట్లు అనిపిస్తుంది. త్రీడీ దృశ్యాల చిత్రీకరణ నిపుణుడైన అమెరికాకు చెందిన 3డి స్టీరియోగ్రాఫర్‌ కీత్‌ డ్రైవర్‌కు కూడా ఇదే తొలి సినిమా. రాత్రి వేళ జాగింగ్‌ చేస్తూ, నటులు పోసాని, సునీల్‌లకు ఎదురయ్యే రెండు డైలాగుల పాత్రలో ఆయన తెరపైనా కనిపించారు. కెమేరామన్‌ సర్వేష్‌ మురారి బాగానే శ్రమించారు.
1980ల నాటి హిట్‌ పాటల హిందీ సంగీత దర్శకుడు బప్పీలహరి, ఆయన కుమారుడు బప్పా లహరి కలసి సంగీతం అందించారీ సినిమాకు. అన్నీ బీటు పాటలే! దర్శకుడు కె. రాఘవేంద్రరావు హిట్‌ పాటల దృశ్యాలకు అనుకరణగా సాగిన 'ఢింక చిక' పాట, నాగార్జున నటించిన 'ప్రేమ యుద్ధం'లోని 'స్వాతి ముత్యపు జల్లులలో...' పాట ( పాత బాణీ, ఆర్కెస్ట్రయిజేషన్‌కే కొత్త గళాలతో పాడించారు) ప్రేక్షకులను కాసేపు అలరిస్తాయి.
ఇక, షాంపేన్‌ గ్లాసులో స్నేహా ఉల్లాల్‌ నర్తించిన క్లబ్‌ సాంగ్‌ 'డింగ్‌ డాంగ్‌ బెల్‌' ఇటీవల వస్తున్న ఐటమ్‌ సాంగ్‌లకు మరో నకలు. థమన్‌ నేపథ్య సంగీతం కూర్చారు. చర్చి దగ్గర అలీతో మాట్లాడి, హీరోలు బయటకు వచ్చే చోటతో సహా వివిధ సందర్భాల్లో సినిమాలోని దృశ్యాలు చూస్తున్నప్పుడూ, డైలాగులు వింటున్నప్పుడూ దర్శక - నిర్మాతలే ఎడిటింగ్‌లో మధ్య మధ్య కొంత తొలగించినట్లు అర్థమైపోతుంటుంది. కోటి రూపాయలతో గోవాలోని హౌటల్‌ హీరో నరేశ్‌ సొంతం ఎలా అవుతుందో అర్థం కాదు. అలాగే, కనపడని పాప గురించి స్నేహా ఉల్లాల్‌ కానీ, పులి గురించి సుదీప్‌ కానీ ఏ చర్యా తీసుకోరెందుకో! సినిమా చూస్తుంటే ఇలాంటి జవాబు లేని ప్రశ్నలు తెగ తడుతుంటాయి.
తెరపై తొలి భారతీయ త్రీడీ చిత్రం 'మై డియర్‌ కుట్టి చేతాన్‌' (1984) వచ్చిన ఇరవై తొమ్మిదేళ్ళ తరువాత రూపొందిన సినిమాగా కామెడీ త్రీడీ 'యాక్షన్‌ ' సాంకేతికంగా పురోగతి చూపింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మనవాళ్ళ త్రీడీ ఎఫెక్ట్‌ కొంత మెరుగైంది. అయితే, ఇటీవల వచ్చిన ఇంగ్లీషు, హిందీ చిత్రాలతో పోలిస్తే, ఈ త్రీడీది ఇంకా వెనుకపట్టే! ఇక, కథ, సన్నివేశాల రూపకల్పన, చిత్రీకరణలో అయితే మనవాళ్ళు పాత యుగాల దగ్గరే పాతుకుపోయారని అనిపిస్తుంది.
కొసమెరుపు : తెలుగు, తమిళ, హిందీ, 'హ్యాంగోవర్‌' లాంటి హాలీవుడ్‌ చిత్రాలతో పోలికలు, మునుపటి చిత్రాల తాలూకు ప్రభావం పుష్కలంగా ఉన్న ఈ 'యాక్షన్‌'లో త్రీడీ మ్యాజిక్‌లే తప్ప, లాజిక్‌ల కోసం వెతకడం వృథా ప్రయాస. క్లైమాక్స్‌లో వచ్చే హీరోయిన్‌, హీరోల మాటలనే కొద్దిగా మార్చి చెప్పాలంటే, ''సినిమా అంటే అంతే! కొన్నింటికి లాజిక్‌లు ఉండవు. కానీ, తెలుగు సినిమా అంటే అసలు లాజిక్కే ఉండదు!'' కాబట్టి, వేళాకోళపు వినోదభరిత దృశ్యాలతో సగటు తెలుగు సినిమాను చూడ్డానికి సిద్ధమై వెళితే, ప్రేక్షకులకు కొంతయినా నిరాశ తప్పవచ్చు. ఎంత విదేశీ సాంకేతికతనూ, నిపుణుల్నీ తెచ్చిపెట్టుకొన్నా, తీసేది మన వాళ్ళు, తీస్తున్నది మన తెలుగు సినిమా కదా! కాబట్టి, తిప్పలు తప్పవు !!
 - రెంటాల జయదేవ   
.........................................................................................

Saturday, July 6, 2013

తెలుగు తెరపై మళ్లీ త్రీడీ హంగామా



తెలుగు తెరపై ఇప్పుడిక మరో కొత్త హంగామా మొదలవుతోంది. రానున్న పదిహేను రోజుల వ్యవధిలోనే ఏకంగా రెండు నేరు తెలుగు 3డి చిత్రాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. 'అల్లరి' నరేశ్‌ హీరోగా నటించిన వినోదభరిత చిత్రం 'యాక్షన్‌ - 3డి' ('విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' అనేది ఉప శీర్షిక) రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, నందమూరి కల్యాణరామ్‌ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న 'ఓం' 3డి చిత్రం పూర్తిస్థాయి యాక్షన్‌ మూవీగా ఆ వెంటనే జనం ముందుకు రానుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని తయారవుతున్న ఈ రెండు చిత్రాలూ తెలుగు నాట సరికొత్త వినోద హంగామాకు తెర తీస్తున్నాయి. 


ఇప్పటికి సరిగ్గా 29 ఏళ్ళ క్రితం మన దేశంలో తయారైన తొలి త్రీడీ చిత్రంగా మలయాళ సినిమా 'మై డియర్‌ కుట్టి చేతాన్‌' విడుదలైంది. ఆ తరువాత చెదురుమదురుగా త్రీడీ చిత్రాలొచ్చినా, చాలా కాలం విరామం తరువాత మళ్ళీ గత ఆరేడేళ్ళుగానే తెరపై 3డి హంగామా పెరిగింది. హాలీవుడ్‌ చిత్రాలతో పాటు, హిందీలో ఓ పక్క షా రుఖ్‌ ఖాన్‌ 'రా.వన్‌', 'డాన్‌-2' లాంటివి మామూలు సినిమాల లాగా 2డి రూపంలో రూపొంది, ఆనక 3డి వెర్షన్‌లోకి మారి, జనం ముందుకు రావడం మొదలైంది. 

ఒకపక్క హాలీవుడ్‌, మరో పక్క హిందీ చిత్ర సీమల త్రీడీ హంగామాతో, దర్శకుడు శంకర్‌ - హీరో రజనీకాంత్‌ల 2007 నాటి బాక్సాఫీస్‌ హిట్‌ 'శివాజీ' కూడా 2012లో 3డి రూపంలోకి కన్వర్ట్‌ అయింది. మాతృకను రీ-మాస్టరింగ్‌ చేసి, అరగంట సేపు నిడివిని తగ్గించి, భారత దేశంలో తొలిసారిగా 'డాల్బీ ఎట్మాస్‌' అనే సరికొత్త ఆడియో పరి జ్ఞానంతో ఈ చిత్రాన్ని 'శివాజీ -3డి'గా నిర్మాతలైన ఏ.వి.ఎం. సంస్థ వారు 2012 డిసెంబర్‌ 12న రజనీకాంత్‌ జన్మదిన కానుకగా తమిళంలో విడుదల చేశారు. ఇలా మళ్ళీ చాలా కాలం తరువాత జనంలో 3డి చిత్రాల పట్ల క్రేజు పెరిగిన నేపథ్యంలో అనువాద చిత్రాలు కాకుండా, తెలుగులో నేరుగా ఇప్పుడు మళ్ళీ రెండు 3డి చిత్రాలు వస్తు న్నాయి. 

''మునుపటి కన్నా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరి గింది. 3డి చిత్రాల రూపకల్పన పరిజ్ఞానం కూడా ఆధునికతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో 3డి చిత్రాలపై ఉన్న ఆసక్తికి అనుగుణంగా ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా రూపొందించాలని భావించాను'' అని 'యాక్షన్‌-3డి'తో దర్శకుడి అవతారమెత్తుతున్న నిర్మాత అనీల్‌ సుంకర 'జీవన'కు వివరించారు. 

'ఓం -3డి' చిత్ర నిర్మాత, హీరో నందమూరి కల్యాణరామ్‌ కూడా ''కొత్తగా ఏదైనా చేయా లన్న తపనతో''నే ఈ త్రీడీ చిత్ర నిర్మాణానికి దిగారు. అందు కోసం కాలాన్నీ, ఖర్చునూ లెక్క చేయకుండా 'కల్యాణరామ్‌ కత్తి' (2010) చిత్రం తరువాత గడచిన రెండున్నరేళ్ళ పైగా ఇదే ధ్యాసలో మునిగి తేలుతున్నారు. అనీల్‌ తొలిసారిగా కామెడీ 3డి చిత్రంతో ముందుకొస్తుంటే, కల్యాణ్‌రామ్‌ తొలిసారిగా పూర్తి యాక్షన్‌ కథా చిత్రాన్ని 3డిలోకి తెస్తుండడం విశేషం. అటు 'యాక్షన్‌' అనీల్‌కు దర్శకుడిగా తొలి చిత్రమైతే, ఇటు 'ఓం' సినిమా దర్శకుడు సునీల్‌ రెడ్డికి మొదటి సినిమా కావడం గమనార్హం. విజయవాడలో పుట్టి, అక్కడే తెగ సినిమాలు చూస్తూ పెరిగిన అనీల్‌కు తన చిన్నప్పటి 'చిన్నారి చేతన - 3డి' నాటి హంగామా గుర్తే! అయితే! అప్పటి 3డి పరిజ్ఞానానికీ, ఇప్పటి దానికీ చాలా తేడా ఉందంటారాయన! అంతేకాదు. సినిమాలో చూపే దృశ్యాల్లో కూడా ''ఇప్పటి త్రీడీకీ, అప్పటి త్రీడీకీ చాలా తేడా ఉంది. అప్పట్లో ప్రేక్షకుడి మీదకు కత్తి, బుల్లెట్‌ లాంటివి దూసుకురావడం లాంటి అద్భుత రస ప్రధాన దృశ్యాలే ఉండేవి. కానీ, ఇప్పుడు పూర్తిగా సినిమాలోని వాతావరణం, తెర మీది దృశ్యంలోని రకరకాల అంశాలు త్రీ డైమన్షనల్‌ రూపంలో కనిపించడం మీదే ఎక్కువ దృష్టి. దీని వల్ల ప్రేక్షకుడికి ఓ కొత్త విధమైన అనుభూతి కలుగుతుంది'' అని అనీల్‌ వివరించారు. 

తీయాలంటే తిప్పలెన్నో! 

అయితే, 3డి సినిమాలు తీయడం అంత సులభమేమీ కాదు. మామూలు కెమేరామన్‌తో పాటు, 3డి దృశ్యాల చిత్రీక రణ సరిగ్గా వస్తున్నదీ, లేనిదీ పర్యవేక్షించడానికి '3డి స్టీరియో గ్రాఫర్‌' పేరిట మరో నిపుణుడు కూడా అవసరం. చేయితిరిగిన అలాంటి నిపుణులు ప్రస్తుతానికి హాలీవుడ్‌లోనే ఉన్నారు. అదీ చాలా కొద్దిమందే! వారిని ప్రత్యేకంగా ఇక్కడకు రప్పించి, షూటింగ్‌ జరిగినన్నాళ్ళూ వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. పైగా, ''3డి సినిమా తీయాలంటే, బోలెడంత సహనం కావాలి. కొన్నిసార్లు రోజు మొత్తం మీద రెండు షాట్లు కూడా తీయలేక పోతాం. అనుకోకుండా సాంకేతికంగా ఏవో చిన్న ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కెమేరాల పని తీరుతో సహా ఏ చిన్న సాంకే తిక ఇబ్బంది వచ్చినా, బొంబాయి నుంచి ప్రత్యేక నిపుణుణ్ణి పిలిపించి, ఆ లోపాన్ని సరిదిద్దాల్సిందే! వాటన్నిటినీ, సహిస్తూ, ఆర్థిక భారాన్ని భరిస్తూ, యూనిట్‌ అందరూ ఓపిగ్గా పని చేస్తే కానీ, సరైన ఉత్పత్తి బయటకు రాదు! 'యాక్షన్‌' చిత్రంతో మాకు అవన్నీ అలవాటైపోయాయి'' అని అనీల్‌ సుంకర చిరునవ్వుతో తన స్వీయానుభవాన్ని వివరించారు. 

'యాక్షన్‌ -3డి' చిత్రం తీయడానికి దాదాపు ఏణ్ణర్ధం పైగా పట్టింది. దాదాపు 130 రోజులు షూటింగ్‌ జరిగింది. అందులో, రోజూ ఏకధాటిగా 20 గంటలు కాల్షీట్లతో పని చేసిన దినాలే ఎక్కువ. హీరో 'అల్లరి' నరేశ్‌ తన కెరీర్‌లో అత్యధిక దినాలు పని చేసిన చిత్రం ఇదే! అలాగే, 3డి సినిమా కావడంతో, ''రేయింబ వళ్ళు పని చేస్తే కూడా నిర్మాణానంతర కార్యకలాపాలకు 3 నెలల సమయం పట్టింది.'' సహజంగానే, ఈ సినిమాకు అయ్యే ఖర్చు కూడా అలానే ఉంటుంది. ఒక హీరోతో సాధారణంగా చేసే చిత్ర నిర్మాణం కన్నా, 3డి చిత్రమంటే 40 శాతం మేర ఎక్కువ ఖర్చు అవుతుందని నిర్మాణ వర్గాల ఉజ్జాయింపు లెక్క. 'అల్లరి' నరేశ్‌ నటించే చిత్రాలకుండే సగటు మార్కెట్‌కు దాదాపు మూడింతల ఖర్చుతో 'యాక్షన్‌'ను తయారు చేయాల్సి వచ్చింది. అలాగే, కల్యాణరామ్‌ సైతం తన చిత్రాల మార్కెట్‌కు చాలా ఎక్కువ రెట్లు ఖర్చు చేస్తూ, సాహసోపేత ప్రయత్నం చేస్తున్నారు. 

కెమేరా పనే కీలకం! 

తెర మీద మామూలుగా బొమ్మలు కదులుతున్నట్లుండే సర్వసాధారణ సినిమాల (సాంకేతికంగా చెప్పాలంటే 2డి వెర్షన్‌)కూ, మన కళ్ళె దుటే పాత్రలు సజీవంగా తిరుగుతున్నట్లు అనిపించే త్రీడీ సినిమాల (3డి వెర్షన్‌)కూ కెమేరాలతో చిత్రీకరణ విషయంలో చాలా తేడాయే ఉంది. ''త్రీడీ చిత్రీకర ణకు కూడా మామూలు సినిమాల చిత్రీకరణకు వాడే రెడ్‌ వన్‌, ఎపిక్‌ కెమేరా లాంటివే వాడతారు. అయితే, దృశ్యాన్ని ఒక కెమె రాతో కాక రెండు కెమేరాలతో చిత్రీకరిస్తారు. ఆ రెండు కెమేరాల మధ్య నిర్ణీతమైన దూరం ఉండేలా, వాటిని ఓ ఫ్రేమ్‌కు బిగి స్తారు. వాటిలో ఒక కెమేరా ఒక కన్ను అయితే, రెండో కెమేరా ఏమో రెండో కన్ను లాంటిది. ఒక కంటితో కాక, మనం రెండు కళ్ళతోనూ చూసినప్పుడే ఏ వస్తువుకైనా, పొడవు, వెడల్పు, లోతు - ఈ మూడు డెమెన్షన్లూ తెలుస్తాయి కదా! ఇదీ అలాగే అన్న మాట! ఆ రెండు కెమేరాలూ ఏకకాలంలో మొదలై, ఒకే రకంగా కదులుతూ ఉండేలా వాటిని సమన్వయపరచాల్సి (సింక్రనైజ్‌ చేయాల్సి) ఉంటుంది. ఆ సమన్వయాన్నీ, చిత్రీకరించిన దృశ్యం తగినంత డెప్త్‌తో ఉన్నదీ, లేనిదీ 3డి-స్టీరియోగ్రాఫర్‌ చూస్తాడు'' అని అనీల్‌ సుంకర విశదీకరించారు. 

3డి దృశ్యాల చిత్రీకరణలో కెమేరాల సమన్వయానికి మాన్యువల్‌ రిగ్స్‌, ఆటోమేటిక్‌ రిగ్స్‌ అని రెండు రకాల పద్ధతులు అనుసరించవచ్చు. ఆటోమేటిక్‌ రిగ్స్‌పై కెమేరాతో చిత్రీకరణ జరిపితే, ఎగుడుదిగుడు ప్రాంతాలు, రోడ్ల మీద ఇబ్బంది గనక, 'యాక్షన్‌ -3డి'కి మాన్యువల్‌ రిగ్సే వాడారు. మాన్యువల్‌ రిగ్స్‌ వేసి, 3డి దృశ్యాల చిత్రీకరణ జరిపే అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరైన 3డి-స్టీరియోగ్రాఫర్‌ కీత్‌ డ్రైవర్‌ను వినియోగించుకు న్నారు. కెమేరామన్‌గా సర్వేష్‌ మురారి వ్యవహరించారు. 3డి చిత్రాల షూటింగ్‌లో కెమేరా పనితనం అంత కీలకం గనకనే, కల్యాణరామ్‌ తన 'ఓం' చిత్రానికి ఏకంగా 'అవతార్‌', 'ప్రొమెథియస్‌' లాంటి హాలీవుడ్‌ చిత్రాలకు పని చేసిన ముగ్గురు స్టీరియోగ్రాఫర్ల సేవలను వినియోగించుకున్నారు. ఛాయా గ్రహణ బాధ్యతలను అజయన్‌ జోసెఫ్‌ విన్సెంట్‌ నిర్వహిం చారు. స్టీరియోగ్రాఫర్లను హాలీవుడ్‌ నుంచి ఇక్కడకు రప్పించి, వారికి రోజువారీగా పారితోషికం చెల్లిస్తూ, సినిమా షూటింగ్‌ జరిగినన్నాళ్ళూ వెంట ఉంచుకోవడం మన దేశవాళీ 3డి చిత్రా లకు పెద్ద ఖర్చే! 

అయినా సరే, మన నిర్మాతలు అందుకు వెనుకాడలేదు. ''హాలీవుడ్‌లో ప్రస్తుతం ఏటా పక్కాగా 3డిలో తయారవుతున్న చిత్రాలు దాదాపు 50 ఉంటాయి. వాటికి పని చేసేందుకు పూర్తిస్థాయి నిపుణులైన స్టీరియోగ్రాఫర్లు ఓ పాతిక మందే ఉంటారు. అలాంటి వారిని తెచ్చి, చిత్రాన్ని రూపొందిస్తు న్నప్పుడు ఆ మాత్రం ఖర్చు తప్పదు'' అని అనీల్‌ అభిప్రాయపడ్డారు. 

సినిమాలు సరే! థియేటర్ల మాటో... 

తెలుగు నాట త్రీడీ చిత్రాల నిర్మాణం, ప్రదర్శన ఇప్పటికీ తక్కువే కాబట్టి, ఈ సినిమాలు తీయడంలోనే కాదు, ప్రదర్శనలోనూ ప్రస్తుతం కొన్ని చిక్కులున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 40 హాళ్ళలోనే పూర్తి స్థాయిలో త్రీడీ చిత్రాల ప్రదర్శనకు అనువైన తెర, ప్రొజెక్టర్‌ వగైరా ఉన్నాయి. ఇప్పుడు 'యాక్షన్‌-3డి'తో మరో పది హాళ్ళు కొత్తగా ఆ వసతిని సమకూర్చు కుంటున్నాయి. పూర్తిస్థాయి త్రీడీ చిత్ర సందర్శన అనుభూతిని అందించనున్నాయి. అయితే, ఇవన్నీ సినీ ప్రదర్శన రంగం పరిభాషలో 'ఎ' సెంటర్లయిన పెద్ద పట్టణాలే. 

ఇక, చిన్న పట్నాలైన 'బి', 'సి' కేంద్రాల్లో దాదాపు మరో 100 హాళ్ళలో కూడా కొంత వరకు త్రీడీ ఎఫెక్ట్‌ కనిపించేలా, ప్రత్యేకమైన కళ్ళద్దాలిచ్చి, చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. మొత్తం ఈ 150 హాళ్ళలోనే త్రీడీ అనుభూతి. మరో 100 హాళ్ళలో నేరుగా మామూలు సినిమాల లాగా ఉండే 2డి వెర్షన్‌నే ప్రదర్శించనున్నారు. అంటే, ఎంత ఖర్చు పెట్టి, 3డి సినిమా తీసినా వాటి ప్రదర్శనకు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న థియేటర్‌ వసతులు పరిమితమే అన్నది ఓ లోటు! 

కానీ, అనీల్‌ మాత్రం అందుకోసం నిరాశ పడాల్సిన పని లేదంటున్నారు. ''అన్ని భాషల్లోనూ భవిష్యత్తు అంతా 3డి చిత్రాలదే! కాబట్టి, అందుకు అనువైన థియేటర్లు కూడా క్రమంగా పెరుగుతాయి'' అంటారాయన. త్రీడీ చిత్రాల ప్రదర్శన కోసం 2కె ప్రొజెక్టర్‌, అందుకు అనువైన వేరే తెర లాంటివి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు దాదాపు 10- 15 లక్షల దాకా ఖర్చవుతుందని ఓ లెక్క. రానున్న మూడు నాలుగేళ్ళలో కొత్త థియేటర్లతో పాటు పాత హాళ్ళు కూడా ఆ వసతుల్ని సమకూర్చుకుంటాయని సినీ వర్గాల అంచనా. 

అలాగే, త్రీడీ సినిమా నిర్మాణానికి ఎక్కువ ఖర్చయినా, కన్నుల పండుగగా ఉంటే ఆ చిత్రాలు చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, ఆ మేరకు ఆ సినిమాల వ్యాపార ప్రతిపాదనలు కూడా మామూలు కన్నా 50 శాతం హెచ్చుతోనే వస్తున్నాయన్నది అనీల్‌ లాంటి వారి అనుభవం. ఆయన తెలివిగా తన చిత్రాన్ని ఏకకాలంలో తమిళంలో కూడా అక్కడి నేటివిటీకి తగ్గ మార్పులు, చేర్పులతో 'ఓ పోడు' పేరిట తీశారు. తెలుగు 'యాక్షన్‌' విడుదలైన మూడు వారాల విరామం తరువాత ఈ తమిళ వెర్షన్‌ విడుదల కానుంది. కామెడీ కన్నా, ఎక్కువగా పాటల మీద దృష్టి పెట్టిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌ ఈ చిత్రమని ఆయన అన్నారు. 

రానున్నది త్రీడీ యుగం 

ఆధునిక సాంకేతికతతో తొలినాళ్ళ ప్రయత్నాలు కాబట్టి, ఈ 3డి చిత్రాల నిర్మాణానికి అనుసరించాల్సిన పద్ధతులపై పరిశోధనకూ, అవగాహనకూ, షూటింగ్‌కూ ఎక్కువ సమయం పట్టింది. కానీ, క్రమంగా అలవాటైన పనిగా ఇది సులభమవుతుందనీ, రాగల రెండేళ్ళలో మామూలు సినిమా చేసినంత సులభంగా త్రీడీ చిత్రాలూ వచ్చేస్తాయనీ అనీల్‌, కల్యాణరామ్‌ లాంటి వారు అభిప్రాయపడుతున్నారు. అన్నీ పూర్తయ్యాక సినిమా మొత్తం ఇప్పుడు చూసుకుంటే, పడ్డ కష్టాన్ని మరిపిస్తోందంటారు అనీల్‌. 

'3డి షూటింగ్‌లో కెమేరాకూ, మనం చిత్రీకరిస్తున్న వస్తువుకూ మధ్య కచ్చితమైన నిర్ణీత దూరం ఉండాలి. కాబట్టి, మామూలు సినిమాల్లో లాగా జిమ్మీ జిబ్‌ల లాంటివి వాడేసి, మన ఊహకు తోచినట్లు త్రీడీ సినిమా తీయలేం. ఇటీవలే జిమ్మీకి పెట్టే 3డీ కెమేరా రిగ్‌ కూడా వచ్చింది. కానీ, ఇప్పటికైతే కేవలం ట్రాక్‌, ట్రాలీ షాట్లతోనే సినిమా తీయాల్సి ఉంటుంది. కాబట్టి, మన ఊహల్ని యథాతథంగా తెర మీదకు తేవడంలో కొంత రాజీ పడాల్సి వచ్చిందని అసంతప్తి అనిపించవచ్చు. అయితే, నూటికి నూరుపాళ్ళూ కష్టపడి, ప్రాణం పెట్టి సినిమా తీసినప్పుడు ప్రేక్షకులకు కూడా అది నచ్చడం గ్యారెంటీ'' అన్నారు అనీల్‌ సుంకర. ప్రయత్నంలో త్రికరణ శుద్ధిగా లోపం లేనప్పుడు ఫలితంలో లోటు జరుగుతుందని ఎవరైనా ఎలా అనగలరు! ఇప్పుడొస్తున్న మన భారీ 3డి చిత్రాల్లోని అతి పెద్ద సానుకూల అంశం చిత్తశుద్ధితో కూడిన ఆ ప్రయత్నమే!
                                           - రెంటాల జయదేవ 
***************************************************

మనదేశంలో తొలి 3డి చిత్రం

నిజానికి, తెలుగు సినీ ప్రేక్షకులకు వెండితెరపై 3డి చిత్రాలు కొత్త ఏమీ కాదు. భారతదేశంలో తయారైన తొలి 3డి చిత్రం 'మై డియర్‌ కుట్టి చేతాన్‌' 1984 ఆగస్టులో తొలిసారిగా విడుద లైంది. జిజో దర్శకత్వంలో కేరళలోని నవోదయ స్టూడియోకు చెందిన ఎం. అప్పచ్చన్‌ నిర్మించిన ఈ చిత్రం ప్రాథ మికంగా మలయాళ చిత్రమైనా, తమిళంలో 'చుట్టి చేతన్‌'గా, తెలుగులో 'చిన్నారి చేతన'గా అనువదించి విడుదల చేశారు. ప్రత్యేకమైన కళ్ళజోడు పెట్టుకొని చూస్తుంటే, తెరపై దృశ్యాలు కళ్ళెదుటే, చేతికి బారెడు దూరంలో నిజంగానే జరుగుతున్న అనుభూతి కలగడం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. 

మీదకు దూసుకు వచ్చే త్రిశూలాలు, మంత్ర దండాల లాంటి అద్భుత రస ప్రధాన దృశ్యాలతో అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించిన ఈ సినిమా తెలుగు రూపం 'చిన్నారి చేతన' అప్పట్లో ఓ పెను సంచలనం. త్రీడీ కళ్ళద్దాల కోసం టికెట్‌ రేటుకు అదనంగా రూపాయో, రెండో వసూలు చేయడం, సినిమా చూసి బయటకు వచ్చేస్తున్నప్పుడు ఆ అద్దాలను మళ్ళీ వెనక్కు ఇచ్చేయడం లాంటివి అప్పటి ప్రేక్షకులకు ఇప్పటికీ ఓ తీపి జ్ఞాపకమే. 

ఆ విజయంతో చిన్నారి ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని, వారిని ఆశ్చర్యా నందాల్లో ముంచెత్తే దృశ్యాలతో మరికొన్ని 3డి సినిమాలు అప్పట్లో వచ్చాయి. కృష్ణంరాజు, సుహాసిని నటించిన 'సాగర్‌- 3డి', జంతువుల గురించి కామెం టరీతో వచ్చిన 'జంతు ప్రపంచం - 3డి', అలాగే దర్శక - నిర్మాత బి. విఠలా చార్య తీసిన జానపద - ఫ్యాంటసీ చిత్రం 'జై భేతాళ -3డి' లాంటివన్నీ అప్పటి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నవే! అయితే, 'చిన్నారి చేతన' స్థాయి విజయాన్ని అవి అందుకోలేదు. ఆ తరువాత మళ్ళీ 3డిల హవా తెలుగులో కనపడలేదు.

అదే సినిమా... ముచ్చటగా మూడు సార్లు... 

మలయాళ చిత్రం 'మై డియర్‌ కుట్టి చేతాన్‌'కే కొన్నేళ్ళ తరువాత ప్రముఖ హిందీ తార ఊర్మిళా మాతోండ్కర్‌ నటించిన దృశ్యాలను కొత్తగా జోడించి, మలయాళంతో పాటు, హిందీలో 'ఛోటా చేతన్‌'గా 1997లో విడుదల చేశారు. మలయాళంలో తొలిసారిగా డి.టి.ఎస్‌. సౌండ్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఈ రెండో వెర్షన్‌కు దక్కిండి.

హిందీలోనూ ఈ చిత్రం విజయవంతమైంది. ఇక, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా నటించిన మేజిక్ మేజిక్ చిత్రం లాంటి ఒకటీ, అరా ప్రయత్నాలు 2000లలో జరిగాయి. అవి అంత ఘన విజయమేమీ సాధించలేదు. ఇంతలో హాలీవుడ్ చిత్రాల 3డి రూపాల హంగామా మొదలైంది. అవతార్ లాంటి బ్లాక్ బస్టర్ ఆంగ్ల చిత్రాలు 3డి రూపంలో బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించసాగాయి. దాంతో, మళ్ళీ మనవాళ్ళ దృష్టి 3డి చిత్రాల రూపకల్పన మీద పడింది.

       
        దాంతో, హిందీలో, తమిళ చిత్ర సీమలో ఈ 3డి క్రేజును సొమ్ము చేసుకొనే కృషి ముమ్మరమైంది. తమిళంలో కొత్త 3డి సినిమాలు వస్తుండగానే, ఆధునిక త్రీడీ టెక్నాలజీలను సమన్వయం చేసుకొని, 2010లో మరోసారి పాత - చుట్టి చేతన్ - సినిమాకే నటులు ప్రకాశ్ రాజ్, సంతానమ్ లతో కూడిన దాదాపు అరగంట నిడివి కొత్త దృశ్యాలను కలిపి, 2011 ఆగస్టు 25న సరికొత్తగా - డిజిటల్ 3డి - రూపంలో తమిళ, మలయాళాల్లో విడుదల చేశారు. అప్పుడూ ఆ సినిమా హిట్టే. ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందుకుంటూ, సరికొత్త దృశ్యాలను జోడించుకుంటూ, మొత్తం మూడుసార్లు నిర్మాణమై, విడుదలైన ప్రతిసారీ విజయం సాధించడం - మై డియర్ కుట్టి చేతన్ - ప్రత్యేకత. పైగా, తొలిసారి 3డి రూపంలో విడుదలై, ఆ పైన మూడో విడత నిర్మాణంలో డిజిటల్ 3డి రూపం సంతరించుకొని విడుదలైన తొలి సినిమా ప్రపంచంలో ఇదే.

              - రెంటాల జయదేవ 
***************************************************
(published on Thurs, 20 Jun 2013 in Prajasakti daily, page no.5)
***************************************************

Monday, July 1, 2013

ఆగిపోయిన స్వర రాఘవ ప్రస్థానం - జె.వి. రాఘవులుకు శ్రద్ధాంజలి.





 ప్రముఖ సంగీత దర్శకులు జె.వి. రాఘవులు శుక్రవారం (June 7) నాడు ఉదయం రాజమండ్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 81 ఏళ్ళు. అభిమాన గాయకుడిగా తాను ఆరాధించిన ఘంటసాల అభిమానాన్ని సంపాదించి, ఆయన వద్దే సహాయకుడిగా పనిచేసి, ఆయనతో కలసి తానూ పాడి, ఆ పైన సంగీత దర్శకుడిగా ఆ గురువుతోనే తన బాణీలకు పాటలు పాడించుకొనే స్థాయికి ఎదిగిన వ్యక్తి - రాఘవులు. ఆయన మరణంతో ఆ తరంతో అనుబంధమున్న మరో స్వర తంత్రి తెగిపోయింది. 

జె.వి. రాఘవులుగా సుపరిచితులైన జెట్టి వీర రాఘవులు 1931 అక్టోబర్‌ 22న జన్మించారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఆయన జన్మస్థలం. ఆదిలక్ష్మి, వీరాస్వామి నాయుడు దంపతుల ఆరుగురి సంతానంలో మూడోవారు - రాఘవులు. ఆయనకు ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు. రాఘవులు అక్షరాల్లో చదివింది ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. దాకానే అయినా, అక్షర లక్షల విలువైన సంగీతంలో మాత్రం దిట్టగా ఎదిగారు. 

సంగీతమంటే అమితమైన ఇష్టంతో భక్తి పాటలు బాగా పాడే తల్లి నుంచి స్వరజ్ఞానం అబ్బిన చిన్నారి రాఘవులుకు పొరుగింటిలోని రంగస్థల నటుడు వై. భద్రాచార్యులు ప్రోత్సాహం తోడైంది. ఆయనతో కలసి, చిన్నతనంలోనే రంగస్థలం పైకి ఎక్కారు. 'హరిశ్చంద్ర'లో లోహితాస్యుడు, 'కుచేలుడు'లో రాఘవుడు లాంటి బాల నటుడి పాత్రలు పోషించారు. నటన, పద్యాల ఆలాపన, ఆపైన శాస్త్రీయ సంగీతం ఆయన వద్దే నేర్చుకున్నారు బాల రాఘవులు. బడిలో తనకు అధ్యాపకులూ, భావ గీత రచయితలూ అయిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రుల ప్రోత్సాహంతో చాలా కచ్చేరీల్లో పాల్గొన్నారు. వారి పాటలు తీసుకొని, బాణీలు కట్టి, రేడియోలోని లలిత గీతాల కార్యక్రమంలో పాల్గొనేవారు. 

ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్‌లో రికార్డింగ్‌ కోసం వచ్చిన ప్రసిద్ధ సినీ, లలిత సంగీత గాయకుడు ఘంటసాల తన కన్నా ముందు జరుగుతున్న రికార్డింగ్‌లో పాడుతున్న రాఘవులు గొంతు విని, ఆ మాధుర్యాన్ని ప్రశంసించారు. మద్రాసు రావాలనుకుంటే, తన వద్దకు రమ్మంటూ ఆ రోజు ఘంటసాల ఇచ్చిన చిరునామా తరువాతి రోజుల్లో రాఘవులు సినీ సంగీత జీవితానికి పాస్‌పోర్టు అయింది. మద్రాసులో ఘంటసాల ఆశ్రయంలో సినీ సంగీతంలో మెలకువలు నేర్చున్నారాయన. సినీ రంగంలో సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా, అడపా దడపా నేపథ్య గాయకుడిగా, ఆనక పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా రాఘవులు ప్రస్థానం ఎన్నో మజిలీలు, మలుపులతో సాగింది. ఘంటసాలతో కలసి కచ్చేరీల్లోనూ, సినిమాల్లోనూ పాడారాయన. 'జగదేక వీరుని కథ'లోని క్లిష్టమైన 'శివశంకరీ శివానంద లహరి...' గీతం వారిద్దరూ కలసి పాడినదే. ఘంటసాల పాడిన 'భగవద్గీత' ఆల్బమ్‌కు కూడా రాఘవులు పనిచేశారు. 

వీణ నాది.. తీగ నీది 

ఘంటసాలతో పాటు ఎమ్మెస్‌ విశ్వనాథన్‌, కె.వి. మహదేవన్‌ లాంటి సుప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా పనిచేశారాయన. వారు బాణీలు కడుతుంటే, సహాయకుడిగా ఆ స్వరాలు తీసుకొని, వాద్య బృందంతో సాధన చేయించిన రాఘవులుకు ఆ అనుభవం తరువాతి కాలంలో స్వతంత్ర సంగీత దర్శకుడయ్యాక బాగా పనికొచ్చింది. సంగీత దర్శకుడిగా జె.వి. రాఘవులు తొలి చిత్రం - రామానాయుడు నిర్మించిన 'ద్రోహి' (1970). అప్పటి నుంచి ఆయన 172 దాకా చిత్రాలకు సంగీతం అందించారు. వాటిలో తమిళ చిత్రం ఒకటి, కన్నడ చిత్రం ఒకటి కూడా ఉన్నాయి. 

'వీణ నాది... తీగ నీది... తీగ చాటు రాగముంది..' (చిత్రం: 'కటకటాల రుద్రయ్య'), 'చినుకు చినుకుగా చిగురు మెత్తగా...' (చిత్రం: 'ముక్కుపుడక') లాంటి సుతిమెత్తని పాటలు అందించడం ఆయనకు తెలుసు. అలాగే, 'ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో...' (చిత్రం: 'జీవన తరంగాలు'), 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ...' (చిత్రం: 'బొబ్బిలి పులి'), 'తరంగిణీ... ఓ తరంగిణీ...' (చిత్రం: 'తరంగిణి') లాంటి ఆలోచనా స్ఫోరకమైన భావప్రధాన గీతాలకు బాణీ కట్టడమూ ఆయనకు కరతలామలకం. ఇలా ప్రాచుర్యం పొందిన పాటలెన్నో జె.వి. రాఘవులు సంగీత దర్శకత్వంలో వచ్చినవే. ఆర్‌. నారాయణ మూర్తి రూపొందించిన 'ఛలో అసెంబ్లీ' (2000)కి ఆయన ఆఖరు సారిగా సంగీతం అందించారు.

 చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మహదేవన్‌ సంగీత సారథ్యంలో నిర్మాత డి. రామానాయుడు నిర్మించిన 'ప్రేమ్‌నగర్‌' చిత్రంలోని 'ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం...' అనే పతాక సన్నివేశపు శీర్షికా గీతానికీ, ప్రసిద్ధమైన 'మనసు గతి ఇంతే...' పాటకూ బాణీలు నిజానికి రాఘవులు సమకూర్చినవే! 'లవకుశ', 'నర్తనశాల', 'పాండవ వనవాసం' తదితర తెలుగు పౌరాణికాలు హిందీ, బెంగాలీ భాషల్లోకి అనువాదమైనప్పుడు ఆ యా భాషలకు తగినట్లు ట్యూన్లను మార్చి, మళ్ళీ ఆర్కెస్ట్రయిజేషన్‌ చేశారయన. 

బాణీకి అనుగుణంగా రాసే రచయితలకు స్వేచ్ఛ ఉండదని అభిప్రాయపడే రాఘవులు ముందుగా సాహిత్యం రాయించి, ఆ పైన బాణీ కట్టడానికే ఇష్టపడేవారు. ఆ అలవాటునే ఎక్కువ భాగం కొనసాగించారు. విజయ మాధవీ కంబైన్స్‌ పతాకంపై వడ్డే బ్రదర్స్‌ నిర్మించిన చిత్రాల్లో ఎక్కువ వాటికి రాఘవులే సంగీత దర్శకుడు. దర్శకనిర్మాతల అభిరుచి మేరకు వంద రూపాయలకు నెల జీతంతో ఘంటసాల వద్ద పని చేయడం మొదలు పెట్టి, సంగీత దర్శకుడిగా తొలి చిత్రానికి 15 వేలు, కెరీర్‌లో అత్యధిక పారితోషికంగా 'బొబ్బిలిపులి'కి రెండు లక్షల రూపాయలు అందుకున్న రాఘవులు జీవిత చరమాంకంలో అనారోగ్యంతో, దానితో వచ్చిపడ్డ ఆర్థిక బాధలతో కష్టపడ్డారు. చివరి రోజుల్లో ఆస్తులన్నీ అమ్ముకొని, రాజమండ్రిలో కొడుకు వద్ద స్థిరపడ్డారు. తన కాళ్ళ మీద తాను నడవలేని స్థితిలో సినీ సంగీత ప్రియులు, కొందరు పరిశ్రమ పెద్దలు చేసిన సహాయం ఆయనకు ఊతమైంది. కొంత కాలంగా అస్వస్థులై, ఆఖరికి శుక్రవారం తెల్లవారు జామున రాజమండ్రిలో జీవన పోరాటానికి చరమ గీతం పాడారు. 

ఆయన భార్య రమణమ్మ దాదాపు దశాబ్దం క్రితమే మరణించారు. వారికి నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి కాగా, నాలుగో అబ్బాయి రవి కుమార్‌ వయొలిన్‌ కళాకారుడిగా సినీ రంగంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ సంగీత దర్శకులైన ఇళయరాజా, ఏ.ఆర్‌. రెహమాన్‌, మణిశర్మలు సైతం ఒకప్పుడు రాఘవులు పనిచేసిన వారే! 

హీరోల్లో ఎన్టీయార్‌తో, రచయితల్లో ఆత్రేయతో, దర్శకుల్లో దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణలతో రాఘవులుకు అనుబంధం ఎక్కువ. ''సాహిత్యం బాగా అవగాహన చేసుకొని, దానికి తగ్గట్లుగా రాగాన్ని నిర్ణయించుకొని, దర్శక - నిర్మాతల అభిరుచి మేరకు బాణీ కట్టడం నేను అనుసరించే పద్ధతి'' అని ఆయన చెబుతూ ఉండేవారు. తెలుగులో ఘంటసాల, పి. సుశీల, హిందీలో మహమ్మద్‌ రఫీ, మన్నాడే, బెంగాలీలో హేమంత్‌ కుమార్‌లు ఆయన అభిమాన గాయనీ గాయకులు. ఘంటసాలతో పాటు పెండ్యాల, నౌషాద్‌, ఆర్‌.డి. బర్మన్‌ల సంగీతమంటే అభిమానించే రాఘవులుకు భీమ్‌పలాస్‌ రాగమంటే చాలా ఇష్టం. ఆ రాగంలోనే ఆయన ఎక్కువ పాటలు చేశారు. 82వ పడిలో కన్ను మూసే వరకు సినీ సంగీతం గురించి, అప్పటి సంగతుల గురించి తనను కలసినవారితో ముచ్చటించిన ఆ స్వరార్చకుడికి శ్రద్ధాంజలి.

- రెంటాల జయదేవ

(Published in PrajaSakti daily, 8th June 2013, Saturday, Page No.8)
...........................................................

Saturday, June 29, 2013

'బలుపు' - యాక్షన్‌ రొటీన్‌ ..! ఎంటర్‌టైన్‌మెంట్‌ అతి రొటీన్‌ !!



 సామాన్య ప్రేక్షకులను మెప్పించేలా సినిమా తీసి, మినిమమ్‌ గ్యారెంటీగా డబ్బులు సంపాదించడం సినీ రంగంలో విజయానికి దగ్గర దోవ. అలా కాకుండా, కొత్తదనంతో కూడిన కథనో, కథనాన్నో అనుసరించి వెళ్ళి, తద్వారా జనాన్నీ, జాగ్రత్తగా సొమ్మునూ రాబట్టుకోవాలనుకోవడం మరో మార్గం. మొదటి దాని కన్నా రెండోది కొద్దిగా కష్టంతో కూడిన పని కాబట్టి, ఆ దోవ తొక్కడానికి కొద్దిగా సాహసం, మరికొద్దిగా కొత్తదనం కోసం తపన ఉండాలి. అవి లేనప్పుడు సినిమాను కేవలం వ్యాపార మార్గంగా భావించి, దగ్గర దోవలో వెళ్ళడానికే నిర్మాతలైనా, దర్శకులైనా ప్రయత్నిస్తారు. అందుకే తెలుగులో మనవాళ్ళు తీసిన కథలే తీస్తుంటారు. పైపెచ్చు, తీసిన పద్ధతిలోనే తీస్తుంటారు. జనం కూడా విధి లేక అలాంటి వాటికే అలవాటు పడి, కానీ లెమ్మని చూసేస్తుంటారు. అందరూ అనుసరించే ఆ దగ్గరి దోవలోనే ప్రేక్షకులకు దగ్గర కావాలని హీరో రవితేజతో దర్శకుడు గోపీచంద్‌ మలినేని చేసిన ప్రయత్నం - 'బలుపు'.

..........................................................................................................
చిత్రం:బలుపు, తారాగణం: రవితేజ, శ్రుతీహాసన్‌, అంజలి, ప్రకాశ్‌రాజ్‌, ఆశుతోష్‌ రాణా, అడివి శేషు, కథ: కోన వెంకట్‌, కె.ఎస్‌. రవీంద్ర, మాటలు: కోన వెంకట్‌, వెలిగొండ శ్రీనివాస్‌, ఆర్ట్‌: ఏ.ఎస్‌. ప్రకాశ్‌, కూర్పు: గౌతంరాజు, కెమేరా: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌, నిర్మాత: పరమ్‌ వి. పొట్లూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని
...........................................................................................................

కథ ఏమిటంటే..

హీరో రవి (రవితేజ) బృందం ఓ బ్యాంకు తరఫున ఋణాల బాకీలు వసూలు చేస్తుంటుంది. ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోమంటూ తండ్రి మోహనరావు (ప్రకాశ్‌రాజ్‌) రవిని పోరుపెడుతుంటాడు. మరోపక్క క్రేజీ మోహన్‌ (బ్రహ్మానందం), అతని మేనకోడలు శ్రుతి (శ్రుతీహాసన్‌) కలసి కనపడిన అబ్బాయినల్లా బకరాలను చేస్తుంటారు. ప్రేమిస్తున్నానంటూ శ్రుతి వాళ్ళను బుట్టలే పడేసి, తమ హౌటల్‌ బిల్లులు కట్టిస్తుంటుంది. అలా మోసపోయిన తన మిత్రుడి తరఫున శ్రుతికి బుద్ధి చెప్పేందుకు హీరో రంగంలోకి దిగుతాడు. పెళ్ళి మరో పది రోజులు ఉందనగా ఇలా క్రేజీ పనులతో థ్రిల్‌ పొందాలని చూసిన శ్రుతి కాస్తా చివరకు అనుకోని పరిస్థితుల్లో హీరో ప్రేమలో పడుతుంది. కుదిరిన పెళ్ళిని కూడా కాదనుకొని, హీరోను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడుతుంది.

ఆమెతో పెళ్ళి ఆగిపోయిన పొగరుబోతు ధనికుల కుర్రాడు రోహిత్‌ (అడివి శేషు) తరఫున అతని మేనమామ వైజాగ్‌ పూర్ణ (ఆశుతోష్‌ రాణా) రంగంలోకి దిగుతాడు. అక్కడ తీరా రవి, మోహనరావులను చూసి, వారిద్దరూ తానెంతో కాలంగా వెతుకుతున్న రౌడీ షీటర్లు శంకర్‌ (రవితేజ), నానాజీ (ప్రకాశ్‌రాజ్‌) అని చెబుతాడు. అక్కడి పోరాటంలో కత్తిపోట్లకు గురై, నానాజీ చావుబతుకుల్లో పడతాడు. ''అరేరు! శంకర్‌! నువ్వు మగాడివైతే, వైజాగ్‌కు వచ్చి శ్రుతిని తెచ్చుకోరా!'' అంటూ విలన్‌ సవాలు విసరడంతో సినిమా ప్రథమార్ధం అయిపోతుంది.

ఇక, హీరోకూ, అతనికి తండ్రిగా చెబుతున్న ప్రకాశ్‌రాజ్‌కూ ఉన్న ఫ్లాష్‌బ్యాక్‌ ఏమిటి, గతంలో వారి బద్ధశత్రుత్వానికి కారణమేమిటి, వారెలా కలసిపోయారు లాంటి ప్రశ్నలన్నిటికీ ద్వితీయార్ధంలోని కథ జవాబు. ఆ పైన విలన్‌ బారి నుంచి శ్రుతిని హీరో ఎలా కాపాడాడన్నది కై ్లమాక్స్‌.

కథనం ఎలా ఉందంటే.. 

కొద్ది క్షణాలు తక్కువగా సరిగ్గా రెండున్నర గంటల నిడివి ఉన్న 'బలుపు' నటి లక్ష్మీరారు (నిజ జీవితపాత్రనే ఆమె ధరించారు)పై దుండగుల అత్యాచార యత్నం, వారిని అడ్డుకొని, ఆటాడుకొనే హీరో రంగప్రవేశంతో చాలా రొటీన్‌గా మొదలవుతుంది. హీరో ఇంట్రడక్షన్‌ ఫైట్‌తో అయింది కాబట్టి, ఆ వెంటనే ఇంట్రడక్షన్‌ సాంగ్‌! తనను కాపాడిన హీరో బృందానికి పార్టీ ఇస్తానంటూ, ఆమె పబ్‌లో చిందులు వేస్తుంది. దుండగుల వాంఛ నుంచి తప్పించుకోవడానికి తెగ శ్రమపడ్డ ఆమె, తీరా హీరోతో అలాంటి వాంఛలే వ్యక్తం చేస్తూ పాట పాడడం ఏమిటో అర్థం కాదు. అది పాత్ర, సంఘటనల పరంగా నప్పదని గీత రచయితకు కాకపోయినా, దర్శకుడికైనా తెలియాలి.

రవితేజ, ప్రకాశ్‌రాజ్‌లు బద్ధశత్రువులంటూ విలన్‌ నోట పలికించడంలో అర్థం లేదు. ఎందుకంటే, ఒకప్పుడు పరస్పర విరోధులైనా, అంజలి మరణంతో వారిద్దరూ దగ్గరైపోయారన్నది విలన్‌కు కూడా తెలిసిన విషయమే! అలాగే, ఫ్లాష్‌బ్యాక్‌ చూపిస్తున్నప్పుడు అందులో ప్రకాశ్‌రాజ్‌, హీరోను ఫ్లాష్‌బ్యాక్‌ తరువాతి జీవితంలోని పేరుతో ప్రస్తావించడం లాంటి తప్పులు సినిమాలో ఉన్నాయి.

ఇద్దరు కథా రచయితలు, ఇద్దరు మాటల రచయితలు, స్క్రీన్‌ప్లేకు దర్శకుడితో పాటు మరొకరు ఉన్న ఈ సినిమా కథ, సన్నివేశాలన్నీ మునుపెప్పుడో వచ్చిన తెలుగు సినిమాల్లోని వాటికి నకళ్ళే! కథనం కూడా హాయిగా, సాఫీగా, వడివడిగా సాగకపోవడం మరో లోపం. సినిమా మొదలై ముప్పావు గంట దాటినా అసలు కథలోకి రాకపోవడం ప్రేక్షకుల సహనానికి పరీక్షే. నటీనటుల అభినయం కూడా కొన్ని చోట్ల అతి అనిపిస్తుంది. అసలు పాత్రలకు పక్కబలంగా తెరపై నేపథ్యంలో కనిపించే నటులు కూడా తమకు డైలాగ్‌ లేకపోయినా, తెగ నటించేస్తుంటారు. గతంలో 'డాన్‌ శీను', 'బాడీగార్డ్‌' చిత్రాలు రూపొందించిన దర్శకుడు గోపీచంద్‌ తన దర్శకత్వ ప్రతిభకు మరింత మెరుగు పెట్టుకోవాల్సి ఉంది.

ఈ సినిమాలో థమన్‌ బాణీల్లో పాటలు బీట్‌ ప్రధానంగా వినిపించాయి. 'కాజల్‌ చెల్లివా...' అనే పాటలో తమన్‌తో, రవితేజ తన గొంతు కలపడం విశేషం. రవితేజ, అంజలి మీద వచ్చే 'నిను చూసిన క్షణంలో...' పాట ఎస్పీబీ, గీతామాధురి గళాల్లో భావప్రధానంగా సాగింది. సినిమా చివరలో రవితేజ, శ్రుతీ హాసన్‌లపై వచ్చే 'పాతికేళ్ళ చిన్నది చేపకళ్ళ సుందరి...' కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ, తాళం వేయిస్తుంది. జయనన్‌ విన్సెంట్‌ కెమేరా అతి హడావిడులు లేకుండా కథనంలో భాగమై, నడిచింది. డ్యాన్సులు, ఫైట్లు రొటీనే!

అభినయం మాటేమంటే.. 

నటీనటుల్లో రవితేజ, ప్రకాశ్‌రాజ్‌లకు ఈ మార్కు కథలు, పాత్రలు కొట్టినపిండి. ఈసారీ వారు అదే చేశారు. శ్రుతీ హాసన్‌, అంజలి - ఇద్దరూ పాత్రల పరిధి మేరకు నటించారు. కానీ, అందం, ఆకర్షణల్లో దొందూ దొందే! పైపెచ్చు, అతి మేకప్‌తో అంజలి అనాకర్షణీయంగా తయారైంది. విలన్‌గా ఆశుతోష్‌ రాణా బాగానే ఉన్నా, ఉత్తరాది పాత్రలాగానే అనిపించాడు. అతని కుమారుల పాత్రల్లో అజరు, షఫీ కనిపిస్తారు. షఫీ చేసిన 'జింగిల్‌ బారు కాశీ' పాత్ర కూడా పాత చింతకాయ పచ్చడే!

సినిమాలో వినోదం కోసం బ్రహ్మానందంతో పాటు, సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ సావిత్రిగా అలీ, ఇంకా 'తాగుబోతు' రమేశ్‌ తదితరులు ఉన్నారు. హీరో, లేదా విలన్‌ చేతిలో వట్టి బడుద్ధాయిగా మారి, దెబ్బలు తింటూ, తనవైన హావభావాలు పలికించడం ఇటీవల బ్రహ్మానందానికి ప్రామాణికమైన పాత్రచిత్రణ. ఇందులోనూ అంతే! చిత్రం మొదట్లో వచ్చిన కామెడీ ట్రాక్‌ లాంటివి నవ్వించడానికి తెగ ప్రయాసపడ్డాయి. కాగా, శ్రుతితో కలసి బ్రహ్మానందం గంగ్‌నమ్‌ శైలి డ్యాన్స్‌, కై ్లమాక్స్‌లో ఆయన ఆవేశంగా చెప్పే డైలాగ్‌ లాంటివి నవ్విస్తాయి. మాటల గారడీతో సాగే మాస్‌ డైలాగులు కొన్ని మాస్‌కు నచ్చుతాయి. కానీ, ''మొక్కను పెంచుకో నీడనిస్తుంది. కుక్కను పెంచుకో తోడుగా నిలుస్తుంది. పగను పెంచుకోకు. ప్రాణం తీస్తుంది'' (ప్రత్యర్థులతో హీరో) లాంటి డైలాగులు ఎఫెక్ట్‌ చూపకపోగా, నవ్వు తెప్పిస్తాయి.

అయితే, 'బలుపు'లాంటి ప్రయత్నాల్లో ఉన్న చిక్కేమిటంటే - పాత్రలు, అవి చెప్పే డైలాగులు, చేసే పనులను ప్రేక్షకులు ముందే అంచనా వేసేయగలుగుతారు. ఈ సినిమాకూ అదే జరిగింది. దాంతో, కొత్త సినిమాకు వచ్చినా సన్నివేశాలు, సంఘటనలతో సహా పాత సినిమాలే గుర్తుకొచ్చేస్తుంటాయి. అలాంటి బలహీనతలన్నీ ఉన్న మాస్‌ మసాలా చిత్రంగా 'బలుపు' నిలుస్తుంది. కానీ, ఇటీవల విజయాల కోసం అర్రులు చాస్తున్న రవితేజకు ఆ భరోసా ఇస్తుందా? బాక్సాఫీస్‌ను గెలుస్తుందా?

- రెంటాల జయదేవ 

(Published in Praja Sakti daily 29th June 2013, PageNo.8)

..................................................................