జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, January 13, 2011

వినోదం కోసం ‘పరమ వీర చక్ర’

మీరు ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసినా తలనొప్పితో తిరిగొస్తున్నారా.? ఏదీ మీకు తగినంతగా వినోదం పంచడం లేదని బాధపడుతున్నారా? తెలుగు సినిమాల మీద కచ్చితమైన అభిప్రాయం చెప్పలేక సతమతమవుతున్నారా? అయితే, మీరు అర్జెంటుగా ‘పరమ వీర చక్ర’ సినిమా చూడాల్సిందే. సరైన స్నేహితులతో కలసి ఈ సినిమాకు వెళ్ళండి. మీకు నూటికి నూరుపాళ్ళు వినోదం గ్యారెంటీ. దానికి నేను హామీ.

మీరు పెట్టిన ప్రతి పైసాకూ వినోదం అందిస్తూ, తెర పై ప్రతి మాటకూ, హీరో ప్రతి కదలికకూ, దర్శకుడి ప్రతి ఆలోచనకూ పగలబడి నవ్వుకోవచ్చు. సినిమా చూస్తున్నంత సేపూ మీరు తెగ ఎంజాయ్ చేస్తారు. తెలుగు సినిమా ఇంకా ఇలాగే ఉన్నందుకు తెగ నవ్వుకుంటారు. 150వ సినిమాగా కూడా ఇలాంటి సినిమా తీయగల దర్శకులు మన దగ్గరే ఉన్నందుకు ఏమనాలో తెలియక విషాదంగా నవ్వుతారు. ఈ చిత్రాలను అత్యద్భుత చిత్రాలుగా చెప్పుకు తిరుగుతున్న మన హీరోలనూ, దర్శక, నిర్మాతలనూ చూసి విరగబడి నవ్వుతారు. అందుకే, తప్పక చూడండి. ‘పరమ వీర చక్ర.’ ఆలస్యం చేయకండి. కొంపదీసి ఆలస్యం చేస్తే, మీరు చూద్దామన్నా హాలులో ఈ సినిమా ఉండదు....

(ఈ అర్ధరాత్రి ‘పరమ వీర చక్ర’లో మాకు కలిగిన మహదానందం గురించి రేపు తెల్లవారాక... నిద్ర లేచాక..తరువాతి పోస్టులో...)

Friday, December 31, 2010

'రగడ' - బాగుందన్నవాడితో పెట్టుకోవాలి గొడవ!



ముగిసిపోతున్న ఈ 2010లో ఇప్పటి దాకా తెలుగు సినిమా ఒకటీ అరా సందర్భాల్లో తప్ప, మిగిలిన అన్నిసార్లూ అన్యాయంగా ప్రేక్షకుల్ని వీరబాదుడు బాదింది. ఆ సంగతి తెలిసీ నేను బుక్ అయి వచ్చిన తాజా సినిమా - ‘రగడ’. సినిమా ఫరవాలేదట అని కొందరూ, బాగానే ఆడుతోంది - ఆడుతుందని మరికొందరూ పొద్దుటి నుంచీ ఆఫీసులో ఒకటే రగడ. సరే, ‘యథా ప్రకారం సిద్ధిరస్తు’ అని అనుకుంటూనే, వెళ్ళాం.

కథా సంగ్రహం

రాయలసీమలో కడపకు చెందిన సత్యారెడ్డి అనే ఓ యువకుడి కథగా ఈ సినిమా నడుస్తుంది. హైదరాబాద్ నగరానికి వచ్చిన ఈ ‘‘కడపోడు’’ డబ్బు కోసం ఏం చేయడానికైనా రెడీ అంటూ ఉంటాడు. పెద్ద పెద్ద రిస్కీ ఫైట్లు కూడా చేసేస్తుంటాడు. నగరంలోని పెద్దన్న (ప్రదీప్ రావత్) గ్యాంగులోని ఛోటా నేతల్లో ఒకడికీ, నగరంలోని మరో గ్యాంగు నేత జి.కె. (‘మగధీర’లో రాజమౌళి చూపించిన కొత్త విలన్ దేవ్ గిల్)కూ మధ్య గొడవ. జి.కె.కు దగ్గరైన హీరో అతనికి ప్రత్యర్థులైన పెద్దన్న గ్యాంగుల్లోని ఛోటా నేతలను ఒక్కొక్కణ్ణీ చంపి, అడ్డు తొలగిస్తుంటాడు. ఆ క్రమంలోనే అతను శిరీష (అనూష్క)తోనూ, అష్టలక్ష్మి (ప్రియమణి)తోనూ దగ్గరవుతాడు. అతను సీమ నుంచి ఆ ఊరెందుకు వచ్చాడు, వాళ్ళను ఎందుకు చంపుతున్నాడు లాంటి అంశాలకు సమాధానంగా ఓ ఫ్లాష్ బ్యాక్. ఆ తరువాత సినిమాలో మాత్రమే సాధ్యమయ్యే బోలెడన్ని ట్విస్టులు. ఆఖరికి ది ఎండ్.

కంటి చూపుతో కాదు, కత్తులతోనే చంపేసే హీరో

కుటుంబ, హాస్య కథా చిత్రాల హీరోగా సంతోషం చిత్రం రోజుల నుంచీ రూటు మార్చిన నాగ్ ను మళ్ళీ చాలా వెనక్కి తీసుకెళ్ళిందీ సినిమా. బహుశా ‘విక్రమ్’ (1986) నుంచి ఇప్పటి వరకు - గడచిన 25 ఏళ్ళ కెరీర్ లో నాగార్జున ఇంతగా తెరపై హింస, రక్తపాతాలు చూపించలేదేమో. నాకైతే మునుపెన్నడూ చూసిన గుర్తు లేదు. రాయలసీమ నేపథ్యం, కత్తి పట్టుకొని వందల మందిని కసక్కున పొడిచేసే కథానాయకుడి కదన కుతూహలం, ఒకరికి ముగ్గురు నాయికలు లాంటి కమర్షియల్ అంశాలు నాగ్ మీద అతిగా ప్రయోగించడం ఇదే తొలిసారి. ఒక్క హిట్ కోసం ఇంత హింస అవసరమా!?

వయసు మీద పడుతున్నా గ్లామర్ తగ్గకుండా కనిపించే నాగార్జున ఎందుకో, ఈ చిత్రంలో అంత ఆహ్లాదంగా కనిపించరు. కొన్ని దృశ్యాల్లో వయసు తెలిసిపోయింది. అనూష్క, ప్రియమణి - నటించడానికి ఏమీ లేకపోవడంతో, పాటల్లో తక్కువ దుస్తులతో ఆకట్టుకోవడానికి శ్రమపడ్డారు. బ్రహ్మన్న, బ్రహ్మీ డార్లింగ్ గా బ్రహ్మానందం కొన్ని ఘట్టాల్లో నవ్వించారు. ధర్మవరపు, బాల నటుడు భరత్ ల బ్యాచ్ కామెడీ కాసేపయ్యాక నవ్వు కాదు, నస అనిపిస్తుంది.

మాటలెక్కువ, చేసింది తక్కువ

కథ, మాటల రచయితగా మొదలై, ఆనక దర్శకుడైన వీరూ పోట్ల ఈ చిత్రానికి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. కలిసొస్తే చెరుకుగడ, ఎదురొస్తే రగడ ..... లాంటి పంచ్ (!?) డైలాగులను మార్చి, మార్చి సినిమాలో వాడారు. వాటిని పాటక జనం ప్రశంసిస్తారని దర్శక, నిర్మాతలు, హీరో అభిప్రాయం. కథే అస్తుబిస్తుగా ఉన్న ఈ చిత్రంలో ఇక, స్క్రీన్ ప్లే, మాటల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. దర్శకత్వ ప్రతిభ కూడా చాలా యావరేజ్.

సినిమాకు సంగీతం (థమన్ ఎస్.) పెద్ద ఎసెట్ కావాల్సింది. కానీ, ఈ చిత్రంలోని పాటలేవీ ఆ ఫక్కీలో నడవలేదు. కనీసం ఒక్క పాటైనా బావుంటుందనుకుంటే, అదీ నిరాశే. అసలే ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం మోకాలుకు చేయించుకున్న సర్జరీతో డ్యాన్సులు, ఫైట్లు నాగ్ కు కష్టంగా మారాయి. దానికి తోడు ఇప్పుడు మీద పడుతున్న వయస్సు. దాంతో, చిన్న చిన్న మూవ్ మెంట్లు హీరో చేస్తుంటే, హీరోయిన్లు, డ్యాన్సర్లు మాత్రం తెగ నర్తించేస్తుంటారు. స్టెప్పులు వేస్తుంటారు. ఈ వరుస చూస్తే, ఎన్టీయార్ 1980ల నాటి సినిమాల్లో చేసిన డ్యాన్సులు గుర్తొస్తే, తప్పు ప్రేక్షకులది కాదు. ఫైట్లూ అంతే - ఒక దెబ్బకు పదుల సంఖ్యలో జనం పడిపోవడమే. కాస్తయినా రియలిస్టిక్ గా అనిపించవు.

కథనంలోనూ లోటుపాట్లు

అమ్మలా తనను పెంచిన డాక్టరమ్మ నిర్మలమ్మను చంపారని తెలిసిన హీరో ఆమెను చంపినవారిని హతమార్చి, పగ తీర్చుకోవడానికి నగరానికి వచ్చాడు. సెకండాఫ్ లో వచ్చే రెండో ఫ్లాష్ బ్యాక్ లో ఆ సంగతే చూపారు. అలాగే, ఒక్కొక్కరినీ చంపుతూ వస్తుంటాడు. సో, ఇక అక్కడ మహేందర్ రెడ్డి (సత్యప్రకాశ్)కి మూడునెలల్లో రూ. 87 కోట్లిచ్చి, అమ్మతో ఆ ఆసుపత్రిని ఖాళీ చేయించకుండా ఉంచాలన్న బంధం ఏమీ హీరోకు లేదు. కానీ, బండి దగ్గర కోట శ్రీనివాసరావు ఎదురై, తమతో చేతులు కలిపేయమంటూ హీరోను బెదిరించే సన్నివేశంలోనే ముందుగా హైదరాబాద్ - కడప బస్సులో వేరెవరి ద్వారానో సంచీ నిండా హీరో డబ్బులు పంపుతున్న షాట్ ఎందుకు చూపినట్లన్నది అర్థం కాని ప్రశ్న.

అలాగే, మహేందర్ రెడ్డి (సత్యప్రకాశ్), అతని అన్న పెద్దన్నల పనుపునే ఛోటా నేతలు వచ్చి హీరో తల్లిని చంపుతారు. ఆ హంతకుల్ని చంపుతానని తల్లి సమాధి సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన హీరో, చివరకు వచ్చేసరికి - పెద్దన్నను చంపడమే తప్ప, మహేందర్ రెడ్డిని ఎందుకు వదిలేసినట్లు. ఈ సినిమాలో ఇలాంటి లోపాలు ఇంకా అనేకం.

కొసమెరుపు -

ఈ సినిమాలో కథ కోసం బలవంతాన తెచ్చిపెట్టిన మలుపులు చూస్తే పిచ్చెక్కిపోతుంది. పైపెచ్చు, అసలు ఈ ట్విస్టులు నచ్చే సినిమా చేశానన్న హీరో గారి మాటలు చదివాక, నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. ఏమైనా, ఈ 14 రీళ్ళ సినిమాను ఓపిగ్గా మొదటి నుంచి చివరి దాకా చూసి బయటకు వచ్చాక నాకు అనిపించింది కాస్త ప్రాసలో చెప్పాలంటేఒకటే- 'రగడ' ..... ఈ సినిమా చాలా బాగుందని చెప్పినవాడితో వేసుకోవాలి గొడవ!

చివరిగా, చిన్నమాట.

2010కి వీడ్కోలు చెబుతూ, 2011కు శుభస్వాగతం పలుకుతూ, మన బ్లాగు మిత్రులకూ, పాఠకులకూ, హితులకూ, స్నేహితులకూ

విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యపీ, జాయ్ ఫుల్ అండ్ ఫ్రూట్ ఫుల్ న్యూ ఇయర్.

Friday, December 24, 2010

బతుకు భయం కలిగించే ‘నాగవల్లి’



(వసూళ్ళ యావే తప్ప, ఆత్మే లేని ఆత్మ కథ ‘నాగవల్లి’ - పార్ట్ 2)

‘నాగవల్లి’ సినిమాలో ప్రేక్షకుడికి నచ్చే అంశాల కన్నా నచ్చని అంశాలే ఎక్కువ. ‘నాగవల్లి’ చిత్రంలో సాఫీగా సాగే కథ లేదేమో కానీ, నటీనటులు మాత్రం బోలెడంత మంది. హీరోగా రజతోత్సవ సంవత్సరంలో ఉన్న వెంకటేశ్ ఈ చిత్రంలో డాక్టర్ విజయ్ గా, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రాజు నాగభైరవ రాజశేఖరుడిగా ద్విపాత్రాభినయం చేశారు. 130 ఏళ్ళుగా బతికుండి, ఓ అఘోరా లాగా పెరిగిన మీసాలు, గడ్డాలు, గోళ్ళతో మూడో వేషంలోనూ కనిపిస్తారు.

పాత్రలు - పాత్రధారులు

కానీ విషాదం ఏమిటంటే - ఒక్క డాక్టర్ విజయ్ వేషంలోనే ఆయన ఫరవాలేదనిపిస్తారు. మిగిలిన వేషాల్లో ఆయన ఆంగిక, వాచికాలు అన్యాయంగా ఉన్నాయి. రాజు వేషంలో ఆహార్యమైనా బాగుంది (రమా రాజమౌళి స్టైలింగ్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలి), కెమేరాలో కాళ్ళకు బూట్లతో కనిపించేస్తున్న అఘోరా వేషానికి వచ్చేసరికి ఆయన మేకప్ కానీ, ఆ కుంగ్ ఫూ తరహా యుద్ధ విన్యాసాలు, ఆ అరుపులు ఏ మాత్రం ప్రొఫెషనల్ గా లేవు. రాజు అంటే ఓ హుందాతనం, ఆ నడకలో, కరచరణ విన్యాసాల్లో ఓ ఠీవి కనిపించాలి. కానీ, దురదృష్టవశాత్తూ ఈ సినిమాలో అవేవీ లేవు. పైగా, హీరోయిన్ తో పాట పాడుతూ, రాజు నడిచే నడక, భుజాలు ఊపే తీరు విదూషకుడిని తలపించాయి. సంభాషణల్లోనూ, వాటి ఉచ్చారణలోనూ పాత్రల తాలూకు స్థల కాలాలను చూపెట్టడంలో కూడా విఫలమయ్యారు.

ప్రధానపాత్ర నాగవల్లి (అసలు పేరు నాగవల్లి. నాట్యకళలో ప్రావీణ్యంతో అందరూ పిలిచే పేరు చంద్రముఖి అని సినిమాలో చెప్పించారు)లో అనూష్కను సైతం పోస్టర్లలో చూపించినంత పాటి అందంగానైనా తెర మీద చూపలేకపోయారు. నృత్యంలో అభినివేశం లేని ఆమె శాస్త్రీయ నృత్యం చేస్తుంటే, తెరపై ఎలా ఉందో వేరుగా చెప్పనక్కర లేదు. ఆమె ప్రియుడైన గుణశేఖరన్ పాత్రధారి ఆమె కన్నా పొట్టిగా, లేత ముఖంతో ఆమెకు చిన్న తమ్ముడిలా కనిపించాడు.

సినిమాలో శరత్ బాబు - ప్రభల కుమార్తెలుగా కమలినీ ముఖర్జీ (నాట్యకళాకారిణి గాయత్రి పాత్ర), శ్రద్ధాదాస్ (చిత్రకారిణి గీత పాత్ర), రిచా గంగోపాధ్యాయ (పరిశోధకురాలు గౌరి పాత్ర), ఇంకా ధర్మవరపు కుమార్తెలుగా లహరి తదితరులతో గ్లామర్ కు తక్కువ ఏమీ లేదు. కానీ, ఏ పాత్రనూ చిరకాలం గుర్తుంచుకోలేం. బ్రహ్మానందం కామెడీ కూడా నవ్వించడానికి విఫలయత్నం చేస్తుంది. కొంతసేపయ్యాక విసుగు కలిగిస్తుంది.

సాంకేతిక విభాగాలు

ఈ సినిమాలో హంపీ తదితర ప్రాంతాలను శ్యామ్ కె. నాయుడి కెమేరా అందంగా తెరకెక్కించింది. గురుచరణ్ సంగీతంలో హీరో పరిచయ గీతం మినహా మరేవీ జనం పదే పదేలా పాడుకొనేలా గుర్తుండవు. కళాదర్శకత్వం (చిన్నా) చాలా నాసిగా ఉంది. రాజు గారి ఆస్థానం లాంటి వాటికి అంత గాడీగా ఉన్న రంగులు ఎలా వాడారో అర్థం కాదు. గమ్మత్తేమిటంటే - చంద్రముఖిని రాజు బంధించి ఉంచిన ప్రణయ కేళీ మందిరమంతా ఎర్రటి రంగు గోడలతో ఉండడం ఆలోచన, అవగాహనల రాహిత్యానికి నిదర్శనం. అలాగే, తలుపునకు నాగుపాము, త్రిశూలం వగైరాలతో తాళం ఉండే ఘనమైన దర్వాజాను కూడా మనకు ఆ ప్రాచీన భావాన్ని కలిగించేలా తీర్చిదిద్దకపోవడం పెద్ద తప్పు. చంద్రముఖిని అష్ట దిగ్బంధనం లాంటి దృశ్యాల్లో సైతం వాడిన తాళాలు, తాళం చెవులు లాంటివి కూడా క్లోజప్ లో కనిపిస్తూ, కథాకాలం నాటికి సంబంధం లేని రూపురేఖలతో చీకాకు తెప్పిస్తాయి. సినిమా చూసే ప్రేక్షకులు ఇవేవీ నోరువిప్పి వివరించకపోవచ్చు కానీ, వారి అంతరాంతరాళాల్లో ఇవి చూపే తెలియని ప్రభావమే చిత్ర ఫలితానికి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.

డిజిటల్ ఇంటర్మీడియట్ (డి.ఐ) చేసిన ఈ చిత్రంలో కొన్ని చోట్ల దృశ్యాలు అలికేసినట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హీరో పరిచయ గీతం లాంటి చోట్ల డి.ఐ.లోని లోపాలు తెలిసిపోతున్నాయి. గ్రాఫిక్స్ సంగతికొస్తే - చంద్రముఖి 30 అడుగుల పొడవున్న పాము రూపంలో వెళ్ళిపోతోందని చెబుతూ వస్తారు. కానీ, గ్రాఫిక్స్ లో పాములా కాకుండా అది కొండచిలువలా తయారైంది. పడగ విప్పినప్పుడు మాత్రం అది పాములా అనిపిస్తుంది. కథలోనే కొంత కన్ఫూజన్ ఉండడంతో, ఎడిటింగ్ మరేమీ చేయలేకపోయింది.

లోటుపాట్లు

కథలో చంద్రముఖి వెంటాడడం ఏమో కానీ, ‘నాగవల్లి’ చిత్రాన్ని చూస్తుంటేనూ, చూసొచ్చాకా ప్రేక్షకుల్ని బోలెడన్ని ప్రశ్నలు వెంటాడతాయి, వేధిస్తాయి. చాలా భాగం జవాబులు దొరకని ప్రశ్నలే. చంద్రముఖి వ్యవహారంలో సాయం కోరుతూ సిద్ధాంతే స్వయంగా డాక్టర్ విజయ్ ని పిలిపిస్తాడు. నిజానికి, వాళ్ళిద్దరూ కలసి ఆ ఎదురైన సమస్యను పరిష్కరించాలి. కానీ, అది పోయి, చివరకు ఒకరిపై మరొకరు పోటీ పడుతూ, నువ్వు తప్పా, నేను తప్పా అని వాదనకు దిగుతున్నట్లుగా తయారైంది.

హేతువాదానికీ, ఆచారాల పట్ల నమ్మకానికీ మధ్య వాదులాట లాగా కనిపించినా, రెండు పాత్రలకూ సమప్రాధాన్యం ఇస్తూ, రెంటిలో ఏదీ దేనికీ తక్కువ కాదన్నట్లు చూపాల్సింది. ‘చంద్రముఖి’లో అలాంటి ప్రయత్నమే చూశాం. కానీ, ‘నాగవల్లి’ అందుకు విరుద్ధంగా సాగింది. చివరకు సిద్ధాంతి పాత్రను డమ్మీని చేసేశారు. క్లైమాక్స్ లో డాక్టర్ విజయ్ పాత్ర ప్రవర్తన కానీ, సమస్య పరిష్కారంలో అతని పాసివ్ పాత్ర కానీ అర్థరహితంగా ఉన్నాయి.

ఎంత సీక్వెల్ అయినా ఇంత కాపీనా?

అలాగే, పెద్ద హిట్ చిత్రానికి సీక్వెల్ అయినంత మాత్రాన అక్షరాలా అంతకు ముందు సినిమా ఫార్ములానే యథాతథంగా వాడేస్తామంటే కుదురుతుందా? కానీ, ఈ చిత్ర దర్శక రచయిత పి. వాసు (కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం మూడూ ఆయనవే) ఆ పిచ్చి పనే చేశారు.

‘చంద్రముఖి’లో రజనీకాంత్ ఇంట్రడక్షన్ పాట (దేవుడా దేవుడా తిరుమల దేవుడా...)కు కాపీ లాగా ఇక్కడా అలాగే హీరో పరిచయ గీతం (అభిమాని లేనిదే హీరోలు లేరులే...). అక్కడ ఇంటిల్లపాదీతో రజనీ పాడే గాలిపటం పాటకు, ఇక్కడ వెంకటేశ్ ఆడవాళ్ళందరితో కలసి కబడ్డీ ఆడి, ఆ పైన పాడే పాట. అక్కడ ‘రారా సరసకు రారా’ పాట ఉంటే, ఇక్కడ ‘ఘిరని ఘిరని...’ అంటూ నర్తకి నాగవల్లి చంద్రముఖి (అనూష్క) డ్యాన్సుకు రాజు గారు (వెంకటేశ్) తాళం వేస్తూ పాడే పాట.

పాటలే కాదు, పాత్రల విషయంలోనూ ఆ వేలంవెర్రి అనుకరణనే కొనసాగించారు. ‘చంద్రముఖి’లో ఇంటికొచ్చిన హీరో, తన భార్యకు దగ్గరైపోతున్నాడేమోనని అనుమానించే వడివేలు పాత్ర గుర్తుందిగా. సరిగ్గా దానికి జిరాక్స్ కాపీ లాంటిది ‘నాగవల్లి’లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పోషించిన పాత్ర. అందులో హీరోకు ఓ సహాయకుడు. ఇందులోనూ హీరోకు ఓ సహాయకుడు. బహుశా సీక్వెల్ ముసుగులో తమ హిట్ సినిమాను తామే ఇంత పచ్చిగా, అడుగడుగునా కాపీ కొట్టుకుంటూ మరో సినిమా తీయడం మన చిత్ర సీమల్లోనే సాధ్యం. ఇలాంటి దర్శక, రచయితలను గుడ్డిగా నమ్మి, ఫార్ములా చట్రంలోనే గుడుగుడు గుంజాలాడాలని అనుకోవడం మన సోకాల్డ్ నిర్మాతలు, హీరోల అవివేకం. దీనికి కోట్ల కొద్దీ కుమ్మరించడం దాన్ని మించిన అహంభావం.

కొసమెరుపు -

ఈ సినిమాకు కొందరు మిత్రులం కలసి వెళ్ళాం. ఆఫీసు పని ముగించుకొని, హడావిడిగా రాత్రి భోజనాలు చేసి, సెకండ్ షోకి వెళ్ళాలని ఆలోచన. అడ్వాన్సుగా టికెట్లు తీసుకొద్దామని ఓ మిత్రుడు ఆటకు రెండున్నర గంటల ముందే హాలుకు వెళ్ళాడు. టికెట్లిమ్మంటే కౌంటర్ వాడు వాడి మాతృభాషలో బదులిస్తూ, ఓ కాగితం చూపాడు. దాని మీద రూ. 1000 అని అంకె ఉంది. మన ఊరు కాని ఊళ్ళో ఆ భాష బాగా తెలియకపోయినా, వాడి భావం మాత్రం మా వాడికి బాగా తెలిసింది.

‘‘ఇక్కడ జనం లేక తెరిచిపెట్టుకు కూర్చున్నాం. మునుపటి ఆటకు వచ్చిన కలెక్షనే రూ. 1000 (అంటే 20 మందే వచ్చారన్నమాట). మీరు తాపీగా సినిమా మొదలు కావడానికి పది నిమిషాల ముందు వస్తే చాలు. ఎన్ని టికెట్లంటే అన్ని టికెట్లిస్తాం, హాలంతా మీదే’’ అన్నది కౌంటర్ వాడి కామెంట్ భావం. అయినా ధైర్యం చేసి సినిమాకు వెళ్ళి, మా లాంటి మరో 25 మంది సినిమా పిచ్చి వాళ్ళతో హాలంతా ఏలుతూ సినిమా చూసేశాం. కానీ, మరునాడు ఉదయం పేపర్లో ‘‘ఈ ఏటి మేటి 5 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి ’’అంటూ నాగవల్లి వాణిజ్య ప్రకటన చూశాక, నమ్మాలో, నవ్వాలో అర్థం కాలేదు.

Thursday, December 23, 2010

వసూళ్ళ యావే తప్ప, ఆత్మే లేని ఆత్మ కథ ‘నాగవల్లి’



ఓ సినిమా పొరపాటునో, గ్రహపాటునో, అనుకోకుండా అన్నీ కుదిరో హిట్టయితే చాలు - ఆ కథను వివిధ భాషల్లో తెరకెక్కించడానికీ, అదే ఫార్ములాతో రకరకాల కథలు అల్లుకోవడానికీ మన దర్శక - నిర్మాతలు అత్యుత్సాహం చూపిస్తుంటారు. పదిహేడేళ్ళ క్రితం మలయాళంలో హిట్టయిన ‘మణి చిత్ర తాళు’ కథ ఇప్పటికి ఎన్ని రూపాలు ధరించిందో చూస్తే, ఆ మాట కచ్చితంగా నిజమని ఎవరైనా ఇట్టే చెప్పవచ్చు. కేరళ ప్రాంతపు ఓ రాజవంశంలో జరిగిన నిజ జీవిత కథగా ప్రచారంలో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకొని ఆ మలయాళ చిత్రం తయారైంది. ప్రజాదరణ పొందిన ఆ చిత్రంలో నాయిక పాత్ర నటి శోభనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్నీ తెచ్చింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే - ఆ సినిమా తెలుగులో డబ్బింగ్ కూడా జరుపుకొంది.

రీమేకులు తీయడంలో దిట్ట అయిన దర్శకుడు పి. వాసు అదే సినిమాను కన్నడంలో ‘ఆప్తమిత్ర’గా, తమిళంలో ‘చంద్రముఖి’గా రూపొందించారు. రెండూ సూపర్ హిట్ కావడంతో వాసులో మరో ఆశ మొగ్గ తొడిగింది. ఈ కథకు కొనసాగింపుగా మరో కథ అల్లుకొని, ‘చంద్రముఖి -2’గా రజనీకాంత్ తోనే మళ్ళీ తీయాలని తెగ ఉత్సాహపడ్డారు. కానీ, రజనీ పచ్చజెండా ఊపకపోవడంతో, ఆ కథనే కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్ధన్ తో ‘ఆప్త రక్షక’గా తీశారు. సరిగ్గా విష్ణువర్ధన్ మరణం, ఆ సినిమా రిలీజు ఒకే సమయంలో జరగడంతో ఆ మహానటుడి ఆఖరి సినిమాగా జనం ఆ కథకు బ్రహ్మరథం పట్టారు. దాంతో, సహజంగానే దాని తెలుగు రీమేక్ కు మన వాళ్ళు ఎగబడ్డారు. రీమేకుల నిర్మాణానికి వేయి కళ్ళతో కాచుకొని ఉండే బెల్లంకొండ సురేశ్ తెలుగులో దీని హక్కులు తీసుకున్నారు. పి. వాసు దర్శకత్వంలోనే ఇది ‘నాగవల్లి’గా రీమేక్ అయింది.

రజనీకాంత్ నటించిన పాత్రకు కొనసాగింపు, విభిన్నమైన గెటప్ తో కూడిన రాజు పాత్ర లాంటివి కన్నడ మాతృకలో చూసి మురిసిపోయిన తెలుగు హీరో వెంకటేశ్ ఏరి కోరి ఈ రీమేక్ లో నటించారు. కానీ, ఎంత ఆత్మల కథ అయినా కథలో ఆత్మ లేకపోతే, లాభం లేదని మరో మారు ‘నాగవల్లి’ నిరూపించింది. నటుడనే వాడికి రకరకాల పాత్రల మీద ప్రేమ ఉంటే చాలదు, ఆ పాత్రపోషణకు మనం సరిపోతామా, లేదా అన్న ఆలోచన, అవగాహన కూడా ఉండాలని ‘నాగవల్లి’ చూస్తే అర్థమవుతుంది. మానిటర్లో చేసిన షాట్ చూసుకొనే సౌకర్యాలు సైతం ఉన్న ఈ రోజుల్లో ఈ చిత్రంలోని నటీనటులు, దర్శకుడు పాత్రపోషణకు కావాల్సిన కనీసపు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు కనిపించదు.

అసలు ‘చంద్రముఖి’ సినిమాలో ఏ అంశం జనానికి అంతగా పట్టిందో అర్థం కాక ఇప్పటికీ కొందరు జుట్టు పీక్కుంటున్న తరుణంలో, దానికి సీక్వెల్ నంటూ ‘నాగవల్లి..... చంద్రముఖి’ వచ్చింది. నూరేళ్ళ పైచిలుకు నాటి చంద్రముఖి తైలవర్ణ చిత్రం ఓ చిత్రకారుడికి దొరకడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ వర్ణచిత్రం కారణంగా చిత్రకారుడు మరణించడం, శాస్త్రీయ నృత్య పోటీల్లో ఆ చిత్రాన్ని బహుమతిగా పొందిన వెంటనే గాయత్రి (కమలినీ ముఖర్జీ) భర్త యాక్సిడెంట్ కు గురై మరణించడం, ఆ పటాన్ని తెచ్చుకున్న గాయత్రి కుటుంబంలో ఆడపిల్ల పెళ్ళిళ్ళు చెడిపోతూ ఉండడం లాంటివన్నీ జరుగుతాయి. తిరుపతి సమీపంలో ఓ కలవారి ఇంట్లో ఓ 30 అడుగుల పాము కనిపిస్తుంటుంది. ఆ చిత్రవిచిత్ర సమస్యలన్నిటి నుంచి బయట పడడం కోసం వారు దైవశక్తి గల రామచంద్ర సిద్ధాంతి (అవినాశ్)ని కలుస్తారు. ఈ చంద్రముఖి వ్యవహారాన్ని పరిష్కరించేందుకు గతంలో తనకు సాయపడ్డ సైకియాట్రిస్ట్ కు సహచరుడైన డాక్టర్ విజయ్ (వెంకటేశ్)ను ఆయన పిలిపిస్తారు.

ఆ సైకియాట్రిస్ట్ హేతుబద్ధంగా, ఈ సిద్ధాంతి దైవ - దుష్టశక్తుల పట్ల నమ్మకాల పరంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో ఒకప్పటి చంద్రముఖి ఆ ఇంట్లోని ఎవరిని ఆవహించి ఉందో తెలుసుకొనే ప్రయత్నాలు జరుగుతాయి. ఆ కృషిలో భాగంగా నూరేళ్ళ పైచిలుకు క్రితం నాటి వెంకటాపురం రాజు చరిత్రను విజయ్ తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ నాగభైరవ రాజశేఖరుడు (మళ్ళీ వెంకటేశే) ఎవరు, ఏమిటి, ఏం చేశాడు, అతనికీ - తంజావూరు ప్రాంత నర్తకి చంద్రముఖికీ ఉన్న సంబంధం ఏమిటి లాంటి అనేక అంశాల గత చరిత్రను తెలుసుకుంటాడు.

ఆ తరువాత ఏం జరిగింది, ఆ ఇంట్లో చంద్రముఖిలా ప్రవర్తిస్తున్నది ఎవరు లాంటి సస్పెన్స్ నిండిన అంశాలతో మిగిలిన సినిమా నడిచింది. సినిమా అంతటా చంద్రముఖి ఆత్మ ప్రస్తావన వస్తుందన్న మాటే కానీ, కథలో మనల్ని కట్టిపడేసే ఆత్మే ఎక్కడా లేదు. ఏ ఘట్టంలోనూ ప్రేక్షకుణ్ణి తనతో పాటు ప్రయాణం చెయ్యనివ్వని దృశ్యాలు, సంఘటనల సమాహారం ఈ చిత్రం. అందుకే, ‘నాగవల్లి’ని చూస్తుంటే, మనం తెర మీద కన్నా చేతికున్న వాచీని ఎక్కువగా చూస్తాం.

( ‘నాగవల్లి’లోని లోటుపాట్లు, వెంకటేశ్ చేసిన తప్పేమిటి. ఒప్పేమిటి వగైరా వివరాల మిగతా భాగం తరువాయి పోస్టులో...)

Sunday, December 19, 2010

బాగానే ఉందనిపించే ‘ఆరెంజ్’ జనానికి ఎందుకు నచ్చలేదు?

(‘ఆరెంజ్’ అంతలా ఫ్లాపయ్యిందేం? - పార్ట్ 2)

ఫస్టాఫ్ మొదలు అప్పటి దాకా ‘ఆరెంజ్’ కథానాయక పాత్ర ప్రతిపాదించిన అంశాలతో సహానుభూతి చెందుతున్న ప్రేక్షకులను నాగబాబు పాత్ర హితోపదేశ ఘట్టం నుంచి దర్శకుడే స్వయంగా దూరం చేసుకున్నారనిపిస్తుంది. ప్రేమ విషయంలో హీరో భావాలకూ, అభిప్రాయాలకూ కారణం - అతని గత జీవితంలో ఎదురైన సంఘటనలు, అనుభవాలేనని సినిమాలో చూపిన ఫ్లాష్ బ్యాక్ తో అర్థమవుతుంది. ఆ అభిప్రాయాలు, ఆ సంఘటనలతో యువతరం ప్రేమికుల నుంచి పెళ్ళయిన పెద్దల దాకా అందరూ ఎంతో కొంత కనెక్ట్ అవుతారు. కానీ, ఆ తరువాత కేవలం నాగబాబు చెప్పిన నాలుగు మాటలతో హీరో ఒక్కసారిగా తన పంథానే మార్చేసుకోవడం ఏ మాత్రం నమ్మబుద్ధిగా, ప్రేక్షకులకు సంతృప్తిగా అనిపించదు. అప్పటిదాకా తెరపై దృశ్యాలతో సంలీనమై ఉన్నవాళ్ళను ఒక్కసారిగా వెనక్కి రప్పించే సన్నివేశాలు ఆ తరువాత ఒకదాని వెంట మరొకటిగా వచ్చేస్తాయి.

హీరో అప్పటి దాకా తాను ప్రవచించిన సిద్ధాంతాలను వదిలేసుకోవడానికి సిద్ధమై, హీరోయిన్ ప్రేమ కోసం ఆమె వెంటబడుతున్నట్లుగా అక్కడ నుంచి కథ దిశ మార్చుకుంది. వ్యక్తిగత ఇష్టానిష్టాలను మరచి, తెర మీద కథానాయకుడు చెప్పిన సిద్ధాంతాలను తలకెక్కించుకున్న వారికి సైతం ఈ అనూహ్యమైన అకస్మాత్తు మార్పు ఏ మాత్రం మింగుడు పడే విషయం కాదు.

హీరో అంటే సామాన్య తెలుగు ప్రేక్షకులకు విజేత అనే అర్థం. హీరో పాత్ర అనుకున్నది, చేసేదే కరెక్ట్. ఎప్పటికైనా అతని వాదనే నిలవాలి, గెలవాలి తప్ప, మరొకరి ముందు అతని వాదన నీరు గారిపోయినట్లు చూపిస్తే, సగటు ప్రేక్షకులను మెప్పించలేం. పైపెచ్చు, ఈ సినిమాలో హీరో అలా వాదన మార్చుకోవడానికి తగిన కారణం కానీ, సంఘటనలు కానీ - సందర్భాలు కానీ (ఫ్లాష్ బ్యాక్ లో లాగా) లేనే లేవు.

ఇక అక్కడ నుంచి దర్శకుడికి కూడా కథ ఎలా నడపాలనే గందరగోళం వచ్చినట్లు అనిపిస్తుంది. అందుకే, హీరో పాత్ర ద్వారా తాను ప్రవచించదలచిన, అప్పటి దాకా ప్రవచిస్తూ వచ్చిన అంశాన్ని పక్కనబెట్టి, మళ్ళీ రొటీన్ గా హీరో, హీరోయిన్లను కలపాలని చూశారు. అలా కాకుండా, హీరో ఆది నుంచి చెబుతూ వస్తున్న సిద్ధాంతాన్నే చూపుతూ, హీరో, హీరోయిన్ల ప్రేమ పెళ్ళి పీటలకు ఎక్కలేదని వాస్తవిక రీతిలో చెబుతూ, ముగించడానికి భయపడ్డారేమో అనిపిస్తుంది.

హీరో పాత్రచిత్రణకు నప్పని రీతిలో కథ చివరి భాగం సాగడంతో, ఆరెంజ్ ఏ వర్గానికీ సంతృప్తి నివ్వలేదు. ఈ సినిమా ఇంతగా పరాజయం పాలవడానికి నాకు అనిపించిన, కనిపించిన ప్రధాన కారణం అది. అలాగే, సినిమాలో జెనీలియా మేకప్ కానీ, ఆమె నటన కానీ బాగాలేవని చెప్పక తప్పదు. ఇక, తెరపై దృశ్యాల్లోని రంగుల గాఢతను కావలసినట్లుగా మార్చుకోవడం కోసం చేసిన డి.ఐ. (డిజిటల్ ఇంటర్మీడియట్) ప్రక్రియ కూడా నాసిగా ఉంది. అందుకే కావచ్చు - సినిమాలో చాలా చోట్ల హీరో, ప్రత్యేకించి హీరోయిన్ మేకప్ లు ముఖానికి మెత్తినట్లుగా, తెల్ల తెల్లగా, ముద్ద ముద్దగా ఉన్నట్లు అనిపించాయి. ఇక, హీరోయిన్ తండ్రి పాత్రలో తమిళ నటుడు ప్రభు, హీరోయిన్ అక్కబావలుగా నటుడు మహేశ్ బాబా సొంత అక్క మంజుల, బావ సంజయ్ స్వరూప్ లు నటించడం వల్ల సినిమాకు వచ్చిన అదనపు హంగేమీ లేదు. నటనలో అంతంత మాత్రం, తెలుగు డైలాగులకు డబ్బింగ్ సాయం అవసరమైన వీరందరినీ ఎందుకు తెచ్చుకున్నారో దర్శకుడు భాస్కర్ కు తెలియాలి.

నిజం చెప్పాలంటే - ఈ సినిమాలో హారిస్ జైరాజ్ బాణీలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఆస్ట్రేలియాలో జరిగినా, అనకాపల్లిలో జరిగినా పెద్ద తేడా లేని ఈ కథను ప్రత్యేకించి హిందీ చిత్రాల ఫక్కీలో ఆస్ట్రేలియాలో అందమైన లొకేషన్లలో షూటింగ్ జరిపారు. పప్పీ పాత్రలో బ్రహ్మానందం బాగానే నవ్వించారు. ‘ప్రేమంటే - నాలుగు అబద్ధాలు, మూడు ఎస్.ఎం.ఎస్.లు, రెండు కుళ్ళు జోకులు’, ‘మొదట ప్రేమిస్తాం. ఆ తరువాత పుట్టిన పిల్లల కోసం ఆ బంధాన్ని కొనసాగిస్తాం’ తరహా మాటలూ గుర్తుంటాయి. ఒక్కో సినిమాకూ నటుడిగా మెరుగుపడుతున్న రామ్ చరణ్ తేజ్ లోని నటుడికి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఘట్టం ఓ ఉదాహరణ. ప్రేమ కోసం జీవితాన్నే అబద్ధాలమయంగా మార్చుకోలేనంటూ ప్రేయసి ఇంటి నుంచి వచ్చేస్తూ, కథానాయక పాత్ర మాట్లాడే మాటలు, చేసే నటన రామ్ చరణ్ లోని మెరుగుదలకు మచ్చుతునకలు.

ఇలా సినిమాలో సానుకూల అంశాలు చాలానే ఉన్నాయి. కానీ, సెకండాఫ్ లో సగమయ్యాక హీరో పాత్ర చిత్రణలో వచ్చిన అకస్మాత్తు మార్పుతో, పూర్తిగా ఈ సినిమా కథే అడ్డం తిరిగింది. మిగతా లోపాలకు ఇది తోడై, కుండెడు పాలల్లో ఒక్క విషపు బొట్టు చిందినట్లయింది. ‘ఆరెంజ్’కు అదే పెద్ద శాపం. మంచి కథాంశాన్ని ఎంచుకున్నా, దాన్ని సమర్థంగా పాత్రల ద్వారా చివరి వరకు డ్రైవ్ చేయకపోతే, విమర్శకుల పరంగానూ, వాణిజ్యపరంగానూ మిగిలేది అసంతృప్తేనని ఆరెంజ్ ఋజువు చేసింది.

Saturday, December 18, 2010

‘ఆరెంజ్’ అంతలా ఫ్లాపయ్యిందేం?

ప్రతి పెద్ద తెలుగు సినిమా వచ్చే మా ఊళ్ళో ఎందుకనో రామ్ చరణ్ తేజ్ ‘ఆరెంజ్’ సినిమా విడుదల కాలేదు. దాంతో, నేను చూడ లేదు. అనుకోకుండా ఇవాళ ఇక్కడ ఓ షో వేస్తే హడావిడిగా వెళ్ళి చూశా. వెళ్ళేటప్పటికి పది నిమిషాల ఆట అయిపోయింది కానీ, ఆద్యంతం కదలకుండా చూశా. బాక్సాఫీస్ దగ్గర సినిమా అడ్డంగా దొరికిపోయిందని (ఈ తెలుగు టీవీ భాషకు పాఠకులు నన్ను మన్నింతురు గాక) ఇప్పటికే విన్నాను. అయినా సరే, సినిమా చూస్తే, విశ్రాంతి దాకా వచ్చేసరికి నాకే డౌట్ వచ్చింది. సినిమా ఫరవాలేదు - బాగానే ఉంది కదా. మరి, ఎందుకింత నెగటివ్ టాక్ వచ్చింది అని నాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. దానికి సమాధానం సెకండాఫ్ లో కాసేపైన తరువాత నుంచి నాకు దొరికింది.

మొత్తం సినిమా చూశాక, కొత్త కథాంశంతో తీసిన ఈ సినిమా జనానికి ఎందుకు నచ్చి ఉండకపోవచ్చనడానికి నాకు కొన్ని కారణాలు తట్టాయి. వాటిని మీతో పంచుకుంటాను.

నిజం చెప్పాలంటే - ఈ చిత్ర కథకు తీసుకున్న అంశం చాలా మంచిది. ప్రేమలో ఏ మేరకు నిజాయతీ ఉంటోంది, ఓ మనిషిని జీవితాంతం ఒకే రకంగా ప్రేమించడం సాధ్యమా లాంటి సున్నితమైన అంశాలను ఈ కథలో డీల్ చేశారు. ఎలాంటి అబద్ధాలూ లేకుండా, జీవితాంతం ఒక వ్యక్తిని ప్రేమించడం కుదిరేపని కాదన్న కథానాయకుడు రామ్ పాత్ర (రామ్ చరణ్ తేజ్) దృష్టి కోణం నుంచి కథ మొత్తం నడుస్తుంది. ఈ చిన్న అంశం మీద ఐటమ్ సాంగ్ లు, విలన్లు, ఛేజ్ లు, భారీ ఫైట్లు, గ్రాఫిక్స్ లాంటివేమీ లేకుండా సంసారపక్షపు సినిమా తీయడమంటే - ఇవాళ్టి తెలుగు సినీ వ్యాపార లెక్కల ప్రకారమైతే పెద్ద రిస్కు. మామూలు సినిమా కథల ప్రకారం చూసినా సరే, ఎలాంటి హీరోకూ, దర్శకుడికైనా సరే ఇలాంటి అంశాన్నీ, స్క్రిప్టునూ తెర మీద రెండున్నర గంటలు చూపడం కత్తి మీద సాము. అందులోనూ పేరున్న హీరోతో, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ లాంటి మరో పేరున్న దర్శకుడు ఆ సినిమా తీస్తే - అది కత్తి మీద సామే కాదు, పీకల మీద కత్తి కూడా.

అయినా సరే, ఈ దర్శక, హీరోలు ఆ సాహసానికి దిగినందుకు అభినందించాల్సిందే. సన్నటి కథాసూత్రం మీదే నడిపించుకుంటూ వెళ్ళినా, చిత్ర ప్రథమార్ధం ఫరవాలేదన్నట్లుగా గడిచిపోతుంది. కానీ, ద్వితీయార్ధంలో నాగబాబు పోషించిన పాత్రతో హీరోకు గీతోపదేశం చేయించిన దగ్గర నుంచి సినిమా గాడితప్పింది. అప్పటి దాకా హీరో ప్రవర్తనకూ, అతని ఐడియాలకూ, ఐడియాలజీకీ ముక్కున వేలేసుకుంటూనే ముచ్చటపడుతూ వచ్చిన ప్రేక్షకులకు అక్కడ నుంచి షాకుల మీద షాకులు ఎదురవుతాయి.

(మిగతా భాగం తరువాయి పోస్టులో...)